The greatest WordPress.com site in all the land!

Archive for October, 2016

అబోరిజినల్స్ ..

అబోరిజినల్స్ ..
ఆమ్మో అబోరిజినల్స్ చాలా అగ్రెసివ్ అని అనడం విన్నాను. అబోరిజినల్స్ అంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ అని మా అమ్మాయి సాధన చెప్పింది. ఉద్యోగాల్లో మిగతా ఆస్ట్రేలియన్స్ లాగే అబోరిజినల్స్ ని కూడా సమానంగా చూస్తామని ప్రత్యేకంగా ఉండడం చదివి ఆశ్చర్యం వేసింది .

అప్పటి నుండి వారిగురించి తెలుకోవాలని , చూడాలని ఆరాటం మొదలయింది. ఉందిగా గూగులమ్మ .. అడిగాను. వాళ్ళ ఛాయాచిత్రాలు నా ముందు పరిచింది. వాళ్ళను చూసి నాలో ఆశ్చర్యం. వాళ్ళ వేషం వేరుగా ఉండొచ్చు కానీ రూపం నేను చిన్నప్పటి నుండీ చుసిన ఆదిలాబాద్ అడవిబిడ్డలు గోండులు , నాయకపోడ్ లు, ఆ తర్వాత చూసిన కోయలు వీళ్లందరిలాగే అనిపించింది .

నిజమే మనం వాళ్ళని ఆదివాసులు అంటున్నాం. ఆస్ట్రేలియన్లు అబోరిజన్స్ అంటున్నారు అనుకుంటూ వాళ్ళ జీవన శైలి తెలుసుకుందామని చదవడం మొదలు పెట్టాను. అదే విధంగా నేనున్న సిడ్నీ నగరంలో కనిపిస్తరేమోనని బయటకు వెళ్ళినప్పుడల్లా కళ్ళు వెతకడం మొదలయింది . కొన్ని తరాలపాటు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కోల్పోయారని తెలిసి విస్తుపోయాను. ఐదు ఏళ్లలోపే తల్లిదండ్రులకు, తమదైన జీవన సంస్కృతికి దూరమై ఎక్కడో హాస్టల్స్ లో అనాధ జీవితం బతికారు వాళ్ళు . అలాంటప్పుడు బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు , తల్లిదండ్రులకు దూరమై తమ పుట్టుక గురించి, తమ వారి గురించి ఏమీ తెలియకుండా ఒంటరి జీవితం గడిపిన అబోరిజినల్స్ ఆవేశంగా , బయటివారిని చూసినప్పుడు కోపంగా ఉంటారంటే ఉండరా మరి?! గడచిన జీవితం ఇచ్చిన సవాళ్ళే వారినలా మార్చేసిందేమో ..?!

చితికిపోతున్న ‘సింగల్ పేరెంట్ చైల్డ్ ‘ బతుకు

ఆమె సింగల్ పేరెంట్ చైల్డ్ . తల్లి తప్ప తండ్రి తెలియదు . ఆమె పుట్టగానే
ఆడపిల్ల అనే కారణంతో అతను ఆమె మొఖమే చూడలేదు . ఆమె తల్లినీ పలకరించలేదు .
నిర్దాక్షిణ్యంగా వదిలేసి తనదోవ తాను చూసుకున్నాడు . తల్లీ బిడ్డలు
బతికారో చచ్చారో కూడా చూడలేదు . తల్లీ తండ్రీ అయి ఆమెను ఆమె తల్లి
పెంచింది.  బడిలోనూ, ఆధార్ కార్డులోనూ బ్యాంకు ఖాతాలోనూ తల్లి పేరే ఉంది
.  అందుకు ఆమె కొంత పోరాటం చేయాల్సివచ్చినా అది సాధించుకుంది ఆ తల్లి .
ఇప్పుడామె పాస్పోర్ట్ తీసుకోవాలనుకుంది.  అప్పటి నుండి మొదలయ్యాయి ఆమె
కష్టాలు.

పాస్ పోర్ట్ అప్లికేషన్ లో తండ్రి పేరు లేని కారణంగా అది తిరస్కరణకు
గురయింది.  ఆమెకు ముక్కు మొహం తెలియని , ఈనాడూ ఇసుమంత ప్రేమ చూపని అతను
తన జన్మకు కారకుడైనప్పటికీ అతని పేరు చేర్చడం ఆమెకు ఇష్టం లేదు. కానీ
పాస్పోర్ట్ అధికారులు తల్లిదండ్రులిద్దరిపేర్లూ కావాలంటున్నారు. తండ్రి
పేరు లేకుండా పాస్పోర్ట్ ఇచ్చేది లేదని వత్తిడి తెస్తున్నారు.  ఒకరకమైన
మానసిక హింసని అనుభవిస్తోంది ఆమె. అప్పుడు ఆమె ఏం చెయ్యాలి?  తండ్రి పేరు
చెప్పని కారణంగా పాస్పోర్ట్ పొందే తన హక్కుని కోల్పోవలసిందేనా ..?  తాను
దేశాంతరం వెళ్ళవలసి వచ్చే అవకాశాల్ని వదులుకోవలసి వచ్చిందేనా ..?

ఆమె తల్లి ప్రియాంక గుప్తా రంగంలోకి దిగింది. పాస్పోర్ట్ అధికారులకు
విషయం నివేదించింది . సీనియర్ అధికారులను కలిసింది . ఉత్తరప్రత్యుత్తరాలూ
నెరపింది . వారిని ఒప్పించడానికి శతవిధాలా  ప్రయత్నం చేసింది. కానీ ఫలితం
లేదు . .

ఒకవేళ తండ్రి పేరు చేర్చి పాస్పోర్ట్ తీసుకున్నా తనంటే ఇష్టంలేని అతని
పేరు తన పాస్పోర్టులో చూసుకున్నప్పుడు కూతురు ఎంత మానసిక వ్యధను, బాధను
అనుభవిస్తుందో అర్ధం చేసుకుంది ప్రియాంక. ఇది నా ఒక్కదాని సమస్యేనా ..?
ఎంతోమంది ఒంటరి తల్లులు / తండ్రుల సమస్య . సింగల్ పేరెంట్స్ కి ఉండే
సమస్యలకు ఇదో సమస్య తోడయింది.  ఈ సమస్యకు పరిష్కారం వెతకాలనీ,, సమాజం
నుండి సహకారం అందుకోవాలని భావించింది.  కోర్టు తలుపు తట్టింది .

తండ్రి పేరు అవసరం లేదని న్యాయ వ్యవస్థ ప్రగతి శీలమైన తీర్పు చెప్పింది .
విడాకులు తీసుకోవడం ద్వారానో , లేదా మహిళ సింగిల్మే గా ఉండాలనుకోవడం
వల్లనో గానీ రాను రానూ దేశంలో సింగిల్ పేరెంట్స్ పెరుగుతున్నారు . ఇలాంటి
సందర్భాల్లో  తండ్రిపేరు  తప్పని సరి కాదు .  వారికి ఇష్టమైతే
పెట్టుకోవచ్చు . కానీ బిడ్డకు ఇష్టం లేనప్పుడు ఆమె ఎవరి సంరక్షణలో ఉంటే
వారి పేరు మాత్రమే ఉండొచ్చని  మే 2016, ఢిల్లీ హై కోర్టు తీర్పు
వచ్చినప్పటికీ పరిస్థితి మారలేదు .

ప్రధానమంత్రి , హోం మంత్రి , స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి  తదితరుల
దృష్టికి సింగిల్ పేరెంట్స్ సమస్యలపై దృష్టి సారించవలసిందిగా వేడుకుంటూ
12 జులై, 2016 న  change.org ద్వారా పిటిషన్ వేసింది. ఈ విషయం పై మహిళా
శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ వెంటనే (జులై 15)స్పందించారు .

ప్రస్తుత పాస్పోర్ట్ నియమావళి  ప్రకారం తల్లిదండ్రులిద్దరి పేర్లూ తప్పని
సరి . ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పుని దృష్టిలో పెట్టుకొని, సమాజంలో
వస్తున్న మార్పులను అనుసరించి మన వ్యవస్థలోనూ , విధి విధానాల్లోనూ , నియమ
నిబంధనల్లోనూ సానుకూల మార్పురావలసిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు .
తనవైపు నుండి ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇటువంటి న్యాయబద్ధమైన అంశాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పడంతో పాటు
” నీ  భర్త ఆమెకు తండ్రిగా ఏనాడూ లేడు .  ఆ బాధ్యతలు నిర్వహించలేదు
కాబట్టి మీ అమ్మాయికి తల్లి పేరు మాత్రమే పెట్టుకునే హక్కు ఉంది . ” అంటూ
ప్రియాంకకు కొండంత అండగా నిలిచారు మేనకా గాంధీ .

ఇప్పుడు ప్రియాంక గుప్త కేంద్ర  విదేశీ వ్యవహారాలమంత్రి సుష్మా స్వరాజ్ ఈ
విషయంలో జోక్యం చేసుకొని పాస్పోర్ట్ నియమ నిబంధనల్లో అవసరమైన మార్పులు
చేయవలసిందిగా అప్పీల్ చేశారు . అందుకోసం సోషల్ ప్రజల మద్దతు
కూడగట్టుకుంటున్నారు.

మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని మనం ఏర్పరచుకున్న నియమ నిబంధనావళి
వల్ల మనం కోల్పోకూడదు. అంటే, మారుతున్న సామాజిక పరిస్థితులకనుగుణంగా మనం
ఏర్పరచుకున్న నియమాలని మనం మార్చుకోవలసిందే .  వివిధ కారణాల కారణంగా
సమాజంలో సింగిల్ పేరెంట్స్ ఎక్కువ అవుతున్నారు. ఆ సింగిల్
పేరెంట్స్ఎక్కువగా ఉన్నది మహిళలే . పురుషులు చాల తక్కువే .

పిల్లలకి తల్లిదండ్రుల ద్వారా సమాజంలో ఓ గుర్తింపు లభిస్తుంది.
తల్లి/తండ్రి మాత్రమే ఆ బిడ్డ బాధ్యతలన్నీ మోసినప్పుడు తల్లి/తండ్రి ఎవరో
ఆ బిడ్డకు తెలియనప్పుడు లేదా తెలిసినా వారిపేరు పెట్టుకోవడానికి
ఇష్టపడనప్పుడు ఆ గుర్తింపు తల్లి/తండ్రి ఏ ఒక్కరికో మాత్రమే ఉంటుంది.
అదే సరైంది కూడా . కానీ ఆ బిడ్డని వదిలించుకుని లేదా వదిలేసి దూరంగా
అనామకంగా ఉన్న వ్యక్తి పేరు తప్పని సరి అని బలవంతం ఎందుకు ?  పురుషాధిక్య
సమాజంలో  సింగిల్ పేరెంట్స్ గా మహిళలు మానసికంగా, చట్టపరంగా ,
సామాజికపరంగా   అనుభవిస్తున్న ఇటువంటి సమస్యలపై చర్చ జరిగి సానుకూల
ఫలితాలు రావాలనీ , వారి సమస్యలకు తెరపడాలని కోరుకుందాం. వీలయినంత త్వరలో
పాస్పోర్ట్ చట్టంలో మార్పులు చోటు చేసుకోవాలని,  ప్రియాంక గుప్తా
కుమార్తె పాస్పోర్ట్ పొందాలని ఆశిద్దాం .

వి. శాంతి ప్రబోధ

(October 17, 2016, Navathelangana, Vedikalo Prachurana)

Tag Cloud

%d bloggers like this: