The greatest WordPress.com site in all the land!

Archive for June, 2015

అనాధ – ఆన్లైన్ ఇబ్బందులు

సమతనిలయం లో 10 మంది పిల్లలు 5 వతరగతి పూర్తీ చేసుకున్నారు. వారిలో 5 మంది మోడల్ స్కూల్ లో చేరాలని అనుకుంటున్నారు. అందుకోసం ఆన్లైన్ లో అప్లై చేయడానికి మా మంజుల ని మీ సేవా సెంటర్ కి పంపించాను.  అవి ఎంట్రీ చేసేటప్పుడు అన్నీ సందేహాలే . మాటిమాటికీ ఫోను.  ఇతర పిల్లల అప్లికేషన్ నింపేటప్పుడు వాళ్లెవరికి రాని ఇబ్బందులు మా పిల్లలకి వచ్చాయి. కారణం వాళ్ళ వివరాలు తెలియకపొవడమే.  ఆ అప్లికేషన్ లో పేరు , ఇంటిపేరు , తల్లిదండ్రుల పేర్లు, కులం , మతం తప్పనిసరిగా ఇవ్వాలి.
కానీ మా పిల్లల్లో కొంత మందికి వారి ఇంటిపేరు తెలియదు. కులం , మతం అసలే తెలియదు .
ఇలా తమ కులం గురించి వివరాలు తెలియని పిల్లల్ని ‘కుల రహితులు’ (casteless )గా గుర్తించి  షెడ్యుల్డ్ కులాల వారికి ఇచ్చే స్కాలర్ షిప్ సౌకర్యాలు, రిజర్వేషన్ సౌకర్యాలు ఇవ్వాలని G.O.Ms.No. 34 చెప్తోంది. అదే విధంగా వీరికి 3% సీట్లు సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ అద్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లోనూ, హాస్టళ్ళలోను సీటు ఇవ్వ వచ్చని G.O.Ms. No 47 చెప్తోంది
అదే విధంగా ఈ పిల్లల నుండి ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు.
గతంలోనూ 10 వతరగతి, ఇంటర్ చదివే వాళ్ళ ఫీజు విషయంలోనూ మాకు ఇబ్బందులేదురయ్యాయి. G.O  చూపించినా ఫీజు తప్పని సరిగా కట్టాల్సిందే , ఆన్లైన్ లో accept చేయడం లేదు అన్నప్పుడు మేం చేసేదిలేక ఫీజు కట్టేశాం.
ఇదిగో ఇప్పుడు మా వాళ్ళలో ఒకరికి ఇంటిపేరు, కులం పేరు తెలియదు . castless అని పెట్టమంటే ఆ ఆప్షన్ లేదు అంటున్నారు. పై G.O ల ప్రకారం యస్ సి పెట్టండి అని చెప్తే, మరో ఆప్షన్ మాల / మాదిగ ఏది అని వచ్చింది. ఎలా .. చివరికి మాదిగ అని ఇచ్చాం . సర్ నేమ్  ఆ అమ్మాయి పేరులో మొదటి అక్షరం S ఇచ్చాం. అయినా ఆ ఫీల్డ్ ముందుకుపోలేదు. అదే అక్షరం రెండు సార్లు  అంటే SS అని ఇచ్చాం.  కానీ మేం చేసింది తప్పు కదా .. మనసు ఒప్పుకోవడం లేదు. లేదంటే ఆ అమ్మాయి మోడల్ స్కూల్ లో అవకాశం కోల్పోవచ్చు.  వీళ్ళకి కులం , ఆదాయం , నివాస సర్టిఫికేట్ లు ఉండవు . orphan certificate ఉంది. సీటు వస్తే అడ్మిషన్ అప్పుడు మరెలాంటి సమస్యలు ఎదుర్కోవాలో ….

ఇప్పుడు చాలా సందర్భాల్లో birth certificate అడుగుతున్నారు. వీళ్ళకు ఆ certificate ఎలా ఇస్తారు .? మా వాళ్ళలో చాలా మందికి మేమే ఒక పుట్టిన తేదీ ఇచ్చాం. వాళ్ళ చిరునామా సమతనిలయమే. ఇక్కడే మేం ఆధార్ కార్డు కూడా తీసుకున్నాం. కానీ birth certificate కి అది సరిపోదు కదా ..
 ఈ విషయాలు  స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారికి ఫోన్ చేసి చర్చించాను. శాఖల మధ్య సమన్వయ లోపం  సాఫ్ట్ వేర్ చేసేటప్పుడు ఇలాంటివి జరిగి ఉండొచ్చని అనిపించి ఆ విషయమే వారితో అన్నాను.  ఈ సమస్యలని పరిష్కరిచడానికి వీలవుతుందేమో చూడగలరా అని అడిగాను.   అవునా .. ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు.  రాసి పంపించండి. స్టేట్ మీటింగ్ లలో మేం పై  వారి దృష్టికి తీసుకేళ్టాం అన్నారు.  చూద్దాం ఏమి జరుగుతుందో ..

కొండా కోనల్లోని మాణిక్యాలు ‘ఓజ ‘ హస్త కళాకారులు

madhyalo madavi bhagavantharavu. mugguru ahmadabaad vellaru ‘మా తాత ముత్తాతల నుండీ ఈ పని చేస్తున్నాం. కానీ మాకు మార్కెట్ లేదు.’ అన్నాడు మడావి భగవంతరావు.   అవునన్నట్లు తలలూపారు అతనితోనే ఉన్న వాళ్ళు . ఆ వెంటనే ‘మాకు పనిచేయడం తెలుసు కానీ మార్కెట్ చేసుకోవడం తెలియదు’ అని తన మాట సవరించుకున్నాడు మడావి భగవంతరావు.  వాళ్ళంతా ‘ఓజ ‘ చేతిపని కళాకారులు. నిజమే,  వాళ్ళు చేసిన చేతికళలకు ఉపయోగపు విలువ ఉంది.  మార్కెట్ చేసుకోవడమే తెలియదు. వారు తమ శక్తిని జోడించి చేసే కళాకృతుల ద్వారా  ఒక తరం నుండి మరో తరానికి వారసత్వ జ్ఞాన సంపద బదిలీ చేస్తున్నారు. అనాదిగా ఉన్న డిజైన్ లనే చేస్తూ తమ గిరిజన తెగల ఆభరణాలు, ప్రకృతిలో నివసించే వారి సంస్కృతీ సంప్రదాయాలకు తగ్గ వ్యవసాయ పనిముట్టులు, గృహావసర వస్తువుల్ని తయారు చేయడం ద్వారా సజీవంగా ఉంచుతున్నారు.

dipam
ఇత్తడి కరిగించి వారు చేసిన కళాఖండాలు మమ్మల్ని చాలా ఆకట్టుకున్నాయి.  భూమిక పత్రిక, మహిళా సమత సొసైటీ ఆధ్వర్యలో ఏర్పాటైన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు డివిజన్ లోని కెరిమెరి, జైనూర్  మండలాలలో 25మంది రచయిత్రుల సందర్శన సందర్భంగా మేం జైనూర్  మండలం లోని ఉషేగాం వెళ్లాం.  అదో కుగ్రామం. ఉట్నూరు నుండి ఆసిఫాబాద్ వెళ్ళే మార్గంలో ఉంది.  ఒకే ఒక బజారు. 20 కుటుంబాలు నివసిస్తున్నాయక్కడ.  ఒకప్పుడు వారు సంచార జీవులు.  ప్రస్తుతం వారి ఇల్లు  ప్రభుత్వం కట్టించిన ఒకే ఒక గది. కొందరి ఇళ్ళకి ముందర వాలుగా వేసిన  పందిరి.   ఆ పందిట్లో కూర్చొని తమ చేతులు ఒంపు సొంపులతో  తమ పని చేసుకుపోతుండగా కొత్తగా కనిపిస్తున్న మాకేసి వింతగాను, ఆసక్తిగాను చూసే యువకులు, పిల్లలు, మహిళలు.  ఆగి ఏమి చేస్తున్నారని అడిగినప్పుడు ఒకరు ఎద్దు అని చెప్తే మరొకరు గంట అని చెప్పారు. thanapanilo వారి చేతుల్లో మైనం సన్న తీగలా ఒంపులతో చుట్లు తిరుగుతూ ..ఒక రూపాన్ని సంతరించు కుంటూ .. వారి కళా నైపుణ్యానికి  అబ్బురంగా చూస్తూ మేం .  వారిని చూస్తుంటే చేట ముందు వేసుకుని క్షణం వృధా కానీయకుండా  చకచకా బీడీలు చుట్టే మహిళలే కళ్ళ ముందు మెదిలారు.
ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఉండే ఇతర గిరిజన తెగలకి భిన్నంగా వీళ్ళు సంచార జీవితం గడిపేవారు.  ఏ చెట్టు కిందో, ఎవరింటి పందిరి కిందో  మకాం వేసి ఇత్తడి కరిగించి నగలు, ఎద్దులు, ఎడ్ల బండ్లకు అలంకరించే ఆభరణాలు చేసే కంసాలిపని, వ్యవసాయ పనిముట్లు చేసే కమ్మరం పని చేసే వారు. అదేవిధంగా గోండులు పూజించే దేవతా విగ్రహాలు, పూజా సామాగ్రి ఇతర వస్తు సామాగ్రి చేసి ఇచ్చేవారు.  అందుకు ప్రతిఫలంగా ధాన్యం, లేదా ఇతర ఆహార పంటలను గోండుల నుండి పొందేవారు. అంటే గోండులు ఇచ్చేవారిగాను ఓజ తెగ వారు పుచ్చుకునే వారిగాను ఉండేవారు.
ఊషేగాంలో  ఉన్న కుటుంబాలన్నీ ‘ఓజ ‘ అనే గిరిజన తెగకు చెందిన కుటుంబాలే.  చూడగానే వారు గోండులకు దగ్గరగా కనిపిస్తారు. కానీ, వారి ఆచార వ్యవహారాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకరికొకరు పిల్లని ఇచ్చి పుచ్చుకోవడం ఉండదు.  గోండులు వీరి ఇళ్ళలో ఆహరం ముట్టరు. వీరు సామాజికంగా  గోండుల కంటే దిగువ స్థాయికి చెందిన తోటి , కొలామ్, పర్దాన్ ల కంటే కూడా తక్కువ స్థాయికి చెందుతారు.    గోండు పురాణాలలో వీరిని  pen de Wojalir (ది ఫౌండర్స్ ఫర్ ది గాడ్స్ ) గా పేర్కొన్నారు.  వీరికి కూడా గోండులలో ఉన్న విధంగానే ఇంటిపేర్లు ఉంటాయి.   మిగతా గిరిజనులతో పోలిస్తే ఓజ తెగ జనాభా చాలా తక్కువ.  జైనూరు మండలం లోని ఊషేగాం తో పాటు ఇంద్రవెల్లి మండలంలోని ఒకటి రెండు కుగ్రామాల్లో మాత్రమే ఉన్నారు. పేదల్లో పేదలు ఓజా తెగ జాతివారు.  వీరిని Wojaris అని అంటారు. గోండులు మాత్రం ఓజాలు అనే వ్యవహరిస్తారు.  వీరు ‘ఓజ’ భాష మాట్లాడతారు. ఓజ భాష మరాఠీ భాషకు దగ్గరగా ఉంటుంది.    తాము చంద్ర వంశీయులమని చెప్పారు అక్కడి వాళ్ళు.
eddula jodiమహిళా సమత సొసైటీ కార్యకర్తలు మమ్మల్ని గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలోకి తీసుకెళ్ళారు.  మేం వెళ్ళేసరికే అక్కడ కొంతమంది ఉన్నారు. లోనకి వెళ్ళగానే పుత్తడిలా మెరిసే అద్భుతమైన ఇత్తడి కళాఖండాలు మా మది దోచుకుంటూ.. అవి వారి చేతుల్లో రుపుదిద్దుకున్నాయంటే ఆశ్చర్యం . వాళ్ళ కళ  గురించి తెలుసుకోవాలన్న ఆతృత.   ఆ క్రాఫ్ట్ వర్క్ అంతా త్వరలో రాబోయే కేస్లాపూర్ లో  జరిగే నాగోబా  జాతర కోసం సిద్దం చేసుకుంటున్నామని చెప్పారు అక్కడి వారిలో ఒకరు.  ప్రతి సంవత్సరం జరిగే జాతరకి రెండు మూడు నెలల ముందు నుండే వివిధ సామాగ్రిని తయారు చేయడం మొదలు పెడతారు వీళ్ళు.
వాళ్ళు తయారు చేసే  హస్త కళల్లో కొన్ని :
nagobaaనాగోబా – చుట్ట చుట్టుకొని పడగ విప్పిన నాగు. గోండులలో మేస్రం వంశస్తుల దైవం
nevadiనేవడి – కాలికి వేసే ఒక రకమైన కంకణం. నాగోబా జాతర సమయంలో దైవాన్ని నెత్తిన ఎత్తుకున్న వ్యక్తీ భీందేవ్ (గోండు, కొలామ్, పర్ధాన్, తోటి తదితర గిరిజనులంతా భీముడిని దేవుడిగా కొలుస్తారు.)  తిరిగేటప్పుడు సాంప్రదాయంగా కాలికి వేసుకునే ఆభరణం.
udaaniఉదాణి – దేవుడి పూజకు ఊదు/సాంబ్రాణి వేసి వెలిగించే వస్తువు
దీపంచె  – దీపం
గంటి  – గంట
gorka pelli koduku pelli kuthuriviగొర్క  – కత్తి
గంటలు, మువ్వలు ,  కర్రకి చివర కడతారు.  దేవుడికి కడతారు.  ఎద్దులకి వేసేవి వేర్వేరుగా ఉంటాయి.  వారు తయారు చేసే వస్తువులు పూజకు సంబంధించినవి, వ్యవసాయానికి సంబంధించినవి, వారి సంస్కృతీ ఆచారాలకు, అవసరాలకు  సంబంధించినవి ఎక్కువగా కనిపిస్తాయి. ఎద్దులు , నెమళ్ళు, పాములు, సూర్య చంద్రులు, అయిదు నక్షత్రాలు  వారి డిజైన్లలో ఎక్కువగా  కనిపిస్తాయి.
గోండు తదితర గిరిజనులు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురులకు  కత్తి లేకుండా పెళ్లి జరగదట.  అందుకే పెళ్ళిళ్ళ కోసం వాటిని తయారు చేస్తారు. వాటిని పెళ్లి గోర్కలు అంటారు.  పెళ్ళికొడుకుకి వాడే గోర్కలు పెళ్లి కూతురికి వాడే వాటి కంటే కొద్దిగా పెద్దవిగా ఉంటాయి.  గోర్కని ఊరికి రక్షణగా పెడతారు. అదే విధంగా భార్యాభర్తలు ఒకరికొకరు రక్షణగా ఉంటారని, దుష్ట శక్తులు వారి దరిచేరకుండా ఉండాలని  గోర్కలు పెళ్ళిలో వారికి ఇస్తారట. గోర్కలపైన సూర్యుడు, చంద్రుడు,  ఐదు నక్షత్రాల (పంచపాండవులు అని అంటారు ) బొమ్మలతో ఉన్నాయి.  మరో గోర్కల సెట్ పై నెమళ్ళ డిజైన్ తో ఉన్నాయి.
దీపం స్టాండ్ లో ఒకప్పుడు ఆముదం వేసి వెలిగించేవారు.  ఆ దీపం రాత్రంతా వెలుగుతూనే ఉండేది. ఇప్పుడు ఏదో ఒక నూనె వాడుతున్నారు. ఇవి ప్రతి ఇంటిలో ఉంటాయి. ఇవి ఒకటి, రెండు, మూడు, ఐదు అంతస్తులు గా ఉండేటట్లు చేస్తారు.  పెద్దవి ఇప్పుడు ఎక్కువగా దేవాలయాల్లో వాడుతున్నారు.
ఎలా చేస్తారంటే :
ఒక దీపం చేయడానికి రెండు రోజులు పడుతుంది. ముందుగా ఒకరకమైన మట్టిపై మైనంతో డిజైన్ చేస్తారు.  ఆ తర్వాత ఆ మైనపు డిజైన్ పై మట్టి వేస్తారు. దాన్ని కుండలు కాల్చినట్లు కాలుస్తారు.  మైనం కరిగిపోయి మధ్యలో ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలో కరిగించిన ఇత్తడి పోస్తారు.  ఆ తర్వాత మట్టి తీసేసి బ్రష్ తో శుభ్రం చేస్తారు.
కావలసిన ఇత్తడిని ఆదిలాబాదు లేదా ఆసిఫాబాదు నుండి తెస్తారు.
ధర
పెళ్లి గోర్కల సెట్ కి (అమ్మాయివి, అబ్బాయివి )మూడువేల ఐదువందల రూపాయలు , కొద్దిగా చిన్నవి అయితే రెండువేల ఐదు వందల రూపాయలు అవుతాయి. చిన్న అద్దుల జత కి ఆరువందల రూపాయలు . ఇలా,  వారు డిజైన్ ని బట్టి , అది తీసుకునే తయారీ సమయాన్ని బట్టి , ఉపయోగించే ఇత్తడిని బట్టి వస్తువు ధర నిర్ణయిస్తారు.
ఎవరికైనా నేరిపిస్తారా ?  అంటే ఇది నేర్పిస్తే అందరూ నేర్చే పని కాదు అన్నారు.  ఐఎఎస్ అధికారి చందనా ఖన్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా ఉన్న సమయంలో అంతరించి పోతున్న ఈ కళను భవిష్యత్ తరాలకు నేర్పించాలన్న ప్రయత్నం జరిగిందనీ, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లోని విద్యార్థులు నేర్చుకున్నారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ మహిళా సమత సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంతి .  అయితే వీరు చేసే డిజైన్లు చాలా సమయం తీసుకుంటాయి. ఒక్క దీపపు కుందె చేయడానికి కనీసం మూడు రోజులు పడుతుంది.  ప్రస్తుతం బడికి పోయే పిల్లలు తప్ప మిగతా వారంతా ఇవి చేస్తారు.  వ్యవసాయం పనికి వెళ్ళరు .  ఇదే వారి ప్రధాన వృత్తి.
ఆదిలాబాదు జిల్లాలోని  DRDA వారు నిర్వహించిన వర్క్ షాపులో పాల్గొన్నామని ఒకరు చెబుతుండగా మడావి భగవంతరావు ఒక వార్తాపత్రిక తీసుకొచ్చి మా బృందం చేతిలో పెట్టాడు. అది ‘అహ్మదాబాద్ సిటీ లైఫ్ ‘. గుజరాతిలో ఓజ హస్తకళ, కళాకారుల  గురించి రాశారు.  ఎక్కడో ఉన్న  పరాయి రాష్ట్రం గుజరాత్లో వారికి లభించిన గుర్తింపుకి  చాలా ఆనందం కలిగింది.  మదావి భగవంతరావు బృందాన్ని ARCHITECTURE PLANNING AND CONSTRUCTION TECHNOLOGY వాళ్ళు 30 మంది విద్యార్థులకు నేరించడం కోసం వీరిలో ముగ్గురు కళాకారులని పిలిపించారనీ ,  వచ్చేప్పుడు తమ  బృందానికి దుప్పి తల బహుకరించారని చెప్పి ఆ దుప్పి తలను చూపించాడు మడావి భగవంతరావు.
తాత ముత్తాతల నుండి సాంప్రదాయికంగా చేస్తున్న డిజైన్లు తప్ప కొత్తవి తెలియదు. డిజైన్లు ఇస్తే మేమూ చేయగలం అని ఎంతో ఆత్మా విశ్వాసంతో ఉన్నారు వాళ్ళు.  చేయడం వరకు తెలుసు గాని వాటిని మార్కెట్ చేయడం తెలియదు.  మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలైన  మహారాష్ట్ర , చత్తిస్ ఘడ్ , మధ్యప్రదేశ్ నుండి కొండలు కోనలు దాటి  వచ్చే భక్తులు కేస్లాపూర్ జాతరలో వీరు తయారు చేసిన వస్తువులు కొంటూ ఉంటారు.  అంతకు మించి రాష్ట్ర హస్త కళల కేంద్రాల్లో వాటిని ఎలా మార్కెట్ చేయాలో తెలియదు.  ఇప్పుడిప్పుడే తమ పిల్లల్ని బడికి పంపుతున్న వీరికి కొత్త డిజైన్లు ఇస్తూ వారిని ప్రోత్సహించక పొతే భవిష్యత్ లో ఈ కళ అంతరించిపోయే ప్రమాదం ఉంది .  రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, గిరిజన సంక్షేమ శాఖ, ప్రభుత్వం  ‘ఓజ ‘ కళాకారుల కళని గుర్తించి వారి కళను కాపాడుతూ భవిష్యత్ తరాలకు భద్రపరచి  అందించాల్సిన బాధ్యత ఉంది. కళాకారులకి చేయూత నిచ్చి వారు రూపొందించే కళాకృతులకు సంస్థ నిర్వహించే షో రూం లలో ఉంచి మార్కెట్ సదుపాయాలు పెంచాల్సిన బాద్యత కూడా ప్రభుత్వానిదే.   అతి దయనీయ స్థితి లో ఉన్న ‘ఓజ ‘ కళాకారులని ఆర్ధికంగా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వి. శాంతి ప్రబోధ

అమ్మాయిని బడి భయపెడుతోందా .. ఆలోచించండి


బాధితురాలు ఎవరైనా కావచ్చు. నా బిడ్డ, నీ చెల్లి, మరొకరి మేనకోడలు ఎవరైనా కావచ్చు.  ఈ సమస్యపై తక్షణం స్పందించాల్సిన అవసరం చాలా ఉంది. 
తెలిసీ తెలియని వయస్సులోనో, అప్పుడప్పుడే కౌమార దశలోకి అడుగుపెడుతున్నవారికో  , యుక్తవయస్సులోకి వచ్చిన వారికో  ఎదురయ్యే ఈ సమస్య గురించి చెప్పుకోవడానికి , చర్చించు కోవడానికి తమ వారంటూ లేక ఎవరికీ చెప్పుకోవాలో అర్ధం కాక , చెప్తే తమని ఎలా అర్ధం చేసుకుంటారో తెలియక తమలో తామే మదన పడి  పోతుంటారు. తమని తామే శిక్షించుకుంటారు. జీవితాన్ని అంతం చేసుకుంటుంటారు. ఇందుకు కారణం సాధారణ కంటికి కనిపించకుండా సాగే హింస.  బడిలో  అనేక మంది మధ్యలో ఉన్నప్పటికీ ఇబ్బంది పెడుతున్న  లైంగిక హింస. అది తోటి వారి నుండి కావచ్చు. విద్యా బుద్దులు నేర్పాల్సిన పంతుళ్ళ నుండి కావచ్చు. బడిలో పనిచేసే మరెవ్వరినుండైనా కావచ్చు లేదా ఇంకెవ్వరి నుండైనా కావచ్చు.  ఎక్కువ మంది ఆడపిల్లలు బడి ప్రాంగణంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య ఇది. బయటి ప్రపంచానికి అంతగా కనిపించని సమస్య ఇది. సభ్య సమాజం ఈ సమస్యపై అంతగా దృష్టి సారించని ప్రాంతం ఇది.

బడిలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే బడి మార్కులు రాంకులే లక్ష్యంగా  కాకుండా విలువలతో కూడిన విద్య అందించాలి. బడిలో విద్యార్థులను, వారి ప్రవర్తనను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. విద్యార్తుల ప్రవర్తనలో వచ్చే మార్పులని పసి గట్టి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సరైన దారిలోకి తేవడం, బాధ పడుతున్న విద్యార్థికి ధైర్యాన్ని ఇవ్వడం చాలా అవసరం. కానీ స్మితా శర్మ కజిన్ విషయంలో అలా జరగలేదు.   ఆ అమ్మాయి ఇచ్చిన పిర్యాదుని ప్రిన్సిపాల్ తీసుకోకుండా  ఆ అమ్మాయిని దోషిగా చూడడం,  బడిలో టీచర్లు అందరి ముందూ ఆ అమ్మాయిని కించపరిచే విధంగా మాట్లాడడం, తట్టుకోలేకపోయింది.  ఆ సమయంలో ఆమె మాటలు వినే వాళ్ళుంటే, ధైర్యం చెప్పే వాళ్ళుంటే పరిస్థతి వేరుగా వుండేది.  ఇలాంటి సమస్య  స్మిత కజిన్కి  మాత్రమేనా..  ఎన్నో వేల, లక్షల విద్యార్థునులు ఎదుర్కొంటున్న సమస్యే.   ప్రతి బిడ్డ ఆ తల్లి దండ్రులకు అపురుపమే.  తాము అపురూపంగా చూసుకునే కుమార్తె అర్ధంతరంగా జీవితం ముగించిందంటే ఆ తల్లి దండ్రుల వేదన వర్ణనాతీతం.  అదే ఆమె సమస్య పట్ల సానుభూతి , సహానుభూతి ఉండేలా ఉపాధ్యాయులు స్పందించి ఉంటే .. ? అలా కావాలంటే ఆ  టీచర్ కి ఇటువంటి సున్నితమైన సమస్యల్ని పరిష్కరించగలిగే నైపుణ్యాలు ఉండాలి. కానీ మన బడుల్లో చాలా మంది ఉపాధ్యాయులకి అంతటి ఓపిక, నైపుణ్యం, సామర్ధ్యం లేవనే చెప్పాలి.   అదే విధంగా తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉన్నప్పుడు పిల్లలు తమ సమస్యని పెద్దల ముందు విప్పగలుగుతారు.  కానీ, మన సమాజంలో మగ పిల్లలకి ఇచ్చిన విలువ ఆడపిల్లలకి ఇవ్వక పోవడం చిన్న చూపు చూడడం కూడా మగ పిల్లల్లో ఆమె పట్ల చిన్న చూపు, వస్తువులాగా వాడి పారేయాలనుకోవడం కనిపిస్తోంది.  నేటి పరిస్థితుల్లో, ఇంట్లో తల్లి దండ్రులు, బడిలో ఉపాధ్యాయులు పిల్లలకు విలువలతో కూడిన సంస్కారం అందించాల్సిన అవసరం చాలా ఉంది.

న్యూ యార్క్ లో  నివసించే స్మితా శర్మ బడిలో తనకు జరుగుతున్న లైంగిక హింసని ఎవరికీ చెప్పుకోలేక బడి పై అంతస్తుల్లోంచి దూకిన సంఘటనతో చలించారు. తన కజిన్ లాగే ఎందరో ఈ సమస్యకి గురి అవుతున్నారు.  తన కజిన్ని కాపాడలేకపోయినప్పటికీ భవిష్యత్తులో మరెవ్వరూ ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుడదని   కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీ కి ఒక పిటిషన్ పంపారు ఆమె.

మన విద్యావిధానంలో కౌన్సిలింగ్ ఒక భాగం కావాలనే ఉద్దేశంతో కేంద్ర మనవ వనరుల శాఖామాత్యులు స్మ్రితి ఇరానీ కి పిటిషన్ పంపారు స్మితా శర్మ. బడులు పిల్లల్ని భయకంపితుల్ని చేయకూడదు. ఆరోగ్యకరమైన వాతావరణంలో వారి విద్యాభ్యాసం సాగాలి. ప్రతి విద్యార్ధి తనకు వచ్చే సమస్యల నుండి దూరం కావాలంటే వారికి సరైన కౌన్సిలింగ్ అవసరం.   విలువలతో కూడిన విద్యకి ప్రాధాన్యత నివ్వడం అత్యవసరం.

ఆడపిల్లల శ్రేయస్సుకోరి వారి విద్యావకాశాలు మెరుగు పడడం కోసం మన ప్రధాని ఆర్భాటంగా  ప్రారంభించిన “బేటీ బచావో , బేటీ పడావో ”  కార్యక్రమం ఎంతవరకూ మేలు చేస్తుందో వేచి చూడాల్సిందే. స్మితా శర్మ పిటిషన్ పై స్మృతి ఇరానీ ఎంత వరకూ స్పందిస్తారో తెలియదు కానీ . మన ఆడపిల్లల్ని కాపాడుకునే క్రమంలో దేశం ఆవల ఉండి కృషి చేస్తున్న స్మితా శర్మ పిటిషన్ కి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం చాలా ఉంది

వి. శాంతి ప్రబోధ

Article published in Prajathanthra May 24 – 30, 2015

పగిలిన కలల్లోంచి.. మొలకెత్తిన అంకురం

‘ఓ సారూ .. నీ బాంచెన్ .. నీ కాల్మొక్త .. సారూ .., నా బిడ్దల కాయిదాలివ్వు సారూ .. ‘ అంటూ హెడ్మాస్టర్ రామానుజం కాళ్ళకు చుట్టుకుపోయినదల్లా తల కొద్దిగా లేపి, కుడి చేత్తో కాలును తాకి మొక్కుతూ బతిమాలుతోంది పెంటమ్మ. 

 
‘చట్ .. చెప్తే నీగ్గాదానే..? పాడిందే పాట పాసుపండ్ల దాసరీ అన్నట్టు .. ఊకె .. నడు .. నడ్..  ‘ మొహం చిట్లించి కాలు విదిలించుకుంటూ ఒక్క కసురు కసిరాడు రామానుజం. అతనలా కదిలినప్పుడు మెడలో వెండితో చుట్టి వెండి తొడుగులు ఉన్న కుంకుడు గింజంత రుద్రాక్షలమాల చొక్కా లోనుండి అలా తొంగిచూసి మళ్లీ తన స్థానానికి చేరుతుండగా..  ఆమె వెనక్కి పడిపోయింది.  ఆమె కేసి కంపరంగా చూశాడు అతను.
బిక్క చచ్చిపోయిన ఆమె లేచి  గొంతుక్కూర్చుంది. కొంగు దులిపింది.  ఆ  చీర కొంగుతోనే చెంపకు అంటుకున్నఅతని కాళ్ళ దుమ్ము తుడుచుకుంది.   ఆ మొహంలో అలసట. తీవ్రమైన అలసటలోంచి ఆ కళ్ళలో కనిపించే పట్టుదల. కళ్ళచుట్టూ  ఉన్న నల్లటి వలయాలు, పోషణలేని శరీరం ఆమె వంటి రంగుని మరింత గాడంగా మారుస్తూ .. తైల సంస్కారం లేని జుట్టు చీకేసిన తాటిటెంకకు మట్టి అంటిన పీచులా ..
 
‘ నడు ..ఆవలికి నడు ” చుర చురా ఆమెనే చూస్తూ మళ్లీ అన్నాడు రామానుజం తన సీటులో కూర్చుంటూ . అంతలో పద్మా టీచర్ లోనకొచ్చారు.
‘అమ్మా టీచరమ్మా..  నువ్వన్న జర జెప్పమ్మా .. పెద్ద సారుకు.  నా బిడ్డల బతుకు నా బతుకోలె బండలు కాకుంట సూడమ్మ ‘ పద్మకేసి తిరిగి ఆమె కాళ్ళు పట్టుకోబోతూ  పెంటమ్మ 
‘అయ్యో గిదేందమ్మా ..లేవ్వు  లే.. ,  గిట్ల  కాళ్ళు పట్టుడేంది బడిల .. ‘ కంగారు పడి అయోమయంగా హెడ్మాస్టారు కేసి చూసింది  పద్మ.
తన డాబు దర్పం ప్రదర్శిస్తూ గొప్పగా  కబుర్లు చెప్పే హెడ్మాస్టరు సారు  ఈ రోజేంటో చాలా  చిరాగ్గా ఉన్నాడు మనసులో అనుకుంటున్న ఆమె ఆలోచనలకు అంతరాయం కల్పిస్తూ ‘దీని కిరి కిరి తోటి తల బొప్పి కడ్తాంది.  ఆలుమగల పంచాయితీ ఇంటికాడ జూస్కోక….  హూ .. కరువమంటే కప్పకు కోపం, ఇడువమంటే పాముక్కోపమయిపాయే ‘ రామానుజం నసుగుడు చెవిలో పడింది.
ఇదివరకు పిల్లల టిసి కోసం ఆమె వచ్చింది. ఆ పిల్లల తండ్రి ఇవ్వవద్దన్నాడని హెడ్మాస్టర్ ఇవ్వలేదు. అందుకే వచ్చినట్టుంది అనుకుని   ‘సమస్యేంది  సార్ ‘  ఆయన ముందున్న కుర్చీలో కూర్చుంటూ ఏమీ ఎరగనట్లుగానే అడిగింది పద్మ టిచర్ .
 
‘ఇదొచ్చి పిల్లల టి. సి అడుగుతది.  దీని మొగడచ్చి ఇవ్వొద్దంటడు. ఏం జెయ్యాలె చెప్పండి.. ? ముందుకుబోతే నుయ్యి . ఎన్కకు బోతే గొయ్యి’  ఏదో పెద్ద కష్టం వచ్చినట్టు నుదిటి మీద కొట్టుకుంటూ అన్నాడు హెడ్మాస్టర్.   నొసలు చిట్లించి కుడి చేతితో బొటనవేలు చూపుడు వేళ్ళ  మధ్య అదిమి  నోసట్లో వోత్తుకుని ఒక్క క్షణం ఆగి ఏదో గుర్తొచ్చినట్లు తల ఎత్తాడు.  ఆ వెంటనే బెల్ నొక్కాడు రామానుజం. 
‘సార్ పిలిచిన్రా ‘ అంటూ క్షణంలో  ప్రత్యక్షమయ్యాడు అటెండరు సాయిలు .  ‘పో ..పోయి  చాయ్  త్యా  పో ‘ అంటూ అతనికి పురమాయించాడు.
‘సారూ .. గిదేం మంచిగ లే..  సారూ .. పురాగ ఆనికెల్లే మాటడవడ్తివి.., ఆడు నీకు పాలు బోత్తాన్నడనే గద..? ‘అక్కసుగా  అంది పెంటవ్వ.  తానున్న దగ్గర నుండి పిసరంతైనా కదలకుండా హెడ్మాస్టారు కళ్ళలోకి సూటిగా చూస్తూ .. ఆమె చూపులో చూపు కలపలేక తల దించుకుని టేబుల్ పై ఉన్న హాజరు పట్టీలో తలదుర్చాడు.  
 
****                              ****
 
పెంటమ్మ , నర్సయ్యలది అన్యోన్యమైన సంసారమే .  డ్వాక్రా గ్రూపులో లోన్ తీసుకుని మొదట ఒక బర్రెని కొన్నారు.  ఏడాదికొకటి చొప్పున కొనుక్కుంటూ పోయారు. పాలిచ్చేవాటిని ఉంచుకుంటూ వట్టిపోయిన వాటిని అమ్మేస్తూ, దూడలని కన్న బిడ్డల్లాగే సాకుతూ ఉండేవారు.   రైతుల పొలాల్లో వాళ్ళ నడిగి వీళ్ళ నడిగి గట్లమ్మట గడ్డి కోసుకురావడం , కుడితి పెట్టడం , సమయానికి మేత వేయడం, బజారు నల్లా నుండి నీళ్ళు మోసుకొచ్చి గాబులు నింపి బర్లను కడగడం వంటి పనులన్నీ చేసేది పెంటమ్మ.   ఒక బర్రె పాలు ఆమె పిండితే మిగతా బర్రెల పాలు నర్సయ్య పిండే వాడు.  పెంటమ్మే బర్లను కాసేది.  సెలవు రోజుల్లో పిల్లలు తోలుకుపోయి వాటిని మేపుకొచ్చేవాళ్ళు.  
 
నర్సయ్య పాలను పొరుగున ఉన్న పట్నంలో ఇళ్ళకు వాడుకం పెట్టుకొని పోసి వచ్చేవాడు. నర్సయ్య  ఊరి బడిలో చదువు చెప్పే పంతుళ్ళందరూ పట్నంలోనే ఉంటారు.  వాళ్ళంతా నర్సయ్య దగ్గరే వాడకం.  బర్రె పాలు తీసినవి తీసినట్టే చిక్కగా ఒక్క చుక్క నీరు కలపకుండా పోసే నర్సయ్య పట్టుపాలకి మంచి గిరాకి.  పాల కేంద్రం నుండి తెచ్చిన వాటికంటే కొలత బాగుంటుంది. రేటు తక్కువ. వెన్న వస్తుందనుకునే వారు. వాడకందారుల దగ్గరనుండి ప్రతి నెల మొదటివారంలో డబ్బులు వసూలు చేసుకోచ్చేవాడు.  ఆ వచ్చిన డబ్బుల్లోంచి బర్రెలకు కావలసిన దాణా, తౌడు ఇంటికి కావలసిన సరుకులు తెచ్చేవాడు. కొంత డబ్బు డ్వాక్రా లోను కట్టమని భార్యకి ఇచ్చేవాడు. ఏ ఇబ్బందులు లేకుండా వారు ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్న సమయం అది.
 
అంతా సజావుగా సాగుతున్న సమయంలో, నర్సయ్య చేతిలో పైసలు మెలగడం చూసి కొందరు దగ్గరకు జమయ్యారు.  వారి ద్వారా పేకాట , తాగుడు వ్యసనాలు అలవాటయ్యాయి.  మొదట్లో ఎప్పుడో ఒకసారి తాగడం, పేకాట ఆడడం చేసేవాడు.  పెంటవ్వ అది గమనించినా ఏమీ ఎరగనట్టే ఉండేది. మొగోడు అన్నంక ఆయింత తాగరా , ఆడరా అనుకునేది. తన మొగుడు అందరి లాంటి వాడు కాదని మురిసిపోయేది.   పోనీలే .. అందరు మొగుళ్ళ లాగా తాగొచ్చి తన ఒళ్ళు హూనం చెయ్యడం లేదుగద .. అని తృప్తి పడేది.   రాను రాను పని తక్కువైంది.   చేతిలో పడ్డ పైసా వ్యసనాలకు ఖర్చయిపోతోంది.  మొదట్లో కొంచెం కొంచెం పైస తన వ్యసనాల కోసం ఖర్చు చేసే నర్సయ్యలో  తప్పుచేస్తున్నానన్న భావన ఉండేది.  అతన్ని మిత్రులు రెచ్చగోట్టేవారు. భార్య మీదకి ఉసి గోల్పేవారు.  పెళ్ళాం పిల్లలతో ఆనందంగా ఉండే నర్సయ్యలో అహం పెరిగి పోతోంది.  ఆడంగి వెధవా.. ఆడిదాని మాటతో నీకేమ్రా .. మగోడివి .  నువ్వు మగోడివి అన్న మాటలు అతని మీద బాగా పని చేశాయి.   రోజూ తప్ప తాగి ఇంటికి చేరే నర్సయ్య ప్రవర్తనలో ఎంతో మార్పు .  అతనేం చేస్తున్నాడో అతనికే తెలియనంతగా మార్పు . 
 
డాక్రా గ్రూపులో బాకీ పెరిగి పోతోంది.  గ్రూపు మీటింగ్ లో సభ్యులంతా పెంటమ్మ మీద వత్తిడి చేయడం మొదలు పెట్టారు.  ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. సరిగా తేవడం లేదు. బతుకమ్మ పండుగ, దసరా పండుగ దగ్గర పడ్డాయి. చేతిలో పైసా లేదు.  భర్త తీరు గమనిస్తోన్న పెంటమ్మ మర్యాదగా చెప్పింది. బతిమాలింది.  నెత్తీ నోరూ బాదుకుంది.  చేసిన కష్టం వ్యసనాల పాలవడం భరించలేక పోతోంది పెంటవ్వ .  పరిస్తితి మరింత విషమంగా తయారవడంతో పాలవాడకం ఉన్న పంతుళ్ళ నుండి డబ్బులు అడిగి తెచ్చింది.  అది వరకూ అప్పుడప్పుడూ ఆమె తేవడం మామూలే.   కానీ ఇప్పుడు నరసయ్యకి ఆ విషయం చాలా కోపం తెప్పించింది.  తనకు తెలియకుండా తెచ్చి కొంత లోను కట్టింది . ఇంట్లోకి సరుకులు తెచ్చింది.  మగడంటే ఖతర్ లేకుంట తయారయితున్నవ్.. ఏం జేయ్యల్నో  ఏం జేయ్యద్దో నాకెర్కలేదా  అంటూ భార్యని చితక తన్నాడు.  దాంతో అలిగి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి చేరింది పెంటవ్వ.  అయినా నర్సయ్యలో మార్పు లేదు. 
 
అన్నీ తానై రెండు రోజులు బర్ల పనులు చేశాడు. ఒళ్ళు పులిసి పోయింది. ప్రాణం ఆకుముక్కల మీదకి మళ్ళింది. గొంతు చుక్క కోసం ఆవురావురంది. మిత్రులు రా రమ్మంటూ పోన్ల మీద ఫోన్లు. .. చివరికి వాళ్ళే ఇంటికొచ్చారు .  బర్లకి సమయానికి మేత , నీళ్ళు ఏమీ లేవు. కట్టేసే ఉంటున్నాయి.  పాలు సరిగా ఇవ్వడం లేదు. పెంటమ్మ వెళ్ళడానికి వారం ముందు ఈనిన గౌడు బర్రె దూడ ఏదో రోగం వచ్చి చచ్చిపోయింది.
పెంటమ్మ ఉంటె అన్నీ తానై చూసుకునేది. ఒక్కసారిగా  అతని మనసు ఉసూరుమంది.  వెళ్లి దాన్ని పిలుచుకు వద్దామా అని మనసు పోరింది. కాని ఆమెను తీసుకు రావడానికి అతని అహం అడ్డు పడుతోంది.  ఆమెకు ఆమె వస్తే సరి. తను మాత్రం వెళ్లి తీసుకురావద్దు. అలిగెల్లిన ఆడదానికి లొంగితే లొకువయిపోతావ్ .  ఆడదాన్ని ఎప్పుడూ .. నాలుగు తంతే.. చెప్పినట్టు వాకిట్లో చెప్పులాగా పడి ఉంటది  అనే మిత్రుల వచనాలు బాగా తలకెక్కిన నర్సయ్య .  
 
ఇంట్లో అడ్డూ అదుపూ లేదు కదా .. నర్సయ్య ఇల్లే ముడుముక్కలాటకి అడ్డా అయింది.  అక్కడికే సీసాలు పార్సిల్ వస్తున్నాయి . 
 
భర్త గురించీ బర్రెల గురించీ ఆ నోటా ఈ నోటా విన్న పెంటమ్మ ఇక ఆగలేకపోయింది.  తను లేక పొతే మరింత ఆగమయిపోతున్న మొగుడిని తనే చక్క దిద్దుకోవాలనుకుంది.  బక్క చిక్కిపోతున్న బర్రెల్ని కాపాడుకోవాలనుకుంది. అనుకున్నదే తడవు అన్నదమ్ముల మాట , తల్లిదండ్రుల మాట ఎవరి మాటా లక్ష్య పెట్టక ఉన్నపళంగా పిల్లలని తీసుకుని తన ఇంటికి చేరింది. 
 
పెంటమ్మ రాకని గమనించిన బర్లు ఆనందంతో అరిచాయి.  వస్తూనే ఎండిపోయిన వాటి నోళ్ళు చూసి కాళీగా పోతున్న బజారు నల్లా నుండి నీళ్ళు తెచ్చి గోళెం నింపి వాటికి తాపింది.  ఇంట్లో అరుపులు .. ఖాళీ సీసాలు .. చిందరవందరగా ఉన్న సామాన్లు, పక్క దుప్పట్లు  చూసి అవాక్కయింది.  అనుకోని అతిధిలా వచ్చిన పెంటమ్మను చూసిన  వాళ్ళూ  అంతే …
చిన్న కూతురు ‘బాపూ.. ‘ అంటూ నర్సయ్య దగ్గరకి పరుగెత్తింది.  పెద్దది అల్లంత దూరానే నిలబడి చూస్తోంది బెరుకు బెరుగ్గా ..   ఒక్క క్షణం చిన్నదాన్ని దగ్గరకు తీసుకుని అంతలోనే .. దూరం జరుపుతూ  ‘పోయిన్రు గద .. మల్ల ఎందుకొచ్చిన్రు .. ‘ కోపంతో అని,  లోనికి అడుగుపెట్టిన పెంటమ్మ కేసి చూస్తూ ‘ఆగు’ అని గట్టిగా అరిచాడు.  మారు మాట్లాడకుండా లోనికి వెళ్ళింది  పెంటమ్మ. చేతిలో ఉన్న పేక ముక్కల్ని అక్కడ పడేసి లం …. అని బూతులు తిడుతూ జుట్టు పట్టి బయటికి లాగాడు. దబదబా చేతికి పనిచెప్పాడు. ‘అయ్యో ..  అమ్మని కొట్టకు బాపూ .. ‘అని అతని కాళ్ళకు చుట్టుకుంటూ బతిమలాడారు పిల్లలు. వాళ్ళని ఒక్క  తోపు తోశాడు. 
 
పెద్దపిల్ల తల వెళ్లి గోడకు తగిలి నుదిటిపై బుస్సున పొంగింది. సోమ్మసిల్లింది. చిన్నదానికి నీళ్ళు తెమ్మని పురమాయించి పిల్లని ఒళ్లోకి తీసుకుంది పెంటమ్మ.  ఏడుస్తూనే చిన్నది గ్లాసుతో తెచ్చిన నీళ్ళు పెద్ద  పిల్లపై  జల్లింది. నెమ్మదిగా ఆ పిల్లని లేపి కూర్చోపెట్టి మిగిలిన నీళ్ళు  తాగించింది. 
 
ఈ గందరగోళంలో అక్కడున్న వాళ్ళంతా నెమ్మదిగా జారుకున్నారు.  నర్సయ్య మాత్రం మిగిలాడు. అతనూ భార్యాపిల్లల్ని ఒక్క చూపు  చూసి తువ్వాలు దులిపి  భుజం మీద వేసుకుంటూ ఏమీ పట్టనట్లుగా నిర్లక్ష్యంగా బయటకు నడిచాడు.
 
 ‘అమ్మా..  బాపు మంచోడు కాదు మనం పోదాం ఈడ ఉండద్దు’ అంటూ తమతో తెచ్చిన చేతి సంచిని అందుకుంది చిన్న కూతురు కళ్ళు చెలిమలవుతుండగా. 
 
నర్సయ్యకి వాళ్ళు తిరిగి వచ్చినందుకు మనసులో సంతోషంగానే ఉంది.  తనకి చాలా పని తప్పుతుంది. బర్లు పాలిస్తాయి. చేతిలో పైసలు తిరుగుతాయని. కానీ మిత్రుల ముందు ఆ మాత్రం మగతనం చూపకపోతే ఎట్లా .. రేపు వాళ్ళు తనని ఎద్దేవా చేయరూ .. అని తన పనిని సమర్ధించుకున్నాడు. 
 
ఎన్నడూ లేని విధంగా ఉన్న అతని  ప్రవర్తనకి విస్తు పోయిన పెంటవ్వ మనసు ఆలోచిస్తోంది.  ఇక్కడ రోజూ ఇలాగే ఉంటే ఎట్లా .. తట్టుకోగలదా .. పిల్లలకింత తిండి పెట్టగలదా .. చేసిన కష్టం చేతికందుతుందా ప్రశ్నల చిక్కుముడులు సుడులు తిరుగుతుండగా … 
 
‘అవునమ్మా..  పోదాం.  బాపు మనని కొట్టి చంపేస్తడు .. ‘ భయం భయంగా పెద్ద కూతురు ..  ఇక అక్కడ నిలువలేక పోయింది. భర్త ఇదివరకూ అప్పుడప్పుడూ చేయి చేసుకున్నా ఇప్పటిలా లేదు అతని ప్రవర్తన. 
 
అక్కడ బడిలో వేద్దామంటే ఇక్కడ బడిలో కాయిదాలు కావాలని చెప్పారెవరో.  అందుకే తీసుకెళ్ళడానికి వచ్చింది పెంటవ్వ.  ఇవ్వలేదు. అందని మానిపండ్ల కోసం అర్రులు చాస్తవేందే.. పో.. పోయి  మీ ఆయన్ని పట్కరా పో అన్నాడు హెడ్మాస్టర్.  అందరూ ప్రైవేటు బడుల వేపు చూస్తున్న సమయంలో తమ బడిలో ఉన్న పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పంతుల్లదే కదా .. దానికి తోడు హెడ్ మాస్టర్ తో సహా నలుగురికి నర్సయ్య పట్టు పాలు పోస్తాడాయె.. . 
 
తను చదువుకుంటానంటే వినకుండా 7వ తరగతిలోనే పెళ్లి చేసిన తల్లిదండ్రుల్ని ఎన్ని సార్లు తిట్టుకుందో పెంటవ్వ.  తన బిడ్డలకు ఎంత కష్టమైనా పడి, ఎవరిని ఎదిరించైనా సరే బడికి పంపాలని , ఉద్యోగం వచ్చేలా చేయాలని వాళ్ళు పుట్టినప్పుడే నిర్ణయించుకుంది ఆమె.  
 
హోండా అక్టివా వేసుకుని బడికి వచ్చే పద్మా టీచర్ ని అలాగే చూసేది అబ్బురంగా. తన కూతుర్ని ఒకనాటికి అట్లా ఉండాలని మనసులో తలపోసేది.  అలాంటిది ఇప్పుడు టిసి ఇవ్వకుంటే ఎట్లా చదివించేది ? అందుకే హెడ్మాస్టర్ కాళ్ళా వేళ్ళా పడింది. అతను ససేమిరా అంటున్నాడు.

  ****                            ****
కడుపులోంచి గుండెలోంచి  పొంగి పొర్లుకొస్తున్న దుఃఖానికి  జుట్టు ముడివేసినట్లు.. పొంగి పారే అలుగుకు అడ్డుకట్ట వేసినట్లు వేయడానికి చాలా శ్రమ పడుతోంది ఆఫీసు రూం బయట బిక్కు బిక్కుమంటూ ఉన్న పెంటమ్మ .

‘ఇచ్చెయ్యండి సార్ .. ఎట్లాగు ఆ పిల్లలు తిరిగి వచ్చేతట్టు  లేరు ‘ పద్మా టీచర్ రికమెండ్ చేయబోయింది సీటులో కూర్చొన్న హెడ్ మాస్టర్ ని రిక్వెస్ట్ చేస్తూ . 
 
‘లేదు మేడం, మీకెర్కలేదు.   రేపు వాళ్ళ అయ్య మన మీదికొచ్చి గొడవ చేస్తడేమో .. ఎట్లా టిసి ఇచ్చిన్రని ‘ అన్నాడు రామానుజం 
‘పెళ్ళాం పిల్లలు తన కాళ్ళ కాడికి వస్తరని వాడు చూస్తాంటే, మీరేంది మేడం ఇచ్చెయ్యమంటున్నరు ‘ అప్పుడే ఆ రూంలోకి వస్తూ మరో పంతులు.

‘అతనికి పిల్లలెంతో .. ఆమెకీ అంతే కద .. మొన్న వచ్చినప్పుడు పిల్లలు చెప్పిన్రు.. అక్కడ్నే  ఉంటమని. ఈడికి రామని.   తండ్రి ఎప్పుడు పేకాట, తాగుడు బందుబెట్టి మునుపటి లెక్క మంచిగ ఉంటే అప్పుడు  వస్తరట’ చెప్పింది పద్మ
 
‘ఆ..  మీరు మరీనూ … వేలెడు లేరు. వాళ్ళంత పెద్ద మాటలా .. ? ‘ సాయంత్రం వెళ్ళిన దగ్గర నుండి పేకాట క్లబ్ లోనే కాలక్షేపం చేసే శంకర్ సార్ 
 
‘అతనైనా చెప్పొచ్చు గద .. గవన్నీ బందుబెట్టి  ఎప్పటిలెక్క పెళ్ళాం పిల్లల్ని మంచిగ చూసుకుంటనని .. బాధ్యతగ మెసుల్తనని .. ‘ పద్మ టీచర్ రెట్టిస్తూ 
 
‘మొన్నామధ్య ఆమె పిల్లల్ని తీసుకుని వస్తే తన్ని ఇంట్లోకి రానివ్వకుండా తగలేశాడట ‘ పెద్ద పిల్ల క్లాస్ పిల్లలు చెప్పిన విషయాన్ని చెప్పింది శకుంతల. 
‘ఏదో , మగాడన్నాక సవాలక్ష పనులు , వ్యాపకాలు ఉంటాయి . ఎప్పుడూ పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగుతారటండీ … ‘ దీర్ఘం దీశాడు చాక్ పీస్ అందుకుంటూ శంకర్. ‘ఏదో మొగుడూ పెళ్ళాలు గొడవపెట్టుకుని  నాలుగురోజులు దూరంగా ఉన్నంత మాత్రాన పిల్లలకు టిసి ఇచ్చి పంపించేస్తామా …?’ క్లాసుకు వెల్లబొతూ మిగతావాళ్ళ కేసి చూస్తూ  మళ్లీ అతనే
 
‘ఇప్పటికే వాళ్ళు బడికి రాక నాలుగు నెలలయితాంది.   ఆ పిల్లలు చదివేది ఆరు , నాలుగు తరగతులు.  వాటి కోసం ఇసుర్రాయోలె తిరుగుతోందామె.  మనకింత విలువనిచ్చి, పిల్లగాండ్లకింత చదువు నేర్పాల్నని.  ప్చ్ .. పాపం ‘ సానుభూతిగా అంది పద్మ  
 
‘టిసి , బోనోపైడ్ ఏది లేక పోయినా ఆ పిల్లల్ని వేరే బడిలో వేయొచ్చు. అది మీకూ తెలుసు గద సార్.  గదేదో ఇస్తేనే మన మర్యాద మనకుంటది గద ‘ శకుంతల తనూ మరో క్లాసుకు వెళ్ళడానికి ఉద్యుక్తమవుతూ మౌనంగా ఉన్న హెడ్మాస్టర్ కేసి తిరిగి.  అతనికి మండిపోతాంది.  ఆడాళ్ళు గద . ఆడిదానికే సపోర్టు చేస్తున్నరు అని మనసులో తిట్టుకుంటూ గోడ గడియారం కేసి చూశాడు.  అతని చూపులకర్ధం తెలిసిన ఆ టీచర్లు నెమ్మదిగా తమ తమ క్లాసులకేసి నడిచారు.
 
బయట ఉన్న పెంటమ్మ వారి  మాటలు విన్నదేమో .. ఆమెలో ఎక్కడ లేని శక్తి వచ్చింది.  అప్పటివరకూ కాళ్ళా వేళ్ళా పడి బతిమలాడిన ఆమె హెడ్ మాస్టర్ రూం లోకి సర్రున దూసుకొచ్చి ‘ ఏంది సారూ .. మగాడన్నంక సవాలక్ష పనులా .. పెళ్ళాం పిల్లలు రెక్కలు ముక్కలు చేసుకుంటే ఆ పైస చేతిలకు తీస్కోని కన్నూ మిన్నూ కానక తాగుతడా .. వావి వరుసలు మరచి కన్న బిడ్డని సూడకుంట  దాని పక్కన చేరి బెదిరిచ్చుడా .. చెప్పు సారూ … గియ్యేనా మగాడు జేసేటి పనులు ..? సదుసెప్పేటి సార్లకు నియతి ఉంటదనుకున్న..థూ .. ఆడిది పిల్లలతోని పరేషాన్ అయితాందని లేదు .. పిల్లలు సదుల్లేకుంట ఆగమయితరని లేదు .. దిమాక్ కరాబు జేసిన్నని తిట్టవట్టినవ్ ? నీకు దిమాకున్నదా..? పిల్లలు ఆనికే గాని నాగ్గాదా .. ?  హు .. పేనుకు పెత్తనమిత్తే నెత్తంతా గొరిగిందట ‘ రగులుతున్న గుండెలోంచి తూటాల్లా వస్తున్న మాటలకు తోడైన ఈటెల్లాంటి చూపులతో కడిగి పారేసింది.  తనేం చేయాలో అర్ధమయినట్లుగా వడి వడి అడుగులతో వెనుదిరిగింది. ఆమె వేస్తున్న ఒక్కో అడుగూ బలంగా .. పరదాలను చీల్చుకుంటూ కొత్త శక్తితో .. ఆ నడకలో తన కూతుళ్ళను చదివించుకోగలనన్న విశ్వాసం. ఆ నడకలో తల్లిగానే కాదు తండ్రిగా కూడా బాధ్యత నిర్వహించ గలనన్న ధీమా .. ఆ చూపులో ప్రపంచంలో ఏదైనా సాధించగలనన్న నమ్మకం.

క్లాసులోకి వెళ్ళబోతున్నపద్మ , శకుంతల టీచర్లు ఆశ్చర్యంతో వెనుదిరిగి అలుపెరుగని బాటసారిలా  సాగిపోతున్న  ఆమె కేసి అభిమానంగా చూస్తూ .. మనసులోనే అభినందిస్తూ ..

మట్టికొట్టుకుపోయిన ఆమె శరీరం పై పడిన వెలుతురు కిరణాలు సరికొత్త కాంతినిస్తూ .. వెలుగుల వెన్నెల పంచుతూ ..
వి. శాంతి ప్రబోధ  
Published in April 2015, Matruka

Tag Cloud

%d bloggers like this: