The greatest WordPress.com site in all the land!

Archive for January, 2015

వంచనా శిల్పం

మాయదారి సొమ్ము సమ్మోహన పరుస్తుంటే

ప్రేయసి వెంట పడ్డ ప్రియుడిలా పరుగులెడుతూ ..

విచ్చుకత్తుల్లా స్వార్ధం ఎగదోసుకు వస్తుంటే

యాసిడ్ దాడులకు పాల్పడే ఉన్మాదిలా ..

బంధాలూ .. అనుబంధాల పొరలు వోలిచేసి

నమ్మకంపై నగ్ననృత్యం చేసి
నెత్తురోడుతున్న విశ్వాసాన్ని సమాధిచేసి
స్నేహానికి ఘోరీ కట్టి
కరాళ మృదంగ హేళితో ..

మానవత్వాన్ని హేళన చేస్తూ మొలిపించిన

గాజు బంగ్లాల్లో బంగారు పీతిరిదొడ్లు కట్టించి
షరాబులా పుష్పక విమానాల్లో షికార్లు చేసినా ..
మంచులా ఘనీభవించిన మురుగు, కరిగి కాల్వలై

కుళ్ళి కంపు కొట్టే గలీజు..ఆ పీతిరిల్లోంచైనా

అవతలికి పోతుందా ,,? ఏమో .. !!!

పొతే.. నిన్నటి

బంధాలు అనుబంధాలకు రెక్కలొచ్చి

మనసు మమకారం తిరిగొచ్చి

నమ్మకంపై విశ్వాసాన్ని మిగిల్చి
నిన్నటి మనిషిగా నిలబెడుతుందా .. ? ఏమో ..!!!

లేక పొతే ..
నీ వంటబట్టిన విద్య నిను ఏమార్చి
గుంటనక్క ఎత్తుల జిత్తులతో చేతులు కలిపి
వంచనా శిల్పంతో మంట రగులుస్తుందా ..
ఆ సెగ నిను మాడి మసి చేస్తుందా ..
ఏమో ..!!! ఎవరికెరుక .. ???  కాలమే చెప్పాలి..
వి. శాంతి ప్రబోధ
( ఓ వ్యక్తి కొడుకు చదువు కోసం అమెరికా వెళ్ళడానికి బ్యాంకులో డిపాజిట్ చూపాలి.  ఎట్లాగైనా  ఆదుకొమ్మని మిత్రుడిని ప్రాధేయ పడితే నోటు పత్రం లేకుండా స్నేహంలో నమ్మకంతో ఇచ్చిన 20 లక్షలు తిరిగి ఆ మిత్రుడికి ఇవ్వకుండా మోసగించిన  సంఘటన తర్వాత రాసిన కవిత.)

శిల లోని జల

060‘గురుబ్రహ్మ గుర్విష్ణు
గుర్దేవో మహేశ్వర
తస్మై శ్రీ గురువేనమః  అంటారు.  కానీ గురువే కీచకుడై కామాంధకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తుంటే పరువు, మర్యాద అంటూ ఊర్కుంటే ఎలా ..? ఈ రోజు మనమ్మాయి, రేపు మరెందరో ..? ఎందరు బలికావాలో ? తప్పు చేసిన వాడిని వదిలేస్తే మనమూ తప్పు చేసిన వాళ్లమవుతాం ‘ బాధ, కోపం, ఏడుపు కలగలిసి ఆవేదనతో గొంతుపెగుల్చుకుంటూ మాధురి. బయట చల్లటి చలి గాలులు వీస్తున్నా ఆ ఇంట్లో ఉక్కపోత, వడగాడ్పులు.
‘నోర్ముయ్ ..ఆడపిల్లను పెంచడం చేతకాదు కానీ .. ‘ కేశవ్ గొంతు కటువుగా, కర్కశంగా. ఆ వెంటనే చెంప చెళ్ళుమన్న శబ్దం .  వాడిగా వేడిగా రాబోతున్న మాటను లోపలికి నెట్టేసి ఆ స్థానంలో అదిమిపెట్టిన  వెక్కిళ్ళు దూకుడుగా బయటకు రావడానికి యత్నిస్తూ, దిగులుతో అల్లాడిపోతూ ఆమె.
‘అయ్యో, దీని ఖర్మ ఇట్లా కాలిందేవిట్రా ..,  ఈ విషయం తెలిస్తే దీన్నెవడయినా చేసుకుంటాడా .. ఆ త్రాష్టుడికి మన పిల్లే దొరికిందా .. ?’ అంటూ నెత్తి బాదుకుంటూ శోకం తీస్తున్న తులసమ్మ మధ్యలో ఆపేసి   ‘నీకిదేం పోయ్యేకాలమే.. కూతురేదో ఘనకార్యం చేసినట్టు కేసు పెట్టి ఊరూ వాడా చాటింపు వేస్తానంటావేమిటి.. ? నీ ముదనష్టం మండా ..’ ‘చేతులు తిప్పుకుంటూ  ఉరుము ఉరిమినట్లుగా  కోడలి మీద కేకలు వేస్తూ .
063హాల్లోంచి మాటలు అస్పష్టంగా వినిపిస్తూ.. ఎవరి గురించీ .. నా గురించేనా .. ఏమైంది నాకు ..?  వీళ్ళెందుకు కొత్తగా మాట్లాడుతున్నారు.  కాదు .. కాదు .. పోట్లాడుకుంటున్నారు. ఇటువంటి వాతావరణం ఈ ఇంట్లో ఎప్పుడూ చూడ లేదే.  నాన్నకేమయిందివాళ?   ఇంతకు ముందెప్పుడూ అమ్మను కొట్టినట్టు తనకు గుర్తులేదు.  మరి ఈ రోజు అమ్మని కొట్టాడు? ఎందుకు ?  అమ్మ అంత పెద్ద తప్పు ఏమి చేసి ఉంటుంది?  అసలేమయింది ఈ ఇంట్లో వాళ్లకి అంతా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మగత మగతగా మూసుకున్న కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ  లేవబోయింది చిట్టితల్లి.  ఆమె శరీరం కదలలేనని మొరాయిస్తోంది.  మనస్సు ఏంటో తెల్సుకోమని తొందరపెడుతోంది.
ఏమైంది నాకివాళ అనుకుంటూ బలవంతంగా కళ్ళు తెరచి మళ్లీ లేవడానికి ప్రయత్నం. శక్తి చాలడం లేదు.  కళ్ళు మళ్ళీ  మూతలు పడుతున్నాయి.  హాలులోంచి మాటలు అస్పష్టంగా, గందరగోళంగా  వినిపిస్తూనే ఉన్నాయి.  అమ్మానాన్నల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉందని తెలుస్తోంది.  వారి మాటలు స్పష్టంగా వినిపించడంలేదు.  సరిగ్గా అర్ధం కావడం లేదు కానీ సన్నగా అమ్మ ఏడుపు.  నాన్న కోపంగా తిట్టడం , మధ్య మధ్యలో నాన్నకు వంత పాడుతూ, నాన్నని రెచ్చగొడుతూ  నాన్నమ్మ గొంతు … తెలుస్తూనే ఉంది
తన ఓపికనంతా,  శక్తినంతా ఎవరో పైపేసి లాగేసినట్లు .. ఒళ్లంతా నిస్సత్తువ .. మగత, కళ్ళు తెరచి చూడలేక పోతోంది. కానీ మనస్సు ఆలోచిస్తోంది. తనకేమైంది.  తనలో తనే మళ్లీ మళ్లీ ప్రశ్నించుకుంటూనే మధ్య మధ్యలో మగతలోకి జారుకుంటోంది.  కాసేపు తెలివిగా ఆలోచించబోతోంది. మరి కాసేపు ఉలిక్కిపడుతూ , భయంతో అరుస్తూ ఆ బాలిక.
‘మేస్టారూ .. ప్లీజ్ .. నన్ను ఇంటికి పంపించెయ్యండి .. మీకు దండం పెడతా .. మేస్టారూ .. నన్ను వదిలెయ్యండి .  నా దగ్గరకు రావద్దు ‘ గట్టిగా అరుస్తోంది . ఏడుస్తోంది. భయానక దృశ్యాలు ఆమెను వెంటాడుతూ భయంతో ఒళ్లంతా కంపించి పోతోంది స్పృహ తప్పుతూ  ఆమె.
‘ఏమైంది చిట్టి తల్లీ ..’ అంటూ కన్నతల్లి ఒక్క ఉదుటున బిడ్డని చేరింది మాధురి. బిడ్డను  గుండెకు హత్తుకుంది.  అమ్మ స్పర్శ తెల్సిందో .. ఆ కన్నీటి చుక్కల వేడి తగిలిందో ఒకసారి తల్లి భుజాల్ని చుట్టేసింది.  అమ్మా .. అమ్మ .మ్మా .. . అబ్బా .. కదలలేక బాధతో  ఏడుస్తూ
ఒళ్లంతా పచ్చిపుండులా బాధపెడుతోంది.  నిస్సత్తువ వెంటాడుతోంది. జరిగిన దుస్సంఘటన తాలుకు భయంకర దృశ్యాలు కళ్ళ ముందు సినిమా రీలులా తిరుగుతున్నాయి. మేష్టారు నుండి తప్పించుకోవడానికి పెనుగులాడుతూ, గోళ్ళతో రక్కుతూ. పళ్ళతో కొరుకుతూ.  మసక మసకగా ఏవో దృశ్యాలు .. తమ్ముడు … తమ్ముడు ఏడి .. తను ఇంటికెలా వచ్చింది .. ఆలోచిస్తూ.. కళ్ళమ్మట నీరు ఏరులై పారుతూ ..జరిగింది  ఏమని చెప్పను వీళ్ళకు.  అతి కష్టం మీద  కళ్ళు తెరిచింది.  ఆమె కళ్ళు తండ్రి కోసం వెతికాయి.  ఆయన స్పర్శ కోసం , మాటకోసం తపన పడింది.  దూరంగా నిలబడి తీక్షణంగా చూస్తున్న అతని చూపులు  ఆమెనెంతో కలవరపరిచాయి.  సుడిగాలిలో చిక్కుకున్న నునులేత రెమ్మలా విలవిలలాడిపోయింది ఆ పసి మనసు .
‘అమ్మా నాకెందుకిలా జరిగింది ‘ తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆమె  కళ్ళలోకి చూడలేక వాలిపోతున్న కనురెప్పలు, ఒణుకుతున్న కంటంతో  చెక్కిలిపై కన్నీరు ఉరికి ఉరికి వస్తుండగా చిట్టితల్లి ప్రశ్న.
‘నీకేం కాలేదురా నాన్నా .. నీకేం  కాలేదు ‘ ఒక చేత్తో కూతుర్ని ఒళ్ళో పడుకోపెట్టుకుని, ఆ కన్నీటి చారికల్ని తుడుస్తూ  అనునయంగా తల నిమురుతూ అన్నదా తల్లి
మేష్టారు మంచివాడు కాదు ట్యూషన్ కి వెళ్ళిన ఆడ పిల్లలని మోసం చేస్తున్నాడు. నాశనం చేస్తున్నాడు.  తన పేరు బయటికి చెప్తే తమ్ముడిని చంపేస్తానంటున్నాడు తనలో తనే గొణుక్కుంటూ మగతలోకి జారింది చిట్టితల్లి.
జరిగింది స్పష్టంగా అర్ధమయిపోతోంది.  ట్యూషన్ కోసం వెళ్ళిన పసి పిల్లను లైంగికంగా వేధించి హించాడని. తెలిసి తెలిసీ ఊర్కోవడం ఎలా?  పరువు , ప్రతిష్ట అనుకుంటే రేపెంత మంది ఇలాంటి సంఘటనలకు బలవుతారో .. కామంతో కళ్ళు మూసుకుపోయిన మానవ మృగాలను నరికి పారెయ్యాలి.  కన్నూ మిన్నూ కానకుండా పసిపిల్లల్ని లైంగికంగా హింసించే వారిని షూట్ చేసి పడెయ్యాలి కసిగా మనసులోనే  తిట్టిపోస్తూ మాధురి.
మధ్యతరగతి మిథ్యా గౌరవాలకోసం ఎందరు ఆడపిల్లల జీవితాలు ఫణంగా పెట్టారో.   శారీరకంగా పడిన నరకయాతన ఒక ఎత్తయితే కుటుంబంలోనూ, సమాజంలోనూ ఆమెపై జరిగే మానసిక హింస మరో ఎత్తు.   ఈ పసిది  తట్టుకోగలదా ..? నిత్యం వీళ్ళ చూపులు భరించగలదా ? అత్తగారన్నట్టు ఆడపిల్లల్ని ఇంట్లో కూర్చోబెడితే మంచిదా ..? ఏమో ..ఇల్లు మాత్రం సురక్షిత మైనదని ఎలా అనుకునేది ?  ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమెను బంధించడం ఎంత వరకు సమంజసం ..? తప్పు చేసినవాడు స్వేచ్చగా దొరలాగా తిరుగుతుంటే వాడి తప్పుకు బలయిన తన కూతురికి శిక్షా ..?  ఆమె బందీ కావాలా ..? ఇదేక్కాది న్యాయం ? ఇదెక్కడి నీతి ?  హృదయ వేదనతో పరిపరివిధాల ఆలోచిస్తోంది ఆ తల్లి మనస్సు .
‘అమ్మా ..’ బాధతో , భయంతో మూలిగింది చిట్టితల్లి .  ఒళ్లంతా తడిసి ముద్దయింది.
‘అమ్మా .. చిట్టీ .. నేనురా,  అమ్మనురా. భయపడకు  నువ్వు ఇంట్లో ఉన్నావ్ .  నా దగ్గరే ఉన్నావురా ‘ అనునయంగా ఆ తల్లి .  చిట్టితల్లి ఒళ్ళు క్రమంగా వేడెక్కుతోంది. కనురెప్పలు మళ్ళీ ముసుకున్నాయి.
టెంతు క్లాసు అక్క చెప్పింది మేష్టారు మంచోడు కాదని.  ఈ మేస్టారుకి భయపడి సుభద్ర బడి మానేసిందనీ.  నాకప్పుడు అర్ధం కాలేదు.  ఇప్పుడు తెలుస్తోంది ఎంత దుర్మార్గుడో .  రేప్ అంటే ఇదే కావచ్చు .  నాన్నమ్మ అన్నట్టు నాకు పెళ్ళి కాదేమో .. నన్నెవరూ చేస్కోరేమో .. మొన్నీ మధ్య చూసిన సినిమాలో రేప్ జరిగిందని భర్త వదిలేశాడు.  భార్య చెడిపోయిందన్నాడు. మరి, ఇప్పుడు నేను చెడిపోయిన దాన్నా ..?  చెడిపోవడం అంటే ఏమిటి ? మరి ఆ మాస్టారు కదా చెడ్డవాడు .  అతను కదా చెడిపోయింది.  నేనట్లా అవుతాను.  ఊహు .. నేను కాదు.  మగతలోనే  ఆలోచిస్తోంది చిట్టితల్లి  హృదయం  .
ఈ విషయం ఎవరితో చెప్పకూడదా..? నాన్న మాటల బట్టి అదే అర్ధమవుతోంది.  చెప్తే ఏమవుతుంది? ఒకింట్లో పనిచేసే అమ్మాయికి ఇట్లాగే అయిందని అప్పుడు  టి .వి . లో మళ్ళీ మళ్ళీ చూపించారుగా.  నన్నూ అట్లాగే చూపిస్తారా ? అమ్మో మాస్టారు తమ్ముడిని చంపేస్తాడేమో ? తుపాకీ కూడా చూపించాడు.  చిట్టితల్లి ఆలోచనలు మగతలో సాగుతూనే ఉన్నాయి పరి పరివిధాలుగా ..
చొప్పకట్టలా పడి ఉన్న కూతురిని చూస్తుంటే ఆమె  గుండె తరుక్కుపోతోంది.  గలగలా పారే సెలయేరులాంటి తన కూతురు అలా నిశ్శబ్దంగా .. నిశ్చలంగా పడి ఉండడం భరించలేక పోతోంది ఆ తల్లి.   ఆ దుర్మార్గుడు కండకావరంతో చేసిన నేరాన్ని వదిలి,  వాడికి శిక్ష వేయకుండా వీళ్ళు దీనికి శిక్ష వేస్తున్నారు.  ఆడదాని అవయవ నిర్మాణం ఆమెకు ఇంత శాపం అవుతుందా..   ఇలా అయితే బిడ్డ కోలుకునేది ఎలా ?  నా చిట్టితల్లి  మామూలు స్థితికి రావాలంటే ఏంచేయాలి ఆలోచిస్తూన్న ఆమె ఒళ్లో ఉన్న కూతురి తల నెమ్మదిగా పక్కకు జరిపి లేచి హాల్లోకి వెళ్ళింది.  కళ్ళు మూసుకుని రెండు కళ్ళ మధ్య కుడి చేతి వేళ్ళతో అదిమి పట్టుకుని సోఫాలో ముందుకు వంగి కూర్చున్న అతని భుజాలు పట్టుకుని ఊపేస్తూ ‘ఏవండీ .. మీరెళ్ళి ముందు డాక్టర్ ని పిలుచుకురండి.  ఒక్కోసారి మతి స్థిమితం లేనట్లుగానూ, మరోసారి అచేతనంగాను పడి ఉన్నదాన్నిచూస్తే భయమేస్తోంది. అది ఏమై పోతుందోనని. ఎట్లాగైనా నా చిట్టితల్లిని కాపాడండీ ‘ అంటూ భర్తని బతిమాలింది.
డాక్టరుని పిలవాలా వద్దా .. డాక్టరు వస్తే విషయం అందరికీ తెలిసిపోతుందేమో తనని తన కూతురిని ఎగతాళిగా , లోకువగా చూస్తుందేమో  ఆలోచిస్తోంది తండ్రి మనస్సు.   ఎదురుగా  టి . వి . లో  మహిళలపై, బాలికలపై ఆకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.  ఓ వైపు అత్యాచారాలకు తీవ్రమైన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఆ ఘటనలు ఆగడం లేదు. పరిచయస్తులు, స్నేహితులు, ప్రేమికులు, ఇరుగుపొరుగు వారే అత్యధిక కేసుల్లో నిందితులు … ‘ వెళ్లి టి.వి. కట్టేశాడు.   నేనిప్పుడు పోలీసు కేసు పెడితే విషయం మీడియాకి వెళ్ళిపోతుంది.  అదొక సంచలన వార్త అవుతుంది. జనం దృష్టి పడుతుంది.  తర్వాత న్యాయం జరిగేవరకూ పాలో అప్ ఉండదు కానీ జనం కళ్ళు మమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి.  ఏమి చెయ్యాలో తోచక సందిగ్దంలో అలాగే కళ్ళుమూసుకుని ఆలోచిస్తూ కేశవ్.
సభ్య సమాజం జుగుప్సతో, బాధతో రగిలిపోవాల్సిన సంఘటన ఇది. తన  కూతురు కంటే చిన్నదైన పిల్లమీద పడి దున్నపోతులా , మదం పట్టిన ఆంబోతులా అత్యాచారం చేసి చిట్టితల్లి మనస్సుని, శరీరాన్ని నలిపి వేసిన మానవ మృగాన్ని వేటాడి వెంటాడి చంపెయ్యాలి  కోపంతో రగిలిపోతోంది మాధురి అంతరంగం.  చదువు చెబుతాడని ట్యూషన్ కి పంపుతే ఇలాంటి అఘాయిత్యం చేస్తాడా ఆ బద్మాష్ .? బడికి పంపి మనశ్శాంతిగా ఉండలేని పరిస్థ్తితిని  తలుచుకుంటేనే ఆమె రక్తం సల సలా మరిగి పోతోంది. కట్టుబాట్ల కటకటాల వెనుక కన్నీరు కారుస్తూ ఉన్న తన స్థితికి, మగవాడి అణచివేతకు, అహంకారానికి బలైన అసహాయ స్థితికి మాధురి  మనసు కుతకుతా ఉడికిపోతోంది
తాకరాని ప్రదేశాల్లో చేతులతోనో , నోటితోనో ముట్ట్టేవారికి దూరంగా ఉండాలని , గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఎదిగే పిల్లలకి తెలియచెప్పాలని ఎప్పుడో మాటల మధ్య  చెల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మాధురికి. అవును, చెల్లి చెప్పినట్లు సాధ్యమయినంత వరకు ఎదుటి వ్యక్తులకు ఆనుకుని, తగులుతూ మాట్లాడకుండా దూరంగా ఉండాలని చెప్పాలి.  ప్చ్ .. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడనుకుని ఏం లాభం అనుకుంటూన్న ఆమె ఆలోచనల్ని భంగం చేస్తూ ‘వద్దు వద్దు .. తమ్ముడు ‘ అరుపులు ,  బాధతో  మూలుగు విని గబగబా చిట్టితల్లి దగ్గరికి చేరింది.   కూతురి పక్కనే కూర్చుంటూ  తల ఆప్యాయంగా నిమురుతూ ఆమెలో ధైర్యం నింపుతూ ఏదో తప్పు జరిగిపోయిందన్న భావన, భయం లేకుండా చేయాలి అనుకుంది.  అంతలోనే మనసు మడతల్లో దాగిన ప్రశ్నలు ఉవ్వెత్తున  ఉప్పెనలా ముంచుకొస్తుంటే లేచి వెళ్లి ,  ‘నా కూతురు , నా ప్రాణం ,  నా బంగారుతల్లి అంటారే .. ఇప్పుడేమయింది మీ ప్రేమ .. అది అలా అచేతనంగా పడి  ఉంటే, భయంతో కంపించి పోతుంటే, జ్వరం తీవ్రమవుతూ ఉంటే  చూస్తూ ఎలా ఉండగలుగుతున్నారు ?  మీ మనస్సు ఎట్లా ఒప్పుతోంది. మీ హృదయం అంత కఠిన శిలలా మారిపోయిందా  ..? ‘ కటువుగా అని,  ‘మనిషిగా ఆలోచించండి . పరువు ప్రతిష్టల్ని పక్కన పెట్టి మన బిడ్డని ఎట్లా కాపాడుకోవాలో ముందు చూడండి ‘ఆవేశంగా  అంది భర్త ప్రవర్తనతో ఆవేదన చెందిన ఆ తల్లి.
కేశవ్ ఒక్క సారి కళ్ళు తెరిచి ఆమె కళ్ళలోకి చూడబోయి, ఆ తీక్షణ చూపులో చూపు కలిపి, ఆ ధాటికి తట్టుకునే ధైర్యం చేయలేక మళ్ళీ మూసుకున్నాడు. తను డాక్టర్ రమని  తీసుకొస్తాడు సరే కానీ .. ఆ తర్వాత, ఊరుకుంటుందా ? పోలీసు కేసు అంటుంది.  తన భార్య గురించి తనకు బాగా తెలుసు. పొలీసు స్టేషన్ కి వెళితే ఏమవుతుందో తనకి బాగా తెలుసు. పొలిసు స్టేషన్ చుట్టూ తిరుగుతూ,  ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు  కోర్టు కేసులు, అక్కడ వాళ్ళు న్యాయ విచారణ పేరుతో అవమానకరమైన, జుగుప్సాకరమైన  ప్రశ్నలతో పుండు మీద కారం జల్లినట్లు ఉండే వేధింపుల మధ్య న్యాయం అడుక్కుంటూ బతకాలి.  తెలిసిన వాళ్ళూ, తెలియని వాళ్ళూ చూసే జాలి చూపులూ,  హేళన మాటలూ వింటూ కుములుతూ బతకాలి.  అది తన వల్ల  కాదు అనుకుంటూ ‘ అసలు పిల్లను బయటకు పంపకుండా ఉండాల్సింది’ అతను మనసులో అనుకున్న మాట  అనాలోచితంగా పైకి వచ్చేసింది .
‘శీలం అంటే అమ్మాయికేనా ..? మగవాడికి ఉండదా ? మగవాడు ఎన్ని సంబంధాలు కలిగి ఉన్నా అతన్ని క్షమార్హుడిగా చూడడం సరైనదేనా ? బలవంతమూ , బలాత్కారమూ ఆడపిల్ల పైనే జరిగినా ఆమెనే నిందించడం ఏమిటి ?  ఇతరుల క్రూరత్వం , కాముకత్వం ఆమెకు బంధనం ఎందుకు కావాలి ?  మీ  ఆలోచనా ధోరణి మారదా ? .  అమ్మాయిల్ని బయటకు వెళ్ళకుండా కట్టడి చేసే బదులు ఆ నేరాన్ని ఎందుకు ఆపకూడదు? ఆ దాడి చేసే వారిని ఎందుకు కట్టడి చేయకూడదు ?’ అదే తీవ్రత ఆమె స్వరంలో.  భర్త మౌనాన్ని పాషాణం కంటే కఠినంగా మారిన అతని హృదయాన్ని ప్రశ్నిస్తూ, నిలదీస్తూ …
‘ఓసినీ, నీమొహం మండా ..? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. కోడిపెట్ట పిల్లల్ని రెక్కల చాటున దాచుకున్నట్టు పొదివి పట్టుకోవాలి గానీ, కూతురిని బజారులోకి ఈడ్చి  కాకులకీ, గద్దలకీ ఫలహారం వేస్తానంటావే.’ గయ్యిమంది ముసలమ్మ.
‘కోడి రెక్కల మాటున దాచి పెట్టడమే కాదు, కాళ్ళతో తన్నుకు పోయే గద్దల్నుంచి, కాకుల్నుంచి ఎలా కాపాడుకోవాలో కూడా నేర్పుతుంది.  కానీ మనం గూట్లో పెట్టి కప్పెయ్యాలని అనుకుంటున్నాం ‘ కత్తిలా కోసేస్తున్న బాధతో కటినంగాఅంది అత్తగారితో ఎప్పుడూ ఆ విధంగా మాట్లాడని మాధురి.
‘వద్దు .. మా తమ్ముడ్ని చంపొద్దు … నేనెవరికీ చెప్పను .. మాస్టారూ . మాతమ్ముడిని చంపొద్దు .. చంపొద్దు .. ‘ అరుస్తోంది.  బతిమాలుతోంది చిట్టితల్లి
ముగ్గురూ కంగారుగా  చిట్టితల్లి దగ్గరికి పరుగెత్తారు.  భయంతో వణికిపోతోంది. వెర్రి చూపులు చూస్తోంది. ఒళ్లంతా చెమటతో తడిసిముద్దయింది. కూతురిని పొదివి పట్టుకుని తమ్ముడు ఇక్కడే ఉన్నాడురా.  వాడికి ఏమి కాలేదు.  అదిగో అక్కడ నాయనమ్మ దగ్గరున్నాడు చూడు  అంటూ వీపు మీద, తల మీద నిమురుతూ థైర్యం చెబుతూ .. .’ అగ్నిపర్వతం బద్దలై ఎగిసి వస్తున్న లావాని పంటి బిగువున అదిమి పెట్టి అనునయంగా ఆమె .
అలా కొన్ని క్షణాలు కూతురిని దీర్ఘంగా చూసి తిరిగి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు కేశవ్.  అయితే, అతని  మనసు మునుపటిలా  స్తబ్దంగా లేదు. ఆలోచిస్తోంది.  నెమనెమ్మదిగా ఆలోచిస్తోంది.  రక్తసిక్తమైన బట్టలతో ఎంగిలాకుని పారేసినట్టు తీసుకొచ్చి ఇంటిముందు పడేసిపోయాడు. శీతాకాలపు చలిగాలులకి తలుపులేసుకు కూర్చున్న తమకి ఎప్పుడు అక్కడ విడిచాడో తెలియనే లేదు.  ట్యూషన్  నుండి రావలసిన పిల్ల రాత్రి  పది అవుతున్నా ఇంకా రాలేదేమిటా అంటూ బయటికొచ్చిన తల్లి పెట్టిన వెర్రి కేకకి ఒక్కుదుటున వాకిట్లోకి వచ్చారు.  బయటికి వచ్చి చూస్తే అచేతనంగా పడి ఉన్న తన బంగారు తల్లి.  హతాశులై తెలివిలో లేని కూతురిని ఎత్తుకొచ్చి గదిలో పడుకోబెట్టాడు. అప్పడు బండబారిన హృదయం ఇప్పుడిప్పుడే వాస్తవంలోకి వస్తోంది.  నెమ్మదిగా ఆలోచించడం మొదలు పెట్టింది.
ఆడపిల్లగా పుట్టడం అంటే అన్నీ భరించదానికేనా…  అమ్మాయిలపై జరిగే దాడుల్ని , లైంగిక హింసనీ , వేధింపుల్ని కట్టడి చేయాలి.  నిందితుడు శిక్ష అనుభవించాలని తన భార్య చెప్పింది నిజం . అనవసరంగా అనాలోచితంగా ఆమెను తప్పు పట్టాను.  ఎన్నడూ లేనివిధంగా చేయి చేసుకున్నాను అన్న పశ్చాత్తాపం ఆ భర్త కళ్ళలో మెదిలింది.
గుండెను మెలిపెడుతున్న బాధను అణుచుకుంటూ, అవును,  భయపడుతూ ఉన్నన్నాళ్ళు ఆడపిల్లలపై జరిగే అరాచకాలుబయటికి పొక్కవు. చీకటిలోనే ఉంటాయి.  పొలీసు స్టేషన్ దాకా రాని సంఘటనలు పెరిగి పోతూనే ఉంటాయి. నేరగాళ్ళు మాటు వేసి వేటకి సిద్దమవుతూనే ఉంటారు . బాధితులైన అమ్మాయిలు  నాలుగు గోడల మధ్య బందీలుగానే ఉంటారు.  నా కూతురు అలా ఉండడానికి వీల్లేదు .  జరగరాని సంఘటన జరిగిందని దాని భవిష్యత్తు ఆగిపోకూడదు అతని మనస్సు చైతన్యమవుతూ ఆలోచిస్తుండగా
‘యాక్సిడెంటు జరిగితే చికిత్స చేయించుకుంటాం కదా!  ఒక రకంగా ఇదీ అంతే..’ అన్నమాధురి ఆలోచనలు మాత్రం, అందుకు కారకుడ్ని మాత్రం ఒదలకూడదు.  నా కూతురూ , నా కుటుంబము పడుతున్న వేదన  మరొకళ్ళు పడే అవకాశం ఆ నిందితుడికి ఇవ్వకూడదు అనుకుంటూ సాగుతున్నాయి.  ఆమె ఆలోచనల్ని పసిగట్టిందేమో తులశమ్మ  ‘రెండ్రోజులు పోతే అంతా సర్దుకుంటుంది .  నువ్వు గాభరాపడి  మమ్మల్ని గాభరా పెట్టకు.  మాంసం తిన్నామని బొమికలు మెడలో వేసుకు తిరుగుతామా .. ఇదీ అంతే .. డాక్టర్లూ  .. పోలీసుస్టేషను అంటూ గొడవ చేయకు’ హుకుం జారీ చేస్తున్నట్లుగా అత్త కోడలికేసే కోపంగా చూస్తూ ..
ఉబికి ఉబికి వస్తున్నఏడుపు నొక్కి పెట్టేస్తూ ..  కన్నీటి సుడిగుండాలను కళ్ళలోనే దాచేయడానికి యత్నిస్తూ ‘చిట్టి తల్లీ లేచికొద్దిగా పాలుతాగరా  ‘లేపుతోంది  బతిమాలుతోంది మాధురి
‘గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేస్తే సరి ‘ లేచి షర్ట్ వేసుకుంటున్న కేశవ్ నుద్దేశించి అందతని తల్లి.
‘అమ్మా.. అలా మాట్లాడకు. నీ కోడలు చెప్పింది నిజం.  ఏక్సిడెంట్ అయితే ఏం చేస్తాం.. ? వెంటనే హాస్పిటల్కి తీసుకెళతాం. వైద్యం చేయిస్తాం కదా.. మనమూ వెంటనే ఆ పని చేయాల్సింది.  ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. రోజూ మన చిట్టితల్లి లాంటి ఆడపిల్లలు ఎందరో ఇలాంటి అఘాయిత్యాలకు గురి అవుతున్నారమ్మా.  మొదటినుంచీ ఇలాంటి విషయాలు పోలీసు స్టేషన్ దాకా వెళ్తే, నిందితులకు తగు శిక్షలు పడితే, తల్లిదండ్రులూ తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగేవి కావేమో ..మన పిల్లకీ గతి పట్టేది కాదేమో..  మన పిల్లకి పెళ్లి చేసేస్తే సమస్య తీరిపోతుందా .. ఆవేశపడకుండా ఆలోచించమ్మాఅంటూ అడుగు ముందుకేశాడా తండ్రి .
***     ***                  ***
అతని ప్రతి అడుగూ వేగంగా పడుతూ .. ఆలోచనలూ అడుగులకంటే వేగంగా సాగుతూ ..  సమాజంలో అపసవ్యపు విలువల్ని ఎలా మార్చాలీ , మనం సృష్టించుకున్న విలువల్ని మనమే మార్చగలం. అద్యాపకుడిగా, తండ్రిగా, బాధ్యత గల పౌరుడిగా తనేం చేయాలో ఆలోచిస్తూ.. నైతిక విలువలు  విలువలు నేర్పాలి.  మానవ సంబంధాల, బంధాలు తెలియజేయాలి.  అమానవీయ ధోరణుల్ని పసిగట్టి ముందే మొక్కగానే తున్చేయాలి. డి జి . పి. అన్నట్లు అమ్మాయిల వస్త్రధారణ మగవాళ్ళని రేచ్చగోడుతోందా .. ఊహు కాదు .. నా చిట్టితల్లి ఏమి రెచ్చగొట్టింది.  సాంప్రదాయబద్దంగా ఉండే చుడీ వేసుకుంది.  మూలకున్న ముసలమ్మా, అభం శుభం ఎరగని ఐదేళ్ళ చిన్నారి ఏమి రెచ్చగొట్టారని వాళ్ళనీ వదలడం లేదు..  మరయితే ఎందుకు పెరిగిపోతున్నాయి ఈ ఆకృత్యాలు, అనాగరిక చర్యలు ?
‘ఏరా ఎక్కడికి?  ఎదురుగా వచ్చే వాళ్ళను కూడా గమనించకుండా ఆ పరధ్యానం’ మోటారు సైకిల్ ఆపి పలకరించాడు మిత్రుడు  విశ్వ.
ఉలికి పడ్డ కేశవ్ ‘ఏం లేదురా ‘
‘ఏమైందిరా అలా వాడిపోయిన తోటకూర కాడలా వేలాడి పోతూ ‘ అతని కళ్ళలోకి ప్రశ్నార్ధకంగా చూస్తూ
కేశవ్ కళ్ళలో నీరు చేరడం విశ్వ దృష్టిని దాటిపోలేదు.   ఏదో ఇబ్బందిలో ఉన్నాడని అర్దమయింది. ‘ ఏం జరిగిందిరా ‘ అన్న మిత్రుడి ప్రశ్న పట్టించుకోకుండా , మారు మాట్లాడకుండా బండి ఎక్కి కూర్చొని పొలీస్ స్టేషన్ కి పోనీ అన్నాడు కేశవ్.   పోలీస్ స్టేషన్ కా ఆశ్చర్యం, కంగారుపులగంగా ఉండగా ఒకసారి వెనక్కి తిరిగి కేశవ్ ని తేరిపారజూసి ముందుకి కదిలాడు విశ్వ.
చదువుసంధ్యాలేని జులాయిలో, అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్న యువతో  అలా ప్రవర్తించారంటే అర్ధం చేసుకోవచ్చు.  వారికి పర్యవేక్షణ సరిగా లేదనో, మానసిక స్థితి సరిగా లేదనో, సినిమాల్లోనో, ఇంటర్నెట్ లోనో చూసే అశ్లీల దృశ్యాలో,   వేళకాని వేళలో అమ్మాయిలు అబ్బాయిలు కలసి తిరగడం వల్లో, స్వేచ్చ పేరుతో పెరిగిపోతున్న విచ్చలవిడితనం వల్లనో అనుకోవచ్చు.  కానీ బాగా చదువుకున్న వాళ్ళు, సమాజంలో గౌరవనీయ స్థానంలో ఉన్నవాళ్ళు, మంచి చెడు చెప్పవలసిన వాళ్ళే ఇలా చేస్తే ..వారిలా ఎందుకు ప్రవర్తిస్తున్నట్లు ?  బయటి ప్రపంచానికి తెలియకుండా ఉంటుందన్ననమ్మకమా ..? అవును, నా లాంటి వాళ్ళు కుటుంబ పరువు, ప్రతిష్ట అంటూ వేలాడుతూంటే అదే తమకు శ్రీరామరక్ష అవుతుందనా ..?  మళ్ళీ ఆలోచనలు చెద పుట్ట పగిలినట్ట్లుగా . కదిలినట్లుగా చిందర వందరగా
‘ సమాజంలో పెరిగిపోతున్న ఈ వికృతికి , విధ్వంసక స్థితికి అసలు  కారణం ఏమిట్రా ?’ ఉన్నట్టుండి కేశవ్ ప్రశ్న. బాండ్ మేళం మోతలో ఆ ప్రశ్న విశ్వ చెవికి సోకకముందే
‘ఆడవాళ్ళు అంటే ఉన్న చిన్న చూపు , చులకన భావం.  ఆమెను లైంగికపరమైన వస్తువుగా చూడడం.  స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని గొప్పగా చెప్పుకోవడమే గానీ, ఆ విషయం  మన పిల్లలకి చిన్ననాటి నుండి నేర్పుతున్నామా ?  ఆడపిల్లల పట్ల గౌరవభావం పెంచే విధంగా పెంచుతున్నామా?   ఉమ్మడి కుటుంబాలు పతనం అయ్యాక ఇంట్లో మంచి చెడు కథల రూపంలో చెప్పేవాళ్ళు లేరు.  నేటి చదువులు ఉద్యోగాన్నిచ్చేవే గానీ  వ్యక్తిత్వం నేర్పేవిగా లేవు. మానవీయ విలువలు, నైతిక  విలువలు తరిగి పోతూ కుళ్ళి కంపు కొడుతుంటే అందులోనే పోర్లుతున్నాము…’ కేశవ్ మాట్లాడేస్తున్నాడు .
‘ఒరే పిచ్చిగానీ పట్టిందా .. ‘ బండి ఆపిన విశ్వ
‘లేదు వదిలింది ‘  లోనికి దారితీస్తూ కేశవ్. అతన్ని అనుసరిస్తూ విశ్వ.
****                              ****                            ****
మనుషుల్లో తప్ప మరే ఇతర జీవిలొను ఇలాంటి రాక్షస వర్తన  కనిపించవనుకుంటా .. ముదిమి ముడతల్లో ఆల్లోచనల రెక్కలు తొడుక్కుంటూ , వివిధ కోణాల్లో విచ్చుకుంటూ .
తనవాళ్ళ ప్రవర్తనలో మార్పు చూసి మాధురి  కనుకోలుకుల్లో కోటి వెలుగు తారకలు.
వి. శాంతి ప్రబోధ 
 .       ( ‘వెలుతురు దారుల్లోకి ‘ పేరుతో 13-11-09 ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ లో ప్రసారం అయిన నా కథ కొన్ని మార్పులు చేర్పులతో PRARAVE  mudrana chesina Agnishikhalo vachchindi)

ముజఫర్ నగర్ మారణకాండ, నిషిద్ధ మేఘాల్లోకి మా యాత్ర – సమీక్ష

“కవిత్వానికి భాష , భాషకి సమాజం మూలాధారాలు. అంటే కవిత్వమే సమాజానికి మూలాధారమవుతుంది ” -క్రిస్టోఫర్ కాడ్వెల్ 
 
ఎవరో తుంటరి చేసిన తప్పుకు 
ఎవరో అనామకుని దుశ్చర్యకు 
అగ్నికి ఆజ్యం పోస్తూ .. ఎంతమంది 
అమాయకులను బలితీస్తారు ? 
ఇది ‘నేను! ముజఫర్ నగర్ ను! ‘ కవితలో కవయిత్రి భండారు విజయ ప్రశ్న 

మేమప్పుడూ ఇప్పుడూ సందర్శకులం కానే కాదు 
మేము సైతం ఆడవాళ్లమే వాళ్ళలా బాధితులమే 
నగ్నపక్షులమై గిలగిల్లాడుతూ విలపించాము 
నిషిద్ధమేఘాలమై అదృశ్యంగా వర్షించాము 
‘నిషిద్ధమేఘాలు ‘ కవితలో కవయిత్రి అనిశెట్టి రజిత ఆవేదన.   ఈ ఇద్దరు కవయిత్రుల ఆవేదనకీ కారణం మీకిప్పటికే అర్ధమయి ఉంటుంది.  అదే ముజఫర్ నగర్ మారణ కాండ.  వేలాది లక్షలాది  మందిలాగే వారిద్దరూ పత్రికలలో ఈ సంఘటనకు సంబంధించిన వార్తలు చదివారు. అయితే వారంతటితో ఆగలేదు.  ఉత్తరాదిలో ఎక్కడో జరిగిన ఓ చిన్న సంఘటన నెలలపాటు రాజుకుంటూ దహించివేస్తూ  ఎంతటి విధ్వంసానికి, మారణ హోమానికి దారితిసిందో అక్కడి ప్రజలు పీడనని కళ్ళారా చూసి విషయం తెలుసుకోవాలనుకున్నారు.  అది తమ సామాజిక బాధ్యతగా భావించారు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కి చెందిన మిత్రులతో కలసి ప్రయాణం కట్టారు. 
మతం కన్నా మానవత్వం – కులం కన్నా గుణం , వర్ణం కన్నా వ్యక్తిత్వం – వర్గం కన్నా మనిషితనం గొప్పదనే  అనిశెట్టి రజిత,  రాతి బండల్లా గడ్డ కట్టుకపోయిన మన అంతరంగాలు కొంచెమైనా కరుగుతాయేమో చూద్దామనే భండారు విజయలు పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ , షామిలి జిల్లాల్లో జరిగిన ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. ఘర్షణల  ఫలితంగా రగిలిన విద్వేషాలకు సజీవ సాక్ష్యాలుగా నిలిచిన  50వేల మంది నిరాశ్రయులై స్వగ్రామాలకు దూరంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకలుగా కనిపించే పునరావాస కేంద్రాలనే మురికి కూపాల్లో తలదాచుకుంటూ క్షణం క్షణం భయంతో బతుకీడుస్తున్న  ప్రజల జీవన చిత్రాన్ని కళ్ళకు కట్టారు.  అక్కడ శిథిలమైన జీవితాలను, బతికున్న శవాల్లా పడి ఉన్న వారి పరిస్థితి చూసి చలించి పోయారు.  వారి అనుభవాలను, స్పందనలను ఆలోచనలను కవితాత్మకంగా వ్యక్తీకరించారు.    ఆ క్రమంలో వెలువరించిన పుస్తకమే ‘ముజఫర్ నగర్ మారణకాండ , నిషిద్ద మేఘాల్లోకి మా యాత్ర’
 
స్త్రీలను వారి కుటుంబ సభ్యులు చూస్తుండగానే  నగ్నం చేసి సామూహిక మానభంగానికి గురిచేసి చంపేయటం, గర్భిణుల గర్భాన్ని చీల్చి అందులోని పిండాలను, పెరుగుతున్న శిశువులను కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి చంపి వేసిన కిరాతకమైన ఘటన ఏ దేశంలోనూ, ఏ ఆటవిక సమాజాలలోను జరిగి ఉండదేమో! ఆ సంఘటనకు చలించి రజిత
ఆడదంటే ఇక్కడ లైంగిక పరికరం .. అత్యాచారాలకు 
అనువైన ఒకే ఒక్క ప్రాణ యంత్రం .. 
ఆడజన్మలు నిషిద్ద మేఘాలు !..  ‘  అని అంటే
‘ఒక కర్కోటకుడు 
మా బిడ్డల పాలిండ్లు కోసేస్తే …  
మరో రాక్షసుడు 
రంపంతో మా భర్తలను ముక్కలు చేస్తాడు’ అంటుంది భండారు విజయ.  బయానా, ఫర్జానా , షకీరా , షబ్నం , ఖుర్షిదా , మొహన, అక్తరి, నసిమా, ఆసియా  ఎందఱో మహిళల కన్నీటి అనుభవాలు చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కళ్ళనుండి రక్తం పారిస్తూ   మనం ఎక్కడున్నాం .. ? ఏమి సాధించాం ..? ఎటు ప్రయాణిస్తున్నాం అంటూ ఎన్నెన్నో ప్రశ్నలని సంధిస్తాయి 
 
నిన్నటి వరకూ ఇరుగు పొరుగుగా కలసి జీవిస్తున్న వారు, ఉప్పు పప్పు పంచుకున్న వారు, ఒకే మంచంపై కూర్చుని హుక్కా పీల్చిన వారు ఆ తెల్లవారి అంత అకృత్యానికి పాల్పడుతున్నారంటే అది ఉద్రేకంతో చేసినవి కావు. మెజారిటీ మతం అని చెప్పుకుంటున్న వారు మైనారిటీల పట్ల ఇంత ద్వేషాన్ని కడుపులో పెట్టుకు తిరుగుతున్నారంటే నిర్ఘాంతపరుస్తుంది.  ఒక మతానికి లేదా కులానికి లేదా సమూహానికి చెందిన వ్యక్తులను లక్ష్యం చేసుకొని దాడి చేయటం, ఇళ్లు తగలబెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయటం, పురుషులను చంపటం, పసిపిల్ల అని కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరికివేయటం, మనుషుల్ని చంపి మంటల్లో విసిరివేయటమే కాకుండా, ఆ  ఘోరకృత్యాలు చేసి వికటాట్టహాసం చేస్తూ విజయోత్సవంలో కరాళనృత్యం చేయటం వంటి నేరాలు ఉన్నాయి.  పిల్లలని చూడక, స్త్రీలని చూడక, ముసలి వాళ్లని చూడక, గర్భిణులని చూడక వారిపై ఎంత అమానుషంగా హింసాకాండ సాగించారో ఊహకందదు.
‘గుజరాత్ ఐనా .. ముజఫర్ నగర్ ఐనా ..
కారంచేడు అయినా .. చుండూరు అయినా ..
ప్రతి యుద్ధంలో గాయాల గురి మహిళలే !!
ప్రతి శవము అత్యాచార బాధితురాలే !   – విజయ
ఒక గుజరాత్ ఒక ముజఫర్ నగర్
కోటి మంది నిర్భయ ల బలిదానాల ఫలితంగా
మేమిప్పుడు అత్యాచార బాధితులం కానే కాదు
ఎన్ని చావులైనా చచ్చి పునరుద్దానమయ్యే వాళ్ళం .. రజిత
ముజఫర్ నగర్ , చుండూరు , కారంచేడు .. ఇలా ఏదో ఓ చోట కులం, మతం, వర్గం అంతర్లీనంగా ప్రవహింప చేస్తూనో, బహిరంగంగానో అనాగరిక, అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  అవును, ప్రతి సంఘటనలోను సమిధలవుతున్నది మహిళలే.  మనలో కొత్త దృక్పథం ఏర్పడాలి. మతా నికి, కులానికి, జాతికి అతీతంగా నిష్పాక్షికంగా నేరపరిశోధన, న్యాయ విచారణ జరగాలి. అంబేద్కర్ అన్నట్టు ‘‘ప్రజాస్వామ్యం అనేది మనం తగిలించుకున్న ముసుగు, ప్రధానంగా ఈ దేశం అప్రజాస్వామికమే ఇంకా!’
చిద్రాలు పడ్డ అక్కడి వారి బతుకు చిత్రాలు కళ్ళముందు ప్రత్యక్షం చేస్తూ, గుండెలవిసిపోయిన బతుకు గుడారాల్లో కాలం వెల్లడిస్తున్నదీనుల  ఆర్తనాదాలు, వేన వేల ప్రశ్నలు మానని గాయంలా మనని వెన్నాడుతూనే ఉంటాయి.   బాధితుల పక్షాన తమ గొంతుక వినిపించే ‘ముజఫర్ నగర్ మారణకాండ , నిషిద్ద మేఘాల్లోకి మా యాత్ర’ లో రచయిత్రులు తమ భావ సంచలనాన్ని వచనంలో , వచన కవిత్వంలో , ఛాయా చిత్రాల్లోనూ బంధించి మన కళ్ళముందు పరిచారు.  వచనం లేదా వచన కవిత్వం ఏదో ఒక రూపంలో ఉంటే ఇంకా బాగుండేది.
రుద్రమదేవి ప్రచురణలు, వరంగల్ సౌజన్యం తో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక పుస్తకకాన్ని ప్రచురించింది.
వి. శాంతి ప్రబోధ

స్త్రీల సాహిత్యం – కథ: 1850 నుండి 1960 వరకు

                                                            
Delhi visit photos 185కథ అంటే చెవి కోసుకోని వారెవరుంటారు చెప్పండి!  అమ్మో, అమ్మమ్మో, నాన్నమ్మో కథలు చెప్తుంటే, వింటూ ఊ కొడుతూ నిద్దురపోవడం చిన్నప్పటి నుండీ మనకు తెలిసిందే. అసలు అప్పుడే స్త్రీల కథలు ప్రారంభం అయ్యాయని  అనొచ్చు.   మనమే కాదు, కథ చెప్పుకోవడం అనాదిగా ఉన్నదే. నలుగురూ ఒక దగ్గర చేరి  కాలక్షేపం కబుర్లు-కథలుగా  చెప్పుకోవడం, నీతిని, సమాజ పోకడని అంతర్వాహినిగా నింపి  కథలు చెప్పుకోవడం తెలిసిందే.  మౌఖికంగా చెప్పుకునే కథలు ముద్రణా సదుపాయాలు వచ్చాక అచ్చులో రావడం ప్రారంభం అయింది. 
 
ఆధునిక సాహిత్యంలో కథ ఒక ప్రత్యేక రూపాన్ని, సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది.  వైవిధ్యం గల  వేలాది కథలు వెలువడ్డాయి. వివిధ పత్రికల్లో వచ్చినవే  కాకుండా కథా సంకలనాలూ  వచ్చాయి.  ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట కథల పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి.

కథా రచన అనేది అగ్గిపుల్లలతో మేడ కట్టడం లాంటిదట. ఒక దశ వచ్చేసరికి ఒక్క పుల్ల ఎక్కువయినా మొత్తం కూలిపోతుందట. ఇంత శ్రద్దగా బాలన్స్ గమనించాల్సిన ఆవశ్యకత ఒక కథారచన లో తప్పించి మరెక్కడా కనపడదట. అందు చేతనే సృజనాత్మక వచన సాహిత్య ప్రక్రియలన్నింటి లోకి కథారచన క్లిష్టమైనదని ప్రఖ్యాత కథా రచయిత “హెచ్.ఈ. బేట్స్ అభిప్రాయం.

మనమిప్పుడు ఆధునిక కథాసాహిత్యంలో స్త్రీలు -కథ 1850- 1960 వరకూ ఎలా సాగిందో చూద్దాం.


1939  ‘భారతి’ మాసపత్రికలో తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రిగారు ‘కథాపరిణామం’ గురించి రాసిన వ్యాసంలో (1 తెలుగు కథకులు కథన రీతులు) అప్పటి కథా సాహిత్యంలో గణనీయ రచయిత్రులు కనుపర్తి వరలక్ష్మమ్మ, క్రమదటి జానకీదేవి , పులవర్తి కమలాదేవి ల గురించి పేర్కొన్నారు. కానీ , 1952 లో తెలుగు కథకుల గురించి వెలువడ్డ  ‘అక్షరాభిషేకం’లోను , 1982లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ప్రచురించిన ‘తెలుగు కథారచయితలు’ పరిశీలనాత్మక వ్యాస సంకలనం లోనూ , 1998లో  ముద్రణ అయిన  ‘తెలుగు కథకులు- కథన రీతులు ‘పుస్తకంలోనూ ఒక్క మహిళా కథకురాలి కథనరీతులపైన విశ్లేషణ కనిపించదు.  అదే విధంగా  20వ శతాబ్ది ప్రతినిధి కథల సంకలనం ‘వందేళ్ళ తెలుగు కథ’లో 1960 కి ముందు కథలని చూసినా నిరాశే.   వాటికి ఉన్న పరిధి, నిర్దిష్ట సాహిత్య ప్రయోజనం ఏమయినప్పటికీ ఆనాడు మహిళా కథకులు లేరా…  అన్న ప్రశ్న ఉదయించక మానదు .  తొలితరం కథా జగత్తులో రచయిత్రులకు సరైన స్థానం దక్కలేదన్నది సుస్పష్టమవుతోంది. రచయిత్రుల సాహితీ సేవకు తగిన ప్రాచుర్యం, గుర్తింపు లేకపోయినా వారు చేసిన కృషిలో మాత్రం లోటు లేదనే చెప్పొచ్చు. 
 
మనం స్త్రీల కథా సాహిత్యాన్ని తవ్వుకుంటూ పోతే వజ్రాల్లాంటి రచనలెన్నో కనిపిస్తాయి. మరుగున  పడి ఉన్న మాణిక్యాల్లాంటి  మహిళారచయిత్రులెందరో సాహితీ చరిత్రలో అగుపిస్తారు. మానవ జీవిత సంవేదనలు కళ్ళముందు సాక్షాత్కరింప చేశారు.  వారు సమాజంలో  జరిగే వాస్తవ సంఘటనలని  వస్తువులుగా తీసుకొని పదునైన కథలెన్నోరాశారు.  విభిన్న కుల, మత, ఆచారాల , సంస్కృతుల , ప్రాంతాల , జాతుల సమ్మేళనం తెలుగు నేల.  ఆయా  ప్రాంతాలలోని  చైతన్య శీలతతో  వచ్చిన కథలు ఆనాటి స్థితి గతుల్ని తెల్పుతూ, ప్రశ్నిస్తూ మనని అబ్బురపరుస్తాయి.  స్త్రీ పురుష అసమానతలు , కుటుంబ సంబంధాలు, వైవాహిక సంబంధాల్లో ఉన్న డొల్లతనం,  వివక్ష,సతి దురాచారం , బాల్య వివాహాలు , విధవ వివాహాల నిషేధం , స్త్రీలకు విద్య నిరాకరణ వంటివెన్నో సమస్యలు ఆనాడు ఉండేవి. భార్యాభర్తలమధ్య యజమాని, బానిసల సంబంధాలే కానీ స్నేహ పూర్వక వాతావరణం తక్కువ.  విదేశీ పాలనలో  చదువుకున్న మగవాళ్ళు ఆంగ్లేయుల్ని అనుకరించాలనుకునేవారు. చిన్నతనంతో, చదువులేమితనంతో , అనాకరికంగాను , ముర్ఖంగాను ప్రవర్తించే భార్యలతో తంటాలు పడే పురుషులు తమ వైవాహిక జీవితంలోనూ, స్త్రీపురుష సంబంధాలలోనూ కొన్ని ఆదర్శాలు , ఆకాంక్షలు ఏర్పరచుకున్నారు. భార్యలు చదువుకుని సంస్కారంతో ఉండాలనీ , భర్తని , కుటుంబాన్ని అర్ధం చేసుకుని , భర్తకోసం ఇంటికి వచ్చి పోయే వారికి మర్యాదలు చేసి తమ గౌరవం కాపాడాలని  అనుకునేవారు ఆ భర్తలు. తాము కోరుకున్న విధంగా స్త్రీలని మలుచుకోవాలంటే వారికి విద్య అవసరం అని భావించారు.  భర్త , కుటుంబం కోసం సంస్కరణ బాట పట్టిన స్త్రీ ఆ పరిధిని దాటి ముందుకెళ్ళింది. ఆధునిక యుగంలో ప్రారంభమైన సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, తెలంగాణ విమోచన  ఉద్యమాల్లో భాగస్వామ్యం అందుకుంది. చక్కని అల్లికతో  బిగువైన కథనంతో చదువరులను ఆలోచింపచేసే కథలకు ప్రాణంపోసింది. తెలుగుసాహిత్య పరిణామంలో తానూ ముఖ్య భూమిక వహించింది.
 
అచ్చు యంత్రం వచ్చాక మొదలైన దిన , వార, పక్ష, మాస, త్రైమాస పత్రికలలో కథా కథనరంగంలో అడుగుపెట్టి సామాజిక ప్రయోజనం కోసం కథలల్లిన బండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ , కాంచనపల్లి కనకాంబ (రాధ , చక్కని కథలు సంపుటాలు )వంటి తొలితరం రచయిత్రులు,  భార్యాభర్తల మధ్య అవగాహన, సఖ్యత కల్పించడంలోనూ,  విద్య ప్రధాన విషయంగాను,  మధ్యతరగతి కుటుంబాల జీవిత లోతుల్ని అధ్యయనం చేసి వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తమ వస్తువుగా చేసుకొని కథా సృజన చేశారు. పురుష సంస్కర్తలు ఏ ఏ లక్షణాలు ఉండాలని కోరుకున్నారో ఆ లక్షణాలన్నిటిని తన కథల ద్వారా ప్రచారం చేసారు తొలి తరం రచయిత్రులు.

1902 నవంబరు ‘హిందూసుందరి’ పత్రికలో వచ్చిన భండారు అచ్చమాంబ రాసిన కథ ‘ధనత్రయోదశి’ తెలుగులో మొదటి కథ అంటున్నారు.   కానీ, అంతకు  ముందే ఆమె రాసిన కథలు   1898 జూలై “తెలుగు జనానా”  స్త్రీల పత్రికలో  ‘ప్రేమా పరీక్షణము’,  సెప్టెంబర్ లో ‘ఎఱఉవుల సొమ్ము బఱవుల చేటు’ వచ్చాయి.   1910 ఫిబ్రవరి లో గురజాడ రాసిన కథ ‘దిద్దుబాటు ‘ కంటే ముందే  భండారు అచ్చమాంబ  మూడు కథలు రాసిన విషయం గుర్తించి తెలుగు కథకు ఆద్యురాలుగా మనం చెప్పుకోవచ్చు.

తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు చదువుకుంటుంటే తనూ పక్కన చేరి చదువు నేర్చుకున్న అచ్చమాంబ  12 కథలు రాశారు.  వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభం కాక ముందే రాయడం వల్ల ఆవిడ కథలు గ్రాంధికంలోనే సాగాయి. కథల ఇతివృత్తం మాత్రం ఆధునికమయినదే. గురజాడ రాసిన ‘దిద్దుబాటు’కి ఏమాత్రం తీసిపోని కథ ‘స్త్రీవిద్య’.  కానీ ఆధునిక కథకుండవలసిన లక్షణాలు లేవని ఆమె కథలకు  విమర్శకులు తొలి కథకు రావలసిన గుర్తింపు ఇవ్వకపోవడం పితృస్వామిక ధోరణికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

అచ్చమాంబ ఎలాంటి ప్రోత్సాహం లేకుండా స్వయం కృషితో తెలుగు,మరాఠీ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీషు  భాషలు నేర్చుకోవడమే కాకుండా  చదువు విషయంలో తాను గురయిన వివక్షను గుర్తించింది. ఆడవారిని ఇళ్ళలో కట్టు బానిసలుగా తయారుచేసే మగవాళ్ళను విమర్శించింది. 1903 జూన్ నెల హిందూ సుందరిలో అచ్చయిన ఆమె కథ ‘దంపతుల ప్రధమ కలహం ‘ లో భార్య పాత్రతో ఆమె ఇలా  అనిపిస్తారు.  ‘నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాదు. వివాహమాడుట వలనను భర్తకు దాసినగుదునా ఏమి? గృహయజమనురాలిగా నెంచి, మన్నించి ప్రేమించవలయును గదా? అట్లు చేయక యిచ్చవచ్చిన పనులన్నియు నన్ను సేయమనిన నేను జేయుదునా ఏమి ” అని.
అదే విధంగా ‘ వివాహము కాగానే మేము గృహిణి పదమున కర్హురాండ్రమగుదుమే గాని కొన్న బానిసలము కాము. మా వంటి పత్నులు పురుషుల యహంభావమునెంత మాత్రమును సహింపజాలరు ‘  అంటూ భార్యాభర్తల సంబంధంలో నెలకొన్న అసమానతల్ని మగవారి అహంభావాన్ని గురించి స్పష్టంగా చెప్పించిన తీరు చూస్తే ఆనాటి పరిస్తితుల్లో ఆమె చైతన్య స్థాయి చూస్తే తొలితరం స్త్రీవాద రచయిత్రిగా కూడా మనం భందారు అచ్చమాంబను చెప్పుకోవచ్చు.

కనుపర్తి వరలక్ష్మమ్మ  కథలలో “కుటీర లక్ష్మి”.  పెన్షన్ పుచ్చుకున్ననాటి రాత్రి, 5 మాసాల 20 రోజులు మొదలైన  కథలు చెప్పుకోదగినవి. ఆనాటి సాంఘిక, కాల  పరిస్థితికి చిహ్నాలుగా ఆమె రచనలు కనిపిస్తాయి. వ్యవహారిక భాషలోనే రాశారు.  కొటికలపూడి సీతమ్మ, రాణీ చిన్నమ్మారావు, కందుకూరి రాజ్యలక్ష్మి,  బుర్రా సూరమాంబ, వేమూరి శారదాంబ, వెన్నెలగంటి హనుమాయమ్మ, సీరము సుభద్రయాంబ, అవధూత జ్ఞానమాంబ, కల్లూరి విశాలాక్షమ్మ, పులుగుర్త లక్ష్మీనరసమాంబ, జూలూరి తులసమ్మ, కాంచనపల్లి కనకాంబ, గుడిపూడి ఇందుమతి, చిల్కపాటి సీతాంబ,  ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, పొణకా కనకమ్మ, చేబ్రోలు సరస్వతీదేవి, ఆత్మూరి అన్నపూర్ణమ్మ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, చావలి బంగారమ్మ వంటి ఎందరో రచయిత్రులు తెలుగుసాహిత్య వైభవాన్ని చాటారు.  తొలి తరం రచయిత్రుల కలం కవాతుతో  తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగం ఆరంభమయిందని చెప్పవచ్చు.  ఉత్తుంగ తరంగంలా తెలుగు సాహిత్యాన్ని ముంచి తేల్చారు స్త్రీలు.  తమ రచనలపై వచ్చే కువిమర్శలు పట్టించుకోకుండా  తమ రచనా వ్యవసాయం చేస్తూనే పోయారు.

సంస్కరణోద్యమ నేపథ్యంలో వచ్చిన కథలు చూద్దాం
ఆనాటి సాంఘిక పరిస్థితుల్లో బాల్య వివాహాలు , కన్యాశుల్కం , బహుభార్యత్వం , వితంతు వివాహాల నిషేధం, వేశ్యలోలత్వం , అవిద్య వంటి ఎన్నోఇబ్బందులు, మూఢనమ్మకాలు సాధారణం.    అవే ఆ స్త్రీల కథా వస్తువులయ్యయి. ఆనాటి సంస్కరణ ఉద్యమాలు వారిని ఎంతో ప్రభావితం చేశాయి. నాలుగు గోడల మధ్య నుండి బయటికొచ్చి ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడడం ,  చదవడం వల్ల వారి ఆలోచనా దృక్పథంలో మార్పు తెచ్చింది. భావాలు పరిపక్వం అవుతూ పదును తేలడం మొదలెట్టాయి.   ఆ ప్రభావంతోనే రచయిత్రులు స్త్రీ విద్య వైపు మొగ్గు చూపడం , పురుషాధిపత్యాన్ని నిరసించడం , మూఢనమ్మకాలని వదిలేయడం అభ్యదయ పంధాలో నడవడం ఆ విధానంలోనే రచనలు చేయడం కనిపిస్తుంది.  ఉదాహరణకి
భండారు అచ్చమాంబ వ్రాసిన కథలు  స్త్రీ విద్య (భార్యా భర్తల సంవాదము),  ధనత్రయోదశి చూద్దాం. అవి 1902లో వచ్చాయి.  సంస్కరణోద్యమానికి ప్రతినిధి రచనలివి.  అనేక మూఢాచారాలతో, అంధ విశ్వాసాలతో సతమతమవుతున్న సమాజానికి తొలిచికిత్సగా వచ్చిన సంస్కరణోద్యమం స్త్రీ సమస్యపైననే ఎక్కువగా కేంద్రీకృతమైంది.  స్త్రీ జీవిత కష్టాలను, దౌర్భాగ్యాలను వ్రాస్తూ స్త్రీలలో వున్న సహజ జీవశక్తులను గౌరవంతో ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తూ స్త్రీలలో చైతన్యం నింపటానికి ప్రయత్నించాయి ఈ ఉద్యమాలు.  ఈ నేపథ్యంలో చూస్తే,    స్త్రీ విద్య ఆవశ్యకత గురించి ప్రస్తావిస్తూ, స్త్రీల ఉద్యమాన్ని నిర్మించడానికి, ప్రోత్సహించడానికే తన రచనలను ఉపయోగించింది అచ్చమాంబ.   స్త్రీ విద్య, స్త్రీల అభివృద్ధి కోసం ఎంతో శ్రద్ధాసక్తితో  రచనలు చేసింది. కట్టుబాట్లు నియమాల యుగంలో పుట్టిన అచ్చమాంబ ఆనాటి యుగధర్మాన్ని పాటిస్తూనే అభ్యుదయ మార్గంలో ఆలోచించింది.

సంస్కరణోద్యమం, జాతీయోద్యమంగా సమగ్రరూపాన్ని తీసుకొంటున్న ఈ సంధికాలంలో భాస్కరమ్మ వ్రాసిన కథ ‘ప్రభావతి’ (1926). ‘ప్రభావతి’ విషయం రీత్యా సంస్కరణోద్యమ కథ.  పదేళ్ళకు పెళ్ళయి ఏడాది తిరగకుండానే భర్తను కోల్పోయిన  ప్రభావతి అనే అమ్మాయి,  వైధవ్యం పేరుతో  దుర్భరమైనప్పుడు   ”ఇతరులచే నింత మాటయైన పడుటకు సహింపదు. అట్టి బాలిక ఇప్పుడకారణముగా నిట్టి నిందావాక్యముల సహింపగలదా? ఇందు ‘తానొనర్చిన తప్పేమిగలదు?’ అంటూ  ఆచారం పేరుతొ విధవని చేయడాన్ని ఏ తప్పు చేయకుండానే విధించే శిక్షగా గుర్తించి నిరసించింది భాస్కరమ్మ.   స్త్రీ ఎప్పుడు వితంతువైనా రజస్వల కానిదే జుట్టు, పసుపు కుంకుమలు తీయరు.   పదేళ్ళకే వితంతువైన  ప్రభావతి రజస్వల అయ్యేనాటికి  పత్రికలు పుస్తకాలు చదువుకుంటూ స్త్రీ స్వాతంత్య్రం కోసం  తన జీవితాన్ని అంకితం చేయాలన్న చైతన్యాన్ని పొందింది.
భార్య పోయిన పురుషునికి ఏ శిక్ష లేకుండా పన్నెండు రోజులకే తిరిగి పెళ్లి పిటలెక్కిస్తారు.  భర్త పోయిన స్త్రీకి పదవనాటి అవస్థ తలచుకుంటే ఎంతటి కఠిన హృదయానికైనా గుండె కరిగి నీరవుతుంది. పురుషులకక్కరలేని మార్పు స్త్రీలకెందుకు? అని స్త్రీ పట్ల ఉన్న దమననీతిని నిరసిస్తూ అవయవ నిర్మాణములో స్త్రీపురుషులకు భేదముండవచ్చు. మానసిక విషయాలలో ఇరువురు సమానులే అని అసమానతను, లింగ వివక్షతను ప్రశ్నిస్తుంది రచయిత్రి.
ఈ కథలో దురాచారాలకు నిలయమైన  సంఘాన్ని ఉద్దేశించి ”ఓ సంఘమా? అసమాన ప్రజాధురీణులై యుండి పరోపకార పారీణలు, దేశసేవా పరాయణులు కావలయునని యెక్కుడాసతో నున్న మానవతుల నెందరినింతవరకు నీపొట్ట బెట్టుకుంటివో” అని ప్రభావతిఅన్న చివరిమాటలు దేశ స్వాతంత్య్రోద్యమానికి ఉపయోగపడకుండా వృధా అవుతున్న స్త్రీశక్తిని గురించి ఆలోచించమని హెచ్చరిస్తాయి.

యల్లాప్రగడ సీతాకుమారి ” పునిస్త్రీ పునర్వివాహం” ఆంధ్రప్రతిక, 1937 లో వచ్చింది.  ఈ కథలో నాయిక మధు వరకట్న సమస్యను అధిగమించి స్వేచ్ఛాజీవితాన్ని గడిపిన దృశ్యం కన్పిస్తుంది. కట్నం ఇవ్వలేదన్న నెపంతో అత్తింటివాళ్ళు మధును పుట్టింట్లోనే వదిలేస్తే, అధైర్యపడకుండా ఎన్నో ఆటుపోటులను ఎదిరించి తన లక్ష్యం వైపు నడిచి మరో ఆదర్శ వివాహం చేసుకొంది. ఈ కథలో కన్పించే మధులాంటి ధైర్యవంతులు ఆనాటి సమాజానికి ఎంతో అవసరమని రచయిత్రి తెలియజేశారు. ‘ఈ రాధేనా?” కథ భారతి  జూలై 1938లోనూ,  ‘ఆ వీణ” ఆంధ్రకేసరిలో 1940 వచాయి.  ఈ కథలు కూడా స్త్రీ అభ్యుదయాన్ని కాంక్షించేవే. సీతాకుమారి కథలన్నీ పూర్తిగా ప్రామాణిక భాషలో సాగాయి.  ఆమె కథల్లో  తెలంగాణ మాండలికపదాలు కనిపిస్తాయి.  ఆమె రాసిన ఇంకొన్ని కథలు గృహలక్ష్మి, భారతి, గోలకొండ పత్రికల్లో అచ్చయ్యాయి. కాని ఆమె కథలు సంపుటిగా రాలేదు. 

Delhi visit photos 230
జాతీయోద్యమ నేపథ్యంలో వచ్చిన కథలు
స్వాతంత్య్రోద్యమం స్త్రీల సమస్యలను కలుపుకొని పరిష్కారదిశగా విస్తరించాలన్న ఆకాంక్ష కూడా అందులో కనబడుతుంది. గాంధీ పిలుపునందుకొని సహాయనిరాకరణోద్యమంలో స్త్రీలు కూడా భాగస్వాములయ్యారు.    కుటుంబాన్ని దాటి కొత్తగా సమాజంలోకి అడుగుపెట్టారు. గుమ్మడిదల దుర్గాబాయి వ్రాసిన ”నేధన్యనైతిని” (1929), కనుపర్తి వరలక్ష్మమ్మ వ్రాసిన ”ప్రేమప్రభావము” (1927), ”ఐదుమాసముల ఇరువది దినములు” (1931), బసవరాజు వెంకటరాజ్యలక్ష్మీ వ్రాసిన ”ఎవరిదదృష్టం” (1931), తాడి నాగమ్మ వ్రాసిన ”ఒక ముద్దు” (1939) అయిదు కథలు జాతీయోద్యమ నేపథ్యంలో వచ్చాయి. జాతీయోద్యమంలో స్త్రీల క్రియాశీలక పాత్రను చిత్రించిన కథలుగా వాటికి ఒక ప్రత్యేకత వుంది.

దుర్గాబాయి ‘నేధన్యనైతిని ‘  కథను 1929లో వ్రాసింది. బాలవితంతువైన శారదాబాయి సంప్రదాయాలను ధిక్కరించి పూనాకు వెళ్ళి చదువుకొని వచ్చి పాఠశాల స్థాపించి నడుపుతున్న చైతన్యశీలి.  ఆమె తమ్ముడు శ్యామసుందరుడు సైమన్‌ కమీషన్‌ బహిష్కరణప్పటినుండి  జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొంటూ పాఠాశాల నుండి బహిష్కరణకు, అన్న ఆగ్రహానికి గురై అక్క  దగ్గరకు చేరతాడు.  లీలది  జాతీయోద్యమ చైతన్యశీల స్వభావం. ఇంట్లో  నూలు వడకటం జాతీయోద్యమ గీతాలు పాడటం ఆమెకు అలవాటైంది.  లీల తండ్రి శ్రీనివాసరావు జబ్బుపడి మరణిస్తూ కూతురికి మాతృభూమిని మరువద్దు, భారతాంబ ఋణం తీర్చు అని సందేశమిచ్చాడు. ఆ తరువాత లీల తల్లి మరణిస్తూ ”చదువుల సరస్వతివై విద్యలేక  దేశమన్న నెట్టిదియో యెరుంగక భర్తయున్నతాశయముల కెంతయు ఆటంకమును గల్గించు వృధా ప్రలాపముల యందే కాలమంతయు గడిపి అవిద్యాంధకారమందు మునిగి తేలుచున్న స్త్రీల నుద్ధరింపుము” అని చెప్పింది.   స్త్రీ విద్య కథలో స్త్రీలు తమ పనులైన తర్వాత  కాలక్షేపం  కబుర్లతో కాలాన్నివృధా చేయకుండా చదువుకు వినియోగించాలని భండారు అచ్చమాంబ చెప్పిన విషయమే ఈ కథలో దుర్గాబాయ్‌ తల్లిపాత్ర తో చెప్పించింది.   శారదాబాయి లీలను చేరదీస్తుంది.  లీల, శ్యామసుందరుల మధ్య అనురాగం పెరుగుతుంది.  శారదాబాయి జబ్బు పడ్డప్పుడు  లీలా శ్యామసుందరులు  పాఠశాల నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు.   తన ఆశయాన్ని ముందుకు తీసుకొనిపోగల యువతరం తయారుకావటం శారదాబాయికి చాలా తృప్తినిచ్చింది. నేటికి నేను ”ధన్యనైతిని” అన్న ఆమె ఆఖరి మాటలో ఆ తృప్తే వ్యక్తమవుతుంది.  స్వార్ధ రహితంగా దేశభక్తితో మానవసేవ చేయటంలోనే జన్మసార్థకమవుతుందని దుర్గాబాయి  భావించినట్లు తెలుస్తుంది ఈ కథ ద్వారా .

గాంధీజీ విజయవాడలో జరగనున్న అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశానికి కలకత్తా నుంచి వస్తూ తెలుగు ప్రాంతంలో చాలా పట్టణాల్లో  ప్రసంగించాడు. విదేశీ వస్త్రాలను బహిష్కరించమని పిలుపునిచ్చాడు. స్వరాజ్య స్థాపనకు  సహాయ నిరాకరణమే శరణ్యమని అభిప్రాయపడ్డాడు. ఆ స్ఫూర్తితోనే కనుపర్తి వరలక్ష్మమ్మ ”ప్రేమప్రభావము” అనే కథను 1927లో వ్రాశారు.
లక్ష్మీ వెంకయ్యనాయుడు దంపతుల కొడుకు రామస్వామి చదువురీత్యా మద్రాస్‌లోఉంటాడు.  గాంధీ మద్రాస్‌ సభలో చెప్పిన సహాయనిరాకరణోద్యమానికి మూల సూత్రాలైన సత్యం, త్యాగం, అహింస, ఐకమత్యం ల  గూర్చిచెప్పిన  గాంధీ మాటలు రామస్వామి హృదయంలో గాఢంగా నాటుకొన్నాయి. తానూ  ఉద్యమంలో చేరాలనుకుని చదువుకు మాని స్వగ్రామం చేరతాడు.  వెంకయ్యనాయుడుకు కొడుకు ఉద్యోగము చేయాలని, పెద్ద మొత్తం వరకట్నంతో అతనికి పెళ్ళి చేయాలని ఉంది.  అది కాదన్న కొడుకును ఇంట్లో ఉండొద్దంటాడు.  తల్లి చాలా బాధపడుతుంది.  తల్లికి ఉద్యమతత్వం చెప్పి ఒప్పించుకుని ఇల్లు వదిలి సహాయనిరాకరణ ఉద్యమంలోఉండగా జైలు పాలైన విషయం తెలుసుకున్న వెంకయ్య నాయుడు తానూ కొడుకు మార్గంలో నడవడంతో  కథ ముగుస్తుంది.   ఈ కథ కనుపర్తి వరలక్ష్మమ్మగారి జాతీయోద్యమ చైతన్యాన్ని సూచిస్తుంది. గాంధీ నిర్విహించిన చారిత్రక పాత్రను రచయిత్రి ఈ కథలో నమోదు చేయటం విశేషంగా చెప్పవచ్చు.
కనుపర్తి వరలక్ష్మమ్మ వ్రాసిన మరో కథ ”ఐదు మాసముల ఇరువది దినములు” (1931) మహాత్మాగాంధీ పిలుపునందుకొని విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చేరతాడు గోపాలరావు.  పురిటికి పుట్టింటికి వెళ్లి పిల్లవాడితో  తన కోసం వచ్చిన భార్య విదేశీ వస్త్రాలు ధరించి వుండటం చూసి  గోపాలరావు ఆమెను పలకరించనయినా పలకరించడు. ఆ  రాత్రే  గోపాలరావును బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. విదేశీ వస్త్రాలను వ్యతిరేకిస్తూ ప్రజలను జాగృతం చేస్తున్నందుకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన చీరలు, నగలే  జీవితం అనుకునే  రుక్మిణిని  దేశ స్థితిగతుల గురించి ఆలోచించేటట్లు చేసింది. స్వదేశీవస్త్రాలనే ధరించమని చెప్పటమే నేరమా అని ఆశ్చర్యపడేలా చేసింది .  భర్త ఆశయాన్ని అర్థం చేసుకున్న రుక్మిణి స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా ఖద్దరు కట్టి, నూలు వడకటం మొదలు పెట్టింది.  స్వదేశీ ఉద్యమం పట్ల ఆమె  చుట్టూ ఉన్న స్త్రీలను సమీకరించి కార్యోన్ముఖుల్ని చేసింది.  5నెలల 20 రోజులకి భర్త జైలు నుండి వచ్చేసరికి అతని ఆదర్శాలకు, అభిరుచులకు అనుగుణమైన ప్రవర్తనతో తయారైంది.

స్త్రీలు భర్తల ఉన్నతాశయానికి భంగం కలిగించని రీతిలో విద్యావంతులు కావాలని ”నేనుధన్యనైతిని” కథలో లీల తల్లితో చెప్పించిన మాటల సారాన్ని ఆచరణ రూపంగా వ్యాఖ్యానించిన కథ ఇది. జాతీయోద్యమ ప్రభావంతో పనిచేసే మగవారి ఆశయాలకు, ఆచరణకు భంగం కలగకుండా వారి సహచరులు అతని బాటలో నడచినప్పుడే  ఉద్యమం బలోపేతం అవుతుందని,   భర్త ఉన్నతాశయాలనర్దం చేసుకొని భార్య నడుచుకోవాలని  తెలిపింది.

శ్రీమతి బసవరాజువేంకటరాజ్యలక్ష్మీ వ్రాసిన కథ ”ఎవరిదదృష్టం”.  ఈ కథలో సరళ, కమల ఇద్దరు స్నేహితులు. సనాతన సంప్రదాయలోని  కమల,  స్త్రీలు కూడా పురుషులతో సమానమనే  సరళల చైతన్యాలు కూడా ఆ రకంగానే వికసించాయి.  తల్లిదండ్రుల ఇష్టప్రకారం  బాల్యంలోనే పెళ్లి చేసుకొని యుక్త వయస్సు రాగానే చదువు మానేసింది కమల. సరళ చదువు స్కూల్‌ ఫైనల్‌ ప్యాసు అయింది. మద్రాస్‌లో జరిగే టెన్నీస్‌ పందెములు చూడ్డానికి వెళ్ళి అక్కడ టెన్నీస్‌ ఆటగాడు బేగ్‌ను పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది.   అయితే  మతాంతర వివాహం కాబట్టి బేగ్ ఇంట్లో ఇష్టం లేకపోవడంతో  ఆమె వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగుస్తుంది.  బాల్య వివాహం చేసుకున్న కమల అత్తమామలకు, భర్తకు సేవలు చేస్తూ వంట చేయడం, నూలు వడకటం, కొందరు పిల్లలకి  హిందీ నేర్పటం, తో పాటు జాతీయోద్యమ కార్యకలాపాలు  సాగిస్తూ ఉంటుంది.   సరళ, కమల దగ్గరికి వెళ్లి  పరిస్థితి చెప్పి  ”నా గతి యిల్లా అయినదని” తన మీద తానే జాలిపడుతున్నట్లు అనిపించిన రచయిత్రికి మతాంతర వివాహాల పట్ల  విముఖత ఉన్నట్లుగా కనిపిస్తుంది.  కమల భర్త దామోదరం  సహాయనిరాకరణోద్యమంలో జైలుకు వెళ్తాడు. తిరిగి వచ్చేవరకు సరళ, కమల ఆయన పని చేయదల్చుకున్నారు.   సరళ ఖద్దరు చీర కట్టుకుని, ఖద్దరుకున్న గౌరవం విదేశీ బట్టలకు లేదని ప్రచారం చేస్తూ ఖద్దరు బట్టల మూట నెత్తిన బెట్టుకొని ఖద్దరమ్మేది. సంసారంలో వైఫల్యం చెందిన స్త్రీలకు జాతీయోద్యమ ఒక ప్రత్యామ్నాయ ఆదర్శం కార్యక్రమంగా చూపించారు రచయిత్రి.  సరళ పేరు ప్రఖ్యాతులు  పత్రికలో చదివి పశ్చాత్తాపంతో బేగ్‌ సరళను వెతుక్కుంటూ వచ్చినప్పుడు  సరళతో ఇలా అనిపిస్తారు ”ఇకరాను,  దేశమే నాకు సంసారం, నీకిష్టమైతే దేశసేవ చేయి, మాతృదేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాతే మనకు సంసారం” అని.  ఇలా అనటంలో ఆమె స్వాతంత్య్ర కాంక్షను బలంగా చూపించింది రచయిత్రి.  ఒకరోజు బెజవాడలో విదేశీబట్టల దుకాణం దగ్గర పికెటింగ్‌లో అరెస్టయి ఆరునెలలు శిక్షతో రాయవేలూరు జైల్లో వేస్తే ఆహార నియమాలు పడక 21 రోజులు ఉపవాసం ఉంటుంది. దేశం కోసం ప్రాణాలు ధారపోయటం నా అదృష్టమని తల్లిదండ్రులకు, స్నేహితురాలికి తెలియజేస్తూ దేశసేవ మాత్రం ఏనాటికి మరువద్దని ఆఖరు మాటగా చెప్పి ప్రాణాలు వదులుతుంది.

ఉన్నతాశయాలతో పనిచేసిన  సరళ పేరును కమల తన కూతురికి పెట్టుకొంటుంది. సకాలంలో పెళ్ళి చక్కని సంసారం భర్త ఆశయాలకనుగుణమైన ఆశయాలు ఆచరణ వున్న కమలదా అదృష్టం,  సంసార జీవితం విఫలమైనా జాతీయోద్యమంలో సార్థకమైన జీవితం గడిపిన సరళదా అదృష్టం అన్న ప్రశ్న పాఠకులను వెన్నంటుతూనే వుంటుంది. రచయిత్రి ఒకసారి ఒకరివైపు, మరొకసారి మరొకరి వైపు మొగ్గినట్లు కన్పించినా ఆ ఇద్దరూ ఒకే వ్యక్తిత్వంలో భాగం కావటం రచయిత్రి ఆకాంక్షేమో !

తాడి నాగమ్మ రాసిన కథ ‘ఒక ముద్దు ‘ .  ఈ కథలోని యువతికి 18 ఏళ్ళు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొంటూ స్వదేశ వస్త్ర విక్రయం తన పనిగా చేస్తున్నది యువతి. ”నేధన్యనైతిని” కథలో లాగ శారదబాయిలాగ వితంతువు కాదు. కనుపర్తి వరలక్ష్మమ్మ గారి ”ఐదు మాసముల ఇరువది దినముల” కథలో లాగ  ఇల్లాలు కాదు. ”ఎవరిదదృష్టం” కథలోని సరళలాగ విఫలమైన సంసారం  కాదు. పెళ్ళికాని యువతి స్వతంత్రంగా, స్వచ్ఛందంగా ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తి.  స్వదేశీ ఉద్యమం వెనుక ఉన్న దేశ ఆర్థికబలం గురించి తెల్సిన విద్యావంతురాలు, మేధావి.

విదేశీ వస్త్రాలు  కొనడంవల్ల సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుందనీ, కొంతకాలం తర్వాత భారతీయులంతా  భిక్షాందేహి అనే స్థితి వస్తుందనీ  ఆవేదన చెందే ఆ యువతి  స్వదేశీ వస్త్రాలు మాత్రమే కొనమని ప్రజలను వేడుకుంటుంది.  ఓ ధనమదాంధుడైన  పురుషుడు ఒక ముద్దు ఇస్తే స్వదేశీ దీక్ష చేస్తానంటాడు.  సామాజిక ఉద్యమాలలోకి ప్రవేశించే స్త్రీలకు మాత్రమే ఎదురయ్యే ప్రత్యేక అనుభవం ఇది.  స్త్రీలను లైంగిక దృష్టితో చూడటానికి మాత్రమే అలవాటు పడ్డ పురుషుల నుండి ఉద్యమాలలోకి వచ్చే స్త్రీలకు ఎదురయ్యే సమస్యను తాడి నాగమ్మ 1930 లలోనే ఊహించింది. ఇక్కడ ఆ యువతి ఒక దేశభక్తురాలుగానో వలసపాలస మీద ధిక్కారం ప్రకటించిన తిరుగుబాటుదారుగానో, మేధావిగానో ఆ పురుషుడికి కనబడలేదు. తన అనుభవానికి, తాను హేళన చేయడానికి, అవమానించడానికి అనువుగా ఉన్న రెండవస్థాయి పౌరురాలుగా మాత్రమే కనబడింది. అందుకే  ఒక ముద్దు ఇస్తే ఉద్యమానికి పని చేయగల్గుతానని అనగలిగాడు. ఇలాంటి పరిస్థితులలో యువతులు అవమానంతో దుఃఖపడటం కాదు చేయాల్సింది. ఆత్మగౌరవంతో అలా అన్నవాళ్ళను ధిక్కరించగల్గాలి. ఈ కథలో యువతి చేసిన పని అదే.  నాకిద్దరు అన్నలున్నారు.  రోజూ నన్ను ముద్దుపెట్ట్కుని  ఆశీర్వదించి శాంతి సమరానికి పంపుతున్నారు.  తరతరాల నుండి దాస్యమును అనుభవిస్తున్న మాతృభూమి విముక్తికోసం విదేశీ వస్తువులనే విషానికి ఆహుతి అవుతున్న నీలాంటి సోదరున్ని రక్షించుకోడానికి ఒక ముద్దు ఇవ్వలేనా?  నీవు నా మూడవ తోబుట్టువు.  ఒకటి కాదు, ఎన్నైనా పొందమని ఆమె తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ముద్దు అతని దృష్టిలో ఒక లైంగిక చర్య. ఆమె దృష్టిలో స్నేహాన్ని, సానుభూతిని, ఆప్యాయతను వ్యక్తీకరించే చర్యగాను,  లైంగికత్వ ముద్ర నుండి విముక్తం చేసి ఒక మానవీయ స్పందనగా నిలబెట్టటం ఆ యువతి వివేకానికి, ఔన్నత్యానికి గుర్తుగా చిత్రించిన రచయిత్రిని అభినందించకుండా ఉండలేం.  ఉద్యమాలలో స్త్రీల భాగస్వామ్యం జాతీయాభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని కల్పుకొని సాగాల్సిన స్థితి గురించి ఈ కథ చెప్పింది.  తాడి నాగమ్మ  వ్రాసిన ”ఒక ముద్దు” కథలో దేశీయ స్వాతంత్య్రఆకాంక్షతో పాటు, విదేశీ వస్తు బహిష్కరణ పెనవేసుకున్నాయి. స్త్రీలను జాతీయోద్యమంలోకి సమీకరించటమే కాక, సామ్రాజ్యవాద సంస్కృతిని వ్యతిరేకించే చైతన్యాన్ని, స్త్రీగా స్వతంత్ర వ్యక్తిత్వ చైతన్యాన్ని కూడా రచయిత్రి ఇందులో కనబరచరచడం ఆనాడు ఆమెకున్న చైతన్య స్థాయిని తెల్పుతుంది.  స్పూర్తిని ప్రవహింపచేస్తుంది.

ఈవిధంగా స్త్రీల కథలు సంఘసంస్కరణోద్యమ, జాతీ యోద్యమ ఆదర్శాలను ఆయా ఉద్యమాలలో క్రియాశీలక భాగస్వామ్యాన్ని చైతన్య చరిత్రను నమోదు చేశాయి.

 

స్వాతంత్ర్యానంతర కథలు

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సామాజిక, ఆర్ధిక, సాహిత్య రంగాలలో  చాలా మార్పులొచ్చాయి.  విద్యావకాశాలు మెరుగుపడ్డాయి.  పత్రికలు రాయమని ప్రోత్సహించేవి. అంతకు ముందు ఉన్నత కులాలు , కుటుంబాల్లోంచి చదువుకుని కథలు రాసేవారు.  జమిందారీ వ్యవస్థ రద్దయిన తర్వాత  కుటుంబాలు మధ్య తరగతిలో చేరిపోయాయి.  మధ్యతరగతి కుటుంబాలోంచి వచ్చిన రచయిత్రులు తమకు తెలిసిన  మధ్యతరగతి జీవితాలపై  విభిన్న కోణాల్లో విస్తృతంగా సాహిత్యాన్ని అందించారు.  మారుతున్న విలువలని, మారుతున్న కుటుంబ సంబంధాల్ని, సామాజిక వ్యవస్థలోని అస్తవ్యస్త తలని , అసమానతల్ని ఎత్తి చూపుతూ కర్తవ్యాన్ని బోధిస్తూ అభ్యుదయ రచనలు చేసారు.  అయితే, తెలంగాణా విమోచనోద్యమం పై కథలు వచ్చినా స్త్రీలు రాసినవి కనిపించవు. అదే విధంగా రాయలసీమ ప్రాంతం నుండి కూడా కనిపించవు.  పేదల జీవితాల గురించి వచ్చిన కథలు చాలా తక్కువ. అవి కూడా మధ్యతరగతి కళ్ళద్దాల్లోంచి కనిపించేవే.

కె. రామలక్ష్మి 1950కి ముందునుంచీ కథలు రాస్తున్నారు. 1954 నాటికే ఆమె తొలి కథా సంపుటి ’విడదీసే రైలుబళ్ళు” ప్రచురించారు.1961 లో ’తొణికినస్వప్నం” ప్రచురిం చారు. రామలక్ష్మి కథలు క్లుప్తమైనవి. ఒక్కసారిగా చదివి ముగించటానికి వీలైనవి. తీరైన నిర్మాణసౌష్ఠవం చాలా కథల్లో కన్పిస్తుంది. ఆత్మ గౌరవం స్త్రీలకి గానీ పురుషులకు గానీ ఒకరిచ్చేది ,ఒకరినించీ లాక్కునేదీ కాదు .అది వాళ్లంతట వాళ్ళే అలవర్చుకోవాలనే నమ్మకాన్ని అనేక కథల్లో అర్థం చేయించడానికి ప్రయత్నిస్తారు రామలక్ష్మి. రామలక్ష్మిగారి కథలన్నీ స్త్రీల జీవితాలని ,వాళ్ళు యువతులుగా,గృహిణులుగా ,వృద్ధులుగా ఎదుర్కుంటున్న సమస్యల్ని,చిత్రించినవే. అందుకు ఒక కారణం ఆమె కొన్ని సేవాసంస్థలలో పనిచేస్తూ బాధిత స్త్రీలను సన్నిహితంగా చూడడం కూడా కావచ్చును.మానసిక రోగులను,  సేవా సంస్థలను వికలాంగుల పాఠశాలను సందర్శించడం కూడా కావచ్చు..స్త్రీలపట్ల సహానుభూతి పెంచడానికవి దోహదం చేసి వుండొచ్చు. 

రామలక్ష్మి కథల్లో భాష, శైలి రెండూ ఆధునికమైనవి. ఎక్కడా అసహజత్వానికి చోటీయనివి. కథల్లో వాదోపవాదాలు శిల్పమర్యాదకు భంగం కలిగించనవి. సాధారణంగా కన్పించే అసాధారణమైన కథలివి. రామలక్ష్మిగారి కథలలో ఆధునిక జీవితంలో మనుషుల మధ్య ప్రేమానుబంధాలు తరిగిపోతున్నాయన్న ఆవేదన వుంది. చదువూ సంస్కారంతో మనుషులు సమస్యల్ని పరిష్కరించుకోవాలేగాని ఆత్మహత్యలు ప్రత్యామ్నాయం కాదన్న ఉద్బోధ అంతర్లీనంగా వుంది.

మాలతీ చందూర్ వాస్తవానికి దగ్గరగా రచనలు చేసేవారు. 1950 ప్రాంతంలో ‘ఆనందవాణి’ వారపత్రికలో ప్రచురితమైన ‘రవ్వల దుద్దులు’ ఆమె రాసిన మొదటి కథ. 1953 ఆగస్టులో ప్రచురితమైన ‘పాప’ కథానిక, ఇంకా ‘లజ్ కార్నర్’, ‘నీరజ’ తదితర రచనలన్నీ ప్రముఖ సాహిత్య మాసపత్రిక ‘భారతి’లో వచ్చాయి.  వాటిలో మధ్యతరగతి జీవితాన్నికళ్ళకు కట్టించే ప్రయత్నం చేశారు. మధ్యతరగతి కుటుంబాలలోని మానవ సంబంధాలు, ఒడుదొడుకులు ఆమె రచనల్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్త్రీ పాత్రలను వట్టి బేలలుగా ఆమె చిత్రించరు. ఆమె కథల్లోని స్త్రీ పాత్రలు ఆత్మ గౌరవంతో సమస్యలను ఎదుర్కొంటాయి.

కథానికా రచనలు చేసి ప్రసిద్ధి పొందిన రచయిత్రి నిడదవోలు మాలతి.  వందకు పైగా కథానికలు వెలువడ్డాయి. ఈమె రచనల్లో ముఖ్యంగా మానవతా విలువలు, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఇతరులకు చెప్పడం విశేషం. నిజానికి, ఫెమినిజానికి మధ్య కథానిక సంచలనం కలిగించింది.   1952 తెలుగు స్వతంత్రలో ప్రారంభమైన ఈమె రచన కొనసాగుతూనే ఉంది.

వాసిరెడ్డి సీతాదేవి  మొదట ‘సాంబయ్య పెళ్లి ‘ కథ రాశారు.  ఆ తర్వాత  1952లో  ‘ధర్మదేవత గుడ్డికళ్ళు ‘ కాలేజీ పోటీల కోసం రాసిన కథ.   జడ్జి గా వ్యవహరించిన కొడవటిగంటి కుటుంబరావు మెచ్చుకొని  బహుమతి ఇచ్చిన కథ అది. 1955లో ‘రత్తమ్మ కష్టాలు ‘  రాసింది.  ఈ కథ ఆనాటి ప్రధానమంత్రి భార్యగురించి   రాసిందని ప్రచారం జరిగి , ప్రధానికి ఫిర్యాదు ఇవ్వడం తో  ఉద్యోగం పోగొట్టుకుంది సీతాదేవి. అయినా తన రచనా వ్యాసంగాన్ని ఆపలేదు సరికదా తన కాలానికి మరింత పదును పెట్టారు . 1955లోనే వాసిరెడ్డి సీతాదేవి కథల పుస్తకం వచ్చింది.
రంగనాయకమ్మ కథలు నాటికీ నేటికీ ప్రత్యేకమైనవే. మొదటి కథ ‘పార్వతమ్మ’  1955లో  తెలుగు స్వతంత్రలో వచ్చింది.   1958లో రాసిన ‘రగిలిన పగ ‘  ఆ  తర్వాత ఆవిడకే నచ్చలేదు.   కథ ఎవరికోసం , ఏ ప్రయోజనం ఆశించి రాస్తున్నామో ననే  మానసిక పరిణతితో ఉండడం వల్ల.


స్త్రీవాద కథలు
తెలుగు సాహిత్యంలో విమర్శకుల విస్మరణకు గురైన భండారు అచ్చమాంబనే తొలి స్త్రీ వాది అని ఆ రచనలను చదివిన వారెవరైనా అనక మానరు.
భండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్షమమ్మ మొదలుకొని అనేక స్త్రీ చైతన్యం కోసం, ఆమె వ్యక్తిత్వం కోసం రాసారంటే అవి ఆనాటి పరిస్తితులకి స్త్రీవాద కథలుగా చెప్పుకోవచ్చేమో .. ఆతర్వాత కాలంలో ఆచంట శారదాదేవి, రంగనాయకమ్మ, కె. రామలక్ష్మి, చాగంటి తులసి, ఆర్‌.వసుంధరాదేవి, డి.కామేశ్వరి వంటి రచయితలు ఎన్నో కథలు రాసారు. అప్పటి వరకు స్త్రీల జీవితంలో ఉన్న భిన్నకోణాల్ని, అంటే..  మాతృత్వం, వివాహం, విడాకులు వంటి అంశాలను చిత్రించారు. పితృస్వామ్య సమాజం స్త్రీలను అణచివేస్తున్న తీరును గురించి  తమ రచనల్లో చూపించారు. వైవాహిక జీవితంలోను, సమాజంలోను, ఆడవాళ్ల అణచివేతకు గల మూలాల్ని ఒక్కొక్కరు ఒక్కో తీరున అర్థం చేసుకుని, తమ కథల్లో ఆవిష్కరించారు.  మొదటి తరం రచయిత్రుల కథల్లో కుటుంబంలో, సమాజంలో స్తీ,పురుష మధ్య అంతరాలని,వివక్షను అతి సహజ విషయంగా భావించినట్లు కనిపిస్తే స్త్రీవాదకథ ఆ వివక్షను“పురుషాధిపత్యరాజకీయం గా“  గుర్తించి ఎదిరించగలిగింది. 

ఉదాహరణకి రామలక్ష్మి గారి పేపర్ టైగర్స్ కథలో సుందరి ,మూర్తి ని ప్రేమించింది .అతను పెళ్ళి చేసుకుంటానంటే నమ్మింది..అతను వేరే పెళ్లికి సిద్ధపడి ఆమెకి చెప్పకుండా వెళ్ళిపోయాడు అప్పటికే ఆమె గర్భవతి.. సుందరి అన్న ఆమెను నిలదీసి ,నానా మాటలని ,ఇంక ఉద్యోగం మానేసి ఇంట్లో వుండమంటాడు .సుందరి తిరగబడింది.ఉద్యోగం మాననంది పిల్లని కని పెంచుకుంటానంది. తల్లి తండ్రులని కూడా తనే చూసుకుంటానంది.ఈ కథ ముగింపులో రచయిత్రి “ఆ రోజు ఆ ఇంట్లో విస్తళ్ళు లేవలేదు. నిజమే..కానీ అలా శాశ్వతంగా వుండిపోదుకదా!!” అంటారు. రామలక్ష్మి గారి కథల్లో ఎక్కువ స్త్రీలు అప్పటికీ ఇప్పటికీ అనుభవిస్తున్న పరాధీనత అసహాయత ఎక్కవగా కనిపిస్తుంది. అట్లా అని ఆమె కథల్లో స్వతంత్ర వ్యక్తిత్వంతో జీవితం గడుపుతున్న స్త్రీలు లేరని కాదు.ఈ కథల్లో ఒక నలుగురు స్నేహితులు కనిపిస్తూ వుంటారు.వాళ్ళు పెళ్ళై సంసారం చేస్తున్నవాళ్లు.అయితే వాళ్ళు తమ స్నేహాన్నీ ఏళ్ళకొద్దీ కాపాడుకుంటారు.తరుచూ కలుస్తారు.కలిసి ప్రదేశాలు చూడ్డానికి వెడతారు.వాళ్ల స్వంత స్పేస్ ని హాయిగా వినియోగించుకుంటారు. ఇప్పటికీ చాలామందికి అటువంటి స్పేస్ లేదని వాపోయే పరిస్థితి వుంది. యాభై అరవైల నాటికే ఆ పరిస్థితి వుందని చెబుతాయి ఈ కథలు.  స్త్రీవాద ఉద్యమ రూపం దాల్చక మునుపే స్త్రీవాద  కథారచన చేసిన రచయిత్రి శ్రీమతి అబ్బూరి చాయాదేవి. అబ్బూరి ఛాయాదేవి కథలు స్త్రీ దృక్పథంతో మొదలై స్త్రీవాద దృక్పథంతో సంభాషించే దశ వరకూ ప్రయాణిస్తాయి. 1952లో రాసిన “అనుబంధం” మొదటి  కథ. ఈ కథలో కుటుంబంలో పురుషాధిపత్యం ఎలా ఉంటుందో, అందులోనే స్త్రీలు ఎలా ఆనందాన్ని వెతుక్కుంటారో చెప్పారు. ఆ తరువాత వైవాహిక జీవితంలోని మంచిచెడుల్ని విశ్లేషిస్తూ రాసిన కథ 1955లో “తెలుగుస్వతంత్ర”లో అచ్చయింది.

హాస్య కథలు
హాస్యకథలు రాసిన మహిళలు చాలా తక్కువ.  హాస్యకథలుగా  భానుమతీ రామకృష్ణగారి మరచెంబు, అత్తగారి కథలు  చెప్పుకోవచ్చు.  అత్తగారు గయ్యాళి అయినా , కోడలు అణగిమణగి ఉన్దేదయినా ఆమె కథల్లో హాస్యం నింపడం ప్రత్యేకత.
వసుంధర గారు రసిక రాజ తగువారము కామా ?, చిరునవ్వు వెల ఎంత ? రెండు హాస్య సంపుటిలు వేశారు.  ఆ కథలు అపరాధ పరిశోధన అనే పత్రికలో అచ్చయ్యాయి.

మనో విశ్లేషణాత్మక కథలు
జమ్మలమడుగు వనాంబ  రాసిన ఒకే ఒక కథ ”సుగుణ ఈ పొరపాటు నాదే”  1934లో ”దక్కన్‌ కేసరి” పత్రికలో ప్రచురించబడింది.  కథానాయకి సుగుణ అతి సున్నితమైన మనస్తత్వాన్ని రచయిత్రి చాలా చక్కగా విశ్లేషించిన కథ ఇది.

నందగిరి ఇందిరాదేవి కథల్లో చెప్పుకోదగ్గ కథ ‘పందెం’ .  1941లో వచ్చింది.  ఈ కథ  సరదాగా సాగిన ఇద్దరి వ్యక్తుల మధ్య మాటా, మాటా పెరిగి రెండు లక్షలు పందెం కాసుకునేదాకా వస్తుంది. వాళ్ళ మధ్య జరిగిన పందేనికి కారణం ఉరిశిక్ష గొప్పదని ఒకరు వాదిస్తే, యావజ్జీవం గొప్పదని మరొకరి వాదన. ఇద్దరి మధ్య జరిగిన పందెం. యావజ్జీవం గొప్పదని వాదించిన వాడు ఒక పది సం||లు ఒంటరిగా వుండాలి. అలా పది సంవత్సరాల కాలంలో ఎలాగూ ఉండలేడు. రెండు లక్షలు నాకే వస్తాయి. అని ఒకరనుకుంటే, పందెం నెగ్గి రెండు లక్షలు తీసుకుంటానని ఇంకొకరను కుంటారు. అయితే ఒంటరిగా వున్న వ్యక్తి గడువుకు ఒక రోజు వుందనగా ఒక కాగితం వ్రాసి వెళ్ళిపోతాడు. నాకు ప్రపంచం మీద విసుగు పుట్టింది, ఇవేవి నన్నాకర్షించవు. అప్పుడు రెండు లక్షలు గొప్పగా అనుకున్నాను. అనుభవించానని ఆనందించాను. కాని ఇపుడు అనవసరం అందుకే వెళిపోతున్నాను.  అంటూ ఆ ఇద్దరు వ్యక్తుల మనో విశ్లేషణను చక్కగా చిత్రించిన కథ.

డా.ఇల్లిందల సరస్వతిదేవి  రాసిన స్వర్ణ కమలాలు , తులసి దళాలు అనే కథ సంపుటాలు తెలుగింటి జీవనానికి అడ్డం పట్టాయి.  1943 లో పితృ హృదయం’ అనే తొలి కథతో మొదలు పెట్టి 250 వరకు కథానికలు రాశారు.  మధ్యతరగతి మనస్తత్వాలని, ఆనాటి  కుటుంబ వ్యవస్థని అందులోని ఒడిదుడుకుల్ని చక్కగా చిత్రించేవారు. కథా రచన ప్రారంభించినప్పుడు సంస్కరణోద్యమ ప్రభావం కనిపించినా తర్వాతి కథల్లో మనవ స్వభావంలో వస్తున్నా మార్పులు , శాస్త్ర సాంకేతిక పురోభివృద్ది వల్ల పెరిగే విసృఖలత్వం, క్లిస్టమయ్యే జీవితాల్ని గురించి సాగాయి ఆమె రచనలు. అవి పాఠకలోకానికి ఎంతగానో ఉత్తేజం కలిగించి, ఆలోచింప చేశాయి
ఆర్.వసుంధరాదేవి మనో విశ్లేషణాత్మక రచనలు చేసిన హేతువాద దృక్పథం గల రచయిత్రి . గాలి రధం , నీడలు కథా సంపుటాలు వేశారు . నిజజీవితంలోని కొన్ని సంఘటనలు ఆధారంగా రచనలు చేసిన రచయిత్రి ఈవిడ .  ఆచంట శారదాదేవి కథల్లో స్త్రీలలో ఉండే ఆత్మన్యూనత, అజ్ఞాత వాంఛలు మొదలైన వాటిని విశ్లేషిస్తూ రచనలు చేశారు. పగడాలు, పారిపోయిన చిలక, మరీచిక , వానజల్లు కథ సంపుటాలు వేశారు.

మనో వైజ్ఞానిక కథలు
వాసిరెడ్డి సీతాదేవిగారి కథల్లో ప్రత్యేకత గలవి మనోవైజ్ఞానిక కథలు . ప్రాయిడ్ ప్రభావంతో మనో వైజ్ఞానిక కథలు చాల  వచ్చాయి .   ఆమె రాసిన ‘మనసు గారడీ ‘ కథా  సంకలనం లో ఆత్మహత్యలు, భ్రాంతులు , కలలు  మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని మానసిక శాస్త్ర పరంగా రచనలు చేశారు

గ్రామీణ నేపథ్య మాండలిక  కథలు

 ”వలయం” ”తిరోగామి” వంటి ఆలోచింపచేసిన కథలు వ్రాసిన చాగంటి తులసి 1946 లో బాలపత్రికలో మొదటికథ వ్రాశారు. యాభయ్యవదశకంనించే పురోగామి దృక్పథంతో కథలు వ్రాస్తున్నారు. పరిమాణంలో తక్కువ అయినా గుణాత్మకమైన కథలు ఆమెవి. పధ్నాలుగు కథలతో  ”తులసి కథలు” కథాసంపుటి వచ్చింది.  ప్రసిద్ధ తెలుగు కథలెన్నింటినో హిందీలోకి ఒరియాలోకి అనువదించి వివిధ పత్రికలలో ప్రచురించారు.  తులసి విజయనగరం జిల్లా మాండలికంలో చెయ్యి తిరిగిన రచయిత. ఆమె వ్రాసిన ”ఆడదాయికి నోరుండాలి” ”చోద” రెండూ ఆ మాండలికంలో వ్రాసిన ఉత్తమపురుష కథలే. మధ్యతరగతి జీవుల నెంత బాగా చిత్రిస్తారో బడుగు జీవుల్నీ అంతే సహానుభూతితో చిత్రిస్తారామె. గుడిసెవాసులకి బుల్‌డోజర్లనించీ ఎంత ప్రమాదం వుందో ప్రకృతినించీ కూడా అంత ప్రమాదం వుందని చెప్పే కథ ”స్వర్గారోహణ”లో తన సత్తు బిందెకోసం ఇంట్లోకి వెళ్లి ముంపులో మునిగిపోయింది పోలి…వ్రాసినవి తక్కువ కథలే అయినా శిల్పంలోను వస్తువులోను తాత్వికతలోనూ గుణాత్మకమైనవి తులసి కథలు.


యశోదారెడ్డి 1951 నించే కథలు వ్రాసారని ఆమెపై పరిశోధన చేసిన సుజాత అంటున్నా,  ఏ సంపుటిలోనూ ఏ కథ కిందా అది వ్రాసి ప్రచురించిన తేదీ లేదు. మా వూరి ముచ్చట్లులో పది కథలు, ఎచ్చమ్మ కథలు లో ఇరవై, ధర్మశాలలో ఇరవై నాలుగు కథలు వున్నాయి. ఎచ్చమ్మ కథలూ, మా ఊరి ముచ్చట్లు, తెలంగాణా గ్రామీణ నేపథ్యంలో మాండలిక గుబాళింపుతో ఉండే యశోదాదేవి కథల్లో వ్యక్తికీ వ్యవస్థకి మధ్య  సంఘర్షణ, తలెత్తే సంక్షోభం, ఫలితంగా ఏర్పడే విలువలు ,  పాత విశ్వాసాలు కాలక్రమంలో కనుమరుగు కావడం అంత ఒక పద్దతిలో కనిపిస్తుంది.  ప్రాంతీయతను, స్థానికతను , కులాన్ని , మతాన్ని, సామరస్యాన్ని భిన్న పార్శ్వాలో స్పృశిస్తాయి ఆమె కథలు .   వార్తాపత్రికలో చదివిన సంఘటనలపై స్పందించి కథలు వ్రాసానని ఆమె వ్రాసుకున్నారు. 

పిల్లల కథలు
అబ్భురి ఛాయాదేవి 1955 లో  వివిధ దేశాల జానపద కథలకు తెలుగు అనుసరణ పిల్లలకోసం రాశారు . ‘అనగా అనగా పేరుతొ వచ్చింది ఆ సంకలనం. 
వసుంధర పేరుతో జొన్నలగడ్డ రాజగోపాలరావు -రాజ్యలక్ష్మి రాసిన చందమామ కథలు దాదాపు 900 అవి రాయడం ఎప్పటి నుండి మొదలయిందో తెలియదు. వీరు రాసిన కథల పాత్రలు కళ్ళముందు కదలాడతాయి.

వస్తువు – శైలి

కథావస్తువు…శైలి చూస్తే ముందుగానే చెప్పుకున్నట్లు సమకాలీన సమాజంలో ఉన్న సామాజిక నేపథ్య అంశాలే వారి కథా వస్తువులు అయ్యాయి.   వారి రచనా భాష మొదట్లో గ్రాంధికంగా  కన్పించినా దీర్ఘ సమాసాలు , కఠిన పదాలు తక్కువ. కాల క్రమంలో భాష సరళంగాను వ్యవాహరికంలోను మాండలిక పదాలతోను కనిపిస్తుంది.  కొన్ని కథలలో జీవిత సత్యాలుంటే, మరి కొన్ని  కథలు నీతి బోధించేవిగా కనిపిస్తాయి. కొన్ని కథల్లో వ్యక్తిత్వ నిర్మాణానికి పనికొచ్చేవి అయితే కొన్ని సంఘ నిర్మాణానికి ఉపయోగపడేవిగా ఉంటాయి. తొలితరం రచయిత్రుల  కథలలో సామాజిక ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తుంది.  శైలి, శిల్పం అన్ని కథల్లో గొప్పగా లేకపోవచ్చు. ఆనాటి సామజిక, రాజకీయ, సాంస్కృతిక  పరిస్థితుల్లో స్త్రీలు ముందుకొచ్చి సాహితీ సృజన చేయడమే అద్భుతమైన  విషయం.   సమాజంలోని  సాంఘిక కట్టుబాట్లు, వివక్ష,  అణచివేత, కుటుంబంలోనూ, సమాజంలోనూ ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటూ కలం అందుకోవడమే గొప్ప విషయం. తమకున్న పరిధిలో స్పందించి జీవితాన్ని అర్ధం చేసుకుని సామాజిక మార్పు ఆశిస్తూ రచనలు చేయడం చిన్న విషయం ఏ మాత్రం  కాదు.  స్త్రీల సాహిత్యాన్ని కాలక్షేపపు సాహిత్యంగా భావించి చిన్న చూపు చూసిన వాళ్ళకీ కొదువలేదు. మహిళలనుండి వచ్చే సాహిత్యం ఏ  పరిస్థితుల్లో వచ్చిందో ఆనాటి దేశ కాల పరిస్థితులు ఏమిటి, ఆ స్త్రీల కుటుంబ చైతన్యం , విద్య, ఆర్ధిక , సాంఘిక రంగాలలో స్థితిగతులు ఆమె చైతన్యాన్ని ఎంత ప్రభావితం చేసాయనే  నేపథ్యంలోంచి అనుభవాలు, అవగాహన, అవకాశాలను బట్టి వారి చైతన్య స్థాయి ఉంటుందని మనం ఇక్కడ  గమనించాలి.  వారి చైతన్య స్థాయిని బట్టే వారి కథలు , రచనలు సాగుతాయి.  ఆధునిక కథా నిర్మాతలుగా చరిత్రలో స్త్రీల పాత్ర విశిష్టమైంది . విలక్షణమైంది. తమ చుట్టూ ఉన్న మనుషులపై , సమాజంపై, సామాజిక రుగ్మతలపై అవగాహనతో , ప్రాపంచిక విషయాలను అర్ధం చేసుకుంటూ, మేధకు పదును పెట్టుకుంటూ , ఒక స్పష్టతతో , వస్తువైవిధ్యంతో, నిబద్దతతో, సామాజిక దృష్టితో కాలంతో పాటు కదులుతూ చేసిన రచనలు ఆధునిక కథా ప్రపంచాన్నిపరిపుష్టం చేస్తూ ముందుకు నడిపించాయి.   ఆనాటి చరిత్రను తమ కథల ద్వారా రికార్డు చేశాయి. తెలుగు కథా ప్రస్థానంలో తమకంటూ ఓ చిరునామా ఏర్పరచుకోవడమే కాకుండా భవిస్యత్ తరాలకి బాటలు వేసిన రచయిత్రులందరినీ స్థలాభావం, సమయాభావం వల్ల నేనిక్కడ చెప్పలేక పోవచ్చు.  కానీ,  అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నా .

వి. శాంతి ప్రబోధ

 

ఆత్రేయ

” సంపాదనే లక్ష్యంగా చూసుకునే మనుషులు ఎక్కువైన కొద్దీ వాతావరణం దుర్భరమవుతుంది. సంపాదన ముందు తక్కిన విలువలు తేలికైన నాడు జీవితం ఊపిరాడదు” – చలం

సంపాదనే లక్ష్యంగా, తేలికైపోతున్న విలువలతో ఉన్న సినిమాలు చూసి విసిగిపోయిన జనాలకు తొలకరి చినుకుల్లా ఆనందాన్ని, భవిష్యత్ పై నమ్మకాన్ని ఇస్తుంది “ఆత్రేయ “.

మనిషి ప్రకృతికి లోబడి తన అస్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అందుకు ప్రయత్నించాలి. మనిషి నిర్మించుకున్న సామాజిక వ్యవస్థ గొప్పదనపు పరంపర కొనసాగేలా ఇనుమడించే విధంగా స్నేహ శీలంగా ఉండాలి సినిమా.  కానీ, ప్రపంచీకరణ నేపథ్యంలో  మనం పుట్టిన వ్యవస్థల్లోకి  అహంకార సంస్కృతి, ఆధిపత్య భావజాలం, నిజాయితీ లేకపోవడం, హింసాయుత ప్రవర్తన, పొగరుబోతుతనం వంటి ఎన్నో అవలక్షణాలు చొచ్చుకొచ్చి తిష్ట వేస్తున్న సమయంలో చీకట్లో చిరుదివ్వెలా దూసుకొచ్చిన చిత్రం “ఆత్రేయ” .

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో విధానాల్లో పనిచేసే మార్కెట్ శక్తులకు అనుబంధాలు , ఆప్యాయతలు, మానవ విలువలు ఉండవు.  మానవ జీవన విలువలకంటే లాభార్జనే దృష్టిగా ఉంటుంది. సమాజ సంక్షేమం కంటే వ్యక్తీగత  క్షేమంపైనే శ్రద్ధ ఉంటుంది. ప్రజా జీవితానికి , భవిష్యత్ తరాల వికాసానికి  విఘాతం కలిగించే సినిమాలతో కాలక్షేపం చేస్తున్న సమయంలో వచ్చిన “ఆత్రేయ” అందరూ తప్పనిసరిగా చూడవలసిన సినిమా.

పిల్లల వ్యక్తిత్వం వికసించే సమయంలో తల్లిదండ్రుల తోడ్పాటు ఎంత అవసరమో తెల్పుతుంది. విద్యార్థుల మానసిక స్థితిని అర్ధం చేసుకునే, పట్టించుకునే ఉపాధ్యాయులు, తోటివారిని ఆత్మీయంగా ప్రేమించే వ్యక్తులు కనిపించే “ఆత్రేయ” సినిమా ఆద్యంతం మనసును తడుతుంది. తీసింది ఈ రంగంలో నిష్ణాతులు కాదు.  అంతా కొత్తవారు. అతి తక్కువ బడ్జెట్ సినిమా.
స్టార్ట్ హెల్ప్ ఫౌండేషన్ – డాట్ కామ్ ఆర్ట్స్ క్రియేషన్స్ వారి “ఆత్రేయ” పూర్తి నిడివిగల సినిమా. చిత్ర నిర్మాణం నిజామాబాదు లోనే జరిగింది. జిల్లాలోని పాటశాల విద్యార్థులు , జిల్లా కళాకారులు ఇందులో తారాగణం. అంతా కొత్తవారైనా ఎంతో సహజంగా ఉంది వారి నటన.  ఎవరికి వారు తమ పాత్రలకి న్యాయం చేశారు. డైలాగ్స్  ఇంగ్లీషులో ఎక్కువగా సాగడమే భాష తెలియనివారికి పంటికింది రాయిలా అనిపిస్తుంది.  కానీ , కథాగమనానికి అది తప్పని సరి అయి ఉండవచ్చు.
వ్యక్తులుగా మార్పుకి భయపడుతూ, వ్యవస్థని మార్చడానికి వెనుకంజవేస్తూ ఉన్నంతకాలం సమస్యలకి పరిష్కారం దొరకదు. మన ఆలోచనా సరళిలో, దృక్పథాల్లో సమూల మార్పు కోసం సభ్య సమాజం హర్షించే ఈ సినిమా మన ముందుంచిన ఈ ప్రయత్నానికి అభినందనలు. ఉత్తమ మానవసంబంధాలతో  మానవత్వ పరిమళాలను వెదజల్లే ” ఆత్రేయ ” సినిమాకి రచన, దర్శకత్వం చిలుముల శాంతికుమార్. సంగీతం శ్రీని ప్రభల.

వి. శాంతి ప్రబోధ

అనుభవం నేర్పిన పాఠం అణు కుంపటి వద్దు.. సంప్రదాయ ఇంధనమే ముద్దు

అత్యంత ఖరీదైన  అంతకంటే ఎక్కువ వినాశకరమైన 20 అణు రియాక్టర్ లను కొనడానికి భారత ప్రభుత్వం రష్యాతో ఈ మధ్యనే ఒప్పందం చేసుకుంది.   ఒక వైపు జపాన్ , జర్మనీ,స్విర్జర్లాండ్  వంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ పునః సమిక్షించుకున్నాయి . దశలవారీగా అణువిద్యుత్ ఉత్పాదన విరమించుకుంటున్నాయి.  ప్రత్యామ్నాయ మార్గలవైపు దృష్టిసారించాయి.  కారణం 1986లో రష్యాలోని చెర్నోబిల్ లోనూ, 2011 లో జపాన్ పుకుషిమా లలో జరిగిన దుర్ఘటనలే .. అందువల్ల పెల్లుబికిన ప్రజా వ్యతిరేకతే. అదంతా ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకీ తెలుసు. మన ప్రభుత్వాధినేతలకు తెలియకుండా ఉంటుందా ..?! అలా అనుకోలేం కదా .. అయితే, చేతి చమురు వదిలించుకుంటూ వినాశకరమైన అణు రియాక్టర్ లవైపే ఎందుకు మొగ్గు చూపుతున్నాం ..?  అణు విద్యుత్ కేంద్రాల పట్ల మన దేశ ప్రజలూ వ్యతిరేకిస్తున్నారు. వాటి పర్యవసానం ప్రజల జీవనాన్ని, పర్యావరణాన్ని, జీవావరణాన్ని ఎంత చిన్నాభిన్నం చేస్తుందో చూస్తూ ఎందుకు ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నాం ..?!  విద్యుత్ అవసరాలు తీర్చుకోవడం కోసం అని ఏలికలు చెప్పేమాట .. అంతకు మించి ఏమైనా ఉందా …???

రోజు రోజుకీ విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నమాట కాదనలేని వాస్తవం. విద్యుత్ లేని జీవితాన్ని ఊహించలేం.  గత అక్టోబరులో హుదుద్ తుఫాను భీభత్సం కారణంగా విచ్చిన్నమైన విద్యుత్ వ్యవస్థ వల్ల పది రోజులకు పైగా విశాఖవాసులు చీకట్లో మగ్గాల్సి వచ్చింది. పరిశ్రమలు నెలరోజులకు పైనే పడకేశాయి. కారణం విద్యుత్ సరఫరా లేకపోవడమే. ఆ సమయంలో వారు పడిన ఇబ్బంది , అసౌకర్యం అందరికీ తెలిసిందే.  ఇంటా బయటా ఏ పని చేయాలన్నా విద్యుత్ కావలసిందే. ఇక చీకటి పడితే చాలు ఇంట విద్యుత్ దీపం వెలాగాల్సిందే .. ఆ విద్యుత్ లేకపోతె కాలం స్తంభించి పోయినట్లు ఉక్కిరిపిక్కిరి అవుతాం.  విలవిలలాడిపోతాం. మన మెదళ్ళు మదించి కనుగొన్న విద్యుత్ మనని అంతగా బానిసను చేసేసుకుంది.

మన విద్యుత్ అవసరాలు తీర్చుకోవడానికి మనం ఎక్కువగా ఆధారపడేది థర్మల్ విద్యుత్ , జలవిద్యుత్, అణువిద్యుత్ లపైనే . , ఆ తర్వాతే ప్రత్యామ్నాయ విద్యుత్  విధానాల పైపు చూస్తున్నాం.  మనం ఉత్పత్తిచేసే సాంప్రదాయేతర విద్యుత్ మానవాళికి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ కీడు చేస్తుందన్న విషయాన్ని విస్మరిస్తున్నాం.  ఆ విషయాల్ని తొక్కి పెట్టేస్తున్నాం.  జరిగే కీడు గురించి ఆలోచించే వారిని నిర్బంధాలకు గురిచేయడం , కేసులు పెట్టి హింసించడం పరిపాటి అయిపొయింది.   ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చడం కోసం, దేశ ఇంధన అవసరాలు తీర్చడం కోసం అణువిద్యుత్ కేంద్రాలు,  వందలాది థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు జరిగిపోతున్నాయి.  ప్రజల అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాని ఎవరూ కాదనలేరు.  కానీ, ఆ క్రమంలో జరిగే నష్టం గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత అవసరం ప్రభుత్వం పైనే ఉంది. దాన్ని విస్మరిస్తే ఎలా..?  నిప్పు ముట్టుకుంటే కాలుతుందని చిన్న పిల్లలకి జాగ్రత్తలు చెప్తాం. దాని దగ్గరకు వెళ్ళ వద్దనీ, దానితో ఆటలాడ వద్దనీ నేర్పుతాం. అలాంటిది పెద్దలే అణు కుంపటి వెలిగించి ప్రజల ప్రాణాలతో , ప్రకృతి నియమాలతో చెలగాటమాడతామంటే … కళ్ళు  చెవులూ మూసుకుపోయి,మెదడు మొద్దుబారిపోయి ప్రవర్తిస్తోంటే .. ఎలా ..ఎలా .???

అణు విద్యుత్ కేంద్రాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల ఎంత నష్టమో క్లుప్తంగా చూద్దాం.

అణువిద్యుత్ కేంద్రాల్లో ఉండే అణు ధార్మిక ప్రభావం , ఆ కేంద్రాల్లో ప్రమాదాలు జరిగితే ఉండే తీవ్ర ప్రభావం , జనజీవన వ్యవస్థలపై , పర్యావరణంపైనా ఏంతో ఎక్కువ ఉంటుంది.    ఎప్పుడో 1986 లో జరిగిన చెర్నోబిల్ ప్రమాదం రెండులక్షలపైగా  ప్రాణాలు తీసింది. ఆ ప్రమాదం వాళ్ళ అణుధార్మిక ప్రభావం 950 మైళ్ళ వరకు ఉంది. ఆ పరిధిలోని వ్యవసాయ భూములు శాశ్వతంగా బీడులైపోయాయి. ఒకవేళ ఎక్కడన్నా పండినా ఆ వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద కూడా పనికి రాకుండా పోయాయి.  3. 5 లక్షల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు.  ఇవన్నీ ప్రపంచానికి తెలుసు. అది జరిగి చాలాకాలం అయిందనుకున్నా .. 2011 మార్చి 11న  జపాన్ లోని పుకుషిమాలో జరిగిన ప్రమాదాన్ని మనమంతా టివి ల ముందు కూర్చొని చూశాం. ఆ తర్వాతే జపాన్ , జర్మనీలు తన పంథా మార్చుకున్నాయి. అణువిద్యుత్ వద్దని ప్రకటించాయి. అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ మార్గాలవైపు అడుగులు వేస్తున్నాయి. కారణం .. అణు ధార్మిక కాలుష్యాన్ని శుద్దిచేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చవడమే కాకుండా 40 నుండి 50 ఏళ్ల వరకూ ఆ శుద్ధి కార్యక్రమం జరిగినా అది పూర్తిగా శుద్ధి కాకపోవచ్చు.  చెర్నో బిల్ ప్రమాదం జరిగి 28 ఏళ్లయినా ఇప్పటికి ఆ కాలుష్యాన్ని పూర్తిగా తొలగించలేకపోయారు అంటే పరిస్థితి అర్ధమవుతుంది కదా…   అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదాలే కాకుండా అణు వ్యర్ధాల వల్ల కూడా ఎంతో ముప్పు పొంచి ఉంది. అయినా వాటి వైపు మనం ఎందుకు చూడడం లేదు ..? ఎందుకు ఆలోచించడం లేదు ..?  బహుళ జాతి కంపెనీల ఒత్తిడికి లొంగి ఇతర దేశాలనుంచి అణు రియాక్టర్లు , వాటికి కావలసిన ఇంధనం అధిక ధరలకు కొంటూ ఆ భారం ప్రజలపై మోపడం జరుగుతోంది .

థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా సురక్షితం అయినవి కాదు. ఈ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి బొగ్గు మండిన్చినప్పుడు వెలువడే బూడిదలో యురేనియం, థోరియం వంటి విషపదార్ద్తాలు వాటి అణుధార్మిక ప్రభావానికి గురవుతున్నారు. వివిధ కాన్సర్ల బారిన పడుతున్నారు.

సమాజ విద్యుత్ అవసరాలు తీర్చడం కోసం మనకి ప్రత్యామ్నాయ మార్గాలు లేవా ..?అణు విద్యుత్ కంటే , థర్మల్ విద్యుత్ కంటే ఎంతో భద్రమైన, విదేశీ ద్రవ్య వినిమయం లేకుండా , ఆర్ధిక లోటు లేకుండా ఉండే ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి.ప్రకృతి మనకు ప్రసాదించిన వరం సౌరశక్తి. వాయు శక్తి. వీటిని ఎంత వినియోగించినా తరిగిపోయేవి , క్షీణించిపోయేవి కావు. ఎంతైనా వినియోగించుకోవచ్చు. ఎంతైనా ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే గాలి, నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్  కంటే సూర్యరశ్మి ద్వారా వచ్చే విద్యుత్ మన అవసరాల్ని ఎక్కువస్థాయిలొ తీర్చగలదు.  సూర్యుడు మనకు ప్రసాదించే కాంతిని , వేడిని , రేడియో తరంగాల్ని  మనం సంపూర్ణంగా నినియోగించగలిగితే మనం వేరే ఇతర ఇంధన వనరులపై ఆధారపడాల్సిన అవసరమే లేదు.  దీని వల్ల  పర్యావరణ కాలుష్యము ఉండదు. అందుకే వివిధ దేశాలు సౌరశక్తి ని ఉపయోగించుకుందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.
సూర్యశక్తి తో ఒక చదరపు మితరుకి వెయ్యి వాట్ల విద్యుత్ ఉత్పత్తి చెయ్యొచ్చునట.  సౌర శక్తి వినియోగంలో చైనా ముందుంది.  సూర్యరశ్మి తక్కువగా ఉండే దేశాలైన ఇజ్రాయిల్ , జపాన్ , జర్మనీ , ఇటలీ ,స్విడ్జర్లాండ్, పోర్చుగల్ , స్పెయిన్ , అమెరికా తదితర దేశాలన్నీ సౌరశక్తి వైపు అడుగులేస్తోంటే మనమ్.. పుష్కలంగా ఉన్న సూర్య రశ్మిని ఉపయోగించుకునేందుకు మీన మేషాలు లెక్కపెట్టుకుంటూ ఉన్న ఆర్ధిక వనరుల్ని ఖర్చు చేసేసుకున్తున్నాం.  సౌరశక్తి వినియోగానికి   ఏమి చర్యలు తీసుకుంటున్నాం ..?   అనుభవాల ద్వారా పెట్టుబడిదారీ దేశాలు అణు ఇంధన ఉత్పత్తి వదిలించుకుంటుంటూ  అణు సాంకేతిక పరిజ్ఞాన్ని వ్యాపారం చేసుకుంటుంటే  మనం గుణపాటం నేర్చుకోకుండా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాం ..?

తరిగిపోయే సాంప్రదాయేతర వనరులపై ఆధారపడే కంటే , వాటి ద్వారా తలెత్తే సమస్యలని అనుభవించే కంటే సహజసిద్దంగా లభించే సాంప్రదాయ వనరులపై దృష్టి మళ్ళించాల్సిన అవసరం ఎంతో ఉంది.   సౌర విద్యుత్, పవన విద్యుత్,. ప్రకృతిలో సహజంగా ఉన్న వనరులవి . వాటి సహజత్వానికి ఏ మాత్రం భంగం కల్గించకుండా సాగే ప్రక్రియలో ఉత్పత్తి అవుతుంది. జనజీవనానికి , జీవావరణానికి , పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కల్గించని సమగ్ర విద్యుత్ విధానాన్ని రూపొందించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.  అనుభవం నేర్పిన పాఠాలతో ఆలోచించి అడుగులువేయాల్సిన అవసరం నేడు ఎంతో ఉంది.

వి. శాంతి ప్రబోధ
ప్రజాతంత్ర వార పత్రికలో ప్రచురణ అయింది

పదునెక్కాల్సిన చైతన్యం

                                                                  
పచ్చని వరి పొలాల్లో కాషాయం రంగులో నీరు పై మడి  నుండి కింది మడికి  జలపాతంలా  దూకుతూ వాగులూ వంకల్లోకి వడి వడిగా ఉరుకుతూ .. బిర బిరా పరుగులతో పొంగి పొర్లుతూ .. ఈ వాతావరణం .. ఈ నీటి పొంగులాగా, వారి  హృదయాలూ ఆనందంగా , ఉత్సాహంగా ఉరకలేస్తూ . 
 
ప్రకృతి అందాల్ని ప్రతి క్షణం  ఆస్వాదిస్తూ మైమరచిపోతున్నవిజయని, ఒళ్ళు విరుచుకున్నట్లు ఆకాశమంతా పరుచుకుని దిశలు మార్చుకుంటూ ప్రయాణిస్తున్న దట్టమైన నల్లటి మేఘాల్ని మార్చి మార్చి గమనిస్తూన్న  వినయ  ‘అక్కా ఇన్ని సంవత్సరాలుగా మనం ఇవన్నీ మిస్ అయినం కదా.. ‘
 
ఆకాశానికి తూట్లు పడిందా అన్నట్లు దారపోతగా వర్షం వాళ్లు  బయలు దేరినప్పుడు ఇంత వర్షం లేదు.  ఏదో కాస్త జల్లు పడుతోంది అంతే .. అప్పటికే వర్షం పడతాంది గద ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్ళవచ్చని అమ్మానాన్న అన్నారు.  అయినా మారం చేసి మరీ  బయలుదేరారీ అక్కా చెల్లెళ్ళు.   కారణం, నాన్న మనసు ఎక్కడ మారిపోతుందోనన్న భయం, రాక రాక వచ్చిన అవకాశం ఎక్కడ జారిపోతుందోనన్న సందేహం నిండిన వారి మనసు తల్లిదండ్రుల మాటని కాదనేలా చేశాయి.  అందుకే కాలయాపన చేయకుండా బయలుదేరేశారు.  ఇంత వర్షం వస్తుందనుకుంటే అసలు పంపే వారే కాదేమో ! మనసులో  అనుకుంది   చెల్లెలు  మాటలు చెవిన పడని  విజయ 
 
ఇది కలా  నిజమా .. నాన్న ఒప్పుకోవడం .. తాము బస్ ఎక్కడం .. చేయి గిల్లి చూసుకుంది. పక్కకు తిరిగి చెల్లి చెయ్యి గిల్లింది విజయ . కెవ్వు మంది వినయ  
 
అంటే నిజమే .. నిజ్జంగా నిజమే .. కల కాదు.  ఎల్లారెడ్డి ఇంకా 24 కి. మీ అని  మైలు రాయి దాటి పోయింది. అంటే దగ్గరవుతున్నాం .  అవును తమ ఊరికి దగ్గరవుతున్నారు.  బస్ ఎక్కి బయలు దేరాక దగ్గరవక  ఏమవుతుంది.   నవ్వుకుంది తనలోనే.  
 
ఆ  ఊరు వదిలి, ఆ  గాలి వదిలి , ఆ  నేల, ఆ పచ్చదనం  వదిలి మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత .. తాము పుట్టి పెరిగిన తమ  ఊరిలో అడుగు పెట్టబోతున్నామన్న ఆనందం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఆ ఇద్దరిని.  తమ ఊళ్లోకి తమ వాళ్ళ దగ్గరికి  మరి కొద్ది  సేపట్లో .. మనసులో తెలియని ఉద్వేగం , ఉత్సాహం దాన్ని పట్టడం వారి  తరం కావడం లేదు.  చెల్లెలి భావాలేమిటోననుకొని అక్క ఆమె కేసి తిరిగింది.  కిటికీ పక్కన కూర్చొని ప్రకృతి అందాల్ని కళ్ళ నిండా నింపుకుంటున్న ఆమె అక్క తన వైపు చూడడం చూసి 
 
‘అక్కా నాన్న ఎందుకిలా చేశారు ‘ మనసులో ఎప్పటినుండో తలెత్తే ప్రశ్నని ఒక్కసారే బాణంలా వదిలింది. 
 
‘ఏం జేసాడే ?’ అర్ధం కానట్లుమొహం చిట్లిస్తూ .. ఆలోచనగా  విజయ
 
‘అదేనే ఇంత అందమైన మన ప్రాంతానికి దూరం చెయ్యలే ..?’ కదిలిపోతున్న పల్లెల్ని చూస్తూ తమ పల్లెను తలపోస్తూ వినయ 
 
‘కొత్తగా అడుగుతవేందే ..?’ కొంచెం విసుగ్గా విజయ 
 
‘అదేనే , చిన్నత్తమ్మ వేరే కులపోడిని చేస్కుంటే ఏమైతది. అతను మనిషి కాదా .. ?  ఇట్ల రాత్రికి రాత్రి పుట్టి పెరిగిన ఊరుని ఎడమ కాల్తో తన్ని దొంగలెక్క  పోవుడేనా.. ఆ పట్నంలో ఏమున్నదని? ‘ నిరసనగా వినయ 
 
‘ఏందే పెద్ద పెద్ద మాటలస్తున్నాయ్. నాన్న , పెద్ద నాన్నల ముచ్చట నీకు తెలియనిదా .. వాళ్ళంతా కులగౌరవం , కుటుంబ గౌరవం అని పాకులాదేటి పాతకాలం మనుషులు .  చెల్లి ఎవడితోనో లేచిపోయిందని తెలిస్తే లోకం ఏమనుకుంటదోనని భయం.   ఈడోచ్చిన చెల్లెని అన్నలు పట్టించుకోలేదు,  అందుకే అది ఎవడితోనో లేచిపోయింది అనుకుంటారని  ఊళ్లో తలెత్తుకోలేక పారేల్లిపోయారు.  కానీ, కన్నతల్లిలా పెంచిన ఊరు మీద మమకారం లేక కాదు.  వాళ్ళకు మనకన్నా ఎక్కువ ఉంటది. వాళ్ళు తమ జీవితం ఇక్కడే అనుకున్నవాళ్ళు.  ఈ మట్టితో , ఈ గాలితో , ఈ నీటితో , చెట్లూ చేమలతో, ఆకుఅలములతో బంధం పెనవేసుకుపోయినవాళ్ళు . ఆ బంధాల్ని , అనుబంధాలని తెంపుకొని  అప్పటికప్పుడు అంత పెద్ద నిర్ణయం తీసుకొని పోయారంటే వాళ్ళెంత యాతన పడ్డారో .. ఎంత నలిగిపోయారో .. ‘ చెల్లి ఆలోచనలు తప్పు అన్నట్లుగా వినయకేసి చూస్తూ చెప్పింది విజయ 
 
‘ఏమో అక్క, నాకయితే ఎన్నో సార్లు మనూరికి పోయి నా దోస్తులని చూడాలని ఉండే.  ధర్మారం ల ఉన్నప్పుడు ఒక్కసారి పోయి వస్తే అని చానసార్లు అనుకున్న. కాని నాన్నకు తెలిస్తే మల్ల నా మొహం చూడడేమోనని భయమయి ఆగిన ‘ వినయ మనసులోమాట చెప్తూ అక్క మోహంలో కలిగే భావాలని చదవడానికి ప్రయత్నిస్తూ 
 
‘ఇంకా నయం, నాన్న సంగతి తెలిసీ అంత ఆలోచన చేశావా ..? నువ్వు గనక అట్లా చేసుంటే నువ్వనుకున్నట్లే చేస్తుండే.  పట్టుదల గల మనిషి.  ఆయన పెద్దిరికానికే  విలువ కావాలనుకుంటాడు. ఒకర్ని ఉత్తగా ఏమనడు. తనను ఎవడన్న అంటే మాట పడదు.  నువ్వు చెప్పకుండ అట్ల జేసుంటే నాకు, నా పెద్దిరికానికి ఈసమంత విలువ ఇవ్వని దానికి ఈ ఇంట్ల జాగ లేదు అంటుండే. లేకుంటే నువ్వన్నట్టు ఉంటుండే.  ఆయనని ఎప్పుడైనా ఒప్పిచ్చుకోవాలే  ‘ భయంగా కళ్ళు పెద్దవి చేసి చెప్పింది తండ్రి మనసు తెలిసిన  విజయ 
 
‘అత్తమ్మ కంటే నాన్నోల్లకు మంది మాటలే ఎక్కువనా.. ? అత్తమ్మను తీసుకపోయినోడు ఆగం చేస్తే ఆమెకెవడు దిక్కు ..?’ చిన్నప్పుడు తననేంతో ముద్దు చేసే చిన్న మేనత్తను తలచుకుంటూ వినయ. 
 
చిన్న మేనత్త ఎవరితో వెళ్లిపోయిందో, ఏమయిందో, ఎక్కడ ఉందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.  వెళ్ళిన రోజు రాత్రి తనకు నచ్చిన వాడితో వెళ్లిపోతున్నానని రెండు వాక్యాలు రాసిన కాయితం పెట్టింది అంతే. అంతకు మించి ఏ సమాచారమూ లేదు ఎవరి దగ్గరా.  వినయ అన్నదీ నిజమే కదా ఆలోచిస్తోంది విజయ
 
ఇన్నేళ్ళలో వాళ్ళ అమ్మ , నాన్న మళ్లీ   సొంత ఊరు దిక్కు  చూడలేదు.  ఊళ్లో ఉన్న ఇల్లు పొలం అన్ని అవతలి బజారులో ఉండే విజయ మేనత్త భర్త చూసుకుంటున్నాడు.  వాళ్లకు పిల్లలు లేరు.  తమకు బుద్ది  పుట్టినప్పుడు పట్నం వెళ్లి తమ్ముడి కుటుంబాన్ని చూసి వస్తుంది మేనత్త మణెమ్మ .

 వీళ్ళలాగే వీరి పెద్దనాన్న కూడా అదే రోజు ఊరు విడిచాడు.  విజయ వాళ్ళ కుటుంబం ఊరువిడిచి రాష్ట్ర రాజధాని నగరంలో అడుగు పెడితే వారి పెద్దనాన్న కుటుంబం జగిత్యాల దగ్గరలో ఉన్న మోహనరావుపేటకు లోని అత్తగారింటికి చేరింది.  ఆ తర్వాత కొంత కాలానికి తన పొలం అమ్ముకున్నాడు. 
 
ఇల్లూ వాకిలీ ఉన్నయ్. పొలం పుట్రా ఇంకా వాళ్ళ పేరనే ఉండడంతో ఆధార్ కార్డు స్వంత ఊరు పేరిటనే తీసుకున్నాడు విజయ తండ్రి.   రేషన్ కార్డ్ కాపీ, ఓటర్ కార్డు కాపీ హైదరాబాదులో చూపి అక్కడి నుంచే ఆధార్ కార్డ్ తీసుకున్నారు.  ఊర్లొ మణెమ్మ ఉండడంతో ఇల్లు , పొలంలకు  ఏ ఇబ్బంది లేకుండా పోయింది.  
 
విజయ కమలానెహ్రు పాలిటెక్నిక్ కాలేజిలో  ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా పూర్తి చేసింది. ఐ సెట్ ఎంట్రెన్స్ లో మంచి మార్కులు తెచ్చుకుని జె.ఎన్.టి. యు. కాంపస్ లో  సీటు సంపాదించింది.  ఇంజినీరింగ్ రెండవ సంవత్సరంలో జేరబోతోంది.  వినయ 10వ తరగతి పూర్తిచేసింది.  నిజామాబాద్ దగ్గరలోని ధర్మారంలోని సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాటశాలలో ఆరవ తరగతి నుంచి పది వరకూ చదివింది.  మంచి మార్కులు రావడంతో బాసరలోని ట్రిపుల్ ఐటిలో సీటు వచ్చింది.  మరో వారం పది రోజుల్లో ఇద్దరూ కాలేజీల్లో జేరాలి.  అందుకే తండ్రి మీద వత్తిడి తెచ్చి తమ ఊరికి ప్రయాణమయ్యారు అక్కాచెల్లెళ్లు .   వారి తండ్రికీ తమ ఊరు వెళ్లాలని మనసు ఉవ్విళ్ళూరుతున్నా తన కోరికను అదిమి పెట్టేశాడు. 
 
చిన్నప్పటి దోస్తు రాజేశ్వరి ఏమి చేస్తోందో .. ఆమెకు పెళ్లి అయిందని అప్పుడెప్పుడో అత్తమ్మ  చెప్పిన గుర్తు .  అత్తమ్మ  రమ్మని చాలా సార్లు పిలిచింది.  కానీ నాన్న పంపలేదు.  ఇప్పుడు ఆమె  మా కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు విజయ ఆలోచనల్లో ఉండగా సెల్ ఫోన్ మోగింది. 
 
అవతల్నించి ‘ఏడి దంక పోయిన్రు ‘ తండ్రి 
‘అక్కా మహ్మద్ నగర్ దాటేసాం.  నిజాంసాగర్ వచ్చేస్తోంది ‘ సంతోషంగా అరిచినట్లు చెప్పింది వినయ
‘దగ్గరకోచ్చేసినం ‘ విజయ 
‘మామ బస్సుకాడనే ఉన్నడు . ఉంటమరి ‘ అని చెప్పి పెట్టేశాడు. కొద్ది క్షణాల్లో బస్సు ఆగింది.  
 
బస్సు దగ్గరికి వీళ్ళ కోసం వచ్చి ఎదురు చూస్తున్న వాళ్ళ మామ మల్లేశం  బస్సు ఆగడం ఆలస్యం తలుపు దగ్గరకు వచ్చి నుంచున్నాడు.  దిగుతున్న విజయ చేతిలోని బాగ్ అందుకొన్నాడు.  చుట్టూ పరికించింది వినయ.  
 
బస్టాండ్ ఏమి మారలేదు .  అప్పట్లానే .. గుంటలు , రాళ్ళు కంకర తేలి .  ఆ గుంతల నిండా వర్షపు నీళ్ళు.  అసలు కాలు ఎక్కడ వేస్తే ఏ గుంటలో అడుగు పడుతుందోనని జాగ్రతగా మామ వెనకే వీళ్ళు .  అప్పటికి వాన కొద్దిగా  ఒరుపిచ్చింది.  సన్నని తుంపర పడుతూ .  బస్టాండు బయట ఉన్న ఆటో మాట్లాడి వాళ్ళని ఎక్కించి బావమరిది గంగాధర్ కి ఫోను చేసి పిల్లలు క్షేమంగా చేరారని చెప్పాడు. ఆ వెనకే సైకిల్ పై బయలుదేరాడు మల్లేశం.  
 
ఊళ్ళోకి అడుగు పెడుతుంటే వారిలో అనిర్వచనియమైన ఆనందం.  అప్పటివరకూ వర్షానికి తడిసి ముద్దయిన ఊరు కడిగిన ముత్యంలా .. నీరెండలో మెరిసిపోతూ .. పచ్చని చెట్లు చేమలు తలలూపుతూ ఆహ్వానం పలుకుతూ 
 
పిట్టగూళ్ళ లాంటి ఇళ్ళు .. ఇరుకు సందులు గొందులు వదిలి తమ ఊరికి రావడం స్వేచ్చా లోకంలోకి .. తమదైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లుగా వాళ్ళు .. ఆటోలోంచి ప్రతిదీ పరిశీలిస్తూ అప్పటికి ఇప్పటికి మార్పు బేరీజు వేస్తూ .. అక్కాచెల్లెళ్లు 
 
ఊళ్లోకి అడుగుపెడుతుంటేనే ఊరి మొదట్లో వెలిసిన తాటి చెట్లతో పోటీపడే సెల్ టవర్ , గులాబీరంగు జండాలు, గులాబీ నేతల ఫొటోలతో కట్టిన బానర్ల వెనుకనుండి తొంగిచూసే ఇళ్ళు.. కొన్ని గుడిసెలు స్లాబ్ ఇళ్ళుగా మారాయి. వాటికి ఎరుపు, తెలుపు,  ఆకుపచ్చతో ఉన్న జండా రంగులు జండా లాగ తలపైన వేసి ఉన్నాయి.    గుంతలు ఉండే మట్టిరోడ్లు కొన్ని సిమెంట్ రోడ్లుగా మారాయి. కొన్ని ఇళ్ళ మీద  డిష్ లు  అంతకు మించి పెద్ద మార్పేమీ లేదు అనుకొంటుండగా  ఇల్లు రానే వచ్చింది. ఆటో ఆగగానే వాకిట్లో పూల వాన కురిపించే తోక మల్లె చెట్టు కోసం వెతికాయి విజయ కళ్ళు.  ఉహూ .. కనిపించలేదు.  ఆ పూలను తనూ, పెదనాన్న పిల్లలూ అత్తమ్మ  ఇంటికి వచ్చి పోటీలుపడి ఏరుకోవడం, పొడవాటి ఆ కాడలతో జడలాగ అల్లి జడలో తురుముకోవడం, పూరేకును నలిపి నాలుకపై పెట్టి ఊదితే అది బుడగలాగా ఉబ్బడం దాన్ని నుదురుకేసి కొట్టుకుని ఆనందించడం  గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంది.   కూన పెంకతో కట్టిన పాతకాలపు ఇల్లు. మట్టి గోడలు, శాబాత్ రాళ్ళు పరచి కొంత, ఎర్ర మట్టితో అలుకు పూత చేసి కొంత ఉన్న ఇల్లు చూసి ఏమి మారలేదు అనుకుంది మనసులో. 
 
‘అయ్యో తోక మల్లె చెట్టేది? ‘ అప్పటివరకూ ఆటోలోనుండి సెల్ ఫోన్తో ఫోటోలు తీస్తూ వఛ్చిన వినయ ప్రశ్న 
 
‘ఓ అదా ..? ఊకె ఆకిట్ల పూలు, ఆకులు రాల్తున్నయ్.  నూకే  ఓపిక లేక  ఎన్నడో కొట్టిపిచ్చిన ‘ చెప్పింది సాదరంగా మేనకోడళ్ళని ఆహ్వానించిన మణెమ్మ. 
 
‘అయ్యో ‘ మనసులో ఉన్నది పైకే అప్రయత్నంగా విజయ 
 
‘ఏమైంది ‘ మణెమ్మ, వాళ్ళాయన మల్లేశం ఒకేసారి కంగారుగా 
 
‘ఏమి లేదులే ‘ అంది నీళ్ళ గాబు దగ్గరలో ఉన్న నాలుగు కనకాంబరం మొక్కలూ, గులాబి అంటూ చూస్తూ 
 
‘ఎప్పుడు బయలు దేరిన్రో  ఏమో .. ఏం తిన్నరో ఏమో కాళ్ళు కడుక్కొని రాన్రి.  తిన్డురు ‘ అంది వాళ్ళు వచ్చేసరికి వంట సిద్దం చేసి ఎదురుచూస్తోన్న మణెమ్మ 
 
‘రాంగ రాంగ కౌడిపెల్లి కాడ మక్క బుట్టలు కాల్చి అమ్ముతాంటే కొనుక్కు తిన్నాం ‘ విజయ 
 
‘అబ్బ ! అవి ఎంత కమ్మగున్నయ్యో .. హైద్రాబాదుల నేనెప్పుడు అంత కమ్మటి మక్క బుట్ట తినలే ‘ వాటి రుచిని గుర్తుకు తెచ్చుకుంటూ వినయ. ఆమె మాటలకు అంతా నవ్వుకున్నారు  
 
భోజనాలయ్యే సరికి మబ్బు తెరలు తెరలుగా విడిపోతూ .. పలుచని ఎండ నెమనెమ్మదిగా పరుచుకుంటూ.. బంగారు వర్ణంలో ఎండ చెట్లపై, మొక్కలపై పడి వింత అందాలు కుమ్మరిస్తూ .. దూరంగా ఆ కొండల మధ్యలోంచి ఏడురంగుల ఇంద్రధనస్సు .. అద్భుతంగా ఉంది అటు చూడు అంటూ ప్రకృతిని ఆస్వాదించే విజయ వినయకి చూపుతూ . 
 
‘అద్భుతంగా కాదక్కా అత్యద్భుతం ఆ దృశ్యం ‘  వినయ.  చేతిలోఉన్న ఫోన్ లోని కెమెరాలో ఆ దృశ్యం బంధిస్తూ విజయ 
 
‘వాన తగ్గినంక ఇట్ల హరివిల్లు వస్తది చానమాట్లు ‘ మణెమ్మ 
 
‘అత్తమ్మా మా ఇంటికి పోయి  చూసోద్దామా ‘ గారాలు పోతూ వినయ 
 
‘నాకూ మా ఇల్లు ఎట్లా ఉన్నదో చూడాలనుంది ‘ విజయ అత్తకేసి తిరిగి 
 
‘పోదం ఉన్డున్రి , పిల్లి గినచ్చి పాలు పెరుగు ముట్ట గిల. పోయి తనబ్బిల  పెట్టొత్త ‘ అంటూ మణెమ్మ లోనకి వెళ్ళింది. 
 
‘అత్తమ్మా గప్పుడు మేము ఉండంగనే గ్యాసు పోయ్యిచ్చున్రు గద. కట్టెల పొయ్యి మీద వండుతున్నవేంది.’ ఇంటికి ఈశాన్యం మూలకు వంటకోసం వేసి  ఉన్న పందిరిలోని కట్టెల పొయ్యి చూసిన వినయ ప్రశ్న 
 
‘  ఆ  ఇచ్చిన్రు కానీ గ్యాసు ఊకె అస్తదా .. దానికి పన్నెండు పదమూడు నూర్లు గట్టాలే.  అటెనుక నాల్గొందల యాబై గ్యాసు బుడ్డికి పట్టుకొని తతిమ్మాయి మన కాతల ఎస్తరట.  మున్డుగల సేతిల చమురు ఉండాలె  గద బిడ్డా ..  ఏడికెల్లి తెచ్చి వేడ్తం’ మొహంలో ఆ భారం ప్రతిఫలింప చేస్తూ మణెమ్మ 
 
‘గుట్టకు బోయి అప్పటి లెక్క కట్టెలు బీ తేనిస్తలేరు .  జంగ్లాతోల్లు పట్టుకొని జుర్మానాలు ఎయ్యవడ్తిరి.  ఆ దండుగులు కట్టే దానికంటే గ్యాసుబుడ్డి కొనుడే నయం’  తోడుక్కున్న షర్టు తీసి గోడకున్న వంకికి తగిలిస్తూ  మల్లేశం 
 
‘తానం చేసేతందుకు ఉడుకు నీల్లకోసమన్న కట్టెల పొయ్యి పెట్టవడ్తది ..   అదిసరె గని.. నడురి పోదాం ‘ అని బయలు దేరింది మణెమ్మ 
 
‘గల్లిలన్ని బురద బురద అయినయ్. జర చూస్కొని నడున్రి బిడ్డా ‘ కాసేపు పడుకుందామని పక్కకున్న ప్లాస్టిక్ నులక మంచం వాలుస్తూ మేనమామ
 
‘అట్లనే మామ ‘ వినయ ఆ వెనకే విజయ మేనత్తను అనుసరిస్తూ 
 
‘గా కుమ్మరి రాములు కొడుకు నారాయణ ఇల్లు ఓ మూల కూలిపాయే , ఎన్నటిదో  తాతలనాటిది గాపోద్దా .. గీ పోద్దా  అన్నట్టుండే .. సంటిపోరితోని ఆ ఇంట్ల ఎట్ల సక్కవెడతరని నేనే సెప్పిన, నా తమ్మునిల్లు కాడువడున్నది. మంచిగ జేసుకొని ఉంటనంటే ఉన్డున్రి అని.   అట్లనే ఉండవట్టిరి యాడాది కెల్లి.  ఇంకొక కమ్రల ఇంకోల్లున్నరు.  ఆల్లే కరెంటు బిల్లు కట్టుకుంట ఉన్నరు. ఇల్లు మంచిగ వెడ్తున్నరు ‘ నడుస్తూ చెప్పింది మణెమ్మ 
 
‘నేను మనింట్లనే పుట్టిన గద ‘ మేనత్త కేసి చూస్తూ  వినయ.
‘ఆ..  అవునే.., ఇంక నెలలు నిండలే. మీ అమ్మ తల్లిగారింటికి పోతననుకున్నది. అంతల్నే ఆగమాగం పుడ్తివి ‘ వినయ కేసి చూసి నవ్వుతూ మణెమ్మ 
 
‘అవునత్తమ్మా ఇది ఆగమాగం పిల్ల ‘ చెల్లిని ఉడికిస్తూ చిలిపి చూపులతో  విజయ. 
 
ఇంటికి తాళం వేసి ఉంది.  నారాయణ భార్య ఆ రోజే పుట్టింటికి వెళ్లిందట. మరో కుటుంబము వారూ  ఆ సమయంలో ఇంట్లో లేరు.  ఇల్లు వాకిలి శుభ్రంగానే ఉన్నాయి. ఇంటి ముందు ఐదారు బంతి మొక్కలు, ఒక మందారం మొక్క కొత్తగా నాటినట్లున్నారు. అంతకు మించే వేరే ఏమి కనిపించలేదు.   ఇల్లు చూసి చేతిలోని మొబైల్ తో ఫోటోలు తీసుకుని వెనుదిరిగారు . 
 
‘ఎవల్లే మనేవ్వా .. గీ పట్నపు పోరగాల్లు ‘ అంటూ బురద కాళ్ళకున్న మట్టెలు , కడియాలు , పట్టాగొలుసులు సవ్వడి చేస్తుండగా అడుగులో అడుగువేస్తూ వచ్చింది రాజమ్మ.  అక్కడక్కడా వెండితీగల్లా మెరిసే జుట్టు తప్ప ఏమీ మారనట్లుగా ఉన్న ఆ  భారీవిగ్రహాన్ని పరీక్షగా చూస్తూ విజయ. 
 
‘అదేందే అట్లా అడగ వడితివి. నా తమ్ముని బిడ్డలు గాదె ‘ మణెమ్మ 
 
‘ ఆ ఎవల్లూ .. గా పారేల్లిపోయిన గంగని బిడ్డలా ‘ కళ్ళు చిట్లించి నొసలు ఎగరేసి వాళ్ళని పైకి కిందకి తేరిపార జూస్తూ ఆశ్చర్యంగా రాజమ్మ
 
‘అవ్ మల్ల ‘ మణెమ్మ 
 
‘గింత గింత పోరగాల్లప్పుడు జూస్తి.  ఎదిగిపోయిన్రు.  ఇన్ని దినాలకు ఇటు దిక్కు మల్తిరి .  నేనేడ గుర్తువడ్తనే ‘  సాగదీస్తూ రాజమ్మ 
 
‘ఏంది బిడ్డ, అత్తమ్మను సూడచ్చిన్రా ‘ అభిమానంగా పలుకరించింది 
 
‘ మా అత్తమ్మ మామలనే కాదు మన ఊరిని, ఊర్ల ఉన్న మీ అందరిని చూద్దామని వచ్చాం ‘ అని ఒక క్షణం రాజమ్మనే చూసి ‘నువ్వు రాజేశ్వరి వాళ్ళ ఆయివి  కదా’ అడిగింది విజయ 
 
‘అవ్ బిడ్డా .. పట్నపోల్లకు ఇంకా మేం యాదికున్నమా..  ‘ దగ్గరకు తీసుకుంటూ అని  ‘మా రాజి నీ సోపతే ఉంటుండే కదా . దానికి లగ్గమైంది.  ఇద్దరు బిడ్డలకు తల్లైంది. దాని కొడుకు సుత సదునేర్వ పోవట్టే .అది ముదోలె.  నువ్వేమో ఇంకా సిన్నపోరోలె’ విజయనే పైకి కిందికి కళ్ళతో స్కాన్ చేస్తూ కించిత్ ఆశ్చర్యంతో అంది రాజమ్మ 
 
ఆమాటలకు అక్కాచెల్లెల్లిద్దరూ  ఒకరికొకరు మొహాలు చూసి నవ్వుకున్నారు చిన్నగా . 
 
మాటల్లోనే మణెమ్మ ఇంటికి చేరారు.  
 
‘అవునాయీ.. చిన్నప్పుడే పెళ్లి చేస్తే  అంతే . పెరిగే వయసులో బరువు బాధ్యతలు మోయాలి. శరీరం ఎదగకుండానే బిడ్డకు తల్లికావడం,ఆరోగ్యం పాడవడం ఇంట్లో భర్తతో, అత్తింట్లో ఎలా ఉండాలో తెలియక పోవడం ..’ విజయ చెప్తున్న మాటలు సగమయినా విందో  లేదో  
 
‘పొద్దుగాల్ల ఆనంటే ఆన. అయిన బీ పతివ్రత బియ్యం తెస్తనని కాటికి బోతి.  ఒక్కిత్తు కానరాక పాయె ‘ మణెమ్మ కేసి తిరిగి నిరాశగా అంది రాజమ్మ 
 
‘మా అత్త లవ్ మంచిదుండే. .. పతివ్రత.  ఆమె బియ్యం తెచ్చుకుంటి ‘ ఎప్పుడో పాతికేళ్ళ కిందటి సంగతి చెప్పింది  మణెమ్మ 
 
వాళ్ళ మాటలు ఆ అక్కచెల్లెల్లిద్దరికీ అర్ధం కాలేదు 
 
‘పతివ్రత అంటే ఏంటి అత్తమ్మా’ వినయ సందేహం.  ఆమె ఎప్పుడూ  అంతే ఏ సందేహం వచ్చినా వెంటనే తీర్చుకోవాల్సిందే .  ఆగదు . ఓపికే ఉండదు
 
‘పతివ్రత అంటే ఎట్ల జెప్పేది ‘ అని కొద్దిగా ఆగి ‘ఒక్క మగనితోనే కూడేది ‘   అంది మణెమ్మ 
 
‘పోరివి నీకేమి తెలుస్తదే’ జారిపోతున్న ముడి విప్పి మళ్లీ వేలికి చుట్టి వేస్తూ రాజమ్మ 
 
‘తనేమయినా , మొగుడు క్షేమం కోసం , సౌఖ్యం కోసం ఆరాటపడేది.  మొగుడు ఎంత దుర్మార్గుడయినా, ఎంత బాధపెట్టినా, భర్త కోసం పూజలు చేస్తూ భరించేది . సతీ సావిత్రిలాగా , సతీ అనసూయలాగా కదత్తమ్మా ‘ ఏదో పాత సినిమాలో చూసిన సంఘటనని గుర్తుకు తెచ్చుకుంటూ విజయ 
 
‘అది సరే గానీ పతివ్రతా బియ్యం ఏమిటి ‘ ప్రశ్నార్ధకంగా వినయ. 
 
అవును వాటి గురించి  నేనూ ఎప్పుడూ వినలేదు ‘ చేతిలో మొబైల్ అటూ ఇటూ తిప్పుతూ విజయ 
 
‘ఎవల్లకైన సచ్చిపోతే ఒడిలో బియ్యం మూట  కడతరు కద.  ముత్తైదు సావు సచ్చినప్పుడు అట్ల కట్టిన బియ్యం కాలకుంటే ఆమెను పతివ్రత అంటరు .  ఆ బియ్యాన్ని పతివ్రత బియ్యం అంటరు’ వివరించింది మణెమ్మ. 
 
‘అత్తమ్మా  నాకేం అర్ధం కాలేదు ‘. అత్తమ్మ చేయి తన చేతిలోకి తీసుకుంటూ విజయ 
 
‘మనిండ్లల్ల ఒడి బియ్యం కడ్తరు కద.  అట్లనే ముత్తైదు సావుకు గడ్తరు’.  లోపలి రాబోతున్న కోడి పిల్లను ఉష్ ఉష్ అంటూ మణెమ్మ 
 
‘ఒడి బియ్యం అంటే ‘ టక్కున మరో ప్రశ్న వినయ నుండి 
 
‘అదేనే పెళ్లయినప్పుడు కొంగులో  బియ్యంపోసి నడుముకి  మూటకడతారు  కదా .. అవి ‘  అని చెప్పి అత్తకేసి తిరిగి 
‘అవునత్తమ్మా  అట్లా ఎన్ని కడతారు ‘ విజయ సందేహం 
 
‘5దోసిళ్ళన్న  5 పిడికిళ్ళన్న వడి బియ్యం , కుడకలు, తమలపాకు కడ్తరు మనిండ్లల్ల ‘ అందుకొని చెప్పింది  రాజమ్మ 
 
‘పెళ్ళికి చావుకు ఒకన్నే కడతరా ఆయీ ..  ‘ వినయ ప్రశ్న 
 
 ‘లగ్గానికి 5 తవ్వలు గడ్తరు .  సావు కైతే 5 దోసిలుగాని , 5 పిడికిళ్ళు గాని కడ్తరు  ‘ అని, ‘గంతే గదనే చిన్ని..’ అంది మణెమ్మ రాజమ్మ కేసి చూస్తూ  
 
‘అత్తమ్మా చనిపోయినంక బొంద పెడతారు కదా’ చిన్ననాట చూసిన దృశ్యాలు కళ్ళముందు కదలాడుతుండగా విజయ 
 
‘మీకు బొంద వెడతరు .  మా అత్తగారింటి దిక్కు కాడువెడ్తరు. బొందవేడ్తె  తెల్వది .  కాడు  అయితేనే యాల్ల పొద్దుగాల్ల పొతే కాలని బట్ట , బియ్యం ఉంటే దొరుకుతాయి.  లేకుంటే ఇట్లనే ఎవల్లన్న కొండవోతరు . అది పతివ్రతైతే .. సైయుంటే బియ్యం కాలయ్ . ఇప్పుడేడ  దోర్కుతున్నయ్.  ఆప్పట్ల దొరుకుతుండే.. ఇప్పటోల్లు అయ్యన్ని యాడ… ‘ భర్త లేచాడేమోనని తొంగి చూస్తూ చెప్తోన్న మణెమ్మ మాటలకు మధ్యలోనే అందుకుని 
 
‘వాటిని  ఏమి చేస్తరు ‘ అక్క చేతిలోని ఫోను లాక్కుని తీసిన ఫోటోలు చూస్తూ వినయ
 
‘కల్లు ముంత లెక్కుండేటి   కొత్త కుండల బెట్టి దేవునింట్ల ఓ మూలకు వెడ్తరు.  అండ్ల లక్షిందేవి ఉంటదట ‘ కళ్ళు పెద్దవి చేసి గుస గుస చెప్పినట్లుగా  రాజమ్మ 
 
‘అవునా … ‘ ఆశ్చర్యంతో అక్క చెల్లెళ్ళు 
 
‘ఏవోనే యవ్వో యవ్వా .. గా పావని గోస గోస గాదే …. నిద్రవట్టే .. అంతల్నే ‘ మణెమ్మ కేసి చూస్తూ చేతులు నోటి దగ్గరకి ముందుకి కదులుతుండగా  రాజమ్మచెప్పే  మాటలు అర్థం కాని విజయ ‘ఏమైంది ఆయీ ‘ మధ్యలోనే అందుకుని 
 
‘దానిది  పరాయి మగోని తోని సయ్యాటలాడేటి బుద్ది గాదు .. పరాయోని తోని ఓ మాట లేకుండే ,  ముచ్చట లేకుండే.  ఆ నాశనపోడు చొప్ప కట్టెను జోపినట్టు జోపిండు .  పోయి దొమ్మరి గుడిసెల దూరిండు.  ఆని పీనుగెల్ల.  యవ్వో .. సంపుతుండే.. సంపుతుందే అన్న  ఏడ్పుకు యావైందే అనుకుంట లేసి పోతి .  నేనేనా రాజ్యం మంది లేసొచ్చే ..  నీ నోట్ల మన్నువడ .. నీ నోట్ల పొక్కులు వడ .. నీ మొదులారి పోనూ, నీ సేతులిరిగి పోనూ .. సత్తదిరా ..నేనీడనే ఉంటి. అదేడ మాటాడిన్దిరా.. నీ నోట్ల మన్నువడ ..   ఆని ముసల్ది ఆడిని శాపనార్ధాలు పెట్టవట్టే .. 
 
ఏందే  లవ్వోర్రుతున్నవ్.  అడ్లు పండిస్తున్నవా .. తిండి వేడ్తున్నవ  .. దినాం పరవాన్నం తినవడ్తివి .. ఎండిపోయిన రొట్టెముక్కలు తినేటిదానికి ..పరవాన్నం వెడ్తి .  థు ..నీ .. ము …. ఇంతగనం జేత్తే ..నేను ముట్టుకుంటే ముడుసుకుపోతది.  ఇది గా ఎర్రోడి తోని ముచ్చట్లడతదా .. నా దగ్గర లేంది ఆడి దగ్గర ఉన్నదా అనుకుంట మల్ల రెండు జోపే .  కొట్టి కొట్టి అల్సి పోయిన్దేమో .. జర నీల్లియ్యి అని తల్లిని గదిమిన్దు.  మూలకున్న నులక మంచం మీదికెల్లి అది లేసి ముంతెడు నీళ్ళు ఇచ్చే .  తాగిండు.  ఎంత దూప అయిందో మల్ల .  ఆ కర్రె మొకాన వట్టిన సెమట తుడుసుకుంట బిర బిర ఆవలికి ఎల్లొచ్చె. 
 
‘ఏందీ సిన్మా జుడచ్చిన్రా ‘ కళ్ళు మిటకరిచ్చుకుంట అన్నడు. దునియా మంది జూడంగ  పోయి దాని గుడిసెల జొచ్చె 
 
సక్కదనాల పోరి .  కాకి ముక్కుకి దొండపండోలె  ప్చ్ .. ఈని పాల వడ్డది .  తీరొక్క మాట అనుకుంట ఎవరింటికి అల్లు పోయే 
 
ఉల్కు పల్కు లేకుంట చొప్ప కట్టోలె  పడున్న కోడల్ని లేప జూసిన్ది అత్త రుక్మవ్వ.  ఎండు  కట్టోలె  పడి ఉండే ఆమె పెయ్యి నిలిస్త లేదు. దగ్గుకుంట మూలకున్న నులక మంచం మీన ఆలింది.  గిల్ల కొట్టుడు కొట్టిండు . పోరి ఉల్కు లేకపాయే .. పల్కు లేక పాయె అని తనలో తనే గోణుక్కున్నది.  మనసులనే ఏడిచిందా ముసల్ది . 
 
యాడనో జూసిన పిల్ల మంచిగ ఉన్నది.  పైస కట్నం లేకున్నా జేస్కుంటనని రాయవారం బంపిండు.  కాలేజీల సదుకునేటి పోరిని లగ్గం జేసుకునే.  అవుటాప్ పోయి అచ్చిండు. గింతంత పైస కమాయిన్చిండు.  ఇల్లు వాకిలి ఉన్నాయ్. చెట్టూ చేను ఉన్నై. గొడ్డు గోదా ఉన్నై.  ఈసమేత్తు బంగారం అడగలే, సిల్లి గవ్వ కట్నం పైస అడ్గకుంట అల్లుడయితండు. పిల్లను కొండబోయి లగ్గం జేస్కుంటనన్నడని సదుల సరస్పతిని దెచ్చి ఈ బెకుప్ చేతిల బెట్టె.  రెండు మూడు నెలలు అయిందో లేదో ఈ  గాడిదిల అనుమానం బూతం జొచ్చె.  ఆ పోరి పానం మీదికచ్చే. పాపం దానత్త కంటి మీన కున్కు లేకుంట గడిపే.  నడుమ నడమ పావని , పావని అని పిల్చిందట. పొద్దుగాల్ల కంటే జీవుడు ఎల్లిపాయే ‘ కళ్ళు ఒత్తుకుంటూ చెప్పింది రాజమ్మ.  మణెమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. 
 
‘అయ్యో ‘ అప్రయత్నంగా వినయ, విజయ
 
‘ ముప్పై ఎండ్లోడు . లగ్గానికి ముందే తిరుగువోతు. పోగరువోతు. అవుటాప్ బోయి ఏం జేసిండో  గని ఈడనైతే ఇంత చేను జేసుకుంట అవ్వార తిరుగుడు .. తాగుడు. ఆనిమీద మన్నువడ ‘ తిట్టింది లోనకి వెళ్ళబోతున్న పిల్లిని కొడుతూ మణెమ్మ 
 
‘ముత్తైదు సావు గద.. ఆ ఇంటి ఆచారం కొద్ది కాడు వెట్టిన్రు. పతివ్రత బియ్యం ఏర్కోను యాల్ల పొద్దుగాల్ల పోయిన.  కాలని బియ్యం దొర్కుతయ్యని’ కొంగుతీసి మొహం తుడుచుకుంటూ రాజమ్మ  
‘దొరకినయా ?’ కుతూహలంగా వినయ 
 
‘యాడ దొరకలే ‘ నిరాశగా రాజమ్మ 
 
‘అంటే ఆమె పతివ్రత కాదా ?’ వినయ 
 
‘అయ్యో , నేనట్ల అంటలేదే  , లగ్గవయి అచ్చిన కాడికేల్లి జుడవట్టినం గద .. అది పరాయి మగొనితోని పోలే, మాట్లలే .. సయ్యాటలాడలే .. అది పతివ్రతనే.  ఆనంటే ఆన గద .  ఆనల  కొట్టుకపోయినట్టున్నయ్ ‘ ముడుతలు పడ్డ రాజమ్మ మోహంలో నిరాశ ఇంకా పోలేదు 
 
‘ఆడుదప్ప ఊరంతా నమ్ముతరు . అది సత్తేమని. అది కొర్రాయి అసొంటిదని.  లగ్గానికి ముందే ఈడే గా సోకులాడిని  … మరిగే.  లగ్గం అయిన దీనికేమో సంసారం తెల్వకపాయే.  ఈ మొరటోడు దగ్గరకుపోతే  బయపడేటిదట.  పువోలె ఉన్నదాన్ని అట్లనే కావురం పట్టినోడు నలిపేసేటోడు.  ఆడిదాని బతుకు ఎట్ల తెల్లర్తదో ఎవనికెరుక ‘  ఇలాంటివెన్నో చూసిన అనుభవంతో నిర్లిప్తంగా రాజమ్మ 
 
‘పాయె .. బతుకెల్లిపాయే .. దాని బతుకెల్లిపాయే పంచబుతాల్ల కల్సి పాయె.   ఆడు నమ్ముతేంది నమ్మకున్టేంది జనం నమ్ముతున్నరు ‘ అక్కడి నుండి లేచి ఎండిన బట్టల్ని తీయడానికి సమాయత్తమవుతూన్న మణెమ్మ 
 
ఎంత అన్యాయం అందమైన భార్యను నమ్మలేని భర్త.  తను జేస్తున్న తప్పు భార్య చేస్తుందన్న అనుమానం .  అందంగా నాజుకుగా ఉండే ఆమెకి తను తగినవాడు కాదని, ఆమె చదువుకున్నదని, తెలివిగలదని ఆమె అంటే తెలియని అసూయని  కనిపించనీయకుండా తనని ఆమె తక్కువ చేయకుండా ఉండడం కోసం, తొక్కిపెట్టి తన అదుపాజ్ఞలలో ఉంచుకోడం కోసం డబ్బు ఉందన్న అహంకారంతో ఆమెని చావబాదడం అమానుషం కాదా ..  ఆమెను అతను హత్య చేసినట్లేగా .. మరి ఊర్లో ఎవ్వరూ అలా అనడం లేదేమి .. ప్రశ్నలు విజయ మదిలో చేరి కందిరీగలా రొద చేస్తూ .. 
 
‘అక్కా.. ఆమె .. అదేనే ఆ పావనిది  మామూలు చావు కాదు హత్య..  హత్యే…  అవుతది కదా..  ‘సందేహ నివృత్తి కోసం అక్క కేసి చూస్తూ  వినయ 
 
నిద్ర లేచి నీళ్ళు తాగి వస్తున్న మణెమ్మ భర్త చివరిమాటలు విని  ‘హత్యేంది .. ‘. ప్రశ్నించాడు 
 
‘మామా ఇప్పటిదాకా ఆ పావని చావు ముచ్చట చెప్పింది రాజమ్మ ఆయి.  ఆమె  రోగం వచ్చో , ప్రమాదం తోటో ఆమె చావలే గద .  మొగడు కొడితే ఆ దెబ్బలకు చచ్చింది.  అంటే అది హత్యే కదా ‘  అడిగింది  వినయ 
 
చెల్లెలూ తనలాగే ఆలోచిస్తోందనుకుని  ‘అవును మామా అది హత్యే కదా ‘ విజయ వంత పాడింది 
 
 ‘ష్ .. నాతో అంటే అన్నరు కానీ ఎక్కడా ఇట్ల అనకున్రి.  మొగడు పెండ్లాలు అన్నంక ఏవో కయ్యాలు అయితనే ఉంటయి. ఏదో కోపంల వాడు కొట్టిండు గానీ దాన్ని చంపాల్నని కాదు కద.  దాని గాచారం సక్కగలేక అది సచ్చింది , అంతే ‘.  అది సాధారణ విషయంలా అంతకన్నా ఎక్కువ ఆ విషయం గురించి మాట్లాడడం ఇష్టంలేని మల్లేశం  తువాలు భుజం మీద వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు.  
 
‘ఇయ్యాల జస్తే రేపటికి రెండు, ఎల్లుండికి మూడు అవుతది.  ఆ పావని జస్తే లోకమేమన్న ఆగుతదా..  రోజు అసొంటి పావనిలు ఎంతమంది గీ మట్టిలమట్టయితున్నరో ఎవల్ల  కెరుక .. ఇల్లు జాగా ఉన్నయ్, పొలం పుట్ర ఉన్నయ్. పైసలున్నయ్.  ఆడిదాని చితి ఆరకున్టనే పిల్లనిస్తమని ఆనింటికి తిరిగేటోళ్లు ఉన్నంక ఆనికి పోయేడిదేంది.’ వాకిట్లోకి అడుగు పెడుతున్న చంద్రమ్మనుద్దేసించి రాజమ్మ.   చంద్రమ్మ అప్పుడే తన చెల్లెలు బిడ్డ నిచ్చి చెయ్యాలని ఆలోచన చేస్తోందని విని ఉండడంతో. ఆ గొంతులో ఒకలాంటి విసురుతోపాటు ఆగ్రహం కూడా కనిపించాయి ఆ అక్కచెల్లెల్లకి.
 
పట్నంలోనే సమస్యలు, కుళ్ళు, కుతంత్రాలు అనుకున్నా. పల్లెలు ప్రకృతికి దగ్గరగా కృత్రిమత్వానికి కాస్త ఎడంగా ఉంటాయనుకున్నా.  నిర్మలంగా , నిశ్చలంగా స్వచ్చంగా కనిపించే పల్లె కుత్తుకలోనూ గుచ్చుకునే ముళ్ళు ఎన్నో.  పల్లె అందం వెనుక, అమాయకత్వం వెనుక , తెలియని తనం వెనుక, ఆహ్లాదం వెనుక అంతర్లీనంగా ప్రవహించే అలవాట్లు , ఆచారాలు , అనుమానాలు, అవమానాలూ వాటికి బలయ్యే పావనిలు ఎందరో.. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు విహరిస్తారు అంటారు కదా పెద్దలు.. ఆమె పూజింప బడడం కాదు ఈ అవమానాలు, అనుమానాలూ, హత్యలు లేకపోతే చాలదూ..  ఆమెను మనసున్న మనిషిగా చూస్తే సరిపొదూ ..వీరి మనసులకు పట్టిన మకిలి కడిగేదెలా ..  చైతన్యం రగిల్చి పదునెక్కించెదెలా .. చిన్నమేనత్త, పావనిల జీవితం తలచుకుంటూ తీవ్ర ఆలోచనలో విజయ.  
 
ఎంత అన్యాయం.  వీళ్ళంతా ఎలా ఊరుకుంటున్నారు? అతి మామూలు విషయంగా ఎలా చూస్తున్నారు? అదే ఆమె అతన్ని కొడితేనో , లేదా ఇద్దరు మగవాళ్ళు కొట్టుకుంటేనో ఇట్లాగే గుట్టు చప్పుడు కాకుండా ఉంటారా.. !  ఆడపిల్ల అన్నా, ఆమె ప్రాణం అన్నా ఇంత చిన్న చూపా.. ఆమెకు గౌరవం, ఆమె జీవితానికి రక్షణ ఉండవా .. ? ఆమెపై జరిగే హింసని, హత్యని నేరంగా గుర్తించరా .. ? నేరం చేసిన వాడిని కట కటాల్లోకి పంపోద్దా.. ?ఈ జనాల మెదడుకు పట్టిన బూజు దులిపేది ఎలాగో ..  ఆలోచిస్తూ వినయ  .. 
 
మిగతా ముగ్గురూ లోకాభిరామాయణం ముచ్చటిస్తూ .. 
 
వి . శాంతిప్రబోధ
(జనవరి 2015 “విహంగ” అంతర్జాల పత్రికలో ప్రచురణ )

Tag Cloud

%d bloggers like this: