The greatest WordPress.com site in all the land!

Archive for April, 2015

బాల్యం మోస్తున్న విషాదం

రాకేశ్ కి ఏడేళ్ళుంటాయి.  రెండో తరగతి చదువుతున్నాడు. చాలా చురుకైన కుర్రాడు. ఎప్పుడూ గలగలా మాట్లాడుతుంటాడు.  సహజంగా ఆ వయసులో ఉండే ఉత్సాహం, ప్రశ్నించే తత్వం, కొత్తవాటి గురించి తెల్సుకోవాలన్న జిజ్ఞాస, కుతూహలం రాకేశ్ లో ఎక్కువే .. ఎప్పుడు ఏ సందేహం వచ్చినా ఏవేవో ప్రశ్నలు వేస్తుంటాడు. ఎన్నెన్నో కలలు కంటుంటాడు.
విరిసే హరివిల్లు కురిసే తొలిజల్లు తనకోసమేనని సంబరపడిపోయే రకం రాకేశ్. అలాంటిది, ఈ మధ్య చాలా దిగులుగా కనిపిస్తున్నాడు. అందరితో కలవడంలేదు.  ఆడుకోవడం లేదు. ఒక్కడే వేప చెట్టు కింద ఉన్న సిమెంటు బల్లలపై కూర్చుంటున్నాడు.  గత వారం రోజులుగా గమనిస్తూనే ఉన్నా.. దాదాపు రోజూ అదే సీను.  స్కూలు నుండి వచ్చి మిగతా పిల్లలంతా బడి బట్టలు మార్చుకుని స్నాక్స్ తిని ఆడుకుంటారు . రాకేశ్ కూడా అలాగే చేసేవాడు.  ఉయ్యాలలు ఊగడమో .. పెద్ద పిల్లలతో బాటు షటిల్, ఫుట్ బాల్ ఆడతానని పేచి పెట్టడమో చేస్తుండేవాడు.   ఒక్కచోట ఒక ఆటలో కుదురుగా ఉండేవాడు కాదు.   అలాంటివాడు ఇప్పుడెందుకు డల్ గా ఉంటున్నాడో అర్ధం కావడం లేదు.
సాధారణంగా అయితే వాడికి ఏ సందేహం వచ్చినా,  ఎవరైనా కొట్టినా తిట్టినా నా దగ్గరకి పరిగెత్తుకొచ్చి ఫిర్యాదు చేసేవాడు.  మరే .. మరే ..ఆ .. చరణ్ గాడున్నాడు చూడూ..  వాడు నన్ను కొట్టాడు .  గాయత్రి నన్ను గిచ్చింది .. పల్లవి నా ప్లేటు గుంజుకుంది  అంటూ .. సాగేవి వాడి కంప్లైంట్లు.ఇప్పుడసలు నా దగ్గరకి రావడం లేదు సరి కదా పిలిచినా పలకడం లేదు.  పెద్ద పిల్లలు ఎవరైనా వీడిని భయపెడుతున్నారా .. బెదిరిస్తున్నారా.. కొత్తగా వచ్చిన ఇద్దరు  పెద్ద పిల్లల్లో విశృంఖల ధోరణి కన్పిస్తోంది.  వారిని శ్రద్దగా గమనిస్తూనే ఉన్నాం.  మా కళ్ళుగప్పి  వారుగానీ వీడిపై ఏదైనా అఘాయిత్యానికి ఒడిగట్టలేదు కదా .. ఏవేవో అనుమానాలూ .. సందేహాలూ .. ఇంకా ఏదైనా కారణం ఉందేమో పగలు రాత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా గమనించమని మూడురోజుల క్రితమే రాధకి చెప్పాను.  రాధ కేర్ టేకర్. పిల్లల్ని చాలా ప్రేమగా లాలనతో ఆదరిస్తుంది. తగిన అనురాగాన్ని అందిస్తుంది.  మంచి చెడు చెబుతుంటుంది.ఆమెకీ తన వాళ్ళంటూ ఎవరూ లేకపోవడం వల్లేమో తల్లిలాగే సాకుతుంది.   పిల్లలకీ ఆమె దగ్గర చనువు ఎక్కువే.  ప్చ్ .. లాభం లేదు అక్కా.   ఏమీ తెలియడం లేదు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటున్నాడని రాధ చెప్పింది.ఏమైంది మేడం, రాకేశ్ ఇదివరకటిలా లేడు. హోం వర్క్ చేస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడడం లేదు,  పిల్లలెవరితోనూ కలవడంలేదు, భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు, చాలా దిగులుగా ఉంటున్నాడని ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళ క్లాస్ టీచర్ ఫోన్ చేసి చెప్పారు.హొమ్ లో పిల్లలంతా రంగు రంగుల సీతాకోకచిలుకల్లా  గ్రౌండ్లో ఆటలాడుతూ .. రాకేశ్ తప్ప.  వాడి దగ్గరగా వెళ్లి పలకరించా .. పలకలేదు.  బెంచీ పై పడ్డ ఆకులు తుడిచి వాడి పక్కనే కూర్చున్నా.  నా వైపు లిప్తపాటు  ఓ నిర్లక్ష్యపు చూపు విసిరి చెట్టు పైకి చూస్తున్నాడు.  వాడి కళ్ళు కళా కాంతి  లేకుండా .. తెల్లగా మిల మిలా నక్షత్రాల్లా మెరిసే కళ్ళు కావిపట్టిన తెల్లటి పంచెలా .. వెలాతెలాపోతూ .. అక్కడ ఏముందా అని పైకి చూశా.  కొమ్మలపై కోతి.  తన పిల్లని వీపు మీద ఎక్కించుకొని ఆ చెట్టు మీద నుండి మరో చెట్టు పైకి గెంతుతూ ..  వాటినే తదేకంగా చూస్తున్న వాడిలో ఏదో బాధ గూడుకట్టుకుని .. చెప్పలేక సతమతమవుతూన్నట్లుగా అనిపించింది.రాకేశ్ గత రెండేళ్ళుగా మా హొమ్ లోనే  ఉంటున్నాడు. వచ్చిన మొదట్లో వాళ్లమ్మ కోసం దిగులుతో ఉండేవాడు.  వచ్చినేడాది దసరా సెలవుల్లో అనుకుంటా వాళ్ళమ్మ వచ్చి ఇంటికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడూ  రాలేదు.  రాకేశ్ తోనూ మాతోనూ  అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడేది.  నేను రాలేని పరిస్థితిలో ఉన్నానమ్మా .. పిల్లాడికి అన్నీ మీరేనమ్మా అంటూ తన ప్రేమంతా మూటగట్టి జాగ్రత్తలు చెప్పేది. రాకేశ్ కి ఇక్కడ బాగా అలవాటైయింది. బాగానే ఉంటున్నాడు. ఆ విషయమే చెప్పి ఆమెని ఓదార్చేవాళ్ళం. రాకేశ్ చంటివాడిగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు ఎయిడ్స్ తో.    అదే జబ్బుతో నాలుగు నెలల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ విషయం  మాకు తెలిసి పదిరోజులయింది.  చాలా బాధ అనిపించినా ఆ విషయం రాకేశ్ తో మేం చెప్పలేదు.  వీడికి ఆ సంగతి ఏమైనా తెలిసిందా.. సందేహం నాలో.  ఊహూ .. ఆ అవకాశంలేదు .. అంటూ నా  బుర్ర తీవ్రంగా ఆలోచిస్తోంది.    ఓ పక్క ఆలోచిస్తూనే ..Kadha-Saranga-2-300x268

వాడి మౌనానికి భంగం కలిగించాలని ‘నేను బైకు, కారు కొన్నానుగా..  ‘ ఊరిస్తూ  అన్నాను.
కళ్ళు చిట్లించి నా మొహంలోకి నిర్లిప్తంగా కనుకొలుకుల్లోంచి చూపు విసిరి వెంటనే దృష్టి మళ్ళించేశాడు.  ఇదే మాట వారం క్రితం నేను అని వుంటే .. ఎగిరి గంతేసేవాడు. ఏది అంటూ ఇచ్చేదాకా నన్ను వదిలేవాడు కాదు.
నాకు క్లాసులో ఫస్టు వస్తే గిఫ్టు ఇస్తానన్నావుగా అని అడిగాడు పదిహేను రోజుల క్రితం.  అవును, ఇస్తాను అంటే ఏమిస్తావు ఉత్సుకతతో.. ప్రశ్న.  ఏమి చెప్పాలా అని ఆలోచిస్తున్న నన్ను చూస్తూ నాకు బండి గిఫ్ట్ గా ఇవ్వొచ్చుగా.. .అన్నాడు
ఆశ్చర్యపోతూ .. బండా .. ఏ  బండి అంటే,  నీ  బండే అంటూ నా హోండా ఆక్టివా వైపు చూపాడు.  వాడు అన్న తీరుకు భలే నవ్వొచ్చింది.  వోర్నీ వెధవా .. ! నా బండికే టెండర్ పెట్టావా .. నా బండి నీకివ్వడం ఏంట్రా .. అంటూ మురిపెంగా వాడి నెత్తిన చిన్న మొట్టికాయ వేసి,  ఇస్తే ఏం చేస్తావ్ అని అడిగా .. బండేసుకుని బుయ్ బుయ్ అంటూ  బడికెల్తా .. మా అమ్మదగ్గరకెల్తా .. అంటూ ఆక్షన్ తో చెప్పాడు.
ఓహో ..అలాగా,  బండి కావాలంటే నేనివ్వడం కాదు. నువ్వు బాగా చదువుకుని చాలా తెలివి తెచ్చుకుని ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకుంటే, బండి ఒక్కటే కాదు నువ్వేది కావాలంటే అది కొనుక్కోవచ్చు అన్నాను . మరి ఈ బండి నువ్వే నీ పైసలు పెట్టే  కొనుక్కున్నావా .. ? టక్కున వచ్చింది ప్రశ్న . కొంచెం ఆశ్చర్యం వెన్నెల పువ్వులా మెరిసే ఆ మోహంలో ..
నవ్వుతూ అవునన్నాను.
అయితే, అప్పుడు నీ  బండి కంటే పెద్ద బండి కొనుక్కుంటాలే.  నా మొహంలోకి అలా పరీక్షగా చూసి, కొన్ని క్షణాల తర్వాత,  ‘అప్పుడు నువ్వు ముసలయిపోతావుగా అమ్మమ్మ లాగా..  మా అమ్మని , నిన్ను నా బండి ఎక్కించుకుంటాలే … ‘ కళ్ళని నక్షత్రాల్లా మెరిపిస్తూ ముత్యాల మాటలు, తన తల్లితో పాటే నాకూ చోటు కల్పిస్తూ.. నా పట్ల సానుభూతి, ప్రేమ ప్రదర్శిస్తూ …
అబ్బురంగా వాడివంకే చూస్తున్ననాకేసి తిరిగి నా రెండు బుగ్గలని ఆ బుల్లి చేతులతో తడుముతూ ‘ఇప్పుడు నాకు బొమ్మ బండి అయినా కొనివ్వోచ్చుగా ..అబ్బా .. ప్లీజ్.. ప్లీజ్ .. ‘ అన్నాడు గోముగా.
సరేలే .. నేను షాప్ కి వెళ్ళినప్పుడు తెస్తాలే అన్నాను .
‘నిజ్జంగా..నిజ్జమ్గా .. తెస్తావా .. ‘ కళ్ళలో మెరుపు తీగలు ప్రసరిస్తుండగా తలెత్తిన సందేహంతో
ఆ నిజమంటే నిజ్జంగా తెస్తా .. సరేనా .
ఒకటి నీబండి లాంటిది , ఒకటి అంకుల్ బండి లాంటిది అంటూ రకరకాల మోడల్స్ చెప్పడం మొదలు పెట్టాడు. షాపులో ఏవి దొరికితే అవి తెస్తాలే అన్నాను.
‘నాకు తెస్తే  ఆ యూసుఫ్ గాడు లేడూ వాడూ అడుగుతాడు గద .. లేకపోతె నాది లాక్కుంటాడు. తుక్కు తుక్కు చేస్తాడు . వాడిక్కూడా  తేరాదూ..’ తోటివాడి పట్ల వాడిప్రేమతో పాటు దూరాలోచన నన్ను ఆశ్చర్యపరుస్తుండగా
‘వాడు క్లాసు ఫస్టు కాదుగా.. ,’ అన్నాను
‘ఆ … అయితే .., మూడో తరగతిలో వాడినే ఫస్టు తెచ్చుకొమ్మని చెప్తాలే ..’ పెద్దరికంగా వీడి జవాబు. అంత చనువుగా మాట్లాడే రాకేశ్, మాటలతో మురిపించే వీడిలా మౌనగీతం ఆలపించడం, అపరిచితుడిలా ప్రవర్తించడం చూస్తుంటే  నాకెంతో బాధగా ఉంది.  ఆ చిన్ని గుండెకి ఏదో పెద్ద గాయమే అయినట్లుంది  అనుకుంటూ వాడి దగ్గరగా జరిగి ..  జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి తల నిమురుతూ ఎందుకురా నాన్నా .. బండి తేలేదని నాపై కోపం వచ్చిందా అన్నా. . తల వంచుకున్నాడు .  నువ్విట్లా ఉంటే నాకేం బాగోలేదురా .. ఊ.. మాట్లాడరా  నాన్నా.. బుంగ మూతి పెట్టి వాడి పద్దతిలోనే నేను.  ఊహు.. ఉలుకు లేదు, పలుకు లేదు.
‘ఊ.. సరేలే అయితే.. , నువ్వు నా దోస్త్ కచ్చా పెట్టావ్ గా .. నేనూ నీ  దోస్తు కచ్చా ..అంతే .. నేను తెచ్చిన కారు, బండి రేపు యూసుఫ్ కి, ఆనంద్ కి, మల్లేష్ కి ఇస్తాలే ..  అంటూ రెండు వేళ్ళను మడచి కటీఫ్ చెప్పాను.  మేం అక్కడ ఉండడం చూసి మిగతా పిల్లలు రాబోతుంటే  పదండ్రా నేనూ ఆటే వస్తున్నా .. మనం ఆడుకుందాం అన్నా ..
‘తెచ్చుకో .. ఇచ్చుకో .. అన్నీ తెచ్చి వాళ్ళకే ఇచ్చుకో .. చేతులు ఊపుతూ మూతి విరుస్తూ ఉక్రోషంతో వత్తి వత్తి పలికాడు.  హమ్మయ్య మొత్తానికి మౌన వ్రతం వీడాడు అనుకుంటుంటే
‘నాకవన్నీ ఏమద్దులే .. మా అమ్మ కావాలి . మా అమ్మనిస్తావా.. ?’ తలెత్తి పలికిన వాడి కళ్ళు మండే సూర్యుడిలా.   నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నిలదీసి అడుగుతుంటే.. నా కళ్ళలో జవాబు కోసం వెతుక్కుంటుంటే .. నా గుండెలో మెలిపెట్టి పిండేసినట్లుగా.. తోడేస్తున్నట్లుగా.. భస్మమై పోతున్నట్లుగా … వాడి కళ్ళలో నిప్పుల వేడికి నా కళ్ళలో తడి  సుడులు తిరుగుతూ . ఆ కళ్ళలో కళ్ళు కలిపి చూడలేక తప్పు చేసిన దానిలా చప్పున తలొంచుకున్నా …  ఎక్కడ నుండీ తేను వాడి కన్నతల్లిని …?

‘ఎండా కాలం సెలవుల్లో మీ అమ్మ వస్తుంది. రేపు మీ అమ్మతో ఫోన్లో మాట్లాడిస్తాలే’ ఆ క్షణానికి ఏమి చెప్పాలో తెలియక నోటికి వచ్చినట్లుగా వాగేశా కానీ, నా గొంతు నాకే కొత్తగా .. బావిలోంచి వస్తున్నట్లు సన్నగా.. పీలగా ..అసహ్యంగా ..

నా గడ్డం పట్టుకుని కళ్ళలోకి సూటిగా తదేకంగా చూస్తూ.. జవాబు కోసం  వెతుకుతూ రాకేశ్ ..ఆ పాలమనసులోకి అబద్దపుటద్దంలోంచి  చూడలేక నేను కుంచించుకుపోతుండగా

‘ఎప్పుడూ అబద్దం చెప్పొద్దని నువ్వే చెప్తావుగా ..?!  ఇప్పుడు నువ్వెందుకు అబద్దమాడుతున్నావ్ ..?’  అని నన్నూ నా నిజాయితీని నిలదీస్తుంటే ఏమని చెప్పను ఆ చిట్టి తండ్రికి.
నాలో ఖాళీతనం ఆవరించుకు పోతుండగా ‘నాకు తెలుసు. అంతా తెలుసు.  నాకోసం మా అమ్మరాదు. ఎవ్వరూ రారు . ఎప్పటికీ.. ఇక ఎప్పటికీ రారు .  నేనూ నవీన, ఆనంద్, కార్తిక్ వాళ్ళందరిలాగే … సెలవులక్కుడా ఎక్కడికీ పోను. నా కెవరూ ఫోన్ చేయరు.  అదే నిజం కదూ .. నా కంతా తెలిసిపోయింది…’ నన్ను చుట్టుకు పోయి ఏడుస్తూ .. అప్పటి వరకూ బిగబట్టుకున్న దుఃఖం కట్టలు తెంచు బయటపడుతూ ..

వాడు ఏడుస్తుంటే నా కళ్ళలోంచి, హృదయం లోంచి  ఏడుపు ఉబికి ఉబికి వస్తూ.. . నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ వాడిని ఒళ్లో పడుకోపెట్టుకుని తల నిమురుతున్నా ..ఆత్మీయ స్పర్శ నందిస్తున్నా..  తల్లితో పాటే నాకూ సమ స్థానం ఇచ్చి తన స్కూటర్ ఎక్కించుకుంటానన్న రాకేశ్ కి నేను తల్లి ప్రేమను పంచగలను కదా. వాడిని చుట్టుముట్టిన కారుమేఘల్లోంచి అమృతం చిలకగలను కదా అన్న ఆలోచన రాగానే గుండెలో భారం దిగుతున్నట్లుగా అనిపించింది.  ‘ ఏడవకురా  నాన్నా .. ఏడవకు, నీకు మేమందరం లేమా .. ?!’  అంటూ వాడి కళ్ళు నా చీర చెంగుతో తుడిచి  నీకు నేనున్నా.. అనే భరోసా వాడిలో కలిగిస్తూ రెండుచేతుల్లోకి తీసుకుని భుజాన వేసుకున్నా. చిట్టి చేతులతో పాములా మెడచుట్టూ చుట్టి కప్పలా కరుచుకుపోయి  వెక్కిళ్ళు పెడుతున్న వాడిని బుజ్జగిస్తూ గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్న నన్ను విస్మయంతోనూ, ఆనందంతోను చూస్తూ కేరింతలు కొడుతూ .. చప్పట్లు చరుస్తూ .. , మాకేసి పరుగెత్తుకొస్తూ యూసుఫ్ , మల్లేష్, గాయత్రీ , పల్లవి , చరణ్ మిగతా వాళ్ళూ ..

(Published in Saranga Web magazine on 26th March, 2015)

మానవతా వర్ధిల్లు

‘అయ్యో తాతా పడిపోయావా’ అంటూ పరుగు పరుగున వచ్చి లేపబోయాడు ఆ అబ్బాయి
ఆ ముసలతన్న్ని లేపడం కష్టంగా ఉందతనికి. ఎవరైనా సాయం వస్తారేమోనని చుట్టూ చూశాడు. రోడ్డుకు ఆవలి వేపు వున్న బస్ స్టాప్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కానీ ఎవరూ ఇటు చూడడం లేదు. మళ్లీ తాతను నిలబెట్టాలని ప్రయత్నించాడు. అతను నున్చోలేక తూలిపోతున్నాడు. ప్చ్ .. పాపం తాతకి తనలాగే ఎవరూ అన్నం పెట్టేవాళ్ళు లేరేమో అనుకున్నాడు ముసలోడుకదా అందుకే పడిపోతున్నాడు. తాత దగ్గర ఏదో వాసన . స్నానం చేసి ఎన్ని రోజులైయిందో అందుకే వాసన . స్నానం చేయడానికి ఇల్లు లేదేమో .. ఆ వాసనకి ఆ అబ్బాయి ఉదయం పంపు కింద దోసిట పట్టి తాగిన నీళ్ళు కడుపులో పేగుల్ని తిప్పేస్తూ .. బయటకు పంపడానికి సిద్దమవుతూ .. అట్లాగే తాతని చెట్టు నీడన చేర్చాడు.
‘అమ్మా ఓ ముద్దుంటే ఎయ్యన్దమ్మా .. ‘ రోడ్డవతల బస్టాప్ పక్కనున్న ఇంటి ముందు నుంచుని ఓ స్త్రీ అడుక్కుంటూ,
తను అట్లా అడుక్కుంటే .. ఒక్కక్షణం మనసులో కదలాడిన ఆలోచన.
‘దుక్కలాగున్నావు పని చేసుకు బతకోచ్చుగా… ఇళ్ళమీదపడి అడుక్కునే బదులు’ ఆ ఇల్లాలు కోపంగా
‘తాతా ఇప్పుడే వస్తా, ఇక్కడే ఉండు’ అంటూ ఆ చెట్టుకింద పడుకోబెట్టి పరుగెత్తాడు.
‘అమ్మా.. అమ్మా ‘ పిలిచాడు
‘ఈ అడుక్కునే వాళ్ళతో చచ్చిపోతున్నాం .. చిన్నా పెద్దా , ముసలి ముతకా అందరూ అడుక్కోవడమే ఈ పని సులభమై పోయింది. తేరగా పెడితే తిని తిరగడం బాగా అలవాటైపోయింది జనాలకి ‘ బిగ్గరగా తిడుతూనే, విసుగ్గా గడపలోకి తొంగి చూసింది ఆ ఇల్లాలు
‘నేను అడుక్కునే వాడిని కాదమ్మా ‘ చిన్న బుచ్చుకున్న మొహంతో
‘ఆ.. మరెందుకోచ్చావ్ ‘ చిరాగ్గా ఆమె అడుగు ఆ అబ్బాయికేసి వేస్తూ
‘అమ్మా నేనునడుక్కోవడానికి రాలేదు. ఏమన్నా పని ఇస్తారేమోననీ .. ‘ భయం భయంగా
‘నువ్వా! నువ్వేం పని చేస్తావ్? నిండా పదేళ్ళు లేవు ‘ విసుగు మాయం అవుతుండగా ఆశ్చర్యంతో
‘మీరేది చెప్తే అది చేస్తానమ్మా .. ఇందాక మీరు అడుక్కోనేవాళ్ళని పనిచేసుకొమ్మని తిట్టడం విన్నానమ్మ . అందుకే వచ్చా ‘ వినయంగా
‘ఒసే రమణీ .. వాడి మాయమాటలు నమ్మకే , పిల్లల్ని అడ్డం పెట్టుకుని దొంగాతనాలెక్కువయ్యాయి ‘ ముసలావిడ హితబోధ చేస్తూ
‘అమ్మా నేను అట్లాంటి వాడిని కాదు. నేనూ అడుక్కుంటే అని ఒక్క క్షణం ఆలోచించిన మాట నిజం. మీ మాటలే నన్ను ఆ పని చేయనీయలేదు. కష్టాన్ని నమ్ముకు బతాకలనేమానాన్న మాట కూడా గుర్తొచ్చింది ‘ వినమ్రంగా ఆ అబ్బాయి
‘మీ నాన్న పని చెయ్యడా ..? ‘ కుతూహలంగా ప్రశ్నించిదావిడ
‘అమ్మానాన్న , తమ్ముడు రోడ్డు ఆక్సిడెంట్ లో చనిపోయారు. చిన్నాన్న దగ్గర ఉండేవాణ్ణి. కానీ, చిన్నమ్మ పెట్టే బాధలకు ఇంట్లోంచి వచ్చేశా. నన్నంటే బాధ పడకపోదును. కానీ, చచ్చిపోయిన నా వాళ్ళను రోజూ తిడుతుంటే ఉండలేక పోయానమ్మా’ కళ్ళలో ఎగిసిపడే నీటిని, గొంతులో అడ్డుపడే బాధని అదిమిపెడుతూ చెప్పాడు
పాపం పసివాడు అన్నం తిన్నట్టు లేదు అనుకుంటూ తాము తినగా మిగిలిన అన్నం, కూరా ఉంటే ప్లేటులో పెట్టుకు వచ్చి తినమంది. వాడి కళ్ళలో మెరుపు ఆమె చూపును దాటిపోలేదు.
‘అమ్మా ఒక బాటిల్ ఉంటే ఇవ్వామ్మా’
అర్ధమయిన ఆవిడ నీళ్ళ సీసా ఇచ్చింది.
అందుకున్న వాడు పరుగుపరుగున రోడ్డు దాటేశాడు. పక్కన కుర్చుని తింటాడేమోననుకున్న ఆ ఇల్లాలు చూసేసరికి అక్కడ లేడు. అయ్యో నా ప్లేటు .. ఎంత నమ్మించాడు. ఏలెడు లేడు వెధవ. ఎన్ని అబద్దాలు చెప్పాడు. ఆ అబ్బాయి కోసం ఆమె కళ్ళు వెతుకుతూ నమ్మినందుకు తనను తాను తిట్టుకుంటూ గేటు దాటిందామె.
రోడ్డవతల ఉన్న పొగడచెట్టు కింద ఉన్న ముసలతని దగ్గరకెళ్ళి తాతా లే అంటూ లేపాడు. లేవలేదు. కాసిని నీళ్ళు చల్లాడు. నెమ్మదిగా లేచాడతను.
‘ఎవర్నువ్వు ‘ ఎగాదిగా చూస్తూ లేచి కూర్చున్నాడు
‘తర్వాత చెబుతాలే నేను లేకపోతే నువ్వు ఆ లారీ కింద ఉండేవాడివి. ఆకలేసిందా .. కాళ్ళు తిరిగి పడిపోయావా .. ‘అంటూ అన్నం కలిపి ప్లేటు అతని ముందు పెట్టాడు.
ఆ బిడ్డడి మొహం చూస్తుంటే తను తిని ఎన్నిరోజులయిందో అన్నట్టుంది. అయినా, కన్నబిడ్డలే కాదని ఇంట్లోంచి గెంటేసిన ఈ తాగుబోతు కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు అనుకుని నువ్వు తిను కొడకా అన్నాడా వృద్దుడు హృదయం భారమవుతుండగా ..
ఆ దృశ్యం చూసిన ఆమె మానవత్వమా వర్ధిల్లు అనుకుంటూ తృప్తిగా వెనుదిరిగింది.

Tag Cloud

%d bloggers like this: