The greatest WordPress.com site in all the land!

Archive for August, 2014

ఊపిరి వేళ్ళు

నా రాక కోసం
మీ ఎదురుచూపులు
విచ్చుకున్న పెదవులు
మెరుస్తున్న కళ్ళు
మిఠాయిలు పంచడాలు
పండుగ సంబరాలు
నా రాక మీకెంతో అపురూపం
నా ఉనికి మీ కెంతో ప్రత్యేకం
నా ఒంట్లో చిన్న నలతకే మీ ఆదుర్దా
చిన్న దెబ్బ తగిలితే చేసే హంగామా
అంతా చూస్తూ
నేను మీకు అపురుపమైనందుకు
కడలి తరంగాల్లా ఎగిసి పడుతూ
మిడి మిడి జ్ఞానంతో మిడిసి పడుతూ
నిశ్శబ్దంగా నిద్రలోకి జారిపోయా
మగతనిద్రలో మస్తిష్కాన్ని కమ్మేస్తూ
కనీ కనబడని తారకల్లా
ఎక్కడినుంచో నాలో ప్రశ్నలు పొడుచుకొస్తూ
ముడుచుకు పోతున్న నిన్ను చూస్తూ
విచ్చుకోడానికి యత్నిస్తున్ననా కనురెప్పలు

విప్పారుతున్న వేయికళ్లతో
లోక రివాజు గమనిస్తున్నా
పగుళ్ళీడుతున్న సుందర తాజ్ మహల్ లా
నీవు చేస్తున్న నిశ్శబ్ద ఘోష నా చెవులను తాకుతూ

నీవూ … నాలాగే ,
నాన్న రక్తం పంచుకునే
అమ్మ కడుపులోంచే
ఒకరు క్షేత్రం , ఒకరు బీజం అయితే మాత్రం

ఎందుకీ వివక్ష ?
ఏమిటీ వైరుధ్యం ..?
నాకు ప్రపంచమే ఇల్లయితే
నీకు ఇల్లే ప్రపంచమా ..!

పుట్టింటిని వదిలి మెట్టినింటికి చేరి
రెండుకుటుంబాల మధ్య రెండు ఇళ్ళ మధ్య
రెండు వంశాల మధ్య ఏర్పడ్డ సంబంధాల్ని
చిక్కబరచడంలో నీదే ప్రధాన పాత్ర కదా !

కానీ … నీకో ప్రత్యేకమైన ఇల్లు లేదు
నీదంటూ వంశం లేదు
కుటుంబం లేదు అంతా నాదే !
నీ శారీర నిర్మాణ వైవిధ్యమే కారణమా ..!?

ఆదిమ కాలంలో
సమాన స్థాయి, వ్యక్తిగత స్వేచ్చ ,
స్వతంత్రభావనలు ఉండేవట, అవి
ఇక గతకాలపు జీవన అవశేషాలేనా ..!?

కట్టు కథలతో నాకనుగుణంగా
మలచుకున్న మనుస్మృతి
తనను ధిక్కరిస్తే ‘కీడు ‘ అని
సన్నాయి నొక్కులు నొక్కింది కదా !

నా ప్రయోజనాలను కాపాడుకునే క్రమంలో
సంస్కృతి, సాంప్రదాయం ముసుగులో
కుటుంబం, కట్టుబాట్ల పేరుతో నీ వికాసాన్ని తోక్కిపెట్టి
విధేయపు ఇనుపగోడలు కట్టింది కదా !

సామాజిక వ్యవస్థని నా నియంత్రణ లోకి తీసుకుని
నా ఆధిపత్యాన్ని స్థిర పరచుకునేందుకు
నా జాతి పన్నిన కుట్ర అని
పోస్ట్ మార్టం చేస్తే అర్ధమవడంలా .. !?

రాజ్యాంగ స్పూర్తిని అపహాస్యం చేస్తూ,
నీ పోరాట ఫలితాలకి తూట్లు పొడుస్తూ
మనుభావజాలం తరతరాలుగా ఇంకిన నా తత్వం
అందిస్తున్న న్యాయం ఏమిటో … ?!

విడమరుస్తున్నాయి కదలికలొస్తున్న నా మెదళ్ళు
మగత వీడి విప్పారుతున్నాయి నా కళ్ళు
సహానుభూతితో కదులుతున్నాయి నా కాళ్ళు
చలన శీలంతో మొలకెత్తి వూడలవుతున్నాయి నీ ఊపిరి వేళ్ళు

వి. శాంతి ప్రబోధ

(ఆగస్ట్ 2014 విహంగ అంతర్జాల మహిళా పత్రికలో ప్రచురణ )

కావ్ కావ్ కాకమ్మా ..

కావ్ కావ్ కాకమ్మా ..

banggai_crow_8174f
కాకమ్మ కాకి
కావ్ కావ్ కాకి
ఎక్కడమ్మా నీవెక్కడమ్మా!
నింగిలో నీ విన్యాసాల జాడెక్కడమ్మా !!

కావ్ కావ్ మంటూ
కొమ్మా రెమ్మా తిరుగుతూ
మా ఇంటిచుట్టూ పల్టీలు కొట్టే కాకమ్మా
నీ పలుకరింపులెక్కడ దాచావమ్మా ..!
నీవెక్కడ దాచావమ్మా ..!!

*** ****

కాకి గోల అని
విసుక్కునే నువ్వేనా !
ఎంగిళ్ళు తిని తెగబలిశానని
ఎద్దేవా చేస్తూ ఈసడించుకునే నువ్వేనా !!

కాకి రంగు పాపాలకు , వేదనలకు
ప్రతిరూపం అని దూరం నెట్టే నువ్వేనా !
కాకిలా కలకాలం బతికేకంటే హంసలా బతికితే చాలు
చిన్నబుచ్చేమాటలతో నా మనసులో గునపాలు గుచ్చే నువ్వేనా !!

గర్భగుడిలోకో నట్టింటిలోకో దూరితే
అరిష్టం అని గుండె బాదుకునే నువ్వేనా !
నేను, తెలీక తలమీద తన్నితే
తప్పదు చావు అని తల్లడిల్లుతూ శాపనార్ధాలు పెట్టే నువ్వేనా !!

ఛీఛీ .. పాడుకాకులు అని
గొణుక్కుంటూ హుష్ హుష్ అని వెంటబడే నువ్వేనా !
లోకులు పలుకాకులు అంటూ
ఆడిపోసుకునే దాకా నిద్రపట్టని నువ్వేనా! !

మీ పితృదేవతల ఆత్మ శాంతి కోసం తప్ప
నీవెప్పుడు కలవరిస్తావ్ .. నాకోసం పలవరిస్తావ్ ?
నీ పలవరింతలో నీ కలవరింతలో
ఏదో మతలబు ఉండే ఉంటుంది కదూ !!?

*** ***

అవును, మిత్రమా అవును
ఆశ్చర్యంగా ఉందా నాదే ఆ పలకరింపు
పిట్టగోడ మీదో.. చెట్టుకొమ్మ మీదో
ఠీవిగా అడుగులేసే నీ జాడ కనుమరుగయ్యాక
కానీ.., తెలియలేదు నీ విలువ ఏమిటో..
నీవు నాకు చేసే మేలు ఏమిటో..

జీతం బత్తెం లేని స్కావెంజర్లా..
పని చేసే నీ జాడ కానరాక
ప్రమాదాల హెచ్చరికలు చేసే అలారంలా..
గగనతలంలో అరుస్తూ గిరికీలు కొట్టే నీ ఆచూకీ లేక
మా ఆవాసాలలో మలిన పదార్ధాలు పేరుకుంటూ
కొత్త రోగాలకు , అంటువ్యాధులకు
అలవాలమై మరుస్థలిగా మారిపోతూ
మృత్యు ఘంటికలు మీటుతూ
ఉంటే, ఇప్పుడు నీరాకకోసం నిరీక్షణ

నీవు ఆలపించే ఐక్యతారాగం
కలసి ఉంటే కలదు సుఖం అనే సందేశం
ఉన్నదాన్ని తోటివారికి పంచడంలోని ఆనందం
పెంచుకునే ఆత్మీయతానుబంధ బలం
అవలోకిస్తే అవుతోంది అవగతం
నీ రంగు నలిపే కానీ మనసు స్వచ్చం
నిత్యం నీ నా అని కలహించుకునే మేం
సమైక్యతలోని గొప్పదనం
నిస్వార్ధమైన పరోపకారగుణం
నీదగ్గర నుంచి నేర్చుకోవాలి

అవును, నల్లా నల్లాని కాకమ్మా
నేను నిజమే చెబ్తున్నానమ్మా
నువు సల్లా సల్లగ ఉండాలే
కావు కావు అనే నీ రాగం మేం వినాలే
ఏదీ శాశ్వతం కాని సృష్టిలో నీ పరంపర కొనసాగాలే
నీవు చిరాయువుగా ఉండాలే..
ఉండాల… ఉండాల .. .

వి. శాంతి ప్రబోధ
14. 7. 2014 జనవిజయం లో ప్రచురణ

(రోజూ మా పక్కింటి మామిడి చెట్టుపై చేరి ఎన్నో రాగాలు ఆలపించే కాకమ్మల స్నేహంతో )

Tag Cloud

%d bloggers like this: