The greatest WordPress.com site in all the land!

Archive for the ‘others’ Category

సామజిక సరిహద్దుల్ని చెరిపేస్తూ .. ధిక్కార స్వరం వినిపిస్తూ… 

ఈ మధ్యకాలంలో ముఖపుస్తకమో లేదా ఇతర సామజిక మాధ్యమాల వేదికగానో తమ మనోభావాలకు తీవ్రమైన విఘాతం కలిగిందంటూ తీవ్రమైన, దాడులు సాధారణం అయిపోతున్న తరుణం ఇది .  అయితే , ఒకే విషయంపై  ఒక సమూహం లేదా ముఠా లేదా మూక చేసే దాడి, దాని స్వరూప స్వభావాలు పురుషులపైనా  మహిళలపైనా ఒకే విధంగా ఉంటాయా ..?
ఊహూ .. ఉండవు . ఒకేలా ఏమాత్రం ఉండవు.
ఆ దాడి చేసే వ్యక్తులు స్త్రీలైనా పురుషులైనా  అవతలి వ్యక్తి పురుషుడైతే అతని పురుషత్వాన్ని కించిత్ మాట అనరు . కానీ అదే స్త్రీ అయితే .. స్త్రీలను దేవతలుగా పూజించే గడ్డపైనే స్త్రీ బాహ్య రూపాన్ని, రహస్యాంగాలను , మొత్తం శరీరాన్ని పచ్చి బూతులతో జుగుప్సాకర మాటల రొచ్చు కుమ్మరించేస్తారు. ఆమెనే కాకుండా ఆమె తల్లినీ , కుటుంబాన్ని కూడా ఆ రొచ్చులోకి లాగుతారు . ఆ వ్యక్తిని , వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఉండే ద్వందార్ధాల ఆ బూతు తిట్లపురాణం  ఇక్కడ విప్పనవసరం లేదనుకుంటా ..  అవి అన్నవాళ్ళకీ విన్నవాళ్ళకి , మీకు అందరికీ తెలుసు .
ప్రపంచమంతా చూస్తుండగా అందరి మధ్యలో ధీమాగా సామాజిక మాధ్యమాల వేదికగా  అతిదారుణంగా  నిస్సిగ్గుగా రేప్ చేస్తామంటారు, అందరికీ వినబడేట్టుగా అరచి మరీ నరికి చంపేస్తామంటారు.  ఇంకా ఎన్నెన్నో చేయగలమనే ఘనుల వికృత రూపం సామజిక మాధ్యమాల్లో నేడు విపరీతంగా కనిపిస్తున్నది.
అసభ్యమైన పదజాలంతో లెక్కలేనంతమంది విజృంభించి సభ్య సమాజం నోటితో ఉచ్ఛరించ వీలుకాని విధంగా  వాంతి  చేస్తారు. ఏదో ఘనకార్యం చేసినట్లు  ఆ కంపునంతా గొప్పగా షేర్ చేసుకుంటారు.   అసభ్యమైన ఆ భాష వాడడం ద్వారా తమ పురుషాహంకారాన్ని వెల్లడి చేసుకుంటారు .  పైశాచికానందం పొందుతారు. మరి , ఇలాంటి వారు ఆమె ముందు చేసే విశృంఖల నృత్యాలు  ఆమె మనో భావాలను దెబ్బతీయడం లేదా ..? ఇదేనా మన సంస్కృతి ? ఇలాగేనా మహిళలను గౌరవించేది ?  ఇటువంటి సంస్కృతినేనా మనం భావి తరాలకు అందించేది ?
సమాజంలో విభిన్న వర్గాలు ,జాతులు , కులాలు , మతాలు ,  సమూహాలు ఉంటాయి . వారి  ఆలోచనల్లో , విలువల్లో,  ఆచరణలో, నిబద్ధతలో స్థాయీ భేదాలు వారి వారి అవగాహనను బట్టి, వారి ఎరుకలో ఉన్న సమాజాన్ని బట్టి ఉండవచ్చు .   వాటిని ఒకరికొకరు విమర్శించుకోవచ్చు . ఖండించుకోవచ్చు . లేదా ప్రశంసించవచ్చు , విశ్లేషించవచ్చు . ఎదుటివారి మాటల్లోంచి వచ్చిన కొత్త కోణాల్ని అనుసరించనూవచ్చు .  వాదాల మార్గాలు వేరయినప్పుడు అవి నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ విధ్వంసపూర్వకంగా ఉండకూడదు కదా …   కానీ ఇప్పుడలా జరగడంలేదు .  వ్యక్తిగతంగా అవమానించడం దాడులు చేసే సంస్కృతి  రోజు రోజుకీ పెరిగిపోతున్నది.
ఉదాహరణకి POW సంధ్య రాముడినీ , కృష్ణుడిని ఓ సందర్భంలో విమర్శించిన సంఘటనే తీసుకుందాం.   అదే విధంగా కత్తి మహేష్  మీడియాలో రాముడిని గురించి ఏదో వ్యాఖ్యానం చేసాడు .   వారి వ్యాఖ్యలు కొందరి మనోభావాలను చిన్నబుచ్చడం లేదా ఆగ్రహం కలిగించడం జరిగి ఉండొచ్చు . కాదనలేం.  అప్పుడేం చేయాలి ?
ఆ విధమైన  విమర్శ ఎందుకు వచ్చిందో ఆలోచించాలి . ఆ విమర్శకి తాము నమ్మిన సిద్ధాంతం ప్రకారమో  లేదా వాదం ప్రకారమో జవాబు చెప్పాలి .   అందుకోసం సంబంధిత విషయాన్ని మరింత అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైన  ప్రతి విమర్శ చేయాలి .
పురాణ ఇతిహాసాల్లో పాత్రలైన రాముడివైనా  , కృష్ణుడివైనా వారి వారి విలువలు, నమ్మకాలూ , విశ్వాసాలు వారిని సృష్టించిన సాహిత్య కాలపువి .   అవి ఈనాటి సమాజానికి ఎంతవరకూ సరిపోతాయో అని ఆలోచించుకోవాలి .  అంటే కాల స్పృహ చాలా అవసరం. కానీ అలా జరగడం లేదు.  విమర్శను విమర్శగా చూడకుండా ప్రతి విమర్శ చేయకుండా హీనమైన స్థాయికి దిగజారిపోయి వ్యక్తిత్వాన్ని దిగజార్చుకునే భాషను ఉపయోగిస్తూ తమ ఘనమైన సంస్కారాన్ని సమాజం ముందు ప్రదర్శించుకున్నారు కొందరు .   తమ మీద తాము ఆరాధించే  విశ్వసాల మీద విలువల మీద నమ్మకం ఉంటె , విశ్వాసం ఉంటే ఇలా ఎప్పటికీ చేయరు . ఆధారాలతో నిరూపించుకోజూస్తారు .  ఆ విశ్వాసం లేకే ఈ విపరీత ధోరణి .
వివాదాస్పద వ్యాఖ్యలు  చేయడం తగదని మత విశ్వాసాల ముసుగులో పితృస్వామ్య భావజాలాన్ని పెంచే మూక (పితృస్వామ్యాన్ని మోసే స్త్రీలు కూడా ) ఆమెనే తప్పు పడుతున్నారు . తనపనేదో తాను చేసుకోక మతసంబంధ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఫలితాలు ఇట్లాగే ఉంటాయని నిస్సిగ్గుగా వ్యాఖ్యానిస్తున్నారు .  కత్తి మహేష్ విషయం తీసుకుంటే అతని పైకూడా వ్యక్తిగత దాడి జరిగినప్పటికీ అది అతని లైంగికతకు సంబంధించినది కాదు. అదే సంధ్య విషయంలో అలా కాదు కదా ..
అంటే ఒకే విషయాన్ని స్త్రీ పురుషులిద్దరూ మాట్లాడినప్పుడు సమాజం వారిని చూసే దృక్కోణంలో  దృక్పథంలో ఉన్న పితృస్వామ్య స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది .
ఇలాంటి అవాకులు చవాకులు నాలుగు గోడల మధ్యనుండి సమాజంలోకి అడుగు పెట్టిన మహిళలకు ముఖ్యంగా  ఉద్యమాల్లో ఉండే మహిళలపై ఎక్కువ.   ఆమె అడుగు ముందుకు పడనీయకుండా ఆమె స్త్రీత్వంపై, లైంగికతపై చేసే దాడి ఈనాటిది కాదు.  స్వాతంత్రోద్యమ కాలంలోనూ , తెలంగాణా విమోచనా ఉద్యమ సమయంలోనూ  ఆ తర్వాత వచ్చిన ఉద్యమాల్లోనూ  ఇటువంటి  పరిస్థితిని మహిళలు ఎదుర్కొంటూనే ఉన్నారు.  అంటే ..  పితృస్వామిక  అవలక్షణ కొనసాగింపే సంధ్యపైన ఈ దాడి అని స్పష్టమవుతుంది
ఈ సందర్భంలో  సివిల్స్ ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవుతున్న యువకుడొకరు అన్నమాటలు గుర్తొస్తున్నాయి. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన మహిళలు  హక్కుల పేరుతో ,  సమానత్వం పేరుతొ, ఇంట్లోంచి బయటికొచ్చిన మహిళలు అందరికీ అందుబాటులో ఉంటారనీ , స్వేచ్ఛ పేరుతో విశృఖలంగా ప్రవర్తిస్తుంటారని , సిగరెట్ , మందు అన్నీ అలవాటుంటుందని అతను  వెలిబుచ్చిన అభిప్రాయం విన్నతర్వాత, ఉన్నత విద్యావంతుడైన, సామజిక అభివృద్ధి కోసం కంకణం కట్టుకోవలసిన, బాధ్యతాయుతమైన బాధ్యతల్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి ఆలోచనల పరిధి ఇంత కుంచించుకుపోయి ఉంటే ఇక మాములు వ్యక్తులతో కూడిన సమాజపు అభిప్రాయం భిన్నంగా ఉంటుందని అనుకోలేం కదా.

మహిళకూ సొంతంగా ఓ మనసుంటుందనీ, మెదడుంటుందనీ  ఏ అంశపైనయినా విషయంపైనయినా ఒక అభిప్రాయం వెల్లడించగల తెలివితేటలు ఉంటాయని పితృస్వామ్యం అనుకోదు.  ఆమె చుట్టూ హద్దులు గీసేసి అవన్నీ తమకు అంటే  పురుషులకే ప్రత్యేకం అనుకుంటుంది.   ఆ సంస్కృతే .. ఆ భావజాలమే స్త్రీని నగ్నంగా నడిరోడ్డున నిలబెట్టింది . ఆ సంస్కృతే కదా ..  నాలుగునెల్ల పసిబిడ్డ నుండి పండు ముదుసలి వరకూ అందరినీ చెరబట్టేది .

భారతదేశంలోకి ఆర్యులు ప్రవేశించిన నాటి నుండీ పితృస్వామ్యం రూపం మార్చుకుంటూ కొనసాగుతూనే ఉంది. మనువు స్త్రీ ఎలా ఉండాలో చేసిన సూత్రీకరణలు  బుర్రల్లో కుక్కుకున్న వారు మతం పేరుతో వెళ్లగక్కుతున్న విద్వేషం  ఉన్మాద రాద్ధాంతం అదే.  ఇది ఒక్క సంధ్య పైనో సుజాత పైనో  దేవిపైనో లేదా మరొకరిపైనో  మాత్రమే అని నేననుకోవడం లేదు . మహిళలపై అనాదిగా సాగుతున్న వివక్ష, ఆమెను పిల్లల్ని కనే యంత్రంగాను , సెక్స్ సుఖం అందించే వస్తువుగాను , సరుకుగానూ ,  పనిముట్టుగానూ   భావించడం , యూస్ అండ్ త్రో వస్తువుల్లా చూడడం .. పరాధీనగా ఉంచడం , బానిసత్వానికి గురిచేయడం మొదలైనవన్నీ ఇందుకు  కారణం.  అయితే  ఆమె లైంగికత్వంపై , ఆమె వ్యక్తిత్వంపై చేస్తున్న దాడి ఆమె ఒక్కరికే కాదు  అది సమస్త స్త్రీ జాతికీ వారు చేస్తున్న హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది.   మహిళల వ్యక్తిత్వాలను , స్వేచ్ఛను , హక్కులను అణచివేయడం, దౌర్జన్యం చేయడం , హింసను ప్రయోగించడం  ద్వారా మహిళలను నిస్సహాయుల్ని చేయడం ముందుకు వెళ్లకుండా చూడడం వారి లక్ష్యం .. ఆ కోవలో వచ్చిందే   ఆడవాళ్లు ఇంటిపనులకే పరిమితమై ఉంటే మంచిదని సాక్షాత్తూ రంగనాథ మిశ్రా అనే ప్రధాన న్యాయమూర్తి  ఓ సందర్భంలోఇచ్చిన  సలహా.
పురుషాధిపత్య భావజాలం పురుషులకే ఉంటుందనుకుంటాం కానీ మహిళల్లోనూ ఉంటుంది .  తమ చుట్టూ ఉన్న పురుషాధిక్య భావజాల ప్రపంచం నిర్ధేశించిన విధంగా తమ వ్యక్తిత్వాలను రూపొందించుకున్న మహిళలు ..తమను తాము తక్కువ గానే భావిస్తుంటారు .

కాలం మారినా  అన్ని ప్రాంతాల్లోనూ  అన్ని మతాల్లోనూ పితృస్వామ్య అవలక్షణాలు , పురుషాధిక్యత నేటికీ సజీవంగానే … హిందూ , ఇస్లాం , క్రైస్తవం  ఏమతంలో చూసినా స్త్రీ పట్ల చిన్నచూపే.  పితృస్వామ్యం పెట్టుబడిదారీ వ్యవస్థకి మూలం .  వీటివెనుక పెత్తందారీ వ్యవస్థలోని రాజకీయాంశాలు ముడివడి ఉన్నాయి

అయితే ,  ఆనాటినుండీ ఈనాటి వరకూ ఆమె స్త్రీత్వంపై  వ్యక్తిత్వంపై ఎన్ని దాడులు  జరిగినా, ఎంత జుగుప్సాకరంగా తెగబడ్డా మహిళ వెనుకంజ వెయ్యలేదు  అన్నిటినీ ఎదుర్కొంటూ మరింత బలం పుంజుకుంటూ  ముందుకు సాగుతూనే ఉంది.   కులం , మతం  పితృస్వామ్యం బలంగా సమర్ధిస్తూ నిర్ధేశించిన చట్రంలోంచి నేటి మహిళ  బయటికి వచ్చి  సామాజిక సరిహద్దుల్ని చెరిపేస్తూ తమ కలల్ని , కోరికలను నెరవేర్చుకుంటూ సమభాగస్వామ్యం కోసం ఉద్యమిస్తూనే ఉంది.  అవసరమైన సందర్భాల్లో తన అభిప్రాయాలు నిర్భయంగా వెల్లడిస్తూ ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉంది .  సమాజంతో యుద్ధం చేస్తూనే  ఉంది .
వి. శాంతి ప్రబోధ
Published in August, 2018 Matruka ,

నాస్తికోద్యమ మేరుపర్వతం లవణం

 lavanam 3
రాలిపోయింది.
నాస్తికోద్యమ మేరుపర్వతం నేలకొదిగి పోయింది.
ప్రజాస్వామిక విప్లవకారుడి ప్రస్థానం ఆగిపోయింది .
స్వాతంత్ర సమరయోధుడే కాదు సాంఘిక సమర సైనికుని  జీవితం ముగిసింది. కానరాని సుదూరతీరాలకు పయనమై వెళ్లిపోయింది.
నిత్యం నూతన సాధనాల అన్వేషణ చేసే ఆ శ్వాస నిలిచిపోయింది.
నవయువకుడిలా ఆలోచించే ఆయన జీవితం ముగిసిపోయింది.
మేమంతా నాన్నగారు అని గర్వంగా చెప్పుకునే, అభిమానంతో పిలుచుకునే  గోపరాజు లవణం ఇకలేరు.  మరణం అనివార్యం అని తెలుసు. అయినా ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది.  కానీ తప్పదుగా…

భారత్‌ కే కాదు  ప్రపంచ దేశాలకు మహత్మాగాంధీజీ మార్గాలు, నియమాలు సూక్తులు సర్వదా అనుసరణీయమని నమ్మిన గాంధేయవాది,  మానవతావాది లవణం గారితో నాకున్న పరిచయం, అనుబంధం తక్కువేమీ కాదు. ఆయన్ని మేమంతా (సంస్కార్ కార్యకర్తలు )అంకుల్ అనీ,  నాన్నగారూ అని పిలుచుకుంటాం.

లవణం గారితో నా పరిచయం ఈనాటిది కాదు. ముప్పై ఏళ్ళ క్రితం 1985లో మొట్టమొదటి సారి ఆయన్ని కలిశాను.lavanam 1 అయితే , అంతకు ముందే మా నాన్న నోట ఆయన గురించి విని ఉండడం వల్లేమో మొదట చూసినప్పుడు ఒకింత ఎగ్జైట్ అయ్యాను.   తిరుపతిలోని  శ్రీ వెంకటేశ్వరవిశ్వద్యాలయం వారు అంతర్జాతీయ జాతీయ సేవాపథక కార్యక్రమం  శ్రీకాళహస్తి లో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నేనూ శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం నుండి కార్యకర్తగా పాల్గొన్నాను. అది పది రోజుల కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ , అంతర్జాతీయ వాలంటీర్ లనుద్దేశించి ప్రసంగించడానికి ఓ రోజు  స్పీకర్ గా వచ్చారు లవణం దంపతులు.  అంతకు కొద్దిగా  ముందే యూరోప్ లో పర్యటించి వచ్చిన లవణం యువతని ఉత్తేజితం చేసే  ప్రసంగం చేశారు. అదే రోజు సాయంత్రం నుండి పొద్దుపోయే వరకూ మా మిత్ర బృందం లవణం గారితో నాస్తికత్వంపై వాదప్రతివాదనలు. తన వదనా పటిమ, వాక్చాతుర్యంతో ఎదుటివారిని తన వాదనని ఒప్పుకునేలా చేసే అద్భుతమైన తీరు, ఏ విషయమైనా అనర్ఘళంగా మాట్లాడగల శక్తిని, వ్యక్తిని చూడడం అదే మొదటిసారి. నాస్తికత్వం గురించి చేసిన వాదనలు ఎంతోకాలం వెంటాడుతూనే ఉండేవి. ఆ తర్వాత పదేళ్ళ కాలం గడచిపోయింది. విచిత్రం ఏంటంటే నేను వివాహానంతరం నిజామాబాద్ జిల్లా వర్నికి వెళ్ళాను.  అప్పటికే అక్కడ నాస్తిక మిత్రమండలి కార్యక్రమాలు , జోగినీ దురాచార నిర్మూలన కార్యక్రమాలు చేపట్టారు లవణం దంపతులు. అదిగో అప్పుడు మళ్లీ కలిశాను. అప్పటి నుండీ కలుస్తూనే ఉన్నాను . కారణం వారి సంస్థ సంస్కార్ కార్యకలాపాల్లో నేనూ భాగస్వామిని కావడమే. లవణం గారెప్పుడూ తమ దగ్గర పనిచేసే కార్యకర్తగా  చూడలేదు. ఓ కూతురుగానే చూసేవారు.  నేను సంస్కార్ లో చేరడానికి కొద్దిగా ముందు నా కన్న తండ్రి వల్లూరిపల్లి రంగారావు గారు పోవడం వల్లేమో లవణం గారితో మాట్లాడుతుంటే మా నాన్న గుర్తోచ్చేవారు.  బహుశా ఆ లోటు భర్తీ లవణంగారితో చేసుకున్నానేమో !

IMG_14532005 అక్టోబర్ వరకూ ఆయన సంస్కార్ చైర్మన్ గానూ, నాస్తికోద్యమ నాయకుడిగానూ,  నాన్నగారిగానూ  మాత్రమే చూశాను. ఆతర్వాత CIDA/KRIS ఆహ్వానం మేరకు ఆయన నేతృత్వంలో  స్వీడెన్ , ఫిన్లాండ్ దేశాల పర్యటనకు బృందంలో నేనూ ఉండడంతో  ఆయన్ని లోతుగా చూసే, పరిశీలించే అవకాశాన్నిచ్చింది.  సమాజాన్ని ఆయన చూసే దృక్కోణం ఏమిటో కొద్దిగా నైనా అర్ధం చేసుకునే అరుదైన సమయం దొరికింది.

లవణం గారు  ఓ మానవతావాదిగా, నాస్తికుడిగా , దేశ గౌరవం ఏమాత్రం తగ్గకుండా చేసే ఉపన్యాసాలు , అక్కడి మిత్రులతో జరిపిన సంభాషణలు ,గాంధీ అంటే రాట్నం – మార్క్స్ అంటే తుపాకినేనా ? కాదంటూ చేసిన ప్రసంగాలు అక్కడి పత్రికలలో చోటుచేసుకోవడం, Political violence in India – A Gandhian Approach to Peace అనే అంశంపై స్వీడెన్ లోని ఐక్యరాజ్యసమితికార్యాలయంలో చేసిన ప్రసంగం, ఫిన్లాండ్ లోని  హెల్సింకి, కార్హులా, తుర్కు పట్టణాలలోను  చేసిన ప్రసంగాలు, నక్సలైట్లతో చర్చలకు సిద్దం అంటూ ఆయన వేసిన కరపత్రాలపై అక్కడిమిత్రులతో చేసిన చర్చలు ఆయనలో నాకు తెలియని ఎన్నో కోణాలని చూపాయి.  నా ఆలోచన విస్తృతం కావడానికి,  విశాలమవడానికి మార్గం దోహదం చేశాయి.

విప్లవం ,ప్రజాస్వామ్యం  రెండూ ప్రజల కోసమే అయినప్పుడు రెండూ కలసి ప్రజల కోసం పనిచేసే అవకాశాలు రావాలని కోరుకున్నారు లవణం.  ప్రతి పౌరుడు ఒక ప్రజాస్వామిక విప్లవవీరుడు అయితే ప్రజాస్వామిక పద్దతిలో విప్లవాత్మక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు తప్పక ఉంటాయని అయన ఆలోచన.

మారుతున్న సమాజంలోని సమస్యలకు అనుగుణంగా నూతన సాంఘిక విప్లవ సాధనాలు వెతకాలన్న ఆలోచనలోంచే, కొత్తబాటలు వేయాలన్న కలల్లోంచే పదేళ్ళక్రితం  నక్సలైట్లకు బహిరంగలేఖ రాసి ఉండవచ్చు. సర్వోదయ నాయకుడిగా , గాంధేయవాదిగా ప్రపంచానికి తెలిసిన లవణం తుపాకీ తమ అవయవాల్లో అంతర్భాగంగా ప్రకటించుకున్న నక్సలైట్లతో కలసి నూతన విప్లవ మార్గాలు వెదుకుదాం అంటూ పిలుపు నివ్వడం, వారితో కలసి చర్చించడానికి వారెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ప్రకటించడం చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుందెవారికైనా .  రెండు విభిన్న మార్గాల్లోని వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా కుదురుతుందని సందేహం కలుగుతుంది. కానీ లవణం గారు మాత్రం గాంధీ – మావోల మధ్య సమన్వయము కోరుకున్నారు. అందుకు తనవంతుగా కృషి చేస్తానని ప్రకటించారు.

గుంటూరు జిల్లాలోని స్టువార్టుపురం నేరస్తుల సంస్కరణ, నిజామాబాద్ , మెదక్ జిల్లాల జోగినీ వ్యవస్థ నిర్మూలన , పునరావాస కార్యక్రమాలతో లవణం దంపతులు స్వాతంత్ర్యానంతర సంఘ సంస్కర్తలు గానే కాక సాంఘిక విప్లవకారులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. రహస్యం కంటే బహిరంగంలో ఎక్కువ శక్తి ఉందేమొనని వివిధ కార్యక్రమాలు చేసిన అనుభవంతో అంటారు లవణం గారు.  తను చైర్మన్ గా ఉన్న సంస్కార్ లో తీవ్ర  సంక్షోభం తలెత్తినప్పుడు ఎదుటివారితో ఆయన వ్యవహరించిన తీరు మరచిపోలేనిది. ఆ సమయంలో ఆయనలో ఉక్కుమనిషిని చూశాను.
స్వీడన్ పర్యటనలోను, మనదేశంలోనూ  ఫండింగ్ ఏజెన్సీస్ తో ఆయన నిక్కచ్చిగా వ్యవహరించిన తీరు నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది. తమ సంస్థలకి  విదేశీ నిధులు సంపాదించడం కోసం దేశాన్ని అత్యంత పేదరికంలో మగ్గుతున్న దేశంగా , ఇక్కడి పేదరికాన్ని భూతద్దంలో చూపించి నిధుల వేట సాగించే సంస్థలు ఎన్నో ఉన్న సమయంలో తన గౌరవాన్ని , సంస్థ గౌరవాన్ని , దేశ గౌరవాన్ని తాకట్టుపెట్టని అయన గొప్పదనం, వారితో వ్యవహరించిన ఖచ్చితమైన తీరు నన్ను అబ్బురపరిచాయి. ఆనందపరిచాయి.

lavanamలవణం గారిపై తండ్రి గోపరాజు రామచంద్ర రావు గారి ప్రభావం ఎంత ఉందో అంతే ప్రభావం గాంధీ , మార్టిన్ లూథర్ కింగ్ లదీ ఉన్నట్లుగా అనిపించేది. 1966-67లలోనూ ఆ తర్వాత అమెరికా వెళ్లినప్పుడు మూడుసార్లు మార్టిన్ లూథర్ కింగ్ ను కలసి మాట్లాడానని చెప్పేవారు.   అహింసకు సత్యాన్వేషణ ముఖ్యమైనప్పుడు సత్యాన్వేషణ ఆస్తికుల సొంత హక్కు కానప్పుడు, నాస్తికులు కూడా సత్యాన్వేషణ చేస్తున్నారని అంగీకరించినప్పుడు తమ ఆస్తికత్వాన్ని చూసుకునే పద్ధతిలో పెద్ద మార్పు వస్తుంది. అది గాంధీజీలో వచ్చింది. గాంధీని ఆయుధంగా స్వీకరించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌లో కూడా అటువంటి ఆలోచనే వచ్చింది. అందుకే ఆయన ప్రపంచ శాంతికొరకు నా వంటి నాస్తికులతో కలసి పనిచేయాలని అనుకున్నారు. దురదృష్టం కొద్దీ కింగ్‌ హత్య వల్ల నాకు ఆ అవకాశం లేకుండా పోయింది అనడం చాలా  సార్లు విన్నాను.

గత శతాబ్దాన్ని నాలుగు భాగాలుగా విభజించి మొదటి అర్ధభాగాన్ని age of active morality అనీ, ఆ తర్వాతి ఇరవై ఎళ్ళని Age of passive morality అనీ, ఆ తర్వాతి పది పదిహేనేళ్ళ కాలాన్ని Age of passive immorality అనీ , ప్రస్తుతం మనం జీవించేది Age of  active immorality అని చాలా సార్లు చాలా సందర్భాలలో చెప్పేవారు.  సాంఘిక విప్లవంలో ఎంత చిన్న త్యాగమైనా వృధా పోదు . ఎంత పెద్ద త్యాగమైనా సరిపోదు . అసమర్ధతతో పెద్ద త్యాగాలు చేయలేక, అహంకారంతో చిన్న త్యాగాలు చేయక సమాజంలో అన్యాయాలు , అక్రమాలు, దోపిడీని మనమే కొనసాగిస్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు లవణం.

కుల మత రహిత వ్యవస్థ ప్రగాధంగా కోరుకునే వారు నాన్నగారు. కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నారు. మానవతావాదం వైపు నడిచిన అయన వర్ణాంతర వివాహాలు చేసుకున్న వేలాదిమంది ముందుకువచ్చి తాము కులరహిత మతాతీత సమాజానికి పునాదులమని నిర్భయంగా చెప్పుకోవలసిన అవసరముందని అనేవారు. అందుకు మనం ఒక సామాజిక శక్తిగా రూపొందాలి. వివాహం ఒకప్రక్క వ్యక్తిగత విషయమైతే, మరొకప్రక్క సమాజానికి పునాది అయిన కుటుంబ వ్యవస్థకి శుభారంభం. అందుకే  మా వివాహం వ్యక్తిగతం అనడానికి వీల్లేదు. వివాహంతో కుటుంబాన్ని ప్రారంభిస్తున్నాం. కుటుంబం సమాజ వ్యవస్థకి మూలం. సమాజ వ్యవస్థ విలువల నుంచి పతనమవుతున్నప్పుడు కుటుంబం కూడా దిగజారిపోతుంది అని చాలా సందర్భాల్లో చెప్పేవారు.  మనం కులాల వేర్పాటు మనస్తత్వం నుంచి బయటపడాలి. ప్రస్తుతం ప్రతి కులంలోని ధనికులని ఆ కులంలోని పేదలే రక్షిస్తున్నారు అంటే ప్రతి కులంలోని దోపిడీ దారులను ఆకులంలోని దోపిడీకి గురవుతున్నవాళ్ళే రక్షిస్తున్నారు. అదే ఈ దేశపు ముఖచిత్రం అంటూ పరిస్థితిని విశ్లేషించేవారు.

గత మే లో అనుకుంటా ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ – రాజకీయాలు కార్పొరెట్‌ చేతికి వెళ్లిపోవడంతో  వాటిలో మానవ విలువలు తగ్గిపోతున్నాయి .  రాజకీయాలలో తగ్గిపోయిన మానవ విలువలను మత విలువలతో నింపాలన్న ప్రయత్నం జరుగుతోంది. ఇలాగే సాగితే  సెక్యులర్‌ వ్యవస్థ రానురాను మతవ్యవస్థగా మారిపోతుందని ఆవేదన చెందిన లవణం గారి మాటలకి అర్ధం చేసుకుంటూ పరిస్థితుల్ని అన్వయించుకుంటూ ఉన్నా .  చాలా కాలమయింది నాన్నగారితో మాట్లాడి అనుకుంటూనే ఫోన్ చేయడంలో జాప్యం. నాన్నగారికి ఫోన్ చేయడమంటే కాస్త సమయం చూసుకుని చేయాలి. ఆయన చెప్పేవన్నీ వినాలి అప్పుడప్పుడూ ప్రశ్నలు వేయాలి . ఆయన చేసే సామాజిక విశ్లేషణల వెంట పరుగులు పెట్టాలి.

అందలోనే పిడుగులాంటి వార్త . లవణం గారి ఆరోగ్యం బాగుండలేదని. పరిస్థితి క్లిష్టంగా ఉందని. ఆ వార్త తెలియగానే గత నెల 29 న వెళ్లి చూసి వచ్చా. ICU లో ఉన్న ఆయన్ని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. దాన్ని అలానే అణచివేస్తూ చూస్తూ నుంచున్నా.   నా చేయి పట్టుకుని నేను బాగానే ఉన్నానురా .. మన వాళ్ళందరికీ చెప్పు. అక్కడ అందరూ బాగున్నారా .. పిల్లలు ఎట్లా ఉన్నారు కుశల ప్రశ్నలు వేసి ప్రమాదం దాటేశానులే ఇక పర్వాలేదు అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు.  మాట్లాడుతోంటే కొద్దిగా ఆయాసం వస్తోంది. మీరు ఎక్కువగా మాట్లాడకండి అంటే వింటేనా మాట్లాడుతూనే ఉన్నారు.  నిత్యచైతన్య శీలి అలా మాట్లాడుతూనే ఉంటారని ఓ 15 నిముషాల తర్వాత బయటికి వచ్చేశా.  లవణంగారి చిన్న చెల్లెలు నౌ గోరా గారితో కలసి నాస్తికకేంద్రంకి వెళ్ళాను. వాళ్ళు చెప్పారు పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం, డాక్టర్ల అబ్సర్వేషన్ లోనే ఉండాలని.   లవణంగారు హాస్పిటల్ నుండి తిరిగివస్తారని  ఆశతో వెనుదిరిగా.

ఎవరికీ లేని విధంగా ఉప్పు సత్యాగ్రహసమయంలో పుట్టినందుకు ‘లవణం ‘ చాలా భిన్నంగా ఆలోచించడం చిన్నపుడే అబ్బింది. పదిపన్నెండేళ్ళ వయస్సులోనే 7వతరగతిలో ఉండగా బ్రిటిష్ విద్యావిధానంలో చదవనని బడి మానేశారు. కానీ నడుస్తున్న ఎన్సైక్లోపీడియాలాగా ఆయనకి తెలియని అంశంలేదు. ఏ విషయమైనా ధారాళంగా మాట్లాడేవారు.  పన్నెండేళ్ళ వయస్సులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1944 – 46 లో మహాత్మాగాంధీ వెంట సేవాగ్రాం ఆశ్రమంలో ఉన్నారు. వినోభాభావే , జయప్రకాశ్ నారాయణ్ లతో కలసి భూదానోద్యమంలో పాల్గొన్న లవణం సహచరి విశ్వనరుడు గుర్రం జాషువా కుమార్తె హేమలత.  ఇద్దరూ కలసి అనేక సాంఘిక సమస్యల, రుగ్మతల పరిష్కారం కోసం నూతన మార్గాల్లో పయనించారు.

ఎనిమిదేళ్ళ క్రితం వెళ్ళిపోయిన హేమలత దగ్గరకి వెళ్ళిపోయారు లవణం.  లవణం దంపతులు చేసిన కృషి వృధా పోదు. వారు నాటిన స్పూర్తి బీజాలు ఎందరిలోనో అంతర్లీనంగా  ఉన్నాయి. అవి మరెన్నో బీజాలకు ప్రాణంపోస్తాయి. లవణం గారి ఆశయాలకు జవం , జీవం ఇస్తాయి. వారి నైతిక వారసత్వాన్ని, సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోతాయి. అలా చేయడమే ఆయనకి మనమిచ్చే అసలైన నివాళి IMG_1450

వి. శాంతి ప్రబోధ
(Published in Saranga Webmagazine on August 16, 2015)

అనాధ – ఆన్లైన్ ఇబ్బందులు

సమతనిలయం లో 10 మంది పిల్లలు 5 వతరగతి పూర్తీ చేసుకున్నారు. వారిలో 5 మంది మోడల్ స్కూల్ లో చేరాలని అనుకుంటున్నారు. అందుకోసం ఆన్లైన్ లో అప్లై చేయడానికి మా మంజుల ని మీ సేవా సెంటర్ కి పంపించాను.  అవి ఎంట్రీ చేసేటప్పుడు అన్నీ సందేహాలే . మాటిమాటికీ ఫోను.  ఇతర పిల్లల అప్లికేషన్ నింపేటప్పుడు వాళ్లెవరికి రాని ఇబ్బందులు మా పిల్లలకి వచ్చాయి. కారణం వాళ్ళ వివరాలు తెలియకపొవడమే.  ఆ అప్లికేషన్ లో పేరు , ఇంటిపేరు , తల్లిదండ్రుల పేర్లు, కులం , మతం తప్పనిసరిగా ఇవ్వాలి.
కానీ మా పిల్లల్లో కొంత మందికి వారి ఇంటిపేరు తెలియదు. కులం , మతం అసలే తెలియదు .
ఇలా తమ కులం గురించి వివరాలు తెలియని పిల్లల్ని ‘కుల రహితులు’ (casteless )గా గుర్తించి  షెడ్యుల్డ్ కులాల వారికి ఇచ్చే స్కాలర్ షిప్ సౌకర్యాలు, రిజర్వేషన్ సౌకర్యాలు ఇవ్వాలని G.O.Ms.No. 34 చెప్తోంది. అదే విధంగా వీరికి 3% సీట్లు సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ అద్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లోనూ, హాస్టళ్ళలోను సీటు ఇవ్వ వచ్చని G.O.Ms. No 47 చెప్తోంది
అదే విధంగా ఈ పిల్లల నుండి ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు.
గతంలోనూ 10 వతరగతి, ఇంటర్ చదివే వాళ్ళ ఫీజు విషయంలోనూ మాకు ఇబ్బందులేదురయ్యాయి. G.O  చూపించినా ఫీజు తప్పని సరిగా కట్టాల్సిందే , ఆన్లైన్ లో accept చేయడం లేదు అన్నప్పుడు మేం చేసేదిలేక ఫీజు కట్టేశాం.
ఇదిగో ఇప్పుడు మా వాళ్ళలో ఒకరికి ఇంటిపేరు, కులం పేరు తెలియదు . castless అని పెట్టమంటే ఆ ఆప్షన్ లేదు అంటున్నారు. పై G.O ల ప్రకారం యస్ సి పెట్టండి అని చెప్తే, మరో ఆప్షన్ మాల / మాదిగ ఏది అని వచ్చింది. ఎలా .. చివరికి మాదిగ అని ఇచ్చాం . సర్ నేమ్  ఆ అమ్మాయి పేరులో మొదటి అక్షరం S ఇచ్చాం. అయినా ఆ ఫీల్డ్ ముందుకుపోలేదు. అదే అక్షరం రెండు సార్లు  అంటే SS అని ఇచ్చాం.  కానీ మేం చేసింది తప్పు కదా .. మనసు ఒప్పుకోవడం లేదు. లేదంటే ఆ అమ్మాయి మోడల్ స్కూల్ లో అవకాశం కోల్పోవచ్చు.  వీళ్ళకి కులం , ఆదాయం , నివాస సర్టిఫికేట్ లు ఉండవు . orphan certificate ఉంది. సీటు వస్తే అడ్మిషన్ అప్పుడు మరెలాంటి సమస్యలు ఎదుర్కోవాలో ….

ఇప్పుడు చాలా సందర్భాల్లో birth certificate అడుగుతున్నారు. వీళ్ళకు ఆ certificate ఎలా ఇస్తారు .? మా వాళ్ళలో చాలా మందికి మేమే ఒక పుట్టిన తేదీ ఇచ్చాం. వాళ్ళ చిరునామా సమతనిలయమే. ఇక్కడే మేం ఆధార్ కార్డు కూడా తీసుకున్నాం. కానీ birth certificate కి అది సరిపోదు కదా ..
 ఈ విషయాలు  స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారికి ఫోన్ చేసి చర్చించాను. శాఖల మధ్య సమన్వయ లోపం  సాఫ్ట్ వేర్ చేసేటప్పుడు ఇలాంటివి జరిగి ఉండొచ్చని అనిపించి ఆ విషయమే వారితో అన్నాను.  ఈ సమస్యలని పరిష్కరిచడానికి వీలవుతుందేమో చూడగలరా అని అడిగాను.   అవునా .. ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు.  రాసి పంపించండి. స్టేట్ మీటింగ్ లలో మేం పై  వారి దృష్టికి తీసుకేళ్టాం అన్నారు.  చూద్దాం ఏమి జరుగుతుందో ..

విశ్వకవి రవీంద్రుడు

sripada sahiti kalapitham37వ తేది  విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ , మనసుకవి ఆత్రేయల జన్మదినం సందర్భంగా శ్రీపాద సాహితీ కళాపీఠం వారు నిజామాబాదులో కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ఆ కార్యక్రమంలో రవీంద్రనాథ్ టాగూర్ గూర్చి నేను చేసిన ప్రసంగ పాఠం ఇది
రవీంద్రనాథ్ టాగూర్ అనగానే నా మనసులో మేదిలేవి మూడు. ఒకటి జనగణమన , రెండోది గీతాంజలి , మూడోది శాంతి నికేతన్. .
మన జాతీయగీతం జనగణమన రాసింది రవీంద్రనాథ్ టాగూర్ అన్న విషయం మనందరికీ తెలుసు. ఆ జాతీయ గీతాన్ని మనమందరం చిన్నప్పటి నుండి ఇప్పటివరకూ ఎన్నోసార్లు ఆలాపించాం.  రవీంద్రుడు జనగణమన రాసినప్పుడు ఆ గీతానికి పెట్టిన పేరు భారత విధాత. కాని తర్వాతి కాలంలో అది జనగణమన గానే అందరికీ తెలుసు. మన జాతీయ గీతమే కాదు బంగ్లాదేశ్ జాతీయ గీతం “అమోర్ సోనార్ బంగ్లా ” కూడా రవీంద్రుని గీతమే .  రెండు దేశాలకు జాతీయ గీతాన్ని అందించిన ఘనత చరిత్రలో మరెవరికీ దక్కలేదేమో ..!
ఆసియాలోనే మొట్టమొదటి నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రుడు. ఆయన విశాల హృదయంలోంచి  వెలువడ్డ గీతాంజలి  భక్తిపూర్వక భావ గీతాలు ఆయన్ని విశ్వకవిని చేశాయి . మనిషిని కుంగ దీసే నిరాశా నిస్పృహల్ని పోగొట్టి శ్రమ జీవన సౌందర్యాన్ని, గొప్పదనాన్ని , ప్రకృతి తో పాటు మనుషుల్ని విశాల హృదయంతో ఆరాధించాడు రవీంద్రుడు. మనవసంబంధాల పట్లా ఆయనకున్న విశ్వాసం , ప్రేమాభిమానాలు ఆయన గితాలలో కన్పిస్తాయి.  బహుశ తన  కుటుంబ జీవితం మానవ సంబంధాల పట్ల విశ్వాసం పెంచితే , కొన్ని కారణాల వాళ్ళ ఇల్లు కదల కుండా ఉండడం ఆయన్ని బయటి ప్రపంచ సౌందర్యం  చాలా ఆకర్షించి ఉండొచ్చు.
 బెంగాలీలో రాసిన ఆ గీతాల్ని ఆయనే ఇంగ్లీషులోకి చేశారు.  ఆఅవి గార్డనర్ , క్రిసేంట్ మూన్ లో ప్రచురితమయ్యాయి.  1913లో నోబెల్ పురస్కారం ప్రకటించిన  తర్వాత అన్ని భారతీయ భాషల్లోకే కాకుండా  ప్రముఖ ప్రపంచ భాషలన్నిట్లోకి అనువాదమయ్యాయి.   కోట్ల కొద్ది విదేశీయులకు భారతీయ సంస్కృతీ పై గౌరవాన్ని కలిగించాయి.
నేను 2005లో స్వీడెన్ వెళ్ళినప్పుడు సిటీ హాల్ చూడగానే , అక్కడికి వెళ్ళగానే ఒక ఉద్వేగం నన్ను ముంచెత్తింది. ఇక్కడే కదా రవీంద్రుడు నోబెల్ అందుకుంది అనుకుంటూ ఏ హాల్ లో అందుకున్నారు .. ఎక్కడ డిన్నర్ చేశారు వంటి ప్రశ్నలు వేసినప్పుడు పురస్కారం అందుకోవడానికి ఆనాడు ఉన్న పరిస్థితులలో రవీంద్రుడు స్వయంగా రాలేకపోయారని టెలిగ్రాం ద్వారా తన సందేశం పంపారని తెలిపారు.   తర్వాత శాంతి నికేతన్ లో దొంగలు పడినప్పుడు నోబెల్ పురస్కార పతకం కూడా పోయింది. శాంతి నికేతన్ నిర్వాహకుల కోరిక మేరకు నోబెల్ కమిటి నమూనా మెడల్ ను చేయించి పంపిందట.
గీతాంజలి గీతాల్లో మహాత్ముడికి నచ్చిన గీతం
 ” ఈ మంత్రములు జపమాలలు విడిచిపెట్టు
తలపులన్నింటినీ బంధించి
ఈ చీకటిగదిలో ఎవరిని పూజిస్తున్నావు .. కళ్ళు తెరచి చూడు
 ఆరాధించే దేవుడు నీ  ఎదుట లేడు
ఎచట రైతు  నేలదున్నుతున్నాడో
ఎచట శ్రామికుడు రాళ్ళు పగులగోడుతున్నడో
అక్కడ పరమాత్ముడున్నాడు
వారు ఎండలో, వానలో ధూళి ధూపరితములైన వస్త్రములతో ఉన్నారు
నీవు కూడా పట్టు పితాంబరములు ఆవల పెట్టు ఆ నేల మీదికి పదా … “
నాకు నచ్చిన గీతం ఏదంటే
“ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో
ఎక్కడ విజ్ఞానం స్వేచ్చగా మనగలుగుతాడో
ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై ఇరుకైన గోడల మధ్య మగ్గి పోవదో
 నా దేశాన్ని ఎక్కడ విరామమైన అన్వేషణ , పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో
ఎక్కడ పరిశుద్దమైన జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో  ఇంకిపోదో
తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో
ఆ స్వేచ్చా స్వర్గంలోకి , తండ్రీ ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహింపు ..”
టాగూరు కి ‘సర్ ‘ బిరుదినిచ్చి గౌరవించింది బ్రిటిష్ ప్రభుత్వం. కానీ దానిని ఆయన తిరస్కరించారు. కారణం జలియన్ వాలా బాగ్ ఉదంతంతో తివ్రమనస్తాపం చెందిన టాగూర్ అందుకు ని రసనగా తాను ‘సర్ ‘ బిరుదును తిరస్కరించారు.
ఐదుగురు విద్యార్థులతో ఆయన ప్రాంభించిన శాంతినికేతన్ ఇప్పుడు వందలాది మంది విద్యార్థులతో విరాజిల్లుతోంది.
రవీంద్రుడు గొప్ప కవి మాత్రమే కాదు ఆయన గొప్ప విద్యావేత్త, కళాకారుడు, నాటక రచయిత, నవలా కారుడు, సంగీతవేత్త, తత్వవేత్త, చిత్రకారుడు.  బహుముఖ ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు గొప్ప మానవతావాది   రవీంద్రుడు . ఆయనని స్మరించుకోవడం మాత్రమే కాదు ఆయన బోధించిన మానవతను, ప్రేమభావాన్ని,  విశాల హృదయాన్ని అలవరచుకోవాలి  మనం .

ఆశ్చర్యం .. ఆనందం …

ఆశ్చర్యం .. అంతులేని ఆశ్చర్యాన్ని మోసుకొచ్చింది ఆ ఫోన్.
చేతిలోని మొబైల్ గంట కొట్టింది. నంబర్ చూస్తే ఎవరో తెలియలేదు. కాల్ తీసుకున్నాను. ఎవరో పెద్ద వాళ్ళ గొంతు. అమ్మా .. వర్ని చరిత్రలో లేని విధంగా చరిత్ర సృస్టించావ్ అంటూ .. గొంతు ఎవరిదో గుర్తుపట్టలేక పోయాను. ఆ గొంతులో ఆనందంతో కూడిన వణుకు. అది జలుబుతో ఉన్నట్లుగానో.. వయసుతో వచ్చినట్లుగానో.. అర్ధంగాక .. ఏమిటండీ మీ గొంతు ఇలా వీక్గా .. అన్నాను ఆ కాల్ చేసింది జంపాల సుబ్బారావు సార్ కావచ్చోనే ఉద్దేశ్యంతో.. వయసు పెద్దదయిపోయింది కదమ్మా .. 85 ఏళ్ళు ఇప్పుడు అని చెప్పి చాలా సంతోషంగా ఉందమ్మా ..పిల్లలేం చేస్తున్నారూ .. మీ ఆయన ఏమి చూస్తున్నాడు .. మీ మామయ్య వాళ్ళంతా బాగున్నారా అని కుశలప్రశ్నలు వేసి తనకి సాహిత్యం అంటే ఎంత ఇష్టమో చెబుతోంటే ఆ మాటల తీరుని బట్టి అర్దమయింది ఆయనెవరో .. అంత పెద్ద వయసులో నేను ఆర్గనైజ్ చేసిన ఓ చిన్న కార్యక్రమాన్ని గుర్తించి నా ఫోన్ నంబర్ ఎలాగో సంపాదించి ఫోన్ చేసి అంతగా మెచ్చుకుంటుంటే నాకు ఏమీ మాట్లాడాలో తెలియని బిడియం.. ఈ సారి ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే చెప్పమని తప్పకుండా వస్తానని చెప్పడం .. సాహితీవ్యాసంగాన్ని వదలవద్దని సలహా ఇవ్వడం.. ధనంతో కూడిన ప్రస్తుత రాజకీయాలు మాట్లాడడం.. ఈ సారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ని కలవమని చెప్పడం అంతా .. అంతా .. ఆశ్చర్యమే … ఆయన్ని నేను చివరగా చూసి ఇరవై ఏళ్ళ పై మాటే . అలాంటిది ఇప్పుడు ఇలా ఫోన్ చేసి మాట్లాడడం ఆశ్చర్యమే కదా మరి!

ఆయనెవరో ఇంతకీ చెప్పనే లేదు కదూ .. ఆయన మరెవరో కాదు , మా బాన్సువాడ నియోజకవర్గంలో ఒకానొక సమయంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేసిన మాజీ ఎమ్మెల్యే SVL నరసింహారావు గారు.

వి. శాంతి ప్రబోధ

మధుర లంబాడీలు…నిండు వసంతం వారి సొంతం!

DSC_0002మామిడిపండులా మధురంగా కనిపించి నా మనసు దోచుకున్న వారిని గురించి తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండడం లోనే రోజులూ, నెలలూ సంవత్సరాలూ కాలగమనంలో దోర్లిపోయాయి. వారిని నేను మొదట చూసింది మంచిర్యాల నుండి ఆదిలాబాద్ బస్సులో వెళ్తూ. వారి ఆహార్యం వింతగా కొత్తగా ఉండి వారి పట్ల ఆసక్తి రేకెత్తించింది. ఆ తరువాత కొన్ని ఏళ్ళకి అంటే నేను నిజామాబాద్ జిల్లాలోని వర్ని వచ్చేవరకూ ఎప్పుడూ వాళ్ళని చూసే అవకాశం రాలేదు.

ఓ రోజు, ఆశ్చర్యగొల్పుతూ వారు మా ఇంటి ముందు నుండి బారులు తీరిన ఏండ్ల బళ్ళలో వెళుతూ .. ఆతర్వాత ఓ రోజు మా ఇంటి దగ్గర వారి బళ్ళు ఆపుకొని మా బోరింగ్ దగ్గర కూర్చొని వారు వెంట తెచ్చుకున్న జొన్న రొట్టెలు తినడం నాకు వాళ్ళని గమనించడానికి అవకాశం దొరికింది. వాళ్ళు అక్టోబరు మాసంలో చెరుకు కొట్టడానికి ఇళ్ళనుండి బయలు దేరి వెళ్ళిన వాళ్ళు మార్చిలో వెనక్కి వస్తున్నారట. ప్రతి సంవత్సరం అలా పిల్లాపాపలతో, గొడ్డు గోదా తీసుకొని వెళ్తారని మా వాళ్ళు చెప్పారు. చక్కని ముఖ కవళికలతో అందంగా, మంచి రంగుతో, పొడుగ్గా ఉండే వారి నడినెత్తిపైకి కట్టి ఉండే జుట్టు, వారి మెడలో కనిపించే పూసలు, నిండు రంగులలో ఉండే బట్టలూ ఆసక్తితో గమనించేదాన్ని. మా వాళ్ళందరూ చిన్నప్పటినుండి చూస్తూ ఉండడం వల్లనేమో వాళ్ళకి ఆ జాతి వారిని ప్రత్యేకంగా చూసేవారు కాదు. నాకు మాత్రం వారు చాలా ప్రత్యేకంగా ఆనాటికీ ఈనాటికీ… నన్ను అంతగా ఆకర్షించిన వారే మథుర లంబాడీలు.
మధుర లంబాడాలు మాములుగా మనకు కనిపించే లంబాడాలు లేదా బంజారాలు లేదా సుగాలీలు లకు భిన్నంగా కనిపిస్తారు. వారి భాష, ఆచార వ్యవహారాలు, కట్టు అన్నింటిలో ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది.
ఎక్కడెక్కడ కనిపిస్తారు
మధుర లంబాడాలు మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చాలా కొద్దిగా కనిపిస్తారు. వీరు మహారాష్ట్ర, చత్తీస్ గడ్ , రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో కూడా తక్కువ సంఖ్యలో కనిపిస్తారు. గుజరాత్ లో ఎక్కువ . వీరిని మహారాష్ట్ర, గుజరాత్ లలో మధుర బంజారా, చత్తీస్ గడ్ లో మధుర లంబాని, మధ్యప్రదేశ్ లో మధుర లబాన్, ఉత్తర ప్రదేశ్ లో మధురాలు లేదా మధూరియా అని అంటారు. మహారాష్ట్రలో వీరిని డి నోటిఫైడ్ విముక్త జాతులుగా ప్రకటించారు.
రాజస్థాన్ లోని బికనీర్, బహాల్యాపూర్ , పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో ఈ జాతి ఆవిర్భవించిందాని చరిత్ర కారుల అంచనా. రాజపుట్ వంశస్తుల అనచివేయబడిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళారని చరిత్రకారుల అంచనా.
DSC_0002
రాజస్థాన్ /గుజరాత్ నుండి ఎప్పుడో కొన్ని తరాల పూర్వం పశువుల పై సరుకులు రవాణా చేస్తూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళేవారని, అలా వచ్చి ఇటే ఉండిపోయారని చెప్తాడు 92 ఏళ్ళ మోతిలాల్ (సిద్దాపూర్ తండా , నిజామాబాద్ ).
నిజామాబాద్ జిల్లాలో వీరిని మధుర లంబాడాలు అనీ, కాయితి లంబాడాలు అనీ, కొప్పు లంబాడాలని , జుట్టు లంబాడాలని రకరకాలుగా పిలుస్తారు. వారి భాష, వేషధారణ, నగలు , పండుగలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వాయిద్య పరికరాలు అన్నీ ప్రత్యేకమే. అటవీ ప్రాంతాల్లోనే వీరి నివాసం. మైదాన ప్రాంతాలకి వారాంతపు అంగళ్ళకి వస్తారు.

మధుర లంబాడాలలో 11 గోత్రాలు ఉన్నాయి. అవి నాయక్, బామన్, బాద్రియా, కిత్రియా,లేల్యా, మాంద్యా, బర్దావల్, తిత్రియా , పెళ్యా, సాబ్ల్యా, భట్ . నాయక్ అందరికన్నా పై స్థాయిలో ఉంటే భట్ లు అందరికన్నా తక్కువ.
రాజస్థాన్ /గుజరాత్ నుండి ఎప్పుడో కొన్ని తరాల పూర్వం పశువుల పై సరుకులు రవాణా చేస్తూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళేవారని, అలా వచ్చి ఇటే ఉండిపోయారని చెప్తాడు 92 ఏళ్ళ మోతిలాల్ (సిద్దాపూర్ తండా , వర్ని మండలం, నిజామాబాద్ ). అయితే తమ వాళ్ళు ఎప్పుడొచ్చింది ఖచ్చితంగా చెప్పలేమని, మా ముత్తాతల ముత్తాతలది కూడా ఇదే ఊరు అంటాడు అతను.
మేం అంతా బస్సు తీసుకొని మా జాతి అంతా ఒక దగ్గర కలుస్తోంది అని తెలిసి గోకుల్ మధుర వెళ్లి వచ్చాం. అక్కడికి మాకు చూస్తే నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా . వాళ్ళు అంతా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో . డాక్టర్లు , ఇంజనీర్లు , కలెక్టర్లు . కొందరు అమెరికాలో . ఇక్కడ మేం ఇంకా అడవిలోనే . చదువు సంధ్యలకు దూరంగానే .. మా పిల్లలను బాగా చదివించాలని ఇప్పుడు మా తపన అన్నాడు గోకుల్ దాస్ తండాకు చెందిన నాయకుడు బారత్యానాయక్
మా ముత్తాతల ముత్తాతల ముందు తరాల వాళ్ళు వందల ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు మా జాతి ఎట్లా ఉందో అట్లానే మా జాతి లక్షణాలు మా దగ్గరే బతికి ఉన్నాయి. అక్కడ మా జాతి కట్టు బొట్టు , వేషభాషలు ఏమీ ఇప్పుడు కనిపించవు అన్నాడు పదవతరగతి వరకు చదివిన సజ్జన్లాల్ .
ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ గోత్రాన్ని బట్టి వాళ్ళు మా జాతీయులు అని గుర్తించవచ్చు అంటాడు ఇంజినీరింగ్ చదువుతున్న పతేసింగ్. వందల ఏళ్ళ క్రితం చెల్లా చెదురు అయిపోయిన మా జాతిని గుర్తించడానికి, ఒక దగ్గర చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు టెక్నాలజీ కూడా చాలా ఉపయోగపడుతోంది అన్నాడు ఈ ప్రాంతంలో మధుర లంబడాల జాతి నుండి కాబోయే మొదటి ఇంజినీర్.
జీవన విధానం
ప్రకృతి ఒడిలో కొండ వాలులోనో, అటవీ ప్రాంతంలోని వాగు సమీపంలోనో ఉంటాయి మథుర లంబాడాల నివాసాలు. మధుర లంబాడాలు ప్రధానంగా పశులకాపరులు. వ్యవసాయం చేస్తారు. గోవుల కాపరి శ్రీకృష్ణుడి రాజధాని గోకుల మధుర మాది అని వాళ్ళు చెప్తారు. వీరి మెడలో జంధ్యం ఉంటుంది. గాయత్రి మంత్రంతో పవిత్ర జంధ్యం వేసుకుంటారు. వాళ్లకు వాళ్ళు మేం క్షత్రియులం అని చెప్పుకుంటారు. కానీ, బయట ప్రపంచం వీరిని గిరిజన తెగలకు చెందిన వారిగానే చూస్తుంది.
వీరు సంచార జీవులుగా ఉన్న కాలంలో వీరు తండాల్లో ఉండేవారు. వీళ్ళ నాయకుడుని నాయక్ అంటారు . వంశానుగాతంగా ఆ పదవి వస్తుంది. నాయక్ ఎప్పుడూ తమ వారి మంచి కోసం ఆలోచిస్తూ కృషి చేస్తాడు. అందరూ అతని మాటని గౌరవిస్తారు.
DSC_0020
ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ కనిపిస్తాయి. ఒక్క కుటుంబంలో అరవై డెబ్బై మంది కుడా ఉంటారు. వ్యవసాయ పనులు, పశువుల పెంపకం అంతా కలసి చేసుకుంటారు . పిల్లలు పెద్దల పట్ల గౌరవంతో ఉంటారు.
ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఐదారేళ్ళ క్రితం వరకూ గోవులను మేపుతూ అలా రోజులు నెలల తరబడి వెళ్ళేవారు . ఇంటికి దూరంగా ఉండే వారు. గోవుల మందలను తోలుకెల్లి పొలాల్లో మంద పెట్టె వాళ్ళు. అందుకు ప్రతిఫలంగా రైతులు జొన్నలు , వడ్లు ఏదో ఒక ధాన్యం ఇచ్చే వారు. వీరి జీవనం చాలా కష్టంగా సాగేది. అప్పట్లో మాకు నాగరికత తెలియదు. గత 20 ఏళ్లలో మా జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. నాగరికత తెలిసింది. మా కట్టు-బొట్టు, ఆచార వ్యవహారాల్లోనూ మార్పు వచ్చింది అంటాడు భారత్యా నాయక్ బంధువు .
అవును, అప్పుడు మాకు అప్పులు లేవు. ఇప్పుడు అప్పులు వచ్చాయి. ప్రభుత్వం వారూ, బాంకు వాళ్ళు రుణాలు ఇస్తున్నారు. అవకాశం ఉంది కదా అని భార్య పేరున , పిల్లల పేరా అప్పులు చేసి ట్రాక్టర్లు, మోటారు సైకిళ్ళు , పొలాలు , బోర్లు సమకూర్చుకుంటున్నాం. కానీ అప్పటి రోజులే బాగున్నాయి అప్పులు లేకుండా యాలకింత తిని కంటి నిండా నిద్ర పోయే వాళ్ళం అన్నాడు భారత్యా నాయక్.
ఇప్పటికీ వ్యవసాయంలో నాగలి, రెండు చక్రాల ఎడ్ల బళ్ళను ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్న వనరులతో వ్వవసాయం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడిప్పుడే ట్రాక్టర్లు , కొత్త మిషన్లు వంటి యంత్రాలు వీరి జీవనంలోకి వచ్చి చేరుతున్నాయి.

ఆహారం
వాస్తవానికి వీరు శాఖాహారులు. అయితే నేటి తరం వారు మద్యం, మాంసాహారానికి అలవాటుపడిపోయారు. వీరి సాంప్రదాయిక ఆహారం రోటి. జొన్నలు బాగా తింటారు . గోధుమ, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము , కంది పప్పులు ఎక్కువగా తింటారు . టమాటా , వంకాయ వంటి రకరకాల కూరగాయలు వాళ్ళ పొలాల్లో పండేవి తింటారు. ఆకుకూరలు తింటారు. వరి బియ్యం తినడం ఒకప్పుడు లేదు. తిన్నా ఎప్పుడో పండుగ సమయాల్లో మాత్రమే తినేవారు. యన్. టి. రామారావు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండురూపాయల బియ్యం ఇచ్చినప్పటి నుండి నెమనెమ్మదిగా బియ్యం తినడం అలవాటు అయింది అంటాడు మాజీ సర్పంచ్ భర్త మోతిలాల్.
జామ, అరటి , యాపిల్ వంటి పళ్ళన్ని వారాంతపు సంతలో తెచ్చుకుంటారు. పెరుగు, నెయ్యి బాగా వాడతారు. తీపి పదార్ధాలు ఇష్టపడతారు. టీ తాగుతారు. పల్లీలతో, కందగడ్దలతో( చిలగడ దుంప) పండుగ సమయాల్లో పాయసం చేసుకుంటారు.
వారి ఇళ్ళు
కొండ కోనలకు సమీపంలో వీరి నివాస సముదాయాలు ఉంటాయని ముందే చెప్పాను కదా ! సమీపంలోని అడవినుండి తెచ్చిన టేకు దుంగలను గోడలుగా అమర్చుకుంటారు. పైన వర్షాకాలపు పంటకు వచ్చే వరిగడ్డిని తెచ్చుకుని ఇళ్ళపై కప్పుతారు. ఇంటి ముందు పశువుల పాకలు ఉంటాయి. పశువులే వారి ఆస్తి. లేగ దూడలను ఇంట్లో తమతో పాటే ఉంచుకుంటారు. వంటకి కట్టెల పొయ్యి వాడతారు.
గతంలో పొయ్యిలో నిప్పు ఉన్నప్పుడే అన్నం తినేవారు. ఆరిపోతే తినరు . ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఉపయోగించుకొని కొందరు పక్కా ఇళ్ళు కట్టుకున్నారు. దాదాపు అన్ని ఇళ్ళలో విద్యుత్ దీపాలు కనిపిస్తాయి. మీటరు ఉండదు కానీ వైర్ తగిలించి విద్యుత్ దీపాలు వెలిగించు కుంటారు కొందరు. కొందరి ఇళ్ళలో టి.వి లు కూడా వచ్చేశాయి. నాగరిక ప్రపంచంలో కనబడే అనేక వస్తువులు అడవుల్లోనో , అటవీ అంచుల్లోనో ఉండే వారి ఇళ్ళలోకి చొచ్చుకొచ్చి ఆశ్చర్యం కలిగిస్తాయి.

స్నేహానికి ప్రాణమిచ్చే మథుర లంబాడీలు కొద్దికాలం క్రితం వరకూ అటు నక్సలైట్లు ఇటు పోలీసుల మధ్య నలిగిపోయారు.

మాతృభాష
వీరి భాష లంబానా భాష. వీరి భాషలో మరాఠీ , హిందీ, బంజారా భాషా పదాలు మిళితమై కనిపిస్తాయి. నిరక్షరాస్యులైన వీరు మాతృభాషతో పాటు స్థానిక భాషలు మాట్లాడతారు.
భాషలో కొన్ని పదాలు
లెహెంగ (లంగా)
కచలి (జాకెట్)
నమస్తే – రామ్ రామ్
యా/బాయి – అమ్మ
బా – నాన్న
దాదా – అన్న
జీజీ – అక్క
జీజొ – బావ
దండో – తాత
డంగి – నాన్నమ్మ
పుప్పీ – అత్త
పెళ్లి – బ్యహ
బాడువా – వడక లగ్గం
నాక్డా – నాయక్
పూజించే దేవతలు

వీరు శ్రీ కృష్ణుడిని కొలుస్తారు. తిరుపతి బాలాజీ , పూరి జగన్నాధ్ ని పుజిస్తారు.

పండుగలు
మథుర లంబాడాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పండుగ గోకులాష్టమి. వీరి నివాసాలకు వెళితే శ్రావణమాసం అంతా పండుగ వాతావరణమే కనిపిస్తుంది.
DSC_0016
వస్త్రధారణ
పెళ్ళికాని ఆడపిల్లలు లేహంగా, కచలి (జాకెట్ ) వేసుకుంటారు . పెళ్లి అయిన స్త్రీలు చీర వాళ్లపద్దతిలో కట్టుకుంటారు.
మగవారి ఆభరణం జంధ్యమే . దీన్ని జనువా అంటారు. సాంప్రదాయంగా ధోతీ (బారకషి ), జుబ్బా (జహంగల ) వేసుకుంటారు.

చదువు
చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. అతి కొద్ది మంది ఇంటర్ వరకు చదివి ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు మిలిటరీలోకి వెళ్ళారు. ఆడ పిల్లల్లో చదువుకునే వారి సంఖ్యా మరీ తక్కువ. ఇప్పుడిప్పుడే 10 వతరగతి కి వచ్చారు . ఒకరిద్దరు ఇంటర్ చదివితే , ఒకమ్మాయి మాత్రం నిజామాబాద్ లో ఉంది ప్రైవేటు కాలేజిలో ఇంగ్లిషు మీడియంలో డిగ్రీ చదువుతోంది.
పెళ్లి:
మగవాళ్ళకి 21, వదువుకి 16 పెళ్లి వయస్సు.
మధుర లంబాడాల తండాలో నాయక్ అందరికీ పెద్దగా ఉండి గ్రామ మంచి చెడులు, గ్రామ మంచి కోసం చేసే కార్యాలు చేస్తాడు. అలాగే భట్ గోత్రికుడి కి కూడా వంశపారంపర్యంగా బట్ పని వస్తుంది. అతను నాయక్ కి సహాయకుడిగా ఉంటాడు. అంతే కాకుండా పెళ్లిల్లప్పుడు పెళ్లి పనులు చేస్తాడు.
అతను చేసే సేవలకు వారి వారి ఆర్ధిక స్థాయిని బట్టి కొత్త సొమ్ము ఇచ్చేవారు. మొన్నటి వరకూ పదకొండు వందల రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 5 వేలు ఆరు వేలు కూడా ఇస్తున్నారు.
ఊరిలో ఎ సమాచారమయినా అందరికి చేరవేస్తాడు భట్. పెళ్లి పిలుపులు , చావు వార్తలు అతనే చేర వేస్తాడు.
మానవ జీవన విధానాన్ని ప్రభావితం చేసే అంశాలు సహజంగానే వారినీ ప్రభావితం చేయడం కనిపిస్తుంది. ఒక సమాజానికి మిగతా సమాజాల వారితో సంపర్కం ఏర్పడ్డాక, రాకపోకలకు సదుపాయాలు ఏర్పడ్డాక, సమాచార వినిమయం పెరిగాక వచ్చే మార్పులు వీరి జీవన విధానంలోకి చోచ్చుకోచ్చేశాయి.
ఇంతకు ముందు పెళ్లి పత్రికలు వేయించేవారు కాదు. ఆకులు – పోకలు ఇచ్చి ఫలానా వారి పెళ్లి ఉందని చెప్పి పిలిచే వాళ్ళు. ఇప్పుడు పెళ్లి పత్రికలు వేయిస్తున్నారు.
ఒకప్పుడు బ్రాహ్మడు ముహూర్తం చూసి పెళ్లి సమయం నిశ్చయించే పద్ధతి లేదు. పెళ్లి సమయాన్ని నాయకుడే నిర్ణయించే వాడు. ఆ సమయానికే పెళ్లి జరిగేది. ఇప్పుడు కూడా నాయక్ పెళ్లి ఎప్పుడు చేయాలో చెప్తున్నాడు కానీ బ్రహ్మడికి కూడా చూపిస్తున్నారు. ఆ సమయం మంచిదో కాదో చెప్పించుకుంటున్నారు.
అమ్మాయి అబ్బాయి పెళ్ళికి ముందు చూసుకునే పద్ధతి కూడా లేదు. అమ్మాయి తరపు వారు అబ్బాయి గురించీ, అబ్బాయి తరపు వారు అమ్మాయి గురించీ ముందే బంధు మిత్రుల ద్వారా తెలుసుకుంటారు. ఆ తర్వాత ఇరువర్గాలు నాయకుడి ఇంటి దగ్గరికి వస్తారు. ఆకులు – పోకలు ఇచ్చి పుచ్చుకుంటారు. తింటారు. పెళ్లి చేసే విధానంలోనూ అనేక మార్పులు.
పెళ్ళైన ఆడపిల్లకి కాలిపాట్ అని నల్లపూసల మంగళసూత్రం ఉంటుంది. రక్షడి, కాఖడి జుట్టులో పెట్టుకుంటారు. ఇత్తడి కాళ్ళ కడియాలు, గూటి (టో రింగ్ ), బిడ్ (మెడ , చెవుల నగలు ). ఒకసారి పెడితే అవి చని పోయే వరకూ తీయరు. భర్త చని పోయిన స్త్రీ అవి తిసివేస్తుంది.
039
విడాకులు తక్కువ . పిల్లలు పుట్టకపోతేనో , భార్య చనిపోతేనో, ఆరోగ్యం బాగోలేకపోతేనో మళ్లీ పెళ్లి చేస్కోరు. విడాకులు తీసుకున్న వాళ్ళు, భర్త చనిపోయిన మహిళలు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఇలా రెండో సారి పెళ్లి చేసుకొనే మహిళ వాళ్ళు విడాకులు తీసుకున్న వారినో , భార్య చనిపోయిన వ్యక్తినో చేసుకుంటారు. విధవరాలిని రండ్ అంటారు.
మగవాళ్ళు విడాకులు కోరితే ఆడపిల్ల వారికి కుల పంచాయితీ పెద్దలు చెప్పిన విధంగా భరణం చెల్లించాలి. విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత భర్తదే. పెళ్లి జరిగాక చేసే పెళ్లికి సంబంధించిన గుర్తులన్ని ఉంచుకోవచ్చు. భార్య/భర్త నడవడి బాగోలేకపోతే విడి పోయి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. రెండో పెళ్ళిని మొహ్తుర్ అంటారు.
కట్నం ఇచ్చి పుచ్చుకోవడం లేదు. ఒకప్పుడు అబ్బాయి అమ్మాయికి కట్నం ఇచ్చే పద్దతి ఉండేది. ఒలి ఇవ్వలేక అబ్బాయిలు ముదిరిపోయేవారట. ఓలి ఇచ్చి చేసుకునే వారు లేక అమ్మాయి ల పెళ్ళిళ్ళు అలస్యంగానే జరిగేవి. అయితే ఇప్పటికీ పెళ్ళిలో అమ్మాయికి 11 రూపాయలు కట్నంగా ఇచ్చే పద్ధతి ఉంది. ఓలి పద్ధతి లేదు. గురువు వచ్చాక ఆ విధంగా ఇవ్వడం మానేశారు.
అమ్మాయి కుటుంబం పేదదయితే పెళ్లి చేసే స్తోమత లేకపొతే , ఆ అమ్మాయిని తమ ఇంటి కోడలిగా తీసుకు వెళ్ళలనుకుంటే అమ్మాయి పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు ఆబ్బాయి వాళ్ళు ఇస్తారు. పెళ్లి చేసుకొని అమ్మాయిని తమ ఇంటికి తెచ్చుకుంటారు.
ఇంటి కోడలు పురిటికి కన్నవారింటికి వెళ్ళే ఆచారం లేదు. అత్తవారింటిలోనే పురుడు పోసుకుంటారు. పురిటి ఖర్చు అత్తింటి వారిదే . బిడ్డ పుట్టిన రెండు మూడు నెలల తర్వాత వెళతారు. ఒకప్పుడు ఇంటిదగ్గరే పురుడుపోసుకునే వారు. ఇప్పుడు ఆసుపత్రి కి వెళుతున్నారు. నెలరోజులు పురిటి మైల పాటిస్తారు. ప్రత్యేకమైన గదిలోనే ఉంటారు. ఆసమయంలో బిడ్డపనులు, తన పనులు తప్ప తల్లి ఏ పని చేయదు.
vaari veedhi
బహుభార్యాత్వం
సాధారణంగా ఏకభార్యత్వం పాటిస్తారు. కొన్ని సందర్భాల్లో బహుబార్యత్వం కనిపిస్తుంది. మొదటి భార్యకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అలా చేసుకుంటారు.
బంధుత్వాలు
చిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న పిల్లల్ని చేసుకోరు. మేనరికాల్ని చేసుకుంటారు.
అన్న చనిపోతే వదినని తమ్ముడు చేసుకోవచ్చు. కానీ, తమ్ముడి భార్యని అన్న చేసుకోడు.
వాయిద్య పరికరాలు
నగారా , బాజాలు , గిల్ల
మహిళల భాగస్వామ్యం
మగవాళ్ళ లాగే మహిళలూ అనడంతో పాటు ఎత్తుగా బలంగా ఉంటారు. స్త్రీలు ఇంటిపని, పొలం పని, పశువులు పాడిపనో ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తారు. ఒకప్పుడు బట్టలు చేత్తోనే కుట్టుకునే వారు. ఇప్పుడు వాళ్ళ బట్టలు కుట్టడానికి ప్రత్యేకంగా ఉన్న దర్జీ కుడతారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వారెవరికీ మిషను కుట్టడం రాదన్నారు. గతంలో తీరిక సమయాల్లో రకరకాల చేతికుట్లు కుట్టేవారట. ఇప్పుడు కుట్టడం లేదు అంటూ ఇప్పుడు అంతా కాలం మారిపోయింది కదా .. ఆ కుట్టినవి. ఇప్పటి వాళ్ళు వేసుకుంటారా అని ఎదురు ప్రశ్నించింది ఓ వృద్దురాలు.
నాలుగేళ్ళ క్రితం గుజరాత్ నుండి ఎవరో వచ్చారు. మా తండాలన్నీ తిరిగారు. మా దగ్గర ఉన్న చినిగిపోయిన బట్టలకు ఉన్నవయినా సరే మేం చేత్తో కుట్టిన వాటిని అడిగారు. వాటికి బదులుగా మాకు ఇత్తడి సామాన్లు ఇస్తామన్నారు. ఏమి చేసుకుంటాం అని మా దగ్గర ఉన్నవన్నీ వెతికి వెతికి వాళ్ళకి ఇచ్చేశాం అంటూ వాళ్ళు ఇచ్చిన ఇత్తడి గిన్నెలు చూపింది ఓ మహిళ. ఇప్పుడు మా దగ్గర మేం చేసిన కుట్లు అల్లికలు లేవు. ఎక్కడో ఒకరి దగ్గర తప్ప. అవి వచ్చిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు. ఇప్పటి ఆడపిల్లలు ఎక్కడ నేరుస్తున్నారు ..? అంది జమునాబాయి .

మధుర లంబాడాల కుటుంబాల్లోనూ మగ పిల్లవాడికి ఇచ్చిన ప్రాధాన్యత ఆడపిల్లకి ఇవ్వరు. ఆడపిల్లలు బడికి పోయేవాళ్ళు చాలా తక్కువ. గొడ్డు గోదా మేపడానికో, చేను కాపలాకో, ఇంటి పనులు చేయడానికో ఆడపిల్లలని బడికి పంపకుండా ఇంటిదగ్గరే ఉంచుతారు. ఏ పనులూ లేనప్పుడు పంపినా తమ తండాలో ఉన్న బడికే. చాలా కొద్ది మంది ఆడపిల్లలు ఊరు దాటి వెళ్లి చదువుకునేది. అదే మగపిల్లలయితే బడి ఉన్నప్పుడు ఊర్లొ కనిపించేది చాలా తక్కువ.
నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు నేనడిగే ప్రశ్నలకి జవాబు చెప్తూనే మా గురించి అన్ని అడుగుతున్నావ్.. నీమిటి లాభం అని ఒకరు అంటే .. సర్కారు జీతం ఇస్తుందా అని మరొకరు .. ఆ ఏమి లాభం లేకుంటే చదువుకున్నోళ్ళు మన ఇళ్ళు ఎందుకు వస్తారు అంటూ మహిళల నుండి ప్రశ్నల పరంపర. ఏదైనా ఆర్దికపరమైన లాభం లేకుండా ఎవరూ ఏ పనీ చేయరని వారి ప్రగాఢమైన నమ్మకం.

ప్రపంచీకరణ, ఆధునికీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా శరవేగంగా జరుగుతున్న మార్పులు, చోటు చేసుకుంటున్న ధోరణులు స్వచ్చమైన ముత్యంలా మెరిసే మథురాలలొకి వచ్చి వారినీ ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో వారి అభివృద్ధి ఎంత వరకూ జరుగుతుందో తెలియదు కానీ మథుర లంబాడాల జాతి ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన తమ అస్తిత్వాన్ని మాత్రం ఇక ఎక్కువ కాలం నిలుపుకోక పోవచ్చేమో త్వరలోనే కోల్పోతుందేమోనని నా బెంగ.
వి. శాంతి ప్రబోధ

క్లాసు బయటి కార్యక్రమాల్లో నేను

.
నేను చదివింది ప్రభుత్వ బడిలోనే  అయినా క్లాసు బయటి కార్యక్రమాలు చాలా ఉండేవి

నన్ను తరగతి గది కంటే బయటి ప్రపంచమే ఆకర్షించేది. అందుకే బయటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపేదాన్ని.  నేను ఏడవ తరగతిలో చేరాక మాకు కొత్తగా ప్రసాద్ అని హిందీ సార్ వచ్చారు.  ఆయన చెప్పే హిందీ పాఠం అంటే నాకెంతో ఇష్టం.  అప్పుడు నాకు హిందీ బాగా వచ్చేది. మంచి మార్కులు తెచ్చుకునే దాన్ని.  ఆ స్కూల్ వదిలాక నాకు వచ్చిన హిందీ కుడా పోయిందనుకోండి.  చెప్పే వారిని బట్టే పిల్లలకు ఆ సబ్జెక్టు అంటే ఆసక్తి ఏర్పడుతుందేమో !  మా హిందీ సారు పాఠం మాత్రమే కాదు మాకు పాటలూ, డాన్సులు కూడా నేర్పేవారు.  అన్నింటిలో ముందు ఉండాలని చెప్పేవారు .  మాతో పాడవోయి భారతీయుడా, ఆడి  పాడవోయి విజయ గీతికా అంటూ పాట  నేర్పి డాన్సు చేయించారు. అదే మొదటిసారి పాట పాడడం, డాన్స్ చేయడం.   మా క్లాసులో ఉన్నదే ఐదుగురం అమ్మాయిలం. వాళ్ళలో నేను తప్ప మిగతా నలుగురు  అమ్మాయిలు విజయ, రాజ్యలక్ష్మి, జయలక్ష్మి, అంజలి  7వ తరగతిలోనే లంగా ఓణీలు వేసుకునేవారు.  నేనేమో గౌన్లు , హాఫ్ లంగాలు వేసుకునే దాన్ని.  వాళ్ళు డాన్సు చేయడానికి అసలు ముందుకి వచ్చేవారు కాదు.  అన్నిటికీ సిగ్గు పడుతూ ఉండేవారు.  మా హిందీ సారూ చాలా ప్రయత్నించారు వాళ్ళను అన్నిట్లో పాల్గొనేలా చేయాలని.  ప్చ్ లాభం లేదు.  ఎనిమదవ తరగతిలో అసలు అమ్మాయిలే లేరు.  నేను ఆరవతరగతి, ఐదవ తరగతి వాళ్ళతో కలసి డాన్సు చేశా.  మొత్తం ఎనిమిది మందిమి  కల్సి చేసిన గ్రూప్ డాన్సు అది.

కొన్ని రోజులయ్యేసరికి మా సాంఘీక శాస్త్రం చెప్పే సుగుణాకర్ రావు సారూ బదిలీపై వెళ్లి పోయారు. ఆ స్థానంలో స్వామి సర్ వచ్చారు.  ఆయన అంటే కుడా నాకు ఇష్టం.  ఆ సార్ వచ్చాక మా బడి లో నెలకొకసారి డిబేట్ పెట్టేవారు.  కత్తి గొప్పదా ? కలం గొప్పదా , స్త్రీ కి విద్య అవసరమా ? అనవసరమా అంటూ రకరకాల అంశాలపై డిబేట్ ఉండేది.  ఒకరోజు ముందుగానే మాకు టాపిక్ చెప్పేవారు. డిబేట్ ఉన్నప్పుడల్లా మా అమ్మతో మా బడిలో చెప్పిన  అంశంపై చర్చ చేసేదాన్ని.  అమ్మ మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పేది.  అమ్మ పనిలో ఉంటే మీ నాన్న దగ్గరకు వెళ్లి చెప్పించుకో అనేది.  అప్పట్లో నాన్న అంటే నాకు చచ్చేంత భయం ఎందుకో .. తలచుకుంటే నవ్వు వస్తుంది.  మా తమ్ముడు రవి , పెద్ద చెల్లి శైలు పాల్గొనేవారు కాదు.  కానీ, చిన్న చెల్లి కామేశ్వరి తనూ పాల్గొనాలని ఉబలాటపడేది. ఉత్సాహపడేది.  తను మూడవ తరగతిలో ఉన్నప్పుడు ఒక ఉపన్యాసపోటిలో పాల్గొంది.  చెప్పాలనుకున్న విషయం చక్కగా జంకు కొంకు లేకుండా చెప్పింది.  చిన్న పిల్ల ఎంత బాగా చెప్పింది అని అంతా అనుకొంటున్న సమయంలో నేను చెప్పింది ఇంతవరకూ విన్నందుకు ధన్యవాదాలు. ఏమన్నా తప్పులుంటే మరణించగలరు అని చెప్పి మైకు వదిలింది.  అంతే , అంతా ఫక్కు మన్నారు .  ఎందుకో అర్ధంగాక తెల్లమొహం వేయడం దాని వంతయింది.

మాకు క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది.  అప్పుడు కుట్లు , అల్లికలు నేర్పేవారు.  ఆ క్లాసుకి ఆడపిల్లలంతా చాలా ఆసక్తి చూపేవారు.

మా బడి ఆవరణలో కూరగాయ మొక్కలు పెంచే వాళ్ళం. కూరగాయలు మాత్రం మా హెడ్ మాస్టర్ ఇంటికి చేరేవి.సాయంత్రం కాగానే బడిలో రోజూ వ్యాయామం చేయించేవారు.  ఆటలు ఆడించేవారు. అలా ఆట పాటలతో  సరదాగా  ఎనిమిదో తరగతి అయిపొయింది.  ఇప్పటి పిల్లలకేది సరదాగా ఆడి  పాడే సమయం?

వి. శాంతి ప్రబోధ

లక్షేట్టిపేటలో నా చదువు

నేను ఆరవ తరగతికి వచ్చేసరికి మా అంజయ్య పంతులు బడి మాయమైంది ఎందుకో మరి! ఆ విషయం గుర్తు లేదు.  మా నాన్న మా చదువు కోసం మా మకాం లక్షెట్టిపేట బోరుమీదకు  మార్చారు. బుద్దిపల్లిలో మా నాయనమ్మ, తాత, మా శేషక్క (చిన్న మేనత్త ) ఉండేవారు.

అప్పుడు  మేం యార్లగడ్డ నాగేశ్వరరావు గారి ఇంట్లో అద్దెకి ఉన్నాం .  మా ఇంటి పక్కనే మా బడి. మా కాన్వెంట్ అసలు పేరేమిటో తెలియదు కానీ రాయలు గారి కాన్వెంట్ అనే వారు.  రాయలు మాస్టారు, ఆయన భార్య, మరి కొంతమంది టీచర్లు ఉండేవారు.  మేం చేరేటప్పటికే ఆ  బడిలో మా మూడో పెద్దమ్మ కొడుకు  కుమార్ అన్న, మామయ్య పిల్లలు ఇంకా కొందరు బంధువుల పిల్లలు చదువుతున్నారు. ఆ కాన్వెంట్ కి  చదువుతో పాటు మంచి నడవడిక నేర్పుతున్నారని పేరొచ్చింది.  అందుకే మమ్మల్నీ ఆ బడిలో చేర్చి ఉంటారు మా వాళ్ళు.

అప్పటివరకూ బడి అంటే చిన్న పాకలో అన్ని క్లాసులు కలసి కూర్చోవడం మాత్రమే తెలుసు.  ప్రతి క్లాస్ వేరువేరు గదుల్లో ఉండడం మొదట్లో నాకు చాల వింతగా ఉండేది.  రాయల సారూ వాళ్ళ బెంగుళూరు పెంకుటిల్లు, దాని ముందు వెనక వరండాలు, ఎదురుగా పెద్ద పాకలు అన్నీ క్లాసు రూములే.

మా రాయల సారూ, ఆయన భార్య మా కర్ధం కాని భాషలో అప్పుడప్పుడూ మాట్లాడుకోవడం మాకు వింతగా తోచేది.  వారి మాటల్లో కొన్ని పదాలు మినహా మిగతావి అర్ధమయ్యేవి కాదు.  వాళ్ళు కన్నడంలోనూ, ఇంగ్లిష్ లోనూ మాట్లాడుకుంటారని పెద్దల మాటల్లో తెలిసింది.

ఆ కాన్వెంట్ కి నేనూ , నా తమ్ముడు రవి వెళ్ళేవాళ్ళం.  చెల్లెళ్ళు ఇద్దరికీ అమ్మ ఇంట్లోనే చెప్పేది.
ఏమైందో మరి మూడు నాలుగునెలలు ఆ బడిలో చదివామో లేదో  మా బడి మూతబడింది.  మా రాయల సారూ వాళ్ళు బళ్ళారి వెళ్లి పోయారు.  అప్పుడు మాకు చాలా బాధ వేసింది.  మగ పిల్లలు కొందరు హమ్మయ్య పిడావదిలాడు అనుకున్నారు.  ఎందుకంటే వాళ్ళు చేసే అల్లరిని భరించేవారు కాదు.  పచ్చి బరిగేతో వాతలు, బస్కీలు, రకరకాల పనిష్మెంట్లు ఉండేవి.  సాధారణంగా ఆడపిల్లలు దెబ్బలు తినేవారు కాదు.

మా కాన్వెంట్ మూత పడడంతో నన్ను మిషన్ కాంపౌండ్ లో ఉన్న C.S.I. బడిలో చేర్చారు.  అది మా ఇంటికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆ కాంపౌండ్ నిండా రకరకాల వృక్షాలు.  మా క్లాసు రూం లు ఒక పద్దతిలో వరుసగా.  ఆ కొత్త స్కూల్ పక్కనే చర్చి ఉండేది.  అది క్రిస్టియన్ మిషినరీ స్కూల్.   ఆ స్కూల్ లో చేరాకే తెలిసింది మతాల గురించి.  అక్కడే మొదటిసారి చర్చి చూసింది.  ఆ చర్చి నాకళ్ళకి అద్బుతంగా కనిపించేది.  దాని తలుపులు చాలా పెద్దవి.  పెద్దగంట.   అక్కడ కొట్టే గంటా ఊరంతా వినపడేది.   రాత్రి పుట వేసే విద్యుత్ దీపాల కాంతి ఎంతో దూరం పరుచుకునేది . మేం  రోజూ చర్చిలో ప్రేయర్  చేయాలి. అది రాయల కాన్వెంట్లో లాగ భారతేదేశం నా మాతృభూమి అని కాకుండా ఏసు ప్రభుకి ప్రేయర్ చేయాలి.  మాకు చర్చిలో సువార్త పుస్తకాలు ఇచ్చేవారు.  అప్పుడప్పుడూ వాటిని చదివే దాన్ని. ఆ స్కూల్ కి వెళ్ళాక సువార్త అని ఒకమ్మాయి ఫ్రెండ్ అయింది.  వాళ్ళు మా స్కూల్ ఉన్న మిషన్ కాంపౌండ్ లోనే ఉండేవారు.  ఇంతకు ముందు రాయలు సారూ వాళ్ళ కాన్వెంట్ లో నాతో పాటు చదివిన అలూరి  లక్ష్మి, సుమతి, మా సరోజ వదిన ఇంకా చాలా మంది C.S.I. బడిలోనే చేరాం.

నేనూ , ఆలూరి లక్ష్మి, సుమతి, ఇంకా కొందరం కలిసి ఇప్పుడు సత్యనారాయణ గుట్ట అనిపిలిచే గుట్టల్ల దగ్గరకు వెళ్ళే వాళ్ళం. ఆ రాళ్ళ పైకి ఎగబాకేవాళ్ళం. భయమంటూ ఉండేది కాదు.  అక్కడ రాముడు సీత నడిచే వారనీ, వాళ్ళ పాదముద్రలున్నాయని, సీతమ్మ వారు వామన గుంటలు ఆడేవారని ఎవరికీ తోచిన విధంగా వాళ్ళం  కథలు కథలుగా  చెప్పుకునేవాళ్ళం.  చీకటి పడే సమయానికి ఇంటికి చేరే వాళ్ళం. అప్పటిదాకా తిరిగొచ్చామని ఇంట్లోనూ ఇబ్బంది కలుగలేదు .   ఇప్పటికీ ఆ దారిలో వెళ్ళినప్పుడల్లా చిన్ననాటి మధుర స్మృతులు మదిలో మెదులుతూనే ఉంటాయి

అలా ఆరవ తరగతి ఆడుతూ పాడుతూ అయిపొయింది.  మా మకాం మారిపోయింది. మేం మళ్లీ మా ఊరికి చేరాం.  బడి మొదలు పెట్టగానే 7 వ తరగతికి  దొనబండ జిల్లా పరిషత్ హై స్కూల్ లో చేరా.

వి. శాంతి ప్రబోధ

నా చదువు ఎలా మొదలయిందంటే …

నా మొదటి గురువు మా అమ్మ కల్పన.  మా చదువు మొదలైంది నాలుగు గోడల మధ్య కాదు.  మా ఇంట్లోనే. అమ్మ ఒడిలోనే .. అమ్మ తన పని అయ్యాక కుర్చోబెట్టేది.
నన్నూ తమ్ముడిని. అమ్మ వెనక, నాయనమ్మ వెనక తిరుగుతూ మూడవ తరగతి పూర్తి చేసేశాను. మాతో పాటు మా పక్క ఇంటి చిన్నమ్మ(అప్పటికి తన పేరు రత్నకుమారి.
తర్వాత తన పేరు 6 వ తరగతిలో మార్చుకుంది విద్యదరి గా. వాళ్ళింట్లో వాళ్ళంతా చిన్నమ్మ అనే వారు. మేమూ అలాగే పిలిచేవాళ్ళం.) ని కూడా కూర్చో బెట్టేది. తనదీ
నా వయస్సే. మా ఊర్లో బడి ఉంటె మమ్మల్ని అక్కడికి పంపే వారేమో! కానీ, బడే లేదు కదా.. నాకయితే బడి అనేది ఉంటుందనే తెలియదు అప్పటి వరకూ. నేను నాలుగవ
తరగతికి వచ్చేసరికి మా ఉళ్లోకి సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబం, వాళ్ళ అల్లుడు లక్ష్మా రెడ్డి గారి కుటుంబం వచ్చి చేరాయి. పిల్లలం పెరిగాం. అందుకే నాన్నావాళ్ళు అందరూ కలసి ఒంటి నిట్టాడు పాక వేశారు. అదే మా బడి. దానికి గడ్డితో వేసిన పై కప్పు తప్ప గోడలు ఉండేవి కావు.

మా కోసం ఒక బడి పంతుల్ని ఏర్పాటు చేశారు. ఆయన పేరు అంజయ్య పంతులు. మా పక్క ఉరు గొల్లపల్లి నుండి వచ్చేవారు. ఆ వూరు మాకు రెండు మైళ్ళ దూరం లోపే ఉండేది .
మా ఇంటికి కనిపిస్తూనే వుండేది. మధ్యలో అన్నీ వారి పొలాలు. వాటి మధ్య లోంచి ప్రవహించే వాగూ .. అయన అలా.. పొలం గట్లమ్మట రావడం మేము గమనిస్తూనే
ఉండేవాళ్ళం. అప్పటివరకూ ఎంత అల్లరి చేసినా మా అంజయ్య పంతులు దగ్గరలోకి వచ్చారంటే అంతా గప్ చుప్ గా ఉండేవాళ్ళం.

మా బడి కోసం మా వడ్ల శంకరయ్య ఒక చెక్క బోర్డు తాయారు చేసి ఇచ్చాడు . గుడిసె మధ్యలో ఉన్న గుంజకి ఆనించి పెట్టాడు మా పంతులు. మా సారు వచ్చేసరికి నల్లాలం
ఆకు, బొగ్గు వేసి బాగా దంచి బోర్డుకు పూసేవాళ్ళం. అది చక్కగా నల్లగా నిగనిగలాడుతూ ఉండేది.

నేనూ, నా తమ్ముడు రవి, చిన్నమ్మ, అరుణ, ఉపేందర్ , మన్మధ, విష్ణు, ప్రభాకర్, జగన్ చదువుకునేవాళ్ళం ఆ బడిలో . కొన్నాళ్ళ తర్వాత నా చెల్లెళ్ళు శైలజ, చంటి
(కామేశ్వరి), రజిత, రజని, శశికళ , సునంద అక్క చేరారు .

మా అంజయ్య పంతులు పచ్చటి పసుపు రంగులో మెరిసిపోతూ ఉండే ఆయన మోహంలో గుంతలు, మచ్చలు .. ధోవతి , చొక్కా , భజం పై ఎర్రటి రుమాలు లాంటి కండువా .. కిర్రు
చెప్పులు, నుదుట నిలువుగా నామాలూ.. ఒక చేతిలో చత్రి, మరో చేతిలో గుడ్డ చేతి సంచిలతో వచ్చేవారు. ఆ.. అంతే కాదు ఆయన చేతిలో ఎప్పుడూ చింతబరిగే మా
వీపులపై నాట్యం చేయడానికి సిద్ధంగా.. దాన్ని చూస్తే మాకు హడల్. చెప్పిన పాఠం అప్ప చెప్పక పోయినా , అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పక పోయినా గోడ కుర్చీలూ..,
బస్కీలు తప్పేవికాదు. చెప్పిన మాట వినక పోయినా, తుంటరి పనులు చేసినా చింత బరిగె వీపులపై నాట్యం ఆడేది. నాలుగైదు రోజులు గడచినా ఆ వాతలు, నెప్పులు ..
అయ్యబాబోయ్ .. మా అంజయ్య పంతులు ..

మా తమ్ముడు రవికి బడికి వెళ్ళడం ఇష్టం లేక పోయినా , పాఠం రాక పోయినా కడుపునొప్పి వచ్చేసేది. కడుపు నొప్పి అని ఒకటి రెండు సార్లు ఇంట్లోనే ఉంటె ఏమనలేదు మా పంతులు. ఆ తర్వాత నుండి బరిగా పట్టుకొని ఇంటికోచ్చెసేవారాయన. మా వాడు మాత్రం తక్కువ తిన్నాడా ఇంటి చుట్టూ పరుగులు పెట్టి ఆయనను నానా తిప్పలు పెట్టేవాడు . చివరికి గెలుపు మా అంజయ్య పంతులుదే. రవికేమో చింత బరిగె  బహుమతులూ.. అలా నాలుగు, ఐదు తరగతులు చదివాను.  మా బడికి ఆదివారం సెలవు ఉండేదే కాదు. అలా ఉంటుందనీ మాకు తెలియదు నేను ఆరవ తరగతిలో చేరేవరకూ.

మా దొడ్డిలో కాసిన కూరగాయలు, పళ్ళు, గేద పాలు ఇచ్చేవారు అమ్మ వాళ్ళు .  మిగతా పిల్లల ఇంటినుండి కుడా ఏవో ఒకటి మా పంతులు ఇంటికి చేరేవి. పంట వచ్చినప్పుడు
ఎడ్ల బండిపై వడ్ల బస్తాలు వేసి పంపేవారు నాన్న.

దసరా పండుగ సమయంలో మాతో విచిత్ర వేషధారణ చేయించేవాడు మా పంతులు.  ఇంటింటికి  ‘ అయ్యవారికి అయిదు వరహాలు, పిల్లవాళ్ళకు పప్పు బెల్లాలు ‘ అంటూ తిరిగే
వాళ్ళం. పెద్దలు ఇచ్చిన పప్పు బెల్లాలు ఆనందంతో స్వీకరించే వాళ్ళం.

మధురమైన ఆ రోజులూ, జ్ఞాపకాలూ, అనుభూతులూ నెమరువేసుకోవడం తప్ప తిరిగిరావు కదా

మా ఊరికి కరెంటు .. గొట్టపు బావి వచ్చిన వేళ ..

 బుద్దిపల్లి ఊరికి దాదాపు కిలోమీటరు దూరంలో ఉండేవి మా ఇళ్ళు.  ఊరికి మా ఇళ్ళకు మధ్యలో నేతకాని, మన్నె ( అది ఒక షెడ్యుల్డ్  తెగ) వాళ్ళ ఇళ్ళు ఉండేవి.  మా ఇళ్ళను అంతా ఆంధ్రగడ్డ అని పిలిచేవారు.  అదేం విడ్డూరమో ! కానీ ,  కోస్తా ప్రాంతం నుండి వచ్చింది రెండే కుటుంబాలు.  ఒకటి మాది అయితే రెండవది మా ఇంటికి దక్షిణం వయిపు ఉన్న  నిమ్మగడ్డ రాఘవయ్య గారిది.  ఆ తర్వాత నల్లగొండ జిల్లా సూర్యాపేట వైపు నుండి వచ్చిన సోమిరెడ్డి గారి డాబా ఇల్లు, దానికి కొద్దిగా ఆవలగా ఆదిలాబాద్ నుండి వచ్చిన ముప్పిడి నారాయణరెడ్డి గారి ఇల్లు ఉండేవి .  మా ఇంటికి ఎదురుగా  భీమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి ఇల్లు, ఆ ఇంటికి దక్షిణాన ఆయన అల్లుడు లక్ష్మా రెడ్డి పంతులు గారి పెంకుటిల్లు, వాళ్ళింటికి తూర్పున లక్ష్మారెడ్డి తాతయ్య వాళ్ళ పెంకుటిల్లు ఉండేవి .   ఆ ఇంటికి ఉత్త్తరంలో వడ్ల శంకరయ్య  ఉండేవాడు .  ఆ ఇల్లు దాటితే రోడ్డు.  రోడ్డుకి అవతలి వైపు కొంత కాలానికి ప్రతాప రెడ్డి గారు, రాజి రెడ్డి గారు వచ్చి చేరారు .   అయినా, మా ఇళ్ళని ఆంధ్ర గడ్డ అనే పిలిచే వారు .

వడ్ణ శంకరయ్యకి, సత్యనారాయణ రెడ్డి గారి ఇళ్ళ మధ్య కొద్దిగా ఖాళీ స్థలం ఉండేది .   ఆ స్థలంలోనే  విద్యుత్ ట్రాన్స్ ఫారం వెశారు.  మా ఆంధ్రగడ్డ ప్రజలంతా కలసి వేయించుకున్న ట్రాన్స్ ఫార్మర్ అది. దానికి ఒక బల్బు పెట్టారు.  అది చూసి   ఊల్లో  అందరికీ  పండగే .  ఎందుకంటే అప్పటి వరకూ మాకు కరెంట్ లేదు. చాలామందికి ఆ వెలుతురు తెలియదు .
కరెంటు లైన్ వేసేప్పుడు అంటే స్తంభాలు నిర్దేశించిన ప్రదేశంలో నిలబెట్టేటప్పుడు చాలా మంది తాళ్ళతో పోల్స్ పైకి లేపేవారు . అప్పుడు వాళ్ళు వింత శబ్దాలు చేసేవారు . కరెంటు లైన్ వేయడం, ట్రాన్స్ ఫార్మర్ బిగించడం .. చాలా అద్భుతంగా అనిపించేది.  ఆ తీగల నుండి వెలుతురు రావడం గమ్మత్తుగా  ..  ఆ ట్రాన్స్ఫార్మర్ , వైర్లు ముట్టుకుంటే షాక్ కొట్టి చచ్చిపోతారని విన్నప్పుడు చాల భయం వేసినా .. రాత్రిపూట వెలుతురు పరిచే విద్యుత్ దీపాలని చూస్తే అద్భుతమే కదా మరి!  మా ఉళ్ళో కరెంట్ పనులు నడచినన్నాళ్ళు బడి నుండి ఇంటికి రాగానే  మా చిన్న చెల్లి చంటిని చంకనేసుకుని, పెద్ద చెల్లి శైలూ ని చేత పట్టుకొని వెళ్లిపోయేదాన్ని  వాళ్ళు చేసే పనులు చూడడానికి.  నే వెళ్ళేటప్పటికే,  నా తమ్ముడు రవి, వాడి దోస్త్ విష్ణు, మన్మద్, ప్రభాకర్, ఉపేందర్  జమ అయ్యేవారు.  మేం వాళ్ళ పనుల్ని కళ్ళప్పగించి చేసే వాళ్ళం.  మాకు వాళ్ళు చేసే ప్రతి పనీ చాలా గొప్పగా అనిపించేది.  వాళ్ళని, వాళ్ళు చేసే పనిని మా గ్రామస్తులంతా చాలా గౌరవంగా చూసేవారు . మా పిల్లలకైతే మా నోళ్ళలో ఎప్పుడూ కరెంటుకు సంబందించిన మాటలే, చర్చలే, వాదులాటలే .
ఆ పని వాళ్ళు మా ఇళ్ళ దగ్గరలోనే గుడారాలు  వేసుకొని ఉండేవాళ్ళు.   ఆ చిన్ని చిన్ని గుడారాల్లో వాళ్ళు ఎలా ఉంటారో నని మాకు చాలాఆశ్చర్యం .  ఆ గుడారాల ముందే మూడు రాళ్ళు పెట్టి వంటలు చేసుకు తినేవారు .  వాళ్ళలో ఒకరిద్దరు మిగిలిన అల్యూమినియం తీగలతో పూల కుండీ లా, అగరొత్తులు వెలిగించే స్టాండ్ గా రకరకాలు తాయారు చేసి మాకు ఇచ్చే వారు.   కరెంటు స్థంభాలకు పైన బిగించే పింగాణి వస్తువుల్ని తేడా వస్తే వాళ్ళు వాడేవారు కాదు.మేం వాటిని పోటిపడి జమ చేసేవాళ్ళం . వాటి కోసం పోట్లాడుకునే వాళ్ళం.  ఒక్కోసారి కొట్టుకొనే వాళ్ళం .   అమ్మ వద్దన్నా వినేవాళ్ళం కాదు.
మా పొలం వాగు వొడ్డున ఉండేది .   పారే వాగునీ ళ్ళకు ఒక మలుపు దగ్గర అడ్డంగా  తూటికాడ, వావిలి పొరక మట్టి వేసి కట్ట కట్టి నీళ్ళు నిలువ చేసేవారు . (చెక్ డ్యాం ల గురించి ఎప్పుడు విన్నా మాట్లాడినా నాకు మొదట గుర్తుకొచ్చేది మా వాగుకు వేసిన కట్టే) ఆ నీటిని పొలంలోకి మల్లించే వారు.   కొంత కాలానికి వర్షాలు లేక కరువు వచ్చింది .    కాలువల ద్వారా వచ్చే నీళ్లు పంట పొలాలకు సరిపోయేవి కాదు.  వాగు వొడ్డునే చెరువు లాంటి బావి తవ్వించారు నాన్న.వాగు నీళ్ళు బావిలోకి వచ్చే ఏర్పాటు చేశారు నాన్న.  మోటతో  నీళ్ళు పైకి తీసి పొలానికి పంపేవారు .   మా ఊరికి కరెంట్ వచ్చాక పొలం వరకూ లైన్ వెశారు.   అదే సమయంలో మా బావిలో మూడో, నాలుగో గొట్టపు బావులు డ్రిల్ చేయించారు మా నాన్న.  రంగారావు గంగను పొంగించాడు అని అంతా పొగిడేవారు.  ఆ తర్వాత అరుణ వాళ్ళ పొలంలోని బావిలోనూ బోర్ వేశారు.  అవి వేసినప్పుడూ  అంతే మా పిల్ల ముఠా నే కాదు, మా ఊరే  కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి వింతగా  నోరెళ్ళబెట్టి, కళ్ళప్పగించి ఆశ్చర్యంతో , అబ్బురంగా చూసేవారు .  చెప్పుకొనే వారు.  మా బుద్దిపల్లి చుట్టుపక్కల ఎవరూ గొట్టపు బావులు వేయక పోవడం, వాటి గురించి విని ఉండక పోవడంతో ఆడ, మగ తేడా లేకుండా వచ్చెసెవారు చూడడానికి. మరి మా నాన్నా మజాకా అని మేం కాలరెగరేసే వాళ్ళం .  ఆ రోజులే వేరు
వి. శాంతి ప్రబోధ

Tag Cloud

%d bloggers like this: