The greatest WordPress.com site in all the land!

“ఆశ్చర్యం…   

నిజానికి పరదాలు కప్పి , నేరం రుజువై జైలు గోడల మధ్య గడిపిన వాళ్ళు బయటికి వస్తే పూలదండలేసి బాణాసంచా తో స్వాగతం పలకడం, మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకోవడం ఇన్నేళ్ల నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదు.  గుండెలో మంటల ప్రవాహం పుడుతున్నది”  గతకాలపు గాయాల శబ్దాలు విన్న కాకి బాధగా అన్నది “దేశమంతా ఆజాదీ అమృతోత్సవ్ లో భాగంగా ఇంటింటా మూడు రంగుల జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకుంటుంటే నీ బాధ ఏంటి ? ” గొణిగింది గాడిద 

“మూడు రంగుల జెండా రెపరెపల మాటున నీకు ఇంకేదో కనపడడం అంటే నీ దృష్టి దోషమేమో..” కొంటెగా అన్నది కోతి 

“నా దోషం కాదు మిత్రమా.. 

ఓ పక్క జనాన్ని సంబరాల్లో ముంచేసి, ప్రవచనాలు వల్లిస్తూ మెస్మరైజ్ చేసి  జైల్లో ఉండాల్సిన నేరస్థులకు స్వతంత్రం ప్రకటించేసిన ఆజాదీ అమృతోత్సవ్… దేశ దౌర్భాగ్యం “బాధ, భయం వెళ్లగక్కింది కాకి 

” వాళ్లెవరికో జైలు గోడల నుంచి ఆజాదీ ప్రసాదిస్తే నీ కొచ్చిన నొప్పి ఏంటో? 

ఏం చేసినా ఆడిపోసుకోవడం.., అక్కసు వెళ్లగక్కడం ఫ్యాషన్ అయిపోయింది” కయ్యిమంది గాడిద.

కాకి, గాడిదల సంవాదం ఏంటో చెట్టుకింద ముచ్చట్లాడుతున్న మేకల జంట చెవిన పడి మౌనంగా వింటున్నాయి. 

అంతలో ” మీరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి గురించో నాకు బోధపడలేదు” అన్నది ఉడుత. 

నాకూ తెలియలేదు అని జత కలిసింది చిలుక. 

“మీకు అప్పుడు జరిగిన సంఘటనలు తెలియకపోయి ఉండొచ్చు. మీరప్పటికి పుట్టారో లేదో .. ” అంటున్న కాకిని ఆపి 

“మా పుట్టుక ఎప్పుడైతే ఏం లే.. ఆ సంగతి వదిలి అసలు విషయం చెప్పండి ”  అన్నది ఉడుత 

“గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో కి అప్పుడు 19 ఏళ్ళు . 2002 గోద్రా అల్లర్లు జరిగిన సమయం . ఆమెను 12 మంది సామూహిక అత్యాచారం చేసి ఆమె రెండేళ్ల కూతురితో పాటు 14 మంది బంధువులను చంపేశారు ” చెప్పింది కాకి 

“నిజమా?! ”  నివ్వెరపోయింది ఉడుత 

“అయ్యో .. ఎంత అన్యాయం ” ఉలిక్కిపడి నొచ్చుకుంది చిలుక. 

“ఇప్పటికే వాళ్ళు 14 ఏళ్ల శిక్ష అనుభవించారు. క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని ప్రభుత్వానికి ఒకరు ఆర్జీ పెట్టుకున్నాడు.  ప్రభుత్వం విడుదల చేసింది. అందులో తప్పేముంది?

అసలు వాళ్ళు బ్రాహ్మణులు, సంస్కారవంతులు సత్ప్రవర్తనతో ఉన్నారు. విడుదల అయ్యారు” భుజాలెగరేస్తూ అన్నది గాడిద. 

“మతి సుతి లేని మాటలు ఆపు. 

కులం, మతం ఆధారంగా వాళ్ళ నేరాన్ని ఎలా అంచనా వేస్తావ్ ?

సవర్ణులు నీకు తెలుసో లేదో వాళ్ళు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. చట్టం శిక్ష విధించింది. 

ఒక కులానికో, ఒక మతానికో చెందిన వాళ్ళు నేరస్థులు కాదని, మరో కులానికి, మతానికి చెందిన వాళ్ళు నేరస్థులని ఎలా చెప్పగలం?  

కులానికి, మతానికి నేరస్థుల విడుదలకి సంబంధం ఏంటి? మన చట్టాల ప్రకారం చట్టం ముందు అందరు సమానం కదా.  వాళ్ళని ప్రభుత్వం ఎట్లా విడుదల చేస్తుంది? 

అసలు నేరం చేయని వాళ్ళు, చాలా చిన్న  నేరం చేసిన వాళ్ళు నేరస్థులుగా జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గిపోతుంటే , తీవ్రమైన నేరం చేసిన వాళ్ళు బయటికి రావడం అన్యాయం కదా …?

పోనీ ఆ దోషులు తాము చేసిన తప్పుకి పశ్చాత్తాపం వ్యక్తం చేశారా..? క్షమాపణ చెప్పారా..? లేదే అటువంటప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఎలా కల్పిస్తారు?”  అప్పటికే దోషుల విడుదల గురించి విని ఉన్న ఆడమేక ఆవేశంగా ప్రశ్నించింది

” 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో నేరస్థులకు సన్మానాలు చేస్తూ, సంబరాలు జరుపుకుంటున్నారంటే దేశ స్వాతంత్య్రం వెనక్కి నడుస్తున్నట్లుగా ఉన్నది ” ఆడమేక కేసి చూస్తూ అన్నది మగ మేక

” తమకో అండ దొరికిందని ఆ కులం వాళ్ళు నేరాలు చేస్తూ ఉంటే  క్షమాభిక్షపెడుతూ పోతారా?” గాడిదకేసి చూస్తూ సూటిగా అడిగింది కోతి 

” అసలు అంత తీవ్రమైన, ఘోరమైన నేరం ఎందుకు చేసి ఉంటారు?”  చిలుక సందేహం 

“ఆ అలా అడిగావు బాగుంది. చెబుతా .. 

2002 ఫిబ్రవరి లో గుజరాత్ నుంచి వందల మంది కరసేవకులు అయోధ్య వెళ్లి అహ్మదాబాద్  తిరిగి రావడానికి సబర్మతి ఎక్స్ప్రెస్  ఎక్కారు.  

గోద్రాలో రైలు ఆగినప్పుడు ముస్లిం మూకలు రైలుపై దాడి చేశాయి. కొన్ని భోగీలకు నిప్పు పెట్టాయి. 59 మంది చనిపోయారు.” చెప్తున్న గాడిదకు అడ్డు పడుతూ  

“అవునా.. అయితే ఆ మూక చేసింది ఖచ్చితంగా తప్పే” అన్నది ఉడుత 

“కరసేవకులపై దాడి విషయం తెలియగానే హిందూ మూకలు ఊరుకుంటాయా.. పెట్రేగిపోయాయి.  ఉచ్ఛం నీచం మర్చిపోయాయి. విలువలకు తిలోదకాలిచ్చాయి. ముస్లింలపై దాడి చేసి చంపేశాయి. వారి ఇళ్లు ధ్వంసం చేసాయి. వారి మహిళలను చెరబట్టాయి. 

ఆ సందర్భంలో వెయ్యి మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలు.  కానీ అంతకంటే చాలా ఎక్కువేనని అనుకుంటూ ఉంటారు.” గతంలో విన్న సంఘటనల తాలూకు విషయాలు గుర్తుకొస్తుండగా చెప్పింది  కాకి 

“అదిగో అప్పుడు బిల్కిస్ బానోపై 12 మంది సామూహిక అత్యాచారం చేసారు.  ఆమె కుటుంబం పై కూడా దాడి జరిగింది .  బిల్కిస్ బానో బతికి బయటపడింది కానీ మిగతా కుటుంబం అంతా ఆ దుర్మార్గానికి బలైంది. ఆమె రెండేళ్ల కూతురితో సహా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.  స్పృహ తప్పిన బిల్కిస్  బానో చనిపోయిందనుకుని వదిలేశారు. 

ఆమె ఒక్కటేంటి ముస్లిం మహిళలెందరో బలయ్యారు. వారి కుటుంబాల్లో ప్రాణాలు కోల్పోయినవారు పోగా మిగిలిన వారు ప్రాణాలు అరచేత పట్టుకుని చెల్లాచెదురయ్యారు ” ఆనాటి సంగతులు గుర్తుచేసుకుంటూ చెప్పింది కోతి. 

“ఎంత దారుణం. మనుషులు చేసే పనేనా? 

ముస్లిమ్స్ చేసిన తప్పుకు తగిన దండన ఉండాల్సిందే. అది విధించాల్సింది చట్టం, న్యాయ వ్యవస్థ. మతం కాదు కదా ..  

ఒక మతం వాళ్ళు మరో మతంపై దాడి చేస్తుంటే రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు?  అప్పటి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? చోద్యం చూస్తున్నదా..?” ఆవేశపడింది చిలుక 

“అహ్హహ్హా .. ఆనాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,  సంఘటనకు జవాబుదారు నేటి  దేశనేత.  ఎవరికర్ధమయినంత వారు అర్ధం చేసుకోండి ” చెంగున కింద కొమ్మకు దుంకుతూ చెప్పింది కోతి 

“అయితే ఏంటట?” గుర్రున చూస్తూ గాడిద 

“కులాన్ని బట్టి శిక్షలు వేస్తారా .. శిక్ష తీవ్రత ఉంటుందా ? ” తీక్షణంగా ఉడుత 

“తీవ్ర నేరం చేసిన నేరస్థులు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా సభ్య సమాజంలో కి 

నో ఎంట్రీ అనాల్సిన వాళ్ళు  బాణాసంచా, మిఠాయిలతో స్వాగతించడం.. 

తిరగబడ్డ విలువలు .. తారుమారైన చిరునామాలు.. క్షేమమేనా?! 

న్యాయ విచక్షణని, న్యాయ పరిధిని చీకటి గుహల్లోకి తోయడం సబబేనా ” గంభీరంగా అన్నది మగమేక. 

“మేలిముసుగులు తొలిగిపోయాయి. కులం, మతం పై జరుగుతున్న దాడులు ఒక క్రమపద్ధతిలో జరిగినవే . ఆవేశంతో కాదు . అధికారం కోసం రాజకీయ కోణంలో చూడవలసినవే . ముందు ముందు మరింత పకడ్బందీగా కొనసాగడానికి సంకేతమేమో..” సాలోచనగా అన్నది ఆడమేక 

“నేరానికి జరుగుతన్న సన్మానం .. ” ప్రశ్నార్ధకంగా ఆగింది చిలుక 

“ఒకరకంగా చూస్తే అంతే అనుకోవాల్సి వస్తుంది. 

2002 లో జరిగిన మారణ కాండని చరిత్ర నుండి ఎలా చెరిపేయగలరు 

మహిళపై జరిగిన ఇటువంటి నేరాలకు క్షమాభిక్ష పెడితే . నేరాలు మరింత పెచ్చరిల్లిపోవా ?  ఇటువంటి నేరాలు చేసిన దోషులు గుజరాత్ జైళ్లలో వీరేనా .. ఎందరో ఉన్నారు . వాళ్ళెవరికీ లేని క్షమాభిక్ష వీళ్లకు మాత్రమే ఎందుకు?”  అన్నది కోతి 

“పైకి మాములుగా కనిపిస్తున్న క్షమాభిక్ష వెనుక చాలా తంత్రం దాగిఉన్నట్లే ఉన్నది “అన్నది  ఆడమేక 

“అత్యాచారాలు, హత్యలు ఇప్పుడే కొత్తగా జరుగుతున్నాయా.. జైలు నుండి కొత్తగా బయటికొస్తున్నారా .. కోడిగుడ్డు మీద ఈకలు రాడానికి ప్రయత్నించే మూక”  ఏటో చూస్తూ గొణుక్కుంది గాడిద 

“తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లకు క్షమాభిక్ష పేరుతో బయటికి తెచ్చి దండలేసి పండుగ జరుపుకుంటుంటే ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం ఉంటుందా ? న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంటుందా?”  అన్నది కాకి 

“ఇంతకు ముందు ఏం చేసారో  చేయలేదో కానీ ఇప్పుడు తమ సత్ప్రవర్తన తో  విడుదలయ్యారు.. ” అంటున్న గాడిద మాటలు పట్టించుకోకుండా 

“కాళ్ళకింద నేలను తవ్వేసే సమాజం ఎటుపోతుందో .. ” అన్నది ఉడుత

“మహిళలపట్ల అవలంబించే వైఖరి మార్చుకోవాలని ప్రధాని ఎర్రకోట నుంచి  ఓ వైపు పిలుపు ఇస్తూ మరో వైపు అదే రోజు బిల్కిస్ బానో దోషులను జైలు నుంచి విడుదల చేయడం వెనుక ఉన్న  ఈ నిర్ణయాన్ని సామజిక , రాజకీయ దృష్టితో పరిశీలించాల్సిందే ” ఆడమేక 

“హంతకులు గ్రామానికి వచ్చిన సంతోషంతో బాణాసంచా కాల్చి సంబరాలతో సర్కస్ విన్యాసాలు చేస్తుంటే, బాధితులు ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయంతో గ్రామం వదిలి పోతున్నారట .  చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్నారు , నేరస్థులు పండుగ జరుపుకుంటుంటే బాధితులు పిల్లి పిల్లల్ని చంకన పెట్టుకుని పోతున్నట్టు భయంతో ఒక్కోరోజు ఒక్కోచోట తలదాచుకుంటున్నారు. 

భవిష్యత్ ఆవిరవుతుంటే ఆ కుటుంబాలకు ఎటువంటి భద్రత, నమ్మకం ఇవ్వగలరు? ” ప్రశ్నించింది మగమేక 

“ఇంతవరకు భారత దేశ చరిత్రలో ఎవ్వరికీ ఇవ్వనంత నష్టపరిహారం ఇచ్చారు తెలుసా” అన్నది గాడిద  

“ప్రభుత్వం ఇచ్చిన లేదా ఇస్తానన్న నష్టపరిహారంతో నేరం సమాధి అయిపోతుందా ?” అడిగింది ఉడుత 

“ఇలా చెబుతున్నానని తప్పుగా  అనుకోకు మిత్రమా.. 

తప్పుని తప్పుగా చెప్పాలి.  తప్పుని ఒప్పుగా చేయాలని చూడడం, ప్రోత్సహించడం మరింత తప్పు మాత్రమే కాదు  దృష్టిలో సామజిక నేరం. 

మంచి, చెడు విచక్షణ మరచి గుడ్డిగా సమర్థిస్తున్న, జేజేలు కొడుతున్న నీ లాంటి వాళ్ళ సమర్ధింపుల వల్ల కూడా సమాజం చాలా నష్టపోతోంది.  

మంచి మనుషులు జీవితాలను ఫణంగా పెట్టి చేసిన త్యాగాలకు అర్ధం లేకుండా పోతున్నది.  స్వతంత్ర దేశం గురించి కన్న కలలు కల్లలుగా మారిపోయే ప్రమాదపుటంచుల్లో ఉన్నది ఈ సమాజం” లోకసంచారం చేసే కాకి గాడిదను హెచ్చరించింది.  

అసలు నేరం చేసారో లేదో తెలియకుండానే తెలుసుకోకుండానే  దిశ కేసులో నిందితుల్ని ఎంకౌంటర్ చేసి పడేసారు. కులం తక్కువ వాళ్ళని వాళ్ళను దోషుల్ని చేసేసారు. 

ఇప్పుడిక్కడ బిల్కిస్ బానో మతం .. అదే ఆమె హిందువైతే సామూహిక అత్యాచారం చేసింది ముస్లిం అయితే క్షమాభిక్ష దొరికేదా .. 

 శిక్ష, క్షమాభిక్ష నేరానికి , నేరస్తుడికా .. లేక మతానికి, కులానికా?

ఆలోచిస్తున్నకొద్దీ ఎన్నెన్నో సందేహాలు కలుగుతున్నాయి? 

క్షమాభిక్ష ఇస్తూ వచ్చిన తీర్పు ప్రభావం పొరలు పొరలుగా సమాజంపై పేరుకుపోయి తీవ్ర ప్రభావం చూపనున్నాయని ఆలోచిస్తున్న ఆడమేక  “నిజానికిది ఒక స్త్రీది, ఒక మతానిది, ఒక కులానిది కాదు. సమస్య. సమాజానిది. 

మెలుకువలోనే అచేతనంగా చేస్తున్న చర్యల పట్ల ఇక మౌనం వహించడం ఏమాత్రం మంచిది కాదు ” అసంకల్పితంగా  అన్నది ఆడమేక 

” ప్రశ్నించిన గొంతులను ఇనుప ఊచల గోడలకు చుట్టాలను చేస్తుంటే.. ఏం చేస్తావ్…నువ్వేం చేస్తావ్?

బలవంతమైన సర్పం కోరలకు చిక్కి ప్రాణాలు కోల్పవడం తప్ప ” నిస్సహాయంగా పలికింది కోతి 

” మిత్రమా.. బలవంతమైన సర్పం చూసి భయపడడం, బాధ పడడం కాదు. 

చీకటి కమ్ముకొస్తున్నది తెలిసి ఊరుకుంటామా.. చిరుదీపం వెలిగించి  చీకటిని పారదోలడానికి ప్రయత్నిస్తాం కదా.. 

కులం పేరుతొ మతం పేరుతొ ఒక్కటవుతున్న సర్పాన్ని ఎదుర్కోవాలంటే మానవీయ స్వరాలన్నీ ఒకటవ్వాలి. నిరసనను బలంగా తెలియజేయాలి.  దేశంలో శాంతి సామరస్యాలను కాపాడుకుంటూ భారత రాజ్యాంగ విలువల్ని పటిష్టం చేసుకోడానికి అంతా ఏకం కావాలి. 

హూ.. ఎంతటి బలవంతమైన సర్పం అయితేనేం .. 

చలిచీమల చేత చిక్కిందంటే చచ్చిపోక తప్పదన్న విషయం మరచిపోకూడదు. “లోతుగా ఆలోచిస్తున్న ఆడమేక 

“అవును, 

లేదంటే అంతా చీకటే.. కటిక చీకటే.. 

అందుకే కదలాలి. కదిలించాలి” స్థిరంగా అన్నది మగమేక.  

అవునన్నట్లు తలాడించాయి మిగతా జీవులన్నీ 

వి. శాంతి ప్రబోధ 

Vihanga, September 2022

“హమ్మయ్య ఇప్పటికి నా ప్రాణానికి శాంతి నిచ్చింది.  ఇక హాయిగా కళ్ళు మూసుకోవచ్చు ” అన్నది చెట్టు కింద చేరిన గాడిద. 

“ఏమిటో .. అంత శాంతినిచ్చింది? దీర్ఘం తీసింది” ఆడమేక 

“ఆ పిల్ల ఆ వీడియో తీసేసిందిగా.. అందుకు” ఒక్క గెంతులో ఆడమేక దగ్గర చేరిన గాడిద అన్నది. 

“ఏ పిల్ల ?” మగమేక ప్రశ్న 

“లోకమంతా కోడై కోస్తుంటే .. మీకింకా ఆ విషయమే తెలియదా.. ” వింతగా చూస్తూ  గాడిద.  

“పనికిమాలిన వాగుడంతా ఆపి అసలు విషయం ఏంటో చెప్పు” కసిరింది ఆడమేక 

” ఆ  స్టా..ర్ర్ సింగర్ చేసిన వీడియో గురించి” వత్తి పలుకుతూ అని మళ్ళీ తానే

“ఎందుకబ్బా.. అంత విసుక్కుంటావు” కినుకగా అన్నది గాడిద 

“ఓ ఆ గాయకురాలు గురించా.. చాలా బాగా పాడుతుంది. ఆమె గొంతు వినిపిస్తుంటే ఆగిపోయి చాలా సార్లు విన్నా .. 

ఊ.. ఇప్పుడర్థమైంది నువ్వేం చెప్పబోతున్నావో …” అంటూ ఆగింది ఆడమేక 

“మీ సస్పెన్స్ తగలెట్టా .. అసలు  విషయం చెప్పండేహే “కసిరింది మగమేక 

” ఆ పిల్ల అసలు ఆడపిల్లేనా..  ముఖానికి బొట్టు లేదు, 

 పెళ్ళైన ఆడపిల్లేనా ..  కాళ్ళకు మెట్టెలు లేవు. 

అది చాలక పోగా అన్నమయ్య కీర్తనను కాళ్ళుపుకుంటూ పాడి అపహాస్యం చేసింది. అది తెలిసి అన్నమయ్య వంశీకులు ఆమె యూ ట్యూబ్ ఛానెల్ లో పెట్టిన ఆ  వీడియో తీసేయమని చెప్పినా పెడచెవిన పెట్టింది. పైగా నా ఇష్టం అని తీయనే తీయను అని మొండికేసింది. 

తిరుమలకు రానివ్వం అని హిందూ సంఘాలు, కేసు పెడతామని అన్నమయ్య వంశీకులు గట్టిగా హెచ్చరించే సరికి తోక ముడిసిందనుకో.. ” కళ్ళు మెరిపిస్తూ గొప్పగా చెప్పింది గాడిద. 

“ఓ .. అదా .. నీ సంతోషానికి కారణం” మగమేక 

“ఆ వీడియో ముచ్చట ఈ చెట్టు కిందే విన్నాను.  ఆ..ఆడకూతురు  ఏమీ చేయలేదులే అని  వందల మంది మీద పడి ఉతుకుడే ఉతుకుడు. పనికి మాలిన జనం. పలికిమాలిన వేషాలు..” అంటున్న ఆడమేకను అడ్డుకుంటూ ఇంతకీ ఎవరిమీద నీ కోపమంతా అన్నది మగమేక. 

“తగలడ్డాయిగా.. పని పాట లేని బాచ్ లు.   

తుమ్మినా, దగ్గినా.. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎగబడే కుక్కమూతి పిందెలు.. అవిచేసే యాగీ తక్కువా మరి! ప్చ్.. ఏం చేస్తుంది. తీసి పడేసింది.

ఆ వీడియో ఏముందని మొన్ననే చూశాను. నాకయితే అందులో తప్పేం కనపడలేదు. 

ఏదో ఆ పిల్ల సరదాగా పాడుకుంది . దానికి ఈకలు పీకాలా.. వంకర మనుషులు.. వంకరేషాలు కాకపోతే.. ” ఆవేశపడింది ఆడమేక 

“కాళ్ళు ఊపుకుంటూ ఒక పరి పరి వయ్యారమే.. అంటూ దేవుని కీర్తన పాడొచ్చా..” తీవ్రంగా  గాడిద

“కాళ్ళు కనబడితే అశ్లీలం అయిపోతుందా.. ” ఉడుత ఆశ్చర్యం

“అలా ఊపుతూ ఆమె పాడింది దేవుని పాట కాబట్టి ఖచ్చితంగా హిందూ సంప్రదాయం పాటించాలి. ఆ స్పృహ ఉండాలి” పూనకం వచ్చినట్టు ఊగిపోతూ  గాడిద 

“దేవాలయాల్లో ఉన్న భంగిమల కన్నా దారుణమైనదా కాళ్ళు ఊపడం. 

ఏది ఏమైనా చూసే కళ్లను బట్టి, దృష్టి కోణం బట్టి ఉంటుంది” నిదానంగా ఆలోచిస్తూ అన్నది ఆడమేక

“ఏంటేంటి..? నువ్వు కూడా ఆ అమ్మాయి మాట్లాడినట్టే మాట్లాడుతున్నావ్.  అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ము మీద తన్నినట్లు” గొణిగింది గాడిద.

అన్నమయ్య రాసిన కీర్తనలు మూడొంతులు శృంగార సంబంధమైనవే .  అన్నమయ్యతో శృంగార సన్నివేశాలు తీస్తే తప్పులేదు.  

సన్యాసి అయిన శంకరాచార్యులు అంగాంగ వర్ణన చేసినా , కుమార సంభవం లో పార్వతీ పరమేశ్వరుల సురత క్రీడల గురించి రాసిన కాళిదాసును. కృష్ణుడి కేళీ విలాస చేష్టలను వర్ణించిన శ్రీనాథుడు  గురించి వీళ్లకు తెలియదా.. 

కాళిదాసు, అన్నమయ్య, శ్రీనాధుడు, పోతన మొదలైన వాళ్లపై కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయని  గొడవ చేస్తారా?  వీధుల్లోకి లాగుతారా? ఊహూ.. ఆపని చేయరు.  ఆడకూతురిని అన్యాయంగా ఆడిపోసుకుంటున్నారు లోలోన అనుకున్నది మగమేక.  

“పూజలు చేస్తూ అంగాంగ వర్ణన చేసే ఆచారాన్ని ఏమనాలి? దానికి నీ సమాధానం ఏంటో..” సవాల్ విసిరినట్టు ఆడమేక. 

“నిజ్జంగా అపచారాలు జరుగుతున్నా నోరెత్తని వీళ్ల ప్రతాపం బలహీనులు అనుకున్న వాళ్లపైనే” అన్నది ఉడుత 

“ఆ అమ్మాయి తప్పు చేసింది. చాలా తప్పు చేసింది. అసలు ఆ వీడియో తీయకుండా ఉండాల్సింది. 

స్వాతి సోమనాద్  “కామసూత్ర ”  సాంఘిక ప్రయోజనం కోసం చేశారు.  అయినా ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. 

తలంచితే ప్రతి వెధవ మనోభావాల పేరుతో నెత్తినెక్కి తైతక్క లాడతానంటాడు. 

ఆమెకు నచ్చినట్లు చేస్తుంది.  ఆమెకు పాడాలని పించింది పాడుతుంది. ఆడాలనిపిస్తే ఆడుతుంది. అది ఆమె ఇష్టం. కానీ వాళ్ళ ఇష్టం ప్రకారం నడుచుకోమనడానికి వాళ్లెవరు? వాళ్ళ పెత్తనం ఏంటి?

మేత్తాగా ఉంటే మొట్టుతూనే ఉంటారు” తీవ్రంగా ప్రశ్నించింది ఆడమేక 

“మన భారతీయత సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవద్దా..” ఉక్రోషంతో అరిచింది గాడిద 

ఆ అమ్మాయి వీడియో పబ్లిక్ లో పెట్టింది కాబట్టి ఈ గొడవ. పెట్టకుండా ఉంటే..?

వందల ఏళ్ల క్రితం ఎప్పుడో అన్నమయ్య సమాజంలోకి వదిలిన కీర్తనలు అవి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పాడుకుంటున్నారు.

ఒకసారి ప్రజల్లోకి, సమాజంలోకి వచ్చాక వారి కుటుంబ ఆస్తి ఎట్లా అవుతాయి? ఇన్ని తరాల తర్వాత వారికి ఏం హక్కు ఉంటుంది? 

ముఖానికి బొట్టు , కాళ్ళకి మెట్టెలు భక్తి చిహ్నాలా .. 

చెత్త పనులన్నీ చేసి బొట్టు మెట్టెలు పెట్టుకుని గుడికి వస్తే భక్తి ఉన్నట్లా  తీవ్రంగా ఆలోచిస్తున్నది చెట్టు మీద కూర్చున్న కోతి. 

“కాళ్ళకు మెట్టెలు, పట్టీలు, ముఖానికి బొట్టు, మెడలో తాళి ఉన్నా లేకపోయినా అందువల్ల సమాజానికి వచ్చిన నష్టం, కష్టం  ఏమిటట?  అది పూర్తిగా ఆమె వ్యక్తిగతం కాదా.. 

భారతీయత, సంప్రదాయం నిలపాల్సింది కాపాడాల్సింది ఆడవాళ్ళ బాధ్యతేనా? మగవాళ్లకు లేదా.. 

అన్నింటా చొరబడి మనో భావాలు దెబ్బతిన్నాయని వీరంగం చేసే వాళ్ళ పద్దతి చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టులేదూ..?” అన్నది ఆడమేక. 

” నిజంగా అన్నమయ్య ఉంటే ఈ రోజు ఎలా స్పందించేవాడు? ఊపుతున్న ఆమె కాళ్ళ మీద మరో కీర్తన రాసేవాడేమో..” నవ్వింది కోతి. 

అదేమీ పట్టించుకోని ఆడమేక “ఒకరి స్వేచ్చని, వ్యక్తీకరణని, తినే తిండిని, కట్టే బట్టని, ప్రేమించే వ్యక్తిని చెప్పడానికి వాళ్లెవరట?  

ఓవర్ ఆక్షన్ కాకపోతే కీర్తనలు దేవుడి ముందే పాడాలని రూలెక్కడైనా ఉందా.?” అన్నది 

“ఆ స్టార్ సింగర్ ఆ కీర్తన మార్చేసినప్పటికీ తన గళం మాత్రం గట్టిగా వినిపించింది. 

ఏదైనా చూసే వాళ్ళ దృష్టి కోణం నుంచే ఉంటుందంటూ..  తన యు ట్యూబ్ ఛానెల్ వేదికగా” అన్నది లోక సంచారం చేసొచ్చిన కాకి. 

“ఇంతకీ ఆ అమ్మాయి గెలిచిందా? ఓడిందా? ” మగమేక సందేహం 

వి. శాంతి ప్రబోధ 

Vihanga, August 22

చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం…  

వర్షం చినుకులు పడుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. కాస్త మునగదీసుకుని పడుకున్నది మేకల జంట. చినుకులు పెరిగాయి.  మోటార్ సైకిల్ ఆపుకుని సెల్ ఫోన్ లో వార్తలు వింటున్నాడు ఓ నడి వయస్కుడు. 

కళ్ళు మూసుకుని సెల్ ఫోన్ నుండి వచ్చే వార్తలు వింటూ ఆ మేకల జంట. 

అంతలో హడావిడిగా పరిగెత్తుకొచ్చింది గాడిద. 

“హే .. ఇది విన్నారా.. 

ఎక్కడో మారుమూల ప్రాంతపు గిరిజన మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైందోచ్.  ఎంత గొప్ప విషయం కదా..!

ఈ మారుమూల పల్లెలో పడున్న మనకి కూడా ఎప్పటికైనా ఇలాంటి గొప్ప అవకాశం వస్తే..!?”  ఆశగా అన్నది గాడిద

అదేమీ పట్టించుకోనట్టు కళ్ళు మూసుకునే ఉన్నది మేకల జంట. 

“సర్వసత్తాక , సామ్యవాద , లౌకిక , ప్రజాస్వామ్య , గణతంత్ర రాజ్యమైన భారతదేశానికి దేశాధినేత రాష్ట్రపతి.  రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత, శాసన విభాగమైన పార్లమెంట్ ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు.  ప్రభుత్వ అధినేత అయిన ప్రధాన మంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు.  అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు.  అటువంటి మహోన్నతమైన పదవికి ఓ మహిళా పోటీపడుతున్నారు.” అంటూ  ఆ సెల్ ఫోన్ నుంచి వినవస్తున్నది. 

“ఎహే.. లేవండి . ఎప్పుడు చూసినా ఇదే సీను” మేకల జంటని పట్టి కుదుపుతూ కసిరింది గాడిద. 

“అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి కి ద్రౌపది ముర్ము. నిజమే  ఒక గిరిజన మహిళ ఆ కుర్చీలో ఆసీనురాలడం భారత దేశానికి గర్వకారణం ” గాడిద కేసి చూస్తూ అన్నది కాకి 

“ఆమెవరో రాష్ట్రపతి అయితే గర్వకారణం ఎవరికి? ఎందుకు? ఎవరో ఒకరు అవాల్సిందే గా..? ” మొహం చిట్లించుకున్న ఉడుత 

“శివాలయంలో చీపురు పట్టుకునే మనిషి. దేశ అధ్యక్షురాలా”  ఎగతాళిగా నవ్వింది చిలుక 

“సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ”  తన మాటను సమర్ధించుకుంటూ కాకి 

“రబ్బర్ స్టాంప్ పోస్టులు దళిత ఆదివాసీ బిడ్డలకు, లేదా మైనారిటీలకు.  అధికారం చెలాయించే పెద్ద పోస్టులు వాళ్ళకి…   

దేశ ప్రయోజనాలే ముఖ్యంగా, అంతర్జాతీయ సమాజంలో దేశ కీర్తి ఇనుమడిస్తుంది. దేశంలో కుల మత వివక్షలేదని ప్రపంచానికి చాటి చెపుతోంది.. అంతేగా ..”  గాడిదకేసి సూటిగా చూస్తూ అన్నది  మగమేక 

“ఏముంది ఒక్కరికి పదవి ఇవ్వాలి. ఆ జాతిని మొత్తం అణచివేతకు గురి చేయాలి ” వెటకారంగా అన్నది కోతి 

“ఆదివాసీ కార్డు ఉపయోగించి ప్రయోజనం పొందాలని ఆరాటం.  అందులో రహస్యం ఏముంది. జగమెరిగిన సత్యం ఇది”  లేచి ఒళ్ళు దులుపుకుంటూ అన్నది మగమేక    

“మత సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న పార్టీ దళిత, ఆదివాసీలకు చేరువ కాలేకపోయింది.  ఓట్లు చేసుకోలేకపోయింది.  వాళ్లకు చేరువయ్యే ప్రయత్నంలో భాగమిది.  దేశ జనాభాలో 9 శాతం ఉన్న ఆదివాసీల ఓట్లపై కన్నేసి ఈ పాచిక వేసినట్టుంది ”  జోస్యం చెప్పింది చిలుక 

“అయ్యాయా .. మీ వెటకారాలు.. ,దెప్పి పొడుపులు.. 

ఒక మంచి పని జరుగుతుంటే సమర్ధించకపోగా నానా రాద్ధాంతం చేస్తారు ..ఛీ ఛీ.. “కయ్యిమంది  గాడిద 

“ఒరిస్సాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతంలో పుట్టి పెరిగిన ద్రౌపది ముర్ము సంతాల్ తెగకు చెందిన మహిళ.  దేశంలో మూడో పెద్ద ఆదివాసీ తెగ సంతాల్.  ఆమె పార్టీలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి,  పార్టీ విధేయురాలు. వార్డు మెంబర్ గా రాజకీయాల్లోకి వచ్చి. అంచెలంచెలుగా ఎదిగింది.  మూలవాసి మహిళ ద్రౌపది ముర్ము  రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవడం చారిత్రక ఘట్టం   

ఆదివాసీ గూడెం నాయకుడి కూతురుగా పుట్టిన ద్రౌపది డిగ్రీ చదివింది.  ఆమె మొదట గుమస్తాగా, తర్వాత టీచర్ గా పనిచేసింది . ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి పంచాయితీ వార్డు మెంబర్ గా గెలవడంతో ద్రౌపది ముర్ము రాజకీయ ప్రస్థానం మొదలైంది .  . 

రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. వాణిజ్య, రవాణా శాఖ మంత్రిగాను, తర్వాత మత్స్య, పశుసంవర్ధక శాఖ, మంత్రిగా పనిచేసింది.  2007 లో ఉత్తమ శాసన సభ్యురాలిగా ఎన్నికయింది. ఆ తర్వాత జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు  సమర్థవంతంగా నిర్వహించింది.” సెల్ ఫోన్లో నుంచి  వినవస్తున్నది. 

“ఆదివాసీ మహిళ గా పుట్టడం ఆమెకు కలిసొచ్చిన అదృష్టం” వెడల్పయిన మొహంతో గాడిద 

“చీపురు పట్టి శివాలయాన్ని శుభ్రం చేసిన ద్రౌపది ముర్ము వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.  పెద్ద పెద్ద పదవులు చేపట్టిన ఆమె సొంత ఊరి ఆలయాన్ని శుభ్రం చేసే కర్మ ఏమిటో ..”  వెక్కిరింతగా ఉడుత 

” అది ఆమె భక్తికి, నిరాడంబరతకు నిదర్శనం. తన మూలాలు మరవని వ్యక్తి.” టక్కున జవాబిచ్చింది  గాడిద 

రాష్ట్రపతి పదవి ఓ రబ్బరు స్టాంపు వంటిదని అనుకోగా విన్నాను.  కాకపోతే అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకని అధికార పార్టీ వీలయినంత డమ్మీ అభ్యర్థిని పెట్టడానికి చూస్తుంది. మరీ పూర్తి అనామక డమ్మీ అయితే విమర్శలు వస్తాయి కదా? అందుకని ఏదో ఓ కవరప్ క్వాలిఫికేషన్ కోసం చూస్తారు. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ లాంటివన్న మాట. ఒకవేళ ప్రత్యర్థులు విమర్శిస్తే, చూశారా,  ఆదివాసీ మహిళ అని కించపరిచారు అని ఎదురు దాడి చేయొచ్చు. మనక్కావలసిన డమ్మీ మనకు దొరుకుతుంది. ఎన్నిక ప్రాతిపదిక అదే అయినపుడు జనం కూడా అదే గుర్తిస్తారు కదా?”  మనసులో అనుకుంది మగమేక 

పంతులుగారికి ఇంట్లో ఆర్డక సమస్య అనిపించినప్పుడల్లా ఏదో ఒకటి ప్రవేశపెట్టి జనాలనుండి గో దానం, భూదానం, మరేదో దానం పొందినట్లన్నమాట అనుకుంది ఆడమేక 

“ఏంటో ఈ మనుషులు అన్ని కులం, మతంలోంచే చూస్తారు .. “గొణిగింది చిలుక 

“మన దేశంలో ప్రతి నిర్ణయం కుల లేదా మత ఆధారితమే ఎందుకంటే ప్రతి కులం, మతం ఎప్పటి కప్పుడు  మా వాటా ఏది, మా కోసం ఏమిటి?  అంటూ 

డిమాండ్ చేస్తుంది”  గొణిగింది గాడిద 

“ఓహో .. , ఏదో ఒకటి విసిరితే తృప్తిపడతారు. ఆ తర్వాత ఆదివాసీ ఓట్లన్నీ దండుకోవచ్చనా ..”  సాలోచనగా అన్నది ఆడమేక 

దేశంలో ఆదివాసీ ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రభావం నామమాత్రమే.  ఆ ప్రాంతాల్లో  ఎన్నికల్లో ప్రతిపక్షాలే మెజారిటీ సీట్లు గెలుస్తున్నారు ..  విన్న విషయాలు గుర్తొచ్చాయి కాకికి. 

” ఓహో ఆదివాసీ ఓట్లు లక్ష్యంగా చేసిన నిర్ణయమన్నమాట ” అన్నది కాకి 

“విశేషమైన ఆమె ప్రజ్ఞాపాటవాలు, మెరుగైన సేవలు,  విధాన పరమైన అంశాలపై  అవగాహన  మీ కళ్ళకు కనిపించడం లేదా.. ” వెటకారంగా అన్నది గాడిద. 

“ఆమె కన్నా విశేష ప్రజ్ఞాపాటవాలు, మెరుగైన సేవలు,  విధాన పరమైన అంశాలపై  అవగాహన ఉన్నవారు అనేకులున్నారు.  కానీ ఆమె ఎంపికకు కారణం ఆమె అస్తిత్వం అంటే ఆమె కులం , మతం, జెండర్ ”  అన్నది ఆడమేక 

“అత్యంత సాధారణ మహిళ రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎంపికై ఇప్పటి వరకు ఏ గిరిజన వర్గాల వారికి లభించని అవకాశం గౌరవం ముర్ముకి లభించింది. 

ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత స్థాయి పదవికి చేరువలో ఉన్న ద్రౌపది ముర్ము ను నేను తప్పు పట్టడం లేదు.” అన్నది కోతి  

“మూలవాసి కి ఇవ్వడం వల్ల ఆదివాసీ సమూహాలకు, ప్రాంతాలకు  ఏమైనా ఒరుగుతుందా .. ఈ రోజుకీ ఆమె స్వస్థలంలో విద్య , వైద్య, రవాణా సదుపాయాలు ఏమీ లేవట. ఆమె ఆ ప్రాంత ఎమ్మెల్యే గా, మంత్రిగా చేసినప్పటికీ తన ప్రాంత అభివృద్ధికి, తన జాతి మెరుగైన జీవితం అందుకోవడానికి ఏం కృషి చేసినట్లు ?” నిలదీసింది మగమేక   

“రాష్ట్రపతి రేసులో గెలిస్తే మొదటి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ఆమె కొత్త చరిత్ర లిఖిస్తారు, అందులో సందేహం లేదు.  కానీ ఒక ఆదివాసీ మహిళ అభ్యర్థి అయినంత మాత్రాన ఆదివాసీల జీవితాల్లో వెన్నెల కురుస్తుందన్న భ్రమలు  మాత్రం లేవు.

ఒక మూలవాసి చెట్టుపై చిటారు కొమ్మకు చేరినంత మాత్రాన మిగతా జాతికి ఆ చెట్టు ఫలాలు అందుతాయా ఏంటి? అందవుగా.. దీన్నేచెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం అంటారు. ” అర్థమైందా అన్నట్లు అందరివైపు చూసింది ఆడమేక 

“వాళ్ల జీవితాల్లో నిన్నటికీ నేటికీ రేపటికి చెప్పుకోదగ్గ మార్పేమీ రాదు. స్వతంత్ర దేశంలో ఇన్నేళ్లలో లేనిది ఈ ఐదేళ్లలో ఎలా వస్తుంది?” అన్నది అవునన్నట్టు తల ఊపిన మగమేక

“అంతేనంటారా .. “అంటూ తలగోక్కుంటూ నీరసంగా వెనుదిరిగింది గాడిద . 

వి. శాంతిప్రబోధ

Vihanga, July 2022

ఎప్పటిలానే ఆ మధ్యాహ్నం వేళ చెట్టు కింద చెట్టు మీద జంతువులు, పక్షులు సేద తీరుతున్నాయి. 

దూర ప్రాంత బాటసారి చెట్టునీడన చేరి సెల్ ఫోన్ లో వార్తలు వింటున్నాడు. 

ఆ పక్కనే కునుకు తీస్తున్న మేకల జంట చెవిన  కూడా పడ్డాయి. నిద్ర ఎగిరిపోయింది.  ఆశ్చర్యంతో చెవులు రిక్కించి వినడం మొదలు పెట్టాయి. 

అంతలో ఇది విన్నారా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ, ఆయాసపడుతూ పరుగు పరుగున వచ్చింది గాడిద. 

“సిగ్గులేకపోతే సరి ఆ పొట్టి పొట్టి గుడ్డలేంటి? ఆ ఆట లేంటి? అని ఆడపిల్లలని ఆడిపోసుకుంటావుగా.. విను, బాగా విను. పొట్టి గుడ్డలేసుకున్న పిల్ల ఏం సాధించిందో.. ”   ఎద్దేవా చేసింది ఆడమేక. 

” పొట్టి దుస్తులతో ఆడిన ఆ పిల్ల ఇప్పుడు  ప్రపంచ ఛాంపియన్.  నీలాగా ఎంతో మంది పొట్టి నిక్కర్లు వేసుకోవద్దని చెప్పారట. బురఖా వేసుకోవాలని పట్టు పట్టారట.  కానీ ఆమె సంకల్పాన్ని, ఆ తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని మతం, కట్టుబాట్లు ఆపలేకపోయాయి. అందుకే ఈ రోజు మహిళల బాక్సింగ్ 52 కిలోల విభాగంలో ప్రపంచ విజేత కాగలిగింది.” వివరంగా చెప్పింది మగమేక 

“హిజాబ్ లేకుండా బయటికి వచ్చే అమ్మాయిని కట్టడి చేసే వాళ్ళకి తన విజయంతో గట్టి పంచ్ ఇచ్చింది నిఖత్ జరీన్.  శభాష్ బిడ్డా శభాష్” చెట్టు మీద నుంచి చిలక  

” బురఖా వేసుకుంటే బురద, బురఖా విప్పితే బంగారం ” అంతేనా వెటకారంగా అన్నది గాడిద. 

“నిఖత్ ను ఆమెగా ఎదగనిచ్చిన, సమాజానికి ఎదురీదిన ఆ తల్లిదండ్రులకి కూడా ఈ విజయం” అన్నది ఆడమేక 

“మట్టిలో మాణిక్యాలు మెరుస్తున్నాయి. ఒక మెట్టు ఎక్కుతుంటే మరో మెట్టు కిందికి లాగుతూ ఉంటారు జనం. కానీ గమ్యం చేరడానికి మళ్ళీ మళ్ళీ పై కి ఎక్కుతూ  

దిగుతూ ఎవరేమన్నా తనకు తాను వెన్ను తట్టుకుంటూ, వెయ్యేనుగుల బలాన్ని నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆడపిల్లలు ” ప్రశంసగా అన్నది మగమేక 

“అవునవును, నిన్న భువనగిరికి చెందిన అన్వితారెడ్డి అత్యున్నత పర్వత శిఖరం ఎవరెస్టు పై జెండా ఎగురవేసింది” గొప్పగా చెప్పింది అప్పుడే వచ్చిన కాకి. 

“ప్రోత్సహిస్తే  బంగారు పంట పండిస్తారు. జాతి గర్వపడేలా చేస్తారు ” అంటున్న గాడిద వైపు చూస్తూ  “ఏంటో ఈ లోకం.. నిన్న నవ్విన నోళ్లే పండుతున్నాయి ” ఉడికిస్తున్నట్లుగా ఆడమేక 

“మీ గోల మీదే గానీ వార్తల్లో చెప్పిన అసలు ముచ్చట విన్నారా?  

నలుగురికి శకునం చెప్పే పిల్లి కుడితిలో పడ్డదట ” అంటూ అర్ధం కానట్టు చూస్తున్న అందరినీ చూస్తూ “నేనే తీన్మార్ ఖాన్ ని. నేను ఆడిందే ఆట అంటే నడుస్తుందా నడవదట. 

తక్షణ న్యాయం, ప్రజల ఆగ్రహం అని ఎన్కౌంటర్ చేసే అధికారం పోలీసులకు లేదని కోర్టు పోలీసులను తప్పు పట్టింది ” అని చెప్పింది కోతి 

“నిజమా ..! ”  అన్నది ఉడుత 

“ఒక నేరానికి మరో నేరమే సమాధానమా?

జగమంతా తెలుసు అది ఎన్కౌంటర్ పేరిట జరిగిన హత్య అని. కానీ నిప్పులాంటి నిజం తేల్చడానికి కోర్టుకు మూడేళ్లు పట్టింది.  ఇప్పటికైనా ఆటవిక న్యాయం అంతరించి, ప్రజల ఉన్మాదానికి ముగింపు వస్తే బాగుండు” ఆలోచనగా ఆడమేక 

“ఆ పదిమంది పోలీసుల లిస్టులో వాళ్ళను నడిపించిన తలకాయ పేరు లేదట”  జనం అనుకోగా విన్నా నెమ్మదిగా అన్నది కోతి 

” ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సింది చట్టం వ్యక్తులు కాదు.  బూటకపు ఎన్ కౌంటర్ అని తేలితే చేసిన అధికారులకు ఉరిశిక్ష వేయొచ్చని సుప్రీంకోర్టు 2013 లో తీర్పు ఇచ్చిందట.”  తనకు తెల్సిన విషయాలు నలుగురికీ  చెప్పింది కాకి 

“అంటే ఏంటి? ఆడపిల్లల్ని బలవంతంగా అనుభవించొచ్చా.. కిరాతకంగా హత్య చేయొచ్చా..? అది నేరం కాదా?

ఇలాంటి కిరాతకులను  ఏరి పారేస్తే  వెర్రికేకలు.. అసలు ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులకి, వాళ్ళకి ఆ ఆర్డర్ చేసిన అధికారులకి పరమ వీర చక్ర బిరుదు ఇవ్వాలి ” ఆవేశపడింది గాడిద 

మళ్ళీ తానే “అమాయకపు ఆడపిల్లల్ని ట్రాప్ చేసి ఎత్తుకుపోయి రేప్ చేసి సజీవ దహనం చేసినప్పుడు లేవని నోళ్లు బూటకపు ఎన్కౌంటర్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. హూ … 

అసలు ఆ రాక్షసుల పట్ల జాలి ఏంటి ? సిగ్గు లేకపోతే సరి” గొంతుచించుకుంది గాడిద 

” ప్రజలు ఆగ్రహిస్తారు, శాసిస్తారు. పోలీసులు వాటిని అర్థం చేసుకుని అమలు చేస్తారు.  అంతేనా ”  చురుగ్గా చూస్తూ ఆడమేక. అవునన్నట్లుగా తలూపింది గాడిద 

“అట్లాగా.. మరిక చట్టాలెందుకు? న్యాయవ్యవస్థ ఎందుకు?  

ఎంత పోలీసు అధికారులు అయితే మాత్రం వాళ్లకు చట్టాలు వర్తించవా? చట్టసమ్మత విధానాలు వదిలి ఉన్మాదం గా ప్రవర్తించవచ్చా? హత్యలు చేసేయొచ్చా? ఇక నేరస్థులకు వీళ్లకు తేడా ఏముంది ?” స్థిరంగా అన్నది ఆడమేక 

“నిజమే, నువ్వన్నదీ కరెక్టే. ఆ పోలీసు అధికారులపై సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం నమోదు చేయాలి”  మగమేక. 

“అట్లా అయితే ఎట్లా .. తప్పు చేస్తే చంపుతారని భయం జనానికి ఉండాలి కదా. మళ్ళీ మళ్ళీ తప్పులు , నేరాలు జరగకుండా ఉండాలంటే  ఆ మాత్రం భయం పోలీసులు పెట్టాల్సిందే” వాదనకు దిగింది గాడిద. అవునన్నట్లుగా చూసింది ఉడుత. 

“ఆ .. అవునా .. అయితే, పోలీసులకి రౌడీ షీటర్ కి తేడా ఏంటో ..?” అన్నది కోతి   

“దిశ కేసు నిందితులు పేదలు, కులాల నిచ్చెనలో కింద ఉన్నవాళ్లు అని కాల్చి చంపేశారు. అదే పలుకుబడి, పరపతి ఉన్నవాళ్ళ పిల్లలు అయితే అలాగే అత్యుత్సాహంతో ఎన్కౌంటర్ చేసేవారా? అలా ఇప్పటివరకు ఎవరినైనా చేశారా? 

దిశ కేసులో చూపిన అత్యుత్సాహం అదే సమయంలోనే జరిగిన రేప్ కేసుల్లో లేదే ..? వాళ్ళు నిచ్చెన మెట్లలో  పై వరుసలో లేరనా?  ఈ కేసులో ముద్దాయిలను ఎన్కౌంటర్ చేయకుండా న్యాయస్థానం ముందు ఎందుకు నిలబెట్టారు ?”  అన్నది మగమేక 

“సమాజంలో పై స్థాయిలో ఉన్న అమ్మాయికి నష్టం జరిగితే సమాజం గగ్గోలు పెడుతుంది, కింద స్థాయి అమ్మాయిలకి జరిగిన అన్యాయాన్ని పట్టించుకోరు. చూసీచూడనట్టు వదిలేస్తారు. పాపం వాళ్ళు ఆడపిల్లలు కాదా! ఏం మనుషులో .. ”  నిట్టూర్చింది ఆడమేక 

“న్యాయానికి , శిక్షకి కులం, మతం వర్గం ఉంటాయన్నమాట.. ఏమిటీ వివక్ష ” తర్కించుకుంది చిలక 

“ఓ పోలీసు సార్లూ  ఇప్పటికైనా మేలుకోండి. నిబంధనలకు అనుగుణంగా నడవకపోతే  రేపు రిస్క్ లో పడేది మీరేనని గుర్తించండి” అన్నది కోతి 

“కోర్టు మొట్టికాయలు వేసి మీరు చేసింది తప్పు అని పోలీసుల్ని శిక్షిస్తుందేమో.., కానీ పోయిన అమాయకుల ప్రాణాలు తెచ్చి ఇవ్వగలరా .. కుటుంబాల్లో పోయిన సంతోషాన్ని ఇవ్వగలరా .. ప్చ్ ..” ఆయా కుటుంబాల బాధ ఎరిగిన కాకి. 

“ఆ నలుగురిలో ముగ్గురు పిల్లలేనట. వాళ్ళకి పోయేకాలం వచ్చింది. అందుకే కాని పనిచేశారు” అన్నది ఉడుత  

“మనకన్నా మనుషులు గొప్పవాళ్లనుకుంటాం కానీ ఈ పనులేంటో…”దీర్ఘం తీసింది కోతి 

“ఆడపిల్లను గౌరవిస్తే , ఆమెను ప్రోత్సహిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి ” ఆలోచనగా అన్నది మగమేక 

“స్త్రీలను గౌరవిద్దాం అని తాటికాయంత అక్షరాలతో మొక్కుబడిగా రాసుకోవడం కాదు.  మగపిల్లవాడు పుట్టినప్పటి నుంచి తోటి ఆడపిల్లను సమానంగా చూడడం నేర్పాలి. 

ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆమెను చూసే దృష్టి  మారితే ఆడపిల్లను గౌరవిస్తే ఇట్లా జరగదు.  

అట్లా చెయ్యరు. కానీ, కుల మత దురహంకారం బలిసిన నోళ్లు  ప్రపంచ విజేతగా జెండా ఎగురవేసిన నిఖత్ కు నీరాజనాలు పలుకుతున్నది. 

అమ్మాయికి చిగురంత ప్రోత్సాహం లభిస్తే అద్భుతాలు సృష్టిస్తుంది.  చరిత్రను తిరగరాస్తుంది. కన్న నేలకు గర్వకారణం అవుతుంది. 

ఆమె పట్టుదల ముందు  పర్వతం చిన్నదవుతుంది    

గజానికొక గాంధారి పుత్రులున్న దేశం ఇది. సృష్టికి మూలం స్త్రీ .. ఆ స్త్రీత్వాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని ఆటలు ఆడతారు . ఎంత వంచన చేస్తున్నారు.  

  ఓ పక్క గ్రహాంతరాలకి పోతామంటారు . కానీ సాటి మనిషిని మనిషిగా చూడటం రాదు”   ఆవేదనగా అన్నది అడమేక 

“ఆమె మాట, ఆట, పాట, తిండి, బట్ట, నడక, నడత అన్నింటిపై పెత్తనం చెలాయిస్తూ, ఎక్కడికక్కడ గోడలు కట్టేస్తూ, తాళాలు బిగించేస్తూ …’ బేటీ బచావో బేటీ పడావో’ నినాదాలు… ఆశ్చర్యంగా లేదూ…” అన్నది మగమేక 

వి. శాంతి ప్రబోధ 

Vihanga, June 2022

“అయ్యో .. అయ్యో ఎంత పని చేసింది?

కోడిని కోసినట్టు కుత్తుక కోయడానికి చేతులెట్లా వచ్చాయో ..” గొంతు చించుకుంటూ గుండెలు బాదుకుంటూ వచ్చింది గాడిద

ఎందుకే మా మీద అంత కక్ష కట్టావ్?  ఒక్కరోజన్నా కంటి నిండా నిద్రపోనిచ్చావా అనుకున్నది మగమేక.  

అసలే వేసవి కాలం, చెట్టునీడన వచ్చే చల్లగాలికి కళ్ళు మూతలు పడుతున్నాయి.

ఉలిక్కిపడి కళ్ళు తెరిచి దీనికి ఇదేం మాయరోగం ఇట్లా కళ్ళు అంటుకోగానే కొంపలంటుకుపోయినట్టు..  లోలోన విసుక్కుంది అప్పటి వరకు ఎండలో తిరిగొచ్చి వేపచెట్టుకింద సేదతీరుతున్న ఆడమేక.   

ఎవ్వరూ తను చెప్పేది వినే స్థితిలో లేరని డీలా పడింది కాలు నొప్పి లెక్కచేయకుండా హైరానా పడుతూ లేస్తూ వచ్చిన గాడిద. ఒళ్లంతా పట్టిన చెమట తుడుచుకుంటూ అసహనంగా అటు ఇటు కదిలింది. అంతలో చెట్టు కొమ్మలపై గెంతుతున్న కోతి కనిపించింది. 

“ఘోరం జరిగిపోయింది. ఎన్నడూ వినని ఘోరం, ఎక్కడ చూడని ఘోరం జరిగిపోయింది..”ఉత్సాహాన్ని దాచడానికి యత్నిస్తూ మొహం బాధగా పెట్టి చెప్తున్న గాడిదను చూస్తూన్న కోతి  ” నాన్చకుండా అసలు విషయమేంటో చెప్పు ” కసిరింది. 

“మనువాడబోయే పిల్లగాడిని మాట్లాడాలని పిలిచి కుత్తుక తెగ్గోసిందట.  ఆడది ప్రాణాలు పోస్తుంది కానీ తీస్తదా? అసలు ఆమె ఆడదేనా?

ఇంత క్రూరమైన బిడ్డను కన్న ఆ తల్లిదండ్రులకు ఎంత నామర్దా .. ” అంటూ బాధపడిపోయింది గాడిద. 

“నువ్వసలు ఆత్రం ఆత్రం.మనిషివి.  సరిగ్గా విన్నావా ? 

ఇవాళ రేపు ఎక్కడ చూసినా కల్తీ. అన్నింటా కల్తీ.  ఆహారం కల్తీ . పర్యావరణం కల్తీ . 

నువ్వు చెప్పే వార్తలు నిజమైనదో కల్తీవో  ఎవరికెరుక ? ” అన్నది రెండు రోజుల క్రితమే కెమికల్స్ తో మగ్గబెట్టిన అరటిపళ్ళు తిని జబ్బుపడిన కోతి. 

“నిజమే, పనిగట్టుకుని అబద్దాలు పుట్టించి నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఈ మధ్య ఎక్కువయ్యారు.  ఈ చెట్టు ఎన్నింటికి సాక్ష్యమో” అన్నది ఉడుత 

“ఏ ప్రయోజనం ఆశించో  అబద్దాలు.. ” సాగదీసింది గాడిద  

“అసలు ఎవరిని నమ్మాలో, ఎవరి ముచ్చట నిజమో .. ఎవరు అబద్దమో తెలియట్లేదు. ఏది తినాలో ఏది తినొద్దో అర్ధం కావట్లేదు” అన్నది కోతి

“కల్తీ ఏంటి? కాలుష్యం ఏంటి ? 

మగవాళ్ళు ఆడవాళ్ళ మీద యాసిడ్ పోయడం, పెట్రోలు పోసి బుగ్గిచేయడం, కొట్టడం , పీకనులమడం, కత్తితో కసక్ అనిపించడం రకరకాలుగా హత్యచేయడం ఎన్నో విన్నాం. ప్రతి రోజు ఎక్కడో దగ్గర వింటూనే ఉన్నా. 

ఓ ఆడపిల్ల, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల కత్తి పట్టి కుత్తుక తెగ్గొయ్యడం ఎక్కడ వినలేదు. అబద్ధం కాదు. అసలు వార్తే . 

టీవీలో అయితే మసాలా ఫుల్ గా దట్టించి చెబుతున్నారు. అది వింటుంటే ఆవేశం పెరిగిపోయిందనుకో.. పరిగెత్తుకొచ్చా” గడగడా చెప్పింది గాడిద

“ఎంత విషాదం.” అన్నది మగమేక  కళ్ళు తెరిచి 

“పీక ఎందుకు కోసిందట? ” అలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఆడమేక 

“ఏ గాలి తిరుగుళ్ళు తిరిగే రకమో .. ” అనుమానం వ్యక్తం చేసింది కోతి 

“పెళ్లి చేసుకోనన్నా వినకుండా  పెద్దలు పెళ్లి కుదిర్చారట. అతని పీడ వదిలించుకోవడం కోసం పిలిచి పీక కోసిందట ” మిత్రులంతా తను చెప్పింది విన్నారన్న ఉత్సాహంగా చెప్పింది గాడిద 

“తన తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి కుదిరిస్తే శిక్షించాల్సింది వాళ్ళని, పీక కోయాల్సింది తల్లిదండ్రులది కదా.. పాపం . ఆ పిల్లాడికి శిక్ష వేసిందా.. ఎంత క్రూరురాలు మతి లేకుండా ..” ఆవేశంగా అన్నది మగమేక 

” మొన్నామధ్య ఆ నేరేడు చెట్టు ఇంటి పక్క పిల్లకు పది పన్నెండేళ్ళుంటాయేమో.. అయిన సంబంధం బయటికి పోవద్దని తల్లి దండ్రులు పెళ్లి నిశ్చయం చేశారు. ఆ పిల్లకి పెళ్లి ఇష్టం లేదు. ఐదో తరగతి చదువుతున్నది. పెళ్లి చేసుకోను అని ఎదురు తిరిగింది. అయినా పెద్దలు వినలే. ఆమెను కట్టడి చేసి పెళ్లి ముహూర్తం పెట్టారు.  

ఈ విషయం మిత్రుల ద్వారా టీచర్ కి పోలీసులకు తెలిపింది. పెళ్లి ఆగింది. ఆ పిల్లకు ఉన్న ధైర్యం ఆ యువతికి లేదా ..” అన్నది రామచిలుక 

“నిజమే, ఆమెకు పెళ్లి ఇష్టంలేదు అనుకుందాం. అయితే అబ్బయిని చంపడమే పరిష్కారమా?  ప్చ్ .. పాపం అతని కన్న తల్లిదండ్రుల ఆశలు కలలు కాలరాసే అధికారం ఆమెకెక్కడిది ?  శిక్షించడానికి ఆమె ఎవరు ? ఆవేశపడింది గాడిద. 

 ఆ మిత్ర బృందం ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. 

“చదివిస్తే ఉన్న మతి పోయినట్లుంది ఇవాళ రేపు ఆడపిల్లల పరిస్థితి 

ఆ..  స్వేచ్ఛ ఎక్కువై.. విపరీత పోకడలు పోతున్నారు. చంపితే జైలు ఊచలు లెక్క పెట్టాలని తెలియదా” ఎగతాళిగా నవ్వింది గాడిద 

“ఇంతకన్నా పెద్ద పెద్ద ఘోరాలు, నేరాలు మగవాళ్ళు ఎన్ని చెయ్యట్లేదు. వాళ్లెవరి గురించి మాట్లాడకుండా ఆ పిల్లని ఆడిపోసుకుంటున్నారు” జాలి పడింది ఉడుత.   

“ఆ అబ్బాయిని చూసి తెగ జాలి పడుతున్నారు. బాధ పడుతున్నారు.  ఆమెకు ఏదో పెద్ద గాయం చేసే ఉంటాడు అందుకే చంపాలని అనుకుందేమో” అన్నది ఆడమేక

” ఆ పిల్ల పెళ్లి వద్దని మొత్తుకున్నప్పుడు ఆ పెద్దలైనా కారణాలేంటో తెల్సుకోవాలిగా.. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అనుకుంటే ఫలితం ఇట్లాగే ఉంటుంది” అన్నది ఉడుత

“నిజమే, ఆ పిల్లకి పిచ్చి ఉందేమో” అనుకుంటున్నారు అన్నది అప్పుడే వచ్చిన కాకి

“మొన్నా మధ్య మొదటిరాత్రికి భయపడి ఆ ఉత్తరాన చివరింటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడట. విడ్డురంగా లేదూ ..” నవ్వింది గాడిద 

“ఇతరుల గాయం మనకెప్పుడూ హాస్యమే ” గొణిగింది కోతి 

“నిజంగా ఆ అమ్మాయికి పిచ్చా.. ” అడిగింది రామచిలుక

“దేవుని పిచ్చిలో ఉందట. పెళ్లి వద్దని దేవుని భక్తురాలిగా ఉంటానని చాలా సార్లు చెప్పిందట.  రెండు మూడు సార్లు పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయట . తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నాలు ఆపకుండా ముహూర్తం కూడా పెట్టించారు. ఆ డిప్రెషన్ లో ఉన్నదట. గిఫ్ట్ ఇస్తాను గుడికి రమ్మని పిల్చి, చున్నీతో అతని కళ్ళకు గంతలు కట్టి గొంతుపై చాకు పెట్టిందట” వివరించింది కాకి 

“ముందునుంచి అదే అనుకుంటున్న. ఆ పిల్ల తేడాగా ఉందని అదే నిజమైంది.”  అన్నది గాడిద 

“మానసిక సమస్య  తీవ్రత తెలియక ఏదో మాట్లాడేసుకుంటున్నాం”  అన్నది కోతి.   

“ఆడపిల్లల అభిప్రాయాల్ని గౌరవించని సమాజం.  పురుషాహంకారం బుసలు కొట్టే ప్రపంచం ఇంతకన్నా గొప్పగా ఏం మాట్లాడుతుంది?  

నేనైతే ఆ అమ్మాయి కంటే ముందు నేరస్థులు ఆమె తల్లిదండ్రులు అంటాను.  ఎంత మూర్ఖులు వాళ్ళు . వాళ్ళ బలవంతం వల్లనే కదా ఆ పిల్ల చివరికి ఆ పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది . హంతకురాలిగా మిగిలిపోయింది. ఆ అమ్మాయి కూడా బాధితురాలే” అన్నది ఆడమేక 

“తల్లిదండ్రులది నేరం ఎట్లా అవుతుంది ? కన్న కూతురికి  పెళ్ళి చేయాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది” కోపంగా ప్రశ్నించింది మగమేక 

“తన ఇష్టాన్ని, అభిప్రాయాన్ని నిర్బయంగా చెప్పలేని నిస్సహాయత, తక్షణ చర్య నుండి విముక్తి పొందలేని అసహాయతలో ఉన్న ఆడపిల్లని కాదు తప్పు పెట్టాల్సింది. 

ఒకవేళ చెప్పినా ఆడపిల్లల ఇష్టాయిష్టాలు పట్టించుకోని సంప్రదాయాన్నీ తప్పు పట్టాలి   

 ఆ పిల్లకి ఆ పరిస్థితి కల్పించిన, ఆ పరిస్థితుల్లోకి నెట్టేసిన సమాజాన్ని తప్పు పట్టాలి” స్థిరంగా అన్నది ఆడమేక 

“భక్తి మైకంలో ఉన్మాద స్థితిలో ఆలోచనా రహితంగా ప్రవర్తించినట్లుంది” నెమ్మదిగా అన్నది మగమేక

“సాటి మనుషుల్ని ప్రేమించలేరు . కులం మతం అడ్డువస్తుంది .  కానీ జంతువుల్ని మాత్రం ప్రపంచంలో ఎవరు ప్రేమించనంతగా ప్రేమిస్తున్నామని నటిస్తారు” ఏసీ కారులో పోతున్న కుక్కను చూస్తూ అన్నది కోతి 

“నువ్వమాట ఏం చూసి అన్నావో కానీ అది అక్షరాలా నిజం. ఆవుదూడకు ఊయల వేసి పెద్ద ఎత్తున బారసాల పండుగ చేయడం చూశా ” సమర్ధింపుగా అన్నది కాకి.

“పని పాట లేనివాళ్లు. వాళ్లకు ఆకలి తెలియదు. కడుపునిండా తిన్నది అరగాలంటే ఏం చేయాలో తోచక ఈ పనులు చేస్తారు.  కన్న బిడ్డ కులం కానివాళ్ళని పెళ్లి చేసుకుంటే ముక్కలు ముక్కలు చేస్తారు. తల్లిదండ్రులను వృద్దాశ్రమాల్లో వదిలేస్తారు. కానీ జంతువుల్ని ప్రేమిస్తారట ” ఎగతాళిగా అన్నది మగమేక 

“ఏంటో ఈ మనుషులు. నేల, నీరు, నింగి కలుషితం చేసేశారు. మనుషులు కలుషితం..మనసులు కల్తీ.. 

మనిషి ప్రాణాలకంటే పరువు ప్రతిష్ట ముఖ్యం అంటారు. వాళ్ళ ప్రవర్తన ఆ గోడమీద సూదంటు గాజు పెంకులు గుచ్చుకున్నట్లు గచ్చుతున్నది. ఎప్పుడు మారతారో..” అన్నది కోతి 

” ఆ పిల్లకి పిచ్చి అని తేల్చేశారు. అందుకు ఆధారాలు ఉన్నాయా ?” ప్రశ్నించింది చిలుక 

“పాపం ” సానుభూతి ప్రకటించింది ఉడుత. ఎవరికి సానుభూతి ప్రకటించిందో అర్ధంకాక అందరి మొహాలు చూసింది గాడిద. 

“ఈ పాపానికి పెళ్లికాని ఆడపిల్ల బరువు అనో, పరువు ప్రతిష్ట అనో బలవంతంగా పెళ్ళికి ఒప్పించిన ఆ తల్లిదండ్రులు ప్రత్యక్ష కారణం అయితే వ్యవస్థ పరోక్ష కారణం. 

అసలు ఆమె కారణాలు ఏమిటో.. మూలాలు ఎక్కడున్నాయో వెతికారా.. వెతకరు. పురుషాధిక్య సమాజం కదా. 

మగవాళ్ళు చేసిన చట్టాల నుంచి, పురుషాధిక్య సమాజపు చూపుల్లోంచి చిలవలు పలువులు చేసి చూస్తే ఆమెదే తప్పుగా కన్పిస్తూ ఉండొచ్చు.  ఆమె సమస్య అసలు సమస్యగానే పరిగణించకపోవచ్చు” తీవ్ర ఆలోచనతో వ్యాఖ్యానించింది ఆడమేక 

ఆడమేక అన్నది అర్ధమయ్యి అవక ఆలోచనలో పడ్డారంతా 

వి. శాంతి ప్రబోధ 

May 2022, Vihanga

 మూడో ప్రపంచ యుద్ధం వస్తుందట..! 

ఇక మన ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే ‘ అంటూ శోకం తీసింది గాడిద. వారం క్రితం విన్న సంగతులే గాడిదను నిలువనీయడం లేదు.  ఏ క్షణమైనా చనిపోతాననే భావన వణుకు పుట్టిస్తున్నది.  ఆ మాట చెబితే మిత్రులు నవ్వుతారేమోనన్న సందేహంతో ఉగ్గబట్టుకున్నది. ఇక ఆగలేక పరుగు పరుగున మిత్రుల చెంతకు చేరి లోపాల రగులుతున్న భయాన్ని వెళ్లగక్కింది. .  

ఏదో ఆ యుద్ధం ఇప్పుడే వచ్చి మృత్యువు నీ వాకిట్లో కూర్చున్నట్టు, నీ ఒళ్ళో వాలిపోయినట్టు ఆ ఏడుపేంటి ?  ఆపు ముందు ” కసిరింది మగమేక 

“ఈ భూ ప్రపంచంలో నువ్వొక్కదానివే ఉన్నట్టు, నీకే ముప్పు ఉన్నట్టు.”.గొణిగింది ఆడమేక 

“ఏమి యుద్దాలో ఏమో .. ఏం బావుకుందామనో ..” అన్నది ఉడుత 

” అగ్రరాజ్యాల ఆర్ధిక ప్రయోజనాల కోసమే ఈ యుద్ధం .  ఆ యుద్దానికి ఎంతమంది ప్రజలు బలయిన వాళ్ళకి అనవసరం.  మనలాంటి జంతు జలాలు, ప్రకృతి, పర్యావరణం ఎంత నాశనం అయితేనేం..  వారి ప్రయోజనాలు వాళ్ళవి . వాళ్ళ లాభాలు వాళ్ళవి .” ఆలోచనగా అన్నది మగమేక. 

“భుజబలం, అధికార బలం, బుద్ధి బలం, మానసిక బలం తో  అభం శుభం ఎరుగని వారిపై ప్రతాపం చూపే బదులు కూర్చుని సామరస్యంగా చర్చించుకోవచ్చుగా.. ? సమస్యలేమైనా ఉంటే పరిష్కరించుకోవచ్చుగా?? వివాదం ముగించేయొచ్చుగా ..?” అన్నది ఆడమేక 

” హూ.. ఆ మాత్రం తెలివి లేకనా .. ” మధ్యలో అందుకుని దీర్ఘం తీసింది గాడిద. 

” కానీ జరగదు. అలా జరగలేదు. జరగనివ్వలేదు. ఆధిపత్యం కోసం పాకులాట, ఆర్ధిక ప్రయోజనాల వెతుకులాటలో సమిధలవుతున్నారు. 

వింటున్నాంగా  ఉక్రెయిన్ సామాన్య ప్రజల దీన స్థితి గురించి.  ముఖ్యంగా మహిళలు, పిల్లల పరిస్థితి వర్ణనాతీతమట ” అంటూ మొగుడు మేక కేసి చూసింది. 

“కొందరి యుద్ధకాంక్ష, ఇంకొందరి విస్తరణ కాంక్ష, స్వార్థ ప్రయోజనాలు  యుద్దానికి కారణం. మూడో ప్రపంచ యుద్ధం దాకా వస్తే జరిగేది అణుయుద్ధమే .. అణు విధ్వంసమే అంటున్నారు” తన చెవిన పడ్డ విషయాలు చెప్పింది మగమేక. 

“అదేగా నేను మొరట్టుకునేది. అణు యుద్ధం వస్తే  మన పని గోవిందా  గోవిందా .. ” అంటూ తూర్పు తిరిగి దండం పెట్టింది గాడిద. 

“హే .. ఆపెహే.. ఉత్త పిరికి సన్నాసి .. ” అన్నది ఉడుత 

“ఈ రోజు కాకపోతే రేపైనా అందరం చావల్సిన వాళ్లమేగా .. ఎందుకంత బాధపడిపోతావ్.? అందరితో పాటు నువ్వూనూ.. ” అంటూ తేలిగ్గా తీసి పారేసింది ఇప్పటివరకు అందరి మాటలు మౌనంగా విన్న కోతి. 

” అట్లా జరిగిందంటే వినాశనం మాములుగా ఉండదు. ప్రపంచమంతా వల్లకాడుగా మారిపోతుంది.  కొన్ని తరాలు నష్టపోతాయి.  ఆ ప్రభావం నుండి బయటపడడానికి వందల ఏళ్లు పట్టొచ్చట ” అన్నది ఆడమేక. 

” ఇదంతా వింటుంటే అప్పుడెప్పుడో మా ఊళ్ళో రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాట గుర్తొస్తున్నది.  

పై నుండి పుల్లలు పెట్టి రెచ్చగొట్టే వాళ్ళని అర్ధం చేసుకోకుండా అన్నదమ్ముల్లా మెలిగిన వాళ్ళు రెచ్చిపోయి ఒకరినొకరు చెరబట్టుకున్నారు. బలవంతుని చేతిలో చిక్కిన బలహీనుడు విలవిలలాడాడు . సాయం కోసం మొరపెట్టుకున్నాడు.  రెచ్చకొట్టిన వాడు వినోదం చూస్తూ కూర్చున్నాడు . 

ఆ అన్నదమ్ముల్లాంటి వాళ్ళ కొట్లాటలో అటు ఇటు వత్తాసు పలికిన సామాన్యులు ప్రాణాలు వదిలారు. అమాయకులైన వారి భార్య పిల్లలు అనాధలైనారు. ప్రాణాలు అరచేత పట్టుకుని పొరుగు ప్రాంతాలకు ఉత్త చేతులతో వలసపోయారు” అన్నది ఉడుత 

” ఆ నువ్వూ అట్లాగే వచ్చినట్టున్నావు ?” అన్నది గాడిద 

అవునన్నట్లు తలూపి “ఎక్కడైనా అంతే ..,

ఎవడి అహంకారానికో, ఎవడి అధికార దాహానికో, ఆధిపత్య ఆరాటానికో.. పెత్తందారీ తనానికో.. అభం శుభం ఎరగని బతుకులు బలైపోతున్నాయి .. 

అవును, ఆ మనుషుల గొడవలో మనమేం చేశామని? మనకేం సంబంధం ఉందని? వాళ్ళు వేసే బాంబులకు మన లాంటి వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి .. ” ఆవేదనతో అన్నది ఉడుత 

“మీ ఊర్లో జరిగిన కొట్లాటలు విసురుకున్న నాటుబాంబులు, ల్యాండ్ మైన్స్ వల్ల ఆ కొద్ది ప్రాంతంలో ఉండే జీవరాశులకు మాత్రమే ఇబ్బంది కానీ అణుబాంబుల వల్ల ఈ జగతి మొత్తం శోకపడాల్సిందే .. 

నేలంతా విషవాయువులతో తడిసిపోతుంది . భూభాగమంతా కలుషితం అయిపోతుంది .. రేడియేషన్ వల్ల వాయు కాలుష్యం , నీటికాలుష్యం జరుగుతుంది. వేల రకాల  

వృక్షజాతులు, పక్షి జాతులు, జంతువులూ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందట” చెట్టుకింద మూగన్ను అంటుకుంటూ ఉండగా ఎవరో అనుకున్న మాటలు గుర్తొచ్చి చెప్పింది ఆడమేక 

“అణుయుద్ధం ముప్పు తప్పినట్టే అనుకుంటున్నారు. ఇప్పుడే వార్తల్లో చెప్పడం విన్నాను ” అన్నది అప్పుడే వచ్చిన కాకి 

“అవునా.. నువ్వు చెప్పేది నిజమా.. ” ఆనందంతో ఎగిరి గంతేసింది గాడిద. 

“అయితే చాలా సంతోషం. 

యుద్ధం అనగానే, నాకయితే నా చిన్నప్పుడు మా ఊళ్ళో విన్న భయంకరమైన బాంబుల మోత చెవిలో దద్దరిల్లింది.  ప్రశాంతత చెదిరిపోయింది. 

హమ్మయ్య , హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు” అన్నది ఉడుత 

“ఎక్కడో వేల మైళ్ళ దూరంలో జరుగుతున్న యుద్ధం గురించి ఇక్కడ మనమంతా ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉందా ..” మరో కొమ్మమీదికి గెంతుతూ అన్నది  కోతి  

“యుద్ధం రెండక్షరాల మాటే, ఎక్కడో జరుగుతూ ఉండవచ్చు..  గానీ .. ఎంత విధ్వంసం.

అణుయుద్ధం అంటే అది ప్రపంచ వినాశనానికే అనడం వినలేదా..? ఎవరు వెళ్లలేని , ఊహించలేని ప్రదేశంలో ఉన్న శత్రువులను కూడా చంపగల అత్యాధునిక ఆయుధాలు, కృత్రిమ మేధ ను ఉపయోగించి దాడులు చేస్తున్నారట. 

మన జీవజాతుల తో పాటు మానవులు ఇన్ని వేల ఏళ్ల నుంచి ఏర్పరచుకున్న మానవ నాగరికతలు కూడా తుడిచి పెట్టుకుపోతాయట.  అణుబాంబు వేసిన వాళ్ళు మాత్రం సక్కంగా బతికి ఉంటారనా.. ?

మనిషి తెలివితేటలతో  సాధించిన జ్ఞానం, సామర్ధ్యం, టెక్నాలజీ, అణుశక్తి , కృత్రిమ మేధ ఆ మనిషికి ఎట్లా ఉపయోగపడుతున్నాయి .. ” అంటున్న ఆడమేక మధ్యలో అందుకుని 

“ఉహు .. కాదు ఎలా ఉపయోగించుకుంటున్నాడు అనాలేమో .. ” సవరించబోయింది గాడిద. 

“కనుక్కున్న అనేకానేక ఆయుధాలు, సమకూర్చుకున్న అత్యంత ఆధునిక ఆయుధాల కోసమేగా .. అంటే భద్రతా పేరుతో కొనసాగించే ఆధిపత్యం కోసమేగా..  

ప్రజల సొమ్మంతా వాటికోసమే తగలేస్తూన్నారు.  

మానవుడు తన జీవితంతో పాటు తన చుట్టూ ఆవరించి ఉన్న జీవులను కూడా రక్షించుకోవాలి.  తన శక్తి సామర్ధ్యాలు, తెలివితేటలు అందరి అభివృద్ధికి, అభ్యున్నతికి ఉపయోగించుకోవాలి.  కానీ కొన్ని క్షణాల్లో తుడిచి పెట్టడానికి కాదుగా? 

మానవ జీవితం మరింత సుఖసంతోషాలతో ఉండడానికి ఉపయోగపడాలి, ఉపయోగించుకోవాలి. కానీ తనతో పాటు సకల జీవరాశుల వినాశనానికి, విధ్వంసానికి కాదు కదా.. ”  ఆవేదనతో అన్నది ఆడమేక 

ప్రాణం పోయడం,  ప్రాణాలు కాపాడడం మాత్రమే తెలిసిన భార్య కేసి అబ్బురంగా చూస్తూ “ఆ విజ్ఞత, విచక్షణ, వివేకం మానవులకు ఎందుకుండవో..” అన్నది మగమేక  

వి. శాంతి ప్రబోధ 

“అబ్బాబ్బా .. 

మీకు నిద్ర ఎలా పడుతుంది. అవతల మంటలు మండిపోతుంటే .. ” ఎక్కడ  వగరుస్తూ వచ్చింది గాడిద. 

దీని గోల రోజూ ఉండేదే అన్నట్లుగా కళ్ళు తెరవలేదు మెళుకువ తో ఉన్న మేకజంట. 

“ఎక్కడ .. మంటలు ఎక్కడా కనిపించట్లేదు .. ” చుట్టూతా చూస్తూ అన్నది చెట్టు మీద కాకి. 

చిన్నగా నవ్వేసి ” నేను చెప్పింది ఆ మంటలు కాదులే .. హిజాబ్ మంటలు” అన్నది గాడిద. 

“హిజాబ్ మంటలు ఏంటి.. తలా తోక లేని మాటలు నువ్వూనూ ..” విసుక్కుంది కళ్ళు తెరిచిన ఆడమేక 

“అసలు విషయం ఏంటో చెప్పు.” ఆవులించి కొండెక్కిన నిద్రని తలుచుకుంటూ అన్నది మగమేక 

“హిజాబ్ గొడవ కర్ణాటకతో అయిపోయిందనుకుంటున్నారా..? లేదు నిప్పు అక్కడ రాజుకుంది.  సెగ ఇక్కడ తగిలింది” అన్నది గాడిద 

“అసలు విషయం చెప్పకుండా ..”మొఖం చిట్లించింది ఆడమేక 

” ఆ అక్కడికే వస్తున్నా .. చెప్పేదాకా ఆగలేవా ..?

నిన్న విజయవాడ  లయోలా కాలేజీలో .. ఇవాళ ఎర్రగొండపాలెం లో హిజాబ్ వివాదం మొదలైంది” వివరించింది గాడిద  

అవునా  అన్నట్లు చూసింది ఆడమేక 

” మొదలవదా ..మరి! మొదలవుతుంది.  నిన్నటి వరకు లేని ఆంక్షలు ఇవ్వాళ మొదలు పెడితే ..” అన్నది మగమేక 

“పిల్లలందరూ ఒకే విధంగా ఉండాలని డ్రెస్ కోడ్ పెట్టిన అట్లా కాదు మేం హిజాబ్ ధరించాల్సిందే అని పట్టు ఆ ఆడపిల్లల కెందుకో .. ” దీర్ఘం తీసింది గాడిద. 

“ఎర్రగొండపాలెం లో ఏమైందిట” అన్నది కాకి 

“మత పెద్దల జోక్యం .. పోలీసుల రంగ ప్రవేశం జరిగిందట. చివరికి సాంప్రదాయ దుస్తుల్లో క్లాసులకు అనుమతి ఇచ్చారట” గాడిద 

“పోన్లే సద్దుమణిగింది.. ” అన్నది కాకి 

“ఒక వర్గం వాళ్ళు హిజాబ్ ధరిస్తే మరో వర్గం ఆడపిల్లలు స్కార్ఫ్ కట్టుకుంటున్నారు. కొందరు కొంగు  నెత్తి మీద నుంచి కప్పుకునే సంప్రదాయం ఎప్పుడు ఉండనే ఉందిగా .. ఇప్పుడు కొత్తగా ఈ అడ్డుకోవడం ఏంటో ..”  ఆలోచనగా అన్నది ఆడమేక 

” హిజాబ్, బురఖా లాంటివి వాళ్ళ మతం వాళ్లపై బలవంతంగా రుద్దిన ఆచారం .. పైగా పాకిస్థాన్ వంటి దేశాల్లో మహిళలు హిజాబ్ వద్దని ఆందోళనలు కూడా చేస్తున్నారట. మన దగ్గర మరీ మూర్ఖంగా తయారవుతున్నారు ” మూతి విరిచింది గాడిద. 

“అబ్బో .. నువ్వు కూడా ప్రగతిశీలంగా ఆలోచిస్తున్నావే .. 

నిజమే, నువ్వన్నట్లు అది మతం బలవంతంగా ఆడవాళ్లపై రుద్దిన ఆచారం.  వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న ఆచారం కావచ్చు.  మరో మతం లో అలాంటి ఆచారాలు కొల్లలు లేవా.. ?” అన్నది ఆడమేక 

అంతలో “హిజాబ్ అంటే .. ” చెంగున వచ్చిన ఉడుత ప్రశ్న 

“జుట్టు, మెడ, ఛాతీని కప్పి ఉంచే పరదా.  కళ్ళు, ముఖం కనిపిస్తాయి ” జవాబిచ్చింది కాకి 

“ముస్లిం స్త్రీలు బురఖా, హిజాబ్ లు తొలగిస్తారనుకుందాం. మరి నువ్వు చెప్పే మహిళలు తలపై నుంచి కొంగు కప్పడం మానేస్తారా .. ” ప్రశ్నించింది మేక 

“అసలు ఏమైంది?” అడిగింది ఉడుత 

“కాలేజీకి ఆలస్యమైతే ఆడపిల్లల్ని నిలదీశారట  అడ్డుకున్నారట .. 

కానీ, తమ సాంప్రదాయ దుస్తులు తొలగించాలని ఆదేశించారని విద్యార్థులు అంటున్నారు.  

విద్యార్థులు మతపరమైన దుస్తులకంటే యూనిఫారం ధరించి వెళ్లడం మంచిది – అమిత్ షా – కేంద్ర హోమ్ శాఖా మంత్రి కూడా చెప్పారు. కాలేజీకి పోయే పిల్లలు ఆ కాలేజీ పద్ధతులు పాటించాలి కానీ కాదు, కూడదు, మేం  ఇష్టం వచ్చినట్టు ఉంటాం అంటే ఎట్లా కుదురుతుంది. అదేం వాళ్ళిల్లు కాదుగా .. ”  ఆవేశంగా అన్నది గాడిద 

“వాళ్లు హిజాబ్ తో వస్తే తాము కాషాయం ధరించి వస్తామని యువత రోడ్ల మీదకు వచ్చారు” అన్నది కాకి

“కాలేజీ, బడి అందరివి. అక్కడ ఒక మత చిహ్నం వద్దని గగ్గోలు పెట్టే వాళ్ళు మరో మత చిహ్నాలైన బొట్టు , మంగళ సూత్రం వంటివి లేకుండా కాలేజీకి వస్తారా ..?  ” ప్రశ్నించింది మగమేక 

పూర్వం మానవులు సమూహాలుగా నివసించేవారట.  ఆ రోజుల్లో ఓడిన గుంపు  పశు సంపద తో పాటు, వారి మహిళల్ని కూడా ఎత్తుకుపోయి కట్టేసేవారు.  కాళ్ళు ,  నడుము , మెడ మీద కట్లు ఉండేవట. వాటి అవశేషాలు నేటి స్త్రీలు ధరించే అభరణాలట. అది చరిత్ర పరిశోధకులు తేల్చిన విషయం అట” ఎక్కడో విన్న విషయాలు వివరించింది కాకి.  

“అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడేది ఆ విషయం కాదు.  మతానికి సంబంధించిన గుర్తులు అన్ని మతాల వారు వచ్చే కాలేజీలలో ఉండొచ్చా అని” అన్నది ఉడుత. 

” నా ఎరుకలో నేను చూసిన బడులలో ఒక మతానికి చెందినవి ఎక్కువగా చూశాను. ఆ బడి ఆ ఒక్క మతానికి చెందింది కాదు కదా .. ఒక్క మతానికి చెందిన దేవుళ్ళే ఎందుకుండాలి ” తాత చేయి పట్టుకు నడుస్తున్న కుర్రవాడి ప్రశ్నకు చెట్టుకింద చెట్టుమీద ఉండి చర్చ చేసుకుంటున్న జీవాలు నిశ్శబ్దంగా ఆ మాటలు వినవచ్చిన కేసి చూశాయి. 

“అవునవును, నా చిన్నప్పుడు బడిలో దేశ నాయకుల ఫోటోలు మాత్రమే కనిపించేవి రా.. బస్సుల్లో, ఆఫీసుల్లో మూడు ముఖ్యమైన మతాలకు చెందిన ఫోటోలు లేదా గుర్తులు ఉండేవి. ఇప్పుడేంటో ప్రభుత్వ బడుల్లో, ఆఫీసుల్లో , బస్సుల్లో అన్ని చోట్లా ఒక మతానికి చెందినవే..” తలగోక్కుంటూ అన్నాడు తాత 

” ఏ మతానికి చెందిన విద్యా సంస్థల్లో ఆ మత చిహ్నాలు ఉంటే తప్పు లేదేమో.. కానీ ప్రజలందరికీ చెందిన ప్రభుత్వ బడులలో కూడా ఒక మతం ప్రాతినిధ్యం వహించడం సరైంది కాదేమో ..” అన్నాడు ఆ యువకుడు 

 ” ఏమోరా మనవడా.. 

హిజాబ్ వేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది ఆ మత మహిళ.  

మన రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది.  ఇప్పుడు ఆ స్వేచ్ఛను  ప్రశ్నగా మారుస్తున్నారనే నా బాధ.  

సామరస్యంగా ఉన్న ప్రజల మధ్య గుడ్డి ద్వేషాన్ని పెంచుతున్నారనే నా వ్యధ.  

ఈ దేశం ఎటుపోతుందో .. ఏమైపోతుందో రా ”  దిగులుగా తాత

“వీటన్నిటికీ మూల కారణం ఏంటో ప్రశ్నించుకోవాలి తాతా..” ముందుకు సాగిపోయారు తాతా మనవడు   

పోతున్న వాళ్ళని చూస్తూ “హిందూ దేశంలో హిందువుల ఫోటోలు పెట్టుకోవడం తప్పెలా అవుతుంది?  ఆ దేశ మత ఆచారాలు పాటిస్తే తప్పెలా అవుతుంది? ” గాండ్రించింది మొఖం చిట్లించుకున్న గాడిద

“దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులున్న మాట నిజమే. కానీ మిగతా మతాలని గౌరవించే ప్రజాస్వామిక దేశం.  మత స్వతంత్రపు హక్కు ఉన్న దేశం. భారత దేశం భిన్న కులాల మతాల కలయిక . భిన్నత్వంలో ఏకత్వం సాధించడం మన గొప్పతనం   అది మరచిపోయి మత ఆచారాల పేరుతో  కల్లోలాలను, రక్తపాతాలు సృష్టిస్తున్నారు ..

ఏదో సమస్య వచ్చిందనుకుందాం.  అప్పుడేం చేయాలి. సమస్య పరిష్కరించుకోవాలి. కానీ ఆ సమస్యను స్వార్ధానికి వాడుకోవడం, పెంచి పెద్దది చేయడం విద్వేషాలు రగిల్చి ఆ మంటల్లో చలి కాచుకోవడం ..  మతోన్మాదులు, రాజకీయ నాయకులకు అలవాటైపోయింది.” అన్నది లోకమంతా చుట్టేసే కాకి  

“మొన్నా మధ్య ఏదో ఎంట్రన్స్ పరీక్ష జరిగినప్పుడు అమ్మాయిల చెవి కమ్మలు , మెళ్ళో మంగళ సూత్రాలు కూడా తీయించారు. అప్పుడేవి మాట్లాడలేదు. క్రిస్టియన్ స్కూల్ లో అయ్యప్ప మాల వేసుకొస్తే రానివ్వకుండా ఎండలో నిలబెట్టినప్పుడు ఎవ్వరి గొంతు పెగల్లేదు” గొంతు చించుకున్నది గాడిద . 

“అయ్యప్ప మాలతో బడీలోకి రానివ్వలేదని గొడవ చేసిన గొంతులే ఇప్పుడు హిజాబ్ తో ఎందుకొచ్చావని దాడి చేస్తున్నాయ్ ఇదేమి న్యాయమో ..” అన్న కాకి కొద్ది క్షణాలాగి అందరికేసి చూస్తూ “వెనుకుండి దాడి చేయించే , రెచ్చ్చగొట్టే నాయకుల పిల్లలు   మత కలహాలకు దూరంగా విదేశాల్లో అన్ని మతాలవారితో కలసి హాయిగా చదువు కుంటున్నారు.  భద్రంగా ఉన్నారు. 

ఇక్కడ విద్యార్థులు మాత్రం చదువు గాలికొదిలేసి  మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటల మతం ఉచ్చులో పడి మూర్ఖత్వంతో ఊగిపోతున్నారు. సభ్యత, సంస్కారం మరచిపోయి, కనీస మర్యాద విడిచి రాళ్లు కర్రలతో దాడులు చేస్తూ.. కత్తులతో రక్తపాతం సృష్టిస్తూ ఉరికొయ్యకేలాడుతున్నారు ” అన్నది 

“మేలిముసుగైనా , ముసుగైనా , హిజాబ్ అయినా మహిళల హక్కులకు వ్యతిరేకమే .. కానీ వాటి గురించి మాట్లాడరు.  అయితే నాకిప్పుడు అనిపిస్తున్న దేమిటంటే అది నిర్ణయించు కోవాల్సింది , చర్చించుకోవలసింది పోరాడాల్సింది ఆ అమ్మాయిలు” అన్నది ఉడుత 

“హిజాబ్ తీయమని గట్టిగా చెప్పినందువల్లే కదా.. ” గొణిగింది గాడిద 

“విద్యా సంస్థల్లోకి మతం చొచ్చుకొచ్చింది. సరస్వతి నమస్తుభ్యం .. ఆమెన్ .. అల్లా  చదువుల్లో చొరబడ్డాయి.   ఏ మతమైనా ఆ ప్రభావం ఆడవాళ్లపైనే.  ముందుకు పోవాలని ఒక అడుగు వేస్తే నాలుగడుగులు   వెనక్కి లాగుతూ…  

స్త్రీల జీవితాలపై మతం , పురుషాధిపత్యం విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి. కలసికట్టుగా అన్ని మతాలు మహిళల్ని అణిచివేస్తున్నాయి.  ఇంట్లో మగవాళ్ళు హిజాబ్ బురఖా వేసుకోవాలని , బయటి మగవాళ్ళు వేసుకోవద్దని వెంటపడుతుంటే ఆ ఆడకూతురు ఏంచేస్తుంది.. “సానుభూతిగా అన్నది మగమేక. 

“ఎవరి మతాన్ని వారు గౌరవించడంలో తప్పులేదు. ఆచరించడంలో తప్పులేదు. ఎవరి విశ్వాసం వారిది.  

మహిళల రాకపోకల నియంత్రణ , వారు ఎలా ఉండాలో ,ఎం చేయాలో , ఎక్కడికి వెళ్లాలో ఎంత సేపు వెళ్లాలో అంతా నిర్ణయించేది వాళ్లే 

కానీ ఆ మతాల్లో మగవాళ్ల ఆధిపత్యానికి తలొగ్గి , వాళ్ళు రూపొందించిన కట్టుబాట్లు పాటించడం… వారు చెప్పిన దేవుళ్లనే  పూజించడం , ఆచారాలు ఆచరించడం ఎంత మూర్ఖత్వం..  ప్రతి ఆడపిల్ల, ప్రతి మహిళ ఆలోచించాలి. తమకి ఏం కావాలో తెల్సుకోవాలి. తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సమయం ఇది.” ఆవేదనగా అన్నది ఆడమేక

“పితృస్వామ్య పురుషాధిక్య సమాజం 

మత భావనలు వదులుకోలేని మనుషులు ఎంత పతనమై పోతున్నారో గుర్తించడం లేదు. 

మతాచారాలన్నీ మహిళల  పట్ల నీచమైన నిబంధనలు రాసిపెట్టాయి . 

మతాలు గొప్పవైతే వాటి గొప్పతనాన్ని చాటుకోవాలంటే ఆయా మతాల్లో ఉన్న అసమానతలను తొలగించుకోవాలి కానీ శత్రువులుగా మార్చుకుంటూ పోతే మారణహోమమే కదా మిత్రమా..” సాలోచనగా అన్నది కాకి

“అవున్నట్లు తలూపుతూ ఆలోచనలో పడింది గాడిద

“అసలుకే మోసం రాకముందే జనం మేల్కొంటే బాగుండు..” ఉడుత ఆశాభావం

“నిజమే, ఇంట్లోంచి దిద్దుబాటు చర్యలు మొదలవ్వాలి. ఏ మతం వారైనా వారి హక్కుల కోసం కొట్లాడాలి, వారి ఆత్మాభిమానం కోసం పోరాడాలి, కానీ సంప్రదాయం ముసుగులో హీనంగా బతకొద్దుగా.. ” అన్నది ఆడమేక   

“ఆవు చేలో పడితే దూడ గట్టున మేస్తుందా .. “ అన్నది మగమేక 

వి. శాంతి ప్రబోధ 

రాత్రి చలి. పగలు ఎండ భరించలేక చచ్చిపోతున్నా” చెమటలు కక్కుతూ పరిగెత్తుకొచ్చిన గాడిద చెమటలు తుడుచుకుంటూ చికాగ్గా అన్నది. 

దేన్నీ ఓర్చుకోదు. అన్నిటికీ గావు కేకలేస్తుంది. ఎదుటివాళ్ల గురించి కొద్దిగా కూడ ఆలోచించదు. ఎన్ని సార్లు చెప్పు ఇంతే.. ఇది మారదుగాక మారదు. లోలోన  ఆడమేక గొణిగింది. 

“ఏంటీ ఏదో నన్నే తిడుతున్నట్టున్నావు”  మొహం చిట్లించి అడిగింది గాడిద. 

“మరి తిట్టక పూలమాలలతో సత్కరిస్తారా.. కమ్మటి నిద్ర చెడగొట్టావు” భార్యను సమర్ధిస్తూ అన్నది మగమేక.

అవునన్నట్లుగా మూసుకున్న కళ్లు తెరిచి మొఖం చిట్లించి కోపంగా గాడిదకేసి చూసింది ఆడమేక.

”  ఆడపిల్లను 

పుట్టనిద్దాం 

బతకనిద్దాం 

చదవనిద్దాం

ఎదగనిద్దాం 

ఆడపిల్ల దేశానికే గర్వకారణం”

ఏ రేడియో లోనో, టీవీలోనో విన్న మాటలు చిలక వల్లెవేస్తున్నది. 

ఆ చిలకపలుకులు చెవిన పడడంతో “నిజమే, రేపటి మానవ సమాజం అమ్మలే  లేని అనాధ అవుతుందేమో.. ఆడపిల్లల్ని పుట్టనీకుండా  అడ్డుకునే మాటల్ని ఉన్న ఉడుత. 

“ఎంత సిగ్గుమాలిన స్థితిలో ఉన్నారు ఈ మనుషులు.

ఆడ పిల్లను బతకనిద్దాం అని సందేశాలు చెప్పుకుంటున్నారు” ఎగతాళి చేసింది కోతి. 

నిజమే కదా .. ఏ జాతిలో లేదు అని ఆలోచనలో పడింది చిలుక. 

” అదే నాకర్ధం కాక మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చా  మిత్రమా.. 

ఆడపిల్లలకు అంత ప్రత్యేకత ఎందుకట ?  మరి మగపిల్లలని పుట్టనివ్వనవసరం లేదా .. వాళ్ళు  బతికి ఎదగనవసరం లేదా ” కోతిని చూస్తూ గాడిద. 

” ఓ అన్నా .. ఆగాగు .. 

 ముచ్చట విను . ఆడపిల్లలు మగపిల్లల పుట్టుక  సమానంగానే ఉన్నదా? సమానంగానే  తింటున్నారా ? సమానంగానే చదువుతున్నారా ? సమానంగానే  ఆరోగ్యం ఉందా ? సమానంగానే ఎదుగుతున్నారా? సమానంగానే స్వేచ్ఛగా ఉన్నారా? ” అన్నది లోకాన్ని తిరిగి చూస్తున్న కాకి 

” ఆడ మగ సమానం ఎట్లా అవుతారు? ఆడ ఆడే , మగ మగే.” ఖచ్చితంగా గాడిద 

“నిజమే .. కానీ మన జంతు జాలంలో లేని వివక్ష మనుషుల్లో  ఉందిగా .. అందుకే అది పోగొట్టడానికి  ప్రత్యేక దినం” అన్నది కాకి 

“ఆ .. ఏం ప్రత్యేకం లే ..హూ .. అంతా ఆ ఒక్కరోజు హంగామా తప్ప” ముతివిరుస్తూ అన్నది కోతి 

“ఆడపిల్ల పుట్టుకనుంచే ఇంట్లోనే,  తల్లిదండ్రుల దగ్గర నుంచి , కుటుంబం నుంచి సమాజం నుంచి తీవ్ర వివక్ష అది పోవాలిగా .. ఆ ఒక్క రోజైనా ఆడపిల్ల గురించి సానుకూలంగా  మాట్లాడుకుంటారు ..

ఏమోనబ్బా.. ఈ మనుషులేంటో అర్థమై చావరు ఈ మట్టి బుర్రకి

ఆ నోటితోనే బాలికల దినోత్సవం అంటారు. స్వేచ్ఛ సమానత్వ అని రంకెలేస్తారు. 

  మళ్లీ ఆ నోరే ఆడపిల్ల చుట్టూ ఆంక్షల ఆనకట్ట వేస్తారు. ఆ నోరే దడికట్టి కట్టడి చేస్తారు

“మొన్నామధ్య  దేశమంతటా బాలికల దినోత్సవం జరుపుకున్నారు. మరో పక్క పదహారేళ్లయినా లేని ఆదివాసీ పిల్లపై గుడ్డలూడదీసి దాడిచేశారు అటవీ అధికారులు. ఆడపిల్లనేగా .. 

ఒకవేళ ఆమె తప్పు చేస్తే చట్ట బద్ధంగా శిక్ష విధించాలి కానీ ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా..” తాను చూసిన సంఘటన కళ్ళలో మెదులుతుండగా ఆవేశంగా అన్నది ఆడమేక. 

మళ్ళీ తానే “నేలను, రాయిని స్త్రీ తో పోలుస్తారు కానీ ఆ స్వేచ్ఛ ఉందా..?

తనకు నచ్చినట్టు ఉంటే బరితెగింపు. సమాజం చెప్పినట్టు వింటే పద్ధతి గలది అంటారు. ఆమె దేహానికి ఇచ్చే విలువ మనసుకి ఇవ్వరు. 

మతం మాయ చేస్తుంది. కులం వెంటాడుతుంది. మాటలకి చేతులకి పొంతనే ఉండదు” తాను చూసిన లోకపు మానవ విలువల్ని వ్యాఖ్యానించింది ఆడమేక. 

“అందుకే, ఆడదై పుట్టడం కంటే అడవిలో మానై బతకడం మేలు అనుకుంటారు” అన్నది ఉడుత. 

“ప్రజలకి నిత్యం ఉద్బోధ చేసే వాళ్ళ వెనుక స్త్రీలపై, బాలికలపై చేసే అత్యాచారాలు వాళ్ళని సమాన అవకాశాల్ని కూలదోసే కపటపు ఆలోచనలు ప్రతిరోజూ ఈ కళ్ళతోనే చూస్తున్నాం ” ఆవేదనగా అన్నది మగమేక 

“బ్రహ్మ జ్ఞానులు అత్యాచారం చేసినా తప్పు కాదు.  అన్నీ ఆ పెద్ద పుస్తకంలో ఉన్నాయిగా” అన్నది గాడిద 

“బాలికలపై, స్త్రీలపై రుబాబు చేసే ఎదవలని తన్నమని చెప్పరు. పిరికి మందుపోసి ఇంట్లో కూచోబడతారు.  ఆడ పుట్టుక  పుట్టిందే మగవారికోసం అంటారు. మగవారికి అణిగిమణిగి ఉండాలని పుట్టినప్పటి నుండి నూరిపోస్తారు.  మాపిల్లవాడికేమో నీకేంట్రా మగపిల్లాడివి అంటూ కొమ్ములిస్తారు. అచ్చోసిన ఆంబొతులాగా తిరిగిరావచ్చు అంటారు” అన్నది లోకం ఎరిగిన కాకి  

“ప్రతి ఆడపిల్లకి ఆమె ఎవరో. ఆమెకు ఏం కావాలో తెలియాలి. 

ధైర్యం, త్యాగం, నిబద్దత, పట్టుదల, చొరవ,మనసు, రాటుదేలిన తనం, నైపుణ్యం ఇవ్వాలి. సవాళ్ళను ఎదుర్కోగల శక్తిని నింపాలి. అది చేయాలంటే ముందు పెద్దలకి అంటే కుటుంబంలోనూ, సమాజంలో- మతపెద్దల్లోనూ, కుల పెద్దలలోను 

 ఆడపిల్ల పట్లఉన్న వివక్షని బూజు దులిపి కడిగేయాలి. అందుకు కృషి చేయాలి.  పైపై మాటలతో ఏం లాభం ?

మేకప్ వేసుకుంటే ఎంత సేపుంటుంది.. ? ” అంటూ దీర్ఘమైన నిట్టూర్పు విడిచింది ఆడమేక. 

నిజమేనన్నట్లు తలూపుతూ ఆలోచనలో పడింది గాడిద 

వి. శాంతి ప్రబోధ 

Feb 2022

పైన ఆకాశమంతా మేఘావృతమై ఉంది.  ఎప్పుడైనా వర్షం కుమ్మరించేట్లుగా ఉంది. కానీ ఆ చెట్టు కింద వాతావరణం మాత్రం చాలా వేడిగా ఉంది.  వాడి వేడి చర్చ జరుగుతోంది. 

ఆ సమయానికి చెట్టు కింద చేరి హాయిగా నిద్రపోయే మేకల జంట నిద్రాభంగమైందని కాసేపు విసుక్కున్నప్పటికీ తర్వాత ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టింది.  ఆ చర్చల సారాన్ని ఇంకించుకోవడానికి యత్నిస్తున్నది. 

మీరెన్నైనా చెప్పండి అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లిచేసి పంపడమే మంచిది. తన వాదన నెగ్గించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న గాడిద. 

బాల్యవివాహాలను నిరోధించాలని సదుద్దేశంతో ఆడపిల్ల పెళ్లి వయసు పెంచితే జరిగే మంచి ఆలోచించకుండా ఎడ్డెమంటే తెడ్డెం, తెడ్డెమంటె ఎడ్డెం అనడం నీకెప్పుడు అలవాటేగా అని గొంతు చించుకున్న గోవు. 

“అదేదో తన అభిప్రాయం చెబితే నువ్వెందుకు అంత ఆవేశపడతావ్.. కూల్ కూల్ .. “ అంటూ సమాధానపరచాలని చిలుక యత్నిస్తున్నది. 

“యునెస్కో లెక్కల ప్రకారం బాల్య వివాహ బాధితుల్లో మూడింట ఒక వంతు మంది మన దేశంలోనే ఉన్నారట. అది మానవ హక్కుల ఉల్లంఘన అట.” తాను ఎప్పుడో ఎక్కడో విన్న విషయం గుర్తొచ్చి చెప్పింది కాకి. 

“మరందుకేగా .. ఈ కొత్త చట్టం తేవాలని చూసేది ” కాకి కేసి కృతజ్ఞతగా చూస్తూ అన్నది ఆవు. 

ఆడపిల్లంటే అప్పుగానో, బరువుగానో చూడటం చూస్తూనే ఉన్నాగా. ఇక వాళ్ళ భద్రత గురించిన భయాలు తల్లిదండ్రులకు ఉండడం సహజమే మనసులోనే అనుకుంది మగమేక.  

పెడదోవ పట్టిన ఆడపిల్లల గురించి ప్రతి రోజూ ఎన్ని వింటున్నాం. మరిన్ని చూస్తున్నాం.. అయినా ఇట్లా మాట్లాడతారేంటి? బుద్ధిలేకుండా ..  పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే ఆ తల్లిదండ్రుల గుండెలపై భారం దిగుతుంది.  ఆ పిల్ల పెళ్లి గురించే కాదు, ఎప్పుడు ఎక్కడ ఆ పిల్ల శీలానికి ప్రమాదం ముంచుకొస్తుందో… 

రేపు పెళ్లి ఎలా చేయగలమో.. అసలే కట్నాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి అని భయపడుతున్న ఆ కన్నవాళ్ళ బాధ మీకు కనపడలేదా .. విరుచుకుపడింది గాడిద. 

“నిజమే.. అసలే లోకంలో ధర్మం తప్పి నడుస్తున్నది.  ధర్మం తప్పిన పెళ్లిళ్లు ఎక్కువైపోతున్నాయి.  అవి హత్యలకు దారితీస్తున్నాయి” బాధగా మొహం పెట్టి అన్నది చెంగు చెంగున చెట్టుపై నుండి దూకుతూ అన్నది కోతి.  

ఆ గొంతులో  వ్యంగ్యమో, వెటకారమో ధ్వనించి చురుగ్గా చూసింది ఆవు. 

‘అంతేనా.. ఒక మతం అమ్మాయిలను ప్రేమ ముగ్గులోకి దింపి పెళ్లి చేసుకుని మరో మతంలోకి మార్చేస్తున్నారు.  జరుగుతున్నది చూస్తుంటే ఒళ్ళు మండిపోతున్నది.  అందుకే..” పళ్ళు కొరికింది  ఆవు.  

“అయితే ఇక 18-21 ఏళ్ల  మధ్య కులాంతర, మతాంతర ప్రేమ పెళ్ళిళ్ళు ఉండవన్నమాట ” దూరంగా డాన్స్ చేస్తూన్న నాట్యమయూరాన్ని చూస్తూ  పలికింది చిలుక 

“ఇప్పటికే చుట్టాలు, ఇరుగుపొరుగు ఇంకెప్పుడు పెళ్లి.. ఎప్పుడు పప్పన్నం పెడతావ్ అని.., ఇంకెన్నాళ్లు ఆడపిల్లను ఉంచుకుంటావ్ అని ఆ తల్లి దండ్రుల్ని పీక్కుతింటుంటేనూ… 

అయినా వీళ్ళకి వోటెయ్యడానికి 18 చాలు. పెళ్ళికి మాత్రం 21 కావాలా.. ?

నా పెళ్లి నా యిష్టం. నువ్వెవరు నా కొంప లోకి దూరి నా పై పెత్తనం చేయడానికి? అనరేంటి .. నేనయితేనా…” కోపగించుకుంది కోతి. 

“నువ్వు చెప్పింది అక్షరాలా నిజం కోతి  బావా.. నువ్వయితే లంకాదహనం చేసినట్లుండేదేమో .. ” నవ్వింది కాకి  

“సినిమాలే అనుకుంటే చేతిలో సెల్ ఫోన్ లు వచ్చాక ఈ ఆడపిల్లలు  ఆగుతున్నారా.. అబ్బో.. చెప్పనలవి కానంత విచ్చలవిడిగా తయారయ్యారు. 

ఇక ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయకపోతే ఆ వయసు చేసే ఆగడాలను ఆపగలిగే శక్తి ఎవరికుంటుంది?” వత్తాసు పలికింది పక్కన ఉన్న మరో గాడిద 

“ఎంత సేపూ ఆడపిల్లలని ఆడిపోసుకోవడమేనా.. ఆ మగ సచ్చినాళ్ళ బుద్ది ఎక్కడేడ్చింది? మరి వాళ్లకు చేయరా పెళ్లిళ్లు?”  కయ్ మన్నది పై నుండి చిలక 

” ఆ వాళ్ళకేంటి మగమహారాజులు .. వాళ్లతో పోలికేంటి విడ్డురంగా.. ” అన్నది మొదటి గాడిద. 

నిజమే కదా.. గల్లీ నుంచి ఢిల్లీ దాక నాయకుల్ని ఎంపిక చేసే హక్కు ఉన్న ఆమెకు తనతో కలసి జీవితం పంచుకునే తోడుని ఎందుకు ఎన్నుకోనివ్వరు? అని ప్రశ్న మొదలైంది ఆడ మేకలో 

“తమకన్నా చిన్న వయసు వాళ్ళని చేసుకుంటే మగవారికి సుఖం, శాంతి . చెప్పిన మాట వింటుంది . భయం , భక్తి తో మెలుగుతుంది. “అంటూ ఇంకా ఏదో అన్నది రెండో గాడిద. 

“పూర్ణమ్మ కథని మర్చిపోయినట్లున్నారు” అంటున్న చిలక మాటలు అకస్మాత్తుగా మొదలైన వర్షపు చినుకుల చప్పుడులో కలిసిపోయాయి.

అంతలో ఇద్దరు యువతులు  ఆ చెట్టు కింద చేరారు. పట్నంలో కాలేజీకి సైకిల్ పై వెళ్లి వస్తుంటారు ప్రతి రోజు. 

మీద పడ్డ చినుకులు చున్నీతో తుడుచుకుంటూ “ఇక చదివింది చాల్లే  ఈ ఏడు పెళ్లి చేయాల్సిందేనని మా అమ్మ వాళ్ళు పట్టుబడుతున్నారే.. 

ఏం చేయాలో తోచడం లేదు” అన్నది సన్నగా చిన్నగా గాలొస్తే ఎగిరిపోయేటట్టున్న అమ్మాయి. 

“పెళ్ళిపోరు లేని ఆడపిల్లలెవరుంటారే..?”అని నవ్వేసింది పక్కనున్న కోలమొహం పిల్ల. 

“అట్లానవ్వకు.. నాబాధ చెప్తే నీకు నవ్వులాటగా ఉందా.. ఏదైనా సలహా ఇస్తావని నేనకుంటే.. చిర్రుమన్నది బక్కపిల్ల. 

“పెళ్లి వయసు మగపిల్లలతో సమానంగా 21 ఏళ్ళకి పెంచుతూ చట్టం చేస్తున్నారట. కేబినెట్ నిర్ణయం అయిందట మొన్న వార్తల్లో విన్నాను” అన్నది రెండో పిల్ల. 

“ఓహ్ ఎంత మంచి మాట చెప్పావ్.. అయితే పెళ్లి ఆపడానికి ఓ మార్గం దొరికినట్టే. మనం ఎంచక్కా చదువుకోవచ్చు.” కళ్ళు మెరుస్తుండగా అన్నది సన్నటి పిల్ల 

ఒక క్షణం ఆగి “నాకు అర్ధం కాక అడుగుతున్నాను. 18 ఏళ్ళు దాటితే ఆడ , మగ ఇద్దరూ పెద్దవాళ్లకింద లెక్క . 

ఆడ మగ సమానం అని చెప్పే చట్టం పెళ్లి వయసు ఇద్దరికీ వేరు వేరుగా ఎందుకు పెట్టిందా అని నాకెప్పుడూ సందేహమే” అన్నది సన్నటి పిల్ల 

“అవును , నిజమేనే.., ఆ దిశగా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఇద్దరికీ 21. సమానం .. సమానం ” నవ్వేసింది రెండో పిల్ల 

“ఆడామగా సమానం అని మన రాజ్యాంగం చెబుతుంది. కానీ సమానంగా ఉన్నామా? మనని సమానంగా ఎక్కడ చూస్తున్నారు చెప్పు?  నాకంటే నాలుగేళ్లు వెనుక పుట్టిన తమ్ముడికి ఉన్న స్వేచ్ఛ నాకుందా.. ప్రతి విషయానికి ఎంత యుద్ధం చేయాల్సి వస్తున్నది?.  చట్టం తెచ్చినంత మాత్రాన మనకి సులువు అయిపోతుందా.. ఊహూ .. లేదు. ” రేపు చేయాల్సిన యుద్దాన్ని తల్చుకుంటూ అన్నది బక్కపిల్ల 

నాలుగు చినుకులు కుమ్మరించి హడావిడి చేసిన నల్లని మేఘం ఎటో వెళ్లిపోవడంతో ఆ అమ్మాయి లిద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు సాగి పోయారు. 

ఆ ఇద్దరి మనస్సులో ఆటంకం లేకుండా చదువుకోగలమా.. కలలు నెరవేర్చుకోగలమా.. అనేకానేక సందేహాలు, ప్రశ్నలు సుడులు తిరుగుతుండగా .. 

వారి మాటలు విన్న ఆవు “బాల్య వివాహాలు నిరోధించడానికి, చిన్న వయసు గర్భాన్ని నిరోధించడానికి, యువతుల మానసిక , శారీరక ఆరోగ్యం సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అయినా ఆడపిల్ల , మగపిల్లవాడు అనే తేడాలు ఇక ఏముంటాయి. అంతా సమానమే ” గాడిదకేసి కళ్ళెగరేసి చూస్తూ అన్నది ఆవు .  

” చాలు చాల్లే .. మా చెప్పొచ్చావ్ .. 

ఏ గల్లీ లో చూసినా , ఢిల్లీలో చూసినా మాటలు చెప్పినంత సులభం కాదు ఆ తేడా పోవడానికి. 

చదువు సంధ్య లేని బస్తీల్లో జనం కంటే చదువు, డబ్బు ఎక్కువైన వాళ్లలోనే ఆ తేడాలు మరీ ఎక్కువ.  అదిగో ఆ హాస్పిటల్ డాక్టరు తన పెళ్ళానికి ఇప్పటికే మూడు సార్లు అబార్షన్ చేయించాడు. ముందు ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇప్పుడు మళ్ళీ తొమ్మిదో నెల కడుపు. ఈ సారి మగపిల్లాడేనటలే..” అన్నది కాకి 

“కుడి ఎడమ అవుతుందా.. ఎడమ కుడి అవుతుందా .. ఇది అంతే ఆడ మగ సమానం ఎప్పటికీ కాదు. కాలేరు” అన్నది మొదటి గాడిద 

“నోటిమాటేగా అంటే పోయిందని అంటారు కానీ, చేతల్లో ఒప్పుకుంటారా.. ఒకమ్మాయి అబ్బాయి పార్కులో కూర్చుంటేనే ప్రేమికులని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు కానీ.. ” సణిగింది కోతి. 

అందరి మాటలు మౌనంగా వింటున్న మేకల జంట నోరు విప్పింది. 

“ఏ మతంలో చూసినా , ఏ కులంలో చూసినా అమ్మాయి పెద్దమనిషి అయితే చాలు ఇక ఆ పిల్ల పెళ్లి గురించి ఆలోచన మొదలవుతుంది. 

ఆమె పెళ్లి ఆమె ఇష్టం కావాలి. నిర్ణయం ఆమెది కావాలి.    మధ్యలో కుటుంబం, బంధువులు, కులం,మతం, రాజ్యం ఎందుకు పెత్తనం చేయాలి. 

పెళ్లి వయసు పెరగడం మంచిదే కాదనలేం. కానీ దానివల్ల ఆడపిల్లకు కావలసినవన్నీ మగపిల్లవాడితో సమానంగా అందుతాయా..? ఇన్నాళ్లు లేనిది చట్టం వల్ల జరిగిపోతుందా..?

మరయితే, ఆడపిల్లల సంక్షేమం కోసం ఇప్పటికే చాలా చట్టాలున్నాయి. పెళ్లి విషయంలో చట్టాలున్నాయి. బాల్య వివాహ చట్టం 1929 ఉంది. ఆ తర్వాత 1978లో సవరణ చేసారు .  2006లో బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చింది . బాల్య వివాహం నేరం అన్నారు. 

అయినా పెళ్లి వయసు రాకుండా పెళ్లిళ్లు జరుగడంలా..? 

అసలు తల్లి గర్భంలోంచి వెలుగులోకి రాకుండానే చిదిమేయడంలా..?

ఆహరం , ఆరోగ్యం, విద్య , వైద్యం, ఉద్యోగం అన్నిట్లో ఆమె వెనుకబాటు స్పష్టంగా కనిపిస్తున్నదే.  

ఆడపిల్లకు ఇంట బయట రక్షణ ఉందా?  ఇక చట్టం ప్రయోజనాన్ని ఏమాశించగలం.. ?!” అన్నది మగమేక 

“ఊ.. ఎన్ని చట్టాలుండి ఏం లాభం? జరగాల్సిన అనర్ధాలన్నీ జరిగిపోతూనే ఉన్నాయి.  ఆడపిల్లల తెలివితేటలన్నీ, వాళ్ళ శక్తి సామర్ధ్యాలన్నీ తనకు, తన కుటుంబానికి, ప్రపంచానికి అందకుండా పోతున్నాయి.  

ప్చ్ .. రోగం ఒకచోట అయితే మందు మరో చోట… 

అసలు రోగానికి మూలం ఎక్కడో చూడకుండా, కారణం వెతక్కుండా, మూల చికిత్స జరక్కుండా పైపై పూతలు .. ప్చ్..  ఎన్ని పూసినా  ఏం లాభం?” దీర్ఘంగా నిట్టూర్చింది ఆడమేక 

వి. శాంతి ప్రబోధ 

Published in Vihanga January 2022

రోజూలాగే ఆ మధ్యాహ్నం చెట్టు కింద సేద తీరుతున్నాయి మేకల జంట. 

చెట్టు మీద ఏవేవో పక్షులు చేరి కబుర్లాడుతున్నాయి. 

అంతలో చెట్టు కింద చేరిన వాళ్ళు రెండు గుంపులుగా చీలిపోయి గల్లా పట్టుకుని కొట్లాడుకుంటున్నారు.  

ఏదో విషయంలో ఇద్దరు మగాళ్ల మధ్య వచ్చిన కొట్లాట చివరికి వాళ్ళింట్లో అమ్మని , అక్కని , ఆలిని తిట్టిన స్థితికి చేరింది. 

“ఛి ..ఛీ ..  ఈ మనుషులకెంత కండకావరం?! వాళ్ళ కొట్లాటలోకి ఇంటి ఆడాళ్ళని వాళ్ళని లాగుతారేంటో .. ” గొణిగింది చిలుక 

ఆ మాటలు విన్న కాకి ” నిజమేనోయ్.. వాళ్ళింతే.  ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ఏం చేశారు? వాళ్ళని రోడ్డు మీద పడేసి బూతులు తిడుతున్నారు ..

అస్సలు  సిగ్గు ఎగ్గూ ఉండదు.  

ఆ మామూలు మనుషుల్ని అనుకుని ఏం లాభంలే ..

పెద్ద పెద్ద తలకాయలే ఆ పనిచేస్తుంటే… ప్రజలకి మంచి చెడ్డ చెప్పాల్సిన వాళ్లే నోటి దూలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే .. 

ఓ పక్క వానలు , వరదలతో జనం ప్రాణాలు అరచేత పట్టుకుని ఉంటె వాళ్ళనట్లా గాలికొదిలేసి వీళ్ళు మాటల ఈటెలు విసురుకుంటున్నారు.  

థు థూ .. వాళ్ళ బతుకు చెడ…  ” కొట్లాడుకుంటున్న మనుషుల కేసి అసహ్యంగా చూస్తూ అన్నది చెట్టుపై ఉన్న కాకి.  

ఆ చెట్టుకింద తతంగమంతా చూస్తున్న చిలుక కాకి మాటలు విని ఆలోచనలో పడింది 

” ఏమోయ్.. కాకి బావా అంత బాధ పడిపోతున్నావ్ .. 

 ఆనాడు అవతలి వాళ్ళు గులాబీని,  చామంతిని నానా మాటలు అనలేదూ ..ఆనాడు  మీ నోళ్లు నోరు పెగల్లేదే .. 

ఆ పార్టీ వాళ్ళకి ఒక రూలు . ఈ పార్టీ వాళ్ళకి ఒక రూలా ..?” అరిచింది గాడిద . 

“ఇవతలి వాళ్ళైనా , అవతలి వాళ్ళైనా ఎవరు మాట్లాడినా తప్పే కదా .. తమ గొడవతో సంబంధం లేని ఆడ మనుషుల్ని ఈ గోదాలోకి ఈడవడానికి ..” సణిగింది చిలుక 

కళ్ళు మూసుకున్న మేకల జంట ఆ గొడవకి మెలకువ వచ్చింది. విషయం ఏంటో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాయి. 

చెట్టుమీద ఉన్న చిలుక విషయం చెప్పింది.  

“రాజకీయ ప్రత్యర్థులైన రెండు గుంపుల వాళ్ళకు పనీపాటా లేదు మన విశ్రాంతి సమయాన్ని మింగేశారు ” అన్నది కాకమ్మ 

నిజమే, రాజకీయ రణ కేంద్రంలోకి ఆ విషయాలతో సంబంధం లేని ఆడవాళ్ళని లాగడం జుగుప్సగా  అనిపించింది  ఆడమేక కు .  

ఎవరినైనా తక్కువ చేయాలన్నా , ఏడిపించాలన్నా వారి ఇళ్లలోని ఆడవాళ్లను తిట్టడమే లక్ష్యమా ..?

ఒకప్పుడు మగవాడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి అతడి ఆస్తిని ధ్వంసం చేసేవారు . ఎప్పుడైతే స్త్రీ ఆస్తిగా మారిందో అప్పటినుండి  తిట్ల సంస్కృతిలో ఆమెను జోడించి  తిట్టడం మొదలయింది 

మగాడిపై ప్రతీకారం తీర్చుకోవాలంటే అవతలి వారి ఇంట్లో మహిళల్ని తిడతారు . అమ్మ , ఆలి , అక్కా తిట్టాల్సిందేనా ..

  ఆ స్త్రీల పై అత్యాచారం చేస్తామని తీరులో తిట్లు  .. వాళ్ళ జననాంగాలను కించపరచటం..  మాటలతో అత్యాచారం చేసేస్తూ ఉంటారు 

దాంతో ఎదుటి వారికి ఘోర అవమానం జరిగిందని భావిస్తారు .  అట్లా తమ అహాన్ని చల్లార్చుకుని సంతృప్తి పడతారు . 

 ఎప్పుడూ అటూ ఇటూ… ఇటూ అటూ…చేతిలో వస్తువులు విసిరినట్లు. వాళ్లపై మాటల రాళ్లు విసిరేస్తున్నారు అని మనసులోనే అనుకుంది ఆడమేక. 

ఇరుపక్షాల మధ్య మాటా మాటా ఇంకా పెరిగి పెద్ద గొడవ గా మారింది.  వాళ్ళ నోళ్ళలోంచి పచ్చి బూతు మాటలు మొదలయ్యాయి.. 

అవి వాళ్ళ తాలూకు ఆడవాళ్ళని చొప్పించి .. లం.. కొడకా ,  ముం .. కొడకా, దొంగ లం. కొడకా … , సువ్వర్ కె బచ్చే ..  

గొడవ జరిగింది మగవాళ్ళ మధ్య అయినా తిట్లు మాత్రం లక్ష్యంగా అలవోకగా సాగిపోతున్నాయి . అది చాలా సహజంగా కనిపిస్తున్నది. తప్పుగా అనిపించడంలేదు  చుట్టూ ఉన్న వాళ్ళకి. చోద్యం చూస్తున్నారు . 

“ఆడవాళ్లను తిట్టడాన్ని ఎదుటివారిపై చేసే దాడిగా భావిస్తున్నారు ..  తన అధికార దర్పాన్నో ,  గొప్పదనాన్నో చూపిస్తున్నాననుకుంటాడు . ఎదుటివారిని అణిచివేస్తున్నాని అనుకుంటాడు .. కానీ చేతకాని వెధవలు …” చిలుక చిర్రెత్తి పోతున్నది 

అంతలో పోలీసులు వచ్చారు . అందర్నీ చెదరగొట్టారు. 

మేమేం తక్కువా అనుకున్నారేమో.. వాళ్ళ నోళ్ళ లోంచి అదే బూతు పురాణం..

ఆడవాళ్ళంటే అంత చులకన ఏంటి? 

వాళ్ళ కోపం, విసుగు చూపించడానికి తిట్టుకున్నారు. కానీ అందులోకి  ఆడవాళ్లను ఈడ్చడం ఎందుకో .. అనుకుంది ఆడమేక. 

మగమేక ఇంకా కళ్ళు మూసుకునే వున్నది.  తనకేమి సంబంధం లేనట్లు ఉన్న మొగుడిని చూస్తుంటే ఆడమేకకి నచ్చడం లేదు.  తట్టి లేపింది. 

“మిత్రులారా.. ఎక్కడికి పో .. ఇదే తంతు. వినలేక చస్తున్నాను. ఆ అసహ్యకరమైన తిట్లు .. వాటన్నిటిలో మహిళల శరీరాలను, వాళ్ళ సంబంధాలను ఉద్దేశించినవే ..  వాటిలో హింస ఉంది . లైంగికార్ధాలు ఉన్నాయి”  బాధపడింది కాకి  

“నిజమే, ఆ తిట్లు మహిళలను పురుషుల కంటే కింది స్థానంలో ఉంచుతాయి.  

స్త్రీలంటే ఆయా కుటుంబ యజమానుల తాలూకు ఆస్తులేనన్న భావనకు అభ్యుదయ వాదులమని చెప్పుకునే కొందరు మనుషుల్లో సైతం అప్రకటితమైన ఆమోదం ఉంది .దానికి అపీలింగ్ గా ఉండే ఏ సంఘటన జరిగినా చటుక్కున కనెక్టయిపోతున్నాం .

మనకు ప్రతీకార రాజకీయాలు తప్ప ప్రత్యామ్నాయ రాజకీయాలు లేనప్పుడు ఇలాగే ఉంటుంది” అన్నది మగమేక  .

“మహిళకు ఉన్న శక్తిని గురించి మాట్లాడరు .. కానీ తక్కువ చేసి మాట్లాడతారు . తక్కువగా చూస్తారు . 

స్త్రీలకు సంబంధించిన ప్రతి అంశంలో తలదూర్చి కట్టు , బొట్టు , మాట , నడత ఆలోచన, ఆచరణ అన్నిటిని నియంత్రించే అధికారం తమదే అనుకుంటారు . 

వీళ్ళ భాషలో చూశారా .. మహిళల్ని అవమాన పరిచే పదాలు, వ్యక్తీకరణలు ఎన్నో .” ఆడమేక వాపోయింది .  

“తిట్లన్నీ ఆడవాళ్లను కేంద్రంగా చేసుకున్నవే కనిపిస్తాయి . మగవాళ్ళను ఉద్దేశించినవి కనపడవు 

ఆడవాళ్లనే కాదు సమాజంలో చివరి అంచుల్లో ఉన్న వారి కులాల పేరుతోనో , కుటుంబాల పేరుతోనో  అట్లాగే తిడతారు” అన్నది కాకి 

“ఆనాడు మహా భారత యుద్ధం ఊరికే వచ్చిందా .. ద్రౌపది నవ్వు వల్ల కాదూ .. “అన్నది గాడిద . 

”  కుండక..  గోళక అని తిట్టుకున్నారట కౌరవులు , పాండవులు.  దాని పర్యవసానమే కురుక్షేత్ర సంగ్రామం..

 తన చిరకాల శత్రువు  అయిన భీముడ్ని ఏడిపిస్తూ  హేళనగా గోళక (అనేకులతో వ్యభిచరించే అలవాటు గల స్త్రీకి పుట్టినవాడని) అని ధుర్యోధనుడు సంబోధించడం  

 ధుర్యోధనుడ్ని ఉద్దేశించి అతడ్ని హేళన చేస్తున్నట్టుగా భీముడు కుండక (కుండక అంటే మగడు చనిపోయిన స్త్రీకి – విధవ స్త్రీకి – పుట్టినవాడని అర్ధం)  అనడంతో ధుర్యోధనుడు తీగ లాగడం..  పర్యవసానంగా అనేకానేక మలుపులు తిరిగి కురుక్షేత్ర సంగ్రామం వరకు వచ్చిందన్నది  ఓ కథ.” ఎక్కడో విన్న పలుకుల్ని అప్పజెప్పింది చిలుక . 

“ఓహో.. అయితే ఈనాటి విషయం కాదన్నమాట.  పురాణ సంస్కృతి నుంచి వచ్చిందే నన్నమాట కాలం మారినా అంతా సేమ్ టు సేమ్ , అప్పటి నుండి ఇప్పటికీ భద్రంగా ఉన్నది ” అన్నది మగమేక  

“నేనేం గాజులేసుకు కూర్చోలేదు ” అంటూ రెచ్చిపయాడు గుంపులో ఓ వ్యక్తి   

“హూ .. ఎంత చులకన ఆడవాళ్లంటే .. మహిళ పురుషుడి ఆస్తిగా మారిపోయింది ” అన్నది ఆడమేక. 

“సంప్రదాయం , విలువలు అంటూ గొప్పగా చెబుతుంటారు గానీ వాళ్ళు నోరు తెరిస్తే ఆడవాళ్ళని కించపరిచే బూతులే ..” విసుక్కుంది చిలుక  

“ఇప్పుడు కాలం మారింది. చదువుకున్న వాళ్ళు అంత తిట్టుకోవట;లేదులే .. సమాజం కళ్లద్దాలు మారాయి” అన్నది గాడిద. 

“నీ మొహం . ఏం  మారింది, ఏం మారలేదు. కళ్ళెదురుగా కనిపిస్తుంటే కూడా ఇంకా సమర్ధిస్తావే .. 

ఆ బూతు మాటలు , జుగుప్సాకరంగా తిట్టే వారు వారి మనస్తత్వానికి గుర్తు. 

అలాంటి పెద్దలు ఉండడం వల్లే నిర్భయ , దిశ ఆయేషా .. లాంటి సంఘటనలు జరుగుతూనే ఉండడానికి కారణం.  

మళ్ళి వాళ్లే చెడిన ఆడదిగా ముద్రవేసి ఆమె బతుకును బలితీసుకుంటారు 

ఎంత దుర్మార్గమో.. 

ఓ కోణంలో  రేప్ లాగే పురుషాధిపత్య సంస్కృతికి వికృత వ్యక్తీకరణ” ఆవేశంగా అన్నది ఆడమేక . 

“నిజమే..మగవాడిని చెడిన పురుషుడు అనరు” అన్నది కాకి . 

 ” స్త్రీల ను Property with Purity గా పరిగణించే మగాళ్లు తమ ప్రత్యర్థులైన మగాళ్ల అహాన్ని దెబ్బ తీసేందుకు వారి తాలూకు స్త్రీల వ్యక్తిత్వం పై మాటలతో తొలి దాడికి దిగుతారు.

ఒక్క మగాడైనా ఇంట్లో గానీ బైట గానీ తన పెళ్లాన్ని కానీ బయటోడి పెళ్లాన్ని కానీ తిట్టకుండా ముద్ద నోట్లో పెడతాడా?” అన్నది ఆడమేక   

భార్య  లోకాన్ని చూసి చేస్తున్న విశ్లేషణకి , అవగాహనకి ఆశ్చర్యపోయి చూస్తున్నది మగమేక.

ము … కొడుకు బూతు పురాణం ..విన్న కాకి “ముండ అనే తిట్టు శివుడిని కించపరచడానికి వచ్చిందట . శివుడి భార్య చాముండేశ్వరి (పార్వతికి ఇంకో పేరు ) లోని చాముండ లోంచి ముండ పుట్టిందట ” అన్నది. 

“విన్నారా .. కాకి బావ మాటలు విన్నారా.. పురాణ కాలం నుంచి ఉన్న సంస్కృతి ఇది.  గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరిచ్చినట్టు మీరు అక్కడ మహిళలను ప్రస్తావించడం అప్రజాస్వామికం , అసందర్భం అంటూ ఏడిస్తే ఏమి లాభం ?” ఎద్దేవా చేస్తున్నట్లుగా గాడిద 

“శాసన సభల్లో విలువలు ఏనాడో నశించిపోయాయి.  ఆరవనాట జయలలితను పైట పట్టుకుని లాగినప్పుడే దుశ్శాసన సభ అయింది.” అన్నది మగమేక 

“ఇట్లాటి లేకినాయాల్లకి ఎవ్వరు ఓట్లేయకూడదు. క్రిమినల్ కేసు పెట్టాలి. అందుకు తగిన విధంగా చట్టంలో మార్పులు తేవాలి ” ఆవేశపడింది ఆడమేక 

” నువ్వు మార్పు తేవాలంటే గుర్తొచ్చింది. 

తిట్లు తిట్టే సంస్కృతిలో, ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని  నేహా , తమన్నా అనే ఇద్దరు యువతులు పని ప్రారంభించారట 

సంకుచితమైన పదాల వాడుక పోయి ముందుకెళ్లే పదాలు రావాలని వాళ్ళ ఉద్దేశమట ” ఎప్పుడో ఎక్కడో విన్న వెయ్యి ఊళ్ళ పూజారి కాకి అన్నది 

“నిజమే, నువ్వన్నట్లు ఇటువంటి తిట్లు ,వ్యాఖ్యలు చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి” ఆడమేకకు వంత పాడింది చిలుక.  

“నీది మరీ చోద్యం కాకపోతేనూ ..  కేసులు పెడతారా .. ” ముక్కుమీద వేలేసుకుంది గాడిద 

“చాలు చాలు నీ తాలు మాటలు” గాడిదను ఉద్దేశించి అన్నది చిలుక 

” రాజ్యాంగ బద్దంగా కొలువైన చట్టసభల్లో స్త్రీల శీలాల గురించి మాటలు అత్యంత హేయం.ప్రజల సంక్షేమం కోసం చట్టాలు చేయాల్సిన సభలు స్త్రీలను అవమానించడానికి వేదికలుగా మారడం దారుణం.ఒకరిమీద ఒకరు బురద జల్లుకోడానికి స్త్రీల క్యారెక్టర్లే దొరికాయా..

అక్కడ స్త్రీ అయిన కారణంగా మాటలు పడింది  రోజా, షర్మిల, భువనేశ్వరి  ఎవరైనా సరే ఆ దౌర్భాగ్య స్థితిని, హేయమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాల్సిందే.   

ఇప్పటికి స్త్రీల పరిస్థితి అంతగా మారలేదు. కానీ ఆమెకు కొంతైనా అవగాహన వచ్చింది . చైతన్యం పెరిగింది . ధైర్యం వచ్చింది.  

ఇవ్వాళ కాకపోతే రేపైనా ఆమె ఊరుకోదు.  

మహిళల క్యారెక్టర్ మీద నోరు పారేసుకుంటూ.. వాళ్ళ ‘మోడెస్టీ ‘ని దెబ్బతీసే, రాజకీయనాయకులనందర్నీ …ముందెన్నడూ రాజకీయాల్లోకి రాకుండా చేసే చట్టాలను తీసుకొస్తుంది .. చెత్తను ఏరేస్తుంది” అన్నది ఆడమేక. 

ఆ మాటల్లో భవిష్యత్ పట్ల గొప్ప ఆశ.  

వి. శాంతి ప్రబోధ

Published in Vihanga December 2021