The greatest WordPress.com site in all the land!

Archive for July, 2014

ఆ యువత – ముందుతరం దూతలు

తను శవమై ఒకరికి వశమై 

తనువు పుండై ఒకరికి పండై 
ఎప్పుడూ ఎడారై 
ఎందరికో ఒయాసిస్సై 
 
క్రితం రాత్రి చదివిన పుస్తకంలోని అలిశెట్టి వాక్యాలు గుర్తొచ్చి  మమత మనసు బాధగా మూలిగింది.  వేశ్యా జీవితం లోని వేదననంతా గుండెమీద చరిచినట్లు చెప్పాడు అనుకుంటూ కళ్ళు మూసుకుంది  మమత.  మసకగా  ఆమె  రూపం కళ్ళముందు  పరుచుకుని ..  ఆమెని  తను  చూసిన చూపు అదే మొదటి చూపు, అదే  చివరి చూపు కూడా .   చిక్కి శల్యమైన ఎముకలపై వేలాడుతున్నచర్మపు శరీరంతో ఆమె.  నిర్జీవమైన ఆ గాజుకళ్ళు తనను చూస్తున్నట్లుగానే అనిపిస్తూ. . తనను అమ్మగా గుర్తించమని వేడుకుంటున్నట్లుగా .. ఆలోచిస్తోంది మమత  దూరంగా ఆడుకుంటున్న తల్లీ  పిల్లలనే తదేకంగా చూస్తూ.  
 
‘ఎనీ థింగ్ స్పెషల్ రమ్మని పిలిచావ్ ‘  వస్తూనే అడిగాడు రాణి స్నేహితుడు  సంతోష్ ఎండలో వచ్చాడేమో మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ . అతను మమతకి కూడా బాగా పరిచయమే.  ఈ కాలం మగ పిల్లలకి భిన్నంగా కనిపించే అతనంటే గౌరవం మమతకి. అతనేకాదు అతని స్నేహితులైన రాణి, రేణుక, గీత, కేశవ్ లన్నా అదే అభిమానం. కాకపోతే రాణి మమతకి క్లాస్ మేట్ మాత్రమే కాదు హితురాలు, సన్నిహితురాలు, ఆప్తురాలు.  రాణి ద్వారానే వారంతా మమతకి పరిచయం.  మమత ఓ అనాధాశ్రమంలో ఉంటుంది.  రేణుక హాస్టల్ లో ఉండి చదువుకుంటుంది. మిగతా వారంతా తమ తమ ఇళ్ళలో ఉంటారు. 
 
‘ఏమైంది మమతా ఎందుకలా ఉన్నావ్ ‘  అంటూ  సంతోష్ వెనకే వచ్చిన రాణి మమతనే తదేకంగా చూస్తూ. కొన్ని క్షణాలు ముగ్గురి మధ్యా  మౌనం
 
‘మేం దగ్గరలోని స్కూల్ లో రెడ్ రిబ్బన్ క్లబ్ ఏర్పాటు చేయడం కోసం వెళ్తన్నాం.  నువ్వు కలవమన్నావని ఇటొచ్చాం.  గీత వాళ్ళనీ ఇక్కడికే రమ్మన్నాం.  వాళ్ళు వచ్చేలోగా మనం  మాట్లాడుకోవచ్చని’ వచ్చి మమత పక్కనే పచ్చగడ్డిలో కూర్చుంటూ  రాణి  
 
మమత కళ్ళనుండి నీరు కారిపోతూ .. ‘ఏమైందే ‘ ఆందోళనగా భుజంపై చేయి వేస్తూ రాణి 
 
‘ప్చ్ .. ఏమీ లేదులే ‘ కళ్ళు తుడుచుకుంటూ మాములుగా ఉండడానికి ప్రయత్నిస్తూ మమత  
 
‘నీ మొహం, నీ కళ్ళు చూస్తుంటే తెలియడం లేదూ నీవెంత డిస్ట్రబ్ గా ఉన్నావో ‘ పరిశీలనగా చూస్తూ రాణి 
 
‘ఏమైంది మమతా,  చెప్పక పోతే మాకేలా తెలుస్తుంది. తెలిస్తే నీకు మేమేమన్నా సాయం చేయగలిగితే చేస్తాం కదా ‘ నెమ్మదిగా అనునయంగా సంతోష్ 
 
‘ఈ సృష్టిలో పశుపక్ష్యాదులు కూడా తమ పిల్లల్ని బాగా చూసుకుంటాయి.  ప్రపంచంలో అత్యంత ప్రియమయిన తల్లిప్రేమ నా విషయంలో దారి తప్పింది. చిట్టి తల్లీ, బంగారు కొండా అంటూ  సేదతీర్చి అక్కున చేర్చుకోవాల్సిన అమ్మను, ఉగ్గు పాలతో, గోరు ముద్దలతో మురిపాల ముత్యాలతో ఎంతో ప్రేమగా పెంచుకోవాల్సిన అమ్మను,  తననుంచి అయిన వాళ్ళందరి నుంచి  దూరంగా విసిరేసిన అమ్మను ఎన్ని సార్లు తిట్టుకున్నానో నిన్నటి వరకూ..  ‘ పార్కు లోని గడ్డిపై కుర్చుని ఆ గడ్డిని ముని వేళ్ళతో లాగుతూ 
 
‘ హా .. ఈ రోజేమయిందే  ఉల్లిపాయ పొరలు విప్పినట్లు మనసు పొరలను విప్పుతున్నావ్ ‘ వాతావరణం తేలిక చేయడానికి ప్రయత్నిస్తూ రాణి 
 
‘అవునే .. అవును. నిజమే నా మనసు పొరల్లో దాగిన ఎన్నెన్నో పజిల్స్ , చిక్కుముడులు .. వాటిని విప్పడానికి దారులు వెతుకుతూన్నా  .. ‘ గోళ్ళు చూస్తూ 
 
‘ఏమిటో నీమాటలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ‘ రాణి  
 
‘నేనేమిటో నా పుట్టుక ఏమిటో, నా మూలాలు ఎక్కడో తెలియక తల్లడిల్లి పోయేదాన్ని.  ఏ పాపపు పనికో, చీకటి తప్పులకో ఫలితం కాదు కదా అని కుంచించుకు పోయేదాన్ని, ఆడపిల్లను కావడం వల్లనో మరెందువల్లనో విసిరేయలేదుకదా అని కంపించి పోయేదాన్ని. చిన్నప్పుడు బడిలో పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నల గురించి కబుర్లు చెబుతుంటే మనసు బాధతో ములిగేది.  నా అమ్మానాన్నలని ఉహించుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యేదాన్ని.  నాతో పాటు పెరిగే పిల్లలకోసం అప్పుడప్పుడూ వారి బంధువులు వచ్చేవారు.  సెలవుల్లో వారింటికి తీసుకెళ్ళేవారు.  నా కోసం ఎవరూ ఎప్పుడూ రారు.  నాకెందుకు ఎవరూ లేరు నా చిన్ని బుర్రలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఎవరైనా, ఎప్పుడైనా రాకపోతారా అని చిన్ని ఆశతో మనసు ఎదురు చూసేది.  ఆరవ తరగతి కోసం నన్ను హైస్కూల్లో చేర్చినప్పుడు మీ కులం ఏది, మతం ఏది అని అడిగితే ఏమి చెప్పాలో తెలియక దిగులు పడిపోయి కళ్ళప్పగించి చూశా.  టీచర్ అడిగిన ప్రశ్నలన్నిటికి తడుముకోకుండా జవాబు చెప్పే నేను,  తరగతిలో పిల్లలు మీరేమిటోళ్ళు, మీ ఇంటి పేరేంటి అని ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తే ఆ  ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పలేక తలదించుకునే దాన్ని.   అప్పుడు వాళ్ళు చేసిన హేళన ఇంకా గుర్తుంది.  ఆశ్రమంకి వచ్చి తాతయ్య నడిగితే తల్లి పేరు భారతి అని, తండ్రి పేరు విశ్వం అని, విశ్వమానవత నా కుటుంబం అనీ, మన ఇంటిపేరు ఆశ్రయ, మన కులం భారతీయం, మన మతం మానవత్వం అని చెప్పమన్నారు.  అదే నీ గుర్తింపు అన్నారు.  ఎందుకో అప్పటి నుంచి నేను ఎక్కువగా నా తోటివారి కంటే పుస్తకాలతోనే స్నేహం చేయడం మొదలు పెట్టా. 
 
ఆశ్రమంలో తాతయ్య, ఆయమ్మలు నన్ను ఎంత బాగా చూసుకున్నా, ఎంత ప్రేమాదరాభిమానాలు చూపించినా నేను ఈ భూమి మీదకు ఎలా వచ్చానో తెలియక తాతయ్యను చాలా సార్లు విసిగించా.  ఏదేమైనా నన్ను కని వదిలించుకున్నందుకు కన్నవాళ్ళను మనసులోనే ఎన్ని శాపనార్ధాలు పెట్టానో.. ఆ  బాధ బరువుతో ఎంత కుంగి పోయానో .. మనసు వేదన పెదవి దాటనియకుండా బతికేశా .’ సీరియస్ గా  రాణి కళ్ళలోకి చూస్తూ మమత 
 
‘ఏ బురదలోంచి వస్తేనేం.  నువ్వు పద్మానివి.  ఏ బురదా అంటని పద్మానివి ‘  నొక్కి నొక్కి అని ఒక్క క్షణమాగి  ‘ ఆ అవునూ నిన్న కన్పించలేదు ఏమయ్యావ్ ‘ రాణి భుజానికున్న బ్యాగ్ తీసి ఒళ్లో పెట్టుకుంటూ  
 
‘జైలుకి వెళ్ళివచ్చా ‘ తన భావాలు కన్పించనీయకుండా తలవంచుకుని మమత 
 
‘ఆ చాల్లేవమ్మా జోకుడు ఎక్కువవలేదూ .. ?’ పచ్చని కొమ్మల్లోంచి పడే ఎండను చూస్తూ సంతోష్  
 
”ఏంటే,  జైలుకి వెళ్లాలని అంత కోరికగా ఉందా ‘ తేలికగా తీసుకుని నవ్వుతూ రాణి 
 
‘నేను సరదాకి అనడం లేదు.  అక్కడ  ఒకావిడ నన్ను కలవాలని అంటోందట. రెండు రోజులుగా  తాతయ్య చెబుతున్నారు.  తాతయ్య నిన్న అక్కడికి  తీసుకెళ్ళారు.  ఆ కబురు పెట్టినావిడ నవమాసాలూ మోసి కన్న నా తల్లి అట.  ఆవిడ నా తల్లి అంటే నా మనసు ఒప్పుకోలేదు.  కానీ, ఆ ఎముకల గూడులో నా పోలికలు స్పష్టంగా కనిపిస్తూ, ఆవిడ చెప్పింది నిజమే నమ్మమంటూ.  ఆమె నాతో ఏదో మాట్లాడాలని తాపత్రయపడుతోంది. ఆయాస పడుతోంది.  నన్ను చూడగానే ఆ గాజు కళ్ళలో ఓ మెరుపు.  అదంతా పట్టించుకోని నా ఆవేశం పొంగిపొరిలి రాబోయింది . కోపం కట్టలు తెంచుకుని బయటకు రావడానికి సిద్దంగా ఉంది. నా కళ్ళలో  దాగిన అసహ్యం తోచుకు వచ్చేసింది.  ఆమెను చీత్కారంగా ఒక దీర్ఘమైన చురకత్తిలాంటి  చూపుతో పర పరా కోసేసి  విసురుగా వచ్చేశా.. అవును ఆవిడ ఆశలను ఒక్క చూపుతో నేలమట్టం చేసి మాట్లాడకుండా వచ్చేశా.. ఆ ఒక్క చూపు చాలు ఆమె నన్ను అర్ధం చేసుకోవడానికి.. ఈ క్షణమా , ఆ క్షణమా అన్నట్లున్న ఆ గుండె పగిలి పోవడానికి, నవనాడుల్లో నింపుకున్న ఆశ అణిగిపోవడానికి , శ్వాస ఆగిపోవడానికి’  తలవంచుకుని చేతికున్న వాచి స్ట్రాప్ తీసి పెడుతూ మమత .  
 
‘ఆ .. నిజమా  ‘ఆశ్చర్యంతో నమ్మలేనట్లుగా  ఇద్దరూ 
 
‘అవును, నేను కాలేజికి బయలు దేరుతుంటే తాతయ్య పిలిచి ఈ ఉత్తరం చేతిలో పెట్టారు. ఎప్పటిదో పాత పేపరు. నలిగిపోయి ఉంది.  ఏమిటిది అని అడిగితే చదువు అ చెప్పారు.  నా తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ నువ్వు మరోసారి ఆమె కోసం వెళ్ళాల్సిన పని లేదులే.  నిన్ను విసిగించనంత దూరం వెళ్లి పోయింది అన్నారు.  కాలేజికి వెళ్ళ బుద్ది కాలేదు. వచ్చి ఇక్కడ కూర్చున్నా.  నీతో మాట్లాడితే నాకు కాస్త రిలీఫ్ వస్తుందేమోనని నిన్ను రమ్మన్నా’ అంది రాణికేసి చూస్తూ 
 
‘చ్చో .. చ్చో .. అయ్యో .. నిజమా .. నమ్మలేక పోతున్నా’ మమత చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటూ సానుభూతితో రాణి  
 
‘అవును నమ్మలేని నిజం. ఏనాడు  కలలోనైనా ఉహించని వాస్తవం.  అమ్మ లేదు అని బాధ పడ్డ నేను అలా ఎందుకు చేశాను. ఆమెను కనీసం సానుభూతిగా గానీ,  మరో కోణం నుంచి ఎందుకు ఆలోచించలేక పోయాను అని ఇప్పుడు ఆలోచిస్తూ అనుకుంటున్నా ‘ మమత దీర్ఘ శ్వాస తో.  ఆమె హృదయం పై ఏదో బరువు పెట్టినట్లు భారంగా అనిపిస్తుండగా 
 
‘అయ్యో..  అలాగా. నువ్వు చాలా అప్సెట్ అయి ఉన్నావ్.  ఈ స్థితిలో నిన్ను వదిలి వెళ్ళలేము.  ఈ రోజు మా  మీటింగ్ వాయిదా వేస్తాంలే ‘ .సంతోష్ . 
 
‘లేదు సంతోష్. మీరు వెళ్ళండి.’ గబగబా అంది మమత 
 
‘ఎలా వెళ్తాం మమతా . నిశ్చలంగా ఉన్న చెరువులో రాళ్ళు వేస్తె ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి ‘ అన్నాడు సంతోష్ జేబులో ఫోన్ తీస్తూ  
 
‘గుండెల మీద పడే బండల్ని తప్పించుకుంటూ పోవడం అలవాటయిన్దిలే.. మీరు చేస్తున్న పని ఎంత మంచిదో, ఎంత మంది జీవితాల్ని నిలుపుతుందో,  ఊబిలొకి వెళ్ళకుండా కాపాడుతుందో ఇప్పుడు బాగా అర్ధమవుతోంది.’   
సంతోష్ చేతిలో ఫోన్ మోగింది.  లేచి మాట్లాడుతూ అవతలికి వెళ్ళాడు.  వచ్చి  ‘గీతా వాళ్ళు మరో పది నిముషాల్లో ఇక్కడుంటాంరట’ చెప్పాడు   
 
అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. మనుషులకు దూరంగా పుస్తకాలు, ర్యాంకులే లోకంగా బతికే నీవేనా ఈ మాటలు మాట్లాడింది’  విస్మయంగా రాణి 
 
‘పసితనం వీడని వయసులో ప్రేమ – పెళ్లి. అయిన వాళ్ళందరికీ దూరమయినా ఏడాదిపాటు ఆమె ఆనందంగానే గడిపింది.  బిడ్డ పుట్టే ముందే  ట్రక్కు డ్రైవర్ గా పని చేసే  అతను చెప్పా పెట్టకుండా మాయమయ్యాడట. తిరిగి కన్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళలేక రెక్కలు తెగిన పక్షిలా విల విలలాడింది.  నిండు గర్భిణి. ఉన్న ఇంటివాళ్ళు మూడు  నెలల అద్దె బకాయి ఉందని ఇంట్లోంచి గెంటేశారు.  చేతిలో చిల్లి గవ్వ లేదు. కాలం ఆగదుగా ఆ అనాధ  మరో అనాధను ఈ ప్రపంచానికి ఇచ్చింది.   నమ్మిన వాడే నట్టేట వదిలిపోతే, బతుకే ప్రశ్నార్ధకంగా మారి వెక్కిరిస్తుంటే  ఏమి చెయ్యాలో దిక్కు తోచక మమతానుబందాలను నొక్కిపెట్టి తన పసి గుడ్డు శ్రేయస్సే ప్రధానంగా భావించి ఆ బిడ్డను  అనాధా ఆశ్రమం ముందు వదిలి పోయిందట. వయసులో ఉన్న ఒంటరి ఆమెలో లోకానికి కనిపించేది ఆడతనం.  లోకం ఊరుకుంటుందా..  మానవ శరీర వ్యాపారుల కంట పడకుండా ఉంటుందా. ఆమె ఆకలిదప్పులు ఆగిపోతాయా..   పరిస్థితులు ఆమెను  భయంకర పాపకూపంలోకి విసిరేశాయి . ఒక అనాలోచిత నిర్ణయం ఆమె పచ్చని బతుకులో చిచ్చు పెట్టింది. కమ్మని బతుకులో కన్నీళ్ళు మిగిల్చింది.  ఆమె బంగారు భవిష్యత్తు బుగ్గి బుగ్గి అయిపొయింది.  తానేమిటో తన గత జివితమేమిటో అన్నీ మర్చి పోయి ముక్కూ మొహం తెలియని వ్యక్తులు తమతో తెచ్చే భయంకర వ్యాదుల్ని బహుమతులుగా అందుకుని వాటితో సహాజీవనం చేసింది.  
 
అదేసమయంలో ఆమె ఉన్న  ‘మెహబూబ్ కి మెహంది ‘పై దాడి జరిగింది. కోర్టులు, కేసులు మామూలే.  అక్కడి వారిని కొన్నాళ్ళు సంక్షేమ హాస్టళ్ళలో ఉంచారు.  అక్కడ తిండి బట్ట సరిగ్గా లేదని కొందరు పారిపోయారు.  కొందరు ఆత్మ హత్య చేసుకున్నారు.  అమె  ఇంకా కొందరు తిరిగి పోలీసులకు దొరికిపోయారు.  అప్పటికే ఎయిడ్స్  ఇంకా ఇతర వ్యాధులు వరించాయి.  జైలులో వేశారు.  ఒకరకమైన నిర్బంధం లోంచి ఇంకో రకమైన నిర్బంధం లోకి మారారు.  
 
ఎయిడ్స్ మహమ్మారి పట్టుకుంటే వదిలే ప్రసక్తి లేదు కాటికి పంపడం ఖాయం అలాంటి వారికి  మెహబూబ్ కి మెహంది చోటివ్వదు. ఒక వేళ  ఇచ్చినా కొంత కాలమే. ఎముకల గుడులా మారే  శరీరం కోసం ఎవరొస్తారు ఆ నరకం కంటే జైలు పదిలం అనుకుంది ఆమె.  ఏదో ఓ రోజు తనలోని  సుడిగుండం కబలిస్తుందని తెలుసు.  పొత్తిళ్ళలో వదిలిన బిడ్డ పదే పదే గుర్తుకొచ్చేది. తోటి ఖైదీలతో కలల మొగ్గ గురించి మురిపెంగా చెప్పుకొనేది. బిడ్డ ఎదుగుదలను ఉహించుకొనేది. చనిపోయేలోగా ఒక్కసారైనా తన బిడ్డను చూసుకొని తృప్తిగా పోవాలని కోరుకునేది. ‘ లేఖలోని విషయాల్ని క్లుప్తంగా వివరించింది మమత 
 
‘ప్చ్ .. పాపం,  ఆమె ఎంత నరకం అనుభవించిందో .. ‘ రాణి 
 
‘చికిత్స లేని వ్యాధిగా అందరినీ భయపెడుతున్న ఎయిడ్స్ భూతం బారిన పడి చాలా కాలమే బతింకిదావిడ. బహుశ ఆమెకు అందిన ART మందులు కారణం కావచ్చు ‘ అప్పటివరకూ మౌనంగా విన్న సంతోష్ 
 
‘సంతోష్ , చిన్న సవరణ.  అది చికిత్స లేని వ్యాధి నిజమే.  కాని భయంకరమైంది.  భూతం అని భయపడడం కాదు చేయాల్సింది.  HIV వైరస్ సోకకుండా చేయాలి. పాకకుండా మనమంతా చేయాలి. తెలిసో తెలియకో ఆమెలాంటి వాళ్ళు బలయారు.  కానీ మనం మన తరాన్ని కాపాడుకుందాం.’ అని  ‘మమతా ఏమనుకోకపోతే ఒక ప్రశ్న ‘  అంది రాణి 
 
‘అనుకోవడానికి ఏముంది అడుగు ‘ నిర్లిప్తంగా 
 
‘నీకూ ఆ వ్యాధి ఉందేమో ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది ‘ రాణి 
 
ఉలిక్కిపడింది మమత. ఆమె  మోహంలో రంగులు మారాయి.   వాతావరణం వేడెక్కింది. భూమి సెగలు కక్కుతోంది.  సూర్య కిరణాలు నేరుగా వారి మిద పడుతున్నాయి . ‘ఈ విపరీత వాతావరణ పరిస్థితులు అని మనసులో అనుకుంటూ  నీడ కేసి కదులుతూన్న రాణిని  చూస్తూ ‘నేను ఎలా కన్పిస్తున్నాను.’ కోపంగా అసహనం కలగాపులగంగా అయి  ఇబ్బంది పెడుతుండగా మమత .
 
‘నీవు ఆరోగ్యంగానే కనిపిస్తున్నావు.  కానీ నీ తల్లి నుండి నీకేమైనా సంక్రమించిందేమో నని .చిన్న అనుమానం తీర్చుకోవడానికి ‘ మెత్తగా రాణి 
 
‘ఆ అవకాశం తక్కువే రాణీ . ఇప్పుడు విన్నదాన్ని బట్టి చూస్తే మమత పుట్టిన తర్వాతే ఆమె బతుకు మారింది ‘ సంతోష్ 
 
‘రాణీ నీవెందుకు చెప్పావో అర్ధమయింది.  కానీ ఆ అవసరం నాకు లేదు. నీకు తెలియదా  నాకు ఎలాంటి చెడు స్నేహాలూ లేవు. ‘ ఇంకా మమత గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్లుగా 
 
‘అవుననుకో, కానీ, కీడెంచి మేలెంచమంటారుగా పెద్దలు అందుకే.. నిన్ను నీవు రక్షించుకోవడానికి, మా నేస్తాన్ని మేం రక్షించుకోవడానికే నేను చెప్పేది.   తప్పుగా అర్ధం చేసుకోకు ‘ అనునయంగా 
 
‘ మొదట నువ్వామాట అనగానే నా మనసు చివుక్కుమన్న మాట నిజం.  ఇప్పుడు  ఏమనుకోన్లే,  అసలు ఆ ప్రాణాంతక వ్యాధి HIV ఎలా వస్తుంది ?’ చేతిలోని ఉత్తరం నోట్ బుక్ లో పెడుతూ మమత 
 
అంతలో సుడిగాలిలా వచ్చిన రేణుక HIV అన్న మాట విని   ‘గే లకు వస్తుంది.  సెక్స్ వర్కర్ లకు , మాదక ద్రవ్యాలు వాడే వారికి , ట్రక్ డ్రైవర్ లకు  వస్తుంది కదూ ‘ అంది తను తెలుసుకున్న విషయాలను నెమరు వేసుకుంటూ.  రేణుక  ఈ మధ్యే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆరంభించింది. 
 
‘గే లా .. అంటే నాకర్ధం కాలేదు ‘ నొసలు చిట్లించిన మమత 
 
‘అంటే .. ఎలా చెప్పాలి .. ‘ కొంచెం ఆగి ఒక దీర్ఘ శ్వాస తీసుకుని ‘ స్వలింగ సంపర్కులు అంటే మగ వాళ్ళు మగ వాళ్ళతో లైంగిక సంబంధం పెట్టుకుంటే గే లు అంటారు. ఆడవాళ్ళు ఆడవాళ్ళతో లైంగిక సంబంధం పెట్టుకుంటే లెస్బియన్ అంటారు ‘ రాణి 
 
‘ఛి .. చ్చీ .. అట్లా కూడా  ఉంటారా ‘ మొహం చిట్లించుకుని, అసహ్యం అన్న భావన ఆ మొహంలో కనిపిస్తుండగా  మమత 
 
‘అవునే, అది వరకు నాకూ ఆ విషయాలు తెలియదు.  రెడ్ రిబ్బన్ క్లబ్ లో చేరాకే తెలిసింది.  మనని మనం రక్షించుకోవాలంటే మనకి దాని గురించిన అవగాహన ఉండాలి.  అది లేకే యువత ఈ విషరాక్షసి కోరల్లో చిక్కుకుని ఎంతో నష్టపోవడం జరుగుతోంది.   ప్రపంచ వ్యాప్తంగా రోజుకి 14000 మంది కొత్తగా ఈ వైరస్ చేరుతోందట.  వారిలో 50% 15 నుంచి 25 ఏళ్ల లోపు వారేనట’ రేణుక  .  
 
‘అమ్మో వింటుంటేనే భయమేస్తోంది. అయితే పెళ్లిళ్లకు జాతకాలు చూస్తారు కానీ hiv ఉందొ లేదో చూడాలి.’  మమత   
 
‘నిజమే. కదా .. సాలోచనగా రాణి 
 
‘మొన్న మా అక్క చిన్నాటి క్లాస్ మెట్ ఆత్మహత్య చేసుకుంది.  ఆమెకు ఎప్పుడూ జ్వరం వచ్చేది.  క్షయ వ్యాది అనుకున్నారు.  ఆ తర్వాత కొన్నాళ్ళకి  నీళ్ళ విరేచనాలు అయేవట , ఒళ్లంతా దద్దుర్లు .. రోజు రోజుకి బక్కగా అయింది.  r.m.p. వచ్చిసూడులు ఇచ్చేవాడట. తగ్గలేదు . బోధన్ వెళ్తే రక్త  పరిక్షలు చేసి HIV పాజిటివ్ అన్నారట .  ఆ రోజు మా అక్క ఆమెతో  పాటే ఉండడం వల్ల తెలిసింది.   ఆమెకు ఆ వ్యాధి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు.  కొన్ని రోజుల తర్వాత ఆత్మహత్య   
చేసుకుంది.  అంతకు ముందే తన మెడికల్ రిపోర్టులు కాల్చేసిందట విషయం ఎవరికీ తెలియకూడదని. తనని తప్పుగా అనుకోకూడదని.   
 
తనని తన వాళ్ళు, సమాజం ఎంత హీనంగా చూస్తుందో నన్న భయం ఆమెను ఆ పని చేయించి ఉంటుంది.  మొదట్లో మన ప్రసార ప్రచార సాధనాలు ద్వారా అల్లాంటి ప్రచారమే సాగింది.  అది ఈ వ్య్దాధిగ్రస్తుల పట్ల శాపంగా మారిందనుకోవచ్చు.  అందుకే ప్రభుత్వం, సంస్థల దృక్పథం మారింది.  ఈ వ్యాధి మనకు తెలిసో తెలియకో మన శరీరంలో ప్రవేశించిందని భయపడకుండా, బెంగ పడకుండా దానిని ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలి. అసలు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి.  వచ్చిన తర్వాత ART కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకుని మందులు వాడితే ఇంకో పదిహేను ఏళ్లయినా జీవితాన్ని పొడిగించుకోవచ్చని  చెప్పి వారికి జీవితంపై ఆశ పెంచితే అలా ఆత్మహత్యలు చేసుకోరు.  నియంత్రణకు ఉన్న అడ్డంకుల్ని  ఎదుర్కోవాలి. ‘ కొంచెం ఆవేశంగా సంతోష్ 
 
‘ఎలా సంతోష్ ? కుటుంబ సభ్యులు , స్నేహితులు , బంధువులు సమాజం వేలివేస్తుందిగా ..గుండెల్ని చిద్రం చేస్తుందిగా  ‘ రేణుక ప్రశ్న 
 
‘షుగర్ వ్యాధి కూడా ఒకసారి వస్తే పోదు. మన వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి వివిధ ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.  ఇదీ అంతే. ఒకసారి HIVవైరస్ చేరితే అది క్రమంగా తన జాతిని పెంచుకుంటూ పోతుంది. మనలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.  మన ఆరోగ్యం  నాశనం చేస్తుంది.   అయితే, వేరే ఏ జబ్బువచ్చినా ఉండే సహకారం ఓదార్పు ఆదరణ ఈ జబ్బుకి ఉండక పోవడానికి కారణం ఈ జబ్బు పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేక భావనే. అరక్షిత లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని  ఆ వ్యక్తుల పట్ల ఉన్న ఏహ్య భావనే. వివక్షే .  బాధితుల పట్ల శ్రద్ధ చూపి  మంచి పోషకాహారం, తగిన మందులు లభిస్తే వారి ఆయుష్షును చాలా కాలం పెంచిన వాళ్ళమవుతాం. వారు కొన్ని జాగ్రత్తలతో సాధారణ జీవితం గడపొచ్చు. ప్రభుత్వం అవసరమైన యాంటి రిట్రోవైరల్ మందుల్నిఉచితంగా అందిస్తుంది .  అది తెలియక చాలా మంది మా అక్క స్నేహితురాలి లాగ జీవితాన్ని అర్ధంతరంగా ముగించి వేస్తున్నారు’ ఆవేదనతో అన్నాడు సంతోష్ 
 
‘ఒకప్పుడు అంటరాని వారిగా భావించి దూరం దూరంగా పెట్టినట్లు, పై నుండి పళ్ళెంలో ముద్ద పడేసినట్లు వీళ్ళకి వేస్తారు.  ఎవరితో కలవనివ్వరు’. తను చూసిన దృశ్యాలు కళ్ళముందు కదలాడుతుండగా రేణుక 
 
‘ఆవిడకీ ప్రభుత్వం ఉచితంగా మందులు ఇచ్చేడట.’ అని ‘సంతోష్ నీకీ విషయాలన్నీ ఎలా తెలుసు ‘ మమత  
 
‘అదేంటే నీకు తెలియదా ..?  వీడు HIV బాధితులకోసం పనిచేసే ఓ సంస్థలో స్వచ్చంద కార్యకర్త.  నెహ్రు యువక కేంద్ర కార్యకర్త.  బడులలో , కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాడు.  అక్కడి టీచర్ల కన్నా చాలా బాగా అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తాడు.  తనకు తెలిసిన పరిజ్ఞానంతో ఈ జబ్బు పట్ల ఉన్న అపోహలని తొలగించడానికి ప్రయత్నిస్తాడు. కథలు, కవితలు రాస్తాడు.   మన ప్రాంతంలో రెడ్ రిబ్బన్ క్లబ్స్ ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర వీడిదే’ .సంతోష్ కేసి మెచ్చుకోలుగా చూస్తూ రాణి 
 
‘అవన్నీ చేస్తుంటే మీ ఇంట్లో ఏమనరా .. ? ‘ మమత సందేహం 
 
‘ఆహాహ్హ .. ఎందుకనరు? అంటారు.  మొదట్లో మా అమ్మకి నేను చేసే పనులు తెలిసి ఏడ్చి గోల గోల చేసింది.   నాకు ఎక్కడ ఆ జబ్బు అంటుకుంటుందోనని భయపడింది.  నాన్న నచ్చ చెప్పినా గొణుగుతూనే ఉండేది. కానీ అక్క స్నేహితురాలి ఉదంతం తెలిసిన తర్వాత అవగాహనా లేమితో చాలా మంది ఈ వ్యాధి కోరల్లో పడుతున్నారని తెలిసిన తర్వాత నన్ను అభినందించింది. ‘ నవ్వుతూ కాలరెగరేస్తూ సంతోష్  
 
‘ఓ నువ్వు గ్రేట్ సంతోష్.  రియల్లీ గ్రేట్.  ‘రెడ్ రిబ్బన్ క్లబ్ అనడం మీ మాటల్లో విన్నా కానీ అదేంటో తెలియదు. HIV రాకుండా ఏదో చేస్తున్నారని కొద్దిగా తెలిసినా నేనెప్పుడూ అంతగా పట్టించుకోలేదు.  ఆసక్తి చూపలేదు. ‘   దూరంగా కనిపించే పిల్లలని ఎందుకో కేకలేస్తున్న తల్లిని తదేకంగా చూస్తూ మమత.  
 
‘బాల్యం నుండి యవ్వనంకి మధ్య ఉన్నదాన్ని కౌమారదశ అంటాం.  ఈ  దశలో ఉండే పిల్లలో  శారీరకంగా జరిగే మార్పులు ఎక్కువ కదా.  అల్లకల్లోలంలా ఉండే సంద్రంలా ఉంటుంది వారి మనసు. ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆసక్తీ, ఆరాటం నిలువననీయదు. ఆత్మీయులు చెప్పే మంచిని పెడచెవిని పెడతారు. తమకి అంతా తెలుసని విర్రవవీగుతారు.  సరదాలు, సంతోషాలు సంచులనిండా నింపుకోవాలని ఉవ్విళ్ళూరతారు.   సిగరెట్లు, గుట్కాలు, మద్యం  వంటివి అలవాటయేది ఈ వయసులోనే. ప్రకంపనలు ఎక్కువ. ఆందోళనలు ఎక్కువ.  దారితప్పి లైంగిక అనుభావాలకోసం ప్రయత్నం చేస్తారు. హొమొసెక్సువల్స్ గా మారడం, లేదా అత్యాచారాలకు పాల్పడడం, లేదా గురవ్వడం జరుగుతోంది. అందువల్ల hiv లాంటి ప్రమాదకర వ్యాధులకు లోనవుతున్నారు.  
 
‘ఏ వయసు వారిని కౌమారదశలో ఉన్నారని అంటారు ‘ రేణుక 
 
’10 నుండి 19 సంవత్సరాలలోపు ఉన్నావారిది కౌమార దశ’ రాణి  
 
‘అంటే మనమూ కౌమార దశలో ఉన్నట్లే  గదా ‘  కళ్ళు పెద్దవి చేస్తూ రేణుక 
 
‘అవును మనం ఆ దశను దాటుకునే స్థితిలో ఉన్నాం’  వాచ్లో టైం చూస్తూ సంతోష్ 
 
‘ ఈ వయసులో  భావోద్వేగాలు ఎక్కువ. అందుకే దారితప్పే తమ్ముళ్ళు , చెల్లెళ్ళని తమని తాము నిగ్రహించుకోవాలని తెలియజేస్తాం.  తమ ఊహలకు కళ్ళెం వేయాలని చెప్తాం.  HIV వ్యాధి ఎలా వస్తుందో తెలిస్తే పక్క దారుల్లో వెళ్ళకుండా  ఆరోగ్యకరమైన జీవన శైలి అలవరచుకుంటారు. అందుకే  సురక్షితమైన లైంగిక ప్రవర్తన అవసరాన్ని తెలియజేస్తాం, స్వచ్చంద రక్తదానం ప్రోత్సహిస్తాం. మాదకద్రవ్యాలకు అలవాటయితే జీవితం ఎలా విషనాగు కోరల్లోకి పోతుందో తెలియజేస్తాం.  
 
‘మన ప్రవర్తనని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్తారన్నమాట ‘ సాలోచనగా మమత 
 
‘సరిగ్గా అర్ధం చేసుకున్నావ్ ‘ షేక్ హ్యాండ్ కోసం చేయి ఇస్తూ సంతోష్ 
 
‘జీవితం హాయిగా జీవించడానికే. మనమే కాదు ఎదుటివారు కూడా హాయిగా జీవించడానికి.    క్షణికావేశంతోనో , ఒక బలహీన క్షణంలో తీసుకున్న బలహీన  నిర్ణయం జీవితాన్ని ఎంత చిన్నా భిన్నం చేస్తుందో, అయిన వాళ్ళని, ఆనందాల్ని ఎంత దూరం చేస్తుందో, అందరినీ ఎంత వ్యధకు, ఆవేదనకు గురిచేస్తుందో  నా కన్నతల్లి జీవితమే ఓ చక్కని ఉదాహరణ. ‘ ఉద్వేగంగా మమత 
 
‘నిజమే, మా హాస్టల్ లో  ఒకమ్మాయి ఉంది.  తను అవధులు దాటి ప్రవర్తించడమే కాకుండా మిగతా వారిని కూడా తన లాగే తయారు చేస్తోంది.  మా హాస్టల్ లోనూ ఒక  మీట్ పెట్టుకుంటే బాగుంటుందేమో!  విషయం అర్ధమయితే పరిస్తితి వేరుగా ఉంటుంది కదా ‘. రేణుక 
 
‘తప్పకుండా పెడదాం మీ వార్డెన్ పర్మిషన్ తీసుకో . గీతా వాళ్ళు వచ్చాక ఎప్పుడు వీలుతుందో చూసి తేదీ నిర్ణయించుకుందాం ‘  చెట్టుపై చేరిన పిట్టల కువ కువలు అడ్డుతగులుతుండగా  రాణి 
 
‘ఈ మధ్యే మా ఆశ్రమంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వచ్చారు. ఇద్దరూ అనాధలే.  తండ్రి లారీ డ్రైవర్.  అతని ద్వారా తల్లికి ఈ జబ్బు అంటుకుంది.  వాళ్ళు పరీక్షలు చేయించుకునే సరికి సమయం మించిపోయింది. రక్త పరీక్షలో విషయం తెలిసినా ictc సెంటర్ కి వెళ్లి మందులు తెచ్చుకుంటే విషయం అందరికీ తెలుస్తుందని వాళ్ళంతా ఏమనుకుంటారోనని జంకుతో ఊరుకున్నారు.  వారి తల్లి ఈ మధ్యే  చనిపోయిందట.  తండ్రి చావు బతుకుల్లో ఉంటే ఎవరో తీసుకొచ్చి వీళ్ళను మా దగ్గర చేర్చారు.  తాతయ్య వీళ్ళకు టెస్ట్ చేయించారు. చిన్న పాపకి hiv ఉన్నట్లు నిర్ధారణ అయింది.  ఈ విషయం గోప్యంగా ఉంచారు తాతయ్య.  కానీ ఎలాగో బయటికి పొక్కింది. అంతే ఆ పిల్లలను ఎవరమూ  దగ్గరకు రానీయడం లేదు. ఆ చిన్న పాప వయస్సు ఐదు ఏళ్ళ లోపే.  పాపం కదా .. వాళ్ళు చేసిన తప్పేమిటి ?  ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టడమేనా ?  ఎంత బాధ పడుతున్నారో ఆ చిన్నారులు ? నిజానికి మాకూ ఈ జబ్బు గురించి సరైన అవగాహన లేక వారిని దూరంగా ఉంచాం.   వారిని చూస్తే జాలేస్తోంది ‘ సాలోచనగా మమత 
 
‘మనం చేయాల్సింది జాలి పడ్డం కాదు సహభావం చూపాలి. మాములుగా వారి వ్యాధి మనకి అంటుకోదు. రక్తం ద్వారాను, స్రావాల ద్వారాను అంటుకుంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ‘ సంతోష్  
 
‘నా కన్నతల్లి లాంటి వారి ద్వారా ఇంకా ఎంత మందికి ఈ వ్యాధి సోకిందో ..?’
 
‘అందుకే అరక్షిత లైంగిక సంబంధాలలోకి వెళ్ళకూడదని చెప్పేది. ఏమరుపాటుతో ఉంటే  ఒకరినుంచి ఒకరికి గొలుసులా ఈ వ్యాధి విస్తరిస్తోంది.  ఆ అవగాహన అందరిలో అవసరం.  మనం మన పరిధిలో చేయగలిగిన పని మనం చేద్దాం ‘ రాణి 
 
‘నెవిరామైసిన్ వాడితే తల్లినుంచి పిల్లకి వ్యాధి వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది.  జబ్బు వచ్చినా సరైన మందులు వాడుతూ పోషకాహారం తీసుకుంటే వారి జీవితకాలం చాలా పెరుగుతుంది …. ‘చెబుతూనే ఉన్నాద్ సంతోష్ 
 
మనిషికీ మనిషికీ మధ్య సంబంధాలు వ్యాపార సంబందాలుగా మారిపోతున్న వేళ , ఆత్మీయతానుబంధాలు రోజు రోజుకీ పలచబడుతున్న తరుణంలో,  స్వార్ధం , మోసం ఆత్మవంచనలతో కుటుంబ సంబంధాలు విచ్చిన్నమవుతున్న దశలో, ఎవరికి వారే యమునాతీరే అనే నేటి బిజీ లైఫ్ లో   వ్యవస్థను , విలువల్ని కాపాడే బాధ్యత నవనాడుల్లో నింపుకుని, ఆత్మీయ హస్తం అందిస్తూ  ముందుకు సాగుతున్న  ఈ యువతరాన్ని అభినందించడం కాదు తనూ వాళ్ళ పనిలో భాగస్వామ్యం పొందాలి  అనుకున్న  మమత ‘నేనూ మీతో పాటు కలసి పని చేయవచ్చా ‘ అడిగింది . 
 
‘తప్పకుండా.  మేం కోరుకునేది అదే.  ఒకరినుంచి మరొకరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవాలనే ‘ ఉత్సాహంగా సంతోష్ 
 
‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది’ మోహంలో కొత్త వెలుగు తొంగి చూస్తుండగా మమత  .  
 
‘బాధ పడుతున్నవేమోనని అనుకుంటే … ‘ అర్దోక్తితో ఆగింది రాణి 
 
‘నిజంగానే నాకు ఆనందంగా ఉంది. ఒకటి ఈ రోజు నా పుట్టుక రహస్యం తెలిసింది.  రెండోది ,  నేను మీతో పాటు ఓ మంచి కార్యక్రమంలో భాగస్వామి కాబోతున్నాను.  ఈ వ్యాధి సోకిన వారికి తోడ్పాటు అందించే విధంగా ఉండబోతున్నాను.  నాకు ఒక ఆసరా  లభించింది.  కాని ఎలాంటి ఆసరా లేకుండా దుర్భర జీవితం అనుభవించే చిన్నారులు ఎందరో.  అలాంటి వారు ముఖ్యంగా నాలాంటి అభాగ్యులు తయారుకాకుండా, కోయిలమ్మ పాటతో మురిసే, నెమలమ్మ నాట్యంతో పులకించే వారు చీడ పురుగుల చేతికి చిక్కకుండా భవిష్యత్తును కాపాడే బృహత్తర కార్యక్రమంలో ఒక బిందువును అనుకుంటే ఎంత తృప్తిగా ఉందో మాటల్లో చెప్పడానికి పదాలు దొరకడం లేదు ‘  కళ్ళు మిల మిల మెరుస్తుండగా మమత 
 
 ఇప్పుడు టాక్ aids స్టాప్ aids అంటూ రెడ్ రిబ్బన్ క్లబ్స్ ఇంకా ఎక్కువ ఏర్పాటు చేయాల్సిన అవసరం, పీర్ ఎడ్యుకేటర్లని తయారు చేయాల్సిన అవసరం, అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది.’ రేణుక 
 
గీత, కేశవ్ ల బృందం రాకతో కూర్చున్న వాళ్ళంతా లేచారు బయలుదేరడానికి ఉద్యుక్తులవుతూ 
 
శ్రీ శ్రీ అన్నట్లు
కొంతమంది యువకులు పుట్టుకతో వృద్దులు 
కొంత మంది యువకులు ముందు తరం దూతలు  
మనసులో అనుకుంటూ అడుగు ముందుకు వేసింది మమత
 
 వి. శాంతి ప్రబోధ 
 

(హెచ్ ఐ వి/ఎయిడ్స్ పై apsacs వేసిన ఆశాదీపం కథా సంకలనంలో వచ్చిన కథ)

మధుర లంబాడీలు…నిండు వసంతం వారి సొంతం!

DSC_0002మామిడిపండులా మధురంగా కనిపించి నా మనసు దోచుకున్న వారిని గురించి తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండడం లోనే రోజులూ, నెలలూ సంవత్సరాలూ కాలగమనంలో దోర్లిపోయాయి. వారిని నేను మొదట చూసింది మంచిర్యాల నుండి ఆదిలాబాద్ బస్సులో వెళ్తూ. వారి ఆహార్యం వింతగా కొత్తగా ఉండి వారి పట్ల ఆసక్తి రేకెత్తించింది. ఆ తరువాత కొన్ని ఏళ్ళకి అంటే నేను నిజామాబాద్ జిల్లాలోని వర్ని వచ్చేవరకూ ఎప్పుడూ వాళ్ళని చూసే అవకాశం రాలేదు.

ఓ రోజు, ఆశ్చర్యగొల్పుతూ వారు మా ఇంటి ముందు నుండి బారులు తీరిన ఏండ్ల బళ్ళలో వెళుతూ .. ఆతర్వాత ఓ రోజు మా ఇంటి దగ్గర వారి బళ్ళు ఆపుకొని మా బోరింగ్ దగ్గర కూర్చొని వారు వెంట తెచ్చుకున్న జొన్న రొట్టెలు తినడం నాకు వాళ్ళని గమనించడానికి అవకాశం దొరికింది. వాళ్ళు అక్టోబరు మాసంలో చెరుకు కొట్టడానికి ఇళ్ళనుండి బయలు దేరి వెళ్ళిన వాళ్ళు మార్చిలో వెనక్కి వస్తున్నారట. ప్రతి సంవత్సరం అలా పిల్లాపాపలతో, గొడ్డు గోదా తీసుకొని వెళ్తారని మా వాళ్ళు చెప్పారు. చక్కని ముఖ కవళికలతో అందంగా, మంచి రంగుతో, పొడుగ్గా ఉండే వారి నడినెత్తిపైకి కట్టి ఉండే జుట్టు, వారి మెడలో కనిపించే పూసలు, నిండు రంగులలో ఉండే బట్టలూ ఆసక్తితో గమనించేదాన్ని. మా వాళ్ళందరూ చిన్నప్పటినుండి చూస్తూ ఉండడం వల్లనేమో వాళ్ళకి ఆ జాతి వారిని ప్రత్యేకంగా చూసేవారు కాదు. నాకు మాత్రం వారు చాలా ప్రత్యేకంగా ఆనాటికీ ఈనాటికీ… నన్ను అంతగా ఆకర్షించిన వారే మథుర లంబాడీలు.
మధుర లంబాడాలు మాములుగా మనకు కనిపించే లంబాడాలు లేదా బంజారాలు లేదా సుగాలీలు లకు భిన్నంగా కనిపిస్తారు. వారి భాష, ఆచార వ్యవహారాలు, కట్టు అన్నింటిలో ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది.
ఎక్కడెక్కడ కనిపిస్తారు
మధుర లంబాడాలు మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చాలా కొద్దిగా కనిపిస్తారు. వీరు మహారాష్ట్ర, చత్తీస్ గడ్ , రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో కూడా తక్కువ సంఖ్యలో కనిపిస్తారు. గుజరాత్ లో ఎక్కువ . వీరిని మహారాష్ట్ర, గుజరాత్ లలో మధుర బంజారా, చత్తీస్ గడ్ లో మధుర లంబాని, మధ్యప్రదేశ్ లో మధుర లబాన్, ఉత్తర ప్రదేశ్ లో మధురాలు లేదా మధూరియా అని అంటారు. మహారాష్ట్రలో వీరిని డి నోటిఫైడ్ విముక్త జాతులుగా ప్రకటించారు.
రాజస్థాన్ లోని బికనీర్, బహాల్యాపూర్ , పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో ఈ జాతి ఆవిర్భవించిందాని చరిత్ర కారుల అంచనా. రాజపుట్ వంశస్తుల అనచివేయబడిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళారని చరిత్రకారుల అంచనా.
DSC_0002
రాజస్థాన్ /గుజరాత్ నుండి ఎప్పుడో కొన్ని తరాల పూర్వం పశువుల పై సరుకులు రవాణా చేస్తూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళేవారని, అలా వచ్చి ఇటే ఉండిపోయారని చెప్తాడు 92 ఏళ్ళ మోతిలాల్ (సిద్దాపూర్ తండా , నిజామాబాద్ ).
నిజామాబాద్ జిల్లాలో వీరిని మధుర లంబాడాలు అనీ, కాయితి లంబాడాలు అనీ, కొప్పు లంబాడాలని , జుట్టు లంబాడాలని రకరకాలుగా పిలుస్తారు. వారి భాష, వేషధారణ, నగలు , పండుగలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వాయిద్య పరికరాలు అన్నీ ప్రత్యేకమే. అటవీ ప్రాంతాల్లోనే వీరి నివాసం. మైదాన ప్రాంతాలకి వారాంతపు అంగళ్ళకి వస్తారు.

మధుర లంబాడాలలో 11 గోత్రాలు ఉన్నాయి. అవి నాయక్, బామన్, బాద్రియా, కిత్రియా,లేల్యా, మాంద్యా, బర్దావల్, తిత్రియా , పెళ్యా, సాబ్ల్యా, భట్ . నాయక్ అందరికన్నా పై స్థాయిలో ఉంటే భట్ లు అందరికన్నా తక్కువ.
రాజస్థాన్ /గుజరాత్ నుండి ఎప్పుడో కొన్ని తరాల పూర్వం పశువుల పై సరుకులు రవాణా చేస్తూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళేవారని, అలా వచ్చి ఇటే ఉండిపోయారని చెప్తాడు 92 ఏళ్ళ మోతిలాల్ (సిద్దాపూర్ తండా , వర్ని మండలం, నిజామాబాద్ ). అయితే తమ వాళ్ళు ఎప్పుడొచ్చింది ఖచ్చితంగా చెప్పలేమని, మా ముత్తాతల ముత్తాతలది కూడా ఇదే ఊరు అంటాడు అతను.
మేం అంతా బస్సు తీసుకొని మా జాతి అంతా ఒక దగ్గర కలుస్తోంది అని తెలిసి గోకుల్ మధుర వెళ్లి వచ్చాం. అక్కడికి మాకు చూస్తే నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా . వాళ్ళు అంతా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో . డాక్టర్లు , ఇంజనీర్లు , కలెక్టర్లు . కొందరు అమెరికాలో . ఇక్కడ మేం ఇంకా అడవిలోనే . చదువు సంధ్యలకు దూరంగానే .. మా పిల్లలను బాగా చదివించాలని ఇప్పుడు మా తపన అన్నాడు గోకుల్ దాస్ తండాకు చెందిన నాయకుడు బారత్యానాయక్
మా ముత్తాతల ముత్తాతల ముందు తరాల వాళ్ళు వందల ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు మా జాతి ఎట్లా ఉందో అట్లానే మా జాతి లక్షణాలు మా దగ్గరే బతికి ఉన్నాయి. అక్కడ మా జాతి కట్టు బొట్టు , వేషభాషలు ఏమీ ఇప్పుడు కనిపించవు అన్నాడు పదవతరగతి వరకు చదివిన సజ్జన్లాల్ .
ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ గోత్రాన్ని బట్టి వాళ్ళు మా జాతీయులు అని గుర్తించవచ్చు అంటాడు ఇంజినీరింగ్ చదువుతున్న పతేసింగ్. వందల ఏళ్ళ క్రితం చెల్లా చెదురు అయిపోయిన మా జాతిని గుర్తించడానికి, ఒక దగ్గర చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు టెక్నాలజీ కూడా చాలా ఉపయోగపడుతోంది అన్నాడు ఈ ప్రాంతంలో మధుర లంబడాల జాతి నుండి కాబోయే మొదటి ఇంజినీర్.
జీవన విధానం
ప్రకృతి ఒడిలో కొండ వాలులోనో, అటవీ ప్రాంతంలోని వాగు సమీపంలోనో ఉంటాయి మథుర లంబాడాల నివాసాలు. మధుర లంబాడాలు ప్రధానంగా పశులకాపరులు. వ్యవసాయం చేస్తారు. గోవుల కాపరి శ్రీకృష్ణుడి రాజధాని గోకుల మధుర మాది అని వాళ్ళు చెప్తారు. వీరి మెడలో జంధ్యం ఉంటుంది. గాయత్రి మంత్రంతో పవిత్ర జంధ్యం వేసుకుంటారు. వాళ్లకు వాళ్ళు మేం క్షత్రియులం అని చెప్పుకుంటారు. కానీ, బయట ప్రపంచం వీరిని గిరిజన తెగలకు చెందిన వారిగానే చూస్తుంది.
వీరు సంచార జీవులుగా ఉన్న కాలంలో వీరు తండాల్లో ఉండేవారు. వీళ్ళ నాయకుడుని నాయక్ అంటారు . వంశానుగాతంగా ఆ పదవి వస్తుంది. నాయక్ ఎప్పుడూ తమ వారి మంచి కోసం ఆలోచిస్తూ కృషి చేస్తాడు. అందరూ అతని మాటని గౌరవిస్తారు.
DSC_0020
ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ కనిపిస్తాయి. ఒక్క కుటుంబంలో అరవై డెబ్బై మంది కుడా ఉంటారు. వ్యవసాయ పనులు, పశువుల పెంపకం అంతా కలసి చేసుకుంటారు . పిల్లలు పెద్దల పట్ల గౌరవంతో ఉంటారు.
ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఐదారేళ్ళ క్రితం వరకూ గోవులను మేపుతూ అలా రోజులు నెలల తరబడి వెళ్ళేవారు . ఇంటికి దూరంగా ఉండే వారు. గోవుల మందలను తోలుకెల్లి పొలాల్లో మంద పెట్టె వాళ్ళు. అందుకు ప్రతిఫలంగా రైతులు జొన్నలు , వడ్లు ఏదో ఒక ధాన్యం ఇచ్చే వారు. వీరి జీవనం చాలా కష్టంగా సాగేది. అప్పట్లో మాకు నాగరికత తెలియదు. గత 20 ఏళ్లలో మా జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. నాగరికత తెలిసింది. మా కట్టు-బొట్టు, ఆచార వ్యవహారాల్లోనూ మార్పు వచ్చింది అంటాడు భారత్యా నాయక్ బంధువు .
అవును, అప్పుడు మాకు అప్పులు లేవు. ఇప్పుడు అప్పులు వచ్చాయి. ప్రభుత్వం వారూ, బాంకు వాళ్ళు రుణాలు ఇస్తున్నారు. అవకాశం ఉంది కదా అని భార్య పేరున , పిల్లల పేరా అప్పులు చేసి ట్రాక్టర్లు, మోటారు సైకిళ్ళు , పొలాలు , బోర్లు సమకూర్చుకుంటున్నాం. కానీ అప్పటి రోజులే బాగున్నాయి అప్పులు లేకుండా యాలకింత తిని కంటి నిండా నిద్ర పోయే వాళ్ళం అన్నాడు భారత్యా నాయక్.
ఇప్పటికీ వ్యవసాయంలో నాగలి, రెండు చక్రాల ఎడ్ల బళ్ళను ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్న వనరులతో వ్వవసాయం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడిప్పుడే ట్రాక్టర్లు , కొత్త మిషన్లు వంటి యంత్రాలు వీరి జీవనంలోకి వచ్చి చేరుతున్నాయి.

ఆహారం
వాస్తవానికి వీరు శాఖాహారులు. అయితే నేటి తరం వారు మద్యం, మాంసాహారానికి అలవాటుపడిపోయారు. వీరి సాంప్రదాయిక ఆహారం రోటి. జొన్నలు బాగా తింటారు . గోధుమ, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము , కంది పప్పులు ఎక్కువగా తింటారు . టమాటా , వంకాయ వంటి రకరకాల కూరగాయలు వాళ్ళ పొలాల్లో పండేవి తింటారు. ఆకుకూరలు తింటారు. వరి బియ్యం తినడం ఒకప్పుడు లేదు. తిన్నా ఎప్పుడో పండుగ సమయాల్లో మాత్రమే తినేవారు. యన్. టి. రామారావు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండురూపాయల బియ్యం ఇచ్చినప్పటి నుండి నెమనెమ్మదిగా బియ్యం తినడం అలవాటు అయింది అంటాడు మాజీ సర్పంచ్ భర్త మోతిలాల్.
జామ, అరటి , యాపిల్ వంటి పళ్ళన్ని వారాంతపు సంతలో తెచ్చుకుంటారు. పెరుగు, నెయ్యి బాగా వాడతారు. తీపి పదార్ధాలు ఇష్టపడతారు. టీ తాగుతారు. పల్లీలతో, కందగడ్దలతో( చిలగడ దుంప) పండుగ సమయాల్లో పాయసం చేసుకుంటారు.
వారి ఇళ్ళు
కొండ కోనలకు సమీపంలో వీరి నివాస సముదాయాలు ఉంటాయని ముందే చెప్పాను కదా ! సమీపంలోని అడవినుండి తెచ్చిన టేకు దుంగలను గోడలుగా అమర్చుకుంటారు. పైన వర్షాకాలపు పంటకు వచ్చే వరిగడ్డిని తెచ్చుకుని ఇళ్ళపై కప్పుతారు. ఇంటి ముందు పశువుల పాకలు ఉంటాయి. పశువులే వారి ఆస్తి. లేగ దూడలను ఇంట్లో తమతో పాటే ఉంచుకుంటారు. వంటకి కట్టెల పొయ్యి వాడతారు.
గతంలో పొయ్యిలో నిప్పు ఉన్నప్పుడే అన్నం తినేవారు. ఆరిపోతే తినరు . ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఉపయోగించుకొని కొందరు పక్కా ఇళ్ళు కట్టుకున్నారు. దాదాపు అన్ని ఇళ్ళలో విద్యుత్ దీపాలు కనిపిస్తాయి. మీటరు ఉండదు కానీ వైర్ తగిలించి విద్యుత్ దీపాలు వెలిగించు కుంటారు కొందరు. కొందరి ఇళ్ళలో టి.వి లు కూడా వచ్చేశాయి. నాగరిక ప్రపంచంలో కనబడే అనేక వస్తువులు అడవుల్లోనో , అటవీ అంచుల్లోనో ఉండే వారి ఇళ్ళలోకి చొచ్చుకొచ్చి ఆశ్చర్యం కలిగిస్తాయి.

స్నేహానికి ప్రాణమిచ్చే మథుర లంబాడీలు కొద్దికాలం క్రితం వరకూ అటు నక్సలైట్లు ఇటు పోలీసుల మధ్య నలిగిపోయారు.

మాతృభాష
వీరి భాష లంబానా భాష. వీరి భాషలో మరాఠీ , హిందీ, బంజారా భాషా పదాలు మిళితమై కనిపిస్తాయి. నిరక్షరాస్యులైన వీరు మాతృభాషతో పాటు స్థానిక భాషలు మాట్లాడతారు.
భాషలో కొన్ని పదాలు
లెహెంగ (లంగా)
కచలి (జాకెట్)
నమస్తే – రామ్ రామ్
యా/బాయి – అమ్మ
బా – నాన్న
దాదా – అన్న
జీజీ – అక్క
జీజొ – బావ
దండో – తాత
డంగి – నాన్నమ్మ
పుప్పీ – అత్త
పెళ్లి – బ్యహ
బాడువా – వడక లగ్గం
నాక్డా – నాయక్
పూజించే దేవతలు

వీరు శ్రీ కృష్ణుడిని కొలుస్తారు. తిరుపతి బాలాజీ , పూరి జగన్నాధ్ ని పుజిస్తారు.

పండుగలు
మథుర లంబాడాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పండుగ గోకులాష్టమి. వీరి నివాసాలకు వెళితే శ్రావణమాసం అంతా పండుగ వాతావరణమే కనిపిస్తుంది.
DSC_0016
వస్త్రధారణ
పెళ్ళికాని ఆడపిల్లలు లేహంగా, కచలి (జాకెట్ ) వేసుకుంటారు . పెళ్లి అయిన స్త్రీలు చీర వాళ్లపద్దతిలో కట్టుకుంటారు.
మగవారి ఆభరణం జంధ్యమే . దీన్ని జనువా అంటారు. సాంప్రదాయంగా ధోతీ (బారకషి ), జుబ్బా (జహంగల ) వేసుకుంటారు.

చదువు
చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. అతి కొద్ది మంది ఇంటర్ వరకు చదివి ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు మిలిటరీలోకి వెళ్ళారు. ఆడ పిల్లల్లో చదువుకునే వారి సంఖ్యా మరీ తక్కువ. ఇప్పుడిప్పుడే 10 వతరగతి కి వచ్చారు . ఒకరిద్దరు ఇంటర్ చదివితే , ఒకమ్మాయి మాత్రం నిజామాబాద్ లో ఉంది ప్రైవేటు కాలేజిలో ఇంగ్లిషు మీడియంలో డిగ్రీ చదువుతోంది.
పెళ్లి:
మగవాళ్ళకి 21, వదువుకి 16 పెళ్లి వయస్సు.
మధుర లంబాడాల తండాలో నాయక్ అందరికీ పెద్దగా ఉండి గ్రామ మంచి చెడులు, గ్రామ మంచి కోసం చేసే కార్యాలు చేస్తాడు. అలాగే భట్ గోత్రికుడి కి కూడా వంశపారంపర్యంగా బట్ పని వస్తుంది. అతను నాయక్ కి సహాయకుడిగా ఉంటాడు. అంతే కాకుండా పెళ్లిల్లప్పుడు పెళ్లి పనులు చేస్తాడు.
అతను చేసే సేవలకు వారి వారి ఆర్ధిక స్థాయిని బట్టి కొత్త సొమ్ము ఇచ్చేవారు. మొన్నటి వరకూ పదకొండు వందల రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 5 వేలు ఆరు వేలు కూడా ఇస్తున్నారు.
ఊరిలో ఎ సమాచారమయినా అందరికి చేరవేస్తాడు భట్. పెళ్లి పిలుపులు , చావు వార్తలు అతనే చేర వేస్తాడు.
మానవ జీవన విధానాన్ని ప్రభావితం చేసే అంశాలు సహజంగానే వారినీ ప్రభావితం చేయడం కనిపిస్తుంది. ఒక సమాజానికి మిగతా సమాజాల వారితో సంపర్కం ఏర్పడ్డాక, రాకపోకలకు సదుపాయాలు ఏర్పడ్డాక, సమాచార వినిమయం పెరిగాక వచ్చే మార్పులు వీరి జీవన విధానంలోకి చోచ్చుకోచ్చేశాయి.
ఇంతకు ముందు పెళ్లి పత్రికలు వేయించేవారు కాదు. ఆకులు – పోకలు ఇచ్చి ఫలానా వారి పెళ్లి ఉందని చెప్పి పిలిచే వాళ్ళు. ఇప్పుడు పెళ్లి పత్రికలు వేయిస్తున్నారు.
ఒకప్పుడు బ్రాహ్మడు ముహూర్తం చూసి పెళ్లి సమయం నిశ్చయించే పద్ధతి లేదు. పెళ్లి సమయాన్ని నాయకుడే నిర్ణయించే వాడు. ఆ సమయానికే పెళ్లి జరిగేది. ఇప్పుడు కూడా నాయక్ పెళ్లి ఎప్పుడు చేయాలో చెప్తున్నాడు కానీ బ్రహ్మడికి కూడా చూపిస్తున్నారు. ఆ సమయం మంచిదో కాదో చెప్పించుకుంటున్నారు.
అమ్మాయి అబ్బాయి పెళ్ళికి ముందు చూసుకునే పద్ధతి కూడా లేదు. అమ్మాయి తరపు వారు అబ్బాయి గురించీ, అబ్బాయి తరపు వారు అమ్మాయి గురించీ ముందే బంధు మిత్రుల ద్వారా తెలుసుకుంటారు. ఆ తర్వాత ఇరువర్గాలు నాయకుడి ఇంటి దగ్గరికి వస్తారు. ఆకులు – పోకలు ఇచ్చి పుచ్చుకుంటారు. తింటారు. పెళ్లి చేసే విధానంలోనూ అనేక మార్పులు.
పెళ్ళైన ఆడపిల్లకి కాలిపాట్ అని నల్లపూసల మంగళసూత్రం ఉంటుంది. రక్షడి, కాఖడి జుట్టులో పెట్టుకుంటారు. ఇత్తడి కాళ్ళ కడియాలు, గూటి (టో రింగ్ ), బిడ్ (మెడ , చెవుల నగలు ). ఒకసారి పెడితే అవి చని పోయే వరకూ తీయరు. భర్త చని పోయిన స్త్రీ అవి తిసివేస్తుంది.
039
విడాకులు తక్కువ . పిల్లలు పుట్టకపోతేనో , భార్య చనిపోతేనో, ఆరోగ్యం బాగోలేకపోతేనో మళ్లీ పెళ్లి చేస్కోరు. విడాకులు తీసుకున్న వాళ్ళు, భర్త చనిపోయిన మహిళలు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఇలా రెండో సారి పెళ్లి చేసుకొనే మహిళ వాళ్ళు విడాకులు తీసుకున్న వారినో , భార్య చనిపోయిన వ్యక్తినో చేసుకుంటారు. విధవరాలిని రండ్ అంటారు.
మగవాళ్ళు విడాకులు కోరితే ఆడపిల్ల వారికి కుల పంచాయితీ పెద్దలు చెప్పిన విధంగా భరణం చెల్లించాలి. విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత భర్తదే. పెళ్లి జరిగాక చేసే పెళ్లికి సంబంధించిన గుర్తులన్ని ఉంచుకోవచ్చు. భార్య/భర్త నడవడి బాగోలేకపోతే విడి పోయి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. రెండో పెళ్ళిని మొహ్తుర్ అంటారు.
కట్నం ఇచ్చి పుచ్చుకోవడం లేదు. ఒకప్పుడు అబ్బాయి అమ్మాయికి కట్నం ఇచ్చే పద్దతి ఉండేది. ఒలి ఇవ్వలేక అబ్బాయిలు ముదిరిపోయేవారట. ఓలి ఇచ్చి చేసుకునే వారు లేక అమ్మాయి ల పెళ్ళిళ్ళు అలస్యంగానే జరిగేవి. అయితే ఇప్పటికీ పెళ్ళిలో అమ్మాయికి 11 రూపాయలు కట్నంగా ఇచ్చే పద్ధతి ఉంది. ఓలి పద్ధతి లేదు. గురువు వచ్చాక ఆ విధంగా ఇవ్వడం మానేశారు.
అమ్మాయి కుటుంబం పేదదయితే పెళ్లి చేసే స్తోమత లేకపొతే , ఆ అమ్మాయిని తమ ఇంటి కోడలిగా తీసుకు వెళ్ళలనుకుంటే అమ్మాయి పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు ఆబ్బాయి వాళ్ళు ఇస్తారు. పెళ్లి చేసుకొని అమ్మాయిని తమ ఇంటికి తెచ్చుకుంటారు.
ఇంటి కోడలు పురిటికి కన్నవారింటికి వెళ్ళే ఆచారం లేదు. అత్తవారింటిలోనే పురుడు పోసుకుంటారు. పురిటి ఖర్చు అత్తింటి వారిదే . బిడ్డ పుట్టిన రెండు మూడు నెలల తర్వాత వెళతారు. ఒకప్పుడు ఇంటిదగ్గరే పురుడుపోసుకునే వారు. ఇప్పుడు ఆసుపత్రి కి వెళుతున్నారు. నెలరోజులు పురిటి మైల పాటిస్తారు. ప్రత్యేకమైన గదిలోనే ఉంటారు. ఆసమయంలో బిడ్డపనులు, తన పనులు తప్ప తల్లి ఏ పని చేయదు.
vaari veedhi
బహుభార్యాత్వం
సాధారణంగా ఏకభార్యత్వం పాటిస్తారు. కొన్ని సందర్భాల్లో బహుబార్యత్వం కనిపిస్తుంది. మొదటి భార్యకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అలా చేసుకుంటారు.
బంధుత్వాలు
చిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న పిల్లల్ని చేసుకోరు. మేనరికాల్ని చేసుకుంటారు.
అన్న చనిపోతే వదినని తమ్ముడు చేసుకోవచ్చు. కానీ, తమ్ముడి భార్యని అన్న చేసుకోడు.
వాయిద్య పరికరాలు
నగారా , బాజాలు , గిల్ల
మహిళల భాగస్వామ్యం
మగవాళ్ళ లాగే మహిళలూ అనడంతో పాటు ఎత్తుగా బలంగా ఉంటారు. స్త్రీలు ఇంటిపని, పొలం పని, పశువులు పాడిపనో ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తారు. ఒకప్పుడు బట్టలు చేత్తోనే కుట్టుకునే వారు. ఇప్పుడు వాళ్ళ బట్టలు కుట్టడానికి ప్రత్యేకంగా ఉన్న దర్జీ కుడతారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వారెవరికీ మిషను కుట్టడం రాదన్నారు. గతంలో తీరిక సమయాల్లో రకరకాల చేతికుట్లు కుట్టేవారట. ఇప్పుడు కుట్టడం లేదు అంటూ ఇప్పుడు అంతా కాలం మారిపోయింది కదా .. ఆ కుట్టినవి. ఇప్పటి వాళ్ళు వేసుకుంటారా అని ఎదురు ప్రశ్నించింది ఓ వృద్దురాలు.
నాలుగేళ్ళ క్రితం గుజరాత్ నుండి ఎవరో వచ్చారు. మా తండాలన్నీ తిరిగారు. మా దగ్గర ఉన్న చినిగిపోయిన బట్టలకు ఉన్నవయినా సరే మేం చేత్తో కుట్టిన వాటిని అడిగారు. వాటికి బదులుగా మాకు ఇత్తడి సామాన్లు ఇస్తామన్నారు. ఏమి చేసుకుంటాం అని మా దగ్గర ఉన్నవన్నీ వెతికి వెతికి వాళ్ళకి ఇచ్చేశాం అంటూ వాళ్ళు ఇచ్చిన ఇత్తడి గిన్నెలు చూపింది ఓ మహిళ. ఇప్పుడు మా దగ్గర మేం చేసిన కుట్లు అల్లికలు లేవు. ఎక్కడో ఒకరి దగ్గర తప్ప. అవి వచ్చిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు. ఇప్పటి ఆడపిల్లలు ఎక్కడ నేరుస్తున్నారు ..? అంది జమునాబాయి .

మధుర లంబాడాల కుటుంబాల్లోనూ మగ పిల్లవాడికి ఇచ్చిన ప్రాధాన్యత ఆడపిల్లకి ఇవ్వరు. ఆడపిల్లలు బడికి పోయేవాళ్ళు చాలా తక్కువ. గొడ్డు గోదా మేపడానికో, చేను కాపలాకో, ఇంటి పనులు చేయడానికో ఆడపిల్లలని బడికి పంపకుండా ఇంటిదగ్గరే ఉంచుతారు. ఏ పనులూ లేనప్పుడు పంపినా తమ తండాలో ఉన్న బడికే. చాలా కొద్ది మంది ఆడపిల్లలు ఊరు దాటి వెళ్లి చదువుకునేది. అదే మగపిల్లలయితే బడి ఉన్నప్పుడు ఊర్లొ కనిపించేది చాలా తక్కువ.
నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు నేనడిగే ప్రశ్నలకి జవాబు చెప్తూనే మా గురించి అన్ని అడుగుతున్నావ్.. నీమిటి లాభం అని ఒకరు అంటే .. సర్కారు జీతం ఇస్తుందా అని మరొకరు .. ఆ ఏమి లాభం లేకుంటే చదువుకున్నోళ్ళు మన ఇళ్ళు ఎందుకు వస్తారు అంటూ మహిళల నుండి ప్రశ్నల పరంపర. ఏదైనా ఆర్దికపరమైన లాభం లేకుండా ఎవరూ ఏ పనీ చేయరని వారి ప్రగాఢమైన నమ్మకం.

ప్రపంచీకరణ, ఆధునికీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా శరవేగంగా జరుగుతున్న మార్పులు, చోటు చేసుకుంటున్న ధోరణులు స్వచ్చమైన ముత్యంలా మెరిసే మథురాలలొకి వచ్చి వారినీ ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో వారి అభివృద్ధి ఎంత వరకూ జరుగుతుందో తెలియదు కానీ మథుర లంబాడాల జాతి ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన తమ అస్తిత్వాన్ని మాత్రం ఇక ఎక్కువ కాలం నిలుపుకోక పోవచ్చేమో త్వరలోనే కోల్పోతుందేమోనని నా బెంగ.
వి. శాంతి ప్రబోధ

దుర్యోధన దుశ్శాసన పర్వమూలాలెక్కడ .. ? నీలోనే …

నేను నిరుపేద ఆడపిల్లను
నేను కులసోపానంలో కింద ఉన్న బాధితను
నిత్యం దుర్యోధన దుశ్శాసన పర్వం లో చిక్కిన సమిధను
అందుకే
ఆ జాడ లేని లోకం కోసం డేగకళ్ళతో గాలించా
ఏదీ .. ఎక్కడా అగుపించదే ?
మూలం ఏమిటని, ఎక్కడుందని
మూడో కన్ను తెరిచి
ముల్లోకాలూ అన్వేషించా
అర్ధమయింది !
మగవాళ్ళు ఎప్పటికీ మగవాళ్ళే …
ఆ మాత్రం కుర్రతనపు ఆకతాయి చేష్టలుండవా.. ?
అనే
నీ తత్వంలోనే ఉంది అసలు లోపం
ఆనాటి నుండి ఈ నాటివరకూ ..
నీ ఆధిపత్య భావనలోనే ఉంది అసలు దోషం
నేను దోషాలకు నిలయం అంటూ
నా ఆడతనానికి మరకలు వేసే నువ్వే ..
నాపై నిఘా .. అనేకానేక హద్దులూ ..
ఆంక్షలు .. ఏర్పరచే నువ్వే
నియమాలూ , విధులూ ఏర్పరచి
నన్నేదో ఉద్దరిస్తున్నట్లు , రక్షిస్తున్నట్లు
జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు ఫోజులిస్తూ
ఒరిపిడి రాయిపై పరీక్షలు చేసేది నువ్వే
అవును మరి !
ఆ శ్రీ రామచంద్రుని వారసులు కదా !!!
నా స్వభావం .. నా చర్యలు పాపిస్టివంటూ
నేను విశ్వసించదగిన దాన్ని కాదని ప్రచారం చేసే నువ్వే
నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి
నా గర్భస్థానాన్ని అనకొండలా ఆక్రమించేసి
అది నీ మగతనంగా విర్ర వీగుతావు
అదేనీవు
అత్యాచారం స్త్రీకి మరణం కంటే హేయం అంటావు
అనైతిక ప్రవర్తనతోఎగిసిపడే నువ్వే
నీ శీలానికి లేని పవిత్రత నా శీలానికి అంటగట్టి
నా జీవితాన్ని రాబందులా కరచిపట్టి
నన్ను సమిధను చేస్తావు
నీ ఆటలు సాగనివ్వకపోతే సహించలేవు
బలసిన కొండచిలువలా బుసకొడతావు
అహంకారంతో అరాచకం సృస్టిస్తావు
పట్టపగలు పదుగురి ఎదుటే
వివస్త్రను చేసి నిస్సిగ్గుగా
సాముహిక అత్యాచారం చేస్తావు
నడివీధిలో తుపాకితో కాల్చేస్తావు
శవాల తివాచీ పరుస్తావు
అవును మరి
తాటక వధ నీ నిర్వాకమేగా !
శుర్పణఖ చెవులు ముక్కు కోసిన ఘనత నీదేగా !!
తోడేళ్ళలా పడి నా మర్మస్థానం పై దాడిచేయడం
బానిసను చేసి లోబరుచుకోవడం ,
అడవుల పాలు చేయడం
అమ్మకానికి పెట్టడం నీకు కొత్తేమీ కాదుగా.. !
పురాణకాలం నుంచి చూస్తున్నదేగా !!
నా వ్యవహారంలో పెత్తందారులా వ్యవహరించి
నా ఆలోచనా స్రవంతిని నియంత్రించి
నా ఉద్వేగాలను భావాలను ప్రతిఘటించి
నా సామాజిక ధర్మాలను నిర్ధారించి
నా నీతి న్యాయం నిర్ణయించి
తీర్పు చెప్పే వారిగా స్థిరపరచే నువ్వు
నా శ్రమను కొల్లగొడుతూ
నా శ్రమ ఫలితాలను అపహరిస్తూ
నా ఆశలను , అభిలాషలను కాలరాస్తూ
నాపై నాకే అంతరం సృష్టించే నువ్వు
నన్ను, నీకు విశ్వాసంగా బతకాలంటావు
నా గర్భస్థలం ఆక్రమించి
నాకు గర్భాదానం చేశానని
వారసులపై హక్కు ప్రకటించి
కాకీవనపు కరకు గాలిలో బంధించాలనుకుంటావు
ఇలా ఎన్నాళ్ళు .. ఎన్నేళ్ళు
ఇకపై సాగవు నీ ఆగడాలు
నీ ఒంటెద్దు పోకడలు తుంగలో తోక్కి
సమాజాభివృద్ధికి సమానాభివృద్దికి
నూతన సంస్కృతికి తోవ చూపుతా
స్త్రీ విముక్తి మార్గాలు వెతుకుతా
తళుకు బెళుకుల గాజురాయిలా కాదు
నిగ నిగలాడే నిక్కమైన నీలమణిలా మెరుస్తా
అంటూ ముల్లోకాలూ చాటింపు వేస్తా
ఆశ్చర్యంగా ఉందా .. ?
అవును నిజంగా నీకు ఆశ్చర్యాన్నే .,!!
నా రూపు మార్చుకుంటూ ..
నా ఉనికికి గుర్తింపునిచ్చుకుంటూ…
చీదరించుకునే నోళ్లను మూయిస్తూ…
సున్నా నుంచీ ప్రశ్నార్ధకంగా.. ఆశ్చర్యార్ధకంగా మారిపోతూ..
నా అస్తిత్వానికి ఓ అర్ధం ఏర్పరచుకుంటూ.. సాగిపోతుంటా ..

– వి. శాంతి ప్రబోధ

(published in July 2014 Vihanga Web magazine)

Tag Cloud

%d bloggers like this: