The greatest WordPress.com site in all the land!

Archive for May, 2015

మన పృథ్విభవిష్యత్ మన చేతుల్లోనే ..

వందేళ్ళు ముందుకెళ్ళి చూస్తే …

రాలిపోవచ్చు, నువ్వూ నేనూ

కానీ.. మన తర్వాతి తరాలు వికసించాలిగా
ఊహూ.. అలా జరగదట..?!
త్సునామిలా విరుచుకుపడుతున్న భూతాపం
చల్లని తల్లి ఆరోగ్యాన్ని హరించేస్తుందట !
మన స్వార్ధపూరిత అనాలోచిత చర్యలు
వేస్తున్న ప్రకృతి విరుద్దమైన అడుగులు
చేస్తున్న వినాశనం అంతా ఇంతా కాదుగా !!
అదృశ్యమవుతున్న అడవులు
విచ్చిన్నమైపోతున్న ఆహార -జల వ్యవస్థలు
స్పృహలేని అడ్డగోలు ఆర్థిక వృద్ది విధానాలు
దేశాల మధ్య, పాలితుల మధ్యలేని ఏకీ భావం
పట్టపగ్గాల్లేని జీవవైవిధ్య వినాశనం
హరీ మంటున్న హరితం
నిర్జీవం అవుతున్న భూసారం
అగ్నిగుండం అవుతున్న భూగోళం
కొండచిలువ అభివృద్ధి మింగేసే పర్యావరణం
తెగిపోతున్న ధరిత్రీ అనుబంధం
ప్రమాదపుటంచున రేపటి ప్రపంచం ….
నేల-నీరు క్షీణత నివారణ నియంత్రణ కోసం
నీ .. నా .. మన నీలిగ్రహా పరిరక్షణ సంరక్షణ కోసం
కారు చీకట్లో కాంతి రేఖలు ప్రసరింపజేసే దివిటీల్లా
ధరిత్రీ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములమవకపొతే
భూగోళాన్ని పదిలపరచుకొంటూ సుస్థిర పర్యావరణానికి
దోహదమవకపోతే.. మూల్యం చెల్లించక తప్పదు
రేపటి తరాల బతుకుని ఫణంగా పెట్టక తప్పదు
పృథ్వి భవిష్యత్ మన చేతల్లోనే .. మన అడుగుల్లోనే ..
 వి. శాంతిప్రబోధ

The Mana Telanganaa E-paper.

భూమిని బతికించుకుందాం..

bhumi bhumi 1

“దునియా ఇట్లనే నడిత్తే భూతల్లి సచ్చిపోతది. మన ఎనక పుట్టే ముని మనుమలు , మనుమరాల్లకు ఎట్ల? ఆ తల్లిని మనం కాపాడుకుంటే అది మనని చల్లగ సుత్తాది”భూమి చచ్చిపోవడమా ..? ఇదేంటి ఎప్పుడూ వినలేదే .. చదవలేదే ..  నాలో ఆశ్చర్యం .  మనుషులు చనిపోవడం తెలుసు.  చెట్లు చేమలూ , జంతువులూ, పక్షులూ ఇలా ఈ ప్రపంచంలో జీవం ఉన్న సమస్త జీవరాసి చనిపోవడం లేదా నశించి పోవడం తెలుసు .  పుట్టడం ఎంత సహజమో గిట్టడమూ అంతే సహజం. అది ప్రకృతి సహజం కూడాను. భూమి చచ్చిపోవడం ఏమిటీ ..? వింతగాను విడ్డురంగాను లేదూ … కాకపోతే మరేమిటి ..? మన తాత ముత్తాతలు .. వారి ముత్తాతలు జీవించిన నేల ఇది. 460 కోట్ల ఏళ్ల పైగా చరిత్ర ఉన్న భూమి చనిపోవడం ఏమిటీ ..ఆ మాటలు మీ లోనూ అదే భావాల్ని కలిగిస్తున్నాయా .. సహజమే .. కానీ అతను అన్న మాటల్లోనూ ఎంతో వాస్తవముంది. అది ఆ తర్వాతి సంభాషణలో అర్ధమయింది.

ఇంతకీ ఆ మాటలన్నదెవరో చెప్పనే లేదు కదూ ..

అతను  భూమి గురించి పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞుడో  చేస్తున్న వాడో కాదు.  పుస్తకాలు తిరగేసి పట్టాలు అందుకున్న వాడు కాదు.  కనీసం ఏనాడు బడి మెట్లు ఎక్కినవాడు కాదు.  మనలాగా నాగరీకుడు అంతకంటే కాదు.  మరెవరతను ?

అతను  ఆదిలాబాద్ జిల్లా కెరమెరి అటవీప్రాంత గోండు గిరిజనుడు. ప్రకృతి ఒడిలో పెరిగి ప్రకృతితో మమేకమయిన జీవి.  అతను మనలాగా నాగరికుడు కాకపోచ్చు, చదువూ సంధ్యా లేకపోవచ్చు . కానీ, జీవితం నేర్పిన అనుభవం ఉంది.  ప్రకృతిని ఆరాధించే అతను అవుతున్న అటవీ విద్వంసాన్ని, కలుషితం అవుతున్నగాలిని, నీటిని,  భూముల్ని, మనుషుల్ని  చూసిన నేపథ్యం ఉంది. తద్వారా జీవితం కోల్పోయిన  ఆదివాసుల్ని, పశు పక్ష్యాదుల్ని చూసి చెందిన ఆవేదన ఆ హృదయంలో గూడుకట్టుకొని ఉంది.

మైదానప్రాంతం నుండి వ్యాపారుల రాక, వ్యాపార పంటలు, రసాయన ఎరువులు , కృత్రిమ పురుగు మందులకు తోడైన ధన వ్యామోహం  తమ ప్రాంతంలోకి, జీవితాల్లోకి చోచ్చుకొచ్చాక విచ్చిన్నమైన జీవితాలు అతనికి తెలుసు. స్వచ్చమైన గాలి, నిర్మలమైన నీరు, ప్రకృతి ప్రసాదించిన ఆహారంతో కల్మషం లేకుండా స్వతంత్ర జీవనం సాగించిన తమ జీవితాల్లో వచ్చిన పెను తుఫానులు అతనికి అనుభవమే.  పీల్చే గాలి, తాగే నీరు , తినే తిండి అన్నీ కలుషితమయి ఆరోగ్య సదుపాయాలు లేక, కావలసిన తిండి అందక ఊపిరివదిలే సంఘటనలు ..  తమవి అనుకున్న చెట్టు చెలక అంతా పరాధీనమై బతుకు భారమై తల్లడిల్లే తమ యాతనలు .. అభివృద్ధి పేరుతో తమ గూడేలను చుట్టిముట్టి పర్యావరణానికి జరుగుతున్న విధ్వంసం,  కనుమరుగై పోతున్న చెట్టు చేమా , పిట్టా , జంతువూ .. కలుషితమైన పర్యావరణం జీవజాలాన్ని ఎలా నాశనం చేస్తోందో హరించి వేస్తోందో అతను కళ్ళారా చూశాడు. అదే విధంగా రేపటి రోజున భూమి జవసత్వాలుడిగి పనికి రాకుండా పోతుందని అలా జరిగిన నాడు అది చచ్చినట్లేనన్న  భయం బాధ అతని మాటల్లో వ్యక్తమవుతుంది. అదే విధంగా దాన్ని కాపాడుకోవాలని అతని ఆరాటం కనిపిస్తుంది.

అసలు, అతను అన్నట్లు నిజంగానే భూమి నిజంగా చనిపోతే .. లేకపోతే .. ఆ ఊహే చాలా కష్టంగా ఉంటుంది కదూ .. రేపటి తరాలు ఏమైపోతాయి .. దిగులు ముంచుకోచ్చేస్తుంది కదూ .. అనేకానేక  ప్రశ్నలు  ఉదయిస్తాయి కదూ .. నిజమే , భూమే లేకపోతే .. ఇంకా ఏ జీవరాశి ఉండదేమో ..!

దాదాపు పదిహేను నెలల క్రితం నేను ఆ మాటలు విన్నాను.  ఇప్పటికీ అవి నన్ను వెంటాడుతూనే ఉన్నాయి, వేటాడుతూనే ఉన్నాయి. ఆలోచింప చేస్తూనే ఉన్నాయి.  ప్రకృతికి విరుద్ధంగా మనం వేసే ప్రతి అడుగు అవని ఆయుషును క్షీనింప చేసేదే అని అతనికి తెలిసింది.  మరి మనం ఎందుకు అర్ధం చేసుకో లేక పోతున్నాం .. మనం సాధించిన ప్రగతి దారి ఎటు వైపు ..?  మనం వేసే అడుగులు మన వినాశనానికి దారి తీస్తున్నాయా.. భవిష్యత్ తరాల జీవితాల్ని మనం ఫణంగా పెడుతున్నామా.. ? సమస్త జీవరాసి లోకి తెలివైన మనిషి తన స్వార్ధం కోసం ప్రకృతిని కొల్లగొడుతూ, తన తెలివితేటలతో ప్రకృతిని శాసిస్తున్నాననీ, సృష్టి కి ప్రతి సృష్టి చేస్తున్నామనీ విర్రవీగుతున్న మనం సాధించిన ప్రగతి, అభివృద్ధి ఇదా  .. ?  మానవ మనుగడకు ఆధారమైన జీవ వైవిధ్యాన్ని అంతం చేయడమే కాకుండా మనని మనం అంతం చేసుకుంటూ మనం సాధించేది ఏమిటి?  రేపటి గురించిన ఆలోచనలు ఆందోళనలు కలవరపెడుతున్న సమయంలో అంటే  ఆరునెలల క్రితం మనం అనుకుంటున్న అభివృద్ధి చేసిన, చేస్తున్న జీవన విధ్వంసాన్ని విశాఖపట్టణ పారిశ్రామికవాడల్లో చూశాక అతని మాటలు అక్షరాల నిజమే అనిపించాయి.

అభివృద్ధి పేరుతో ఎడా పెడా జరుగుతున్న విచ్చిన్నాన్ని, వినాశనాన్ని  మనం లెక్కలోకి తీసుకోవడం లేదు.  రేపు జరగబోయే అనర్ధాన్ని మనలో చాలా మందిమి పట్టించుకోవడంలేదు.  తెలిసినా తెలియనట్లుగానే, మనకు సంబంధం లేని విషయంగానే ఉంటాం. మనం పీల్చే గాలినీ, మనం తాగే నీటినీ, మనం ఉండే నేలనీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదేనని మరచిపోతుంటాం. ఎవరో వచ్చి ఏదో చేస్తార్లే .. చూస్తార్లే అని ఆశిస్తాం.. లేదా బాధ్యతంతా ప్రభుత్వాలదేనని నిందలు మోపుతూ ఉంటాం.

అణుధార్మిక కేంద్రాలు, వివిధ పరిశ్రమలవల్ల పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు  అవి చేస్తున్న చెరుపు అంతా ఇంతా కాదు.  అణుధార్మిక కేంద్రాలు , వివిధరకాల పరిశ్రమలు ఏర్పాటులో రాజకీయాలకు అతీతంగా, లాభాపేక్ష కంటే ప్రజల బాగోగులే ముఖ్యంగా ప్రభుత్వం భావిస్తే, పర్యావరణ అనుమతులు ఇచ్చేముందు అలోచించి నిర్ణయాలు తీసుకొంటే,  ప్రపంచ దేశాల మధ్య, దేశంలో వివిధ రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయంతో వ్యవహరిస్తే,  ప్రకృతి వనరుల్ని అవసరానికి మించి వాడుకోకుండా ఉంటే,  ఆర్ధిక విధానాలు పర్యావరణానుకులంగా ఉంటే  పెద్ద ఎత్తున విడుదల అవుతున్న విష రసాయనాలు, ఉద్గారాల నుండి మన గాలిని, నీటిని , తిండిని, మనని మనం కాపాడుకోవచ్చేమో ..

కానీ, మన దేశంలో విడుదలయ్యే కర్బన ఉద్గారాలు,కాలుష్యాలు, వ్యర్దాలకు తోడు ఇతర దేశాల ఎలక్ట్రానిక్ చెత్త అంతా చట్ట విరుద్దంగా మన దేశం చేరుతోంది.  మనదేశ పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా మారుతోంది.

 

మానవాళికి పెనుముప్పుగా మారుతున్న భూతాపం తగ్గించి పర్యావరణ విధ్వంసం నుండి ప్రజలని సంరక్షించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవి అత్యల్పమనే చెప్పాలి.

పృద్విని కాపాడుకోవాలనే లక్ష్యంతో 1970 ఏప్రిల్ 22న మొదటిసారిగా అమెరికా అంతటా ధరిత్రీ దినోత్సవం జరిగింది.  అందుకు కారణం గెలార్డ్ అతని బృందం. పర్యావరణ పరిరక్షణకోసం అది ప్రపంచ దేశాలకు పాకింది. దాదాపు 184 దేశాలు ఈ అందులో భాగస్వాములయ్యాయి.  వ్యక్తులు , సంస్థలు , దేశాలు ధరిత్రిని కాపాడుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కానీ పర్యావరణ విద్వంసం పెరిగిపోతున్న స్థాయిలో పరిరక్షణ కార్యక్రమాలు లేవు. ఇంతింతై వటుడింతై అన్నట్లు అడ్డూ అదుపూ లేకుండా జల, వాయు, భూ కాలుష్యాలు పెరిగిపోతున్నాయి.  తద్వారా ఏర్పడే విపరీత వాతావరణ పరిస్థితుల్లో వచ్చే సునామీలు, తుఫాన్ లు, అకాల వర్షాలు, హిమపాతాలు, వేసవి తాపాలు జీవన వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తున్నాయి.

జీవులు  ఉన్న ఏకైక గ్రహం భూమి. అదే మన చర్యల వల్ల జీవం కోల్పోతే ..? ఎలా .. మనుగడ ఎలా ..? ఆలోచిద్దాం .. నిద్రపోతున్న ప్రభుత్వాలని తట్టి లేపుదాం.. ఆ క్రమంలో కృషి చేస్తున్న సంస్థలకి, వ్యక్తులకి మన వంతు సహకారం అందిద్దాం ..  మనమంతా పర్యావరణ స్పృహ పెంచుకొంటూ మన తోటివారిలోను ఆ స్పృహ వచ్చేలా చూద్దాం . చేయీ చేయీ కలిపి అడుగు ముందుకేద్దాంరండి.  రండి కదలి రండి పర్యావరణ పరిరక్షణలో భాగం అవ్వండి.  అప్పుడే గోండు గిరిజనుడు చెప్పినట్లు భూతల్లి మనని చల్లగా చూస్తుంది .

 

వి. శాంతి ప్రబోధ

Click here to Reply or Forward

2.91 GB (19%) of 15 GB used

Manage

TermsPrivacy

Last account activity: 1 minute ago

Details

విశ్వకవి రవీంద్రుడు

sripada sahiti kalapitham37వ తేది  విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ , మనసుకవి ఆత్రేయల జన్మదినం సందర్భంగా శ్రీపాద సాహితీ కళాపీఠం వారు నిజామాబాదులో కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ఆ కార్యక్రమంలో రవీంద్రనాథ్ టాగూర్ గూర్చి నేను చేసిన ప్రసంగ పాఠం ఇది
రవీంద్రనాథ్ టాగూర్ అనగానే నా మనసులో మేదిలేవి మూడు. ఒకటి జనగణమన , రెండోది గీతాంజలి , మూడోది శాంతి నికేతన్. .
మన జాతీయగీతం జనగణమన రాసింది రవీంద్రనాథ్ టాగూర్ అన్న విషయం మనందరికీ తెలుసు. ఆ జాతీయ గీతాన్ని మనమందరం చిన్నప్పటి నుండి ఇప్పటివరకూ ఎన్నోసార్లు ఆలాపించాం.  రవీంద్రుడు జనగణమన రాసినప్పుడు ఆ గీతానికి పెట్టిన పేరు భారత విధాత. కాని తర్వాతి కాలంలో అది జనగణమన గానే అందరికీ తెలుసు. మన జాతీయ గీతమే కాదు బంగ్లాదేశ్ జాతీయ గీతం “అమోర్ సోనార్ బంగ్లా ” కూడా రవీంద్రుని గీతమే .  రెండు దేశాలకు జాతీయ గీతాన్ని అందించిన ఘనత చరిత్రలో మరెవరికీ దక్కలేదేమో ..!
ఆసియాలోనే మొట్టమొదటి నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రుడు. ఆయన విశాల హృదయంలోంచి  వెలువడ్డ గీతాంజలి  భక్తిపూర్వక భావ గీతాలు ఆయన్ని విశ్వకవిని చేశాయి . మనిషిని కుంగ దీసే నిరాశా నిస్పృహల్ని పోగొట్టి శ్రమ జీవన సౌందర్యాన్ని, గొప్పదనాన్ని , ప్రకృతి తో పాటు మనుషుల్ని విశాల హృదయంతో ఆరాధించాడు రవీంద్రుడు. మనవసంబంధాల పట్లా ఆయనకున్న విశ్వాసం , ప్రేమాభిమానాలు ఆయన గితాలలో కన్పిస్తాయి.  బహుశ తన  కుటుంబ జీవితం మానవ సంబంధాల పట్ల విశ్వాసం పెంచితే , కొన్ని కారణాల వాళ్ళ ఇల్లు కదల కుండా ఉండడం ఆయన్ని బయటి ప్రపంచ సౌందర్యం  చాలా ఆకర్షించి ఉండొచ్చు.
 బెంగాలీలో రాసిన ఆ గీతాల్ని ఆయనే ఇంగ్లీషులోకి చేశారు.  ఆఅవి గార్డనర్ , క్రిసేంట్ మూన్ లో ప్రచురితమయ్యాయి.  1913లో నోబెల్ పురస్కారం ప్రకటించిన  తర్వాత అన్ని భారతీయ భాషల్లోకే కాకుండా  ప్రముఖ ప్రపంచ భాషలన్నిట్లోకి అనువాదమయ్యాయి.   కోట్ల కొద్ది విదేశీయులకు భారతీయ సంస్కృతీ పై గౌరవాన్ని కలిగించాయి.
నేను 2005లో స్వీడెన్ వెళ్ళినప్పుడు సిటీ హాల్ చూడగానే , అక్కడికి వెళ్ళగానే ఒక ఉద్వేగం నన్ను ముంచెత్తింది. ఇక్కడే కదా రవీంద్రుడు నోబెల్ అందుకుంది అనుకుంటూ ఏ హాల్ లో అందుకున్నారు .. ఎక్కడ డిన్నర్ చేశారు వంటి ప్రశ్నలు వేసినప్పుడు పురస్కారం అందుకోవడానికి ఆనాడు ఉన్న పరిస్థితులలో రవీంద్రుడు స్వయంగా రాలేకపోయారని టెలిగ్రాం ద్వారా తన సందేశం పంపారని తెలిపారు.   తర్వాత శాంతి నికేతన్ లో దొంగలు పడినప్పుడు నోబెల్ పురస్కార పతకం కూడా పోయింది. శాంతి నికేతన్ నిర్వాహకుల కోరిక మేరకు నోబెల్ కమిటి నమూనా మెడల్ ను చేయించి పంపిందట.
గీతాంజలి గీతాల్లో మహాత్ముడికి నచ్చిన గీతం
 ” ఈ మంత్రములు జపమాలలు విడిచిపెట్టు
తలపులన్నింటినీ బంధించి
ఈ చీకటిగదిలో ఎవరిని పూజిస్తున్నావు .. కళ్ళు తెరచి చూడు
 ఆరాధించే దేవుడు నీ  ఎదుట లేడు
ఎచట రైతు  నేలదున్నుతున్నాడో
ఎచట శ్రామికుడు రాళ్ళు పగులగోడుతున్నడో
అక్కడ పరమాత్ముడున్నాడు
వారు ఎండలో, వానలో ధూళి ధూపరితములైన వస్త్రములతో ఉన్నారు
నీవు కూడా పట్టు పితాంబరములు ఆవల పెట్టు ఆ నేల మీదికి పదా … “
నాకు నచ్చిన గీతం ఏదంటే
“ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో
ఎక్కడ విజ్ఞానం స్వేచ్చగా మనగలుగుతాడో
ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై ఇరుకైన గోడల మధ్య మగ్గి పోవదో
 నా దేశాన్ని ఎక్కడ విరామమైన అన్వేషణ , పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో
ఎక్కడ పరిశుద్దమైన జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో  ఇంకిపోదో
తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో
ఆ స్వేచ్చా స్వర్గంలోకి , తండ్రీ ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహింపు ..”
టాగూరు కి ‘సర్ ‘ బిరుదినిచ్చి గౌరవించింది బ్రిటిష్ ప్రభుత్వం. కానీ దానిని ఆయన తిరస్కరించారు. కారణం జలియన్ వాలా బాగ్ ఉదంతంతో తివ్రమనస్తాపం చెందిన టాగూర్ అందుకు ని రసనగా తాను ‘సర్ ‘ బిరుదును తిరస్కరించారు.
ఐదుగురు విద్యార్థులతో ఆయన ప్రాంభించిన శాంతినికేతన్ ఇప్పుడు వందలాది మంది విద్యార్థులతో విరాజిల్లుతోంది.
రవీంద్రుడు గొప్ప కవి మాత్రమే కాదు ఆయన గొప్ప విద్యావేత్త, కళాకారుడు, నాటక రచయిత, నవలా కారుడు, సంగీతవేత్త, తత్వవేత్త, చిత్రకారుడు.  బహుముఖ ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు గొప్ప మానవతావాది   రవీంద్రుడు . ఆయనని స్మరించుకోవడం మాత్రమే కాదు ఆయన బోధించిన మానవతను, ప్రేమభావాన్ని,  విశాల హృదయాన్ని అలవరచుకోవాలి  మనం .

తనదాకా వస్తే.. (కథ) – వి . శాంతి ప్రబోధ

తనదాకా వస్తే.. (కథ) – వి . శాంతి ప్రబోధ.

Tag Cloud

%d bloggers like this: