The greatest WordPress.com site in all the land!

Archive for July, 2017

మహిళల పరిశుభ్రతా.. ? మత చిహ్నాలా.. ?  వేటికి మీ ప్రాధాన్యత ???

దేశ వ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంటోంది. వివిధ వర్గాల మహిళలు తమ గొంతు విప్పుతున్నారు . కారణం భారత ప్రభుత్వం సానిటరీ నాప్కిన్స్ పై 12 % జీఎస్టీ విధించడమే .
అసలు భారత ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటి ? ఏ ప్రాధాన్యతా క్రమంలో వస్తువులపై గూడ్స్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ ) నిర్ణయించి విధించింది ? ఎన్నెన్నో ప్రశ్నలు . మరెన్నో సందేహాలూ .. ఇప్పుడందరి నోటా జీఎస్టీ గురించే ..

స్వతంత్రం వచ్చాక పన్ను విధానంలో ఇదే పెద్ద సంస్కరణ అంటున్నారు . కావచ్చు అది ప్రజలకు, ప్రభుత్వానికి ఏ విధంగా మేలు చేస్తుందో చర్చించడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు నేను తడిమే విషయం సానిటరీ నాప్కిన్స్ పై 12% జీఎస్టీ గురించి మాత్రమే .

ఒక ఆడపిల్ల ఋతుమతి కావడం , తల్లి కావడం ఆమె శరీర సహజ ధర్మం. ఆ రుతుక్రమం మహిళల ఛాయస్ కాదు . ఆమెకు ఇష్టం ఉన్నా లేకున్నా నెలలో3- 5 రోజులు, దాదాపు 39 ఏళ్ళు రక్తం స్రవిస్తూనే ఉంటుంది . అంటే ప్రతినెలా మహిళలకు అవసరమైన వస్తువు సానిటరీ నాప్కిన్స్ . ఇది లక్సరీ ఎంతమాత్రం కాదు . కంపల్సరీ . ఆ అవసరాన్ని గుర్తించకుండా 355 మిలియన్ల మహిళల రుతు ధర్మంపైన పన్ను వేస్తున్నామన్న సోయేలేదు ఈ పాలసీ మేకర్స్ కి . .

ఇప్పటికీ ఋతుధర్మం పట్ల ప్రజల్లో ఎన్నో మూఢ నమ్మకాలు, అపోహలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. దాన్ని శరీర సహజ ప్రక్రియగా కాకుండా మైల , ముట్టు అంటూ దూరంగా ఉంచుతారు . ఆ సమయంలో తీసుకోవాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత గురించిన జ్ఞానమూ తక్కువే . AC నీల్సన్ అధ్యయనం ప్రకారం ఇప్పటికి 88% మహిళలు అరక్షిత విధానాల్లోనే ఉన్నారు , సరిగ్గా ఉతకని బట్ట , బూడిద , మట్టి , ఇసుక , చెక్క పొట్టు వంటివి వాడడం వల్ల 70% మంది పునరుత్పత్తి అవయవాల ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారు . సరైన రుతుక్రమ రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కౌమార బాలికలు ఆ 5 రోజులూ బడికి దూరం అవుతున్నారు . ఈ విధంగా ఏడాదిలో 50రోజులు కోల్పోతున్నారు .
యునెస్కో స్టడీ ప్రకారం 20 % ఆడపిల్లలు పుష్పవతి అయిన తర్వాత బడి మానేస్తున్నారు . బడిలో సరైన వసతులు కరవు కావడం వాళ్ళ గ్రామీణప్రాంత బాలికలు ఆ 5 రోజులూ బడికి దూరంగా ఉంటున్నారు .

దేశంలో 70% మహిళలు సానిటరీ నాప్కిన్స్ కొనే స్థోమతలో లేరు. ఆ క్రమంలో ఇప్పటికీ చాలామంది మహిళలు పాత బట్టతో చేసిన పాడ్స్ వాడడం తెలిసిందే . .. పోలియెస్టర్ వంటి సింథటిక్ పాత బట్టతో చేసిన పాడ్స్ వాడడం వల్ల ఆ ప్రాంతంలో వచ్చే సమస్యలు ఫంగల్ ఇన్ఫెక్షన్లు ..తక్కువేమి కాదు . ఒకవేళ సానిటరీ నాప్కిన్ వాడినప్పటికీ , రోజంతా ఒకే పాడ్ వాడడం వల్ల వచ్చే సమస్యలు , సింథటిక్ పాడ్స్ తిరిగి వాడడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో మన మహిళలు సతమతమవుతూనే ఉన్నారు . నాటు పద్ధతులు మోటు పద్ధతులు అనుసరించడం వల్ల అనేక శారీరక , మానసిక రుగ్మతలకు గురవుతున్నారు మహిళలు . అందుకే మహిళల, బాలికల వ్యక్తిగత పరిశుభ్రతపై కొంతకాలం దృష్టి కేంద్రీకృతం చేసింది మహిళా శిశు సంక్షేమ విభాగం , వైద్య విభాగం . ఆ క్రమంలో వ్యక్తిగత లైంగికావయవాల పరిశుభ్రత కోసం బాలికలకు సానిటరీ నాప్కిన్స్ వాడడంపై ప్రచారం చేసి అలవాటు చేసారు . పాత బట్టలు , ఇతరత్రా అపరిశుభ్ర విధానాల వల్ల వచ్చే అనారోగ్యాల గురించి విశదీకరించడం జరిగింది. పరిశుభ్రమైన నాప్కిన్స్ అవసరం తెలియజేస్తూ కొంతకాలం బడిలో ఉచితంగా అందజేయడం జరిగింది . అదే విధంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో చౌకగా అందజేశారు . ఈ మధ్య కాలంలో ఇవ్వడం మానేశారు . మార్కెట్లో కొనాలంటే కొనలేని విధంగా వాటిపై పన్నులు విధిస్తున్నాం ..

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి . అల్ట్రా నాప్కిన్స్ రోజంతా ఉంచుకోవడం వల్ల గర్భ సంచి కాన్సర్ కి దారితీస్తోందని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి . అందుకే పాడ్ ప్రతి 5 గంటలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది . అంటే రోజుకి 4 లేదా 5 నాప్కిన్స్ అవసరం . ఒక ఆడపిల్ల రుతుక్రమం నెలలో 5 రోజులు ఉంటుందని అనుకుంటే 20 నుండి 25 నాప్కిన్స్ అవసరమవుతాయి . అలా ప్రతి నెలా కావాల్సి ఉంటుంది . ఈ విధంగా చూస్తే కనీసం 3 సానిటరీ నాప్కిన్ పాకెట్స్ అవసరం అవుతాయి . (అందులో 8 ఉంటాయనుకుంటే ) . ఒక్కో పాకెట్ తక్కువ రకం తీసుకున్నా కనీసం 30 రూపాయలు (టాక్స్ లేకుండా ) . ఒక వ్యక్తికీ 120 లు ఖర్చు . ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఎంతవుతుందో .. లెక్కవేయనక్కరలేదు కదా .. అదే టాక్స్ కలిపితే తడిసి మోపెడు అవుతుంది . కాబట్టి సానిటరీ నాప్కిన్స్ పై ఎలాంటి టాక్స్ ఉండకూడదు .

అదే సమయంలో హిందూ మహిళ వాడే బొట్టు , కుంకుమ , గాజులపై పన్నులు విధించడం లేదు. అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ? ఒక మహిళకి తన ఆరోగ్యం కాపాడుకునే , తప్పని సరి అవసరం అయిన సానిటరీ నాపికిన్స్ అవసరమా ..? లేక హిందూ మహిళగా గాజులు , బొట్టు కుంకుమ అవసరమా .. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నదో చెప్పకనే చెప్పడం లేదూ …?! ఇదే ప్రభుత్వం సిగరెట్లపై గతంలో ఉన్న టాక్స్ కంటే 4 – 10 శాతం పన్ను తగ్గించింది.

మహిళల అత్యవసర వస్తువు కావడం వల్లే సానిటరీ నాప్కిన్స్ పై జీఎస్టీ ఉండరాదంటూ కదం తొక్కుతున్నారు మహిళలు . ఇది ఇప్పుడొక ఉద్యమ రూపు దాలుస్తోంది .
శాలిని ఠాక్రే రాజకీయ పలుకుబడి ఉన్న ప్రముఖ కుటుంబపు పెద్ద కోడలు . ఆమె సానిటరీ నాప్కిన్స్ పై ఉన్న జీఎస్టీ వ్యతిరేకంగా గొంతు విప్పారు . మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య కూడా సానిటరీ నాప్కిన్స్ పై 12% జీఎస్టీ కి వ్యతిరేకంగా తన గళం విప్పారు . అదే విధంగానటి కొంకణాశర్మ , నిర్మాత ఏక్తాకపూర్ , నటి దర్శకురాలు రత్న పథక్ షా , పూజాసింగ్ సామాజికవేత్త కుంకుమ బొట్టు , గాజులు , వాటికి టాక్స్ బాదకుండా సానిటరీ నాప్కిన్స్ కి మాత్రం రెండో స్లాబ్ లో 12% విధించడం చూస్తే భారతీయ మహిళల్ని ఏమనుకుంటున్నారు .. ఎలా చూస్తున్నారు , భారతీయ మహిళలకి వారి వ్యక్తిగత పరిశుభ్రత , ఆరోగ్యం కంటే బొట్టు , గాజులు ముఖ్యమా ..? రుతుక్రమం పట్ల ఉన్న ఏహ్యత , అపవిత్రత , మైల , ముట్టు .. సానిటరీ నాప్కిన్స్ పై టాక్స్ విధించరాదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు సుస్మితా దేవ్ ఆర్ధిక మంత్రి అరుణ్ జెట్లీ ని కోరారు . అది చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అయింది.

ఛాయా కక్కడే మరో ఐదుగురు మహిళలు జూన్ 21 నుండీ సానిటరీ నాప్కిన్స్ పై టాక్స్ ఉండకూడదని నిరాహారదీక్ష చేసస్తున్నారు కక్కడే బృందం స్వయం సహాయక బృందాలద్వారా సానిటరీ నాప్కిన్స్ తయారు చేసి 30 (6 నాప్కిన్స్ ప్యాక్ ) అందజేసింది . 12% పన్ను అంటే దాని ఖరీదుఇంకా పెరిగి పోతుంది. ఈ పెరుగుదల మహిళల కొనుగోలు శక్తిపై, వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది అంటారు ఆమె . అందుకే నిత్యావసర వస్తువుల్ని రేషన్ దుకాణాల్లో సరఫరా చేసినట్లే సానిటరీ నాప్కిన్స్ కూడా నిత్యావసర వస్తు సరఫరా చేసే రేషన్ దుకాణాల్లో అందించాలి . గ్రామీణ మహిళలకు ఉచితంగా అందించాలి . బడుల్లో సానిటరీ వెండింగ్ మెషిన్స్ పెట్టాలి . టాక్స్ ఉండకూడదు డిమాండ్ చేస్తోంది 41 ఏళ్ల ఛాయా కక్కడే .

కుంకుమ బొట్టు , గాజులు , కండోమ్స్ పైన మాత్రం 0% జిఎస్టీ చూస్తే నేతల పితృస్వామ్య భావజాలం స్పష్టమవుతుంది . మహిళల పునరుత్పత్తి వ్యవస్థ పరిశుభ్రత, ఆరోగ్యం ఈ పాలకులకు పట్టదా .. సానిటరీ ప్రొటెక్షన్ ప్రతి మహిళా ప్రాథమిక హక్కు ఏలిన వారు తెలుసుకునేదెన్నడో .. ?!

బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ పాడ్స్ ని సైనికుల గాయాల కోసం డిజైన్ చేసాడు . ఆ తర్వాత అది రుతుక్రమంలో వాడే పాడ్ గా మారింది . అమెరికన్ కంపెనీ జాన్సన్ జాన్సన్ వారు 1896 లో వాడి పడేసే పాడ్స్ తాయారు చేసి వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అప్పుడు బ్యాండేజ్ వాడే విధంగానే ఉండేవి . 1980 ఆ పద్ధతి మారింది . తడిని బాగాపీల్చుకుని , ఎటువంటి లీకు కాకుండా మరకలు కాకుండా ఉండే విధంగా రకరకాల సానిటరీ నాప్కిన్స్ తయారుచేయడం మొదలుపెట్టారు .

కెనడా , యూకే , ఐర్లాండ్ , స్లోవేకియా మొదలైన దేశాలు సానిటరీ నాప్కిన్స్ పై టాక్స్ తీసేయాలని నిర్ణయించుకుని సంతకం చేసాయి . అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా అడుగులువేస్తున్నాయి

మనదేశమూ ఆ దిశగా అడుగు వేయాల్సిన అవసరం చాల ఉంది . లేకపోతే ధరలు పెరిగిన సానిటరీ పాడ్స్ కొనలేని భారతీయ బాలికలు బడికి దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది . మళ్ళీ పూర్వపు అరక్షిత పద్ధతులలోకి వెళ్లే ప్రమాదం ఉంది . భారతీయ .

ప్రతి మహిళా ఏడాదికి 12 నెలలు , జీవిత కాలంలో 39 ఏళ్ళు .. వాడాల్సిందే . మహిళకి సహజమైన ప్రక్రియ రుతుక్రమం . అది వారికి ఆర్ధిక భారం కాకూడదు . మహిళలకు అందుబాటులో ఉండాలి . వాటిని కొనగలిగే విధంగా ఉండాలి. మహిళకి అత్యవసరమైన వస్తువుగా టాక్స్ లేకుండా అందించాల్సిన దిశగా ప్రభుత్వం అడుగువేయాలి. లేకపోతే ఘనంగా చెప్పుకునే స్వచ్ఛ భారత్ కి , భేటీ బచావో – భేటీ పడావో నినాదాలకు అర్ధం లేకుండా పోతుంది .

మత చిహ్నాలైన బొట్టు , కుంకుమ , గాజులకు విలువ ఇచ్చి వాటిపై పన్ను విధించకుండా మతఛాందస ప్రభుత్వంగా ముద్ర వేయించుకుంటున్న ప్రభుత్వం, ఉద్యమం తీవ్రరూపం దాల్చకముందే మేల్కొంటే మంచిది. __వి.శాంతి ప్రబోధ.

దివిటీనై వెలుగుతూనే ..

తెగబలిసిన గద్దలెక్కడినుంచో 
నాపైనున్న ఆకాశంలోకి
చిత్తకార్తె కుక్కల్లా చొరబడ్డాయ్
నా కాళ్ళకిందున్న మట్టిపొరల లోతుపాతులు
దుర్భిణీ వేసి తెలుసుకున్నాయ్
నా చుట్టూ కనిపించీ కనిపించని తెరలతో
కొండచిలువలా చుట్టేస్తూనే ఉన్నాయ్ !

నీ అనేదే లేదు, అన్నీ నావే …
నింగి నేలా నాదేనంటూ తెగబడిన గద్ద
పోగుపడ్డ తరతరాల ప్రకృతి వనరులను పెకిలించేస్తూ
నన్ను పరాయిని చేసి
తన్ని తరిమేస్తుంటే.. నా జీవికను ,
వేలయేళ్ళ నా అస్థిత్వాన్ని అనుబంధాన్ని
కుళ్ళబొడిచి బొందపెడుతుంటే కుక్కిన పేనులా
మన్ను తిన్న పాములా పడిఉండగలనా ..?!

కొడిగడుతున్న దీపాన్ని నిలుపుకునే ప్రయత్నంలో
నోరు విప్పి ఇదేమిటని అడిగితే
సునామీలా విరుచుకుపడే తుపాకులు
నన్ను దేశద్రోహిని చేసి
నా శవాన్ని పాతాళగరిగెకు
చిక్కిన బొక్కెనలా వేళ్ళాడేసి
ఖబడ్డార్ .. అంటూ హెచ్చరికలు

తెగబడ్డ రాబందులకు
జై కొట్టే పాత్ర విజయవంతంగా పోషించే
పాలితులకు నేను , నా జాతి ఎప్పుడూ
కానివాళ్ళమే.. కానీ, మేమిన్నాళ్లూ
కాపాడుకుంటూ వచ్చిన నింగీ , నేల , నీళ్లు
పందికొక్కుల కలుగుల్లోకి చేరిపోతుంటే
నేనెలా ఊరుకోగలను ..?!

తవ్విపోసిన కొండలూ గుట్టల సాక్షిగా
నేలమాళిగల్లో నువ్వు రాశులు పోసిన
ఖజానా ఖనులు నా జాతికి
అంకితం చేసి జీవం పొసే వరకూ
ముత్తెమంతలేని ఈ మిణుగురు
సమాధుల్లోంచి మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతూనే
నీ అంతంకోసం బారులు తీరిన దివిటీనై కదులుతూనే
వి . శాంతి ప్రబోధ

(ఏప్రిల్ 17, మాతృకలో ప్రచురణ అయిన కవిత )

చెదిరిన చిత్రం చిగురిస్తుందా ..

‘మా బాపు  ఉద్యోగరీత్యా బదిలీ అయినప్పుడల్లా  నా మనసు ఎంత విలవిలలాడేదో ..
నా దోస్తులందరినీ వదిలిపోవాల్సి వచ్చినప్పుడల్లా  ఎంత ఏడ్చేదాన్నో  .. నిండు కుండ భళ్ళున బద్దలయినట్టు ఫీలయేదాన్ని’  చెప్పుకొచ్చింది  శివరాణి పక్కనున్న లీలా టీచర్ తో .

‘అవును మేడం . నేనింత పెద్దగయ్యిన్నా ..  నాకూ అదే దిగులు . అదే బాధ..
ఐదేళ్ల సంది ఉన్న బడిని ఒదిలొచ్చుడు మనసుకు ఎంత రపరపయిందో ఎట్ల జెప్పేది ..? ‘ కన్నబిడ్డలా ఆ బడిపై పెంచుకున్న మమకారాన్ని , అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ  కొద్దీ క్షణాలు ఆగి గట్టిగా ఊపిరి  పీల్చి వదిలింది లీల .
‘ ఆ..మేడం,  నేను స్కూల్ గురించి విన్న.  దాని అభివృద్ధికి మీరు  చేసిన కృషి..   ఆ బడికి డివిజన్లో  వచ్చిన గుర్తింపు.. ‘  చుట్టూ పరుచుకున్న రకరకాల ఆకుపచ్చని షేడ్స్ తో కనిపించే  పచ్చని పంట పొలాలనే పరికించి చూస్తూ  శివరాణి .
‘ఆ బడిపిల్లలతో వారి తల్లిదండ్రులతో, ఊరితో  అనుబంధం ఒదిలి  దూరంగ ఇట్ల ఎన్నడైన ఎల్లిరావాల్నని  తెల్సినా …  ‘ నిట్టూర్చి, ఓ దీర్ఘ శ్వాస తర్వాత  మళ్ళీ తానే  ‘ ఆఊరితో.. ఊరోళ్ళతో నా సంబంధ బాంధవ్యాలు తెగిపోవు .  కొనసాగించవచ్చు .. కానీ… వీళ్ళ  పరిస్థితి అట్ల కాదుగద  మేడం . తరతరాల బంధమాయె.  ఆ అనుబంధాన్ని శాశ్వతంగ జలసమాధి చేయాల్సిందేననుకుంటుంటేనే  వేయి శూలాలు గుండెల్లో గుచ్చుకున్న బాధ… ‘ అంది లీల బడివైపు అడుగులు వేస్తూ ..
లీల మొహంలో కనిపిస్తున్న భావ వీచికల్ని చూసి ఈవిడ చాలా సున్నిత మనస్కురాలు అనుకుంది పక్కనే నడుస్తున్న శివరాణి .
రెండడుగులు వేసారోలేదో  ఐదో తరగతి చదివే సునీత  నాయనమ్మ  రాజవ్వ  కనబడి ‘నమస్తే మేడం .. ” శివరాణిని పలుకరించి ఎవరన్నట్లుగా లీలకేసి కళ్ళు చికిలించి చూస్తోంది .
‘ అంత మంచిదేనా .. ‘ పలుకరించింది. కానీ,  అడగవలసిన ప్రశ్న కాదేమోనని ఫీలయింది  శివరాణి.
‘ఏం మంచిగ ?
 గిదే.. మంచిగ .
మనసు మనాది తోటి  అడ్లు రాలిన కల్లమయ్యే … ఏంజేత్తం ?  అనుమాండ్ల కాడ దండలేస్కోని రోజొక్క గ్రూపు కుసుంటాన్నం .
గా.. పెద్దాయనకేమన్న దయొచ్చి దర్శనమయితడేమోనన్న ఆశతోని .. ‘ గొంతు గద్గదమవుతుండగా రాజవ్వ
అంతలో కర్ర కొట్టుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి వీళ్ళ దగ్గర ఆగిన ముదిమి జాలవ్వ  అందుకుని  ‘ఊరు వాడ వదిలి మమ్ముల ఊరపిచ్చుక లెక్క  పొమ్మంటే యాడికి  ఎగిరి బోతం..ఏడికో పోయిన ఆ కొత్త జాగల మాదేముంటది ? తాత ముత్తాతల కెల్లి  ఇంకా అంతకు ముంగట ఎన్ని జామాన్లు నడిచెనో ..
అసొంటి ఊరిది ..  రజాకార్ల జమానాల సుత గిట్ల లేకుండే ..
మా ఊరోళ్లే  ఆల్లను గుట్టల్లకు తరివి కొట్టిరి. గిప్పుడు గా రజకర్లోలె  మందకు మంద ఊరిమీదవడ్తిరి ..
ఏవేవో కమ్మలు ముంగటవెట్టి  నిశానీ ఏపిచ్చుకుంటిరి .  ఉరికి ఏమైతాందో … ‘  బోసినోటి జలవ్వ   లోపల పొంగి పొర్లతున్న దుఃఖపు నది తీవ్రతకు  గొంతు పెగలక  తడారినకళ్ళను  పైటచెంగు వెనకకు తోచేస్తూ  అక్కడే కూలబడిపోయింది .
‘ఈడ్నే పుట్టినం ఈ మట్టిలనే కడతెర్తం అనుకొంటిమి .. గిట్ల అంటరని ఎన్నడన్న కలగంటిమా .. ‘  నిట్టూర్చింది రాజవ్వ .

నిజమే, అది ఒట్టి ఊరేనా .. దానికెంతో చరిత్ర , వాళ్ళకెంతో గుర్తింపు ..వాళ్ళకో అస్తిత్వాన్నిచ్చిన స్థలం ..  ఆఊరితో , ఊరిజనంతో , చెట్టుచేమతో ,రాలురప్పలతో , చేనుచెల్కతో , ఆకుఅలుములతో , వాగువంకలతో  గుట్టలతో పిట్టలతో  పైరగాలితో పెనవేసుకున్న  అనుబంధం ..  ఎన్నెన్నో జ్ఞాపకాల సమాహారమే  ఊరు . మాఊరు , మాప్రాంతం , అనే ఆత్మగౌరవంతో పాటు ఎన్నిరకాల సెంటిమెంట్లు ఊరి చుట్టూ ముడిపడి ఉంటాయో ..   మనసులో తలపోసింది లీల

‘కళ్ళు తెరిచినా మూసుకున్నా  నా ఊరు  ఇక ఉండదన్నమాటలే చెవుల్ల జొర్రిగల్లెక్క తిర్గవట్టె .  ఊరు మునిగిపోతదన్న  ముచ్చట చెవుల బడ్డప్పటి  కెల్లి నా పానం గిప్పుడే ఉన్నదున్నట్టు పొతే మంచిగుండనిపియ్యవట్టే …  గిట్ల ఈ మట్టిల్నే కల్సిపోవాలె
.. మావంశపోల్లంతా గీ మట్టిలనే.. నన్నూ ఆడికే కొంటబొమ్మని దేవునికి మొరవెట్టుకుంటాన్న  ‘ అరవైఏళ్ల రాజవ్వ  ఆవేదన ఆ టీచరులిద్దరి గుండెని మెలితిప్పింది .

తన వాళ్ళ జీవితం ప్రవహించిన చోటే , ఆ శ్వాసలో శ్వాసై పోవాలనుకుంది..ఆమె కోరికతో తప్పులేదు కదా అనుకుంది శివరాణి
‘తెలంగాణా ప్రజల చరిత్రను కాపాడుకుందం, మనని మనం బద్రం చేసుకుందం అంటే మాస్తు కొట్లాడితిమి . పోరాడితిమి.. ఓట్లన్ని గుత్తవట్టినట్టు ఒక్కదిక్కే గుద్దితిమి .. మా రాజ్యం మాకొచ్చెనని సంబురాలు జేసుకుంటిమి.  కానీ ఇప్పుడు ..’. చచ్చిన శవంముందు కూర్చుని ఏడ్చినట్లు శోకం పెట్టింది  రాజవ్వ . కన్నీటి సముద్రమైన ఆమెను ఎలా సముదాయించాలో తెలియక తికమక పడ్డారు శివరాణి , లీలా టీచర్లు .
ఆమె దుఃఖం చూస్తుంటే  తనకే ఆబాధ, కష్టం  వఛ్చినట్లుగా హృదయంలోంచి దుఃఖం పొంగుకొచ్చి కనురెప్పల గుప్పిట్లో దాచుకున్న బిందువులు ఒక్కొక్కటి ఆమెకు తెలియకుండానే జారిపోతున్నాయి  లీల కళ్ళ నుండి .
అది చూసిన శివరాణి  ‘ మూడునెలల సంది  వినీవినీ మేము కొద్దిగా బండబారినం. మీరు కొత్త కదా .. అట్లనే
 ఉంటది  టీచర్ ‘ అంది
లంచ్ టైం ముగుస్తుండడంతో మౌనంగా స్కూల్ కేసి నడుస్తున్నారు టీచర్లిద్దరూ
.. వారి మనసు  మేఘావృతమై .. వారి భావోద్వేగాలు భారీ చినుకులై  కురుస్తుండగా  ఉదయం జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది  లీలకి .
 ***                                                          ***                                                  ***
హాజరు వేసుకొని  వెళ్ళిపోతున్న సుజల, కరిష్మా , పారిజాత , రజితలను పిలిచింది . నలుగురూ ఏడో తరగతి పిల్లలే .   వాళ్ళ  క్లాస్ టీచర్ తను .
అదేంటి అట్లా పోతున్నారు క్లాసులో కూర్చోకుండా అడిగింది    ‘మేడం ఒకళ్లకు అన్నం పెట్టాల్నంటే మరొకళ్ళకు బంద్ చెయ్యాలన్నా .. ‘ రజిత  ప్రశ్నబాణంలా దూసుకొచ్చింది .
తనేమడిగింది వాళ్ళేం చెబుతున్నారు  ఒక్క క్షణం లీలకు అయోమయంగా తోచింది .  ఆమె చూపుల్ని చూసి నలుగురూ ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకున్నారు
చీకటిని చీల్చే జవాబు ఏమన్నా వస్తుందేమోనని . ‘ చెప్పండి మేడం ‘ ఏమాత్రం సంకోచం లేకుండా రెట్టించింది  రజిత .
ఆ పిల్ల  సీమమిరపకాయలాగా కన్పించింది లీలా టీచర్ కళ్ళకి.
టీచర్ ఏమి చెబుతుందా అన్న ఆత్రుతతో చూస్తున్నారు నలుగురూ .. వారి వెనకే క్లాసులోంచి బయటికి పోబోయిన మిగతా విద్యార్థులూ  ఆగి చెవులు రిక్కించి నిల్చున్నారు.
‘ ఆకలి  ఎవరికైనా ఒకటే కదా ..  అందరి ఆకలీ తీరాలి .. . ‘  లీలా టీచర్ చెబుతున్నది ఇంకా పూర్తికాకుండానే
‘ ఒకళ్లకు ఆకలున్నదని , ఆపతున్నదని .. ఇంకొకళ్ళ నోటికాడి బువ్వ ఇగ్గుకబోయి ఆకలున్నోడి ముంగట పెడతారా  .. మరి  నోటిముందు కూడుపొతే ఈని ఆకలెట్ల తీరాలె …  ‘  సునామీ తీవ్రతతో కరిష్మా  ప్రశ్న దూసుకొచ్చింది
‘ఇదెక్కడి న్యాయమో తెలుస్త లేదు .. ‘ నరాలు పొంగుకొస్తుండగా పారిజాత
‘అక్కడ నాలుగు జిల్లాలల్ల రైతులకు కూడు బెట్టాల్నంటే ఈడ మాపొట్ట కొట్టాల్నా మేడం .. మేము రైతులం కాదా .. మేం మనుషులం కాదా .. మేడం ‘ భూగోళం అంచులు దాటేలా వాడిచూపులతో  రజిత లీలకేసి చూస్తూ

‘ మొన్నటిదాంక మన రాష్ట్రం మనదే .. మన కొలువులు మనకే .. మన మాట మనదే అని ఏమేమో చెప్తే నిజమనుకుంటిమి .. ఊరు ఊరంత ఓట్లేసి గెలిపిస్తే ..  కుప్పలు కుప్పలుగా అస్థిపంజరాలు పేరుస్తున్నరు … ‘ అంటూ వచ్చి అక్కడ నిలిచింది పదోతరగతి చదివే  ఈశ్వరి .

‘ మునిగిపోయే మీభూమి జాగలకు పైసలిస్తమని అంటున్నరు గద ..  మీరంతా ఎందుకింత బాధపడుతున్నరు’  వారి మనసులో విషయం తెలుసుకుందామని లీల ప్రశ్న

‘ ఆ..ఏమిస్తరు మేడం .. మెడకు తాడు బిగిచ్చి  గుడ్లు ముంగటికి పొడుచుకత్తాంటే నోరంత ఎండ్కబోయి గుండె గడబిడ అయితాంటే  బారాణాకు చారణ ఇస్తరా ..? ఏంజేస్కోను ? ‘  మట్టివాసన గుబాళించే ఈశ్వరి .

‘మేడం పైసలు కాదు భూములకు భూములు , ఇండ్లకు ఇండ్లు .. అన్ని ఇక్కడ మాకేమున్నాయో అవ్వన్నీ కొత్త జాగల ఇవ్వుమనున్రి ‘  సాలోచనగా సుజల

‘అయ్యన్నీ ఇచ్చిన బీ గాఊరు మన ఊరయితదావే …. మన శ్వాసలో ప్రవహించే ఈ ఊరి జ్ఞాపకాలు తెచ్చిస్తరా ..? మన మనసుకు అయిన గాయాలు మాన్పుతరా ‘ కొద్దిగా కసిరినట్లుగా  ఈశ్వరి

‘మిరపకాయల ఘాటుకంటే ఎక్కువ ఘాటుగా ఉన్నాయి మీ మాటలు ‘ వాతావరణం తేలిక చేసే ఉద్దేశంతో నవ్వుతూ అంది లీలా టీచర్ .
‘అవును , కడుపు నొప్పి , మంట ఉన్నోడికే ఆ బాధ తెలుస్తది .  మీకేం తెలుస్తది ..? ఇట్లనే నవ్వుతరు ..మాలోపటికి  తొంగి చూస్తే తెలుస్తది మా గోస ‘ సీరియస్ అంది ఈశ్వరి .
నిజమే .. మునిగేది గ్రామము.   వారి భూములూ ఇళ్ళు , వారి చుట్టూ ఉన్న జంతుజాలాలే కాదు.  వారి జ్ణాపకాలు …. ఒలిచిన కొద్దీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయే వారి జ్ఞాపకాలకు ఏ పరిహారం ఇవ్వగలరు ?  భవిష్యత్ పట్ల అందమైన కలలతో గుండె నిండా ఊహలతో ఉండాల్సిన పసివారి గుండెల్లో  ఎన్నెన్ని గాయాలు ..మోడువోయిన అలసత్వపు జాడలే ..  మౌనంగా తలపోస్తున్న లీలా టీచర్ ఆలోచనల్ని భంగపరుస్తూ

‘కడుపు నిండిన మాటలట్లనే ఉంటయ్ ..’ అని ఒకరంటే
‘మనని బండరాయో, మట్టి ముద్దనో అనుకుంటున్నరు .. ఏడ బడేస్తే ఆడ పడివుంటమని’ అంటూ మరొకరు అనుకుంటూ  ఒకరివెనుక ఒకరు అంతావెళ్లిపోయారు .
చూస్తే స్కూల్ దాదాపు ఖాళీ .  దూరంగా కన్పిస్తున్న ర్యాలీలో కలిశారు వాళ్లంతా.
వారి మాటలూ  చూపులూ లీలా టీచర్కు  ఎక్కడో గుచ్ఛుకుంటున్నాయి.    తననే ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది.  వాళ్ళు వెలుతురు పొట్లమేదో విప్పుతున్నట్లుగా తోస్తోంది.  తనలోకి తాను తొంగి చూసుకోవడం మొదలు పెట్టింది .
కొద్ది గంటల క్రితం వరకూ మల్లన్న సాగర్ రిజర్వాయర్ వస్తే నల్లగొండ జిల్లాలోని తమ భూములకు రేటు పెరుగుతుందని  ఆశపడింది తను .
రెండొందల ఎకరాల ఆసామి తన మేనమామ. ఆయన పొలాలన్నీ  ఈ ప్రాజెక్టు కింద పోతాయని అనుకున్నప్పుడు మార్కెట్ రేటు ఒకటైతే ప్రభుత్వం ఇచ్ఛే పరిహారం మరొకటి ఉంటుందని ఎంత దిగులు పడ్డారో .. ,  కాడెద్దులనే నమ్ముకుని బతికే వాళ్ళం ఏమైపోతామో ఎట్లా బతకాలో   అని అత్త ఎంత గగ్గోలు పెట్టిందో…అలాంటిది ఇప్పుడవి పొవట్లేదని తెలిసి చాలా సంతోషపడ్డారు అంతా .
వాళ్లన్నట్లు తనది కడుపు నిండిన బేరమే .. వాళ్ళ ఆకలి తనకేం తెలుసు .
***                                            ********                                       ***

ఎవరి ఆలోచనల్లో ఉండగానే  బడిలోకి వచ్చేసారు శివరాణి , లీలా టీచరులిద్దరూ .
‘ఏం మేడం .. ఏమంటున్నారు ‘హెడ్మాస్టర్  అడిగాడు
‘ఏం చెప్పాల్సార్ . వాళ్ళ  గోస గోస కాదు .  దుఃఖాన్ని దోసిళ్ళతో పట్టుకొచ్చిన . హృదయపు  బరువు ఎట్ల దింపుకోవాల్నో  తెలుస్తలేదు ‘ అంటూ
కుర్చీలో కొద్ది క్షణాలు కూర్చొని  లేచి క్లాసుకు వెళ్ళింది లీల.

క్లాసులో ఎవ్వరూ లేరు .  ఇంటర్వెల్ తర్వాత వెళ్లిన పిల్లలు తిరిగి రాలేదు .  ఆమె తిరిగొచ్చి స్టాఫ్ రూములో కూర్చుంది .  అప్పటికే  శివరాణి మరో ఇద్దరు సార్లు అక్కడ కూర్చొని ముచ్చట్లాడుతున్నారు .

‘తెలంగాణ కోసం కష్టపడ్డారన్న గౌరవం ఉండే .. అదంతా ఖరాబ్ జేసుకుంటుండు  ‘  కొద్దిగా  సానుభూతి , అభిమానం కలగలసి అన్నాడు వీళ్ళ  దగ్గరే కూర్చున్న  హెడ్మాస్టర్

‘ తాను తిన్న  తినకున్న ప్రపంచానికింత తిండి పెట్టేది భూమిని నమ్ముకున్న రైతన్ననే ..
ఆ రైతన్న సర్వం కోల్పోతుంటే అరకొర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాల్నని  చూస్తున్నారు .
ఆటగాళ్లకేమో పతకం తెచ్చారని పోటీలు పడి నజరానాలు ..’  గొణిగి మళ్ళీ  ఆయనే  ‘ దళితులకు ఏడు లక్షలకు ఎకరం భూమి
కొనిద్దామన్న ఎవ్వడు భూమి అమ్ముతలేదన్నోడు  యీళ్లకు ఎకరాకు ఐదారు లక్షలిద్దామంటున్నడు పేద్ద సార్ . ‘  కొంచెం వ్యంగ్యం  హిందీ సారు  గొంతులో .

‘అధికారంలో ఉన్నవాళ్ళకి పేద ప్రజలు కానరారు .  ఆనాడు బషీర్భాగ్ రైతులపై కాల్పులు .. ఈనాడు మన రాజ్యంలో మన రైతులపై కాల్పులు ..’ నిరసనగా శివరాణి గొంతు కలిపింది

అక్కడ కూర్చున్న పంతుళ్లు రాజకీయాల్లోకి దిగారు . శివరాణి బాగ్ లోంచి  ఆదివారం అనుబంధం తీసుకొని అందులో లీనమైంది .
లీల టేబుల్ పై ఉన్న పేపర్ అందుకుంది. ఏవీ బుర్రకెక్కడం లేదు .  కొద్ది సేపటిక్రితం హనుమాండ్ల దగ్గర కూర్చున్న వారి మాటలే గందరగోళంగా ఆమె మదిలో మెదులుతూ ఉన్నాయి .
***                 **                    **
‘వందల వేల ఎకరాలున్నోళ్లను గడ్డకు ఏసుకుంట మా నెత్తిమీద కొట్టుకుంట  బక్క పానాలను బొంద పెడ్తమంటున్నరు’  నడివయస్కుడు భుజంపై తువ్వాలు దులిపి మళ్ళీ వేసుకుంటూ
.
‘మీరందరు కల్సింటే అల్లేంది జేజమ్మలు తాతమ్మలు దిగొత్తరని అంటున్నరుగదనే ..  ‘అన్నది బీడీలు సుట్టుకుంట ఓ యువతి .
‘యాడిది .. వచ్చేసింది .. కుత్తుకల దాంకచ్చింది . ఇగ కాళ్లు లేత్తయ్ రా..  ఆగుల కొట్టుక పోతర్రా అని ఒకరొచ్చి అనవట్టె .. ఆ నాయకుడొత్తడు .. ఈ నాయకుడొత్తడు .. సచ్చినోల్లను  పరామర్శించేతందుకొచ్చినట్టొచ్చి పరామర్శించి పోతున్నరు.’ సోడాబుడ్డి అద్దాల తాత జవాబు
‘ ఉస్మాన్ బాషా , మహబూబ్ బాషా రాజరికం ఎలిన్నుంచి ఎట్టి కొట్టాలు  జేసి ఆరిజనులే కానీ ఎవరేగానీ మేము ఆడ కల్లాలు జేసుకుంట బావులు కాపాడుకుంట సులైమానయితే పట్టాలు జేసుకొని పిల్లల కెల్లి అందరు కష్టపడి జేసుకుంటిమి . అంత గీ ఏట్ల కలిపేతందుకా .. ? ‘ మరో వృద్ధుడి ఆవేదన

గ్రూపులో లోను లేపి, ఇసొంటోళ్ల అసొంటోళ్ల   తాన  పైసలు తెచ్చి బిడ్డ లగ్గం జెత్తి. కూలో నాలో జేసుకుంట బతుకుతుంటి …గ్రూపుల పైసలు కట్టమని మెడ మీన కత్తివెట్టె ..

ఇంటి  జాగకు పైసలిత్తరట .  ఆలిచ్చే పైసలు ఏటికొత్తయ్ .. ఇంట్ల ఎడ్డిపిల్ల ఉండే .. పదేన్నూర్లు  పింఛను వస్తది .  వేరే కాడికివోతే  పింఛనిత్తరా ..బతికుడెట్లా .. మూలిగే నక్కమీద తాటి పండు బడ్డట్టయింది ‘ వాపోతోంది ఓ నడివయసు ఒంటరి మహిళ
‘బరిబత్తల నిలవెట్టినట్టయ్యే .. ‘
‘ఏ ఊరికి బోయిన దొంగలమయితం . మనూర్ల మనమే  సర్దారులం .  పోయిన కాడ ఓరేషను కారట్ , ఆధార్ కారట్ , పింఛన్ ఏముంటాయో ఏముండయో .. మంచికి చెడుకి ఎవరెట్లయితరో .’ కలగూరగంపలాగా సాగున్నయి  మాటలు
‘గా భీంరావు పటేలు భూమి ఇచ్చిండట గద .. ?’ ఒకరి ప్రశ్న
‘ఆని భూమి జాగ ఉంటే తగులవెట్టు కోని  .. గానీ ఆ నిప్పు ఊరంతా ఆగంజేత్తే చూసుకుంట ఊకుంటమా .. ఊర్ల చిచ్చు బెట్టేటోన్ని తిరగగొడతం ఏర్కేనా ..?’ ఆ మాటల్లో పట్టుదల , కడుపులో బాధ , కళ్ళలో కసితో ఓ పడుచు జవాబు

పుట్టినూరిది . పెరిగినూరిది . మాఊరు మాకే గావాలె .. కష్టపడి బంగ్లాలు కట్టుకున్నం . ఎంత మంచిగ కట్టుకున్నం .. ఇయ్యన్నీ…   పన్నెండు ఆమడల తిరిగిన ఇంత సౌలట్ దొరుకుతదా .. ఇంతమంచి జనం , నీళ్లు సౌలత్ ..వదిలి  ఎట్లబోవాలె .. ఈ ఊర్లనే 6గురు కొడుకులను పెద్ద పెద్దోళ్ల పిల్లలెక్క జేసిన .  ఇదంత కాటికి ఒదిలి నేనెట్ల పోదును .. తిన్న కూడు సుతం పెయ్యికింకుతలేదు ‘  శోకం అందుకుంది కాలనిలో ఉండే మైసమ్మ . ఆమె వెనకే ఇంకొంతమంది .. పొట్టకూటికోసం , తమ అస్తిత్వం కోసం గమ్యం తెలియని దారుల్లో తప్పిపోయిన వాళ్ళలా ఉన్న వారిని  ఓదార్చబోయారు లీల , శివరాణిలు .

అంతలో ‘ .. నేను బయట బతుకుత ..ఊరంత అట్ల బతుకుతదా ..ఆగమై పోరా ..ఎప్పుడయినా ఎవడయినా బోయేదే .. బతికితే అందరం బతకాలె .. లేకుంటే అందరం ఆనీళ్లల్లనే బడిచావాలే .. అంతదాన్క  ఎత్తిన పిడికిలి. కలిపిన చేయ్యిడవొద్దు …  ‘ కూలిపోతున్న మానవత్వపు జెండా  సమున్నతంగా ఎగురవేస్తూ ఆ  గ్రామసర్పంచ్ . ఆ వెనకే మరి కొందరు పెద్దలూ ..
పోతరాజుల కొరడా చిందేసినట్లున్న వాతావరణం ఒక్కసారిగా  గంభీరంగా మారిపోయింది.

***                 ***                     ***

ఆ దృశ్యం లీలా టీచర్ కళ్ళముందు లీలగా కదలాడుతుండగా ..

మిలమిల మెరిసే వేగు చుక్కల్లా వారు  చరిత్ర పుటల్లో తమ పేజీకి రంగులద్దుతూ  జీవం పోస్తున్నట్లే  ..  బతుకమ్మను  సరికొత్తగా పేరుస్తున్నట్లే ,  ఆకురాలిన చెట్టుపై  పిట్టల చెదిరిన చిత్రాన్ని చిగురింప చేస్తున్నట్లే  తోచింది ఆమెకు

వి . శాంతి ప్రబోధ

Dasharathi smaraka poti Prize winning story . Published in Sopathi, Navathelangana Sunday magazine 30, April, 2017

మార్పుకోసం ధైర్యంగా ..

నే.. ఎక్కడ చూసినా
ఉశ్వాసనిశ్వాసల్లా నేను,
జగమంతా సగంగా అల్లుకుపోయి
సూర్యచంద్రుల్లా అవిశ్రాంతంగా శ్రమిస్తూ..నే

కానీ
నాకూ , నా పుట్టుకకూ విలువేలేదు
ఇంటా బయటా నా శ్రమకు గుర్తింపే లేదు
నా ఆశలకు , ఆశయాలకు గౌరవమే లేదు
రక్షణలేని ప్రాణ మానమర్యాదలు నీలిమబ్బుల మాటునే

నిరంతరం
నాపై చొచ్చుకొచ్చే వివక్ష కొత్త కొత్త రూపాల్లో మార్గాల్లో
ఉచ్చు బిగించి విచ్చుకత్తులతో దాడిచేసి
హింసకు, పీడనకు, వేదనకు గురిచేస్తూ
సమాజ ప్రగతిని అసంపూర్తిగా మిగులుస్తూ ..

నేటికీ
ఆహారం, ఆరోగ్యం అందీ అందనట్లుగానే
విద్య విహారంలో అట్టడుగునే
ఆదాయం , వనరులు ఆమడ దూరంలోనే
ఆర్ధిక, రాజకీయ నిర్ణయాధికారం పాతాళంలో.. నే

అందుకే
నా లోపలి సముద్రపు హోరు
ఘనీభవించి, ఆకాశంలో చుక్కలెన్నో అన్ని
సవాళ్లు ఎదుర్కొంటూనే ఉన్నా
ఏళ్లతరబడి యుద్ధం చేస్తూనే ఉన్నా

కళ్ళకు గంతలు కట్టి
మాటల మతాబుల వెలుతురులో
నన్ను భ్రమల్లో ముంచాలనుకునే
వారి కుయుక్తుల్ని ఓ కంట కనిపెడుతూ
నా చుట్టూఉన్న కట్టుబాట్ల జెముడు పొదల్ని
ఇనుప కంచెల్ని ఛేదించుకుంటూ
ముందుకుపోయే క్రమంలో.. రక్తసిక్తమైన ఒళ్ళు
నిత్యం సలిపే గాయాలతో … అయినా
రెక్కలిరిగిన పక్షిలా పడిఉండలేను

కష్టాలకూ బాధలకూ లేపనం పూసుకుంటూ..నే
నా ఆలోచనలకు, ఆశయాలకు రెక్కలిచ్చి
వేల సూర్యశక్తుల్ని నాలో ఒంపుకుంటూ
సవ్యసాచిలా సమాజ నిర్మాణంలో
నా భాగంకోసం చలిస్తూ జ్వలిస్తూ.. నే

నాకు ఒక దినోత్సవం
ఒక వేడుక కాదు కావాల్సింది
నిరంతరం కొనసాగే శ్వాసలా.. ప్రతిరోజూ
అవనిలో అర్ధభాగమన్న ఎరుకతో
అంతం లేని అవకాశాలు
హద్దులు లేని సమభాగస్వామ్యం కావాలి

అందుకోసం
గళం విప్పుతూ, కదం కదుపుతూ
రాజీలేని పోరాటం చేస్తూ..నే
మార్గాలు నిర్మించుకుంటూ
మార్పుకోసం ధైర్యంగా సాగుతూ..నే

వి. శాంతి ప్రబోధ
8. 3. 2017

అమ్మా … వెలుతురు కెరటం నీ సువర్ణ  

వాళ్ళు  చెప్పేది నిజమేనా .. ? నిజం కాదని ఎవరైనా చెప్తే ఎంత బాగుండునని  బస్ ఎక్కే లోపల ఎన్నిసార్లు అనుకుందో…  ఉరుములు మెరుపులు లేని ఆకాశం పిడుగుని వర్షించినట్లుగా ఉందా వార్త ఆమెకు .

కిటికీలోంచి కదిలిపోతున్న ఉషోదయ దృశ్యాలు ఆమెను ఏమాత్రం ఆకట్టుకోవడంలేదు .  అమ్మ మొఖమే సినిమా
రీలులా అటూ ఇటూ కదులుతూ ..
నా జీవితంలో కొత్త రాగాల్ని , రుచుల్ని పండించాలని ఎంతో ఆశపడింది  అమ్మ .. అవి ఫలించేలోపునే వెళ్లిపోయిందా .. అస్సలు నమ్మ బుద్ది కావడంలేదు.

అమ్మ .., నిజ్జంగా చనిపోయిందా .. ? అదెలా .. ఎలా సంభవం ?  నిన్నటివరకూ బాగానే ఉందిగా ..  రాత్రి పదిగంటల సమయంలో కూడా  మాట్లాడింది.   అవే అమ్మ చివరి మాటలు.
ఆ క్షణంలో తాను అనుకుందా..  తెల్లవారేసరికి పరిస్థితి తలకిందులవుతుందని ..?!
రేపు అందుకోబోయే గ్రూప్ వన్ ఫలితాలని తలుచుకుని అమ్మా  ఇకనుంచి మనకన్నీ మంచి రోజులే అంటే..
అవునే .. నిజమే కావచ్చు . సర్కారు  3 ఎకరాలు ఇస్తదట. ఊర్లోకి పోతే కచేరి కాడ అంటున్నరు .  కానీ నేను తీసుకోవద్దనుకుంటున్న అని మనసులో మాట చెప్పి హాయిగా నవ్వింది.
ఎందుకమ్మా అన్న ప్రశ్నకు  ఇయ్యాల్నో రేపో నా బిడ్డ సర్కారీ నౌకరీలకు ఎక్కుతది కదా .. ఆ భూమి ఇంకెవరికన్నా అక్కర్ల ఉన్నోళ్లకు ఇత్తరని మరోసారి నవ్వుతూ వివరించింది.
ఏమీ చదువుకోని అమ్మ ఎంత సంస్కారయుతంగా , బాధ్యతగా ఆలోచించింది ?  .. వెయ్యిమైళ్ళ వేగంతో  చెలరేగే ఆలోచనల నడుమ చేతిలో ఫోన్ మోగడాన్నే గమనించడం లేదు సువర్ణ.
అది చూసింది శారద.  వెంటనే సువర్ణ  చేతిలోని  మొబైల్  నెమ్మదిగా తన చేతిలోకి తీసుకుని ఇప్పుడే బస్సెక్కాము.
అవతల నుండి ఏమన్నారో కానీ .. ఈ పరిస్థితిలో ఒక్క దాన్ని ఎట్లా పంపిస్తామండీ ..  మీరు కంగారు పడకండి సువర్ణని నేను వెంటబెట్టుకుని వస్తున్నాను అంటూ  నెమ్మదిగా అవతల ఉన్న వాళ్ళకి చెప్పింది శారద .

శారద మాటలేవీ చెవికెక్కని సువర్ణకి రాత్రి అమ్మ ఫోన్ చేసినప్పటి మాటలే వినిపిస్తున్నాయి.!
అమ్మ ఇంకా ఏదో మాట్లాడబోయింది. తనే కట్ చేసింది రేపు మాట్లాడుకుందాం అమ్మా నిద్రొస్తోంది అని చెప్పి .  లేకపోతే అమ్మ ఏం చెప్పేదో ..

వర్షాకాలంలో సుడిగాలిలా .. ఏమిటిది ? ఆశల పల్లకిలో ఊరేగుతున్న సమయాన పడమటి సూరీడు తూరుపు దిక్కు చేరకుండానే అమ్మ కానరానిలోకాలకు తరలి పోయిందని వార్త . నమ్మ లేకపోయింది.  అసలే నమ్మలేకపోతోంది. అమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయింది అంటున్నారు.  సన్నగా ఎండిపోయిన పుల్లలాగా ఉండే అమ్మకి హార్ట్ ఎటాక్ రావడం ఏంటి ?

సువర్ణ హృదయం బాధతో మెలిపెడుతోంది.  ఎక్కడో చిన్ని ఆశ మినుకు మినుకు మంటూ .. అమ్మకి ఏమీ కాలేదని వార్త ఈ ఫోను మోసుకురాకపోతుందా అనిపించి ఆశగా మొబైల్ వైపుచూసింది . మళ్ళీ  మళ్ళీ  అవే ప్రశ్నలు అలల సమూహంలా ఒకదాని వెంట ఒకటి  చేరి రొదపెడుతూ .. ఆమె ఎక్కిన నాన్ స్టాప్ బస్సు వేగం కంటే ఎన్నో రెట్ల వేగంతో పరుగులు పెడుతూ  సాగుతున్నాయి సువర్ణ  ఆలోచనలు .

పాలిపోయిన ఆమె కంటి నుండి చుక్క నీరు కారడం లేదు కానీ హృదయంలోనే ఆమె దుఃఖిస్తున్న తీరు శారదని కలచివేసింది.   శారద, సువర్ణలు ఒకే పిజి హాస్టల్ లో , ఒకే రూంలో ఉండడం వరకూ మాత్రమే వారి పరిచయం. వ్యక్తిగత విషయాలు పంచుకునేంత దగ్గరతనం , స్నేహం లేవు . ఎవరి లక్ష్యాలని చేరుకునే ప్రయత్నంలో వాళ్ళు  తీరిక లేకుండా  ఉండడం వల్లనో .. తమకు తాము ఏర్పాటు చేసుకున్న చట్రంలో బందీలుగా ఉండడం వల్లనో , వయస్సులో వ్యత్యాసం వల్లనో కానీ వారి మధ్య పెద్దగా  స్నేహం పెరగలేదు.  మంచి నిద్రలో ఉండగా సువర్ణ ఫోన్ శారదని డిస్ట్రబ్ చేసింది.  విషయం తెలిసి ఆ పరిస్థితుల్లో ఒంటరిగా పంపించడం ఇష్టం లేక సువర్ణ వద్దన్నా తనూ బయలుదేరింది శారద.

కళ్ళు మూసుకుని కణతల దగ్గర ఒత్తుకుంటున్న సువర్ణని చూసి  శారద నెమ్మదిగా భుజం తట్టింది.  పొడారిపోతున్న ఆమె పెదాలు గమనించి కొంచెం నీళ్ళు తాగమంటూ వాటర్ బాటిల్ మూత తీసి తాగించబోయింది శారద.  వద్దంటూ కొద్దిగా కదిలి తిరిగి కళ్ళు మూసుకుంది సువర్ణ.

వారి వెనక సీట్లో పసిపాప ఎందుకో గుక్కపట్టి ఏడుస్తూ ఆమె ఆలోచనలకి భంగం కలిగిస్తూ .. బహుశా ఆకలేసిందేమో .. పాలసీసా తెచ్చుకోవడం తెలీదా ఆ బిడ్డ తండ్రి భార్యని కసురుకుంటున్నాడు. తెచ్చా.. ఆ బ్యాగ్ మీరు పైన పెట్టారు .  కొద్ది దూరంలో వెళ్తున్న ట్రైన్ చూపుతూ ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తూనే భయపడుతూ నెమ్మదిగా చెప్పింది తల్లి. ఆ పీల గొంతులో అతనంటే ఉన్న భయం స్పష్టంగా తెలుస్తోంది.  ఆ ముక్క ముందేడ్వోచ్చుగా .. గర్జించాడు  భర్త .  కొద్దిగా ఆ చారల బ్యాగ్ తీసిస్తారా .. భయం భయంగా  నసిగినట్లుగా ఆమె ..  తల్లి అందించిన స్తన్యం తన ఆకలి తీర్చలేదేమో పాప ఓ క్షణం ఏడుపు ఆపి మళ్ళీ గట్టిగా గొంతు పెంచింది . పాల కోసం తడుము కుంటూనే ఉంది .  అపుడప్పుడే వస్తున్న పళ్ళతో పాప కసిగా కొరికిందేమో .. అబ్బా .. అని బాధ పంటికింద నొక్కి  పెట్టింది తల్లి. అదేమీ పట్టనట్టే  కూర్చున్నాడతను మొహం విసుగ్గా పెట్టి .  లేచి పైన పెట్టిన బ్యాగ్ తీసే ప్రయత్నం చేయకపోవడంతో నిస్సహాయంగా అతనికేసి చూసింది ఆ యువతి.   అతను అదేమీ పట్టనట్టు ఉండడంతో చంకలో బిడ్డతోసహా తానే లేవబోయింది.

బిడ్డ గుక్కపట్టి ఏడుస్తంటే అట్లా కసురుకుంటావేమయ్యా .. లేచి ఆ సంచీ ఇవ్వరాదు..కొద్దిగా గట్టిగానే అంది వాళ్ళ వెనక సీటులో ఉన్న నడివయస్సు స్త్రీ .  ఒక్క క్షణం ఆవిడ కెసి తీక్షణంగా చూసి  మౌనంగా లేచి సంచి భార్యకి అందించాడు .  పాలసీసా నోటికందగానే పాప ఏడుపాగిపోయింది.

హైదరాబాద్ నిజామాబాద్ బస్సు వేగంగా కదులుతోంది . ఆ బస్సుకంటే వేగంగా కదులుతున్నాయి సువర్ణకి అమ్మ జ్ఞాపకాలు . ఈ  అమ్మ లాగే తన తల్లీ నా కంట తడి రానీయలేదు. తనకోసం అమ్మ ఎన్ని కష్టాలు పడింది . ఎన్నెన్ని అవమానాలు భరించింది . సంప్రదాయం ముసుగులో చీమూ నెత్తురూ లేని పరాన్నబుక్కులు లూటీ చేసిన తన శరీరంలాగా, ఆమె జీవితపు పత్రహరితాన్ని పీల్చేసిన పురుగుల బారిన  కన్నబిడ్డ పడకూడని ఆరాటపడింది. జాగ్రత్త పడింది.  ఆ జీవితం తాలుకు ఛాయలుపడని హాస్టల్ లో ఉంచి చదివించింది. తన బతుకు నాకు తెలియకూడని అనుకుంది.

సువర్ణ చేతిలో ఫోన్ బీప్ శబ్దం చేసింది . చూడకుండానే శారద చేతికిచ్చింది.  ఆమె మెసేజ్ ఏదో వచ్సినట్లుందని  చూసి ఏదో ప్రమోషన్ మెసేజ్ అని అట్లాగే పట్టుకుంది .  మళ్ళీ తల్లి తలపుల్లోకి పోతున్న సువర్ణ కి అంతరాయం కలిగిస్తూ ముందు సీట్లోంచి వినిపిస్తున్నాయి మాటలు .

నాకు ఈ రోజు సెలవు పెట్టడానికి కుదరదు .  తప్పని సరిగా ఫీల్డ్ విజిట్ కి పోవాలి .  బతిమాలుతునట్లుగా ఆమె గొంతుకలో.   నువ్వు  ఇంట్లో ఉన్నావని నన్ను సెలవు పెట్టమనడం బాగోలేదు హరీ .. అట్లా అయితే జాబ్ మానేస్తాలే ……. , అది  కుదరదంటే ఎలా .. నాకేమన్నా సరదానా .. నాలిగింటికి లేచి వండి వార్చి ఊరు నిద్రలేవకుండానే హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని బయటపడడం ‘ ఆమె గొంతు పదును దేరుతోంది   అవతల్నించి ఏమన్నాడో గానీ ఫోన్ గొంతు నొక్కి  బ్యాగ్లో పడేసింది .  హాయిగా , విశ్రాంతిగా , ఆనందంగా బతకాలని ఎవరికుండదు ?  ఈ మగాళ్ళకి పెళ్ళాం తెచ్చే జీతం కావాలి. అన్నీ అతని చెప్పు చేతుల్లో నడవాలి.  ఆఖరికి  ఆమె ఉద్యోగం కూడా అతని కనుసన్నల్లోనే చేయాలి ..గొణుక్కుంటోంది  ఆ స్త్రీ .

ఆ మాటలు సువర్ణ చెవిన పడ్డాయి.  తాను చూసిన ఆడవాళ్ళలో చాలామందిని కట్టుకున్న భర్త, తండ్రి , అన్న తమ్ముడు , కొడుకు ఎవరో ఒకరు హక్కుగా అజమాయిషీ చేస్తారు.  కానీ తన తల్లి పరిస్థితి అది కాదే ..
చెడ్డీ వేసుకున్న ప్రతి మగాడూ … ఎట్లా భరించిందో అమ్మ ..  జీరబోయిన  గుండె గొంతుకలోంచి ఎగిసిపడే దుఃఖాన్ని అదిమిపడుతూ ఆది కనిపించనీయకుండా  చేసేప్రయత్నంగా కిటికీలోంచి బయటకు మొహం పెట్టింది  సువర్ణ .

కొద్ధి క్షణాల అనంతరం శారదతో ఏదో చెప్పబోయి  అటు తిరిగి ఆగిపోయింది సువర్ణ .
అవతల పక్క సీటులోని నడివయస్కుడు శారదనే  తదేకంగా కొరికి తినేసేలా చూస్తున్నాడు. అది గమనించిన శారద అతన్ని చుర చురా కాల్చేసేలా చూసి చేతిలోని దినపత్రికలో మొహం దూర్చింది.
‘ఎవరైనా నన్ను అలా చూస్తే అమ్మ రగిలిపోయేది’ సువర్ణ మనసులో మాట అప్రయత్నంగా పైకి  తన్నుకొ చ్చేసింది .

విస్మయంగా పేపర్లోంచి తల తిప్పి సువర్ణకేసి చూసిన శారద ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని  ఆత్మీయ స్పర్శ అందించింది.  సువర్ణ మనస్థితి అమ్మచుట్టూరా తిరుగుతోందని అర్ధం చేసుకుంది.  అదిమి పెట్టిన ఆమె దుఖాన్ని బయటికి తెచ్చే అవుట్ లెట్ కావాలి.   ఒక్క సారిగా బద్దలయిందంటే ఆమెని ఆపడం తన తరం కాదని భావించిన శారద ‘ ఇంకా ..’ అంది .

‘ఎదుగుతున్న క్రమంలో నన్ను ఇతరులు చూసే దృష్టి అమ్మని చాలా కలవర పరిచేది .  కాలేజిలో  సామాజికాంశాలపై ఊరూరు తిరిగి వీధినాటకాలు వేసేదాన్ని . అది అమ్మకు అస్సలు నచ్చేది కాదు.  బహుశా ఆడామగా కలిసి ఒకే బృందంగా వెళ్ళడం వల్ల కావచ్చు .  ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలిస్తున్నానని ఓ రోజు చాలా పెద్ద గొడవపెట్టుకుంది. బాగా చదువుకుని నీడ పట్టున ఉద్యోగం చేసుకుంటావనుకుంటే ఈ తిరుగుళ్ళు ఏమిటి ? అంటూ బాధపడింది . నేను తప్పు పని చేయడంలేదని అందరికీ మంచి జరగడంకోసమేనని ఎంతచెప్పినా ఆమెకు అది ఎక్కలేదు . నన్ను ఎంతో స్వేచ్చగా పెంచిన అమ్మ  ప్రవర్తన నాకెంతో ఆశ్చర్యం గాను కొత్తగానూ అనిపించి అదే అడిగాను .  నేను చేసే పని మంచిది కాదని ఆమె ఖఛ్చితమైన అభిప్రాయం .   నాకు నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించింది.  గొడవ పడింది . అమ్మ అంత గట్టిగా వాదించడం , నా ఆలోచనని, పనిని  సరిచేయాలని ప్రయత్నించడం  నా జీవితంలో అది రెండోసారి  ‘ బయటకు దీర్ఘంగా చూస్తూ చెప్పింది సువర్ణ

‘అవునా ..?’  శారద ప్రశ్నార్ధకం
ఒకసారి దీర్ఘ శ్వాస  తీసుకుని వదలుతూ  ‘అవును, నా కులంలో చాలా మంది ఆడపిల్లలాగా నేనెప్పుడూ లేను. అందుకు భిన్నంగా పెంచింది అమ్మ.  బుడిబుడి నడకల నన్ను చదువుల తల్లి ఒడిలో చేర్చింది.  ఊళ్ళో  నాతోటివాళ్ళు  తమ్ముళ్ళను సాకుతూనో , కడవలతో నీళ్ళు మోస్తునో , బండెడు చాకిరీ చేస్తునో , అడివికిపోయి కట్టెలు తెస్తూనో .. ఉంటే .. నేను మాత్రం అలా కాదు.
సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి పొరిగింటి రాజమణి తో కల్సి  కట్టెలకు పోయాను.  అమ్మకి పని భారం తగ్గిద్దామనే ఉద్దేశంతో . అందుకు అమ్మ సంతోషపడలేదు సరికదా చెడామడా తిట్టింది. అమ్మ ఎప్పుడూ అట్లా తిట్టలేదు.  ఎందుకట్లా చేసిందో చాలా సేపు అర్ధం కాలేదు. అమ్మ కోపం తగ్గాక సారీ చెప్పి , మన చుట్టుపక్కల ఆడపిల్లలంతా రోజూ చేస్తున్న పనేకదా .. వర్షాలు దగ్గరపడుతున్నాయ్ .  పొయ్యిలో కట్టెలు లేవు . నీకు కష్టం కావద్దని , సాయం చేద్దామని  నేను వాళ్ళతో పాటు వెళ్తే  తప్పేమిటన్న నా  ప్రశ్నకు  ‘మనసొంటి మాదిగోళ్ళ  ఆడపిల్లలపై అచ్చోసిన ఆంబోతుల్లెక్క తిరిగేటోల్ల కళ్ళు, పడతయ్ బిడ్డా …  మనసొంటి ఆడోల్లని చెరబట్టే కీచక మూకలు  అవకాశం కోసం ఎదురు చూస్తనే ఉంటయ్ బిడ్డా ..జర బద్రం ..  ఊర్ల పెరిగిన పిల్లలకు ఎవరెసొంటోల్లో అంతో ఇంతో ఎర్కుంటది. నువ్వా  సుడాబోతే పట్నం పిల్లలెక్క , పెద్దిండ్లల్ల పిల్ల లెక్క సక్కదనాం ముంటివి. ఈ గుడిసెల్ల కాపాడుడు నాతోని అయితదా .. గందుకే మందిలకు పోకు’ అని విశదపరిచింది.  ఆనాడు అమ్మ మాటలు అర్ధమయ్యి అవనట్లుగా ..  అంతగా పట్టించుకోలేదు కూడా .  ఇప్పుడాలోచిస్తుంటే ఎర్నాకులంలో న్యాయ విద్యార్థిని జిషకి జరిగిన అన్యాయం తెలిసిన తర్వాత గానీ నేను రియలైజ్ అవలేదు ఆనాడు అమ్మ ఎందుకంతగా చెప్పిందో ..  అంటూ శారద మొహంలోకి  ఓ క్షణం అలా  చూసి చూపు తిప్పుకుంటూ

‘గర్భ దరిద్రంలో  మోసిన బరువుల మోత, రంపపు కోత అనుభవించిన అమ్మ అంతకు మించి లాలిత్యంతో ఎలా చెప్పగలదు ?  ఏ గుడ్లగూబ ఆబగా కబళిస్తుందో నన్న భయంతో  తల్లి కోడి  రెక్కల కింద పిల్లను దాచుకునే ప్రయత్నం ఆమెదని అర్ధం చేసుకునే వయసు కాదు నాదప్పుడు .’ అంటూ చెప్పడం ఆపి సీరియస్ గా  వింటున్న శారద మోహంలో భావాల్ని చదవడానికి ప్రయత్నం చేస్తోంది సువర్ణ .

తర్వాత  అన్నట్లు చూస్తున్న శారద తన చేతిలోని సువర్ణ చేతిని నెమ్మదిగా వదిలి  గాలికి  చెల్లాచెదురవుతున్న సువర్ణ  జుట్టుని సవరించింది.   ఆ చర్య  తల్లి ఆత్మీయ స్పర్శ  పొందిన ఫీలింగ్ కలిగించింది సువర్ణకి .  శారద భుజంపై తల వాల్చిందల్లా  లేచి చిన్నపిల్లలా శారద మొహంలోకి చూసింది . శారద ఆమె తలను తన ఒడిలోకి తీసుకుంది . చెమర్చిన కళ్ళు  కనిపించనీయకుండా  ఓక్షణం కళ్ళు మూసి తెరిచింది సువర్ణ . ఎంత వద్దన్నా ఓ కన్నీటి చుక్క ఆమె కనుకొలుకుల్లోంచి  పక్కకు జారింది.
నెమ్మదిగా మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది .   ట్రాన్స్ లో మాట్లాడుతున్నట్లుగా ఉంది ఆమె తీరు చూస్తుంటే .

నా ఇంటర్ ఎగ్జామ్స్ ముందు జరిగిన సంఘటన అమ్మని ఎంత ఆందోళనకు గురి చేసిందో .. చిగురుటాకులా వణికిపోయింది .
ఏమైంది ? శారద కళ్ళతోనే ప్రశ్నించింది

‘ ఇంటర్ ఎగ్జామ్స్ లో   సాధారణంగా వచ్చే ముఖ్యమైన  ప్రశ్నలు చెప్తానని  చెప్పి మేకతోలు కప్పుకున్న తోడేలు లెక్చరర్  లైంగిక దాడికి పాల్పడడంతో అతన్ని ఎదుర్కుంటున్న క్రమంలో అతను అన్న మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి .

‘ ఏమిటే .. అంత నీల్గు తున్నావు ?  పత్తిత్తయినట్టు .. అయ్యేవడో తెల్వకుండా పుట్టినదానివి .. అంటూ సైంధవుడిలా వెంటపడి దుర్భాష లాడినప్పుడు ఆ క్షణంలో వచ్చిన ఆవేశంతో లెక్చరర్ అనికూడా  చూడకుండా చెప్పు తీసుకుని చెడామడా వాయించేసాను.  కానీ భవిష్యత్ పరిణామాల్ని ఊహించలేదు . ఆ అవమానాన్ని భరించలేక తెల్లారితే పరీక్ష ఉన్నదనే విషయం పట్టించుకోక ఇంటికి పరిగెత్తుకుపోయాను.  అమ్మని ఒక బిడ్డ అనరాని మాటలన్నాను . ఎన్నిమాటలన్నా అమ్మ ఒక్క మాట తూలలేదు.  మనసులోపల ఉప్పొంగుతున్న త్సునామీ అలల్ని ఎలా అదిమిపెట్టగలిగిందో .. ఆమెలో ఎన్ని నెత్తుటి నదులు పారాయో .. ఎంత తప్పుగా అర్ధం చేసుకుంది .. ప్చ్ పాపం ..అమ్మ .   చీర చెంగు మాటున అలవికాని అవమానాలు, విషాదాలు దాచేస్తూ .. ఎక్కడి బాధల్ని, బెంగల్ని  అక్కడే పాతరేస్తూ నా కోసం ..నిభాయించుకుంది. ఆశావహంగా  నాకోసం  ముందుకు నడుస్తూనే ఉంది.  మరిప్పుడెందుకు ఆ నడక ఆగిపోయిందో ..?విధి ఆమెను ఏ తీరాలకు విసిరేసిందో ‘  సువర్ణ కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి . గొంతు జీరబోయింది .

తన ఒళ్ళో  ఉన్న సువర్ణ  భుజంపైఓ చేత్తో  తడుతూ మరో చేత్తో ఆమె తలపై చేయి వేసి అనునయంగా  నిమురుతోంది శారద .
కొద్ది సేపు ఇద్దరి మధ్యా మౌనం . ఆ తర్వాత  శారద ఒడిలోని తల లేపి ఆమె మొహంలోకి చూస్తూ
‘తాత చనిపోకముందు తన పేర ఉన్న అరెకరం చేను పండించుకొమ్మని అమ్మకి ఇచ్చాడు. చెట్టు,పుట్టలతో అడవిలాగా ఉన్నదాన్ని చంటి బిడ్డలా సాకింది.  ఒంటి చేత్తో సాగులోకి తెచ్చింది . తిండిగింజలకి ఇబ్బందిలేకుండా చేసుకుంది.  తాత చనిపోయాడు. అమ్మమ్మ నోరులేని జీవి. అది అలుసుగా తీసుకుని పెద్దమామ, చిన్న మామ ఆ పొలం గుంజుకున్నప్పుడు ఆబోతుల్లా కొమ్ములతో కుమ్మి, కొట్టి  హింసించినప్పుడు, కుటుంబంలో , సమాజంలో వచ్చే ప్రతి సంకెలని తెన్చుకుంటూ సాగిన అమ్మకి ఇప్పుడు ఏమయింది శారదా ? ‘ బేలగా అడిగింది సువర్ణ .   మళ్ళీ ఆమే  ‘నా కోసం..  నా కోసమే,  పొగచూరిన కళ్ళలో ఒత్తులేసి నాకు బాట చూపే ప్రయత్నం చేస్తూనే ఉండేది అమ్మ .  ఎటు నుండి ఏ కష్టం వచ్చి మీదపడుతుందో అని అమ్మ కాపు కాస్తూనే ఉండేది. అయినా ఈ మగాళ్ళకెంత అలుసో కద శారదా ఆడవాళ్లంటే .. అందునా మా లాంటి వాళ్ళంటే ..’
అవునన్నట్లు తలూపుతూన్న శారద చేతిని చేతిలోకి తీసుకుంటూ  ‘పేదలం , దళితులం .. జోగినీ కుటుంబం .. ఆడవాళ్ళం ..ఒంటరి ఆడవాళ్ళం ..  వాళ్ళు  అట్లనే ఉంటరు బిడ్డా ..అలుసు తీసుకుంటరు బిడ్డా .. ఒంటి బలుపు తీర్సుకుంటరు బిడ్డా ..  మనం  యుద్ద తంత్రాలు నేర్వాలే బిడ్డా అని చెప్పిందో నాడు  నేను అడిగిన ఓ  ప్రశ్నకి సమాధానంగా .. అక్షరం చదవని అమ్మ నాకెన్ని జీవిత పాఠాలు చెప్పిందో .. ‘ ఆకాశంలో అలుముకుంటున్న చీకటి మేఘాల్లాటి జ్ఞాపకాల్లోంచి తొలుచుకొస్తున్న సువర్ణ మాటలు పూర్తి కాకుండానే

‘నిజమే సువర్ణా, ఎంతబాగా చెప్పింది మీ అమ్మ … ఆమె అనుభవం చెప్పిన పాఠాలు ఎన్ని డిగ్రీలు చదివినా వస్తాయా ..?  ఎంతటి గడ్డు స్తితి నైనా ఎదుర్కొనే ధైర్యం, విశ్వాసం లేకే కదా యువత ఆత్మహత్యలు చేసుకునేది  ‘ సాలోచనగా అంది శారద .  అదేమీ పట్టించుకోనట్టే .. తన ధోరణిలో తను చెప్పుకుపోతోంది సువర్ణ.

‘అమ్మ జోగిని అని అనడం చిన్నప్పుడు విన్నాను. కానీ జోగినీ అంటే ఏమిటో  తెలియదు. తెల్సుకోవాల్సిన అవసరమూ రాలేదు. నాకు  అమ్మ పోలికలున్నా రంగు రాలేదు. అమ్మది నాణ్యమైన నలుపు .  నేను చిన్నప్పటి నుండి హాస్టల్ లో ఉండి చదువుకోవడం , సెలవులకి  ఇంటికి వెళ్ళినా మళ్ళీ  హాలిడే కాంప్ లకు వెళ్ళడంతో సరదాగా గడచిపోయేది. లేదంటే ఉపాధి పనులకు అమ్మతో పాటే వెళ్ళేదాన్ని. ఆ పనులకు తీసుకెళ్ళడం , నాతో పని చేయించడం అమ్మకు అస్సలు ఇష్టముండేది కాదు. నేను కమిలిపోతానని, నా రంగు మాసి పోతుందని అనేది.  కానీ ఇంటి దగ్గర ఒంటరిగా ఉండడం అస్సలు మంచిది కాదనే ఉద్దేశం. అమ్మే నన్ను చూడాలనిపించినప్పుడల్లా నా దగ్గరకు వచ్చేది .   బడి  పాఠాల్లో మంచి మార్కులు తెచ్చుకునే నేను అమ్మ చెప్పిన జీవిత పాఠాలను ఆనాడు సరిగ్గా బుర్రకు ఎక్కించుకోలేదేమో ..అర్ధం చేసుకోలేదేమో ..  ! నాకు పెళ్లి చేసెయ్యాలని ఎంతో  తపన పడింది .  పెళ్లి లేని తల్లిగా ఎన్ని అవమానాల్ని తన గరళంలో బిరాడాతో బిగిన్చేసిందో .. ప్చ్ ,, ‘ నిట్టూర్చింది  కనుకోలుకుల్లో దాగిన కన్నీటి చుక్కని చున్నీతో తుడిచేస్తూ .

అప్పటివరకూ జోగిని అంటే అర్ధం కాని శారద ఏదో అర్ధమయిన దానిలా సానుభూతిగా చూసింది సువర్ణ వైపు .
‘నే చెప్పింది నీకు అర్ధమయ్యే ఉంటుందనుకుంటున్నా …  అమ్మ ఆరాటానికి  కారణం అప్పుడు నాకు అర్ధం కాలేదు . తనకి లేని దాన్ని కూతురికి అందించాలని ఆమె తపన, తాపత్రయం అందులో సంతోషం వెతుక్కునే ప్రయత్నం కావచ్చని ఇప్పుడనిపిస్తోంది.  ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి అని భీష్మించుకు కూర్చున్న నన్ను బాగా చదువుకున్నావు . మంచీ చెడూ నాకంటే నీకే ఎక్కువ తెలుసు అంటూ సరిపెట్టుకుంది .

ఎక్కడిదాకా వచ్చారని చిన్న మామ ఫోన్ కి కామారెడ్డి దగ్గరలో ఉన్నామని సమాధానం చెప్పిన సువర్ణ కేసి చూస్తూ  ‘నువ్వూ మాలాగే పేదింటి పిల్లవనుకున్నా కానీ  ఎంతటి గడ్డు పరిస్తితుల్లోంచి ఎదిగోచ్చావో తెలుస్తుంటే  ఆశ్చర్యంగానూ గర్వంగాను  ఉంది సువర్ణా .  నీవసలు అలా కనిపించవు .  ‘ ఆశ్చర్యంగాను, ఆప్యాయంగా సువర్ణ చేతికి గట్టిగా పట్టుకుంది శారద .

‘నీకు నేను చెప్పింది చాలా తక్కువ  శారదా .. పన్నెండో ఏడు వెళ్లిందో లేదో అమ్మకి  నేను పుట్టానట.   ఆ తర్వాత ఏడాదిన్నరకి తమ్ముడు .. ఆమె ప్రమేయం లేకుండానే .. మా పుట్టుక గురించి ఆమె ఆరాటపడకుండానే .. ఎవరెవరి శరీర తాపం తీర్చుకునే క్రమంలోనో… సాంప్రదాయపు చట్రంలో చిక్కి విలవిలాడే అమ్మ రక్తం పంచుకుని మేమీ లోకంలోకి వచ్చేశాం. కానీ ఏమైందో కానీ తమ్ముడు ఏడాదిలోపే మమ్మల్ని వదిలిపోయాడు.

నాకు ఊహ తెలిసినప్పటి నుండీ నాన్నంటే  తెలియదు.  అమ్మని అడిగితే వదిలి వెళ్ళిపోయాడంది.  ఒంటి చేత్తోనే మమ్మల్ని పెంచింది అమ్మ .  ప్రభుత్వం జోగినులకు ఇచ్చే పునరావాస కార్యక్రమాల్లో కుట్టుపని నేర్చుకుంది.  జాకెట్లు , గౌన్లు , లంగాలు వంటివి కుట్టడం నేర్చుకుంది.  కానీ అమ్మ దగ్గర కుట్టించుకోవడానికి వచ్చేవారు కాదు.  కారణం అప్పటికే ఆమె జోగినులకోసం కట్టించిన ఆశానగర్ కాలనీలో ఉండడమే .  ప్రభుత్వం హాస్టళ్లకు కుట్టే బట్టలు వీళ్ళతో కుట్టించింది.  జోగినుల కాలనీ అని ముద్ర పడడంతో  అల్లరి చిల్లరి  మగవాళ్ళు  అక్కడ చేరి అల్లరి పెట్టడం మొదలు పెట్టారు . ఇక అక్కడ ఉండలేక అమ్మ లాగే మిగతావాళ్ళు  చాలా మంది అక్కడి నుండి వెళ్ళిపోయారు .  అమ్మకి మళ్లీ పనిలేదు .  కూలీకి వెళ్ళేది. మొదట్లో కూలికి కూడా రానిచ్చేవారు కాదట .  అటువంటి పరిస్తితి లోంచి వచ్చిన అమ్మ ఎంత గొప్పగా ఆలోచించిందో తెలుసా .. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని జోగినులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పిందట.  కానీ అది తీసుకోనని రాత్రి మాటల్లో చెప్పింది అమ్మ .’

‘ఏం ఎందుకని వద్దంది ‘ ఉచితంగా వస్తుందంటే ఫినాయిలు తగదానికయినా సిద్ధమయ్యే ఈ కాలంలో ఇలాంటివాళ్ళు కుడా ఉంటారా అనే ఆశ్చర్యంతో శారద ప్రశ్నదూసుకొచ్చింది.

‘ అది ఆత్మ గౌరవం కోసం కావచ్చు లేదా నేను ఉద్యోగంలో చేరితే ఆర్ధికంగా ఇక ప్రభుత్వ సహకారం అవసరం లేదని ఉండవచ్చు. లేదా తన జీవితం తాలుకు  నీలి నీడలు నాపై పడతాయని కావచ్చు ఏమైనా అమ్మ తీసుకున్న నిర్ణయం గొప్పదే కదా ..’ కొన్ని క్షణాలు అలా కళ్ళు మూసుకు తెరిచి మళ్ళీ తానే  ‘సమాజంలో ఉండే హెచ్చు తగ్గులు, సమాజపు అంతః స్వరూపం  బడిలో ఉన్నప్పుడు అంతగా తెలియదు. కారణం నేను సంస్కార్ బడిలో చదవడం కావచ్చు. అక్కడ అందరినీ ఒకే విధంగా చూడడం కావచ్చు .  కబడ్డీ , ఖో ఖో రాష్ట్ర , జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నప్పుడు , కొన్ని సామాజిక కార్యక్రమాలకోసం , బాల జర్నలిస్టుగా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మనషుల మధ్య ఉండే అంతరాలను గమనించినా అంత సీరియస్ గా తీసుకోలేదు .. బహుశా అంతగా అర్ధం చేసుకునే వయసు కూడా కాదేమో …

ఎప్పుడయితే నేను బాలల హక్కులపై  రాష్ట్ర స్థాయి , జాతీయ స్థాయి సదస్సులకి హాజరయ్యానో అప్పటి నుండి నా మెదడు మరింత ఆలోచించడం మొదలు పెట్టింది . పదును అవడం ఆరంభమైంది.  చెప్పాను కదా ఇంటరులో ఉండగా జరిగిన సంఘటన . ఆ తర్వాత ఒంటరి స్త్రీగా తల్లి పడుతున్న కష్టాలు కొద్ది కొద్దిగా అవగతమవుతూ వచ్చాయి. నా తల్లిలానో,  గ్రామంలోని మహిళల్లాగానో బతక కూడని అప్పుడే నిశ్చయించుకున్నాను .  అమ్మ హేమలతా లవణం స్ఫూర్తి నిచ్చేది . అట్లా నలుగురికీ ఉపయోగపడేలా బతకాలని నాకు నేనే చెప్పుకునేదాన్ని.  ఆక్రమంలో అన్నింటా చురుకుగా పాల్గొంటూ వచ్చిన ఏ  అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు దూసుకుపోయే దాన్ని. అప్పటికప్పుడు ఏ విషయమైనా నదురు బెదురూ లేకుండా ఎంతమంది ముందయినా మాట్లాడేదాన్ని. విస్లేషించే దాన్ని. సూటిగా చెప్పే దాన్ని. బహుశా ఇవన్నీ నేను చదివిన బడి, అక్కడి మనషులు, వాతావరణం నాకిచ్చాయని అనుకుంటున్నా ..

ఆ లక్షణాలే అమెరికా దాకా వెళ్ళే అరుదైన అవకాశాన్నిచ్చాయి .  నేనెప్పుడూ ఊహల్లో కూడా కనని కలని నిజాన్ని చేస్తూ నా ముందుకు వచ్చిన అవకాశం అది. కానీ అప్పుడు అమ్మ పంపడానికి చాలా భయపడింది.  తెలిసిన వాళ్ళు  తెలియని వాళ్ళు అమ్మని చాలా భయపెట్టారు.  తన భయాలన్నీ తనలోనే పెట్టుకుని  హేమలతా లవణం ఆమ్మమ్మ పై ఉన్న గౌరవంతో , నమ్మకంతో అమెరికాలో జరిగే సదస్సుకి నన్ను పంపించింది ‘. గాలికి ఎగురుతున్న ముంగురులను సవరించుకుంటూ చెప్తున్న సువర్ణ మాటలు పూర్తి కాకుండానే అందుకుని  ‘ ఏమిటీ చిన్నప్పుడే నీకు అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందా ..?’  చెప్పలేనంత ఆశ్చర్యం కళ్ళలో నిండగా అడిగింది శారద .

‘అవును , ఆ రోజు నా జ్ఞాపకాల్లో ఇంకా పచ్చిగానే , అప్పుడప్పుడూ ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది. పాస్పోర్ట్ కోసం హైదరాబాద్ వెళ్లినప్పుడు తండ్రి పేరు లేదని పాస్ పోర్ట్ ఇవ్వనని చెప్పారు.  తండ్రి ఇప్పుడు మీకు లేక పోవచ్చు కానీ నీ పుట్టుకకి కారకుడైన వ్యక్తీ పేరు చెప్పమన్నారు . ఏమి చెప్పను . ఏమని చెప్పను. భారమైన హృదయంతో తప్పుచేసిన దానిలా తల వంచుకున్నాను .  అప్పటికీ నన్ను తీసుకెళ్ళిన అంటి పరిస్థితి వివరించింది.  వాళ్ళకి జోగిని అంటేనే తెలియదు. చెప్పింది అర్ధం చేసుకోరు . వాళ్ళ టైం వెస్ట్ అవుతోందని మాట్లాడారు. ఆంటి చాలా రిక్వెస్ట్ చేశారు . ఒప్పుకోలేదు.   అప్పటికప్పుడు అమ్మని పిలిపించి జోగిని అంటే ఏంటో తెల్పుతూ ఒక అఫిడవిట్ తయారు చేయించి  అమ్మతో సంతకం చేయించి పాస్త్పోర్ట్ ఆఫీసర్ కి ఇచ్చి వివరించిన తర్వాతే  పాస్పోర్ట్ అప్లికేషన్ తీసుకున్నారు.  మొదటిసారిగా నేను జోగిని కూతురుగా పుట్టినందుకు బాధపడ్డాను. కానీ అప్పటికి జోగినీ జీవితం ఎలా ఉంటుందో తెలియదు .

‘ అవునా ..  తండ్రి పేరు లేకపోతే ఇలాంటి కష్టాలుంటాయా .. ? విస్మయంగా శారద

అవునన్నట్లుగా తలూపి ‘ఆంటి వాళ్ళు చొరవ చూపక పోతే నాకు వచ్చిన అవకాశం నేను కోల్పోయేదాన్ని.. నేను కాకుండా మరెవరికి ఈ అవకాశం వచ్చినా తండ్రి పేరు లేదన్న కారణంగా పాస్ పోర్ట్ అప్లికేషన్ వెనక్కి ఇచ్చేసేవారు కాదు కదా .. అప్పటి నుండి నాలో ఎన్నెన్నో ప్రశ్నల తుఫానులు రేగడం మొదలయ్యాయి.  కానీ అమ్మని అడిగి తెలుసుకునే అవకాశమే రాలేదు. పాస్పోర్ట్ వచ్చాక రెండుసార్లు ధిల్లీ వెళ్లి వచ్చా వీసా కోసం ..  అక్కడ కూడా జోగిని బిడ్డగా , తండ్రి లేని బిడ్డగా మళ్ళీ రుజువు చేసుకోవాల్సి వస్తుందేమోనని భయపడ్డా . కానీ వాళ్ళు  తండ్రి పేరు లేదని అభ్యంతర పెట్టలేదు. కానీ, నేను మైనర్ ని కాబట్టి అమ్మని అడ్రెస్స్ , నివాస దృవీకరణ చేసుకునే పత్రాలు కావాలన్నారు.  తెల్లవారే సరికి అమ్మ విమానం ఎక్కి దిల్లీ వచ్చింది.  ఎక్కడో పొలాల్లో పని చేసుకుంటున్న అమ్మని పిలిపించి అప్పటికప్పుడు తోడిచ్చి ధిల్లీ పంపించారు  సంస్కారు వాళ్ళు .

బిడ్డా .. నిజామబాద్ మొకం జూడని నాకు మీది మోటార్ ఎక్కిపిచ్చినవ్ .. నీకంటే ముందు నేనే గాలి మోటార్ ఎక్కిన అంది  అమ్మ  ఢిల్లీ చేరగానే . ఇందిరమ్మ ఇక్కడే ఉండేదా ..ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏవేవో అమాయకపు ప్రశ్నలు వేసింది .  నిన్న ఈ వరకూ చేన్ల ఉంటి . ఇగో ఇప్పుడు డిల్లి గల్లిలల్ల .. అంటూ ఆశ్చర్యపోతునే ఉంది .
మా జీవితాలు ఆ మట్టి లోంచి , బురదలోంచి పైకి వచ్చి అంబరాన్ని  అందుకోవాలని,  మేమంతా సంబరాన్ని పంచుకోవాలని సంస్కార్ చాలా చాలా చేసింది.

మా రజిత టీచర్ వాళ్ళ అబ్బాయిని అమెరికా చదువుకు పంపుదామంటే వీసా రాలేదట. చాలా బాధపడిందా .. నాకు వీసా వచ్చిందని  ఈర్ష్య పడింది కూడా . బడిలో వాళ్లకి , సంస్థలో వాళ్ళకి , ఊళ్లో  వాళ్ళకి  అందరికీ ఆశ్చర్యమే ..

చుట్టుపక్కల ఊళ్ళ  వాళ్ళు   కొందరు అమ్మని అదృష్టవంతురాలివి అని పొగిడితే కొందరు ఈర్ష్య పడ్డారు.  తమ ఊర్లొ ఉన్న పెద్దరెడ్డి కొడుక్కి కూడా వీసా రాలేదట. తన కొడుకు వెళ్ళలేని చోటుకు నేను వెళ్తున్నందుకు తమ పీఠం కదిలిపోతున్నంత బాధపడిపోయారు . లేని పోనివి ప్రచారం చేశారు.  విపరీతంగా భయపెట్టారు. తన భయాలన్నీ గుప్పిట బంధించి కళ్ళ నిండిన నీటిని నా కళ్ళ పడకుండా తుడిచేస్తూ అమ్మ నన్ను పంపింది.  కానీ.. నేను తిరిగి వచ్చేవరకూ కంటి నిండా కునుకు లేకుండా గడిపింది. ‘  సువర్ణ  అమ్మ తలపులను భంగపరుస్తూ సెల్ ఫోన్ మోగింది .
‘హార్టీ కంగ్రాట్స్ సువర్ణా ‘
‘…’
‘ఏంటి రిజల్ట్స్ వచ్చాయిగా  .. ఇంకా చూసుకోలేదా ..?  ట్రీట్ ఎప్పుడిస్తున్నావ్ ..?
‘ …’
‘స్టేట్ సెకండ్ రాంక్ కొట్టేశావ్ ‘ . రిజర్వేషన్ లో చూస్తే నీదే ఫస్ట్ ‘ కంగ్రాట్స్ అగైన్ ‘ సెలెబ్రేషన్ ఎప్పుడు ?’
‘ …’ కళ్ళలోంచి నీరు కారిపోతోంది
‘ఏమిటే మౌన వ్రతం చేస్తున్నావా .. లేక  ఫస్ట్ రాంక్ రాలేదనా ..’ అంతలో సువర్ణ చేతిలోని మొబైల్ లాక్కున్న శారద సారీ ఇప్పుడీ విషయం చెప్తున్నందుకు .. సువర్ణ వాళ్ళ మదర్ ఎక్ష్పైర్ద్ ‘ అని చెప్పింది .
‘ఓ అయాం సారీ .. తర్వాత మాట్లాడతా ..’ పెట్టేసింది .  ఆ తర్వాత వెంటవెంటనే చాలా ఫోన్లు .. ఏవీ రిసీవ్ చేసుకునే స్థితిలో లేదు సువర్ణ .  అప్పటికి  హై వే దిగి డిచ్ పల్లి క్రాస్ చేసింది బస్సు .

‘ఒక్క  రోజు ముందుగా ఈ వార్త అందితే .. అమ్మ ప్రాణం నిలిచేదేమో … రక్త సంబందీకులు, పేగు తెంచుకు పుట్టిన నేనూ  ఉండీ లేనట్లు బిక్కు బిక్కుమంటూ బతికింది  అమ్మ .   మనసులో జరిగే సునామీ విధ్వంసాన్ని , హృదయంలో ఉడికే నెత్తుటి మూటల్ని మూటకట్టి  దాచేసేది . లోపల జరిగే యుద్దపు కన్నీటి చారికల్ని కనిపించనీయకుండా  చిరునవ్వు లేపనం పూసుకు తిరిగేది. నన్ను శిఖరాగ్రంపై చూడాలని కలలు కనేది.   ఆ కలలు నిజమవుతున్న వేళ ..  అమ్మా  ఏంటమ్మా .. అంక్షల పంజరాలను  విప్పుకుని ఆశల రెక్కలతో విహరిద్దామని వెళ్ళిపోయావా ..  దుఃఖం తన్నుకొస్తోంది  ఆమెకి .

వాళ్ళ మాటలు చెవిన పడ్డాయేమో .. కొందరు సానుభూతిగా సువర్ణకేసి చూస్తున్నారు.  బద్దలవుతున్న అగ్నిపర్వతాల్ని లోలోనే ఆర్పే ప్రయత్నంలో గట్టిగా కళ్ళు మూసుకు కూర్చుంది సువర్ణ . మనసులో మూగగా తల్లితో మాట్లాడేసుకుంటోంది

నీ దారి పొడవునా ఉన్న ముళ్ళ జెముళ్లను ఏరేసి పూల పాన్పు పరచాలనుకుంటున్న  నా ఆశల్ని పేకమేడల్లా కూల్చేసి పొలిమేరలు దాటి పడమటి కొండల్లోకి  చేరిపోయావా .. అమ్మా  చిక్కటి చీకటి పాయల్లో చిల్లు పిడతలా నన్నిలా వదిలేసి  .. ? !
ఊహు .. కాదు, నే చిల్లు కుండని కాదు. కాకూడదు . నిండు కుండను.  నీవిచ్చిన సప్త వర్ణాలని నింపుకుని ఉదయపు వెలుతురు కెరటం అవుతుందమ్మా నీ సువర్ణ.  ప్రేమంతా నింపుకుని వేళ్ళు జుట్టులోకి పోనిచ్చి సవరిస్తూ లాలించే అమ్మ మొహం కళ్ళలో మెదులుతుండగా సువర్ణ ఆలోచనలకు భంగం కలిగిస్తూ నిజామాబాద్ బస్ స్టేషన్ లో బస్ ఆగింది .
.
వి. శాంతి ప్రబోధ

Published in Matruka 2017 March
(2016 నోముల పురస్కారం పొందిన కథ )

దారి చూపిన ఒంటరి నక్షత్రం   

ఒకే ఒక్క సంతకం ఆయుధంగా నా యుద్ధం మొదలయింది .
ఇప్పుడు నావెనుక పెద్ద సైన్యం వేలు లక్షల సంతకాలతో.  రోజు రోజుకు నాకు మద్దతు తెలిపే  సైన్యం పెరిగిపోతోంది .  నేను విజయం అందుకోవాలని ప్రపంచం నులుమూలల ఉన్న భారతీయుల నుండి మెయిల్స్ . మెస్సేజ్ లు .  కొందరయితే ఏకంగా ఫోన్ చేస్తున్నారు . ఒక సామాన్యురాలికి ఇంత స్పందనా ..?!

అనూహ్యంగా ..
ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యం, ఆనందం,  ఉత్సాహం , ఉద్వేగం కలగాపులగంగా .. నా కూతురు కళ్ళలో దీపాలు వెలిగించగలనన్న నమ్మకం నాలో మరింత బలాన్ని పెంచుతూ … బహుశా ఈ సమస్య నా ఒక్కదానికే కాదు, చాలామంది  ప్రధానమైనదిగా భావించడం  వల్లేమో ..

ఈ ప్రపంచంలో నేనొక్కదాన్నేకాదు. నాలాంటి సమస్యలు ఎంతోమంది మంది స్త్రీలే ఎదుర్కొంటున్నారని ఇప్పుడర్ధమవుతోంది .  అందుకేనేమో మార్పు కోసం వేసే నా అడుగులకు తోడుగా అడుగేస్తూ .. బాసటగా నిలుస్తూ ..  నాలో ఆత్మవిశ్వాసం  పెంపొందిస్తూ ఉన్నారని ఆలోచిస్తూ ఆరిన బట్టల్ని తీసి మడతపెడుతోంది  గాయత్రి.

కానీ ఆ పోలీసు ఆఫీసర్ ఎంత రూడ్ గా మాట్లాడాడు .  భాష భరించలేనిదిగా .. ఛి ..ఛీ .. ఎంత అసహ్యంగా మాట్లాడాడు  సమస్యని అర్ధం చేసుకోకుండా ..  చదువుకున్న వాళ్ళు కూడా  సంస్కారం లేకుండా అసభ్యంగా  మాట్లాడతారా .. ? మడతపెట్టిన బట్టలు సర్దుతూ . అప్పటికి ఎన్నోసార్లు వేసుకున్న ప్రశ్నే అయినా మళ్ళీ మళ్ళీ ఆమెలో తొంగిచూస్తూ .

హూ.. అలాంటి వాళ్ళని తల్చుకొని టైం వెస్ట్ చేసుకోవడం , బుర్రని పాడుచేయుకోవడం ఎందుకు అని వెళ్లి సోఫాలో కూర్చుంది . ఎదురుగా ఉన్న టీపాయ్ పై గమన  కోసం కొన్న లాప్టాప్ కనిపించడంతో  మెయిల్ చెక్ చేద్దామనుకుంటూ లేచి  లాప్టాప్ అందుకుంది గాయత్రి .  శని , ఆదివారాలు డాన్స్ క్లాసు పిల్లతోనే సరిపోతుంది .  మిగతా రోజుల్లో అయితే సాయంత్రాలు మాత్రమే వస్తారు .   పనుల్లోపడి రెండురోజులుగా మెయిల్ చెక్ చేసుకోలేదు .  మొన్నటివరకూ ఫోన్ వాడడమే గాని మెయిల్ , వాట్సాప్ , ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా జోలికే వెళ్ళేది కాదు . అలాంటిది ఇప్పుడు బాగా వినియోగిస్తున్నా .. అవసరం అన్ని నేర్పిస్తుందేమో , అలవాటు చేస్తుందేమో .. అనుకుంటూ మెయిల్ బాక్స్ తెరిచింది .

సంగీత కార్లేకర్ మెయిల్ .  ఓ .. మొన్ననగా పంపితే తన నుండి రిప్లై లేదని ఈ రోజు ఫోన్ చేసిందన్నమాట .. కొన్ని నిముషాల క్రితం మాట్లాడిన మహిళ మాటలే గుర్తొచ్చాయి గాయత్రికి .
వెంటనే అసలు ఇలాంటి ఆడవాళ్ళూ ఉంటారా .. ? అనే సందేహం మొలిచి ఆశ్చర్యంతో ఆమె మెయిల్ చూస్తోంది కానీ ఆవిడ మాటలే చెవుల్లో ..
 .
నిజంగా ఆవిడకి ఎంత ధైర్యం , ఎంత తెగింపు , ఎంత  ఆత్మవిశ్వాసం?  సమాజం నుండి వచ్చే సవాళ్ళను ఎదుర్కొనే తెగువ , గుండె నిబ్బరం?! అవి  లేకపోతే ఆమె అంత పెద్ద నిర్ణయం తీసుకోగలిగేదా ..  ?! లేకపోతే పెళ్ళికాకుండా బిడ్డను కనిపెంచడమే కాకుండా .. ఆ బిడ్డ తండ్రిపేరు ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదంటుందా . . ఆమె మాటలు వినగానే ఆ ధోరణి.కొంచెం అతిగాను  అరిగించుకోవడం కొంచెం కష్టంగానూ అనిపించినా ఆలోచిస్తుంటే  బాగున్నట్లుగా కూడా తోచింది గాయత్రికి .  ఎలాంటి సంకోచాలు, సందిగ్దాలు లేకుండా  తనకి కావలసింది తను అందుకోవాలనుకునే సంగీత  కార్లేకర్ తత్త్వం చాలా వింతగా , కొత్తగా విస్మయపరిచింది .
‘అమ్మా ఏమాలోచిస్తున్నావ్ ? నేనొచ్చి లైట్ వేసినా నీవు గమనించనే లేదు ‘ కూతురి ప్రశ్న .
చిన్నగా నవ్వేసి ‘ అమ్ములూ ఆవిడకెంత ధైర్యం .. ‘ అనాలోచితంగా
‘ఎవరికమ్మా ..  ఏమి చెప్పకుండా  నాకెలా అర్ధమవుతుంది ‘ షూ లేస్ విప్పుతూ గమన
‘ఓ .. అవును కదూ ..హూ .. ‘ చిన్నగా తనను తాను మొట్టికాయ వేసుకొని   ‘సంగీతా కార్లేకర్ అనే ఆవిడ ఢిల్లీలోనే ఉంటోందిట . ఇంతకుముందే ఫోన్ చేసింది . ‘ అంటూ ఎండ కోసం బయట పెట్టిన ఇండోర్ ప్లాంట్ ని తెచ్చి హాల్లో ఓ మూలగా పెట్టింది .
‘ఓ .. అయితే .. ?’ తనపని ఆపి తల్లికేసి చూస్తూ గమన
‘ఆవిడ పెళ్లికాకుండానే తల్లి అయిందట . కొడుకు పుట్టాడట .  బర్త్ సెర్టిఫికెట్ కి తండ్రిపేరు అడిగారట . నేను అవివాహితను . నా బిడ్డకు తండ్రిలేడని చెప్తే ఆ బిడ్డకు గార్డియన్ గా లీగల్ సర్టిఫికెట్ కావాలన్నారట .
తనకేసి తదేకంగా చూస్తున్న కూతురు చూపుల్ని తప్పించుకుంటూ  ‘ ఆ బిడ్డను నవమాసాలూ మోసి కన్నది నేను .  పెంచేది నేను . ఆ బిడ్డకు తండ్రిపేరు చెప్పకపోతే తల్లిని కాకుండా పోతానా ..? సహజంగానే నా బిడ్డకి గార్డియన్ నేను .  అది నా హక్కు అని కోర్టుకు వెళ్లిందట .    పెళ్లి చేసుకోకుండా తల్లి అయినప్పటికీ ఆ బిడ్డను తండ్రి కాదనుకుంటే బిడ్డ తల్లి  కస్టడీలో ఉన్నప్పుడు ఆమె గార్డియన్ అంటూ ఆమెకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందట ఢిల్లీ హై కోర్టు .  అప్పుడామె సుప్రీం కోర్టు ను ఆశ్రయించిందట .  సుప్రీంకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందట .’   చెప్పి  కిచెన్ లోకి దారితీసింది గాయత్రి .
‘ సుప్రీం కోర్టు ఏమంటోందట ?’  ఆమె వెనకే వచ్చిన గమన  వేసిన ప్రశ్నకు చిరునవ్వుతో  ‘ ఆమె తనబిడ్డ తండ్రి ఎవరో చెప్పాలనుకుంటే చెప్తుంది. లేదంటే లేదు. అది ఆమెహక్కు అని చెప్పిందట సర్వోత్తమ న్యాయ స్థానం . తీర్పు చెప్పడమే కాకుండా ఆ బిడ్డ బర్త్ సర్టిఫికెట్ , స్కూల్ అడ్మిషన్ , పాస్పోర్ట్ ఎక్కడైనా తల్లిపేరు ఉంటె సరిపోతుందని చెప్పిందట .’  స్నాక్స్ ప్లేట్ లో సర్దుతూ చెప్పింది గాయత్రి

తల్లి కళ్ళలో ఆనందం చూసి ‘అమ్మా.. మనకీ ఢిల్లీ కోర్టు  అదే చెప్పింది కదమ్మా ..’ తల్లి చేతిలోంచి ప్లేటు అందుకుంటూ గుర్తు చేసింది గమన .
‘అవునవును, బహుశా ఆవిడే  ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పుకి బాట వేసిందేమో .. ‘ సాలోచనగా ఆలోచిస్తూ చిన్న నవ్వుతో అంది గాయత్రి .
‘అమ్మా ..  నీకు నువ్వు  సాహసం ఊపిరులూదుకుంటూ నీ  ముందు నిలిచిన సవాళ్ళను ఎదుర్కొంటూ పోతున్నావు. కానీ ఆమె అలాకాదన్నమాట .  ఏటికి ఎదురీదే సాహసి.  తనకు తానుగా కొత్తదార్లేసుకుపోతూ సవాళ్ళను ఎదుర్కొంటోంది . ఎప్పుడైనా అంతేనేమో .. దారులు వేసేవాళ్ళు ఎన్నో సవాళ్లు , ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే ..  వాళ్ళు పరిచిన బాటలో మిగతావాళ్ళు సునాయాసంగా నడిచేస్తారు కదా .. ‘  కారప్పూస నోట్లో వేసుకుంటూ  అంటున్న పదిహేనేళ్ల కూతురి కేసి విస్మయంగా, విచిత్రంగా  చూసింది గాయత్రి .
తల్లీకూతుళ్ల మాటల మధ్యలో  గాయత్రి పక్కనున్న మొబైల్ మోగడం మొదలు పెట్టింది
ఎవరో చూద్దామని తీసి చూసింది గాయత్రి. కొత్త నంబర్ .
‘అమ్మా .. నువ్వు ఈ మధ్య ఫోనుల్లో చాలా  బిజీ అయిపోయావ్ ‘  అంటూ తానూ తల్లిపక్కకు చేరింది .
‘ ఏమోనే ..  ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు . కొందరు సపోర్ట్ చేస్తున్నారు .  కొందరు తామూ బాధితులమేనని తమ వ్యధ చెప్పుకుంటున్నారు .  కొందరు సలహా అడుగుతున్నారు . కొందరు తాము ఎలా ఎదుర్కొన్నారో చెప్తున్నారు .  రకరకాల మనుషులు . రకరకాల సమస్యలు ..’ అంటూ ఫోన్ చూస్తూన్న  గాయత్రికి ఎవరో తెలియని కాల్ తీసుకోవాలనిపించలేదు .  పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ మళ్ళీ  మోగుతోంది . ఎవరో మాలతీమాధుర్ పేరు చూపుతోంది ట్రూకాలర్ .  ఇది తాను గమనతో గడిపే సమయం కావడంతో ఒకింత అనాసక్తితోనే కాల్ తీసుకుంది గాయత్రి .
‘నమస్తే మేడం ..
ముందుగా మీకు అభినందనలు .
మీరు చేస్తున్న యుద్ధం చిన్నది కాదు .  ఒకప్పుడు నేనూ ఇలాంటి యుద్ధమే చేశాను . చివరికి విజయం సాధించాను . మీకు మీ అమ్మాయికి న్యాయం జరిగి తీరుతుంది ‘ అవతలి నుండి పాఠం అప్పచెప్పినట్లుగా గడగడా .
‘మీరు ‘ ప్రశ్నార్ధకంగా ఆగింది గాయత్రి
‘ఓ సారీ అండీ .. నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదా ..  నా పేరు మాలతి .  హైదరాబాదు నుండి కాల్ చేస్తున్నాను . ‘
‘చెప్పండి ‘ హైదరాబాద్ పేరువినగానే గాయత్రికి తల్లిదండ్రులు కళ్ళముందు మెదిలారు .   నాన్నకి ఏమాత్రం బాగుండడం లేదు . చెల్లి దగ్గర హైదరాబాదులోనే ఉన్నారు. ఆయనకి నీ మీద బెంగ..ఒకసారి వీలయితే వచ్చిపోరాదు . ఉదయం ఫోన్లో చెల్లి చెప్పిన విషయం మదిలో మెదిలింది.
అవతలినుండి ‘మేడం మీ అమ్మాయి పాస్పోర్ట్ కోసం ఎంత స్ట్రగుల్ చేస్తున్నారో ఇప్పుడే చేంజ్ . ఆర్గ్ ద్వారా తెలిసింది .  నా సంపూర్ణ మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది .  ఆ .. చెప్పలేదు కదూ .. నేనూ సింగల్ పేరెంట్ నే .. మా అబ్బాయికి స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ లో తండ్రిపేరు లేకుండా ఎక్సమ్ రాయనివ్వనంటే  కోర్టుకు వెళ్ళా .. నిజానికి వాడు పుట్టిన కొంత కాలానికి నాతో కలసి నడుస్తూస్తానని బాస చేసిన వాడు తన దారి తాను చూసుకున్నాడు .  సహజీవనంలో ఉండాల్సింది ఒకరంటే ఒకరికి ప్రేమ , నమ్మకం , సడలని విశ్వాసం . అవేవి లేని అతను నన్ను మోసం చేస్తున్నాడని అప్పట్లో గ్రహించలేకపోయాను . అతని ప్రేమంతా నా వెనుక ఉన్న ఆస్తి , అంతస్తు అని అతని ద్వారానే తెలిసిన మరుక్షణం అతన్ని క్షమించలేకపోయాను.  అది మా అమ్మానాన్నలకు నచ్చకపోయినా  స్వతంత్ర జీవితమే ఎంచుకున్నాను… ‘
అవతలనుండి వింటున్నారోలేదో సందేహం వచ్చి ‘ సారీ మేడం .. మిమ్మల్ని విసిగిస్తున్నానేమో ..’ సందేహిస్తూ మాలతి
‘ఫర్వాలేదులెండి .. అసలు సమస్యని ఎలా అధిగమించారో చెప్పనే లేదు ‘  అంటూ తరగాల్సిన కూరగాయలు తీసి ముందు పెట్టుకుంది గాయత్రి . అంతకు ముందు లేని ఉత్సాహం గాయత్రి గొంతులో .
‘ఆ అక్కడికే .. గడచిన కాలంలోకే వస్తున్నానండీ .. మా అబ్బాయి స్కూల్ లో మొదట నా పేరు రాయడానికి ఒప్పుకోలేదు . అతనికి తల్లీ  తండ్రీ నేనే అని వాదించిన మీదట నా పేరు రాశారు తండ్రిపేరు లేకుండా . మా వాడు 10కి వచ్చాడు . బోర్డు ఎక్సమ్ కి ఫీ కట్టాం . అప్లికేషన్ లో తండ్రి పేరు తప్పని సరి లేదంటే పరీక్షలు రాయడం కుదరదు అన్నారు .  మా వాడు చాలా టెన్స్ అయ్యాడు పరీక్ష రాయగలనో లేదోనని .  వాడి పరీక్షఫీజు కట్టేవరకూ వచ్చిన పరిస్థితులతో యుద్ధం చేశాను.

‘ఓ రియల్లీ యూ డిడ్ ఏ  గ్రేట్ జాబ్ , కంగ్రాట్యులేషన్ ‘ మనస్ఫూర్తిగా అభినందించింది గాయత్రి

కూరగాయలు తరుగుతూ మొబైల్ లో మాట్లాడుతున్న తల్లినే పరీక్షగా గమనిస్తోంది గమన కారప్పూస ఒక్కోపలుకు నోట్లో వేసుకుంటూ .

నాన్నలాగే అమ్మ కూడా  నన్ను వద్దనుకుంటే .. ? ఈ మధ్య తరచూ పొడుచుకొచ్చే ప్రశ్న  ఊహ మాత్రంగా  ఓ క్షణం మెదిలి మాయమైంది . ఏ చుక్కలూ లేని ఒంటరి ఆకాశంలా ..రాలిపోయిన పువ్వులా ..   ఏ ఆర్ఫనేజ్ లోనో , రోడ్డుపై అడుక్కుంటూనో … ఛ ..ఛా .. ఇలా ఆలోచించకూడదు.  అమ్మ ఎంత త్యాగం చేసింది. నా బతుకులో రాగాలు పలికించడం కోసం కరిగిపోయే కాలంలో తానూ కరిగిపోతూనే ఉంది .  నేనే లోకంగా బతుకుతోంది .   అమ్మ బాధ్యతలు , నాన్న బాధ్యతలతో పాటు ఇద్దరి ప్రేమ ఆప్యాయత అన్నీ కలిపి  అందిస్తోంది.  ఆ మాటే అంటే ఒప్పుకోదు అమ్మ .
ఎన్ని కష్టాలు , ఇబ్బందులు , సమస్యలు సవాళ్ళు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటోంది .  ఆమె డీలాపడిపోవడం, ఏడుస్తూ కూర్చోవడం, ఇతరులపై ఆధారపడడం  ఎప్పుడూ చూడలేదు.   అమ్మే నాకు  నాన్న.  నాకుమంచి స్నేహితురాలు కూడా అమ్మే .. ఆ మాటే అమ్మతో అంటే .. నువ్వేరా చిట్టితల్లీ నా ఆప్త మిత్రురాలివి అంటుంది .  నాలుగైదేళ్లుగా ఇద్దరి మధ్యా అన్నివిషయాలూ పంచుకోవడం చర్చించుకోవడం మరింత పెరిగింది .  ఇక పాస్పోర్ట్ సమస్య వచ్చిన దగ్గర నుండీ మరీ ఎక్కువయింది అని తలపోస్తున్న గమన తల్లివైపు ఆరాధనా పూర్వకంగా చూసింది . తల్లి అవతలి వారితో మాట్లాడే మాటలు కొన్ని  చెవిలో పడుతున్నాయి .
సింగల్ పేరెంట్ చైల్డ్ గా పిల్లలు ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందో తనకు అనుభవమేగా .  ఆవిడ తన భర్తని వద్దనుకుంది. అతనూ వద్దనుకున్నాడు .  కానీ ఆ బిడ్డడికి తండ్రి ప్రేమ , పేరూ రెండూ కావాలనుకుంటే ..? గమనంలో సందేహం .
తన విషయం అలా కాదే .. అమ్మ తన భర్తను వద్దనుకోలేదు . కావాలని వదులుకోనూలేదు .  ఆడపిల్ల పుట్టిందన్న ఏకైక కారణంతో అతనే తప్పుకున్నాడు .  ఎంత వివక్ష ? ఆనాటినుండీ ఈనాటివరకూ  ఏనాడన్నా ఇటు తొంగి చూశాడా .. లేదే .. చచ్చామో బతికామో కూడా అతనికి తెలియదు .  ఇదే నగరంలో మంచి స్థాయి ఉద్యోగి అని మాత్రమే తనకి తెల్సు.  లీగల్ గా  వెళ్తే మీ అమ్మకి , నీకు ఎంతో కొంత ఇవ్వకపోడు మీ నాన్న . నిజానికతను మంచివాడే .  ఎవరికైనా ప్రాణభీతి ఉంటుంది కదా .. అందుకే మిమ్మల్ని కాదనుకున్నాడు.  మీ అమ్మకి ఇంత కష్టపడే పని ఉండదు అంటూ అమ్మకి  నచ్చచెప్పమని ఫోన్ చేసినప్పుడల్లా నాతో నస పెడుతుంది అమ్మమ్మ .  అతన్ని మీ నాన్న అని అమ్మమ్మే కాదు ఎవరన్నా నాకు ఒళ్ళు మండిపోతుంది .
నేను అమ్మని గౌరవిస్తాను . వద్దని పోయిన వాడి సొమ్ము తానొద్దనుకుంది అమ్మ .  అదే నామాట అని చెప్తే  ఇదెక్కడి పిచ్చి మాలోకం అని గోలపెడుతుంది అమ్మమ్మ .
ఎక్కడో పెళ్ళిలో చూసి అమ్మ కుటుంబస్థాయి వేరైనా  ఏరికోరి పెళ్లి చేసుకుని  డెలివరీకి పుట్టింటికి పంపకుండా తన దగ్గరే ఉంచుకున్నాడట అతను.  ఊళ్ళో వైద్య సదుపాయాలు అంతంతమాత్రమని అమ్మమ్మ తాతయ్య వాళ్లనే తమదగ్గరికి పిలిపించాడట.  అంతా అమ్మపై ప్రేమ.   పుట్టబోయే బిడ్డ పై అప్పుడే ఎంత మమకారమో అనుకున్నారట . అమ్మ అదృష్టానికి పొంగిపోయారట .  కానీ ..  ఏం జరిగింది ? నేను పుట్టిన ఘడియలు బాగోలేదని నన్ను చూడొద్దని అతనికి వాళ్ళమ్మ  చెప్పిందట .  నా జాతకం జ్యోతిష్కుడి దగ్గర చూపించిందట . గడ్డం దగ్గర రూపాయి బిళ్ళంత నల్లటి మచ్చతో పుట్టిన బిడ్డ తండ్రికి ప్రాణగండమని జ్యోతిష్కుడు చెప్పాడట.  హాస్పిటల్ బిల్ కట్టాడు కానీ మా మొహమే చూడలేదట. అమ్మ పరిస్థితికి  తాత భోరున ఏడ్చి ఊరికి వచ్చెయ్యమంటే అమ్మే వెళ్లలేదట. అతను  మనసు మార్చుకుని వస్తాడన్న ఆశతో కొంతకాలం ఎదురు చూసింది అమ్మ . ఆ ఆశతోనే బతికింది.
అమ్మా తాతయ్య వాళ్ళతో వెళ్లి ఉండాల్సింది కదా అని చాలాసార్లు అడిగింది . అప్పుడు రాని సమాధానం ఇప్పుడు వచ్చింది ఆమె సంభాషణ ద్వారా .. అమ్మని ఇంటికి తమతో తీసుకువెళ్తే ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ల భారం నెత్తిపై ఉంది . దానికి తోడు ఈ తల్లీకూతుళ్లను తీసుకుపోతే ఇంకా పెరిగే ఇబ్బందులగురించి అమ్మమ్మ తాతయ్య మాటలు విన్న అమ్మ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకొంటూ తనబతుకు తను బతికింది.
అందరి సానుభూతి భరించడం కష్టం అనుకున్న అమ్మ ఊళ్ళోని సామాజిక పరిస్థితుల్లో ఇమడలేననుకుంది .  ఒంటరిగా బతకడం అలవాటు చేసుకుంది.  గుప్పెడు మనసులో చప్పుడు  లేకుండా ఆలోచనలు, అనుభూతులు దాచిపెట్టుకుంది .   సరదాగా నేర్చుకున్న యోగ , కూచిపూడి నాట్యం వృత్తిగా మార్చుకుంది.  తన కాళ్లపై తాను నిలదొక్కుకుంది .  కానీ మానసికంగా శారీరకంగా ఎంతో నలిగిపోయింది. ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది .  తన బిడ్డకు తను తప్ప ఎవరూ లేరు . తాను మాములుగా ఉండాలి . తన బాధలేవీ తెలియకుండా పెంచాలనుకునేది.  ఏలోటూ రానివ్వకూడదని కష్టపడేది .  నాకు తెలిసినదగ్గరనుండీ గమనిస్తూనే ఉన్నా .. అమ్మకి సామాజిక జీవనం, పెళ్లిళ్లు పేరంటాలు దాదాపు లేనట్లే.  ఎటు వెళ్లాలన్నా ఆర్ధిక సమస్యలకుతోడు సవాలక్ష ప్రశ్నలకు జవాబు చెప్పలేనితనం అని అమ్మతో సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ అర్ధమవుతోందని మదిలోనే తలపోసింది గమన .  ఆమె ఆలోచనలను భంగపరుస్తూ
‘జాతి భద్రత కోసం పాస్పోర్ట్ లో తండ్రి పేరు అవసరమంటాడా పోలీసాఫీసర్ .. హు .. తండ్రి పేరుకీ దేశభద్రతకీ సంబంధం ఉందా ..?’ తల్లి అంటున్న మాటలు చెవినపడ్డాయి.
ఆడపిల్ల పుట్టుకకు కారణమైన తండ్రి ఆమెను వదిలించుకుంటే .. దేశాన్ని రక్షించాల్సిన పోలీస్ తండ్రి పేరుతోనే దేశ భద్రత అంటున్నారు .. అసలు వీళ్ళమెదడులో ఏముంది ? పెండముద్దా .. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడతారు . తాము ఏమి చేసినా మాట్లాడినా చెల్లిపోతుందనుకుంటారా .. చెలరేగుతున్న అనేకానేక ప్రశ్నలను అదుపుచేస్తూ గమన చెవిలో తల్లి మాటలు
‘అప్పుడు తెలియక అతన్ని రోడ్డుపైకి ఈడ్చలేదు .. ఆతను లేకుండా నా బిడ్డను నేను పెంచుకుంటాననే మొండి పట్టుదల, మా అమ్మానాన్నలకు నేనూ నా బిడ్డ భారం కాకూడదు అనే భావన తప్ప ఏమీ తెలియదానాడు . సమాజం నుండీ వచ్చే సవాళ్ల గురించీ ఆలోచించలేదు .  నన్నూ నా  బిడ్డనీ వద్దనుకున్నాడని అర్ధమయినప్పుడు గుండెలవిసేలా ఏడ్చాను. పల్లెటూరునుండి వచ్చిన అమాయకత్వం ఆనాటిది.  అదే ఇప్పుడయితే ఏ విధంగా ఉండేదాన్నో ..
మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ మొగుడువదిలేసిన కూతుర్ని తమతో తీసుకుపోయి దగ్గర ఉంచుకోవడానికి అమ్మానాన్నలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్ధమయిన తర్వాత, ఈ జీవితం నాది.  నా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా నేను నేనుగా బతకడానికి నన్ను నేను సన్నద్ధం చేసుకున్నాను.  సమూహంలోంచి నాలోకి నేను ఒదిగిపోయి బతికాను .   సమాజం మనం ఎలా ఉండాలో చెప్తుంది కానీ .. మనం ఎలా ఉంటే అలా స్వీకరించదు  ఎందుకో .. ‘  మనసు మడతలను విప్పుతూ స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి నూనె పోస్తూన్న  గాయత్రి .
ముక్కూమొహం తెలియని వాళ్లిద్దరూ చిరకాల మిత్రుల్లాగా మాట్లాడుకోవడం చూస్తే గమనకి ఆశ్చర్యంగా ఉంది .  తన స్టూడెంట్స్ తాలూకు పేరెంట్స్ వచ్చినా చాలా తక్కువగా .. అవసరానికి మించి ఒక్కమాట మాట్లాడని అమ్మ  ఈ రోజు మొదటిసారి మనిషినైనా చూడకుండా పెదాల మధ్యన దాచిన మౌనాన్ని ఛేదించుకొని మాటలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆమె మనసు లోతుల్లో దాగిన విషయాల్ని పరుస్తోంది.   నా పాస్పోర్ట్ సమస్య మొదలయినప్పటి నుండి అమ్మలో చాలా మార్పు . తానెన్నడూ ఊహించని మార్పు.
ఆ  నడకలో , మాటలో , చేతల్లో .. ధీరత్వం .. ఆత్మవిశ్వాసం ప్రస్ఫూటంగా కనిపిస్తన్నాయి .  మళ్ళీ అమ్మ సమూహంలోకి . నిశ్శబ్దపు కౌగిలిలోంచి బయటికి చీకటి చిక్కుముడుల దారులు విప్పుకుంటూ .. కాలం గీసిన చిత్రం ఎంత విచిత్రం .. తల్లిగురించే ఆలోచిస్తూ గమన

తననే తదేకంగా చూస్తున్న గమనని గమనిస్తూనే ఉంది గాయత్రి . తరిగిన కూరగాయలు పొయ్యిమీద వేసి,  చపాతీ పిండి కలుపుతూ మాట్లాడుతూనే ఉంది .

‘తండ్రి ఎవరో తల్లి చెప్తేనే బిడ్డకి తెలిసేది . కానీ తల్లిని బిడ్డకి ఎవరూ పరిచయం చేయనవసరం లేదే .. హాస్పిటల్ వారు బిడ్డ పుట్టగానే ఇచ్చే సర్టిఫికెట్ లోనూ తాను బిడ్డను కన్నట్లే ఇచ్చారు  కదా .. అతను కనలేదు , పెంచలేదు . కనీసం మొహం చూడలేదు . అలాంటప్పుడు తల్లిపేరు తప్పని సరి కావాలి కానీ తండ్రి పేరు కాదు కదా .. తల్లిపేరు పెట్టుకోవడం నా జన్మ హక్కు . నా పుట్టుకకు కారకుడయ్యాడేమో కానీ నేను నా తండ్రి అని చెప్పుకునే అర్హత అతనికి లేదు .
కూతురుగా నన్ను ఎప్పుడో వదిలేసిన ఆ తండ్రి పేరు ఉంచుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవలిసింది నేను కానీ వాళ్ళు కాదు . ఏంటో ఈ సమాజంలో .. మనకోసం మనం ఏర్పరచుకున్న చట్టాలు మనం మార్చుకోలేమా .. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పుతేలేరా ..?  అంటూ నా కూతురు వేసిన  ప్రశ్నలే  నాలో కొత్త చైతన్యాన్ని రగిలించింది .
నా చిట్టితల్లి అప్పుడే ఇంత పెద్దయిపోయిందో.. ఎంతబాగా ఆలోచిస్తోందో ..
నాకెప్పుడూ అలాంటి ఆలోచనే రాలేదెందుకు ?  నిండా 15 ఏళ్ళు లేని దీనికి ఎంత చక్కని విశ్లేషణ?  అని దాని మాటలు వింటూ ఆశ్చర్యపోతూనే ఉంటాను. పుస్తకాల పురుగులా ఎప్పుడూ చదువుతూ ఉంటుందిగా .. అందుకే ఇంత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుందేమో అనిపిస్తుంది ‘ కూతురి గురించి గర్వంతో ఉప్పొంగిన స్వరంతో గాయత్రి .
‘నిజమేనండీ .. ఎప్పుడైనా ఎక్కడైనా తల్లి పేరు తప్పని సరి కావాలి కానీ తండ్రిపేరు కాకూడదు కదా .. అద్భుతంగా చెప్పింది  మీ అమ్మాయి . ‘ ఏం చదువుతోంది అవతలి నుండి  మాలతిమాధూర్ ప్రశ్న ..
అదేమీ వినిపించుకోని గాయత్రి ‘ ఒకప్పుడెప్పుడో పిల్లల్ని తల్లి పేరుతోనే గుర్తుపట్టేవారని చరిత్రలో చిన్నప్పుడు చదివిన గుర్తు’  జ్ఞాపకాల జాడల్లోకి వెళ్ళబోతున్న గాయత్రి మాటల  మధ్యలోనే అందుకున్న మాలతీ నవ్వుతూ
‘గౌతమీపుత్ర శాతకర్ణి .. ‘
‘హా.హ్హ ..
ఆ కాలంలోలాగా తల్లిపేరుతోనే గుర్తింపు కావాలని నేను కోరుకోవడం లేదు. కానీ, తండ్రిపేరు లేని కారణంగా నా కూతురు  పాస్పోర్ట్ పొందే హక్కుని కోల్పోవడమే ముల్లులా గుచ్చుకుంటోంది . ఒంటరిగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా కలగని దుఃఖం ఇప్పుడు గుండెనిండా ..
తండ్రి పేరు రాయలేదని పోలీస్ క్లీరెన్సు ఇవ్వరట ..
ఆ బిడ్డపుట్టుకకకు ఎవడో ఒకడు కారణమై ఉంటాడుగా వాడి పేరు రాస్తే పోతుందని , ఏదో ఒక పేరు రాస్తే పోలా .. అనీ ఉచిత సలహాలు .
అలా ఎందుకు రాసుకోవాలి?   నా జీవితంలో లేనివాడి లేనిపోని బరువుని నేను మోయలేను అంటూ  నా కూతురు నుండి ఛేదించుకు వచ్చే ప్రశ్నలు..
అక్కడికీ పోలీస్ ఆఫీసర్ నీ , పాస్పోర్ట్ ఆఫీసర్ని కలిసి నా పరిస్థితి వివరించా. ఆర్థికంగా , సామాజికంగా , మానసికంగా ఎన్ని ఇబ్బందులు , సమస్యలూ వచ్చినప్పటికీ  కూతురిని నేనెలా పెంచుకొచ్చిందీ తెలుపుతూ  అఫిడవిట్ సబ్మిట్ చేశాను.  ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న నా బిడ్డని గౌరవించకపోయినా  తండ్రిపేరు కోసం వత్తిడి తేవద్దని ప్రాధేయపడ్డాను.
అది తెలిసిన నా కూతురుకి చాలా కష్టం కలిగించింది .  నాకు పాస్పోర్ట్ లేకపోయినా ఫర్వాలేదు .  నువ్వుమాత్రం ఎవ్వరినీ ప్రాధేయపడొద్దని గట్టిగా చెప్పింది .
పాస్పోర్ట్ పొందడం  నా జన్మ హక్కు . ఎన్నాళ్లీ హింస ఉండేది?  ఆకు రాల్చిన చెట్టు చిగురించక పోదు . అట్లాగే మన జీవితాలూ ..  ఈ రోజు కాకపోతే రేపు .. రేపు కాకపొతే మరోరోజు ..
ఇవ్వకుండా ఎక్కడికి పోతారు .. ఆ రోజు వస్తుంది .  న్యాయ బద్దంగా ఎందుకు ఇవ్వరో మనమూ చూద్దాం . మార్గాలు దొరక్కపోవు . ఈ సారి కాకపొతే మరో సారి నాకు అవకాశాలు రాకపోవు. మనం ఎవ్వరినీ ప్రాధేయపడాల్సిన అవసరం లేదంటుంది.  నేను ఇబ్బంది పడిపోతున్నాని అది దాని అవకాశాలు వదులుకోవడానికి సిద్దమైపోయింది…  ‘  గాయత్రి తనలో మూటకట్టుకున్న బరువును తేలికపరుచుకుంటూ .
పిల్లల్ని దత్తత తీసుకుంటే .. IVF మరో పద్దతిలో పిల్లల్ని కంటే ..  వాళ్ళకి తండ్రి ఎవరని చెప్తారో .. మన చట్టాలకు కళ్ళు చెవులే కానీ బుర్ర ఉండదా ..?  ప్రతి పౌరుని హక్కుని గౌరవించాల్సిన పనిలేదా ? సింగల్ పేరెంట్ గా ఉన్న తండ్రిని అడగాలి తల్లి ఎవరని ?   ఇడియట్స్ … అన్ని చోట్లా తండ్రి పేరు లేదా భర్త పేరు .. మరి భర్తని భార్య పేరు అడగరెందుకో ..? పాస్పోర్ట్ కోసమే కాదు ఎక్కడైనా ఎప్పుడైనా ముందు ఉండాల్సింది అమ్మ పేరు…  గమన ఆలోచనలకు అప్పుడప్పుడూ  అడ్డుకట్టవేస్తూ తల్లి మాటలు చెవిలో పడుతున్నాయి
తనదగ్గర డాన్స్ నేర్చుకునే అమ్మాయి తల్లి సలహామేరకు చేంజ్ . ఆర్గ్ లో పిటిషన్ వేసింది .  పాస్స్పోర్టులో సింగల్ పేరెంట్ పేరు ఉన్నా సరిపోయేలాగా మార్పులు తేవాల్సిన అవసరం గురించి . అందుకు సహాయం కోరుతూ ప్రధానమంత్రితోపాటు , స్త్రీ శిశు సంక్షేమ శాఖామంత్రి , హోం వ్యవహారాలమంత్రి , విదేశాంగ మంత్రి లకు అర్జీ పెట్టుకుంది .
మూడోరోజుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి నుండి మెయిల్ ..  అర్జీ ని  సపపోర్ట్ చేస్తూ ..
చీకటి రెక్కలు విరుస్తూ వెలుతురు మెట్లు ఎక్కుతున్న అమ్మది సాహసవంతమైన జీవితం. ఈ తల్లికి బిడ్డనయినందుకు గర్వంగా ఫీలయింది గమన .  ఆ వెంటనే తన మిత్రురాలు స్వాతి వాళ్ళమ్మ గమన కళ్ళముందు మెదిలింది. ఆమెను స్వాతితో సహా వాళ్ళింట్లో అందరూ కరివేపాకులా తీసిపడేస్తారు. పెదవి విప్పని దుఃఖాన్ని మోస్తూ ఏ క్షణమైనా వర్షించే మేఘాన్ని తలుపుకు తెస్తుందావిడ.   మళ్ళీ ఆమెలేకుండా వాళ్లకి ఒక్క క్షణం గడవదు.  అమ్మని దేవతతో పోలుస్తుంటారు కదా .. మరి ఆ అమ్మకి విలువేమీ ఇవ్వరు  ఎందుకో ..?  అసలే అర్ధం కాదు అనుకుంటూ లేచి టీవీ పైనున్న రిమోట్ అందుకుంది గమన .
స్క్రోల్ అవుతున్న వార్తలు చూసి ‘అమ్మా .. ఇటుచూడు ‘ సంతోషంతో  గట్టిగా అరిచింది
ఏమిటన్నట్లుగా ఫోన్ మాట్లాడుతూనే చేస్తున్న పనిని ఆపి టీవీ కేసి దృష్టి సారించింది గాయత్రి .
ఒంటరి తల్లి ఆవేదనతో పాస్పోర్ట్ నిబంధనల్లో మార్పులు.  ఇకనుండి తల్లిదండ్రుల పేర్లలో ఎవరో ఒకరి పేరు రాసినా సరిపోతుంది…  న్యూస్ కొనసాగుతోంది .
కరిమబ్బును సవాలు చేసే ఈ నక్షత్రం ఒంటరి కాదు.  ఎన్నో నక్షత్రాలు ఆమె చుట్టూ  ఓ గేలక్సీలా .. చంద్రకాంతుల మెరుపులతో కాంతులీనుతున్న అమ్మ మొహంలోకి  తదేకంగా చూస్తూ  ఆమె నుండి స్ఫూర్తి పొందుతూ , ఆరాధనాపూర్వకంగా చూస్తోంది గమన .
వి . శాంతి ప్రబోధ
Story Published in Bhumika March 2017

చాట్ బాక్స్ ల్లో చెత్త రాతల కుక్కమూతి పిందెలు  తెంపలేమా ..  

మనం ఎటువంటి సమాజంలో నివసిస్తున్నాం  ? హత్యచేస్తామనో , రేప్ చేస్తామనో , యాసిడ్ పోస్తామనో బెదిరింపులతో  ఆడపిల్లలని , మహిళలని మానసిక హింసకు గురిచేస్తోంటే ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు ?  ఎవరు అటువంటి బెదిరింపులకు  పాల్పడుతున్నారో గుర్తించి వారిపై తగిన చర్యలు  ఎందుకు తీసుకోవడంలేదు ? ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి . అందుకు  బాధ్యులు ఎవరు ?  ఆడపిల్లలా .. వారిని కన్నతల్లిదండ్రులా .. విద్యాబుద్ధులు నేర్పే గురువులా .. సమాజమా … ?

ఆడపిల్లల్ని , మహిళల్ని భయభ్రాంతులకు గురయ్యేవిధంగా బెదిరించే వారిని ఏమనాలి ..? మానసికరోగులు  అనాలా .. లేక నేరస్థులు అనాలా ..?  మానసిక రోగులు అయితే వారికి మానసిక వైద్యం అవసరం . నేర మనస్తత్వం ఉన్నవాళ్లయితే వారిలో పరివర్తన చేసే శిక్ష అవసరం. ఆలా కాకుండా చూసీ చూడనట్లు వదిలేస్తే ఏమవుతుంది .. వ్యవస్థ మొత్తం వ్యాధిగ్రస్తమవుతుంది . లేదా నేరాలమయం అవుతుంది .
తరతరాలుగా పితృస్వామ్య మనువాద భావజాలం నరనరాన ఇంకిపోయిన మన సమాజంలో ఇప్పుడు జరుగుతున్నదదే .  ఆధునిక సమాజంలో అందిపుచ్చుకున్న టెక్నాలజీని ఉపయోగించుకుని పబ్లిక్ గా  అమ్మాయిలపై జరిగే దాడులు, బెదిరింపులు  అన్నీ ఇన్నీ కావు .  ముఖ్యంగా ఫేస్బుక్ , ట్విట్టర్ వంటి సోషల్ మీడియా చాట్ బాక్స్ ల్లో దూరి చెత్త కూతలు , రాతలు …
 ట్విట్టర్ ఖాతాలో ఓ అమ్మాయి ఎదుర్కొన్న బెదిరింపుల గురించి ఇప్పుడు చూద్దాం .
ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు . ఒక నేపథ్య గాయని .  పేరు శ్రీపాద చిన్మయి .   నువ్వు మళ్లీ పాడకుండా చేస్తాం . నీ  మొహంపై యాసిడ్ పోస్తాం . నిన్ను రేప్ చేస్తాం వంటి బెదిరింపులు ఎదుర్కొంది.  పబ్లిక్ లైఫ్ లో ఉన్న ఆమెకు ఇటువంటి హింసాత్మకమైన బెదిరింపులు రావడం ఆమెను భయకంపితురాలిని చేసాయి .  ఆ విషయం ట్విట్టర్ కి రిపోర్ట్ చేసింది .  ట్విట్టర్ పట్టించుకోలేదు . అసలు చెవిన పెట్టలేదు .  పోలీసు కేసు అయితే తప్ప మేం ఎటువంటి చర్యా తీసుకోమని స్పష్టం చేసింది .
ఇలాంటప్పుడు చాలామంది మహిళలు మౌనంగా ట్విట్టర్ నుండి బయటకు వచ్చేస్తారు .  కానీ శ్రీపాద చిన్మయి అలా చేయలేదు .  ఈ సంఘటన ఆమెను కుదిపివేసింది . మహిళల పట్ల సమాజపు చూపుని అర్ధంచేసుకునేలా చేసింది . భయకంపితురాల్ని చేసింది .  ఇటువంటి సమస్య పదుగురిలో ఉన్న  తనకి ఎదురయింది .  తన దగ్గర డబ్బుంది . సమయం ఉంది . పదుగురి సప్పోర్ట్ ఉంది తనో సెలబ్రిటీ కాబట్టి  . నేపథ్య గాయకురాలిగా అభిమానుల బలం ఉంది .  మామూలు ఆడపిల్లలకు ఈ సమస్య వస్తే ..  ఆ ఆలోచనే ఆమెను ముందుకు నడిపించింది .  మహిళలపై దాడిచేసే , మానసికంగా గాయపరిచే వారిని వదల కూడదనీ ,  యుద్ధం చేయాల్సిందే నని నిర్ణయించుకుంది .  వెంటనే పోలీసు కంప్లైంట్ చేసింది .  హింసాత్మక బెదిరింపులకు   పాల్పడుతున్న వారిని గుర్తించడంలో అభిమానుల సహకారం తీసుకుంది. ముగ్గురిని పట్టుకొని 10 రోజులు జైలుకు పంపడం జరిగింది .
శ్రీపాద చిన్మయి ఇంతటితో తృప్తిపడితే  చెప్పాల్సిందేమీ లేదు . ఆమె ఇంకాస్త ఆలోచించింది . ట్విటర్ లో ఉన్న సాధారణ మహిళలు  ప్రతిరోజు ఎదురయ్యే ఇటువంటి దాడులను ఎదుర్కోగలరా .. అందుకు వారి ఆర్ధిక, సామాజిక పరిస్థితులు ఎంత వరకు సహకరిస్తాయి అని ఆలోచన చేసింది . మహిళని ముందుకు నడిపిస్తూ వారికి హింస నుండి రక్షణ పొందేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ట్విట్టర్ దేనని అభిప్రాయపడింది .  అదే ట్విట్టర్ కు తెలిపింది .   ట్విట్టర్లో mute  అండ్ block  ఫంక్షన్స్ ఈ మధ్యే తీసుకొచ్చింది . కానీ మహిళలకు వ్యతిరేకంగా హింసాత్మకంగా కూసే వాళ్ళని నిరోధించలేదు .  అలాంటి వారి ఖాతాలు మూసేయలేదు .  2015 లో టెర్రరిస్ట్ లతో లింక్ ఉన్నాయని మూడులక్షల అరవై వేల ఖాతాలను మూసేసింది . అదే విధంగా మహిళలకి భద్రత కల్పిస్తూ పోకిరీలు , పర్వర్ట్ ల ఖాతాలను మూసేయ్యొచ్చుకదా ..అది వారి బాధ్యత కాదా ..? మహిళల వాదన , వారి గొంతు వినిపించుకోవాల్సిన అవసరం ట్విట్టర్ కి లేదా అంటూ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ  కి పిటిషన్ పంపింది శ్రీపాద చిన్మయి . దానికి ప్రజల మద్దతు కోరుతోంది.
కొంతమంది మగవాళ్ళకి మహిళలని బెదిరించడం , అత్యాచారం చేస్తామని అనడం పెద్ద సమస్యగానే కాదు అసలు సమస్యగానే  కనిపించక పోవచ్చు .  హింసలో అత్యంత భయంకరమైన అత్యాచారం వాళ్ళకి సాధారణంగా కనిపించవచ్చు .  సరదాగానూ కనిపించవచ్చు .  ఇటువంటి సంఘటనల పట్ల సమాజం స్పందించాలి .  మహిళలు మౌనం వీడి ముందుకు రావాలి .  రేప్ అవనీయండి , జెండర్ బేస్డ్ హింస అవనీయండి  మహిళల మౌనాన్ని బద్దలు కొట్టాలి .  సోషల్ మీడియాలో ఉన్న మహిళలు ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు , చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మన ఖాతాలను మూసుకోవడం కాదు అలాంటి మానసిక జబ్బు ఉన్నవారినే బయటికి పంపాలి .  వారిని నేరస్థులుగా గుర్తించాలి .  ట్విట్టర్ ఇటువంటి ఖాతాల్ని మూసెయ్యలి . లే కపోతే  మహిళలపై మరింత ఎక్కువ దాడులు చెయ్యడానికి ట్విట్టర్ లాంటి వేదికలుగా చేసుకొని చేలరేగిపోతారు .  అది ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలకి ఆరోగ్యకరం కాదు . అందుకే  ట్విట్టర్ తనను తాను  శుభ్రం చేసుకోని  మహిళల్ని  భద్రంగా ఉండమని మహిళాప్రపంచం కోరుకుంటోంది .  ప్రపంచంలోని నలుమూలల నుండి  మహిళలు, సభ్యసమాజం ట్విట్టర్ వైపు ఆసక్తిగా చూస్తోంది . మహిళల పట్ల ట్విట్టర్ స్పందన ఎలా ఉంటుంది .. విచక్షణతో వ్య్వవహరిస్తారా లేక వివక్ష చూపిస్తారా  వేచి చూడాల్సిందే .   ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం స్పందించాలి . కట్టుదిట్టమైన చట్టాలు  కఠినంగా శిక్షించే రూపొందించి అవి అమలయ్యే  విధంగా చర్యలు తీసుకోవాలి .
మాట్లాడే స్వతంత్రం , స్వేచ్ఛగా భావప్రకటన చేసే హక్కు ఉన్నాయని  మహిళల గురించి తమ ఇష్టం వచ్చినట్లు కూస్తే , రాస్తే తాటతీసే చట్టాలకోసం ప్రయత్నిద్దాం .
వి . శాంతిప్రబోధ
Published in Prajathanatra daily edit page on 31 March 2017

వధ్యశిలపై అడవి బిడ్డలు  

 గుండ్రంగా ఉందన్నట్లు ప్రపంచంలో ఏమూలకు పోయినా ఇదే పరిస్థితా ..? ప్రపంచంలో ఏమూల విలువైన ఖనిజ సంపద, సహజవనరులు  ఉంటే అక్కడ వాలిపోయే కార్పొరేట్ గుత్త్తాధిపత్య సంస్థల ఏలుబడిలోని ప్రభుత్వాల చేతిలో అక్కడి ప్రజలు మాడి మసై పోవలసిందేనా .. ?  మరీ ముఖ్యంగా మూలవాసులు లేదా ఆదివాసులు..?!
మూలవాసులు లేదా ఆదివాసులు లేదా గిరిజనులు మనం ఏ విధంగా పిలుచుకున్నప్పటికీ రానురానూ వారి జీవనం, వారి భూమి  ప్రమాదాల్లోకి వెళ్ళిపోతోంది.  ఆయా తెగల జీవన శైలులు ప్రమాదపుటంచున కొట్టుమిట్టాడుతున్నాయి.  సహజవనరుల వినియోగం కోసం పెట్టుబడి సంస్థలు మూలవాసుల జీవన ప్రదేశాలపై కన్నేశాయి. ప్రభుత్వాలు తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవాలని  ప్రయత్నం చేసే కార్పొరెట్ సంస్థల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయి. నిజానికి సహజవనరుల ఉపయోగం పర్యావరణానికి, అక్కడ ఉండే జనానికే కాదు జీవావరణానికి  ఏమాత్రం హానికలగకుండా ఉండాలి .  అంటే పర్యావరణ అనుమతులు తప్పని సరి.   ఇందుగలడందులేదన్నట్లు .. ఎక్కడ చూసినా అవి నామమాత్రంగానే .. తూతూ మంత్రంగానే ..
ఫలితం .. పర్యావరణంతో పాటు ఆదివాసీల సంస్కృతి వారి సాంఘిక , చారిత్రక చరిత్రలు కూడా వినాశనం తప్పడంలేదు.  మూలవాసుల వైవిధ్య జీవన విధానంలోకి , జీవన ప్రదేశాల్లోకి చొచ్చుకొచ్చే గద్దలు , డేగలు వారిని కబళించేస్తున్నాయి.   వారిని అభివృద్ధి పథకాల కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బలవంతంగా తరలించినప్పుడు సాంస్కృతికంగా , సమాజపరంగా కొత్త చోట ఉన్న సమూహాలతో సమాజాలతో కలిసిపోవడానికి ఎంత ఒత్తిడి ఎదుర్కొవలసి వస్తోందో వారిమాటల్లోనే చూద్దాం .
సెప్టెంబర్ 12వ తేదీ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తరపున 45 రచయిత్రుల బృందం పోలవరం ముంపు , పునరావాస గ్రామాలను సందర్శించడం జరిగింది . ఈ సందర్భంగా మేం పర్యటించిన కొత్త దేవరగొండు , కొత్త రామయ్యపేట , తదితర గ్రామాలలో పిన్నలను పెద్దలను పలకరించడం జరిగింది .

ఉన్న ఊళ్ళో వ్యవసాయము చేసుకునే వాళ్ళము ..  ఆపరాలూ అవీ ఇవీ పండిచ్చుకు తినేవాల్లము  సంతకెళ్తే ఉల్లిపాయలూ .. అప్పుడప్పుడూ  పచ్చి మిరపకాయలూ కొనుక్కునేవాళ్ళం . ఇప్పుడు అన్నీ కొనుక్కోటమేగా .. వాళ్ళిచ్చే వెయ్యి రూపాయిలు దేనికొత్తయ్యి .. ఉప్పు , పప్పు , కూరగాయలు , పుల్లలు అన్నీ కొనుక్కోటమేగా .. కొండకెల్లి పండో .. పచ్చనాకో తెచ్చుకునేవాళ్లం .. ఇప్పుడేదీ .. అన్నిటికీ కరువేగా .. ‘ 

‘అట్టాగని ఇక్కడ పనీ లేదు ఏదోటి చేద్దామంటే .. మాకు భూవి లేదని ఇవ్వలేదు. ఉన్న వాళ్ళకిచ్చినా అది పదిమైళ్ళవతల ఇచ్చారు . ఎట్టా చేసుకునేదీ .. మా రాతలిట్టా ..’  వెంకటమ్మ , 
కొత్తదేవరగొందు

‘ఆ ఎలచ్చన్లప్పుడోత్తారు అదిచ్చేత్తాం పెద్దమ్మా ఇది చేత్తాం పెద్దమ్మా అంటా .. ఈ తడవ రానీ చెప్తా .. నా అసొంటోళ్లేవయి పొవాల్నో అడ్గుతా .. వాళ్ళిచ్చే వెయ్యిరూపాయిలు నా మందులకే సాలట్లా .. ఇక్కడ ఓ ఆకా .. పసారా .. అన్నిటికీ దిక్కుమాలిన మందులేగా .. ” అంది దాదాపు డెబ్బయ్యేళ్లున్న నర్సమ్మ , 
కొత్తదేవరగొందు

‘దూడలూ మేపుకునే వాళ్ళము .. కొండెక్కి అటూ ఇటు తిరిగొచ్చేయి .. కోళ్ళు , మేకలూ అన్నీ అమ్మేసుకుచ్చేసాం. ఏవీ లేకపోతే కొండకొమ్ములు , వెదురు బియ్యం అయినా తెచ్చుకునే వాళ్ళం . ఈడతిని కుకుంటే ఎక్కడనుంచొత్తయి .. వాళ్ళిచ్చిన సొమ్ములు నిండుకున్నాయి ‘

‘సుబ్బరంగా పడగొట్టేశారు సీతాఫలం మొక్కలూ , ఇంతింత లావు మామిడి మొక్కలూ..  అన్నిటిమీదా .. ఇళ్లమీదా మట్టోసేసారు ..మట్టి దిబ్బనాగుందిప్పుడు మా ఊరు ‘  – సింగారమ్మ , కొత్తదేవరగొందు 

 
‘ఏవేవో ఇచ్చేత్తావని నమ్మిచ్చి గొంతుకోశారు.  వచ్చాక అడిగితే సమాధానం లేదు .  ఎవడి దగ్గరకెళ్ళినా ఒక రూపాయి పుట్టట్లేదు .  ఇల్లు మాత్రం ఇచ్చింది .  ఇల్లొకటి ఉంటే సరిపోతదా .. ?ఎంత బాధ .. ఖర్మ .. ఏమ్చేతాం ..? కాలం ఎటు తీసుకుపోతుందో ..  ‘ –   ఓ రైతు , కొత్తరామయ్యపేట  
 
నర్మదానదిపై కట్టిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కింద 1000 ఆదివాసీ గూడేలు జల సమాధి అయితే పోలవరం కింద  3 లక్షల మంది ఆదివాసీల జీవనశైలి, సంస్కృతి  జలసమాధి అవుతున్నాయి .
అదే విధంగా గత జనవరిలో POW తో కలసి కొత్తగూడెం సమీపంలోని మొండి చెలక, బంగారు చెలక వంటి  గిరిజన గ్రామాలకు వెళ్లడం జరిగింది. విమానాశ్రయం కోసం 2500 ఎకరాలలో సర్వే నిర్వహిస్తున్న అధికారులు , పోలీసు బృందంతో అక్కడి మహిళలు మాట్లాడిన మాటలు నన్ను ఆలోచనల్లో పడేశాయి .
ఇది నా పిల్లలు పుట్టిన గడ్డ , నేను పుట్టిన మట్టి , మేమె కాదు నా తల్లిదండ్రులు , వారి తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు .. ఇంకా ముందటి నుండి మేం బతుకుతున్న నేల , గాలి ఇదే .. ఇది మీది కాదు సర్కారుదే అంటే మేమెట్లా ఒప్పుతం ? ఇదే మా గుర్తింపు . మీరిప్పుడొచ్చిన్రు . కానీ మేమెట్లా కాదు .. ఆ …ఈ జల్  జంగల్ , జమీన్ మాది”  అంటూ ఎలాంటి భయం లేకుండా పోలీసు అధికారులను నిలదీసింది ఓ యువతి .
రెండేళ్ల క్రితం అరకులోయలో బాక్సయిట్ నిధుల కొండ గాలికొండకు ప్రరవే నుండీ వెళ్ళాం. అక్కడా అంతే ..
 బ్రిటిష్ వారి కాలం నుండి ఇప్పటివరకూ  మా కొండల్లో నిక్షిప్తమై ఉన్న బాక్సయిట్ నిధుల కోసం ఎంత ఆరాటపడినా మేం ఎదుర్కొంటూనే ఉన్నాం . మమ్మల్ని  మేంకాపాడుకుంటూనే ఉన్నాం.  చేప సముద్రంలోంచి ఒడ్డునేత్తే బతుకుతుందా ..? మేఁవూ అంతే ..‘ అన్నాడో గిరిజన యువకుడు ఆనంద్, అరకు
ఒకనిర్దిష్ఠ ప్రాంతంలో ఉండి అక్కడే అభివృద్ధి చెందిన సంస్కృతి మూల/ఆదివాసులది.  అంటే స్థానికంగా వారు అభివృద్ధి చేసుకున్న సంస్కృతి అన్నమాట.  ప్రపంచంలో ఎక్కడికక్కడ వారి ప్రాంతీయ , సాంస్కృతిక , సామాజిక పరిస్థితులనుండి , చారిత్రక నేపథ్యాలనుండి వారి సంస్కృతులు వెలిశాయి. అవి మానవ జీవన గమనంలో కొన్ని ఉనికిలో ఉంటే మరికొన్ని తమ ఉనికిని కోల్పోయాయి .  నాగరిక సమాజాల్లో ఇమడని తమదైన ప్రత్యేక జీవన సంస్కృతిని కోల్పోని సమూహాలూ , సమాజాలూ నేటికీ ప్రపంచమంతటా ఉన్నాయి. కొండాకోనల సరసన ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి అతి సహజంగా జీవిస్తూ, ప్రకృతితో పాటు తమ సంస్కృతినీ పదిలంగా పదికాలాల పాటు భద్రపరచుకోవాలనుకునే దృష్టి వారిది.  అలా భద్రపరచుకుంటూ వస్తున్న వారినే మన  నాగరిక సమాజం ఆదివాసులు లేదా మూలవాసులు లేదా గిరిజనులు అంటోంది.

ఆయా ప్రాంతాలను బట్టి , భౌగోళికమైన పరిస్థితులను బట్టి మానవజాతుల్లో సాంస్కృతికమైన వైరుధ్యాలు మనకు తెలుసు. అవి అంతర్గతంగా మార్పులు చెందుతూనే ఉంటాయి .    అయితే పెట్టుబడిదారీ గుత్తాధిపత్య సంస్థల కనుసన్నల్లో సాగే ప్రభుత్వాలు , వాటి లక్ష్య సాధన కోసం, లాభాపేక్షకోసం  మూలవాసుల నివాసప్రాంతాలపై దృష్టి పెట్టింది.  తరతరాలుగా సంక్రమించిన నివాసప్రాంతాలు , వారి ఆస్తిపాస్తులు , సంస్కృతి ఆచార వ్యవహారాలు అన్నిటికీ దూరంగా వారిని తరిమేయడం లేదా తరలించడం జరుగుతోంది.  అది పోలవరం  వంటి  ప్రాజెక్టు పేర కావచ్చు , లేదా ఒక వేదాంత , జిందాల్ వంటి  కంపెనీల కోసం కావచ్చు  లేదా విమానాశ్రయం కోసం కావచ్చు . లేదా మరి దేని కోసమైనా కావచ్చు .  అది చత్తిస్ గఢ్ ,,జార్ఖండ్, ఒరిస్సా , పశ్చిమబెంగాల్, ఆంధ్ర, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలు ఏవైనా  కావచ్చు.  లేదా ఒకప్పుడు పూర్తిగా స్థానిక తెగలతో ఉన్న  ఆస్ట్రేలియాలో వజ్రాల గనులు , బంగారు గనులు , బొగ్గుగనుల కోసం   వారిని

 నిర్వాసితుల్ని చేసినా, వారి భూముల్లోనే వారిని కూలీలుగా మార్చినా ,  స్థానికులైన రెడ్ ఇండియన్లను అమెరికాలో మైనింగ్ కోసం నిర్వాసితుల్ని చేసినా పెట్టుబడిదారీ సామ్రాజ్యం నిర్మించుకున్నా  , పెరూ లో  కాపర్ మైనింగ్ కోసం, బంగారు గనుల కోసం  స్థానిక తెగల భూముల్నిఅడ్డదారుల్లో ఆక్రమించినా , దక్షిణాఫ్రికా లో  వజ్రాలవేట సాగించినా సమిధలు అయ్యేది అమాయకులైన స్థానిక తెగలవారే .  ఆయాప్రాంతాల్లో అక్కడి స్థానిక తెగలు తమ భూముల్ని కాపాడుకోవడం కోసం , దాని మీద పట్టుకోల్పోకుండా ఉండడం కోసం ఆ తెగలు చాలా పోరాటాలే చేశాయి . చేస్తూనే ఉన్నాయి .
అదే విధంగా మనదేశంలోనూ సారవంతమైన భూముల్లో ,  ముడి ఇనప ఖనిజం, మైకా , బంగారం ,  బొగ్గు , బాక్సయిట్ , సున్నపురాయి .. వంటి సహజసిద్ధమైన ఖనిజసంపద నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి.  వాటిపై కన్నేసిన శక్తులనుండి తమ భూముల్లోంచి తమని గెంటి వేసి అత్యంత నిరుపేదలుగా మార్చేసే స్థితిని ఇక్కడి మూలవాసులూ ఎదుర్కొంటూనే ఉన్నారు .  అది సింగూరు , నందిగ్రామ్ కావచ్చు . అరకులోయ కావచ్చు , బస్తర్ కావచ్చు , నియంగిరి కావచ్చు , సర్దార్ సరోవరం కావచ్చు , పోలవరం కావచ్చు , పోస్కో కావచ్చు మరోటి మరోటి కావచ్చు .  మూలవాసులకు తమ భూమితో ఉన్న అనుబంధమే ఆ పోరాటాలు వారితో చేయించింది.  గత ప్రభుత్వ హయాంలో వేదాంత బాక్సయిట్ మైనింగ్ కోసం తమ ప్రాంతంలో అడుగుపెట్టకుండా అడ్డుకుని విజయం సాధించారు గిరిజనులు .  అది మానవహక్కుల్ని కాపాడుకోవడంలో వారు సాధించిన గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు.
మనదేశ జనాభాలో 8. 2 శాతం గిరిజనులు ఆక్రమిస్తే జాతి నిర్మాణం కోసం తలపెట్టిన గనులు , ప్రాజెక్టులు, పరిశ్రమలలో  తదితరాలలో ఇల్లూవాకిలి , భూమి , చెట్టు పుట్ట కోల్పోయిన గిరిజనులశాతం 55. 16 % గా 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి .  అది చూస్తే అర్ధమవుతోంది కదా బలిపశువులు అయ్యేది ఎవరో… దేశంలో ఖనిజలవణాలు ఉత్పత్తి చేసే జిల్లాలు  50 ఉంటె అందులో సగం పైగా గిరిజన ప్రాంతాల్లోనే  ఉన్నాయి .  90% బొగ్గు , 50% మిగతా సహజ సిద్దమైన వనరులు వీరు నివసిస్తున్న ప్రాంతోలలోనే ఉన్నాయ్ .
రాష్ట్రాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మొదటి వరుసలో  నిలబెట్టాలంటే కొందరు త్యాగాలు చేయక తప్పదు -రమణ్ సింగ్ , ముఖ్యమంత్రి , చత్తిస్ ఘడ్
అభివృద్ధి అంటే ఆదివాసీలని తుడిచిపెట్టేయడం కాదుగా … ప్రిమిటివ్ ట్రైబల్ చట్టాలను మట్టికలుపుతూ వారి భూముల్ని అక్రమంగా బదలాయించుకోవడమా ?   కొన్నిచోట్ల వారి భూముల్ని వారికే ఇచ్చేస్తాం అని అంటున్నాయి కంపెనీలు, కానీ ఎప్పుడు ? వందల కోట్ల సొమ్ము దండుకున్నాక ఎందుకూ పనికిరాని పిప్పిని వదిలిపోవడమా ..? ఆ కంపెనీ ల్లో ఉద్యోగాలిస్తామని భ్రమలు కల్పిస్తున్నారు ?  ఆదివాసీల్లో ఎంతమందికి ఇప్పటి వరకూ ఉద్యోగాలిచ్చారు ?  ఇచ్చిన పనులు ఏంటి .. ఇచ్చినా  చదువులేదనే చచ్చు కారణం చూపి  దినసరి కూలీ గానే  కదా ..
చదువు చెప్పిస్తామని వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తామని బిల్డింగులు కడుతున్నారు కానీ అక్కడ ఉపాధ్యాయులు , వైద్య సిబ్బంది కరువే . ఇక రవాణా సదుపాయం గురించి చెప్పనవసరం లేదు .  కట్టించిన భవనాలు మావోయిస్టుల ఏరివేత కోసం దిగిన పారా మిలిటరీ వారి ఆధీనంలోనే .. టీచర్ ఉన్న చోట కూడా ఆదివాసీ పిల్లలు బడికి పోలేని స్థితి. ఇక చదువెక్కడనుండి వస్తుంది ?
అసలే పేదలైన ఆదివాసీలు ప్రభుత్వాల  అసంబద్ధ విధానాల వల్ల మరింత పేదలుగా మారుతున్నారు .  ఐరన్ ఓర్ , బొగ్గు , బాక్సయిట్ , సున్నపురాయి .. వంటి ఎంతో విలువైన ఖనిజ  సంపదని దేశం కోల్పోతోంది . సంపద విదేశాలకు తరలి పోతోంది . తమ దేశాల్లో పర్యావరణాన్ని , ప్రకృతిని కాపాడుకునే విదేశీ  కంపెనీలు ఇక్కడమాత్రం మన పర్యావరణాన్ని , మన ప్రకృతినీ , మన జీవితాలని కొల్లగొడుతున్నాయి.  అంతేకాకుండా మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి.   ఇందుకు బాధ్యత ఎవరిదీ ? ఎవరిని నిందించాలి స్వదేశీ ప్రభుత్వాలనా ..? మల్టీనేషనల్ కంపెనీలనా ..?
తమదైన ప్రత్యేక జీవన విధానాన్ని కాపాడుకొంటూ  ప్రకృతిపై, సహజవనరులపై  ఆధారపడి ప్రకృతి సిద్ధంగా జీవించే  ప్రకృతి బిడ్డలు  అడవితో తామున్న సంబంధాన్ని, అనుబంధాన్ని  కొనసాగిస్తూ వందల రకాల పంటలు  పండిస్తారు . వాటితో పాటు స్థానిక అడవుల్లోని  మొక్కలు , జంతువులూ ,  కుటుంబాలూ వారికి కొట్టినపిండి .. అంతులేని వృక్షసంపద , జంతు సంపద కూడా నిర్వాసితులైపోతున్నాయి . మనుగడ కోల్పోతున్నాయి .   తరతరాలుగా వారు పెంపొందించుకున్న జ్ఞానం , ప్రక్రుతితో పెనవేసుకుపోయిన బంధం అక్కడితో అంతమైపోతోంది .   శతాబ్దాల తరబడి వారు రక్షిస్తూ వస్తున్న సహజ సంపద , ప్రకృతి , అటవీసంపద అన్నీ వారితో పాటే విధ్వంసం అవుతున్నాయి.
అభివృద్ధి మంత్రం జపించే ప్రభుత్వాలకు , పాలకులకు మనం రాసుకున్న రాజ్యాంగం మూలవాసులకూ  వర్తిస్తుందని  తెలియదా ..?!  21వ శతాబ్దపు ఫలాలేవీ వారికి అందకపోగా .. ఉన్న జీవితం , వారి జీవన హక్కులు కాలరాసిపోతున్నాయి.  ప్రపంచ పటంలో మానవ హక్కులు ఉల్లంఘిస్తున్న దేశంగా ఖ్యాతి మాత్రం సొంతం చేసుకుంటోంది మనదేశం .
భారతదేశంలో మొదటగా 1774 లో ఈస్ట్ ఇండియా కంపెనీ బొగ్గు తవ్వకంతో మైనింగ్ మొదలయినప్పటికీ 1991లో వచ్చిన నూతన ఆర్ధిక విధానం తర్వాత గ్లోబలీకరణ , ప్రయివేటీకరణ కు తలుపులు బార్లా తెరిచిన తర్వాతే పారిశ్రామికీకరణ, అభివృద్ధి పేరుతో జరిగే తరతరాల  జీవన విధ్వంసానికి బాటలు వేయడం మొదలయిందని చెప్పొచ్చు .   అప్పటి నుండీ ప్రకృతి బిడ్డలకు  వాళ్ళ నేలపై , వాళ్లదైనా జీవన శైలిలో సంచరించే , జీవించే స్వేచ్ఛ వాళ్ళకి లేకుండా పోయింది .  చేసుకున్న చట్టాలకు సవరణలు జరిగాయి .  గిరిజనుల సంక్షేమం కోసం 1996 PESA  చట్టం వచ్చినా , 2006లో వచ్చిన అటవీ చట్టం తెచ్చినా , రాజ్యాంగంలో ని 5, 6వ షెడ్యూల్ ఉన్నా ఆర్టికల్ 46 అన్నిరకాల వివక్ష , దోపిడీ, సామజిక అన్యాయం  నుండి రక్షణ కల్పించాలని చెబుతున్నా ..అడవులపై హక్కు ఆదివాసీలకే ఉందని 2010లో ప్రకటించినా ..   అన్నీ  ఘోరంగా  విఫలమయ్యాయి .    కాబట్టే , రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వాలు ఉండబట్టే  లక్షలాది మూలవాసులు తమ నివాసప్రాంతాలనుండి నిర్ధాక్షిణ్యంగా తరిమివేయబడుతున్నారు .   నిరాశ్రయుల్ని చేస్తున్నారు .  వారికి సరైన పునరావాస సౌకర్యాలు కూడా  కల్పించడంలేదు .
1940లో హైమండార్ఫ్ అనే యూరోపియన్ ఆంథ్రోపోలోజిస్ట్ మొదట  మనదేశపు కొన్ని మూలవాసుల తెగలపై పరిశోధన చేశారు .  ఆ తర్వాత 1970లో కూడా అయన పరిశోధన కొనసాగించారు. స్వాతంత్య్రానికి ముందు స్వాతంత్య్రానంతరం ఆయన చేసిన పరిశోధన తేల్చిందేమంటే వారి జీవన స్థితి గతులు దిగజారిపోయాయని . ఇప్పుడు నూతన ఆర్ధిక విధానాల్లో  అధః పాతాళంలోకి జారాయని చెప్పొచ్చు.
1994లో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ఆదివాసీ హక్కులమీద ముసాయిదా ప్రకటించింది. అందులో ప్రధానంగా స్వయం నిర్ణయక హక్కు , స్వేచ్ఛ హక్కు , మానవహక్కుల సంరక్షణ , ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలు -జీవన విధానం , వేష భాషల రక్షణ , స్వపరిపాలన , విద్య వైద్యం మౌలిక సదుపాయాల హామీ  మొదలయినవి .  వాస్తవంగా అవన్నీ అమలవుతున్నాయా ?
 రాజ్యాంగ స్ఫూర్తికి  విరుద్ధంగా ఆదివాసీలను ప్రాంతాల వారీగా  విడగొట్టి వారి హక్కుల్ని కాలరాస్తూ, వారి ఐక్యతను చిన్నాభిన్నం చేస్తూ ,  అభివృద్ధిపేరిట ఆదిమ జాతులను అంతం చేస్తూ వారి సమాధులపై నిర్మించే అభివృద్ధిని దేశప్రజలు కోరుకోవడంలేదని సర్కారుకు తెలియనిదా..?
ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి పేరిట జరుగుతున్న మైనింగ్ , ప్రాజెక్టులు , పరిశ్రమలకు వ్యతిరేకంగా  విధ్వంసానికి  గురవుతున్న నేటివ్ ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడం కోసం ఆందోళనలు , పోరాటాలు చేయడం జరుగుతూనే ఉంది .   అయితే , జీవన విధ్వంసానికి గురవుతున్న మూలవాసుల పక్షాన అండగా నిలబడిన వారిని దేశద్రోహులుగా పరిగణించడం లేదా చట్టవ్యతిరేక కార్యక్రమాలు నెరపుతున్నారన్న నెపంవేసి అరెస్ట్ చేసి జైళ్లలో కుక్కడం లేదా నక్సలైట్ / మావోయిస్టు  ముద్రవేసి ఎంకౌంటర్ పేరుతొ మట్టుపెట్టడం లేదా మాయం చేయడం  మాత్రం మనదేశంలోనే జరుగుతోంది .
వి . శాంతి ప్రబోధ
Published in Sakshi edit page on  12 Jan 2017.”Abhivruddhaa.. anachivethaa..?”
ప్రరవే , జాతీయ సమన్వయకర్త

కొత్తలోకం చూపిన బ్లాక్ మార్కెట్స్ 

డిసెంబర్ 4వ తేదీ .

నేను బ్లాక్ మార్కెట్స్ కు  వెళ్లినరోజు .

బ్లాక్ మార్కెట్ అంటే నల్ల ధనపు లేదా దొంగడబ్బు మార్కెట్లు అనుకునేరు  .
నల్లవారి మార్కెట్లు .  అయితే  అక్కడ అంతా నల్లవారే కనబడరు .  నల్లవారు అంటారు కానీ వారంతా నలుపు రంగులో ఉండరు . వారి పూర్వికులది నలుపు రంగే కావచ్చు . కానీ ఇప్పుడన్ని రంగుల్లోనూ కనిపిస్తారు . ఎప్పుడైతే వారి  అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడడం మొదలయిందో అప్పటి నుండి వారి రంగూ రూపు  మారడం మొదలయింది .  బ్లాక్ మార్కెట్స్ లోకి వెళ్లేముందు వాళ్ళ చరిత్ర ఏంటో విహంగ వీక్షణం చేద్దాం .

ఒకప్పుడు ఆ భూభాగమంతా వారిదే.  ఏ సమూహానికి ఆ సమూహం వారి పరిసరాలు , భౌగోళికంగా ఉన్న పరిస్థితులు  అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా వారి సంస్కృతి ఆచార వ్యవహారాలు రూపొందించుకున్నారు .  ఆదిమ మానవుడు పుట్టిన దక్షిణాఫ్రికా నుండి  అన్వేషణలో ఆసియా దేశాల మీదుగా 60 మైళ్ళు ప్రయాణించి ఇప్పటి వెస్ట్రన్ ఆస్ట్రేలియా భుభాగం చేరారట . అలా వచ్చిన వీరు  ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని రక్షిస్తూ ప్రకృతితో మమేకమై సహజీవనం చేశారు.
కానీ ఇప్పుడు ఆ భూభాగమంతా వారిది కాదు . వారి జనాభా 3% పడిపోయింది . 50 నుండి  65 వేల (ఆంత్రోపాలజిస్టులు కొందరు 50 వేలని , కొందరు 65 వేల ఏళ్ళని రకరకాలుగా చెప్తున్నారు . ఏదేమైనా 50 వేల ఏళ్ళక్రితమే మానవుడు నిరంతర అన్వేషి అని తెలుపుతూ  మానవుల పుట్టినిల్లయిన ఆఫ్రికా ఖండం నుండి ఖండాంతరాలలోకి మొదట వలసలు ప్రారంభం చేసి  ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి బాటలువేసింది వీరే.
న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని పెన్ రిత్ సమీపంలో 1971 ముందు మట్టిదిబ్బలలో లభ్యమైన   రాతి పనిముట్లు  50 వేల ఏళ్ల  క్రితం ఉన్న మూలవాసులవిగా గుర్తించారు .
 ఆస్ట్రేలియాలోని మూలవాసుల బంధువులే మొట్టమొదటి వాస్తవమైన మానవ అన్వేషులు . మన పూర్వీకులు ప్రపంచమంటే భయపడుతూ ఉన్న సమయంలోనే వీరు అసాధారణంగా సముద్రమార్గంలో ఆసియా వరకు ప్రయాణించారు ” విల్లెర్స్ లేవ్ , కోపెన్ హెగెన్ యూనివర్సిటీ , డెన్మార్క్ కు చెందిన పరిశోధకుని అభిప్రాయం
ఆస్ట్రేలియా , పపువా న్యూ గినియా దీవుల్లో  ల్లో నివసిస్తున్న జనాభా డిఎన్ఏ పరీక్షచేసిన తర్వాత ప్రాచీన మానవుని జీవన యానాన్ని పసిగట్టారు . వారే సముద్రాన్ని దాటిన మొదటి మానవులని విశ్లేషించారు .
వారెవరో కాదు అబోరిజినల్స్ .. అంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ . ఒకప్పుడు 270 నేటివ్ ఆస్ట్రేలియన్ భాషలతో విలసిల్లిన నేలపై ఇప్పుడు 145 మాత్రమే ఉంటే, అందులో 18 భాషలు మాత్రమే వాడకంలో ఉన్నాయి . అంటే కుటుంబంలో అందరూ మాట్లాడేవి . మిగతా భాషలు కొద్దిమంది  ముసలీ ముతకా తప్ప మిగతా కుటుంబ సభ్యులు మాట్లాడరు.  50 వేల ఏళ్ళకి తక్కువ కాని ఘనచరిత్ర కలిగిన మూలవాసుల సంస్కృతి ఆచారవ్యవహారాలు, భాషలు , జ్ఞానసంపద , వనరులు ,వారి జీవనం అన్నీ ఆపదలో ఉన్నాయి . ఆ విషయాన్ని గమనించి తమ తాతముత్తాతలు తిరుగాడిన తావుల్ని , నింగిని , నేలని మాత్రమే కాదు వారి అందించిన అపారజ్ఞానాన్ని, కళలని , నైపుణ్యాలని పదిలపరుచుకోవాలని నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు భావిస్తున్నారు.  అందుకు తగిన కృషి చేస్తున్నారు .
నేను అబోరిజన్స్ ని కలవాలనుకోవడానికి కారణం ఏమిటంటే .. 
అబోరిజినల్స్ ని కలవాలని నేను సిడ్నీ వచ్చిన దగ్గర నుండి అనుకుంటూనే ఉన్నాను .  కారణం , బ్లాక్ టౌన్ హాస్పిటల్ ఉద్యోగాల్లో మిగతా ఆస్ట్రేలియన్స్  లాగే అబోరిజినల్స్ ని కూడా సమానంగా చూస్తామని ప్రత్యేకంగా తెలుపుతూ రాసిన దాన్ని చదివాను .   అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.   అదే  అడిగాను.  మా వాళ్లేమో ,  ఆమ్మో అబోరిజినల్స్ చాలా అగ్రెసివ్ అట అన్నారు.  కొందరు ఆస్ట్రేలియన్లని అడిగితే వాళ్ళు మూలవాసుల గురించి మాట్లాడ్డానికే ఇష్టపడలేదు .   వాళ్ళని హాస్పిటల్ లో , షాపింగ్ మాల్స్ లో, మార్కెట్ ప్రదేశాల్లో , స్టేషన్స్ ఎక్కడబడితే అక్కడ  చాలా చోట్ల చూశాను . వాళ్ళు ఖచ్చితంగా అబోరిజినల్స్ అని చెప్పలేను . మాట్లాడి తెలుసుకునే  అవకాశం లేదు .  మాట్లాడినా మాములు విషయాలు మాట్లాడగలం కానీ వారి పూర్వీకుల గురించి గానీ , మీరు అబోరిజనల్సా అని గానీ సూటిగా  అడగలేం కదా .. అసలు అలా అడగకూడదు కూడాను.  అడిగితే ఇక్కడ చాలా పెద్దతప్పు .  వివక్ష చూపిస్తున్నారని , లేదా వాళ్ళని వేలెత్తి చూపుతున్నారనో మీద కేసు పెట్టినా పెడతారు అన్నారు మావాళ్ళు.    మనదేశంలో లాగా ఇక్కడ అట్రాసిటీస్ ఆక్ట్ ఉందేమో అనుకున్నా .  మనం అడిగేది అర్ధం చేసుకోలేక పోయినా, మనం సరిగ్గా అడగలేక పోయినా ఇబ్బందే అని గమ్మున ఉన్నా.   వారిని మాత్రం పలకరించలేదు కానీ రోజు రోజుకీ వారిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి , తపన పెరిగిపోయింది .
చివరికి  కలవడం కోసం బ్లూ మౌంటెన్స్ దగ్గర ఉన్న అబోరిజినల్ హెరిటేజ్ టూర్ కి వెళ్లిరావాలని అనుకున్నాం .  కానీ అంతలో బ్లాక్ మార్కెట్ గురించి తెలిసింది .  డిసెంబర్ 4 బ్లాక్ మార్కెట్ డే (నల్ల వాళ్ళ లేదా అబోరిజినల్ ).  ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ మార్కెట్ అంటే మన అంగడి లేదా సంత లాంటిది నిర్వహిస్తారు. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో జరుగుతుంది .  ఆయా తెగల ప్రజలు అంతా కలసి ఓ చోట చేరి తమ నైపుణ్యాలని , కళల్ని , జ్ఞానాన్ని , సంస్కృతిని, ఆహారాన్ని , వైవిధ్యభరితమైన జీవితాన్ని  మనకు పరిచయం చేస్తారు . ( మనకు నచ్చిన వాటిని మనం కొనుక్కోవచ్చు ).  విషయం తెలవగానే వాళ్ళని కలవడానికి ఇంతకంటే మంచి అవకాశం నా ఈ పర్యటనలో రాదనుకున్నా .  ఆ రోజు ఎన్నిపనులున్నా వెళ్లాలని నిశ్చయం జరిగిపోయింది .
 2013 నుండి బ్లాక్ మార్కెట్స్ ని నిర్వహిస్తోంది ఫస్ట్ హ్యాండ్ సొల్యూషన్స్ అబోరిజల్స్ కార్పొరేషన్ .  ఆపదలో లేదా రిస్క్ లో ఉన్న యువతని ఆదుకోవడం కోసం ఈ ఫండ్ ఉపయోగిస్తారట .  బోటనీ బే తీరంలోని లే పెరౌస్ లో ఈ సంస్థ కార్యాలయం , మ్యూజియం ఉన్నాయి . దీన్ని అబోరిజినల్స్ బిజినెస్ సెంటర్ అనొచ్చు .  ఇక్కడనుండి బేర్ ఐలాండ్ కి టూర్లు నిర్వహిస్తుంటారు .  అబోరిజినల్ రోల్ మోడల్స్ ని యువతకి పరిచయం చేస్తారు . యువతలో లీడర్ షిప్ పెంచడం , పబ్లిక్ తో మాట్లాడడం వంటి జీవన నైపుణ్యాలు అందిస్తున్నారు.   వాటితోపాటే బ్లాక్ మార్కెట్స్ నిర్వహణ .  మొదట్లో ప్రతినెలా నిర్వహించినప్పటికీ 2015 నుండి ప్రతి మూడునెలలకొకసారి నిర్వహిస్తున్నారు .   ఆయా స్టాల్స్ లో తాయారు చేసిన వస్తువులుకొని అబోరిజినల్ యువతను ప్రోత్సహించమని చెప్తుంది ఆ సంస్థ .
“మా పూర్వీకుల వారసత్వ జ్ఞానం విపత్కర పరిస్థితుల్లో కొట్టుకిట్టాడుతోంది . వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాదే “  అంటాడు ఫస్ట్ హ్యాండ్ సోలుషన్స్ డైరెక్టర్ పీటర్ కూలీ .
ఆధునిక ఆస్ట్రేలియా పుట్టింది లే పెరౌస్ లోనే .  అంటే ఆస్ట్రేలియాని కనుగొన్న  కెప్టెన్ కుక్ 1770లో మొదట అడుగుపెట్టింది ఈనేలపైనే.  ఆ తర్వాతే బ్రిటిష్ వారి కాలనీలు 1788లో వెలిశాయి =. స్థానికులైన ఆస్ట్రేలియన్ల భూముల్ని , వనరుల్ని దురాక్రమించడంతో పాటు వేల ఏళ్ల సంవత్సరాలుగా నివసిస్తున్న వారి జీవనాన్ని , తరతరాలుగా పొందిన జ్ఞానాన్ని, రూపొందిచుకున్న సంస్కృతిని , భాషల్ని, చరిత్రని సర్వనాశనంచేశారు  జాత్యాహంకారులు . తమ నేలపై తాము పరాయివారుగా తిరుగాడుతూ వివక్షతో బతుకీడ్చడం కాదు.  కోల్పోతున్న తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం తమ పూర్వీకులు కొందరు జాత్యహంకారులపై పోరాడారు .  వారి స్పూర్తితో హక్కుల్ని,  సంస్కృతిని పునరుజ్జివింపచేసుకుంటూ తమ వారసత్వసంపదని కాపాడుకుంటూ ఏకీకృతం అవుతున్నారు నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు . అందులో భాగంగా ఏర్పడిందే బ్లాక్ మార్కెట్ ..
పదండి అలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్లి చూసోద్దాం 
మేముండే బ్లాక్ టౌన్ నుండి బారంగారో రిజర్వ్ లో ఉన్న బ్లాక్ మార్కెట్స్కి కారులో వెళ్లడం కంటే ట్రైన్ లో వెళ్లడం మంచిది అనుకున్నాం .( కారులో వెళ్తే పార్కింగ్ వెతుక్కోవాలని ) .  బస్సు , ఫెర్రీ సౌకర్యం కూడా ఉంది .  ఏది ఎక్కినా opeal కార్డు స్వైప్ చేయడమే .  ప్రయాణ సదుపాయం చాలా బాగుంది .   బారంగారో రిజర్వ్ టౌన్ హాల్ కి , సిడ్నీ హార్బరుకి దగ్గరలో ఉంది . వెతుక్కునే పనిలేకుండా సులభంగానే వెళ్లిపోయాం.
ఉదయం 9. 30 కే బ్లాక్ మార్కెట్స్ లో దుకాణాలు తెరిచారు .  హిక్సన్ రోడ్డులోని  బారంగారో రిజర్వు లోని బ్లాక్  మార్కెట్స్  చాలా సందడిగా కనిపిస్తున్నాయి .  చుట్టూ స్టాల్స్ 30 పైగా ఉన్నాయి  మధ్యలో ఉన్న ఖాళీలో  ఇసుకపోసి ఉంది .  అందులో సాంప్రదాయ నృత్యాలు సాగుతున్నాయి . చుట్టూ జనం గుమి గూడి చూస్తున్నారు .  Ngaran Ngaran డాన్స్ ట్రూప్ వారి ఆధ్వర్యంలో ఆ నృత్య ప్రదర్శన జరిగుతోంది.  మైకులోంచి ఆ నృత్య రీతిని వివరిస్తున్నారు .  వారి డాన్సు చూస్తుంటే నాకు ఆదిలాబాద్ గిరిజనులు చేసిన గుస్సాడీ , చత్తిస్గఢ్ గిరిజనుల మోరియా నృత్యాలు గుర్తొచ్చాయి .  ఆహార్యం ఒకేలా లేకపోవచ్చు గానీ కాళ్ళు చేతుల కదలికలు ఒకేలా అనిపించాయి .  వీవర్స్ చేసే నృత్యం , ఫిషింగ్ కమ్యూనిటీ చేసే నృత్యం , వేటాడేవారి నృత్యం ఇలా వారు చేసే పనులను బట్టి వారి నృత్యాలు ఉన్నాయి . ఆ ట్రూపులో ఉన్న చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు . ఆ విషయమే అడిగినప్పుడు-  ఆదిమ కాలంనాటి వారి నృత్యం కనుమరుగై పోతున్న నేపథ్యంలో అది కాపాడుకోవడానికి వారసత్వ సంపదగా ముందు తరాలకు అందించడం కోసం ఇప్పటి తరానికి తమ పూర్వీకుల సనాతన నృత్యాన్ని నేర్పుతున్నామని చెప్పాడు ఆ ట్రూప్ లీడర్ మాక్స్ హారిసన్ .  నాకు వాళ్ళ నృత్య రీతులు చూశాక కలిగిన భావాన్ని వారితో పంచుకున్నప్పుడు ‘ఇండియాకు మాకు కొన్ని పోలికలు ఉంటాయట’ అన్నాడు ట్రే పార్సన్ అనే మరో కళాకారుడు .
ఏ స్టాల్ నుండి చూడ్డం మొదలు పెడదామా అనుకుంటూ  మొదటి స్టాల్ దగ్గరకి వెళ్ళాం .  అక్కడ ఆదిమ జాతుల గురించి సమాచారం చాలా ఉంది . దాంతో ఆసక్తి ఉన్నవారు అబోరిజినల్ కల్చరల్ టూర్ చూసే ఏర్పాటు ఉందని చెప్పారు .  వెంటనే మేమూ మా పేర్లు రిజిస్టర్ చేసుకున్నాం . 11 గంటలకు ఆ టూర్ మొదలయింది .  బారంగారో రిజర్వ్ లో దాదాపు గంటసేపు సాగింది మా టూర్ . ఆదిమకాలంనాటి వీవర్స్ కమ్యూనిటీ కి చెందిన జెస్సికా మాకు గైడ్ గా వచ్చింది . ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ లో పనిచేస్తోంది (సెలవుల్లో తమ జాతి ఉన్నతి కోసం సేవలు అందిస్తూ ఉంటుందట. మరో సందర్భంలో అడిగిన ఓప్రశ్నకు జవాబుగా చెప్పింది ).  ఆవిడతో కలసి మాతో పాటు జపాన్ , చైనా , ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశస్తులతో పాటు కొంతమంది యూరోపియన్ దేశాల వారు కూడా వచ్చారు .
బారంగారో కొండ అంచున నడుస్తూ , ఆగుతూ ఆమె చెప్పిన విషయాలు ఇవే . 1788లో 1100 మంది నేరస్థులు , మరో రొండొందలమంది సిబ్బందితో మొదటి యూరోపియన్ కాలనీ వెలిసిన సమయంలో క్యాంమెరగల్ , కడిగళ్  జాతి బారంగారో లో ఉండేది . ఆ సమయంలో దాదాపు 1500 జనాభా  బోటనీ బే నుండి బ్రోకెన్ బే వరకూ ఉన్న సిడ్నీ తీరప్రాంతంలో చిన్న చిన్న సమూహాలుగా  నివసించేవారని గవర్నర్ ఆర్థర్ ఫిలిప్ అంచనా . పారామట్టా నదిలోనో , సముద్రంలో చెట్టు బెరడుతో చేసిన తెప్పలపై తిరిగి చేపలు పట్టడం , వేటాడడం , వండుకోవడం , తినడం ఇదీ వారి దినచర్య.
యూరోపియన్ సెటిల్మెంట్ తర్వాత కూడా కొంతకాలం అబోరిజినల్స్ కి , వలసవచ్చిన తెల్లవాళ్లకి డార్లింగ్ హార్బర్ సమీపంలో సముద్రపు కాకల్స్ అనే గవ్వలు  , ఆయిస్టర్ లు ప్రధాన వనరుగా ఉండేవి . బ్రిటిష్ కాలనీలతో పాటే వచ్చిన మశూచి చాలామంది మూలవాసుల్ని మింగేసింది . దాంతో వారు తమ నివాసాల్ని శ్వేతజాతీయులకి దూరంగా ఏర్పాటు చేసుకున్నారు .  కాలనీలు పెరిగాయి . 1900 నాటికి సిడ్నీ హార్బర్ నుండి ప్రధాన వ్యాపార కేంద్రంగా మారింది . న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇరవయ్యో శతాబ్దం నుండి ఇరవయ్యో శతాబ్దంలోకి మాత్రమే కాదు ప్రపంచంలోని  అత్యాధునిక నగరాల్లో ఒకటిగా  ఈ ప్రాంతపు రూపురేఖలు మారిపోయాయి .  అభివృద్ధిని మేం కాదనడంలేదు . కానీ మా అస్తిత్వాల్ని, మా వారసత్వ సాంస్కృతిక సంపదను మేం కోల్పోవడానికి సిద్ధంగా లేం. ఇప్పటికే మాకు తీరని నష్టం జరిగింది అని స్పష్టం చేసింది జెస్సికా  ఓ ప్రశ్నకు సమాధానంగా .
బ్రిటిష్ కాలనీలు వెలసిన కొత్తలో “బారంగారో” అనే  చేపలు పట్టే ఓ శక్తివంతమైన మూలవాసీ మహిళ ఉండేది.  ఆమె  తెల్ల జాతీయుడైన అధికారికి ఒకే రోజు  200 వందల చేపలు ఇచ్చిందట. అందుకే అతను ఆ ప్రాంతానికి ఆమె పేరుపెట్టాడట.  మూలజాతుల వారు పెట్టుకున్న పేర్ల స్థానంలో ఇంగ్లీషు వారి ఊరి పేర్లు , పట్టణాల పేర్లు కనిపిస్తాయి .  సిడ్నీ మహానగరం ఉన్న న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం పేరు కూడా యూరోపియన్లు మొదట వచ్చి రాగానే తామున్న ప్రాంతానికి న్యూ సౌత్ వేల్స్ అని పేరు పెట్టారట . అదే విధంగా ఆస్ట్రేలియాలో పేర్లన్నీ మార్చేశారు. కొద్ది తప్ప. బ్రిటిష్ వారితో స్థానిక ఆస్త్రేలియాన్స్ కి ఉన్న సంబంధాలను బట్టి అక్కడక్కడా ఇప్పటికీ అబోరిజినల్స్ పేర్లు కనిపిస్తాయి.   బారంగారో కొండకి ఒక వైపు అంతా నీరు మరో వైపు భూభాగం .  ఆ కొండపై 75,858 రకాల మొక్కలు పెరుగుతున్నాయి . అవన్నీ కూడా సిడ్నీ ప్రాంతంలో పెరిగే మొక్కలూ , చెట్లూ .  అవి బ్రిటిష్ కాలనీలు రాకముందూ – వచ్చిన తర్వాత మా  జాతీయుల చరిత్రలు చెబుతాయి అంటుంది జెస్సికా . అక్కడ  కనిపించే గడ్డిని చూపి దీనితో మా పూర్వీకులు తమ అవసరాలకు కావాల్సిన పాత్రలు , సంచులు , బుట్టలు తాయారు చేసుకునేవారు . ఆ గడ్డి గెలలు వచ్చాక ఆ గెలనుండి వచ్చే నారతో నులక నేసి మంచాలకు చుట్టేవారు.  చెట్టు బెరడు ఎన్నో విధాలుగా వాడేవారు . నార, పీచు , పళ్ళు , ఫలాలు , వాటి గింజలు , దుంపలు ప్రతిదీ తమచుట్టూ ఉన్న అడవినుండి తమ అవసరాలకు మాత్రమే తెచ్చుకునేవారు . చెట్లను నరకడం మా పూర్వీకులకు తెలియదు . వాళ్ళు చెట్టు మొదలు నుండి పైకి  నిలువుగా ఒక గాటు పెట్టి  బెరడు తొలిచేవారు .  ఆ బెరడును చాలా రకాలుగా అవసరాలకు మలుచుకునేవారు . ఎన్నెనో ఔషధమొక్కలున్నాయి  ఈ కొండపై అంటూ మాకు వివరించింది .  తను మాకు చూపిన గడ్డితో చేసిన బాగ్ లోంచి తీసి తమ పూర్వీకులు వాడిన పరికరాలు , వస్తువులు చూపింది .
అదే విధంగా కనిపించే ఆ నీటిలో ఎంతో చరిత్ర సమాధి అయింది .   అనూహ్య వాతావరణ పరిస్థితుల్లో సముద్రపు నీటిమట్టం పెరిగి అప్పుడున్న జనాభాతో పాటు రాతిని తొలిచి చేసుకున్న వారి నివాసాలు , సొరంగ మార్గాలు జల సమాధి అయ్యాయి . ఇక్కడ దొరికే ఈ ఇసుక రాళ్ళూ , నత్తలు , గవ్వలు , చేప పొలుసులు అన్నీ మూలవాసుల ఆనవాళ్ళని , ఆనాటి చరిత్రని పట్టిస్తాయి అని ఎంతో ఉద్వేగంగా చెప్పిందామె .
కొద్దీ దూరంలో అంటే 500 మీటర్ల దూరంలో కనిపిస్తున్న ఆకాశహార్మ్యాలను చూపుతూ అభివృద్ధి దృష్టి ఎప్పుడూ మా స్థలాలపైనే .. అటుచూడండి ఆ కట్టడాలన్నీ అబోరిజినల్స్ స్థలాల్లోనే జరిగేది . మేం గట్టిగా అడ్డుకుంటున్నాం . అయితే మా జనాభా తక్కువ . ఉన్నవాళ్లు కూడా ఎక్కడెక్కడో ఎవరికి వారుగా ఉన్నారు . అందరం సంఘటితమయ్యి మా సమస్యలని ఎదుర్కొంటూ పోరాడడమే కాదు మా హక్కుల్నీ కాపాడుకోవడం కోసం మిగతా వాళ్ళకంటే మేం మరింత కష్టపడాల్సి వస్తోంది  అంటుందా మూలవాసీ మహిళ .
ఒక్క బారంగారో లోనో , సిడ్నీ లోనో , న్యూసౌత్ వేల్స్ లోనో మాత్రమే కాదు దేశమంతా అబోరిజినల్స్ టోర్రెస్ స్ట్రైట్ ఐలాండర్స్ పరిస్థితి ఇదే  అంటూ వివరించింది జెస్సికా . మధ్య మధ్యలో మేం అడిగే ప్రశ్నలకు , సందేహాలకు ఓపిగ్గా జవాబు చెప్పింది . ఇప్పటికీ ఈ దేశంలో మా పట్ల వివక్ష ఉంది . విద్య , ఆరోగ్యం , ఉద్యోగం,  అన్ని చోట్లా వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పింది . అందుకు సంబంధించిన వివరాలు మరోచోట ప్రస్తావిస్తాను .  అదే విధంగా  స్టోలెన్  జనరేషన్స్ గురించి విన్నానన్నపుడు జెస్సికా చాలా ఉద్వేగానికి గురయింది . అవును , ఇప్పటికీ తమ కుటుంబాన్ని కలుసుకోలేని పిల్లలూ , పిల్లల్ని కలవలేని తల్లిదండ్రులు కొల్లలు .  ఇలాంటి మార్కెట్స్లోనో , మీట్స్ లోనో , ఉత్సవాల్లోనో కలిసినప్పుడు తమవారెవరైనా కనిపిస్తారేమోనని వారి  పేర్లను బట్టి బంధుత్వాలు వెతుక్కుంటూ ఉంటారు . (స్టోలెన్ జనరేషన్స్ గురించి మరో సందర్భంలో మాట్లాడుకుందాం . ) అని చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది .
అలా ఓ గంట నడకతో సాగిన ఆ టూర్ అయ్యేసరికి కడుపులో కొద్దిగా ఆకలి మొదలయింది .  మేం ఇంటినుండి తెచ్చుకున్న పదార్ధాలున్నప్పటికీ అక్కడున్న ఫుడ్ స్టాల్స్ వైపు చూశాము .  మూలవాసులు ఏమి తినేవారో ఆ ఆహార పదార్ధాలు అక్కడ కనిపించాయి .  ఈము పక్షి మాంసం , కంగారూ ల మాంసం పుల్లలకు గుచ్చి నిప్పులపై కాల్చి (ఇప్పుడు మనం అనే BBQ ) చేపలు , పీతలు,  వోయిస్టర్ చెరుకు ఆకులాంటి ఓ ఆకులో చుట్టి కాలుస్తున్నారు .  నత్తలు , ఆల్చిప్పలు ఒలిచి అరటి మొక్క పొరల్లాంటి పొరల్లో చుట్టి కొద్దిగా కాల్చి ఇస్తున్నారు .  ఒకరకం నీచు వాసన .  ఉప్పు కారం మసాలా  లాంటివేమీ లేకుండా  ఎలా తినేవారో అలా ..
మేం ఈము మాంసం తో చేసిన స్కీవర్స్ తీసుకున్నాం .
నేటివ్ అబోరిజినల్స్ జీవిత వీర గాథలు చెప్పింది టకీ కూలీ అనే మహిళ.   ఆ తర్వాత ఆ మహిళ పామిస్ట్రీ చెప్తోంది.  ఒక్కక్కరి నుండి $10, 20, 30 తీసుకొంది. తమ హస్త రేఖలను బట్టి , ముఖ కవళికలను బట్టి ఆమె జాతకం చెప్తోంది . చాలా మంది క్యూ లో కనిపించారు.
అద్భుతమైన కళా నైపుణ్యాలు వారివి . రేగు పండ్ల గింజల్లాంటి గింజలతో వారు చేసిన ఓ  ఆభరణం నా మనసుని బాగా ఆకట్టుకుంది. కొందామనుకున్నాను కానీ అది అప్పటికే అమ్మేశానని చెప్పింది నిర్వాహకురాలు .   మా పూర్వీకులు రంగులు వాడేవారు కాదు . మేం వాడుతున్నాం అని చెప్పింది మేరీ . ఆవిడ ఆర్ట్స్ స్టూడెంట్ ననీ బహుశా వచ్చే ఏడాది ఇండియా వస్తానని చెప్పింది . అయితే ఇండియాలో ఏ యూనివర్సిటీ కి వచ్చేది తెలియదట . కల్చరల్ ఎక్స్చేంజి ప్రోగ్రాంలో భాగంగా వస్తానని చెప్పింది . దాదాపు 50 ఏళ్ల వయసులో ఉన్నావిడ ఇప్పుడు ఈ వయస్సులో యూనివర్సిటీ కి వెళ్లి చదువుతున్నందుకు అభినందించాను . ఆవిడ నవ్వుతూ   మేం చదువుల్లోకి వెళ్ళేది చాలా ఆలస్యంగా .  నాన్ అబోరిజినల్స్ కి ఉన్న అవకాశాలు మాకు లేవు . మేం అవతలి వారి నుండి ఎగతాళి ఎదుర్కొంటూ పై చదువులకు రావడం సాహసమే అని చెప్పింది .  అందుకే కాలేజీల్లో ,యూనివర్సిటీ లో మిగతా వాళ్ళకంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ వయసులో పెద్దవాళ్ళయి ఉంటారు అంటూ కొబ్బరి పూసలతో  బ్రేస్ లెట్ తాయారు చేస్తూ  వివరించింది .  ఇంకా ఎదో మాట్లాడ బోతుండగా కస్టమర్స్ రావడంతో బిజీ అయిపొయింది .  వాళ్ళతో చాలా చాలా మాట్లాడాలి . ఎంతో తెలుసుకోవాలన్న ఉత్సాహం నాది . కానీ వాళ్ళకి ఉన్న సమయం ఉదయం 9. 30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే . అంతలోనే తమ వస్తువులు వీలయినంత ఎక్కువ అమ్మి సొమ్ము చేసుకోవాలన్న తాపత్రయం .  అలా వాళ్ళు తాయారు చేసిన హస్త కళలు , ప్రకృతి సహజమైన వస్తువులతో తాయారు చేసిన సబ్బులు , షాంపూలు , పురుగుమందులు , కొన్ని రకాల మందులు  ఒక స్టాల్లోఉంటే మరో స్టాల్ లో కిందరగార్డెన్ స్కూల్ పిల్లలకోసం స్టడీలెర్నింగ్ మెటీరియల్ అతి తక్కువ ధరల్లో .  ఒక స్టాల్ లో పురాతన ఆస్ట్రేలియన్ వాడిన సామగ్రి ,పనిముట్లు ,వాళ్లకు సంబంధించిన ఫోటోలు, ఆర్ట్ , వగైరాలతో పాటు ఆస్ట్రేలియా దేశంలో ఆదిమ మానవుడు నివసించిన రాతి గుహలు , సొరంగాలు , వారి పవిత్ర స్థలాలు, ఆదిమ కాలంనాటి మానవుల శిలాజాలు , జంతువుల శిలాజాలు వంటివన్నీ చూపడానికి ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీల వివరాలు ..  మందమైన నారవంటి బట్టపై ప్రాధమిక రంగులతో వేసిన కళాకృతులు , పెయింటింగ్స్, మనం ఎందుకూ పనికిరావని పడేసే షెల్స్ , సీడ్స్  తో ఎన్నో ఎన్నెన్నో .. కళాకృతులు , ఆభరణాలు . అద్భుతంగా ..
ఒక స్టాల్ లో పురాతన నేటివ్ ఆస్ట్రేలియన్ వాడిన పనిముట్లు, సామాగ్రి, ఇతర వస్తువులతో పాటు వాళ్ళు కప్పుకున్న గొంగళి కనిపించింది . ఆ స్టాల్ నిర్వాహకుడు జోసెఫ్  ఆ గొంగళి గురించి చెప్పాడు . ఆదిమ మానవులు బిడ్డ పుట్టిన తర్వాత కూలమన్  (అంటే దోనె ఆకారంలో ఉన్న చెట్టు బెరడు )లో గొర్రె ఉన్నితోలు వేసి ఆ బిడ్డను పడుకోబెట్టి అదే కప్పేవారట . ఎటన్నా పోయినా అట్లాగే  తీసుకెళ్లేవారట .  అలా బిడ్డ పెరిగిన కొద్దీ ఆ ఉన్ని ముక్కకి మరో ముక్క అతికేవారట . అలా ఆ బిడ్డ పెద్దయ్యేసరికి పెద్ద గొంగళి అయ్యేదట . అలా అతుకులు అతుకులుగా ఉన్న గొంగళి భలే ఉంది . కూలమన్ ను వంట పాత్రగాను , వస్తువులు వేసుకునే పాత్రగాను  ఎన్నోరకాలుగా వాడేవారట .  మహిళలయినా , పురుషులయినా వాళ్ళ చేతిలో చేతికర్ర కన్నా చిన్నదిగా సూదంటు మొనతో ఉన్న కర్ర ఉండేదట . అది వారిని వారు కాపాడుకోవడం కోసం , కందమూలాలు తవ్వుకోవడం కోసం వంటి వివిధ పనులకోసం వాడేవారు . అలా వారి వస్తువులు , పనిముట్లు ఒకటి కంటే ఎక్కువ పనులకోసం ఉపయోగించేవారు .
ఉదయం 9. నుండీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నారతో వివిధ రకాల వస్తువులు , సముద్రంలో దొరికే వివిధ రకాల గవ్వలతో వస్తువులు , అలంకరణ సామాగ్రి తాయారు చేయడం , అదే విధంగా ఆభరణాలు తాయారు చేయడం , పెయింటింగ్స్ , వంటి వర్క్ షాప్స్ కొనసాగాయి .  95 సంవత్సరాల మహిళ ఎంతో ఉత్సాహంతో ఓ స్టాల్ లో కనిపించింది తన కూతురితో పాటు . ఆమె తాను నేర్చుకున్న పూర్వీకుల జ్ఞానాన్ని వారసత్వంగా తరువాతి తరాలకు అందించే ప్రతినిధిగా అక్కడ కనిపించడం అపురూపంగా తోచింది .
ఓ పక్క ఎండ మండుతున్నా వచ్చే జనం పోయే జనంతో కిటకిటలాడాయి బ్లాక్ మార్కెట్స్ .  అక్కడ వారు చాలా షాపింగ్ చేశారు . మేం మాత్రం ఓ కొత్త లోకంలోకి వెళ్ళివచ్చినట్లుగా భావించాం .  మనకు తెలియని మూలవాసుల జీవితాల గురించి ఆలోచిస్తూ తిరుగు ముఖంపట్టాం.
ఆస్ట్రేలియా పర్యటించేవారు ఓపెరా హౌస్ , హార్బర్ బ్రిడ్జి, స్కైటవర్  వంటివి చూడ్డమే కాదు అబోరిజినల్స్ జీవనానికి సంబంధించిన టూర్లు చేయొచ్చు . మూలవాసుల జీవనం గురించి ఎంతో తెలుసుకోవచ్చు .  అదే విధంగా అలలపై తేలియాడే చేపల్ని, నీటిఅడుగున ఉన్న సముద్రపు జీవాల్ని  గురించి తెలుసుకోవచ్చు.  చేపల్ని  వేటాడడం , వివిధ రకాల సముద్ర జీవుల్ని అక్కడే కాల్చుకు తినడం , బూమెరాంగ్ ఎలా విసరాలో నేర్చుకోవడం ,   మంచుయుగం , రాతియుగాల్లోను  జాత్యహంకారులు అడుగుపెట్టక ముందున్న నేటివ్ ఆస్ట్రేలియన్ల జీవనం , టెక్నాలజీ ని , వారి ఆర్ధిక వ్యవస్థని , మార్కెట్ పద్దతులను  తెలుసుకోవడం వంటివన్నీ మనకు కొత్త ఉత్సాహాన్నివ్వడమే కాదు జీవితంపై కొత్త అన్వేషణలకు పునాదులేస్తాయి .
ఆస్ట్రేలియాలో ఏ  మూలకు పోయినా ప్రాచీనచరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను తుడిచేసే ప్రయత్నమే ..  ఎతైన ఆకాశహర్మ్యాలు , స్కై టవర్స్, స్కైవేలు , ఫోర్ వేలు, మైనింగ్ ప్రాజెక్ట్స్ వంటి  మరెన్నో అభివృద్ధి పథకాల  కింద నలిగిపోయిన మూలవాసుల గుండె ఘోష వినిపిస్తూనే ఉంటుంది .  అతి పురాతనమైన చరిత్ర కలిగి కేవలం మూడుశాతం జనాభాగా మిగిలిన మూలవాసులు కోరుకునేదొకటే . అభివృద్ధి భూతం తమని మింగకూడదనే . ఇప్పటివరకూ జరగకూడని విధ్వంసం జరిగిపోయింది . ఇక  జరుగకూడదనే  వారి తపనంతా .   వారే కాదు ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ప్రజలు కోరుకునేది అదే కదా ..
వి . శాంతి ప్రబోధ
Published in Saranga 24 Dec, 2016

Tag Cloud

%d bloggers like this: