The greatest WordPress.com site in all the land!

Archive for February, 2015

నాకెంత తృప్తిగా ఉందో ..  

   

praja jan 25 - 31సాలేహా నేనూ ఇద్దరం పదవతరగతి పరీక్షలు రాశాం.  ఇంటరు చదవాలని అనుకున్నాం. సాలేహ ఎప్పుడు క్లాసులో ఫస్టు వచ్చేది. నాకేమో ఎప్పుడూ అత్తెసరు మార్కులే. తను చదవడంలోనే కాదు మా పిల్ల సంఘం మీటింగుల్లో బాగా మాట్లేది. ఏది చెప్పినా పండు వొలిచి తినమని ఇచ్చినట్లుగా ఉండేది. తను చాలా ఆక్టివ్ కదా అందుకే ఆమెను ఇష్టపడేవారు.

అలాంటి సాలేహ ఈ మధ్య మా సంఘం కార్యక్రమాలకి రావడంలేదు. వాళ్ళ తమ్ముడిని అడిగితే ఏమో .. అని సమాధానమిచ్చాడు. వాళ్ళిల్లు మా ఇంటికి దూరమే అయినా నేనే వాళ్ళింటికి వెళ్ళా. వాళ్ళింటికి సున్నం వేసి కొత్తగా కనిపిస్తోంది. వాళ్ళమ్మ మిషనుపై బట్టలు కుడుతోంది. సబీనా చేత్తో ఏదో కుడుతోంది. అంతా పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. తమ పనులు చేసుకుంటూ నేను అక్కడ ఉన్నంత సేపూ సాలేహ అక్క సబీనా , చెల్లెళ్ళు సురయా , సలీమా మాతో పాటే ఉన్నారు. ఒక్క క్షణం కుడా కదలలేదు. వాళ్ళమ్మ ఏదో సైగ చేసింది.  నాతో ఆ ఇంట్లో వాళ్ళెవరు ఇదివరకటిలా ఆప్యాయంగా మాట్లాడలేదు. ఎందుకువచ్చానా అన్నట్లుంది వాళ్ళమ్మ చూపు.  సాలేహ కూడా పోడిపోడిగానే మాట్లాడుతోంది. సరైన సమాధానం లేదు. వాళ్ళక్క పెళ్లి కుదిరింది కావచ్చు . ఆ పనుల్లో ఉన్నట్లున్నారని అందుకే సాలేహ రావడం లేదని అనుకున్నా. ఈ సమయంలో వచ్చి తప్పు చేశానా అనిపించింది.   మంచి ఎండలో వచ్చానేమో దాహంగా ఉంది. మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది సాలేహ. గ్లాసు నా చేతిలోంచి తీసుకుంటూ చిన్న చిట్టి నా చేతిలో పెట్టింది . ఎవరి కంట పడకుండా .

ఇంటికి రాగానే విప్పి చూసి మానైపోయాను . సాలేహ కి పెళ్లట . అతని వయస్సు 35 పైనేనట. సాలేహ వయసున్న కొడుకు , అంతకంటే కొంచెం చిన్నగా ఒక కొడుకు ఉన్నారట. అతని భార్య తో అతనికి కోర్టు కేసు నడుస్తోందట. సలేహనిచ్చి పెళ్లి చేస్తే కట్నం వాడు ఎం వద్దు  ఎదురు నలబై వేలు ఇస్తామన్నారట.  ఆ పైసలతో సాలేహ అక్క పెళ్లి చేయాలనుకున్టున్నారట. మరో ఐదు రోజుల్లో పెళ్లి.

సాలేహ ఇస్తా ఇస్తాలతో ఏమాత్రం పనిలేకుండా జరగబోతున్న పెళ్లి .. ఏమి చేయాలో అర్ధం కాలేదు. ఇలాంటి సమయాల్లో సలేహనే చక్కటి నిర్ణయాలు తీసుకునేది. ఇప్పుడు తనదే సమస్య  ఎలా .. అలోచించి వెంటనే ఆ సంఘం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎం చేయాలో నిర్ణయం చేసుకున్నాం. మా పేర్లు బయటికి తెలిస్తే మాకు ఇంట్లోనూ , ఊళ్లోనూ ఇబ్బంది అవుతుందేమో నాన్న భయం .. అట్లా కాకుండా ఉండాలంటే ఎట్లా అని చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం.  మేం అంతరం ఎవరికీ వరం మా MRO, S.I, జిల్లా కలెక్టర్ ఫోన్ నంబర్లు సేకరించాం. వారికి,1098 లకు ఫోన్ చేసి విషయం చెప్పాం. మా పేర్లు బయటకి రావద్దని , పెళ్లి ఎట్లాగయినా ఆపమని కోరాం.

మాలో ఉత్కంట ఏమవుతుందోనని. వాళ్ళింటికి వెళ్ళాలంటే ఏదో జంకు . వాళ్లకి మా మిద అనుమానం వస్తుందేమో నని. అలా ఒక రోజు గడిచి పోయింది. పెళ్లి ఎల్లుండి అనగా అప్పుడు వచ్చాయి మా ఊళ్ళోకి జీప్ లు.

బాల్య వివాహం గురించి ఆరా తీశారు. అలాంటిది ఏమీ లేదని చెప్పారు ఊళ్లో వాళ్ళు. ఖాసిం ఇల్లు అడిగి తెలుసుకుని వెళ్తుంటే మాకు అర్ధమయి పోయింది . అయినా ఏమి ఎరగనట్లే ఉన్నాం. వచ్చిన వాళ్ళకి అక్కడి వాతావరణం చూస్తే పరిస్థితి అర్ధమయినట్లుంది.  కానీ , ఆ ఇంట్లో వాళ్ళు పెళ్లి సబీనా కి ఆమెకి 18 ఏళ్లున్నాయి అన్నారు. సాలేహ ఎవరంటే తనేనని చెప్పింది సాలేహ.  ఆమెతో వాళ్ళ అక్కతో విడివిడిగా మాట్లాడారు. సబీనా పెళ్ళికి తాము అడ్డు చెప్పమని సాలేహ పెళ్లి జరిగితే మాత్రం కేసు అవుతుందని , జైలుకి  వెళ్ళాల్సి వస్తుందని, రేషన్ , కరెంట్ అన్నీ బందు అని బెదిరించారు.  అబ్బాయి వివరాలు అడిగారు. చివరికి వాళ్ళ నాన్న సలేహని చదివిస్తామని చెప్పారు.   చాలా గోప్యంగా ఉంచిన విషయం ఊళ్లో ఎవరికీ తెలియకుండా సర్కరోల్లకు ఎట్లా తెలిసిందో వాళ్ళకి అర్ధం కాలేదు.  మేమూ చెప్పలేదు.

నాకు చాలా తృప్తిగా అనిపించింది సాలేహా పెళ్లి ఆపినందుకు. తను నాతో పాటు కాలేజికి వస్తున్నందుకు.

లలిత

కొత్తపల్లి 

జనవరి 25 – 31, 2015 ప్రజాతంత్ర లో ప్రచురణ

భాగ్య – రేఖ

pajatantra 1తమ్ముడిని కొనుక్కొచ్చిన అమ్మ
అమ్మకి అప్పుడప్పుడు కడుపు నెప్పి వచ్చేది. సర్కారు దవాఖానకు పోయి మందులు తెచ్చుకునేది.  ఒక రోజు అమ్మ దవాఖానా నుంచి వచ్చేటప్పుడు చంకలో చిన్నబాబుని తెచ్చింది. ఎవరు అంటే తమ్ముడు అని చెప్పింది. ఎక్కడ తెచ్చావంటే కొనుక్కోచ్చానని చెప్పింది.  మా ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఆ తమ్ముడికి పాలపొడి డబ్బాలు కొనుక్కొచ్చి ఆ డబ్బా పాలు పట్టేది.  కాళ్ళకున్న కడియాలు, మెడలో హారం అమ్మి ఆ పైసలు ఇచ్చి ఈ తమ్ముడిని కొనుక్కొచ్చింది.

మా నాన్నకి మా అమ్మ పెద్ద భార్య. మా అమ్మకి నేను చెల్లి పుట్టిన తర్వాత ఒక తమ్ముడు పుట్టుకలోనే చనిపోయాడట.  ఆ తర్వాత ఇద్దరు చెల్లెళ్ళ పుట్టారు. ఒక చెల్లి పుట్టగానే చనిపోయిందని ఇంటికి తేలేదు. ఇంకో చెల్లిని దవఖానలోనే అమ్మేసింది నాన్నమ్మ.

నారుపోసే కొడుకు లేదట. అందుకనే మానాన్న మళ్ళీ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అయినా కొడుకు పుట్టలేదు. అందరూ ఆడపిల్లలే .  అందుకే అమ్మ కొడుకుని కొనుక్కొచ్చింది.  తమ్ముడు వచ్చినప్పటి నుండి ఏమున్నా దాచిపెట్టి తమ్ముడికి పెడుతుంది. వాడంటే నాకూ ఇష్టమే .  కానీ , ఒక్కోసారి చెల్లివాడిని  కొడ్తుంది.  అమ్మ ఏది తెచ్చినా మాకుపెట్టినా పెట్టకున్నా వాడికి పెడుతుంది కదా అందుకని.  అమ్మా నాన్నలకు మా కంటే వాడి మీదనే ప్రేమ ఎక్కువయిపోయింది .  అమ్మ పనికి పోతుంది కదా .. వాడిని చూసుకోవడానికి నన్ను బడి మానిపించారు. వాడు అంగన్వాడికి పొయిన తర్వాత నేను మళ్ళీ బడికి పోతానని ఏడిస్తే సరేనని కస్తూరిబా బడిలో వేశారు.  నా తోటివాళ్ళంతా 9, 10 తరగతుల్లో ఉంటే నేను ఆరో తరగతిలో ఉన్నా.

తమ్ముడు వచ్చినంక నాన్న అమ్మని మంచిగా చూసుకుంటున్నాడు. కొట్టడం లేదు. తిట్టడం లేదు. సొమ్ములు పోయినా  తమ్ముడోచ్చాక నాన్న తనతో మంచిగా ఉంటున్నాడని అమ్మ సంతోషపడింది.
కానీ .. నాకు అర్ధం కానిదోకటే .. అదేంటంటే .. మేమింతమంది బిడ్డలం ఉన్నాం కదా .. మా అందరి కంటే ఎక్కువగా ఎవరో కన్న కొడుకుని ప్రేమగా చూసుకుంటున్నారెందుకని ? మా అమ్మకు పుట్టిన నా చెల్లెళ్ళు ఇద్దరు , మా చిన్నమ్మ కు పుట్టిన బిడ్డ ఇంటికే రాలేదు. కారణం ఆడపిల్లలు కావడం వల్లేగా ..?! కన్న పిల్లల కంటే మగపిల్లవాడు ఎక్కువా .. ? ఎందుకు?

యమున
గుర్జాల్ తండా

10.

  
భాగ్య – రేఖ
భాగ్య నేను చిన్నప్పటి నుంచి దోస్తులమే. వాళ్ళిల్లు మా ఇల్లు దగ్గర దగ్గరే . ఆమె తమ్ముళ్ళని పట్టుకొని కొన్ని రోజులు బడి మానేసింది. ఆ తర్వాత ఆమెని ఎవరో సార్లు వచ్చి తీసుకెళ్ళి RSTC లో చేర్చారు. అక్కడి నుండి భాగ్య మా బడిలో చేరింది. నా తరగతిలోనే వేశారు. మేము నాలుగో తరగతి అయి ఐదో తరగతిలోకి వచ్చాం.  అప్పటికి భాగ్యకి 12 ఏళ్ళు ఉండొచ్చు. నీ కంటే రెండు మూడేళ్ళు పెద్దది దాని సోపతి ఏంటి అనేది  అమ్మ.

ఒక రోజు మంచి సంబంధం వచ్చిందని ఆమెకి పెళ్లి చేసేసారు.  నేను చదువుకుంటా పెళ్లి వద్దు అని ఏడ్చి చాలా గొడవ చేసింది. అయినా ఆమె మాట ఎవరూ పట్టించుకోలేదు. పెళ్లి ఎట్లాగయినా ఆపమని బడిలో మా టీచర్ కి చెబుదామనుకుందట. కానీ ఆ అవకాశమే లేకుండా గుట్టు చప్పుడు కాకుండా వేములవాడకు తీసుకుపోయి పెళ్లి చేసుకొని తీసుకోచ్చారు.  పెళ్లి చేసుకుని వచ్చేవరకూ మా కెవరికి ఆ విషయం తెలియనే తెలియదు.  ఇంతకీ ఆమె భర్త వయసు ఎంతో తెల్సా 30 ఏళ్ళు.

పెళ్ళయి ఏడెనిమిది నెలలు గడిచాయో లేదో భర్త వేధింపులు మొదలయ్యాయి.  అత్తమామలు కొడుకునే కోప్పడేవారట.  కానీ భాగ్యతో అతను సరిగ్గా ఉండేవాడు కాదు. నువ్వు అందంగా లేవు . నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఏమో .. చామంతి లాంటి అమ్మాయి కావాలనుకున్నా . ఎండిపోయిన కట్టెపుల్లలాగా ఉన్నావు అంటూ రోజూ బాధ పెట్టేవాడని, బాగా తాగి వచ్చి ఆమె బట్టలిప్పి అతనికి ఆనందం వచ్చేవరకూ బీడీ కాల్చిఒళ్లంతా  చురకలు పెట్టేవాడట.

బతుకమ్మ పండుగకి తమ ఇంటికి తీసుకుపోడానికి వెళ్ళిన భాగ్య అన్న చెల్లెను చూసి ఏడ్చేశాడు. ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె ఇక్కడ ఉండగానే ఆమె భర్త విడాకుల నోటీసు పంపాడు. భర్తకి సుఖం ఇవ్వని భార్య తనకి వద్దని అందులో రాశాడట. తన పరిస్థితి ఏమిటో అర్ధం కాని భాగ్య చనిపోదామని నిర్ణయించుకుంది.  ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంటే  భాగ్యని పక్కింటి వాళ్ళు కాపాడారు.

మా అమ్మా నాన్నా ఎంత వత్తిడి చేసినా నేనయితే చిన్నప్పుడే పెళ్లిచెసుకోను. భాగ్యని చూస్తే ఏడుపోచ్చేది నాకు. తను అదివరకటి లాగా గలగలా మాట్లాడడం లేదు. తనని ఎట్లా నవ్వించాలొ నాకు తెలియదు. నా ఐదో తరగతి అయ్యేసరికి భాగ్య జీవితంలో ఏమేమో జరిగి పోయాయి.
ఇప్పుడు ఆమె వంటి మీద మచ్చలు నెమ్మదిగా మానుతున్నాయి. కానీ , మనసుకి అయిన గాయం ఇంకానే పచ్చిగానే ఉంది అంటుంది పక్కింటి ఆంటి. అది మానాలంటే నువ్వు మళ్ళీ బడికి పోవలసిందే అని భాగ్యకి నచ్చచెప్పింది కూడా.  భాగ్య వాళ్ళింట్లో వాళ్ళు మొదట్లో ఒప్పుకోకున్నా తర్వాత  అందుకు ఒప్పుకున్నారు.  వచ్చే ఏడాది ఆమెను కస్తూరిబా బడిలో వేస్తారట. అది తెలిసి నాకు చాల సంతోషం అయింది.

రేఖ
కొల్లూరు

నేనూ .. నా రేడియో కార్యక్రమం

praja jan11-17ఎప్పటికైనా మా వాళ్ళని కలుస్తానా ..?

నాకు ఐదుగురు అక్కలు . ఒక అన్న. నేను అందరి కంటే చిన్నదాన్ని.  నేను పుట్టిన కొన్ని రోజులకే అమ్మ కోమ్లి  చచ్చిపోయింది. మా నాన్న పనికిపోయి వచ్చేటప్పుడు బాగా తాగి వస్తాడు.

అమ్మ లేదు కదా .. అందుకని  మా పెద్దక్క విజ్జక్కే నన్ను పెంచింది. అమ్మలాగా సాకింది.  తర్వాత మా పెద్దక్కకి పెళ్లి అయిపొయింది. నన్ను చూసుకోడానికి అక్క లేదుగా .. నన్ను అమ్మేస్తానని అన్నాడట మా నాన్న.  మా అక్క ఒప్పుకోలేదు. తనతో తీసుకుపోతానంది. కానీ మా బావ వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదట. మా రెండో అక్కే నన్ను చూసుకుండేది. అంతలో మా రెండో అక్క పెళ్లి కూడా అయింది.  తను మా తండాలోనే ఉండేది.

మా రెండో అక్క పెళ్లి అయ్యేప్పటికి మా నాన్నకి చాలా అప్పులయ్యాయి.  అప్పులు తీర్చమని అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వచ్చేవాళ్ళు.  మా నాన్నకి మళ్ళీ నన్ను అమ్మేయ్యాలన్న బుద్ది  పుట్టింది.  అమ్మేస్తానని ఎవరికో బేరం కుదుర్చుకున్నాడు.  వాళ్ళ దగ్గర కొన్ని పైసలు తీసుకున్నాడు.  ఆ విషయం మా రెండో అక్కకి తెలిసింది.  పెద్దక్కకి కబురు పెట్టింది.  ఇద్దరు అక్కలూ వచ్చి నాన్నతో గొడవ పెట్టుకున్నారు. నాన్న వినలేదు. వాళ్ళనే తిట్టాడు. వాళ్ళు ఏడ్చారు. బతిమలాడారు. అయినా మా నాన్న వినలేదు.  అంతా నేను చూస్తూనే ఉన్నాను. అక్క వాళ్ళు ఏడుస్తాంటే నేనూ అన్న ఇద్దరు చిన్నక్కలు ఏడ్చేసాం.

రెండో అక్కకి కొంచెము  కోపం ఎక్కువ కదా .. వెంటనే నాన్న మీదికి రోకలి బండ తీసుకొని లేచింది.  చెల్లెళ్ళను అమ్మినవా..  ఇగో నిన్నిక్కడే చంపి నేను పోలీసులకు లొంగిపోతా అని అన్నది. పెద్దక్క అట్లా ఎందుకు గానీ నాన్ననే పోలీసులకు పట్టిస్తం అన్నది.

తర్వాత రెండు రోజులకే మా రెండో అక్క బావ వచ్చి నన్ను తీస్కపోయి అనాధాశ్రమంలో చేర్చారు.  నేను అనాధాశ్రమంలో చేరేటప్పటికి నాకు మా భాష అంటే లంబాడి భాష తప్ప ఏమి రాదు.  ఎవరితో మాట్లాడే దాన్నే కాదు. ఎవరేమన్నా నవ్వేదాన్ని అంతే .  మా అక్కల దగ్గర గారాబంగా పెరిగాను కదా .. ఇక్కడ వాళ్ళు కూడా నన్ను ముద్దు చేసేవారు. అందరి కన్నా చిన్న దాన్ని కదా .. కానీ , నాకేమో మా అక్కలు , అన్న, నాన్న , మా తండాలో  అందరూ గుర్తోచ్చేవారు.   వాళ్ళు పెట్టె తిండి తినబుద్ది అయ్యేది కాదు.  మా ఇంటికాడ రొట్టెలు తింటే ఇక్కడేమో తెల్లన్నం పెడతారు.  మా అక్క ఉడుకుడుకు నీళ్ళు కాసి స్నానం చేపిచ్చేది.  ఇక్కడేమో నాకు నేనే చల్లటి చన్నీళ్ళు చెయ్యాలంటే గజ్జ గజ్జ ఒణుకు వొచ్చేది.  నేను మా ఇంటి కాడ ఎప్పుడూ బట్టలుతుక్కోలేదు. ఇక్కడ నా బట్టలు నేనే ఉతుక్కోవాలి కదా .. పెద్ద అక్కలు అప్పుడప్పుడూ ఉతికి పెట్టేవారు.

నేను అనాదాశ్రమానికి వచ్చినప్పుడు నాకు ఆరేళ్ళు ఉంటాయేమో. అప్పటికి నేను ఎప్పుడన్నా మా తండాలో ఉన్న అంగన్వాడి బడికి పోయేదాన్ని. లేకపోతే లేదు. ఇప్పటికి నేనొచ్చి ఎనిమిదేళ్ళు దాటింది. ఒక్క సారి కూడా మా వాళ్ళు నన్ను చూడడానికి రాలేదు.  ఒక్కసారో రెండు సార్లో మా పెద్దక్క ఫోన్ చేసింది. అంతే . ఆమె మా భాషలో మాట్లాడితే  నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. అందుకే ఎక్కువ మాట్లాడ లేదు.  అప్పటి నుండి ఇప్పటి వరకూ మళ్ళీ పోన్ చెయ్యలేదు.  అప్పుడయితే వాళ్ళంతా గుర్తొచ్చి ఏడ్పు  వచ్చేది.  ఇప్పుడు రాదు. కానీ , వాళ్ళు అప్పుడప్పుడు గుర్తొస్తూనే ఉంటారు.

నాకిక్కడ బాగానే అలవాటయింది. నిజానికి మా ఇంటికాడ కంటే ఇక్కడే బాగుంది కూడా . కానీ ఎప్పుడన్నా సెలవులు వస్తాయి కదా .. దసరాకి, సంకురాత్రి కి, ఎండాకాలం  అప్పుడు మా దోస్తులని తీసుకుపోవడానికి వాళ్ళ చుట్టాలు వస్తారు.  వాళ్ళని తమతో తీసుకు పోతారు. కొన్ని రోజులుంచుకుని పంపుతారు. మధ్యలో కూడా ఎప్పుడన్నా చూడడానికి వస్తారు. వచ్చేటప్పుడు ఎవన్నా తెస్తారు. వాళ్లకి అమ్మా నాన్నా లేకున్నా వాళ్ళకి ఎవరన్నా వస్తారు. నాకు నాన్న ఉండీ రాడు. ఇంకా కొందరికి కుడా ఎవరూ రారు. మా నాన్నకి నేనొక్కదాన్నే ఎక్కువయ్యానా .. అని నాన్న మీద కోపం వస్తుంది. అవసరం లేనప్పుడు ఎందుకు పుట్టించాడు అని తిట్టుకుంటాను.  సెలవులిచ్చినప్పుడు  మేమే ఉంటాం కదా .. ఎవరన్నా వచ్చి నన్నూ తీసుకుపోతారేమోనని ఆశగా చూస్తూ ఉంటా.. ఎవరూ రారు కదా..  అప్పుడు చాలా ఏడుపు వస్తుంది.  అన్నం తినబుద్దికాదు.  బాదం చెట్టు కింద కూచుని ఆ చెట్టుతో మాట్లాడుకుంటా.  ఆ చెట్టు నన్ను నవ్వించడానికి బాదం కాయలు రాలుస్తుంది. వాటిని ఏరుకుని పగలగొట్టి పలుకు తింటా .

ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. నేను ఆడపిల్లను కావడం వల్లే మా నాన్న నన్ను వదిలేశాడని. మా చిన్న అక్కల్ని ఉంచాడో .. అమ్మేశాడో .. లేకపోతె నాలాగా ఏ అనాధాశ్రమంలోనో చేర్చాడో .. అనుకుంటూ ఉంటా .. మా అమ్మ ఉంటే ఇట్లా జరిగేది కాదేమో .. ఏది ఏమైనా నేను బాగా చదివి మా వాళ్ళను కలవగలనేమో ..

విష్ణుబాయి

లింగి తాండ

8.

 నేనూ .. నా రేడియో కార్యక్రమం

నాకు మొదట్లో ఏమీ తెలిసేది కాదు. బడి నుంచి వచ్చాక ఇంట్లో అమ్మ వెనుక తిరగడం , అక్కతో పాటు కూర్చొని టివి సీరియళ్ళు చూడడం చేసేదాన్ని.  ఒక రోజు మా ఫ్రెండ్ ఊరికే  ఇంట్లో కూర్చుంటావు ఎందుకు .. ? నువ్వూ మా బాలసేవాసంఘంలో చేరొచ్చు కదా అంది.  వాళ్ళ సంఘం గురించి, వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి బడిలో ఉన్నప్పుడు  అప్పుడప్పుడు మాతో చెప్పేది.  తను చాలా ఉషారుగా ఉండేది. స్కూల్ లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేది. ఎవరితో మాట్లాడాలన్నా భయపడేది కాదు. తనే కాదు వాళ్ళ సంఘంలో పిల్లలంతా అంతే  చాలా చురకుగా ఉండేవారు.  వాళ్ళని చూస్తే నాకూ అలాగే ఉంటే బాగుండు అనిపించేది.  ఇప్పుడు తనే అంది కదా వాళ్ళ సంఘంలో చేరమని .. వెళ్తే .. ఆలోచించా .  మా ఫ్రెండ్ సునీత ఉండేది ఎస్ సి కాలనీలో.  వాళ్ళ సంఘం కార్యక్రమాలు జరిగేదీ అక్కడే.  అక్కడికి వెళ్తానంటే ఇంట్లో ఏమంటారో నన్న భయం. అసలే మా అమ్మకి పట్టింపులు ఎక్కువ. అని కొంత కాలం గడిపేసా.  ఒక ఆదివారం తెగించి మా పక్కింట్లోనే ఉండే మరో మిత్రురాలితో కలసి సునీత వాళ్ళింటికి వెళ్ళా.  మేం వెళ్లేసరికి ఆ కాలనీ పిల్లలంతా కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు.  మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు వాళ్ళు. అంత మా బడి పిల్లలే కదా .. అక్కడ వాళ్ళు మాట్లాడే విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పెద్ద వాళ్ళలాగా గ్రామంలో వాళ్ళకున్న సమస్యల గురించి, బడిలో సమస్యల గురించి పెద్ద వాళ్ళలాగా మాట్లాడేస్తున్నారు .  గత  నెలలో వారెం పనులు చేశారో చెప్పి అప్పుడు వచ్చిన ఇబ్బందుల్ని చెప్తూ వాటిని ఎలా ఎదుర్కొన్నారో పరిష్కరించుకున్నారో కూడా చెప్పారు కమిటీల వారిగా. అదే విధంగా ఆ నెలలో ఏమి చేయ్యలనుకుంటున్నారో నిర్ణయించుకున్నారు. ఎలా చేయాలో చర్చించుకున్నారు.  వాళ్ళంతా మాకు రోజూ బడిలో కనిపించే వాళ్ళే . కానీ అప్పుడక్కడ వాళ్ళు చాలా కొత్తగా మరో లోకం నుంచి వచ్చిన వాళ్ళలాగా …

క్లాసులో నేనే ఫస్ట్ రాంకర్ ని నాకు కొంచెం గర్వం.  వీళ్ళు కాలని వాసులు అని కొంచెం చిన్న చూపు ఉండేవి నాలో. కానీ , నా కన్నా వీళ్ళకు చాలా తెలుసు. చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు అని అప్పుడే అర్ధమయింది అందుకే నా అభిప్రాయం మార్చుకున్నా.

ఆ రోజు మీటింగ్ అయ్యాక రేడియో కార్యక్రమం కోసం స్క్రిప్ట్ తాయారు చేసుకున్నారు కొందరు . కొందరు తాము తాయారు చేసుకున్న వాటిని ప్రాక్టీసు చేస్తున్నారు.

నేను ఎప్పుడన్నా రేడియో వినేదాన్ని. కానీ రేడియో లో మాట్లాడ్డం గురించో .. అందులో తమ గొంతు వినిపించడం గురించో ఎప్పుడూ ఆలొచించనైనా ఆలోచించలేదు.  కానీ వీళ్ళు ఆ ఆలోచన చేశారు. రేడియో ద్వారా తమ గొంతుని ప్రపంచానికి వినిపించడానికి తయారవుతున్నారు అదీ పిల్లలకు సంబంధించిన వివిధ విషయాలపై .  వాళ్ళ పని చాలా గొప్పగా అనిపించింది.  నేను పాటలు బాగా పాడతానని అంతా అంటూ ఉంటారు.  నా గొంతు నా పాట రేడియోలో వినాలంటే .. ఆ ఊహే నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. అందుకే వాళ్లనడిగా నేనూ ఒక పాత పాడవచ్చా అని.

మా సంఘంలో చేరితే మా సభ్యురాలిగా నీకూ అవకాశం ఉంటుంది అని చెప్పారు వాళ్ళు.  సభ్యత్వం కింద ఏడాదికి 20 రూపాయలు కట్టాలి అన్నారు.  అమ్మ నడిగితే ఏమంటుందో .. భయం .. వాళ్ళ దగ్గరకి వెళ్ళానని తెలిస్తే మళ్లీ  రానివ్వదేమోననే సందేహం అమ్మకి ఈ విషయం చెప్పనివ్వలేదు. అక్కతో చెప్పాను ఏమన్నా సలహా ఇస్తుందేమోనని . తను ఏమి మాట్లాడకుండా ఆ విషయం అన్నకు చెప్దాం అంది.

ఆ కాలనీలో పిల్లలు ఎంత ధైర్యంగా ఉన్నారు. సర్పంచ్ దగ్గరకి, పోలీసుల దగ్గరకు వెళ్ళాల్సి వచ్చినా భయపడరు. నేను అమ్మా నాన్నల  దగ్గర నా విషయం భయపడుతున్నానెందుకు ? నేనేమీ తప్పు చెయ్యడం లేదు కదా .. అని నాకు నేనే ధైర్యం తెచ్చుకుని నాన్నకి చెప్పా .. 20 రూపాయలు కావాలని అడిగా. అది విన్న అమ్మ ఆడపిల్ల ఆ తిరుగుళ్ళు ఏమిటని కేకలేసింది.  చదువుని నిర్లక్ష్యం చెయ్యొద్దు అని నాన్న డబ్బులిచ్చారు.  అవి తీసుకెళ్ళి వాళ్లకిచ్చాను.  ఆ తర్వాత వారంలో మా కార్యక్రమం రికార్డ్ చేశారు. ఆ తర్వాతి వారం రేడియో లో వచ్చింది.  మా ఇంట్లో రేడియో పని చెయ్యడం లేదు. మా అన్న మా నాన్నవాడే  సెల్ ఫోన్ తీసుకుని దాని ఇయర్ ఫోన్ చెట్టుపై వేసి నిజామాబాద్ రేడియో వచ్చేలా పెట్టాడు. మా ఇంట్లో వాళ్మే కాకుండా , మా చుట్టుపక్కల వాళ్ళు అంతా మా రేడియో కార్యక్రమం విన్నారు. నా గొంతు రేడియో వినడం నాకెంత గొప్పగా అనిపించిందో మాటల్లో చెప్పలేను.  మా వాళ్ళంతా అందరూ నా గొంతు రేడియోలో చాలా బాగా వచ్చిందని మెచ్చుకున్నారు. అప్పుడు నాకు ఏదో ఘనకార్యం చేసి ఏదో సాధించేసినంత సంతోషం కలిగింది.

నేను ఆడపిల్లను కదా అని ఊరుకుంటే నాకీ ఆనందం దక్కేదా ..?  ఇకనుండీ ఎవరేమి అంటారో అని  వెనుకాడుతూ అవకాశాల్ని వదులుకోకూడదు అని నిర్ణయించుకున్నా.

కళ్యాణి

చీలపల్లి
(జనవరి 11 -17, 2015 ప్రచురణ )

అనుభవం నేర్పిన పాఠం అణు కుంపటి వద్దు.. సంప్రదాయ ఇంధనమే ముద్దు

praja అత్యంత ఖరీదైన  అంతకంటే ఎక్కువ వినాశకరమైన 20 అణు రియాక్టర్ లను కొనడానికి భారత ప్రభుత్వం రష్యాతో ఈ మధ్యనే ఒప్పందం చేసుకుంది.   ఒక వైపు జపాన్ , జర్మనీ,స్విర్జర్లాండ్  వంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ పునః సమిక్షించుకున్నాయి . దశలవారీగా అణువిద్యుత్ ఉత్పాదన విరమించుకుంటున్నాయి.  ప్రత్యామ్నాయ మార్గలవైపు దృష్టిసారించాయి.  కారణం 1986లో రష్యాలోని చెర్నోబిల్ లోనూ, 2011 లో జపాన్ పుకుషిమా లలో జరిగిన దుర్ఘటనలే .. అందువల్ల పెల్లుబికిన ప్రజా వ్యతిరేకతే. అదంతా ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకీ తెలుసు. మన ప్రభుత్వాధినేతలకు తెలియకుండా ఉంటుందా ..?! అలా అనుకోలేం కదా .. అయితే, చేతి చమురు వదిలించుకుంటూ వినాశకరమైన అణు రియాక్టర్ లవైపే ఎందుకు మొగ్గు చూపుతున్నాం ..?  అణు విద్యుత్ కేంద్రాల పట్ల మన దేశ ప్రజలూ వ్యతిరేకిస్తున్నారు. వాటి పర్యవసానం ప్రజల జీవనాన్ని, పర్యావరణాన్ని, జీవావరణాన్ని ఎంత చిన్నాభిన్నం చేస్తుందో చూస్తూ ఎందుకు ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నాం ..?!  విద్యుత్ అవసరాలు తీర్చుకోవడం కోసం అని ఏలికలు చెప్పేమాట .. అంతకు మించి ఏమైనా ఉందా …???

రోజు రోజుకీ విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నమాట కాదనలేని వాస్తవం. విద్యుత్ లేని జీవితాన్ని ఊహించలేం.  గత అక్టోబరులో హుదుద్ తుఫాను భీభత్సం కారణంగా విచ్చిన్నమైన విద్యుత్ వ్యవస్థ వల్ల పది రోజులకు పైగా విశాఖవాసులు చీకట్లో మగ్గాల్సి వచ్చింది. పరిశ్రమలు నెలరోజులకు పైనే పడకేశాయి. కారణం విద్యుత్ సరఫరా లేకపోవడమే. ఆ సమయంలో వారు పడిన ఇబ్బంది , అసౌకర్యం అందరికీ తెలిసిందే.  ఇంటా బయటా ఏ పని చేయాలన్నా విద్యుత్ కావలసిందే. ఇక చీకటి పడితే చాలు ఇంట విద్యుత్ దీపం వెలాగాల్సిందే .. ఆ విద్యుత్ లేకపోతె కాలం స్తంభించి పోయినట్లు ఉక్కిరిపిక్కిరి అవుతాం.  విలవిలలాడిపోతాం. మన మెదళ్ళు మదించి కనుగొన్న విద్యుత్ మనని అంతగా బానిసను చేసేసుకుంది.

మన విద్యుత్ అవసరాలు తీర్చుకోవడానికి మనం ఎక్కువగా ఆధారపడేది థర్మల్ విద్యుత్ , జలవిద్యుత్, అణువిద్యుత్ లపైనే . , ఆ తర్వాతే ప్రత్యామ్నాయ విద్యుత్  విధానాల పైపు చూస్తున్నాం.  మనం ఉత్పత్తిచేసే సాంప్రదాయేతర విద్యుత్ మానవాళికి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ కీడు చేస్తుందన్న విషయాన్ని విస్మరిస్తున్నాం.  ఆ విషయాల్ని తొక్కి పెట్టేస్తున్నాం.  జరిగే కీడు గురించి ఆలోచించే వారిని నిర్బంధాలకు గురిచేయడం , కేసులు పెట్టి హింసించడం పరిపాటి అయిపొయింది.   ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చడం కోసం, దేశ ఇంధన అవసరాలు తీర్చడం కోసం అణువిద్యుత్ కేంద్రాలు,  వందలాది థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు జరిగిపోతున్నాయి.  ప్రజల అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాని ఎవరూ కాదనలేరు.  కానీ, ఆ క్రమంలో జరిగే నష్టం గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత అవసరం ప్రభుత్వం పైనే ఉంది. దాన్ని విస్మరిస్తే ఎలా..?  నిప్పు ముట్టుకుంటే కాలుతుందని చిన్న పిల్లలకి జాగ్రత్తలు చెప్తాం. దాని దగ్గరకు వెళ్ళ వద్దనీ, దానితో ఆటలాడ వద్దనీ నేర్పుతాం. అలాంటిది పెద్దలే అణు కుంపటి వెలిగించి ప్రజల ప్రాణాలతో , ప్రకృతి నియమాలతో చెలగాటమాడతామంటే … కళ్ళు  చెవులూ మూసుకుపోయి,మెదడు మొద్దుబారిపోయి ప్రవర్తిస్తోంటే .. ఎలా ..ఎలా .??? అణు విద్యుత్ కేంద్రాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల ఎంత నష్టమో క్లుప్తంగా చూద్దాం.

అణువిద్యుత్ కేంద్రాల్లో ఉండే అణు ధార్మిక ప్రభావం , ఆ కేంద్రాల్లో ప్రమాదాలు జరిగితే ఉండే తీవ్ర ప్రభావం , జనజీవన వ్యవస్థలపై , పర్యావరణంపైనా ఏంతో ఎక్కువ ఉంటుంది.    ఎప్పుడో 1986 లో జరిగిన చెర్నోబిల్ ప్రమాదం రెండులక్షలపైగా  ప్రాణాలు తీసింది. ఆ ప్రమాదం వాళ్ళ అణుధార్మిక ప్రభావం 950 మైళ్ళ వరకు ఉంది. ఆ పరిధిలోని వ్యవసాయ భూములు శాశ్వతంగా బీడులైపోయాయి. ఒకవేళ ఎక్కడన్నా పండినా ఆ వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద కూడా పనికి రాకుండా పోయాయి.  3. 5 లక్షల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు.  ఇవన్నీ ప్రపంచానికి తెలుసు. అది జరిగి చాలాకాలం అయిందనుకున్నా .. 2011 మార్చి 11న  జపాన్ లోని పుకుషిమాలో జరిగిన ప్రమాదాన్ని మనమంతా టివి ల ముందు కూర్చొని చూశాం. ఆ తర్వాతే జపాన్ , జర్మనీలు తన పంథా మార్చుకున్నాయి. అణువిద్యుత్ వద్దని ప్రకటించాయి. అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ మార్గాలవైపు అడుగులు వేస్తున్నాయి. కారణం .. అణు ధార్మిక కాలుష్యాన్ని శుద్దిచేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చవడమే కాకుండా 40 నుండి 50 ఏళ్ల వరకూ ఆ శుద్ధి కార్యక్రమం జరిగినా అది పూర్తిగా శుద్ధి కాకపోవచ్చు.  చెర్నో బిల్ ప్రమాదం జరిగి 28 ఏళ్లయినా ఇప్పటికి ఆ కాలుష్యాన్ని పూర్తిగా తొలగించలేకపోయారు అంటే పరిస్థితి అర్ధమవుతుంది కదా…   అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదాలే కాకుండా అణు వ్యర్ధాల వల్ల కూడా ఎంతో ముప్పు పొంచి ఉంది. అయినా వాటి వైపు మనం ఎందుకు చూడడం లేదు ..? ఎందుకు ఆలోచించడం లేదు ..?  బహుళ జాతి కంపెనీల ఒత్తిడికి లొంగి ఇతర దేశాలనుంచి అణు రియాక్టర్లు , వాటికి కావలసిన ఇంధనం అధిక ధరలకు కొంటూ ఆ భారం ప్రజలపై మోపడం జరుగుతోంది .

థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా సురక్షితం అయినవి కాదు. ఈ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి బొగ్గు మండిన్చినప్పుడు వెలువడే బూడిదలో యురేనియం, థోరియం వంటి విషపదార్ద్తాలు వాటి అణుధార్మిక ప్రభావానికి గురవుతున్నారు. వివిధ కాన్సర్ల బారిన పడుతున్నారు.

సమాజ విద్యుత్ అవసరాలు తీర్చడం కోసం మనకి ప్రత్యామ్నాయ మార్గాలు లేవా ..?అణు విద్యుత్ కంటే , థర్మల్ విద్యుత్ కంటే ఎంతో భద్రమైన, విదేశీ ద్రవ్య వినిమయం లేకుండా , ఆర్ధిక లోటు లేకుండా ఉండే ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన వరం సౌరశక్తి. వాయు శక్తి. వీటిని ఎంత వినియోగించినా తరిగిపోయేవి , క్షీణించిపోయేవి కావు. ఎంతైనా వినియోగించుకోవచ్చు. ఎంతైనా ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే గాలి, నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్  కంటే సూర్యరశ్మి ద్వారా వచ్చే విద్యుత్ మన అవసరాల్ని ఎక్కువస్థాయిలొ తీర్చగలదు.  సూర్యుడు మనకు ప్రసాదించే కాంతిని , వేడిని , రేడియో తరంగాల్ని  మనం సంపూర్ణంగా నినియోగించగలిగితే మనం వేరే ఇతర ఇంధన వనరులపై ఆధారపడాల్సిన అవసరమే లేదు.  దీని వల్ల  పర్యావరణ కాలుష్యము ఉండదు. అందుకే వివిధ దేశాలు సౌరశక్తి ని ఉపయోగించుకుందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. సూర్యశక్తి తో ఒక చదరపు మితరుకి వెయ్యి వాట్ల విద్యుత్ ఉత్పత్తి చెయ్యొచ్చునట.  సౌర శక్తి వినియోగంలో చైనా ముందుంది.  సూర్యరశ్మి తక్కువగా ఉండే దేశాలైన ఇజ్రాయిల్ , జపాన్ , జర్మనీ , ఇటలీ ,స్విడ్జర్లాండ్, పోర్చుగల్ , స్పెయిన్ , అమెరికా తదితర దేశాలన్నీ సౌరశక్తి వైపు అడుగులేస్తోంటే మనమ్.. పుష్కలంగా ఉన్న సూర్య రశ్మిని ఉపయోగించుకునేందుకు మీన మేషాలు లెక్కపెట్టుకుంటూ ఉన్న ఆర్ధిక వనరుల్ని ఖర్చు చేసేసుకున్తున్నాం.  సౌరశక్తి వినియోగానికి   ఏమి చర్యలు తీసుకుంటున్నాం ..?   అనుభవాల ద్వారా పెట్టుబడిదారీ దేశాలు అణు ఇంధన ఉత్పత్తి వదిలించుకుంటుంటూ  అణు సాంకేతిక పరిజ్ఞాన్ని వ్యాపారం చేసుకుంటుంటే  మనం గుణపాటం నేర్చుకోకుండా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాం ..? తరిగిపోయే సాంప్రదాయేతర వనరులపై ఆధారపడే కంటే , వాటి ద్వారా తలెత్తే సమస్యలని అనుభవించే కంటే సహజసిద్దంగా లభించే సాంప్రదాయ వనరులపై దృష్టి మళ్ళించాల్సిన అవసరం ఎంతో ఉంది.   సౌర విద్యుత్, పవన విద్యుత్,. ప్రకృతిలో సహజంగా ఉన్న వనరులవి . వాటి సహజత్వానికి ఏ మాత్రం భంగం కల్గించకుండా సాగే ప్రక్రియలో ఉత్పత్తి అవుతుంది. జనజీవనానికి , జీవావరణానికి , పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కల్గించని సమగ్ర విద్యుత్ విధానాన్ని రూపొందించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.  అనుభవం నేర్పిన పాఠాలతో ఆలోచించి అడుగులువేయాల్సిన అవసరం నేడు ఎంతో ఉంది.
వి. శాంతి ప్రబోధ

 డిసెంబర్ 14 = 20 ప్రజాతంత్రలో ప్రచురణ

Tag Cloud

%d bloggers like this: