The greatest WordPress.com site in all the land!

Archive for December, 2014

ఉగ్రవాదం కాదు.. నింగిని మించిన ఇంగితం కావాలి

ధన్ .. ధన్ .. ధనా ధన్

విచక్షణారహితంగా వస్తున్న శబ్దం

అంతా బొక్క బోర్లా పడుకోమని మాస్టారి ఆదేశం

వచ్చేస్తోంది .. వచ్చేస్తోంది ..

కరాళ మేఘంలా గాలిలో నాట్యం చేస్తూ

మా వైపే వడివడిగా అడుగులేస్తూ ..
ధన్ .. ధన్ .. ధనా ధన్

పేలుళ్లు గ్రెనేడ్ శబ్దాలు

మా శరీరాలను చీల్చుకుంటూ
మా ఆశల్ని ఆశయాల్ని చిద్రంచేస్తూ ..
నెత్తురు ముద్దల్లా మార్చేస్తూ
రక్తపుటేరులు పారిస్తూ
ఉంటే .. నాలో బతకాలన్న ఆశ వటవృక్షంలా
పెరిగిపోతుండగా.. కలుగులో దాక్కున్నట్లుగా
బెంచీ కింద దూరి కనుకోనుకుల్లోంచి చూశా

దేశాన్ని కాపాడే మా నాన్నలు రోజూ
వేసుకునే దుస్తుల్లో  వీళ్ళు

ఉగ్ర కార్ఖానాలో తర్ఫీదు పొందిన మిలిటెంట్లు
మేమేం చేశామని .. ? మా జీవితాల్ని కాలరాస్తున్నారు
కర్కోటకులైన వీళ్ళకేం తెలుసు జీవితం విలువ
గాయం సలుపుతుండగా మదిలో రేగే ప్రశ్నలు

పిచ్చికుక్కల్లా చెలరేగిపోతూ

రక్తపిపాసి క్రురంగా చూస్తూ
భూతంలా నా వేపే కదులుతూ
ధన్ .. ధన్ .. ధనా ధన్

 శకునిలా  వ్యవహరించిన నాదేశం
లో.. మమ్మల్నే బలితీసుకోవడమా ..?!
మనిషి మనిషికి చేస్తున్న ద్రోహం
ఉర్విలో అరికట్టి ఉరి తీయండి ఉగ్ర రక్కసిని
నింగిని మించిన ఇంగితం
ప్రదర్శించి ప్రపంచ మానవాళిని
శ్వాసించనీయండి ..నా ఆలోచనని
శ్వాస నిశ్వాసలని  నిలువరిస్తూ
మళ్ళీ ధన్ .. ధన్ .. ధనా ధన్
వి. శాంతి ప్రబోధ

(16. 12. 2014 పాకిస్తాన్ లోని సైనిక పాఠశాలపై ఉగ్రవాదుల  దాడిని ఖండిస్తూ   విద్యార్థుల మృతికి సంతాప సూచకంగా .. )

మంచినీరును రక్షించుకున్నాం … అడ్డంకులు దాటుకుంటూ …

048

మంచినీరును  రక్షించుకున్నాం …

నా పేరు నిరోషా. ముగ్గురన్నల ముద్దుల చెల్లెల్ని. అన్నల తరవాత చాలా కాలానికి పుట్టానని అంతా నన్ను గారాబంగా చూసేవారు. మా కుటుంబంలో ఉన్న ఒకే ఒక ఆడపిల్లను కావడం కూడా కారణం కావచ్చు. ఎందుకంటే మా చిన్నాన్నలకి, అత్తమ్మకి అందరికీ మొగపిల్లలే కదా . అందుకే  నేను ఏదంటే అది సాగేది. అట్లాని నేను ఏమి గొంతెమ్మ కోరికలు కోరేదాన్ని కాదు.  అన్నలు ఎప్పుడన్నా తిడుతుంటే నాన్న ఊరుకునేవాడు కాదు. పోనీలేండి ఆడపిల్ల. చిన్నపిల్ల అనేవారు.  నాయనమ్మేమో నాలుగురోజులయితే మరో ఇంటికి పోయే దానితో మీకు ఏంటిరా గొడవ అనేది.  నాయనమ్మ అట్లా అంటే కోపం వచ్చేది. ఎదురు తిరిగి ఏమన్నా అనబోతే అమ్మ కోప్పడేది పెద్ద వాళ్లకు ఎదురు చెబుతున్నావ్ అంటూ . నేను నా ఫ్రెండ్స్, మా బాలసేవాసంఘం కార్యక్రమాలతో బిజీగా ఉండేదాన్ని. వేళాపాల లేకుండా తిరుగుతున్నానని జోగుదానిలాగా ఆ తిరుగుడేంటి అని అప్పుడప్పుడూ  నాయనమ్మ కసిరేది.  నాన్న సపోర్ట్ నాకుందిగా .. ఆవిడ మాటలు నేనసలు పట్టించుకునే దాన్ని కాదు.  మా పిల్లల గ్రూప్ అంతా కలసి గ్రామంలో చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళం. నేను చురుగ్గా ఉంటానని అంతా మెచ్చుకునేవాళ్ళు.  మా ఫ్రెండ్స్ కొందరు స్కూలు ఇల్లు తప్ప వేరే ఏమీ లేదు.  వాళ్లకి నేనంటే కుళ్ళుగా ఉండేది. నిజానికి మంగ నాకన్నా తెలివైనది. కానీ ఆమెని ఇంట్లోంచి కదలనిచ్చేవారు కాదు. వాళ్ళని ఒప్పించుకుని బయటకు వచ్చే ధైర్యం ఆమెకు లేదు.  తను గానీ వచ్చిందా అన్నిట్లో నాకన్నా తనే ముందుంటుందని నాకు తెల్సు.  కానీ తనకు తెలీదేమో రాదు. మా ఇంట్లో ఏమనరని కుళ్ళుకుంటుంది.

నేను తోమ్మిదోతరగతిలో ఉండగా ఒకరోజు బడినుండి ఇంటికి వస్తూ గమనించాం.  మా అవతల బజారులో ఉన్న ఇంటి దగ్గర లెట్రిన్ గుంత తవ్వడం. వెంటనే ఆ ఇంటి అతనికి చెప్పాం నేనూ నా ఫ్రెండు. అంకుల్ ఇక్కడ తవ్వితే ఆ పక్కనే ఉన్న బజారు పంపు నీళ్ళు తాగడానికి పనికిరాకుండా పోతాయి.  మన నాలుగైదు బజార్లకు ఇదే మంచి నీటి బోరు అని. అతనసలు మా మాటే పట్టించుకోలేదు. మా దొడ్లో మా ఇష్టం వచ్చిన దగ్గర తవ్వుకుంటం మీరేంటి చెప్పేది అని తిట్టాడు.  అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి కొద్ది సేపయ్యాక మా సభ్యులం అంతా కలసి సర్పంచ్ కి చెప్పాం. అతను నేను చుస్తాలే అన్నాడు.  కానీ పట్టించుకోలేదు.  మళ్ళీ మేమంతా గుంత ఆపాల్సిన్దేనని ఆ ఇంటికి వెళ్లి పట్టుబట్టి అక్కడే కూర్చున్నాం.

ఈళ్ళని కాదు. ఈ ఆడిపోరగాళ్ళని జోగోల్లలేక్క ఊరుమీద వదిలిన వాళ్ళని అనాలి అని తిట్టేసరికి చాలా కోపం వచ్చింది. మాతో మగ పిల్లలూ ఉన్నా వాళ్ళనేమి అనకుండా ఆడపిల్లల్నే ఎందుకు తిడుతున్నారు ..? ప్రశ్న తొలుస్తాంది. అయినా మా పని ఆపలేదు. మళ్ళీ సర్పంచ్ దగ్గరికి, వార్డ్ మెంబర్ త్దగ్గరకి, యూత్ దగ్గరకి డ్వాక్రా అమ్మల దగ్గరకి వెళ్లి చెప్పాం. అక్కడ తవ్వడం వల్ల భవిష్యత్ లో ఎదుర్కొవలసిన సమస్య గురించి వారికి అర్ధమయ్యేలా వివరించాం. ఆ తెల్లవారి ఆదివారం కావడంతో అందరినీ పోగేసి గుంత తవ్వేదగ్గరకి తీసుకెళ్లాం. అందరం కలసి అక్కడ లెట్రిన్ గుంత తవ్వకుండా ఆపి మా మంచినీటి బోరుని రక్షించుకున్నాం.  కానీ, ఆడపిల్లల్ని ఆ ఇంటివాళ్ళు తిట్టిన మాటలు నాకెన్నో సార్లు గుర్తొస్తూనే ఉంటాయి.  ఆడపిల్ల ఇంట్లోంచి బయటికి వెళ్తే .. నలుగుర్లో తిరిగితే ఆమెను ఎందుకు అవహేళన చేస్తారో, జోగుదానిలా ఎందుకంటారో ప్రశ్న వేధిస్తూనే ఉన్నా నేను నా పనులు మాత్రం ఆపలేదు. మా ఇంట్లో వాళ్ళు నాపై ఆ వత్తిడి తేలేదు.  నేనింకా పెద్దదాన్నయితే మా ఇంట్లో వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుందో తెలియదు. ఒక్కోసారి అనిపిస్తుంది నేను ఒక్క ఆడపిల్లను కావడం వల్లే మా ఇంట్లో నాకీ స్వేచ్చ వచ్చిందేమో నని. ఏది ఏమయినా నేను మాత్రం నాకున్న స్వేచ్చని వదులుకోను. అట్లాని మా అమ్మా నాన్నలకి తలవంపులు తెచ్చే పనులు చేయను. నన్ను చూసి ఇంకా కొందరు అమ్మాయిలు చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో ముందుకొస్తున్నారు.  ఇంకా రావాలని కోరుకుంటున్నాను.

నిరోషా,

రాంపూర్

4.
అడ్డంకులు దాటుకుంటూ …

వేసవి సెలవులోచ్చాయి. మా పిల్లలందరం కలసి ఈ సెలవుల్లో ఏదైనా మంచి పని చేద్దాం అనుకున్నాం.  సరిగ్గా అదే సమయంలో సంస్కార్ నుండి కబురు వీధినాటికలపై ట్రైనింగ్ ఉందనీ, మా బాలసేవాసంఘం నుండి ఎంపిక చేసిన నలుగురు సభ్యులని పంపమన్న  సమాచారం అందుకోన్నామో లేదో మేం సమావేశం అయ్యాం. 10 నుండి 18 ఏళ్ల వయసు వాళ్ళు మా సంఘ సభ్యులు.  అందరం  కలసి  ఇద్దరు అమ్మాయిల్ని  ఇద్దరు అబ్బాయిల్ని నలుగురిని ఎంపిక చేసాం. వారు శిక్షణ పొందాం. వచ్చిన తర్వాత మా ఊళ్లో మిగతా పిల్లలకి మేం శిక్షణ ఇచ్చి ఒక జట్టు తయారుచేసుకోవాలి. మా ఊళ్లో ఆడపిల్లల్ని బడికి పంపరు. చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేస్తారు. అందుకే ఆ సమస్యని తీసుకుని వీధి నాటిక  తయారు చేసుకుందామని నిర్ణయించుకున్నాం.  నాతో పాటు శిక్షణ తీసుకున్న అనసూయని వాళ్ళ అన్న వద్దన్నాడని మా కార్యక్రమాలకి రావడం మానేసింది. వాళ్ళన్నయ్య కాలేజికి  చదువుకుంటున్నాడు. వాళ్ళ అమ్మానాన్నలంటే చదువుకోలేదు. తెలియదు.  ఎందుకు వద్దంటున్నారో తెల్సుకుందామని వాళ్ళింటికి వెళ్లాను.

ఆడపిల్లలు తిరిగి చెడిపోతున్నారని .. మా చెల్లిని ఆ తిరుగుళ్ళకి పంపనని ఎంతో ఖచ్చితంగా చెప్పాడు. మగపిల్లలతో కలసి నాటకాలేంటి అని అసహ్యంగా మాట్లాడాడు.  నాకు చాలా కోపం వచ్చింది.  మా ఇంట్లో వాళ్లెప్పుడూ అట్లా మాట్లాడలేదు. అతనలా  మాట్లాడేసరికి ఏడుపు తన్నుకోచ్చేసి ఏడ్చేసా.

మా మీటింగ్లో ఈ విషయం చెప్పా. అనసూయ ప్లేస్ లో వేరే వాళ్ళు ఆ పాత్ర చేయాలని నిర్ణయించుకుని ప్రదర్శనకి సిద్దం అయ్యాం. మా ప్రదర్శనని చూసి కొందరు మెచ్చుకుంటే కొందరు పిల్లలు చెడిపోతున్నారని అన్నారు. ఎవరేమనుకున్నా మేం మా పని మాత్రం ఆపకూడదని నిర్ణయించుకున్నాం. చదువులేకపోవడం వల్ల , చిన్నతనంలోనే పెళ్ళివల్ల ఆడపిల్లలు ఏమి కోల్పోతున్నామో , ఎలా బాధలు అనుభవించాల్సి వస్తోందో తెలియజేస్తూ ఆడపిల్లలు ఎవ్వరం బడి మానొద్దనీ, చిన్నప్పుడే పెళ్లి చేసుకోవద్దని సందేశమిస్తూ సాగింది మా వీధినాటిక. మా ఊళ్ళో రెండు సార్లు ప్రదర్శించిన తర్వాత మా పక్కూరు  పిల్లలు వాళ్ళ ఊర్లో ప్రదర్శన ఇవ్వమని అంగట్లో కలసినప్పుడు అడిగారు. మేమంతా సైకిళ్ళపై వెళ్లి పక్క ఊర్లొ ప్రదర్శన ఇవ్వాలని నిర్ణయం జరిగింది.  ఊర్లో ఏం చేసినా మాట్లాడని మా ఇంట్లో వాళ్ళు పొరుగూరు వెళ్తామంటే మాత్రం ఒప్పుకోలేదు.  ససేమిరా అన్నారు. ఇట్లాగయితే మొదటికే మోసం వచ్చి బడి మన్పిస్తారేమోనని భయమేసి అప్పటికి మా కార్యక్రమం వాయిదా వేసుకున్నాం.   మనీష, కాశామణిలదీ నా లాంటి సమస్యే. ఎదిగిన పిల్లల్ని ఊల్లమ్మట ఎట్లా పంపిస్తాం అంటున్నారు పెద్దలు. అదే మా తోటి మగపిల్లలకి ఆ సమస్యే లేదు.  ఆడపిల్లలం కావడం వల్లే కదా మనకి ఈ సమస్య అని చాలా బాధపడ్డాం.  ఏం చేయాలో ఆలోచించాం.

ఆడపిల్లల్ని, మగపిల్లల్ని తేడాగా చూడ్డం వల్ల, పక్షపాతం చూపడం వాళ్ళ ఆడపిల్లలు ఎంత బాధపడుతున్నారో .. ఎంత నష్టపోతున్నారో అందువల్ల కుటుంబం , సమాజం ఎంత నష్టపోతుందో తెల్పుతూ మరో వీధినాటిక సిద్దం చేసుకుని వేశాం. ఆ ప్రదర్శన తర్వాత మా ఇంట్లో , మరి కొందరి ఇళ్ళల్లో కొద్దిగా మార్పు. రాత్రి 7 గంటల లోపు ఇంటికి చేరాలన్న నియమంతో, నిబంధనలతో నాకు అవకాశం దొరికింది పొరుగూళ్లో ప్రదర్శనకి. నన్ను చూసి మరో ముగ్గురు ఇంట్లో ఒప్పించుకోగాలిగారు. మొత్తం నలుగురు అమ్మాయిలం, ఆరుగురు అబ్బాయిలతో మా బృందం విజయవంతంగా వీధి నాటిక ప్రదర్శనలు ఇచ్చింది. మన్ననలు పొందింది.

ఆడపిల్లను కావడం వల్లే సమస్య వచ్చిందని ముడుచుకుపోయి కూర్చోకుండా మన వాళ్ళని ఒప్పించుకుంటే  అడ్డంకులు ఎదురైనా దాటుకుంటూ  ముందుకు పోతామని నాకు అర్ధమయింది.

గంగాలలిత

రుద్రారం
(published in Prajathantra Nov.30 – 6 Dec 2014)

ఎవరికోసం ఈ అభివృద్ధి ..?

నవంబరు 7వ తేది మా ప్రజాస్వామిక రచయిత్రుల బృందం విశాఖపట్నంలోని కొన్ని పారిశ్రామిక వాడలు సందర్శించిన తర్వాత నా మనసుని మెలిపెట్టిన ప్రశ్నలను, కలిగిన భావనలను మీ ముందుంచుతున్నాను .

ఇప్పుడు అందరి నోటా అభివృద్ధి అన్న పదం సమృద్ధిగా వినిపిస్తోంది. ప్రస్తుత దేశ కాల పరిస్థితుల్ని చూస్తే మదిలో ఎన్నెన్నో ప్రశ్నలు… అసలు అభివృద్ది అంటే ..? ఆ అభివృద్ది ఎవరి కోసం ..? ఎందుకోసం ..? ఎక్కడ జరుగుతోంది ..? ఎలా జరుగుతోంది ..?

బళ్ళు ఓడలు అవడం, ఓడలు బళ్ళు అవడం అంటే ఇదేనేమో ..! ఒకప్పుడు చక్కటి కట్టుదిట్టమైన ఇళ్ళు వాకిళ్ళు , పిల్లా పాపలు , గొడ్డు గోదాతో పసిడి పంటలతో విలసిల్లిన ఆ గ్రామం నేడు వట్టిపోయి వల్లకాడులా మారిపోయింది. ఒకప్పుడు 368 కుటుంబాలున్న ఆ గ్రామంలో ఇప్పుడు మిగిలింది 20 కుటుంబాలే. వారూ ఆ గ్రామం వదలలేక .. చావలేక.. అభాగ్య జీవితం గడుపుతున్నవారే .. ఆ గ్రామమే చుక్కవానిపాలెం.

ఆ గ్రామం ఇప్పుడు కొత్తగా ఏర్పడింది కాదు. ఎప్పుడో.. అంటే వారి తాత ముత్తాతల కాలం నుండీ అక్కడే ఉందా గ్రామం. అక్కడున్నవారంతా చిన్న సన్నకారు రైతులు. మధ్యతరగతి కుటుంబీకులు. పచ్చగా నందనవనంలా కళకళలాడే ఆ గ్రామానికి దగ్గరలోనే 1957 లో హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ కంపనీ ఏర్పాటుచేయాలన్న నిర్ణయం జరిగింది. ఆ కంపనీ అవసరాలకోసం ప్రభుత్వ స్థలాలే కాకుండా స్థానిక రైతుల నుండి కలిపి మొత్తం 365 ఎకరాల స్థలం సేకరించుకుంది. 1964 లో పని ప్రారంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద జింక్ కంపనీగా వెలుగొందింది. కోట్లాది రూపాయల ఆదాయం పొందే సంస్థపై ప్రయివేటు గద్దల దృష్టి పడింది. తరువాతి కాలంలో ప్రభుత్వ వాటా తగ్గి ప్రయివేటు వాటా పెరిగింది. షరా మామూలే .. 2002లో ప్రభుత్వ రంగ సంస్థకి మరణశాసనం రాసి వేదాంత కంపెనీ అధినంలోకి వచ్చింది. 1976లో నిర్మించిన జింక్ స్మెల్టర్ లో పనిచేసే 300 మంది కార్మికులతో బలవంతంగా విరమణ చేయించి నడిరోడ్డుపైకి విసిరేసింది. ప్రతి ఏడాది కోట్ల రూపాయల లాభం అందుకున్టున్నప్పటికి ముడి ఖనిజం కొరత, పవర్, పర్యావరణం వంటి రకరకాల కుంటి సాకులు చూపి జింక్ కంపెనీని మూసేసింది యాజమాన్యం. వాస్తవంలోకి తొంగి చూస్తే .. వేదాంత కంపెనీ గంగవరం పోర్టు కొనుగోలు చేసింది. విశాఖ పోర్టులో రెండు బెర్తుల్ని పిపిపి పద్దతిలో తీసుకుంది. దాంతో స్టాక్ యార్డుల అవసరం ఏర్పడింది. దానికోసం జింక్ కంపనీకి చెందిన స్థలాన్ని చూపించి ఇక్కడి జింక్ కంపనీ రాజస్తాన్ కు తరలించి ఈ కంపనీ ఊపిరి తీసేసింది. ప్రభుత్వరంగ సంస్థల పట్ల , కార్మికుల సంక్షేమం పట్ల మన ప్రజా ప్రభుత్వాలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాయో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలదూ ..?!

Previous Image
Next Image
shithilamaipotuna-pilaka-gangulu-illukunchinchuku-poyina-pilaka-ganguluo-pakka-zink-facotry-aa-pakkane-led-factoryprarave-team-vishakha-field-visit-035vikalnguralaina-bharati-gangulu-chinna-kuturuacid-kalvalaa-paarutu-gangulu-inti-pakkane

ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే మరో వైపు పరిస్థితి ఏమిటో ఓసారి చూడాలంటే చుక్కవానిపాలెమో .. పిట్టవానిపాలెమో వెళ్తే వాటితో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలు, ఆయ గ్రామస్తుల పరిస్థితి ఇట్టే అర్ధమైపోతుంది. ప్రజల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల ప్రజా ప్రభుత్వాల నిబద్దత ఏమిటో, తీసుకున్న బాధ్యత ఏమిటో విశదమవుతుంది.

చుక్కవానిపాలెం ప్రస్తుత స్థితి చూద్దాం. ఏళ్ల తరబడి జింక్ కంపనీ నుండి వెలువడ్డ విషవాయువులు, వ్యర్ధ పదార్ధాలు అక్కడి ప్రజల జీవనాన్ని, పరిస్తితుల్ని చిన్నాభిన్నం చేసేసాయి. . విషవాయువులు, రసాయనాలు గాలిని, నీటిని, వారి శరీరాల్ని కలుషితం చేశాయి. మానసిక శారీరక వైకల్యం, కాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, కీళ్ళు ఎముకల సమస్యలు, హార్మోన్ల అసమానతలు మృత్యు ఘంటికలు మోగించడంతో ఉలిక్కిపడ్డ అక్కడి ప్రజలు చేపట్టిన అనేక ఆందోళనలు, ఉద్యమాలు, ప్రయత్నాల తర్వాత కనీసపు ఉపశమన చర్యగా మంచినీరు సరఫరాకి, వారం వారం డాక్టరు వచ్చి చూసేలా కంపనీ ఏర్పాటు చేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయింది. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో బతికుంటే బలుసాకు తినొచ్చు అని భావించిన అక్కడి ప్రజలు ఎంతో కష్టం మీద పునరావాసం సాధించుకున్నారు. పగిలిన గుండెకు అతుకులు వేసుకుంటూ తుంగవానిపాలెంలో 40 గజాల స్థలంలో 20 గజాల ఇల్లు అందుకున్నారు. చావుడప్పు మోగిస్తున్నప్పటికీ పిట్టగూడు లాంటి ఆ ఇళ్ళలో ఇమడలేనక, గంపెడంత ఇళ్ళను, కన్నతల్లిలా సాకిన ఊరిని వదిలి వెళ్ళలేక 20 కుటుంబాలు చావైనా బతుకైనా అక్కడేనని ఉండిపోయాయి. అలాంటి వారిలో పిలక గంగులు కుటుంబం ఒకటి.

పిలక గంగులుకి నలుగురు అన్నదమ్ములు. అంతా ఒకే ఊళ్ళో ఉండేవారు. అందరి ఇళ్ళు పిలిస్తే పలికే విధంగా ఉండేవి. వాళ్ళలో ఇద్దరు హంతకులెవరో తెలియని హత్యలకు బలై చనిపోతే మరొకరు ఆవురావురంటున్న కాలుష్య కోరల్ని విదిలించుకుని ఊరు విడిచాడు.
పిలక గంగులుకి ఆరు ఎకరాల వరి సాగు చేసే పోలం ఉండేది. గంట్లు, చోళ్ళు. వరి, మినుములు, ఉలవలు, కంది పండించేవారు. రెండు పంటలు పండేవి. 1964 ఎకరం 800 రూపాయలకి తీసుకున్నారు. ఆ తర్వాత 76లో లక్షా తొంబై వేలిచ్చి తీసుకున్నారు. అప్పుడు చాలా మొత్తంలో డబ్బు చేతికి వచ్చిందని ఫ్యాక్టరీకి తన పొలం అప్పజెప్పారు అతని పెద్దలు.

వ్యవసాయదారుడైన పిలక గంగులు చేతిలో పైసా అయిపొయింది. షిప్ యార్డ్ లో కూలిగా మారాడు.
ఒకప్పుడు ఇంటి దొడ్లో కూరగాయలు, పళ్ళు కాయించే వారు. కోళ్ళు, గేదలు ఉండేవి. దేనికి కొదువ ఉండేది కాదు. హాయిగా జీవితం గడచిపోతున్న సమయంలో ఆవరించిన విష మేఘం ఒక్కొక్కరినీ మింగేయడం ఆరంభించింది. అక్కడి మనుషుల్లాగే మొక్కలు , పశువులు, పక్షులు అన్నీ ఒక్కొక్కటీ కనుమరుగవడం జరిగిపోయింది. అవే కాదు, రెండు మూడు తరాలకు గొడుగు పట్టాల్సిన ఇళ్ళు చిక్కి శిథిలాలై చరిత్రలో భాగమైపోయాయి.

పిలక గంగులు సంతానంలో నలుగురు మానసిక వైకల్యంతో చనిపోయారు. ఇద్దరు కూతుళ్ళకు పెళ్లి చేశాడు. ఇద్దరు కూతుళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇద్దరినీ చూపుతూ పెళ్లి చేసుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తారా .. ? అని ప్రశ్నించే గంగులు చిన్నకూతురు, చిన్న కొడుకుశారీరక వికలాంగులే. ఇంట్లో ఉన్న కూతుళ్ళలో కుమారి మాత్రం 10వ తరగతి చదివింది. చిన్నకూతురు లేచి నించోలేదు, నడవలేదు, మాట్లాడలేదు. ఆరడుగుల ఎత్తుండే గంగులు ఐదడుగుల కంటే తక్కువగా రోజురోజుకి కుంచించుకుపోతూ ..

ఆ గ్రామపు నేలపోరల్లో, వాతావరణంలోభాగమైపోయిన వివిధరకాల రసాయనాలను ప్రతి జీవి తమ శరీరపు లోపలి పొరల్లో ఇంకించుకుని దుర్భర బాధలకు, తీవ్ర నష్టానికి బాదితులైనవే .. నేటికీ ఆ రసాయనాల ఘాటైన వాసనల్లోనే వారు. అక్కడివారితో ముచ్చటిస్తూన్న కొద్దిసేపటికే మాకు ఆ వాతావరణానికి తల బరువెక్కింది. జుట్టు బిరుసెక్కింది. మొహం గరకుగా అనిపించింది. వాళ్ళు ఏళ్ల తరబడి ఎలా భరిస్తున్నారో ..?.!

అక్కడ ఉన్న ఎవరిని కదిపినా వ్యధాభరిత జీవన చిత్రాలే .. హృదయపు లోతుల్ని పరా పరా కోస్తున్న గాయాలే .. వాళ్ళ మాటల్లోనే విందాం.

“జి. యం. వెంటబడి తీసుకొచ్చిఇవన్నీ తిప్పిఏంటి మా పరిస్థ్తితి అంతే నేనేమీ చేయలేను. నా చేతిలో ఏమిలేదు అని డాక్టర్ నిస్తాను మందులువాడుకోండి. తాగడానికి నీళ్ళిస్తాను తాగండి అన్నాడు. అట్లా కొంతకాలం బతికాం. ఇప్పుడు జింక్ కంపనీ మూతపడింది. ఏళ్ళతరబడి మొరబెట్టుకోగా ఏర్పాటైన మంచినీటి కుళాయిలు తీసేశారు. వారానికి ఒకసారి వచ్చే డాక్టరు రావడం లేదు. అక్కడ వచ్చే మరణాలన్నింటికి తనని బాధ్యుణ్ణి చేస్తారని చెప్పి డాక్టర్ రాకుండా చేశారు కొందరు నాయకులు .రసాయనాలు చూపినా ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకుంటే ఎవరు ఎక్కడ అతుక్కుపోతారో నన్న భయం. ఇప్పుడు మేమంతా గోలచేస్తే రెండురోజులకో తుట్టు నీళ్ళ ట్యంకి పంపుతున్నారు. ‘ – సర్పంచ్

“ప్రతి ఇంటికి 10, 15 గేదెలుండేయి. కుమారిని చూపుతూ ఈ పిల్ల 15 లీటర్ల పాలు పిండేది. ఎలాగుండేవోరిమి ఇప్పుడిలా అయిపోయాము. అప్పుడి ఫోటోలు చూసావంటే ఆళ్ళు ఈళ్ళు ఒకరేనేటి? ఇలాగామ్మా అంటావు ” – పిలక గంగులు

” సుట్టు కోనేసినాడు. ఇయన్ని దించీసినాడు.(స్టాక్ పాయింట్ గోడౌన్లు, అమ్మోనియం నైట్రేటు గుట్టల్ని,అక్కడ నిలిచిన లారీలు చూపుతూ ) మద్యలో ఉన్డోల్లం. లంకంతేసి కొంపలు వొదిలీసి, ఆ బొమ్మరిల్లాటి ఇల్లిస్తే ఆ ఇళ్ళల్లో ఎలాగుండాల ?
మా ఇళ్ళను ఆడు మనుషుల్ని తీసుకొచ్చి ఇరగ్గోట్టేసి పోతన్నాడు. ఎవడేటిచేత్తాడని ? పోలీసోడు ఆల్ల దగ్గర డబ్బు తీసుకుని మామాట వినడు. పెజల్ని ఏడిపిస్తే ఆడు బాగుపడతాడేటి? మరి అలా ఎడిపిస్తాన్నడనుకో . ‘ – చుక్కా అనంతమ్మ

పిట్టవానిపాలెం లోనూ ఇలాంటి స్థితే. అయితే ఇక్కడ గ్రామస్తులు జింక్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత తిరిగి తమ గ్రామానికి చేరుకున్న్నారు. ఇల్లు కట్టుకున్నారు.

జింక్, లెడ్ ఫ్యాక్టరీలు పిట్టవానిపాలెం గ్రామానికి అతి సమీపంలో ఉన్నాయి. కూతవేటు దూరంలోనే HPCL, కోరమండల్, జిప్సం కంపెనీలు. అవి వదిలే కార్బన్ డయాక్సైడ్ , సల్పర్ డయాక్సైడ్ , ఆర్సెనిక్ , లెడ్ వంటి వాయువులు, ధూళితో గ్రామం నిండిపోయేది . ఆ విషవాయువుల్లో ఉండే టోలిన్ వల్ల పిల్లలుపుట్టకపోవడం, తరచూ అబార్షన్లు అవడం జరుగుతాయి. బెంజీన్ వల్ల బుద్ది మాంద్యం వస్తుంది. పోలిసైకిక్ ప్రొడక్ట్స్ లో కాన్సర్ కారకాలు ఎక్కువ ఉంటాయి. విశాఖపట్నంలో పారిశ్రామిక అభివృద్ధి 1990 నాటికే ఉన్నప్పటికీ 2000 నుండి బాగా పెరిగింది.

“పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ప్రకృతివనరుల విద్వంసం జరుగుతుంది. తద్వారా పర్యావరణ విద్వంసం జరుగుతుంది తత్ఫలితం ప్రజలపై ఆ దుష్ప్రభావాల ప్రభావం ఉంటుంది. రెండింటిని బేరీజు వేసుకున్నప్పుడు అభివృద్ధి కంటే విద్వంసం, విచ్చిన్నం ఎక్కువ అని ఇప్పటి పరిస్తితులను చూస్తే అర్ధం అవుతుంది. అభివృద్ధి ఎవరి కోసం అర్ధమవుతుంది.” – జె.వి. రత్నం, పర్యావరణ ఉద్యమకారుడు, గ్రీన్ క్లైమేట్ పత్రిక ప్రచురణ కర్త , సంపాదకుడు

“ఫ్యాక్టరీ ఉన్నప్పుడు మాకు పిల్లలు పుట్టకుండా అబార్షన్ అయిపోవడం, పుట్టిన వాళ్ళు చనిపోవడం, వికలాంగులవడం, దగ్గు దమ్ము వంటి ఎన్నో రోగాలతో సతమతంయ్యేవాళ్ళం . ఒక పశువులున్దేవి కావు, కోళ్ళున్దేవి కావు. కాలుష్యం వల్ల పిల్లలు చని పోయేవారు. అందరి సంగతీ ఎందుకూ .. నాకు తొమ్మిది అబార్షన్లు. ఆ తర్వాతే బాబు పుట్టాడు. పెద్ద బాబుకి పుట్టుకతోనే జబ్బు. ఆ తర్వాత ఎన్నో మందులు వాడిన తర్వాత పుట్టిన చిన్న బాబు. ఇద్దరూ కొన్నాళ్ళు పెరిగి చనిపోయారు. చూడండి, మీకు ఏ ఇంటికి వెళ్ళినా ఇలాంటి సంఘటనలే కనిపిస్తాయి. చాలా ఇబ్బందులు పడ్డామండి. జింక్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత ఇప్పుడిప్పుడే కొద్దిగా ఊపిరి పిలుస్తున్నామనుకుంటే ఉదుద్ వచ్చి ఊపిరి తీసేసింది”. డ్రాలింగ్ వరలక్ష్మి

విశాఖపట్నం పారిశ్రామిక వాడలలో మా పర్యటన నాకు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్ని మరో కోణంలో చూపింది. ప్రజలకోసం ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో అర్ధమయింది. ముందటి స్థితిని దాటి ముందుకు వెళితే కదా అభివృద్ది ..! ఎవరు ముందుకు వెళ్లారో… తెలిపి అప్పటివరకూ నాకున్న భ్రమల్ని తొలగించింది. మరెన్నో ప్రశ్నలను నా ముందు నిలిపింది .

వి. శాంతి ప్రబోధ
అధ్యక్షురాలు,
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక – తెలంగాణా విభాగం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– See more at: http://vihanga.com/?p=13522#sthash.LFfKvPAR.SH7DFMop.dpuf

నిశీధిలో శైశవ గీతి ఆలపిస్తూ …

నిశీధిలో శైశవ గీతి ఆలపిస్తూ …

ఆకాశ మేఘాన్నడిగా అమ్మ ఏదని ?

నింగి చుక్కల్లో దుర్భిణీ వేశా నాన్న ఎవరని ??

గద్దకళ్ళతో విశ్వమంతా గాలించా నా మూలం ఏమిటని  ???

సన్నని నూలుపోగు ఆధారం కోసం
అలుపెరుగని నావికుడిలా ముల్లోకాలూ తిరగేస్తూనే
ఒకసారి మందపవనంలా మరోసారి పెనుగాలిలా చుట్టేస్తూనే …

పండు వెన్నెల్లాటి అమ్మ ఒడి వెచ్చదనం
ఆ చేతి గోరుముద్దలు, బుగ్గలపైచేసే ముద్దుల సంతకాలు

కంటిచెమ్మ తుడిచి జోలపాడి నిద్రపుచ్చే లాలిపాటలు

నాన్నతో ఆటపాటల జ్ఞాపకాల మాధుర్యం

ఆత్మీయ స్పర్శతో  చెప్పే కథల్లో విహారాలు

ఇంటిల్లిపాది కోడిపొదుగు రక్షణ నిల్వలు

ఏవీ తెలియదు, హిమ ప్రవాహంలా జనం

జాలి మాటల చూపులు తప్ప, ఉప్పెనలా ఎగిసిపడే

ఆలోచనలతో  సముద్రమంత బరువెక్కిన హృదయం

అమావాస్య చంద్రుడిలా శైశవగీతి ఆలపిస్తూ

నెలవంక శశాంకుడిలా ఆశతో ఎదుగుతూ

విధినెదిరించి నావారి ఊహలు మొలకెత్తించుకుంటూ

హృదిలోని హిమాలయ సునామీలను
మదిలోని సూపర్ వాల్కేనోలను
గది లోపలిపొరల్లో పాతరేసి నా వాళ్ళకోసం సెర్చ్ చేస్తూ

అంతా ఉండి ఎవరూ లేనోళ్ళలా
మెషిన్లతో మాట్లాడుతూ ఆటలాడుతూ
అదేలోకంగా బతికేసే తెల్లని ఐరావతాలు నన్ను వెక్కిరిస్తూ

వాసనలేని పూల్లా..  రోబోట్ ఆత్మీయతలు ఒలకబోస్తూ ..
మంచుతో కప్పినట్లున్న మంచి తెరల ముసుగు ముళ్ళతో గుచ్చుతూ
ఉంటే , పగిలిన గుండెకు మాట్లు వేసుకుంటూ
నే నిశీధిలో శిల్పంలా నిరీక్షిస్తూనే  ..

వి. శాంతి ప్రబోధ
14. 11. 2014

‘నేను ఆడపిల్లనవడం వల్లనే …. – నా గురించి నేను’

prajathanthra 0172014 సంవత్సరాన్ని Empowering Adolescent Girls: Ending the Cycle of Violence ( కిశోర బాలికల సాధికారత-హింసా నిర్మూలన) గా జరుపుకోవాలని UNO పిలుపునిచ్చింది. బాలికలు, యువతుల సంరక్షణ, సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన, హక్కుల పరిరక్షణ వంటి అంశాలపట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకోసం అంతర్జాతీయ బాలికా సాధికారదినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆడపిల్లల పట్ల వివక్ష , అత్యాచారాలు , కొట్టడం , హింసించడం, దాడి చేసి చంపడం ప్రతి రోజూ కనిపిస్తూనే, వినిపిస్తూనే…   అందుకు కారణం కుటుంబ సభ్యులో, బడిలో టీచర్ లో , తోటి వాళ్ళో, ఇరుగుపొరుగులో .. ఎవరో ఒకరు.  నిత్యం ఆడపిల్లలపై, మహిళలపై జరిగే దుశ్చర్యలకి కారణం ఏమిటి? ఎవరు? ఎవర్ని బాధ్యుల్ని చేద్దాం ..?  ఆడపిల్లని మగ పిల్లతో చూడలేనితనం, ఆమె హక్కుల్ని గౌరవించలేని గుణం కావచ్చు, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్ధికంగా ఆమెకు గుర్తింపు లేకపోవడం కావచ్చు.  ఆమెను  అధీనంలో వుండే ఒక వస్తువుగా చూడడం కావచ్చు.   సమానంగా చదువు లేకపోవడం కావచ్చు,  పెద్దల నిర్లక్ష్యం , నిరక్షరాస్యత, అవగాహనలేమి కావచ్చు.  లైంగిక, పునరుత్పత్తి, సామాజిక, ఆర్ధిక సేవలు అందుబాటులో లేకపోవడం కారణం కావచ్చు.  ఏదేమైనా  ఈ సమస్యకి  పరిష్కారం మన దగ్గరే మన కుటుంబంలోనే, మన  సమాజంలోనే ఉంది.  ఆడపిల్లలకి మహిళలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత, వారిని విద్యావంతుల్ని , స్వశక్తి వంతుల్ని,  చైతన్య వంతుల్ని చెయ్యాల్సిన బాధ్యత అందరిదీ.  అందుకోసం  ప్రజలలో అవగాహన కల్గించాల్సిన, పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదొక్కటే కాదు.  దానితోపాటు వ్యక్తులు, సంస్థలు , అన్నిరకాల ప్రచార ప్రసార సాధనాలు మీడియా అందరూ బాధ్యత తిసుకున్నప్పుడే మనం ఆడపిల్లను హింస నుండి విముక్తం చేయగలం.  ఈ  హింస ఇలాగే కొనసాగితే నష్ట పోయేది ఆమె మాత్రమే కాదు. జాతి , జాతి మొత్తం ఎంతో నష్టపోతుంది.  ఆరోగ్యవంతమైన ఆడపిల్లలున్న సమాజం ఆరోగ్యవంతంగా ఎదుగుతుందన్నది ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటా ..!
ఈ సందర్భంగా కిశోర బాలబాలికలతో పనిచేసిన సమయంలో వివిధ సందర్భాలలో మేం నిర్వహించిన కన్సల్టేషన్ లలోను, వర్క్ షాపులలోనూ వారు వెల్లడించిన విషయాలను, వివిధ కార్యక్రమాలలో పాల్గొని వారు పొందిన స్పూర్తితో తమ జీవితంలో తెచ్చుకున్న మార్పుని

నేను ఆడపిల్లనవడం వల్లనే

                                     – నా గురించి నేను’ 

అనే శీర్షికతో వారం వారం మీ ముందుకు రాదలచుకున్నా.

ఆ  కిశోరబాలికల అనుభవాలు, పొందిన వేదనలు, వాటిని ఎదుర్కొన్న విధం మరికొంత మందిని ఆలోచింప చేస్తుందనీ, చైతన్యం రావడానికి కొంతైనా తోడ్పడుతుందని మీ ముందుకు తేవాలని అనుకుంటున్నాను.  ఇక్కడ మీ ముందుకు వచ్చే అమ్మాయిలు, వారి సమస్యలు కొత్తవేమీ కాకపోవచ్చు. అలాంటి మనుషులు, సమస్యలు మనమంతా రోజూ చూసేవే కావచ్చు .  వాళ్ళలో కొంతమంది  తమకింతే రాసిపెట్టి ఉందని నిర్లిప్తంగా జీవితాన్ని ఈడ్చేవారూ ఉండవచ్చు .  తమ స్థితికి కుంగిపోయి జీవితాన్ని అంతం చేసుకునేవాళ్ళు ఉండొచ్చు.  తాము ఎందుకు చిన్న చూపుకు గురవుతున్నాం, అన్నతోనో తమ్ముడితోనో సమానంగా ఎందుకు ఉండలేకపోతున్నామని ప్రశ్నించేవాళ్ళు సమానత్వం కోసం కృషి చేసేవాళ్ళూ ఉండొచ్చు.  తమకున్న క్లిష్ట పరిస్తితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు పోయేవాళ్ళూ తారసపడతారు. తమలాంటి మరి కొందరికి ధైర్యాన్ని, ఆత్మస్తైర్యాన్ని నింపేవాళ్ళూ కనిపిస్తారు.  అలాంటి వాళ్ళే మన ముందుకు వస్తారు.  మనకి స్పూర్తినందిస్తారు . అలాగే, వాళ్ళ వ్యక్తిగత విషయాలు నలుగురుకీ చెప్పుకోవడానికి ఇష్టపడని వాళ్ళూ ఉన్నారు.  అందుకే వారి ప్రైవసీ కోసం ఆ అమ్మాయిల పేర్లని, ఊర్లని  మార్చి చెప్తున్నాం. ఫోటోలు ఇవ్వలేక పోతున్నాం.

 

                                                                                       అమ్మేనా …?

“నా తల్లి కన్నా తల్లేనా అని నాకెప్పుడూ సందేహం.  ఆమె పేగు తెంచుకు పుట్టిన బిడ్డను అంత దారుణంగా తీసుకెళ్ళి అమ్మాయిలతో వ్యాపారం చేసే వాళ్లకి అమ్మేయగలదా ..?”

నా పేరు లిఖిత.  మాది నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం.  నేను చిన్నప్పుడు మా అమ్మా నాన్నలతోనే హాయిగా ఉండేదాన్ని.  అంగన్వాడి బడికి పోయేదాన్ని. నాన్న చనిపోయాడు.  ఎట్లా చనిపోయాడో తెలియదు. అమ్మ వల్లే చనిపోయాడని నాన్నమ్మవాళ్ళు అమ్మని ఇంట్లోంచి పంపేశారు.  అమ్మ వేరే అతన్ని చేసుకుంది. నేను అమ్మమ్మ ఇంటికి చేరాను.  నన్ను ఇంట్లోంచి పంపెయ్యమని మా చిన్న అత్తమ్మ రోజూ గొడవ పెట్టుకునేది.  నాన్నమ్మ వాళ్ళు నన్ను రానియ్య లేదు.   అప్పటి నుండి నాకు  అమ్మ, నాన్న, ఇల్లు అంటూ లేకుండానే..ఎప్పుడు ఎవరు ఎటు విసిరేస్తారో తెలియకుండా .. నా బాల్యం గడచి పోయింది. అందరు పిల్లలా బడి తెలియదు.  నేనున్నానని మామ వాళ్ళు అమ్మమ్మను ఇంట్లోంచి గెంటేశారు. నిజామాబాద్ వచ్చేసాం. చెట్లకిందో, బస్టాండుల్లోనో, దుకాణాలముందో  ఇంటి పంచలోనో రాత్రి పూట తల దాచుకునేవాళ్ళం.  అడుక్కు తినే వాళ్ళం.  ఓ రోజు నిద్రపోయిన అమ్మమ్మ లేవనే లేదు.  ఎవరు చెప్పారో.. ఎట్లా తెలిసిందో .. మా అమ్మ నన్ను తన దగ్గరకు తీసుకెళ్ళింది. అప్పటికే పదకొండేళ్ళు ఉండొచ్చు.

నేనెంతో సంతోషించా అమ్మ దగ్గరైనందుకు.  ఒక తమ్ముడున్నాడు. కొత్త నాన్న ఉన్నాడు.  తమ్ముడితో ఆడుకుంటూ ఉండేదాన్ని.  బడికిపోతానని అంటే, అమ్మ వచ్చే ఏడాది తమ్ముడిని నన్ను పంపుతానంది .   మా కొత్త నాన్నఆటో సరిగ్గా నడిపేవాడేకాదు. ఎప్పుడూ తాగి వచ్చేవాడు.  నన్ను ఎట్లాగో చూసేవాడు. ఒకరోజు అమ్మకి , కొత్త నాన్నకి చాలా గొడవ అయింది. ఎందుకో నాకు తెలియదు కానీ నా గురించే అని తెలుస్తాంది.   రెండు రోజుల తర్వాత అమ్మ ఊరికి పోదాం అని ఒక బాగ్ లో బట్టలు పెట్టింది. అమ్మ నేను, తమ్ముడు వెళ్లాం.  ఏ  ఊరికో తెలియదు. అమ్మ నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. నాకు ఏమి చెప్పకుండానే పోయింది. ఎటు పోయిందో తెలియదు.  వాళ్ళు ముప్పైవేల రూపాయలకు కొనుక్కున్నారని తెలిసింది.  అక్కడ ఉన్న వాళ్ళు అంతా నా కన్నా పెద్ద వాళ్ళే .  వాళ్ళు అదో రకంగా .. మొహాలకి , పెదవులకి రంగు పూసుకుని … ఎప్పుడూ మగవాళ్ళు చాలా మంది వచ్చి పోతుండేవారు .   నాకు అక్కడ అన్నం అన్నీ బాగానే పెట్టేవారు. బాగానే చూసుకున్నారు.  రెండు మూడు రోజులయ్యాక నా లాంటి పిల్లలు ఉన్న చోటుకి తీసుకుపోయారు.  అక్కడ మా ఫోటోలు తీసుకోవడానికి వస్తారని బాగా తయారవమని చెప్పారు.   ఆ రోజే నేను, రాజీ ఇద్దరం నెమ్మదిగా తప్పించాం.   మేం పరిగెత్తుంటే వేరే సార్లు మమ్మల్ని పట్టుకుని  వివరాలడిగి బాలసదనంకి పంపారు.  అప్పటి నుండి నేను బడికి పోతున్నా .   ఇప్పుడు ఎనిమిదోతరగతి చదువుతున్నా.  ఇప్పుడు నాకు అర్ధమవుతోంది ఇక్కడికి రాక పోతే నా జీవితం ఎట్లా ఉండేదో …  అందుకే బాగా చదువుకుని నా లాంటి పిల్లకోసమే పనిచేయాలని అనుకుంటున్నా..  మా అమ్మలాగా ఏ అమ్మా ఉండకూడని కోరుకుంటున్నా .

లిఖిత

 

 

                                                        నాన్న ఇలాంటి వాడా?  అసహ్యం వేస్తోంది

మంచి నిద్రలో ఉన్నాను. నా శరీర భాగాల్ని తడిమినట్లయింది. ఒక్క సారిగా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూద్దును కదా .. మా నాన్న.  నా పక్కనే నిద్రపోతూ .  నిద్రలో నా కెందుకు అట్లా అనిపించిందో నాకర్ధం కాలేదు.

అంతకు ముందు నాన్నమ్మ దగ్గర పడుకునే నేను నాన్న మస్కట్ పోయినప్పటి నుంచీ అమ్మ దగ్గరే పడుకునేదాన్ని.  అమ్మ జబ్బుతో చనిపోయింది. అప్పటి నుంచీ రోజూ నేనొక్క దాన్నేనులకమంచం వేసుకొని పడుకుంటున్నా.  రోజూ లాగే ఆ రోజూ పక్క పరుచుకు పడుకున్నా.   అమ్మ చనిపోయిందని వచ్చిన నాన్న మరి పోలేదు. బయట పందిట్లో పడుకుంటున్నాడు.  అన్న వదిన వేరే రూంలో.   నా మంచం చాలా చిన్నది. సన్నగా ఉంటుంది. నాన్న పడుకునేసరికి చాలా ఇరుకుగా అయింది. లేచి నీళ్ళు తాగి బాత్ రూంకి పొయొచ్చి మళ్ళీ పడుకున్నా.  కొంచెం సేపటి వరకూ అట్లాగే ఉన్నా . నిద్ర పట్టలేదు. లేచి చాప పరుచుకుని పడుకున్నా.

మరో రోజు కూడా అంతే. నిద్రలో హటాత్తుగా మెలకువ వచ్చి చూస్తే నాన్న నా పక్కన.  నాన్న ప్రవర్తన ఇదివరకటిలాగా లేదు. ఏదో తేడా .. తెలియడం లేదు. అతని దగ్గర మందు కంపు.  రాత్రవుతుందంటేనే భయం వేస్తోంది. నిద్ర రావడం లేదు. ఎప్పటికో నిద్ర పోయినా కలత నిద్రే.  నాన్న గురించి ఎవరికి చెప్పాలో, ఎట్లా చెప్పాలో తెలియడం లేదు.

ఓ రోజు అప్పుడే నిద్రపట్టింది. తన పురుషాంగాన్ని నాకేసి గట్టిగా రుద్దుతున్నాడు.  నా శరీర భాగాల్ని తడుముతున్నాడు. మెలకువ వచ్చేసింది. భయమేస్తోంది. ఏమనాలో , ఏమిచెయ్యాలో తెలియక భయంతో బిగుసుకున్నా. ఆ రోజు ఇంట్లో అన్న వదిన కూడా లేరు.  తట్టుకోవడం మనసుకి చాలా కష్టంగా ఉంది.  ఇక ఆగలేక  “ఏందే నాన్న .. ” అన్నాను  కోపాన్ని అదిమి పెట్టుకుంటూ.

చప్పున లేసి ధోతి సర్దుకుంటూ బయటికి పోయాడు.

లేచి వెళ్లి తలుపు పెట్టుకున్నా.  నాన్న ఇట్లా చేస్తున్నాడేంటి ? మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న నాలో.   నిజానికి అమ్మ కంటే నాన్ననే ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఎంతో ముద్దు చేశేవాడు. అట్లాటిది ఇట్లా అయిపోయాడేమిటి.   మా నాన్న ఇట్లాటి వాడా అని చాలా బాధ, భయం కలిగాయి.  నేను కన్న బిడ్డ లాగా కనబడట్లేదా .. ? నేను ఆడపిల్లను కావడం వల్లేనా .? ఆడదానిగా మాత్రమే కనిపిస్తున్నానా .. ?           ఎప్పుడు తెల్లారుతుంది ? అన్నా వదిన మరో రోజుకి గానీ రారు.  వచ్చినా వాళ్లకి చెప్తే నమ్ముతారా ? నన్నే తప్పు పడతారా .. ? ఏమో ..అని  ఏదైనా తెల్లవారగానే అత్తమ్మ దగ్గరకి వెళ్ళిపోయా ..  ఆ తర్వాత నాన్న గురించి ఎవ్వరికీ చెప్పలేదు కానీ ఆయన్ని చూడాలన్నా నాకు అసహ్యం వేసేది.

శ్వేత

లింగాపూరు

(ఈ సంఘటన ఆ అమ్మాయి  పద్నాలుగుపదిహేనేళ్ళ వయసులో జరిగింది )

ప్రజాతంత్ర సంపూర్ణ స్వతంత్ర వర పత్రిక 23-29, నవంబర్ 2014న  ప్రచురణ అయింది

నిరాశా పొరలపై ఆశల నగిషీలు చెక్కనా .. !

నా ముద్దు మాటల

విందు మూటలతో

ఆనందించిన వారు

నన్నెందుకో

తమదరి చేరనీయడంలేదు

 

ఒడిలో కూర్చోపెట్టుకొని

మురిపాల ముద్దలతో

మురిపించిన వారు

నన్నెందుకో

తమ సరి రానీయడం లేదు

 

నా పాలబుగ్గలపై  కురిపించిన

అమృతధారల స్థానే

చురకత్తుల జాలి చూపులు

నన్ను కోసేస్తున్నాయి

తాటాకు చీరికల్లా

 

నేనేం తప్పు చేశానో తెలియదు

నాలో ఏమి తిష్ట వేసిందో అర్ధంకాదు

కానీ

తలంతా రక్కసి పుళ్ళు

నాసికనుండి బోలబోలా కారే రక్తం

ఏ మందులకీ లొంగక

తిన్నది ఒంటబట్టక

కృశించి పోతున్న శరీరం

 

పెద్ద సూదితో నా రక్తం

జలగలా లాగేసిన

డాక్టరు ఏం చెప్పారో

ఆకులు రంగులు మార్చుకున్నట్లు

అంతా నాపై చూపే జాలి

వరద కాల్వలై

నన్ను కుంచింప చేస్తూ

 

ఒకప్పుడు

కన్న వాళ్ళు లేక

కడుపుకింత పెట్టేవాళ్ళు కానరాక

ఆకలి మంటలు తాళలేక

గుప్పెట్లతో మట్టి తిన్న నా చేతుల్ని

ఆ తర్వాత

ఆబగా తిన్న అన్నం వెక్కిరిస్తోంది

అప్పుడప్పుడే

ఊహల పురివిప్పుతున్న

ఆశల హరివిల్లు పై

ఉరి వల విసిరింది

 

చేరదీసిన ఆర్ద్ర హృదయం

కరుణ చూపిన చేతులు

కాసింత దూరంలోనే

గొంగళి పురుగును చూసినట్లు చూస్తూ

 

కారణం ఏమిటని

ఆరాతీస్తే అమృతం లాంటి అమ్మపాలు

నా పాలిట విషపు గుళికై

ఆకలిగొన్న మృగంలా

నా శరీరాన్ని ఆక్రమించేసిందట

ఎరకోసం దేవులాడే గద్ద

నన్ను తన్నుకు పోడానికి చూస్తోందట

అమ్మ లాగే , నాన్నలాగే ,

అక్క లాగే నేనూ ….

అంతా గుసగుసలు

 

నేనేం నేరం చేశానని ?

నా శరీరం హరితంలేని పత్రంలా

జల్లెడవుతోంది

మూడు వసంతాలైనా చూడని

నాకిదేం శిక్ష ?

నాకూ బతకాలని ఉంది

మీ అందరిలా నిండుగా

పున్నమి చంద్రుడిలా

నూరేళ్ళూ బతకాలని ఉంది

నా బుగ్గలపై మీ ముద్దుల

సంతకాల మూటలు కట్టి  దాచుకోవాలనుంది

అభిమానం వెల్లువై మీరు చూపే ఆప్యాయత,ఆదరణ

కలకాలం కళ్ళలో వత్తులేసి వెలిగించాలని ఉంది

నాకు కాదు శిలువ

వేయండి నన్నూ నాలాంటి వారిని

కబళిస్తున్న ఎయిడ్స్ కి

అని గొంతెత్తి అరవాలని ఉంది

కానీ గొంతు పెగలడం లేదు

గాఢమైన చీకటి గుహలోకి జారిపోతోంది

అంతలో

నాలో చలనం కలిగిస్తూ

నా ఊహలకు ఊతమిచ్చి

ఊపిరి పోస్తూ

ఊయలలూపుతూ

కొత్త చిగుర్లు తోడిగిస్తానంటూ

నన్ను

ఒడిసి పట్టుకున్న ART మందులు

ఈ ఆధారం చాలు

నా ఆశల అలలపై అడుగులేస్తూ

నా కలల తీరం చేరడానికి

సరి కొత్త ప్రపంచానికి రంగులద్దడానికి

నిరాశా పొరలపై ఆశల నగిషీలు చెక్కడానికి

వి. శాంతి ప్రబోధ

( తల్లిదండ్రులు లేని మూడేళ్ళ చిన్నారి వైష్ణవి కి HIV అని తెలిసాక, ఆ చిన్నారి చూపులు గుచ్చుకుంటూ ఉంటే తట్టుకోలేక వాటినుండి ఉపశమనం పొందడానికి చేసిన ప్రయత్నం ఇది )

Tag Cloud

%d bloggers like this: