The greatest WordPress.com site in all the land!

Archive for June, 2016

‘మూడవ మనిషి ‘ దీర్ఘ కవిత: సమీక్ష    

  
హిజ్రా, కొజ్జా , గాండు, పేడి …ఎలా పిలిచినా ఆడామగా కాని మూడోవర్గం వాళ్లని ఎవ్వరమూ చేరదీయం సరికదా.  హిజ్రాలని చూసి ఎవగించుకుంటాం. చూడరాని వాళ్ళని చూసినట్టు అసహ్యంగా మొహం పెట్టి చూస్తాం. రోడ్డుపై వారు కనిపిస్తే, వారికి దూరంగా వెళ్లిపోతుంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచనకు వస్తే కారు అద్దాలన్నీ గట్టిగా బిగించేస్తుంటాం. రైల్లో యాచనకు వచ్చిన వాళ్ళను చూస్తే మొహం అదోలా పెట్టి ఎటో చూడడమో అవహేళన చేయడమో చూస్తుంటాం. లేదా వాళ్ళని దొంగల్లానో, ఏదో నేరం చేసిన వాళ్ళలానో చూస్తుంటాం.  కానీ ఆ  శరీరం మాట్లాడే మాటలని, ఆ హృదయపు ఆవేదనని, సంవేదన గురించి ఏనాడైనా ఆలోచిస్తామా .. ఊహు .. వారిని అసలు పట్టించుకోం. వారి గురించి అర్ధం చేసుకోం.   కాకపోతే మనలో కొందరం సానుభూతి చూపుతూ ఐదో పదో వాళ్లమొహాన వేసి ఏదో ఘనకార్యం చేసినట్లు భుజం తట్టుకుంటాం. లేదా  అవసరానికి లాక్కొచ్చి మనపిల్లలను దీవించమని కోరతాం అలాచేస్తే మన పిల్లలు చల్లగా ఉంటారని నమ్మి మన స్వార్ధం కోసం మాత్రమే మనం వాళ్ళని మన ఇళ్ళకి ఆహ్వానించేది.  లేదా వారి శరీరాలతో బేరసారాలూ .. అంతేగా ..ఒక శరీరం రెండు రూపాలతో, రెండు మనస్సులతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళను మనం చూసే దృష్టి.  అంతకుమించి ఉంటుందా .. ?
‘కాకిపిల్ల కాకికి ముద్దు ‘ అంటారు.  కానీ అది నిజం కాదేమో .. అనిపిస్తుంది. అటూ ఇటూ కాకుండా పుట్టిన పిల్లల్ని లేదా వారు ఎదుగుతున్నక్రమంలో కలిగే అసహజ ధోరణుల్ని తల్లిదండ్రులుచూసి తల్లిదండ్రులూ ముద్దు చేయడం లేదు. అర్ధం చేసుకోవడంలేదు.  వారికి వ్యక్తిగా ఎదగడం కోసం తమ సహకారం అందించడం లేదు.  అందుకే ఆ మాట అనాల్సి వచ్చింది. మరి తల్లిదండ్రులే కాదంటే, చీదరించుకుంటే మరి సమాజం నుండి అంతకన్నా ఎక్కువ ఆశించగలమా?  అందుకేనేమో  రేణుక అయోల వారి హృదయపు లోతుల్లోకి చొచ్చుకెళ్ళి వారనుభవిస్తున్న జీవితం తాలుకు లోతుపాతుల్ని దుర్భిణి వేసి చూశారు.  ద్రవించిన హృదయపు వేదనని అక్షరాలుగా పరిచారు.  సమాజంలో అటూ ఇటూ కాకుండా ఉన్నట్లు కనిపిస్తున్నవారి దేహాచరిత్ర కవిత్వీవికరించి వారి పట్ల సమాజం సహానుభూతి పొందే ప్రయత్నం చేశారు

.”మరీ అంత హటాత్తుగా కాదు గానీ / చాపకింద నీరు – పన్నెండేళ్ళ వయస్సు / చెప్పకుండానే వస్తాయి….. ఓహ్ !/  అరచేత్తో పట్టుకోవచ్చు ” అని కొండేపూడి నిర్మల “హృదయానికి బహువచనం”లో అంటారు.  శారీరక మార్పుల్ని ఎంతో ప్రేమగా ఆహ్వానించే  ప్రక్రియ ఇది. అదే హిజ్రాల్లో  ” ఒక శరీరం రెండు రూపాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు/ ఒక స్త్రీ రూపం కోసం / అంతులేని పరుగు తీస్తున్నప్పుడు” అంటూ  అయోమయాన్ని , అణచివేతను, సంఘర్షణని , మానసిక స్థితినీ తనదిగా అనుభూతి చెందారు. ఆ సహానుభూతితోనే ఒక దేహంలో రెండు లైంగిక రుపాలున్న, స్త్రీ మనసులో పురుష శరీరం , మనసుకీ మనసుకీ మధ్య జరిగే యుద్ధం , స్త్రీత్వం వైపుకే మొగ్గు చూపే మనస్సు , కోల్పోతున్న జీవితాన్ని పొందడానికి చేసే ప్రయత్నం కనిపిస్తుంది “మూడవ  మనిషి ” దీర్ఘ కవితలో

తప్పిపోయిన తన శరీరాన్ని , తన పేరుని , పుట్టుకని అవసరం లేకపోయినా మూడో మనిషిగా నిర్మించి అగాధాల్లోకి తోసేసే ఎప్పటికీ చెక్కుచెదరని గోడల్ని, జైళ్ళని ఓ స్వరం ప్రశ్నిస్తూ తన ఉనికిని , తన పేరుని , తన పుట్టుకని గురించి ధైర్యంగా చెప్పుకున్న దేహచరిత్రే ఈ దీర్ఘ కవిత “మూడో మనిషి “.

ఒక శరీరంలో రెండు రూపాలతో / కొట్టుమిట్టాడుతున్నప్పుడు / ఒక స్త్రీ రూపం కోసం / అంతులేని పరుగులు తీసిన జీవితాన్ని / అక్షరాలుగా చుసుకోవాలనుకున్నప్పుడు / సమాజం ముందు / నిర్జీవ దేహంతో నిలబడినప్పుడు / తన ముఖంతోనే అందరి / ముఖం చూసుకునే సమాజం ./ తన అవసరాల కోసం/ బతకలేని రూపాన్ని హింసించే సమాజంలో ‘  అంటూ వాళ్ళకి అయ్యే గాయాలు, వేదనలు, వ్యధలు నదీ ప్రవాహంలా ప్రవహిస్తాయి.  అక్షారాలు పట్టుకుని అనంతసాగరం ఈదాలనుకున్నపుడు   “నేనెందుకిలా పుట్టాను ?/ రెండు శరీరాలతో / లోకం రహదారుల వెంట నడవగలనా ?/ ఏ బెంచిలో కూర్చోవాలి ? / ఎవరి పక్కలో కూర్చోవాలి ? / అన్నీ సందేహాలే ……….” అని హృద్యంగా చిత్రించిన రేణుక  వీళ్ళకి  చదువు , ఉద్యోగం , ఆస్తి , పదవులు ఎక్కడా లేని స్థానాన్ని, ముక్కలవుతున్న స్వప్నాల్ని  సున్నితంగా ఎత్తి చూపుతారు.

‘లోపలి స్త్రీతో / బయటి ప్రపంచంలో బతకాలి అనుకున్నప్పుడు / ఆ మనిషి కోసం / ఆ రూపం కోసం / ఎన్ని మైళ్ళయినా / ఏలాంటి దారైనా / నడవక తప్పదు అనుకుంటూ / ధైర్యపు గొడుగుతో నిలబడటం కనిపిస్తుంది.
కొన్ని నిజాలు, ఆ యుద్దాల నిజాలు/ శరీరాన్ని చితిలోకి తోసేస్తున్నప్పుడు/ బతికినప్పుడు చనిపోలేదా ?/ చనిపోయానే వేలసార్లు/ మరి ఇప్పుడు ఎందుకు భయం ?/ అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ నువ్వు ‘హిజ్రావి ‘/ నువ్వు కొజ్జావి ‘ అన్న పిలుపులు విన్నప్పుడు  నిప్పు రవ్వల్లా ఎగిసి వచ్చే నేను స్త్రీని/  అవును నేను స్త్రీని/ నాకొక దారి ఉంది/ ఆ దారిలో చీకటి ఉన్నా/ నా లోపలి స్త్రీ లో/ వెలుగు ఉంది అంటూ తనకు తాను  స్త్రీగానే గుర్తింపు పొందాలనుకుంటుంది.  కానీ అందుకు భిన్నంగా మూడో మనిషిగా గుర్తింపునివ్వడాన్ని సమర్ధించరు. ఇలా ప్రశ్నిస్తారు  ”  చదువుకోవచ్చని/ మూడవ వ్యక్తిగా / గుర్తింపు యునివర్సిటి లలో / ఎవరికీ  ఓదార్పు కాగితాలు ?/ అసలు ఎందుకీ మూడవ వ్యక్తి ?/ తేనెతుట్ట కి పొగ పెట్టినట్లు / మళ్ళీ ఒక జాతిని / నిర్మించడం దేనికి ?/ వివక్షకి కొత్త దేహాలెందుకు ?/ అని ప్రశ్నిస్తుంది.
స్త్రీగా ఉండనిస్తే ఛాలు  / మామూలు మనిషిగా – స్త్రీలా / బాత్రూం ల దగ్గర / ఉద్యోగాల దగ్గర / గుర్తిస్తే చాలు … …../  మూడవ జాతి  నిర్మాణం ఆగిపోవాలి/ ఎలాంటి / ముద్రలు లేని  స్వాతంత్ర్యం కావాలి / హింస ఆపలేని న్యాయాలు ఎవరి కోసం ? కాకి గూట్లోంచి కోకిల పిల్లల్లా / నెట్టివేయబడిన బతుకులని / ఎవరో ఒకరుగా బతకనివ్వాలి / స్త్రీ గానో , పురుషుడిగానో ఉండనివ్వాలి / వాళ్ళని వాళ్ళ లా బతకనివ్వండి చాలు/ అంటూ వారి అంతరంగ లోతుల్లో జరిగే ఘర్షణ , ఉపరితలంలోని జీవిత ఘర్షణను  కళ్ళకు కట్టడంతో పాటు మరో జాతిని నిర్మించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తుంది. మూడోమనిషిగా  ఉండడానికి ఆ దేహం చూపే విముఖతని ఎంతో సమర్ధవంతంగా చూపారు కవయిత్రి.

తనలో పైకి కనిపించే శరీరం కాదు తనది లోపలి శరీరమే తనదని భావించి  పై శరీరాన్నిమగతనపు ఛాయలు తొలగిన్చుకొన్నప్పుడు ఎంత భావుకతతో  ప్రతిభావంతంగా చెప్పారో చూడండి .
శరీరం చెట్టు నుంచి / కొమ్మలు నరకాలి అనుకున్నప్పుడు/ కూకటి వేళ్ళతో సహా పెకిలించ బడింది/ శరీరం నుండి చిన్న అంగం తెగి పడింది/ చుట్టుతా నిశ్శబ్దం/ జీర్ణం కాని జడత్వం/ చల్లారిన అగ్నిపర్వతం’  గా చెప్తారు అయోల. కుటుంబం సహకారం లేకుండా శరీరంలో అంతర్భాగంగా ఉన్న ఒక అంగాన్ని తొలగించుకున్నప్పుడు కలిగే శారీరక మానసిక బాధని  అధిగమించి మనసు చెప్పిన విధంగా నడుచుకున్నప్పుడు  రహస్యమేదో కనిపెట్టినట్లు అరె వాడు వీడే కదూ .. అంటూ జతల కళ్ళు చేసే హేళనలు మనసుకి భారం కలిగిస్తాయి.

 

 “మగపిల్లవాడు ” మంత్రసాని గొంతులో సంతోషం /తండ్రి ముఖంలో ఉబికిన ఆనందం /…… అంటూ చూపింది.  అదే విధంగా ”  ఈ ఆడంగి తనం ఏమిటిరా కొడుకా ?/
దుఖంతో ముఖాన్ని నిమిరిన/ గాజుల చేతులు ఇంకా జ్ఞాపకం/  వంటి వాక్యాలు సమాజంలో ఉన్న జెండర్ అసమానతల్నిపట్టిస్తాయి.
ఆధిపత్య భావ జాల సమాజంలో పేదలు , శ్రామిక కులాలు , మహిళలు అనేక విధాల అణచివేతకు గురవుతున్నట్లే , అవమానాలకు , అత్యాచారాలకు ,  లైంగిక దోపిడీకి గురవుతున్నట్లే  వారి గొంతు మూగబొతున్నట్లే ఏక శరీరంలో రెండు దేహాలున్న మనిషి స్త్రీగా బతకాలనుకున్నప్పుడు అంతకు భిన్నంగా ఉండదు అని చెప్పే మాటలు చుడండి ” కన్నతల్లి , వదిన, చెల్లి / అందరూ స్త్రీలు / అధికారం లేని / సొంతగొంతు లేని స్త్రీలు ‘/,
మూడవ మనిషి అనిపించుకోవడానికి ఇష్టపడనని దేహం  , తనని స్త్రీ గానో , పురుషుడుగానో మాత్రమే గుర్తించమన్న దేహచరిత్ర కి  మూడవ మనిషి  అని పేరు పెట్టడం ఎందుకో అర్ధం కాలేదు .. అదేవిధంగా వచనం పాలు ఎక్కువే. బహుశా ఆమె ఎంచుకున్న కథాత్మక విధానం వల్లనేమో ..!
వినోదిని అన్నట్లు ‘ ప్రభుత్వాలు , సమాజం తమను తాము సంస్కరించుకోవలసిన అవసరాన్ని చాటి చెప్పే కావ్యం ఇది. ముందుమాటలో శీలా సుభద్రాదేవి గారన్నట్లు “థర్డ్ జెండర్ జీవితాన్ని తీసుకుని దీర్ఘ కావ్యం రాయడం ఒక సాహసమే.  ఆరునెలల పాటు హిజ్రాల జీవితాన్ని అధ్యయనం చేసిన తర్వాత వారిలో పరకాయ ప్రవేశం చేసి మూడో మనిషిగా ముద్రపడినవారి హృదయాన్ని ఆవిష్కరించిన తీరు అభినందనీయం.

వి . శాంతి ప్రబోధ

నేను గోవును మాటాడుతున్న .. ప్లీజ్ వినండి

ఓ మోడీ సారూ .. ప్రణబ్ సారూ .. మంచిగున్నారా .
అరె .. ఏంటి పియం గారూ  అట్లా చూస్తున్నారు ?
ఎవరనా ..? నా కళ్ళనుండి కారేదారల్ని చూసా..? నేను సారూ.. మీరు పవిత్రంగా పూజించుకునే గోవును, అదే గోమాతను.
కారేది, మీ  ఏలుబడి జూసిన ఆనందబాష్పాలు కావు సారూ .. నాకాపాదించిన పవిత్రత తీస్తున్న ప్రాణాలు చూసి కారుతున్న కన్నీరు .  నా చుట్టూత జరిగే రాజకీయం చూసి పారుతున్న రక్తకన్నీరు సారూ ..

అట్ల చూస్తారేంటి సారూ ..మీకు తెలియనిదా..ఇన్ని రోజులు నేనెంత సంతోషంగా  ఉన్నానో..ఇప్పుడు నా ఆనందం ఆవిరై పోయింది..
ఏంటి .. ? ఎందుకో తెలవడం లేదా ..?
జనం నా పాలు తాగారు.  నా మాంసం తిన్నారు.  మూత్రం తాగారు. నా పేడ వాడుకున్నారు.  నా చర్మం ఒలుసుకున్నారు.  నన్ను బానిసను చేసి అవసరమైనన్ని విధాల వాడుకున్నారు.  ఈ భూప్రపంచంలో నేను ఉన్నా లేకపోయినా మీకు ఉపయోగపడుతున్నానని సంబురపడ్డా. ఆ సంబురమంతా బెలూన్ లాగా పగిలిపోయింది.  మనసంతా నెత్తుటి గాయాలతో సలుపుతా వుంది సారూ.

మీ స్వార్ధం కోసం అతి తెలివితో మీరు నాకు పవిత్రత అంటగట్టారని నాకు తెలుసు.  నా చుట్టూ మీ పురాణాల్లో కథలెన్నో అల్లారనీ తెలుసు. మీ నాగరికత అంతా మా పశుబానిసత్వంపై ఆధారపడిందేననీ తెలుసు.  అయినా నేనెప్పుడన్నా బాధపడ్డానా .. లేదే ..!

దాద్రిలొ గొడ్డు మాంసం తిన్నారని , నిలువ ఉంచారనే ఆరోపణతో మూకుమ్మడి దాడి చేసి అక్లాక్ ప్రాణం గాల్లో కలిపేసారు. హిమాచల్ ప్రదేశ్ లో ఒకర్ని చంపేశారు ..నా కారణంగా ఇట్లా ఎంతమంది పై దాడి చేస్తారు సారూ .. గోమాంసం తిన్న వారిని చంపేయాల్సిందే ‘ అని సాద్వి ప్రాచి,  ముస్లింలు దేశంలో ఉండాలంటే గో మాంసం తినకూడదని  హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ అంటే కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అదే పాట. ఏంటిది సారూ ..నా చుట్టూ ఇంత రాజకీయం ? నేనింత వరకూ గోమాంసం తినలేదు కానీ తింటే తప్పేమిటని అన్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను, తింటే  తలనరికేస్తా అంటూ చెన్నబసప్ప హెచ్చరిక.. గో మాంసం హిందువులు తినేవారని  లాలూ అంటే ఋషులు, మహర్షులూ తినేవారని ఒకరు నా చుట్టూ నా మాంసం చుట్టూ రాజకీయాలల్లడం  మీకు తెలియనిదా సారూ .. ?! నా పిచ్చిగానీ ..

ఈ లోకంలో ఇష్టమైన వాళ్ళు నా మాంసం తింటారు . అయినా ఎంత విచిత్రం ?!   గోమాంసం తినేవాళ్ళు మన దేశంలోనే తక్కువనీ ఎగుమతులు మాత్రం ఇక్కడినుంచే ఎక్కువత గదా ..   అవునూ, నాకు తెలియక అడుగుతున్న.  ఏమనుకోవద్దు సారూ  మనలో మన ముచ్చట, మీ జైన్ దోస్తులకు బీఫ్ ఫ్యాక్టరీలు ఉన్నాయట గద ..!  ఆ ముచ్చట హిందీ న్యూస్ చానల్ వాళ్ళకు మీరే గద చెప్పింది.  నిజమేనా మోడీ సారూ .. ?!

అదేంటో నా మట్టి బుర్రకు అస్సలే అర్థమవుత లేదు. హింస చేయొద్దని బీఫ్ అమ్మొద్దని చెప్పే జైనులు బీఫ్ బడా వ్యాపారం చేస్తే తప్పులేదు గానీ, గల్లిల్లొ అమ్ముకునే చోటామోటా గాళ్ళది తప్పా .. అది తినే వాళ్ళది నేరమా .. ?

ప్రణబ్ సారేమో బీఫ్ అమ్మొద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ఖానును చేస్తే దానికి ఆమోద ముద్ర వేసాడు.  ఆ బాటనే హర్యానా , జమ్మూ కాశ్మీర్ నడిచాయి . ఈ  రచ్చ చూస్తుంటే లోకం అంతా తలకిందులైనట్లున్నది .

గాంధీ తాత ఏమన్నాడూ .. ముస్లింలు బీఫ్ తినడం, తినకపోవడం వారిష్టం. హిందువుల కోసం సోదరభావంతో వారు మానేస్తే అంతకన్నా సంతోషించాల్సింది లేదని కదా… బలవంతంగా వారిపై మన అభిప్రాయం రుద్దడం సరికాదని కదా…
వివేకానందుడి గురువు రామకృష్ణ పరమహంస భగవద్గీతను ఎంత భక్తితో పఠించేవాడో, ఖురాన్, బైబిల్ లను కూడా అంతే నిష్ఠగా చదివేవాడనీ, ఖురాన్ ను పఠించేటప్పుడు గోమాంసాన్ని నెత్తిపై పెట్టుకొని పఠించేవాడనీ  అనుకోవడం విన్నా. ఆయన శాకాహారి.  మాంసం అస్సలే ముట్టడు. కానీ ఇస్లాం ప్రకారం గోమాంసం ముఖ్యమైంది కాబట్టి దాన్ని నెత్తిన పెట్టుకోవడం ద్వారా ఇస్లాంను ఆయన మనసా, వాచా, కర్మణా అంగీకరించాడనీ కీర్తించడం నా చెవిన పడింది.

ఆయుర్వేద పుస్తకం ‘చక్రసంహిత’లో  ”రుగ్మతల కారణంగా కండకోల్పోవడం వల్ల బాధపడుతున్న వారికి గోమాంసం వల్ల ప్రయోజనం ఉంది. శారీరక శ్రమవల్ల ఆకలి ఎక్కువగా వుండే వారికి గోమాంసం వల్ల ఉపయోగం ఉంది” అని  చెప్పిన విషయం పెద్దలు మరిచిపోయినట్లున్నారు..!?

భిన్నత్వంలో ఏకత్వం సాధించడం కదా మనదేశ గొప్పదనం ..వైవిధ్యం మనదేశ సంపద కద సారూ .. మరి, అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన వారి మధ్య ఈ వైషమ్యాలు ఎందుకట?

నన్ను హిందువులు పవిత్రంగా పూజిస్తారు . ముస్లింలు, హిందూ మతంలోని కొన్ని వర్గాల వారూ  చాలా ఇష్టంగా తింటారు.  అది వారి వారి వ్యక్తిగత అలవాటు. దానికి నేను తప్పు పట్టను పెద్ద సార్లూ . .  కానీ , నన్ను వాడుకుని రాజకీయం చేస్తున్నారు చూడండి.. అదే నాకు నచ్చడం లేదు.  అదే సారూ నా బాధ , నా వ్యధ.
ఏ గడ్డి తినాలో నేను నిర్ణయించుకుంటాను.  కానీ, ఎవరో వచ్చి ఇది తిను అది తినొద్దు అని నా అలవాట్లపై ఎక్కి కూర్చొని సవారి చేస్తానంటే ఎట్లా ఒప్పుకుంటా ? నా పేరు మీద జనం వ్యక్తిగత అలవాట్లలోకి చొరబడి నియంత్రించాలని చూస్తున్నారు చూడండి అదే నాకు మింగుడు పడడం లేదు . ఇంత జరుగుతున్నా అన్నీ తెలిసిన పెద్దలైన  మీ మౌనం అస్సలే భరించలేకుండా ఉంది.

మోడీ సారూ .. ప్రణబ్ సారూ  మీ పెద్ద తలకాయలకు నేను  చెప్పే  అంతటి దాన్ని కాను సారూ .. నాకు ఆపాదించిన పవిత్రత నాకు ఏమైనా మేలు చేస్తుందో లేదో నాకు తెలియదు.  కానీ,  నా వల్ల ఎవరికైనా ఎందరికైనా  మేలు జరగాలి కానీ ఒక్కరికికూడా  నష్టం జరగకూడదనే నే కోరుకునేది. అదే వేడుకుంటున్నా సారూ ..  మనది లౌకిక, ప్రజాస్వామిక దేశం అని అంటుంటారే .. ఏవీ ప్రజాస్వామిక లక్షణాలు .. ప్రభుత్వం, కోర్టులు ప్రజల ఆహారపుటలవాట్లలో వేలు పెట్టి గోల చేయడం ఏమిటో… ?   నన్ను రక్షించడానికే ఇదంతా అని మీరు అంటుండవచ్చు ..
నేనేనా .. నా లాగే మేక , గొర్రె , పంది , కోడి  వగైరా వగైరా సోదర జాతులూను.  వాటినెందుకు వదిలేశారో ..?
జంతు మాంసం తినడం  ఈనాటిదా సార్లూ.. మానవుడు చేతికి చిక్కిన జంతువును వేటాడి తిన్నాడు కదా .. మాంసం నిత్యావసరంగా మారిన రోజుల్లో అతిథికి గో మాంసం పెట్టక పొతే అమర్యాదగా భావించిన గతం మనదే కదా..? ఇప్పుడే ఈ రాద్దాంతం ఏమిటి ?

నాకు లేని మతాన్ని అంటగట్టి దేశ సమైక్యతకి , సమగ్రతకి భంగం కలిగించే ప్రసంగాలు, పరమత సహనం పోయి ద్వేషం రెచ్చగొట్టే ఉద్రేక ప్రవచనాలతో జనాన్ని రెచ్చగొడుతూ నన్నూ నా జాతినీ సిగ్గుపడేలా చేస్తున్నారు.  ఇదంతా చూస్తుంటే.. నా కళ్ళలోంచి రక్తం కాక పన్నీరు కారుతుందా … ?!
మనుషుల ఆలోచన అంత సన్నంగా కుక్కమూతి పిందెగా ఎందుకు మారిపోతాంది? మానవత్వం ఎందుకు గిడసబారిపోతాంది ? అని నిత్యం నాకళ్ళు ఏరులై  కారుస్తూనే ఉన్నాయి.

నాకు తెలియక అడుగుతున్నా, ఏమనుకోకండి సారూ ..  ఏలిన వారికి , రాజకీయులకు గోమాంసం తప్ప అభివృద్ధి పట్టదా ..కొంపలు అంటుకుపోతున్నట్టు పోటీపడి రచ్చ రచ్చ చేస్తున్నారు.  నలుగురినీ కలుపుకుపోయి ప్రజలు పదికాలాలపాటు పచ్చగా ఉండాలని చూడరా .. ?

నాకు మతం లేదు, అన్ని మతాల వారూ ఒక్కటే . నాకు మత రాజకీయం తెలవదు, అన్ని పార్టీల వారూ నాకు సమానమే.  సారూ .. మీ గొడవల్లోకి నన్ను లాగనీకండి. మత దృష్టితో చూడనీకండి . మత విద్వేషం రగిల్చనీకండి. అన్ని జంతువుల్లాగే నేనూ ఓ జంతువునని గుర్తించండి.
పెద్దలు మీరు . నా గురించి కలహాలతో కలిసున్న మానవాళిని ముక్కలు చేయనీకుండా , భీభత్సం సృష్టించనీకుండా చూడగల సత్తా ఉన్నవారు.  మీకు దండం పెడతా మోడీ సారూ .. ప్రణబ్ సారూ .. కుంచించుకుపోతున్న మనుషుల మెదళ్ళు విచ్చుకొనేట్టు చెయ్యండి  సారూ ..అయినా నేను చెప్పల్నా .. ?!
సారూ.. అట్ల కోపానికి రాకు సారూ .. తెలిసో తెలియకో తప్పు మాట్లాడితే పెద్దమనసుతో మన్నించి ఈ గోమాత గోడును జర ఆలోచించండి  సారూ…

వి. శాంతి ప్రబోధ

ఎంగిలి

సందేహం నాలో ..

కొలిమిలో నలిగిన కత్తిలా

చుర చురా కాలుతూ

సర సరా కోసుకుపోతూ ..

అప్పుడులేని ఎంగిలి ఇప్పుడేమిటని ?

చిన్నతనంలో
చిలక్కొట్టిన జాంపండు

కోసం .. కోట్లాడి తిన్నానే ..

పక్కోడి దగ్గరి

యాపిల్ పండు గుంజుకు తిన్నానే

కాకెంగిలి అని వాడికి నచ్చజెప్పానే ..

మరిప్పుడేమిటి ..?
మదపిచ్చోడి చేతిలో

ఆమె దేహం ఎంగిలైందని

అగ్ని హోత్రంలా ఎందుకింత రగిలిపోతున్నాను

త్సునామిలా విరుచుకుపడే కెరటాలకు
ఇనుప కంచెలు కట్టేస్తున్నాను

కలిమి గల ఆమె హృదయ సౌందర్యం అర్ధంకాలేదా ?

మనసు అనురాగం మలినం కాలేదని తెలియలేదా .. ?!

వైకుంఠపాళీలో పాము నోట పడిన ఆమెను

నిచ్చెన మెట్లు ఎక్కించలేనా .. ?!

ఆమె కాయో   పండో కాదుగా ..

ఆఫ్ కోర్స్ కాకపోవచ్చు

కానీ …. అలా చూడలేనా ?

నా నిరంకుశపు ఆలోచనలు

భగభగ మండే మంటల్లో కాల్చి బూడిద చేయలేనా ..

హృదయపు నేలలో సరికొత్త ఆలోచనలు మొలకెత్తించలేనా …

వి. శాంతి ప్రబోధ
15. 3. 2016

పుండు పొడిసే కాకికి నొప్పి ఏం తెలుస్తుంది ..?

వేప చెట్టు నీడన సేదతీరుతున్న భార్య మేక దగ్గరకు వస్తూ ‘ఏంటి ఏమైంది అట్లా ఉన్నావ్ ‘ అడిగింది మొగుడు మేక
‘ఆ ఇంటావిడని చూస్తే గుండె తరుక్కుపోతాంది’ బాధగా మొహం పెట్టి చెప్పింది భార్య
‘ఏ..  ఎందుకూ .. ‘ అంటూ తనూ భార్య పక్కనే జారిగిలబడింది మొగుడు మేక.
‘ తన ఇంట్లోనే తనవాళ్ళనుకున్న వాళ్ళే దారుణంగా హింసిస్తుంటే, తనపై అఘాయిత్యానికి, ఆకృత్యాలకి పాల్పడుతుంటే, అవమానిస్తుంటే తట్టుకోలేక పోతోంది చూడు. ఎట్లా పొగిలి పొగిలి ఏడుస్తాందో. అట్లాగని తలవంచలేకపోతున్నట్లుంది…  ఆడాళ్ళ బతుకులు బాగుపడడం కోసం బలపడడం కోసం కొందరు ఏళ్ళ కొద్దీ చేసిన ఉద్యమాలూ , పోరాటాలు సాధించుకున్న చట్టాలు , ప్రగతిని కుళ్ళ బొడిచి  ఆమె తల నరకడానికి ఈ దౌర్భాగ్యులు ఏమాత్రం సంకోచించడం లేదు. ‘ భర్త మొహంలోకి చూస్తూ భార్య మేక
‘పెళ్ళాం ఉసురు పోసుకోవడం వాళ్ళు సంపాదించుకున్న తెలివి ..’ భార్య మొహంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ వ్యంగ్యంగా భర్త మేక
‘నీకు గుర్తుందా 1975-85 అంతర్జాతీయ మహిళా దశాబ్దం’ అడిగింది భార్య
‘ఆ..  అవును ,  మహిళా ఉద్యమాలు క్రియాశీలంగా ఉన్న ఆ కాలంలో అంటే 1983లోనే కదా 498 A చట్టం వచ్చింది ‘ గుర్తుకు తెచ్చుకుంటూ భర్త.
‘ అప్పటికే అంటే 1961లోనే వరకట్న నిషేధ చట్టం వచ్చిందా .. అయినా ఏం లాభం? ప్చ్ .. కాళ్ళ పారాణి ఆరకముందే ఎన్నో దీపాలు ఆరిపోయే.  అందుకే 498A చట్టాన్ని పకడ్బందీగా రూపకల్పన చేశారట. వరకట్నం మాత్రమే కాకుండా నాలుగ్గోడల మధ్య జరిగే శారీరక మానసిక హింసలు ఏవైనా ఈ చట్టం పరిధిలోకే వస్తాయట. అయ్యన్నీ వచ్చినా ఏం లాభంలే .. ఆయమ్మని చూస్తే గుండె చెరువవుతోంది.  కూరలో ఉప్పెక్కువయ్యిందని జుట్టుపట్టి రోడ్డు మిదేశాడే .. వాడ్ని చూస్తే పోయి గల్లాబట్టి నాలుగు పీక బుద్దయింది ‘
ఇంకా నయం పోలేదు.  మా గొడవలో ఏలుపెత్తడానికి నువ్వెవరని నరికి మసాలా పట్టిచ్చి తినేసేవాడు మనసులో అనుకుని ‘ఇప్పుడా ముచ్చట ఎందుకు చెప్తున్న ..’ తల గోక్కుంటూ భర్త

‘దేశంలో 498A ఉండాలా వద్దా అని చర్చ చాలా జరుగుతోందటగా.  ఆ చట్టం దుర్వినియోగం అవుతోందటగా! ‘ ఇప్పటిదాకా చెట్టు నీడన కూర్చున్న వాళ్ళనుకుంటుంటే విన్నాలే చెప్పింది భార్య.

‘అవును నేనూ అడపాదడపా వింటూనే ఉన్నా.. ‘సహనంలేని ఉద్రేకపడే మహిళా చిన్న కారణాలకే కేసులు పెట్టవచ్చు. దాని వలన ఆమె భర్త , అతని కుటుంబం జైలు పాలు అవ్వొచ్చు. అతని ఉదోగం పోవచ్చు , వారి వైవాహిక జీవితంలో తుఫాను రావచ్చు నని మలవత్ కమిటి చెప్పిందట .. అని ఎంత విడ్డూరం ..?’  భర్త

 ‘ ఏమో .. ఎక్కడో ఒకటి రెండు చోట్ల దుర్వినియోగం అయితే అయ్యాయేమో .. కాదనను. అంత మాత్రాన ఉన్న చట్టాన్నే రద్దుచేయాలా .. ‘ అని ఒక్క క్షణం ఆగి మనకి ఇట్టాటి బాధలూ లేవు.  చట్టాలూ లేవు.  ఏంటో  చదువు, తెలివితేటలున్న మనుషుల్లో సంస్కారం కుంచించుకు పోతూ .. ‘ చెప్తున్న ఆడమేక మాటలకి మధ్యలోనే అందుకున్న మగ మేక ‘చట్టం బాధితులకు కొండంత న్యాయం చేయాలని సూచిస్తే…అది ఆచరణలో ఆవగింజంత కూడా అమలు చేయరు. ఉన్న చట్టాల గురించి కొందరికి తెలవదు. తెలిసినా అవి వినియోగంలోకి రావు.  వచ్చినా ఏదో తూతూ మంత్రంగానే కదా .. అలాంటి దేశంలో…ఒక చట్టం దుర్వినియోగం గురించి చర్చ జరగడం చూస్తే ఈగవాలితే రోకలితో కొట్టినట్టుంది ‘ నెమరువేసుకుంటూ  అంది.
‘ చట్టాలుండీ ఆడవాళ్ళపై హింస అణచివేత తగ్గలేదంటే అసలే లేకుంటే… ‘ అని కొద్దిగా ఆగి మళ్లీ తానే ‘చట్టం చేసేవాళ్ళు అమలు చేసేవాళ్ళు , న్యాయం చెప్పే వాళ్ళు అంతా అతని వైపే ..చీ పాడు బుద్ది పోనిచ్చుకున్నారు కాదు. మనమే నయం. ఆడమగ వివక్ష లేదు.  498ఆ చట్టం వల్ల భర్త అతని కుటుంబానికి అన్యాయం జరుగుతుందని తెగ ఇదయిపొతున్నరు గానీ   ఆమె  కుటుంబ హింసకీ క్రూరత్వానికీ బలై జీవితాన్ని కోల్పోయినా పర్వాలేదా ..? ‘ ఆవేశంగా ప్రశ్నించింది భార్య .
ఆ గొంతులో తీవ్రత కొద్దిగా తగ్గించుకుంటూ మళ్లీ తనే సాహితీప్రసూన మాస పత్రిక ముఖచిత్రంపై ముగ్ద మనోహరంగా ఉన్న రాజీవను భర్తకు చూపింది. ‘ఈమెను గుర్తుపట్టావా.. భవిష్యత్ పై శతకోటి ఆశ ఉహలతో అత్తిల్లు చేరిన యాడాది లోపే అత్తింటి ఆరళ్ళకు బలై కాటికి చేరే .. ఆమెనే కాదు .. అలాంటి ఎన్ని ముద్ద మందారాలు నేలరాలిపోయాయో ..ఈ దేశంలో . వాళ్లకు న్యాయం జరగొద్దా .. అవి జరక్కుండా ఆపొద్దా .. ? ఊ .. చెప్పు .. ‘ అంది భర్తని నిలదీస్తూ ..

‘నిజమే.. పుండు పొడిసే కాకికి ఎద్దు నొప్పి ఏం తెలుస్తుంది ..?  అసలు చర్చ జరగాల్సింది 498-A ఉండాలా..ఊడాలా అని కాదు.  మహిళలపై అఘాయిత్యాలు…అరాచకాలు అరికట్టడం ఎలా అని. ఉన్న చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయంటే అందుకు కారణం ఆమెనా .. ? కానే కాదు. ఆమెకు తప్పుడు సలహాలు ఇచ్చి కేసు పెట్టించే పోలీసులు , లాయర్లు… ‘ అంటున్న భర్త మాటలకు అడ్డుపడుతూ

‘మనం పరాధీనులం అనుకుంటాం కానీ మనకంటే పరాధీనులు ఈ మనుషులు. కానీ అది ఒప్పుకోరు.  అధికులమని విర్రవీగుతారు. కడుపులో కత్తులు పెట్టుకొని తీయగ మాట్టాడతారు.  డబ్బు, పేరు, పరపతి, ఆధిపత్యం కోసం వ్యూహాలు పన్ని ఉచ్చువేసి అణచివేయడం లేదంటే చంపేయడం వీళ్ళ నీతి .. అందులో భాగమే ఆడవాళ్ళపై జరిగే హింస. అందుకే ఈ జాతిలో పుట్టనందుకు గర్వపడుతున్నా..  ‘ భర్త చూపులో చూపు కలుపుతూ భార్య .
వీళ్ళకి చదువు బారాణా , బుద్ది చారాణా అంటూ లేచింది భర్త మేక
వి. శాంతి ప్రబోధ
సాహిత్య ప్రసూన, ఏప్రిల్ 2016 ప్రచురణ

తెలంగాణా తల్లి సంబుర పడ్తోందా …? 

సంబురాలు ..

ధూం ధాం సంబురాలు
కోట్లల్లో అంబరాన్ని తాకే సంబురాలు
నా వాడవాడలా జరుగుతున్న
ఆటపాటల్ల వేడుకలు
జిగేల్ మంటూ మెరిసిపోతున్న
తళుకు బెళుకుల వీధులు
ఆనందడోలికల్లో విహరింప చేసి
నన్ను ఉక్కిరి బిక్కిరి చేయడంలేదు
కబేళాకి తరలిపోతున్న
బడుగు జీవుల బతుకు
చిగురించకుండా వెంటాడి
వేటాడుతున్న కరువు
డాం డాం అంటూ పిట్టల్లా
నేలరాలుతున్న బడుగు జీవుల
జీవన దృశ్యం  నా హృదయంలో
శోక గీతం ఆలపిస్తూ ఉంటే
సీతాకోకచిలుక రంగులు నాలో
ఒంపుకుని ఆనంద తాండవం ఎలా చేయగలను?
మీ తల్లి  తెలంగాణా
ఎప్పుడు సంబురపడ్తదో తెలుసా ?
అట్టహాసపు అలంకరణలు
హంగులు ఆర్భాటాలకు
పెట్టే ప్రతి పైసా నేలలో ఇంకి
సుభిక్షమై బిడ్డల వెతలు తీరి
వారి మోములో వెలిగే ధగ ధగల
కాంతి తెలంగాణమంతా వ్యాపించినప్పుడు
వి. శాంతి ప్రబోధ
1.6.2016 కవిసంగమం

నిన్న – రేపు

 నిన్నటి పేజిలో
ఏరుకున్న కాసిన్ని నక్షత్రాలను

మూటకట్టి మొలకలెత్తిస్తూ                
వడగాడ్పులతో సుళ్ళు తిరిగే కడగళ్ళను

శిథిల జ్ఞాపకంగాను మార్చేస్తూ

మమతను పంచే మనసున
మానవత చిగుర్లు తొడిగిస్తూ
చిగురుటాకుల తోరణాలతో
రేపటి కలల పేజిని
తెరుద్దామని వచ్చేశావా  దుర్ముఖీ ..

వి. శాంతి ప్రబోధ
published in Sakshi daily on 8.4.2016

Tag Cloud

%d bloggers like this: