The greatest WordPress.com site in all the land!

Archive for the ‘images’ Category

కొండా కోనల్లోని మాణిక్యాలు ‘ఓజ ‘ హస్త కళాకారులు

madhyalo madavi bhagavantharavu. mugguru ahmadabaad vellaru ‘మా తాత ముత్తాతల నుండీ ఈ పని చేస్తున్నాం. కానీ మాకు మార్కెట్ లేదు.’ అన్నాడు మడావి భగవంతరావు.   అవునన్నట్లు తలలూపారు అతనితోనే ఉన్న వాళ్ళు . ఆ వెంటనే ‘మాకు పనిచేయడం తెలుసు కానీ మార్కెట్ చేసుకోవడం తెలియదు’ అని తన మాట సవరించుకున్నాడు మడావి భగవంతరావు.  వాళ్ళంతా ‘ఓజ ‘ చేతిపని కళాకారులు. నిజమే,  వాళ్ళు చేసిన చేతికళలకు ఉపయోగపు విలువ ఉంది.  మార్కెట్ చేసుకోవడమే తెలియదు. వారు తమ శక్తిని జోడించి చేసే కళాకృతుల ద్వారా  ఒక తరం నుండి మరో తరానికి వారసత్వ జ్ఞాన సంపద బదిలీ చేస్తున్నారు. అనాదిగా ఉన్న డిజైన్ లనే చేస్తూ తమ గిరిజన తెగల ఆభరణాలు, ప్రకృతిలో నివసించే వారి సంస్కృతీ సంప్రదాయాలకు తగ్గ వ్యవసాయ పనిముట్టులు, గృహావసర వస్తువుల్ని తయారు చేయడం ద్వారా సజీవంగా ఉంచుతున్నారు.

dipam
ఇత్తడి కరిగించి వారు చేసిన కళాఖండాలు మమ్మల్ని చాలా ఆకట్టుకున్నాయి.  భూమిక పత్రిక, మహిళా సమత సొసైటీ ఆధ్వర్యలో ఏర్పాటైన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు డివిజన్ లోని కెరిమెరి, జైనూర్  మండలాలలో 25మంది రచయిత్రుల సందర్శన సందర్భంగా మేం జైనూర్  మండలం లోని ఉషేగాం వెళ్లాం.  అదో కుగ్రామం. ఉట్నూరు నుండి ఆసిఫాబాద్ వెళ్ళే మార్గంలో ఉంది.  ఒకే ఒక బజారు. 20 కుటుంబాలు నివసిస్తున్నాయక్కడ.  ఒకప్పుడు వారు సంచార జీవులు.  ప్రస్తుతం వారి ఇల్లు  ప్రభుత్వం కట్టించిన ఒకే ఒక గది. కొందరి ఇళ్ళకి ముందర వాలుగా వేసిన  పందిరి.   ఆ పందిట్లో కూర్చొని తమ చేతులు ఒంపు సొంపులతో  తమ పని చేసుకుపోతుండగా కొత్తగా కనిపిస్తున్న మాకేసి వింతగాను, ఆసక్తిగాను చూసే యువకులు, పిల్లలు, మహిళలు.  ఆగి ఏమి చేస్తున్నారని అడిగినప్పుడు ఒకరు ఎద్దు అని చెప్తే మరొకరు గంట అని చెప్పారు. thanapanilo వారి చేతుల్లో మైనం సన్న తీగలా ఒంపులతో చుట్లు తిరుగుతూ ..ఒక రూపాన్ని సంతరించు కుంటూ .. వారి కళా నైపుణ్యానికి  అబ్బురంగా చూస్తూ మేం .  వారిని చూస్తుంటే చేట ముందు వేసుకుని క్షణం వృధా కానీయకుండా  చకచకా బీడీలు చుట్టే మహిళలే కళ్ళ ముందు మెదిలారు.
ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఉండే ఇతర గిరిజన తెగలకి భిన్నంగా వీళ్ళు సంచార జీవితం గడిపేవారు.  ఏ చెట్టు కిందో, ఎవరింటి పందిరి కిందో  మకాం వేసి ఇత్తడి కరిగించి నగలు, ఎద్దులు, ఎడ్ల బండ్లకు అలంకరించే ఆభరణాలు చేసే కంసాలిపని, వ్యవసాయ పనిముట్లు చేసే కమ్మరం పని చేసే వారు. అదేవిధంగా గోండులు పూజించే దేవతా విగ్రహాలు, పూజా సామాగ్రి ఇతర వస్తు సామాగ్రి చేసి ఇచ్చేవారు.  అందుకు ప్రతిఫలంగా ధాన్యం, లేదా ఇతర ఆహార పంటలను గోండుల నుండి పొందేవారు. అంటే గోండులు ఇచ్చేవారిగాను ఓజ తెగ వారు పుచ్చుకునే వారిగాను ఉండేవారు.
ఊషేగాంలో  ఉన్న కుటుంబాలన్నీ ‘ఓజ ‘ అనే గిరిజన తెగకు చెందిన కుటుంబాలే.  చూడగానే వారు గోండులకు దగ్గరగా కనిపిస్తారు. కానీ, వారి ఆచార వ్యవహారాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకరికొకరు పిల్లని ఇచ్చి పుచ్చుకోవడం ఉండదు.  గోండులు వీరి ఇళ్ళలో ఆహరం ముట్టరు. వీరు సామాజికంగా  గోండుల కంటే దిగువ స్థాయికి చెందిన తోటి , కొలామ్, పర్దాన్ ల కంటే కూడా తక్కువ స్థాయికి చెందుతారు.    గోండు పురాణాలలో వీరిని  pen de Wojalir (ది ఫౌండర్స్ ఫర్ ది గాడ్స్ ) గా పేర్కొన్నారు.  వీరికి కూడా గోండులలో ఉన్న విధంగానే ఇంటిపేర్లు ఉంటాయి.   మిగతా గిరిజనులతో పోలిస్తే ఓజ తెగ జనాభా చాలా తక్కువ.  జైనూరు మండలం లోని ఊషేగాం తో పాటు ఇంద్రవెల్లి మండలంలోని ఒకటి రెండు కుగ్రామాల్లో మాత్రమే ఉన్నారు. పేదల్లో పేదలు ఓజా తెగ జాతివారు.  వీరిని Wojaris అని అంటారు. గోండులు మాత్రం ఓజాలు అనే వ్యవహరిస్తారు.  వీరు ‘ఓజ’ భాష మాట్లాడతారు. ఓజ భాష మరాఠీ భాషకు దగ్గరగా ఉంటుంది.    తాము చంద్ర వంశీయులమని చెప్పారు అక్కడి వాళ్ళు.
eddula jodiమహిళా సమత సొసైటీ కార్యకర్తలు మమ్మల్ని గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలోకి తీసుకెళ్ళారు.  మేం వెళ్ళేసరికే అక్కడ కొంతమంది ఉన్నారు. లోనకి వెళ్ళగానే పుత్తడిలా మెరిసే అద్భుతమైన ఇత్తడి కళాఖండాలు మా మది దోచుకుంటూ.. అవి వారి చేతుల్లో రుపుదిద్దుకున్నాయంటే ఆశ్చర్యం . వాళ్ళ కళ  గురించి తెలుసుకోవాలన్న ఆతృత.   ఆ క్రాఫ్ట్ వర్క్ అంతా త్వరలో రాబోయే కేస్లాపూర్ లో  జరిగే నాగోబా  జాతర కోసం సిద్దం చేసుకుంటున్నామని చెప్పారు అక్కడి వారిలో ఒకరు.  ప్రతి సంవత్సరం జరిగే జాతరకి రెండు మూడు నెలల ముందు నుండే వివిధ సామాగ్రిని తయారు చేయడం మొదలు పెడతారు వీళ్ళు.
వాళ్ళు తయారు చేసే  హస్త కళల్లో కొన్ని :
nagobaaనాగోబా – చుట్ట చుట్టుకొని పడగ విప్పిన నాగు. గోండులలో మేస్రం వంశస్తుల దైవం
nevadiనేవడి – కాలికి వేసే ఒక రకమైన కంకణం. నాగోబా జాతర సమయంలో దైవాన్ని నెత్తిన ఎత్తుకున్న వ్యక్తీ భీందేవ్ (గోండు, కొలామ్, పర్ధాన్, తోటి తదితర గిరిజనులంతా భీముడిని దేవుడిగా కొలుస్తారు.)  తిరిగేటప్పుడు సాంప్రదాయంగా కాలికి వేసుకునే ఆభరణం.
udaaniఉదాణి – దేవుడి పూజకు ఊదు/సాంబ్రాణి వేసి వెలిగించే వస్తువు
దీపంచె  – దీపం
గంటి  – గంట
gorka pelli koduku pelli kuthuriviగొర్క  – కత్తి
గంటలు, మువ్వలు ,  కర్రకి చివర కడతారు.  దేవుడికి కడతారు.  ఎద్దులకి వేసేవి వేర్వేరుగా ఉంటాయి.  వారు తయారు చేసే వస్తువులు పూజకు సంబంధించినవి, వ్యవసాయానికి సంబంధించినవి, వారి సంస్కృతీ ఆచారాలకు, అవసరాలకు  సంబంధించినవి ఎక్కువగా కనిపిస్తాయి. ఎద్దులు , నెమళ్ళు, పాములు, సూర్య చంద్రులు, అయిదు నక్షత్రాలు  వారి డిజైన్లలో ఎక్కువగా  కనిపిస్తాయి.
గోండు తదితర గిరిజనులు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురులకు  కత్తి లేకుండా పెళ్లి జరగదట.  అందుకే పెళ్ళిళ్ళ కోసం వాటిని తయారు చేస్తారు. వాటిని పెళ్లి గోర్కలు అంటారు.  పెళ్ళికొడుకుకి వాడే గోర్కలు పెళ్లి కూతురికి వాడే వాటి కంటే కొద్దిగా పెద్దవిగా ఉంటాయి.  గోర్కని ఊరికి రక్షణగా పెడతారు. అదే విధంగా భార్యాభర్తలు ఒకరికొకరు రక్షణగా ఉంటారని, దుష్ట శక్తులు వారి దరిచేరకుండా ఉండాలని  గోర్కలు పెళ్ళిలో వారికి ఇస్తారట. గోర్కలపైన సూర్యుడు, చంద్రుడు,  ఐదు నక్షత్రాల (పంచపాండవులు అని అంటారు ) బొమ్మలతో ఉన్నాయి.  మరో గోర్కల సెట్ పై నెమళ్ళ డిజైన్ తో ఉన్నాయి.
దీపం స్టాండ్ లో ఒకప్పుడు ఆముదం వేసి వెలిగించేవారు.  ఆ దీపం రాత్రంతా వెలుగుతూనే ఉండేది. ఇప్పుడు ఏదో ఒక నూనె వాడుతున్నారు. ఇవి ప్రతి ఇంటిలో ఉంటాయి. ఇవి ఒకటి, రెండు, మూడు, ఐదు అంతస్తులు గా ఉండేటట్లు చేస్తారు.  పెద్దవి ఇప్పుడు ఎక్కువగా దేవాలయాల్లో వాడుతున్నారు.
ఎలా చేస్తారంటే :
ఒక దీపం చేయడానికి రెండు రోజులు పడుతుంది. ముందుగా ఒకరకమైన మట్టిపై మైనంతో డిజైన్ చేస్తారు.  ఆ తర్వాత ఆ మైనపు డిజైన్ పై మట్టి వేస్తారు. దాన్ని కుండలు కాల్చినట్లు కాలుస్తారు.  మైనం కరిగిపోయి మధ్యలో ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలో కరిగించిన ఇత్తడి పోస్తారు.  ఆ తర్వాత మట్టి తీసేసి బ్రష్ తో శుభ్రం చేస్తారు.
కావలసిన ఇత్తడిని ఆదిలాబాదు లేదా ఆసిఫాబాదు నుండి తెస్తారు.
ధర
పెళ్లి గోర్కల సెట్ కి (అమ్మాయివి, అబ్బాయివి )మూడువేల ఐదువందల రూపాయలు , కొద్దిగా చిన్నవి అయితే రెండువేల ఐదు వందల రూపాయలు అవుతాయి. చిన్న అద్దుల జత కి ఆరువందల రూపాయలు . ఇలా,  వారు డిజైన్ ని బట్టి , అది తీసుకునే తయారీ సమయాన్ని బట్టి , ఉపయోగించే ఇత్తడిని బట్టి వస్తువు ధర నిర్ణయిస్తారు.
ఎవరికైనా నేరిపిస్తారా ?  అంటే ఇది నేర్పిస్తే అందరూ నేర్చే పని కాదు అన్నారు.  ఐఎఎస్ అధికారి చందనా ఖన్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా ఉన్న సమయంలో అంతరించి పోతున్న ఈ కళను భవిష్యత్ తరాలకు నేర్పించాలన్న ప్రయత్నం జరిగిందనీ, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లోని విద్యార్థులు నేర్చుకున్నారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ మహిళా సమత సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంతి .  అయితే వీరు చేసే డిజైన్లు చాలా సమయం తీసుకుంటాయి. ఒక్క దీపపు కుందె చేయడానికి కనీసం మూడు రోజులు పడుతుంది.  ప్రస్తుతం బడికి పోయే పిల్లలు తప్ప మిగతా వారంతా ఇవి చేస్తారు.  వ్యవసాయం పనికి వెళ్ళరు .  ఇదే వారి ప్రధాన వృత్తి.
ఆదిలాబాదు జిల్లాలోని  DRDA వారు నిర్వహించిన వర్క్ షాపులో పాల్గొన్నామని ఒకరు చెబుతుండగా మడావి భగవంతరావు ఒక వార్తాపత్రిక తీసుకొచ్చి మా బృందం చేతిలో పెట్టాడు. అది ‘అహ్మదాబాద్ సిటీ లైఫ్ ‘. గుజరాతిలో ఓజ హస్తకళ, కళాకారుల  గురించి రాశారు.  ఎక్కడో ఉన్న  పరాయి రాష్ట్రం గుజరాత్లో వారికి లభించిన గుర్తింపుకి  చాలా ఆనందం కలిగింది.  మదావి భగవంతరావు బృందాన్ని ARCHITECTURE PLANNING AND CONSTRUCTION TECHNOLOGY వాళ్ళు 30 మంది విద్యార్థులకు నేరించడం కోసం వీరిలో ముగ్గురు కళాకారులని పిలిపించారనీ ,  వచ్చేప్పుడు తమ  బృందానికి దుప్పి తల బహుకరించారని చెప్పి ఆ దుప్పి తలను చూపించాడు మడావి భగవంతరావు.
తాత ముత్తాతల నుండి సాంప్రదాయికంగా చేస్తున్న డిజైన్లు తప్ప కొత్తవి తెలియదు. డిజైన్లు ఇస్తే మేమూ చేయగలం అని ఎంతో ఆత్మా విశ్వాసంతో ఉన్నారు వాళ్ళు.  చేయడం వరకు తెలుసు గాని వాటిని మార్కెట్ చేయడం తెలియదు.  మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలైన  మహారాష్ట్ర , చత్తిస్ ఘడ్ , మధ్యప్రదేశ్ నుండి కొండలు కోనలు దాటి  వచ్చే భక్తులు కేస్లాపూర్ జాతరలో వీరు తయారు చేసిన వస్తువులు కొంటూ ఉంటారు.  అంతకు మించి రాష్ట్ర హస్త కళల కేంద్రాల్లో వాటిని ఎలా మార్కెట్ చేయాలో తెలియదు.  ఇప్పుడిప్పుడే తమ పిల్లల్ని బడికి పంపుతున్న వీరికి కొత్త డిజైన్లు ఇస్తూ వారిని ప్రోత్సహించక పొతే భవిష్యత్ లో ఈ కళ అంతరించిపోయే ప్రమాదం ఉంది .  రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, గిరిజన సంక్షేమ శాఖ, ప్రభుత్వం  ‘ఓజ ‘ కళాకారుల కళని గుర్తించి వారి కళను కాపాడుతూ భవిష్యత్ తరాలకు భద్రపరచి  అందించాల్సిన బాధ్యత ఉంది. కళాకారులకి చేయూత నిచ్చి వారు రూపొందించే కళాకృతులకు సంస్థ నిర్వహించే షో రూం లలో ఉంచి మార్కెట్ సదుపాయాలు పెంచాల్సిన బాద్యత కూడా ప్రభుత్వానిదే.   అతి దయనీయ స్థితి లో ఉన్న ‘ఓజ ‘ కళాకారులని ఆర్ధికంగా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వి. శాంతి ప్రబోధ

Tag Cloud

%d bloggers like this: