The greatest WordPress.com site in all the land!

Archive for July, 2015

చింటూ -చిరునేస్తాలు

ఏయ్ పిచ్చుక పిల్లా .. ఏమిటే ఆ గోల ? ఎందుకు అలా గొంతు చించుకు అరుస్తున్నావు. కాసేపు గమ్మునుండలేవూ .. ‘ కిటికీ పైన వెంటిలేటర్ అద్దాల మధ్యలో ఉన్న పిచ్చుక గూడు కేసి చూస్తూ ముద్దు ముద్దుగా కోప్పడ్డాడు ఏడేళ్ళ చింటూ

రెండు అద్దాల మధ్యన ఉన్న గూట్లోంచి బుజ్జి పిచ్చుక పిల్ల తల్లిదండ్రుల రాకకోసం ఎదురు చూస్తూ అరుస్తోంది. అదేపనిగా అరుస్తూనే ఉంది.

‘మా అమ్మా నాన్న నిన్నటి నుండి ఇంటికి రాలేదు ‘ గూట్లోంచి బయటికి తొంగి చూస్తూ ఏడుపు మొఖంతో చెప్పింది బుజ్జి ‘అవునా .. ఎందుకని రాలేదు ‘ దాని బాధంతా తనలో ఒమ్పుకుంటూ దిగులుగా మొహం పెట్టి చింటూ ప్రశ్న ‘ఏమో.. తెలియదు, అమ్మా వాళ్ళు బయటికి వెళ్తుంటే మేమూ వస్తామని మారాం చేశాం. నన్ను ఒక పక్క , తమ్ముడ్ని ఒక పక్క ఒళ్ళో కూర్చోపెట్టుకుని వద్దురా నా బంగారు కోండలూ .. నా బుజ్జి, బుల్లి చాలా చాలా మంచి వాళ్ళంట. అమ్మా నాన్న చెప్పినట్లు వింటారంట అని అమ్మ ముద్దు పెట్టింది’ బుగ్గ చూపిస్తూ చెప్పింది బుజ్జి.

‘ఎగరాడానికెందుకర్రా అంత తొందర. అసలే వాతావరణం బాగోలేదు. కొద్దిగా రెక్కలు రానీయండి. వాతావరణం బాగున్న రోజున మిమ్మల్ని బయటికి మేమే తీసుకెళ్తాం. అన్నీ చూపిస్తాంగా మా తల నిమురుతూ అన్నాడు నాన్న. సరేనని బుద్దిగా తలూపాం. వెళ్తూ వెళ్తూ మాకు చెరో ముద్దిచ్చి అల్లరి చెయ్యకుండా జాగ్రత్తగా ఉండండని, బయటికి వెళ్ళే ప్రయత్నం చేయొద్దని మరీ మరీ చెప్పి బయలుదేరారు. తొందరగా రండని బుల్లి ఏడుపు మొఖంతో అన్నాడు. మీ బొజ్జలు చూడండి ఎట్లా లోపలికి పోయాయో .. మీకు ఆకలేస్తోంది అవునా అంది అమ్మ. అవునని మేం తలలూపాం. అందుకే కదర్రా మీకు ఆహారం తేవడానికేగా మేం వెళ్ళేది. వీలయినంత త్వరగా వచ్చేస్తాం అని మమ్మల్ని బుజ్జగించి వెళ్ళారు. ఇప్పటికీ రాలేదు ‘ ఏడుపు స్వరంతో చెప్పింది బుజ్జి పిచ్చుక అయ్యో .. మీరే ఉన్నారా .. భయమేయ్యలేదా .. అని ఒక్క క్షణం ఆగి , ‘నిన్న చాలా పెద్ద గాలి, దుమ్ము తో పెద్ద వర్షం వచ్చిందికదా.. అప్పుడు ఇంట్లో మీరే ఉన్నారా .. ‘ చింటూ అమాయకపు కళ్ళలో సందేహం

‘ఊ .. అంతకు కొద్దిగా ముందే కదా అమ్మవాళ్ళు బయటికి వెళ్ళింది. మేమే బిక్కు బిక్కు మంటూ ఉన్నాం . మాకు చాలా భయమేసింది. డమ డమా .ఉరుములు.. . మెరుపులు మా మీదే పడ్డట్టు .. ఒణికిపోయాం’ చెప్పింది బుజ్జి రాత్రంతా నిద్రలేక కునుకు తీస్తున్న బుల్లి పిచ్చుక మాటలు వినబడి ఉలిక్కిపడి లేచింది. అమ్మా నాన్న వచ్చేసారేమో అని కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసింది. కనిపించలేదు. ఒక్క సారిగా లేచి బయటకు చూడబోయి జారి కిందపడింది. ‘తమ్ముడూ.. ‘ అని బుజ్జి పిచ్చ్చుక, ‘ అయ్యో.. ‘ అని చింటూ ఒకేసారి అరిచారు. దాన్ని కింద పడిపోకుండా ఆపడం కోసం తన చిట్టి చేతులతో ప్రయత్నించాడు చింటూ .. కానీ అది వాడి చేతుల్ని తాకుతూ కింద పడిపోయింది.

విలవిల లాడుతున్న బుల్లిని చేతిలోకి తీసుకుని ‘అమ్మా అమ్మా ‘ అని అరుస్తూ ఇంట్లోకి పరుగెత్తాడు. అది బాధతో అరుస్తూనే ఉంది. ‘అయ్యయ్యో ఆ చంటి పిల్లని పట్టుకోచ్చావేంటి నాన్నా .. తప్పు కదా .. అక్కడే వదిలేసిరా ..’ చింటూ అమ్మ కోప్పడింది. ‘లేదమ్మా నేను దాన్ని దాని గూట్లోంచి తీయలేదమ్మా . అదే వాళ్ళమ్మ వాళ్ళకోసం చూస్తూ జారి పడిపోయింది. అదుగో అటు చూడు బుజ్జి పిచ్చుక తమ్ముడు కోసం, అమ్మా నాన్న కోసం ఎట్లా ఏడుస్తాందో .. ‘ బిక్క మొహంతో చెప్పాడు చింటూ

‘అవునా ..’ అంటూ వెళ్లి మంచినీళ్ళు దానిపై చిమ్మింది. దాన్ని జాగ్రత్తగా చూసి ఏమీ దెబ్బలు తగల్లెదులే .. అంటూ దాని నోట్లో మంచి నీటి చుక్కలు వేసింది చింటూ అమ్మ ‘అమ్మా బుల్లి పిచ్చుక , వాళ్ళ అన్న బుజ్జి పిచ్చ్చుక నిన్నటి నుండి ఏమీ తినలేదట . వాళ్ళ అమ్మా నాన్నలకోసం బెంగపెట్టుకుని ఏడుస్తున్నాయి దీనంగా మొహం పెట్టి చెప్పాడు చింటూ.

అమ్మ బుల్లి పిచ్చుకకు సపర్యలుచేస్తుంటే చూస్తూ తనకే దెబ్బ తగిలినట్లు వలవిల లాడాడు. నా చిట్టి తండ్రికి ఎంత దయాగుణం .. తనే ఆ బాధలు పడుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. గత నాలుగు రోజులుగా అవి వాడి నేస్తాలు అయ్యాయి అనుకుంటూ ‘బుల్లి పై నుండి పడింది కద నాన్నా .. , అందుకే కొంచెం షాక్ లో ఉంది. కొంచెం సేపయితే మాములుగా అయిపోతుందిలే .. నీవేం దిగులుపడకుప్పింది అమ్మ. అయినా కొడుకు విచారం తగ్గలేదని గమనించిన అమ్మ ‘వెళ్లి గుప్పెడు బియ్యం తెచ్చిదీనికి వెయ్యి, తింటుంది’ అని చెప్పింది.

‘ అమ్మా బుల్లి బియ్యం తినలేకపోతోంది చూడు ..’ తల్లి మొహం రెండు చేతులతో తన వేపు తిప్పుకుని చెప్పాడు. ‘ఇది చిన్నపిల్ల కదమ్మా .. బియ్యం ఎట్లా తింటుంది? గట్టిగా ఉన్నాయి కదా’ .. అంటూ అమ్మ చేయి వదిలి లోపలికి పరుగెత్తాడు. కుక్కర్ లోంచి గుప్పెడు అన్నం తీసుకొచ్చి దానిముందు వేశాడు. అది ఒక మెతుకు కూడా నోట్లో పెట్టుకోలేదు.

బుల్లిని తదేకంగా చూస్తూ ‘ఇది మెత్తగానే ఉందిలే తిను ‘ ముద్దు ముద్దుగా అంటున్న చింటూ మురిపెంగా చూసింది అమ్మ. ఆ బుల్లి పిచ్చుక అన్నాన్ని చూస్తూ తన అన్న ఏడుపు వినవస్తున్న దిక్కునూ చూస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ‘బుజ్జీ మీ తమ్ముడికి ఎట్లా ఉందోనని ఏడుస్తున్నావా .. ఏడవకు ఏం కాలేదులే నీ తమ్ముడికి . మీరు నిన్నటి నుండి ఏమి తినలేదని నాకు తెలుసుగా .. అందుకే అన్నం పెట్టా . తిని వస్తుంది’ అని గట్టిగా అరిచి చెప్పాడు బుజ్జికి విన పడాలనే ఉద్దేశంతో.

తన తమ్ముడేడి అని చుట్టూ పరికించింది బుజ్జి పిచ్చుక. కనిపించలేదు. ఎగిరి తమ్ముడు దగ్గరికి చేరాలని ప్రయత్నిస్తోంది. ఎగరలేక పోతోంది. ‘ప్లీజ్ , నన్ను మా అన్న దగ్గరకి పంపవా ‘ బతిమాలింది బుల్లి పిచ్చుక. ‘ వాళ్ళ అన్నకోసం బెంగపడుతోంది. నెమ్మదిగా గూట్లో పెట్టేయ్యి చింటూ..’ అనే మాటలు విన్పించాయి బుజ్జికి. నా తమ్ముడు బాగానే ఉన్నాడని ఆనందపడి తమ్ముడి దగ్గరకి వెళ్ళాలన్న ప్రయత్నం మానుకుంది.

సరేననిచింటూ దాన్ని చేతిలోకి తీసుకోగానే నెప్పితో అరిచింది బుల్లి . దెబ్బ నొప్పి పెద్తోందా అని జండు బాం రాసాడు. ఆ తర్వాత స్టూలు వేసుకుని కిటికీ ఊచలు పట్టుకుని పైకి ఎక్కుతోంటే చింటూ పడిపోతావ్ అంటూ అమ్మ వచ్చి నెమ్మదిగా గూట్లో వదిలింది. చింటూ పరుగు పరుగున ఇంట్లోంచి అన్నం తెచ్చ్చి అమ్మ కిచ్చాడు . అదికూడా గూట్లో వదిలింది అమ్మ .

నన్ను అమ్మా నాన్నా జాగ్రత్తగా చూసుకుంటారు . వీటిని వాళ్ళ అమ్మ నాన్న వచ్చేవరకూ నేను చూసుకోవాలి మనసులోనే అనుకుని, ‘ చిరు నేస్తాలూ .. ఏడవకండి . మీకేం కావాలన్నా నేనున్నాను. ఈ ఫ్రెండ్ ని నమ్మండి. మీ అమ్మా నాన్నా వచ్చేవరకూ నేను మీకు తోడుంటాను’ పెద్దరికంగా అభయమిచ్చాడు చింటూ . ఆ మాటలు విన్న అమ్మ హృదయం ఆనందంతో పొంగింది.

– వి . శాంతి ప్రబోధ

published in Jabilli children’s web magazine july 22, 2015

తస్మాత్ జాగ్రత్త

thasmat jagraththa-praja- june  ఇది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే .  ఎవరిపై బురద జల్లినా అది తప్పకుందా ఖండిచాల్సిన సంగతే. ఆమె లైంగికతే అందుకు కారణమైతే ..? అది ఆకాశంలో సగ భాగమైన మహిళలందరినీ అవమానించినట్లే కదా ..?
కారణాలేమైనా ..రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో నియమితులైన మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారిగానే కాకుండా  కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అడవులు, పర్యావరణం, నీటిపారుదల, ఐసీడీఎస్, హౌజింగ్, వ్యవసాయం, పాడి పరిశ్రమ, ల్యాండ్ రెవెన్యూ, విపత్తు నిర్వహణ, యూఎల్సీ లాంటి శాఖలను పర్యవేక్షిస్తున్నారు ఐఏఎస్ అధికారిణి స్మితా సిబ్బర్వాల్ .  సీఎంవోలో విధులు నిర్వహించటమంటే ఆషామాషీ విషయం కాదు .  నిత్యం తీరిక లేకుండా ఉండే సిన్సియర్  ఐఏఎస్ అధికారి  ఆమె. అటువంటి వ్యక్తిపై అసంబద్దమైన , అనుచితమైన కథనం OUTLOOK వీక్లి లో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.  దాన్ని ఆమె తీవ్రంగా ఖండించిన విషయం, ఆ తర్వాత యు ట్యూబ్ లో క్యారికేచర్ తొలగించడం తెలిసిందే .
ఆవిడపై పనిగట్టుకుని రాయాల్సిన అవసరం, పనిగట్టుకుని పేరు పెట్టకుండా క్యారికేచర్ గీయడం ఏమిటి ? అనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తాయి . ఒక ప్రవేటు కార్యక్రమంలో వేసుకున్న దుస్తుల ఆధారంగా ఆమె క్యారెక్టర్ ని నిర్ణయిస్తారా .. ఆమె అనువైన దుస్తుల్ని ఎంచుకునే అధికారం ఆమెపై ఆమెకు ఉండదా ..? నిజానికి, ఎటువంటి అసభ్యతకి తావివ్వని దుస్తుల్లో కనిపిస్తారామే. నీటుగా నిండైన దుస్తుల్లో కన్పిస్తున్న ఆమెని   అన్నిటికీ మించి ఆవిడ ఏ జిల్లాలో పనిచేసినా అట్టడుగు వర్గాల అభున్నతికి కృషిచేశారన్న మంచి పేరు ఉంది.

నిండా నలబై ఏళ్ళు లేని స్మిత 2001 ఐఏఎస్ అధికారిణి. ఆమె 22 వ ఏటనే 4 వ రాంకుతో ఐఏఎస్ సాధించిన ప్రజ్ఞాశాలి. పదేళ్ళ పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేసిన తర్వాత 2011 లో కరీంనగర్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.  ఆ సమయంలో ఆమె ప్రజలకు చేరువయ్యే ఎన్నో కొత్త కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. జిల్లా పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె మదిలోంచి పుట్టిన కార్యక్రమమే అమ్మలాలన కార్యక్రమం.  20 సూత్రాల కార్యక్రమం అమలు,  పాలనపై పట్టు ఆమెకు ప్రధానమంత్రి ఎక్ష్సెలెన్స్ అవార్డు తెచ్చిపెట్టింది .  అదే విధంగా గత పార్లమెంటు , అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో మెదక్ జిల్లా కలెక్టర్ గా ఓటరును చైతన్యపరచి అధిక పోలింగ్ సాధించారు  స్మితా సబ్బర్వాల్.   ఆమె కార్యదక్షత , పనిపట్ల నిబద్దత , ప్రజల మనిషిగా ఆమె అమలు పరచిన అబివృద్ది కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆమెను చేరువ చేశాయి.

ఆమె కార్యదక్షతను, పరిపాలన దక్షతను, సేవాతత్పరతను  వదిలేసి అవమానకరంగా చిత్రించడం జరిగిందంటే కారణం ఆమె మహిళ కావడమే కదా ..!.  అదే స్థానంలో పురుషుడు ఉంటే ఇలాగే రాసేవారా ..? ప్రతిభను, సమర్ధతను గుర్తించకుండా “ఐ క్యాండి ‘ పదాలతో హీనపరుస్తారా ? వారి లైంగికతనే గుర్తిస్తారా ?

అవుట్ లుక్ పత్రిక ఈ వ్యాసం రాయడంలోని రాజకీయ కారణాలు ఏమైనప్పటికీ ఇలాంటి అసంబద్ద రాతని ఖండించాల్సిందే. ఇక్కడ మరో విషయం కూడా నొక్కి చేపుకోవాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారిణికే ఇలాంటి పరాభవాలు జరిగితే సామాన్య మహిళల విషయం ఏమిటి..?  ఇలాగే ఉంటే అన్ని రంగల్లో మహిళల భాగస్వామ్యం మరింత తగ్గిపోదా ..?  వేసే ప్రతి అడుగుని స్కాన్ చేసి అనుచిత వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టి వెనక్కి లాగేయడం కాదా ?  ఎన్నో ఉద్యమాలు , పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు , సాధించిన అభివృద్ధి , సాధికారత దిశగా వేస్తున్న అడుగులు  ఏమవుతాయి ? ఏ గమ్యం చేరతాయి ఆలోచించాల్సిన సమయం ఇది.   ఆమెని సెక్స్ అబ్జెక్ట్ గా మాత్రమే చూసే వ్యాధికి చికిత్స జరగకపోతే, తగిన మందు పడక పొతే, కుళ్ళి కంపు కొట్టే భావనల్ని తెగనరికి కాయకల్ప చికిత్స చేయకపోతే రాచపుండులా పెరిగిపోతుంది. కూకటివేళ్ళతో సహా నాశనం చేస్తుంది. కాబట్టి,  మహిళల్లారా… తస్మాత్ జాగ్రత్త  .

వి . శాంతి ప్రబోధ

(published in Prajathanthra daily on 7.7.15)

ప్రకృతి తల్లి హృది మీటే ప్రయత్నంలో …

నా ఊళ్ళో ..పరిశ్రమలు .. ఫాక్టరీలు ..

రెక్కలు కట్టుకోచ్చి ముంగిట వాలిన అభివృద్ధిని

కళ్ళారా చూసి ఆనందించాలని కలలు కంటూ

పచ్చని నా పల్లెతల్లి ఒడిలో వెచ్చగా సేదతీరాలని

బతుకు దారులు వెతుక్కుంటూ పోయిన నే

జ్ఞాపకాల తీగలపై తేలియాడుతూ తిరిగొచ్చా ..

కళ్ళనిండుగా కళకళలాడే దృశ్యాలు కనుచూపుమేరలో

కానరాక కారుచిచ్చులా ఎగిసే పొగ మేఘం

ఉరితాళ్ళలా సాగిపొయ్యే విద్యుదయస్కాంత తీగలు

మా వారి హృదయ తంత్రుల్ని చుట్టేసే తరంగాలు

కాన్సర్ లూ .. ట్యూమర్ లూ ఇచ్చే రేడియా ధార్మిక కణాలు

నిగనిగలాడే శరీరాలు తెల్లని మచ్చలతో వెలవెలబోతూ

మిల మిల లాడే కళ్ళు నిస్సత్తువగా తెలతెలాపోతూ

ఉరికంబంపై వేలాడదీసిన శవంలా …

పిల్లా పాపలతో నిండుగా నవ్వే నా పల్లె దివాళా తీసినట్టుగా ..

వెక్కిరిస్తూ ..చెవుల కింపైన సంగీతంలా సాగే సవ్వడుల

నా పల్లె గీతం మృత్యు రాగమాలపిస్తూ..  కోడి కూతలూ

నక్క ఊళలూ కనుమరుగై, విషంగా నింగీ నేలా నీరూ

నెత్తుటి కడవల గర్భస్రావాలూ ..కండరాల సమస్యలూ..

బుద్దిమాంద్యాలూ  ..శక్తి విహీనమైన తారల్ని అందిస్తూ

కొత్తతరపు దారులు చేసే శివతాండవం చూసి బావురుమన్నా ..

శ్వాస నిశ్వాసల్లో గలగలలాడే కరెన్సీనే కలవరిస్తూ పలవరిస్తూ

గడించే రూపాయిలూ .. డాలర్లూ.. యూరోలూ…అందుకునే

యముడు పలుకుమార్చి, స్వరం మార్చి మోగించే చావుడప్పుతో

మా వారసులకిచ్చే ఆస్తిని చూసి మౌనంగా ప్రశ్నించే నా పల్లె ఘోష

ఏమని చెప్పను ? పచ్చని నా గ్రామ స్మృతులని బొక్కేనేసి తోడేస్తూ ..

నెత్తుటి కన్నీళ్ళ మడుగులో మరుభూమిగా నిలిచిన నా పల్లె దృశ్యాలను

లోపలిపోరల్లో ఇంకిపోకుండా ఎలా కాపాడగలను ?

ప్రాణంతో తొణికిసలాడే జలధారల్ని ఎలా సృస్టించగలను ..?

నింగీ  నేల నీరు సజీవంగా పదికాలాల పాటు పదిలంగా

నిలబెట్టుకోడానికి  ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో

నేను,  ప్రకృతి తల్లి హృది మీటే ప్రయత్నంలో …

 

వల్లూరిపల్లి  శాంతి ప్రబోధ

published in Kuwait NRI’S.Com

 

వినిమయంలో నియమం

vini 1నీవూ .. నేనూ .. మనం
వినిమయదారులం .. వినియోగదారులం
వినిమయంలో.. నేడు, నియమం మాయం
విపణి వీధి  మోస విన్యాసాల మయం
వలలు వేసే బంపర్ ఆఫర్లు ఊదరగొట్టే ప్రకటనలూ
నకిలీలు అడ్డదారుల్ల్లో సందడి చేస్తూ
                            సింగారాన్ని బంగారంలా మెరిపిస్తూ
                            మాయచేసి బురిడీ కొట్టిచ్చే కనికట్టు విద్యలూ
తూకాల్లో కొలతల్లో నాణ్యతలో స్వచ్చతలో
రేషన్, ఫ్యాషన్, మాన్షన్, ఆపరేషన్   ఏదైనా
వేయి పడగల విషనాగులా బుసలు కొడుతూ ..
మన బతుకుల్ని కాటేస్తూ..  కాలరాస్తూ…
అందుకే .. , పెంచుకోవాలి వినియోగ చైతన్యం
అరికట్టాలి అక్రమార్కుల నకిలీల రాజ్యం
అంటే .. అంగడి అమ్మకాల్లో కావాలి అప్రమత్తం
ఆకాశంలో చుక్కలకెగబాకాలి మన చైతన్యం
ఆగ్మార్క్, ఐఎస్ఐ, , హాల్మార్క్ , ఎకోమార్క్ గుర్తులు                     vini 2
స్వచ్చత, నాణ్యత, మన్నిక, ధర లేబుళ్ళు
చూసుకోవాలి, గ్యారంటి , వారంటి ఎక్స్ పైరీలు
చూసి కొనాలి వస్తువులు అడగాలి బిల్లులు
లోపం ఉన్నా  కల్తీ జరిగినా చేయాలి ఫిర్యాదులు
మనకోసం వెన్నుదన్నుగా చట్టాలు, హెల్ప్ లైనులు
vini 3తెలుసుకోవాలి వినియోగదారుల సంఘాల విజయ గాధలు
పొందాలి న్యాయం నష్టపోయిన సొమ్ములు వస్తువులు
నిన్న కనబడని తారకల్లా వినియోగ హక్కులు
నేడు సలహాలూ సూచనల కళారూపాలు కన్స్యుమర్స్ క్లబ్బులు,
కట్టుదిట్టమైన నిబంధనల రక్షణా చర్యలు
జిల్లా, రాష్ట్ర , జాతీయ స్థాయిల్లో కమిషన్లు
వెండి వెన్నెల్లా వినియోగ విద్య దోసిట నింపుతూ ..
విలువలతో..  వినిమయంలో నియమం పాటిస్తూ ..
వి. శాంతి ప్రబోధ
Published in VINIYOGAM VIKASAM KOSAM July, 2015

మూలం

గడ్డకట్టిన భావజాలంతో మొలకెత్తిన మీ ప్రశ్న ..
నా మూలం ఏదనేగా మీ వెతుకులాట .?!
నా పుట్టుపూర్వోత్తరాలేమిటనేగా మీ గుంజులాట ?!!
నా అస్తిత్వం ఎక్కడిదనేగా మీ వాదులాట?!!!

నిజమే .. నేనెక్కడిదాన్ని ?
తమిళనాడు? ఆంధ్రా ..?? తెలంగాణా ..???
నాదే ప్రాంతం ? నేనేమని చెప్పుకోవాలి ??
నేను పుట్టిపెరిగిన ప్రాంతాన్నా ..
మా తాత ముత్తాతలు తిరుగాడిన తావునా
నా మూలాల తోనే
నా ఎదుగుదల, నా బతుకు ముడిపడి ఉందట !
అలలు అలలుగా ఎగిసిపడుతున్న ఆలోచనలు
ఆకాశ మేఘాల్లా.. తెల్ల ఐరావతంలా తోసుకువస్తూ ..

అమ్మా.. గోదారమ్మ తల్లీ నీవైనా చెప్పు తల్లీ
నీవెక్కడో పుట్టావ్ నాసిక్ లో ..
వాలుని బట్టి సాగుతూ వాగుల్ని వంకల్ని
ఐక్యం చేసుకుని కనువిందుచేస్తూ కొండాకోనల్ని
దాటుతూ గుండెని విశాలం చేసి గంగాజలమై జనం గొంతుల్ని
తడుపుతూ పంట పొలాల్ని
సస్యశామలం చేస్తూ బంగారు పంటల్ని
ఇస్తూ బంగాళాఖాతంలో విశ్రమిస్తున్నావే
నీ నడక సాగిన పొడవునా అంతా నిన్నే
తలుస్తూ అక్కున చేర్చుకున్నారే ..
వేగం తగ్గిన నీ కోసం అర్రులు చాస్తున్నారే
ఎవరికివారు తమకే చెందుతావంటున్నారే

మరి నన్నెందుకమ్మా ఇలా అవమానిస్తారు ..?
బతుకు మజిలీలో మావాళ్ళు చివరికిక్కడ చేరితే
జరిమానా నాకు విధించడం న్యాయమా ?
ధర్మం చెప్పమ్మా.. గోదారమ్మ తల్లీ
ప్రవాహ తీరు నీకూ నాకూ ఒకటి కాదా
పలుకు .. స్వరం మారిపోతుందా .. ?!

ఇన్నాళ్ళూ నాదైనది ఇప్పుడు కాదంటుంటే
ఇన్నేళ్ళ నా కృషిని మరుగుజ్జును చేస్తుంటే
ఎదనిండా శిలాక్షరాల గాయాలై నెత్తురోడుతుంటే ..
జలపాతపు హోరులా సలుపుతుంటే
జాలరిలాగా జల్లెడ పడుతున్నా ..ఆత్మీయ కలయికలకోసం

వి. శాంతి ప్రబోధ

(published in June, 2015 Bhoomika Magazine)

బలవంతపు పెళ్ళిల్ల సంకెళ్ళలో ..

praja  31- june 6జరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. ఎన్నెన్నో పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి.  ఒక అమ్మాయిని  ఒక అబ్బాయిని జత చేస్తున్నాయి. కలసి జీవించండి అంటున్నాయి. అవి సంప్రాదాయ పెళ్ళిళ్ళు కావచ్చు కాకపోవచ్చు. అది ఒక కులంలో కావచ్చు, మతంలో కావచ్చు , వర్గంలో కావచ్చు ప్రాంతంలో కావచ్చు. లేదా కులాంతరము, మతాంతరం, ప్రాంతాంతరం , దేశాంతరం , వర్గాంతరం కూడా కావచ్చు . ప్రపంచ వ్యాప్తంగా పెళ్ళిళ్ళు జరిగి పోతునే ఉన్నాయి.  ధనిక, పేద తారతమ్యాలు లేకుండా గ్రామీణ – పట్టణ భేధాల్లేకుండా జరిగిపోతూనే ఉన్నాయి.  అయితే , దాని గురించి అంతగా చెప్పుకునేదేముంది అనిపించవచ్చు . నిజమే, ఆ విధంగా అనిపించడం సహజం కూడా..  కుల, మత , ప్రాంత , దేశాంతర పెళ్ళిళ్ళు సాధారణంగా ప్రేమ వివాహాలు అయి ఉంటాయి.  ఒకరికొకరు ఇష్టపడి చేసుకునేవి అయి వుంటాయి. అలాంటి వాటి గురించి ఇక్కడ నేను మాట్లాడ బోవడం లేదు .  అమ్మయికి పెళ్లి వయస్సు రాకుండా, ఆమె ఇష్టం లేకుండా, ఆమె ప్రమేయం లేకుండా, ఆమెకు తెలియ కుండా జరిగే పెళ్ళిళ్ళ  గురించే నేను మాట్లాడదలచాను.  మన పురుషాధిక్య  సమాజంలో ఇష్టంలేకుండా జరిగే పెళ్ళిళ్ళు లేదా బలవంతపు పెళ్ళిళ్ళు ఎక్కువగా  అమ్మాయి విషయంలోనే అని వేరే చెప్పక్కరలేదు కదా..  అలాంటి పెళ్ళిళ్ళ గురించే, అమ్మాయి ఇష్టాయిస్టాలతో తమకు సంబంధం లేదని పెద్దలు నిర్ణయించి చేసే పెళ్ళిళ్ళ గురించే, బలవంతంగా అమ్మాయిని కిడ్నాప్ చేసి చేసుకునే పెళ్ళిళ్ళ గురించే నేను ప్రస్తావించదలచుకున్నది.


యుక్తవయస్సుకొచ్చాక తమ జతని వెతుక్కోవడం సహజమే. అది పశు పక్ష్యాదుల్లో కావచ్చు , మానవుల్లో కావచ్చు.   కానీ జంటలని పెద్దలు నిర్ణయించి ఏర్పాటు చేసేది మాత్రం వేరే ఏ జీవరాశిలో కనిపించదు.
అదీ యుక్తవయస్సు రాక ముందే తమకు నచ్చిన విధంగా, తమ అవసరాలకు అనుగుణంగా పిల్ల పెళ్లి చేసేస్తుంటారు పెద్దలు.  వాటిలో ఎన్ని పిల్లల ఇష్టపూర్వకంగా జరుగుతున్నాయి. ఎన్ని పెళ్లి వయసు వచ్చాక జరుగుతున్నాయి అని తరచి చూస్తే.., ప్రతి సంవత్సరం లక్షలాది బలవంతపు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అమ్మాయికి అబ్బాయికి పెళ్లి వయస్సు రాకముందే వారి అభిప్రాయంతో ప్రమేయం లేకుండా  పెద్దల ఇష్టప్రకారం జరిగేవి కావచ్చు. డబ్బుకోసం/ఆస్తి కోసం పిల్లల్ల్ని పెళ్లి పేరుతో అమ్మేయడం కావచ్చు,  అరబ్బు షేక్ లతో జరిగే నెల రోజుల కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు కావచ్చు . పెళ్లి పేరుతొ అక్రమంగా రవాణా చేయడం కావచ్చు. వ్యభిచార కూపంలోకి నెట్టడం కావచ్చు .  పెళ్లి చేసుకుని పనిమనిషిగా మార్చడం కావచ్చు బలవంతంగా ఎత్తుకెళ్ళిమతం మార్చి లేదా బెదిరించి పెళ్ళిచేసుకోవడం కావచ్చు.

ఏదైనా ఆమె ఇష్టపూర్వకంగా జరగని పెళ్ళి అంటే ఆమెకు బలవంతపు పెళ్ళేగా ..  అవి మహిళల ,బాలికల జీవితాల్ని బానిసత్వంలోకి నేట్టేస్తున్నాయి.

చట్టరీత్యా బానిసత్వం నేరం. కానీ,  బలవంతంగా జరిగే పెళ్లి ద్వారా బానిసత్వం లోకి నెట్టబడే బాలికల, మహిళల జీవితాలగురించి గానీ , అది నేరం అని గానీ మనం ఆలోచించం. ఆ విషయాల గురించి మాట్లాడం , చర్చించం. అది ఒక సమస్యగానే గుర్తించం.  ఒక వేళ ఎవరైనా మాట్లాడినా చాలా తక్కువగా మాట్లాడతాం.  అందువల్లే ఇలాంటి నేరాలు సంప్రదాయం ముసుగులో యదేచ్చగా జరిగిపోతున్నాయి. చెప్పుకోదగ్గ మార్పులేమీ రాకపోతే భవిష్యత్తులోనూ రాబోయే సంవత్సరాలలోనూ ఇంకా పెరిగిపోయే అవకాశాలున్నాయి.

18 సంవత్సరాల లోపు ఆడపిల్లకి పెళ్లి చేయకూడదు.  బలవంతంగా అసలు చేయకూడదు. అది నేరం. చట్టరీత్య శిక్ష ఉంటుంది.  కానీ ఆ విషయం మనకు తెలియదు. తెలిసినా తెలియనట్లుగానే నటిస్తాం.  పండితుల నుండి పామరుల దాకా ఇదే తంతు.  అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారం చెలాయించే వాళ్ళు, చట్టాలు చేసే వాళ్ళు , వాటిని అమలు చేయాల్సిన వాళ్ళు కూడా ఇందుకు మినహాయింపు ఏమాత్రం కాదు.
ఏదేమైనా బలవంతపు పెళ్లిళ్లకు బలయ్యేది మాత్రం ఆడపిల్ల నిండు జీవితం.  ఆమెకు బలవంతపు పెళ్ళిళ్ళు నేరం అని తెలియక పోవడం వల్లనో , పరువు తక్కువ అనో, పెద్దలనుండి వ్యతిరేకత ఎదురవుతుందనో గానీ ఇలాంటి పెళ్ళిళ్ళకి వ్యతిరేకంగా కేసులు నమోదు కావడం లేదు.   ఇష్టం లేకుండానే, బలవంతంగానే ఆ వివాహబంధంలో నలిగి నలిగి కృశించిపోతున్న బాలికలు, యువతులు, మహిళలు అనేకం.

18 ఏళ్ళ పై బడిన వారిని లెక్క లోకి తీసుకోకుండా చూస్తే ప్రతి రెండు సెకన్లకి ఒక బాలిక బలవంతపు పెళ్ళికి బలవుతున్నారట. 
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి ముగ్గురు బాలికల్లో ఒకరికి 18 ఏళ్ల లోపే పెళ్లి జరిగిపోతోందట.  దాదాపు 60 ఏళ్ళ క్రితం తయారైన అంతర్జాతీయ చట్టం ప్రకారము బలవంతపు పెళ్లి అంటే అది బానిసత్వం తో సమానం , నేరం.
ఇక
మనదేశంలో చూస్తే 44 శాతం ఆడపిల్లలకి 18 లోపే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయట .  అందులో 70 నుండి 80 శాతం పెళ్ళిళ్ళు బలవంతపు పెళ్లిల్లే నని ఒక సర్వే తెలిపింది.
2013 ఐక్య రాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి రాజు 20 వేల మంది 18 ఏళ్లలోపే తల్లులు అవుతున్నారు.  ఎక్కడ వెనుకబాటుతనం, దారిద్ర్యం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.  నూటికి 10 జననాలు పెళ్ళికాని తల్లుల ఇచ్చేవేనని , 15 ఏళ్ల లోపువారికి పుట్టిన వాళ్ళే 20 లక్షల వరకూ ఉంటారని ఆ నివేదిక తెలిపింది.  మనదేశంలో 22 శాతం 18 ఏళ్ళ లోపే గర్భావతులవుతున్నారట.

వయస్సు రాకముందే గర్భం దాల్చడం , కాన్పు కష్టమై మరణించడం, అబార్షన్లు ఎక్కువగా అవడం 18 ఏళ్ళలోపు జరిగే బలవంతపు పెళ్ళిళ్ళలో ఎక్కువ. ఇలాగే కొనసాగితే
అందుకే బలవంతపు పెళ్ళిళ్ళ వల్ల బానిసత్వంలో మగ్గే బాధితుల గురించి మనం ఆలోచించాలి. వాళ్ళు తమ గురించి తాము మాట్లాడలేని స్థితిలో తమని ఆదుకొమ్మని ప్రపంచాన్నిఅర్ధిస్తున్నారని గమనించాలి. వాళ్ళను కష్టాల కొలిమిలోంచి బయట పడేయాలి. భవిష్యత్తులోనూ ఇలాంటి బలవంతపు పెళ్ళిళ్ళు జరగకుండా చూడాలి.
ప్రపంచమంతా బాలికల రక్షణకు చట్టాలు ఉన్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి.  బాలికల రక్షణ హక్కులను హరించివేసే వేసే విధంగా పనిచేసే వాళ్ళే ఎక్కువని తెలుస్తోంది కదా ..
 విద్యాధిక కుటుంబాలలోనూ , ఉన్నత తరగతి కుటుంబాలలోనూ , పట్టణ ప్రాంత కుటుంబాలలోనూ బలవంతపు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నప్పటికీ వాటి సంఖ్య గ్రామీణ ప్రాంతాలతోను, అల్పాదాయవర్గాల తోనూ పోలిస్తే తక్కువే 

గుడిలో అన్ని చోట్లా పిల్లల పెళ్లి వయస్సు తెలపడమే కాకుండా ఇష్టం లేని పెళ్లి లేదా బలవంతపు పెళ్లి చేయడం నేరం అని ఆడపిల్లలకి తెలియాలి. వారి తల్లి దండ్రులకి , కుటుంబాలకి తెలియాలి. అందుకు చట్ట ప్రకారం ఉన్న శిక్షల గురించి

తెలిపేచర్యలు తీసుకోవాలి. అందుకోసం ప్రచార ప్రసార సాధనాలని సాధనంగా చేసుకోవాలి.

వి. శాంతి ప్రబోధ
(published in Prajatanthra weekly May 31 -June 6)
తెలిపేచర్యలు తీసుకోవాలి. అందుకోసం ప్రచార ప్రసార సాధనాలని సాధనంగా చేసుకోవాలి.

వి. శాంతి ప్రబోధ

ఆలోచించడం మొదలు పెట్టాక ..

‘సరూ సరూ .. ‘ గట్టిగా పిలుస్తూ వచ్చింది గీత

‘ఏమైందే …కాలింగ్ బెల్ కొట్టకుండా  అంత దూరం నుండే అరుస్తూ వస్తున్నావ్ ‘ నవ్వుతూ తలుపు తీసింది సరోజ .
‘నీకీ విషయం తెలుసా?’ ఆ గొంతులో కంగారు, ఆందోళన
‘ ఏమిటో  చెప్పకుండా ఈ విషయం  తెలుసా .. అంటే ఎలా తెలుస్తుందే ..’ అంటూ లోనికి వెళ్లి ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ తీసుకొని టేబుల్ మిద ఉన్న గ్లాసుల స్టాండ్ లోంచి  గ్లాసు తీసుకు వస్తూ
‘ముందు నువ్వు కూర్చో’ అంటూ తన వెనకే వచ్చిన గీతకు మంచి నీళ్ళ  గ్లాసు అందించింది.
‘రాము ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదట.  హాస్పిటల్ లోనే ఉన్నాడట. ఇవ్వాళో రేపో అంటున్నారట ‘త్వరత్వరగా చెప్పింది తెలిసిన విషయాన్ని సరోజ మొహలోకి చూస్తూ .  ఆగొంతులో ఆదుర్దా.
‘అయితే నాకెందుకు చెప్తున్నా ‘ అప్పటివరకూ నవ్వుతూ ఉన్నముఖం కాస్త కఠినంగా మారుతూండగా
‘అదేంటి సరూ .. అలా అంటావ్ ‘ ఆశ్చర్యంగా అని, ‘ ఈ విషయాన్ని వినగానే నాకు చాలా బాధనిపించింది.  వెంటనే నీకు కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తోంది.  ఇక ఆగలేక నీకు చెబుదామని ఉన్నపళాన పరుగు పరుగున వస్తే ఇలా అంటావే ‘ఆ కంఠంలో విసుగూ, కోపం, బాధ మిళితమై.
‘రోజూ ఎందఱో చావు వాకిట నిలబడి ఉంటారు . లేదా చనిపోతారు. ఇదీ అంతే’ లోపల ఎలాంటి భావనలు కలుగుతున్నాయో ఏమాత్రం బయటపడకుండా అతి మాములుగా సరోజ
‘ఏమిటీ ఇదీ అంతేనా ..’ హతాశురాలైన గీత
‘మరేమని అనాలే ? భోరు భోరున ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ హాస్పిటల్ కి పరుగెత్తి సేవలు చేయాలా ‘ కఠినం అవుతున్న గొంతుతో
‘సరూ నిజం చెప్పు , నీకేం అనిపించడం లేదా ..’ ఆవేశాన్ని అణుచుకుంటూ అని,  మళ్లీ తానే  ‘ కొద్దిగా పరిచయం అయితేనే, కాస్త తెలిసిన వాళ్లయితేనే వారికి ఆపద వచ్చిందంటే అయ్యో అనిపిస్తుందే ..వెళ్లి చూసిరావాలని అనిపిస్తుందే, మరి మీరు రెండేళ్ళు ప్రేమలో మునిగి తేలారు.  అయిన వాళ్ళందరినీ కాదనుకున్నారు.  పదేళ్ళు కలసి సహాజీవనం చేశారు.  ఆ అనుబంధం గుర్తుకు రావడం లేదా .. ?
‘గీతా ,  ఆపుతావా నీ పురాణం?  ఆ విషయం మాట్లాడాలని వస్తే ఇక నేను మాట్లాడేదేమీ లేదు’ నిక్కచ్చిగా గట్టిగానే  చెప్పి టీ పాయ్ మీదున్న రిమోట్ అందుకుని రెండుసార్లు దాన్ని అటూ ఇటూ తిప్పి టి .వీ. అన్ చేసింది.  నీవిక వెళ్ళవచ్చు అన్నట్లుగా ఉందామె వైఖరి.
ఒక్క క్షణం సరోజ వైపే దీర్ఘంగా చూసిన గీత, సరోజ చేతిలోని రిమోట్ లాక్కుని వాల్యూం తగ్గించింది.  ఆమెకి సరోజ మీద చాలా కోపంగాను , అసహనంగాను ఉంది.  తెలిసిన వాళ్లకి బాగోకపోతే వెళ్లి పరామర్శించి దైర్యం చెప్పి వస్తామే, అలాంటిది కొంతకాలం ఒకరికోకరుగా బతికారు.  ఎన్నో ఆనందాలు మూటగట్టుకున్నారు.  అతను ఎన్నో  తప్పులు చేసి ఉండవచ్చు.  ఆమెను ఆవేదనకు గురి చేసి ఉండవచ్చు.  వ్యధను కలిగించవచ్చు.  ఆమెకు మనసుకు అయిన గాయాలు పచ్చి పుళ్ళలా సలుపుతూనే ఉండవచ్చు. కానీ, ఇప్పుడతను పశ్చాత్తాపపడుతున్నాడు .  ఒకసారి ఆమెను చూడాలని ఆరాటపడుతున్నాడు. మనసులో ఉన్న భారం దించుకొవాలనుకుంటున్నాడు. ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వవచ్చుగదా! దీనికి ఎలా నచ్చ చెప్పాలి ఆలోచనల్లో గీత .   తనలో కలిగే భావాలని ఏమాత్రం బయట పడనీయకుండా సీరియస్ గా టి. వి . చూస్తున్నట్లుగా సరోజ
ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.  ఎలాగైనా అతని దగ్గరకు తీసుకెల్లాలని గీత ప్రయత్నం. అందుకే ‘ అతని పరిస్థితి తెలిస్తే నీవిట్లా ఉండవు.  అతన్ని ఈ చివరి క్షణాల్లో క్షమించలేవా.  పోనీ ఒక స్నేహితురాలిగా వెళ్లి చూసి రావచ్చుగా.. . ‘ గీత అనునయంగా చెప్తుండగా
‘సరూ ఉన్నావా ..’ కంగారుగా సరోజ అక్క వనజ
ఆ తీరు చూస్తుంటే తనూ ఇదే వార్త మోసుకోచ్చినట్లుంది అనుకుంది సరోజ.’
‘ఆ .. ఇక్కడే ఉన్నావా ..? వెళ్ళావేమో ఒక్కదానివే అనుకున్నా ‘ నిట్టూర్చి , ‘సరే పద వెళదాం , గీతా నువ్వు కూడా వస్తే బాగుంటుంది ‘ గుక్క తిప్పుకోకుండా వనజ.
అక్క మాటల్లోని అంతరార్ధం అర్ధమయినా అర్ధం కానట్లే ‘ఎక్కడికి?’ ప్రశ్నించింది సరోజ
‘అదేంటే . నీకు తెలియదా ..’తెల్లబోతూ వనజ
తెలుసు అన్నట్లుగా కళ్ళతో సైగ చేసింది గీత.  అర్ధమైనట్లు తలూపింది వనజ
‘ఇదో పిచ్చిమాలోకం .  అవతల మనిషి క్షణాలు లెక్క బెడుతున్నాడు.  ఇప్పుడైనా దీనికి తొందర లేక పోతే ఎలా..?  జాగ్రత్తపడక పోతే ఎలా ‘  గీతతో వనజ
అక్క ఏం మాట్లాడుతోందో అర్ధం కాలేదు సరోజకి. చానల్స్ అటూ ఇటూ మారుతున్నాయి .  ఆమె మనసులాగే కుదురుగా లేకుండా
తలుపులు తీసి ఉండడంతో రెండు పిచ్చుకలు సయ్యాటలాడుతూ హాల్లోకి వచ్చాయి.  ఆగి ఉన్న సీలింగ్ ఫ్యాన్ రెక్కలపై వాలాయి   ఆడపిచ్చుక ఒక్క క్షణం ఉండి బయటికి తుర్రు మనడంతో ఆ వెనకే
మగ పిచ్చుక.
అచ్చు ఇలాగే రామూ కూడా తన వెనకే తిరిగే వాడు.  తన ప్రేమ కోసం తహ తహ లాడేవాడు. సాహిత్యం, సమాజం గురించి ఇద్దరి మధ్యా ఎన్నో చర్చలు , వాద ప్రతివాదాలు.  ఏమి జరిగినా చివరికి గెలిచేది మాత్రం నేనే. ఆహా కాదు  నన్ను గెలిపించుకునేవాడు.  అలాంటిది ఎందుకిలా చేశాడో.. అతని గురించి తెలిసినా ఏమిటో విచిత్రం తనకే భావనలు కలగడం లేదు.  తన మనసు బండబారిపోయిందా? ఏమో అయుండవచ్చు. వీల్లెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు .  వ్యధ, వేదన అనుభవించింది తను వాళ్ళకేం అర్ధమవుతుంది. ఆమె మనసులోని ఆలోచనల్లాగే  చేతులు అస్థిరంగా, అస్థిమితంగా కదులుతూ
‘సరూ ఇట్లా చెప్తున్నానని ఏమనుకోకు.  మొండిగా ప్రవర్తించకు.  తర్వాత రాముని చూడాలని ఉన్నా చూడలేవు.  మాట్లాడలేవు.  అప్పుడు ఆ బాధ నిన్నూ , నీ మనసునీ తొలిచేస్తుంది .  అనునయంగా ఏదో చెప్పాబోయింది గీత
విషయం అర్ధమయినట్లు తలూపి టి .వి . వాల్యూం మరింత తగ్గించి ‘అక్కడికి నేనేమని వెళ్ళాలి? ఎవరినని వెళ్ళాలి? వాళ్ళ వాళ్ళందరికీ, అక్కడికొచ్చిన వాళ్ళందరికీ నేను ఫలానా అని చెప్పుకోవాలా .. అక్కడి వాళ్ళ రకరకాల చూపులు అన్నీ భరించాలా .. అసలు అంత అవసరం ఉందా ..?  ఇక అతని మీద ప్రేమంటారా ..  ఆ ప్రేమా , అభిమానం ఎప్పుడో ఏడేళ్ళ క్రితమే ఆవిరయి పోయాయి.  అతని కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీరింకిపోయింది. అతని కోసం ఎదురు చూసి చూసి కళ్ళు అలసి పోయాయి.  అతని పిలుపు కోసం మనసు తహతహలాది నిరసించిపోయింది .  ఈ చిన్ని హృదయం ఎప్పుడో బద్దలయిపోయింది.  ఈ మెదడు పొరల్లో దాగిన జ్ఞాపకాలను తుడిచేసింది. బంగారు పంజరపు బంధనాలను వీడింది. ఇంకా చెప్పాలంటే ఆ సరోజ ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు మీ ముందున్న ఈ సరోజ  మరో ప్రపంచం తనదైన ప్రపంచం నిర్మించుకునే, సృష్టించుకునే యత్నంలో ఉంది.  ఆమెను డిస్ట్రబ్ చేయకండి ..’ నిచ్చలంగా చెప్పుకుపోతోంది సరోజ
‘అసలు నీవు మనిషివేనా ? ఇసుమంతైనా  బుద్ది ఉందా ..? లే , పద ‘ అంటూ కసిరి సరోజ చేతిలో రిమోట్ లాక్కుని టి. వి. కట్టేసింది వనజ .
చూడు గీతా , దీనికి ఎట్లా నచ్చ చెప్తావో నాకు తెలియదు.  దీన్ని మనం హాస్పిటల్ కి తీసుకేళ్ళాలి. అతని తర్వాత ఆ ఆస్తి అంతా దీనికే చెందుతుంది.  ఇది వెళ్ళక పోతే ఎవరో ఒకరు గద్దల్లా తన్నుకు పోతారు. వెళ్లి కొన్ని గంటలు అక్కడ ఉంటె ఏమిటట దీనికి వచ్చిన నష్టం .. గీత కేసి సరోజ కేసి కొరకొరా చూస్తూ వనజ
‘అక్కా ..’ ఆశ్చర్యంగా గీత
‘అవును గీతా , ప్రాక్టికల్ గా ఆలోచించు. వీళ్ళు ఇద్దరూ ఏడేళ్ళుగా విడివిడిగా ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతున్నారు.  నిజమే, కానీ న్యాయబద్దంగా విడిపోలేదుగా. పిల్లా జెల్ల లేరు. అతని వారసురాలు ఇదే కదా .  దీనికి ఏమన్నా ఇక్కడ ఇంత లప్ప లుగుతోందా. అమ్మా నాన్నలు పోతూ పోతూ ఇచ్చిన ఆ అరా ఎకరం తప్ప.  ఎలా బతుకుతుంది.  పెరిగే వయసేకాని తరిగే వయసు కాదుగా .  దీనికి ఆధారం ఉండొద్దూ.  ఉద్యోగం చూస్తే అదీ జానెడు బెత్తెడు లేదు.  పి. ఎఫ్. లాంటి సౌకర్యం లేదు.  దీని భవిష్యత్ గురించి ఆలోచించాలిగా మనం ‘ అర్దోక్తితో వనజ
అప్పుడే అక్కడికొచ్చిన సరోజ  ‘ఆపుతావా .. ఎంత సేపు లేని లేనిప్రేమలు ..లేని బంధాల కోసం  ఆత్మవంచన చేసుకుని  ఆస్తుల కోసం తద్వారా పెరిగే నా అంతస్తు కోసం రావాలి అంతేగా’
అవునునన్నట్లు కొంచం కొంచం ప్రసన్నం అవుతున్న మొహంతో హమ్మయ్య ఇప్పటికైనా అర్డంచేసుకున్నావ్. సంతోషం పద పద ‘ తొందర చేస్తూ వనజ
‘అక్కా నేను చెప్పేది శ్రద్ధగా విను. మేం అన్యోన్యంగా ఉండాలనీ, మా కుటుంబ సంబంధాలు బలంగా ఉండాలనీ, కుటుంబ శ్రేయస్సు కోసం సమ బాధ్యత తీసుకోవాలని అనుకున్నాం. అదే విధంగా కొంతకాలం నడిచాం. ఎప్పుడైతే అతనికి డబ్బు యావ పెరిగిందో అప్పటినుండే మా బంధం, బాంధవ్యం మరచిపోవడం మొదలయింది.   డబ్బు సంపాదనతో పాటే అంతకు ముందులేని స్నేహాలు, వ్యసనాలు  తోడయ్యాయి.  నా కన్నా ఆ  స్నేహాలకే , ఆ వ్యసనాలకే తనకవసరం  అనుకున్నాడు .  అలాగే బతికాడు . అతని బ్యాంకు ఎకౌంట్ బరువు పెరుగుతున్న కొద్దీ, ఇల్లు, వాహనాలు, వస్తువులు అన్నీ వచ్చి చేరాయి  మా మధ్యకి దూరం పెంచుతూ .  అతనిలో అహంభావం పెరిగింది అది నేను తట్టుకోలేకపోయాను. ఒకే ఇంట్లో ఎవరికి వారిగా బతకడం చాలా కష్టమైంది    నేను కోరుకున్నది రామూని. అతని మనసుని, ప్రేమని , అతనితో అనుబంధాన్ని.  అతన్లో మార్పు ఆశించి , ప్రయత్నించి , భంగపడి చతికిల పడ్డా. చివరికి అలాంటి వ్యక్తితో బంధం  నాకూ అవసరం లేదనుకున్నా , నా బతుకు నేను బతుకుతున్నా.  నాకు లేని బాధ నీకెందుకు ?  ఆస్తులు, అంతస్తులు ఆనాడే తృణప్రాయంగా తోసి వచ్చిన దాన్ని .  అతనే నావాడు కానప్పుడు అతని ఆస్తులు నాకెందుకు ?’ అక్కడున్న ఇద్దరి మొహాల్లోకి సూటిగా చూస్తూఘాటుగా  సరోజ
‘ఇద్దరి మధ్యా ఒక కాయకాసినా ఆ బంధం నిలబదేదేమో ! దీని ఖర్మ కాకపోతే ఒక్క..’ వనజ గొణుగుతూ
‘అక్కా .. ఆపు ‘ అరిచింది సరోజ
‘ఆడదానికి భర్త లేకపోతే బతుకే లేదన్నట్లు,  ఆమె బతుకు భర్తతోనే అని చిన్నప్పటి నుండి నూరి పోస్తారు.
‘నేనూ అలాగే అనుకున్నా .  కానీ , ఇప్పుడు అర్ధమవుతోంది.  అతని కోసం నా ఇస్తా ఇష్టాలన్నీ మార్చుకున్నప్పుడు  అది అతని మీద ప్రేమ అనుకున్నా.  అతనేలోకంగా బతికినప్పుడు అనురాగం అనుకున్నా,  అతను చెప్పినట్లు చేసినప్పుడు అన్యోన్యత అనుకున్నా ..  నేను అతనికి అవసరం లేదనుకున్నప్పుడు అతనకి నాపై ప్రేమ కరిగిపోయినప్పుడు , నేననేదాన్ని ఉన్నానని మరచి పోయి తిరిగినప్పుడు, నన్ను హింసించినప్పుడు , అనుమానించినప్పుడు, అవమానించినప్పుడు భార్యగా  భరించా ఎంతో ఓపికతో.   .  అతను లేక పోతే నా ఉనికే లేదన్న భ్రమతో , బతుకే లేదన్న పిరికితనంతో . కాని ఇప్పుడు తెలుస్తోంది. ఆలోచించడం మొదలు పెట్టాక , ఒకరిపట్ల ఒకరికి ప్రేమ, అనురాగం, మమకారం , గౌరవంతో కూడిన  బంధాలు , అనుబంధాలు లేని ఆ బంధనాలన్ని వదిలి పెట్టాక తెలుస్తోంది నేనేమిటో.  వ్యక్తిగా నేనెంత కోల్పోయానో .. ఎంత ఆధార పడ్డానో అర్ధమవుతోంది .
ఆస్తి పాస్తులపై నాకు ఆశలు లేవు
అంతస్తులు హోదాలపై వ్యామోహాలు లేవు
నేను నేనుగా ఉండాలన్నదే నా కోరిక
నాకు ఏ ఇజాలూ తెలియదు . ఇగొలూ లేవు . భేషజాలు లేవు . భిన్న వైరుధ్యాలు, దృక్పధాలు గల వ్యక్తులైనా నన్ను నన్నుగా గుర్తిస్తే నేను గౌరవిస్తాను. అభిమానిస్తాను.    కానీ డబ్బు, హోదాల పరుగులాటలో వచ్చే తాత్కాలిక భోగాలు నాకవసరం లేదు.  నేను పావును కాలేను. అందుకే కాదనుకుని వచ్చానని మీకూ తెలుసు.  అన్నీ తెలిసి కూడా ఆ వ్యక్తీ దగ్గరకి నన్నెట్లా రమ్మంటున్నారో నాకర్ధం కావడంలేదు’
డిగ్రీ మొదటి ఏడాదిలో ఉండగా కాలేజి వార్షికోత్సవంలో నెమలికి నేర్పిన నడకలివే అని సరోజ పాడిన పాట విన్న రాము ఆమె వెంట పడ్డాడు.  పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ళు అతని ప్రేమలో ఊయలలూగిన సరోజ తన గొంతు అతనికే అంకితమిచ్చింది.  పాటలు పాడే కోయిలమ్మ గొంతు మూగపోయింది.
రెండో సంవత్సరంలో పెళ్ళితో చదువు అటకెక్కించిన సరోజ 13 ఏళ్ల తర్వాత ఈ మధ్యే డిగ్రీ పూర్తి చేసింది .  పోస్ట్ గ్రాడ్యుఎషన్ చేసింది.  ఆస్తి అంతస్తులు కాదని చిన్న ఇంట్లో దిగువ మధ్య తరగతి జీవిగా బతుకు బండి లాగడం కోసం ఓ పత్రికాఫీసులో గుమాస్తాగా చేరింది .  ఉన్నంతలోనే తృప్తిగా బతుకుతోంది.  జీవన గమ్యం కేసి అడుగులు వేయడం మొదలుపెట్టింది.  తనకిష్టమైన పాటలు పాడుతోంది.  తనలాగా ఒంటరి వారైన వారి దగ్గరకెళ్ళి  స్వాంతన చేకూరుస్తుంది.
వనజ అక్క అన్నట్లు సరోజ అమాయకురాలా ..  కాదు కానే కాదు.  సరోజలో కనిపిస్తున్న స్థిత ప్రజ్ఞత , దృఢ నిర్ణయం అబ్బుర పరుస్తున్నాయి గీతని.  చిన్న పిల్ల్లలా బేలగా, మౌనంగా,  అమాయకంగా ఉండే సరోజ , ఎవరేది చెప్తే అది నమ్మేసే సరోజలో ఎంత ధైర్యం. భవిష్యత్ పట్ల ఎంత విశ్వాసంతో చెప్పింది !!
సరే నే వస్తా ఎలా ఉన్నది అలా వదిలిపెట్టి వచ్చా.  పిల్లలు వచ్చే సమయం అవుతోంది’  గోడ గడియారం కేసి చూస్తూ అన్న గీత,  సరోజ చేయిని నొక్కి పట్టుకుంది  స్నేహ హస్తం అందిస్తూ.
ఇక ఇక్కడుండి నేను చేసేదేముందీ’ చెల్లెలు వైపు ఓ దీర్ఘమైన చూపు విసిరిన వనజ కూడా లేచింది వెళ్ళడానికి
(కథ ) జూన్ 2015 విహంగలో

Tag Cloud

%d bloggers like this: