The greatest WordPress.com site in all the land!

Archive for September, 2014

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…

batukamma 1దసరా, బతుకమ్మ పండుగల సీజన్ రాగానే నా చిన్ననాటి మధుర జ్ఞాపకాలు ముసిరి మరోసారి ఆనాటి రోజుల్లోకి తీసుకుపోతుంటాయి. నా బాల్యంలో జరుపుకున్న పండుగలలో బతుకమ్మ ఒక మధురానుభూతి. ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజూ, సద్దుల బతుకమ్మ రోజు మా ఇంటి దగ్గర చాలా సందడిగా ఉండేది. కారణం మా ఇంట్లో ఉండే రకరకాల పువ్వులు. ఉదయం లేవగానే మా తమ్ముడు, మా పొలంలో పని చేసే జీతగాళ్ళు మా ఇంటి ముందు ఉండే పెద్ద పందిరి ఎక్కే వారు. ఆ పందిరి పాకిన తీగ బటాణి పూవులు , మాలతీ పూలూ, బోగన్ విలియా పూవులు కోసి కిందకి వేసే వారు. నేను, నా చెల్లెళ్ళు వాటిని పెద్ద పెద్ద గంపలలో వేటికవి నింపే వాళ్ళం. ఆ తర్వాత దొడ్లో విరగ బూసిన బంతి, బంగాళాబంతి (పట్నం బంతి), ఊక బంతి, పైడాపిన్, నందివర్ధనం,తెలుపు- గులాబీ రంగుల గన్నేరు, గోరింట వంటి రకరకాల పూలను కోసి గంపలలో సిద్దంగా ఉండే వాళ్ళం. ఉదయమే లేచి అడవి సమీపంలోనో, బంజరు భూముల్లోనో కనిపించే తంగేడు పూలు, కంది, జొన్న వంటి మెట్ట పోలాల్లోంచి గునక పూవు, కట్ల పూవు వంటి వాటిని మా వూరివాళ్ళు తెచ్చుకునే వారు. ఆ తర్వాత అంటే తొమ్మిది పదిగంటల సమయంలో మా ఇంటికి చేరేవారు పూల కోసం. మా అమ్మో, నాయనమ్మో వచ్చిన వాళ్లకి కాదనకుండా అన్ని రకాల పూలూ ఇచ్చి పంపే వాళ్ళు. ఆ సందడి ముగిసే సరికి పన్నెండయ్యేది.

మా ఇంట్లో మా వాళ్ళు బతుకమ్మలు పేర్చేవారు కాదు. మొదట్లో అమ్మనీ, నాయనమ్మని విసిగించే వాళ్ళం. మనమూ బతుకమ్మలు పేరుద్దామని. ఆ పండుగ చేయడం మాకు రాదు. మనకు అలవాటు లేదు అని చెప్పి మీరు లక్ష్మి అక్క వాళ్ళింటి దగ్గరో, శోభక్క వాళ్ళింటి దగ్గరకో, అరుణ వాళ్ళింటి దగ్గరకో వెళ్లి నేర్చుకోండి అని చెప్పింది అమ్మ. అప్పటి నుండి వాళ్ళు తెచ్చిన తంగేడు, గునక , కట్ల పూవులను తీసుకుని ఒక పెద్ద తప్క (ప్లేట్ ) తీసుకుని గుమ్మడి ఆకులు కానీ, సొర ఆకులు కాని వేసి చుట్టూ పసుపు రంగులో ఉండే తంగేడు పూలను ఆ ప్లేటు చుట్టూ గుండ్రంగా పేర్చే వాళ్ళం. మధ్యలో ఉన్న ఖాళీలో తంగేడు ఆకు నింపే వాళ్ళం. ఆ తర్వాత తెల్లటి గునక పూల చివరలో నిండు గులాబీ రంగులో మొద్దొచ్చె గునక పూలు,టమాటా రంగులో ఉండే కాయితప్పూలూ, బంతి పూలు, బటాణి పూలూ, పట్నం బంతి పూలూ, నీలి రంగు పూలూ , మాలతీపూలూ ఒకదాని తర్వాత ఒకరకం రంగు వచ్చేట్టు శిఖరం లాగా పేర్చి పైన గుమ్మడి పూవు బొడ్డెమ్మతో ఎంత అందంగా ఉండేవో మా ఊరి బతుకమ్మలు. అసలు బతుకమ్మలు పేర్చడం ఓ అద్భుత కళ. ఒకరికొకరు పోటీ పది తమ ఇంటి బతుకమ్మ బాగుండాలని తమ సృజనకి పదునుపెట్టి చేసేవాళ్ళు. అంత అందమైన బతుకమ్మలు ఆ తర్వాతి కాలంలో నేనెప్పుడూ చూడనే లేదు.batukamma

మేం మేము పట్టుకోగలిగే విధంగా చిన్న బతుకమ్మలే పెర్చుకునే వాళ్ళం కానీ, లక్ష్మి అక్క వాళ్ళ అమ్మ వెంకటరత్తమ్మగారు, శోభక్క వాళ్ళమ్మ ఇందిరమ్మగారు వాళ్ళు చాలా పెద్దవి దాదాపు మా ఎత్తు ఉండే విధంగా తాయారు చేసేవారు పెద్ద ఇత్తడి తంబాలంలో వాటిని పెర్చేవారు. తోడు బతుకమ్మ మొదటి దానికంటే చిన్నదిగా ఉండేది. వాళ్ళ దగ్గరే మేమూ బతుకమ్మలు పేర్చడం నేర్చుకున్నాం. తొమ్మిది రకాల సున్ని పిండిలతో సద్దులు చేసేవారు. కొంచెం సేపు ఎవరిదైనా ఒకరింటిదగ్గర ఆడి ఆ తర్వాత ఓ మైలు దూరంలో ఉండే చెరువు ఒడ్డుకు తీసుకెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడేవాళ్ళు. వాళ్ళతో మేము చప్పట్లు చరుస్తునో, కోలలు వేస్తూనో ఆడేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు ఒడ్డున నిల్చుని చూసేవారు. ఊరు ఊరన్త అక్కడే ఉండేది. అందరూ అలా ఒక దగ్గర కలిసేది ఆ ఒక్క పండుగకే.

ఆ పెద్ద పెద్ద బతుకమ్మలు చెరువుదాకా మోయడం చాల కష్టం కదా .. అందుకే జీతగాళ్ళు వాటిని చేరువుదాకా తెచ్చే వారు. చెరువుకు వెళ్ళేటప్పుడు బాండుతో చప్పుడు చేసుకుంటూ వెళ్ళడం భలే ఉండేది. పెద్ద వాళ్ళు పెట్టెలో అడుగున దాచిన పెద్దంచు పట్టు చీరలు తీసి కట్టేవాళ్ళు. మేం పిల్లలం లంగా జాకెట్టు వేసుకునే వాళ్ళం. వెంట మగవాళ్ళు కుడా వచ్చేవారు. చెరువు దగ్గర చదునుగా ఉన్న దగ్గర ఒక వెంపలి చెట్టు నాటి పసుపు కుంకుమలు వేసి ఊదుబత్తులు (సాంబ్రాణి కడ్డీలు ) వెలిగించేవారు. దాని చుట్టూ బతుకమ్మలు ఉంచినాక ఆట మెదలయ్యేది.

ఒక్కేసి పువ్వేసి చందమామ
ఒక జాము ఆయెనే చందమామ
రెండేసి పువ్వేసి చందమామ
రెండు జాములయేనే చందమామ

బంగారు బతుకమ్మ ఉయ్యాలో
ఇద్దరక్కజెల్లెల్లు ఉయ్యాలో
ఒక్కురికిచ్చిరి ఉయ్యాలో

శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మా .. చిత్రమై పొదురమ్మ గౌరమ్మా అంటూ రకరకాల పాటలు పాడేవారు .
batukamma 2
ఎంగిలి పువ్వు బతుకమ్మకి పాడే పాటలు, సద్దుల బతుకమ్మకి పాడే పాటల్లో తేడా ఉండేది. ఆ పాటలు ఇప్పుడు గుర్తు లేవుగాని వాళ్ళతో కలసి లయబద్దంగా అడుగులేస్తూ, చప్పట్లు చరుస్తూ గుండ్రంగా తిరుగుతూ ఆడడం బలే జోష్ ఇచ్చేది. బతుకమ్మలాటకి వయసుతో పనిలేకుండా ఆడవాళ్ళంతా ఆడేవాళ్ళు. పేదలు, డబ్బున్నవాళ్ళు అనే తేడా కూడా కనిపించేది కాదు.

ఆట అయిపోయాక బతుకమ్మలని ఆడవాళ్ళు నీళ్ళలోకి దిగి వదిలేసే వారు. పోయిరావమ్మా అంటూ .. సాగనంపేవారు . జీతగాళ్ళు వాటిని ఇంకా కొంత లోపలి పంపేవారు. ఆ తర్వాత అందరూ తమ ఇంటి నుండి తెచ్చిన తొమ్మిది రకాల సద్దుల మూటలు విప్పి “ఇస్తి నమ్మ వాయనం , పుచ్చు కుంటినమ్మ వాయనం ” అనుకుంటూ ఇచ్చి పుచ్చుకునేవారు. మా పిల్ల మూక అంతా ఆ సద్దులు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూసే వాళ్ళం. అలా సంబురం అంతా అయిపోయే సరికి చీకటి పడిపోయేది. చెరువు ఒడ్డునుండి పొలం గట్ల మీదుగా ఇంటికి వెళ్ళాలి. టార్చి లైటు వెలుతురులో ఒకరితర్వాత ఒకరం నడుచుకుంటూ వెళ్తుంటే పెద్దలు పిల్లలకి జాగ్రత్తలు చెప్పడం, చెరువులోంచి వచ్చిన బురద కాళ్ళు ఆడవాళ్ళ చీరలకు తగిలితే వాళ్ళు చీర పాడైపోతుందని జాగర్త పడడం, కొంటె పిల్లలు కావాలని గట్టుమీద నడుస్తూ వాళ్ళను దాటుకుపోవడం అంతా తమాషాగా ఉండేది.

దాదాపుగా బతుకమ్మలని మరచిపొతున్న సమయంలో ఊపునిస్తూ వచ్చిన తెలంగాణా ఉద్యమం బతుకమ్మకి మళ్లీ బతుకునిచ్చిందనిపిస్తోంది. వెదురుబద్దలకి రంగు కాయితాలు అంటించి చేసిన బతుకమ్మల ఆట కొద్ది మందితో ఎంతో కృత్రిమంగా ఉండేది. ఇప్పుడుజవం జీవం వచ్చిన బతుకమ్మలు కళ్ళ కింపుగా .. జనంతో కళకళలాడుతూ నిండుగా .. ఉద్యమ స్పూర్తితో విస్తరిస్తూ .. సమకాలీన సమస్యలతో విశాలత్వం సంతరించుకుంటూ ..

వి. శాంతి ప్రబోధ

రాజ్యహింస – తెలుగు సాహిత్యం

రాజ్యహింస .. అది తాము మాట్లాడకూడని , రాయదగని పదం కొందరికి అయితే .. మరి కొందరికి అసలు ఆ పదానికి అర్ధమే తెలియదు.

భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో నాడు కరీంనగర్ – ఆదిలాబాదు జిల్లాలను కల్లోల ప్రాంతాలుగా ప్రకటించినప్పుడూ .., నేడు బహుళజాతి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు చెల్లుబాటుకాకపోవడంతో వాకపల్లి …వంటి సంఘటనలు కుదిపేసినా , దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత పేరిట ఆదివాసీల పై నిరంతర హింస జరుగుతున్నా అదేదీ తెలియకుండా , అది తమకు సంబంధించినది కాదనే స్పృహతో తెల్సుకోవడానికి ప్రయత్నించకుండా , ఒకవేళ తెలిసినా వాటికి సాహిత్యంలో చోటు కల్పించే సాహసం చేయలేని వాళ్లెందరో..!

ఇక్కడ ఓ విషయం మీతో పంచుకోవాలి . ఈ పత్రం తయారు చేసుకునే క్రమంలో మహిళలపై రాజ్యహింసకు సంబంధించిన సాహిత్యం గురించి తెలిసిన విషయాలు నాతో పంచుకోవలసిందిగా ఫేస్బుక్ మిత్రులకు విజ్ఞప్తి చేశాను. రెండో మూడో లైకులు తప్ప వేరే స్పందన లేదు. కారణం ఏమిటి? అతి మామూలు విషయాలకి విశేషంగా స్పందించే మిత్రుల నుండి స్పందన లేకపోవడానికి కారణం ఏమిటి? అప్పుడర్థమయింది రాజ్యహింస అంటే ఎంత భయమో .. రాజ్యం ఎంత భయపెడుతుందో ..

రాజ్యహింస గురించి రాయాలంటే ముందుగా రాజ్యం గురించీ, దాని పోకడల గురించీ, అందువల్ల ఇబ్బందులకు, హింసకు గురయ్యేవారి జీవితాల గురించీ తెలిసి ఉండాలి. కాల్పనిక సాహిత్యం కాకుండా వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే రచనలు చేయగలగాలి. అందుకు సామాజిక స్పృహ, సమకాలీన సమాజం పట్ల అవగాహన ఉండాలి. భిన్న పరిస్థితులలో, విభిన్న కాలాలలో సమాజ ధోరణులు తెలిసి ఉండాలి. విభిన్న పార్శ్వాలలో మహిళలపై జరిగే హింస గురించి అర్ధం చేసుకోవాలి, విశ్లేషించాలి.

తమపై జరిగే వివిధ రకాలైన దోపిడీని, వివక్షని , అత్యాచారాలకు, పీడనకు, హింసకు వ్యతిరేకంగా మహిళలు తమ గళం విప్పుతున్నారు. వీధుల్లోకి వస్తున్నారు. పితృస్వామిక భావజాలంతో నిండి ఉన్న సమాజంలో తమ అస్తిత్వం కోసం, స్వేచ్చ కోసం, భద్రత కోసం, సమానత్వం కోసం హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో ముందు వరుసలో నిలిచిన స్త్రీలపై హింస కూడా పెరిగిపోయింది. ఆమె ఆలోచనను, చైతన్యాన్ని, ఎదుగుదలను మొగ్గలోనే తుంచేయడానికి ప్రయత్నం సాగుతూనే ఉంది. ఆధిపత్య భావజాలంతో ఉన్న వారు ఆమెను అణచివేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆమెపై , ఆమె లైంగికతపై బురద జల్లుతునే ఉన్నారు. లేదా ఆమె లైంగికతనే దోపిడీ చేస్తూ, శారీరక మానసిక హింసకు గురిచేస్తూ ఉండడం మనకు పురాణ కాలం నుండి నేటివరకూ కనిపిస్తున్న వాస్తవం. అది జరిగేది కుటుంబం వల్ల కావచ్చు. సమాజం వల్ల కావచ్చు . రాజ్యం వల్ల కావచ్చు. అయినా, ఆమె అన్నింటిని ఎదుర్కుంటూ ముందుకు అడుగుగేస్తోంది. ఈ సమయంలో ఆమె పడే వేదనని , ఆవేదనని , కష్ట నష్టాలని, ఆమె స్తైర్యాన్ని, నిబ్బరాన్నికూలదోయడానికి వివిధ కోణాల్లో, వివిధ పద్ధతుల్లో ప్రయత్నాలూ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటప్పుడు ఆమెకు అండగా నిలబడాల్సింది రాజ్యం. కానీ , జరుగుతున్నదేమిటి? ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన రాజ్యం, కనుపాపలా చూసుకోవాల్సిన రాజ్యం, తానే కాటేస్తే ..? హింసకు గురిచేస్తే ..?? ఎవరితో చెప్పుకోవాలి??? ఎలా న్యాయం పొందాలి ???

అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసాన్ని జనం గమనిస్తున్నారు . తమ హక్కుల సాధనకు కదులుతున్నారు . తమపై జరిగే దోపిడీని , అణచివేతను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరికొకరు హక్కుల సాధన కోసం పోరాడుతూ , సంఘటితమవుతూ సాగుతూన్నారు. ఇంద్రవెల్లి నుండి వాకపల్లిదాకా కదులుతూనే ఉన్నారు. నాటి స్వాతంత్ర్య ఉద్యమం నుండి సారా ఉద్యమం, విద్యుత్ ఉద్యమం, ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకు నిరసన వరకూ సాగుతూనే ఉన్నారు. ప్రతిఘటన ఎదురవుతున్న కొద్దీ మరింత బలం పుంజుకుంటూ ఉద్యమ లక్ష్యం వైపు సాగుతున్నారు . ఎప్పుడైతే ప్రజలు ఒక సమస్య పరిష్కారానికి కదలడం మొదలుపెట్టారో అప్పుడు పాలకుల్లో , ప్రభుత్వంలో కలవరం మొదలు అవుతుంది. ప్రజల కదలికలు నియంత్రించాలనుకుంటుంది. అందుకోసం రాజ్యం తన అధికార బలంతో అణచివేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ప్రజల హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ఎప్పుడైతే అణచివేత, ఏరివేత మొదలుపెడుతుందో అప్పుడు ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకత, నిరసన పెరుగుతుంది. ఫలితం రాజ్యం తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో హింస మొదలుపెడుతుంది. అది ఉద్రుతమవుతుంది.

అవసరమైతే పిల్లి పులిగా మారుతుందన్నట్లు సామాన్య మహిళలు వివిధ సందర్భాల్లో తమపై జరిగే రాజ్యహింసని ఎదుర్కొంటూనే .. స్థానిక మహిళలని కలుపుకుంటూనే మహిళలపై దోపిడీకి వ్యతిరేకంగా, రాజ్యహింసకి వ్యతిరేకంగా సామాజిక, రాజకీయ, ఆర్ద్తిక, సాంస్కృతిక కోణాల్లో కారణాలని వెతుక్కుంటూ అసాధారణంగా సాగుతున్నారు. పాలకులు పాలక వర్గం చేతిలోని వారు చేసే హింసాకాండ ఎప్పుడయితే బయటి ప్రపంచంలోకి వస్తుందో .. అప్పుడే సామాన్యులకి జరుగుతున్నదేమిటో అర్ధమవుతుంది.

ఆ నిర్భందాలని , దాడుల్ని, హింసని తట్టుకుని రాజ్యహింసపై తమ కలం పట్టి అక్షర వ్యవసాయం చేసే వారూ లేకపోలేదు . జరుగుతున్న దుర్నీతిని , ఆటవిక న్యాయాన్ని, బాధితుల పట్ల నింపుతున్న విషాన్ని బయట పెట్టడానికి రచన ఒక ఆయుధం. నేడు ప్రచార ప్రసార సాధనాలు రేటింగ్ పెంచుకుని వ్యాపారం పెంచుకునే ఆత్రుతే తప్ప వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకుపోవడంలో విఫలం అయ్యాయనేది కాదనలేని వాస్తవం. ప్రతి చానల్ , ప్రతి వార్తా పత్రిక ఏదో ఒక పార్టీ గొడుగు కింద చేరి అబద్దాల్ని వండి వారుస్తున్నాయనేది కాదనలేని సత్యం. అలాంటప్పుడు వాస్తవాల్ని రచనలో ప్రతిబింప చేయాల్సిన బాధ్యత సృజనశీలురదే.

పోరాటాల్లో, ఉద్యమాల్లో ఉన్న మహిళలు , మరీ ముఖ్యంగా మావోయిస్ట్ ఉద్యమాల్లోని మహిళలు తుపాకీలు పట్టడమే కాదు కలం పట్టి అక్షారాలు నేర్చుకోవడంతో పాటు సాహిత్యం సృష్టిస్తున్నారు. వారి సాహిత్యం వారి అనుభవాలతో , వారి చుట్టూ జరుగుతున్న సంఘటనల నేపథ్యం నుండి వచ్చిన సాహిత్యం కనుక వారి సాహిత్యంలో మహిళలపై జరిగే రాజ్యహింసని తడమకుండా ఉండలేని స్థితి. అవే బయటి ప్రపంచానికి వాస్తవ స్థితిని తెలియజేసేది.

పోరాటాలలో , ఉద్యమాలలో మమేకం కాని వారికి మహిళలపై జరిగే రాజ్యహింస గురించి ఏం తెలుస్తుంది ..? ప్రచార మాధ్యమంలో వచ్చే మసిబూసి మారేడుకాయ చేసిన వార్తలు తప్ప..! అడపాదడపా ప్రగతిశీల సంస్థలు, వ్యక్తులు అందించే సాహిత్యం తప్ప .!!

నేను ఈ పత్రం తయారు చేసుకోవడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. కారణం వ్యక్తిగతంగా నాకు ఏ పోరాటాలతోను ఉద్యమాలతోను సంబంధం లేకపోవడం. ఈ అంశంపై వచ్చిన సాహిత్యం నాకు అందుబాటులో ఉన్నది తక్కువ కావడం కూడా ఒక కారణం కావచ్చు,

రాజ్యహింసపై మహిళలు సృజించిన తెలుగు సాహిత్యం తక్కువే. గృహ హింస , సామాజిక హింస, కులహింస, మత హింస, లైంగిక హింస , మానసిక హింస, సాంస్కృతిక హింస వంటి హింసలకు సంబంధించిన రచనలే కనిపించాయి. కానీ, రాజ్యహింసకు సంబంధించి లభ్యమయిన రచనలు చాలా చాలా తక్కువ. లభ్యమయినవి రాశిలో తక్కువే కావచ్చు కాని, సామాజిక, రాజకీయ, ఆర్ధిక , సాంస్కృతిక పరిస్థితులపై లోతైన అవగాహన, పరిశీలనతో ఉన్నాయవి.

నా వెతుకులాటలో నాకు మొదట నా దగ్గరే లభ్యమైంది 1992 ఏప్రిల్ లో వెలువడ్డ నలుపు” మహిళా ప్రత్యేక సంచిక . అది ఎప్పుడు ఎలా నాదగ్గరికి చేరిందో కానీ రాయడానికి నాకు శక్తినిచ్చింది.

తమది కాని దాన్ని, తమవారైన ఆక్రమదారులను సమర్ధించడం రాజ్యం స్వభావం. అందుకు అడ్డువచ్చిన వారిని హింసించడం దాని స్వభావమే. అదే విధంగా తనకు అడ్డువచ్చే వారిని, న్యాయంగా తమకు రావలసిన దాన్ని పొందడం కోసం పోరాడే వారిని, తమ హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న వారిని ప్రభుత్వం అణిచేందుకు రకరకాల హింసా పద్దతులు ప్రయోగించడం అందరికీ తెలిసిందే. అందుకు మనం ఎన్నో సంఘటనలని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అలాంటి సంఘటనలకి స్త్రీల సాహిత్యంలో ఎంత చోటు లభిస్తోందో తడిమి చూద్దాం.

వివిధ సాహితీ ప్రక్రియలలో మొదట వ్యాసం తీసుకుందాం.

రాజ్యహింస ఈ పదం వినగానే మనకేమనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో , ప్రజలు చైతన్యం అవుతున్న క్రమంలో పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో వినవచ్చే పదం అనుకుంటాం. కానీ, శతాబ్దాల రాజ్యహింసకు ప్రతీక రామాయణం ఎందరెందరు తాటకలు .. ఎన్ని వేలమంది శూర్పణకలు అవమానాల పాలయ్యారో అని ఆవేదన వ్యక్తం చేసిన బి. విజయ భారతి విశ్లేషణా వ్యాసం మనని మరో కోణంలో ఆలోచింపచేస్తుంది.

రామరాజ్యం అంటే రాజ్యహింసల సమాహారం. ఇలాంటి రామరాజ్యమా మనం కోరుకునేది ? రాజ్యహింస రూపాలు మార్చుకుంటోంది కానీ స్వభావాన్ని కాదన్న విజయభారతి మాట అక్షర సత్యం అనిపిస్తుంది ఆ వ్యాసం చదివితే. పురాణ వాజ్మయాన్ని చరిత్రను సమన్వయపరచి చూస్తే రామాయణంలోని రాజ్యహింస స్వరూపం స్పష్టమవుతుంది. ఈనాటి బడుగువర్గాల ప్రజలూ ఆదివాసీలు రాజ్యం చేతిలో అనుభవిస్తున్న హింస రామాయణ కాలం నాటిది ఇంకా ముందటిదే కావచ్చు అంటారు బి. విజయ భారతి ” రామాయణంలో గ్రీన్ హంట్ ” అనే వ్యాసంలో (ఈ వ్యాసం వసంతం లో వచ్చింది).

రచయిత్రి మాటల్లో “ఈ రాజ్యహింస స్వరూపాన్ని అర్ధం చేసుకోవాలంటే రామాయణం బాలకాండ లో ‘తాటక వధ ‘ చదవాల్సిందే . సహస్ర నాగ బాల సమన్విత అయిన తాటకి భర్తను అగస్త్యముని శాపంతో దహించాడు. అదేమిటని అడగడానికి వెళ్ళిన తాటకనూ తాటక కొడుకులనూ చిత్రహింసల పాలు చేశారు. పోలీసు టాణాలోని హింస సరిపోక రాజధాని నుండి రాకుమారులు రామలక్ష్మణులు వచ్చారు. ఒంటరిగా, చేతిలో ఆయుధం లేకుండా ఉన్న సమయంలో తాటకను చేతులు నరికి ముక్కు చెవులూ కోసి ఆ పైన గుండెల్లోకి బాణం వేసి చంపారు. ఈ ఎన్కౌంటర్ ఎందుకు జరిగిందంటే దేశం సుఖం కోసం, గో బ్రాహ్మణ హితం కోసం, చాతుర్వర్ణ హితం కోసం జరిగిందని రామాయణం సంజాయిషీ ఇచ్చింది. రాముడు అరణ్యవాసం పేరుతో ‘దండక’లో ప్రవేశించాడు. దండక రాక్షసుల రాజ్యం. అక్కడ వారి అనుమతిలేకుండా ఆశ్రమం నిర్మించుకున్నాడు. దండకలో ప్రవేశించిన కొత్త వాళ్లెవరని, ఆయుధాలతో ఎందుకు తిరుగుతున్నారని సందేహాలు వచ్చేసరికి శుర్పణక ముక్కూ చెవులూ తెగిపోయాయి. ”
అదీ రాజ్య హింసా విధానం. ఈ విధానం నేటికీ సాగుతూనే .. ఉందిగా ..?! మావోయిస్టుల ఏరివేత పేరుతో దండకారణ్యంలో చేరిన సాయుధబలగాలు ఆదివాసీలపై చేస్తున్న దమనకాందని గుర్తుకు తేవడం లేదూ … ?

ఆకాశంలో సగం అయిన స్త్రీలు పోరాటాల్లోను సగం కావడం , వర్గ దోపిడీకి , పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించడం , దోపిడీ వర్గాలకు నిజంగానే భయకంపితులను చేస్తున్నది. అనేక హింసలను అనుభవించిన స్త్రీలు చైతన్యవంతులై ఒక్కసారి ఉద్యమాలలోకి రావడమంటూ జరిగితే సాధారణంగా వెనక్కు తిరిగి వెళ్ళే సమస్యే ఉత్పన్నం కాదు. చరిత్ర రుజువు చేసిన అంశం ఇది. అందుకే ప్రారంభంలోనే స్త్రీల కదలికలను అడ్డుకునేందుకు స్త్రీ విముక్తి పోరాటాలను త్రుంచి వేసేందుకు రాజ్యం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నది. మహిళా ఉద్యమాలను, ప్రజా ఉద్యమాలను అణచి వేసేందుకు రాజ్యం లైంగిక అత్యాచారాలను ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నది అంటారు విమల మహిళా పోరాటాలు – రాజ్యహింస అనే వ్యాసంలో (1992 ఏప్రిల్ ‘నలుపు ‘ సంచికలో) .

పోరాట ప్రాంతాలలో రాజ్యహింస మూడు పద్దతులలో అమలవుతూ ఉంది .
ఒకటి పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళా సంఘాల కార్యకర్తలపైన , సానుభూతి పరులపైన, విప్లవ సంస్థలలో పని చేస్తున్న మహిళా కార్యకర్తలపైన
రెండు , ప్రజా ఉద్యమాలలో పనిచేస్తున్న కార్యకర్తలు , సానుభూతిపరుల కుటుంబాలకు చెందిన స్త్రీల పైన ,
మూడు , ఎలాంటి పోరాటాలతోను సంబంధం లేకపోయినప్పటికీ పోరాట ప్రాంతాలలో ఉండడం, స్త్రీలు కావడం వల్ల జరిగేది .

రాష్ట్రంలో నేడు పితృస్వామ్యం , జెండర్ , స్త్రీల లైంగిక స్వేచ్చ , స్త్రీల చరిత్ర , స్త్రీల దృక్కోణం … మొదలైన అంశాలపై చెప్పుకోదగిన చర్చ సాగుతోంది . దీనితో పాటు , నిజానికి గ్రహించాల్సిన మరో విషయం స్త్రీలు పోరాడుతున్నారు . అవి మద్యపాన నిషేధ ఉద్యమం కానీయండి, విద్యుత్ వ్యతిరేక ఉద్యమం కానీయండి, ఆర్ధిక పోరాటాలు కానివ్వండి , పాక్షిక సమస్యలపై సాగిస్తున్న పోరాటాలు కానివ్వండి . ఏదైనా స్త్రీలు వంట గదులను , కుటుంబం నాలుగు గోడలను దాటి బయటికి వస్తున్నారు. వేసే ప్రతి ఒక్క అడుగు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఆచరణలో పోరాడందే సాధ్యం కాదు అని గుర్తిస్తున్నారు. స్త్రీల ఆచరణాత్మక అనుభవాలను, విజయాలను పరిశీలించాల్సిన , పరిగణన లోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

“స్త్రీలు రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను , జీవించే హక్కును కోరడం , సాంఘిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సమానత్వం కావాలనడం నేరం అవుతుంన్దా..? తమపై రకరకాల రూపాల్లో అణచివేతను , అత్యాచారాలను సాగిస్తున్న నేరస్తులను ,ప్రభుత్వం శిక్షించక పోవడమే కాకుండా , బాధితులైన స్త్రీలనే నేరస్తులను చేసి నిలబెడుతున్న దురన్యాయాన్ని ప్రశ్నించడం తప్పవుతుందా ‘ అంటారు విమల. తమను తాము రక్షించునేందుకు తమ ఆత్మగౌరవం కోసం, స్వేచ్చ కోసం స్త్రీలు ఉద్యమించడం తప్పేలా అవుతుందని ఇవ్వాళ స్త్రీలు నిలదిస్తున్నారు . కుటుంబహింస, రాజ్యహింస చెట్టాపట్టాలేసుకుని స్త్రీలపై అణచివేతను కొనసాగిస్తున్నప్పుడు ప్రతిఘటన స్త్రీల హక్కు కాదా అని ప్రశ్నిస్తున్నా రామే.

కన్నీళ్లను కత్తులుగా మలచుకున్న స్త్రీలు మానవులుగా జీవించేందుకై ఈ రోజు చావుబతుకుల మధ్య సంకుల సమరం సాగిస్తున్నారు. స్త్రీలకు నిర్భందం , అణచివేత కొత్త కావు. పితృస్వామ్యానికి, దోపిడీ వర్గ వ్యవస్థకు వ్యతిరేకంగా స్వేచ్ఛకోసం , సమానత్వం కోసం , నూతన సమాజం కోసం పోరాడుతున్న స్త్రీలు ఈ వ్యవస్థీకృత రాజ్యహింసను కుడా ప్రతిఘటించి తీరుతారు అని ఇరవై రెండేళ్ళ క్రితం వ్యక్తం చేసిన విమల ఆశాభావానికి సమాధానంగా కనిపిస్తున్నారు నేడు ఉద్యమాలలో సాగిపోతున్న మహిళలు.

ప్రజల ప్రజాస్వామిక కాంక్షలను అణగదొక్కడానికి రాజ్యం అత్యాచారాలని ఒక మార్గంగా ఎన్నుకోవడం యాదృచ్చికం కాకపోవచ్చు. భద్రతా దళాలు , పోలిసుల చేతుల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక, రాజ్య హింస రామరాజ్యం నుండి సరఫరా అయిన రాజ్యహింసే కావచ్చేమో .. !! మయసభలో సభికులందరి ముందు జరిగిన ద్రౌపది వస్త్రాపహరణాని కొనసాగింపే మహిళలపై జరిగే హింసలకి కారణం కావచ్చేమో ..!!!

ఇంద్రవెల్లిలో తాము జరుపుకోవాలనుకున్న సభకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ప్రభుత్వం ఆదివాసి యేతరులను ఇంద్రవెల్లిలోకి లోకి అనుమతించి గిరిజనులను అడ్డుకొన్నప్పుడు ‘ఆదివాసీ పోరాటాలు – స్త్రీలు మరో జలియన్ వాలాబాగ్ ఇంద్రవెల్లి ‘ అనేవ్యాసంలో

“సామూహికంగా బ్రతికే గిరిపుత్రికలు ప్రభుత్వం అంటే అడవి తల్లిల్లా కాచి కాపాడేదేనని అనుకున్నారు . అందుకే గిరిజన రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో నిరాయుధంగా కదిలారు. సభకు వస్తున్నా, వచ్చిన ఆదివాసీలు న్యాయమైన డిమాండ్లు వినడానికి కుడా ఇష్టపడని పాలకవర్గాలు అచ్చు బ్రిటిష్ వలసవాద కాలంలో జరిగిన జలియన్ వాలాబాగ్ లోలాగా చెట్లెక్కి వాముల పొదల వెనుకనుంచి దొంగచాటుగా కాల్చారు . బెదిరిపోయి అయోమయస్థితిలో ఎక్కడ బుల్లెట్లు దిగుతున్నాయో కుడా చూసుకోలేని పరిస్త్తితుల్లో ప్రజలు పరుగులు తీస్తుంటే మన దేశ పోలీసులే రేసుకుక్కల్లా వేటాడి వేటాడి పాయింట్ బ్లాక్ రేంజ్ తో కాల్చారు. వారి శవాలు, ట్యాంకులు, పొదలవేనుక నుంచి ….. వారం తర్వాత కుడా కనుక్కున్నారు . గోండు మహిళా మంకుబాయి నడుములో తూటాలు .. ఆమె కుటుంబ సభ్యులు చనిపోయారు . ఇస్రుబాయి కాళ్ళలో కాల్చి లాక్కుపోయారు . కాళ్ళు తీసేశారు . ఇలా ఎందరో ..”

” తమ నాయకుడైన కొమురం భీం చనిపోయిన తర్వాత తమ చనిపోయినవారికి నివాళులు అర్పించడం గోండుల రివాజు. దసరాపండుగ పున్నాన నివాళు అర్పిస్థారు. ఇది నిజాం కాలం నుండి జరుగుతోంది . అయితే నిజాం పాలక వర్గాలకు భయపడి ప్రజలు రాత్రిపూట చేసుకునేవారు. కానీ , ఇప్పుడు అదే జరిగిన్ది. పోలీసులు ఇంద్రవేల్లిని ముంచెత్తారు . ” అంటూ రాజ్యహింస గురుంచి తన ఆవేదన చెందారు రచయిత్రి జూపాక సుభద్ర భూమికలో రాసిన వ్యాసంలో

నవంబరు 11 1999లో రంగవల్లి, ఆమెతో పాటు మరో ముగ్గురు పోలిసుల రాజ్యహింసకు బలైన విషయం అందరికీ తెలిసిందే . ఆ విషయాన్నే “వెచ్చటి చలి యాది రంగవల్లి” అని మరచిపోలేని ఆమె జ్ఞాపకాలని భూమిక పత్రిక ద్వారా అందరికీ పంచారు జూపాక సుభద్ర.

తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో స్త్రీల పాత్ర , అనుభవాలను పరిశీలించి , పరిశోధించి, స్త్రీల దృష్టి కోణంలోంచి చూసి , ఉద్యమాల్లో, పోరాటాల్లో మహిళల భాగస్వామ్యం అధ్యయనం చేసి విశ్లేషించింది స్త్రీ శక్తి సంఘటన వారు అచ్చువేసిన పుస్తకం ‘మనకు తెలియని మనచరిత్ర ‘ ఈ పుస్తకంలో నైజాం వ్యతిరేక తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్న మహిళల్లో వచ్చిన చైతన్యం , తమ చైతన్యం వల్ల అనుభవించిన, ఎదుర్కొన్న రాజ్యహింస గురించి కూడా ఆ పుస్తకం ద్వారా ఆ ఉద్యమకారుల మాటల్లో మనం తెలుసుకోవచ్చు.

కాత్యాయనీ విద్మహే రాసిన ప్రత్యేక వ్యాసం ‘మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం ‘ భూమిక పత్రికలో వచ్చింది. ఆంద్ర రాష్ట్రంలో ఆదివాసి స్త్రీలు అడవి సంపదపై సహజ హక్కులు భంగపడుతుంటేను, నిత్య జీవితం గిరిజనేతరుల దోపిడీకి, అటవీ అధికారుల వేధింపులకు బాలి అవుతుంటేను తమ పురుషులతో పాటు స్త్రీలూ పోరాటాలలోకి సమీకృతులయ్యారు . …. 1974 సెప్టెంబర్ 29న అభ్యుదయ స్త్రీల సంఘం ఏర్పడింది . స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు , విముక్తికై పోరాడేందుకు అవసరమైన చైతన్యాన్ని , ఆర్ధిక విధానానికి , సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటాలను నిర్మించడం ప్రధాన లక్ష్యంగా ఈ సంఘం ప్రకటించింది…….శ్రామిక స్త్రీల విముక్తి గురించి , అవిద్య , అజ్ఞానం, అనచివేతల్తో మగ్గిపోయే అసంఖ్యాక స్త్రీల విముక్తి గురించి ఆలోచించాలని , పనిచేయాలని నిస్వార్హంగా ప్రకటించిన అభ్యుదయ స్త్రీల సంఘం అత్యయిక పరిస్థితి మూలంగా ఆకాంక్షలకు నిర్భందాలకు గురి కావలసి వచ్చిందని ‘ ఆవేదన వ్యక్తం చేశారు.

1978 నాటి ఉత్తర తెలంగాణ రైతాంగ ఉద్యమం ఉధృత స్థాయిలో ఉంది. సిరిసిల్ల , జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి పోలీసు బలగాలను మొహరించి రైతు కూలీ సంఘ కార్యకర్తలను భయభ్రాంతులను చేసే విధంగా గ్రామాలలో గుండాలు, పోలీసుల దాడులు నిత్య కృత్యమయ్యాయి . అందులో భాగంగా స్త్రీలు అనేకమంది అత్యాచారాలకు గురయ్యారు . కొడుర్పాక రాజవ్వ, సత్తేవ్వ మొదలైన వారు ఆ కోవలోకి చెందినవారు అంటారు కాత్యాయని.

1990 ప్రారంభానికి ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీ విముక్తి) పూర్తీ రూపం తీసుకుంది. 1992 ఏప్రిల్ 10-12 తేదీలలో వరంగల్లులో తొలి రాస్స్త్ర సదస్సు నిర్వహణ, భూస్వామ్య వ్యతిరేక మహిళా వ్యవసాయ కూలీ ఉద్యమాలను, జోగిని, బసివి వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను , కుటుంబ హింస నుండి రాజ్యహింస వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న జీవిత భీభత్సానికి వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళాసంఘం నిర్మించిన ఉద్యమం విధాన్ని తెలిపింది ఈ వ్యాసం.

సైనిక దళాల ప్రత్యేక అధికార చట్టం వల్ల కాశ్మీర్ , ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, నక్సల్ ఉద్యమ ప్రాంతాలు, చత్తిస్ ఘడ్ (సల్వాజుడుం) ముఖ్యంగా ఆదివాసి మహిళలు నిత్యం సైనిక, పొలిసు దళాల లైంగిక దాడులు , హింస ఎద్దుర్కొంటూ పోరాడుతున్నాయి. కాశ్మీర్ , ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక దుశ్చర్యలు ఎంత ఘోరంగా , క్రూరంగా ఉంటాయో అక్కడి మహిళా పోరాటాలు ఐరో షర్మిల పద్నాలుగేళ్ళ దిక్షలె చెప్తాయి. పోలీసుల హింసని చట్టం, న్యాయా స్థానాలు ఎట్లా రక్షిస్తాయో వాకపల్లి ఘటన నిదర్శనం అనే సుభద్ర ‘యునిఫామ్ వేసుకున్న దోషులు, నేరస్తులకు ప్రత్యెక అధికార చట్టాన్ని ఉపసహరించుకోవాలని మహిళా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేయడం అభినందనీయం’ అన్నారు వహ్వా – జాతీయ మహిళాకమిషన్ ‘ ఆనే వ్యాసంలో ( భూమిక నవంబర్ -13)

కారంచేడు, చుండూరు గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. జూన్ 12న లక్షింపేట దళితులపై జరిగిన హింసాకాండ మరవకముందే, పుండుపై కారంలాగా జూన్ 28న ఛత్తీస్‌గఢ్‌లో కాల్పుల ఘటన వార్త. బాసగూడెంలో 19 మంది ఆదివాసీల మీద విచక్షణా రహితంగా కాల్పులు, ఊచకోత, నరికివేత. కోల్డ్‌బ్లడెడ్ ఓపెన్ మర్డర్స్! వారు ఆదివాసీలు, అడవులలో ఉంటారు, అనగా మావోయిస్టులు అనబడతారు. దళితులూ, ఊరికి చివర ఉంటారు, తమకు అన్యాయం జరుగుతుందని సంవత్సరాల తరబడి విన్నపాలు ఇచ్చుకున్నా ఎవరూ పట్టించుకోరు, వీరిని అంటరాని వారు అంటారు.నరనరాన పేరుకుపోయిన కులం కుళ్ళు ఒక్కసారిగా విరుచుకుపడింది. పోలీసుల అండదండలు ఉన్నాయి. అటు రాజ్యం, సామ్రాజ్యవాదం చేతిలో కీలుబొమ్మ అయింది. పాపం వారిది ఒకే కులం, ఒకే మతం. అమాయకులను బలగాలతో చంపిస్తారు. పేరు ఎన్‌కౌంటర్! వీరు నిరాయుధులు అయి ఉండొచ్చు, అమాయకులు అయినా కావొచ్చు. పిల్లలు, మొన్న బాసగూడెంలో కుమారి కాక, 15 ఏళ్ల ఆడపిల్ల, అంటూ రాజ్యహింసకు అమాయకులు, పిల్లలు బలికావడాన్ని ఆవేదనతో ప్రశ్నిస్తారు .-సూరేపల్లి సుజాత దళిత ఆదివాసిలపై రాజ్యహింస అనే వ్యాసంలో

యం. రత్నమాల వివిధ సందర్భాలలో వివిధ ఉద్యమ పత్రికలలో రాసిన వ్యాసాలు, సభలు , సదస్సులలో చేసిన ప్రసంగాలను కూర్చి ‘దాక్షిణ్య వాదం నుండి దండకారణ్యం దాక భారత మహిళా ఉద్యమం ‘ పుస్తకంగా చేశారు. రాజ్యహింస బాధితులకు దక్కని న్యాయం గురించి , నిర్వాసితత్వం – రాజ్యహింస , రాజ్యంపై , పితృస్వామ్యంపై ఏకకాలంలో పోరాడుతున్న్న దండకారణ్య ఆదివాసీ మహిళలు, తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని రాజ్యహింసకు బలైన బెల్లి లలిత తదితర మహిళల గురించి ఆవేదన చెందారామె. నిర్వాసిత ప్రాంతాల్లో నష్టపరిహారంగా అందుకున్న సొమ్ముతో విచ్చలవిడి అరాచక జీవితానికి అలవాటు పడ్డ భర్త, అస్థిరమైన జీవితం వాళ్ళ జరిగే హింస కుటుంబ హింసలా పైకి కనిపిస్తున్నప్పటికీ దానికి కారణం రాజ్యం. అంటే అది రాజ్యహింసే కదా అంటారు రత్నమాల . చాలా సందర్భాలలో స్త్రీలపై జరిగే హింసకి ప్రత్యక్షంగా రాజ్యం కనిపించదు కానీ అందుకు కారణం మాత్రం రాజ్యం అవుతుంది. రాజ్యం ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి. జవాబుదారితనంతో ఉండాలి . కానీ, ప్రజల నిర్ణయాధికారాన్ని లాక్కోకూడదు కదా.!

నిర్బంధంలో నున్న క్రాంతి కారి ఆదివాసీ మహిళా సంఘటన్ దేశవ్యాప్తంగా జరిగిన సెమినార్లకు తమ పత్రాలు పంపి తమపై నున్న రాజ్య నిర్భంధాన్ని, పోరాటాలూ ఉద్యమాలు ఊపిరిగా బతికే తమపై జరుగుతున్న రాజ్యహింస, తాము ఎదుర్కొంటున్న తీరు ప్రపంచానికి తెలియజేసింది. ఎంతో మంది మేధావులను కదిలించింది. ఆలోచింపచేసింది.

“కొంగునడుముకు చుట్టవే చెల్లెమ్మా
కొడవళ్ళు చేతబట్ట్తవే చెల్లెమ్మా ” పాట మనందరం ఎన్నో సార్లు విన్నాం. ఆ పాట సమాజంలో మహిళల స్థితి చెబుతూనే
“ఆలుమగలు కలసి సినిమా చూడబోతే
రక్షక భటులంటూ భక్షక భాతులోచ్చి
కాకి బట్టలోల్లు కనికరం లేనోళ్ళు
నీ భర్తను చంపిరా చెల్లెమ్మా
ని మానము చెరిచిరా చెల్లెమ్మా ..”

పొలిసు స్టేషన్ లేమో నరక కూపాలాయె
కండ్లుకానని దొరలూ కామందు పొలిసు
ని మానప్రాణాలనే చెల్లెమ్మా దోచి మంటల గలిపిరా చెల్లెమ్మా
అంటూ మహిళలపై జరిగే రాజ్య హింసని ఎత్తి చూపారా పాటలో . ఇలాంటి పాటలు గ్రామాల్లో కెళితే ఆశువుగా కనిపిస్తాయి. వారి దైనందిన జీవితంలో కలిగే కాస్త సుఖాలని పాటలు కట్టి పాడే వారి కవిత్వం చాలా సార్లు ఎక్కడా రికార్డు కాదు.

ఇక కథ విషయానికి వస్తే ..
స్వరూపి రాసిన బ”తుకమ్మ బండి ” కథ తెలంగాణ గ్రామ నేపథ్యంలో సాగింది. బతుకమ్మ కొడుకు మేఘ్య కోసం వచ్చిన పోలీసులు అతను దొరకక పొతే ఆమెను తీసుకు పోయి నానా బూతులు తిట్టి కొట్టి పంపేవారు. చివరికి మేఘ్యను పొలుసులు పట్టుకుపోయి కాల్చేశారు. ఆ బెంగతో భర్త చనిపోతాడు. ఆమెకో కూతురు స్వరూప ఉంది. కూతురు పెళ్ళిచేస్తే అత్తింట ఎంత హింస భరించాలొ.. అదే అన్నలలో కలిస్తే సంఘంలో పనిచేస్తే సచ్చినా మంచిగా సావోచ్చు అనుకొంటుంది. అమ్మకు తెలియకుండా కూతురు స్వరూప అదే విధంగా ఆలోచించి అన్నలలో కలిసిపోతుంది.

బయటి సమాజంలో మహిళపై జరిగే హింస కంటే నిర్భంధం ఉన్నా, ఏ నిముషమైనా ప్రాణాలు పోవచ్చని తెలిసినా ఒక మంచి పని కోసం జరిగే యుద్ధంలో చనిపోవడం మేలని , బయట అంతకంటే తక్కువ హింస ఏమి లేదనీ చెప్తుందీ కధ.

సాధన రాసిన రాగో నవల చదవలేదు. మిడ్కో పేరుతో రాసే కరుణ , మైనా , దమయంతి కథలు , నేను చదవలేదు కాని విన్నాను .

మహిళల పై రాజ్యహింస అంశంగా ఇంకా ఎంతో మంది రచయిత్రులు రచనలు చేసి ఉండవచ్చు. నాకు అందుబాటులో ఉన్న కొద్ది రచనలతో నేను ఈ చిన్న ప్రయత్నం చేశాను .

ఆకులతో కొలాజ్ చేయడం ద్వారా సామాజిక స్పృహని పెంచే ఇతర చిత్రాలతో పాటు రాజ్యహింసకు సంబంధించిన చిత్రాలు కూడా చేయడం సుహాసిని కే చెల్లు.

పత్రికలు గమనిస్తే
పోరుమహిళ :
దండకారణ్యంలో ధైర్యసాహసాలతో ముందుకు సాగే క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన్ మహిళల రాటుదనం మొండిదనం సహించలేని రాజ్యం వారిని అణచడానికి లైంగిక అత్యాచారాలను సాధనంగా వాడుకుంటోందన్న విషయం అందరికీ తెలిసిందే. దండకారణ్యంలో సాధారణ మహిళలు , పోరుబాటన ఉన్న మహిళలు రెండురకాల రాజ్యహింస నేదుర్కొంటున్నారు. పొలీసు, ప్రభుత్వ నిర్భంద విధానాలకు గురవడం ఒకటైతే, ఉద్యమంలో భాగస్వాములైన తమ వారి జాడ చెప్పమనే పోలిసుల వత్తిళ్ళు, దాడులు, తమవారిని కాపాడుకోవడం కోసం , వత్తిడిని ఎదుర్కోవడం కోసం మరింత తెగువ చూపుతున్నారు . నిత్యం నిర్భంధం ఎదుర్కొంటూనే 1996 మార్చి 8న ‘పోరుమహిళ’ పేరుతో తెలుగులోనూ , సంఘర్ష్ రథ్ మహిళా ‘ పేరుతో హిందీలోనూ దండకారణ్యంలో ప్రారంభమైన ఈ పత్రిక నేటికీ కొనసాగుతోంది. ఈ పత్రిక పోరాటంలో ఉన్న మహిళలపై రాజ్యహింస గురించి ముఖ్యంగా సల్వాజుడుం , సాయుధబలగాల దాడుల గురించే కాక రాజ్యహింస గురించీ , సల్వాజుడుంని పొరుమహిళలు ఎలా ప్రతిఘటించింది తెలియజేస్తూ వారిని కార్యోన్ముఖుల్ని చేస్తోంది. ఈ పత్రిక తీవ్ర నిర్భందాలు , సమస్యలు , వత్తిళ్ళ మధ్య అజ్ఞాతంగా వెలువడుతుండడం విశేషం.

మహిళలపై సల్వాజుడుం శేస్తోన్న అమానుషమైన దాడుల్ని గురించి , దాన్ని మహిళలు ప్రతిఘటిస్తున్న తీరు గురించి ‘మా గోడు వినేదెవరు?’ అనే పుస్తకాన్ని తెలుగులో క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన్ ప్రచురించింది.

క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన్ ‘ సంఘం పెట్టడం వల్ల రాజ్యహింసకు గురికావలసి వస్థున్నది. సల్వాజుడుం దాడులను నిర్భందాలకు , అత్యాచారాలకు, హత్యాకాండకు బలికావలసి వస్తున్నా , పారా మిలిటరీ బలగాల వాళ్ళ బాధలు పడుతున్నా ఆదివాసీ మహిళా సంఘటన ముందుకు సాగుతూనే ఉంది . తెలంగాణా అందవిలో ఉత్తర తెలంగాణ మహిళా విముక్తి సంఘం పనిచేస్తున్నది . పోరుమహిల పత్రిక ప్రచురిస్తున్నది ‘ అంటూ అనేక విషయాలను ఆ వ్యాసంలో తడిమారు.

సిఆర్పి , పోలీసు బలగాల అత్యాచారాలనూ, దౌర్జన్యకాండను ఎదిరిస్తూ వివివ్ద సెక్షన్ల ప్రజలంతా ‘బస్తర్ మహిళా సంఘర్ష్ సమితి ‘ అనే బ్యానర్ కింద ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. 2004 జూన్ 23న జరిగిన ర్యాలిలో 15 వేలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ ర్యాలీని విఫలం చేయాలని పొలిసు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా అంతమంది పాల్గొన్నారు. మహిళలపై అత్యాచారాలను శిక్షించాలి , సిఆర్పి , పోలీసులను వెనక్కి పంపాలి అంటూ నినదించారు. రాజ్య హింసకు వ్యతిరేకంగా వేల సంఘ్యలో ప్రజలు కలవడం , పాలకులను కలవార పెట్టింది. టివీ చానేల్లలోను , వార్తా పత్రికలలోనూ ఈ అత్యాచారాల గురించి ప్రచారం జరగడంతో పాటు బయటి ప్రపంచానికి ఎం జరుగుతుందో తెలుసుకోవడానికి అర్త్డం చేసుకోవడానికి ఉపయోగపడింది .
భూమిక , మహిళామార్గం, మాతృక లలోను రాజ్యహింసకి సంబంధించిన వ్యాసాలూ వచ్చాయి. మాతృక ప్రస్తుతం రాకపోయినా మిగతా వాటిలో అప్పుడప్పుడూ అందుకు సంబందించిన సాహిత్యం మనకు అందుతూనే ఉంది.

1999 డిసెంబర్‌లో 54వ ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ఒక అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం 25 నవంబర్‌ను అంతర్జాతీయంగా ‘మహిళా హింసపై వ్యకిరేక దినం’గా ప్రకటించారు. ఆ ఒక్క రోజుని మహిళలపై హింసకి వ్యతిరేకంగా జరుపుకోవడం కాదు మనం చేయాల్సింది. మన రెండు కళ్లతో గమనించినదాన్ని విషయాన్ని వివిధ సాహితీ రూపాలలోకి తెచ్చి వేయి మెదళ్ళలో కదలిక తెచ్చే ప్రయత్నం చేయగలగాలి. వ్యక్తిలో, వ్యవస్థ మార్పులో తనదైన బాధ్యతతో, కర్తవ్య నిర్వహణ చేయగలగాలి. ఆ విధంగా చేస్తున్న మహిళల కలాలు ఒక్కొక్కటిగా తమని తాము కూడగట్టుకుంటూ తరువాతి వారికి మార్గదర్శకం చేస్తూ పాలకులను ప్రశ్నిస్తూ సాగుతూనే ఉన్నాయి
మహిళలపై జరుగుతున్న రాజ్యహింసని తమ సాహిత్యం ద్వారా ప్రజలలోకి తిసుకేళ్ళా ల్సిన బాధ్యత రచయితలది. మరీ ముఖ్యంగా రచయిత్రులది.

వి. శాంతిప్రబోధ

(జూన్ 2014 విహంగ వెబ్ మాగజైన్లోనూ ,జూలై 2014 ప్రజాతంత్ర వారపత్రికలోను ప్రచురణ అయింది)

బియాస్ .. బడబాగ్ని

అద్భుత అందాల్ని ఆరబోస్తూ
రాలూ రప్పల మధ్య హోయలోలికిస్తూ
అనుకోని అతిధిలా రా రమ్మని ఆహ్వానించావే
అంతలోనే ఏమైంది నీకు ..?
మంద్రంగా సాగే నీ అందాలకు ఉక్కిరి బిక్కిరైన
పసివాడని పసిడి మొగ్గల్ని నీలోనే ఐక్యం చేసుకున్నావెందుకని ?
మా హృదయాల్లో బడబాగ్నిని మిగిల్చి నీకు మచ్చ తెచ్చుకున్నావెందుకని ?
ఝుల్లనే చల్లటి నీళ్ళలో తూనీగలా తుళ్ళుతూ
నీ సోయగాల్ని మది కెమెరా కన్నుల్లో బంధిస్తూ
సంతోషానికి ప్రతీకలుగా నిల్చిన వాళ్ళను చూస్తే కన్ను కుట్టిందా ..?
ఎవరు ఊహించారు .. నీ కుటిల తత్వాన్ని ..?!
ఆ చల్లటి నీటిలాగే నీ మనసు చల్లనైనదనుకుంటే
నీవింత క్రూరంగా వికటాట్టహాసంతో స్వైర విహారం చేస్తావా ,,?
మృత్యు ఘంటికలు మోగిస్తావా ..?
ఆ క్షణం వరకూ పరవళ్ళు తొక్కిన ఆనందం ఆవిరైపోతుండగా
లిప్తపాటులో ఆత్మీయ మిత్రులు హహాకారాలు చేస్తూ మాయమై పోతూండగా
ఆపన్నులకు ఆత్మీయహస్తం అందించాలని
నీ ఉరవడికి అడ్డుకట్ట వేయాలని
ఒడ్డున ఘోషించే హృదయ వేదన వినపడలేదా ..?
ఒక్కక్కరినీ వికృతంగా ఈడ్చుకు పోయావు
ఒక్క క్షణం .. ఒక్కటంటే ఒక్క క్షణం
నీవు సంయమనం చూపితే ..
చిన్న హెచ్చరిక జారీ చేస్తే .. ఏమిపోయింది నీకు ?
నీ నిర్లక్ష్య ఫలితం
అమ్మానాన్నల ఆశల పల్లకి మోసే కలలసౌధాలు కానరాని తీరాలకు
అద్భత ప్రతిభతో విన్నూత్న సృష్టికి చేసే సమాజ నావికుల్ని అర్ధంతరంగా లాగేసుకు
నీవేం బావుకున్నట్టో….?

వి. శాంతి ప్రబోధ
(బియాస్ మృతుల స్మారక కవిత july 2014)

నంగనాచి తుంగబుర్రలా సాగుతూ …

నల్ల నాగులా నిగనిగలాడే నీవు
కోట్లాది రూపాయలు మింగేస్తూ
మెత్తగా సుతిమెత్తగా మంద్రంగా సాగే సంగీతంలా జారిపోతూ
కొండాకోనల హృదయ తంత్రుల్ని మీటుతూ
పచ్చాపచ్చని పంటచేల నడుమ వింతసోయగాలొలికిస్తూ
గ్రామాలను నగరాలను అనుసంధానం చేస్తూ
ఊళ్ళూ ఏళ్లూ సెలయేళ్ళు దాటేస్తావు
సముద్రపు అంచుల్నితాకి అనిర్వచనీయ ఆనందం పొందుతూ
నదీజలాల సరిగమలతో మంచుముద్దవుతావు
పక్షుల కిలకిలారావాలతో మైమరచి పోతూ
రంగు రంగుల సీతకోకచిలుకల సౌందర్యంతో పరవశిస్తావు
దుర్భేధ్యమైన అరణ్యాల్ని చీల్చుకుంటూ
అడవిపూల పరిమళాలు ఆఘ్రాణిస్తూ
క్రూర మృగాలనూ, విషసర్పాలను హత్తుకుంటూ
వన్య ప్రాణులతో నీ గొంతు జత కలుపుతావు

వెదురు పొదలతో ఊసులడుతూ
మబ్బుతునకలతో సయ్యాటలాడుతూ
ఎండా వానా , చలి గిలీ జాన్తా నై అంటావు
స్కైలార్క్ లా గాలి పాటలు పాడుతూ
పంటపొలాలూ, బంజరుభూములూ, ఎడారులూ
పచ్చిక బయళ్ళూ, చిత్తడి నేలలూ దేన్నైనా వశం చేసేసుకుంటావు
ప్రకృతి వింతల్ని, విశ్వంలోని విడ్డూరాల్ని కళ్ళప్పగించి చూస్తూ
పసిడి కాంతుల్ని, ధవళ రేఖల్ని స్పృశిస్తూ
బ్రహ్మరాత మార్చేస్తామనే బహుళ జాతి కంపెనీల ద్వంద రీతినీ
స్థానిక ప్రభుత్వాల కుట్రలు, కుతంత్రాలూ భారంగా మోస్తూ
అభివృద్ధి రెక్కలు మోసుకొచ్చే పరిణామాలు భరిస్తూ
జరుగుతున్న విధ్వంసానికి సాక్షిగా నిలుస్తావు
ఆశల పల్లకిలో ఊరేగుతూ కనిపించని వలలో చిక్కుకునే అభాగ్యులనూ
విరిగిన రెక్కల మాటున దాగిపోయే పేదవారి ఆకలిదప్పులనూ
ఘనీభవించిన ఎన్నెన్నో చేదు ఘటనల్ని నీ చర్మపు పొరలకింద దాచేస్తూ
అగాధంలోకి దూకే జలపాతంలా ఉరకలు వేస్తూ అగుపిస్తావు

ఆత్మీయతానుబంధాల సంబంధ బంధ్యవ్యాలు కలుపుతూ
అలుపు సొలుపు లేకుండా యోజనాల కొద్దీ సంచారంచేస్తూ
సంస్కృతి, నాగరికతలను విశ్వవ్యాప్తం చేస్తావు
రేచుకుక్కలు తరుముకొస్తున్నట్లు దౌడుతీస్తూనో
నిండు గర్భిణిలా కదలలేక కదులుతూనో
గమ్యంకేసి గమనం సాగిస్తూ
దూరాల తీరాలు దాటేస్తుంటావు
నీకు అంతరాల అంతరంగాల గొడవేలేదు
జాతి , మత కుల భేదాలే లేవు
రంగు రూపు , భాష యాసలతో పనిలేదు
ఎంత విశాల హృదయం నీది ?! అందరినీ అక్కున చేర్చుకుంటావు
ముసిముసి నవ్వులతో పలకరిస్తావు
ఒక్కోసారి ఏమవుతుందో నీకు..? మదపుటేనుగులా ఘింకరిస్తావు
ఒళ్ళు విరుచుకొని నిద్దుర లేచే యమభటులకు చోటిస్తావు
చిక్కటి చీకటికి రుధిర వర్ణాలద్దుతావు
శిశిర వసంతాల్లో స్వప్నాల శకలాలే మిగులుస్తావు
ఏమీ ఎరుగని నంగనాచి తుంగబుర్రలా .. నీవు
ఉత్సాహాలూ, ఉత్తేజాలు, నిరాశలూ
గుండె గోడలపై గుచ్చుకునే కరకు ముళ్ళూ
హృదయం బద్దలయ్యే విషాదాలు మోసుకెళ్తూ
కూడా సంతోషాల పున్నాగలు పూయిస్తూ
పల్లెలనుండి పట్టణాలకు నగరాలకు
అటునుండి ఇటూ, ఇటునుండి అటూ
సాగుతూ సరికొత్త రాగం ఆలపిస్తూనే ఉంటావు
దేశ ఆర్ధిక వ్యవస్థకి ములస్తంభం అవుతావు
సమన్యాయం పాటించానంటావు

వి. శాంతిప్రబోధ

నిశ్శబ్దం పై యుద్ధం “ఆశాదీపం “

ఇది ప్రపంచ ఆరోగ్య అవగాహనలో నవకేతనం !
దేశ వైద్య చరిత్రలోనే అపూర్వం !
ఆరోగ్య రంగాల్లోనే ప్రథమం !
అంతేకాదు, తెలుగు సాహితీ ప్రస్థానంలోనే ఓ మహాప్రయోగం !!!
బహుశా భారతీయ సాహిత్య యాత్రలోనే నవ్య గమనం !!!

“ఆశాదీపం” కథల సంపుటి ముందుమాటలోని సి. పార్ధసారధి గారన్న పై మాటలు అక్షర సత్యం. ప్రపంచ భూతం, మహమ్మారి అంటూ వణికిపోయే HIV/AIDS పై 59 మంది రచయిత్రుల అక్షర దీపాలు వెలిగించడం సామాన్య విషయం కాదు. ఒకే సమస్యపై అంత మంది రచయిత్రులు ఏకకాలంలో స్పందించడం, కలం ఝుళిపించడం అద్వితీయ సంఘటన, అప్పుర్వ ఘట్టం. ఆ సంఘటన పురుడు పోసుకోవడానికి ప్రధాన కారణం APSACS. Break the silence అన్న NACO స్పూర్తితో APSACS వారు ప్రపంచ సాహితీ చరిత్రలోనే గొప్ప ప్రయత్నానికి నాంది పలికారు. సి. పార్ధసారధి, IAS గారి నేతృత్వంలో APSACS తెలుగు రచయిత్రులందరికీ సాహితీ సమారోహణం పేరుతో అవగాహనా సదస్సు నిర్వహించింది. ఈ సంకల్పం, అంటే ఒక సామాజిక ప్రయోజనం కోసం సాహిత్యాన్ని సాధనంగా చేసుకోవడం, సాహితీ ప్రపంచంలో విన్నూత్న ఒరవడికి శ్రీకారం చుట్టినట్లే .. రచయిత్రుల్ని, కవయిత్రుల్ని ఓ సామాజిక కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తూ వారి సామాజిక బాధ్యతని పెంచినట్లే కదా !

ఒక యజ్ఞంలా సాగిన ఈ పుస్తక ప్రస్థానంలో మొదట ఏర్పాటు చేసిన కార్యక్రమం సాహితీ సమారోహాణం. సమాజ సుస్థితికి ఆధారం మహిళలు. అందుకే ప్రత్యేకంగా రచయిత్రులు, కవయిత్రుల కోసం ఓ అవగాహన కార్యక్రమాన్ని రూపొందించారు. అదే సాహితీసమారోహణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి పేరెన్నికగన్న రచయిత్రులని , కవయిత్రుల్ని ఆహ్వానించి, 26 అక్టోబర్, 2013న జూబ్లీ హాల్ లో హెచ్ఐ వి /ఎయిడ్స్ పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో పొందిన అవగాహన ఆసరాతో కథలు, కవితలు ఆహ్వానించారు. వాటిని బాగా అనుభవం ఉన్న కథకులు, కవులు జల్లెడ పట్టి 59 కథలు , 70 కవితలు ఎంపిక చేశారు. వాటిని రెండు పుస్తకాలుగా వేశారు. కథల పుస్తకం ‘ఆశాదీపం’ గాను, కవితల పుస్తకం ‘చిగురంత ఆశ’ గాను రూపుదిద్దుకున్నాయి. ఎంపిక అయిన కథలలో నుండి ఉత్తమ కథలను, కవితలను ఎంపికచేశారు. ఉత్తమ కథలకు, కవితలకు పుస్తకావిష్కరణ సభలో బహుమతులు అందించారు.

ప్రస్తుతం మనమిక్కడ కథా సంకలనం ఆశాదీపం గురించి ముచ్చటించుకుందాం. మామిడి హరికృష్ణ కుంచెనుండి అర్ధవంతమైన చిత్రం ఆశాదీపం ముఖచిత్రంగా అలరించింది. ఈ కథా సంకలనంలో మొత్తం 59 కథలున్నాయని ముందే చెప్పుకున్నాం కదా.. . 59 మంది కథకులకు ఇచ్చిన అంశం ఒకటే అయినా అన్నీ విభిన్నమైన కథలు. వైవిధ్యమైన కథలు. ఒక్కో మస్తిష్కం నుండి ఒక్కోలా. ఒక్కొక్కరి ఆలోచనా తీరు ఒక్కో విధంగా. ఒక్కొక్కరి రచనా శైలి ఒక్కో రకంగా. వెరసి కథలన్నీ దేనికది భిన్నంగా. ఆశ్చర్యంగా రెండు మూడు కథలు మినహా మిగతా కథలన్నీ మహిళల జీవితం చుట్టూనే.. వారి జీవన వ్యధలకి కారణమైన హెచ్ఐవి/ఎయిడ్స్ రావడానికి కారణాలు, సమస్యని ఎదుర్కొనే క్రమం, మానసిక బలాన్ని పెంచుకుంటూ, ప్రభుత్వం అందించే మందులు వాడుతూ అవగహనతో పాటు చైతన్యవంతం కావడం, మార్గంలో ఎదురైన ముళ్ళను ఎరివేస్తూ తమలాంటి వారికి స్పూర్తినిస్తూ చైతన్య పరచడం ఈ కథలలో ప్రవహిస్తూ ఉంది.

20140602_183348

ఇక మనం కొన్ని కథల్లోకి తొంగి చూద్దాం.
గురజాడ శోభా పేరిందేవి రాసిన ‘అంతం కాదిది ఆరంభం’ మూగ పిల్ల నీలపై జరిగిన అత్యాచారం , తత్ఫలితంగా గర్భంతో పాటు హెచ్ఐవి/ఎయిడ్స్ కి గురికావడం ఆమె మనసునీ, శరీరాన్ని మొద్దుపరిస్తే, ఆమె తల్లిని భయాందోళనకు గురిచేసి పెద్ద కూతురికి పెళ్లి కావాలంటే ఈ పిల్లను వదలాల్సిందేనని, కూతురిని ఇంటికి రాకు చనిపోమ్మని చెప్పేలా చేస్తుంది. తనెందుకు చావాలని నీల హెచ్.ఐ.వి . కేంద్రానికి వెళ్లి సైగలతో తన విషయం చెప్పుకొని మందులు తీసుకోవడంతో పాటు తనలాంటి వాళ్ళని బతికించే విధంగా కృషి చేస్తూ తన జీవితానికి ఒక అర్ధం కల్పించుకోవడంతో ముగుస్తుంది కథ.

‘వంద చేతుల తోడు ‘ కన్నెగంటి అనసూయ కలం నుండి జాలువారిన కథ ఇది. బిసి వెల్ఫేర్ హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న బాలిక నర్మదపై హాస్టల్ వార్డెన్ చేసిన ఆత్యాచారం, చేసిన మోసం వల్ల ఆమె గర్బవతి కావడం, హెచ్ఐవి సోకడం తాను మందులు వాడుతూ స్వచ్చంద సంస్థల సహకారంతో తనలాంటి వారికి చేయూతనిస్తూ హెచ్ఐవిపై అవగాహన కల్పిస్తూ, బతుకుపై ఆశతో, ఆమె ఆత్మా విశ్వాసంతో ముందుకు సాగే కథ ఇది.

డా. త్రివేణి రాసిన కథ ‘పల్లవించిన పాట’ . పదవతరగతి వరకూ చదువులోనే కాకుండా ఇతర కార్యక్రమాలలోనూ ముందువరసలో ఉండే పల్లవికి పెళ్లి జరగడం, భర్తతో హైదరాబాదులో కాపురం పెట్టిన రెండేళ్లకే అతను హెచ్ఐవి ఎయిడ్స్ తో చనిపోవడం ఆ విషయం తెల్సి ఆమెకు ఆదరణ లభించకపోవడంతో ఆశ్రమంలో ఉంటుంది. మూడేళ్ళ తర్వాత ఆమె ఊళ్ళోకి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులలోను, గ్రామస్తులలోను ఆమెను ఊర్లోకి రానివ్వడానికి , తమతో కలుపుకోవడానికి భయపడిన వైనం ఆ గ్రామ అంగన్వాడి టీచర్ పద్మ వారి భయాల్ని తొలగించడానికి చేసిన ప్రయత్నం హృద్యంగా చూపుతుంది ఈ కథ.

‘కాంతిరేఖ’ కథలో దుబాయ్ లో ఉండే వ్యక్తి పెళ్ళికి ముందే సెక్స్ అనుభవం కోసం మిత్రులసలహా మేరకు వెళ్ళడం, పెళ్ళైన కొద్దిరోజులకే హెచ్ఐవి బయటపడడం ఆ తర్వాత అతను చనిపోవడం , కోడలు కరుణకు అత్తింటివాళ్ళు వాళ్ళ ఆరళ్ళు, గర్భవతిగా ఉన్నా ఇంట్లోంచి వెళ్ళగొట్టడం, డాక్టర్ దంపతుల చెంత చేరడం, అప్పటికే కొడుకు హెచ్ఐవి/ఎయిడ్స్ తో మరణించడంతో వారు హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితుల కోసం హాస్పిటల్ నడపే ఆ డాక్టర్ దంపతులు కరుణని ఆదరించి ధైర్యం చెప్పడం, కూతురిని కన్న కరుణ ఆరోగ్యకరమైన జీవన విధానంతో తన జీవితాన్ని పొడిగించుకుంటూ కూతురిని పెద్ద చేయడమే కాక చివరికి అత్తామమలకు ఆమె ఆధారమవుతుంది. ఈ కథా రచయిత్రి నెల్లుట్ల రమాదేవి

‘భయం .. పెద్ద జబ్బు ‘ తాయమ్మ కరుణ రాసిన కథ. ఈ కథలోనూ భర్త ద్వారా హెచ్ఐవి/ఎయిడ్స్ సోకిన భార్య విజయని దూరంగా పెట్టి అత్తింటివారు చూసే చిన్న చూపు తెలిసీ భర్త మౌనంగా బాధపడడం, తర్వాత విజయ నిలదీయడంతో తల్లికి విష్యం చెప్పిన భర్త సంతోష్. షుగర్ , బి.పి ల్లాగే మందులతో జీవిత కాలం పోడిగించ వచ్చని వైద్యులు చెప్పిన విషయాలు చెప్పినా వినిపించుకోకుండా పిల్లలని తన దగ్గరకి రానివ్వని అత్త, దూరమవుతున్న పిల్లలు, చదువుకున్నతనే మానసికంగా నలిగిపోతుంటే .. మరింత అనారోగ్యానికి గురవుతుంటే మరి ఏమీ తెలియని వారి పరిస్థితి ఏమిటి అని ఆలోచించిన విజయ తను న్యూనత నుండి బయటపడి హెచ్ఐవి/ఎయిడ్స్పై ఉన్న అపోహల్ని తొలగించాలనుకోవడంతో కథ ముగుస్తుంది.

హెచ్ఐవి ఎయిడ్స్ఉన్న వ్యక్తి విషయం దాచి పెట్టి పెళ్లి చేసుకుంటే అది చెల్లదని చెప్తుంది వారణాసి నాగలక్ష్మి కథ ‘శుభరాత్రి’. ఈ కథలో మనోజ్ఞ పెళ్లి అయ్యి వెంటనే విడాకులు తీసుకున్న విషయం చెల్లి ద్వారా తెలుసుకుంటాడు రాజీవ్ . మనోజ్ఞ పట్ల ప్రత్యేక అభిమానం ఉన్న అతను ఆమె విడాకులకు కారణం హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తితో పెళ్లి కావడమేనని, ఆ విషయం పెళ్ళైన మూడో నాడే అతని మిత్రుడి ద్వారా తెలుసుకుని ఆ బంధం నుండి విడివడిందని, ఆమెకి హెచ్ఐవి సోకలేదని తెలిసి ఆమెను మనసులోనే అభినందించడంతో కథ ముగుస్తుంది

బయటి ప్రపంచం ఎరుగని విలాసాలు, సౌఖ్యాలు, వస్తువులు, వారి ఆహారం ఎప్పుడో చూసిన పుట్టమ్మ అనే యువతి తమ ఊరు వచ్చే విదేశీ టూరిస్టులని చూసి విదేశీ మోజుతో ఉండేది. వారిలాగే ఇంగ్లిషు మాట్లాడుతూ తమ ఇంట్లో అద్దెకు ఉండే విదేశీ యువకుడితో స్నేహం చేసింది. అతను మరోసారి వచ్చినప్పుడు సన్నిహితమైంది. మరుసటి ఏడాది వస్తే పెళ్లి చేసుకుందాం అని చెప్పి వెళ్ళే ముందు తన వస్తువులన్నీ ఆమె కిస్తూ ఒక పాకెట్ ఇచ్చి తను వెళ్ళాక చూడమంటాడు. అతను వెళ్ళాక చూస్తే నీకు బహుమతిగా ఎయిడ్స్ ఇచ్చాను అనే లేఖ. తెలిసీ తెలియని వారితో శారీరక సంబంధాలు ఎంత అనర్ధమో చెప్పిన కథ మన్నెం సింధుమాధురి రాసిన ‘బహుమతి ‘.

ఓ యువకుడు విలువలకు వలువలు ఒలుస్తున్న సమయంలో భార్య, తల్లి, అక్క, బాల్యమిత్రుడు, చిన్ననాడు చదువు నేర్పిన పంతులు తగిన విధంగా స్పందించక పోవడంతో ఆ యువకుడు అప్పటివరకూ తెచ్చుకున్న పేరుని, జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చిందని అతని ప్రవర్తనకి తమ బాధ్యతారహిత్యమేనని బాధపడే కథ చంద్రలత రాసిన ‘ఆ ఆరుగురు ‘ ఆ ఆరో వాళ్ళెవరో కథ చదివి తెలుసుకోవాల్సిందే ..

భర్త ద్వారా సంక్రమించిన హెచ్ఐవి తో అతని కంటే ముందు భార్య చావు బతుకుల్లో ఉండడానికి కారణం జండర్ వివక్ష అని చెప్పే కథ దర్భలక్ష్మి సుహాసిని రాసిన కథ ‘గిరిజ’ . భర్త విచ్చలవిడి తనం వల్ల హెచ్ఐవిసోకిన ఉద్యోగస్తురాలైన మహిళ తనను తాను కాపాడుకుంటూ తన పిల్లలిద్దరినీ పెంచి పెద్దచేస్తూ హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులకు మనోధైర్యం అందిస్తూ ఆత్మవిశ్వాసం పెంచే తల్లి సేవలకు తామూ తోడవుతాం అనే పిల్లల కథ సమ్మెట ఉమాదేవి కధ ‘తిమిర సంహరణ సమయాన ..!’ .

రక్తమార్పిడి వల్ల హెచ్ఐవి సోకినట్లు వచ్చిన కథలు కొండవీటి సత్యవతి గారి ‘పాలపుంత ‘ డా . సి. భవానిదేవి గారి ఈతరం దూతలు , గంటి సుజలామూర్తి గారి మార్గదర్శి . స్వాతి శ్రీపాద రాసిన ‘వెలిగించనా చిన్న దీపం ‘ ఇంజక్షన్సు ద్వారా హెచ్ఐవి వైరస్ సోకడం వాళ్ళ కుటుంబ అనాదరణకు గురై చావాలనుకున్న వ్యక్తీ ఆ తర్వాత ఓ సంస్థ లో తన లాంటి వాళ్లకి సేవలందించే కథ ‘గమ్యం ‘. దాదాపు ఇలాంటి కథే

ఉపాధివేటలో భార్యాబిడ్డల్ని వదిలి గల్ఫ్ బాట పట్టిన వ్యక్తీ అక్కడ అంటుకున్న హెచ్ఐవి భార్యకి అంటించడం .. ఆ బాధ వ్యధ చిత్రించిన కథ అడువాల సుజాత రాసిన ‘ఆలోచించండి’ .
కొత్త అనుభవం కోసం ఒకసారి చేసిన తప్పుకు కుంచించుకుపోతూ శిక్ష అనుభవిస్తున్నాననే కథ ‘నీకు .. నా మొదటి ప్రేమలేఖ’. ఎంతో భావుకంగా ఉన్న ఈ కథ ఝాన్సీ కెవి కుమారి రాశారు.
సినిమాలు, టివి సీరియళ్ళ మోజులో ఇల్లువదిలి ట్రాఫికర్లకు చిక్కి కొంతకాలానికి ఆ ఊబి నుండి బయటపడి హెచ్ఐవి బాదితులకు సహాయం చేస్తూ జీవించే యువతీ కథ అల్లూరి గౌరీ లక్ష్మి గారి ‘చిరుదీపాలు. సమస్యకు మందేయడం కాదు ఆ సమస్యకు మూలం ఎక్కడుందో తెలుసుకొని సమూలంగా మానవతా విలువలతో చెప్పాలనే కథ గరిమెళ్ళ సుబ్బలక్ష్మి రాసిన ‘మీరే నేర్పాలి ‘ , ప్రేమపేరుతో మోసపోయి వొళ్ళు అమ్ముకునేవాళ్ళు తమకు తెలియకుండా తమ దరి చేరిన హెచ్ఐవి వంటి వ్యాదుల్ని ఇతరులకు అంటించాలానే కాసిని, ఆ తర్వాత మారిన వైనాన్ని చూపిన కథ డి. కామేశ్వరి రాసిన ‘మానవత్వం మరువకు. దా. ఆలూరి విజయలక్ష్మి రాసిన ‘కల్లోల కడలి’ కథ కన్నా బిడ్డలా ఆకలి తీర్చడం కోసం , ఆకలి గొన్న మగవాళ్ళ ఆకలి తీర్చే ఆ తల్లి హెచ్ఐవిబారిన పడడాన్ని చిత్రించింది. అశ్రద్ద , చిన్న నిర్లక్ష్యం వాళ్ళ హెచ్ఐవికి గురి అవడం, మరికొన్ని బతుకులు ఇలా కాకుండా చూస్తాననే యువకుడి ఆత్మవిశ్వాసాన్ని మన ముందుంచిన అయినంపుడి శ్రీలక్ష్మికథ ‘అమ్మ నవ్వింది ‘ . హెచ్ఐవి/ఎయిడ్స్ తో చనిపోయిన వారి పిల్లల్ని చేరదీసి అక్కున చేర్చుకున్న యువతీ నిశాంత సమాజం నుండి తాను వెలివేతకు గురయినా స్థైర్యంతో ముందుకు సాగిన కథ ‘నిశాంత పెళ్లి ‘ అనిశెట్టి రజిత రాశారు. కలసి మెలసి ఉన్నా, ముట్టుకున్న హెచ్ఐవిమరొకరికి సక్రమించాడు అనిచేప్పే అమృతలత కథ ‘ఆత్మీయ స్పర్శ’.

హెచ్ఐవి బాధితులు వారిలో ఓ చిన్నారిని డాక్టరును చేసి ప్రతిఫలంగా హెచ్ఐవిపై అవగాహన సమాజంలో పెంచమని చెప్పే కథగంటి భానుమతి రాసిన ‘ వాళ్ళు కోరిన కోరిక ‘
మిత్రురాలి కొడుకుకి హెచ్ఐవి సోకినట్లు తెలుసుకున్న ఓ తల్లి తన కొడుకుకి హెచ్ఐవి పరీక్షలు చేయించి అతను పక్కదారులు పట్టకుండా అవగాహన పెంచే కథ గోలేటి లలితాశేఖర్ రాసిన ‘పెనేసియా’ హెచ్ఐవిపై అవగాహన పెంచే మరో కథ ఇంద్రగంటి జానకీబాల రాసిన ‘బ్రతుకు పోరాటం’,

పెళ్ళికి ముందే హెచ్ఐవిపరీక్షలు , ఎలీసా పరీక్షా చేయించుకొని జాగ్రత్తలు పాటించాలని ప్రేమికులు చెప్పే కిరణ్ బాల కథ ‘అదిగో నవలోకం ‘ . రెడ్ రిబ్బన్ క్లబ్స్ అవసరాన్ని గురించి రాసిన కథలు కె . ప్రవీణారెడ్డి రాసిన ‘ది రెడ్ రిబ్బన్ క్లబ్’ వి. శాంతి ప్రబోధ రాసిన ‘ఆ యువత ముందు తరం దూతలు’ .

డా అనంత లక్ష్మి రాసిన చెల్లని నోటు, భావరాజు పద్మిని రాసిన పులిరాజు, జీవితం – గద్వాల కిరణ్ కుమారి, మీరే నేర్పాలి – జిఎస్ సుజాత, జవాబు – కస్తూరి భారతి రామం, కె.బి. లక్ష్మి ‘ఆకాశామల్లి’ , కె వాసవదత్త రమణ కథ ఎనిమిదొఅడుగు’ , నండూరి సుందరీ నాగమణి కథ ఆశాదీపం, నామాని సుజనా దేవి కథ ‘దొరికిన జవాబు ‘, పోడూరి కృష్ణకుమారి కథ ‘ఓడిపోలేదోయ్ ‘ , పి.వి.శేషారత్నం కథ ‘అమ్మమనసు , పరిమలా సోమేశ్వర్ ‘ఒక్కసారి ‘ పొత్తూరి విజయలక్ష్మి కథ ‘అసాధ్యం కాదు సుసాధ్యమే ‘ పోల్కంపల్లి శాంతాదేవి కథ ‘నవ్వులు పూయించండి’, పాలంకి సత్య కథ వెలుగురేఖ’, పెండ్యాల గాయత్రి కథ ‘కథ మారింది’ , పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి కథ వేలివేయొద్దు’ , పుటల హేమలత కథ ‘కొత్తఆశ ‘, రాజీవ రాసిన హాయ్ ప్రేమ ‘ , ఆర్ . రమాదేవి కథ ‘తీరం చేరే కెరటం ‘ , శైలజా మిత్ర ‘ కర్తవ్యం’ , శ్రీలలిత ‘తమసోమా జ్యోతిర్గమయ ‘, సింగరాజు రమాదేవి ‘ఒక ప్రేమకథ ‘, తమిరిశ జానకి ‘ నీ జీవితం నీ చేతిలో ‘, తుర్లపాటి లక్ష్మి ‘ప్రతిమ’, తురగా ఉషారమణి ‘కెరటం ‘ డా. తెన్నేటి సుధాదేవి ‘నా తప్పులేదు’, టి . నళిని ‘బ్రతకాలి -బ్రతికించాలి ‘ డా . వాసా ప్రభావతి ‘ఉషోదయం ‘ , డా . వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘పడవలు రేవు చేరాయి ‘ వంటి ఎన్నో కథలు వాటి గూర్చి చెప్పటం కాదు చదివి తీరాల్సిందే.

హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాప్తికి కారణాలు అత్యాచారాలు, రక్తమార్పిడి, భర్త ద్వారా భార్యకి సంక్రమించడం, ట్రాఫికింగ్, వ్యభిచారం, నిర్లక్ష్యం , మానవతావిలువలు నశించడం, ప్రేమ పేరుతో మోసపోవడం… ఎన్ని కథలో .. ఎన్ని వ్యధలో .. భిన్న దృక్పథాల్లో మన చుట్టూ ఉన్న సమాజంలో కుల, మత , ప్రాంత, లింగ బేధం లేకుండా అన్ని వర్గాల వారూ పడే బాధ. ఒక్కో కథ ఒక్కో తీరులో తీసుకున్న సమస్య పై అవగాహన కలిగిస్తూ, మనో ధైర్యాన్ని , బతుకుపై విశ్వాసాన్ని ప్రోది చేస్తూ.. తమ లాంటి బ్రతుకు మరొకరికి రాకూడదని కోరుకుంటూ .. తమకు చేతనైన సహాయం అందిస్తూ .. సాగిన కథలే అన్నీ . కథా రచన శైలిలో వైవిధ్యంతో సాగిన కథలు ఇవి. కథలో పటుత్వం కొన్నింటిలో తగ్గినప్పటికీ అన్ని కథలూ అవసరం అయినవే. చైతన్యవంతం అయినవే. పరిమిత సమయంలో ఇంత మంచి కథలు ఆవిష్కరించిన కథకులందరికి అభినందనలు చెప్పాలిసిందే.

రచయితల్ని ఆయా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళి వారికి మరింత ప్రత్యక్షానుభావాన్ని కలుగ చేస్తే ఇంకా ఎంతో అవసరమైన అంశాలతో , వివరాలతో ఇంకా మాంచి కథలు వస్తాయని ఈ కథలు వాగ్దానం చేస్తున్నాయి అని జ్యూరీ మాటలో డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారన్నారు. నిజమే, నాలుగు గోడల మధ్య కూర్చొని ఊహించి రాసినదానికి కంటే, ప్రత్యక్షంగా చూసి లోతుగా అధ్యయనం చేసి రాసే సాహిత్యం మరింత శక్తివంతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నిజానికి అన్ని కథల్నీ చదివి ఎంపిక చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ పని చేశారు కథా రచనలో అపార అనుభవం ఉన్న కథకులు విహారి, డా. వాడ్రేవు వీరలక్ష్మిదేవి, తుమ్మేటి రఘోత్తమరెడ్డి వ్యవహరించారు.

తెలుగునేల నలుమూలలా ఉన్న రచయిత్రులందరినీ సమీకరించి, వారి రచనలు సేకరించి ఒక కార్యాన్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహించిన సంపాదకులు అయినంపుడి శ్రీలక్ష్మి, మామిడిహరికృష్ణ, మమతారఘువీర్ ల కృషికి నిదర్శనం అద్భతంగా ఉన్న ఆశాదీపం. అక్టోబరులో సాహితీ సమారోహణం గురించి చెప్పినప్పుడు ఊహించలేదు ఇంత చక్కటి పుస్తకం అందుకుంటామని. అందుకోసం సంపాదకులు పడిన శ్రమ, ఇబ్బందులు తక్కువేమీ కాదు. అనుకోని అవాంతరాల వల్ల అనుకున్న సమయానికి డిసెంబరు ఒకటవ తేదీన పుస్తకం రాకపోయినప్పటికీ వారు పడిన ప్రయాస అంతా తుడిచిపెట్టుకుపోయి ఉంటుంది.

హెచ్ ఐ వి/ఎయిడ్స్పై ప్రజలలో అవగాహన పెంచడం కోసం, చైతన్యవంతం చేయడం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అందులో ఈ పుస్తకం కోసం చేసింది సముద్రంలో నీటి బొట్టంతే. కానీ, వచ్చే ఫలితం ఊహకందనంత.
-వల్లూరిపల్లి శాంతి ప్రబోధ

స్నేక్ గ్యాంగ్ సెర్చ్

ఒళ్ళు విరుచుకుని
నేలంతా పరుచుకున్న
విషనాగుల సమూహం
రక్తనాళాల్లా విస్తరిస్తూ
జనంలో సంచరిస్తూ
ఉచ్చు పన్నుతుంటే
ఉగ్రంగా వెంటాడుతుంటే
తెరవెనుక పైశాచిక దృశ్యాల్ని
చూడలేని కాలం
మంచులా ఘనీభవించింది

*** ***

చీకటి దుప్పటి కమ్మేసిన వేళ
నరనరాన నిండిన కిరాతకత్వం
“ఆమె” అంటే ఉన్న చులకన భావం
చవి చూసిన వానకారు కోయిల
అగ్నిపర్వతంలా ఎగిసిపడుతూ
రక్తపు మడుగులా ఉడుకుతూ
లావా వెదజల్లుతూ
పంచాగ్నుల్ని రగిలిస్తూ విశ్వపుటంచున

*** ***

దీర్ఘ నిద్ర నుండి మేల్కొని
కార్డన్ అండ్ సెర్చ్ తో
కుక్కమూతి పిందెల్ని ఏరేసి
శిథిల గృహంలో
ఆశల మెరుపు తునకల్ని
మొలిపించే యత్నం చేస్తూ
తీగపై వేలాడుతున్న మగువ
ప్రాణానికి ‘ఉమన్ పాలసీ ‘
చేస్తుందా కాయకల్ప చికిత్స ?!
ఇస్తుందా రక్షణ కవచం ? !!

వి. శాంతి ప్రబోధ

6. 9.14
(స్నేక్ గ్యాంగ్ గురించి రాయమని fb మిత్రుని సూచన స్పూర్తితో )

మహారణ్యపు ముళ్ళదారుల్లో ..

చిగురు తొడుగుతున్న బాల్యాన్ని
ఊపిరాడని చీకటి గుయ్యారంలోకి
రెక్కలు విప్పుకుని తరుముతూ .. రభసచేస్తూ..
తన కబంధ హస్తాలలోకి రారమ్మని వేధిస్తూ ..
తనువు నుజ్జు నుజ్జై బాధతో అరుస్తుంటే
మనసు భయంతో చిగురుటాకులా కంపించిపోతుంటే
పసిమొగ్గల హాహాకారాలను జుర్రుతూ
వికటాట్టహాసంతో ఆలింగనం చేసుకొన్నావా ..?!

******
బంగారు బతుకు బొమ్మల్ని చిందరవందర చేసి
మహారణ్యపు ముళ్ళదారుల్లోకి గిరాటేసి
మసక బారుస్తూ .. చీకటి రంగుల్లోకి తరిమేసి
కన్న వారి కళ్ళలో ఆశల చిగుళ్ళు తుంచేసి
బొండు మల్లె గుబాళింపులు మాయంచేసి
సేదతిరమంటున్నావా ..?
మట్టిపొరల సువాసనలద్దుతున్నానంటూ
నిన్ను నీవు సమర్ధించుకుంటున్నావా .?!

** *** **

ఉత్పాతంలో ముద్దలు ముద్దలుగా
రాలిన చుక్కల జ్ఞాపకాల వేదనతో
పగిలిన హృదయ రోదనతో
తెల్ల కాగితంపై రక్తాశ్రువుల వీడ్కోలు
రెప్ప వాల్చి తెరిస్తే .. మళ్ళీ మామూలే
లిప్తపాటులో .. అంతా జరిపించేసి
రాజుకుంటున్న కారుమబ్బుల్లో
గద్దల్లా తన్నుకు పోతున్న ఇనుప శకలాలు
అయినా నిద్దురపోతూనే ఉంటాం!
మొద్దు నిద్దుర పోతూనే ఉంటాం !!

వి. శాంతి ప్రబోధ
(ముసాయపేట సంఘటన తర్వాత రాసిన కవిత)

Tag Cloud

%d bloggers like this: