The greatest WordPress.com site in all the land!

Archive for September, 2015

ఓ సారూ .. మా గోస వినుకో సారూ ..

ఓ సారూ..మా అసొంటి అనాధ పిల్లగాల్లకు జిల్లాకొక అనాధ శరణాలయం పెడతనంటాన్నవ్ గద సారూ ..
చానా సంతోషం సారూ. ఆ ముచ్చట యినంగనే, అబ్బ, సియం సారు కెంత దయ మామీద ?! అని సంబురపడ్డం సారూ .. ఎంత మంచోడు ..సర్కారే అమ్మానాన్న లెక్క బాద్యత తీసుకుంటది అని సెప్పినవ్ గద , గాలికి దూలికి పెంట కుప్పల పొంట తిరిగేటి పోరలంటే సారుకెంత పావురం అని మురిస్తిమి. దేవుడంటే నువ్వే గద సారూ అనుకొంటిమి.

మమ్ముల జూత్తే మీ గుండె బరువై బేజారయితది గద సారూ .. గందుకే మాకు తక్లిబ్ కాకుంట ఏమేమో జేత్తనని సెప్పవట్టినవ్ గదా సారూ .. గది మాకెర్కే సారూ ..
కానీ, ఇక్కడ తమరో ముచ్చట మర్సింరు సారూ ..
మేమిట్ల అయ్యవ్వలు లేక అనాధలం ఎందుకయినమో ఒక్క పారన్నా ఇచారం జేసిన్రా.. సారూ … తీరెం ఆలోచిన్చురి. మీకే సమజయితది.
అంత తీరెం లేనంటున్రా .. గుడుంబా నించి కల్తి సారా నుంచి జనాన్ని కాపాడేతందుకు జల్ది చీపు లిక్కరు తెచ్చేటి పనిల బిజి బిజి ల ఉన్నరా ..
ఓ సారూ ..ఒక్క పారంటే ఒక్కపారి జర మా గోడు ఇను సారూ .. మా బతుకులు గిట్ల ఎట్ల ఆగమయినయో నీకు చెప్పెతందుకే గీ ముచ్చట సారూ .. ఇని అటెంక మీ పని సూసుకో సారూ ..
సూడు సారూ .. మాలో యాడాదెల్లని పోరగాల్ల కెల్లి ఉన్నరు. మేవేం తప్పు జేసినం సారూ .. ఆ అయ్యవ్వల కడుపుల పుట్టడవెనా ..? మాకెందుకు సారూ ఈ సిక్ష ,,? మా వోల్లు తాగుడుకి బానిసలవ్వడమేనా ..?
అవు సారూ .. నేను జెప్పేది ఇసిత్రంగనే ఉంటది నీకు .. మీ అసొంటోల్లకు . మీకేడ తెలుత్తది సారూ మా గోస .
మా అవ్వయ్యలు సోయి లేకుంట బగ్గ తాగి తాగి సచ్చిన్రు. తాగుడుతోనోచ్చిన రోగాల్తోటి సచ్చిన్రు. టక్కర్లయి సచ్చిన్రు. కొట్టుకొని సచ్చిన్రు. చంపిన్రు . పోలీసు ఠానలకు పోయిన్రు. తాగిన నిషాల చెయ్యరాని యెన్నో చేసిన్రు. మమ్ముల సంపిన్రు. తాగుడుకి సేతిల పైసల్లేకుంటే జితగాల్లను సేసిన్రు. బిచ్చగాల్లను జేసిన్రు. గిన్నె తెపాలమ్మినట్టు మమ్ముల అమ్మేసిన్రు. ఆ మైకంల కన్నబిడ్డలని సూడకుంట మీనవడి కోర్కెలు తీర్సుకున్నరు. ఆల్లకడ్డమొచ్చినమని తిర్గమర్గ దంచిన్రు. ఇట్ల ఆల్లు జేసినయి సేప్పుకుంటవోతే చాంతాడంత ఎల్తది.
తాగుడే లేకుంటే మా అమ్మ నాయినలు మాకు ఉంటున్డిరి గదా సారూ … మా కోసం మీ గుండె బేజారు కాకున్డే గదా సారూ .. ?!
అయ్యన్ని గాదు గానీ .. గీ ముచ్చట సెప్పు సారూ .. గా పోద్దేమో బెల్టుషాపులు బందువేడ్త అని మా..స్తు జెప్తివి. గప్పుడు మా మొకాలు సూడాలే , టూబు లైట్ల లెక్క ఎల్గిపాయే .
గద్దెనెక్కినవ్ .. కల్లు మామ్లల అర్రాసులు శురూ జేస్తివి. కల్లు తాగురి .. తాగి తూలురి ఏం గాదంటివి. చెట్లకెల్లి తీసేటి కల్లు మంచిదంటివి. అవ్ అది ఎన్కటి కెల్లి ఉన్నదేనాయే . అబ్బో.. లవ్ మంచోడు మంచిగ సెప్పిండు మా సియం సారు అని మురిసి తాగిరి. ఏమయింది ? జనం పిట్టల్లెక్క రాలవడ్తిరి .
చెట్టు గీసిన కల్లు తాగితే చస్తరా .. రోగాలోత్తయా .. అంటాన్నవా సారూ ..
అవు సారూ .. ఊర్లల్ల చెట్లు ఎన్నున్నాయో .. చెట్టు గీకిన తాటి కల్లు , ఈత కల్లు , జీలుగ కల్లు ఎంతస్తదో మీకు ఎర్క లేనిదా .. సారూ .. ??
గాలన్లకు గాలన్ల కల్లు ఎట్ల తయారయితదో .. దానేన్క ఎవరెవరున్నారో మీకు ఎర్క లేనిదా .. ??? ఆరుగాలం కష్టమంతా .. మావొల్ల చెమటంతా కార్సి కొనుక్కునే గుల్పారం సీసాలు , పాకెట్లు పాణాలు గుంజుకపోతాయని జల్గల్లెక్క జేబుకు సిల్లువెట్టి నెత్తురు పిక్కుంటయని మా వోల్లకు తెల్వక పాయె . మా అసొంటి పోరగాల్లం సెప్పిన ఇంటరా .. పో .. బే .. నువేన్దిరా మాకు సెప్పేటిది .. గంత పెద్దోల్లయిన్రా .. గా సర్కారుకు కన్న మీకెక్కువ ఏర్కనా ఏంది ? అని మా మీదికే ఎగవడుడాయే. చేసిన కష్టం మరిచి పులిసిన పెయ్యికి జరంత సుకంగ ఉంటదని ఇంత సుక్కతోటి గొంతు తడుపుకున్టాంటే మీ లొల్లి ఏంది ? అని ఒర్రుతనే తాగుతాన్రు. తాగి తాగి రాలిపోవుడే నాయె. అయిన ఆపుత లేరు తాగుడు. పెద్దోల్లు తాగంగ జరంత బొట్టు పోల్లగాల్లకు పోసి అలవాటు జేత్తున్నరు. ఆల్లు సుత దానికే గులాం అయితున్నరు. ఆ.. అది లేకుంటే ..?

ఇగ గిప్పుడేమో ఊర్లల్లకు చీపు లిక్కరు తెత్త నంటున్టివి .. గట్లెట్ల సారూ .. మా అమ్మలు , అత్తలు , అక్కలు అంత అసొంటివి అమ్మొద్దని కొట్లాడి ఉద్యమాల్జేసి బంద్జేపిత్తే మల్ల పట్కరావడ్తివి. ఏంది సారూ .. నువు బెట్టేటి ఆశ్రమాల్ల పిల్లలు గావాల్నంటే గిట్లనా సారూ ..?! నీ పేరు కోసం మమ్ముల పెంచుతవా సారూ .. నువు అమ్ముత అంటున్న చీపు లిక్కరు పైసలన్ని యాడివి సారూ .. మా వోల్ల నెత్తురు నీరై సీసాలల్ల కెల్లి పారేటిదే గద సారూ .. ఆ పైసలు వెట్టి మాకు ఆశ్రమాలు పెడ్తవా సారూ … కాకుల గొట్టి గద్దల కేసినట్టు ?
ఆ నిజమేనా .. ఆ ముచ్చట నీ నోట్లకెళ్లే అచ్చిందా .. ?!
అబ్బ ఎంత మంచి ముచ్చట సారూ … నీ నోట్లింత చర్కర బొయ్యాలే సారూ ..
చీపు లిక్కరు తెత్తలేవు, గుడుంబా లేకుంట సూత్తవ్ నిజ్జంగ నీకు మొక్కాలె సారూ .. అట్లనే కల్లు కల్తీ కాకుంట గట్టి జెయ్యి సారూ ..
గాయింత జేస్నవంటే మా ఊర్లను బొందలగడ్డలు గాకుంట, దిక్కుదివానం లేని మా అసొంటి పోరలు కాకుంట జేసి మనసున్న మారాజువని మొక్కుతం సారూ ..
దయగల్ల మారాజువి సల్లంగుండాలే .. సల్లంగ సూడాలె సారూ !
గీ పిల్లలేంది.. ఆల్ల ముచ్చట నేనినుడేంది అని కోపానికి రాకు సారూ ..
ఏదో పెంట మీని ఎంగిలాకులేరుకుంట ఎట్టికి పెరిగేటోల్లం, ఏవన్న తప్పుంటే మా తప్పు కాయి సారూ … మా గోస, యాతన ఇంకోల్లకొద్దని ఆరాటపడ్తున్నం గంతే సారూ.. గంతే .
ఇట్లు
అనాధ పిల్లలు

వి. శాంతి ప్రబోధ

published in September 15  employee voice

వెన్నెల తలపుల్లో ..

బొయ్ ..బొయ్ శబ్దం .. హారన్ చప్పుళ్ళు … కంకర గుమ్మరించిన సౌండ్ తో పోటీ పడుతూ లేచే ధూళి గాలిలో కలసి చెట్టూ చేమలపై పరుస్తూ ..

కాలువ లోపల రాయి, సిమెంటు, కంకర, ఇసుక తో లైనింగ్ పనులు నడుస్తున్నాయి. కార్మికులు ఎవరి పనుల్లో వాళ్ళు ..కంకర, ఇసుక, మొరంతో వచ్చిన టిప్పర్లు ముందుకి వెనక్కి జరుగుతున్నప్పుడు ఎర్రని ధూళి మేఘం ఏర్పరుస్తూ .. .. మలుపుతిప్పుతున్నప్పుడు మరింతగా గొంతు పెంచి బోయ్ ..బొయ్ అరుస్తూ..

నిజాంసాగర్ కాలువ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కాలువ గట్టు గతం కంటే చాలా వెడల్పుగా.. రెండు వాహనాలు ఒకేసారి వెళ్ళడానికి వీలుగా విశాలంగా ముస్తాబవుతూ ఆకుపచ్చేకాని లేత, ముదురు రంగుల షేడ్స్ తో పెళ్లికూతురులా కళకళ లాడుతూన్న వరిపొలాలను ముగ్ద మనోహరంగా ఉన్న అడవినీ వేరుచేస్తూ నిజాంసాగర్ మెయిన్ కెనాల్. ఆ అడవి వెనకే దాగిన కొండలూ .. గుట్టలూ ..గత వారం రోజులుగా కురిసిన వర్షంతో తడిసి ముద్ద అయిన ప్రకృతి. వొళ్ళు విరుచుకొని మబ్బుల మాటునుండి ఎదిగి వస్తోన్న ఉదయభానుని లేత ఎండని ఆహ్వానిస్తూ.. అడవిలోకి మేతకోసం ఆవురావురంటూ వెళ్తున్న పశువులూ.. ఆ వెనుకే వాటిని తోలుకెల్తున్న పశుల కాపర్లు .. గేదలు .. మేకలు .. వాటి అరుపులూ .. ఆ చెట్లపై నివాసం చేసే రకరకాల పక్షుల పాటలూ ..విన్యాసాలూ .. చుక్కపోడుపులో పోలంపోయి పని చూసుకొని ఇంటికి వెళ్తూ వెళ్తూ పచ్చగడ్డి మోపులు ద్విచక్ర వాహనాలపై కట్టుకు పోయేవాళ్ళు ..తలకెత్తుకున్న వాళ్ళు .. పొలం వెళ్ళే వాళ్ళు ..వచ్చేవాళ్ళు .. ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు. తెలిసిన వారితో పలకరింపులు, వేళాకోళాలు , చిన్నపాటి ముచ్చట్లు. అది రోజూ కనిపించే దృశ్యమే. రోజూ వినిపించే పక్షుల సంగీతమే .. అంతా సహజాతిసహజంగా జరిగిపోతూ ..

అసహజంగా.. ఆ చప్పుళ్ళ మధ్యలోంచి ‘క్యార్ .. క్యార్… క్యార్ ‘ పసిపిల్ల ఏడుపు, గాలిలో కలసి పోయి తెరలు తెరలుగా వినిపించీ వినిపించనట్లుగా వినిపిస్తూ ..

ఆ ఏడుపు కాలువ లైనింగ్ పనికి సిమెంట్ మాలు మోస్తున్న శేఖర్ చెవిని తాకింది. నెత్తి మీద బరువుతోనే అలా నిలబడి పోయాడు కొన్ని క్షణాలు శ్రద్ధగా ఆ ఏడుపు ఎటునుంచో ఆలకించాడు.

” అరేయ్, ఏందిరా! బండలెక్క అట్ల నిలవడ్డవ్ ” మేస్త్రీ అదిలింపు తో తట్ట దింపుతుండగా , మళ్లీ వినిపిస్తున్న పసి బిడ్డ ఏడుపు. ఆలకించమని తోటి వారితో చెప్పాడు.

ఆ .. పిల్లల ఏడుపా .. ఇక్కడెట్ల వస్తుంది.. ఏ అడివి పిల్లో .. ఇంకేదైనా జంతువు ఏడుపో అని కొట్టిపారేశారు మిగతావాళ్ళు. ఒకావిడ మాత్రం అవును, పసిబిడ్డ ఏడుపులాగే ఉంది అంది శేఖర్ కి వత్తాసు పలుకుతూ

‘ఏందిరా … పని ఇడ్సి నకరాలు జేస్తున్నవా..గీ అడ్విల పిల్లల ఏడుపా ..నెత్తిమిన తల్కాయ గిన ఉందా లేదా .. నడు .. నడు తల్కాయ ఈడవెట్టి పన్జేయున్రి’ అరిచాడు అంతకు ముందే పనిసాగడం లేదని సూపర్వైజర్ మేస్త్రి పై కేకలేయడంతో గరం గరంగా ఉన్నమేస్త్రి.

మేస్త్రి కోపం చూసి తన పనేదో చేసుకుపోతున్నాడు కాని మనసు నిలువనీయడం లేదు. ఆగి ఆగి ఆ ఏడుపు అతని చెవుల్ని తాకుతోంది. కలవరపరుస్తోంది. మళ్లీ అంతలోనే ఈ అటవీ ప్రాంతంలో పసిపిల్లల ఏడుపు ఎందుకు వినిపిస్తుంది? ఎలా వినిపిస్తుంది ? ఏదో విని ఇంకేదో అనుకుంటున్నాడు తను అనుకొని, తనను తాను సమాధాన పరచుకుందామని ప్రయత్నం చేశాడతను. గాలి మోసుకొస్తున్న ఆ ఏడుపు మళ్లీ మళ్లీ చెవుల్లో పడ్తూ..హృదయాంతరాళాల్నికదిలిస్తూ … ఇక ఆగలేక పోయాడు. చేతిలో ఉన్న గమేలా అక్కడే పడేసి ఒకటికి అని చిటికెన వేలు చూపిస్తూ మరో మాటకు తావివ్వకుండా ఏడుపు వినవస్తున్న వైపు పరుగు తీశాడు శేఖర్.

ఇంతకు ముందులా ఏడుపు పెద్దగా క్యార్ .. క్యార్ అని వినిపించడం లేదు. కాని, ఏడవడానికి ఓపిక లేక ఏడుస్తున్నట్లుగా పీలగా .. ఆగి .. ఆగి .. వినవస్తోంది.

అటు ఇటు వెతుకుతూ అడ్డువస్తున్న కొమ్మల్ని వంచుతూ దారి చేసుకుంటూ వెళ్తున్నాడు. కనిపించిన ఎండిపోయిన కొమ్మ చేతిలోకి తీసుకున్నాడు. పక్క పుల్లలు విరిచి పడేశాడు. చేతి కర్ర తయారు చేసుకున్నాడు. దంతి, తంగేడు, ఉడుగు, ఉల్లెంత వంటి రకరకాల పొదలు ..దాటుతూ .. చేతి కర్రతో శబ్దం చేస్తూ నడుస్తున్నాడు. గుబుర్ల లోంచి రెండు కుందేళ్ళు చెంగు చెంగున పరిగెత్తాయి . బుర్రు పిట్టలు తుర్రుమన్నాయి. దూరంగా కోయిల గానం వినిపిస్తూ .. అక్కడి నుండి రెండడుగులు వేశాడో లేదో , మళ్లీ ఏడుపు అతి దగ్గరలో . చుట్టూ చూశాడు. తెల్లటి బట్టలో చుట్టిన పసికందు. ఎర్రగా కంది పోయి… ఒళ్ళంతా ఎండిపోయిన రక్తపు మరకలతో.. కళ్ళు మూసుకొని ఏడ్వలేక ఉంగా .. ఉంగా .. అతినీరసంగా .. గొంతు పూడుకుపోతుండగా ఆ పురిటి గుడ్డుని చూసి అవాక్కయ్యాడు శేఖర్. ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. చుట్టూ చూశాడు. ఎవరూ కనబడలేదు. తన వాళ్ళ దగ్గరకు వెళ్లి తీసుకోద్దామా అనుకున్నాడు. ఆ పసికందు కేసి చూశాడు. ఏడ్చి .. ఏడ్చి .. అలసి సొలసి .. పెదాలు ఆరిపోయి .. పెరుగుతున్న ఎండకి కమిలిపోయి .. రక్తపు మరకలతో బిగుసుకు పోతూ .. వెంటనే తన నిర్ణయం సరి కాదనుకున్నాడేమో… ఒక్క ఉదుటున వంగి ముళ్ళ పొదలోంచి ఆ పసి కందుని జాగ్రత్తగా, చుట్టిన బట్టతో సహా చేతుల్లోకి తీసుకున్నాడు. దంతి పొద ముళ్ళు అతని చర్మాన్ని చీరేస్తూన్నా పట్టించుకోకుండా ఆ పసి గుడ్డుని జాగ్రత్తగా పొదివి పట్టుకుని పరుగు పరుగున తన గుంపును చేరుకున్నాడు. పరిగెత్తుకొస్తున్న అతని చేతిలో పొదివి పట్టుకున్న పసికందును చూసి అందరిలో ఆశ్చర్యం ఉత్కంట. అంతా తమ తమ పనులాపేసి శేఖర్ చుట్టూ గుమిగూడారు.

‘ ఆ వీడు అన్నది నిజమే. వాడి చేతిలో పసిగుడ్డు ‘ మాలు మోస్తున్న యాదయ్య ఆశ్చర్యంతో అరచినట్లుగా ..
‘ఆడ పిల్లా… మగపిల్లాడా ‘ గుంపులోంచి ఓ గొంతు.

‘ఏమో ‘ అయోమయంగా శేఖర్
చుట్టి ఉన్న బట్టను తీసి చూశారు మరొకరు.

‘ఆడపిల్ల ‘ అందుకే వదిలి బరువు దించుకున్నారేమో’
‘అయ్యో .. పురిటి మరకలు కూడా పోలేదు’
‘ఆ తల్లికి ప్రాణం ఎట్లా ఒప్పిందో .. తల్లి కర్కశత్వాన్ని తిడ్తూ…

‘అసలు కన్న తల్లికి తెలుసో లేదో..’ సందేహం
‘ఆ… ఏ అక్రమ సంతానమో .. గుట్టు చప్పుడు కాకుండా వదిలించుకునట్టున్నారు’ దీర్ఘం తీస్తూ

‘ఎనిమిదింటి కాన్నినించి మనం పనుల్లో ఉన్న్నాం .. ఇప్పుడు కాదు మస్కుల తెచ్చి పడేసినట్టున్నరు..’ ఒకరు
‘చందమామ లెక్క చక్కగున్నది పిల్ల’.
‘పెద్దింటి పిల్లలెక్కనే గొట్టవట్టింది ..’

‘ఆడిపిల్లను పెంచుడంటే ….మాటలా ..’
ఆడోల్లకు ఎన్ని కష్టాలు వచ్చినాయే తల్లీ .. ‘నిట్టూర్పు
‘ఈ బిడ్డని ఏం చేద్దామని తేచ్చినావ్ ర ‘ ప్రశ్న
‘ఇప్పుడో .. అప్పుడో పోయే ప్యానమది ‘ నిట్టూర్పు

‘యాడ కెల్లి తెచ్చినవో ఆడనే ఒదిలిరా ‘ సలహా . ఎవరికి తోచినట్లుగా వారు రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ..
చివరగా మాట అన్న వాళ్ళకేసి తీక్షణంగా చూశాడు శేఖర్ . కానీ ఏమి చెయ్యాలో తోచట్లేదు. అతని చేతుల్లో అట్లాగే ఆ పసికందు
ఏమిటో .. కావాలనుకున్న వాళ్లకి పిల్లలు కారు. ఒద్దనుకునేవాళ్ళకి పిల్లలు. చిన్నగా నిట్టూర్చాడు మేస్త్రి. పెళ్ళయ్యి తొమ్మిదేళ్ళు దాటినా పిల్లలు లేరు. తను తీసుకెళ్ళి పెంచుకుంటే .. భార్య ఎంత సంతోషిస్తుందో .. కొద్ది క్షణాలు మనసు ఊగిస లాడింది. పసిపిల్లల బోసినవ్వులు , కేరింతలు , చిలిపి చేష్టలు లేని ఇల్లు ఇల్లుకాదురా .. అనే తల్లి మాటలు గుర్తొచ్చాయి . అయినా తనకు మాత్రం లేదూ .. బుడి బుడి అడుగుల సవ్వడి వినాలని.. ప్చ్ .. ఏం లాభంలే ఏమనుకొన్నా … ఎవరు కన్న బిడ్డో.. నేను పెంచుకుంటే.. అందరూ ఏమనుకుంటారు .. తనని.. మదిలో ఎన్నెన్నో ప్రశ్నలు .. అయినా చావుకి బతుక్కి దారమంత దూరంలో ఉన్న ఈ పిల్ల వద్దులే .. మనసులో అనుకుంటూ ,

‘ ఇప్పటి దంక మస్తు అయింది. పొద్దేల్లిపోతాంది లేన్రి లేన్రి ‘ అరిచాడు మేస్త్రి, తనలో ముసురుతున్న భావ సంఘర్షణని జోకొడుతూ. సైట్ ఇంజినీర్ వచ్చే సమయం అయింది. ఇలా చూస్తే ఊరుకోడని అతని భయం.

‘అన్నా .. నేను ఈ పూట పని బంద్… చీటి రాస్కోమని సూపర్వైజర్ కి చెప్పు’ అంటూ అక్కడినుండి కదిలాడు శేఖర్ .
మస్టర్ ఏసినంక బంద్ సీటి రాస్కో అంటె ఎట్ల’ మేస్త్రి అరుపు విననే లేదు శేఖర్.
నలబై ఏళ్ళున్న లచ్చుమమ్మ కేసి తిరిగి .. ‘అమ్మా నాతో వస్తవా .. ఈ బిడ్డను ఎత్తుకోనుడు నాకు చాతనయితలేదు’ పసి బిడ్డను చేతుల్లో అలాగే పట్టుకుని

అంతలో ఇక్కడ ఏదో జరుగుతోందని దూరం నుంచి గమనించిన మరో గుంపులోని మహిళలు అటుకేసి వచ్చారు .
ముందు బిడ్డకి ఒళ్లంతా తుడిచి పాలుపట్టాలని సలహా ఇచ్చింది ఓ అమ్మ. రాము భార్య ఆరు నెలల బాలెంత కదా. ఆమె దగ్గరకు తీసుకెళ్ళి పాలు పట్టియ్యమని సూచించింది .. మరో అమ్మ
అంత దూరం పోయే దంక ఉంటదా ఈ బిడ్డ మరో స్త్రీ .

అందరికీ పని మీద ద్యాస పోయింది . కాళ్ళు చేతులు యధాలాపంగా పనిచేస్తున్నా ఆలోచనలు మాత్రం పిల్లల గురించే. వదిలించుకునే పిల్లల తల్లుల గురించే. .. ఆడ పిల్లల గురించే .. .

‘ఒరే ముందూ వెనుకా ఆలోచించకుండా ఈ ఆడపిల్లని పట్టుకొచ్చావ్ . ఏమి చేద్దామని రా.. నీకా ఇల్లు వాకిలీ లేదు. నా అన్న వాళ్ళెవరు లేరు. ఏమి చేద్దామని రా .. ‘ రెట్టించి అడిగింది లచ్చుమమ్మ.

ఆ పసికందుని లచ్చుమమ్మ చేతుల్లోకి అందించిన శేఖర్ ‘ఏమో నమ్మా నేనేమీ ఆలొచించలె. బిడ్డ అట్లనే ఉంటే ఏమయిపోతదోనని ఎత్తుకొచ్చిన. నేను అమ్మ అయ్యా లేని అనాధని . ఏదో ఆళ్ళ పంచన ఈళ్ల పంచన పెరిగిన వాణ్ని. ఈ గుంపులో చేరి ఇట్ల బతికేస్తున్నా. ఈ గుంపులో వాళ్ళనే నా వాళ్ళుగా అనుకున్నా. ఆ గుంపు పనికి ఎటు పోతే నేనూ ఆటే పోతున్నా’ అని. ఇప్పుడు ఈ పిల్లని ఏమి చెయ్యాలి? తీవ్రంగా ఆలోచిస్తూ .. గుడారంకేసి నడుస్తూ ..
ఎదురుగా టిప్పర్ లేపు కొంటూ వచ్చిన దుమ్ము ఆ బిడ్డపై పడకుండా కొంగు కప్పింది లచ్చుమమ్మ.

                  ***                                                    ***                                                             ***

పిల్లలు లేరని మేస్త్రి భార్యని పుట్టింటికి పంపేసి ఇంకో పెళ్లి చేసుకుంటానని అంటున్నాడట. ఆ మేస్త్రి భార్యకి ఈ పాపని ఇస్తే… ? ఆమె పెంచుకుంటుందా … మేస్త్రి ఒప్పుకుంటాడా .. తొమ్మిది నెలలు కడుపులో మోసిన తల్లే .. తన రక్తం పంచుకు పుట్టిన తండ్రే వదిలేసినప్పుడు వీళ్ళు పెంచుకుంటారా .. కాళ్ళు చేతులు కడుక్కుని ఆలోచనలతో వేడెక్కిన తలపై చల్లటి నీళ్ళు చల్లుకున్నాడు. ఇంతలో పని దగ్గరనుండి మేస్త్రి ఫోన్. అక్కడున్న వాళ్ళందరినీ త్వరగా రమ్మని. సైటు ఇంజినీర్ వచ్చాడని . పసి పాపని కూడా తీసుకురమ్మని వార్త.

సైటు ఇంజినీర్ వచ్చి తనను పని కావడం లేదని అంటాడని విషయం ఫోన్ చేసి చెప్పాడు మేస్త్రి. అప్పటికే సైటుకి బయలు దేరిన ఇంజినీరు వస్తూ దారిలో ఉన్నపోలీసు వాళ్ళకి సమాచారం అందించారు. అంగన్వాడి కార్యకర్తకి, CDPO కి, సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి పాపని తీసుకు వెల్తారట చెప్పాడు ఇంజినీరు.

మేస్త్రి తన మనసులో మాట చెప్పాలను కున్నాడు. కానీ గొంతు పెగలడం లేదు. ఇంతలో దుమ్ము లేపుతూ వచ్చిన జీప్ పని చోటు నుండి పనివాళ్ళు వేసుకున్న గుడారాల కేసి కదిలింది. శేఖర్ లచ్చుమమ్మలతో పాటు మేస్త్రి భార్య ఒడిలో బిడ్డ. పాలు చుక్క చుక్క పెదాలకు తాకిస్తూ మేస్త్రి భార్య . పిల్లలు లేని తనకు ఈ బిడ్డనిచ్చి తల్లిని చెయ్యమని అర్ధిస్తూ ఆమె. ముందు ఈ పిల్లని హాస్పిటల్ లో చేర్చాలి. కన్నవాళ్ళు వస్తారేమో చూద్దాం. లేదంటే పిల్లని మీరు పెంచుకోవాలనుకుంటే చట్టప్రకారం పెంచుకుందురు అని చెప్పి చంటి దానితో సహా జీప్ లో వచ్చిన వాళ్ళు వెళ్లి పోయారు.

                      ***                                                            ***                                         ***
తెల్లవారి అన్ని వార్తాపత్రికల్లో వార్త. అ పసిగుడ్డు ప్రాణాలు రక్షించిన శేఖర్ని అభినందిస్తూ
శేఖర్ పని చేస్తున్నా ఆ పసికందు ముఖమే కన్పిస్తోంది. ఎలా ఉందొనని .. చూడాలని మనసు ఆరాటపడుతోంది. కారణాలేమైనా ఆ పిల్లని వదిలించుకున్న వాళ్ళు చాలా తప్పు చేశారు అనుకున్నాడు.

రెండు రోజుల తర్వాత పని అయిపోయినాక సాయంత్రం మేస్త్రి ఇంటికి వెళ్ళాడు శేఖర్. తను అనాధగా ఎంత బాధ అనుభవిస్తున్నాడో చెప్పాడు. ఆ పాప ఎలా బతుకుతుంది ఈ లోకంలో అని బాధ పడ్డాడు. ఆ పాపని పెంచుకొమ్మని ప్రాధేయపడ్డాడు. ఆమెకు పునర్జన్మ ఇవ్వుమని, సంతానం లేని లోటు తీర్చుకొమ్మని కోరాడు. అన్నీ మౌనంగా విన్న మేస్త్రి ఏమీ మాట్లాడకుండా మొహంలో భావాలు కన్పించనీయకుండా అక్కడ నుంచి లేచి దబా దబా వెళ్ళిపోయాడు.

మేస్త్రి భార్య ఆ బిడ్డని పెంచుకోవాలనే తపన పడుతోంది. పసితనం నుంచి పెంచుకుంటే తమనే అమ్మ అయ్యా అనుకుంటుందని అనుకుంది. కానీ భర్తని ఎలా వోప్పించాలో ఆమెకు అర్ధం కావడం లేదు. రెండు రోజులుగా ముభావంగా ఉన్న అతన్ని పలుకరించాలంటేనే భయపడుతోంది. ఎక్కడ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతోంది.

పిల్లా జెల్ల లేరు. ముద్దు లేదు ముచ్చట లేదని. మరో పెళ్లి చేసుకొమ్మని తల్లి గోల గోల చేస్తోంది. మారుమనువు చేసుకుంటే పిల్లలు పుడతారని నమ్మకమేమి ? నడుస్తూ ఆలోచిస్తున్నాడు మేస్త్రి .

“నీ భార్య పిల్లలు కావాల్నని చెట్టుకు పుట్టకు మొక్కే. ముడుపులు కట్టే. ఏడ మందుబోస్తారంటే నీ ఆడికి బోయే . ఫాయిదనె లేకపాయే. దానిల ఏమి తప్పు లేదని డాక్టర్ చెప్పే. ” అన్న అక్కభర్త మాటలు గుర్తొచ్చాయి అతనికి. అంటే నాలోనే ఉంది. అప్పుడు ఎందర్ని జేసుకున్నా ఇంతే గద. మొన్న ఊరికి బొయొస్తానని జెప్పి దవాఖాన్ల చూపించా. అనుకున్నట్టే అయింది . ఇంక ఈ జన్మలో పిల్లలు కారని తెలిసిపోయింది. ఈ పిల్లని పెంచుకుంటే .. ఆ ఆడిపిల్లనా .. వంశం నిలిపే టోడు కావాల్నని అయ్యగునుగుతాడేమో. . అమ్మ పెదవి విరుస్తదేమో . . . తల పగిలి పోయేలా ఆలోచనలు .. తేనెటీగల్లా పరుగెత్తుకొచ్చి గుచ్చే ప్రశ్నలూ.. నడుస్తూనే ఉన్నాడు వేగంగా .. ఇంకా వేగంగా మదిలో మెదిలే ఆలోచనల కంటే వేగంగా నడుస్తూ మేస్త్రి

భార్యలో లోపం ఉందని తేలితే దాన్ని వదిలేసేవాడా .. అమ్మ గోలకి తల ఒగ్గేవాడా .. ఏమో ..కావాల్నని కోరి చేసుకున్న పెండ్లాం .. పాపం.. పిల్లలకోసం మనేద పెట్టుకుంది . అదెంత బాధ పడతందో తెలుసు .. ఎడతెగని ఆలోచనలు వానాకాలం దీపం దగ్గర ఉసిళ్లలా ముసురుతూ ..

శేఖర్ గాడు అన్నట్టు ఆ పిల్ల చేసిన తప్పేమిటి..? పుట్టిన రోజే చావు రోజు కూడానా .. అట్లా రాసి ఉంటే అట్లాగే జరుగుతుంది. ఏమో.. ! గట్టి పిండమై బతికితే.. బతికిస్తే .. ఆ ఆడపిల్ల ఒంటరిగా ఈ లోకంలో బతకగలదా …బతకనిస్తుందా .. ఊహు .. మరి ఆమెకు తను బతుకునిస్తే..? తను తండ్రి అవుతాడు. తన భార్య తల్లి అవుతుంది. రక్తం పంచుకు పుడితేనేనా .. కన్నబిడ్డనా ..? కంటిపాపలా చూసుకుంటే.. ప్రేమను, అప్యాయతానురాగాలను పంచి పెంచితే ..గుండెలపై ఆడిస్తే … తండ్రిగా బాధ్యత నిర్వర్తిస్తే .. తన కన్నబిడ్డ కంటే ఎక్కువ కాదా .. అవును, తను తండ్రిగా ..కొత్తగా.. ఆ ఊహే .. ఆలోచనే..నరరాన బిరబిరా ప్రవహిస్తూ.. ఆనందం కలిగిస్తూ.. హాయినిస్తూ.. కొత్త శక్తి నిస్తూ .. జీవితం పట్ల ఉత్సాహాన్ని నింపుతూ .. తేలికయిన గుండెతో .. నడక వేగం తగ్గింది .. అడుగులు వెనక్కి మళ్ళాయి …

ఎదురుగా ఆకాశంలో చందమామ చీకటి తెరలను చీల్చుకోస్తూ.. కొండలనడుమనుంచి … అడవి తల్లి అందాల్లోంచి తొంగి చూస్తూ .. చల్లని వెన్నెల వర్షం కురిపిస్తూ .. ఆ వెన్నెల్లో తడిసి ముద్దవుతున్న మేస్త్రి కళ్ళకి చందమామలో ఆ పసిపాప అగుపిస్తూ .. కొత్తగా మొలకెత్తిన ఆలోచన అప్పటివరకూ ఉన్న వ్యధని మాయం చేస్తూ .. భార్య నైరాశ్యపు మొహంలో జాబిలి వెన్నెల వెలుగు చూడడం కోసం వడి వడిగా అడుగులేస్తూ… . ఊయలలొ ఊగే పసి పాప సుతి మెత్తని స్పర్శను తలపోస్తూ … ఆ పాపకి వెన్నెల అని పేరు ఖాయం చేస్తూ .. వెన్నెల వీధుల్లో విహరిస్తూ బిగ్గరగా అరిచాడు ‘వెన్నెలా వచ్చేస్తున్నా .. నీ కోసం వచ్చేస్తున్నా ‘

వి. శాంతి ప్రబోధ

http://vihanga.com/?p=15808 September 2015

కాగితం – కరెన్సీ నోటు

ఫోన్ మోగుతోంది చూడరా చిన్నా ..
గార్డెన్ లోని కలుపు మొక్కలు ఏరేస్తూ  అమ్మ కేకవేసింది.

కథల పుస్తకం చదువుకుంటున్న ఏడేళ్ళ చిన్నా లేచి వెళ్లి ఫోన్ ఎత్తాడు.  అవతల తండ్రి గొంతు.

ప్యాంటు జేబులో డబ్బులున్నాయి తీయడం మరచిపోయి అట్లాగే వాషింగ్ మిషన్ లో వేశాను . అమ్మకు చెప్పు అని చెప్పి పెట్టేశాడు .

‘అమ్మా…  అమ్మా’ అంటూ అరుస్తూ పరుగెత్తుకొచ్చిన చిన్నావాషింగ్ మిషన్ చప్పుడు విన్నాడు .
అయ్యో..  అయ్యయ్యో అని అరిచాడు .

ఏమయిందో అర్ధం కాని చిన్నా తల్లి వసంత కంగారు పడుతూ చిన్నా దగ్గరికి పరుగు పరుగున వచ్చింది .

వాషింగ్ మిషన్ వైపు గుడ్లప్పగించి చేయి చూపుతూ నించున్నాడు చిన్నా
ఏమైందిరా చిన్నా .. అర్ధం కాని అమ్మ అడిగింది

నాన్న ఫోన్ చేశారు కదా అంటూ తండ్రి  చెప్పిన విషయం చెప్పాడు.

‘అవునా ..’ అంటూ వాషింగ్ మిషన్ స్విచ్చి ఆఫ్ చేసింది వసంత

మూత తీసి చూస్తే వంద రూపాయల నోటు ఒకటి నలిగి నీళ్ళపై తేలి కనిపిస్తూ ..  గబగబా ప్యాంటు తీసింది.  మిగిలిన నోట్లన్నీ రబ్బరు బాండుతో కట్టేసి జేబులోనే ఉన్నాయి . వాటిని బయటికి తీసింది అమ్మ.  అవి తడిసి కొద్దిగా నలిగినట్లుగా కన్పించాయి

అమ్మయ్య, అన్నీ బాగానే ఉన్నాయని వాటిని కట్టనుండి విడదీసి ఫాన్ వేసి ఒక్కోటి ఆర బెడ్తోంది అమ్మ.
‘అమ్మా వీటిని ఇస్త్రీ చేస్తే సాపుగా అవుతాయి కదా’ వాటినే పరీక్షగా చూస్తూ అన్నాడు చిన్నా
‘అవునురా .. తడి ఆరిన తర్వాత అదే పనిచేద్దాం.  ఈ రోజు మనకి బడి లేదని మీ నాన్న భలే పని పెట్టారులే ‘ చిన్నగా నవ్వుతూ అంది అమ్మ. అవునన్నట్లు తలూపాడు చిన్నా.
అమ్మ ఆరబెట్టడం చూస్తున్న చిన్నా చిన్ని బుర్రలో సందేహం.
‘అమ్మా నేను ఒక రోజు జేబులో ఒక పేపర్ పెట్టి మరచిపోయాను. నువ్వు చూసుకోకుండా అట్లాగే మిషన్ లో వేసావు, గుర్తుందా ..?’
‘ఊ .. ఇప్పుడావిషయం ఎందుకు గుర్తొచ్చింది ‘  ?
‘అప్పడు ఆ పేపర్ నానిపోయి చిరిగి ముక్కలు ముక్కలుగా అయిపొయింది . మిగతా బట్టలకి ఆ చిన్న చిన్న ముక్కలు అతుక్కుపోయాయి. మరి రూపాయలు ఎందుకు అట్లా కాలేదు ?’ తన సందేహం వెలిబుచ్చాడు చిన్నా

‘అవును నిజమే .. ఎందుకు అట్లా కాలేదు ‘? ఆలోచిస్తూ అమ్మ అంది .

లోపలికి అడుగు పెడ్తూ చిన్నా ప్రశ్న విన్న సమంత  నేను చెప్పనా’ అంది నవ్వుతూ

‘ఓ .. చెప్పు పిన్నీ.. చెప్పు ‘ అంటూ ఆమె చేయి పట్టుకుని సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు  చిన్నా .

కారణం తెలుసుకుందామని చేస్తున్న పని ఆపి చెల్లెలు చెప్పే విషయం వినడానికి సిద్దమయింది వసంత

పిన్ని ఏం చెబుతుందా అని చెవులు రిక్కించి ఆమె మొహంలోకి కళ్ళార్పకుండా చూస్తున్నాడు చిన్నా .

‘నిజమే నోటుపుస్తకాలకు , న్యూస్ పేపర్ లకు , ఇతర పుస్తకాలకు అంటే మనం సాధారణంగా వాడే పేపర్ కి కరెన్సీ తయారీకి వాడే పేపర్ కీ చాలా తేడా ఉంది. మామూలు పేపర్ చెట్లనుంచి వచ్చే పదార్ధంతో చేస్తారు.  అదే నోట్లకు వాడే పేపర్ని పత్తి , ఊలు, కొన్నిరకాల గుడ్డ పీలికల నార వేసి చేస్తారు. అందుకే అవి నీళ్ళలో త్వరగా నానిపోవు.  చిరిగిపోవు. చాలా నాణ్యంగా ఉంటాయి ‘ చిన్నా బుర్రకి అర్ధమయ్యేలా చెప్పింది పిన్ని

‘ఓ అదా సంగతి.. నాకూ తెలియదు’ అంటూ లేచి వెళ్లి చెల్లికి మంచినీళ్ళ గ్లాసు అందించింది అమ్మ

తనకు తెలిసిన విషయం చెప్దామని పక్కింటి చిన్నారి దగ్గరకి తుర్రుమన్నాడు  చిన్నా

Published in http://jabilli.in/1277.,  20.9.2015

Tag Cloud

%d bloggers like this: