The greatest WordPress.com site in all the land!

Archive for March, 2016

గడ్డి పువ్వు గుండె సందుక

సుదీర్ఘ వేసవి తర్వాత వచ్చిన తొలకరి వాన ఆమెను పులకరింప చేయడం లేదు .  ఆమెలో ఇంకా వేసవి సుడిగాలులే వీస్తూ ..గుండెలో ఎండలు మండిస్తూ ..  పరిపరివిధాల ఆలోచింప చేస్తూ .. మంచు దుప్పటి కప్పుకున్న శీతాకాలంలోలా అప్పుడప్పుడూ కళ్ళ ముందు తల్లిదండ్రుల రూపం తెరలు తెరలుగా ప్రత్యక్షం అవుతూ .. అంతలోనే మాయమవుతూ ..
ఇప్పటి వరకూ అవే ప్రశ్నలు ఎన్నో సార్లు ఎదురైనా .. అప్పుడు లేనంత  బాధ ఇప్పుడు.. తనకి తన తమ్ముళ్ళకి ఇది కొత్త కాదే .. మరెందుకు ఈ సారి మెలిపెట్టి సుడులు తిప్పుతోంది. గుండెను పిండేస్తోంది. అదిమి పెట్టినకొద్దీ ఉబికి ఉబికి పైకి వస్తోంది ఆలోచిస్తోంది 14 ఏళ్ల మణి.
క్లాసు టీచర్ వనజా మేడం  పిలిచి వివరాలు అడిగిన విధం .. క్లాసులో తోటి పిల్లలు స్పందించిన తీరు పదే పదే కళ్ళముందుకొచ్చి ఆమె బాధను రెట్టింపు చేస్తోంది.

ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసుకున్న మణి  కొద్దిరోజుల క్రితమే  ఆరో తరగతికి హై స్కూల్ లో చేరింది.   తాను ఉండే ఆశ్రమం వారిచ్చిన సైకిల్ పై  రెండున్నర కిలోమీటర్ల దూరంలోని బడికి వెళ్లి వస్తోంది. ఆ రోజు తరగతి టీచర్ పిల్లలకి చిన్న అసైన్మెంట్ ఇచ్చి క్లాసులో అందరి పేర్లు రిజిస్టరులో రాస్తోంది. అడ్మిషన్ లో ఇంటిపేరు లేకపోవడం గమనించి మణిని పిలిచి  మీ ఇంటి పేరు ఏంటని అడిగింది.
“ఏమో తెలియదు మేడం ” తలదించుకుని లో గొంతుకతో .
‘ఏవిటీ ..  తెలియదా ..?’ తను సరిగ్గానే విందా అన్న సందేహంతో రాసే పని ఆపి మణి  మొహంలోకి చూస్తూ మళ్లీ అడిగింది  వనజ.
ఈ ప్రశ్న బడిలో మొదట చేరినప్పుడే ఎదురైంది.  ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మనసులో అనుకుంటూ  ‘అవును టీచర్ …, తెలియదు’   ఏదో అడ్డుపడ్డట్టుగా అయి పీలగా మణి గొంతు.
తను అడిగింది ఈ అమ్మాయికి అర్ధమయిందా లేదా అనే అనుమానంతో నీ పేరుకు ముందు ఏమి రాస్తావ్ ..? అంటే A. మణి , B . మణి అట్లా నీవేమని రాస్తావ్ మణికి అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూ వనజా టీచర్.
‘నేను ఏమీ రాయను మేడం . ఉత్త మణి  అనే రాస్తా ” ఆవిడ వైపు చూస్తూ నొక్కి  చెప్పి చప్పున తలొంచుకుంది మణి
అప్పటి వరకూ అసైన్ మెంటుతో పాటే అల్లరి కూడా చేస్తున్న పిల్లలు ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారు.  మణి – టీచర్ ల మధ్య జరుగుతున్న సంబాషణ వైపు వాళ్ళ దృష్టి మళ్ళింది. అంతలో నిశ్శబ్దాన్ని చీలుస్తూ ‘ఉత్త మణి ‘ కిసుక్కుమన్నారెవరో .  ఆ నవ్వుతో జతకలిపారంతా .
ఆ తీరుకు తనకీ నవ్వొచ్చినప్పటికీ దాన్ని పెదాల మధ్యలో బంధించి ‘ సైలెన్స్..  సైలెన్స్’ అంటూ అరిచింది టీచర్.   ఈ పిల్లకి ఇంటిపేరు తెలియకపోవడం ఏమిటి?..  చిత్రంగా ఉందే .. చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా చెప్తారని మనసులోనే అనుకుంటూ,  మీ కులం ఏమిటని మరో ప్రశ్న సంధించింది.
‘తెలియదు మేడం ‘
‘యస్ సి , యస్ టి , బి సి … ‘ అంటుండగా మధ్యలోనే
మరో ప్రశ్నకు తావివ్వకుండా ‘ఏమో నాకవన్నీ తెలియదు మేడం ‘
టీచర్ అడుగుతున్న తీరుకి మణికి  జవాబు  చెప్పాలనిపించలేదు .  తనపై నిప్పుల వర్షం కురుస్తునట్టుగా ఫీలయింది. గొంతులో గూడు కట్టుకున్న బాధ ఆ వేడికి కరిగి కళ్ళలోకి ఉబికి వస్తున్న నీటిని కనిపించనీయకుండా అదీ తెలియదు అన్నట్లుగా తల ఊపి తలదించుకుంది మణి .   ‘ఇంత పెద్దగా అయ్యావ్..  తెలియదా .. షేం షేం ‘ వెనకనుండి మగపిల్లలెవరో బిగ్గరగా ..
‘హా .. చ్చో చ్చో .. ‘ దీర్ఘం తీశారొకరు
‘తెలియదు మేడం ‘ ఆమెను అనుకరిస్తూ అన్నారింకొకరు . అంతా ఘొల్లున నవ్వారు.
మణి తల మరింత వంగిపోయింది. టచ్ మీ నాట్ లా ముడుచుకుపోయింది.
సైలెన్సు సైలెన్సు అని అంటున్న టీచర్  గొంతు ఆ అరుపుల్లో కలిసిపోయింది .
వీళ్ళంతా నన్ను రోజూ ఇట్లాగే గేలి చేస్తారేమో .. బనాయిస్తారేమో .. ఒక వైపు బాధ , దుఃఖం పొంగుకోస్తుండగా దాన్నిదాచేందుకు యుద్ధం చేస్తోంది.  తనలోని ఘర్షణని అదిమిపెట్టిన ఆమె మెదడు చురుగ్గా ఆలోచిస్తోంది.  అప్పుడెప్పుడో ఆశ్రమంలో తాతయ్య చెప్పిన విషయాలు గుర్తుకొచ్చి టక్కున లేచి  టీచర్ దగ్గరకొచ్చి నుంచుంది. తలెత్తి అందరి వైపు చూస్తూ గట్టిగా ‘నా కులం మానవకులం, నా మతం మానవత్వం, నా ఇంటిపేరు భారతీయం’  అని చెప్పి , చాలా ఇంకా ఏమైనా సమాచారం కావాలా అన్నట్టుగా అందరికేసి కలియ జూసింది.  ఆ చూడడంలో ఎవరికీ లేని కులం, మతం , ఇంటిపేరు తనకి ఉన్నందుకు కించిత్ గర్వపడింది కూడా.
ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. ఆశ్చర్యం.  ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ‘అచ్చా… ‘ దీర్ఘం తీస్తూ అన్నాడు ఒకడు  .
‘ఆమె అనాధ మేడం .   అనాధాశ్రమం నుండి వస్తుంది’  సానుభూతిగా చెప్పింది గీత .
‘ఓ .. అవునా..పాపం.. ‘ అని ఒక క్షణం సానుభూతిగా చూసి ‘మరయితే  ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ..’ కసురుతూ  నా టైం అంతా వేస్ట్ చేశావ్ అన్నట్లు చూసి వెళ్లి కూర్చోమన్నట్లుగా చెయ్యి చూపింది క్లాసు టీచర్.
మణి తన సీటులో కూర్చుంది.  పక్కనే కూర్చున్న గీత ‘ ఏయ్ .. నిజంగా మేడం అడిగిన వివరాలు నీకు తెలియదా ..? ‘ గుసగుసగా అడిగింది .
గట్టిగాకళ్ళు మూసుకుని తెరుస్తూ ‘చెప్పానుగా .. ‘ మళ్లీ ఆ ప్రశ్న అడగొద్దన్నట్లు మొహం చిట్లించుకొని సీరియస్ గా చెప్పింది మణి.
టీచర్ పాఠం చెప్పడం మొదలు పెట్టడంతో నెమ్మదిగా  పిల్లల అల్లరి సద్దు మణిగింది. అప్పటికావిషయం మరచిపోయి పాఠంలోకి వెళ్లిపోయారంతా .
లంచ్ టైంలో లెక్కల సారుతో వనజా టీచర్ అన్న మాటలు  మణి చెవినపడ్డాయి.
అవే ఆమె చెవుల్లో బాకా ఊదుతున్నట్టుగా అలజడి కలిగిస్తున్నాయి . తల్లి దండ్రులు లేకపోవడం శాపమా ..? ఏం తప్పు చేశామని ..?  ఈ లోకంలోకి వస్తామని అడుగలేదే .. ? ఎట్లా వచ్చామో తెలియదే .. అది మా తప్పా .. ??!  అంతా మమ్మల్నేందుకు దోషులుగా  చూస్తారు. దూరంగా ఉంచుతారు .   చేయని తప్పుకు మాకెందుకీ శిక్ష?  నేను చదువుకోవాలంటే నేను ఉండాలి కానీ నా పుట్టుక వివరాలన్నీ అవసరమా .. తెలియదు అని చెప్పినా వినిపించుకోకుండా ఆ మేడం మళ్లీ మళ్లీ పట్టి పట్టి అడుగుతోంది .. ఆ టీచరంటే అయిష్టంతోపాటు హృదయంలోంచి పొంగుకొస్తున్న అనేక  ప్రశ్నలు .  చిన్నబడిలో సుధా టీచర్ నేనంటే ఎంత ప్రాణం పెట్టేది.  నువ్వెళ్ళి పోతున్నావ్ మణీ..  నా చెయ్యి ఇరిగినట్టే ఉంటుంది అంది టి. సి. ఇచ్చినప్పుడు.  స్కూల్ లో చార్ట్లపై బొమ్మలు తనతోనే వేయించేది, రాయించేది. తను చేసిన ప్రాజెక్ట్ వర్కులన్నీ ఎంతో ప్రేమగా దాచుకుంది ఆ మేడం.  తన కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అంతే ప్రేమగా చూసుకునేది. ఆశ్రమంలో తాతయ్య మంచి చెడు ఎట్లా చెప్తారో అట్లాగే సుధా టీచర్ చెప్పేది .  ఎప్పుడూ మేం బాధ పడకుండా చూసుకునేది.  ఎవరన్నా అనాధ అన్నా ఊరుకునేదే కాదు. తాతయ్య కూడా అంతే .  ఎంతో ధైర్యం చెబుతారు. సొంత అమ్మా నాన్నా లేకపోతేనేం .. అమ్మానాన్నయి ప్రేమ పంచుతూ బాగోగులు చూసుకుంటున్నారు.   వారి ఆత్మీయ స్పర్శతో తనో అనాధ అన్న భావనే పోయింది అని మనసులోనే తలపోస్తున్న మణిని బడిలో జరిగిన సంఘటన బాగా కుంగదీసింది.

బడికి వెళ్ళాలంటేనే ఒక రకమైన బెరుకు  భయం మొదలయింది.   బడికి పోనంటే ఎందుకని అడుగుతారు  తాతయ్య. ఒకరోజు రెండురోజులు ఏదో ఒకటి చెప్పి తాతయ్యని మభ్య పెట్టవచ్చు. కానీ రోజూ అలా చేయలేను కదా .. జరిగిందంతా తాతయ్యకి చెప్తే ..  ఊహు వద్దులే ..
మా కోసం .. మా లాంటి వాళ్ళకోసమే  తాతయ్య గొప్పజీవితం వదులుకున్నాడని అంటుంటారు. మాతో పాటే ఉంటూ ఎనలేని ప్రేమనందిస్తున్నాడు.  మా అమ్మానాన్నా వాళ్ళు ఉన్నా మమ్మల్ని ఇంత బాగా చూసుకునేవారు కాదేమో..   అలాంటి తాతయ్యకి ఇవన్నీ చెప్పి బాధ పెట్టడం అవసరమా ..  ఎనభై ఏళ్ళ వయసులో మా కోసం ఎంతో శ్రమిస్తున్నారు తాతయ్య.    చూద్దాం.. నా సమస్యని నేను పరిష్కరించలేనంత  పెద్ద సమస్య కాదులే..అని తనకు తాను చెప్పుకుంది. అలా అనుకున్టుంటే హృదయం కొంత తేలికయింది.  నేను ధైర్యంగా ఉంటే నా సమస్యలన్నీ పరార్ అవ్వవూ ..?!   అని తనలో తాను చిన్నగా నవ్వుకుంది.  అవును, తాతయ్య చెప్పేది అదే కదా..  ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవమని. ఎట్టి పరిస్తితిలోనూ ధైర్యం కోల్పోవద్దనీ.. మరిప్పుడు నేనేంటి ఇంత పిరికిగా ఆలోచిస్తున్నా అని తన తలపై మొట్టికాయ వేసుకుంది.  అసలు  నేనేం తప్పు చేశానని బడికి మానేయాలి.  ఒక వేళ నేను తప్పు చేస్తే అది దిద్దుకోవాలి కానీ బడి మానేయడం అంటే మరో తప్పు చేసినట్లే కదా .. తెలిసో తెలియకో వాళ్ళు ఏదో వాగారని నేను బడి మానేస్తేనే తప్పు .  ఇదేనా నేను మీకు నేర్పించింది అని తాతయ్య ఖచ్చితంగా  బాధపడతారు.  అయినా క్లాసులో నా కన్నా చిన్న పిల్లల మాటలకి నేనంత విలువనిచ్చి బడి మానెయ్యడమేమిటి?  చాలా తప్పుగా ఆలోచించాను. అనవసరంగా ఆందోళన పడుతున్నాను, భయ పడుతున్నానని తనకు తాను లెంపలేసుకుంది. లేచి వెళ్లి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారో చూసి వచ్చింది. మళ్లీ పుస్తకం అందుకుంది.

మరుసటి రోజు బడికి రాగానే ‘ఏమో తెలియదు మేడం ‘ రెండుమూడు సార్లు మణికేసి కొంటెగా  చూస్తూ అన్నాడు క్లాసులో వెనక బెంచిలో కూర్చున్న ప్రసాద్ .
‘ఒరేయ్ జానెడు బెత్తడు లేవు . ఏమంటున్నావురా ..’ గుడ్లురిమింది
‘ఆ..  నువ్వున్నావుగా కాడిలాగా .. తాడిచెట్టంత నాకిస్తావా ..’ వెటకారంగా ప్రసాద్
‘ఒరే .. దానితో నీ కేంటి రా … అదెవరో … ఎట్లా పుట్టిందో .. కులం లేదు , మతం లేదు .. కనీసం ఇంటిపేరు  లేదు . . ‘ చిన్న చూపుగా అన్నాడు ఓం ప్రకాష్
ఊర్కుంటే రోజు ఇట్లాగే తనని ఏడిపించడం మొదలు పెడతారు. వాళ్ళ ఆటలు సాగనివ్వకూడదు కానీ ఎలా .. లిప్తపాటు ఆలోచించి, రగిలే కోపాన్ని ఆర్పుకుంటూ   ‘ఏం తమ్మీ  .. మాటలు మంచిగా రానివ్వు ..” మొహంపై నవ్వు పులుముకుని అంది .
‘ఛి చ్హి .. ఎవరే నీకు తమ్మి .. నేనేంటి .. నువ్వేంటి  ? చ్చీ .. ‘ ఏవగింపుగా చూస్తూ ప్రసాద్
‘ప్చ్ పాపంరా .. అట్లా  అనకు , ఆమె బాధ పడుతుంది. ‘ అన్నాడు రాజీవ్
‘బాధ ఎందుకురా .. మేమేమీ తప్పు మాట్లాడలేదే , ఉన్నదేగా .. ‘ దీర్ఘం తీశాడు ప్రసాద్
‘ఆమెకు ఏదో శాపం తగిలింది. అట్లాగే కావాలి . క్లాసులో నన్ను మొదటి లీడర్ కానివ్వలేదు కదా .. మంచిగయింది ‘ ఉక్రోషంతో అన్నాడు ఓంప్రకాష్ .
క్లాసులో ఆమె మొదటి లీడర్ కావడం వాడికి నచ్చలేదు. తనే కావాలనుకున్నాడు. ‘వాడేంటో  వాడికి తెలియదు కానీ పేద్ద .. పెత్తనం చేస్తానంటాడు’ .  గొణిగాడు రాజీవ్
‘అరే .. నిన్న ఆమె సైకిల్ లో గాలి నువ్వే తీసావని తెలిస్తే మేడం నీకే పనిష్మెంట్ ఇస్తారు ‘ ఓంప్రకాష్ చెవిలో గొణిగాడు పక్కనే కూర్చున్న గోరేమియా.
‘ అబ్బ ఛా .. నాకు తెలీదు .. అయినా  ఎవరు చెప్తార్రా ..ఆ .. ఎవరు చెప్తారు ? నువ్వు గానీ చెప్పవుకద ..’ కళ్ళెగరేస్తూ కొంచెం బెదిరింపుగా
‘అరె బై నేనెందుకు చెప్త .. ‘ మిత్రుడి చేతిలో చేయి కలుపుతూ గోరేమియా
‘దానికి ఏం తెలియదు గానీ పొగరుకి తక్కువ లేదు . సోకుకి తక్కువ లేదు .. అయ్యవ్వలేవరో తెల్వని దానికి క్లాసు లీడర్ చేసిన ఆ టీచర్ కి దిమాక్ లేదు. .. ‘ ఉక్రోషంగా ప్రసాద్
‘ఒరేయ్ గీ అడుక్కు తినేదానికి సైకిల్ కావాల్సొచ్చిందా .. ఇవ్వాళ సాయంత్రం లోపు ఎవ్వరూ చూడకుండా టైర్ బ్లేడుతో కోసేద్దాం ‘  కసిగా అన్నాడు ఓంప్రకాష్
‘ ఏమిటర్రా మీ క్లాస్ గోల స్టాఫ్ రూం లోకి వినిపిస్తోంది, కొత్తపిల్లలు కామ్ గా ఉంటారనుకుంటే ఇంత అల్లరివాళ్ళా  అంటూ సోషల్  టీచర్ రేఖ  క్లాసులోకి రావడంతో అంతా కామ్ అయ్యారు.  ఆవిడ పాఠం మొదలు పెట్టబోతుండగా ఓంప్రకాష్  లేచి మేడం మీతో మాట్లాడాలి అన్నాడు. క్లాసు అయిన తర్వాత మాట్లాడతా అంటూ పాఠం మొదలు పెట్టారు ఆవిడ.   కొన్ని క్షణాల తర్వాత మళ్లీ లేచి నుంచున్న ఓంప్రకాష్ ‘ఇప్పుడే మాట్లాడాలి ‘ గట్టిగా అంటూ వెనక బెంచీ నుండి టీచర్ ముందుకు వచ్చాడు.
ఊ .. చెప్పమన్నట్లుగా చూశారావిడ .
‘మేడం, క్లాసులో మొదటి లీడర్ గా ఆమెను నేను ఒప్పుకోను.  ఆమె గెడకొయ్యలాగ పెద్దగా కనిపిస్తాందేమో కానీ..  ఇది పెద్దగాలేదు.  స్క్రూ లూజు. ‘ మణి కేసి చూపి ఆ చూపుడు వేలు కణతల దగ్గరగా పెట్టి తిప్పుతూ అన్నాడు .
‘అవునా .. ‘ఆశ్చర్యం నటిస్తూ రేఖ
‘అవును మేడం , మీకు తెలియదా నిన్న క్లాస్ టీచర్ తో ఏం చెప్పిందో .. ఆమెకు ఇంటిపేరు తెలియదు , కులం పేరు తెలియదు . పిచ్చిదా..  మంచిదా .. ఇట్లాటిది క్లాసు లీడరా .. దాన్ని పోయి కులం, గోత్రం తెల్సుకొని రమ్మనాలిగానీ ..  ‘ ఏదో గొప్ప విషయం కనుక్కొన్నట్లుగా  ఫోజు పెట్టి అంటున్న ఓంప్రకాష్ మాటలు పూర్తికాకుండానే
‘దీనికి బడి అవసరమా .. ‘ ప్రసాద్ అరిచినట్లుగా ..
అతనికి అసలే ఆడపిల్లలంటే చులకన భావం.  తల్లిదండ్రులులేని ఆడపిల్లని మణిని నిన్నటి నుండీ మరింత చులకనగా చూస్తున్నాడు.
‘అయిందా ..నువ్వు చెప్పాలనుకున్నది, ఏ అమ్మాయినయినా అది ఇది అన్నావంటే బాగుండదు.. వెళ్లి కూర్చో’ ఓంప్రకాష్ తో కటువుగా అని ప్రసాద్ వైపు గుడ్లు మిటకరించి చూసి ‘ఇంకోసారి ఇలాంటి మాటలు విన్నానంటే క్లాసులో ఉండవు, జాగ్రత్త .. ‘ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది టీచర్. ఆ వెంటనే నీవేం పట్టించుకోకు అన్నట్లుగా ఆవిడ మణి కేసి సానుభూతిగా  చూసింది.  కానీ, అప్పటికే మణి మొఖం పేలవంగా మారడం  ఓంప్రకాష్, ప్రసాద్ ల కేసి ఉక్రోషంగా చూడడం టీచర్ దృష్టిని దాటిపోలేదు.
కళ్ళు పుస్తకంలోని అక్షరాల వెంట పరుగులు పెడుతున్నాయి కాని అవి ఆమె బుర్రలోకి చేరడంలేదు.  ఆలోచనల  తేనెతుట్టె వదలడం లేదు. తేనెటీగల గుంపు దాడిచేసి ముళ్ళతో గాయపరుస్తున్నట్లుగా ..   బుర్రలోకి చొచ్చుకోస్తున్న రకరకాల ప్రశ్నల ముళ్ళు .

టీచర్ పాఠం చెబుతున్నారు . కానీ , అది మణి బుర్రలోకి దూరడం లేదు.  ఆమె మెదడు ఆలోచిస్తోంది. హృదయం ఆవేదన చెందుతోంది. అయినా తనెందుకు బాధ పడాలి. ఆ అబ్బాయి అన్నది నిజమేగా .. తనకి కులం, మతం తెలియదు. ఇంటిపేరు తెలియదు. తాతయ్య చెప్పినట్లు చెప్పినప్పటికీ క్లాసు అందరికీ తానో అనాధ అని అర్ధమయిపోయింది. అయితే ఏమయింది. ఉన్నదేగా ..  వాళ్ళేం తప్పు మాట్లాడలేదు అని తనను తాను సర్ది చెప్పుకుంటోంది.  అయినా .. అమ్మా నాన్న లేకపోతే .. నేను వాళ్ళ లాంటి దాన్ని కాదా ..? నా కులం , మతం , పుట్టు పూర్వోత్తరాలు వారికి అవసరమా .. నేను చదువుకోవడానికి , నేను లీడర్ గా ఉండడానికి వాటికి సంబంధం ఏమిటి ..అర్ధం కావడం లేదు .  ఆమెలో గుండు సూదితో పోడిచినట్లు  అలజడి మొదలై పెరిగిపోతూ .. లోలోన ఎంతో ఘర్షణ.   తన ఉనికిని నిలబెట్టుకోవాలంటే తను స్వయం ప్రకాశంగా నిలవాలి . ఇలాంటి మాటలు అసలు పట్టించుకో కూడదు . ఈ ముళ్ళను ముందు ఏరెయ్యాలి.   తాతయ్య చెప్పినట్టు మేం గడ్డి పువ్వులం కాదు. సువాసనలు విరజిమ్మే సుమాలం.   కోపం తగ్గించుకుని చిరునవ్వే నీ ఆభరణం చేసుకో తల్లీ అంటూ  తాతయ్య దగ్గర కూర్చోబెట్టుకుని చాలా సార్లు చెప్పారు .  అది నిజం చేయాలి.   ఏనాటికైనా నేను గెలుస్తాను. వీళ్ళందరినీ గెలుస్తాను  అని తనను తాను చెప్పుకుంది మణి.
నిర్మలంగా కనిపించాలని పాఠం వినాలని ప్రయత్నిస్తున్న ఆమెలో ఆరని  ప్రశ్నలు చేలరేగుతూ .. ఆలోచనలు ఎక్కడెక్కడికో ఎగిరిపోతూ ..

***                 ****

నాన్న జబ్బుచేసి  చనిపోవడం తనకు గుర్తే .  అప్పుడు అత్తమ్మ వాళ్ళు అమ్మని బాగా తిట్టారు. ఎందుకు తిట్టారో తెలియదు. ఆ తర్వాత కొద్ది రోజులకే చిన్న తమ్ముడు పుట్టాడు.  అమ్మ  పిచ్చిదై పోయింది. ఏదేదో మాట్లాడేది.  మమ్మల్ని కొట్టేసేది. ఒకసారైతే పెద్ద తమ్ముడిని బస్ కిందకి తోసేసింది.  డ్రైవర్ అమ్మని బాగా తిట్టాడు. చిన్న తమ్ముడికి అసలు పాలే ఇచ్చేది కాదు. ఏదేదో మాట్లాడేది. నాన్న పేరు ఎత్తితే గొంతు పట్టేది. అత్తమ్మ వాళ్ళే చిన్న తమ్ముడిని కొన్ని  రోజులు వాళ్ళింట్లో ఉంచుకున్నారు.   పెద్ద తమ్ముడికి తిండిపెట్టడం, స్నానం చేయించడం అన్నీ తనేగా చేసింది. అప్పుడు అమ్మ ఎటెటో తిరిగేది.  అత్తమ్మ వాళ్ళ మీదకు కరిచినట్టు పడేది. మాట్లాడేది కాదు.   వాళ్ళు అమ్మను కర్రతో కొట్టేవారు. అట్లా అమ్మని వాళ్ళు కోడతాంటే తను, పెద్ద తమ్ముడు ఏడవడం బాగా గుర్తే.   అమ్మ మిమ్ములను ఎప్పుడో  చంపేస్తది అనేది  అత్తమ్మ.  అమ్మ దగ్గరకి మమ్ములను పోనిచ్చే వారుకాదు. ఒక్కోసారి అమ్మ మేమంటే ఎంతో మంచిగ ప్రేమగా ఉండేది. అయినా ,  కొన్ని రోజులయ్యాక ఒక మేడం వచ్చి మమ్ముల్ని ముగ్గురిని నిజామాబాదుకు తీసుకుపోయింది.  బాలసదనంలో రెండురోజులు ఉంచారు. ఆడపిల్లలు మగ పిల్లలు వేర్వేరుగా ఉంచుతారన్నారు. అక్కడ మమ్ముల్ని ముగ్గురినీ ఒకే దగ్గర ఉంచడం కుదరదని వేరే చోటుకు పంపారు.  అది అనాధాశ్రమం. అప్పటికి తనకి  ఎనిమిదేళ్ళు ఉన్నాయో లేదో .. నాన్న ఉన్నప్పుడు అంగన్వాడీ కి వెళ్ళేది.  ఆ తర్వాత మూడేళ్ళలో బడికి పోనేలేదు. అమ్మ పిచ్చిదవడంతో చిన్న తమ్ముడిని దాదాపుగా తనే పెంచింది.

అనాధాశ్రమంలో  తమ్ముళ్ళతో పాటు తనని బడిలో వేశారు. బడి అంటేనే భయం వేసేది. క్లాసులో అందరికన్నా పెద్దదాన్ని. మొదట్లో కొందరు వెక్కిరించేవారు. ఆ తర్వాత అలవాటయింది .  అందరు మంచిగా చూసుకున్నారు. నెమ్మదిగా అక్షరాలు నేర్చుకోవడం మొదలు పెట్టాను . దీపావళి పండుగ నాటికి అక్షరాలన్నీ వచ్చేశాయి. మేడం రెండో తరగతిలో వేశారు. పెద్ద తమ్ముడు  క ఖ లు నేర్చుకుంటున్నాడు. చిన్న తమ్ముడిని అంగన్వాడి బడిలో కూర్చోబెట్టి నేను నా బడిలో కూర్చునేదాన్ని.  నాకు చదువు మీద కంటే తమ్ముళ్ళ మీదే ధ్యాస.  చిన్నోడికి అమ్మ అంటే తెలియదు . పెద్దోడికి ఆ జ్ఞాపకాలు లేవు. నాకే అమ్మ మీద మనసు పీకుతుంది. నాన్న చనిపోకముందు వరకు ఎంతో మంచిగా ఉన్న అమ్మ .. నన్ను పెద్ద తమ్ముడిని ఎంతో ప్రేమగా మురిపెంగా చూసుకున్న అమ్మకేమయింది ..?  ఎందుకు పిచ్చిదైయింది .. అమ్మమ్మ వాళ్ళు , అత్తమ్మ వాళ్ళూ ఎవరూ ఆమెను దవఖానకు ఎందుకు తీసుకుపొలేదు .. చిన్నగా జ్వరమొస్తేనే పోయి సూది పోడిపిచ్చుకొని గోలీలు ఏసుకుంటారు కదా .. అమ్మకి ఎందుకు చూపించలేదో .. ప్రశ్నల వరద సుడులు తిరుగుతూనే..
మమ్మల్ని పెంచిన ఆశ్రమం వాళ్ళు ఏడెనిమిది నెలలకే నిజామాబాదు మేడంకి ఇచ్చేశారు. అప్పుడు ఆ మేడం ఎవరెవరితోనో మాట్లాడి ఈ తాతయ్య దగ్గరికి పంపించారు. ఇక్కడ మాలాంటి పిల్లలే అందరూ . ఒక్కొక్కరిదీ ఒక్కో కథ .. చాలామందికి ఎవరూ లేరు.  ఏమో .. మాలాగే ఉన్నారేమో .. తెలియదు.  మాకు అమ్మ ఉంది ..కానీ , లేనట్టే పెరుగుతున్నాం. ఎవరైనా అడిగినప్పుడు తప్ప మాకు అమ్మా నాన్నలు గుర్తు రావడంలేదు.  ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉందో .. ఎక్కడ ఉందో .. ఏం చేస్తాందో ..

ఒకసారి మా ఊరు వెళ్లోస్తే … ఎట్లా వెళ్ళేది ?   మమ్మల్ని ఇక్కడికి పంపిన మేడం వస్తే అడిగా .. మా ఊరు తీసుకెళ్ళమని . సరే ఎప్పుడన్నా సెలవులకు పంపుతానంది . కాని ఇంతవరకూ రానేలేదు.
మా నాన్న ఉన్నప్పు డు అంతా .. అత్తమ్మ వాళ్ళు , అమ్మమ్మ వాళ్ళు , చిన్నమ్మ వాళ్ళు అందరూ వచ్చేవారు. అమ్మ దగ్గరో , నాన్న దగ్గరో పైసలు పట్టుకుపోయ్యే వాళ్ళు .  ఏమైంది వీళ్ళకి  ఒక్కసారి కూడా రావడం లేదు.  మమ్ములను చూడాలని వాళ్లకి లేదా .. లేక పొతే మేం ఎక్కడున్నామో వాళ్ళకు తెలియదా .. అంతే అయుంటుంది. వాళ్ళకి తెలిస్తే రాకుండా ఎందుకుంటారు. పండుగలకు తీసుకెళ్ళకుండా ఎందుకుంటారు ? వేలవేల ప్రశ్నలు ఉదయిస్తూ తలను భారంగా మార్చేస్తూ

ఏనాటికైనా తన వాళ్ళను కలువకపోతానా అని ఎక్కడో చిన్ని ఆశ . తనకి తన ఊరు పేరు మాత్రమే తెలుసు. నాన్నని అత్తమ్మ నర్సన్నా అనేది. ఊళ్లో వాళ్ళు నర్సిమ్మ్మా అనేవాళ్ళు. అమ్మని సాయవ్వా అనేవాళ్ళు . అంతే గుర్తు.. నన్ను ఇక్కడి నుండి ఎవరు పంపుతారు .  నేను తెల్సుకోవాలంటే ఎట్లా .. ముందు నేను బాగా చదువుకోవాలి . ఉద్యోగం చేయాలి. తమ్ముళ్ళతో  తీయని జ్ఞాపకాల జీవితాన్ని తయారు చేసుకోవాలి.
అమ్మకి పిచ్చి తగ్గిందో లేదో .. మా కోసం వెతుక్కుంటూ ఉందేమో .. మేం కనపడక ఎంత ఏడ్చిందో పాపం. అమ్మ అన్నం తిన్టాందో లేదో .. పిచ్చిది కదా ఎవరు పెడతారు .  నేను పిచ్చిదాని కూతురునని తెలిస్తే వీళ్ళంతా నన్నూ పిచ్చిదంటారా ..? ఏమో .. లోపల్నుచి వణుకు . ఆలోచిస్తున్న మణి కళ్ళముందు ఉదయం బడికి వచ్చే దార్లో  కనిపించిన పిఛ్చామె ..ప్రత్యక్షమైంది.  ఆమె పిచ్చిది.  మా అమ్మ.. పిచ్చిదే..  ఆ.. మె .. మా అమ్మ ..?     ఏమో .. కాకూడదని ఏముంది ? ఎందుకో ఆ ఊహ రాగానే.. ఒక తీయని అనుభూతితో  ఆమె గుండె దడదడలాడింది.  ఆ వెంటనే అందరూ పిచ్చిదాని కూతురునని నన్నూ పిచ్చిదానిగా చూస్తారేమో .. భయం తొంగి చూసింది .  నిజంగా ఆమె మా అమ్మయితే .. పిచ్చిదయితేనేం .. అమ్మ కదా .. ఆమెలో రక్త ప్రసరణ వేగం పెరిగి గుండె కొట్టుకోవడం స్పష్టంగా తెలుస్తోంది.
ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమెని జాగ్రత్తగా గమనించాలి.   అమ్మయితే .., నన్ను గుర్తు పడుతుందా .. మణెమ్మా అని పిలుస్తుందా ..  గుండెకు హత్తుకుంటుందా .. ముద్దుల వర్షం కురిపిస్తుందా .. ఛా .. అసలు గమనించనే లేదు ఆమె మొఖం .. అయినా ఆమె అమ్మ ఎందుకవుతుంది ? చినిగిపోయి చీలికలు పేలికలు అయిన బట్టలతో .. కింద పైజామా .. పైన జాకెట్  దాని మీద చినిగి పేలికలయిన షర్ట్ తో .. అట్టలు కట్టిన జుట్టు చింపిరిగా .. మట్టికొట్టుకు పోయి .. ఛి చీ .. ఆమె అమ్మ కాదు .. కాకూడదు .. అయినా అమ్మ అట్లా ఎందుకుంటది. చందమామలాంటి ముఖం అమ్మది. చక్కగా గోచీ చీర కట్టుకుంటుంది.   ఆమె అంత పిచ్చి పిచ్చి చేసేది కానీ , ఈమె లాగా చేసేది కాదు కదా ..
ఏమో .. అమ్మేనేమో .. ఇప్పుడట్లా అయిపోయిందేమో .. మేమిక్కడ ఉన్నామని అమ్మకి తెలిసిందా .. అందుకే వచ్చిందా .. ఆ  ఆలోచన రాగానే మణి  గుండె వేగం మరింత పెరిగింది. తక్షణమే బయటకు వెళ్లి ఆమెని చూడాలని కోరిక బలంగా ఎగదన్నుకు వస్తూ .. ఆమె గేటు బయట ఉంటుందా .. ఇంటర్వెల్ లో అందరూ కలసి బయటికి తరిమేశారు కదా ..  అయ్యో .. ఎట్లా .. గేటు బయట ఉంటుందా … లంచ్ బెల్ లో చూడాలి అనుకొంటూ సమాధానం లేని ప్రశ్నలకు జవాబు కోసం  కిటికీ లోంచి బయటకు కళ్ళతో వెతుకుతోంది మణి  . అమ్మయితే .., అమ్మని దగ్గరికి తెచ్చుకోవాలి. తాతయ్య ఏమంటారో .. తాతయ్య మంచివాడు . అర్ధం చేసుకుంటాడు.   తాతయ్యకి ఏంతో మంది తెలుసుగా అమ్మ ఆరోగ్యం బాగుచేయిస్తాడు.  అప్పుడు ఎన్ని కస్టాలు వచ్చినా.. ఎంత కష్టమయినా ఎదుర్కోవాలి. అవును, ఎదుర్కోవాలి తాతయ్య సాయంతో .  ఆ ఆలోచనే ఎంతో ధైర్యాన్నిస్తోంది.  ఒక వేళ అమ్మ కాకపోయినా నేను నేనుగా నిలబడాలి. తాతయ్య బాధ్యతలు నేనూ పంచుకోవాలి. గడ్డిపువ్వునే అయినా గుడ్డిపువ్వులాగా ఉండకూడదు. ఆమె ఆలోచనలు ఎటునుండి ఎటో ప్రయాణిస్తూ .. ఆలోచనల్లో ఇంద్రధనస్సులు మెరిపిస్తూ .. అన్నిటినీ గుండె సందుకలో భద్రంగా దాచుకుంటూ.

***                     ***               ***

పాఠం చెప్పి విద్యార్థుల్ని ప్రశ్నలేస్తూ, పిల్లల అసైన్ మెంట్ చూస్తూ మధ్య మధ్యలో మణిని గమనిస్తూనే ఉంది రేఖ.  ఆ టీచర్ మనసు మణి గురించే తీవ్రంగా ఆలోచిస్తోంది.  అసైన్మెంట్ పేపర్స్ చూడడం ఆపి మణికేసి చూస్తూ, ఆ అమ్మాయి చాలా బాధ పడుతున్నట్లుంది. ఓంకార్ వాళ్ళ బాచ్ ని ఆఫీసు రూంకి పిలిచి ప్రత్యేకంగా మాట్లాడాలి, వాళ్లకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అదే విధంగా మణి చుట్టూ ముసిరిన వేదన నుండి కాపాడాలి. ఆమెలో నిర్లిప్తత, ఆత్మన్యూనత రాకుండా చూడాలి. ఉత్సాహం నింపాలి . అందుకు  అవసరమైన సహకారం అందించాలంటే ఎట్లా .. ?  ప్రతి క్లాసులోనూ ప్రత్యేక పరిస్తితుల్లో ఉండే పిల్లలు ఉంటూనే ఉంటారు . వాళ్ళను గమనించి వారి ఆత్మాభిమానం దెబ్బతినకుండా ప్రతికూల పరిస్తితుల్లోకి పోకుండా  చూసుకోవాలి.  ఆత్మవిశ్వాసం , ఆశాభావం పెంపొందేలాగా చూడాలి. అలా చేయాలంటే  ఓం ప్రకాష్ లాంటి ఒకరిద్దరికి కౌన్సిలింగ్ మాత్రమే కాదు పిల్లలందరికీ అవగాహన అయ్యేట్లు చెప్తే బాగుంటుందేమో .. అవును, అలా చేస్తేనే మంచిది.  ముందుగా ఈ విషయం హెడ్ మాస్టర్ తో మాట్లాడి ఒక రోజు స్కూల్ లో పిల్లలందరికీ ప్రత్యేక అవసరాలలో ఉండే పిల్లలతో ఎలా మెలగాలో తెలపితే బాగుంటుంది.   కానీ , మిగతా టీచర్లు ఏమంటారో .. ?!
తామే ఆ పరిస్తితిలో ఉంటే ..ఆ కోణంలోంచి ఆలోచించే సహానుభూతే  సహజానుభూతి అయ్యేలా  పిల్లల్ని మలచడానికి,  ఈ వయసులో పిల్లల్లో మొలకెత్తే విష బీజాల్ని తుంచేసి సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడడం ఉపాధ్యాయులుగా తమ బాధ్యత అని తలపోస్తూన్న సమయంలో రేఖా టీచర్ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ బెల్ మోగింది.   హెడ్ మాస్టర్ ని ఒప్పించి సమయం తీసుకునే  లోపు ఓం ప్రకాష్ వాళ్ళతో మాట్లాడాలనీ  మనసులోనే చేయవలసిన పనికి సంబంధించిన  ప్రణాళిక వేసుకుంటూ… క్లాసు బయటికి నడిచింది రేఖ.  ఆ వెనుకే గబ గబా గేటుకేసి పరుగు తీసింది మణి చేజారిన ఆశల్ని వెతుక్కునే ప్రయత్నంలో ..

Pudlished in Navathelangana Sunday suppliment Sopathi on 6th March, 2016

Tag Cloud

%d bloggers like this: