The greatest WordPress.com site in all the land!

Archive for January, 2013

మా నా య న మ్మ … నా జ్ఞా ప కా ల్లో ..

మా నా య న మ్మ … నా జ్ఞా ప కా ల్లో ...

పోరాడుతూనే…

నా జీవితమే ఓ పోరాటం
అవును మరి!
నా పుట్టుకే ఓ పోరాటం
పుట్టాక మనుగడ ప్రశ్నార్థకం
ఆ మనుగడకోసం పోరాటం
అన్నలా బడికి పోవాలని ఆరాటం
అందుకోసం మళ్లీ పోరాటం
తమ్ముడికి పెట్టింది నేనూ తినాలన్న ఆరాటం
అక్కడా మరో పోరాటం
జ్వరమొస్తే దవాఖానకు పోవాలన్న ఆరాటం
అందుకూ మళ్లీ పోరాటం
అన్నలా ఉద్యోగం చేయాలనీ నా ఆశయం
అప్పుడూ పోరాటం
పెళ్లి చెయ్యాలని పెద్దల ప్రయత్నం
వాయిదా వేసేందుకు నా పోరాటం
వెంటనే పిల్లలు కావాలని అయన ఆరాటం
ఇప్పుడే వద్దని నా పోరాటం
అమ్మో.. ఆడపిల్లా.. వద్దు వద్దని ఆయన భయం
ఆడపిల్ల ఐతేనేమని ఆ బిడ్డ జీవిక కోసం నా పోరాటం
ఆ.. ఆడపిల్ల మళ్లీ నాలానే..
పోరాడుతూనే..
పోరాటం చేస్తూనే..
ముందుకు సాగుతూనే..
సమానత్వం కోసం ఆరాటపడుతూనే..
సాదిన్చుకునే దిశలో పయనిస్తూనే..
పోరాడుతూనే..పోరాడుతూనే..
ఎన్నాళ్ళో.. ఎన్నేల్లో ..

– వ. శాంతి ప్రబోధ

Gallery

మా నాయనమ్మ జ్ఞాపకాల్లో …4

మా నాయనమ్మ నేర్పరితనం

మా నాయనమ్మను  తలచుకుంటేనే  చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.  తను అన్ని పనులు ఎలా నేర్చుకుందో.. ఎవరి దగ్గర నేర్చుకుందో..మరి! 

ఇప్పుడు చాలా మందికి ఈత చాపలు, తుంగ చాపలు తెలియదు. అంతా ప్లాస్టిక్ చాపలే కదా! కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఇంట్లో ఈత  చాపలు, తుంగ చాపలు వాడేవాళ్ళం. కొబ్బరి పీచుతో చేసిన గడప ముందు కాళ్ళు తుడుచుకునే పట్టాలు వాడే వాళ్ళం.  ఈత ఆకుల చీపుర్లు,  తాటి మట్టల ఆకుల చీపుర్లు వాడేవాళ్ళం. అట్లాగే తాటి ఆకుల బుట్టలు వాడే వాళ్ళం. బంధువులు కాకుండా ఎవరైనా వస్తే విస్తరి ఆకులు వేసి అన్నం పెట్టేవాళ్ళం. వీటిని వేటినీ ఎప్పుడూ మేం కొనలేదు. అన్ని ఇంట్లోనే తాయారు చేసేవాళ్ళు. అవి మా నాయనమ్మ చేతుల మీదుగా రూపుదిద్దుకునేవి. వాటిని చూసి అమ్మ, మా చిన్నక్క (రెండో మేనత్త ) చేసే వాళ్ళు. వాళ్ళు ముగ్గురిని చూసి నేను నేర్చుకున్నా. అయితే, మానాయనమ్మే మాస్టర్ వాటిలో.

వేసవి రాగానే చెరువు దగ్గర నుండి తుంగ తెప్పించేవారు నాన్న. దాన్ని ఎండ పెట్టించేవారు. మా నాయనమ్మ వాటిని సైజుల వారీగా పెట్టుకునేది. మా ఇంట్లో మంచం కోడు లాంటి చెక్కలు రెండు సైజులలో ఉండేవి. వాటికి మధ్యలో రంధ్రాలు ఉండేవి. నాన్న, నాయనమ్మ కలసి ఆరు అడుగుల దూరంలో మగ్గంలా పెట్టి ఆ చివరనుండి ఈ చివరికి పురికొసలతో కట్టేవారు. ఆ పురికొసల మధ్యలో అడ్డంగా ఈ రంధ్రాలు ఉన్న చెక్క ఉండేది. అంటే ఆ రంధ్రాలలోంచి పురికోసలు వచ్చేవి. ఆ పురికొసల మధ్యలో తుంగ వొక డిజైన్ వచ్చేలా నేసేవారు. అమ్మ కూడా తుంగ పెట్టి నేసేది కానీ నిలువుగా పురికొస కట్టడం ఎప్పుడూ చూడలేదు. నేనూ సరదాగా అప్పుడప్పుడు వో చెయ్యి వేసేదాన్ని. ఆ కొత్త చాపల మీద పడుకోవడానికి నేను నా చెల్లెళ్ళు శైలు, చంటి, తమ్ముడు రవి పోటీ పడేవాళ్ళం. మెత్తగా ఉండేవి. వాటినుండి వచ్చే కొత్త వాసన భలే ఉండేది. మా బుద్డిపల్లి నుండి వచ్చేసాక మళ్లీ ఆ వాసన ఎప్పుడూ నా నాసిక పసికట్టలా.

ఈత ఆకులు తెప్పించి వాటిని అరపెట్టేది. చాప కోసం అయితే మట్ట నుంచి ఆకులు వేరే చేసేది మానాయనమ్మ. చీరిన ఆకుల్నిఅటు నాలుగు ఇటునాలుగు పెట్టి జడలా పొడవుగా అల్లేది. అల్లా కొన్ని మీటర్లు అల్లిన తర్వాత కావాలనుకున్న సైజులో కతిరించేది. వాటిని ఈతాకులతో కుట్టేది. చుట్టూ అంచు కుట్టేది. మా అమ్మ, నేను కూడా నేర్చుకున్నాం. ఈ చాపలు బంతి భోజనాల కోసం, మేము చదువు కోవడం కోసం ఎవరిది వాళ్ళకి, పడుకోవడాని కోసం లేదా బయట వేసుకొని కూర్చోవడానికి వేరు వేరుగా తాయారు చేసేది. నా పెళ్లి అయి వర్ని వచ్చాక బిచ్చం అడుగుకోవడానికి ఈత చాప అల్లుతూ వచ్చింది ఒకామే. అది చూసి, ఇలా నాకు వచ్చు అని చెప్పా మా ఆడపదచుతో. తను నన్ను అదోలా చూస్తూ ఇది గోసంగి వాళ్ళు చేస్తారు. మనవాళ్లు చెయ్యరు అంది. అప్పటి వరకూ నాకు తెలియదు అది ఒక కులం వాళ్ళు చేసే పని అని. మరి మా నాయనమ్మకి ఎలా తెలిసిందో ఈ విద్య!

చీపుర్ల కోసం అయితే చెట్టు నుంచి తెచ్చిన ఆకుల మట్టని చీరి చేసేది. ఒక సారి మా బుద్దిపల్లి నుంచి బలరావుపేటకి ఏదో ఫంక్షన్ కి మా నాయనమ్మ, అమ్మ, మా పక్కింటి వాళ్ళు వెళ్ళాం. ఎడ్ల బండిలో. వచ్చేటప్పుడు దారిలో ఉన్న తాటి పువ్వు దగ్గర పైన నెలవంకలా వచ్చినవి ఎండి రాలిపోయి పడి ఉన్నాయ్. వెంటనే మా బండి ఆపించింది. వాటిని మా ఎడ్ల బండిలో వేయించింది మా నాయనమ్మ. వాటితో పాటే మా బండి ఎక్కినట్లుంది ఓ తేలు నెమ్మదిగా బయటకు వచ్చి నా పిర్రపై తన ప్రతాపం చూపింది. ఇంకేముంది? నేను గోలగోల. ఏడుపు. నాకా సంఘటన బాగా గుర్తు. ఏమైందో తెలియక అమ్మ, నాన్నమ్మ వాళ్ళు కంగారు. బండి ఆపి చూస్తే.. ఆ మట్టల లోంచి నెమ్మదిగా తేలు బయటకి వచ్చింది. అప్పుడు నేను ఏడుస్తూనే మా నాయనమ్మని తిట్టేసుకున్న.

ఈత మట్టలు, తాటి మట్టల చీపుర్లు పొట్టిగా, దిట్టంగా ఉండేవి. నడుము వంచి ఊడవాలి వాటితో. అందుకేనేమో మా అమ్మకు గాని, నాయనమ్మకు గాని, అత్తలకు గాని ఎవరికీ పొట్ట ఎత్తుగా ఉండేది కాదు. అందరికి పొట్ట, నడుము నాజుకుగా ఉండేది!

కొబ్బరి పీచుతో కాళ్ళు తుడుచుకునే పట్టాలు చేసేవాళ్ళు. కొబ్బరి పీచు పట్టాలు నాయనమ్మ చేసేది. లేదంటే గోతాం సంచుల్ని కుట్టి చుట్టూ ఏదైనా బట్టతో గొట్ వేసి కుట్టేది అమ్మ. ఏది వృధాగా పోనివ్వకుండా, ఉపయోగకరమైన వస్తువులు తాయారు చేయడం మా నాయనమ్మ గొప్పదనం. ఎందుకంటున్నానంటే.. అలా మా ఇంట్లో తప్ప నేను చుసిన వారెవ్వరి ఇళ్ళలోనూ ఆ రోజుల్లో లేవు కనుక. కావలసినవి అన్నీ మా ఇంట్లో స్వయంగా చేసినవే కదా.. అందుకే నా నేస్తం అరుణ అనేది మీ ఇంట్లో అన్ని ప్రత్యేకంగా ఉంటాయి అని. నిజమే కదా!

ప్రతిఘటిస్తూ..

నా ఉనికి తెలియగానే
అమ్మో.. అయ్యో.. నిట్టూర్పులు.. పెదవి విరుపులు..
కళ్ళు విప్పి లోకం చూడనీకుండా ప్రయత్నాలు..
అయినా, అన్ని గండాల్ని దాటేసి
నా ప్రమేయం లేకుండానే “కెవ్వు” మంటూ వచ్చేశా..కళ్ళు తెరిచేశా..
ఆనాటి నుండి నా పట్ల వివక్షతను చూస్తూనే ఉనన్నా.. ప్రశ్నిస్తూనే ఉన్నా..
అనునిత్యం నాపై జరిగే దోపిడీ, అణచివేత,
అసమానతల్ని ప్రతిఘటిస్తూనే ఉన్నా …
అనుక్షణం నా ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా..
నా అవసరాలు తీర్చుకోవడానికీ, అవకాశాలు కల్పించుకోవడానికీ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నా..
నన్ను నేను రక్షించుకుంటూ మానవ మనుగడకు
ప్రాణం పోస్తూనే ఉన్నా..
గుమ్మం ముందుఉండే డోర్ మ్యట్ లానో,
అందచందాలను ఒలకబోసే షోకేసులో బొమ్మలానో ఉండలేక
బండెడు చాకిరీ చేసే పనిమనిషిలానో,
వారసుల్ని అందించే మరమనిషిలానో మనలేక
సతమతమవుతూ జీవన సమరం సాగిస్తూనే ఉన్నా..
ఆకాశంలో సగంగా స్వేచ్చాస్వాతంత్ర్యాలతో విహరించాలనీ
విధాన నిర్ణయాలలో భాగస్వామ్యం పొందాలనీ
రాజకీయ, ఆర్ధిక, న్యాయరంగాలలో సమ స్థాయిలో వ్యవహరించాలనీ
సమాజ గతిలో, పురోగతిలో నా కర్తవ్యం నిర్వహించాలనీ
సంపూర్ణ వ్యక్తిగా, స్వశక్తివంతురాలిగా నిరూపించుకోవాలనీ
ఉవ్విళ్ళూరే నాలో ఎన్నో ఆలోచనలు , ఆశలు, ఆశయాలు
నేడు కాకపోతే రేపు
రేపు కాకపోతే మరుసటి రోజైనా..
అనుకున్నది సాధిస్తానన్న ఆశతో
నిత్యం ప్రశ్నిస్తూ.. సంఘర్షిస్తూ.. సంఘటితపరుస్తూ ..
ముందుకు సాగుతూనే ఉన్నా..

– వి.శాంతిప్రబోధ

Aside

కాల చక్రంలో…

కాలం ఎంత చిత్రమైంది.
ఎన్నో వింతలు, విడ్డూరాలతో అబ్బురపరుస్తూ ..
అలవి కాని ఆనందం తో అలరిస్తూ ..
అంతలోనే విషాదంలో ముంచేస్తు… 
ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ..
రకరకాల అనుభవాల్ని, అనుభూతుల్ని తనతో మోసుకోస్తూ ..
ఒక్కో సంవత్సరాన్ని మన ముందుకి తోస్తూ..
కళ్ళు ముసి తెరిచేలోగా మాయచేసేస్తూ … 
కొత్త కొత్త ఆశలకి, ఆకాంక్షలకి ఊపిరి పోస్తూ
మరో సంవత్సరాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరింప చేస్తూ
సాగి పోతూనే ఈ కాలచక్రం కొనసాగుతూ …   

– వ. శాంతి ప్రబోధ                              

Tag Cloud

%d bloggers like this: