The greatest WordPress.com site in all the land!

Archive for the ‘kavithalu’ Category

నేనేం చేయనూ .?!

కొన్నాళ్లుగా నేనో కలగంటున్నాను
ఆ కలలో దేశ సంచారం చేసి వస్తున్నాను
భక్తి పేరుతో బలహీనతల్ని
పొడుచుకుతినే రాబందులు లేని
చోటుకోసం గాలిస్తూ వస్తున్నాను
సందు గొందుల్లోని ఇరుకుబాటల్లోకే
కాదు , మహానగరాల్లోని
మెగాదారుల్లోకీ పరుగులు పెడుతున్నాను
ఎక్కడికి పోయినా అదే దృశ్యం
మాయపొరలు కప్పి మెదడు
చచ్చుబడిపోతున్న  సమాజం
గారడీ విద్యలతో బురిడీ కొట్టిస్తూ
నగదు, నగానట్రాతో పాటు ఇల్లూ ఒళ్ళు గుల్ల చేస్తూ
మనుషుల్నీ మనసుల్నీ దర్జాగా లూటీచేసే
సైకోలు ,రేపిస్టులు, గుండాలు,
ఖూనీకోర్లు, స్మగ్లర్లు … రాత్రికి రాత్రి వేషం కట్టి
సన్యాసిననో .. కలియుగ దైవాన్ననో
గజానికొక్కడు తగులుతూనే …
లెక్కలేనన్ని మఠాలు, పీఠాలు మొలుస్తూనే..
కడుపులో చెయ్యిపెట్టి కష్టాలన్నీ
తోడేసి ఆశీస్సులు అందిస్తామనే
స్వాముల ముసుగులోని సోంబేర్ల
కౌగిట్లో చలికాచుకునే ఆమాత్యులూ ..
సాష్టాంగపడి ముడుపులు కట్టే పాలకులూ ..
జనంసొమ్ముతో యజ్ఞయాగాలు చేసే నేతలూ..
ఉన్న గడ్డమీద
ఆవు చేలో మేస్తుంటే .. దూడ గట్టున మేస్తుందా ?
 లోతుతెలియని ప్రవాహపు సుడిగుండాల్లోకే
 అవ్వలూ , అమ్మలూ , అక్కలూ ..
అంతా జనమంతా  .. అటే మురుగులోకే..
నదీప్రవాహంలా అలుపెరగకుండా అడ్డొచ్చే
ఆలోచనల్ని కొక్కేనికి వెళ్ళాడేసి పరుగులెడుతుంటే
డేరాలు కట్టి పీఠాధిపతులైన బురిడీగాళ్లు ..
సామ్రాజ్యాలు కాన్సర్ పుండులా విస్తరించుకుంటూ
మత్తులో, సుఖాల్లో, విందు విలాసాల్లో మునిగితేలుతూ..
గల్లీ నుండి ఢిల్లీ దాకా
బక్కచిక్కిన మనసుల్లో
కొత్తచివురుల ఆశల చిట్టా
గుర్తెరిగిన రాబందులు
మొగలిరేకుల సువాసనలు గుప్పిస్తూ
కనిపించని కత్తి వేలాడదీసి
నగ్నంగా చేసే ఉన్మాదపు ప్రేలాపనలు
హృదయాలను  హత్తుకునే  దృశ్యాలే
బతుకులు పండాల్సిన చోట
రంగు రుచి వాసన కోల్పోయిన
కర్మసిద్ధాంతపు కొలిమిలోకి విసిరేస్తుంటే
భక్తి విశ్వాసాల ముసుగులో మూఢత్వం
జడలువిప్పి వికటాట్టహాసం చేసే దృశ్యాలు
చూడలేక కళ్ళుమూసుకున్న మౌనం
పుట్టిన రాచపుండుని సర్జరీ చేసి
బోన్సాయి బతుకుల్లో భరోసా నింపమని ఆర్థిస్తోంది!
ఉలిక్కిపడి చుట్టూ పరికించా ..
దట్టమైన చీకటి బిలంలో  నేను  ..
కత్తి చేతబట్టి  వెలుతురుతీరం వెతుక్కుంటూ
సాగేక్రమంలో.. ఇప్పటివరకూ
నా కనురెప్పలకింద కదలాడింది
కలకాదు నిజమని వర్తమానం చెప్పింది
ఇప్పుడేం చేయను ?
వికలమైన మనసులోంచి పొడుచుకొచ్చిన ప్రశ్న
నేనేం చేయనూ ..?? అని
వికసించాల్సిన మెదళ్లు
నిషిద్ధలోయల్లోకి జారిపోతుంటే
నిటారుగా నిలబడాల్సిన దేహాలు
కూలిన గోడల్లా మిగిలిపోతుంటే
పుణ్య దేశం మానసికరోగుల
అభయారణ్యంగా మారిపోతుంటే
అజ్ఞానం, అంధవిశ్వాసం
శాస్త్రీయతకు ఉరితాళ్ళు పేనుతుంటే
గుండెపగిలి  కన్నీటి కుండనైన
నేనేం  చేయనూ..???
ఎప్పటికీ కదలని విగ్రహంలానో
నిశ్చల సముద్రంలానో
ప్రశాంతంగా ఉండగలనా ..?! లేదంటూ ..
అలలు అలలుగా సాగే ఆలోచనలు
ఉవ్వెత్తున ఎగుస్తూ ..కాళిక నృత్యం చేస్తున్నాయి
 ఖడ్గం అందుకుని లాజిక్ లేని కనికట్టుగాళ్ళ ను
కరిగిపోయే కాలంలో కలిపేయమంటూ
సూర్యచంద్రులు సంకేతాలిస్తున్నాయి
వి . శాంతి ప్రబోధ
11. 11.2017
(2వ కవయిత్రుల సమ్మేళనంలో చదివిన కవిత) published in Netinijam daily on 23.11.17

అడవి అంటుకుంటున్నది

నివురుగప్పిన నిప్పు
చాపకింద నీరులా
వ్యాపిస్తున్నది దశదిశలా …
దావానలంలా మారి
సెగలపొగలు కక్కడానికి సిద్ధమవుతున్నది

*** ***
పర్యావరణాన్ని పరిసరాలను
కనురెప్పల్లా పదిలపరుచుకునే
ప్రకృతి బిడ్డలం
వాతావరణ పరిస్థితులకు
అనుగుణమైన మా జీవనం
ఆహారాన్వేషణ , ఆటపాటలతో
సొంతమైన ఆనందమయ జీవితం
అంతా తలకిందులై..

చల్లని అడవితల్లి ఒడిలోచేరి
పోడుచేసి పొట్టపోసుకుంటుంటే
తరతరాలుగా తల్లీబిడ్డల
ఆత్మీయబంధాన్ని తుడిచేసి
తల్లి బిడ్డను ముద్దాడడం
బిడ్డ తల్లిచనుపాలు కుడవడం
తప్పని అంటారేం
నేరమని శిక్షిస్తారేం .. ?
,
పోడుచేసుకుని బతకడమే గానీ
పోగుచేసుకుని దోచుకుపోవట్లేదే .?!
వేరుపురుగుల్లా మారట్లేదే .. ?1
అయినా.. మాకాళ్ళ కింది భూమి
గుట్టు చప్పుడు కాకుండా
పందికొక్కుల కలుగుల్లోకి కదిలిపోతూనే

కనురెప్పల్ని కాటేసే మాయావి
కళకళలాడే మా బతుకుల్లో
చిక్కటి తేమను కబళించి
పచ్చటి గాలి వాసనల బదులు
చితులు పేరుస్తూ .. తాను
ఆశల ఊటబావులు తోడుకుంటూనే

మా అస్తిత్వంపై వేనవేల
ప్రశ్నల వల విసురుతూ
ప్రకృతి నియమాలకు విరుద్ధంగా
అభివృద్ధిపేర విధ్వంసం సృష్టిస్తూ
మా సంస్కృతికి, జీవికకు విఘాతం కలిగిస్తూ
అమ్మఒడి నుండి బిడ్డలను తరిమేస్తుంటే ..

చేసిన చట్టాలు చాపచుట్టేసి
మాకు గోరీలు కట్టేందుకు
లాఠీల , తూటాల వడగాడ్పుల
తుఫానులు సృష్టిస్తూ.. తాను
ఇంద్రధనుస్సు రంగులు
అద్దుకుంటూ ఊరేగుతుంటే ..

ఆకలిదప్పులతో అలమటిస్తున్న మేం
నింగి , నీరు , నేలా, కొండాకోనలు
మావేనన్న ఎరుకతో పోరుబాటపట్టి తెగిస్తే …
పుట్టలుపగిలిన చీమల్లా బయటపడి జ్వలిస్తే ..
ఎంతటి మహా మాయావి అయినా
ఆ మంటల్లో మాడి మసికాక తప్పదు!

వి . శాంతి ప్రబోధ
పోడు పోరు కోసం పంపిన కవిత

నేరం మొక్కది కాదు సుమా..

నేనో నునులేత మొక్కని
కొమ్మలేస్తూ ఆకుపచ్చ
తివాచీలా పరుచుకుపోవాలనీ ..
మొగ్గలు తొడుగుతూ సుమించాలనీ ..
విశ్వమంతా సౌరభాలు వెదజల్లాలని
నేనెప్పుడూ కలలు కనలేదు ..

అలాగే .. కాని కాలంలో
ఆకు రాల్చాలనీ
మోడువారాలనీ
ఏ మాత్రం అనుకోలేదు

ఆడుతూ పాడుతూ
ఎగిరే ఆనందాల చిరుజల్లుల్లో
చిగురించే చిరు ఆశల
మధ్య ఎదగాలనుకున్నా

కానీ నన్ను నన్నుగా
ఎదగనీకుండా నా చుట్టూ
చేరిన బొంత పురుగులు
నాపై
భారం మోపుతూ ..
వత్తిడి పెంచుతూ
నన్ను పీల్చి పీల్చిపిప్పిచేసి
అవి మాత్రం
రంగురంగుల సీతాకోకచిలుకల్లా
రూపాంతరం చెందుతూ ..

మొక్కనాటి
కాయలు ఏరుకోవాలనే
తొందరలో ..
నేను వృక్షంగా ..
మహా వృక్షంగా ఎదగాలనే
మోజులో
నా తల్లిదండ్రులు ..

ఫలితం
బాహ్యప్రపంచంతో
సంబంధం తెగిపోయి
నిర్బంధ జీవితం గడిపే నేనూ ..

ఈ మొక్క శక్తి ఏమిటో
ఇష్టా ఇష్టాలేమిటో తెలుసుకోకుండా
ఇరుగు పొరుగుతో పోలుస్తూ
పెను భారం మోపుతూ
గ్రీష్మపు వడగాడ్పులు ..
సునామీ వేగంతో
నాపై విరుచుకు పడుతూ
నిరంతరం నన్ను వేటాడుతూ

తగిలిన వేలుకే మళ్ళీ మళ్ళీ
దెబ్బతగులుతూ నేను
నా భవిష్యత్ పై నా ఛాయిస్ లేకుండా
బందిఖానాలో విలవిలాడుతూ నేను

చిన్న ఆత్మీయ స్పర్శకోసం
కొద్ది వినోదం కోసం
మరికొద్ది స్వేచ్ఛకోసం
తల్లడిల్లిపోతూ ..

వెచ్చని నిన్నలలోంచి
పచ్చని రేపటిలోకి
ప్రయాణించేందుకు
వసంత ఆగమనాలే కాదు
సూర్యాస్తమయ మసక కాంతి
కూడా కానరాని స్థితిలో నేను
మోడై రాలిపోతూ ..
నేరం నాది కాదు సుమా..!!!

వి. శాంతి ప్రబోధ
29. 10. 2017
( కవయిత్రుల కవిసమ్మేళనంలో చదివిన కవిత )
Published in Poddu daily on 1. 11. 2017

ప్లీజ్, మా బాల్యానికో చిరునామా ఇవ్వరూ .. !!!

మాకూ మిగతా ప్రపంచంలా  
ఆటపాటలలో గడపాలని ఉంది  కానీ ..,
ఆకాశంలో నక్షత్రాల్లా అందుకోలేని దూరంలో
మేమూ చదువులతల్లి ఒడిలో ఒదిగిపోవాలని ఉంది కానీ ..,
బడిమెట్లు ఎగతాళిగా వెక్కిరిస్తూంటే ఆశలు ఆవిరై
తూనీగలా పూదోటలో విహరించాలని కలలు కానీ ..
ఆ స్వేచ్ఛ కలలోనైనా అందుకోగలనో లేదో
కానీ.. పంజరంలో  బందీలానే ..
చీకటవుతుందంటే గుబులు
తెల్లవారుతుందంటే భయంతో
సన్నని చీలికల్లాంటి వాకిళ్ళలోంచి
వెలుతురు చారికలకోసం చకోరంలా చూసేనాకు
అందమైన లోయల్లో పైకి చూస్తే
బారులు తీరిన పక్షులు వాటి  కిలకిలారావాలు
కాదు నాకు కనిపించేవీ .. వినిపించేవీ ..
లోహవిహంగాలూ.. రాత్రి పగలూ హోరెత్తే
బాంబుల మోతలు.. ఇనుప డెక్కల  చప్పుళ్లే
సొగసరి హిమసమూహాల అందచందాల
మాటున మాటువేసి నక్కిచూసే డేగకళ్లు
ఆయుధాలతో పహారాకాసే మరమనుషులు
ఆత్మీయ ఆలింగనాలు కాదు నన్ను ముద్దులతో
స్పర్శించేది మెడమీద వేలాడే కత్తులు ప్లాలెట్స్ బుల్లెట్స్
కుండపోతలో తడిసి ఛిద్రమైన జీవన దృశ్యాలు
నేనేకాదు.. మా నాన్న ..  తాత  కూడా
ఇలాగే… దాచిపెట్టిన కాలంలో
కరిగిపోయిన తమ బాల్యాన్ని
తమ వారసుల్లోనైనా వెతుక్కుందామన్న
లోలోపలి ఆశను
మనసునిండా ఒంపుకుని ఎదురుచూస్తూనే..,
మేమేం నేరం చేశామనీ మా  నేలపై  మేం పరాయిగా ..
ఇల్లూ వాకిలీ వదిలి దిక్కు మొక్కూ తెలియని పయనంలో ..
రెండు మనసుల మధ్య, రెండు మతాల మధ్య ,
రెండు ప్రాంతాల మధ్య, రెండు దేశాల మధ్య
అగ్ని రాజేసి మంటలెగదోస్తూ ఆడే రాజకీయ చదరంగంలో
కేరింగ్ – కిల్లింగ్ ల సంస్కృతిలో
మంటగలుస్తున్న మా బాల్యపు చిరునామా ఎక్కడ ?
మనసులు మమతలు మీకులేవా
ప్రేమతో అనుబంధాలను గట్టిబరచుకోలేరా ..?
గీతల కావల ఉన్న మా మనసులు చూడలేరా
ఒకరిమీద ఒకరు కయ్యానికి కాలుదువ్వుతూ
సమరోత్సాహంతో యుద్ధ మేఘాలు సృష్టిస్తూ పోవడమేనా ..?
పడిన పీటముడులు తెంచలేమా ?
భాయి భాయి అని కలసి నడువలేమా ?
అహంకార ఆధిపత్య ఆరాట పోరాటాలను
పక్కన పెట్టి, పెద్దలారా పెద్ద మనసుతో ఆలోచించండి
అవలోకించండి .. మా బాల్యాన్ని మాకివ్వండి
ప్లీజ్ , మా బాల్యానికో చిరునామా ఇవ్వరూ .. ?!
..
వి. శాంతి ప్రబోధ
29.09. 2016

దివిటీనై వెలుగుతూనే ..

తెగబలిసిన గద్దలెక్కడినుంచో 
నాపైనున్న ఆకాశంలోకి
చిత్తకార్తె కుక్కల్లా చొరబడ్డాయ్
నా కాళ్ళకిందున్న మట్టిపొరల లోతుపాతులు
దుర్భిణీ వేసి తెలుసుకున్నాయ్
నా చుట్టూ కనిపించీ కనిపించని తెరలతో
కొండచిలువలా చుట్టేస్తూనే ఉన్నాయ్ !

నీ అనేదే లేదు, అన్నీ నావే …
నింగి నేలా నాదేనంటూ తెగబడిన గద్ద
పోగుపడ్డ తరతరాల ప్రకృతి వనరులను పెకిలించేస్తూ
నన్ను పరాయిని చేసి
తన్ని తరిమేస్తుంటే.. నా జీవికను ,
వేలయేళ్ళ నా అస్థిత్వాన్ని అనుబంధాన్ని
కుళ్ళబొడిచి బొందపెడుతుంటే కుక్కిన పేనులా
మన్ను తిన్న పాములా పడిఉండగలనా ..?!

కొడిగడుతున్న దీపాన్ని నిలుపుకునే ప్రయత్నంలో
నోరు విప్పి ఇదేమిటని అడిగితే
సునామీలా విరుచుకుపడే తుపాకులు
నన్ను దేశద్రోహిని చేసి
నా శవాన్ని పాతాళగరిగెకు
చిక్కిన బొక్కెనలా వేళ్ళాడేసి
ఖబడ్డార్ .. అంటూ హెచ్చరికలు

తెగబడ్డ రాబందులకు
జై కొట్టే పాత్ర విజయవంతంగా పోషించే
పాలితులకు నేను , నా జాతి ఎప్పుడూ
కానివాళ్ళమే.. కానీ, మేమిన్నాళ్లూ
కాపాడుకుంటూ వచ్చిన నింగీ , నేల , నీళ్లు
పందికొక్కుల కలుగుల్లోకి చేరిపోతుంటే
నేనెలా ఊరుకోగలను ..?!

తవ్విపోసిన కొండలూ గుట్టల సాక్షిగా
నేలమాళిగల్లో నువ్వు రాశులు పోసిన
ఖజానా ఖనులు నా జాతికి
అంకితం చేసి జీవం పొసే వరకూ
ముత్తెమంతలేని ఈ మిణుగురు
సమాధుల్లోంచి మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతూనే
నీ అంతంకోసం బారులు తీరిన దివిటీనై కదులుతూనే
వి . శాంతి ప్రబోధ

(ఏప్రిల్ 17, మాతృకలో ప్రచురణ అయిన కవిత )

మార్పుకోసం ధైర్యంగా ..

నే.. ఎక్కడ చూసినా
ఉశ్వాసనిశ్వాసల్లా నేను,
జగమంతా సగంగా అల్లుకుపోయి
సూర్యచంద్రుల్లా అవిశ్రాంతంగా శ్రమిస్తూ..నే

కానీ
నాకూ , నా పుట్టుకకూ విలువేలేదు
ఇంటా బయటా నా శ్రమకు గుర్తింపే లేదు
నా ఆశలకు , ఆశయాలకు గౌరవమే లేదు
రక్షణలేని ప్రాణ మానమర్యాదలు నీలిమబ్బుల మాటునే

నిరంతరం
నాపై చొచ్చుకొచ్చే వివక్ష కొత్త కొత్త రూపాల్లో మార్గాల్లో
ఉచ్చు బిగించి విచ్చుకత్తులతో దాడిచేసి
హింసకు, పీడనకు, వేదనకు గురిచేస్తూ
సమాజ ప్రగతిని అసంపూర్తిగా మిగులుస్తూ ..

నేటికీ
ఆహారం, ఆరోగ్యం అందీ అందనట్లుగానే
విద్య విహారంలో అట్టడుగునే
ఆదాయం , వనరులు ఆమడ దూరంలోనే
ఆర్ధిక, రాజకీయ నిర్ణయాధికారం పాతాళంలో.. నే

అందుకే
నా లోపలి సముద్రపు హోరు
ఘనీభవించి, ఆకాశంలో చుక్కలెన్నో అన్ని
సవాళ్లు ఎదుర్కొంటూనే ఉన్నా
ఏళ్లతరబడి యుద్ధం చేస్తూనే ఉన్నా

కళ్ళకు గంతలు కట్టి
మాటల మతాబుల వెలుతురులో
నన్ను భ్రమల్లో ముంచాలనుకునే
వారి కుయుక్తుల్ని ఓ కంట కనిపెడుతూ
నా చుట్టూఉన్న కట్టుబాట్ల జెముడు పొదల్ని
ఇనుప కంచెల్ని ఛేదించుకుంటూ
ముందుకుపోయే క్రమంలో.. రక్తసిక్తమైన ఒళ్ళు
నిత్యం సలిపే గాయాలతో … అయినా
రెక్కలిరిగిన పక్షిలా పడిఉండలేను

కష్టాలకూ బాధలకూ లేపనం పూసుకుంటూ..నే
నా ఆలోచనలకు, ఆశయాలకు రెక్కలిచ్చి
వేల సూర్యశక్తుల్ని నాలో ఒంపుకుంటూ
సవ్యసాచిలా సమాజ నిర్మాణంలో
నా భాగంకోసం చలిస్తూ జ్వలిస్తూ.. నే

నాకు ఒక దినోత్సవం
ఒక వేడుక కాదు కావాల్సింది
నిరంతరం కొనసాగే శ్వాసలా.. ప్రతిరోజూ
అవనిలో అర్ధభాగమన్న ఎరుకతో
అంతం లేని అవకాశాలు
హద్దులు లేని సమభాగస్వామ్యం కావాలి

అందుకోసం
గళం విప్పుతూ, కదం కదుపుతూ
రాజీలేని పోరాటం చేస్తూ..నే
మార్గాలు నిర్మించుకుంటూ
మార్పుకోసం ధైర్యంగా సాగుతూ..నే

వి. శాంతి ప్రబోధ
8. 3. 2017

ఎంగిలి

సందేహం నాలో ..

కొలిమిలో నలిగిన కత్తిలా

చుర చురా కాలుతూ

సర సరా కోసుకుపోతూ ..

అప్పుడులేని ఎంగిలి ఇప్పుడేమిటని ?

చిన్నతనంలో
చిలక్కొట్టిన జాంపండు

కోసం .. కోట్లాడి తిన్నానే ..

పక్కోడి దగ్గరి

యాపిల్ పండు గుంజుకు తిన్నానే

కాకెంగిలి అని వాడికి నచ్చజెప్పానే ..

మరిప్పుడేమిటి ..?
మదపిచ్చోడి చేతిలో

ఆమె దేహం ఎంగిలైందని

అగ్ని హోత్రంలా ఎందుకింత రగిలిపోతున్నాను

త్సునామిలా విరుచుకుపడే కెరటాలకు
ఇనుప కంచెలు కట్టేస్తున్నాను

కలిమి గల ఆమె హృదయ సౌందర్యం అర్ధంకాలేదా ?

మనసు అనురాగం మలినం కాలేదని తెలియలేదా .. ?!

వైకుంఠపాళీలో పాము నోట పడిన ఆమెను

నిచ్చెన మెట్లు ఎక్కించలేనా .. ?!

ఆమె కాయో   పండో కాదుగా ..

ఆఫ్ కోర్స్ కాకపోవచ్చు

కానీ …. అలా చూడలేనా ?

నా నిరంకుశపు ఆలోచనలు

భగభగ మండే మంటల్లో కాల్చి బూడిద చేయలేనా ..

హృదయపు నేలలో సరికొత్త ఆలోచనలు మొలకెత్తించలేనా …

వి. శాంతి ప్రబోధ
15. 3. 2016

తెలంగాణా తల్లి సంబుర పడ్తోందా …? 

సంబురాలు ..

ధూం ధాం సంబురాలు
కోట్లల్లో అంబరాన్ని తాకే సంబురాలు
నా వాడవాడలా జరుగుతున్న
ఆటపాటల్ల వేడుకలు
జిగేల్ మంటూ మెరిసిపోతున్న
తళుకు బెళుకుల వీధులు
ఆనందడోలికల్లో విహరింప చేసి
నన్ను ఉక్కిరి బిక్కిరి చేయడంలేదు
కబేళాకి తరలిపోతున్న
బడుగు జీవుల బతుకు
చిగురించకుండా వెంటాడి
వేటాడుతున్న కరువు
డాం డాం అంటూ పిట్టల్లా
నేలరాలుతున్న బడుగు జీవుల
జీవన దృశ్యం  నా హృదయంలో
శోక గీతం ఆలపిస్తూ ఉంటే
సీతాకోకచిలుక రంగులు నాలో
ఒంపుకుని ఆనంద తాండవం ఎలా చేయగలను?
మీ తల్లి  తెలంగాణా
ఎప్పుడు సంబురపడ్తదో తెలుసా ?
అట్టహాసపు అలంకరణలు
హంగులు ఆర్భాటాలకు
పెట్టే ప్రతి పైసా నేలలో ఇంకి
సుభిక్షమై బిడ్డల వెతలు తీరి
వారి మోములో వెలిగే ధగ ధగల
కాంతి తెలంగాణమంతా వ్యాపించినప్పుడు
వి. శాంతి ప్రబోధ
1.6.2016 కవిసంగమం

నిన్న – రేపు

 నిన్నటి పేజిలో
ఏరుకున్న కాసిన్ని నక్షత్రాలను

మూటకట్టి మొలకలెత్తిస్తూ                
వడగాడ్పులతో సుళ్ళు తిరిగే కడగళ్ళను

శిథిల జ్ఞాపకంగాను మార్చేస్తూ

మమతను పంచే మనసున
మానవత చిగుర్లు తొడిగిస్తూ
చిగురుటాకుల తోరణాలతో
రేపటి కలల పేజిని
తెరుద్దామని వచ్చేశావా  దుర్ముఖీ ..

వి. శాంతి ప్రబోధ
published in Sakshi daily on 8.4.2016

పూయని రంగుల’కల’

భవిష్యత్ చిత్రపటంపై
రంగురంగుల వర్ణాలద్ది
అందమైన బొమ్మ గీయాలనే
ఊహల ఊయలలొ ఊరేగుతూ
పయనమయ్యా సుదూర తీరాలకు


ఆదిలోనే హంసపాదన్నట్లు
రంగులు చెదిరి తుడుచుకు పోతుంటే
అడుగడుగనా ఇక్కట్ల పాలయ్యా ..
అబుదాబీ, శ్రాన్ఫ్రాన్ సిస్కో లలో
ఐఎఫ్ బి ఐ బందీనై పడి ఉన్నా ..


పరాయి ప్రదేశంలో
దిక్కుతోచని స్థితిలో
పరాధీనులమై
గంటల తరబడి ఎడతెగని ఎదురుచూపులు
చేరవలసిన గమ్యం చేరుతానో లేదో
తెలియని సందిగ్దావస్థలోనే


వెనక్కి తిరిగి చూస్తే
నాన్న చెమట చుక్కల
పరిమళంతో పుష్పించిన నేను
అమ్మ గోరుముద్దలతో
బంగారు మొక్కలా ఫలించాల్సిన నేను
ఏమైపోతాను ..? నా వాళ్ళేమైపోతారు .. ??
కల చెదిరిన నన్ను చూసి
పడావు పడిన మట్టిగోడలా మారిపోతానా ..?
ఏమో .. ఏమో …!!!
ఇంతకీ నేను చేసిన నేరం ఏమిటి ?


చేస్తున్న ఉద్యోగం వదిలి
అగ్రరాజ్యంలో ఉన్నత విద్య అందుకోవాలన్న
ఆశల పల్లకిలో ఊరేగుతూ
పై దొంతరలోకి ఎగబాకే ప్రయత్నంలో
జారిపడి నిచ్చెన చివరి మెట్టుపై వేలాడుతున్నా ..
తప్పెవరిదో బలయ్యేది మాత్రం నేను


అందుక్కారణం ఎవరు ?
బడిబండి ఆసుపాసులు తెలుసుకోలేకపోవడమా ..?
కలలకు వలవేసి కమీషన్ కొట్టే కన్సల్టేషన్ కంపెనీలా..?
దిశా నిర్దేశం చేయలేని ప్రభుత్వాలా ..?
అనుమతులు లేని విద్యాలయాలా..?


కారణాలేమైనా
ఏడవలేక ముఖంపై నవ్వులద్దుకుని
జారిపోతున్న స్వప్నం లోంచి
వెలిసిన రంగుల్ని పొదివిపట్టుకుని
ఇంద్రధనుస్సు రంగులు పూయించే ప్రయత్నంలో

వి. శాంతి ప్రబోధ

(సిలికాన్ వ్యాలీ యునివర్సిటీ, నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ వర్సిటి లలో అడ్మిషన్ తీసుకుని కోటి కలలతో అగ్రరాజ్యం బయలుదేరిన విద్యార్థుల పట్ల సానుభూతితో) Published in Kavisangamam 23.12.2015

 

Tag Cloud

%d bloggers like this: