The greatest WordPress.com site in all the land!

విత్త ప్రపంచపు కొత్త వాకిళ్ళలో 

ఎక్స్ప్రెస్ హైవేలు , స్కై వేలు , 

మల్టీ లేయర్ ఫ్లై ఓవర్ లు , 

నింగిని తాకే టవర్స్, మెట్రో పిల్లర్ , 

గ్లోబల్ సిటీ, స్మార్ట్ సిటీ, గ్రీన్ సిటీ హై టెక్ సొగసులు 

అంతర్జాతీయ ప్రమాణాల రహదారులు, ప్రాజెక్టులు 

ఆహా .. ఎంతగా పురోగమిస్తున్నాం .. 

ఎటుచూసినా ఆధునికత చిగుర్లు తొడిగి మొగ్గలేస్తూ 

రా రమ్మని ఆహ్వానించే స్వర్గధామం ఈ మహానగరం  

ఆహా .. ఏమి అభివృద్ధి ఈ కళ్ళు చాలడం లేదు చూడ్డానికి 

అని నిన్నటివరకూ మురిసిన నాకు 

ఇప్పుడక్కడ అవేమి అగుపించడం లేదు 

ఆ స్థానంలో 

రాళ్ళల్లో , రప్పల్లో.. నిగనిగలాడే రహదారుల్లో 

రక్తమోడుతున్న పాదాలే .. 

చీమల బారులా అలుపు సొలుపూ 

లేకుండా నిరంతరం సాగుతున్న గాయాలే .. 

నెత్తిన తట్ట బుట్ట , చంకన పిల్లాపాపలతో 

పాయలు పాయలుగా కదిలే వేదనలే

సొంతగూటికి సముద్రమై ఉప్పొంగుతూ 

ఆశల ప్రయాణం సాగిస్తున్న దేహాలే ..  

కళ్ళముందు కదలాడుతున్నాయి 

ఆ గాయాల పాదాల  దేహాలన్నీ .. 

నవనాగరక నగర నిర్మాణంలో 

రాళ్ళెత్తిన కూలీలవి 

పనితప్ప గుర్తింపు ఎరగని కూలీలవి  

బతుకు ఆరాటమే తప్ప 

హక్కులకోసం పోరాడని సైనికులవి

కమిలిపోతూ, కుమిలిపోతూ, నలిగిపోతూ  

ప్యాకేజీల మడతల్లోని 

మతలబులెరగని బహుదూర బాటసారులవి  

కరోనాతో తిరగబడిన ప్రపంచంలో 

తల్లడిల్లుతూనే ఆకలిదప్పులనదిమి 

తల్లి ఒడి చేరాలన్న గుండె తడి 

చేసే హడావిడిలో చేత చిల్లిగవ్వ లేకున్నా 

ఇంటికే చేరతారో కాటికే చేరతారో 

తెలియని ముళ్ళదారుల్లో మండే ఎండల్లో 

బారులు బారులుగా కదిలే వలసకూలీలవి 

దేశ అభివృద్ధి బండి చక్రాల కింద పడి 

నలిగి నెర్రలు వాసిన ఆ హృదయాలు 

నెత్తురు తాగుతున్న బాటల్లోని అతిథి కూలీలవి  

మిలమిల మెరిసే మహానగరపు మెరుపుల్లో 

తళతళ లాడే మాయానగరపు తళుకుల్లో

ప్రగతి దీపం కింద చీకటిలా..

ప్రజాస్వామ్యం కంటి కింది చారికల్లా.. 

నగరాన్ని దాటి వస్తుంటే .. ఆశ్చర్యం .. 

ఎర్రటి ఎండల్లో.. సుడిగాడ్పుల్లో.. 

రాటుదేలిన సున్నితత్వం 

ఆవిరైన ఆశల మూటగట్టుకు వెనుదిరిగిన 

అతిథి కూలీల ఆదరించి అన్నంపెట్టి 

సాదరంగా బండెక్కిస్తున్న మానవత్వం

నేను నుండి మనం కేసి సాగిన విశాలత్వం  

రేపటి పట్ల ఆశలు చిగురింప చేస్తూ   

జీవితపు సువాసనలు వెదజల్లుతూ 

తిరగబడిన ప్రపంచంలో …    

 

వి. శాంతి ప్రబోధ 

28.05.2020 ప్రజాతంత్రలో ప్రచురణ

మొక్క మొక్కను పలుకరించే ప్రకృతి

మనిషి మనిషినీ కదిలించే ప్రవృత్తి
గల గుత్తా జ్యోత్స్న నేనో హై బ్రీడ్ విత్తనాన్ని అంటుందో కవితలో . నిజమే . ఈ హైబ్రీడ్ విత్తనంతో నా పరిచయం వయస్సు మూడు తక్కువ ముప్పై ఏళ్లు.
నిజామాబాద్ జిల్లాలో మద్యపాన నిషేధ ఉద్యమ సమయంలో ఆమె అక్షరాలతో, మాటలతో పరిచయం. ఆ తర్వాత అక్షరాస్యతా ఉద్యమంలో ఇద్దరం కలసి పనిచేశాం. సామజిక సేవాకార్యక్రమాలలో ఉన్న మా దగ్గరికి (సంస్కార్ -వర్ని ) తరచూ వచ్చేది. సమాజపు అంచులలోకి నెట్టివేయబడ్డ జీవితాలతో ముచ్చటించేది.   ఆ సన్నిహితత్వం నేటికీ కొనసాగుతూనే ఉంది . బహుశా ఆ దగ్గరితనంతోనే నాకీ మాటలు రాసే అవకాశం ఇచ్చి ఉంటుందని అనుకుంటున్నా.
నాది కొంచెం బిడియంగా ఉండే తత్త్వం . తనది చొచ్చుకుపోయే స్వభావం . అప్పుడూ ఇప్పుడు ఎప్పుడు నన్ను కదిలించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది.  నేను చిన్నదాన్నని అలా ఉంటుందేమోనని మొదట్లో అనుకునేదాన్ని. నన్నే కాదు తనకు పరిచయం ఉన్న అందరినీ అంతే .. వెనుక బెంచ్ లో కాదని ముందు బెంచిలోకి లాక్కుపోవాలని చూస్తుంది.
ఆమెది ఉద్యమ కుటుంబ నేపథ్యం.  అందువల్లేనేమో నిజామాబాద్ జిల్లాలోని ప్రతి ఉద్యమంలోనూ ముందు భాగాన గుత్తా జ్యోత్స్న పేరు కనిపిస్తుంది.  కులనిర్ములన, మూఢనమ్మకాలు మొదలుకొని నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకూ .  వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన జ్యోత్స్న ఎక్కువకాలం డిప్యుటేషన్ పై సామాజిక కార్యక్రమాల్లోనే ఉన్నదంటే అందుక్కారణం ఆమెలోని సామాజిక ఉద్యమకారిణి.
తన గమ్యమేమిటో తనకి స్పష్టంగా తెలుసు. ఎక్కడా ఊగిసలాటలు లేవు. నమ్మిన దాన్ని ఎన్ని ఇబ్బందులున్నా, ఎవరేమనుకున్నా లక్ష్యపెట్టని నైజం ఆమెది. ఎప్పటికప్పుడు సాహసవంతమైన నిర్ణయాలతో ముందుకు నడుస్తున్నది.
కులాల సంకెళ్లను తెంపుకున్న కుటుంబంలో పుట్టి, స్వేచ్ఛగా గాలిపీలుస్తున్న జ్యోత్స్న అక్షరాలు మానవ ప్రకృతిని గురించి మాట్లాడతాయి.  సమాజహితం గూర్చి ఆలోచింపజేస్తాయి. ప్రశ్నార్ధకమైన పుట్టుకల పక్షాన నిలబడతాయి.  మానవత్వ మనుగడకు బడుల్లో, గుడుల్లో కులాన్ని వెతకడాన్ని ప్రశ్నిస్తాయి. వెర్రిగా వెంటబడుతున్న మతాన్ని నిలదీస్తాయి. మానవత్వాన్ని నిలుపుకొమ్మని ఉద్బోధిస్తాయి. మనిషిగా బతకమని సూచిస్తాయి.
ఆమె కవిత్వాన్ని పలకరిస్తే ..
 “విజ్ఞాన శాస్త్రాన్ని వెన్నుతట్టిలేపిన /జాబిలమ్మ ఎంత అందంగా ఉంది ! /ఆడపిల్లల్ని అక్కున చేర్చుకొమ్మని చెప్పినట్లుంది ” ఈ పాదాలను ఆలోచిస్తే చాలా ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి . ఆధునిక విజ్ఞానంతో అందమైన జాబిల్లిలాంటి ఆడపిల్లల్ని తల్లి గర్బంలోనే చిదిమేస్తుంటే అక్కున చేర్చుకొమ్మని ఆశావహంగా చెప్తుంది.
” గాలి , నీరు , భూమి వాడుకునే మనం /మన ఊపిరిని బాధ్యతగా వాడుకోవాలి ” మన ఊపిరి బాధ్యతగా వాడుకోవాలంటే గాలి, నీరు , భూమిని కూడా భద్రంగా చూసుకోవాలని హెచ్చరిక అంతర్లీనంగా కనిపిస్తున్నది. అదే విధంగా మన ప్రాణం పట్ల, మన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్న సూచన ఉన్నది.
నాకు తెలిసి తను రాసిన కవితలు చాలానే ఉండాలి . కానీ ఎక్కడా భద్రపరుచుకున్నట్లు లేదు. ఎందుకంటే తొంభైలలో అడపాదడపా తాను రాసిన కవితలు చూసాను . అవేవీ ఇక్కడ “ఉద్యమాల చౌరస్తా ..”లో చోటు చేసుకోలేదు .  తనకు అందుబాటులో ఉన్న కవితలతో పాటు ఈ మధ్యకాలంలో రాసిన కవితలు ఇక్కడ మనకు కన్పిస్తాయి .
ఒకటి రెండు మినహా మిగతా కవితలు రాసిన తేదీలు లేవు. ఇస్తే బాగుండేది .  ఆ అక్షరాల బాణాల్లో ఆ సమయ సమాజ ప్రతిబింబం స్పష్టంగా తెలిసేది .
కులనిర్మూలన సంఘం కార్యక్రమాల్లోనూ , అవయవదానం కార్యక్రమాల్లోనూ, హేతువాద, మానవవాద కార్యక్రమాల్లోనూ నిండు యవ్వనిలా బిజీబిజీగా ఉంటుంది. తన సొమ్ము , సమయం సమాజహితం కోసం ఖర్చు చేస్తూ, ఉద్యోగానంతర జీవితాన్నీ ఫలప్రదంగా గడుపుతున్న జ్యోత్స్న తన కలానికి ఇంకా ఎక్కువ పనికల్పించాల్సిన అవసరం ఉందని , ఆ కోరిక తీరుస్తుందని ఆశిస్తున్నాను .
అభినందనలతో,
వి . శాంతి ప్రబోధ
ఆ ప్రాంతమంతా రణ రంగం నుండి 
తరలిన క్షతగాత్రులతో ..
గుట్టలు గుట్టలుగా పోగవుతున్న దేహాలు
జీవంగా .. నిర్జీవంగా..
జీవం పోస్తారనుకున్న  దేవుళ్ళు భయంతో
తలుపులు మూసుకుంటే
ప్రాణం నిలిపే సంజీవనులై వైద్య బృందం..
రోబోల్లా..  రేయింబగళ్లు బాధితుల సేవలో
***               ***
చిరునవ్వులు పూసే ఆమె
వాడిన తోటకూర కాడలా వేలాడిపోతూ
దేహాపు అలసట తీర్చడం కోసం
అత్యవసర వార్డుకీవల కొన్ని క్షణాలు
కుప్ప తెప్పలుగా వచ్చిపడుతున్న
పాజిటివ్ లు ..ఎగశ్వాస దిగశ్వాసతో
కొందరు, బంధాల బంధనాలు తెంపుకుని
అనాధల్లా పయనమైపోతూ ..
అవే దృశ్యాలు ..
రోజుల తరబడి అవే దృశ్యాలు
చూసీ చూసీ మనసంతా శూన్యంగా..
దేహమంతా నిస్సత్తువతో ..
తనలాగే ఇతర వైద్యులు .. వైద్య సిబ్బంది
సూర్యోదయాలు అస్తమయాలు తెలీకుండా
గడియారం ముల్లులా .. పనిచేస్తూనే ..
ఏంటమ్మా .. అలా ఉన్నావ్
సీనియర్ పలకరింపుతో లోపల
గూడుకట్టుకున్న దుఃఖం
కట్టలు తెంచుకొని అలలు అలలుగా ఎగిసిపడింది
మాసిన బట్టలతోనే ఆమెను చుట్టుకుపోయింది .
ఆత్మీయ స్పర్శ పంచుకునే తోడు కోసం
తపించిపోతున్నారేమో .. ఇద్దరూ
ఒకరినొకరు ఓదార్చుకుంటూ
గుండె బరువు తీర్చుకుంటూ
కారిడార్లో ఓ మూల కూలబడ్డారు
**          **
ఆమె అమాసకో పున్నానికో
వెనుక వాకిట్లోంచి ఇంట్లోకి చేరి
బరిబాతై బట్టల్ని వాషింగ్
మిషన్దొ వేసి, అంటుకున్నవన్నీ
శానిటైస్ చేసి, తలారా వేడినీటి
స్నానం చేసినా ఐసొలేట్.. అయినవాళ్లకు
ఆరడుగుల దూరంలో కలిపే మాటలు
మీదకురికే మూడున్నరేళ్ల చిట్టితల్లి
ఏమీ తినడంలేదని జతగాడి ఫిర్యాదు ..
అతని చూపులో చూపు కలపలేక
తినమ్మా .. మా బంగారం కదా ..
నీకేం కావాలి చెప్పు ..పప్పు ..ఆమ్లెట్
ఊహూ .. నువ్వే ..   కావాలి
మమ్మీ..  హగ్గీ ప్లీజ్ ..
ఎదుట ఉన్న వారి స్పర్శ
అందుకోలేనంత దూరంలో
ఏకాకిలా.. ఆమె గుండె బద్దలైంది
యూస్ అండ్ త్రో
భోజనంప్లేటు  చే జారిపోయింది
ఐదేళ్ల కొడుకు వేసే ప్రశ్నల వర్షం ..
పెద్దరికంతో అందించే జాగ్రత్తల గుచ్ఛం  ..
చూసి మురిపెంతో వాడి బుగ్గల్ని పుణికి
గుండెలకు హత్తుకోవాలన్న బలమైనకోరికకు
కళ్లెం వేయలేక సతమతమవుతూ ..
శారీరకంగా బలహీన పడుతున్న ఆమె
ఏ ఏమరుపాటు క్షణాన
శత్రువు దాడి చేస్తుందో
ఏమయి పోతుందోననే బెంగతో అతను
ఆ స్థితిని దాటవేసే ప్రయత్నంలో
రాని నిద్రను తెచ్చుకుంటూ
నలిగిన హృదయంతో గుడ్ నైట్ లు
ఫ్లయింగ్ కిస్ లతో భారమైన హృదయం
పిల్లలు పడుకున్నాక
కాసేపు మనసుకు సాంత్వననిచ్చే
కబుర్లు కలబోసుకోవాలని
ఆత్మీయ స్పర్శతో సేదతీరాలని
మనసుపడే ఆరాటం ..
కానీ ఎలా .. ఎలా
ఎన్నాళ్లిలా .. ఏమో
క్యాలెండరులో తేదీలు, నెలలు
కదిలిపోతున్నాయి ..
***               ***
మిత్రులారా ..
నాలాటి వాళ్ళ తరపున మీకో విన్నపం
యుద్ధభూమిలో మీ వైపున నిలబడి
పోరాటం చేస్తున్న సైనికుల
మాట వింటారు కదూ ..
మీరు రణరంగంలోకి
రాకుండా ఉండాలంటే
హతం కాకూడదంటే
అవగాహనతో మెలుగుతూ
వ్యక్తి  దూరం, పరిశుభ్రత పాటిస్తే సరి
నాలుగ్గోడలమధ్యే హాయిగా
పిల్లాపాపల ఆటపాటలతో
సరదా సరదా కాలక్షేపాలతో
సరి కొత్త వ్యాపకాలతో
కుటుంబమంతా సందడి చేయండి
సంబురం చేసుకోండి
మాకులేని అవకాశం మీకుంది
దాన్ని ఫలవంతం చేసుకోండి
స్మాల్ పాక్స్ , పోలియోలను
అద్భుతంగా తరిమి కొట్టిన అనుభవంతో
ఈ మహమ్మారిని నిర్ములించే సత్తా, సామర్ధ్యం
మన దేశానికి ఉన్నాయన్న భరోసా ఇవ్వండి
ఎల్లవేళలా మీ సేవలో మేముంటాం
గెలుపు మనదే ..  రేపు మనదే ..
Published in Prajatantra 04.04.2020
వి . శాంతి ప్రబోధ
25 . 03. 2020

దేవుళ్లు

నిన్నటివరకూ గుళ్ళు గోపురాలు ,
చర్చీలు మసీదులు పట్టుకు తిరిగా..
కోరిన కోరికలు తీర్చమంటూ
కోట్లకొద్దీ సొమ్ములు అర్పించా..
నేనిప్పుడు నడిసంద్రంలో నిలబడి
హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తుంటే..
మొహం చాటేశాయి
తలుపులు మూసుకున్నాయి
స్వాములూ , బాబాలు
పోపులు , ఫాస్టర్ లు
ముల్లాలూ , మున్షిలూ
నమ్ముకున్న ముక్కోటి దేవతలూ
ఈ మహమ్మారి రాకుండా ఎలాగూ ఆపలేరని
ఆపద నుండి గట్టెక్కించలేరని
పిట్టల్లా రాలిపోతున్న జనాన్ని
స్వస్థత వరాలతో స్వస్థత పరచలేరని
కరోనా పాజిటివ్ గా నను దరిచేరనీయలేరని
తాకి ప్రార్ధనలు చేయలేరనీ..
తెలిసిన హృదయం బద్దలైంది
విశ్వాసం వేయి ముక్కలైంది
ఎంత గుడ్డిగా బతికానిన్నాళ్ళూ..
జిమ్మిక్కులకు, గారడీ విద్యలకు జై కొడుతూ
నిన్న నేను ఎగతాళి చేసిన వైద్యం
నిర్లక్ష్యం చేసిన వైద్యాలయాలు
నా కోసం తలుపులు తెరిచే..
రేయింబవళ్లు నిద్రాహారాలు మాని
వైద్య బృందం నాచుట్టూ..
అసలైన దేవుళ్లుదేవతలు వాళ్లేగా!
కులమేదైనా .. మతమేదేనా ..
కలిమిలేములు ఏవైనా
ఆడామగ, భాషా భేదం ఏదైనా
కర్తవ్య నిర్వహణలో తామేమైపోతున్నా
మానవజాతి ప్రాణం నిలిపే
యత్నంలో  నిరంతరం శ్రమించే దేవుళ్లు
ఇప్పటికి తెలిసింది .
అక్కర ఎక్కడ ఉందో.. ఎక్కడ పెట్టాలో ..
ఇప్పటికి తెలిసింది
ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మ కూడదో
ఇప్పటికి తెలిసింది
ఎందుకు  విశ్వసించాలో..ఎందుకు విశ్వసించకూడదో
వి. శాంతిప్రబోధ
02. 04. 2020
ఉదయం ఆరుగంటలకే కాలింగ్ బెల్ మోగడంతో  ఏమిటీరోజు పనిమనిషి పద్మ అప్పుడే వచ్చేసిందే అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది మాధురి .
ఎదురుగా  చెల్లి మాలతి.
ఆమెకేసి కళ్లింతవిచేసుకుని విస్మయంగా చూసింది .  “ఏంటే ఉరుముల్లేని పిడుగులా  ఊడిపడ్డావ్ .  రాత్రి మాట్లాడినప్పుడు కూడా వస్తున్నట్టు  చెప్పనేలేదు” చెల్లి చేతిలోని బ్యాగ్ చూసి ఆశ్చర్యంగా అడిగింది మాధురి.
“ఏం.. నీ ఇంటికి రావడానికి కూడా ముందు చెప్పి పర్మిషన్ తీసుకుని రావాలా ..?” దబాయిస్తూ ఎదురు ప్రశ్న వేసి బాత్రూంలోకి దూరింది మాలతీ .
మొహం కడుక్కొచ్చిందేమో ఆమె మొఖమంతా తడితడిగా ఉంది . ఆ తడి చీర చెంగుతో అద్దుకోవడం చూసి టవల్ అందించింది మాధురి.
అక్కచేతిలోని టవల్ అందుకుని మొఖానికి అడ్డుకుంటూ  “అక్కా .. నాలో ఏమన్నా మార్పు కనిపిస్తోందా ” అకస్మాత్తుగా సూటిగా అక్క మొహంలోకి చూస్తూ అడిగింది.
దబ్బ పండులా మిసమిసలాడుతూ ఉండే చెల్లి ఇలా వేలాడిన తోటకూరలా  అయిపోయిందేమిటి?  మనసులో అనుకుంటూ కిచెన్లోకి నడుస్తూన్న మాధురి ఆగిపోయి  చెల్లినే అయోమయంగా చూస్తూ  “అదేం ప్రశ్నే ….”  అంది కానీ .. పాలిపోయినట్లున్న చెల్లెల్ని చూస్తే దిగులేసింది.
“అమ్మా,  నీలో చాలా మార్పు వచ్చింది . నువ్వు  ఇదివరకటి మా అమ్మలాగా లేవు .
నీలో కోపం , ఆవేశం , అసహనం  తొందరపాటు పెరిగిపోయాయి . నువ్వు చెప్పింది వినకపోతే వెంటనే వైల్డ్ గా  రియాక్ట్ అవుతున్నావ్  ” ఒక్క క్షణం ఆగి,  అయోమయంగా చూస్తున్న అక్కనే చూస్తూ “ఈ మాట నాది కాదు . స్నేహాది . దాదాపు రోజూ ఈ మాట నాకు దానినోట వినిపిస్తోంది. అక్క చెప్తున్నది నిజమేనంటాడు సౌహార్ద్. నీ మరిదిదీ వాళ్ళ మాటే . కాకపొతే స్నేహ చెప్పినట్లుగా పదే పదే ఆ విషయం చెప్పరు.  అంతే తేడా” లోపల నిక్షిప్తమైన అగ్నిపై నవ్వు పూత పూస్తూ అన్నది మాలతి .
చెల్లెలు నవ్వుతూనే చెప్పినా ఆ నవ్వులో జీవం ఉన్నట్టనిపించలేదు మాధురి  కళ్ళకి .  ప్రశాంతంగా ఉండేందుకు, దిగులు మేఘాల్ని తరిమేసేందుకు శతవిధాలా ప్రయత్నం చూస్తూ మాలతి.
చెల్లెలి కుటుంబంలో ఏదో జరిగింది . ఆమె మనసును బాగా గాయం చేసేదేదో జరిగింది .  లోలోన అగ్నిగుండాలే బద్దలవుతున్నట్టుగా ఉంది.  పైకి కన్పించనీకుండా పెదవులపై నవ్వులు పులుముకుని మాములుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది .
ఇద్దరమూ ఉండేది ఇదే సిటీ లో, చెరో మూల ఉత్తర దక్షిణాల్లా… ఎప్పుడూ ఇంత ప్రొద్దున రాలేదు .  వచ్చినా వాళ్ళాయనతోనే వస్తుంది .
ఇప్పుడిలా బాగ్ తో వచ్చిందంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని అనుకున్న మాధురి “నీకేమనిపిస్తోంది ?” చెల్లికేసి తిరిగి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎదురుప్రశ్న వేసింది.
 మొహంలో మారుతున్న భావాల్ని, రంగుల్ని కన్పించనీకుండా నొక్కిపెట్టిన పెదాల్ని వదిలి “ఏమో…  నాకేమయింది .. మామూలుగానే ఉన్నాగా .. “అంటూ భుజం ఎగురవేసి అక్కకేసి చూసే ధైర్యం చేయలేక కిందకి చూస్తూ అన్నది.
ఆ వెంటనే, “అయ్యో ఫోన్ ఎక్కడ పెట్టాను .. “అని వెతుక్కోవడం మొదలుపెట్టింది మాలతి .
ఆమె ఫోన్ కి రింగ్ చేసింది మాధురి.
“ఓ ఇక్కడే ఉంది” అంటూ ఫ్రిజ్ పై నుండి మొబైల్ చేతిలోకి తీసుకుని డైనింగ్ టేబుల్ కుర్చీ లాక్కుని కూర్చున్నది మాలతి .
ఉదయపు నీరెండ మీదపడుతుండగా “వాళ్ళు అన్ని సార్లు చెబుతున్నారంటే నిజంగానే ఏమన్నా తేడా వచ్చి ఉంటుంది . పెద్దవాళ్ళం అవుతున్నాం కదా .. మార్పులు సహజమే .. వచ్చాయేమో ..” సాలోచనగా అన్నది మాధురి
“లేదక్కా .. చూడు నేను మామూలుగానే ఉన్నాగా ..
నువ్వేమన్నా చెప్పు.. నా కయితే వాళ్ళ మాటల్తో నన్ను పిచ్చి దాన్నిగా మారుస్తున్నారనిపించింది” గొంతులో జీర అడ్డుతగులుతుండగా  అసహనంగా లేచి నిల్చుని అటూఇటూ కదులుతూ అన్నది మాలతి
చెల్లెలి భుజంపై ఆప్యాయంగా చేయి వేసి తట్టుతూ ఆమె చేతిని పట్టుకుని వచ్చి సోఫాలో కూర్చుంది మాధురి .  ఆమె ఒళ్ళో తల పెట్టుకుని ఒక్కసారిగా బావురుమంది మాలతి .  చెల్లెలు అట్లా ఏడుస్తుంటే మాధురికీ  దుఃఖం పొంగుకొచ్చింది .
అందర్లోకి చిన్నది మాలతి. చాలా గారాబంగా పెరిగింది . పెళ్ళై అత్తింటికి చేరాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కష్టాలు పడింది. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంది . ఏనాడూ నోరు తెరిచి తన కష్టాన్ని, బాధని చెప్పుకోలేదు . ఇట్లా గుండెపగిలి ఏడవను లేదు .  ఇప్పుడేంటి అంతా సుఖంగా , సజావుగా సాగిపోతున్న వేళ.. కొద్దీ క్షణాల తర్వాత తనను తాను సముదాయించుకుని చెల్లెలి బాధకి , దుఃఖానికి మూల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో పడింది మాధురి.
” ఛ .. ఛా .. ఏమిటే ..మరీ  చిన్న పిల్లల్లా .. ఆ పిచ్చిమాటలేంటి ? ” చిరుకోపంతో కసురుతూనే చెల్లెలి తలపై చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది.
అక్క  మొహంలోకి లిప్తపాటు అలా చూసి దీర్ఘశ్వాస వదిలి కళ్ళు తుడుచుకుంటూ పక్కకు ఒత్తిగిలింది మాలతి .
“మాలతీ … నువ్వు ఏదో బాధలో ఉన్నవని నాకు అర్ధమవుతున్నది .  అదేంటో ఈ అక్కదగ్గర కూడా చెప్పుకోలేవా .. అక్క నీకంత పరాయిదై పోయిందా .. ” నిష్ఠురమాడింది మాధురి. ఆ విధంగానైనా చెల్లిలోపల మరుగుతున్నదేదో బయటికి వస్తుందన్న ఆశతో .
ఆ తర్వాత ” అక్కాచెల్లెళ్ల బంధానికి అర్థమేముంది .. కష్టసమయాల్లో ఒకరికొకరు తోడవ్వకపోతే..
అమ్మ ఉంటే అమ్మకి చెప్పుకునేదానివి కాదా .. అమ్మ తర్వాత ఆ బాధ్యత నాదే కదా .. ” చెల్లెలి తల నిమురుతూ అనునయిస్తూ అన్నది మాధురి.
ఆ తర్వాత నెమ్మదిగా “నాకెవరున్నారు .. నువ్వు తప్ప .. అందుకేగా .. అక్కడ ఉండలేక నీదగ్గరకొచ్చింది ”  వెక్కుతూనే అన్నది మాలతి
“నేనేం మాట్లాడినా అందులో తప్పులు వెతకడమే స్నేహ పని .  నువ్వు మాట్లాడింది ఇది తప్పు . అది తప్పు .
ఇలా కాదు అలా మాట్లాడాలి . అలా ఉండాలి . ఇలా చెయ్యాలి అంటూ ఎప్పుడూ నాలో తప్పులు వెతకడం …  నాకు క్లాసులు పీకడమే దాని పని అయిపొయింది.
ఒకటి అని మరోటి  చెప్తున్నావ్ ..అంటుంది ఒకసారి . అడిగిన దానికి సూటిగా చేప్పకుండా  చుట్టూ తిప్పి ఏదేదో చెప్తున్నావ్  అంటూ విసుక్కుంటుంది మరోసారి.
పిల్లలిద్దరూ నాతో  మాట్లాడేదే తక్కువ.
ఎప్పుడయినా ఏదైనా మాట్లాడితే నా మాటల్లో ఎప్పుడూ తప్పులెన్నడమే, పూచిక పుల్లలాగా తీసిపడెయ్యడమే వాళ్ళ పనయిపోయింది .  సూటిగా జవాబులు చెప్పట్లేదు అంటుంది .
నిజం చెప్పాలంటే నాకు ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది . ఏమి తప్పులు తీస్తారోనని .
వాళ్ళతో మాట్లాడుతుంటేనే ఏదో తత్తరపాటు. పదాలు తొందరగా గుర్తురావు . ఒకటి అనబోయి ఒకటి అనేస్తున్నాను .  అది నాకూ తెలుస్తోంది .
ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను .  ఎక్కడలేని దిగులు వచ్చేస్తోంది . నిద్ర పట్టడం లేదు . ఒంటరితనం భరించలేకపోతున్నా . నిండా యాభైఏళ్లు లేవు.
ఇప్పుడే నా పరిస్థితి ఇట్లా ఉంటే ..
భవిష్యత్ ఇంకెంత భయంకరంగా మారుతుందో..  తలుచుకుంటే విపరీతమయిన ఆందోళన కలుగుతోంది.
నిద్రలేక నీరసం .. చేసే పనిమీద శ్రద్ధ పెట్టలేకపోతున్నా ..
ఒక్కోసారి పిల్లల్ని ఏమనలేక నన్ను నేనే హింసించుకోవడం లేదా నా కోపమంతా పనిమనిషిమీద చూపడం జరుగుతోంది .
అమ్మ కేమయింది ఉత్తగానే అరుస్తుంది . ఇట్లా అయితే ఈ ఇంట్లో పనిచేయడం నా వల్లకాదని అల్టిమేటం ఇచ్చింది పనిమనిషి .
బయట ఎవరూ  ఇంతవరకూ నాతో పిల్లలు చెప్పినట్లు చెప్పలేదు .
ఆ మాటే అంటే  బయటివాళ్లేందుకు చెప్తారు . నీ వాళ్ళం కాబట్టి , నీ మంచికోరేవాళ్ళం కాబట్టి మేం చెబుతాం అంటుంది స్నేహ.
ఆలోచిస్తే అదీ నిజమే అనిపిస్తుంది ”  చేతికున్న ఉంగరాన్ని అటూ ఇటూ తిప్పుతూ మాలతి అంతరంగాన్ని అక్కముందు  పరిచింది .
“అంటే .. స్నేహ  అంటున్నట్లు నిజంగా నీవు కూడా ఫీలవుతున్నావా .. నీలో మార్పు వచ్చిందని”  చెల్లెలి కళ్ళలోకి గుచ్చ్చి గుచ్చి చూస్తూ అడిగింది మాధురి.
“ఏమోనే .. అదే నాకేమీ అర్ధం కావడం లేదు” కొన్ని క్షణాలాగి  మళ్ళీ తానే
“పరిస్థితులను బట్టి, మారుతున్న వయసును బట్టి  నా భావోద్వేగాల్లో తేడా వస్తే వచ్చి ఉండొచ్చునేమో .. .
ప్రశాంతమైన జీవితం ఈ రోజుల్లో ఎవరికి ఉంటుంది చెప్పు . ప్రతివారికీ ఏదో ఒక ఆందోళన, వత్తిడి ఉంటుంది కదా ..
ఈ మధ్య నేను ఒంటరినైపోయినట్లుగా అన్పిస్తోంది. ఏం మాట్లాడినా పిల్లలది, వాళ్ళ నాన్నది ఒకే మాట . నన్ను వేరు చేసేస్తున్నారు . నేను పిలిస్తే ఒక్క అంగుళం కదలరు . పలకరు . అదే వాళ్ళ నాన్న పిలిస్తే ఏంటి నాన్నా..  అంటూ వెంటనే రెస్పాండ్ అవుతారు .
నేనంటే గౌరవం లేదు . నాకూ , నేను చేసే పనికీ  విలువేలేదు.
అటువంటి చోట నేనెందుకు ఉండాలి .. ఎన్నోరోజుల నుండి ఈ ప్రశ్న నన్ను వేధిస్తున్నది ..
చిన్నప్పుడు ఎంత ప్రేమగా ఉండేవారు . ప్రతిదీ నాతో పంచుకునే వారు. అప్పుడు వాళ్ళకి అమ్మే లోకం .  ప్రపంచపు రంగులు తెలియని అమాయకత్వం.
ఇప్పుడు వాళ్ళ ప్రపంచం పెద్దదైపోయింది. రంగు రంగుల లోకం ఇరవైనాలుగు గంటలూ ఇంట్లో ఉండే అమ్మకి ఏమి తెలుసూ .. ఏమీ తెలియదు .
అందుకే  వాళ్ళప్రపంచంలో అమ్మ స్థానం ఏమూలనో … రంగువెలిసిన బొమ్మలా ..
వాళ్ళ నాన్నసంపాదనకోసం, స్నేహితుల కోసం బయటి ప్రపంచంలో నలుగురితో తిరిగొస్తారు.  ఆయనకు చాలా విషయాలు తెలుసు . లోక జ్ఞానం తెలుసు అనుకుంటారు. అన్నిటికంటే ముందు తమకోసం కావలసినన్ని డబ్బులు ఇస్తారుగా అందుకే అయన ఏమి చెప్పినా వాళ్ళకి వేదవాక్కు .
వాళ్ళ దృష్టిలో నేనో కరివేపాకు.. ఇంకెందుకే .. నేనింకా ఆ ఇంట్లో ఉండడంలో అర్ధముందా .. చెప్పక్కా..
వాళ్ళ పద్దతి చూస్తే .. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది …  ” హృదయంలోని బాధ వడిపెడుతుండగా లేని నవ్వు పెదవుల చెదరనీకుండా అక్క కళ్ళలోకి చూస్తూ  అన్నది మాలతి
“అలా ఎందుకనుకుంటావే ..” అనునయంగా అన్నది మాధురి
“ఏం ఎందుకనుకోకూడదు ..?
అయినా ..  నీకేం తెల్సు .. వాళ్ళ ప్రవర్తన .. రోజూ నేనెంత వ్యధకు, రంపపుకోతకు గురవుతున్నానో .. వాళ్ళు చేసిన గాయాలు ఎలా సలుపుతుంటాయో..  ఎన్ని సార్లు నాలో నేను ఏడ్చుకుంటూ ఉన్నానో ..
ఇన్నాళ్ళు నన్ను నేను సమాధాన పరుచుకుంటూ వచ్చా.. గాయానికి పై పై పూత పూసుకుంటూ వచ్చా .. ఇక నా వల్లకాదు” గబగబా చెప్పింది .
ఆ వెంటనే “నీకూ తెలుసుగా .. మా పెళ్లినాటికి సతీష్ కి సరైన ఉద్యోగమే లేదాయె . నా ఉద్యోగంతోనే కదా సంసారాన్ని నడుపుకొచ్చింది. ఆ తర్వాత తనకి మంచి ఉద్యోగమే వచ్చినా టూరింగ్ జాబ్ . ఇంట్లో ఉండేది తక్కువ . అన్నీ నేనే చూసుకునేదాన్ని కదే …చివరికి వాళ్ళ అమ్మానాన్నలు .. చెల్లెళ్ళ పురుళ్ళు  అన్నీ నేనే కదే చేసింది .. ” చెల్లెలు తన ధోరణిలో చెప్పుకుపోతూన్నది .
నిజమే , చాలా ఇబ్బందులు పడింది. గుట్టుగా సంసారాన్ని ఉన్నంతలో బాగానే లాక్కొచ్చింది.  కానీ ఏనాడూ ఇట్లా బయటపడలేదు .  అన్ని ఒత్తిళ్ళనీ తట్టుకుని నిలబడింది .  గడ్డుకాలం దాటిపోయింది. హాయిగా ఉండాల్సిన సమయంలో ఇప్పుడేమిటో.. సమస్య
మధ్యలో సతీష్ ఆరోగ్యం దెబ్బతిని ఉద్యోగాన్నిహెడ్ ఆఫీసుకు మార్చుకున్నాడు .
పిల్లలూ కాలేజీలకు వచ్చారు. తాను డాక్టర్ కావాలని కలలు కని ఆర్ధిక పరిస్థితుల కారణంగా కాలేకపోయిన సతీష్ కి తన కొడుకు డాక్టర్ కావాలని కోరిక . అందుకోసం చెల్లెలు ఎంతకష్టపడిందో  తనకు తెలియనిది కాదు అనుకుంది మాధురి .
”  సౌహార్ద్ ని ట్యూషన్స్ కి ఎట్లా తిప్పానో ..  స్నేహని మ్యూజిక్ క్లాసులకూ , డాన్స్ క్లాసులకూ ఎలా తీసుకెళ్లానో .. వాళ్లకిష్టమైనవి చేయడం కోసం నేనెంత వదులుకున్నానో వాళ్లకేం తెల్సు  .. చెప్పినా ఇప్పుడు వాళ్ళకవేమీ  పట్టవు . అదొక విషయమే కాదు .
పిల్లలకీ వాళ్ళ నాన్నకు నేనో వ్యక్తిని ఇంట్లో ఉన్నాననే ధ్యాసే ఉండదు ..
ఏదో సందర్భంలో మీ కోసం నేనన్నీ వదులుకున్నానంటే ..
నిన్నెవరు చేయమన్నారు .. మేమేమన్నా నీ వెంటబడి తీసుకెళ్ళమన్నామా .. అన్నీ చేయమన్నామా.. ఎప్పుడూ ఏదో చదువుతూ ఉంటావు ..  అని కయ్ మంది స్నేహ .
రోజంతా ఇంట్లో ఉన్న నాతో వాళ్ళ అవసరాలకు తప్ప మాటలుండవు . నన్నొక మనిషిలాగా చూడరు .
వాళ్ళ నాన్నతో మాత్రం చాలా చాలా మాట్లాడతారు. జోకులేసుకుంటారు .. కలసి సినిమాలు చూస్తారు . వాటి గురించి చర్చించుకుంటారు ..
నేను మధ్యలో వెళ్తే నాకేమీ తెలియదని .. నా మాటల్లో .. చేతల్లో తప్పులు వెతుకుతారు ..
వేళకు తిండి తినరు. బయటి తిండి తినడమే గొప్ప అనుకుంటున్నారు .  నేను వాళ్ళకోసం వండిందంతా వృధా అవుతుంటే మనసు చివుక్కుమంటున్నది.
రాత్రి పగలు లేకుండా బయట తిరుగుళ్ళు .. చెప్తూనే ఉంటాను . వింటేగా .. పాత చింతకాయ పచ్చడి అంటారు
అసలే రోజులు బాగోలేవు . ఏ రోజు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలుసు .. ?
అలాంటప్పుడు సతీష్ వాళ్ళని కోప్పడొచ్చుగా ..
ఊహూ .. అలా చేయడు .. ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు .. మరి నాకు మండదా .. చెప్పక్కా ..
మళ్ళీ తనే .. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్ .. ఆ మాత్రం ఆడపిల్లకి నేర్పుకోలేవా.. అర్ధరాత్రి దాకా తిరిగొస్తుంటే చెప్పొద్దా ..  అంటాడు నీ మరిది .
కానీ తాను చెప్పడు . తండ్రే కదా .. చెప్పొచ్చు కదా .. ఊహూ .. అది చెయ్యడు ..
అది చెయ్యొద్దు .. ఇది చెయ్యొద్దు . అట్లా ఉండు , ఇట్లా ఉండు అని చెప్పి నేను చెడ్డదాన్నయిపోతున్నా ..
నా మాటలు వాళ్ళ బుర్రకెక్కవు .  చాదస్తపు మాటలకింద తీసి అవతల పడేస్తారు. “
“అయితే .. ” మాట పూర్తి కాకుండానే
” వాళ్ళ పనులు చేసిపెట్టే రోబోని కాదుగా… విలువలేని చోట , గౌరవించని చోట ఉండడం ఎంత కష్టమో ..ఎంత ఉక్కపోతగా ఉంటుందో నీకేం తెల్సు .. ? ఆ  గాయపు రంగులేమిటో లోతు ఎంతో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది.
రెక్కలు విరిగిన పక్షిలా గిలగిలా కొట్టుకుంటున్నానక్కా ..
అందుకే.. అక్కడి నుండి , వాళ్ళనుండి దూరంగా వచ్చేశాను . అప్పుడు వాళ్ళ కోసమే నా జీవితాన్ని ఇంటికి పరిమితం చేసుకున్నాను . కానీ ఇప్పుడు, జీవితం దశదిశా లేకుండా సాగిపోతుండడాన్ని భరించలేక పోతున్నాను.
విరిగిన రెక్కలను అతికించుకుని నన్ను నేను ఆవిష్కరించుకోవాలని, స్వేచ్చా విహంగంలా విహరించాలని తపన .. అందుకే నాకోసం నేనొచ్చేశా ..  “
“వచ్చేశావా ..?” అప్రయత్నంగా మాధురి నుండి
” అవును, వచ్చేసా ..  చచ్చి పోదామన్న ఆలోచనను అక్కడే సమాధిచేసి నా జాడని నేను వెతుక్కునే ప్రయత్నంలో ఆ ఇంట్లోంచి వచ్చేశా..
నేనిలా రావడం నీకు ఇష్టం లేదా .. కష్టంగా ఉందా, ఇబ్బందిగా ఉందా.. బరువయితే  చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను . లేదంటే ఏదో ఒక ఉద్యోగం దొరికే వరకూ ఇక్కడ నీతో ఉంటాను “.  నా కళ్ళలో నా జవాబు వెతుకుతున్నట్లుగా సూటిగా చూస్తూ ..  స్థిరంగా తన నిర్ణయాన్నినొక్కి చెప్పింది మాలతి.
తన చేయి చేతిలోకి తీసుకుని ఆత్మీయంగా నొక్కుతూ “మంచి పని చేసావ్ .. నీకు నేనున్నానన్న నమ్మకం ఉన్నందుకు సంతోషం .. దిగులు పడకు .
అన్నీ సర్దుకుంటాయి . ముందు స్థిమితపడవే .. . అన్ని విషయాలూ నింపాదిగా మాట్లాడుకుందాం ” అని బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసే మిషతో అక్కడ నుండి లేచింది మాధురి.
ఆ కాసేపటికే స్నేహ ఫోన్ ” అమ్మ..వచ్చిందా పెద్దమ్మా..” ఆ అడగడంలో ఎంతో కంగారు.. దుఃఖం పొంగుకొచ్చి మాట్లాడలేకపోయింది.
కూతురి చేతిలో ఫోన్ తీసుకుని “వదినా .. మాలతి అక్కడికి .. ” సతీష్ అడుగుతుండగా ..
“వచ్చింది. తాను మానసికంగా చాలా డిస్ట్రబడ్, డిప్రెస్డ్ గా ఉంది” .  నేను మళ్ళీ మాట్లాడతా ముక్తసరిగా చెప్పి కాల్ కట్ చేసింది మాధురి .
చెల్లెలు స్థితికి కారణమైన ఆ కుటుంబ సభ్యులపైన చాలా కోపంగా ఉంది మాధురికి.
తనకంటూ సెలవు దినం లేకుండా గడియారం ముల్లులా నిత్యం ఎవరికి ఏం కావాలో సమయానికి అమర్చిపెట్టడం తన బాధ్యతగా భావించే మాలతికి ఒక ప్రశంస ఇవ్వకగా ఆమె శ్రమకు విలువ ఇవ్వకపోగా  చిన్న చూపు చూడడం, చులకన చేయడం  .. చాలా కష్టంగా ఉంది మాధురికి.
ఆలోచిస్తున్నదామె .. ఈ సమస్య మాలతిది ఒక్కదానిదేనా ..
చాలా ఇళ్లలో గృహిణుల సమస్యే .. కాదు కాదు ఆడవాళ్ళ సమస్యే ..
ఇటు ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగబాధ్యతలతో సతమతమవుతూ నేనూ అనేకపాట్లు పడ్డదాన్నేగా…
చాలా మంది గృహిణులు నిరాశా నిస్పృహలతో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు ..  ఆందోళన కుంగుబాటు కు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు .
తోడికోడలు వాళ్ళ  అక్క ఈ మధ్య ఆత్మహత్య చేసుకుంది.
ఆవిడకిదేం పోయేకాలం అంటూ ముక్కున వేలేసుకున్నారు.  ఇట్లా చేసిందని అందరూ ఆశ్చర్యపోయారు.  ఆర్ధిక ఇబ్బందులు ఏమీ లేవు.  ముత్యాల్లాంటి పిల్లలు.  చక్కని సంసారం. నిండుకుండని కాళ్లతో తన్నేసుకుంది అనుకున్నారంతా . బహుశా .. ఆమె కూడా జీవితం పట్ల నిరాశా నిస్పృహలకు లోనై మానసికంగా కుంగిపోయి  అలా చేసుకొన్నదేమో…  ! అనేక సందేహాలు ..
చెల్లెలు ఏమి చేస్తున్నదోనని చూస్తూ ఫ్రిజ్ లో ఉన్న దోశ పిండి తీస్తున్నది మాధురి .
చేతిలో రిమోట్ పట్టుకుని ఛానెల్స్ అటూ ఇటూ తిప్పుతున్నది . ఏ ఒక్క ఛానెల్ చూడడంలేదు.  ఆమె చూపులు గోడపై ఉన్న పెయింటింగ్ పై ఆగాయి. తదేకంగా చూస్తున్నాయి.
అస్థిమితంగా ఉన్న మాలతిని ఆకట్టుకున్న పెయింటింగ్ కాలక్షేపం కోసం ఈ మధ్య మాధురి వేసిందే ..
మాలతికి చిన్నప్పుడు చిత్రకళలో ప్రవేశం ఉంది . కాలేజీ రోజుల్లో చాలా బహుమతులు అందుకున్నది.  ఆ తర్వాత ఉద్యోగం , పెళ్లి, సంసారజీవితంలో అన్నీ ఏ గంగలోకి కొట్టుకుపోయాయో …
భర్త , పిల్లలు ఆమె మొదటి ప్రాధాన్యతలో నిలవడంతో ఆమె వేసిన పెన్సిల్ ఆర్ట్ , పెయింటింగ్ , హ్యాండీ క్రాఫ్ట్స్ ఆసక్తులన్నీ వెనక్కి వెళ్లిపోయాయి.  కొంతకాలం చెల్లిని ఇక్కడే ఉంచుకుని జీవితం పట్ల నూతనోత్సాహం కలిగించాలి.
సతీష్ వస్తే .. వచ్చి బతిమాలితే .. వెళ్తుందా .. ఏమో .. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఆమె మాత్రమే .. ఆమె మనసు పొరల్లో ఏముందో ..
నా దగ్గర ఉన్నంత సేపూ చెల్లిని గతం చేసిన గాయాల నుండి బయటపడే మార్గాలు ఆలోచించాలని మాలతి గురించే ఆలోచిస్తున్నది మాధురి.
శరీరానికి అయిన గాయం కనిపిస్తుంది. దానికి సపర్యలూ జరుగుతాయి . కానీ మనసుకు అయిన గాయం పైకి ఏమీ కనిపించదు. లో లోపలే విస్తరిస్తూ గాయాన్ని మరింత పెంచుతుంది.  అది మనం గమనించలేం. గమనించినా దానికి తగిన వైద్యం చేయించాలని అస్సలు ఆలోచించం …
శరీరంలో మిగతా భాగాలకు లాగే మనసుకు తగిలే దెబ్బల్ని చికిత్స అవసరం.
నిజానికి,  ఈ సమయంలో కుటుంబ సభ్యులందరి సహకారం కావాలి.   వారి మధ్య ఉన్న అనుబంధం మరింత గట్టిబడాలి కానీ పలుచన కాకూడదు .
మాలతి మనసుకి అయిన గాయం చిన్నా చితకా గాయం కాదు. ఈ ఒక్కరోజుది కాదు. లోలోపలే రక్తమోడిన గాయం ఇప్పుడు పక్వానికొచ్చింది. ఆ పుండు పగిలి  డిప్రెషన్ కు లోనయింది. దానికి తోడు మోనోపాజ్ సమస్యలు.
మాలతి మామూలుగా అవ్వాలంటే అందరి సహకారం చాలా అవసరం . నచ్చచెప్పి ఇంటికి పంపడం కంటే కొంతకాలం ఇక్కడ ఉంచడమే ఉత్తమం.
మధురికి ఒకప్పుడు తన కుటుంబం ఇచ్చిన సహకారంతో మోనోపాజ్ సమస్యలనుండి బయటపడిన వైనం గుర్తొచ్చింది.  భర్త కాలంచేసినా, పిల్లలు విదేశాల్లో ఉన్నా ఒంటరినన్న దిగులు, అభద్రతాభావం లేకుండా ఆనందంగా గడిపేస్తున్నది.
మోనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్లలో హెచ్చు తగ్గులు మందులతో సవరించుకోవచ్చు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల డిప్రెషన్ కు లోనైన మాలతిని మామూలు మనిషిని చేయడం కొంత సున్నితమైన వ్యవహారమే కానీ తగ్గని, పరిష్కారం కాని సమస్య ఏమీ కాదు.
నిజానికి ఆ డిప్రెషన్ నుండి బయటపడే మార్గాలు మాలతి కూడా అన్వేషిస్తున్నదని స్పష్టమవుతున్నది.
కుటుంబం కోసం తన సర్వశక్తులూ ధారపోసే తల్లులు, అదే తమ లోకం అనుకునే తల్లులు తమదనుకున్న లోకం తమకు దూరంగా జరిగిపోతుంటే బెంబేలు పడిపోతుంటారు.  అదే సమయంలో తమను చేతకానివాళ్లుగా తీసిపడేస్తుంటే కుంగిపోతుంటారు. లోపలికి ముడుచుకు పోతుంటారు.
కానీ చెల్లెలు ఆ స్థితిని అధిగమించాలని ప్రయత్నించడం,  అందులో భాగంగానే ఇక్కడికి రావడం.. అంటే చెల్లెలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని సుస్పష్టం..
క్షణం తీరిక లేదు . చిల్లి గవ్వ ఆదాయం లేక చిన్నచూపుకు లోనవుతున్నానని భావించే ఉద్యోగ అన్వేషణలో పడింది. తన ఆత్మగౌరవం తాను కాపాడుకోవాలని తాపత్రయ పడుతున్నది. తనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలని ఆరాటపడుతున్నది.  తన అస్థిత్వాన్ని తాను నిరూపించుకోవడానికి ఘర్షణ పడుతున్నది .  అందుకు ఆమెను ఖచ్చితంగా అభినందించాల్సిందే ..
కొన్నాళ్ళు మాలతి ఆ ఇంట్లో లేకపోతే.. అప్పుడు తెలిసి వస్తుంది ఆమె ఏమిటో .. ఆమె విలువ ఏమిటో ..
మబ్బుల మాటున దాగిన వెన్నెల్లాటి వారి ప్రేమను ఒకరికొకరు అర్ధం చేసుకోవడానికి, వ్యక్తం చేసుకోవడానికి కొంత సమయం, సంయమనం అవసరం .  కాలమే వారి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.
ఈలోగా తన చెల్లి మానసిక పరిస్థితి, మోనోపాజ్ సమయంలో వచ్చే ఇబ్బందులు .. హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే ఇబ్బందులు , డిప్రెషన్ వంటి మానసిక అనారోగ్య సమస్యల గురించి వివరంగా సతీష్, స్నేహ, సౌహార్ద్ లకు తెలియజేయాలి.
నిండైన ఆత్మవిశ్వాసంతో మాలతి తన కుటుంబంతో ఆనందంగా ఉండడంతో పాటు, ఓ వ్యక్తిగా తనను తాను ఆవిష్కరించుకునే క్రమంలో చేతనయినంత తోడ్పాటు అందించాలని ఆలోచనలతో దోశప్లేటు చెల్లెలుకి అందించింది మాధురి.
వి . శాంతి ప్రబోధ

నేను సాధారణంగా సినిమా చూడడానికి ఆసక్తి చూపను.  అటువంటిది, మిత్రురాలు శ్రీలక్ష్మి ఆహ్వానంతో 22న ఒక సినిమా ప్రీ వ్యూకి వెళ్ళాను.  ఆ సినిమా పేరు స్క్రీన్ ప్లే .  మామూలుకి భిన్నంగా ఉన్న దాని గురించి మీతో పంచుకుందామని ఇలా..
ఆశ్చర్యం ఏమంటే, సగం సినిమా అయి విరామం ఇస్తుండగా ఆలా కనిపించి ఇలా మాయమయిన మొహాన్ని చూసేవరకూ గమనించనంతగా సినిమాలో లీనమైపోయాను. రెండే రెండు పాత్రలతో ఇంతసేపు గడచిపోయిందా అనుకున్నాను .
సెకండ్ హాఫ్ నుంచి మూడో పాత్ర కనిపిస్తుంది. అంతే, సినిమా అంతా మూడంటే మూడు పాత్రలతో నడుస్తుంది . ఎక్కడా బోర్ కొట్టకుండా  ప్రేక్షకులను రెండుగంటలు ఉత్కంఠతో కూర్చోబెట్టగలిగిందంటే అర్ధం చేసుకోండి..  .
చావైనా  బతుకైనా నీతోనే ప్రియతమా మనసంతా తనువంతా నీవేలే నేస్తమా సమరానికి శ్వాసనే ప్రాణమై వెలుగునై నువ్వే నేనుగా నేనే నీవుగా బతుకంతా నీతోనే సాగనా..
పాటతో మొదలైన సినిమా వీక్షకులను నెమ్మదిగా తన వైపు తిప్పుకుంటుంది. MM శ్రీలేఖ సంగీత సారధ్యంలో వచ్చిన ఒకే ఒక్క పాట ఉందా సినిమాలో .  మెలోడియస్ గా సాగే ఆ పాట నాకయితే చాలా నచ్చింది .  ఆ పాట వస్తున్నంత సేపూ ఆనిమేటెడ్ పాత్రల బొమ్మలు కనిపిస్తాయి .  సినిమా అంతా అట్లాగే ఉంటుందేమో అనుకునేంతలో భార్యాభర్తలు తగవుపడే దృశ్యం షేడెడ్ గా కనిపిస్తుంది .  నలుపు తెలుపుగా కనిపించే షేడ్స్ లో ఆ పాత్రల ఎక్స్ప్రెషన్స్ స్పష్టంగా అర్ధమవుతుంటాయి. ఆ తర్వాత షేడ్స్ పోయి పాత్రలు మనముందుకు వస్తాయి.  సినిమాలో లీనమైన మనకు ఆ పాత్రలు చాలా సహజంగా కనిపిస్తాయి. ఒక్కోసారి భయపెట్టిస్తాయి. కోపం తెప్పిస్తాయి.  బాధ కలిగిస్తాయి.  నవ్విస్తాయి .
A సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రంలో కొన్ని దృశ్యాలు కొంచెం అతిగానే  అనిపించినప్పటికీ జుగుప్స కలిగించేవిగా మాత్రం లేవు .

ఆడవాళ్ళ కొచ్చే సమస్యలను అర్ధం చేసుకోగలిగే మనసు, సున్నితత్వం  మగవాళ్లకు ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్క్రీన్ ప్లే ద్వారా  చెప్పినట్లుగా నాకనిపించింది .
ప్రధాన పాత్రలైన రాధిక, గౌతమ్ లుగా నటించిన ఇద్దరూ కొత్త నటులు.  మొదటిసారిగా తెరకు పరిచయం అయినవారు.  కానీ వాళ్ళ నటన అట్లా అనిపించలేదు. చాలా అనుభవం ఉన్న వాళ్ళ లాగ ఉంది వాళ్ళ నటన. రాధికగా ప్రగతి యధాటి , గౌతమ్ గా విక్రమ్ శివ నటించారు . మూడో పాత్ర భూపతిగా కె.ఎల్. ప్రసాద్  నటించారు. ప్రసాద్ గారు తెలుగు యూనివర్సిటీ ఉపన్యాసకులు.  ఈ చిత్ర రచయిత, దర్శకులు కె ఎల్ ప్రసాద్.

మాములుగా సినిమాకి ముందు స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఆ స్క్రిప్ట్ ప్రకారం డైలాగ్స్ చెప్తారు. కానీ ఇక్కడ అలా కాదట. Mumble code screenplay విధానంలో జరిగిందట.  అదేంటో నాకు అర్ధం కాలేదు. కానీ ఫోటోగ్రఫీ , సంగీతం చాలా బాగున్నాయి. రొటీన్ సినిమాలకు చాలా భిన్నంగా ఉన్న సినిమా ఇది.
ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగే అసలు కథ తెలుసుకోవాలంటే సినిమా చూడండి  మార్చి 6వ తేదీ రిలీజ్ అవుతుంది.

కొన్నాళ్లుగా నేనో కలగంటున్నాను
ఆ కలలో దేశ సంచారం చేసి వస్తున్నాను
భక్తి పేరుతో బలహీనతల్ని
పొడుచుకుతినే రాబందులు లేని
చోటుకోసం గాలిస్తూ వస్తున్నాను
సందు గొందుల్లోని ఇరుకుబాటల్లోకే
కాదు , మహానగరాల్లోని
మెగాదారుల్లోకీ పరుగులు పెడుతున్నాను
ఎక్కడికి పోయినా అదే దృశ్యం
మాయపొరలు కప్పి మెదడు
చచ్చుబడిపోతున్న  సమాజం
గారడీ విద్యలతో బురిడీ కొట్టిస్తూ
నగదు, నగానట్రాతో పాటు ఇల్లూ ఒళ్ళు గుల్ల చేస్తూ
మనుషుల్నీ మనసుల్నీ దర్జాగా లూటీచేసే
సైకోలు ,రేపిస్టులు, గుండాలు,
ఖూనీకోర్లు, స్మగ్లర్లు … రాత్రికి రాత్రి వేషం కట్టి
సన్యాసిననో .. కలియుగ దైవాన్ననో
గజానికొక్కడు తగులుతూనే …
లెక్కలేనన్ని మఠాలు, పీఠాలు మొలుస్తూనే..
కడుపులో చెయ్యిపెట్టి కష్టాలన్నీ
తోడేసి ఆశీస్సులు అందిస్తామనే
స్వాముల ముసుగులోని సోంబేర్ల
కౌగిట్లో చలికాచుకునే ఆమాత్యులూ ..
సాష్టాంగపడి ముడుపులు కట్టే పాలకులూ ..
జనంసొమ్ముతో యజ్ఞయాగాలు చేసే నేతలూ..
ఉన్న గడ్డమీద
ఆవు చేలో మేస్తుంటే .. దూడ గట్టున మేస్తుందా ?
 లోతుతెలియని ప్రవాహపు సుడిగుండాల్లోకే
 అవ్వలూ , అమ్మలూ , అక్కలూ ..
అంతా జనమంతా  .. అటే మురుగులోకే..
నదీప్రవాహంలా అలుపెరగకుండా అడ్డొచ్చే
ఆలోచనల్ని కొక్కేనికి వెళ్ళాడేసి పరుగులెడుతుంటే
డేరాలు కట్టి పీఠాధిపతులైన బురిడీగాళ్లు ..
సామ్రాజ్యాలు కాన్సర్ పుండులా విస్తరించుకుంటూ
మత్తులో, సుఖాల్లో, విందు విలాసాల్లో మునిగితేలుతూ..
గల్లీ నుండి ఢిల్లీ దాకా
బక్కచిక్కిన మనసుల్లో
కొత్తచివురుల ఆశల చిట్టా
గుర్తెరిగిన రాబందులు
మొగలిరేకుల సువాసనలు గుప్పిస్తూ
కనిపించని కత్తి వేలాడదీసి
నగ్నంగా చేసే ఉన్మాదపు ప్రేలాపనలు
హృదయాలను  హత్తుకునే  దృశ్యాలే
బతుకులు పండాల్సిన చోట
రంగు రుచి వాసన కోల్పోయిన
కర్మసిద్ధాంతపు కొలిమిలోకి విసిరేస్తుంటే
భక్తి విశ్వాసాల ముసుగులో మూఢత్వం
జడలువిప్పి వికటాట్టహాసం చేసే దృశ్యాలు
చూడలేక కళ్ళుమూసుకున్న మౌనం
పుట్టిన రాచపుండుని సర్జరీ చేసి
బోన్సాయి బతుకుల్లో భరోసా నింపమని ఆర్థిస్తోంది!
ఉలిక్కిపడి చుట్టూ పరికించా ..
దట్టమైన చీకటి బిలంలో  నేను  ..
కత్తి చేతబట్టి  వెలుతురుతీరం వెతుక్కుంటూ
సాగేక్రమంలో.. ఇప్పటివరకూ
నా కనురెప్పలకింద కదలాడింది
కలకాదు నిజమని వర్తమానం చెప్పింది
ఇప్పుడేం చేయను ?
వికలమైన మనసులోంచి పొడుచుకొచ్చిన ప్రశ్న
నేనేం చేయనూ ..?? అని
వికసించాల్సిన మెదళ్లు
నిషిద్ధలోయల్లోకి జారిపోతుంటే
నిటారుగా నిలబడాల్సిన దేహాలు
కూలిన గోడల్లా మిగిలిపోతుంటే
పుణ్య దేశం మానసికరోగుల
అభయారణ్యంగా మారిపోతుంటే
అజ్ఞానం, అంధవిశ్వాసం
శాస్త్రీయతకు ఉరితాళ్ళు పేనుతుంటే
గుండెపగిలి  కన్నీటి కుండనైన
నేనేం  చేయనూ..???
ఎప్పటికీ కదలని విగ్రహంలానో
నిశ్చల సముద్రంలానో
ప్రశాంతంగా ఉండగలనా ..?! లేదంటూ ..
అలలు అలలుగా సాగే ఆలోచనలు
ఉవ్వెత్తున ఎగుస్తూ ..కాళిక నృత్యం చేస్తున్నాయి
 ఖడ్గం అందుకుని లాజిక్ లేని కనికట్టుగాళ్ళ ను
కరిగిపోయే కాలంలో కలిపేయమంటూ
సూర్యచంద్రులు సంకేతాలిస్తున్నాయి
వి . శాంతి ప్రబోధ
11. 11.2017
(2వ కవయిత్రుల సమ్మేళనంలో చదివిన కవిత) published in Netinijam daily on 23.11.17

నివురుగప్పిన నిప్పు
చాపకింద నీరులా
వ్యాపిస్తున్నది దశదిశలా …
దావానలంలా మారి
సెగలపొగలు కక్కడానికి సిద్ధమవుతున్నది

*** ***
పర్యావరణాన్ని పరిసరాలను
కనురెప్పల్లా పదిలపరుచుకునే
ప్రకృతి బిడ్డలం
వాతావరణ పరిస్థితులకు
అనుగుణమైన మా జీవనం
ఆహారాన్వేషణ , ఆటపాటలతో
సొంతమైన ఆనందమయ జీవితం
అంతా తలకిందులై..

చల్లని అడవితల్లి ఒడిలోచేరి
పోడుచేసి పొట్టపోసుకుంటుంటే
తరతరాలుగా తల్లీబిడ్డల
ఆత్మీయబంధాన్ని తుడిచేసి
తల్లి బిడ్డను ముద్దాడడం
బిడ్డ తల్లిచనుపాలు కుడవడం
తప్పని అంటారేం
నేరమని శిక్షిస్తారేం .. ?
,
పోడుచేసుకుని బతకడమే గానీ
పోగుచేసుకుని దోచుకుపోవట్లేదే .?!
వేరుపురుగుల్లా మారట్లేదే .. ?1
అయినా.. మాకాళ్ళ కింది భూమి
గుట్టు చప్పుడు కాకుండా
పందికొక్కుల కలుగుల్లోకి కదిలిపోతూనే

కనురెప్పల్ని కాటేసే మాయావి
కళకళలాడే మా బతుకుల్లో
చిక్కటి తేమను కబళించి
పచ్చటి గాలి వాసనల బదులు
చితులు పేరుస్తూ .. తాను
ఆశల ఊటబావులు తోడుకుంటూనే

మా అస్తిత్వంపై వేనవేల
ప్రశ్నల వల విసురుతూ
ప్రకృతి నియమాలకు విరుద్ధంగా
అభివృద్ధిపేర విధ్వంసం సృష్టిస్తూ
మా సంస్కృతికి, జీవికకు విఘాతం కలిగిస్తూ
అమ్మఒడి నుండి బిడ్డలను తరిమేస్తుంటే ..

చేసిన చట్టాలు చాపచుట్టేసి
మాకు గోరీలు కట్టేందుకు
లాఠీల , తూటాల వడగాడ్పుల
తుఫానులు సృష్టిస్తూ.. తాను
ఇంద్రధనుస్సు రంగులు
అద్దుకుంటూ ఊరేగుతుంటే ..

ఆకలిదప్పులతో అలమటిస్తున్న మేం
నింగి , నీరు , నేలా, కొండాకోనలు
మావేనన్న ఎరుకతో పోరుబాటపట్టి తెగిస్తే …
పుట్టలుపగిలిన చీమల్లా బయటపడి జ్వలిస్తే ..
ఎంతటి మహా మాయావి అయినా
ఆ మంటల్లో మాడి మసికాక తప్పదు!

వి . శాంతి ప్రబోధ
పోడు పోరు కోసం పంపిన కవిత

నేనో నునులేత మొక్కని
కొమ్మలేస్తూ ఆకుపచ్చ
తివాచీలా పరుచుకుపోవాలనీ ..
మొగ్గలు తొడుగుతూ సుమించాలనీ ..
విశ్వమంతా సౌరభాలు వెదజల్లాలని
నేనెప్పుడూ కలలు కనలేదు ..

అలాగే .. కాని కాలంలో
ఆకు రాల్చాలనీ
మోడువారాలనీ
ఏ మాత్రం అనుకోలేదు

ఆడుతూ పాడుతూ
ఎగిరే ఆనందాల చిరుజల్లుల్లో
చిగురించే చిరు ఆశల
మధ్య ఎదగాలనుకున్నా

కానీ నన్ను నన్నుగా
ఎదగనీకుండా నా చుట్టూ
చేరిన బొంత పురుగులు
నాపై
భారం మోపుతూ ..
వత్తిడి పెంచుతూ
నన్ను పీల్చి పీల్చిపిప్పిచేసి
అవి మాత్రం
రంగురంగుల సీతాకోకచిలుకల్లా
రూపాంతరం చెందుతూ ..

మొక్కనాటి
కాయలు ఏరుకోవాలనే
తొందరలో ..
నేను వృక్షంగా ..
మహా వృక్షంగా ఎదగాలనే
మోజులో
నా తల్లిదండ్రులు ..

ఫలితం
బాహ్యప్రపంచంతో
సంబంధం తెగిపోయి
నిర్బంధ జీవితం గడిపే నేనూ ..

ఈ మొక్క శక్తి ఏమిటో
ఇష్టా ఇష్టాలేమిటో తెలుసుకోకుండా
ఇరుగు పొరుగుతో పోలుస్తూ
పెను భారం మోపుతూ
గ్రీష్మపు వడగాడ్పులు ..
సునామీ వేగంతో
నాపై విరుచుకు పడుతూ
నిరంతరం నన్ను వేటాడుతూ

తగిలిన వేలుకే మళ్ళీ మళ్ళీ
దెబ్బతగులుతూ నేను
నా భవిష్యత్ పై నా ఛాయిస్ లేకుండా
బందిఖానాలో విలవిలాడుతూ నేను

చిన్న ఆత్మీయ స్పర్శకోసం
కొద్ది వినోదం కోసం
మరికొద్ది స్వేచ్ఛకోసం
తల్లడిల్లిపోతూ ..

వెచ్చని నిన్నలలోంచి
పచ్చని రేపటిలోకి
ప్రయాణించేందుకు
వసంత ఆగమనాలే కాదు
సూర్యాస్తమయ మసక కాంతి
కూడా కానరాని స్థితిలో నేను
మోడై రాలిపోతూ ..
నేరం నాది కాదు సుమా..!!!

వి. శాంతి ప్రబోధ
29. 10. 2017
( కవయిత్రుల కవిసమ్మేళనంలో చదివిన కవిత )
Published in Poddu daily on 1. 11. 2017

ఈ మధ్యకాలంలో ముఖపుస్తకమో లేదా ఇతర సామజిక మాధ్యమాల వేదికగానో తమ మనోభావాలకు తీవ్రమైన విఘాతం కలిగిందంటూ తీవ్రమైన, దాడులు సాధారణం అయిపోతున్న తరుణం ఇది .  అయితే , ఒకే విషయంపై  ఒక సమూహం లేదా ముఠా లేదా మూక చేసే దాడి, దాని స్వరూప స్వభావాలు పురుషులపైనా  మహిళలపైనా ఒకే విధంగా ఉంటాయా ..?
ఊహూ .. ఉండవు . ఒకేలా ఏమాత్రం ఉండవు.
ఆ దాడి చేసే వ్యక్తులు స్త్రీలైనా పురుషులైనా  అవతలి వ్యక్తి పురుషుడైతే అతని పురుషత్వాన్ని కించిత్ మాట అనరు . కానీ అదే స్త్రీ అయితే .. స్త్రీలను దేవతలుగా పూజించే గడ్డపైనే స్త్రీ బాహ్య రూపాన్ని, రహస్యాంగాలను , మొత్తం శరీరాన్ని పచ్చి బూతులతో జుగుప్సాకర మాటల రొచ్చు కుమ్మరించేస్తారు. ఆమెనే కాకుండా ఆమె తల్లినీ , కుటుంబాన్ని కూడా ఆ రొచ్చులోకి లాగుతారు . ఆ వ్యక్తిని , వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఉండే ద్వందార్ధాల ఆ బూతు తిట్లపురాణం  ఇక్కడ విప్పనవసరం లేదనుకుంటా ..  అవి అన్నవాళ్ళకీ విన్నవాళ్ళకి , మీకు అందరికీ తెలుసు .
ప్రపంచమంతా చూస్తుండగా అందరి మధ్యలో ధీమాగా సామాజిక మాధ్యమాల వేదికగా  అతిదారుణంగా  నిస్సిగ్గుగా రేప్ చేస్తామంటారు, అందరికీ వినబడేట్టుగా అరచి మరీ నరికి చంపేస్తామంటారు.  ఇంకా ఎన్నెన్నో చేయగలమనే ఘనుల వికృత రూపం సామజిక మాధ్యమాల్లో నేడు విపరీతంగా కనిపిస్తున్నది.
అసభ్యమైన పదజాలంతో లెక్కలేనంతమంది విజృంభించి సభ్య సమాజం నోటితో ఉచ్ఛరించ వీలుకాని విధంగా  వాంతి  చేస్తారు. ఏదో ఘనకార్యం చేసినట్లు  ఆ కంపునంతా గొప్పగా షేర్ చేసుకుంటారు.   అసభ్యమైన ఆ భాష వాడడం ద్వారా తమ పురుషాహంకారాన్ని వెల్లడి చేసుకుంటారు .  పైశాచికానందం పొందుతారు. మరి , ఇలాంటి వారు ఆమె ముందు చేసే విశృంఖల నృత్యాలు  ఆమె మనో భావాలను దెబ్బతీయడం లేదా ..? ఇదేనా మన సంస్కృతి ? ఇలాగేనా మహిళలను గౌరవించేది ?  ఇటువంటి సంస్కృతినేనా మనం భావి తరాలకు అందించేది ?
సమాజంలో విభిన్న వర్గాలు ,జాతులు , కులాలు , మతాలు ,  సమూహాలు ఉంటాయి . వారి  ఆలోచనల్లో , విలువల్లో,  ఆచరణలో, నిబద్ధతలో స్థాయీ భేదాలు వారి వారి అవగాహనను బట్టి, వారి ఎరుకలో ఉన్న సమాజాన్ని బట్టి ఉండవచ్చు .   వాటిని ఒకరికొకరు విమర్శించుకోవచ్చు . ఖండించుకోవచ్చు . లేదా ప్రశంసించవచ్చు , విశ్లేషించవచ్చు . ఎదుటివారి మాటల్లోంచి వచ్చిన కొత్త కోణాల్ని అనుసరించనూవచ్చు .  వాదాల మార్గాలు వేరయినప్పుడు అవి నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ విధ్వంసపూర్వకంగా ఉండకూడదు కదా …   కానీ ఇప్పుడలా జరగడంలేదు .  వ్యక్తిగతంగా అవమానించడం దాడులు చేసే సంస్కృతి  రోజు రోజుకీ పెరిగిపోతున్నది.
ఉదాహరణకి POW సంధ్య రాముడినీ , కృష్ణుడిని ఓ సందర్భంలో విమర్శించిన సంఘటనే తీసుకుందాం.   అదే విధంగా కత్తి మహేష్  మీడియాలో రాముడిని గురించి ఏదో వ్యాఖ్యానం చేసాడు .   వారి వ్యాఖ్యలు కొందరి మనోభావాలను చిన్నబుచ్చడం లేదా ఆగ్రహం కలిగించడం జరిగి ఉండొచ్చు . కాదనలేం.  అప్పుడేం చేయాలి ?
ఆ విధమైన  విమర్శ ఎందుకు వచ్చిందో ఆలోచించాలి . ఆ విమర్శకి తాము నమ్మిన సిద్ధాంతం ప్రకారమో  లేదా వాదం ప్రకారమో జవాబు చెప్పాలి .   అందుకోసం సంబంధిత విషయాన్ని మరింత అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైన  ప్రతి విమర్శ చేయాలి .
పురాణ ఇతిహాసాల్లో పాత్రలైన రాముడివైనా  , కృష్ణుడివైనా వారి వారి విలువలు, నమ్మకాలూ , విశ్వాసాలు వారిని సృష్టించిన సాహిత్య కాలపువి .   అవి ఈనాటి సమాజానికి ఎంతవరకూ సరిపోతాయో అని ఆలోచించుకోవాలి .  అంటే కాల స్పృహ చాలా అవసరం. కానీ అలా జరగడం లేదు.  విమర్శను విమర్శగా చూడకుండా ప్రతి విమర్శ చేయకుండా హీనమైన స్థాయికి దిగజారిపోయి వ్యక్తిత్వాన్ని దిగజార్చుకునే భాషను ఉపయోగిస్తూ తమ ఘనమైన సంస్కారాన్ని సమాజం ముందు ప్రదర్శించుకున్నారు కొందరు .   తమ మీద తాము ఆరాధించే  విశ్వసాల మీద విలువల మీద నమ్మకం ఉంటె , విశ్వాసం ఉంటే ఇలా ఎప్పటికీ చేయరు . ఆధారాలతో నిరూపించుకోజూస్తారు .  ఆ విశ్వాసం లేకే ఈ విపరీత ధోరణి .
వివాదాస్పద వ్యాఖ్యలు  చేయడం తగదని మత విశ్వాసాల ముసుగులో పితృస్వామ్య భావజాలాన్ని పెంచే మూక (పితృస్వామ్యాన్ని మోసే స్త్రీలు కూడా ) ఆమెనే తప్పు పడుతున్నారు . తనపనేదో తాను చేసుకోక మతసంబంధ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఫలితాలు ఇట్లాగే ఉంటాయని నిస్సిగ్గుగా వ్యాఖ్యానిస్తున్నారు .  కత్తి మహేష్ విషయం తీసుకుంటే అతని పైకూడా వ్యక్తిగత దాడి జరిగినప్పటికీ అది అతని లైంగికతకు సంబంధించినది కాదు. అదే సంధ్య విషయంలో అలా కాదు కదా ..
అంటే ఒకే విషయాన్ని స్త్రీ పురుషులిద్దరూ మాట్లాడినప్పుడు సమాజం వారిని చూసే దృక్కోణంలో  దృక్పథంలో ఉన్న పితృస్వామ్య స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది .
ఇలాంటి అవాకులు చవాకులు నాలుగు గోడల మధ్యనుండి సమాజంలోకి అడుగు పెట్టిన మహిళలకు ముఖ్యంగా  ఉద్యమాల్లో ఉండే మహిళలపై ఎక్కువ.   ఆమె అడుగు ముందుకు పడనీయకుండా ఆమె స్త్రీత్వంపై, లైంగికతపై చేసే దాడి ఈనాటిది కాదు.  స్వాతంత్రోద్యమ కాలంలోనూ , తెలంగాణా విమోచనా ఉద్యమ సమయంలోనూ  ఆ తర్వాత వచ్చిన ఉద్యమాల్లోనూ  ఇటువంటి  పరిస్థితిని మహిళలు ఎదుర్కొంటూనే ఉన్నారు.  అంటే ..  పితృస్వామిక  అవలక్షణ కొనసాగింపే సంధ్యపైన ఈ దాడి అని స్పష్టమవుతుంది
ఈ సందర్భంలో  సివిల్స్ ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవుతున్న యువకుడొకరు అన్నమాటలు గుర్తొస్తున్నాయి. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన మహిళలు  హక్కుల పేరుతో ,  సమానత్వం పేరుతొ, ఇంట్లోంచి బయటికొచ్చిన మహిళలు అందరికీ అందుబాటులో ఉంటారనీ , స్వేచ్ఛ పేరుతో విశృఖలంగా ప్రవర్తిస్తుంటారని , సిగరెట్ , మందు అన్నీ అలవాటుంటుందని అతను  వెలిబుచ్చిన అభిప్రాయం విన్నతర్వాత, ఉన్నత విద్యావంతుడైన, సామజిక అభివృద్ధి కోసం కంకణం కట్టుకోవలసిన, బాధ్యతాయుతమైన బాధ్యతల్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి ఆలోచనల పరిధి ఇంత కుంచించుకుపోయి ఉంటే ఇక మాములు వ్యక్తులతో కూడిన సమాజపు అభిప్రాయం భిన్నంగా ఉంటుందని అనుకోలేం కదా.

మహిళకూ సొంతంగా ఓ మనసుంటుందనీ, మెదడుంటుందనీ  ఏ అంశపైనయినా విషయంపైనయినా ఒక అభిప్రాయం వెల్లడించగల తెలివితేటలు ఉంటాయని పితృస్వామ్యం అనుకోదు.  ఆమె చుట్టూ హద్దులు గీసేసి అవన్నీ తమకు అంటే  పురుషులకే ప్రత్యేకం అనుకుంటుంది.   ఆ సంస్కృతే .. ఆ భావజాలమే స్త్రీని నగ్నంగా నడిరోడ్డున నిలబెట్టింది . ఆ సంస్కృతే కదా ..  నాలుగునెల్ల పసిబిడ్డ నుండి పండు ముదుసలి వరకూ అందరినీ చెరబట్టేది .

భారతదేశంలోకి ఆర్యులు ప్రవేశించిన నాటి నుండీ పితృస్వామ్యం రూపం మార్చుకుంటూ కొనసాగుతూనే ఉంది. మనువు స్త్రీ ఎలా ఉండాలో చేసిన సూత్రీకరణలు  బుర్రల్లో కుక్కుకున్న వారు మతం పేరుతో వెళ్లగక్కుతున్న విద్వేషం  ఉన్మాద రాద్ధాంతం అదే.  ఇది ఒక్క సంధ్య పైనో సుజాత పైనో  దేవిపైనో లేదా మరొకరిపైనో  మాత్రమే అని నేననుకోవడం లేదు . మహిళలపై అనాదిగా సాగుతున్న వివక్ష, ఆమెను పిల్లల్ని కనే యంత్రంగాను , సెక్స్ సుఖం అందించే వస్తువుగాను , సరుకుగానూ ,  పనిముట్టుగానూ   భావించడం , యూస్ అండ్ త్రో వస్తువుల్లా చూడడం .. పరాధీనగా ఉంచడం , బానిసత్వానికి గురిచేయడం మొదలైనవన్నీ ఇందుకు  కారణం.  అయితే  ఆమె లైంగికత్వంపై , ఆమె వ్యక్తిత్వంపై చేస్తున్న దాడి ఆమె ఒక్కరికే కాదు  అది సమస్త స్త్రీ జాతికీ వారు చేస్తున్న హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది.   మహిళల వ్యక్తిత్వాలను , స్వేచ్ఛను , హక్కులను అణచివేయడం, దౌర్జన్యం చేయడం , హింసను ప్రయోగించడం  ద్వారా మహిళలను నిస్సహాయుల్ని చేయడం ముందుకు వెళ్లకుండా చూడడం వారి లక్ష్యం .. ఆ కోవలో వచ్చిందే   ఆడవాళ్లు ఇంటిపనులకే పరిమితమై ఉంటే మంచిదని సాక్షాత్తూ రంగనాథ మిశ్రా అనే ప్రధాన న్యాయమూర్తి  ఓ సందర్భంలోఇచ్చిన  సలహా.
పురుషాధిపత్య భావజాలం పురుషులకే ఉంటుందనుకుంటాం కానీ మహిళల్లోనూ ఉంటుంది .  తమ చుట్టూ ఉన్న పురుషాధిక్య భావజాల ప్రపంచం నిర్ధేశించిన విధంగా తమ వ్యక్తిత్వాలను రూపొందించుకున్న మహిళలు ..తమను తాము తక్కువ గానే భావిస్తుంటారు .

కాలం మారినా  అన్ని ప్రాంతాల్లోనూ  అన్ని మతాల్లోనూ పితృస్వామ్య అవలక్షణాలు , పురుషాధిక్యత నేటికీ సజీవంగానే … హిందూ , ఇస్లాం , క్రైస్తవం  ఏమతంలో చూసినా స్త్రీ పట్ల చిన్నచూపే.  పితృస్వామ్యం పెట్టుబడిదారీ వ్యవస్థకి మూలం .  వీటివెనుక పెత్తందారీ వ్యవస్థలోని రాజకీయాంశాలు ముడివడి ఉన్నాయి

అయితే ,  ఆనాటినుండీ ఈనాటి వరకూ ఆమె స్త్రీత్వంపై  వ్యక్తిత్వంపై ఎన్ని దాడులు  జరిగినా, ఎంత జుగుప్సాకరంగా తెగబడ్డా మహిళ వెనుకంజ వెయ్యలేదు  అన్నిటినీ ఎదుర్కొంటూ మరింత బలం పుంజుకుంటూ  ముందుకు సాగుతూనే ఉంది.   కులం , మతం  పితృస్వామ్యం బలంగా సమర్ధిస్తూ నిర్ధేశించిన చట్రంలోంచి నేటి మహిళ  బయటికి వచ్చి  సామాజిక సరిహద్దుల్ని చెరిపేస్తూ తమ కలల్ని , కోరికలను నెరవేర్చుకుంటూ సమభాగస్వామ్యం కోసం ఉద్యమిస్తూనే ఉంది.  అవసరమైన సందర్భాల్లో తన అభిప్రాయాలు నిర్భయంగా వెల్లడిస్తూ ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉంది .  సమాజంతో యుద్ధం చేస్తూనే  ఉంది .
వి. శాంతి ప్రబోధ
Published in August, 2018 Matruka ,

Tag Cloud

%d bloggers like this: