The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘నిఖత్ జరీన్.’

పొట్టి గుడ్డల పిల్ల

ఎప్పటిలానే ఆ మధ్యాహ్నం వేళ చెట్టు కింద చెట్టు మీద జంతువులు, పక్షులు సేద తీరుతున్నాయి. 

దూర ప్రాంత బాటసారి చెట్టునీడన చేరి సెల్ ఫోన్ లో వార్తలు వింటున్నాడు. 

ఆ పక్కనే కునుకు తీస్తున్న మేకల జంట చెవిన  కూడా పడ్డాయి. నిద్ర ఎగిరిపోయింది.  ఆశ్చర్యంతో చెవులు రిక్కించి వినడం మొదలు పెట్టాయి. 

అంతలో ఇది విన్నారా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ, ఆయాసపడుతూ పరుగు పరుగున వచ్చింది గాడిద. 

“సిగ్గులేకపోతే సరి ఆ పొట్టి పొట్టి గుడ్డలేంటి? ఆ ఆట లేంటి? అని ఆడపిల్లలని ఆడిపోసుకుంటావుగా.. విను, బాగా విను. పొట్టి గుడ్డలేసుకున్న పిల్ల ఏం సాధించిందో.. ”   ఎద్దేవా చేసింది ఆడమేక. 

” పొట్టి దుస్తులతో ఆడిన ఆ పిల్ల ఇప్పుడు  ప్రపంచ ఛాంపియన్.  నీలాగా ఎంతో మంది పొట్టి నిక్కర్లు వేసుకోవద్దని చెప్పారట. బురఖా వేసుకోవాలని పట్టు పట్టారట.  కానీ ఆమె సంకల్పాన్ని, ఆ తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని మతం, కట్టుబాట్లు ఆపలేకపోయాయి. అందుకే ఈ రోజు మహిళల బాక్సింగ్ 52 కిలోల విభాగంలో ప్రపంచ విజేత కాగలిగింది.” వివరంగా చెప్పింది మగమేక 

“హిజాబ్ లేకుండా బయటికి వచ్చే అమ్మాయిని కట్టడి చేసే వాళ్ళకి తన విజయంతో గట్టి పంచ్ ఇచ్చింది నిఖత్ జరీన్.  శభాష్ బిడ్డా శభాష్” చెట్టు మీద నుంచి చిలక  

” బురఖా వేసుకుంటే బురద, బురఖా విప్పితే బంగారం ” అంతేనా వెటకారంగా అన్నది గాడిద. 

“నిఖత్ ను ఆమెగా ఎదగనిచ్చిన, సమాజానికి ఎదురీదిన ఆ తల్లిదండ్రులకి కూడా ఈ విజయం” అన్నది ఆడమేక 

“మట్టిలో మాణిక్యాలు మెరుస్తున్నాయి. ఒక మెట్టు ఎక్కుతుంటే మరో మెట్టు కిందికి లాగుతూ ఉంటారు జనం. కానీ గమ్యం చేరడానికి మళ్ళీ మళ్ళీ పై కి ఎక్కుతూ  

దిగుతూ ఎవరేమన్నా తనకు తాను వెన్ను తట్టుకుంటూ, వెయ్యేనుగుల బలాన్ని నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆడపిల్లలు ” ప్రశంసగా అన్నది మగమేక 

“అవునవును, నిన్న భువనగిరికి చెందిన అన్వితారెడ్డి అత్యున్నత పర్వత శిఖరం ఎవరెస్టు పై జెండా ఎగురవేసింది” గొప్పగా చెప్పింది అప్పుడే వచ్చిన కాకి. 

“ప్రోత్సహిస్తే  బంగారు పంట పండిస్తారు. జాతి గర్వపడేలా చేస్తారు ” అంటున్న గాడిద వైపు చూస్తూ  “ఏంటో ఈ లోకం.. నిన్న నవ్విన నోళ్లే పండుతున్నాయి ” ఉడికిస్తున్నట్లుగా ఆడమేక 

“మీ గోల మీదే గానీ వార్తల్లో చెప్పిన అసలు ముచ్చట విన్నారా?  

నలుగురికి శకునం చెప్పే పిల్లి కుడితిలో పడ్డదట ” అంటూ అర్ధం కానట్టు చూస్తున్న అందరినీ చూస్తూ “నేనే తీన్మార్ ఖాన్ ని. నేను ఆడిందే ఆట అంటే నడుస్తుందా నడవదట. 

తక్షణ న్యాయం, ప్రజల ఆగ్రహం అని ఎన్కౌంటర్ చేసే అధికారం పోలీసులకు లేదని కోర్టు పోలీసులను తప్పు పట్టింది ” అని చెప్పింది కోతి 

“నిజమా ..! ”  అన్నది ఉడుత 

“ఒక నేరానికి మరో నేరమే సమాధానమా?

జగమంతా తెలుసు అది ఎన్కౌంటర్ పేరిట జరిగిన హత్య అని. కానీ నిప్పులాంటి నిజం తేల్చడానికి కోర్టుకు మూడేళ్లు పట్టింది.  ఇప్పటికైనా ఆటవిక న్యాయం అంతరించి, ప్రజల ఉన్మాదానికి ముగింపు వస్తే బాగుండు” ఆలోచనగా ఆడమేక 

“ఆ పదిమంది పోలీసుల లిస్టులో వాళ్ళను నడిపించిన తలకాయ పేరు లేదట”  జనం అనుకోగా విన్నా నెమ్మదిగా అన్నది కోతి 

” ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సింది చట్టం వ్యక్తులు కాదు.  బూటకపు ఎన్ కౌంటర్ అని తేలితే చేసిన అధికారులకు ఉరిశిక్ష వేయొచ్చని సుప్రీంకోర్టు 2013 లో తీర్పు ఇచ్చిందట.”  తనకు తెల్సిన విషయాలు నలుగురికీ  చెప్పింది కాకి 

“అంటే ఏంటి? ఆడపిల్లల్ని బలవంతంగా అనుభవించొచ్చా.. కిరాతకంగా హత్య చేయొచ్చా..? అది నేరం కాదా?

ఇలాంటి కిరాతకులను  ఏరి పారేస్తే  వెర్రికేకలు.. అసలు ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులకి, వాళ్ళకి ఆ ఆర్డర్ చేసిన అధికారులకి పరమ వీర చక్ర బిరుదు ఇవ్వాలి ” ఆవేశపడింది గాడిద 

మళ్ళీ తానే “అమాయకపు ఆడపిల్లల్ని ట్రాప్ చేసి ఎత్తుకుపోయి రేప్ చేసి సజీవ దహనం చేసినప్పుడు లేవని నోళ్లు బూటకపు ఎన్కౌంటర్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. హూ … 

అసలు ఆ రాక్షసుల పట్ల జాలి ఏంటి ? సిగ్గు లేకపోతే సరి” గొంతుచించుకుంది గాడిద 

” ప్రజలు ఆగ్రహిస్తారు, శాసిస్తారు. పోలీసులు వాటిని అర్థం చేసుకుని అమలు చేస్తారు.  అంతేనా ”  చురుగ్గా చూస్తూ ఆడమేక. అవునన్నట్లుగా తలూపింది గాడిద 

“అట్లాగా.. మరిక చట్టాలెందుకు? న్యాయవ్యవస్థ ఎందుకు?  

ఎంత పోలీసు అధికారులు అయితే మాత్రం వాళ్లకు చట్టాలు వర్తించవా? చట్టసమ్మత విధానాలు వదిలి ఉన్మాదం గా ప్రవర్తించవచ్చా? హత్యలు చేసేయొచ్చా? ఇక నేరస్థులకు వీళ్లకు తేడా ఏముంది ?” స్థిరంగా అన్నది ఆడమేక 

“నిజమే, నువ్వన్నదీ కరెక్టే. ఆ పోలీసు అధికారులపై సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం నమోదు చేయాలి”  మగమేక. 

“అట్లా అయితే ఎట్లా .. తప్పు చేస్తే చంపుతారని భయం జనానికి ఉండాలి కదా. మళ్ళీ మళ్ళీ తప్పులు , నేరాలు జరగకుండా ఉండాలంటే  ఆ మాత్రం భయం పోలీసులు పెట్టాల్సిందే” వాదనకు దిగింది గాడిద. అవునన్నట్లుగా చూసింది ఉడుత. 

“ఆ .. అవునా .. అయితే, పోలీసులకి రౌడీ షీటర్ కి తేడా ఏంటో ..?” అన్నది కోతి   

“దిశ కేసు నిందితులు పేదలు, కులాల నిచ్చెనలో కింద ఉన్నవాళ్లు అని కాల్చి చంపేశారు. అదే పలుకుబడి, పరపతి ఉన్నవాళ్ళ పిల్లలు అయితే అలాగే అత్యుత్సాహంతో ఎన్కౌంటర్ చేసేవారా? అలా ఇప్పటివరకు ఎవరినైనా చేశారా? 

దిశ కేసులో చూపిన అత్యుత్సాహం అదే సమయంలోనే జరిగిన రేప్ కేసుల్లో లేదే ..? వాళ్ళు నిచ్చెన మెట్లలో  పై వరుసలో లేరనా?  ఈ కేసులో ముద్దాయిలను ఎన్కౌంటర్ చేయకుండా న్యాయస్థానం ముందు ఎందుకు నిలబెట్టారు ?”  అన్నది మగమేక 

“సమాజంలో పై స్థాయిలో ఉన్న అమ్మాయికి నష్టం జరిగితే సమాజం గగ్గోలు పెడుతుంది, కింద స్థాయి అమ్మాయిలకి జరిగిన అన్యాయాన్ని పట్టించుకోరు. చూసీచూడనట్టు వదిలేస్తారు. పాపం వాళ్ళు ఆడపిల్లలు కాదా! ఏం మనుషులో .. ”  నిట్టూర్చింది ఆడమేక 

“న్యాయానికి , శిక్షకి కులం, మతం వర్గం ఉంటాయన్నమాట.. ఏమిటీ వివక్ష ” తర్కించుకుంది చిలక 

“ఓ పోలీసు సార్లూ  ఇప్పటికైనా మేలుకోండి. నిబంధనలకు అనుగుణంగా నడవకపోతే  రేపు రిస్క్ లో పడేది మీరేనని గుర్తించండి” అన్నది కోతి 

“కోర్టు మొట్టికాయలు వేసి మీరు చేసింది తప్పు అని పోలీసుల్ని శిక్షిస్తుందేమో.., కానీ పోయిన అమాయకుల ప్రాణాలు తెచ్చి ఇవ్వగలరా .. కుటుంబాల్లో పోయిన సంతోషాన్ని ఇవ్వగలరా .. ప్చ్ ..” ఆయా కుటుంబాల బాధ ఎరిగిన కాకి. 

“ఆ నలుగురిలో ముగ్గురు పిల్లలేనట. వాళ్ళకి పోయేకాలం వచ్చింది. అందుకే కాని పనిచేశారు” అన్నది ఉడుత  

“మనకన్నా మనుషులు గొప్పవాళ్లనుకుంటాం కానీ ఈ పనులేంటో…”దీర్ఘం తీసింది కోతి 

“ఆడపిల్లను గౌరవిస్తే , ఆమెను ప్రోత్సహిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి ” ఆలోచనగా అన్నది మగమేక 

“స్త్రీలను గౌరవిద్దాం అని తాటికాయంత అక్షరాలతో మొక్కుబడిగా రాసుకోవడం కాదు.  మగపిల్లవాడు పుట్టినప్పటి నుంచి తోటి ఆడపిల్లను సమానంగా చూడడం నేర్పాలి. 

ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆమెను చూసే దృష్టి  మారితే ఆడపిల్లను గౌరవిస్తే ఇట్లా జరగదు.  

అట్లా చెయ్యరు. కానీ, కుల మత దురహంకారం బలిసిన నోళ్లు  ప్రపంచ విజేతగా జెండా ఎగురవేసిన నిఖత్ కు నీరాజనాలు పలుకుతున్నది. 

అమ్మాయికి చిగురంత ప్రోత్సాహం లభిస్తే అద్భుతాలు సృష్టిస్తుంది.  చరిత్రను తిరగరాస్తుంది. కన్న నేలకు గర్వకారణం అవుతుంది. 

ఆమె పట్టుదల ముందు  పర్వతం చిన్నదవుతుంది    

గజానికొక గాంధారి పుత్రులున్న దేశం ఇది. సృష్టికి మూలం స్త్రీ .. ఆ స్త్రీత్వాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని ఆటలు ఆడతారు . ఎంత వంచన చేస్తున్నారు.  

  ఓ పక్క గ్రహాంతరాలకి పోతామంటారు . కానీ సాటి మనిషిని మనిషిగా చూడటం రాదు”   ఆవేదనగా అన్నది అడమేక 

“ఆమె మాట, ఆట, పాట, తిండి, బట్ట, నడక, నడత అన్నింటిపై పెత్తనం చెలాయిస్తూ, ఎక్కడికక్కడ గోడలు కట్టేస్తూ, తాళాలు బిగించేస్తూ …’ బేటీ బచావో బేటీ పడావో’ నినాదాలు… ఆశ్చర్యంగా లేదూ…” అన్నది మగమేక 

వి. శాంతి ప్రబోధ 

Vihanga, June 2022