The greatest WordPress.com site in all the land!

Archive for the ‘travellog’ Category

కొత్తలోకం చూపిన బ్లాక్ మార్కెట్స్ 

డిసెంబర్ 4వ తేదీ .

నేను బ్లాక్ మార్కెట్స్ కు  వెళ్లినరోజు .

బ్లాక్ మార్కెట్ అంటే నల్ల ధనపు లేదా దొంగడబ్బు మార్కెట్లు అనుకునేరు  .
నల్లవారి మార్కెట్లు .  అయితే  అక్కడ అంతా నల్లవారే కనబడరు .  నల్లవారు అంటారు కానీ వారంతా నలుపు రంగులో ఉండరు . వారి పూర్వికులది నలుపు రంగే కావచ్చు . కానీ ఇప్పుడన్ని రంగుల్లోనూ కనిపిస్తారు . ఎప్పుడైతే వారి  అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడడం మొదలయిందో అప్పటి నుండి వారి రంగూ రూపు  మారడం మొదలయింది .  బ్లాక్ మార్కెట్స్ లోకి వెళ్లేముందు వాళ్ళ చరిత్ర ఏంటో విహంగ వీక్షణం చేద్దాం .

ఒకప్పుడు ఆ భూభాగమంతా వారిదే.  ఏ సమూహానికి ఆ సమూహం వారి పరిసరాలు , భౌగోళికంగా ఉన్న పరిస్థితులు  అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా వారి సంస్కృతి ఆచార వ్యవహారాలు రూపొందించుకున్నారు .  ఆదిమ మానవుడు పుట్టిన దక్షిణాఫ్రికా నుండి  అన్వేషణలో ఆసియా దేశాల మీదుగా 60 మైళ్ళు ప్రయాణించి ఇప్పటి వెస్ట్రన్ ఆస్ట్రేలియా భుభాగం చేరారట . అలా వచ్చిన వీరు  ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని రక్షిస్తూ ప్రకృతితో మమేకమై సహజీవనం చేశారు.
కానీ ఇప్పుడు ఆ భూభాగమంతా వారిది కాదు . వారి జనాభా 3% పడిపోయింది . 50 నుండి  65 వేల (ఆంత్రోపాలజిస్టులు కొందరు 50 వేలని , కొందరు 65 వేల ఏళ్ళని రకరకాలుగా చెప్తున్నారు . ఏదేమైనా 50 వేల ఏళ్ళక్రితమే మానవుడు నిరంతర అన్వేషి అని తెలుపుతూ  మానవుల పుట్టినిల్లయిన ఆఫ్రికా ఖండం నుండి ఖండాంతరాలలోకి మొదట వలసలు ప్రారంభం చేసి  ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి బాటలువేసింది వీరే.
న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని పెన్ రిత్ సమీపంలో 1971 ముందు మట్టిదిబ్బలలో లభ్యమైన   రాతి పనిముట్లు  50 వేల ఏళ్ల  క్రితం ఉన్న మూలవాసులవిగా గుర్తించారు .
 ఆస్ట్రేలియాలోని మూలవాసుల బంధువులే మొట్టమొదటి వాస్తవమైన మానవ అన్వేషులు . మన పూర్వీకులు ప్రపంచమంటే భయపడుతూ ఉన్న సమయంలోనే వీరు అసాధారణంగా సముద్రమార్గంలో ఆసియా వరకు ప్రయాణించారు ” విల్లెర్స్ లేవ్ , కోపెన్ హెగెన్ యూనివర్సిటీ , డెన్మార్క్ కు చెందిన పరిశోధకుని అభిప్రాయం
ఆస్ట్రేలియా , పపువా న్యూ గినియా దీవుల్లో  ల్లో నివసిస్తున్న జనాభా డిఎన్ఏ పరీక్షచేసిన తర్వాత ప్రాచీన మానవుని జీవన యానాన్ని పసిగట్టారు . వారే సముద్రాన్ని దాటిన మొదటి మానవులని విశ్లేషించారు .
వారెవరో కాదు అబోరిజినల్స్ .. అంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ . ఒకప్పుడు 270 నేటివ్ ఆస్ట్రేలియన్ భాషలతో విలసిల్లిన నేలపై ఇప్పుడు 145 మాత్రమే ఉంటే, అందులో 18 భాషలు మాత్రమే వాడకంలో ఉన్నాయి . అంటే కుటుంబంలో అందరూ మాట్లాడేవి . మిగతా భాషలు కొద్దిమంది  ముసలీ ముతకా తప్ప మిగతా కుటుంబ సభ్యులు మాట్లాడరు.  50 వేల ఏళ్ళకి తక్కువ కాని ఘనచరిత్ర కలిగిన మూలవాసుల సంస్కృతి ఆచారవ్యవహారాలు, భాషలు , జ్ఞానసంపద , వనరులు ,వారి జీవనం అన్నీ ఆపదలో ఉన్నాయి . ఆ విషయాన్ని గమనించి తమ తాతముత్తాతలు తిరుగాడిన తావుల్ని , నింగిని , నేలని మాత్రమే కాదు వారి అందించిన అపారజ్ఞానాన్ని, కళలని , నైపుణ్యాలని పదిలపరుచుకోవాలని నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు భావిస్తున్నారు.  అందుకు తగిన కృషి చేస్తున్నారు .
నేను అబోరిజన్స్ ని కలవాలనుకోవడానికి కారణం ఏమిటంటే .. 
అబోరిజినల్స్ ని కలవాలని నేను సిడ్నీ వచ్చిన దగ్గర నుండి అనుకుంటూనే ఉన్నాను .  కారణం , బ్లాక్ టౌన్ హాస్పిటల్ ఉద్యోగాల్లో మిగతా ఆస్ట్రేలియన్స్  లాగే అబోరిజినల్స్ ని కూడా సమానంగా చూస్తామని ప్రత్యేకంగా తెలుపుతూ రాసిన దాన్ని చదివాను .   అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.   అదే  అడిగాను.  మా వాళ్లేమో ,  ఆమ్మో అబోరిజినల్స్ చాలా అగ్రెసివ్ అట అన్నారు.  కొందరు ఆస్ట్రేలియన్లని అడిగితే వాళ్ళు మూలవాసుల గురించి మాట్లాడ్డానికే ఇష్టపడలేదు .   వాళ్ళని హాస్పిటల్ లో , షాపింగ్ మాల్స్ లో, మార్కెట్ ప్రదేశాల్లో , స్టేషన్స్ ఎక్కడబడితే అక్కడ  చాలా చోట్ల చూశాను . వాళ్ళు ఖచ్చితంగా అబోరిజినల్స్ అని చెప్పలేను . మాట్లాడి తెలుసుకునే  అవకాశం లేదు .  మాట్లాడినా మాములు విషయాలు మాట్లాడగలం కానీ వారి పూర్వీకుల గురించి గానీ , మీరు అబోరిజనల్సా అని గానీ సూటిగా  అడగలేం కదా .. అసలు అలా అడగకూడదు కూడాను.  అడిగితే ఇక్కడ చాలా పెద్దతప్పు .  వివక్ష చూపిస్తున్నారని , లేదా వాళ్ళని వేలెత్తి చూపుతున్నారనో మీద కేసు పెట్టినా పెడతారు అన్నారు మావాళ్ళు.    మనదేశంలో లాగా ఇక్కడ అట్రాసిటీస్ ఆక్ట్ ఉందేమో అనుకున్నా .  మనం అడిగేది అర్ధం చేసుకోలేక పోయినా, మనం సరిగ్గా అడగలేక పోయినా ఇబ్బందే అని గమ్మున ఉన్నా.   వారిని మాత్రం పలకరించలేదు కానీ రోజు రోజుకీ వారిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి , తపన పెరిగిపోయింది .
చివరికి  కలవడం కోసం బ్లూ మౌంటెన్స్ దగ్గర ఉన్న అబోరిజినల్ హెరిటేజ్ టూర్ కి వెళ్లిరావాలని అనుకున్నాం .  కానీ అంతలో బ్లాక్ మార్కెట్ గురించి తెలిసింది .  డిసెంబర్ 4 బ్లాక్ మార్కెట్ డే (నల్ల వాళ్ళ లేదా అబోరిజినల్ ).  ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ మార్కెట్ అంటే మన అంగడి లేదా సంత లాంటిది నిర్వహిస్తారు. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో జరుగుతుంది .  ఆయా తెగల ప్రజలు అంతా కలసి ఓ చోట చేరి తమ నైపుణ్యాలని , కళల్ని , జ్ఞానాన్ని , సంస్కృతిని, ఆహారాన్ని , వైవిధ్యభరితమైన జీవితాన్ని  మనకు పరిచయం చేస్తారు . ( మనకు నచ్చిన వాటిని మనం కొనుక్కోవచ్చు ).  విషయం తెలవగానే వాళ్ళని కలవడానికి ఇంతకంటే మంచి అవకాశం నా ఈ పర్యటనలో రాదనుకున్నా .  ఆ రోజు ఎన్నిపనులున్నా వెళ్లాలని నిశ్చయం జరిగిపోయింది .
 2013 నుండి బ్లాక్ మార్కెట్స్ ని నిర్వహిస్తోంది ఫస్ట్ హ్యాండ్ సొల్యూషన్స్ అబోరిజల్స్ కార్పొరేషన్ .  ఆపదలో లేదా రిస్క్ లో ఉన్న యువతని ఆదుకోవడం కోసం ఈ ఫండ్ ఉపయోగిస్తారట .  బోటనీ బే తీరంలోని లే పెరౌస్ లో ఈ సంస్థ కార్యాలయం , మ్యూజియం ఉన్నాయి . దీన్ని అబోరిజినల్స్ బిజినెస్ సెంటర్ అనొచ్చు .  ఇక్కడనుండి బేర్ ఐలాండ్ కి టూర్లు నిర్వహిస్తుంటారు .  అబోరిజినల్ రోల్ మోడల్స్ ని యువతకి పరిచయం చేస్తారు . యువతలో లీడర్ షిప్ పెంచడం , పబ్లిక్ తో మాట్లాడడం వంటి జీవన నైపుణ్యాలు అందిస్తున్నారు.   వాటితోపాటే బ్లాక్ మార్కెట్స్ నిర్వహణ .  మొదట్లో ప్రతినెలా నిర్వహించినప్పటికీ 2015 నుండి ప్రతి మూడునెలలకొకసారి నిర్వహిస్తున్నారు .   ఆయా స్టాల్స్ లో తాయారు చేసిన వస్తువులుకొని అబోరిజినల్ యువతను ప్రోత్సహించమని చెప్తుంది ఆ సంస్థ .
“మా పూర్వీకుల వారసత్వ జ్ఞానం విపత్కర పరిస్థితుల్లో కొట్టుకిట్టాడుతోంది . వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాదే “  అంటాడు ఫస్ట్ హ్యాండ్ సోలుషన్స్ డైరెక్టర్ పీటర్ కూలీ .
ఆధునిక ఆస్ట్రేలియా పుట్టింది లే పెరౌస్ లోనే .  అంటే ఆస్ట్రేలియాని కనుగొన్న  కెప్టెన్ కుక్ 1770లో మొదట అడుగుపెట్టింది ఈనేలపైనే.  ఆ తర్వాతే బ్రిటిష్ వారి కాలనీలు 1788లో వెలిశాయి =. స్థానికులైన ఆస్ట్రేలియన్ల భూముల్ని , వనరుల్ని దురాక్రమించడంతో పాటు వేల ఏళ్ల సంవత్సరాలుగా నివసిస్తున్న వారి జీవనాన్ని , తరతరాలుగా పొందిన జ్ఞానాన్ని, రూపొందిచుకున్న సంస్కృతిని , భాషల్ని, చరిత్రని సర్వనాశనంచేశారు  జాత్యాహంకారులు . తమ నేలపై తాము పరాయివారుగా తిరుగాడుతూ వివక్షతో బతుకీడ్చడం కాదు.  కోల్పోతున్న తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం తమ పూర్వీకులు కొందరు జాత్యహంకారులపై పోరాడారు .  వారి స్పూర్తితో హక్కుల్ని,  సంస్కృతిని పునరుజ్జివింపచేసుకుంటూ తమ వారసత్వసంపదని కాపాడుకుంటూ ఏకీకృతం అవుతున్నారు నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు . అందులో భాగంగా ఏర్పడిందే బ్లాక్ మార్కెట్ ..
పదండి అలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్లి చూసోద్దాం 
మేముండే బ్లాక్ టౌన్ నుండి బారంగారో రిజర్వ్ లో ఉన్న బ్లాక్ మార్కెట్స్కి కారులో వెళ్లడం కంటే ట్రైన్ లో వెళ్లడం మంచిది అనుకున్నాం .( కారులో వెళ్తే పార్కింగ్ వెతుక్కోవాలని ) .  బస్సు , ఫెర్రీ సౌకర్యం కూడా ఉంది .  ఏది ఎక్కినా opeal కార్డు స్వైప్ చేయడమే .  ప్రయాణ సదుపాయం చాలా బాగుంది .   బారంగారో రిజర్వ్ టౌన్ హాల్ కి , సిడ్నీ హార్బరుకి దగ్గరలో ఉంది . వెతుక్కునే పనిలేకుండా సులభంగానే వెళ్లిపోయాం.
ఉదయం 9. 30 కే బ్లాక్ మార్కెట్స్ లో దుకాణాలు తెరిచారు .  హిక్సన్ రోడ్డులోని  బారంగారో రిజర్వు లోని బ్లాక్  మార్కెట్స్  చాలా సందడిగా కనిపిస్తున్నాయి .  చుట్టూ స్టాల్స్ 30 పైగా ఉన్నాయి  మధ్యలో ఉన్న ఖాళీలో  ఇసుకపోసి ఉంది .  అందులో సాంప్రదాయ నృత్యాలు సాగుతున్నాయి . చుట్టూ జనం గుమి గూడి చూస్తున్నారు .  Ngaran Ngaran డాన్స్ ట్రూప్ వారి ఆధ్వర్యంలో ఆ నృత్య ప్రదర్శన జరిగుతోంది.  మైకులోంచి ఆ నృత్య రీతిని వివరిస్తున్నారు .  వారి డాన్సు చూస్తుంటే నాకు ఆదిలాబాద్ గిరిజనులు చేసిన గుస్సాడీ , చత్తిస్గఢ్ గిరిజనుల మోరియా నృత్యాలు గుర్తొచ్చాయి .  ఆహార్యం ఒకేలా లేకపోవచ్చు గానీ కాళ్ళు చేతుల కదలికలు ఒకేలా అనిపించాయి .  వీవర్స్ చేసే నృత్యం , ఫిషింగ్ కమ్యూనిటీ చేసే నృత్యం , వేటాడేవారి నృత్యం ఇలా వారు చేసే పనులను బట్టి వారి నృత్యాలు ఉన్నాయి . ఆ ట్రూపులో ఉన్న చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు . ఆ విషయమే అడిగినప్పుడు-  ఆదిమ కాలంనాటి వారి నృత్యం కనుమరుగై పోతున్న నేపథ్యంలో అది కాపాడుకోవడానికి వారసత్వ సంపదగా ముందు తరాలకు అందించడం కోసం ఇప్పటి తరానికి తమ పూర్వీకుల సనాతన నృత్యాన్ని నేర్పుతున్నామని చెప్పాడు ఆ ట్రూప్ లీడర్ మాక్స్ హారిసన్ .  నాకు వాళ్ళ నృత్య రీతులు చూశాక కలిగిన భావాన్ని వారితో పంచుకున్నప్పుడు ‘ఇండియాకు మాకు కొన్ని పోలికలు ఉంటాయట’ అన్నాడు ట్రే పార్సన్ అనే మరో కళాకారుడు .
ఏ స్టాల్ నుండి చూడ్డం మొదలు పెడదామా అనుకుంటూ  మొదటి స్టాల్ దగ్గరకి వెళ్ళాం .  అక్కడ ఆదిమ జాతుల గురించి సమాచారం చాలా ఉంది . దాంతో ఆసక్తి ఉన్నవారు అబోరిజినల్ కల్చరల్ టూర్ చూసే ఏర్పాటు ఉందని చెప్పారు .  వెంటనే మేమూ మా పేర్లు రిజిస్టర్ చేసుకున్నాం . 11 గంటలకు ఆ టూర్ మొదలయింది .  బారంగారో రిజర్వ్ లో దాదాపు గంటసేపు సాగింది మా టూర్ . ఆదిమకాలంనాటి వీవర్స్ కమ్యూనిటీ కి చెందిన జెస్సికా మాకు గైడ్ గా వచ్చింది . ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ లో పనిచేస్తోంది (సెలవుల్లో తమ జాతి ఉన్నతి కోసం సేవలు అందిస్తూ ఉంటుందట. మరో సందర్భంలో అడిగిన ఓప్రశ్నకు జవాబుగా చెప్పింది ).  ఆవిడతో కలసి మాతో పాటు జపాన్ , చైనా , ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశస్తులతో పాటు కొంతమంది యూరోపియన్ దేశాల వారు కూడా వచ్చారు .
బారంగారో కొండ అంచున నడుస్తూ , ఆగుతూ ఆమె చెప్పిన విషయాలు ఇవే . 1788లో 1100 మంది నేరస్థులు , మరో రొండొందలమంది సిబ్బందితో మొదటి యూరోపియన్ కాలనీ వెలిసిన సమయంలో క్యాంమెరగల్ , కడిగళ్  జాతి బారంగారో లో ఉండేది . ఆ సమయంలో దాదాపు 1500 జనాభా  బోటనీ బే నుండి బ్రోకెన్ బే వరకూ ఉన్న సిడ్నీ తీరప్రాంతంలో చిన్న చిన్న సమూహాలుగా  నివసించేవారని గవర్నర్ ఆర్థర్ ఫిలిప్ అంచనా . పారామట్టా నదిలోనో , సముద్రంలో చెట్టు బెరడుతో చేసిన తెప్పలపై తిరిగి చేపలు పట్టడం , వేటాడడం , వండుకోవడం , తినడం ఇదీ వారి దినచర్య.
యూరోపియన్ సెటిల్మెంట్ తర్వాత కూడా కొంతకాలం అబోరిజినల్స్ కి , వలసవచ్చిన తెల్లవాళ్లకి డార్లింగ్ హార్బర్ సమీపంలో సముద్రపు కాకల్స్ అనే గవ్వలు  , ఆయిస్టర్ లు ప్రధాన వనరుగా ఉండేవి . బ్రిటిష్ కాలనీలతో పాటే వచ్చిన మశూచి చాలామంది మూలవాసుల్ని మింగేసింది . దాంతో వారు తమ నివాసాల్ని శ్వేతజాతీయులకి దూరంగా ఏర్పాటు చేసుకున్నారు .  కాలనీలు పెరిగాయి . 1900 నాటికి సిడ్నీ హార్బర్ నుండి ప్రధాన వ్యాపార కేంద్రంగా మారింది . న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇరవయ్యో శతాబ్దం నుండి ఇరవయ్యో శతాబ్దంలోకి మాత్రమే కాదు ప్రపంచంలోని  అత్యాధునిక నగరాల్లో ఒకటిగా  ఈ ప్రాంతపు రూపురేఖలు మారిపోయాయి .  అభివృద్ధిని మేం కాదనడంలేదు . కానీ మా అస్తిత్వాల్ని, మా వారసత్వ సాంస్కృతిక సంపదను మేం కోల్పోవడానికి సిద్ధంగా లేం. ఇప్పటికే మాకు తీరని నష్టం జరిగింది అని స్పష్టం చేసింది జెస్సికా  ఓ ప్రశ్నకు సమాధానంగా .
బ్రిటిష్ కాలనీలు వెలసిన కొత్తలో “బారంగారో” అనే  చేపలు పట్టే ఓ శక్తివంతమైన మూలవాసీ మహిళ ఉండేది.  ఆమె  తెల్ల జాతీయుడైన అధికారికి ఒకే రోజు  200 వందల చేపలు ఇచ్చిందట. అందుకే అతను ఆ ప్రాంతానికి ఆమె పేరుపెట్టాడట.  మూలజాతుల వారు పెట్టుకున్న పేర్ల స్థానంలో ఇంగ్లీషు వారి ఊరి పేర్లు , పట్టణాల పేర్లు కనిపిస్తాయి .  సిడ్నీ మహానగరం ఉన్న న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం పేరు కూడా యూరోపియన్లు మొదట వచ్చి రాగానే తామున్న ప్రాంతానికి న్యూ సౌత్ వేల్స్ అని పేరు పెట్టారట . అదే విధంగా ఆస్ట్రేలియాలో పేర్లన్నీ మార్చేశారు. కొద్ది తప్ప. బ్రిటిష్ వారితో స్థానిక ఆస్త్రేలియాన్స్ కి ఉన్న సంబంధాలను బట్టి అక్కడక్కడా ఇప్పటికీ అబోరిజినల్స్ పేర్లు కనిపిస్తాయి.   బారంగారో కొండకి ఒక వైపు అంతా నీరు మరో వైపు భూభాగం .  ఆ కొండపై 75,858 రకాల మొక్కలు పెరుగుతున్నాయి . అవన్నీ కూడా సిడ్నీ ప్రాంతంలో పెరిగే మొక్కలూ , చెట్లూ .  అవి బ్రిటిష్ కాలనీలు రాకముందూ – వచ్చిన తర్వాత మా  జాతీయుల చరిత్రలు చెబుతాయి అంటుంది జెస్సికా . అక్కడ  కనిపించే గడ్డిని చూపి దీనితో మా పూర్వీకులు తమ అవసరాలకు కావాల్సిన పాత్రలు , సంచులు , బుట్టలు తాయారు చేసుకునేవారు . ఆ గడ్డి గెలలు వచ్చాక ఆ గెలనుండి వచ్చే నారతో నులక నేసి మంచాలకు చుట్టేవారు.  చెట్టు బెరడు ఎన్నో విధాలుగా వాడేవారు . నార, పీచు , పళ్ళు , ఫలాలు , వాటి గింజలు , దుంపలు ప్రతిదీ తమచుట్టూ ఉన్న అడవినుండి తమ అవసరాలకు మాత్రమే తెచ్చుకునేవారు . చెట్లను నరకడం మా పూర్వీకులకు తెలియదు . వాళ్ళు చెట్టు మొదలు నుండి పైకి  నిలువుగా ఒక గాటు పెట్టి  బెరడు తొలిచేవారు .  ఆ బెరడును చాలా రకాలుగా అవసరాలకు మలుచుకునేవారు . ఎన్నెనో ఔషధమొక్కలున్నాయి  ఈ కొండపై అంటూ మాకు వివరించింది .  తను మాకు చూపిన గడ్డితో చేసిన బాగ్ లోంచి తీసి తమ పూర్వీకులు వాడిన పరికరాలు , వస్తువులు చూపింది .
అదే విధంగా కనిపించే ఆ నీటిలో ఎంతో చరిత్ర సమాధి అయింది .   అనూహ్య వాతావరణ పరిస్థితుల్లో సముద్రపు నీటిమట్టం పెరిగి అప్పుడున్న జనాభాతో పాటు రాతిని తొలిచి చేసుకున్న వారి నివాసాలు , సొరంగ మార్గాలు జల సమాధి అయ్యాయి . ఇక్కడ దొరికే ఈ ఇసుక రాళ్ళూ , నత్తలు , గవ్వలు , చేప పొలుసులు అన్నీ మూలవాసుల ఆనవాళ్ళని , ఆనాటి చరిత్రని పట్టిస్తాయి అని ఎంతో ఉద్వేగంగా చెప్పిందామె .
కొద్దీ దూరంలో అంటే 500 మీటర్ల దూరంలో కనిపిస్తున్న ఆకాశహార్మ్యాలను చూపుతూ అభివృద్ధి దృష్టి ఎప్పుడూ మా స్థలాలపైనే .. అటుచూడండి ఆ కట్టడాలన్నీ అబోరిజినల్స్ స్థలాల్లోనే జరిగేది . మేం గట్టిగా అడ్డుకుంటున్నాం . అయితే మా జనాభా తక్కువ . ఉన్నవాళ్లు కూడా ఎక్కడెక్కడో ఎవరికి వారుగా ఉన్నారు . అందరం సంఘటితమయ్యి మా సమస్యలని ఎదుర్కొంటూ పోరాడడమే కాదు మా హక్కుల్నీ కాపాడుకోవడం కోసం మిగతా వాళ్ళకంటే మేం మరింత కష్టపడాల్సి వస్తోంది  అంటుందా మూలవాసీ మహిళ .
ఒక్క బారంగారో లోనో , సిడ్నీ లోనో , న్యూసౌత్ వేల్స్ లోనో మాత్రమే కాదు దేశమంతా అబోరిజినల్స్ టోర్రెస్ స్ట్రైట్ ఐలాండర్స్ పరిస్థితి ఇదే  అంటూ వివరించింది జెస్సికా . మధ్య మధ్యలో మేం అడిగే ప్రశ్నలకు , సందేహాలకు ఓపిగ్గా జవాబు చెప్పింది . ఇప్పటికీ ఈ దేశంలో మా పట్ల వివక్ష ఉంది . విద్య , ఆరోగ్యం , ఉద్యోగం,  అన్ని చోట్లా వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పింది . అందుకు సంబంధించిన వివరాలు మరోచోట ప్రస్తావిస్తాను .  అదే విధంగా  స్టోలెన్  జనరేషన్స్ గురించి విన్నానన్నపుడు జెస్సికా చాలా ఉద్వేగానికి గురయింది . అవును , ఇప్పటికీ తమ కుటుంబాన్ని కలుసుకోలేని పిల్లలూ , పిల్లల్ని కలవలేని తల్లిదండ్రులు కొల్లలు .  ఇలాంటి మార్కెట్స్లోనో , మీట్స్ లోనో , ఉత్సవాల్లోనో కలిసినప్పుడు తమవారెవరైనా కనిపిస్తారేమోనని వారి  పేర్లను బట్టి బంధుత్వాలు వెతుక్కుంటూ ఉంటారు . (స్టోలెన్ జనరేషన్స్ గురించి మరో సందర్భంలో మాట్లాడుకుందాం . ) అని చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది .
అలా ఓ గంట నడకతో సాగిన ఆ టూర్ అయ్యేసరికి కడుపులో కొద్దిగా ఆకలి మొదలయింది .  మేం ఇంటినుండి తెచ్చుకున్న పదార్ధాలున్నప్పటికీ అక్కడున్న ఫుడ్ స్టాల్స్ వైపు చూశాము .  మూలవాసులు ఏమి తినేవారో ఆ ఆహార పదార్ధాలు అక్కడ కనిపించాయి .  ఈము పక్షి మాంసం , కంగారూ ల మాంసం పుల్లలకు గుచ్చి నిప్పులపై కాల్చి (ఇప్పుడు మనం అనే BBQ ) చేపలు , పీతలు,  వోయిస్టర్ చెరుకు ఆకులాంటి ఓ ఆకులో చుట్టి కాలుస్తున్నారు .  నత్తలు , ఆల్చిప్పలు ఒలిచి అరటి మొక్క పొరల్లాంటి పొరల్లో చుట్టి కొద్దిగా కాల్చి ఇస్తున్నారు .  ఒకరకం నీచు వాసన .  ఉప్పు కారం మసాలా  లాంటివేమీ లేకుండా  ఎలా తినేవారో అలా ..
మేం ఈము మాంసం తో చేసిన స్కీవర్స్ తీసుకున్నాం .
నేటివ్ అబోరిజినల్స్ జీవిత వీర గాథలు చెప్పింది టకీ కూలీ అనే మహిళ.   ఆ తర్వాత ఆ మహిళ పామిస్ట్రీ చెప్తోంది.  ఒక్కక్కరి నుండి $10, 20, 30 తీసుకొంది. తమ హస్త రేఖలను బట్టి , ముఖ కవళికలను బట్టి ఆమె జాతకం చెప్తోంది . చాలా మంది క్యూ లో కనిపించారు.
అద్భుతమైన కళా నైపుణ్యాలు వారివి . రేగు పండ్ల గింజల్లాంటి గింజలతో వారు చేసిన ఓ  ఆభరణం నా మనసుని బాగా ఆకట్టుకుంది. కొందామనుకున్నాను కానీ అది అప్పటికే అమ్మేశానని చెప్పింది నిర్వాహకురాలు .   మా పూర్వీకులు రంగులు వాడేవారు కాదు . మేం వాడుతున్నాం అని చెప్పింది మేరీ . ఆవిడ ఆర్ట్స్ స్టూడెంట్ ననీ బహుశా వచ్చే ఏడాది ఇండియా వస్తానని చెప్పింది . అయితే ఇండియాలో ఏ యూనివర్సిటీ కి వచ్చేది తెలియదట . కల్చరల్ ఎక్స్చేంజి ప్రోగ్రాంలో భాగంగా వస్తానని చెప్పింది . దాదాపు 50 ఏళ్ల వయసులో ఉన్నావిడ ఇప్పుడు ఈ వయస్సులో యూనివర్సిటీ కి వెళ్లి చదువుతున్నందుకు అభినందించాను . ఆవిడ నవ్వుతూ   మేం చదువుల్లోకి వెళ్ళేది చాలా ఆలస్యంగా .  నాన్ అబోరిజినల్స్ కి ఉన్న అవకాశాలు మాకు లేవు . మేం అవతలి వారి నుండి ఎగతాళి ఎదుర్కొంటూ పై చదువులకు రావడం సాహసమే అని చెప్పింది .  అందుకే కాలేజీల్లో ,యూనివర్సిటీ లో మిగతా వాళ్ళకంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ వయసులో పెద్దవాళ్ళయి ఉంటారు అంటూ కొబ్బరి పూసలతో  బ్రేస్ లెట్ తాయారు చేస్తూ  వివరించింది .  ఇంకా ఎదో మాట్లాడ బోతుండగా కస్టమర్స్ రావడంతో బిజీ అయిపొయింది .  వాళ్ళతో చాలా చాలా మాట్లాడాలి . ఎంతో తెలుసుకోవాలన్న ఉత్సాహం నాది . కానీ వాళ్ళకి ఉన్న సమయం ఉదయం 9. 30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే . అంతలోనే తమ వస్తువులు వీలయినంత ఎక్కువ అమ్మి సొమ్ము చేసుకోవాలన్న తాపత్రయం .  అలా వాళ్ళు తాయారు చేసిన హస్త కళలు , ప్రకృతి సహజమైన వస్తువులతో తాయారు చేసిన సబ్బులు , షాంపూలు , పురుగుమందులు , కొన్ని రకాల మందులు  ఒక స్టాల్లోఉంటే మరో స్టాల్ లో కిందరగార్డెన్ స్కూల్ పిల్లలకోసం స్టడీలెర్నింగ్ మెటీరియల్ అతి తక్కువ ధరల్లో .  ఒక స్టాల్ లో పురాతన ఆస్ట్రేలియన్ వాడిన సామగ్రి ,పనిముట్లు ,వాళ్లకు సంబంధించిన ఫోటోలు, ఆర్ట్ , వగైరాలతో పాటు ఆస్ట్రేలియా దేశంలో ఆదిమ మానవుడు నివసించిన రాతి గుహలు , సొరంగాలు , వారి పవిత్ర స్థలాలు, ఆదిమ కాలంనాటి మానవుల శిలాజాలు , జంతువుల శిలాజాలు వంటివన్నీ చూపడానికి ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీల వివరాలు ..  మందమైన నారవంటి బట్టపై ప్రాధమిక రంగులతో వేసిన కళాకృతులు , పెయింటింగ్స్, మనం ఎందుకూ పనికిరావని పడేసే షెల్స్ , సీడ్స్  తో ఎన్నో ఎన్నెన్నో .. కళాకృతులు , ఆభరణాలు . అద్భుతంగా ..
ఒక స్టాల్ లో పురాతన నేటివ్ ఆస్ట్రేలియన్ వాడిన పనిముట్లు, సామాగ్రి, ఇతర వస్తువులతో పాటు వాళ్ళు కప్పుకున్న గొంగళి కనిపించింది . ఆ స్టాల్ నిర్వాహకుడు జోసెఫ్  ఆ గొంగళి గురించి చెప్పాడు . ఆదిమ మానవులు బిడ్డ పుట్టిన తర్వాత కూలమన్  (అంటే దోనె ఆకారంలో ఉన్న చెట్టు బెరడు )లో గొర్రె ఉన్నితోలు వేసి ఆ బిడ్డను పడుకోబెట్టి అదే కప్పేవారట . ఎటన్నా పోయినా అట్లాగే  తీసుకెళ్లేవారట .  అలా బిడ్డ పెరిగిన కొద్దీ ఆ ఉన్ని ముక్కకి మరో ముక్క అతికేవారట . అలా ఆ బిడ్డ పెద్దయ్యేసరికి పెద్ద గొంగళి అయ్యేదట . అలా అతుకులు అతుకులుగా ఉన్న గొంగళి భలే ఉంది . కూలమన్ ను వంట పాత్రగాను , వస్తువులు వేసుకునే పాత్రగాను  ఎన్నోరకాలుగా వాడేవారట .  మహిళలయినా , పురుషులయినా వాళ్ళ చేతిలో చేతికర్ర కన్నా చిన్నదిగా సూదంటు మొనతో ఉన్న కర్ర ఉండేదట . అది వారిని వారు కాపాడుకోవడం కోసం , కందమూలాలు తవ్వుకోవడం కోసం వంటి వివిధ పనులకోసం వాడేవారు . అలా వారి వస్తువులు , పనిముట్లు ఒకటి కంటే ఎక్కువ పనులకోసం ఉపయోగించేవారు .
ఉదయం 9. నుండీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నారతో వివిధ రకాల వస్తువులు , సముద్రంలో దొరికే వివిధ రకాల గవ్వలతో వస్తువులు , అలంకరణ సామాగ్రి తాయారు చేయడం , అదే విధంగా ఆభరణాలు తాయారు చేయడం , పెయింటింగ్స్ , వంటి వర్క్ షాప్స్ కొనసాగాయి .  95 సంవత్సరాల మహిళ ఎంతో ఉత్సాహంతో ఓ స్టాల్ లో కనిపించింది తన కూతురితో పాటు . ఆమె తాను నేర్చుకున్న పూర్వీకుల జ్ఞానాన్ని వారసత్వంగా తరువాతి తరాలకు అందించే ప్రతినిధిగా అక్కడ కనిపించడం అపురూపంగా తోచింది .
ఓ పక్క ఎండ మండుతున్నా వచ్చే జనం పోయే జనంతో కిటకిటలాడాయి బ్లాక్ మార్కెట్స్ .  అక్కడ వారు చాలా షాపింగ్ చేశారు . మేం మాత్రం ఓ కొత్త లోకంలోకి వెళ్ళివచ్చినట్లుగా భావించాం .  మనకు తెలియని మూలవాసుల జీవితాల గురించి ఆలోచిస్తూ తిరుగు ముఖంపట్టాం.
ఆస్ట్రేలియా పర్యటించేవారు ఓపెరా హౌస్ , హార్బర్ బ్రిడ్జి, స్కైటవర్  వంటివి చూడ్డమే కాదు అబోరిజినల్స్ జీవనానికి సంబంధించిన టూర్లు చేయొచ్చు . మూలవాసుల జీవనం గురించి ఎంతో తెలుసుకోవచ్చు .  అదే విధంగా అలలపై తేలియాడే చేపల్ని, నీటిఅడుగున ఉన్న సముద్రపు జీవాల్ని  గురించి తెలుసుకోవచ్చు.  చేపల్ని  వేటాడడం , వివిధ రకాల సముద్ర జీవుల్ని అక్కడే కాల్చుకు తినడం , బూమెరాంగ్ ఎలా విసరాలో నేర్చుకోవడం ,   మంచుయుగం , రాతియుగాల్లోను  జాత్యహంకారులు అడుగుపెట్టక ముందున్న నేటివ్ ఆస్ట్రేలియన్ల జీవనం , టెక్నాలజీ ని , వారి ఆర్ధిక వ్యవస్థని , మార్కెట్ పద్దతులను  తెలుసుకోవడం వంటివన్నీ మనకు కొత్త ఉత్సాహాన్నివ్వడమే కాదు జీవితంపై కొత్త అన్వేషణలకు పునాదులేస్తాయి .
ఆస్ట్రేలియాలో ఏ  మూలకు పోయినా ప్రాచీనచరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను తుడిచేసే ప్రయత్నమే ..  ఎతైన ఆకాశహర్మ్యాలు , స్కై టవర్స్, స్కైవేలు , ఫోర్ వేలు, మైనింగ్ ప్రాజెక్ట్స్ వంటి  మరెన్నో అభివృద్ధి పథకాల  కింద నలిగిపోయిన మూలవాసుల గుండె ఘోష వినిపిస్తూనే ఉంటుంది .  అతి పురాతనమైన చరిత్ర కలిగి కేవలం మూడుశాతం జనాభాగా మిగిలిన మూలవాసులు కోరుకునేదొకటే . అభివృద్ధి భూతం తమని మింగకూడదనే . ఇప్పటివరకూ జరగకూడని విధ్వంసం జరిగిపోయింది . ఇక  జరుగకూడదనే  వారి తపనంతా .   వారే కాదు ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ప్రజలు కోరుకునేది అదే కదా ..
వి . శాంతి ప్రబోధ
Published in Saranga 24 Dec, 2016

చిత్రకూటమి యాత్ర   ఓ రకంగా సాహసయాత్రే ..?!

అద్భుతమైన అందాలొలికే లోయలూ .. ఎత్తైన కొండలూ ..  సేలయేళ్లు .. జలపాతాలూ .. వాటి హోరూ ..
ఎటు చూసినా పచ్చా పచ్చని రంగు వివిధ షేడ్స్ తో .. కనులకి మనసుకి ఆనందం,  ఆహ్లాదం పంచుతూ  ..
ఎక్కడికో లాక్కుపోయే స్వచ్చ్చమైన గాలి ..  వాటిని అరకొర వసతుల మధ్య తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న అడవి మల్లెలు
వారే..ఈ నేలపై విరబూసిన ప్రకృతి బిడ్డలు .. ఆదివాసీలు . మూలవాసులు …
నవనాగరకతకు దూరంగా  ప్రకృతి సహజంగా బతికే  అడవి తల్లి బిడ్డలు .
కరెన్సీ రెపరెపలు .. అలవికాని సంపద కోసం రెపరెపలు తెలియని జీవులు ..
ప్రకృతి   తల్లి వొడిలో సంపన్నంగా బతికే  వాళ్ళే  నేటి  విధ్వంసక అభివృద్ధి కి తొలి నిర్వాసితులు
పెట్టుబడిదారీ సామ్రాజ్యకాంక్షకు బలవుతున్న ఆదివాసులు , మూలవాసుల బతుకుల్లో పచ్చదనం దూరమై చాలా ఏళ్ళయిపోయింది .  వాళ్ళ  జీవితాలు మండిపోతున్నాయి .  ఎండిపోతున్నాయి .  ప్రకృతి వినిపించే సంగీతపు స్థానంలో ఇనుపబూట్ల చప్పుళ్ళు , తుపాకీ గుళ్ల శబ్దం చొచ్చుకు వచ్చ్చేసింది .
స్వేచ్ఛగా చెట్టూ పుట్టా , కొండా కోన తిరిగే వాళ్ళ  కాళ్ళ  చుట్టూ ఆంక్షల ఇనుప గజ్జెలు చుట్టుకుని ఉన్నాయి .  కొండా కోనల్లో నిక్షిప్తమై ఉన్న అంతులేని ఖనిజ సంపదపై కొందరి కన్ను .    వాటిని కొల్లగొట్టి సొంతం చేసుకునేందుకు కదిపే పావులు .. అభివృద్ధి  ముసుగులో  జరిగిపోతున్న విపత్తు  .. విధ్వంసం అయిపోతున్న జీవితాలు .
అడవిబిడ్డలకు వెన్నుదన్నుగా నిలిచి మానవీయ సహాయం అందించే శక్తులూ ..  ఫలితం  నిర్విరామంగా .. నిర్బంధం .. కేసులు .. కుట్రలు ..
ప్రజాస్వామ్య ,  ప్రజాతంత్ర దేశంలో  తరతరాలుగా  తమదని నమ్ముకుని బతుకుతున్న వారిని మాయోపాయాలతో  జల్ జంగల్ జమీన్  నుండి తరిమేస్తుంటే .. మనుగడే  ప్రశ్నార్ధకమై  బిక్కు బిక్కు మంటున్న బతుకు వాళ్ళవి .. కనీసం వాళ్ళ  దగ్గరకు వెళ్లి నాలుగు మాటలు మాట్లాడలేని పరిస్థితి , పలుకరించి ధైర్యం చెప్పలేని దు స్థితి  నేడక్కడ  దాపురించింది.  కనిపించని  యుద్ధమేఘం కమ్మేసిన కారు మబ్బుల్లో వాళ్ళు …   ఇదంతా ఎక్కడో  అనుకునేరు . .. మన పొరుగునే .. ఛత్తిస్ గఢ్ లోనే .. దండకారణ్య ప్రాంతంలోనే .. అలాంటి అప్రకటిత యుద్ధ వాతావరణంలో అద్భుతమైన ప్రకృతిని   ఆస్వాదిస్తూ  సాగింది చిత్రకూటమి యాత్ర .
ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన బిడ్డలతో పాటు వారు నివసించే సుందర ప్రదేశాలను చూసేందుకు, వారి సామాజిక రాజకీయార్థిక పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు  బయలుదేరింది చిత్రకూటమి
చిత్రకూటమి అంటే …?
తన బలం తన రచయిత మిత్రులే అని గర్వంగా చెప్పుకునే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక -AP కార్యదర్శి   కెఎన్ మల్లీశ్వరి మదిలోంచి పుట్టుకొచ్చ్చిన  చిత్రమైన ఆలోచనకి సై అన్న మిత్రుల కార్యాచరణే చిత్రకూటమి .  గత మే నెలలో నవతరంతో యువతరం కార్యక్రమం అనంతరం ఇంకా ఏదో చేయాలన్న  తపనలోంచి ఉద్భవించిన ఆలోచనకి సంస్కృతి గ్లోబల్ స్కూల్ నిశాంత్ , మహిళచేతనకు చెందిన సామజిక కార్యకర్త  కత్తి పద్మ , తెలుగు రీడర్స్ క్లబ్ నిర్వాహకుడు అనిల్ బత్తుల , 10 టీవీ అక్షరం కార్యక్రమ జర్నలిస్టు  కిరణ్ చర్ల ఒక బృందంగా కార్యక్రమం రూపొందించారు .   ఆ తర్వాత  డా.మాటూరి శ్రీనివాస్ , నారాయణ వేణు గార్లు ఈ బృందానికి తమ సహాయ సహకారాలందిస్తే తెరవెనుక చందు శ్రీనివాస్ , సూర్రెడ్డి గార్లు పని చేశారు .  దాదాపు వారి మూడునెలల నిరంతర  శ్రమ ఫలితం చిత్రకూటమి యాత్ర .
నిజానికి ఈ యాత్ర తలపెట్టింది 30 మందితో  అనూహ్యంగా  ఎంతో మంది తమనూ యాత్రలో భాగస్వామం చేసుకొమ్మని కోరడంతో అది 65కి చేరింది. అయినా ఇంకా చాలామంది తమకు అవకాశం లేదే అని బాధపడడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది పిల్లలు , 45 మంది జర్నలిస్టులు , సామాజిక కార్యకర్తలు ,రచయితలతో విశాఖ తీరం నుండి చిత్రకూట్ జలపాతాల వరకూ ఆగష్టు 13 – 15 తేదీలలో చిత్రకూటమి యాత్ర జరిగింది.
యాత్ర అనుకున్న వెంటనే చిత్రకూటమి వాట్సాప్ గ్రూప్ చేసారు.  మల్లీశ్వరి , కత్తి పద్మ , నిశాంత్ , డా . మాటూరి శ్రీనివాస్ లతో కూడిన బృందం ముందుగా విశాఖ నుండి జలపాతాల వరకూ వెళ్లి అవసరమైన ఏర్పాట్లు చేశారు . అదే సమయంలో జగదల్పూర్ లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త బేలా భాటియాను , కొందరు జర్నలిస్టు మిత్రులను , ఆదివాసీలను కలిసి కార్యక్రమం రూపొందించారు .
ఎవరికి వాళ్ళు   చిత్రకూటమి యాత్ర కోసం ఆత్రుతతో ఎదురుచూపులు కదా ..  చిత్రకూటమి వాట్సాప్ గ్రూప్ లో మమ్మల్ని ఊరిస్తూ మల్లీశ్వరి , కత్త్తి పద్మల పోస్టులకు తోడు నారాయణ వేణు గారి పోస్టులు , ఫోటోలు , సమాచారం ..  13తేదీ త్వరగా వచ్ఛేస్తే బాగుండునని  తొందర పెట్టె మా మనస్సు  … వేర్వేరు ప్రాంతాలు , వృత్తులలో  ఉన్న వారిని  కలిపింది అంతర్లీనంగా ఉన్న వారి అభిరుచి.  అంతా  ఒక చోట కలవడం , కలసి మూడు రోజులు గడపడం సామాన్య విషయం కాదు కదా …
ఈ యాత్రకు  హైదరాబాద్  బృందంలో నేను , జి.ఎస్ . రామ్మోహన్ నాంపల్లిలో గోదావరి ఎక్కాం.  అనిల్ బత్తుల , కిరణ్ చర్ల  , స్వేచ్ఛ వొట్కార్ , రమాసరస్వతి, చందు తులసి, దేవేందర్  సికింద్రాబాదులో ఎక్కారు .  5.45 కి ట్రైన్ అయితే 4 గంటలకే  వచ్చేయండని  తమ్ముడు అనిల్ తొందర .   ఖాజీపేటలో కాత్యాయనీ విద్మహే గారితో పాటు మరో నలుగురు మిత్రులు జతకలిశారు . వస్తూ వస్తూ నాలుగు రకాల స్నాక్స్  తెచ్చారు కాత్యాయనీ విద్మహే . ఇంకేముంది అందరి ద్రుష్టి వాటిపైనే . ఆవిడేమో మూడురోజులూ 70 మందీ తినడం కోసం ఆర్డర్ చేసి చేయించి బందోబస్తుగా పాక్ చేయించి తెచ్చారు .   కాస్త అల్లరి తర్వాత అనీల్ వాటిని ఓపెన్ చేశాడు పల్లీలు నువ్వులు బెల్లంతో చేసిన లడ్డులు , సకినాలు , చెక్కలు తిన్నాం ..   అందరి కంటే ముందు తిన్న  ఆనందం .. మధ్య మధ్యలో మిగతా సభ్యుల రాకపోకల వివరాలు తెలుసుకుంటూ నిర్వాహకుల్లో ఒకడైన అనీల్ .. పాటలు , కబుర్లు , చర్చలు అల్లరి అల్లరిగా .. చివరికి  ఇరుగు పొరుగు బెర్తుల వాళ్ళ  ఆగ్రహం చూసి మౌనంగా నిద్రకి ఉపక్రమించాం . కానీ నిద్ర పడితేగా …  తెల్లవారు ఝామున  అనకాపల్లి లో దిగేసి సంస్కృతీ గ్లోబల్ స్కూల్ దగ్గర  ఉదయకాలపు పనులు ముగించుకొని వెంటనే యాత్రా మొదలు పెట్టాలనేది మా ప్లాన్ . కానీ ట్రైన్ గంట లేటు .  మేం దిగేప్పటికే ఒంగోలు నుండి వచ్చిన రాజ్యలక్ష్మి , మహ్మద్ ఖాసీం , సమీర్ , విజయవాడ నుండి వచ్చిన అనీల్ డానీ మాకు స్వాగతం పలికారు . సంస్కృతి వాళ్ళు  పంపిన బస్ సిద్ధంగా ఉంది .    శాంతివనం మంచికంటి గారి కోసం కాసేపు వెయిటింగ్ .  ఈ లోగా జి .ఎస్ . రామ్మోహన్ , చందు తులసి వేపపుల్లలు ఇచ్చారు . వాటితో దంతవధానం .. ఓ నలభై నిముషాల ప్రయాణం..
మేం చేరేప్పటికే అందరూ సిద్దమై బస్ ఎక్కుతున్నారు .  కత్తి పద్మ  అందరినీ త్వరపెట్టి సమయానికి బస్ ఎక్కేలా  చేయడంతో  సిద్దహస్తురాలు  కావడంతో మేమూ  త్వరగా  బయలుదేరి విజయనగరం జిల్లా బొండపల్లి ఉన్నత పాఠశాలకు చేరుకున్నాం .  అక్కడే  వివిన మూర్తి , వి రామలక్ష్మి , దగ్గుమాటి పద్మాకర్ , ఆర్ యం ఉమామహేశ్వరరావు , విష్ణుప్రియగార్లు  బృందంలో చేరారు .
సాహిత్య కార్యశాల 
మా  యాత్రలో మొదటి కార్యక్రమం విజయనగరం జిల్లాలోని బొండపల్లి ఉన్నత పాఠశాల లో సాహిత్య కార్యశాల నిర్వహణ .  ఆరోజు రెండో శనివారం . బడికి సెలవు అయినా పై తరగతుల పిల్లలంతా అక్కడే  ఎంతో ఉత్సాహంగా మాకు ఆహ్వానం పలికారు .  మల్లీశ్వరి నిర్వహణ లో ప్రారంభ సభ జరిగింది .
ముందుగానే నిర్ణయించిన  గ్రూపుల ప్రకారం కవులు రచయితలతో ప్రభత్వ  పాఠశాల విద్యార్థులతో పాటు  సంస్కృతి గ్లోబల్ స్కూల్ పిల్లలు కూడా  కలసి సాహిత్యం గురించి, వారు చదివిన పుస్తకాల గురించి , నచ్చ్చిన పుస్తకం గురించి  పిచ్చ్చాపాటీ ముచ్చట్లు ..  నెమ్మదిగా కథా రచనలోకి వచ్చింది మా గ్రూపు . ప్రతి గ్రూప్ కి ఒక పేరున్న పుస్తకం పేరు పెట్టారు . మా గ్రూప్ పేరు అగ్నిధార . మా గ్రూప్ కి నేను వివిన మూర్తి గారు మెంటార్స్ .. మాకు  ఆరుగురు పిల్లలను కేటాయించారు .   పిల్లలు తమ చుట్టూ ఉన్న , తాము చూస్తున్న  సమాజంలోంచి, సంఘటనల్లోంచి కథలుగా మలిచారు .  ఒక్కొక్కరూ  కాలం దాటని మూడు కథలు రాశారు ఆ కొద్ది సేపట్లోనే .. .  సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఉండి చదువుకుంటున్న జ్యోతి  రాసిన మూడు కథలూ  వేటికవి ఎన్నదగినవే .. వాళ్ళు  రాసినవి చూసి కొన్ని మెళుకువలు చెప్పాం మేం .  నిజానికి అది స్వల్ప సమయం . అంతకంటే ఎక్కువ చెప్పడం కష్టమే ..  మాలాగే మిగతా గ్రూపుల్లోనూ ..
తర్వాత అందరూ సమావేశమై తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకున్నారు .
ఆ పిల్లలని అదే విధంగా ప్రోత్సహిస్తే మంచి కథకులు, కవులను తెలుగు సమాజం అందుకోగలదన్న నమ్మకం మాలో .. . సాహిత్యపు సాన్నిహిత్యం తాలూకు సువాసనలు వెదజల్లుతున్న వాళ్ళ.కి  బొండపల్లి హైస్కూల్ లో పనిచేసే తెలుగు ఉపాధ్యాయులు జి.ఎస్ . చలం గారు , శంకర్ గార్ల  ప్రోత్స హం స్పష్టంగా కనిపించింది.
భోజనానంతరం మళ్ళీ  మా యాత్ర ఆరంభం . ఆంధ్ర , ఒరిస్సా , ఛత్తీస్ గఢ్ ల చెట్టూ చేమల్నీ పలకరిస్తూ  ఆ పచ్చ్చదనంలో పరవశించి పోతూ  స్వచ్ఛమైన కొండగాలుల్ని గుండె నిండా నింపుకుంటూ  మాతో పాటే కొండాకోనల మీదుగా పయనించే మేఘమాలికల్ని , అవి చిలకరించి వర్షపు చినుకుల్ని  కెమెరాల్లో బంధిస్తూ .. కబుర్లు .. పాటలు .. చిరుతిళ్లతో అర్ధరాత్రి దాటిన తర్వాత  గమ్యం చేరాం .   మార్గమధ్యలో సుంకి చెక్పోస్ట్ దగ్గర , కోరాపుట్ లో  రాత్రి భోజనం తీసుకోవడం కోసం చిన్న విరామం . విద్యుత్ దీపాలతో కాస్త అనువుగా ఉన్న చోట బస్ ఆపుకుని రాత్రి భోజనాలు ..
జలపాతాల్లో తడిసి ముద్దై
 
తీర్థ్ ఘర్ జలపాతం :  కాంగర్ నదిపై ఉన్న అద్భుతమైన  జలపాతం ఇది . దాదాపు 299 అడుగుల ఎత్తుపై నుండి కుచ్చు లా  పరుచుకుని  ఎగిసి పడే జలపాతపు సొగసు చూసి తరించాల్సిందే .  దూరం నుండి కనిపించకుండా    వినిపించే  సవ్వడి వడివడిగా  రా రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ..  నీళ్ళలోకి దిగొద్దు అనుకున్న వాళ్ళు కూడా ఆగలేకపోయారు .  సంస్కృతీ స్కూల్ పిల్లలు తప్ప దాదాపు అంతా జలపాతపు హోరులో .. ముద్దై .. అందరిలోనూ మధురమైన అనుభూతిని మిగిల్చింది .
జగదల్పూర్ కి దాదాపు 35 కిమీ దూరంలో ఉంది ఈ జలపాతం.  కుటుంసార్ గుహలు కూడా అక్కడి నుండి దగ్గరలోనే ఉంటాయని చెప్పారు నిర్వాహకులు . కానీ వెళితే ఆ రోజంతా అక్కడే  అయిపోతుంది ముందుగా అనుకున్న కార్యక్రమాలు చేయలేమని ముందుకు సాగిపోయాం
చిత్రకూట్ జలపాతం :  ఇండియన్ నయాగరా  గా పిలిచే చిత్రకూట్ జలపాతం  ఇంద్రావతి నది పై ఉంది .  ఆ జలపాతపు ముందు కూర్చొని ఎంత సేపు చూసినా కదలనివ్వదు .  సాయంత్రం వేళలో  జలపాతపు నీటి తుంపర్లపై ఎండపడి వచ్ఛే ఇంద్రధనస్సు కోసం ఎదురు చూసాం . కానీ మాకది కన్పించలేదు .  మాలో కొందరు  కిందకు వెళ్లి ఆ నీటిని తాకి  వచ్చారు .
బస్తర్ జిల్లాలో జగదల్ పుర్  కి పశ్చిమ దిశలో 38 కిమీ దూరంలో ఉంది . 95 అడుగుల ఎత్త్తు నుండి నీళ్లు పడుతూ ఉంటాయి . ఎడమ నుండి కుడికి 980 అడుగుల దూరం ఉంటుంది ఈ జలపాతం .  టూరిజం డిపార్ట్మెంట్ వారి తో పాటు స్థానికుల  చాయ్ హోటళ్లు ,  ఆదివాసీలు రూపొందించిన హస్త కళలు , వాటర్ స్పోర్ట్స్  ఉన్నాయి .
ఈ రెండు జలపాతాలూ కాంగర్ నేషనల్ పార్క్ లోనే ఉన్నాయి . ఈ పార్కులో అరుదైన పక్షులు, మూలికలు  ఉన్నాయట .
జర్నలిస్టులు, సామజికకార్యకర్తలతో మాటామంతీ 
అనుకున్న సమయానికే  దేశబంధు దినపత్రిక సంపాదకుడు , జర్నలిస్ట్  దేవశరణ్ తివారీ ,  బాలల హక్కులకోసం ఉద్యమిస్తు, శిక్షార్త్ తో కలసి పనిచేస్తున్న  సామజిక కార్యకర్త, బచ్పన్ బచావో వ్యవస్థాపక సభ్యుడు  ఆశిష్, అతని భార్య  వచ్ఛేసారు .  వాళ్ళతో కొంతమంది  మాటామంతీ జరిపితే , మరికొంత మంది బేలా భాటియాని కలవాలన్నది మా ప్లాన్ .  కానీ అనివార్య కారణాలతో బేలా అప్పటికప్పుడు వేరే ప్రాంతానికి ప్రయాణమయ్యారని తెలిసి చాలా నిరాశ పడ్డాం .   అక్కడవున్న ప్రత్యేక సామాజిక పరిస్థితుల వల్ల  ఆదివాసీలను వారి గూడేలలో కలవలేకపోయాం .  మనం చేస్తున్నది ఒకరకంగా సాహస యాత్ర అని పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు అనుకున్న కార్యక్రమంలో మార్పులు చేర్పులు జరగవచ్చని నిర్వాహకులు ముందే  చెప్పి ఉండడంతో అందుకు సిద్దమై ఉన్నాం .
సమావేశంలో జర్నలిస్టు  తివారీ  చెప్పిన విషయాలు మమ్మల్ని దిగ్బ్రాంతికి గురిచేశాయి .   భావప్రకటనా స్వేచ్ఛకోసం ,  అసమ్మతిని వ్యక్తం చేసే హక్కుకోసం రాజ్యం నుండి  ఆదివాసీలె దుర్కొంటున్న  నిర్బంధం ఎప్పుడో పూర్తి స్థాయి విస్ఫోటనంగా మారుతుందేమో ననిపించదా క్షణం . ఏమో ?!
కేంబ్రిడ్జ్ లో డాక్టరేట్ చేసిన  సామజిక కార్యకర్త బేలా భాటియా  ఛత్త్తిస్ గఢ్ గిరిజనుల హక్కులకోసం  కృషి చేస్తున్నారు .  పొలీసు బలగాలు ఆదివాసీ మహిళలపై జరిపిన లైంగిక అత్యాచారాల తర్వాత బేలా ఆ మహిళలు నేరస్థులపై  కేసులు పెట్టేలా ప్రోత్సహించారు .  అప్పటినుండి కత్తికట్టిన పోలీసుల ప్రోత్బలంతో  వారి కనుసన్నల్లో నడిచే సామాజిక ఏకతా మంచ్ , సల్వాజుడుం వంటి సంస్థలు ఆమెను వేధిస్తున్నాయనీ , బస్తర్ విడిచి పొమ్మని హుకుం జారీచేస్తున్నాయనీ తెలిసి విస్తుపోయాం.
 బస్తర్ ఏరియాలో సోనీ సోరి పై యాసిడ్ దాడి గురించి ముందే విని ఉన్నాం .. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలైన సోని సోరి ఆదివాసీ మహిళపై జరుగుతున్న లైంగిక  దాడులు అత్యాచారాలకు సంబంధించిన ఘటనపై ఇతర మహిళా సంఘాలతో , బేలాభాటియా వంటి సామాజిక కార్యకర్తలతో కలసి నిజనిర్ధారణ చేసింది . ఆ నిజ నిర్ధారణ ఆధారంగా మహిళపై అత్యాచారాలకు పాల్పడిన వారిని చట్టబద్ధంగా శిక్షింప చేయాలన్న ప్రయత్నం ఆమెది .    ఇలాంటి సంఘటనల కు చెక్ పెట్టే ఉద్దేశమున్న  రాజ్యం ఆ మహిళలను మావోయిస్టుగాను , వారి సానుభూతిపరులుగాను  ముద్ర వేసి అక్రమకేసులు బనాయించడం , ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గేలా చేయడం జరుగుతోందక్కడ .    పోలీసు దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా , ఆదివాసులకు మద్దతుగా నిలిచిన  బేలా భాటియా , సోనిసోరి , జర్నలిస్ట్ మాలినీ  సుబ్రహ్మణ్యం , లీగల్ ఎయిడ్ అందిస్తున్న మహిళా లాయర్లను బెదిరించడం, భయభ్రాంతులకు గురయ్యేలా ప్రవర్తించడం , ప్రయత్నించడం  వంటి విషయాలు తెలుసుకున్న తర్వాత  మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా .. లేక ఆ భ్రమల్లో బతుకుతున్నామా  అన్న సందేహం కలగింది.  పోలీసు రాజ్యంలో  చట్టం రాజ్యాంగం  మట్టి కలిసిపోయాయా అనే ప్రశ్నలు తలెత్తాయి .  ఏదైమైనా  తీవ్రనిర్బందాన్ని ఎదుర్కొంటూనే ఆదివాసీ మహిళలకు అండగా నిలిచిన బేలా వంటి సామాజిక కార్యకర్తలకూ , మాలినీ సుబ్రహ్మణ్యం వంటి జర్నలిస్టులను , సోని సోరి వంటి నేతలను, మహిళా లాయర్లు , మహిళాసంఘాల నాయకులను  మనసులోనే అభినదించుకున్నాం .  మాలినీ సుబ్రహ్మణ్యం వంటి  వారు చివరికి రాజ్యం చేసే బెదిరింపులకు  బలై  ఆ ప్రాంతం వదలక తప్పలేదు .
రాజ్య  నిర్బంధం మెలమెల్లగా పెరిగిపోతూ  ఉన్నదక్కడ. బస్తర్ కేంద్రంగా పనిచేసే జర్నలిస్టులను పిలిచి పోలీసులు ప్రశ్నించడం నిత్యకృత్యమై పోయిందనీ , తప్పుడు అరెస్టులు కూడా నిజమైన ముప్పుగానే మారుతున్నాయని  జర్నలిస్టు తివారీ మాటల అర్ధం అవగతం అవుతున్నకొద్దీ తెలియని గుబులు
రాజ్యం , మావోయిజం ల మధ్య బాలల బాల్యం ఎలా నలిగిపోయిందో వివరించారు  సామాజిక కార్యకర్త  “బచ్పన్  బచావో ‘ వ్యవస్థాపకుడు  ఆశిష్ .  పిల్లలతో కళకళలాడాల్సిన బడులు  సీఆర్పీ ఎఫ్ జవాన్లతో నిండిపోవడం , పిల్లలు బడికి దూరమై బిక్కుబిక్కుమంటూ ఉండడం గురించి చెప్పారు .  అనంతరం మా బృందంలోని పిల్లలు, పెద్దలు కూడా మా ముందున్న  జర్నలిస్టులు , సామజిక కార్యకర్తలని చాలా ప్రశ్నలు  వేసి సందేహనివృత్తి చేసుకోవడాని కి ప్రయత్నించారు .  ఛత్తీస్ ఘడ్ లోని ఆదివాసీల సామజిక స్థితిగతులు మా బృందాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి
ఆదివాసీల ఆటపాటల్లో 
వాగుల్లో వంకల్లో .. కొండల్లో కోనల్లో .. నాగరకసమాజానికి దూరంగా ఉండే ఆదివాసులు ఆదిమ సంస్కృతికి వారసులు .  మేం చిత్రకూట్ నుండి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు  గౌర్ తెగకు చెందిన ఆదివాసులు .   వాళ్ళని చూడగానే ఆదిలాబాద్ జిల్లాలో కనిపించే గోండులే గుర్తొచ్చారు. వారి ముఖకవళికలు అదే విధంగా అనిపించాయి .
గౌర్ ఆదివాసీల నృత్యం ప్రత్యేకమైనదని  వారి నాయకుడు మంగళ్ చెప్పారు .   బస్తర్  జిల్లాలోని గౌర్ తెగ వారు డోల్ బాజా  నృత్యం  మాములుగా వారి వివాహ సమయంలో చేసే ప్రధాన నృత్యం . స్త్రీ  పురుషులు ఇద్దరూ చేస్తారు .  ఆ నృత్యం చేయడానికి మా ముందుకొచ్చారు ఆ బృందం . వెదురుతో చేసిన బూర , డప్పు , డోలు  వాద్యపరికరాలతో చేసే చప్పుళ్లకు అనుకుణంగా లయబద్దంగా వాళ్ళ అడుగులు  వేస్తూ మగవాళ్ళు ముందు వచ్చారు ఆ వెనుకే మహిళలు  వఛ్చి కలిశారు  .   ఆడవారి కుడిచేతిలో  “తిరుదు డి ” అనే వాద్య  పరికరం ఉంది .  డప్పు శబ్దానికి అనుగుణంగా వారి చేతిలోని తీరుదుడితో  శబ్దం చేస్తూ ..  నృత్యం చేస్తూ గుండ్రంగా కదులుతారు . ఆ కదలడం, అడుగులు వేయడం రకరకాలుగా నెమ్మదిగా .. ఒక్కోసారి  వేగంగా .. డప్పు శబ్దాన్ని బట్టి లయబద్దంగా . పాట ఉండదు .  ఆ శబ్దాలకు అనుకుణంగానే..  మగవారి  తలలపై గేదె కొమ్ములతో చేసిన కిరీటాలు ..చూడ్డానికి గేదె తలపై కుచ్చులా నిలువుగా నుంచున్న  పక్షుల ఈకలు .   ఆ  కిరీటం నుండి మొహంపైకి వేలాడే గవ్వలు.. చాలా గమ్మత్థుగా ..  మెడలో పైసలతో  నల్లటి దారానికి గుచ్చిన దండలూ .. రెండు భుజాలమీదుగా ముందుకు వేసుకున్న పొడవాటి వాద్య పరికరం .
మహిళలు తెల్లటి చీరలో సంప్రదాయ కట్టు తో అలంకరణలో .. వారి నృత్యంలో  మా బృందం కూడా చేరింది . వారి అడుగుతో అడుగు కలిపింది .   ఆ తర్వాత మారియా తెగకు చెందిన ఆడపిల్లలు చాలా వేగంగా ఉన్న స్టెప్పులతో చేసిన నృత్యం అబ్బురపరిచింది.
 రాత్రి భోజనాల అనంతరం సంస్కృతి గ్లోబల్ పాఠశాల  పిల్లలు ప్రదర్శించిన  సాంసృతిక కార్యక్రమాలు మా మనసుల్ని అప్పటికి కొద్దిగా తేలిక పరిచాయనుకున్నాం .. కానీ  అక్కడి సామాజిక పరిస్థితుల గురించిన ఆలోచన మమ్మల్ని వెంటాడుతూనే …
మరుసటి రోజు ఉదయమే బయలుదేరాం. మార్గ మధ్యలో కాట్పాడ్ మార్కెట్ లో ఆగుదామన్నా , సిమిలిగూడా  సంతలోనో , మరో సంతలోనో ఆగి గిరిజనులతో కొంత సేపు గడుపుదామనుకున్న  మా  ప్లాన్ కి  భంగంకలిగిస్తూ వర్షం .  కానీ దారంతా అద్భుతమైన సోయగంతో అలరిస్తూ .. ఆ వర్షపు ఛాయల్లోనే  రో డ్డు పక్కన ఉన్న చిన్న షెల్టర్ లో  ఆగి  భోజనాలు ..  భోజనాల గురించి చెప్పుకునేప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి భోజనం అందించిన రైల్వే  కేటరింగ్ కాంట్రాక్టర్ అప్పారావు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే .
విశాఖ సముద్ర తీరం చేరగానే జరిగిన ముగింపు సభతో మా యాత్ర ముగిసింది . సామాజిక పరిస్థితుల దృష్ట్యా చూస్తే మాది సాహస యాత్రే అనిపించింది .    ఒకప్పుడు ఆంక్షలు లేని స్వేఛ్చా జీవితం  గడిపే ఆదివాసీల  ఉనికి  పారిశ్రామికీకరణ, ఆధునీకరణ , అభివృద్ధికరణలతో  ప్రశ్నార్థకమౌవుతున్న  స్థితి , కష్టాల కడలిలో కొట్టుకు పోతూ అనేక ఆంక్షల నడుమ  చేసే  జీవన పోరాటం తాలూకు ఆలోచనలు తీర్థ్ ఘడ్ జలపాతంలా ఎగిసిపడుతూ .. మాలో తెలియని స్ఫూర్తిని నింపిన భావనలతో పాటు  అడవి మల్లెల సువాసనలు .. పరవశింపచేసే లోయల ఒంపు  సొంపుల అందాలూ .. ఆత్మీయంగా పలకరిస్తూ సాగిపోయే పిల్ల గాలులూ ..జలపాతపు సవ్వడులూ ఇంకా మా  ముందు కదలాడుతూనే  .. కెమెరాలోనూ ,  మదిలోనూ బంధించిన వందలాది క్లిక్ లను మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ..   చిత్రకూట్  జలపాతంలా ఉత్సహంతో ఉరకలేస్తూ మరో యాత్ర కోసం సిద్ధం అవుతూ  .. చివుర్లు తొడిగిన  పచ్చని  స్నేహ సంబంధాల్ని , మానవ సంబంధాల్ని చిక్కబరుచుకుంటూ.. ప్రపంచాన్ని తెలుసుకుంటూ ..
మొత్త్తం చిత్రకూటమి యాత్రలో అత్యంత ఆసక్తి కలిగించిన విషయం సోషల్ అక్టీవిస్ట్ , జర్నలిస్టులతో సంభాషణ .  చాల చల్లని వాతావరణంలో వాడి వేడి చర్చలు .  వారు చెప్పిన విషయాలు మమ్మల్ని ఎంతో విస్మయపరిచాయి . ప్రభుత్వ  గణాంకాల ప్రకారం 30 వేల మంది అనధికారిక లెక్కల ప్రకారం లక్షమంది బాలలు బడికి దూరమయ్యారని తెలవడం .  ఆ పిల్లలపై పడుతున్న వత్తిడి .. యుద్ధనేపథ్యం , గన్నులు , చంపుకోవడాలు , రక్తపు మరకలతో  తడిసిన బాల్యం .. నక్సలైట్లు , సల్వాజుడుం , పోలీసు యంత్రాంగం మధ్య నలిగిపోతున్న బాల్యం చాలా బాధాకరం  .
                                           -” జస్వంత్ , సంస్కృతి గ్లోబల్ పాఠశాల 10వ తరగతి విద్యార్ధి
వి . శాంతి ప్రబోధ
ప్రరవే , జాతీయ సమన్వయకర్త
Published in Bhumika Srivadapatrika Monthly, September 2016

ఎవరికోసం ఈ అభివృద్ధి ..?

నవంబరు 7వ తేది మా ప్రజాస్వామిక రచయిత్రుల బృందం విశాఖపట్నంలోని కొన్ని పారిశ్రామిక వాడలు సందర్శించిన తర్వాత నా మనసుని మెలిపెట్టిన ప్రశ్నలను, కలిగిన భావనలను మీ ముందుంచుతున్నాను .

ఇప్పుడు అందరి నోటా అభివృద్ధి అన్న పదం సమృద్ధిగా వినిపిస్తోంది. ప్రస్తుత దేశ కాల పరిస్థితుల్ని చూస్తే మదిలో ఎన్నెన్నో ప్రశ్నలు… అసలు అభివృద్ది అంటే ..? ఆ అభివృద్ది ఎవరి కోసం ..? ఎందుకోసం ..? ఎక్కడ జరుగుతోంది ..? ఎలా జరుగుతోంది ..?

బళ్ళు ఓడలు అవడం, ఓడలు బళ్ళు అవడం అంటే ఇదేనేమో ..! ఒకప్పుడు చక్కటి కట్టుదిట్టమైన ఇళ్ళు వాకిళ్ళు , పిల్లా పాపలు , గొడ్డు గోదాతో పసిడి పంటలతో విలసిల్లిన ఆ గ్రామం నేడు వట్టిపోయి వల్లకాడులా మారిపోయింది. ఒకప్పుడు 368 కుటుంబాలున్న ఆ గ్రామంలో ఇప్పుడు మిగిలింది 20 కుటుంబాలే. వారూ ఆ గ్రామం వదలలేక .. చావలేక.. అభాగ్య జీవితం గడుపుతున్నవారే .. ఆ గ్రామమే చుక్కవానిపాలెం.

ఆ గ్రామం ఇప్పుడు కొత్తగా ఏర్పడింది కాదు. ఎప్పుడో.. అంటే వారి తాత ముత్తాతల కాలం నుండీ అక్కడే ఉందా గ్రామం. అక్కడున్నవారంతా చిన్న సన్నకారు రైతులు. మధ్యతరగతి కుటుంబీకులు. పచ్చగా నందనవనంలా కళకళలాడే ఆ గ్రామానికి దగ్గరలోనే 1957 లో హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ కంపనీ ఏర్పాటుచేయాలన్న నిర్ణయం జరిగింది. ఆ కంపనీ అవసరాలకోసం ప్రభుత్వ స్థలాలే కాకుండా స్థానిక రైతుల నుండి కలిపి మొత్తం 365 ఎకరాల స్థలం సేకరించుకుంది. 1964 లో పని ప్రారంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద జింక్ కంపనీగా వెలుగొందింది. కోట్లాది రూపాయల ఆదాయం పొందే సంస్థపై ప్రయివేటు గద్దల దృష్టి పడింది. తరువాతి కాలంలో ప్రభుత్వ వాటా తగ్గి ప్రయివేటు వాటా పెరిగింది. షరా మామూలే .. 2002లో ప్రభుత్వ రంగ సంస్థకి మరణశాసనం రాసి వేదాంత కంపెనీ అధినంలోకి వచ్చింది. 1976లో నిర్మించిన జింక్ స్మెల్టర్ లో పనిచేసే 300 మంది కార్మికులతో బలవంతంగా విరమణ చేయించి నడిరోడ్డుపైకి విసిరేసింది. ప్రతి ఏడాది కోట్ల రూపాయల లాభం అందుకున్టున్నప్పటికి ముడి ఖనిజం కొరత, పవర్, పర్యావరణం వంటి రకరకాల కుంటి సాకులు చూపి జింక్ కంపెనీని మూసేసింది యాజమాన్యం. వాస్తవంలోకి తొంగి చూస్తే .. వేదాంత కంపెనీ గంగవరం పోర్టు కొనుగోలు చేసింది. విశాఖ పోర్టులో రెండు బెర్తుల్ని పిపిపి పద్దతిలో తీసుకుంది. దాంతో స్టాక్ యార్డుల అవసరం ఏర్పడింది. దానికోసం జింక్ కంపనీకి చెందిన స్థలాన్ని చూపించి ఇక్కడి జింక్ కంపనీ రాజస్తాన్ కు తరలించి ఈ కంపనీ ఊపిరి తీసేసింది. ప్రభుత్వరంగ సంస్థల పట్ల , కార్మికుల సంక్షేమం పట్ల మన ప్రజా ప్రభుత్వాలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాయో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలదూ ..?!

Previous Image
Next Image
shithilamaipotuna-pilaka-gangulu-illukunchinchuku-poyina-pilaka-ganguluo-pakka-zink-facotry-aa-pakkane-led-factoryprarave-team-vishakha-field-visit-035vikalnguralaina-bharati-gangulu-chinna-kuturuacid-kalvalaa-paarutu-gangulu-inti-pakkane

ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే మరో వైపు పరిస్థితి ఏమిటో ఓసారి చూడాలంటే చుక్కవానిపాలెమో .. పిట్టవానిపాలెమో వెళ్తే వాటితో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలు, ఆయ గ్రామస్తుల పరిస్థితి ఇట్టే అర్ధమైపోతుంది. ప్రజల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల ప్రజా ప్రభుత్వాల నిబద్దత ఏమిటో, తీసుకున్న బాధ్యత ఏమిటో విశదమవుతుంది.

చుక్కవానిపాలెం ప్రస్తుత స్థితి చూద్దాం. ఏళ్ల తరబడి జింక్ కంపనీ నుండి వెలువడ్డ విషవాయువులు, వ్యర్ధ పదార్ధాలు అక్కడి ప్రజల జీవనాన్ని, పరిస్తితుల్ని చిన్నాభిన్నం చేసేసాయి. . విషవాయువులు, రసాయనాలు గాలిని, నీటిని, వారి శరీరాల్ని కలుషితం చేశాయి. మానసిక శారీరక వైకల్యం, కాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, కీళ్ళు ఎముకల సమస్యలు, హార్మోన్ల అసమానతలు మృత్యు ఘంటికలు మోగించడంతో ఉలిక్కిపడ్డ అక్కడి ప్రజలు చేపట్టిన అనేక ఆందోళనలు, ఉద్యమాలు, ప్రయత్నాల తర్వాత కనీసపు ఉపశమన చర్యగా మంచినీరు సరఫరాకి, వారం వారం డాక్టరు వచ్చి చూసేలా కంపనీ ఏర్పాటు చేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయింది. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో బతికుంటే బలుసాకు తినొచ్చు అని భావించిన అక్కడి ప్రజలు ఎంతో కష్టం మీద పునరావాసం సాధించుకున్నారు. పగిలిన గుండెకు అతుకులు వేసుకుంటూ తుంగవానిపాలెంలో 40 గజాల స్థలంలో 20 గజాల ఇల్లు అందుకున్నారు. చావుడప్పు మోగిస్తున్నప్పటికీ పిట్టగూడు లాంటి ఆ ఇళ్ళలో ఇమడలేనక, గంపెడంత ఇళ్ళను, కన్నతల్లిలా సాకిన ఊరిని వదిలి వెళ్ళలేక 20 కుటుంబాలు చావైనా బతుకైనా అక్కడేనని ఉండిపోయాయి. అలాంటి వారిలో పిలక గంగులు కుటుంబం ఒకటి.

పిలక గంగులుకి నలుగురు అన్నదమ్ములు. అంతా ఒకే ఊళ్ళో ఉండేవారు. అందరి ఇళ్ళు పిలిస్తే పలికే విధంగా ఉండేవి. వాళ్ళలో ఇద్దరు హంతకులెవరో తెలియని హత్యలకు బలై చనిపోతే మరొకరు ఆవురావురంటున్న కాలుష్య కోరల్ని విదిలించుకుని ఊరు విడిచాడు.
పిలక గంగులుకి ఆరు ఎకరాల వరి సాగు చేసే పోలం ఉండేది. గంట్లు, చోళ్ళు. వరి, మినుములు, ఉలవలు, కంది పండించేవారు. రెండు పంటలు పండేవి. 1964 ఎకరం 800 రూపాయలకి తీసుకున్నారు. ఆ తర్వాత 76లో లక్షా తొంబై వేలిచ్చి తీసుకున్నారు. అప్పుడు చాలా మొత్తంలో డబ్బు చేతికి వచ్చిందని ఫ్యాక్టరీకి తన పొలం అప్పజెప్పారు అతని పెద్దలు.

వ్యవసాయదారుడైన పిలక గంగులు చేతిలో పైసా అయిపొయింది. షిప్ యార్డ్ లో కూలిగా మారాడు.
ఒకప్పుడు ఇంటి దొడ్లో కూరగాయలు, పళ్ళు కాయించే వారు. కోళ్ళు, గేదలు ఉండేవి. దేనికి కొదువ ఉండేది కాదు. హాయిగా జీవితం గడచిపోతున్న సమయంలో ఆవరించిన విష మేఘం ఒక్కొక్కరినీ మింగేయడం ఆరంభించింది. అక్కడి మనుషుల్లాగే మొక్కలు , పశువులు, పక్షులు అన్నీ ఒక్కొక్కటీ కనుమరుగవడం జరిగిపోయింది. అవే కాదు, రెండు మూడు తరాలకు గొడుగు పట్టాల్సిన ఇళ్ళు చిక్కి శిథిలాలై చరిత్రలో భాగమైపోయాయి.

పిలక గంగులు సంతానంలో నలుగురు మానసిక వైకల్యంతో చనిపోయారు. ఇద్దరు కూతుళ్ళకు పెళ్లి చేశాడు. ఇద్దరు కూతుళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇద్దరినీ చూపుతూ పెళ్లి చేసుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తారా .. ? అని ప్రశ్నించే గంగులు చిన్నకూతురు, చిన్న కొడుకుశారీరక వికలాంగులే. ఇంట్లో ఉన్న కూతుళ్ళలో కుమారి మాత్రం 10వ తరగతి చదివింది. చిన్నకూతురు లేచి నించోలేదు, నడవలేదు, మాట్లాడలేదు. ఆరడుగుల ఎత్తుండే గంగులు ఐదడుగుల కంటే తక్కువగా రోజురోజుకి కుంచించుకుపోతూ ..

ఆ గ్రామపు నేలపోరల్లో, వాతావరణంలోభాగమైపోయిన వివిధరకాల రసాయనాలను ప్రతి జీవి తమ శరీరపు లోపలి పొరల్లో ఇంకించుకుని దుర్భర బాధలకు, తీవ్ర నష్టానికి బాదితులైనవే .. నేటికీ ఆ రసాయనాల ఘాటైన వాసనల్లోనే వారు. అక్కడివారితో ముచ్చటిస్తూన్న కొద్దిసేపటికే మాకు ఆ వాతావరణానికి తల బరువెక్కింది. జుట్టు బిరుసెక్కింది. మొహం గరకుగా అనిపించింది. వాళ్ళు ఏళ్ల తరబడి ఎలా భరిస్తున్నారో ..?.!

అక్కడ ఉన్న ఎవరిని కదిపినా వ్యధాభరిత జీవన చిత్రాలే .. హృదయపు లోతుల్ని పరా పరా కోస్తున్న గాయాలే .. వాళ్ళ మాటల్లోనే విందాం.

“జి. యం. వెంటబడి తీసుకొచ్చిఇవన్నీ తిప్పిఏంటి మా పరిస్థ్తితి అంతే నేనేమీ చేయలేను. నా చేతిలో ఏమిలేదు అని డాక్టర్ నిస్తాను మందులువాడుకోండి. తాగడానికి నీళ్ళిస్తాను తాగండి అన్నాడు. అట్లా కొంతకాలం బతికాం. ఇప్పుడు జింక్ కంపనీ మూతపడింది. ఏళ్ళతరబడి మొరబెట్టుకోగా ఏర్పాటైన మంచినీటి కుళాయిలు తీసేశారు. వారానికి ఒకసారి వచ్చే డాక్టరు రావడం లేదు. అక్కడ వచ్చే మరణాలన్నింటికి తనని బాధ్యుణ్ణి చేస్తారని చెప్పి డాక్టర్ రాకుండా చేశారు కొందరు నాయకులు .రసాయనాలు చూపినా ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకుంటే ఎవరు ఎక్కడ అతుక్కుపోతారో నన్న భయం. ఇప్పుడు మేమంతా గోలచేస్తే రెండురోజులకో తుట్టు నీళ్ళ ట్యంకి పంపుతున్నారు. ‘ – సర్పంచ్

“ప్రతి ఇంటికి 10, 15 గేదెలుండేయి. కుమారిని చూపుతూ ఈ పిల్ల 15 లీటర్ల పాలు పిండేది. ఎలాగుండేవోరిమి ఇప్పుడిలా అయిపోయాము. అప్పుడి ఫోటోలు చూసావంటే ఆళ్ళు ఈళ్ళు ఒకరేనేటి? ఇలాగామ్మా అంటావు ” – పిలక గంగులు

” సుట్టు కోనేసినాడు. ఇయన్ని దించీసినాడు.(స్టాక్ పాయింట్ గోడౌన్లు, అమ్మోనియం నైట్రేటు గుట్టల్ని,అక్కడ నిలిచిన లారీలు చూపుతూ ) మద్యలో ఉన్డోల్లం. లంకంతేసి కొంపలు వొదిలీసి, ఆ బొమ్మరిల్లాటి ఇల్లిస్తే ఆ ఇళ్ళల్లో ఎలాగుండాల ?
మా ఇళ్ళను ఆడు మనుషుల్ని తీసుకొచ్చి ఇరగ్గోట్టేసి పోతన్నాడు. ఎవడేటిచేత్తాడని ? పోలీసోడు ఆల్ల దగ్గర డబ్బు తీసుకుని మామాట వినడు. పెజల్ని ఏడిపిస్తే ఆడు బాగుపడతాడేటి? మరి అలా ఎడిపిస్తాన్నడనుకో . ‘ – చుక్కా అనంతమ్మ

పిట్టవానిపాలెం లోనూ ఇలాంటి స్థితే. అయితే ఇక్కడ గ్రామస్తులు జింక్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత తిరిగి తమ గ్రామానికి చేరుకున్న్నారు. ఇల్లు కట్టుకున్నారు.

జింక్, లెడ్ ఫ్యాక్టరీలు పిట్టవానిపాలెం గ్రామానికి అతి సమీపంలో ఉన్నాయి. కూతవేటు దూరంలోనే HPCL, కోరమండల్, జిప్సం కంపెనీలు. అవి వదిలే కార్బన్ డయాక్సైడ్ , సల్పర్ డయాక్సైడ్ , ఆర్సెనిక్ , లెడ్ వంటి వాయువులు, ధూళితో గ్రామం నిండిపోయేది . ఆ విషవాయువుల్లో ఉండే టోలిన్ వల్ల పిల్లలుపుట్టకపోవడం, తరచూ అబార్షన్లు అవడం జరుగుతాయి. బెంజీన్ వల్ల బుద్ది మాంద్యం వస్తుంది. పోలిసైకిక్ ప్రొడక్ట్స్ లో కాన్సర్ కారకాలు ఎక్కువ ఉంటాయి. విశాఖపట్నంలో పారిశ్రామిక అభివృద్ధి 1990 నాటికే ఉన్నప్పటికీ 2000 నుండి బాగా పెరిగింది.

“పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ప్రకృతివనరుల విద్వంసం జరుగుతుంది. తద్వారా పర్యావరణ విద్వంసం జరుగుతుంది తత్ఫలితం ప్రజలపై ఆ దుష్ప్రభావాల ప్రభావం ఉంటుంది. రెండింటిని బేరీజు వేసుకున్నప్పుడు అభివృద్ధి కంటే విద్వంసం, విచ్చిన్నం ఎక్కువ అని ఇప్పటి పరిస్తితులను చూస్తే అర్ధం అవుతుంది. అభివృద్ధి ఎవరి కోసం అర్ధమవుతుంది.” – జె.వి. రత్నం, పర్యావరణ ఉద్యమకారుడు, గ్రీన్ క్లైమేట్ పత్రిక ప్రచురణ కర్త , సంపాదకుడు

“ఫ్యాక్టరీ ఉన్నప్పుడు మాకు పిల్లలు పుట్టకుండా అబార్షన్ అయిపోవడం, పుట్టిన వాళ్ళు చనిపోవడం, వికలాంగులవడం, దగ్గు దమ్ము వంటి ఎన్నో రోగాలతో సతమతంయ్యేవాళ్ళం . ఒక పశువులున్దేవి కావు, కోళ్ళున్దేవి కావు. కాలుష్యం వల్ల పిల్లలు చని పోయేవారు. అందరి సంగతీ ఎందుకూ .. నాకు తొమ్మిది అబార్షన్లు. ఆ తర్వాతే బాబు పుట్టాడు. పెద్ద బాబుకి పుట్టుకతోనే జబ్బు. ఆ తర్వాత ఎన్నో మందులు వాడిన తర్వాత పుట్టిన చిన్న బాబు. ఇద్దరూ కొన్నాళ్ళు పెరిగి చనిపోయారు. చూడండి, మీకు ఏ ఇంటికి వెళ్ళినా ఇలాంటి సంఘటనలే కనిపిస్తాయి. చాలా ఇబ్బందులు పడ్డామండి. జింక్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత ఇప్పుడిప్పుడే కొద్దిగా ఊపిరి పిలుస్తున్నామనుకుంటే ఉదుద్ వచ్చి ఊపిరి తీసేసింది”. డ్రాలింగ్ వరలక్ష్మి

విశాఖపట్నం పారిశ్రామిక వాడలలో మా పర్యటన నాకు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్ని మరో కోణంలో చూపింది. ప్రజలకోసం ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో అర్ధమయింది. ముందటి స్థితిని దాటి ముందుకు వెళితే కదా అభివృద్ది ..! ఎవరు ముందుకు వెళ్లారో… తెలిపి అప్పటివరకూ నాకున్న భ్రమల్ని తొలగించింది. మరెన్నో ప్రశ్నలను నా ముందు నిలిపింది .

వి. శాంతి ప్రబోధ
అధ్యక్షురాలు,
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక – తెలంగాణా విభాగం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– See more at: http://vihanga.com/?p=13522#sthash.LFfKvPAR.SH7DFMop.dpuf

ప్రపంచ ఆహార దినోత్సవం అనగానే గుర్తొచ్చే యూహ

ఈ రోజు అక్టోబరు 16వ తేది. అంటే ఈ రోజే ప్రపంచ ఆహార దినోత్సవం . ఆహారం, ఆహార దినోత్సవం అనగానే స్వీడన్ దేశంలో మా పర్యటన, ఆ పర్యటనలో మూటగట్టుకున్న అనుభవాలు జ్ఞప్తికి రాకమానవు. అది జరిగింది తొమ్మిదేళ్ళ క్రితం.

ఆ సంఘటన జరిగింది అక్టోబరు 10, 2005 న. నాకు ఇప్పటికీ ఆశ్చర్య పరుస్తుంది. అబ్బురపరుస్తుంది. ఆ సంఘటన మీతో పంచుకోవాలనిపించి ఇప్పుడు మీ ముందుకొచ్చా. ఆ రోజు ఉదయం నుండీ మేమంతా చాలా బిజీగా ఉన్నాం. స్టాక్ హోం నగరం లోని బ్యోర్కా (Bjorka Behandlingsham ), Stenby Gird లలో మాదకద్రవ్యాలకు అలవాటు పడి నేరాలు చేసి జైలుకు వచ్చిన వారికి ఇచ్చే చికిత్సలు, ఆ జైళ్ళలో ఉండేవారి హక్కులు ఏమిటో తెలుసుకొని తిరుగు ప్రయాణం అయ్యాం KRIS బృందం Juha Deoderson, Annelli, Eva Maria లతో పాటు స్టాక్ హోం లోనే ఉంటున్న రత్న (లవణంగారి మానస పుత్రిక ) ఇక్కడ నుండి వెళ్ళిన లవణం గారు , సుందర్ , నేను. మేం అప్పటివరకూ వెళ్ళిన ప్రదేశాలు సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉన్నాయి. అంతా అలసిపోయి త్వరగా మా బసకు చేరాలని అనుకుంటున్న సమయంలో మేం ఉన్న వాహనం పార్కింగ్లో ఆపి ఇప్పుడే వస్తానంటూ పరుగు పరుగున వెళ్ళాడు యూహ. ఎందుకో మాకెవ్వరికీ అర్ధం కాలేదు. నిముషాలు గడుస్తున్నాయి అతను రాలేదు.

దాదాపు ఇరవై నిముషాల తర్వాత చేతిలో పెద్ద పెద్ద బ్యాగ్స్ తో వచ్చాడు.
అంత సేపు వెయిట్ చేయించాల్సివచ్చినందుకు క్షమాపణలు చెప్పాడు. మా వాహనం కదిలాక నెమ్మదిగా తను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందీ చెప్పాడు. మరో పది నిముషాలు ఆలస్యం అయితే ఆ పూట చాలామంది తన కోసం ఎదురుచూస్తూ ఆకలితోనే ఉండేవాళ్ళని. ఎందుకో అర్ధం కాని మాకు వివరించాడు తనేం చేస్తాడో. అక్కడ సాయంత్రం 6 గంటలయ్యేసరికి హోటళ్ళు ముసేస్తారట. ఆ లోపు వెళ్తే ఆరోజు మిగిలిపోయిన ఆహారం తీసుకోవచ్చు. లేదంటే అది వృధా అయిపోతుంది. అందుకే ప్రతి రోజూ ఆ సమయాల్లో రెండు మూడు హోటల్లనుండి ఆహారం సేకరించి పేదలకి అందిస్తాడట. వాటితో వారు కడుపు నింపుకుంటారట . యూహ జైలు జీవితం నుండి బయటి ప్రపంచంలోకి వచ్చి KRIS లో చేరిన తర్వాత ఇలా తనకు తోచిన సేవచేస్తున్నాడని అన్నెల్లి చెప్పింది. అతని మానవత్వానికి హేట్సాఫ్ చెప్పి ముందుకు కదిలాం.

వి. శాంతి ప్రబోధ

చిన్న ప్రపంచం పై ఆధారపడే పెద్దప్రపంచం

Delhi visit photos 172మెరుపు మెరిస్తే .. వాన కురిస్తే.. హరివిల్లు విరిస్తే .. అతనికి ఎంత ఆనందం వస్తుందో తెలీదు కానీ .. టీ కెటిల్ వదిలి బడికి వెళ్తే మాత్రం పట్టలేంత ఆనందం .. కానీ అది అందుకోగలడా అతడు ?

అది సెప్టెంబర్ 13 వ తేది ఉదయం ఆరు – ఆరున్నర గంటల మధ్య సమయం.
భారతీయ సాహిత్యంలో స్త్రీ నిన్న, నేడు , రేపు కోసం దేశ రాజధానీ నగరం చేరిన మాకు లోడి రోడ్లోని ఆంధ్రా అసోసియేషన్ లో విడిది. క్రితం రోజు డిల్లీ నగర పర్యటనతో అంతా అలసిపోయి ఉన్నాం. ఉదయం నిద్రలేచేసరికి వచ్చాడా అబ్బాయి. నిద్ర లేవగానే ఓ గుక్క వేడి వేడి టీ నీళ్ళు గొంతులో పడందే ఏదీ తోచదు మాలో కొందరికి. ఆతిథ్యం ఇచ్చిన వారు టీ ఇచ్చేసరికి ఏ సమయం అవుతుందో తెలియదు మొదటి రోజు కదా.. ! బయటికి వెళ్లి తాగడానికి దగ్గరలో దొరుకుతుందో లేదో అనుకుంటూన్నసమయంలో చేతిలో కెటిల్, టీ కప్పులతో ప్రత్యక్షమయ్యాడు అతడు. మా వాళ్లకి ప్రాణం లేచి వచ్చినట్లయింది . ఏడెనిమిదేళ్ళు ఉంటాయేమో అతనికి. పేరు పవన్. అతనితో పాటే అతని మిత్రుడు. అదే వయసులో .

నెమ్మదిగా అతన్తో మాట కలిపాం. బడికి వెళుతున్నావా అంటూ .. ఓ దీర్ఘమైన చూపు విసిరి లేదన్నట్లుగా తల ఊపాడు. ఏం ఇష్టం లేదా .. ? అంటే ఉండన్నట్లుగా మౌనంగానే సమాధానం. టీ తీసుకోమ్మంటూ కప్పులో టీ కెటిల్ లోంచి వంపబోయాడు. వద్దన్నాను. నాకు టీ తాగే అలవాటు లేకపోవడం వల్ల. అతని టైం వృధా చేస్తున్నానేమో అనుకుంటూ పక్క గదుల్లో ఇచ్చి రమ్మన్నా. అక్కడంతా ఇచ్చే వచ్చా చక్కని హిందీలో అన్నాడు. బడికి ఎందుకు వెళ్ళడం లేదని మళ్ళీ అడిగా . ‘నేను బడికి వెళ్తే ఈ పని ఎవరు చేస్తారు. మాకు పూట ఎట్లా గడుస్తుంది’ ప్రశ్నార్ధకంగా నాకేసి ఆ చిన్న కళ్ళు చూస్తూ. మీ అమ్మ నాన్న.. అని నేను అడుగుతోంటే ‘నాన్న లేడు చనిపోయాడు. అమ్మ ఉంది పని చేయలేక పోతోంది. ముగ్గురు అక్కలు ఉన్నారు. వాళ్లకి మా నాన్న ఉన్నప్పుడే పెళ్లి అయిపొయింది. వాళ్ళు మా దగ్గరకు రారు. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. నేనే చూసుకోవాలిగా వాళ్ళని’ అంటున్న అతన్ని చూస్తే గుండె బాధతో మెలేసినట్లయింది. నేపాల్ జాతీయులట. చాలా ఏళ్ళ క్రితమే వారి కుటుంబం డిల్లీకి వచ్చేసిందట. కానీ ఇల్లు అంటూ వేరే లేదట. రాజధాని నగరంలో వీధీ వీధి నాదే నంటూ పుట్పాత్ పైనే జీవనం. అక్కడే డబ్బా రేకు అడ్డు పెట్టి టీ తయారు చేసి తల్లి ఇస్తే ఇతను అమ్ముతుంటాడట. ఎన్ని టీలు ఇచ్చింది. ఎవరు ఎంత ఇచ్చింది, ఇంకా ఎంత రావాలి లెక్క ఖచ్చితంగా చెప్తున్నాడు చాలా ఆశ్చర్యంగా. ఆ వయసులో బడికి వెళ్ళే పిల్లలకే సరిగ్గా రావు లెక్కలు. వేళ్ళు లెక్క పెట్టుకుంటూ చేస్తారు. కానీ పవన్ మాత్రం మనసులోనే లెక్కించుకుంటూ చకచకా చెప్పేస్తున్నాడు. తనకి చదువుకోవాలని ఉన్నా అది కుదరదని, తమ్ముళ్ళను బడికి పంపుతానని చెప్పాడు. పవన్ తో వచ్చిన అతని మిత్రుడు (పేరు గుర్తు లేదు) మాత్రం బడికి వెళ్తున్నాడట అప్పుడప్పుడు.
Delhi visit photos 174
అతి చిన్న వయసులో పవన్ బాధ్యతాయుత ప్రవర్తనని చూసి అభినందిస్తూనే అపురూపంగా ఆనందంగా సాగాల్సిన అందమైన బాల్యం మసకబారిపోతోందని బెంగపడింది నా మనసు. ఇంత పెద్ద ప్రపంచం ఇంత చిన్న పిల్లలపై ఆధార పడుతోందా ..? ! వాళ్ళ ప్రపంచంలో వాళ్ళని ఉండనివ్వకుండా వాళ్ళ ఆసక్తుల్ని, ఆకాంక్షల్ని పెద్ద ప్రపంచం లాగేసుకుంటోందా ..? ఆలోచిస్తూ ఫోటో తీసుకున్నాను. మొదట సిగ్గు పడిపోయాడు. తర్వాత తనూ ఫోటోకి ముందుకొచ్చాడు పవన్ మిత్రుడు . ఆ తర్వాత పది రూపాయలు ఇవ్వబోతే వద్దంటూ తీసుకోకుండా మిత్రుడితో వారి భాషలో ఏదో చెప్పుకుంటూ వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. అతని ఆత్మాభిమానం చూస్తే ముచ్చటేసింది. కానీ, పరిస్థితులు అతన్ని అలాగే ఉండనిస్తాయా ..? ??

మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 14 ఏళ్ళ లోపు బాలలందరికీ నిర్భంద ఉచిత విద్య ఇవ్వాలంటుంది. చట్ట ప్రకారం బాలలకు సమాన అవకాశాలు , సౌకర్యాలు కల్పిస్తూ ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందేలా వారికి స్వేచ్చ నివ్వాలి. అంతే కాకుండా గౌరవప్రదంగా జీవించే పరిస్తితుల్ని కల్పించాలి. దోపిడీ, అనైకతలకు గురికాకుండా కాపాడాలి. ఇంకా బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా 1986 బాలకార్మిక వ్యతిరేక చట్టాలు ఉన్నాయి.విద్యాహక్కు చట్టం ఉంది. కానీ జరుగుతున్నది ఏమిటి? మన చట్టాలని వెక్కిరిస్తూ, మన వైఫల్యాలని ఎత్తి చూపుతూ పసివాడని బాల్యం పుస్తకాల సంచుల బరువు బదులు కుటుంబ బరువు మోస్తూ… తమ హక్కులను కోల్పోతూ.. పనిచేసుకుంటూ కూడా చదువుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేయొచ్చు కదా .. ! అవును చేయచ్చుగా .. శ్రద్ధ, చిత్తశుద్ది ఉంటే సాధ్యం కాదా ..? సందేహం. అంతలోనే పదేళ్ళ క్రితం చూసిన “పచ్చసాలె ” గుర్తొచ్చింది. అది మెదక్ జిల్లా జహీరాబాద్ దగ్గరలో ఉంది(ఊరి పేరు గుర్తులేదు). దక్కన్ డెవలప్మెంట్ సొసైటి ఆధ్వర్యంలో నడుస్తుంది. అక్కడ పిల్లలు సగం రోజు పని సగం రోజు బడిలో గడపడం, మిగతా బడులకు భిన్నంగా ఉండే ఆ బడికి పోవడానికి పిల్లలు చూపే ఉత్సాహం గుర్తొచ్చాయి. ప్రస్తుతం బాలల కోసం మన దేశంలో రకరకాల పేర్లతో వివిధ పథకాలున్నాయి. అయినా పిల్లల బతుకుల్లో మార్పురాకపోవడానికి కారణం అమలులో చిత్తశుద్ధి లోకపోవడమే కదా. అందుకే పవన్ లాంటి ఎంతో మందికి పెన్నూ పుస్తకం పట్టడం కంటే ఆకలి తీర్చు కోవడమే ముఖ్యమైన సమస్యగా నేటికీ కొనసాగుతోంది.

ఇలాంటి పిల్లలంతా కలసి లక్షల్లో ఉంటారు మన దేశంలో. చదువుకు దూరం అయిన వీరు పెరిగి పెద్దయినా నైపుణ్యం లేని పనులతో సరిపెట్టుకోవలసి వస్తుంది. అంతే కాకుండా వీరి పరిస్తితుల్ని ఆసరాగా చేసుకుని వీరిని మభ్యపెట్టి అక్రమ మార్గాల్లోకి మళ్ళించే వారూ వీరిని వెన్నంటే ఉంటారన్ననిజం మరచిపోకూడదు .. ఆత్మాభిమానంతో ఎదుగుతున్న పవన్ లాంటి వాళ్ళని తమ పావులుగా మార్చుకునే అవకాశం లేకపోలేదు .. ఇలా ఏవేవో ఆలోచనలు. ఆ తర్వాత కొంతసేపటి వరకూ నన్ను వెంటాడుతూనే ..

అది ఆగ్రా.
agra1
15వ తేదీ సాయంత్రం 4 గంటల సమయం. ఉన్న తక్కువ సమయంలో అందాల తాజమహల్, ఆగ్రా కోట చూసి 8.30 కి వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. సమయంతో పోటిపడుతూ ముందుకు సాగవలసిన సమయమది. మా కాళ్ళ కడ్డు తగులుతూ పది అంతకు తక్కువ వయసున్న ఆడ, మగ పిల్లలు చేతిలో తాజమహల్ బొమ్మలు తీసుకోమంటూ… ఇరవై రూపాయలకే నని ఇంగ్లీషు, హిందీ భాషలలో పలుకరిస్తూ, పర్యాటకుల వెన్నంటే నడుస్తూ కొనమని పదే పదే అడుగుతూ .. ఓ అబ్బాయినడిగితే బడికి వెళ్లి వచ్చేశానన్నాడు. మరో అమ్మాయి బడికి వెళ్లి వచ్చానని చక్కని ఇంగ్లీషులో జవాబిచ్చింది. కానీ నాకు సందేహం నిజంగా వీరు చదువుకుంటున్నారా.. అని. ఏదేమైనా తమ వయసు పిల్లలు ఆటపాటల్లో ఆనందంగా గడుపుతోంటే వీరు మాత్రం బతుకు పోరులో జీవికకు మార్గాలెతుక్కుంటూ ..agra2

డిల్లీ నగర ప్రధాన వీధుల అందం, తాజ్ మహల్ సౌందర్యం మన మనసుల్ని దోచుకుంటాయేమో .. ఆ వెన్నంటే రెక్కలు తొడిగి నింగిన గాలిపటంలా ఎగరాల్సిన బాల్యపు రంగుల కలలు వెలవెల పోతుంటే జీవన సమరంలో పోరాడే చిట్టిపొట్టి చేతులు మానని గాయంలా హృదయాన్ని తొలుస్తుంటాయి. మారు మూల పల్లెల్లోనే కాదు మహారణ్యాల్లాంటి నగరాలల్లోనూ పేద పిల్లల స్థితి, అనాధల స్థితి ఇదే. దేశంలో ఎక్కడికెళ్ళినా ఎటు చూసినా పిల్లల స్థితిలో ఏమున్నది గర్వకారణం ..? ప్రతి చోటా ఇలాటి దృశ్యాలే సర్వ సాధారణం.

మురిపెంతో దాచుకోవాల్సిన బాల్యం బతుకు పోరాటంలో కాదు కదా నలిగిపోవాల్సింది. కలలు కనే ఆ కళ్ళు దేశానికి కాళ్ళు, కళ్ళు అయి నడిపించాలి కదా.. మన దేశానికి బంగారు భవితనివ్వాలి కదా … ఆ బాలల కళ్ళలో మెరుపు మెరిసి, హృదయం ఆనందంతో తడిసి, హరివిల్లు విరిసే రోజెప్పుడు వస్తుందో … ?! బాధ్యతల బరువు మోసే చిన్నారి ప్రపంచానికి తనదైన అద్భుత లోకాన్నిపెద్ద ప్రపంచం అందించే ప్రయత్నం ఎప్పుడు విజయవంతం అవుతుందో… ?! అనేక భావాలు మనసుని చుట్టుముట్టి గందరగోళ పరుస్తుంటే వెనుదిరిగా ..

వి. శాంతి ప్రబోధ

మనమంతా ఒకటే అన్న భావన ఎప్పుడొస్తుందో …

మా ప్రయాణం ప్రారంభమైంది. అక్టోబర్ 7వ తేది 2005 సంవత్సరం 11. 30 కి అనుకుంటా ఆర్లాండా ఎయిర్ పోర్టులో దిగాం. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్లో బయలు దేరిన మేం ఫ్రాంక్ ఫర్ట్ కి అక్కడినుండి స్టాక్ హోం కి చేరాం. మేం మా బాగేజీ అంతా కలెక్టు చేసుకుని వచ్చేసరికి మా కోసం ఎదురు చూస్తూ KRIS సభ్యులు Mr. యూహ, Ms. అన్నెల్లి విక్లాండ్, Mr. కై ఎల్లింగ్లస్ లతో పాటు లవణం గారి మానస పుత్రిక రత్న , తన జీవన సహచరుడు పెర్తి , వారి మిత్రుడు తెలుగువాడు, లవణం గారి అభిమాని అయిన తిరునగరు వెంకట్ గార్లు మాకు ఆహ్వానం పలుకుతూ ..

ఆర్లాండా ఎయిర్ పోర్ట్ నుండి స్టాక్ హోం సిటీ 27 మైళ్ళు (43 కి. మీ .) దూరం . ఆర్లాండా ఎయిర్ పోర్ట్ నుండి స్టాక్ హొమ్ సిటీకి వచ్చే దారిలో అంతా చిట్టడవులు.

అక్కడక్కడా పొలాల్లో ఒకటీ అరా ఇల్లు అంతే మేం అంతా నేరుగా Tjarhovsgatan లో ఉన్న KRIS ఆఫీసుకి చేరుకున్నాం. ఆ సంస్థ అధ్యక్షుడు క్రిష్టర్ కార్ల్ సన్, ఉపాధ్యక్షుడు పీటర్ సూదర్ లుండ్ ఇంకా కొందరు KRIS సభ్యులు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు.

Four principles of KRIS
honesty, life free from drugs/addiction, friendship and solidarity అనే పోస్టర్

దాదాపు 20 నిముషాలు వారితో సమావేశమయ్యాంతో మా అఫిషియల్ ప్రోగాం ఆరంభమయింది. తర్వాతి రోజుల్లో మేం ఎక్కడెక్కడికి వెళ్ళాలి. ఏమి చెయ్యాలి మొత్తం ఆక్షన్ ప్లాన్ వివరించారు. తర్వాత మమ్ముల్ని మాకు ఏర్పాటు చేసిన విడిదికి అన్నేల్లి , యుహ తీసుకు వెళ్ళారు. అసలు అది యుహ వాళ్ళ ఇల్లు. మాకు అది ఇచ్చి తను మరెవరి ప్లాట్ లోనో ఉన్నాడు. హోటల్ లో ఉంటే మేం భోజనానికి ఇబ్బంది పడతామని ఈ ఏర్పాటు చేశామని చెప్పారు. మేము మన భోజనం వండుకోవడానికి వీలుగా ఉంది . మాకు అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి కొన్ని స్వీడిష్ క్రోనార్లు (అక్కడి డబ్బు), మా రోజువారీ ప్రయాణం కోసం ఒక నెల వాడుకునే విధంగా పాస్ ఇచ్చారు. ఆ పాసుతో రోడ్డు, రైలు, జల మార్గాల్లో స్టాక్ హొమ్ సిటీ తో పాటు సబర్బ్ ఏరియాలో ఎక్కడికైనా ఎన్ని సార్లు అయినా వెళ్లి రావచ్చని చెప్పింది అన్నెల్లి. ఆ పాస్ మన బ్యాంకు ATM కార్డులా ఉంది.

అప్పటికే రకరకాల బ్రెడ్లు, బటర్, జాంలు, జ్యుసులు ఫ్రెంచ్ ఫ్రై లు ఇంకా ఏవేవో తెచ్చి ఫ్రిజ్ నిండా నింపేశారు. మేం మన పచ్చళ్ళు, కారం పొడి, సాంబారు పొడి, పులిహోర పేస్టు, ఉలవచారు లాంటివి తీసుకొని వెళ్లాం. అదే రోజు సాయంత్రం అన్నేల్లి వాళ్ళ సాయంతో మేం నడుచుకుంటూ ఐదు నిముషాల నడక దూరంలో ఉన్న డిపార్ట్ మెంటల్ స్టోర్ కి వెళ్లాం. అప్పుడు తెలిసింది చలి. ఎయిర్ పోర్టులో టర్మినల్స్మ కి దగ్గరలోనే ఉన్న మల్టీ స్టోరీడ్ కార్ పార్కింగ్ ఎయిర్ కండిషన్ తో ఉండడం వల్ల చలి తెలియలేదు. మేం చలి బాగా ఫీల్ అయింది ఆ రోజు సాయంత్రం స్టోర్ కి వెళ్ళినప్పుడే. చలి తట్టుకోవడానికి థర్మల్స్ వేసుకొని కోట్ వేసుకుని తలకు కేప్ పెట్టుకున్నా ఆ చలి తట్టుకోవడం కష్టం గానే ఉంది. అమ్మో నెల రోజులు ఎలా భరించాలో అని భయపడిపోయా.

ఆ స్టోర్ లో మాకు కావలసిన వస్తువులు తీసుకుంటుంటే అక్కడ పని చేసే ఒకమ్మాయి వచ్చి నన్ను మీది శ్రీలంకా అని అడిగింది. కాదు ఇండియా అని చెప్తే తమిళ్ వారా అని అడిగింది. ఆ అమ్మాయి శ్రీలంక తమిళియన్ అట . నేను తమిళ్ అమ్మాయిలా కన్పించానేమో ! అలా మేం వెళ్లి మాకు కావలసిన వస్తువులు తెచ్చుకున్నాం.

లవణం గారు ఎక్కడ ఉంటే అక్కడి భోజనం చేసేయగలరు. ఆయనకి ఇబ్బంది లేదు. అంతకు ముందు అంటే 2004లో నేను గ్లోబల్ కనెక్షన్స్ యూత్ కాన్ఫరెన్సులో పాల్గొనడానికి అమెరికాలోని బోస్టన్ వెళ్ళినప్పుడు పడిన ఇబ్బంది నాకు బాగా తెలుసు. మా చెల్లి కోసం పట్టుకెల్లిన నిమ్మకాయ పచ్చడి ఒట్టిది తిన్నా ఉప్పు కారంలేని ఆ చప్పిడి తిండి తినలేక. ఆ విషయం చెప్తే నన్ను కలవడానికి వస్తూ మా చిన్న చెల్లి కామేశ్వరి తెచ్చిన ఇంటి భోజనాన్ని ఎంత అస్వాదించానో మరచిపోలేదు. సుందర్ కి కూడా 2003లో ఆ స్వీడిష్ భోజనం తో పడ్డ ఇబ్బంది గుర్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా అవసరమైనవి ఇక్కడి నుండే తీసుకువెళ్లాం.

శని, ఆదివారాలు కావడంతో మాకు అఫిషియల్ పని లేదు. 8వ తేదీ, 9వ తేదీ మేమంతా ఖాళీ.
8 వ తేదీన వెంకట్ గారు వచ్చి తీసుకెళ్ళారు రత్న వాళ్ళింటికి. అక్కడ నుండి నేను, సుందర్ వెంకట్ గారింటికి వెళ్లాం. ఆరోజు అక్కడే ఉండి 9వ తేదీ భోజన సమయానికి ఇండియన్ రెస్టారెంట్ కి చేరుకున్నాం . ఆ రోజు అక్కడ జరిగే రత్న, పెర్తిల కూతురు హెల్మి సమైక్య మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొనడానికి . ఆ వేడుకకు దాదాపు 15 దేశాలకు చెందిన అతిథులు పాల్గొన్నారు. విభిన్న సంస్కృతులు , భాషల వారికి భారతీయ భోజనం కాదు కాదు అచ్చమైన తెలుగింటి భోజనం పెట్టారు. ఆఖరికి ముద్ద పప్పు, ఆవకాయ పచ్చడి, అప్పడంతో సహా. అంతా తెలుగింటి భోజనాన్నిఇండియన్ రెస్టారెంట్ లో ఎంతో ఆస్వాదించారు. ఐస్ క్రీములు , కేకులు , కూల్ డ్రింకులు మాత్రం స్వీడిష్ వి.

భోజనాలయాక ఆ రెస్టారెంట్ ఓనర్ ని కలిశా. భోజనం బాగుందని చెప్పి పిచ్చా పాటి మాట్లాడుతూ ఇండియా లో ప్రాంతం నుండి వచ్చారని అడిగా. అతను చెప్పిన జవాబు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అతను ఇండియన్ కాదు బంగ్లాదేశీయుడు. ముస్లిం మతస్తుడు. ఇక్కడ వీళ్ల దృష్టిలో నేను భారతీయుడినే. మేము అలాగే చెప్తాం. అమెరికాలో సెప్టెంబర్ 11 సంఘటన తర్వాత మా వాళ్ళ మీద ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అపనమ్మకం వల్ల మేం తప్పని సరి పరిస్థితిలో ఈ విధంగా చెప్తున్నాం. అందుకు మేం ఏమీ బాధ పాడడం లేదు. మేమూ భారత ఉపఖండ వాసులమే కదా అన్నాడతను. ఇక్కడ మన దేశాల మధ్య కూడా మనమంతా ఒకటే అన్న భావన ఎప్పుడొస్తుందో …!

నా స్వీడన్ పర్యటన నేపధ్యం

KRIS (Kriminals Returned Into Society) గురించి నేను మొదట విన్నది 2005 మార్చిలో . Mr.  యూహ డెడర్సన్  , Mrs. ఆన్నేల్లి విక్లాండ్ ల భారత పర్యటనకి కాస్త ముందు.

మన దేశంలో నేరస్తుల సంస్కరణ జరిగింది మానవతావాదులు, సంఘ సంస్కర్తలు శ్రీ లవణం, శ్రీమతి హేమలతాలవణం ల ఆధ్వర్యంలో.  సంస్కార్ స్వచ్చంద సంస్థ ద్వారా.  స్టువార్టుపురం నేరస్తుల సంస్కరణ కార్యక్రమాలను వారు చేపట్టారు.

1871లో బ్రిటిష్ కొలోనియల్ ప్రభుత్వం ‘క్రిమినల్ ట్రైబ్స్ ఆక్ట్ ‘ చట్టం ద్వారా కొన్ని కులాలు, తెగలని పుట్టుకతోనే నేరస్తులుగా పేర్కొంది.  నేరం చేస్తే నేరస్తులవుతారు కానీ, నేరస్తుల కడుపున పుట్టడమో , ఆ నేర్స్తులున్న కులాల్లోనో , తెగల్లోనో పుట్టడమే నేరమయితే అది మానవత్వం అవుతుందా ..?  పుట్టిన దగ్గర నుండి చనిపోయేవరకూ వారిని నేరం చేయకపోయినా నేరస్తులుగా చిత్రీకరించడం అంటే .. వారు నేరస్తులుగా కాక మరేమీ అవుతారు ?   వారి కోసం ప్రత్యేకంగా కాలనీలు ఏర్పాటు చేసింది .  అలా ఏర్పడిందే స్టువార్టుపురం

సాధారణ ప్రజలు నిద్రలోనైనా స్టువార్టుపురం అంటే ఉలిక్కిపడతారు.  కరడు కట్టిన గజదొంగల్ని తలచుకుని భయపడతారు.  అలాంటి ఊళ్ళో డెబ్బయవ దశకంలో సంస్కార్ సంస్కరణ కార్యక్రమం ప్రారంభించింది.  నేరస్థులుగా ముద్ర పడ్డవారిని వారిని చైతన్యవంతం చేసింది.  మార్పుకి కృషి చేసింది.  దేశంలో స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన మొదటి సంస్కరణ కార్యక్రమం ఇదేనేమో ..!

నేరస్తులను సంస్కరించే ఇలాంటి కృషి స్వీడెన్ దేశంలో ప్రారంభం అయింది.  అయితే అది చేసింది నేరాలను, నేరస్థులను బయటి నుండి చూసి , స్పందించి వారిని సంస్కారించాలన్న సంస్కరణవాదులు కాదు.  అక్కడి జైళ్ళ లోని ఖైదీలు, శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత తమను తాము సంస్కరించుకోవాలని అనుకోవడం విశేషం.

ఆ విధంగా 1997లో KRIS అనే లాభాపేక్ష లేన్సి స్వచ్చంద సంస్థ ఏర్పడింది.  స్వీడెన్ రాజధాని స్టాక్ హొమ్ లో మొదటి సమావేశం జరిగింది.  2005 నాటికి దాదాపు 5000 మంది మాజీ ఖైదీలు , నేరస్తులు సభ్యులుగా చేరారు.

స్వీడెన్ దేశంలో నేరస్తులు అంటే మాదక ద్రవ్యాలకు లేదా మత్తు పదార్ధాలకు అలవాటుపడి వాటి  కోసం నేరాలు చేసిన వారే ఎక్కువ.  ఇప్పుడు KRIS సభ్యులంతా వారు మాదకద్రవ్యాలకు , మత్తుపదార్ధాలకు దూరంగా ఉంటున్న వారే.

జైళ్లలో ఉన్న నేరస్తులని క్రిస్ సభ్యులు కలుస్తారు.  వాళ్ళతో తరచు మాట్లాడుతూ ఉంటారు.  కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు .

మేం మాజీ నేరస్తులం.  కొన్నేళ్ళ పాటు జైల్లో మగ్గాం.  నేరస్థ జీవితంలో మాకు గౌరవం లేదు. అందులోంచి బయట పడాలని అనుకున్నాం.  అందుకే అలాంటి వారందరం కలిశాం.  ఒక సంస్థగా ఏర్పడ్డాము.  మమ్మల్ని గుర్తించండి. గౌరవించండి.  ఈ పౌర సమాజంలో మమ్మల్నీ భాగస్వాములు కానీయండి .   మమ్మల్ని మంచి పౌరులుగా ఎదగనీయండి .   మా పాత జీవితాన్ని మరచి మమ్మల్ని మీలో ఒకరుగా అంగీకరించండి.  అంటూ ముదుకు వెళ్తోంది KRIS.  వీరితో కలసి పనిచేసే పౌర సమాజాలు  సంస్థలు తక్కువే కావచ్చు  కానీ వారిని తక్కువ చేసి చూడలేం.  వారి ప్రయత్నాన్ని అభినందించి తీరాల్సిందే.

సంస్కార్ KRIS  రెండూ నేరస్తుల సంస్కరణ కోసం పని చేసినా, చేస్తున్నా వాటి పని తీరు మాత్రం భిన్నం. మన దేశంలో నేరస్థ జాతుల సంస్కరణ పౌర సమాజం నుండి అంటే సంస్కార్ సంస్థ నుండీ వచ్చింది .  స్విడెన్లో మాజీ నేరస్తులనుండి వచ్చింది.  స్వీడెన్ రాజుతో సహా వివిధ వర్గాల వారు దాదాపు 900 మంది వీరికి సహకరిస్తున్నారు.

యుహ డెడర్సన్ , అన్నేల్లి విక్లాండ్ లు మనదేశంలో సువార్ట్పురంలో సంస్కార్ చేస్తున్న సంస్కరణ కార్యక్రమాలను చూశారు.  ఎక్స్ క్రిమినల్స్ తో మాట్లాడారు.  మన జైళ్లను చూశారు.  వారు వెళ్ళిన తర్వాత సంస్కార్ నుండి ముగ్గురు సభ్యుల బృందాన్ని స్వీడన్ ఆహ్వానించారు.  ఆ బృందంలో సంస్కార్ చైర్మన్ లవణం గారు, సంస్కార్ – ప్లాన్ డైరెక్టర్ సుందర్ తో పాటు అప్పుడు  ప్రోగ్రాం మేనేజర్ గా ఉన్న  నాకు చోటు లభించింది.   అరుదైన అవకాశం దక్కింది.

SIDA , Forum Syd , KRIS ల  ఆర్ధిక సహాయంతో మా ప్రయాణ ఏర్పాట్లు జరిగిపోయాయి.

Tag Cloud

%d bloggers like this: