The greatest WordPress.com site in all the land!

Archive for the ‘kathalu’ Category

తన కోసం తాను 

ఉదయం ఆరుగంటలకే కాలింగ్ బెల్ మోగడంతో  ఏమిటీరోజు పనిమనిషి పద్మ అప్పుడే వచ్చేసిందే అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది మాధురి .
ఎదురుగా  చెల్లి మాలతి.
ఆమెకేసి కళ్లింతవిచేసుకుని విస్మయంగా చూసింది .  “ఏంటే ఉరుముల్లేని పిడుగులా  ఊడిపడ్డావ్ .  రాత్రి మాట్లాడినప్పుడు కూడా వస్తున్నట్టు  చెప్పనేలేదు” చెల్లి చేతిలోని బ్యాగ్ చూసి ఆశ్చర్యంగా అడిగింది మాధురి.
“ఏం.. నీ ఇంటికి రావడానికి కూడా ముందు చెప్పి పర్మిషన్ తీసుకుని రావాలా ..?” దబాయిస్తూ ఎదురు ప్రశ్న వేసి బాత్రూంలోకి దూరింది మాలతీ .
మొహం కడుక్కొచ్చిందేమో ఆమె మొఖమంతా తడితడిగా ఉంది . ఆ తడి చీర చెంగుతో అద్దుకోవడం చూసి టవల్ అందించింది మాధురి.
అక్కచేతిలోని టవల్ అందుకుని మొఖానికి అడ్డుకుంటూ  “అక్కా .. నాలో ఏమన్నా మార్పు కనిపిస్తోందా ” అకస్మాత్తుగా సూటిగా అక్క మొహంలోకి చూస్తూ అడిగింది.
దబ్బ పండులా మిసమిసలాడుతూ ఉండే చెల్లి ఇలా వేలాడిన తోటకూరలా  అయిపోయిందేమిటి?  మనసులో అనుకుంటూ కిచెన్లోకి నడుస్తూన్న మాధురి ఆగిపోయి  చెల్లినే అయోమయంగా చూస్తూ  “అదేం ప్రశ్నే ….”  అంది కానీ .. పాలిపోయినట్లున్న చెల్లెల్ని చూస్తే దిగులేసింది.
“అమ్మా,  నీలో చాలా మార్పు వచ్చింది . నువ్వు  ఇదివరకటి మా అమ్మలాగా లేవు .
నీలో కోపం , ఆవేశం , అసహనం  తొందరపాటు పెరిగిపోయాయి . నువ్వు చెప్పింది వినకపోతే వెంటనే వైల్డ్ గా  రియాక్ట్ అవుతున్నావ్  ” ఒక్క క్షణం ఆగి,  అయోమయంగా చూస్తున్న అక్కనే చూస్తూ “ఈ మాట నాది కాదు . స్నేహాది . దాదాపు రోజూ ఈ మాట నాకు దానినోట వినిపిస్తోంది. అక్క చెప్తున్నది నిజమేనంటాడు సౌహార్ద్. నీ మరిదిదీ వాళ్ళ మాటే . కాకపొతే స్నేహ చెప్పినట్లుగా పదే పదే ఆ విషయం చెప్పరు.  అంతే తేడా” లోపల నిక్షిప్తమైన అగ్నిపై నవ్వు పూత పూస్తూ అన్నది మాలతి .
చెల్లెలు నవ్వుతూనే చెప్పినా ఆ నవ్వులో జీవం ఉన్నట్టనిపించలేదు మాధురి  కళ్ళకి .  ప్రశాంతంగా ఉండేందుకు, దిగులు మేఘాల్ని తరిమేసేందుకు శతవిధాలా ప్రయత్నం చూస్తూ మాలతి.
చెల్లెలి కుటుంబంలో ఏదో జరిగింది . ఆమె మనసును బాగా గాయం చేసేదేదో జరిగింది .  లోలోన అగ్నిగుండాలే బద్దలవుతున్నట్టుగా ఉంది.  పైకి కన్పించనీకుండా పెదవులపై నవ్వులు పులుముకుని మాములుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది .
ఇద్దరమూ ఉండేది ఇదే సిటీ లో, చెరో మూల ఉత్తర దక్షిణాల్లా… ఎప్పుడూ ఇంత ప్రొద్దున రాలేదు .  వచ్చినా వాళ్ళాయనతోనే వస్తుంది .
ఇప్పుడిలా బాగ్ తో వచ్చిందంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని అనుకున్న మాధురి “నీకేమనిపిస్తోంది ?” చెల్లికేసి తిరిగి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎదురుప్రశ్న వేసింది.
 మొహంలో మారుతున్న భావాల్ని, రంగుల్ని కన్పించనీకుండా నొక్కిపెట్టిన పెదాల్ని వదిలి “ఏమో…  నాకేమయింది .. మామూలుగానే ఉన్నాగా .. “అంటూ భుజం ఎగురవేసి అక్కకేసి చూసే ధైర్యం చేయలేక కిందకి చూస్తూ అన్నది.
ఆ వెంటనే, “అయ్యో ఫోన్ ఎక్కడ పెట్టాను .. “అని వెతుక్కోవడం మొదలుపెట్టింది మాలతి .
ఆమె ఫోన్ కి రింగ్ చేసింది మాధురి.
“ఓ ఇక్కడే ఉంది” అంటూ ఫ్రిజ్ పై నుండి మొబైల్ చేతిలోకి తీసుకుని డైనింగ్ టేబుల్ కుర్చీ లాక్కుని కూర్చున్నది మాలతి .
ఉదయపు నీరెండ మీదపడుతుండగా “వాళ్ళు అన్ని సార్లు చెబుతున్నారంటే నిజంగానే ఏమన్నా తేడా వచ్చి ఉంటుంది . పెద్దవాళ్ళం అవుతున్నాం కదా .. మార్పులు సహజమే .. వచ్చాయేమో ..” సాలోచనగా అన్నది మాధురి
“లేదక్కా .. చూడు నేను మామూలుగానే ఉన్నాగా ..
నువ్వేమన్నా చెప్పు.. నా కయితే వాళ్ళ మాటల్తో నన్ను పిచ్చి దాన్నిగా మారుస్తున్నారనిపించింది” గొంతులో జీర అడ్డుతగులుతుండగా  అసహనంగా లేచి నిల్చుని అటూఇటూ కదులుతూ అన్నది మాలతి
చెల్లెలి భుజంపై ఆప్యాయంగా చేయి వేసి తట్టుతూ ఆమె చేతిని పట్టుకుని వచ్చి సోఫాలో కూర్చుంది మాధురి .  ఆమె ఒళ్ళో తల పెట్టుకుని ఒక్కసారిగా బావురుమంది మాలతి .  చెల్లెలు అట్లా ఏడుస్తుంటే మాధురికీ  దుఃఖం పొంగుకొచ్చింది .
అందర్లోకి చిన్నది మాలతి. చాలా గారాబంగా పెరిగింది . పెళ్ళై అత్తింటికి చేరాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కష్టాలు పడింది. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంది . ఏనాడూ నోరు తెరిచి తన కష్టాన్ని, బాధని చెప్పుకోలేదు . ఇట్లా గుండెపగిలి ఏడవను లేదు .  ఇప్పుడేంటి అంతా సుఖంగా , సజావుగా సాగిపోతున్న వేళ.. కొద్దీ క్షణాల తర్వాత తనను తాను సముదాయించుకుని చెల్లెలి బాధకి , దుఃఖానికి మూల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో పడింది మాధురి.
” ఛ .. ఛా .. ఏమిటే ..మరీ  చిన్న పిల్లల్లా .. ఆ పిచ్చిమాటలేంటి ? ” చిరుకోపంతో కసురుతూనే చెల్లెలి తలపై చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది.
అక్క  మొహంలోకి లిప్తపాటు అలా చూసి దీర్ఘశ్వాస వదిలి కళ్ళు తుడుచుకుంటూ పక్కకు ఒత్తిగిలింది మాలతి .
“మాలతీ … నువ్వు ఏదో బాధలో ఉన్నవని నాకు అర్ధమవుతున్నది .  అదేంటో ఈ అక్కదగ్గర కూడా చెప్పుకోలేవా .. అక్క నీకంత పరాయిదై పోయిందా .. ” నిష్ఠురమాడింది మాధురి. ఆ విధంగానైనా చెల్లిలోపల మరుగుతున్నదేదో బయటికి వస్తుందన్న ఆశతో .
ఆ తర్వాత ” అక్కాచెల్లెళ్ల బంధానికి అర్థమేముంది .. కష్టసమయాల్లో ఒకరికొకరు తోడవ్వకపోతే..
అమ్మ ఉంటే అమ్మకి చెప్పుకునేదానివి కాదా .. అమ్మ తర్వాత ఆ బాధ్యత నాదే కదా .. ” చెల్లెలి తల నిమురుతూ అనునయిస్తూ అన్నది మాధురి.
ఆ తర్వాత నెమ్మదిగా “నాకెవరున్నారు .. నువ్వు తప్ప .. అందుకేగా .. అక్కడ ఉండలేక నీదగ్గరకొచ్చింది ”  వెక్కుతూనే అన్నది మాలతి
“నేనేం మాట్లాడినా అందులో తప్పులు వెతకడమే స్నేహ పని .  నువ్వు మాట్లాడింది ఇది తప్పు . అది తప్పు .
ఇలా కాదు అలా మాట్లాడాలి . అలా ఉండాలి . ఇలా చెయ్యాలి అంటూ ఎప్పుడూ నాలో తప్పులు వెతకడం …  నాకు క్లాసులు పీకడమే దాని పని అయిపొయింది.
ఒకటి అని మరోటి  చెప్తున్నావ్ ..అంటుంది ఒకసారి . అడిగిన దానికి సూటిగా చేప్పకుండా  చుట్టూ తిప్పి ఏదేదో చెప్తున్నావ్  అంటూ విసుక్కుంటుంది మరోసారి.
పిల్లలిద్దరూ నాతో  మాట్లాడేదే తక్కువ.
ఎప్పుడయినా ఏదైనా మాట్లాడితే నా మాటల్లో ఎప్పుడూ తప్పులెన్నడమే, పూచిక పుల్లలాగా తీసిపడెయ్యడమే వాళ్ళ పనయిపోయింది .  సూటిగా జవాబులు చెప్పట్లేదు అంటుంది .
నిజం చెప్పాలంటే నాకు ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది . ఏమి తప్పులు తీస్తారోనని .
వాళ్ళతో మాట్లాడుతుంటేనే ఏదో తత్తరపాటు. పదాలు తొందరగా గుర్తురావు . ఒకటి అనబోయి ఒకటి అనేస్తున్నాను .  అది నాకూ తెలుస్తోంది .
ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను .  ఎక్కడలేని దిగులు వచ్చేస్తోంది . నిద్ర పట్టడం లేదు . ఒంటరితనం భరించలేకపోతున్నా . నిండా యాభైఏళ్లు లేవు.
ఇప్పుడే నా పరిస్థితి ఇట్లా ఉంటే ..
భవిష్యత్ ఇంకెంత భయంకరంగా మారుతుందో..  తలుచుకుంటే విపరీతమయిన ఆందోళన కలుగుతోంది.
నిద్రలేక నీరసం .. చేసే పనిమీద శ్రద్ధ పెట్టలేకపోతున్నా ..
ఒక్కోసారి పిల్లల్ని ఏమనలేక నన్ను నేనే హింసించుకోవడం లేదా నా కోపమంతా పనిమనిషిమీద చూపడం జరుగుతోంది .
అమ్మ కేమయింది ఉత్తగానే అరుస్తుంది . ఇట్లా అయితే ఈ ఇంట్లో పనిచేయడం నా వల్లకాదని అల్టిమేటం ఇచ్చింది పనిమనిషి .
బయట ఎవరూ  ఇంతవరకూ నాతో పిల్లలు చెప్పినట్లు చెప్పలేదు .
ఆ మాటే అంటే  బయటివాళ్లేందుకు చెప్తారు . నీ వాళ్ళం కాబట్టి , నీ మంచికోరేవాళ్ళం కాబట్టి మేం చెబుతాం అంటుంది స్నేహ.
ఆలోచిస్తే అదీ నిజమే అనిపిస్తుంది ”  చేతికున్న ఉంగరాన్ని అటూ ఇటూ తిప్పుతూ మాలతి అంతరంగాన్ని అక్కముందు  పరిచింది .
“అంటే .. స్నేహ  అంటున్నట్లు నిజంగా నీవు కూడా ఫీలవుతున్నావా .. నీలో మార్పు వచ్చిందని”  చెల్లెలి కళ్ళలోకి గుచ్చ్చి గుచ్చి చూస్తూ అడిగింది మాధురి.
“ఏమోనే .. అదే నాకేమీ అర్ధం కావడం లేదు” కొన్ని క్షణాలాగి  మళ్ళీ తానే
“పరిస్థితులను బట్టి, మారుతున్న వయసును బట్టి  నా భావోద్వేగాల్లో తేడా వస్తే వచ్చి ఉండొచ్చునేమో .. .
ప్రశాంతమైన జీవితం ఈ రోజుల్లో ఎవరికి ఉంటుంది చెప్పు . ప్రతివారికీ ఏదో ఒక ఆందోళన, వత్తిడి ఉంటుంది కదా ..
ఈ మధ్య నేను ఒంటరినైపోయినట్లుగా అన్పిస్తోంది. ఏం మాట్లాడినా పిల్లలది, వాళ్ళ నాన్నది ఒకే మాట . నన్ను వేరు చేసేస్తున్నారు . నేను పిలిస్తే ఒక్క అంగుళం కదలరు . పలకరు . అదే వాళ్ళ నాన్న పిలిస్తే ఏంటి నాన్నా..  అంటూ వెంటనే రెస్పాండ్ అవుతారు .
నేనంటే గౌరవం లేదు . నాకూ , నేను చేసే పనికీ  విలువేలేదు.
అటువంటి చోట నేనెందుకు ఉండాలి .. ఎన్నోరోజుల నుండి ఈ ప్రశ్న నన్ను వేధిస్తున్నది ..
చిన్నప్పుడు ఎంత ప్రేమగా ఉండేవారు . ప్రతిదీ నాతో పంచుకునే వారు. అప్పుడు వాళ్ళకి అమ్మే లోకం .  ప్రపంచపు రంగులు తెలియని అమాయకత్వం.
ఇప్పుడు వాళ్ళ ప్రపంచం పెద్దదైపోయింది. రంగు రంగుల లోకం ఇరవైనాలుగు గంటలూ ఇంట్లో ఉండే అమ్మకి ఏమి తెలుసూ .. ఏమీ తెలియదు .
అందుకే  వాళ్ళప్రపంచంలో అమ్మ స్థానం ఏమూలనో … రంగువెలిసిన బొమ్మలా ..
వాళ్ళ నాన్నసంపాదనకోసం, స్నేహితుల కోసం బయటి ప్రపంచంలో నలుగురితో తిరిగొస్తారు.  ఆయనకు చాలా విషయాలు తెలుసు . లోక జ్ఞానం తెలుసు అనుకుంటారు. అన్నిటికంటే ముందు తమకోసం కావలసినన్ని డబ్బులు ఇస్తారుగా అందుకే అయన ఏమి చెప్పినా వాళ్ళకి వేదవాక్కు .
వాళ్ళ దృష్టిలో నేనో కరివేపాకు.. ఇంకెందుకే .. నేనింకా ఆ ఇంట్లో ఉండడంలో అర్ధముందా .. చెప్పక్కా..
వాళ్ళ పద్దతి చూస్తే .. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది …  ” హృదయంలోని బాధ వడిపెడుతుండగా లేని నవ్వు పెదవుల చెదరనీకుండా అక్క కళ్ళలోకి చూస్తూ  అన్నది మాలతి
“అలా ఎందుకనుకుంటావే ..” అనునయంగా అన్నది మాధురి
“ఏం ఎందుకనుకోకూడదు ..?
అయినా ..  నీకేం తెల్సు .. వాళ్ళ ప్రవర్తన .. రోజూ నేనెంత వ్యధకు, రంపపుకోతకు గురవుతున్నానో .. వాళ్ళు చేసిన గాయాలు ఎలా సలుపుతుంటాయో..  ఎన్ని సార్లు నాలో నేను ఏడ్చుకుంటూ ఉన్నానో ..
ఇన్నాళ్ళు నన్ను నేను సమాధాన పరుచుకుంటూ వచ్చా.. గాయానికి పై పై పూత పూసుకుంటూ వచ్చా .. ఇక నా వల్లకాదు” గబగబా చెప్పింది .
ఆ వెంటనే “నీకూ తెలుసుగా .. మా పెళ్లినాటికి సతీష్ కి సరైన ఉద్యోగమే లేదాయె . నా ఉద్యోగంతోనే కదా సంసారాన్ని నడుపుకొచ్చింది. ఆ తర్వాత తనకి మంచి ఉద్యోగమే వచ్చినా టూరింగ్ జాబ్ . ఇంట్లో ఉండేది తక్కువ . అన్నీ నేనే చూసుకునేదాన్ని కదే …చివరికి వాళ్ళ అమ్మానాన్నలు .. చెల్లెళ్ళ పురుళ్ళు  అన్నీ నేనే కదే చేసింది .. ” చెల్లెలు తన ధోరణిలో చెప్పుకుపోతూన్నది .
నిజమే , చాలా ఇబ్బందులు పడింది. గుట్టుగా సంసారాన్ని ఉన్నంతలో బాగానే లాక్కొచ్చింది.  కానీ ఏనాడూ ఇట్లా బయటపడలేదు .  అన్ని ఒత్తిళ్ళనీ తట్టుకుని నిలబడింది .  గడ్డుకాలం దాటిపోయింది. హాయిగా ఉండాల్సిన సమయంలో ఇప్పుడేమిటో.. సమస్య
మధ్యలో సతీష్ ఆరోగ్యం దెబ్బతిని ఉద్యోగాన్నిహెడ్ ఆఫీసుకు మార్చుకున్నాడు .
పిల్లలూ కాలేజీలకు వచ్చారు. తాను డాక్టర్ కావాలని కలలు కని ఆర్ధిక పరిస్థితుల కారణంగా కాలేకపోయిన సతీష్ కి తన కొడుకు డాక్టర్ కావాలని కోరిక . అందుకోసం చెల్లెలు ఎంతకష్టపడిందో  తనకు తెలియనిది కాదు అనుకుంది మాధురి .
”  సౌహార్ద్ ని ట్యూషన్స్ కి ఎట్లా తిప్పానో ..  స్నేహని మ్యూజిక్ క్లాసులకూ , డాన్స్ క్లాసులకూ ఎలా తీసుకెళ్లానో .. వాళ్లకిష్టమైనవి చేయడం కోసం నేనెంత వదులుకున్నానో వాళ్లకేం తెల్సు  .. చెప్పినా ఇప్పుడు వాళ్ళకవేమీ  పట్టవు . అదొక విషయమే కాదు .
పిల్లలకీ వాళ్ళ నాన్నకు నేనో వ్యక్తిని ఇంట్లో ఉన్నాననే ధ్యాసే ఉండదు ..
ఏదో సందర్భంలో మీ కోసం నేనన్నీ వదులుకున్నానంటే ..
నిన్నెవరు చేయమన్నారు .. మేమేమన్నా నీ వెంటబడి తీసుకెళ్ళమన్నామా .. అన్నీ చేయమన్నామా.. ఎప్పుడూ ఏదో చదువుతూ ఉంటావు ..  అని కయ్ మంది స్నేహ .
రోజంతా ఇంట్లో ఉన్న నాతో వాళ్ళ అవసరాలకు తప్ప మాటలుండవు . నన్నొక మనిషిలాగా చూడరు .
వాళ్ళ నాన్నతో మాత్రం చాలా చాలా మాట్లాడతారు. జోకులేసుకుంటారు .. కలసి సినిమాలు చూస్తారు . వాటి గురించి చర్చించుకుంటారు ..
నేను మధ్యలో వెళ్తే నాకేమీ తెలియదని .. నా మాటల్లో .. చేతల్లో తప్పులు వెతుకుతారు ..
వేళకు తిండి తినరు. బయటి తిండి తినడమే గొప్ప అనుకుంటున్నారు .  నేను వాళ్ళకోసం వండిందంతా వృధా అవుతుంటే మనసు చివుక్కుమంటున్నది.
రాత్రి పగలు లేకుండా బయట తిరుగుళ్ళు .. చెప్తూనే ఉంటాను . వింటేగా .. పాత చింతకాయ పచ్చడి అంటారు
అసలే రోజులు బాగోలేవు . ఏ రోజు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలుసు .. ?
అలాంటప్పుడు సతీష్ వాళ్ళని కోప్పడొచ్చుగా ..
ఊహూ .. అలా చేయడు .. ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు .. మరి నాకు మండదా .. చెప్పక్కా ..
మళ్ళీ తనే .. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్ .. ఆ మాత్రం ఆడపిల్లకి నేర్పుకోలేవా.. అర్ధరాత్రి దాకా తిరిగొస్తుంటే చెప్పొద్దా ..  అంటాడు నీ మరిది .
కానీ తాను చెప్పడు . తండ్రే కదా .. చెప్పొచ్చు కదా .. ఊహూ .. అది చెయ్యడు ..
అది చెయ్యొద్దు .. ఇది చెయ్యొద్దు . అట్లా ఉండు , ఇట్లా ఉండు అని చెప్పి నేను చెడ్డదాన్నయిపోతున్నా ..
నా మాటలు వాళ్ళ బుర్రకెక్కవు .  చాదస్తపు మాటలకింద తీసి అవతల పడేస్తారు. “
“అయితే .. ” మాట పూర్తి కాకుండానే
” వాళ్ళ పనులు చేసిపెట్టే రోబోని కాదుగా… విలువలేని చోట , గౌరవించని చోట ఉండడం ఎంత కష్టమో ..ఎంత ఉక్కపోతగా ఉంటుందో నీకేం తెల్సు .. ? ఆ  గాయపు రంగులేమిటో లోతు ఎంతో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది.
రెక్కలు విరిగిన పక్షిలా గిలగిలా కొట్టుకుంటున్నానక్కా ..
అందుకే.. అక్కడి నుండి , వాళ్ళనుండి దూరంగా వచ్చేశాను . అప్పుడు వాళ్ళ కోసమే నా జీవితాన్ని ఇంటికి పరిమితం చేసుకున్నాను . కానీ ఇప్పుడు, జీవితం దశదిశా లేకుండా సాగిపోతుండడాన్ని భరించలేక పోతున్నాను.
విరిగిన రెక్కలను అతికించుకుని నన్ను నేను ఆవిష్కరించుకోవాలని, స్వేచ్చా విహంగంలా విహరించాలని తపన .. అందుకే నాకోసం నేనొచ్చేశా ..  “
“వచ్చేశావా ..?” అప్రయత్నంగా మాధురి నుండి
” అవును, వచ్చేసా ..  చచ్చి పోదామన్న ఆలోచనను అక్కడే సమాధిచేసి నా జాడని నేను వెతుక్కునే ప్రయత్నంలో ఆ ఇంట్లోంచి వచ్చేశా..
నేనిలా రావడం నీకు ఇష్టం లేదా .. కష్టంగా ఉందా, ఇబ్బందిగా ఉందా.. బరువయితే  చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను . లేదంటే ఏదో ఒక ఉద్యోగం దొరికే వరకూ ఇక్కడ నీతో ఉంటాను “.  నా కళ్ళలో నా జవాబు వెతుకుతున్నట్లుగా సూటిగా చూస్తూ ..  స్థిరంగా తన నిర్ణయాన్నినొక్కి చెప్పింది మాలతి.
తన చేయి చేతిలోకి తీసుకుని ఆత్మీయంగా నొక్కుతూ “మంచి పని చేసావ్ .. నీకు నేనున్నానన్న నమ్మకం ఉన్నందుకు సంతోషం .. దిగులు పడకు .
అన్నీ సర్దుకుంటాయి . ముందు స్థిమితపడవే .. . అన్ని విషయాలూ నింపాదిగా మాట్లాడుకుందాం ” అని బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసే మిషతో అక్కడ నుండి లేచింది మాధురి.
ఆ కాసేపటికే స్నేహ ఫోన్ ” అమ్మ..వచ్చిందా పెద్దమ్మా..” ఆ అడగడంలో ఎంతో కంగారు.. దుఃఖం పొంగుకొచ్చి మాట్లాడలేకపోయింది.
కూతురి చేతిలో ఫోన్ తీసుకుని “వదినా .. మాలతి అక్కడికి .. ” సతీష్ అడుగుతుండగా ..
“వచ్చింది. తాను మానసికంగా చాలా డిస్ట్రబడ్, డిప్రెస్డ్ గా ఉంది” .  నేను మళ్ళీ మాట్లాడతా ముక్తసరిగా చెప్పి కాల్ కట్ చేసింది మాధురి .
చెల్లెలు స్థితికి కారణమైన ఆ కుటుంబ సభ్యులపైన చాలా కోపంగా ఉంది మాధురికి.
తనకంటూ సెలవు దినం లేకుండా గడియారం ముల్లులా నిత్యం ఎవరికి ఏం కావాలో సమయానికి అమర్చిపెట్టడం తన బాధ్యతగా భావించే మాలతికి ఒక ప్రశంస ఇవ్వకగా ఆమె శ్రమకు విలువ ఇవ్వకపోగా  చిన్న చూపు చూడడం, చులకన చేయడం  .. చాలా కష్టంగా ఉంది మాధురికి.
ఆలోచిస్తున్నదామె .. ఈ సమస్య మాలతిది ఒక్కదానిదేనా ..
చాలా ఇళ్లలో గృహిణుల సమస్యే .. కాదు కాదు ఆడవాళ్ళ సమస్యే ..
ఇటు ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగబాధ్యతలతో సతమతమవుతూ నేనూ అనేకపాట్లు పడ్డదాన్నేగా…
చాలా మంది గృహిణులు నిరాశా నిస్పృహలతో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు ..  ఆందోళన కుంగుబాటు కు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు .
తోడికోడలు వాళ్ళ  అక్క ఈ మధ్య ఆత్మహత్య చేసుకుంది.
ఆవిడకిదేం పోయేకాలం అంటూ ముక్కున వేలేసుకున్నారు.  ఇట్లా చేసిందని అందరూ ఆశ్చర్యపోయారు.  ఆర్ధిక ఇబ్బందులు ఏమీ లేవు.  ముత్యాల్లాంటి పిల్లలు.  చక్కని సంసారం. నిండుకుండని కాళ్లతో తన్నేసుకుంది అనుకున్నారంతా . బహుశా .. ఆమె కూడా జీవితం పట్ల నిరాశా నిస్పృహలకు లోనై మానసికంగా కుంగిపోయి  అలా చేసుకొన్నదేమో…  ! అనేక సందేహాలు ..
చెల్లెలు ఏమి చేస్తున్నదోనని చూస్తూ ఫ్రిజ్ లో ఉన్న దోశ పిండి తీస్తున్నది మాధురి .
చేతిలో రిమోట్ పట్టుకుని ఛానెల్స్ అటూ ఇటూ తిప్పుతున్నది . ఏ ఒక్క ఛానెల్ చూడడంలేదు.  ఆమె చూపులు గోడపై ఉన్న పెయింటింగ్ పై ఆగాయి. తదేకంగా చూస్తున్నాయి.
అస్థిమితంగా ఉన్న మాలతిని ఆకట్టుకున్న పెయింటింగ్ కాలక్షేపం కోసం ఈ మధ్య మాధురి వేసిందే ..
మాలతికి చిన్నప్పుడు చిత్రకళలో ప్రవేశం ఉంది . కాలేజీ రోజుల్లో చాలా బహుమతులు అందుకున్నది.  ఆ తర్వాత ఉద్యోగం , పెళ్లి, సంసారజీవితంలో అన్నీ ఏ గంగలోకి కొట్టుకుపోయాయో …
భర్త , పిల్లలు ఆమె మొదటి ప్రాధాన్యతలో నిలవడంతో ఆమె వేసిన పెన్సిల్ ఆర్ట్ , పెయింటింగ్ , హ్యాండీ క్రాఫ్ట్స్ ఆసక్తులన్నీ వెనక్కి వెళ్లిపోయాయి.  కొంతకాలం చెల్లిని ఇక్కడే ఉంచుకుని జీవితం పట్ల నూతనోత్సాహం కలిగించాలి.
సతీష్ వస్తే .. వచ్చి బతిమాలితే .. వెళ్తుందా .. ఏమో .. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఆమె మాత్రమే .. ఆమె మనసు పొరల్లో ఏముందో ..
నా దగ్గర ఉన్నంత సేపూ చెల్లిని గతం చేసిన గాయాల నుండి బయటపడే మార్గాలు ఆలోచించాలని మాలతి గురించే ఆలోచిస్తున్నది మాధురి.
శరీరానికి అయిన గాయం కనిపిస్తుంది. దానికి సపర్యలూ జరుగుతాయి . కానీ మనసుకు అయిన గాయం పైకి ఏమీ కనిపించదు. లో లోపలే విస్తరిస్తూ గాయాన్ని మరింత పెంచుతుంది.  అది మనం గమనించలేం. గమనించినా దానికి తగిన వైద్యం చేయించాలని అస్సలు ఆలోచించం …
శరీరంలో మిగతా భాగాలకు లాగే మనసుకు తగిలే దెబ్బల్ని చికిత్స అవసరం.
నిజానికి,  ఈ సమయంలో కుటుంబ సభ్యులందరి సహకారం కావాలి.   వారి మధ్య ఉన్న అనుబంధం మరింత గట్టిబడాలి కానీ పలుచన కాకూడదు .
మాలతి మనసుకి అయిన గాయం చిన్నా చితకా గాయం కాదు. ఈ ఒక్కరోజుది కాదు. లోలోపలే రక్తమోడిన గాయం ఇప్పుడు పక్వానికొచ్చింది. ఆ పుండు పగిలి  డిప్రెషన్ కు లోనయింది. దానికి తోడు మోనోపాజ్ సమస్యలు.
మాలతి మామూలుగా అవ్వాలంటే అందరి సహకారం చాలా అవసరం . నచ్చచెప్పి ఇంటికి పంపడం కంటే కొంతకాలం ఇక్కడ ఉంచడమే ఉత్తమం.
మధురికి ఒకప్పుడు తన కుటుంబం ఇచ్చిన సహకారంతో మోనోపాజ్ సమస్యలనుండి బయటపడిన వైనం గుర్తొచ్చింది.  భర్త కాలంచేసినా, పిల్లలు విదేశాల్లో ఉన్నా ఒంటరినన్న దిగులు, అభద్రతాభావం లేకుండా ఆనందంగా గడిపేస్తున్నది.
మోనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్లలో హెచ్చు తగ్గులు మందులతో సవరించుకోవచ్చు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల డిప్రెషన్ కు లోనైన మాలతిని మామూలు మనిషిని చేయడం కొంత సున్నితమైన వ్యవహారమే కానీ తగ్గని, పరిష్కారం కాని సమస్య ఏమీ కాదు.
నిజానికి ఆ డిప్రెషన్ నుండి బయటపడే మార్గాలు మాలతి కూడా అన్వేషిస్తున్నదని స్పష్టమవుతున్నది.
కుటుంబం కోసం తన సర్వశక్తులూ ధారపోసే తల్లులు, అదే తమ లోకం అనుకునే తల్లులు తమదనుకున్న లోకం తమకు దూరంగా జరిగిపోతుంటే బెంబేలు పడిపోతుంటారు.  అదే సమయంలో తమను చేతకానివాళ్లుగా తీసిపడేస్తుంటే కుంగిపోతుంటారు. లోపలికి ముడుచుకు పోతుంటారు.
కానీ చెల్లెలు ఆ స్థితిని అధిగమించాలని ప్రయత్నించడం,  అందులో భాగంగానే ఇక్కడికి రావడం.. అంటే చెల్లెలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని సుస్పష్టం..
క్షణం తీరిక లేదు . చిల్లి గవ్వ ఆదాయం లేక చిన్నచూపుకు లోనవుతున్నానని భావించే ఉద్యోగ అన్వేషణలో పడింది. తన ఆత్మగౌరవం తాను కాపాడుకోవాలని తాపత్రయ పడుతున్నది. తనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలని ఆరాటపడుతున్నది.  తన అస్థిత్వాన్ని తాను నిరూపించుకోవడానికి ఘర్షణ పడుతున్నది .  అందుకు ఆమెను ఖచ్చితంగా అభినందించాల్సిందే ..
కొన్నాళ్ళు మాలతి ఆ ఇంట్లో లేకపోతే.. అప్పుడు తెలిసి వస్తుంది ఆమె ఏమిటో .. ఆమె విలువ ఏమిటో ..
మబ్బుల మాటున దాగిన వెన్నెల్లాటి వారి ప్రేమను ఒకరికొకరు అర్ధం చేసుకోవడానికి, వ్యక్తం చేసుకోవడానికి కొంత సమయం, సంయమనం అవసరం .  కాలమే వారి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.
ఈలోగా తన చెల్లి మానసిక పరిస్థితి, మోనోపాజ్ సమయంలో వచ్చే ఇబ్బందులు .. హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే ఇబ్బందులు , డిప్రెషన్ వంటి మానసిక అనారోగ్య సమస్యల గురించి వివరంగా సతీష్, స్నేహ, సౌహార్ద్ లకు తెలియజేయాలి.
నిండైన ఆత్మవిశ్వాసంతో మాలతి తన కుటుంబంతో ఆనందంగా ఉండడంతో పాటు, ఓ వ్యక్తిగా తనను తాను ఆవిష్కరించుకునే క్రమంలో చేతనయినంత తోడ్పాటు అందించాలని ఆలోచనలతో దోశప్లేటు చెల్లెలుకి అందించింది మాధురి.
వి . శాంతి ప్రబోధ

చెదిరిన చిత్రం చిగురిస్తుందా ..

‘మా బాపు  ఉద్యోగరీత్యా బదిలీ అయినప్పుడల్లా  నా మనసు ఎంత విలవిలలాడేదో ..
నా దోస్తులందరినీ వదిలిపోవాల్సి వచ్చినప్పుడల్లా  ఎంత ఏడ్చేదాన్నో  .. నిండు కుండ భళ్ళున బద్దలయినట్టు ఫీలయేదాన్ని’  చెప్పుకొచ్చింది  శివరాణి పక్కనున్న లీలా టీచర్ తో .

‘అవును మేడం . నేనింత పెద్దగయ్యిన్నా ..  నాకూ అదే దిగులు . అదే బాధ..
ఐదేళ్ల సంది ఉన్న బడిని ఒదిలొచ్చుడు మనసుకు ఎంత రపరపయిందో ఎట్ల జెప్పేది ..? ‘ కన్నబిడ్డలా ఆ బడిపై పెంచుకున్న మమకారాన్ని , అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ  కొద్దీ క్షణాలు ఆగి గట్టిగా ఊపిరి  పీల్చి వదిలింది లీల .
‘ ఆ..మేడం,  నేను స్కూల్ గురించి విన్న.  దాని అభివృద్ధికి మీరు  చేసిన కృషి..   ఆ బడికి డివిజన్లో  వచ్చిన గుర్తింపు.. ‘  చుట్టూ పరుచుకున్న రకరకాల ఆకుపచ్చని షేడ్స్ తో కనిపించే  పచ్చని పంట పొలాలనే పరికించి చూస్తూ  శివరాణి .
‘ఆ బడిపిల్లలతో వారి తల్లిదండ్రులతో, ఊరితో  అనుబంధం ఒదిలి  దూరంగ ఇట్ల ఎన్నడైన ఎల్లిరావాల్నని  తెల్సినా …  ‘ నిట్టూర్చి, ఓ దీర్ఘ శ్వాస తర్వాత  మళ్ళీ తానే  ‘ ఆఊరితో.. ఊరోళ్ళతో నా సంబంధ బాంధవ్యాలు తెగిపోవు .  కొనసాగించవచ్చు .. కానీ… వీళ్ళ  పరిస్థితి అట్ల కాదుగద  మేడం . తరతరాల బంధమాయె.  ఆ అనుబంధాన్ని శాశ్వతంగ జలసమాధి చేయాల్సిందేననుకుంటుంటేనే  వేయి శూలాలు గుండెల్లో గుచ్చుకున్న బాధ… ‘ అంది లీల బడివైపు అడుగులు వేస్తూ ..
లీల మొహంలో కనిపిస్తున్న భావ వీచికల్ని చూసి ఈవిడ చాలా సున్నిత మనస్కురాలు అనుకుంది పక్కనే నడుస్తున్న శివరాణి .
రెండడుగులు వేసారోలేదో  ఐదో తరగతి చదివే సునీత  నాయనమ్మ  రాజవ్వ  కనబడి ‘నమస్తే మేడం .. ” శివరాణిని పలుకరించి ఎవరన్నట్లుగా లీలకేసి కళ్ళు చికిలించి చూస్తోంది .
‘ అంత మంచిదేనా .. ‘ పలుకరించింది. కానీ,  అడగవలసిన ప్రశ్న కాదేమోనని ఫీలయింది  శివరాణి.
‘ఏం మంచిగ ?
 గిదే.. మంచిగ .
మనసు మనాది తోటి  అడ్లు రాలిన కల్లమయ్యే … ఏంజేత్తం ?  అనుమాండ్ల కాడ దండలేస్కోని రోజొక్క గ్రూపు కుసుంటాన్నం .
గా.. పెద్దాయనకేమన్న దయొచ్చి దర్శనమయితడేమోనన్న ఆశతోని .. ‘ గొంతు గద్గదమవుతుండగా రాజవ్వ
అంతలో కర్ర కొట్టుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి వీళ్ళ దగ్గర ఆగిన ముదిమి జాలవ్వ  అందుకుని  ‘ఊరు వాడ వదిలి మమ్ముల ఊరపిచ్చుక లెక్క  పొమ్మంటే యాడికి  ఎగిరి బోతం..ఏడికో పోయిన ఆ కొత్త జాగల మాదేముంటది ? తాత ముత్తాతల కెల్లి  ఇంకా అంతకు ముంగట ఎన్ని జామాన్లు నడిచెనో ..
అసొంటి ఊరిది ..  రజాకార్ల జమానాల సుత గిట్ల లేకుండే ..
మా ఊరోళ్లే  ఆల్లను గుట్టల్లకు తరివి కొట్టిరి. గిప్పుడు గా రజకర్లోలె  మందకు మంద ఊరిమీదవడ్తిరి ..
ఏవేవో కమ్మలు ముంగటవెట్టి  నిశానీ ఏపిచ్చుకుంటిరి .  ఉరికి ఏమైతాందో … ‘  బోసినోటి జలవ్వ   లోపల పొంగి పొర్లతున్న దుఃఖపు నది తీవ్రతకు  గొంతు పెగలక  తడారినకళ్ళను  పైటచెంగు వెనకకు తోచేస్తూ  అక్కడే కూలబడిపోయింది .
‘ఈడ్నే పుట్టినం ఈ మట్టిలనే కడతెర్తం అనుకొంటిమి .. గిట్ల అంటరని ఎన్నడన్న కలగంటిమా .. ‘  నిట్టూర్చింది రాజవ్వ .

నిజమే, అది ఒట్టి ఊరేనా .. దానికెంతో చరిత్ర , వాళ్ళకెంతో గుర్తింపు ..వాళ్ళకో అస్తిత్వాన్నిచ్చిన స్థలం ..  ఆఊరితో , ఊరిజనంతో , చెట్టుచేమతో ,రాలురప్పలతో , చేనుచెల్కతో , ఆకుఅలుములతో , వాగువంకలతో  గుట్టలతో పిట్టలతో  పైరగాలితో పెనవేసుకున్న  అనుబంధం ..  ఎన్నెన్నో జ్ఞాపకాల సమాహారమే  ఊరు . మాఊరు , మాప్రాంతం , అనే ఆత్మగౌరవంతో పాటు ఎన్నిరకాల సెంటిమెంట్లు ఊరి చుట్టూ ముడిపడి ఉంటాయో ..   మనసులో తలపోసింది లీల

‘కళ్ళు తెరిచినా మూసుకున్నా  నా ఊరు  ఇక ఉండదన్నమాటలే చెవుల్ల జొర్రిగల్లెక్క తిర్గవట్టె .  ఊరు మునిగిపోతదన్న  ముచ్చట చెవుల బడ్డప్పటి  కెల్లి నా పానం గిప్పుడే ఉన్నదున్నట్టు పొతే మంచిగుండనిపియ్యవట్టే …  గిట్ల ఈ మట్టిల్నే కల్సిపోవాలె
.. మావంశపోల్లంతా గీ మట్టిలనే.. నన్నూ ఆడికే కొంటబొమ్మని దేవునికి మొరవెట్టుకుంటాన్న  ‘ అరవైఏళ్ల రాజవ్వ  ఆవేదన ఆ టీచరులిద్దరి గుండెని మెలితిప్పింది .

తన వాళ్ళ జీవితం ప్రవహించిన చోటే , ఆ శ్వాసలో శ్వాసై పోవాలనుకుంది..ఆమె కోరికతో తప్పులేదు కదా అనుకుంది శివరాణి
‘తెలంగాణా ప్రజల చరిత్రను కాపాడుకుందం, మనని మనం బద్రం చేసుకుందం అంటే మాస్తు కొట్లాడితిమి . పోరాడితిమి.. ఓట్లన్ని గుత్తవట్టినట్టు ఒక్కదిక్కే గుద్దితిమి .. మా రాజ్యం మాకొచ్చెనని సంబురాలు జేసుకుంటిమి.  కానీ ఇప్పుడు ..’. చచ్చిన శవంముందు కూర్చుని ఏడ్చినట్లు శోకం పెట్టింది  రాజవ్వ . కన్నీటి సముద్రమైన ఆమెను ఎలా సముదాయించాలో తెలియక తికమక పడ్డారు శివరాణి , లీలా టీచర్లు .
ఆమె దుఃఖం చూస్తుంటే  తనకే ఆబాధ, కష్టం  వఛ్చినట్లుగా హృదయంలోంచి దుఃఖం పొంగుకొచ్చి కనురెప్పల గుప్పిట్లో దాచుకున్న బిందువులు ఒక్కొక్కటి ఆమెకు తెలియకుండానే జారిపోతున్నాయి  లీల కళ్ళ నుండి .
అది చూసిన శివరాణి  ‘ మూడునెలల సంది  వినీవినీ మేము కొద్దిగా బండబారినం. మీరు కొత్త కదా .. అట్లనే
 ఉంటది  టీచర్ ‘ అంది
లంచ్ టైం ముగుస్తుండడంతో మౌనంగా స్కూల్ కేసి నడుస్తున్నారు టీచర్లిద్దరూ
.. వారి మనసు  మేఘావృతమై .. వారి భావోద్వేగాలు భారీ చినుకులై  కురుస్తుండగా  ఉదయం జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది  లీలకి .
 ***                                                          ***                                                  ***
హాజరు వేసుకొని  వెళ్ళిపోతున్న సుజల, కరిష్మా , పారిజాత , రజితలను పిలిచింది . నలుగురూ ఏడో తరగతి పిల్లలే .   వాళ్ళ  క్లాస్ టీచర్ తను .
అదేంటి అట్లా పోతున్నారు క్లాసులో కూర్చోకుండా అడిగింది    ‘మేడం ఒకళ్లకు అన్నం పెట్టాల్నంటే మరొకళ్ళకు బంద్ చెయ్యాలన్నా .. ‘ రజిత  ప్రశ్నబాణంలా దూసుకొచ్చింది .
తనేమడిగింది వాళ్ళేం చెబుతున్నారు  ఒక్క క్షణం లీలకు అయోమయంగా తోచింది .  ఆమె చూపుల్ని చూసి నలుగురూ ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకున్నారు
చీకటిని చీల్చే జవాబు ఏమన్నా వస్తుందేమోనని . ‘ చెప్పండి మేడం ‘ ఏమాత్రం సంకోచం లేకుండా రెట్టించింది  రజిత .
ఆ పిల్ల  సీమమిరపకాయలాగా కన్పించింది లీలా టీచర్ కళ్ళకి.
టీచర్ ఏమి చెబుతుందా అన్న ఆత్రుతతో చూస్తున్నారు నలుగురూ .. వారి వెనకే క్లాసులోంచి బయటికి పోబోయిన మిగతా విద్యార్థులూ  ఆగి చెవులు రిక్కించి నిల్చున్నారు.
‘ ఆకలి  ఎవరికైనా ఒకటే కదా ..  అందరి ఆకలీ తీరాలి .. . ‘  లీలా టీచర్ చెబుతున్నది ఇంకా పూర్తికాకుండానే
‘ ఒకళ్లకు ఆకలున్నదని , ఆపతున్నదని .. ఇంకొకళ్ళ నోటికాడి బువ్వ ఇగ్గుకబోయి ఆకలున్నోడి ముంగట పెడతారా  .. మరి  నోటిముందు కూడుపొతే ఈని ఆకలెట్ల తీరాలె …  ‘  సునామీ తీవ్రతతో కరిష్మా  ప్రశ్న దూసుకొచ్చింది
‘ఇదెక్కడి న్యాయమో తెలుస్త లేదు .. ‘ నరాలు పొంగుకొస్తుండగా పారిజాత
‘అక్కడ నాలుగు జిల్లాలల్ల రైతులకు కూడు బెట్టాల్నంటే ఈడ మాపొట్ట కొట్టాల్నా మేడం .. మేము రైతులం కాదా .. మేం మనుషులం కాదా .. మేడం ‘ భూగోళం అంచులు దాటేలా వాడిచూపులతో  రజిత లీలకేసి చూస్తూ

‘ మొన్నటిదాంక మన రాష్ట్రం మనదే .. మన కొలువులు మనకే .. మన మాట మనదే అని ఏమేమో చెప్తే నిజమనుకుంటిమి .. ఊరు ఊరంత ఓట్లేసి గెలిపిస్తే ..  కుప్పలు కుప్పలుగా అస్థిపంజరాలు పేరుస్తున్నరు … ‘ అంటూ వచ్చి అక్కడ నిలిచింది పదోతరగతి చదివే  ఈశ్వరి .

‘ మునిగిపోయే మీభూమి జాగలకు పైసలిస్తమని అంటున్నరు గద ..  మీరంతా ఎందుకింత బాధపడుతున్నరు’  వారి మనసులో విషయం తెలుసుకుందామని లీల ప్రశ్న

‘ ఆ..ఏమిస్తరు మేడం .. మెడకు తాడు బిగిచ్చి  గుడ్లు ముంగటికి పొడుచుకత్తాంటే నోరంత ఎండ్కబోయి గుండె గడబిడ అయితాంటే  బారాణాకు చారణ ఇస్తరా ..? ఏంజేస్కోను ? ‘  మట్టివాసన గుబాళించే ఈశ్వరి .

‘మేడం పైసలు కాదు భూములకు భూములు , ఇండ్లకు ఇండ్లు .. అన్ని ఇక్కడ మాకేమున్నాయో అవ్వన్నీ కొత్త జాగల ఇవ్వుమనున్రి ‘  సాలోచనగా సుజల

‘అయ్యన్నీ ఇచ్చిన బీ గాఊరు మన ఊరయితదావే …. మన శ్వాసలో ప్రవహించే ఈ ఊరి జ్ఞాపకాలు తెచ్చిస్తరా ..? మన మనసుకు అయిన గాయాలు మాన్పుతరా ‘ కొద్దిగా కసిరినట్లుగా  ఈశ్వరి

‘మిరపకాయల ఘాటుకంటే ఎక్కువ ఘాటుగా ఉన్నాయి మీ మాటలు ‘ వాతావరణం తేలిక చేసే ఉద్దేశంతో నవ్వుతూ అంది లీలా టీచర్ .
‘అవును , కడుపు నొప్పి , మంట ఉన్నోడికే ఆ బాధ తెలుస్తది .  మీకేం తెలుస్తది ..? ఇట్లనే నవ్వుతరు ..మాలోపటికి  తొంగి చూస్తే తెలుస్తది మా గోస ‘ సీరియస్ అంది ఈశ్వరి .
నిజమే .. మునిగేది గ్రామము.   వారి భూములూ ఇళ్ళు , వారి చుట్టూ ఉన్న జంతుజాలాలే కాదు.  వారి జ్ణాపకాలు …. ఒలిచిన కొద్దీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయే వారి జ్ఞాపకాలకు ఏ పరిహారం ఇవ్వగలరు ?  భవిష్యత్ పట్ల అందమైన కలలతో గుండె నిండా ఊహలతో ఉండాల్సిన పసివారి గుండెల్లో  ఎన్నెన్ని గాయాలు ..మోడువోయిన అలసత్వపు జాడలే ..  మౌనంగా తలపోస్తున్న లీలా టీచర్ ఆలోచనల్ని భంగపరుస్తూ

‘కడుపు నిండిన మాటలట్లనే ఉంటయ్ ..’ అని ఒకరంటే
‘మనని బండరాయో, మట్టి ముద్దనో అనుకుంటున్నరు .. ఏడ బడేస్తే ఆడ పడివుంటమని’ అంటూ మరొకరు అనుకుంటూ  ఒకరివెనుక ఒకరు అంతావెళ్లిపోయారు .
చూస్తే స్కూల్ దాదాపు ఖాళీ .  దూరంగా కన్పిస్తున్న ర్యాలీలో కలిశారు వాళ్లంతా.
వారి మాటలూ  చూపులూ లీలా టీచర్కు  ఎక్కడో గుచ్ఛుకుంటున్నాయి.    తననే ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది.  వాళ్ళు వెలుతురు పొట్లమేదో విప్పుతున్నట్లుగా తోస్తోంది.  తనలోకి తాను తొంగి చూసుకోవడం మొదలు పెట్టింది .
కొద్ది గంటల క్రితం వరకూ మల్లన్న సాగర్ రిజర్వాయర్ వస్తే నల్లగొండ జిల్లాలోని తమ భూములకు రేటు పెరుగుతుందని  ఆశపడింది తను .
రెండొందల ఎకరాల ఆసామి తన మేనమామ. ఆయన పొలాలన్నీ  ఈ ప్రాజెక్టు కింద పోతాయని అనుకున్నప్పుడు మార్కెట్ రేటు ఒకటైతే ప్రభుత్వం ఇచ్ఛే పరిహారం మరొకటి ఉంటుందని ఎంత దిగులు పడ్డారో .. ,  కాడెద్దులనే నమ్ముకుని బతికే వాళ్ళం ఏమైపోతామో ఎట్లా బతకాలో   అని అత్త ఎంత గగ్గోలు పెట్టిందో…అలాంటిది ఇప్పుడవి పొవట్లేదని తెలిసి చాలా సంతోషపడ్డారు అంతా .
వాళ్లన్నట్లు తనది కడుపు నిండిన బేరమే .. వాళ్ళ ఆకలి తనకేం తెలుసు .
***                                            ********                                       ***

ఎవరి ఆలోచనల్లో ఉండగానే  బడిలోకి వచ్చేసారు శివరాణి , లీలా టీచరులిద్దరూ .
‘ఏం మేడం .. ఏమంటున్నారు ‘హెడ్మాస్టర్  అడిగాడు
‘ఏం చెప్పాల్సార్ . వాళ్ళ  గోస గోస కాదు .  దుఃఖాన్ని దోసిళ్ళతో పట్టుకొచ్చిన . హృదయపు  బరువు ఎట్ల దింపుకోవాల్నో  తెలుస్తలేదు ‘ అంటూ
కుర్చీలో కొద్ది క్షణాలు కూర్చొని  లేచి క్లాసుకు వెళ్ళింది లీల.

క్లాసులో ఎవ్వరూ లేరు .  ఇంటర్వెల్ తర్వాత వెళ్లిన పిల్లలు తిరిగి రాలేదు .  ఆమె తిరిగొచ్చి స్టాఫ్ రూములో కూర్చుంది .  అప్పటికే  శివరాణి మరో ఇద్దరు సార్లు అక్కడ కూర్చొని ముచ్చట్లాడుతున్నారు .

‘తెలంగాణ కోసం కష్టపడ్డారన్న గౌరవం ఉండే .. అదంతా ఖరాబ్ జేసుకుంటుండు  ‘  కొద్దిగా  సానుభూతి , అభిమానం కలగలసి అన్నాడు వీళ్ళ  దగ్గరే కూర్చున్న  హెడ్మాస్టర్

‘ తాను తిన్న  తినకున్న ప్రపంచానికింత తిండి పెట్టేది భూమిని నమ్ముకున్న రైతన్ననే ..
ఆ రైతన్న సర్వం కోల్పోతుంటే అరకొర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాల్నని  చూస్తున్నారు .
ఆటగాళ్లకేమో పతకం తెచ్చారని పోటీలు పడి నజరానాలు ..’  గొణిగి మళ్ళీ  ఆయనే  ‘ దళితులకు ఏడు లక్షలకు ఎకరం భూమి
కొనిద్దామన్న ఎవ్వడు భూమి అమ్ముతలేదన్నోడు  యీళ్లకు ఎకరాకు ఐదారు లక్షలిద్దామంటున్నడు పేద్ద సార్ . ‘  కొంచెం వ్యంగ్యం  హిందీ సారు  గొంతులో .

‘అధికారంలో ఉన్నవాళ్ళకి పేద ప్రజలు కానరారు .  ఆనాడు బషీర్భాగ్ రైతులపై కాల్పులు .. ఈనాడు మన రాజ్యంలో మన రైతులపై కాల్పులు ..’ నిరసనగా శివరాణి గొంతు కలిపింది

అక్కడ కూర్చున్న పంతుళ్లు రాజకీయాల్లోకి దిగారు . శివరాణి బాగ్ లోంచి  ఆదివారం అనుబంధం తీసుకొని అందులో లీనమైంది .
లీల టేబుల్ పై ఉన్న పేపర్ అందుకుంది. ఏవీ బుర్రకెక్కడం లేదు .  కొద్ది సేపటిక్రితం హనుమాండ్ల దగ్గర కూర్చున్న వారి మాటలే గందరగోళంగా ఆమె మదిలో మెదులుతూ ఉన్నాయి .
***                 **                    **
‘వందల వేల ఎకరాలున్నోళ్లను గడ్డకు ఏసుకుంట మా నెత్తిమీద కొట్టుకుంట  బక్క పానాలను బొంద పెడ్తమంటున్నరు’  నడివయస్కుడు భుజంపై తువ్వాలు దులిపి మళ్ళీ వేసుకుంటూ
.
‘మీరందరు కల్సింటే అల్లేంది జేజమ్మలు తాతమ్మలు దిగొత్తరని అంటున్నరుగదనే ..  ‘అన్నది బీడీలు సుట్టుకుంట ఓ యువతి .
‘యాడిది .. వచ్చేసింది .. కుత్తుకల దాంకచ్చింది . ఇగ కాళ్లు లేత్తయ్ రా..  ఆగుల కొట్టుక పోతర్రా అని ఒకరొచ్చి అనవట్టె .. ఆ నాయకుడొత్తడు .. ఈ నాయకుడొత్తడు .. సచ్చినోల్లను  పరామర్శించేతందుకొచ్చినట్టొచ్చి పరామర్శించి పోతున్నరు.’ సోడాబుడ్డి అద్దాల తాత జవాబు
‘ ఉస్మాన్ బాషా , మహబూబ్ బాషా రాజరికం ఎలిన్నుంచి ఎట్టి కొట్టాలు  జేసి ఆరిజనులే కానీ ఎవరేగానీ మేము ఆడ కల్లాలు జేసుకుంట బావులు కాపాడుకుంట సులైమానయితే పట్టాలు జేసుకొని పిల్లల కెల్లి అందరు కష్టపడి జేసుకుంటిమి . అంత గీ ఏట్ల కలిపేతందుకా .. ? ‘ మరో వృద్ధుడి ఆవేదన

గ్రూపులో లోను లేపి, ఇసొంటోళ్ల అసొంటోళ్ల   తాన  పైసలు తెచ్చి బిడ్డ లగ్గం జెత్తి. కూలో నాలో జేసుకుంట బతుకుతుంటి …గ్రూపుల పైసలు కట్టమని మెడ మీన కత్తివెట్టె ..

ఇంటి  జాగకు పైసలిత్తరట .  ఆలిచ్చే పైసలు ఏటికొత్తయ్ .. ఇంట్ల ఎడ్డిపిల్ల ఉండే .. పదేన్నూర్లు  పింఛను వస్తది .  వేరే కాడికివోతే  పింఛనిత్తరా ..బతికుడెట్లా .. మూలిగే నక్కమీద తాటి పండు బడ్డట్టయింది ‘ వాపోతోంది ఓ నడివయసు ఒంటరి మహిళ
‘బరిబత్తల నిలవెట్టినట్టయ్యే .. ‘
‘ఏ ఊరికి బోయిన దొంగలమయితం . మనూర్ల మనమే  సర్దారులం .  పోయిన కాడ ఓరేషను కారట్ , ఆధార్ కారట్ , పింఛన్ ఏముంటాయో ఏముండయో .. మంచికి చెడుకి ఎవరెట్లయితరో .’ కలగూరగంపలాగా సాగున్నయి  మాటలు
‘గా భీంరావు పటేలు భూమి ఇచ్చిండట గద .. ?’ ఒకరి ప్రశ్న
‘ఆని భూమి జాగ ఉంటే తగులవెట్టు కోని  .. గానీ ఆ నిప్పు ఊరంతా ఆగంజేత్తే చూసుకుంట ఊకుంటమా .. ఊర్ల చిచ్చు బెట్టేటోన్ని తిరగగొడతం ఏర్కేనా ..?’ ఆ మాటల్లో పట్టుదల , కడుపులో బాధ , కళ్ళలో కసితో ఓ పడుచు జవాబు

పుట్టినూరిది . పెరిగినూరిది . మాఊరు మాకే గావాలె .. కష్టపడి బంగ్లాలు కట్టుకున్నం . ఎంత మంచిగ కట్టుకున్నం .. ఇయ్యన్నీ…   పన్నెండు ఆమడల తిరిగిన ఇంత సౌలట్ దొరుకుతదా .. ఇంతమంచి జనం , నీళ్లు సౌలత్ ..వదిలి  ఎట్లబోవాలె .. ఈ ఊర్లనే 6గురు కొడుకులను పెద్ద పెద్దోళ్ల పిల్లలెక్క జేసిన .  ఇదంత కాటికి ఒదిలి నేనెట్ల పోదును .. తిన్న కూడు సుతం పెయ్యికింకుతలేదు ‘  శోకం అందుకుంది కాలనిలో ఉండే మైసమ్మ . ఆమె వెనకే ఇంకొంతమంది .. పొట్టకూటికోసం , తమ అస్తిత్వం కోసం గమ్యం తెలియని దారుల్లో తప్పిపోయిన వాళ్ళలా ఉన్న వారిని  ఓదార్చబోయారు లీల , శివరాణిలు .

అంతలో ‘ .. నేను బయట బతుకుత ..ఊరంత అట్ల బతుకుతదా ..ఆగమై పోరా ..ఎప్పుడయినా ఎవడయినా బోయేదే .. బతికితే అందరం బతకాలె .. లేకుంటే అందరం ఆనీళ్లల్లనే బడిచావాలే .. అంతదాన్క  ఎత్తిన పిడికిలి. కలిపిన చేయ్యిడవొద్దు …  ‘ కూలిపోతున్న మానవత్వపు జెండా  సమున్నతంగా ఎగురవేస్తూ ఆ  గ్రామసర్పంచ్ . ఆ వెనకే మరి కొందరు పెద్దలూ ..
పోతరాజుల కొరడా చిందేసినట్లున్న వాతావరణం ఒక్కసారిగా  గంభీరంగా మారిపోయింది.

***                 ***                     ***

ఆ దృశ్యం లీలా టీచర్ కళ్ళముందు లీలగా కదలాడుతుండగా ..

మిలమిల మెరిసే వేగు చుక్కల్లా వారు  చరిత్ర పుటల్లో తమ పేజీకి రంగులద్దుతూ  జీవం పోస్తున్నట్లే  ..  బతుకమ్మను  సరికొత్తగా పేరుస్తున్నట్లే ,  ఆకురాలిన చెట్టుపై  పిట్టల చెదిరిన చిత్రాన్ని చిగురింప చేస్తున్నట్లే  తోచింది ఆమెకు

వి . శాంతి ప్రబోధ

Dasharathi smaraka poti Prize winning story . Published in Sopathi, Navathelangana Sunday magazine 30, April, 2017

అమ్మా … వెలుతురు కెరటం నీ సువర్ణ  

వాళ్ళు  చెప్పేది నిజమేనా .. ? నిజం కాదని ఎవరైనా చెప్తే ఎంత బాగుండునని  బస్ ఎక్కే లోపల ఎన్నిసార్లు అనుకుందో…  ఉరుములు మెరుపులు లేని ఆకాశం పిడుగుని వర్షించినట్లుగా ఉందా వార్త ఆమెకు .

కిటికీలోంచి కదిలిపోతున్న ఉషోదయ దృశ్యాలు ఆమెను ఏమాత్రం ఆకట్టుకోవడంలేదు .  అమ్మ మొఖమే సినిమా
రీలులా అటూ ఇటూ కదులుతూ ..
నా జీవితంలో కొత్త రాగాల్ని , రుచుల్ని పండించాలని ఎంతో ఆశపడింది  అమ్మ .. అవి ఫలించేలోపునే వెళ్లిపోయిందా .. అస్సలు నమ్మ బుద్ది కావడంలేదు.

అమ్మ .., నిజ్జంగా చనిపోయిందా .. ? అదెలా .. ఎలా సంభవం ?  నిన్నటివరకూ బాగానే ఉందిగా ..  రాత్రి పదిగంటల సమయంలో కూడా  మాట్లాడింది.   అవే అమ్మ చివరి మాటలు.
ఆ క్షణంలో తాను అనుకుందా..  తెల్లవారేసరికి పరిస్థితి తలకిందులవుతుందని ..?!
రేపు అందుకోబోయే గ్రూప్ వన్ ఫలితాలని తలుచుకుని అమ్మా  ఇకనుంచి మనకన్నీ మంచి రోజులే అంటే..
అవునే .. నిజమే కావచ్చు . సర్కారు  3 ఎకరాలు ఇస్తదట. ఊర్లోకి పోతే కచేరి కాడ అంటున్నరు .  కానీ నేను తీసుకోవద్దనుకుంటున్న అని మనసులో మాట చెప్పి హాయిగా నవ్వింది.
ఎందుకమ్మా అన్న ప్రశ్నకు  ఇయ్యాల్నో రేపో నా బిడ్డ సర్కారీ నౌకరీలకు ఎక్కుతది కదా .. ఆ భూమి ఇంకెవరికన్నా అక్కర్ల ఉన్నోళ్లకు ఇత్తరని మరోసారి నవ్వుతూ వివరించింది.
ఏమీ చదువుకోని అమ్మ ఎంత సంస్కారయుతంగా , బాధ్యతగా ఆలోచించింది ?  .. వెయ్యిమైళ్ళ వేగంతో  చెలరేగే ఆలోచనల నడుమ చేతిలో ఫోన్ మోగడాన్నే గమనించడం లేదు సువర్ణ.
అది చూసింది శారద.  వెంటనే సువర్ణ  చేతిలోని  మొబైల్  నెమ్మదిగా తన చేతిలోకి తీసుకుని ఇప్పుడే బస్సెక్కాము.
అవతల నుండి ఏమన్నారో కానీ .. ఈ పరిస్థితిలో ఒక్క దాన్ని ఎట్లా పంపిస్తామండీ ..  మీరు కంగారు పడకండి సువర్ణని నేను వెంటబెట్టుకుని వస్తున్నాను అంటూ  నెమ్మదిగా అవతల ఉన్న వాళ్ళకి చెప్పింది శారద .

శారద మాటలేవీ చెవికెక్కని సువర్ణకి రాత్రి అమ్మ ఫోన్ చేసినప్పటి మాటలే వినిపిస్తున్నాయి.!
అమ్మ ఇంకా ఏదో మాట్లాడబోయింది. తనే కట్ చేసింది రేపు మాట్లాడుకుందాం అమ్మా నిద్రొస్తోంది అని చెప్పి .  లేకపోతే అమ్మ ఏం చెప్పేదో ..

వర్షాకాలంలో సుడిగాలిలా .. ఏమిటిది ? ఆశల పల్లకిలో ఊరేగుతున్న సమయాన పడమటి సూరీడు తూరుపు దిక్కు చేరకుండానే అమ్మ కానరానిలోకాలకు తరలి పోయిందని వార్త . నమ్మ లేకపోయింది.  అసలే నమ్మలేకపోతోంది. అమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయింది అంటున్నారు.  సన్నగా ఎండిపోయిన పుల్లలాగా ఉండే అమ్మకి హార్ట్ ఎటాక్ రావడం ఏంటి ?

సువర్ణ హృదయం బాధతో మెలిపెడుతోంది.  ఎక్కడో చిన్ని ఆశ మినుకు మినుకు మంటూ .. అమ్మకి ఏమీ కాలేదని వార్త ఈ ఫోను మోసుకురాకపోతుందా అనిపించి ఆశగా మొబైల్ వైపుచూసింది . మళ్ళీ  మళ్ళీ  అవే ప్రశ్నలు అలల సమూహంలా ఒకదాని వెంట ఒకటి  చేరి రొదపెడుతూ .. ఆమె ఎక్కిన నాన్ స్టాప్ బస్సు వేగం కంటే ఎన్నో రెట్ల వేగంతో పరుగులు పెడుతూ  సాగుతున్నాయి సువర్ణ  ఆలోచనలు .

పాలిపోయిన ఆమె కంటి నుండి చుక్క నీరు కారడం లేదు కానీ హృదయంలోనే ఆమె దుఃఖిస్తున్న తీరు శారదని కలచివేసింది.   శారద, సువర్ణలు ఒకే పిజి హాస్టల్ లో , ఒకే రూంలో ఉండడం వరకూ మాత్రమే వారి పరిచయం. వ్యక్తిగత విషయాలు పంచుకునేంత దగ్గరతనం , స్నేహం లేవు . ఎవరి లక్ష్యాలని చేరుకునే ప్రయత్నంలో వాళ్ళు  తీరిక లేకుండా  ఉండడం వల్లనో .. తమకు తాము ఏర్పాటు చేసుకున్న చట్రంలో బందీలుగా ఉండడం వల్లనో , వయస్సులో వ్యత్యాసం వల్లనో కానీ వారి మధ్య పెద్దగా  స్నేహం పెరగలేదు.  మంచి నిద్రలో ఉండగా సువర్ణ ఫోన్ శారదని డిస్ట్రబ్ చేసింది.  విషయం తెలిసి ఆ పరిస్థితుల్లో ఒంటరిగా పంపించడం ఇష్టం లేక సువర్ణ వద్దన్నా తనూ బయలుదేరింది శారద.

కళ్ళు మూసుకుని కణతల దగ్గర ఒత్తుకుంటున్న సువర్ణని చూసి  శారద నెమ్మదిగా భుజం తట్టింది.  పొడారిపోతున్న ఆమె పెదాలు గమనించి కొంచెం నీళ్ళు తాగమంటూ వాటర్ బాటిల్ మూత తీసి తాగించబోయింది శారద.  వద్దంటూ కొద్దిగా కదిలి తిరిగి కళ్ళు మూసుకుంది సువర్ణ.

వారి వెనక సీట్లో పసిపాప ఎందుకో గుక్కపట్టి ఏడుస్తూ ఆమె ఆలోచనలకి భంగం కలిగిస్తూ .. బహుశా ఆకలేసిందేమో .. పాలసీసా తెచ్చుకోవడం తెలీదా ఆ బిడ్డ తండ్రి భార్యని కసురుకుంటున్నాడు. తెచ్చా.. ఆ బ్యాగ్ మీరు పైన పెట్టారు .  కొద్ది దూరంలో వెళ్తున్న ట్రైన్ చూపుతూ ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తూనే భయపడుతూ నెమ్మదిగా చెప్పింది తల్లి. ఆ పీల గొంతులో అతనంటే ఉన్న భయం స్పష్టంగా తెలుస్తోంది.  ఆ ముక్క ముందేడ్వోచ్చుగా .. గర్జించాడు  భర్త .  కొద్దిగా ఆ చారల బ్యాగ్ తీసిస్తారా .. భయం భయంగా  నసిగినట్లుగా ఆమె ..  తల్లి అందించిన స్తన్యం తన ఆకలి తీర్చలేదేమో పాప ఓ క్షణం ఏడుపు ఆపి మళ్ళీ గట్టిగా గొంతు పెంచింది . పాల కోసం తడుము కుంటూనే ఉంది .  అపుడప్పుడే వస్తున్న పళ్ళతో పాప కసిగా కొరికిందేమో .. అబ్బా .. అని బాధ పంటికింద నొక్కి  పెట్టింది తల్లి. అదేమీ పట్టనట్టే  కూర్చున్నాడతను మొహం విసుగ్గా పెట్టి .  లేచి పైన పెట్టిన బ్యాగ్ తీసే ప్రయత్నం చేయకపోవడంతో నిస్సహాయంగా అతనికేసి చూసింది ఆ యువతి.   అతను అదేమీ పట్టనట్టు ఉండడంతో చంకలో బిడ్డతోసహా తానే లేవబోయింది.

బిడ్డ గుక్కపట్టి ఏడుస్తంటే అట్లా కసురుకుంటావేమయ్యా .. లేచి ఆ సంచీ ఇవ్వరాదు..కొద్దిగా గట్టిగానే అంది వాళ్ళ వెనక సీటులో ఉన్న నడివయస్సు స్త్రీ .  ఒక్క క్షణం ఆవిడ కెసి తీక్షణంగా చూసి  మౌనంగా లేచి సంచి భార్యకి అందించాడు .  పాలసీసా నోటికందగానే పాప ఏడుపాగిపోయింది.

హైదరాబాద్ నిజామాబాద్ బస్సు వేగంగా కదులుతోంది . ఆ బస్సుకంటే వేగంగా కదులుతున్నాయి సువర్ణకి అమ్మ జ్ఞాపకాలు . ఈ  అమ్మ లాగే తన తల్లీ నా కంట తడి రానీయలేదు. తనకోసం అమ్మ ఎన్ని కష్టాలు పడింది . ఎన్నెన్ని అవమానాలు భరించింది . సంప్రదాయం ముసుగులో చీమూ నెత్తురూ లేని పరాన్నబుక్కులు లూటీ చేసిన తన శరీరంలాగా, ఆమె జీవితపు పత్రహరితాన్ని పీల్చేసిన పురుగుల బారిన  కన్నబిడ్డ పడకూడని ఆరాటపడింది. జాగ్రత్త పడింది.  ఆ జీవితం తాలుకు ఛాయలుపడని హాస్టల్ లో ఉంచి చదివించింది. తన బతుకు నాకు తెలియకూడని అనుకుంది.

సువర్ణ చేతిలో ఫోన్ బీప్ శబ్దం చేసింది . చూడకుండానే శారద చేతికిచ్చింది.  ఆమె మెసేజ్ ఏదో వచ్సినట్లుందని  చూసి ఏదో ప్రమోషన్ మెసేజ్ అని అట్లాగే పట్టుకుంది .  మళ్ళీ తల్లి తలపుల్లోకి పోతున్న సువర్ణ కి అంతరాయం కలిగిస్తూ ముందు సీట్లోంచి వినిపిస్తున్నాయి మాటలు .

నాకు ఈ రోజు సెలవు పెట్టడానికి కుదరదు .  తప్పని సరిగా ఫీల్డ్ విజిట్ కి పోవాలి .  బతిమాలుతునట్లుగా ఆమె గొంతుకలో.   నువ్వు  ఇంట్లో ఉన్నావని నన్ను సెలవు పెట్టమనడం బాగోలేదు హరీ .. అట్లా అయితే జాబ్ మానేస్తాలే ……. , అది  కుదరదంటే ఎలా .. నాకేమన్నా సరదానా .. నాలిగింటికి లేచి వండి వార్చి ఊరు నిద్రలేవకుండానే హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని బయటపడడం ‘ ఆమె గొంతు పదును దేరుతోంది   అవతల్నించి ఏమన్నాడో గానీ ఫోన్ గొంతు నొక్కి  బ్యాగ్లో పడేసింది .  హాయిగా , విశ్రాంతిగా , ఆనందంగా బతకాలని ఎవరికుండదు ?  ఈ మగాళ్ళకి పెళ్ళాం తెచ్చే జీతం కావాలి. అన్నీ అతని చెప్పు చేతుల్లో నడవాలి.  ఆఖరికి  ఆమె ఉద్యోగం కూడా అతని కనుసన్నల్లోనే చేయాలి ..గొణుక్కుంటోంది  ఆ స్త్రీ .

ఆ మాటలు సువర్ణ చెవిన పడ్డాయి.  తాను చూసిన ఆడవాళ్ళలో చాలామందిని కట్టుకున్న భర్త, తండ్రి , అన్న తమ్ముడు , కొడుకు ఎవరో ఒకరు హక్కుగా అజమాయిషీ చేస్తారు.  కానీ తన తల్లి పరిస్థితి అది కాదే ..
చెడ్డీ వేసుకున్న ప్రతి మగాడూ … ఎట్లా భరించిందో అమ్మ ..  జీరబోయిన  గుండె గొంతుకలోంచి ఎగిసిపడే దుఃఖాన్ని అదిమిపడుతూ ఆది కనిపించనీయకుండా  చేసేప్రయత్నంగా కిటికీలోంచి బయటకు మొహం పెట్టింది  సువర్ణ .

కొద్ధి క్షణాల అనంతరం శారదతో ఏదో చెప్పబోయి  అటు తిరిగి ఆగిపోయింది సువర్ణ .
అవతల పక్క సీటులోని నడివయస్కుడు శారదనే  తదేకంగా కొరికి తినేసేలా చూస్తున్నాడు. అది గమనించిన శారద అతన్ని చుర చురా కాల్చేసేలా చూసి చేతిలోని దినపత్రికలో మొహం దూర్చింది.
‘ఎవరైనా నన్ను అలా చూస్తే అమ్మ రగిలిపోయేది’ సువర్ణ మనసులో మాట అప్రయత్నంగా పైకి  తన్నుకొ చ్చేసింది .

విస్మయంగా పేపర్లోంచి తల తిప్పి సువర్ణకేసి చూసిన శారద ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని  ఆత్మీయ స్పర్శ అందించింది.  సువర్ణ మనస్థితి అమ్మచుట్టూరా తిరుగుతోందని అర్ధం చేసుకుంది.  అదిమి పెట్టిన ఆమె దుఖాన్ని బయటికి తెచ్చే అవుట్ లెట్ కావాలి.   ఒక్క సారిగా బద్దలయిందంటే ఆమెని ఆపడం తన తరం కాదని భావించిన శారద ‘ ఇంకా ..’ అంది .

‘ఎదుగుతున్న క్రమంలో నన్ను ఇతరులు చూసే దృష్టి అమ్మని చాలా కలవర పరిచేది .  కాలేజిలో  సామాజికాంశాలపై ఊరూరు తిరిగి వీధినాటకాలు వేసేదాన్ని . అది అమ్మకు అస్సలు నచ్చేది కాదు.  బహుశా ఆడామగా కలిసి ఒకే బృందంగా వెళ్ళడం వల్ల కావచ్చు .  ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలిస్తున్నానని ఓ రోజు చాలా పెద్ద గొడవపెట్టుకుంది. బాగా చదువుకుని నీడ పట్టున ఉద్యోగం చేసుకుంటావనుకుంటే ఈ తిరుగుళ్ళు ఏమిటి ? అంటూ బాధపడింది . నేను తప్పు పని చేయడంలేదని అందరికీ మంచి జరగడంకోసమేనని ఎంతచెప్పినా ఆమెకు అది ఎక్కలేదు . నన్ను ఎంతో స్వేచ్చగా పెంచిన అమ్మ  ప్రవర్తన నాకెంతో ఆశ్చర్యం గాను కొత్తగానూ అనిపించి అదే అడిగాను .  నేను చేసే పని మంచిది కాదని ఆమె ఖఛ్చితమైన అభిప్రాయం .   నాకు నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించింది.  గొడవ పడింది . అమ్మ అంత గట్టిగా వాదించడం , నా ఆలోచనని, పనిని  సరిచేయాలని ప్రయత్నించడం  నా జీవితంలో అది రెండోసారి  ‘ బయటకు దీర్ఘంగా చూస్తూ చెప్పింది సువర్ణ

‘అవునా ..?’  శారద ప్రశ్నార్ధకం
ఒకసారి దీర్ఘ శ్వాస  తీసుకుని వదలుతూ  ‘అవును, నా కులంలో చాలా మంది ఆడపిల్లలాగా నేనెప్పుడూ లేను. అందుకు భిన్నంగా పెంచింది అమ్మ.  బుడిబుడి నడకల నన్ను చదువుల తల్లి ఒడిలో చేర్చింది.  ఊళ్ళో  నాతోటివాళ్ళు  తమ్ముళ్ళను సాకుతూనో , కడవలతో నీళ్ళు మోస్తునో , బండెడు చాకిరీ చేస్తునో , అడివికిపోయి కట్టెలు తెస్తూనో .. ఉంటే .. నేను మాత్రం అలా కాదు.
సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి పొరిగింటి రాజమణి తో కల్సి  కట్టెలకు పోయాను.  అమ్మకి పని భారం తగ్గిద్దామనే ఉద్దేశంతో . అందుకు అమ్మ సంతోషపడలేదు సరికదా చెడామడా తిట్టింది. అమ్మ ఎప్పుడూ అట్లా తిట్టలేదు.  ఎందుకట్లా చేసిందో చాలా సేపు అర్ధం కాలేదు. అమ్మ కోపం తగ్గాక సారీ చెప్పి , మన చుట్టుపక్కల ఆడపిల్లలంతా రోజూ చేస్తున్న పనేకదా .. వర్షాలు దగ్గరపడుతున్నాయ్ .  పొయ్యిలో కట్టెలు లేవు . నీకు కష్టం కావద్దని , సాయం చేద్దామని  నేను వాళ్ళతో పాటు వెళ్తే  తప్పేమిటన్న నా  ప్రశ్నకు  ‘మనసొంటి మాదిగోళ్ళ  ఆడపిల్లలపై అచ్చోసిన ఆంబోతుల్లెక్క తిరిగేటోల్ల కళ్ళు, పడతయ్ బిడ్డా …  మనసొంటి ఆడోల్లని చెరబట్టే కీచక మూకలు  అవకాశం కోసం ఎదురు చూస్తనే ఉంటయ్ బిడ్డా ..జర బద్రం ..  ఊర్ల పెరిగిన పిల్లలకు ఎవరెసొంటోల్లో అంతో ఇంతో ఎర్కుంటది. నువ్వా  సుడాబోతే పట్నం పిల్లలెక్క , పెద్దిండ్లల్ల పిల్ల లెక్క సక్కదనాం ముంటివి. ఈ గుడిసెల్ల కాపాడుడు నాతోని అయితదా .. గందుకే మందిలకు పోకు’ అని విశదపరిచింది.  ఆనాడు అమ్మ మాటలు అర్ధమయ్యి అవనట్లుగా ..  అంతగా పట్టించుకోలేదు కూడా .  ఇప్పుడాలోచిస్తుంటే ఎర్నాకులంలో న్యాయ విద్యార్థిని జిషకి జరిగిన అన్యాయం తెలిసిన తర్వాత గానీ నేను రియలైజ్ అవలేదు ఆనాడు అమ్మ ఎందుకంతగా చెప్పిందో ..  అంటూ శారద మొహంలోకి  ఓ క్షణం అలా  చూసి చూపు తిప్పుకుంటూ

‘గర్భ దరిద్రంలో  మోసిన బరువుల మోత, రంపపు కోత అనుభవించిన అమ్మ అంతకు మించి లాలిత్యంతో ఎలా చెప్పగలదు ?  ఏ గుడ్లగూబ ఆబగా కబళిస్తుందో నన్న భయంతో  తల్లి కోడి  రెక్కల కింద పిల్లను దాచుకునే ప్రయత్నం ఆమెదని అర్ధం చేసుకునే వయసు కాదు నాదప్పుడు .’ అంటూ చెప్పడం ఆపి సీరియస్ గా  వింటున్న శారద మోహంలో భావాల్ని చదవడానికి ప్రయత్నం చేస్తోంది సువర్ణ .

తర్వాత  అన్నట్లు చూస్తున్న శారద తన చేతిలోని సువర్ణ చేతిని నెమ్మదిగా వదిలి  గాలికి  చెల్లాచెదురవుతున్న సువర్ణ  జుట్టుని సవరించింది.   ఆ చర్య  తల్లి ఆత్మీయ స్పర్శ  పొందిన ఫీలింగ్ కలిగించింది సువర్ణకి .  శారద భుజంపై తల వాల్చిందల్లా  లేచి చిన్నపిల్లలా శారద మొహంలోకి చూసింది . శారద ఆమె తలను తన ఒడిలోకి తీసుకుంది . చెమర్చిన కళ్ళు  కనిపించనీయకుండా  ఓక్షణం కళ్ళు మూసి తెరిచింది సువర్ణ . ఎంత వద్దన్నా ఓ కన్నీటి చుక్క ఆమె కనుకొలుకుల్లోంచి  పక్కకు జారింది.
నెమ్మదిగా మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది .   ట్రాన్స్ లో మాట్లాడుతున్నట్లుగా ఉంది ఆమె తీరు చూస్తుంటే .

నా ఇంటర్ ఎగ్జామ్స్ ముందు జరిగిన సంఘటన అమ్మని ఎంత ఆందోళనకు గురి చేసిందో .. చిగురుటాకులా వణికిపోయింది .
ఏమైంది ? శారద కళ్ళతోనే ప్రశ్నించింది

‘ ఇంటర్ ఎగ్జామ్స్ లో   సాధారణంగా వచ్చే ముఖ్యమైన  ప్రశ్నలు చెప్తానని  చెప్పి మేకతోలు కప్పుకున్న తోడేలు లెక్చరర్  లైంగిక దాడికి పాల్పడడంతో అతన్ని ఎదుర్కుంటున్న క్రమంలో అతను అన్న మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి .

‘ ఏమిటే .. అంత నీల్గు తున్నావు ?  పత్తిత్తయినట్టు .. అయ్యేవడో తెల్వకుండా పుట్టినదానివి .. అంటూ సైంధవుడిలా వెంటపడి దుర్భాష లాడినప్పుడు ఆ క్షణంలో వచ్చిన ఆవేశంతో లెక్చరర్ అనికూడా  చూడకుండా చెప్పు తీసుకుని చెడామడా వాయించేసాను.  కానీ భవిష్యత్ పరిణామాల్ని ఊహించలేదు . ఆ అవమానాన్ని భరించలేక తెల్లారితే పరీక్ష ఉన్నదనే విషయం పట్టించుకోక ఇంటికి పరిగెత్తుకుపోయాను.  అమ్మని ఒక బిడ్డ అనరాని మాటలన్నాను . ఎన్నిమాటలన్నా అమ్మ ఒక్క మాట తూలలేదు.  మనసులోపల ఉప్పొంగుతున్న త్సునామీ అలల్ని ఎలా అదిమిపెట్టగలిగిందో .. ఆమెలో ఎన్ని నెత్తుటి నదులు పారాయో .. ఎంత తప్పుగా అర్ధం చేసుకుంది .. ప్చ్ పాపం ..అమ్మ .   చీర చెంగు మాటున అలవికాని అవమానాలు, విషాదాలు దాచేస్తూ .. ఎక్కడి బాధల్ని, బెంగల్ని  అక్కడే పాతరేస్తూ నా కోసం ..నిభాయించుకుంది. ఆశావహంగా  నాకోసం  ముందుకు నడుస్తూనే ఉంది.  మరిప్పుడెందుకు ఆ నడక ఆగిపోయిందో ..?విధి ఆమెను ఏ తీరాలకు విసిరేసిందో ‘  సువర్ణ కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి . గొంతు జీరబోయింది .

తన ఒళ్ళో  ఉన్న సువర్ణ  భుజంపైఓ చేత్తో  తడుతూ మరో చేత్తో ఆమె తలపై చేయి వేసి అనునయంగా  నిమురుతోంది శారద .
కొద్ది సేపు ఇద్దరి మధ్యా మౌనం . ఆ తర్వాత  శారద ఒడిలోని తల లేపి ఆమె మొహంలోకి చూస్తూ
‘తాత చనిపోకముందు తన పేర ఉన్న అరెకరం చేను పండించుకొమ్మని అమ్మకి ఇచ్చాడు. చెట్టు,పుట్టలతో అడవిలాగా ఉన్నదాన్ని చంటి బిడ్డలా సాకింది.  ఒంటి చేత్తో సాగులోకి తెచ్చింది . తిండిగింజలకి ఇబ్బందిలేకుండా చేసుకుంది.  తాత చనిపోయాడు. అమ్మమ్మ నోరులేని జీవి. అది అలుసుగా తీసుకుని పెద్దమామ, చిన్న మామ ఆ పొలం గుంజుకున్నప్పుడు ఆబోతుల్లా కొమ్ములతో కుమ్మి, కొట్టి  హింసించినప్పుడు, కుటుంబంలో , సమాజంలో వచ్చే ప్రతి సంకెలని తెన్చుకుంటూ సాగిన అమ్మకి ఇప్పుడు ఏమయింది శారదా ? ‘ బేలగా అడిగింది సువర్ణ .   మళ్ళీ ఆమే  ‘నా కోసం..  నా కోసమే,  పొగచూరిన కళ్ళలో ఒత్తులేసి నాకు బాట చూపే ప్రయత్నం చేస్తూనే ఉండేది అమ్మ .  ఎటు నుండి ఏ కష్టం వచ్చి మీదపడుతుందో అని అమ్మ కాపు కాస్తూనే ఉండేది. అయినా ఈ మగాళ్ళకెంత అలుసో కద శారదా ఆడవాళ్లంటే .. అందునా మా లాంటి వాళ్ళంటే ..’
అవునన్నట్లు తలూపుతూన్న శారద చేతిని చేతిలోకి తీసుకుంటూ  ‘పేదలం , దళితులం .. జోగినీ కుటుంబం .. ఆడవాళ్ళం ..ఒంటరి ఆడవాళ్ళం ..  వాళ్ళు  అట్లనే ఉంటరు బిడ్డా ..అలుసు తీసుకుంటరు బిడ్డా .. ఒంటి బలుపు తీర్సుకుంటరు బిడ్డా ..  మనం  యుద్ద తంత్రాలు నేర్వాలే బిడ్డా అని చెప్పిందో నాడు  నేను అడిగిన ఓ  ప్రశ్నకి సమాధానంగా .. అక్షరం చదవని అమ్మ నాకెన్ని జీవిత పాఠాలు చెప్పిందో .. ‘ ఆకాశంలో అలుముకుంటున్న చీకటి మేఘాల్లాటి జ్ఞాపకాల్లోంచి తొలుచుకొస్తున్న సువర్ణ మాటలు పూర్తి కాకుండానే

‘నిజమే సువర్ణా, ఎంతబాగా చెప్పింది మీ అమ్మ … ఆమె అనుభవం చెప్పిన పాఠాలు ఎన్ని డిగ్రీలు చదివినా వస్తాయా ..?  ఎంతటి గడ్డు స్తితి నైనా ఎదుర్కొనే ధైర్యం, విశ్వాసం లేకే కదా యువత ఆత్మహత్యలు చేసుకునేది  ‘ సాలోచనగా అంది శారద .  అదేమీ పట్టించుకోనట్టే .. తన ధోరణిలో తను చెప్పుకుపోతోంది సువర్ణ.

‘అమ్మ జోగిని అని అనడం చిన్నప్పుడు విన్నాను. కానీ జోగినీ అంటే ఏమిటో  తెలియదు. తెల్సుకోవాల్సిన అవసరమూ రాలేదు. నాకు  అమ్మ పోలికలున్నా రంగు రాలేదు. అమ్మది నాణ్యమైన నలుపు .  నేను చిన్నప్పటి నుండి హాస్టల్ లో ఉండి చదువుకోవడం , సెలవులకి  ఇంటికి వెళ్ళినా మళ్ళీ  హాలిడే కాంప్ లకు వెళ్ళడంతో సరదాగా గడచిపోయేది. లేదంటే ఉపాధి పనులకు అమ్మతో పాటే వెళ్ళేదాన్ని. ఆ పనులకు తీసుకెళ్ళడం , నాతో పని చేయించడం అమ్మకు అస్సలు ఇష్టముండేది కాదు. నేను కమిలిపోతానని, నా రంగు మాసి పోతుందని అనేది.  కానీ ఇంటి దగ్గర ఒంటరిగా ఉండడం అస్సలు మంచిది కాదనే ఉద్దేశం. అమ్మే నన్ను చూడాలనిపించినప్పుడల్లా నా దగ్గరకు వచ్చేది .   బడి  పాఠాల్లో మంచి మార్కులు తెచ్చుకునే నేను అమ్మ చెప్పిన జీవిత పాఠాలను ఆనాడు సరిగ్గా బుర్రకు ఎక్కించుకోలేదేమో ..అర్ధం చేసుకోలేదేమో ..  ! నాకు పెళ్లి చేసెయ్యాలని ఎంతో  తపన పడింది .  పెళ్లి లేని తల్లిగా ఎన్ని అవమానాల్ని తన గరళంలో బిరాడాతో బిగిన్చేసిందో .. ప్చ్ ,, ‘ నిట్టూర్చింది  కనుకోలుకుల్లో దాగిన కన్నీటి చుక్కని చున్నీతో తుడిచేస్తూ .

అప్పటివరకూ జోగిని అంటే అర్ధం కాని శారద ఏదో అర్ధమయిన దానిలా సానుభూతిగా చూసింది సువర్ణ వైపు .
‘నే చెప్పింది నీకు అర్ధమయ్యే ఉంటుందనుకుంటున్నా …  అమ్మ ఆరాటానికి  కారణం అప్పుడు నాకు అర్ధం కాలేదు . తనకి లేని దాన్ని కూతురికి అందించాలని ఆమె తపన, తాపత్రయం అందులో సంతోషం వెతుక్కునే ప్రయత్నం కావచ్చని ఇప్పుడనిపిస్తోంది.  ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి అని భీష్మించుకు కూర్చున్న నన్ను బాగా చదువుకున్నావు . మంచీ చెడూ నాకంటే నీకే ఎక్కువ తెలుసు అంటూ సరిపెట్టుకుంది .

ఎక్కడిదాకా వచ్చారని చిన్న మామ ఫోన్ కి కామారెడ్డి దగ్గరలో ఉన్నామని సమాధానం చెప్పిన సువర్ణ కేసి చూస్తూ  ‘నువ్వూ మాలాగే పేదింటి పిల్లవనుకున్నా కానీ  ఎంతటి గడ్డు పరిస్తితుల్లోంచి ఎదిగోచ్చావో తెలుస్తుంటే  ఆశ్చర్యంగానూ గర్వంగాను  ఉంది సువర్ణా .  నీవసలు అలా కనిపించవు .  ‘ ఆశ్చర్యంగాను, ఆప్యాయంగా సువర్ణ చేతికి గట్టిగా పట్టుకుంది శారద .

‘నీకు నేను చెప్పింది చాలా తక్కువ  శారదా .. పన్నెండో ఏడు వెళ్లిందో లేదో అమ్మకి  నేను పుట్టానట.   ఆ తర్వాత ఏడాదిన్నరకి తమ్ముడు .. ఆమె ప్రమేయం లేకుండానే .. మా పుట్టుక గురించి ఆమె ఆరాటపడకుండానే .. ఎవరెవరి శరీర తాపం తీర్చుకునే క్రమంలోనో… సాంప్రదాయపు చట్రంలో చిక్కి విలవిలాడే అమ్మ రక్తం పంచుకుని మేమీ లోకంలోకి వచ్చేశాం. కానీ ఏమైందో కానీ తమ్ముడు ఏడాదిలోపే మమ్మల్ని వదిలిపోయాడు.

నాకు ఊహ తెలిసినప్పటి నుండీ నాన్నంటే  తెలియదు.  అమ్మని అడిగితే వదిలి వెళ్ళిపోయాడంది.  ఒంటి చేత్తోనే మమ్మల్ని పెంచింది అమ్మ .  ప్రభుత్వం జోగినులకు ఇచ్చే పునరావాస కార్యక్రమాల్లో కుట్టుపని నేర్చుకుంది.  జాకెట్లు , గౌన్లు , లంగాలు వంటివి కుట్టడం నేర్చుకుంది.  కానీ అమ్మ దగ్గర కుట్టించుకోవడానికి వచ్చేవారు కాదు.  కారణం అప్పటికే ఆమె జోగినులకోసం కట్టించిన ఆశానగర్ కాలనీలో ఉండడమే .  ప్రభుత్వం హాస్టళ్లకు కుట్టే బట్టలు వీళ్ళతో కుట్టించింది.  జోగినుల కాలనీ అని ముద్ర పడడంతో  అల్లరి చిల్లరి  మగవాళ్ళు  అక్కడ చేరి అల్లరి పెట్టడం మొదలు పెట్టారు . ఇక అక్కడ ఉండలేక అమ్మ లాగే మిగతావాళ్ళు  చాలా మంది అక్కడి నుండి వెళ్ళిపోయారు .  అమ్మకి మళ్లీ పనిలేదు .  కూలీకి వెళ్ళేది. మొదట్లో కూలికి కూడా రానిచ్చేవారు కాదట .  అటువంటి పరిస్తితి లోంచి వచ్చిన అమ్మ ఎంత గొప్పగా ఆలోచించిందో తెలుసా .. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని జోగినులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పిందట.  కానీ అది తీసుకోనని రాత్రి మాటల్లో చెప్పింది అమ్మ .’

‘ఏం ఎందుకని వద్దంది ‘ ఉచితంగా వస్తుందంటే ఫినాయిలు తగదానికయినా సిద్ధమయ్యే ఈ కాలంలో ఇలాంటివాళ్ళు కుడా ఉంటారా అనే ఆశ్చర్యంతో శారద ప్రశ్నదూసుకొచ్చింది.

‘ అది ఆత్మ గౌరవం కోసం కావచ్చు లేదా నేను ఉద్యోగంలో చేరితే ఆర్ధికంగా ఇక ప్రభుత్వ సహకారం అవసరం లేదని ఉండవచ్చు. లేదా తన జీవితం తాలుకు  నీలి నీడలు నాపై పడతాయని కావచ్చు ఏమైనా అమ్మ తీసుకున్న నిర్ణయం గొప్పదే కదా ..’ కొన్ని క్షణాలు అలా కళ్ళు మూసుకు తెరిచి మళ్ళీ తానే  ‘సమాజంలో ఉండే హెచ్చు తగ్గులు, సమాజపు అంతః స్వరూపం  బడిలో ఉన్నప్పుడు అంతగా తెలియదు. కారణం నేను సంస్కార్ బడిలో చదవడం కావచ్చు. అక్కడ అందరినీ ఒకే విధంగా చూడడం కావచ్చు .  కబడ్డీ , ఖో ఖో రాష్ట్ర , జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నప్పుడు , కొన్ని సామాజిక కార్యక్రమాలకోసం , బాల జర్నలిస్టుగా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మనషుల మధ్య ఉండే అంతరాలను గమనించినా అంత సీరియస్ గా తీసుకోలేదు .. బహుశా అంతగా అర్ధం చేసుకునే వయసు కూడా కాదేమో …

ఎప్పుడయితే నేను బాలల హక్కులపై  రాష్ట్ర స్థాయి , జాతీయ స్థాయి సదస్సులకి హాజరయ్యానో అప్పటి నుండి నా మెదడు మరింత ఆలోచించడం మొదలు పెట్టింది . పదును అవడం ఆరంభమైంది.  చెప్పాను కదా ఇంటరులో ఉండగా జరిగిన సంఘటన . ఆ తర్వాత ఒంటరి స్త్రీగా తల్లి పడుతున్న కష్టాలు కొద్ది కొద్దిగా అవగతమవుతూ వచ్చాయి. నా తల్లిలానో,  గ్రామంలోని మహిళల్లాగానో బతక కూడని అప్పుడే నిశ్చయించుకున్నాను .  అమ్మ హేమలతా లవణం స్ఫూర్తి నిచ్చేది . అట్లా నలుగురికీ ఉపయోగపడేలా బతకాలని నాకు నేనే చెప్పుకునేదాన్ని.  ఆక్రమంలో అన్నింటా చురుకుగా పాల్గొంటూ వచ్చిన ఏ  అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు దూసుకుపోయే దాన్ని. అప్పటికప్పుడు ఏ విషయమైనా నదురు బెదురూ లేకుండా ఎంతమంది ముందయినా మాట్లాడేదాన్ని. విస్లేషించే దాన్ని. సూటిగా చెప్పే దాన్ని. బహుశా ఇవన్నీ నేను చదివిన బడి, అక్కడి మనషులు, వాతావరణం నాకిచ్చాయని అనుకుంటున్నా ..

ఆ లక్షణాలే అమెరికా దాకా వెళ్ళే అరుదైన అవకాశాన్నిచ్చాయి .  నేనెప్పుడూ ఊహల్లో కూడా కనని కలని నిజాన్ని చేస్తూ నా ముందుకు వచ్చిన అవకాశం అది. కానీ అప్పుడు అమ్మ పంపడానికి చాలా భయపడింది.  తెలిసిన వాళ్ళు  తెలియని వాళ్ళు అమ్మని చాలా భయపెట్టారు.  తన భయాలన్నీ తనలోనే పెట్టుకుని  హేమలతా లవణం ఆమ్మమ్మ పై ఉన్న గౌరవంతో , నమ్మకంతో అమెరికాలో జరిగే సదస్సుకి నన్ను పంపించింది ‘. గాలికి ఎగురుతున్న ముంగురులను సవరించుకుంటూ చెప్తున్న సువర్ణ మాటలు పూర్తి కాకుండానే అందుకుని  ‘ ఏమిటీ చిన్నప్పుడే నీకు అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందా ..?’  చెప్పలేనంత ఆశ్చర్యం కళ్ళలో నిండగా అడిగింది శారద .

‘అవును , ఆ రోజు నా జ్ఞాపకాల్లో ఇంకా పచ్చిగానే , అప్పుడప్పుడూ ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది. పాస్పోర్ట్ కోసం హైదరాబాద్ వెళ్లినప్పుడు తండ్రి పేరు లేదని పాస్ పోర్ట్ ఇవ్వనని చెప్పారు.  తండ్రి ఇప్పుడు మీకు లేక పోవచ్చు కానీ నీ పుట్టుకకి కారకుడైన వ్యక్తీ పేరు చెప్పమన్నారు . ఏమి చెప్పను . ఏమని చెప్పను. భారమైన హృదయంతో తప్పుచేసిన దానిలా తల వంచుకున్నాను .  అప్పటికీ నన్ను తీసుకెళ్ళిన అంటి పరిస్థితి వివరించింది.  వాళ్ళకి జోగిని అంటేనే తెలియదు. చెప్పింది అర్ధం చేసుకోరు . వాళ్ళ టైం వెస్ట్ అవుతోందని మాట్లాడారు. ఆంటి చాలా రిక్వెస్ట్ చేశారు . ఒప్పుకోలేదు.   అప్పటికప్పుడు అమ్మని పిలిపించి జోగిని అంటే ఏంటో తెల్పుతూ ఒక అఫిడవిట్ తయారు చేయించి  అమ్మతో సంతకం చేయించి పాస్త్పోర్ట్ ఆఫీసర్ కి ఇచ్చి వివరించిన తర్వాతే  పాస్పోర్ట్ అప్లికేషన్ తీసుకున్నారు.  మొదటిసారిగా నేను జోగిని కూతురుగా పుట్టినందుకు బాధపడ్డాను. కానీ అప్పటికి జోగినీ జీవితం ఎలా ఉంటుందో తెలియదు .

‘ అవునా ..  తండ్రి పేరు లేకపోతే ఇలాంటి కష్టాలుంటాయా .. ? విస్మయంగా శారద

అవునన్నట్లుగా తలూపి ‘ఆంటి వాళ్ళు చొరవ చూపక పోతే నాకు వచ్చిన అవకాశం నేను కోల్పోయేదాన్ని.. నేను కాకుండా మరెవరికి ఈ అవకాశం వచ్చినా తండ్రి పేరు లేదన్న కారణంగా పాస్ పోర్ట్ అప్లికేషన్ వెనక్కి ఇచ్చేసేవారు కాదు కదా .. అప్పటి నుండి నాలో ఎన్నెన్నో ప్రశ్నల తుఫానులు రేగడం మొదలయ్యాయి.  కానీ అమ్మని అడిగి తెలుసుకునే అవకాశమే రాలేదు. పాస్పోర్ట్ వచ్చాక రెండుసార్లు ధిల్లీ వెళ్లి వచ్చా వీసా కోసం ..  అక్కడ కూడా జోగిని బిడ్డగా , తండ్రి లేని బిడ్డగా మళ్ళీ రుజువు చేసుకోవాల్సి వస్తుందేమోనని భయపడ్డా . కానీ వాళ్ళు  తండ్రి పేరు లేదని అభ్యంతర పెట్టలేదు. కానీ, నేను మైనర్ ని కాబట్టి అమ్మని అడ్రెస్స్ , నివాస దృవీకరణ చేసుకునే పత్రాలు కావాలన్నారు.  తెల్లవారే సరికి అమ్మ విమానం ఎక్కి దిల్లీ వచ్చింది.  ఎక్కడో పొలాల్లో పని చేసుకుంటున్న అమ్మని పిలిపించి అప్పటికప్పుడు తోడిచ్చి ధిల్లీ పంపించారు  సంస్కారు వాళ్ళు .

బిడ్డా .. నిజామబాద్ మొకం జూడని నాకు మీది మోటార్ ఎక్కిపిచ్చినవ్ .. నీకంటే ముందు నేనే గాలి మోటార్ ఎక్కిన అంది  అమ్మ  ఢిల్లీ చేరగానే . ఇందిరమ్మ ఇక్కడే ఉండేదా ..ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏవేవో అమాయకపు ప్రశ్నలు వేసింది .  నిన్న ఈ వరకూ చేన్ల ఉంటి . ఇగో ఇప్పుడు డిల్లి గల్లిలల్ల .. అంటూ ఆశ్చర్యపోతునే ఉంది .
మా జీవితాలు ఆ మట్టి లోంచి , బురదలోంచి పైకి వచ్చి అంబరాన్ని  అందుకోవాలని,  మేమంతా సంబరాన్ని పంచుకోవాలని సంస్కార్ చాలా చాలా చేసింది.

మా రజిత టీచర్ వాళ్ళ అబ్బాయిని అమెరికా చదువుకు పంపుదామంటే వీసా రాలేదట. చాలా బాధపడిందా .. నాకు వీసా వచ్చిందని  ఈర్ష్య పడింది కూడా . బడిలో వాళ్లకి , సంస్థలో వాళ్ళకి , ఊళ్లో  వాళ్ళకి  అందరికీ ఆశ్చర్యమే ..

చుట్టుపక్కల ఊళ్ళ  వాళ్ళు   కొందరు అమ్మని అదృష్టవంతురాలివి అని పొగిడితే కొందరు ఈర్ష్య పడ్డారు.  తమ ఊర్లొ ఉన్న పెద్దరెడ్డి కొడుక్కి కూడా వీసా రాలేదట. తన కొడుకు వెళ్ళలేని చోటుకు నేను వెళ్తున్నందుకు తమ పీఠం కదిలిపోతున్నంత బాధపడిపోయారు . లేని పోనివి ప్రచారం చేశారు.  విపరీతంగా భయపెట్టారు. తన భయాలన్నీ గుప్పిట బంధించి కళ్ళ నిండిన నీటిని నా కళ్ళ పడకుండా తుడిచేస్తూ అమ్మ నన్ను పంపింది.  కానీ.. నేను తిరిగి వచ్చేవరకూ కంటి నిండా కునుకు లేకుండా గడిపింది. ‘  సువర్ణ  అమ్మ తలపులను భంగపరుస్తూ సెల్ ఫోన్ మోగింది .
‘హార్టీ కంగ్రాట్స్ సువర్ణా ‘
‘…’
‘ఏంటి రిజల్ట్స్ వచ్చాయిగా  .. ఇంకా చూసుకోలేదా ..?  ట్రీట్ ఎప్పుడిస్తున్నావ్ ..?
‘ …’
‘స్టేట్ సెకండ్ రాంక్ కొట్టేశావ్ ‘ . రిజర్వేషన్ లో చూస్తే నీదే ఫస్ట్ ‘ కంగ్రాట్స్ అగైన్ ‘ సెలెబ్రేషన్ ఎప్పుడు ?’
‘ …’ కళ్ళలోంచి నీరు కారిపోతోంది
‘ఏమిటే మౌన వ్రతం చేస్తున్నావా .. లేక  ఫస్ట్ రాంక్ రాలేదనా ..’ అంతలో సువర్ణ చేతిలోని మొబైల్ లాక్కున్న శారద సారీ ఇప్పుడీ విషయం చెప్తున్నందుకు .. సువర్ణ వాళ్ళ మదర్ ఎక్ష్పైర్ద్ ‘ అని చెప్పింది .
‘ఓ అయాం సారీ .. తర్వాత మాట్లాడతా ..’ పెట్టేసింది .  ఆ తర్వాత వెంటవెంటనే చాలా ఫోన్లు .. ఏవీ రిసీవ్ చేసుకునే స్థితిలో లేదు సువర్ణ .  అప్పటికి  హై వే దిగి డిచ్ పల్లి క్రాస్ చేసింది బస్సు .

‘ఒక్క  రోజు ముందుగా ఈ వార్త అందితే .. అమ్మ ప్రాణం నిలిచేదేమో … రక్త సంబందీకులు, పేగు తెంచుకు పుట్టిన నేనూ  ఉండీ లేనట్లు బిక్కు బిక్కుమంటూ బతికింది  అమ్మ .   మనసులో జరిగే సునామీ విధ్వంసాన్ని , హృదయంలో ఉడికే నెత్తుటి మూటల్ని మూటకట్టి  దాచేసేది . లోపల జరిగే యుద్దపు కన్నీటి చారికల్ని కనిపించనీయకుండా  చిరునవ్వు లేపనం పూసుకు తిరిగేది. నన్ను శిఖరాగ్రంపై చూడాలని కలలు కనేది.   ఆ కలలు నిజమవుతున్న వేళ ..  అమ్మా  ఏంటమ్మా .. అంక్షల పంజరాలను  విప్పుకుని ఆశల రెక్కలతో విహరిద్దామని వెళ్ళిపోయావా ..  దుఃఖం తన్నుకొస్తోంది  ఆమెకి .

వాళ్ళ మాటలు చెవిన పడ్డాయేమో .. కొందరు సానుభూతిగా సువర్ణకేసి చూస్తున్నారు.  బద్దలవుతున్న అగ్నిపర్వతాల్ని లోలోనే ఆర్పే ప్రయత్నంలో గట్టిగా కళ్ళు మూసుకు కూర్చుంది సువర్ణ . మనసులో మూగగా తల్లితో మాట్లాడేసుకుంటోంది

నీ దారి పొడవునా ఉన్న ముళ్ళ జెముళ్లను ఏరేసి పూల పాన్పు పరచాలనుకుంటున్న  నా ఆశల్ని పేకమేడల్లా కూల్చేసి పొలిమేరలు దాటి పడమటి కొండల్లోకి  చేరిపోయావా .. అమ్మా  చిక్కటి చీకటి పాయల్లో చిల్లు పిడతలా నన్నిలా వదిలేసి  .. ? !
ఊహు .. కాదు, నే చిల్లు కుండని కాదు. కాకూడదు . నిండు కుండను.  నీవిచ్చిన సప్త వర్ణాలని నింపుకుని ఉదయపు వెలుతురు కెరటం అవుతుందమ్మా నీ సువర్ణ.  ప్రేమంతా నింపుకుని వేళ్ళు జుట్టులోకి పోనిచ్చి సవరిస్తూ లాలించే అమ్మ మొహం కళ్ళలో మెదులుతుండగా సువర్ణ ఆలోచనలకు భంగం కలిగిస్తూ నిజామాబాద్ బస్ స్టేషన్ లో బస్ ఆగింది .
.
వి. శాంతి ప్రబోధ

Published in Matruka 2017 March
(2016 నోముల పురస్కారం పొందిన కథ )

దారి చూపిన ఒంటరి నక్షత్రం   

ఒకే ఒక్క సంతకం ఆయుధంగా నా యుద్ధం మొదలయింది .
ఇప్పుడు నావెనుక పెద్ద సైన్యం వేలు లక్షల సంతకాలతో.  రోజు రోజుకు నాకు మద్దతు తెలిపే  సైన్యం పెరిగిపోతోంది .  నేను విజయం అందుకోవాలని ప్రపంచం నులుమూలల ఉన్న భారతీయుల నుండి మెయిల్స్ . మెస్సేజ్ లు .  కొందరయితే ఏకంగా ఫోన్ చేస్తున్నారు . ఒక సామాన్యురాలికి ఇంత స్పందనా ..?!

అనూహ్యంగా ..
ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యం, ఆనందం,  ఉత్సాహం , ఉద్వేగం కలగాపులగంగా .. నా కూతురు కళ్ళలో దీపాలు వెలిగించగలనన్న నమ్మకం నాలో మరింత బలాన్ని పెంచుతూ … బహుశా ఈ సమస్య నా ఒక్కదానికే కాదు, చాలామంది  ప్రధానమైనదిగా భావించడం  వల్లేమో ..

ఈ ప్రపంచంలో నేనొక్కదాన్నేకాదు. నాలాంటి సమస్యలు ఎంతోమంది మంది స్త్రీలే ఎదుర్కొంటున్నారని ఇప్పుడర్ధమవుతోంది .  అందుకేనేమో మార్పు కోసం వేసే నా అడుగులకు తోడుగా అడుగేస్తూ .. బాసటగా నిలుస్తూ ..  నాలో ఆత్మవిశ్వాసం  పెంపొందిస్తూ ఉన్నారని ఆలోచిస్తూ ఆరిన బట్టల్ని తీసి మడతపెడుతోంది  గాయత్రి.

కానీ ఆ పోలీసు ఆఫీసర్ ఎంత రూడ్ గా మాట్లాడాడు .  భాష భరించలేనిదిగా .. ఛి ..ఛీ .. ఎంత అసహ్యంగా మాట్లాడాడు  సమస్యని అర్ధం చేసుకోకుండా ..  చదువుకున్న వాళ్ళు కూడా  సంస్కారం లేకుండా అసభ్యంగా  మాట్లాడతారా .. ? మడతపెట్టిన బట్టలు సర్దుతూ . అప్పటికి ఎన్నోసార్లు వేసుకున్న ప్రశ్నే అయినా మళ్ళీ మళ్ళీ ఆమెలో తొంగిచూస్తూ .

హూ.. అలాంటి వాళ్ళని తల్చుకొని టైం వెస్ట్ చేసుకోవడం , బుర్రని పాడుచేయుకోవడం ఎందుకు అని వెళ్లి సోఫాలో కూర్చుంది . ఎదురుగా ఉన్న టీపాయ్ పై గమన  కోసం కొన్న లాప్టాప్ కనిపించడంతో  మెయిల్ చెక్ చేద్దామనుకుంటూ లేచి  లాప్టాప్ అందుకుంది గాయత్రి .  శని , ఆదివారాలు డాన్స్ క్లాసు పిల్లతోనే సరిపోతుంది .  మిగతా రోజుల్లో అయితే సాయంత్రాలు మాత్రమే వస్తారు .   పనుల్లోపడి రెండురోజులుగా మెయిల్ చెక్ చేసుకోలేదు .  మొన్నటివరకూ ఫోన్ వాడడమే గాని మెయిల్ , వాట్సాప్ , ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా జోలికే వెళ్ళేది కాదు . అలాంటిది ఇప్పుడు బాగా వినియోగిస్తున్నా .. అవసరం అన్ని నేర్పిస్తుందేమో , అలవాటు చేస్తుందేమో .. అనుకుంటూ మెయిల్ బాక్స్ తెరిచింది .

సంగీత కార్లేకర్ మెయిల్ .  ఓ .. మొన్ననగా పంపితే తన నుండి రిప్లై లేదని ఈ రోజు ఫోన్ చేసిందన్నమాట .. కొన్ని నిముషాల క్రితం మాట్లాడిన మహిళ మాటలే గుర్తొచ్చాయి గాయత్రికి .
వెంటనే అసలు ఇలాంటి ఆడవాళ్ళూ ఉంటారా .. ? అనే సందేహం మొలిచి ఆశ్చర్యంతో ఆమె మెయిల్ చూస్తోంది కానీ ఆవిడ మాటలే చెవుల్లో ..
 .
నిజంగా ఆవిడకి ఎంత ధైర్యం , ఎంత తెగింపు , ఎంత  ఆత్మవిశ్వాసం?  సమాజం నుండి వచ్చే సవాళ్ళను ఎదుర్కొనే తెగువ , గుండె నిబ్బరం?! అవి  లేకపోతే ఆమె అంత పెద్ద నిర్ణయం తీసుకోగలిగేదా ..  ?! లేకపోతే పెళ్ళికాకుండా బిడ్డను కనిపెంచడమే కాకుండా .. ఆ బిడ్డ తండ్రిపేరు ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదంటుందా . . ఆమె మాటలు వినగానే ఆ ధోరణి.కొంచెం అతిగాను  అరిగించుకోవడం కొంచెం కష్టంగానూ అనిపించినా ఆలోచిస్తుంటే  బాగున్నట్లుగా కూడా తోచింది గాయత్రికి .  ఎలాంటి సంకోచాలు, సందిగ్దాలు లేకుండా  తనకి కావలసింది తను అందుకోవాలనుకునే సంగీత  కార్లేకర్ తత్త్వం చాలా వింతగా , కొత్తగా విస్మయపరిచింది .
‘అమ్మా ఏమాలోచిస్తున్నావ్ ? నేనొచ్చి లైట్ వేసినా నీవు గమనించనే లేదు ‘ కూతురి ప్రశ్న .
చిన్నగా నవ్వేసి ‘ అమ్ములూ ఆవిడకెంత ధైర్యం .. ‘ అనాలోచితంగా
‘ఎవరికమ్మా ..  ఏమి చెప్పకుండా  నాకెలా అర్ధమవుతుంది ‘ షూ లేస్ విప్పుతూ గమన
‘ఓ .. అవును కదూ ..హూ .. ‘ చిన్నగా తనను తాను మొట్టికాయ వేసుకొని   ‘సంగీతా కార్లేకర్ అనే ఆవిడ ఢిల్లీలోనే ఉంటోందిట . ఇంతకుముందే ఫోన్ చేసింది . ‘ అంటూ ఎండ కోసం బయట పెట్టిన ఇండోర్ ప్లాంట్ ని తెచ్చి హాల్లో ఓ మూలగా పెట్టింది .
‘ఓ .. అయితే .. ?’ తనపని ఆపి తల్లికేసి చూస్తూ గమన
‘ఆవిడ పెళ్లికాకుండానే తల్లి అయిందట . కొడుకు పుట్టాడట .  బర్త్ సెర్టిఫికెట్ కి తండ్రిపేరు అడిగారట . నేను అవివాహితను . నా బిడ్డకు తండ్రిలేడని చెప్తే ఆ బిడ్డకు గార్డియన్ గా లీగల్ సర్టిఫికెట్ కావాలన్నారట .
తనకేసి తదేకంగా చూస్తున్న కూతురు చూపుల్ని తప్పించుకుంటూ  ‘ ఆ బిడ్డను నవమాసాలూ మోసి కన్నది నేను .  పెంచేది నేను . ఆ బిడ్డకు తండ్రిపేరు చెప్పకపోతే తల్లిని కాకుండా పోతానా ..? సహజంగానే నా బిడ్డకి గార్డియన్ నేను .  అది నా హక్కు అని కోర్టుకు వెళ్లిందట .    పెళ్లి చేసుకోకుండా తల్లి అయినప్పటికీ ఆ బిడ్డను తండ్రి కాదనుకుంటే బిడ్డ తల్లి  కస్టడీలో ఉన్నప్పుడు ఆమె గార్డియన్ అంటూ ఆమెకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందట ఢిల్లీ హై కోర్టు .  అప్పుడామె సుప్రీం కోర్టు ను ఆశ్రయించిందట .  సుప్రీంకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందట .’   చెప్పి  కిచెన్ లోకి దారితీసింది గాయత్రి .
‘ సుప్రీం కోర్టు ఏమంటోందట ?’  ఆమె వెనకే వచ్చిన గమన  వేసిన ప్రశ్నకు చిరునవ్వుతో  ‘ ఆమె తనబిడ్డ తండ్రి ఎవరో చెప్పాలనుకుంటే చెప్తుంది. లేదంటే లేదు. అది ఆమెహక్కు అని చెప్పిందట సర్వోత్తమ న్యాయ స్థానం . తీర్పు చెప్పడమే కాకుండా ఆ బిడ్డ బర్త్ సర్టిఫికెట్ , స్కూల్ అడ్మిషన్ , పాస్పోర్ట్ ఎక్కడైనా తల్లిపేరు ఉంటె సరిపోతుందని చెప్పిందట .’  స్నాక్స్ ప్లేట్ లో సర్దుతూ చెప్పింది గాయత్రి

తల్లి కళ్ళలో ఆనందం చూసి ‘అమ్మా.. మనకీ ఢిల్లీ కోర్టు  అదే చెప్పింది కదమ్మా ..’ తల్లి చేతిలోంచి ప్లేటు అందుకుంటూ గుర్తు చేసింది గమన .
‘అవునవును, బహుశా ఆవిడే  ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పుకి బాట వేసిందేమో .. ‘ సాలోచనగా ఆలోచిస్తూ చిన్న నవ్వుతో అంది గాయత్రి .
‘అమ్మా ..  నీకు నువ్వు  సాహసం ఊపిరులూదుకుంటూ నీ  ముందు నిలిచిన సవాళ్ళను ఎదుర్కొంటూ పోతున్నావు. కానీ ఆమె అలాకాదన్నమాట .  ఏటికి ఎదురీదే సాహసి.  తనకు తానుగా కొత్తదార్లేసుకుపోతూ సవాళ్ళను ఎదుర్కొంటోంది . ఎప్పుడైనా అంతేనేమో .. దారులు వేసేవాళ్ళు ఎన్నో సవాళ్లు , ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే ..  వాళ్ళు పరిచిన బాటలో మిగతావాళ్ళు సునాయాసంగా నడిచేస్తారు కదా .. ‘  కారప్పూస నోట్లో వేసుకుంటూ  అంటున్న పదిహేనేళ్ల కూతురి కేసి విస్మయంగా, విచిత్రంగా  చూసింది గాయత్రి .
తల్లీకూతుళ్ల మాటల మధ్యలో  గాయత్రి పక్కనున్న మొబైల్ మోగడం మొదలు పెట్టింది
ఎవరో చూద్దామని తీసి చూసింది గాయత్రి. కొత్త నంబర్ .
‘అమ్మా .. నువ్వు ఈ మధ్య ఫోనుల్లో చాలా  బిజీ అయిపోయావ్ ‘  అంటూ తానూ తల్లిపక్కకు చేరింది .
‘ ఏమోనే ..  ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు . కొందరు సపోర్ట్ చేస్తున్నారు .  కొందరు తామూ బాధితులమేనని తమ వ్యధ చెప్పుకుంటున్నారు .  కొందరు సలహా అడుగుతున్నారు . కొందరు తాము ఎలా ఎదుర్కొన్నారో చెప్తున్నారు .  రకరకాల మనుషులు . రకరకాల సమస్యలు ..’ అంటూ ఫోన్ చూస్తూన్న  గాయత్రికి ఎవరో తెలియని కాల్ తీసుకోవాలనిపించలేదు .  పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ మళ్ళీ  మోగుతోంది . ఎవరో మాలతీమాధుర్ పేరు చూపుతోంది ట్రూకాలర్ .  ఇది తాను గమనతో గడిపే సమయం కావడంతో ఒకింత అనాసక్తితోనే కాల్ తీసుకుంది గాయత్రి .
‘నమస్తే మేడం ..
ముందుగా మీకు అభినందనలు .
మీరు చేస్తున్న యుద్ధం చిన్నది కాదు .  ఒకప్పుడు నేనూ ఇలాంటి యుద్ధమే చేశాను . చివరికి విజయం సాధించాను . మీకు మీ అమ్మాయికి న్యాయం జరిగి తీరుతుంది ‘ అవతలి నుండి పాఠం అప్పచెప్పినట్లుగా గడగడా .
‘మీరు ‘ ప్రశ్నార్ధకంగా ఆగింది గాయత్రి
‘ఓ సారీ అండీ .. నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదా ..  నా పేరు మాలతి .  హైదరాబాదు నుండి కాల్ చేస్తున్నాను . ‘
‘చెప్పండి ‘ హైదరాబాద్ పేరువినగానే గాయత్రికి తల్లిదండ్రులు కళ్ళముందు మెదిలారు .   నాన్నకి ఏమాత్రం బాగుండడం లేదు . చెల్లి దగ్గర హైదరాబాదులోనే ఉన్నారు. ఆయనకి నీ మీద బెంగ..ఒకసారి వీలయితే వచ్చిపోరాదు . ఉదయం ఫోన్లో చెల్లి చెప్పిన విషయం మదిలో మెదిలింది.
అవతలినుండి ‘మేడం మీ అమ్మాయి పాస్పోర్ట్ కోసం ఎంత స్ట్రగుల్ చేస్తున్నారో ఇప్పుడే చేంజ్ . ఆర్గ్ ద్వారా తెలిసింది .  నా సంపూర్ణ మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది .  ఆ .. చెప్పలేదు కదూ .. నేనూ సింగల్ పేరెంట్ నే .. మా అబ్బాయికి స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ లో తండ్రిపేరు లేకుండా ఎక్సమ్ రాయనివ్వనంటే  కోర్టుకు వెళ్ళా .. నిజానికి వాడు పుట్టిన కొంత కాలానికి నాతో కలసి నడుస్తూస్తానని బాస చేసిన వాడు తన దారి తాను చూసుకున్నాడు .  సహజీవనంలో ఉండాల్సింది ఒకరంటే ఒకరికి ప్రేమ , నమ్మకం , సడలని విశ్వాసం . అవేవి లేని అతను నన్ను మోసం చేస్తున్నాడని అప్పట్లో గ్రహించలేకపోయాను . అతని ప్రేమంతా నా వెనుక ఉన్న ఆస్తి , అంతస్తు అని అతని ద్వారానే తెలిసిన మరుక్షణం అతన్ని క్షమించలేకపోయాను.  అది మా అమ్మానాన్నలకు నచ్చకపోయినా  స్వతంత్ర జీవితమే ఎంచుకున్నాను… ‘
అవతలనుండి వింటున్నారోలేదో సందేహం వచ్చి ‘ సారీ మేడం .. మిమ్మల్ని విసిగిస్తున్నానేమో ..’ సందేహిస్తూ మాలతి
‘ఫర్వాలేదులెండి .. అసలు సమస్యని ఎలా అధిగమించారో చెప్పనే లేదు ‘  అంటూ తరగాల్సిన కూరగాయలు తీసి ముందు పెట్టుకుంది గాయత్రి . అంతకు ముందు లేని ఉత్సాహం గాయత్రి గొంతులో .
‘ఆ అక్కడికే .. గడచిన కాలంలోకే వస్తున్నానండీ .. మా అబ్బాయి స్కూల్ లో మొదట నా పేరు రాయడానికి ఒప్పుకోలేదు . అతనికి తల్లీ  తండ్రీ నేనే అని వాదించిన మీదట నా పేరు రాశారు తండ్రిపేరు లేకుండా . మా వాడు 10కి వచ్చాడు . బోర్డు ఎక్సమ్ కి ఫీ కట్టాం . అప్లికేషన్ లో తండ్రి పేరు తప్పని సరి లేదంటే పరీక్షలు రాయడం కుదరదు అన్నారు .  మా వాడు చాలా టెన్స్ అయ్యాడు పరీక్ష రాయగలనో లేదోనని .  వాడి పరీక్షఫీజు కట్టేవరకూ వచ్చిన పరిస్థితులతో యుద్ధం చేశాను.

‘ఓ రియల్లీ యూ డిడ్ ఏ  గ్రేట్ జాబ్ , కంగ్రాట్యులేషన్ ‘ మనస్ఫూర్తిగా అభినందించింది గాయత్రి

కూరగాయలు తరుగుతూ మొబైల్ లో మాట్లాడుతున్న తల్లినే పరీక్షగా గమనిస్తోంది గమన కారప్పూస ఒక్కోపలుకు నోట్లో వేసుకుంటూ .

నాన్నలాగే అమ్మ కూడా  నన్ను వద్దనుకుంటే .. ? ఈ మధ్య తరచూ పొడుచుకొచ్చే ప్రశ్న  ఊహ మాత్రంగా  ఓ క్షణం మెదిలి మాయమైంది . ఏ చుక్కలూ లేని ఒంటరి ఆకాశంలా ..రాలిపోయిన పువ్వులా ..   ఏ ఆర్ఫనేజ్ లోనో , రోడ్డుపై అడుక్కుంటూనో … ఛ ..ఛా .. ఇలా ఆలోచించకూడదు.  అమ్మ ఎంత త్యాగం చేసింది. నా బతుకులో రాగాలు పలికించడం కోసం కరిగిపోయే కాలంలో తానూ కరిగిపోతూనే ఉంది .  నేనే లోకంగా బతుకుతోంది .   అమ్మ బాధ్యతలు , నాన్న బాధ్యతలతో పాటు ఇద్దరి ప్రేమ ఆప్యాయత అన్నీ కలిపి  అందిస్తోంది.  ఆ మాటే అంటే ఒప్పుకోదు అమ్మ .
ఎన్ని కష్టాలు , ఇబ్బందులు , సమస్యలు సవాళ్ళు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటోంది .  ఆమె డీలాపడిపోవడం, ఏడుస్తూ కూర్చోవడం, ఇతరులపై ఆధారపడడం  ఎప్పుడూ చూడలేదు.   అమ్మే నాకు  నాన్న.  నాకుమంచి స్నేహితురాలు కూడా అమ్మే .. ఆ మాటే అమ్మతో అంటే .. నువ్వేరా చిట్టితల్లీ నా ఆప్త మిత్రురాలివి అంటుంది .  నాలుగైదేళ్లుగా ఇద్దరి మధ్యా అన్నివిషయాలూ పంచుకోవడం చర్చించుకోవడం మరింత పెరిగింది .  ఇక పాస్పోర్ట్ సమస్య వచ్చిన దగ్గర నుండీ మరీ ఎక్కువయింది అని తలపోస్తున్న గమన తల్లివైపు ఆరాధనా పూర్వకంగా చూసింది . తల్లి అవతలి వారితో మాట్లాడే మాటలు కొన్ని  చెవిలో పడుతున్నాయి .
సింగల్ పేరెంట్ చైల్డ్ గా పిల్లలు ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందో తనకు అనుభవమేగా .  ఆవిడ తన భర్తని వద్దనుకుంది. అతనూ వద్దనుకున్నాడు .  కానీ ఆ బిడ్డడికి తండ్రి ప్రేమ , పేరూ రెండూ కావాలనుకుంటే ..? గమనంలో సందేహం .
తన విషయం అలా కాదే .. అమ్మ తన భర్తను వద్దనుకోలేదు . కావాలని వదులుకోనూలేదు .  ఆడపిల్ల పుట్టిందన్న ఏకైక కారణంతో అతనే తప్పుకున్నాడు .  ఎంత వివక్ష ? ఆనాటినుండీ ఈనాటివరకూ  ఏనాడన్నా ఇటు తొంగి చూశాడా .. లేదే .. చచ్చామో బతికామో కూడా అతనికి తెలియదు .  ఇదే నగరంలో మంచి స్థాయి ఉద్యోగి అని మాత్రమే తనకి తెల్సు.  లీగల్ గా  వెళ్తే మీ అమ్మకి , నీకు ఎంతో కొంత ఇవ్వకపోడు మీ నాన్న . నిజానికతను మంచివాడే .  ఎవరికైనా ప్రాణభీతి ఉంటుంది కదా .. అందుకే మిమ్మల్ని కాదనుకున్నాడు.  మీ అమ్మకి ఇంత కష్టపడే పని ఉండదు అంటూ అమ్మకి  నచ్చచెప్పమని ఫోన్ చేసినప్పుడల్లా నాతో నస పెడుతుంది అమ్మమ్మ .  అతన్ని మీ నాన్న అని అమ్మమ్మే కాదు ఎవరన్నా నాకు ఒళ్ళు మండిపోతుంది .
నేను అమ్మని గౌరవిస్తాను . వద్దని పోయిన వాడి సొమ్ము తానొద్దనుకుంది అమ్మ .  అదే నామాట అని చెప్తే  ఇదెక్కడి పిచ్చి మాలోకం అని గోలపెడుతుంది అమ్మమ్మ .
ఎక్కడో పెళ్ళిలో చూసి అమ్మ కుటుంబస్థాయి వేరైనా  ఏరికోరి పెళ్లి చేసుకుని  డెలివరీకి పుట్టింటికి పంపకుండా తన దగ్గరే ఉంచుకున్నాడట అతను.  ఊళ్ళో వైద్య సదుపాయాలు అంతంతమాత్రమని అమ్మమ్మ తాతయ్య వాళ్లనే తమదగ్గరికి పిలిపించాడట.  అంతా అమ్మపై ప్రేమ.   పుట్టబోయే బిడ్డ పై అప్పుడే ఎంత మమకారమో అనుకున్నారట . అమ్మ అదృష్టానికి పొంగిపోయారట .  కానీ ..  ఏం జరిగింది ? నేను పుట్టిన ఘడియలు బాగోలేదని నన్ను చూడొద్దని అతనికి వాళ్ళమ్మ  చెప్పిందట .  నా జాతకం జ్యోతిష్కుడి దగ్గర చూపించిందట . గడ్డం దగ్గర రూపాయి బిళ్ళంత నల్లటి మచ్చతో పుట్టిన బిడ్డ తండ్రికి ప్రాణగండమని జ్యోతిష్కుడు చెప్పాడట.  హాస్పిటల్ బిల్ కట్టాడు కానీ మా మొహమే చూడలేదట. అమ్మ పరిస్థితికి  తాత భోరున ఏడ్చి ఊరికి వచ్చెయ్యమంటే అమ్మే వెళ్లలేదట. అతను  మనసు మార్చుకుని వస్తాడన్న ఆశతో కొంతకాలం ఎదురు చూసింది అమ్మ . ఆ ఆశతోనే బతికింది.
అమ్మా తాతయ్య వాళ్ళతో వెళ్లి ఉండాల్సింది కదా అని చాలాసార్లు అడిగింది . అప్పుడు రాని సమాధానం ఇప్పుడు వచ్చింది ఆమె సంభాషణ ద్వారా .. అమ్మని ఇంటికి తమతో తీసుకువెళ్తే ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ల భారం నెత్తిపై ఉంది . దానికి తోడు ఈ తల్లీకూతుళ్లను తీసుకుపోతే ఇంకా పెరిగే ఇబ్బందులగురించి అమ్మమ్మ తాతయ్య మాటలు విన్న అమ్మ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకొంటూ తనబతుకు తను బతికింది.
అందరి సానుభూతి భరించడం కష్టం అనుకున్న అమ్మ ఊళ్ళోని సామాజిక పరిస్థితుల్లో ఇమడలేననుకుంది .  ఒంటరిగా బతకడం అలవాటు చేసుకుంది.  గుప్పెడు మనసులో చప్పుడు  లేకుండా ఆలోచనలు, అనుభూతులు దాచిపెట్టుకుంది .   సరదాగా నేర్చుకున్న యోగ , కూచిపూడి నాట్యం వృత్తిగా మార్చుకుంది.  తన కాళ్లపై తాను నిలదొక్కుకుంది .  కానీ మానసికంగా శారీరకంగా ఎంతో నలిగిపోయింది. ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది .  తన బిడ్డకు తను తప్ప ఎవరూ లేరు . తాను మాములుగా ఉండాలి . తన బాధలేవీ తెలియకుండా పెంచాలనుకునేది.  ఏలోటూ రానివ్వకూడదని కష్టపడేది .  నాకు తెలిసినదగ్గరనుండీ గమనిస్తూనే ఉన్నా .. అమ్మకి సామాజిక జీవనం, పెళ్లిళ్లు పేరంటాలు దాదాపు లేనట్లే.  ఎటు వెళ్లాలన్నా ఆర్ధిక సమస్యలకుతోడు సవాలక్ష ప్రశ్నలకు జవాబు చెప్పలేనితనం అని అమ్మతో సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ అర్ధమవుతోందని మదిలోనే తలపోసింది గమన .  ఆమె ఆలోచనలను భంగపరుస్తూ
‘జాతి భద్రత కోసం పాస్పోర్ట్ లో తండ్రి పేరు అవసరమంటాడా పోలీసాఫీసర్ .. హు .. తండ్రి పేరుకీ దేశభద్రతకీ సంబంధం ఉందా ..?’ తల్లి అంటున్న మాటలు చెవినపడ్డాయి.
ఆడపిల్ల పుట్టుకకు కారణమైన తండ్రి ఆమెను వదిలించుకుంటే .. దేశాన్ని రక్షించాల్సిన పోలీస్ తండ్రి పేరుతోనే దేశ భద్రత అంటున్నారు .. అసలు వీళ్ళమెదడులో ఏముంది ? పెండముద్దా .. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడతారు . తాము ఏమి చేసినా మాట్లాడినా చెల్లిపోతుందనుకుంటారా .. చెలరేగుతున్న అనేకానేక ప్రశ్నలను అదుపుచేస్తూ గమన చెవిలో తల్లి మాటలు
‘అప్పుడు తెలియక అతన్ని రోడ్డుపైకి ఈడ్చలేదు .. ఆతను లేకుండా నా బిడ్డను నేను పెంచుకుంటాననే మొండి పట్టుదల, మా అమ్మానాన్నలకు నేనూ నా బిడ్డ భారం కాకూడదు అనే భావన తప్ప ఏమీ తెలియదానాడు . సమాజం నుండీ వచ్చే సవాళ్ల గురించీ ఆలోచించలేదు .  నన్నూ నా  బిడ్డనీ వద్దనుకున్నాడని అర్ధమయినప్పుడు గుండెలవిసేలా ఏడ్చాను. పల్లెటూరునుండి వచ్చిన అమాయకత్వం ఆనాటిది.  అదే ఇప్పుడయితే ఏ విధంగా ఉండేదాన్నో ..
మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ మొగుడువదిలేసిన కూతుర్ని తమతో తీసుకుపోయి దగ్గర ఉంచుకోవడానికి అమ్మానాన్నలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్ధమయిన తర్వాత, ఈ జీవితం నాది.  నా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా నేను నేనుగా బతకడానికి నన్ను నేను సన్నద్ధం చేసుకున్నాను.  సమూహంలోంచి నాలోకి నేను ఒదిగిపోయి బతికాను .   సమాజం మనం ఎలా ఉండాలో చెప్తుంది కానీ .. మనం ఎలా ఉంటే అలా స్వీకరించదు  ఎందుకో .. ‘  మనసు మడతలను విప్పుతూ స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి నూనె పోస్తూన్న  గాయత్రి .
ముక్కూమొహం తెలియని వాళ్లిద్దరూ చిరకాల మిత్రుల్లాగా మాట్లాడుకోవడం చూస్తే గమనకి ఆశ్చర్యంగా ఉంది .  తన స్టూడెంట్స్ తాలూకు పేరెంట్స్ వచ్చినా చాలా తక్కువగా .. అవసరానికి మించి ఒక్కమాట మాట్లాడని అమ్మ  ఈ రోజు మొదటిసారి మనిషినైనా చూడకుండా పెదాల మధ్యన దాచిన మౌనాన్ని ఛేదించుకొని మాటలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆమె మనసు లోతుల్లో దాగిన విషయాల్ని పరుస్తోంది.   నా పాస్పోర్ట్ సమస్య మొదలయినప్పటి నుండి అమ్మలో చాలా మార్పు . తానెన్నడూ ఊహించని మార్పు.
ఆ  నడకలో , మాటలో , చేతల్లో .. ధీరత్వం .. ఆత్మవిశ్వాసం ప్రస్ఫూటంగా కనిపిస్తన్నాయి .  మళ్ళీ అమ్మ సమూహంలోకి . నిశ్శబ్దపు కౌగిలిలోంచి బయటికి చీకటి చిక్కుముడుల దారులు విప్పుకుంటూ .. కాలం గీసిన చిత్రం ఎంత విచిత్రం .. తల్లిగురించే ఆలోచిస్తూ గమన

తననే తదేకంగా చూస్తున్న గమనని గమనిస్తూనే ఉంది గాయత్రి . తరిగిన కూరగాయలు పొయ్యిమీద వేసి,  చపాతీ పిండి కలుపుతూ మాట్లాడుతూనే ఉంది .

‘తండ్రి ఎవరో తల్లి చెప్తేనే బిడ్డకి తెలిసేది . కానీ తల్లిని బిడ్డకి ఎవరూ పరిచయం చేయనవసరం లేదే .. హాస్పిటల్ వారు బిడ్డ పుట్టగానే ఇచ్చే సర్టిఫికెట్ లోనూ తాను బిడ్డను కన్నట్లే ఇచ్చారు  కదా .. అతను కనలేదు , పెంచలేదు . కనీసం మొహం చూడలేదు . అలాంటప్పుడు తల్లిపేరు తప్పని సరి కావాలి కానీ తండ్రి పేరు కాదు కదా .. తల్లిపేరు పెట్టుకోవడం నా జన్మ హక్కు . నా పుట్టుకకు కారకుడయ్యాడేమో కానీ నేను నా తండ్రి అని చెప్పుకునే అర్హత అతనికి లేదు .
కూతురుగా నన్ను ఎప్పుడో వదిలేసిన ఆ తండ్రి పేరు ఉంచుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవలిసింది నేను కానీ వాళ్ళు కాదు . ఏంటో ఈ సమాజంలో .. మనకోసం మనం ఏర్పరచుకున్న చట్టాలు మనం మార్చుకోలేమా .. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పుతేలేరా ..?  అంటూ నా కూతురు వేసిన  ప్రశ్నలే  నాలో కొత్త చైతన్యాన్ని రగిలించింది .
నా చిట్టితల్లి అప్పుడే ఇంత పెద్దయిపోయిందో.. ఎంతబాగా ఆలోచిస్తోందో ..
నాకెప్పుడూ అలాంటి ఆలోచనే రాలేదెందుకు ?  నిండా 15 ఏళ్ళు లేని దీనికి ఎంత చక్కని విశ్లేషణ?  అని దాని మాటలు వింటూ ఆశ్చర్యపోతూనే ఉంటాను. పుస్తకాల పురుగులా ఎప్పుడూ చదువుతూ ఉంటుందిగా .. అందుకే ఇంత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుందేమో అనిపిస్తుంది ‘ కూతురి గురించి గర్వంతో ఉప్పొంగిన స్వరంతో గాయత్రి .
‘నిజమేనండీ .. ఎప్పుడైనా ఎక్కడైనా తల్లి పేరు తప్పని సరి కావాలి కానీ తండ్రిపేరు కాకూడదు కదా .. అద్భుతంగా చెప్పింది  మీ అమ్మాయి . ‘ ఏం చదువుతోంది అవతలి నుండి  మాలతిమాధూర్ ప్రశ్న ..
అదేమీ వినిపించుకోని గాయత్రి ‘ ఒకప్పుడెప్పుడో పిల్లల్ని తల్లి పేరుతోనే గుర్తుపట్టేవారని చరిత్రలో చిన్నప్పుడు చదివిన గుర్తు’  జ్ఞాపకాల జాడల్లోకి వెళ్ళబోతున్న గాయత్రి మాటల  మధ్యలోనే అందుకున్న మాలతీ నవ్వుతూ
‘గౌతమీపుత్ర శాతకర్ణి .. ‘
‘హా.హ్హ ..
ఆ కాలంలోలాగా తల్లిపేరుతోనే గుర్తింపు కావాలని నేను కోరుకోవడం లేదు. కానీ, తండ్రిపేరు లేని కారణంగా నా కూతురు  పాస్పోర్ట్ పొందే హక్కుని కోల్పోవడమే ముల్లులా గుచ్చుకుంటోంది . ఒంటరిగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా కలగని దుఃఖం ఇప్పుడు గుండెనిండా ..
తండ్రి పేరు రాయలేదని పోలీస్ క్లీరెన్సు ఇవ్వరట ..
ఆ బిడ్డపుట్టుకకకు ఎవడో ఒకడు కారణమై ఉంటాడుగా వాడి పేరు రాస్తే పోతుందని , ఏదో ఒక పేరు రాస్తే పోలా .. అనీ ఉచిత సలహాలు .
అలా ఎందుకు రాసుకోవాలి?   నా జీవితంలో లేనివాడి లేనిపోని బరువుని నేను మోయలేను అంటూ  నా కూతురు నుండి ఛేదించుకు వచ్చే ప్రశ్నలు..
అక్కడికీ పోలీస్ ఆఫీసర్ నీ , పాస్పోర్ట్ ఆఫీసర్ని కలిసి నా పరిస్థితి వివరించా. ఆర్థికంగా , సామాజికంగా , మానసికంగా ఎన్ని ఇబ్బందులు , సమస్యలూ వచ్చినప్పటికీ  కూతురిని నేనెలా పెంచుకొచ్చిందీ తెలుపుతూ  అఫిడవిట్ సబ్మిట్ చేశాను.  ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న నా బిడ్డని గౌరవించకపోయినా  తండ్రిపేరు కోసం వత్తిడి తేవద్దని ప్రాధేయపడ్డాను.
అది తెలిసిన నా కూతురుకి చాలా కష్టం కలిగించింది .  నాకు పాస్పోర్ట్ లేకపోయినా ఫర్వాలేదు .  నువ్వుమాత్రం ఎవ్వరినీ ప్రాధేయపడొద్దని గట్టిగా చెప్పింది .
పాస్పోర్ట్ పొందడం  నా జన్మ హక్కు . ఎన్నాళ్లీ హింస ఉండేది?  ఆకు రాల్చిన చెట్టు చిగురించక పోదు . అట్లాగే మన జీవితాలూ ..  ఈ రోజు కాకపోతే రేపు .. రేపు కాకపొతే మరోరోజు ..
ఇవ్వకుండా ఎక్కడికి పోతారు .. ఆ రోజు వస్తుంది .  న్యాయ బద్దంగా ఎందుకు ఇవ్వరో మనమూ చూద్దాం . మార్గాలు దొరక్కపోవు . ఈ సారి కాకపొతే మరో సారి నాకు అవకాశాలు రాకపోవు. మనం ఎవ్వరినీ ప్రాధేయపడాల్సిన అవసరం లేదంటుంది.  నేను ఇబ్బంది పడిపోతున్నాని అది దాని అవకాశాలు వదులుకోవడానికి సిద్దమైపోయింది…  ‘  గాయత్రి తనలో మూటకట్టుకున్న బరువును తేలికపరుచుకుంటూ .
పిల్లల్ని దత్తత తీసుకుంటే .. IVF మరో పద్దతిలో పిల్లల్ని కంటే ..  వాళ్ళకి తండ్రి ఎవరని చెప్తారో .. మన చట్టాలకు కళ్ళు చెవులే కానీ బుర్ర ఉండదా ..?  ప్రతి పౌరుని హక్కుని గౌరవించాల్సిన పనిలేదా ? సింగల్ పేరెంట్ గా ఉన్న తండ్రిని అడగాలి తల్లి ఎవరని ?   ఇడియట్స్ … అన్ని చోట్లా తండ్రి పేరు లేదా భర్త పేరు .. మరి భర్తని భార్య పేరు అడగరెందుకో ..? పాస్పోర్ట్ కోసమే కాదు ఎక్కడైనా ఎప్పుడైనా ముందు ఉండాల్సింది అమ్మ పేరు…  గమన ఆలోచనలకు అప్పుడప్పుడూ  అడ్డుకట్టవేస్తూ తల్లి మాటలు చెవిలో పడుతున్నాయి
తనదగ్గర డాన్స్ నేర్చుకునే అమ్మాయి తల్లి సలహామేరకు చేంజ్ . ఆర్గ్ లో పిటిషన్ వేసింది .  పాస్స్పోర్టులో సింగల్ పేరెంట్ పేరు ఉన్నా సరిపోయేలాగా మార్పులు తేవాల్సిన అవసరం గురించి . అందుకు సహాయం కోరుతూ ప్రధానమంత్రితోపాటు , స్త్రీ శిశు సంక్షేమ శాఖామంత్రి , హోం వ్యవహారాలమంత్రి , విదేశాంగ మంత్రి లకు అర్జీ పెట్టుకుంది .
మూడోరోజుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి నుండి మెయిల్ ..  అర్జీ ని  సపపోర్ట్ చేస్తూ ..
చీకటి రెక్కలు విరుస్తూ వెలుతురు మెట్లు ఎక్కుతున్న అమ్మది సాహసవంతమైన జీవితం. ఈ తల్లికి బిడ్డనయినందుకు గర్వంగా ఫీలయింది గమన .  ఆ వెంటనే తన మిత్రురాలు స్వాతి వాళ్ళమ్మ గమన కళ్ళముందు మెదిలింది. ఆమెను స్వాతితో సహా వాళ్ళింట్లో అందరూ కరివేపాకులా తీసిపడేస్తారు. పెదవి విప్పని దుఃఖాన్ని మోస్తూ ఏ క్షణమైనా వర్షించే మేఘాన్ని తలుపుకు తెస్తుందావిడ.   మళ్ళీ ఆమెలేకుండా వాళ్లకి ఒక్క క్షణం గడవదు.  అమ్మని దేవతతో పోలుస్తుంటారు కదా .. మరి ఆ అమ్మకి విలువేమీ ఇవ్వరు  ఎందుకో ..?  అసలే అర్ధం కాదు అనుకుంటూ లేచి టీవీ పైనున్న రిమోట్ అందుకుంది గమన .
స్క్రోల్ అవుతున్న వార్తలు చూసి ‘అమ్మా .. ఇటుచూడు ‘ సంతోషంతో  గట్టిగా అరిచింది
ఏమిటన్నట్లుగా ఫోన్ మాట్లాడుతూనే చేస్తున్న పనిని ఆపి టీవీ కేసి దృష్టి సారించింది గాయత్రి .
ఒంటరి తల్లి ఆవేదనతో పాస్పోర్ట్ నిబంధనల్లో మార్పులు.  ఇకనుండి తల్లిదండ్రుల పేర్లలో ఎవరో ఒకరి పేరు రాసినా సరిపోతుంది…  న్యూస్ కొనసాగుతోంది .
కరిమబ్బును సవాలు చేసే ఈ నక్షత్రం ఒంటరి కాదు.  ఎన్నో నక్షత్రాలు ఆమె చుట్టూ  ఓ గేలక్సీలా .. చంద్రకాంతుల మెరుపులతో కాంతులీనుతున్న అమ్మ మొహంలోకి  తదేకంగా చూస్తూ  ఆమె నుండి స్ఫూర్తి పొందుతూ , ఆరాధనాపూర్వకంగా చూస్తోంది గమన .
వి . శాంతి ప్రబోధ
Story Published in Bhumika March 2017

పడమట ఉదయించే సూర్యుడు

నా గాలికి నా మట్టికి నా ఊరికి చేరువవుతున్న కొద్దీ పులకరింత నా తనువంతా వ్యాపిస్తూ..   శరీరం దూదిపింజలా తేలికైపోతోంది. ఎంత వడివడిగా వేసినా నా అడుగులు నెమ్మదిన్చినట్లుగా.. నా ఇంటిదారి దూరం పెరిగిపోయినట్లుగా ..  ఏమిటలా..  అంతలోనే అదిమిపెట్టిన సందేహాలు మళ్ళీ మళ్ళీ పొడుచుకొస్తూ..   నా వాళ్ళు నన్ను గుర్తిస్తారా ..   దాదాపు పదిహేనేళ్లపైనే అయింది చూసి ..   ఎటుపోతున్నాడో కూడా తెలియకుండా .. పోయి పోయి .. ఇప్పటికి ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళకి తనవారికి చేరువ కాబోతున్నాడు .  వాళ్ళంతా తనని మరచి పోయారేమో..  అమ్మ కన్నీరు ఇంకిపోయేలా ఏడ్చి ఉంటుంది.  నాన్న మనసులో మెలిపెట్టే బాధని నుదుటి మడతల్లోనో బుర్ర మీసాల్లోనో దాచేసి అమ్మని ఓదార్చి ఉంటాడు. అసలు ఏమయ్యాననుకున్నారో.. ఆలోచనల్లోనే ఊళ్ళోకి అడుగుపెట్టేశాడు  సురేష్.

గంపెడు పిల్లలకోడిలా సందడి సందడిగా ఆప్యాయత అభిమానం కలబోసిన ప్రేమపూర్వక పలకరింపులూ, పరాచికాలూ, ఆత్మీయకలయికలూ, ఎంతో నిండుగా సవ్వడి చేసే పిల్లల కేరింతలు, లేగదూడల అంబా అరుపులూ ,  పిచ్చుకల కువకువలూ, కోయిల పాటలూ, పక్కగా పారే సెలయేటి గలగలలూ, పచ్చని పొలాల మీదుగా వీచే పైరగాలి .. , ఇళ్ళముందు ఆహ్వానం పలికే బంతీ చేమంతులు, మల్లె-మందారాలు, గులాబీల గుబాళింపులు కంటికింపుగా హరివిల్లులా కదలాడే తన పల్లె  స్వాగతించే క్షణాలకోసం తపించి పోయిన సురేష్ మూగనోము పట్టినట్లున్న ఊరిని చూసి ఆశ్చర్యపోతూ .. ఈ సాయం సంధ్యా సమయంలో వడివడిగా ఇళ్ళకు చేరే కూలీ మహిళలు, రైతులు,  పశువులు ఏరీ.. ఎక్కడ .. ?  రకరకాల సందేహాలు మదిలోంచి తొలుచుకోస్తుంటే చుట్టూ పరికిస్తూ నడుస్తున్నాడు సురేష్.

పూరిపాకల స్థానంలో డాబా ఇళ్ళు  అక్కడక్కడా.  చాలా ఇళ్ళు పాడుబడ్డట్టుగా.  ఆ పచ్చదనం ఆ నిండుదనమే లేదు.  కళాకాంతి విహీనంగా .. ఒక్క మాటలో చెప్పాలంటే వల్లకాడులా అగుపిస్తూ .. పెంటకుప్పలపై కాళ్ళతో కెలికి ఆహారం అన్వేషించే కోళ్ళు .. చెట్లపై చేరే పక్షుల కిలకిలారావాలు.. ప్రకృతిలో మమేకమైన ఆ క్షణాలు గుర్తుకొస్తుంటే సావాసగాళ్ళేవరన్నా కన్పిస్తారేమోనని చుట్టూ పరికిస్తూనే తన ఇంటి ఆనవాళ్ళకోసం ప్రయత్నిస్తున్నాడు.  నీళ్ళు మోసే అమ్మలు, అవ్వలు , అక్కలు చెల్లెళ్ళు ఎవరూ కన్పించరేం .. ఆలోచిస్తూ నాలుగడుగులేశాడోలేదో మంచినీటి  బోరింగ్ దగ్గర రంగువెలసిన ప్లాస్టిక్ బిందెలతో ఇద్దరు మహిళలు. ఒకావిడ వెళ్తూ , మరొకావిడ పంపుకొడుతూ..  మిలమిలలాడే ఇత్తడి బిందెలు , తళతళలాడే స్టీలు బిందెలు, వెండిలా మెరిసే సీమెండి బిందెలు కళ్ళలో మెదులుతుండగా .. కళ్ళు చికిలించి చూస్తున్నవారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.  ఎండిపోయినట్లున్న బక్క పలచటి అవ్వను చూస్తుంటే బాగా ఎరిగిన పోలికల్లాగే… పోల్చుకోడానికి అతని మెదడు వేగంగా కదులుతోంది. ప్చ్.. లాభం లేదు. ఆమె నీళ్ళ  బిందెతో వెళ్లి పోయింది

ఊరు మొదట్లోనే బోరింగ్ దగ్గరలోనే తన ఇల్లు.  కాని ఆనాటి నా ఇంటి ఆనవాళ్ళేవీ.. లేవే. .  ఎలా గుర్తించను ? ఇల్లు డాబాగా మారిందనుకున్నా వెనకదోడ్లో ఉండే మామిడి, తాటి, ఎదర ఉండే కొబ్బరి చెట్లేవని వెతికాయి అతని కళ్ళు.   ఊళ్లో అసలు తాటిమానే కనిపించలేదు.  అక్కడక్కడా తలలు విరిగిన కొబ్బరి చెట్లు అనాధల్లాగా .. గత జీవితానికి మూగసాక్షిగా నిలిచినట్లుగా ఉన్న ఊరిని చూసి అతని మనసు మూగగా రోదిస్తోంది. ఇంటర్నెట్ సహాయంతో వెతికి వెతికి చివరికి తన ఊరు చిరునామా తెల్సుకోగలిగాడు. పైస పైసా కూడబెట్టుకుని ఎంతో  ఆత్రుతతో, ఉత్సాహంతో వచ్చాడు తన వారికోసం.  హృదయం అయిన వారి కోసం తహ తహ లాడిపోతోంది. కానీ  ఏ ఆధారంతో గుర్తించను నా ఇంటిని. తల్లిదండ్రులనైనా గుర్తించగలనా.. ఈ పదిహేనేళ్ళల్లో గుర్తించలేనంతగా మారిపోతారా మనుషులు..? అనుకుంటుండగా..  భూమికి జానెడు బెత్తెడు లేని నీవు, పొట్టి నిక్కర్లు వేసుకుని తిరిగే నీవు తాటిచెట్టులా ఎదగలా .. ప్రశ్నించింది అతని మనసు.

సురేష్ కి అర్ధమైపోయింది తన ఇల్లు గుర్తించడం కష్టమని. మరో బిందె నీళ్ళ కోసం వస్తున్న ఇందాకటి అవ్వకెదురెళ్ళి బుస్సా రాఘవులు ఇల్లు ఏదని అడిగాడు.  ఆవిడ అలా అతని వైపే కళ్ళార్పకుండా చూస్తోంది .  దీర్ఘంగా చూస్తోంది. పడమటి అరుణకిరణాలు ఆకళ్ళ మీద పడ్డాయేమో కళ్ళు చిట్లిస్తూ.. ఎవరు బాబూ అడిగింది బావిలోంచి వచ్చినట్లున్న గొంతు సవరించుకుంటూ.   అడుగులో అడుగువేస్తూ ఆమె దగ్గరగా వెళ్లి మళ్ళీఅడిగాడు.  ‘ఎందుకు బాబూ’ అంటూ తన ఇంటికేసి కదిలిందామె.

ఆమె వెనకే అడుగులేస్తున్న సురేష్ ని చూసిన మరో స్త్రీ ‘ఇంతకీ మీరెవరు బాబూ .. ‘ ప్రశ్నించింది.

‘నేను రాఘవులు కొడుకుని’ ఉద్వేగంగా చెప్పాడు.

“ఎవరూ..” అవ్వ గొంతులో ఉత్కంట, ఆశ్చర్యం.  ‘ఆ .. రాఘవులు కొడుకువా .. అంటే .. ” తను విన్నది నిజమా అని సందేహం ఆమెలో.

‘అవును  నేను బుస్సా రాఘవులు పెద్ద కొడుకుని…’అతని మాటలు పూర్తి కాకుండానే అవ్వ సురేష్ దగ్గరకి వచ్చి చూస్తోంది.  మసకమసకగా అగుపిస్తున్న అతని  చేతులు పట్టుకుని నలిపేస్తూ.. ‘పెద్దోడా.. ‘ అంటూ ఏడవడం మొదలు పెట్టింది.  ఆవిడ ఎందుకు ఏడుస్తోందో ..అర్థం కాక అయోమయంలో .. అతను. ఆమె స్పర్శ అతన్ని కదిలిస్తోంది..

‘ ఎందుకేడుస్తావే .. లేడు రాడనుకున్న కొడుకు చెట్టంతై నిలువెత్తు బంగారంలా నిన్నెతుక్కుంటూ వస్తే ఏడుస్తావేమే..?’ సముదాయిస్తోంది మరో స్త్రీ.

‘కన్న కొడుకు కళ్ళ ముందుకొస్తే గుర్తించలేని గుడ్డి దాన్నయ్యానే..’ మరో సారి రాగం తీస్తూ కళ్లోత్తుకుంది. కొడుకు ఒళ్ళంతా ప్రేమగా తడుముతోంది ఆమె. అవును, అది తన తల్లి స్పర్శే.  అంటే .. అమ్మ.. అమ్మ అంత ముసలిదై పోయిందా..నిండు పున్నమిలా వెలిగే అమ్మ మొహంలో రెండు కొండల మధ్యనుండి ఉదయించే సూర్యుడిలా వెలిగే బొట్టు .. ఏది ?  కొడిగడుతున్న దీపంలా ఉన్న ఈమె తన తల్లి.. అతని కళ్ళు ఒప్పుకోవడం లేదు.  కానీ ఆ స్పర్శలోని వెచ్చదనం అమ్మ అనే చెబుతోంది. సగం జీవితం చూడని అమ్మ అంత ముసలైందా..  తలెత్తే ప్రశ్నలని అదిమి ‘అమ్మా ‘ అంటూ తల్లిని అల్లుకుపోయాడు సురేష్ .

‘నాయనా ఉన్నావా.. బాగున్నావా .. నా బంగారు తండ్రీ ఈ ముసలి తల్లిని వెతుక్కుంటూ వచ్చావా.. ఏమై పోయావురా బంగారు తండ్రీ ‘అంటూన్న ఆమె మొహంలో అమావాస్యనాడు పూర్ణచంద్రుడు వచ్చినట్లుగా .. వెలుగు.  ఏళ్ల తరబడి దాగిన దుఃఖం కట్టలు తెంచుకుని కళ్ళలోంచి జలపాతంలా దుముకుతుండగా..  జమిలిగా ఎగిసి పడుతున్న దుఖాన్ని  సంతోషాన్ని కొంగుచాటున బంధించి గుండెల్లో దాచుకుంటూ కొడుకు చేయి అందుకుని లోనకి నడిచింది.  గడపలోంచి లోపలికి అడుగుపెడ్తుంటే కనపడిందా ఫోటో .. ఎప్పుడో వేసిన మాసిన దండ వేలాడుతూ. అది నాన్నది. అవును నాన్నదే.  అంటే.. నాన్న లేడా.. అతని హృదయంలో మేఘాలు కమ్ముకుంటూ.. ఇద్దరి మధ్య మౌనం.. ఆ మౌనంలోనే.. ఆ స్పర్శతోనే ఏళ్ల తరబడిన ఎన్నెన్నోవిషయాలు మాట్లాడేసుకున్నారు.

****                          ****                     ****

అమ్మమ్మ వాళ్ళ ఇంటినానుకునే యన్టిపిసి ప్రహరీ గోడ.  ఆ గోడ కట్టక ముందు అక్కడికి  వచ్చే రకరకాల పరికరాల్ని, యంత్రాలని, వాటిని తెచ్చే 20 చక్రాల లారీల్ని ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టో.. కళ్ళప్పగించో చూసే వాళ్ళం.  ఒక్కోసారి వాటి వెనకే పరుగెత్తడం చాలా సరదాగా ఉండేది. వాటిని చూడడం కోసమే సెలవోస్తే చాలు అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. అమ్మమ్మ  ఊళ్లో చూసిన వాటి గురించి స్కూల్లో మిత్రులకి చిలువలు పలువలు చేసి ఎంతో గొప్పగా చెప్పేవాడు. ఎప్పటిలాగే అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు 20 చక్రాల లారీ ఎక్కబోతే అప్పటికే అది కదిలింది.  మామ ఎక్కడినుంచి చూశాడో పట్టుకుని తన్నాడు కర్రతో.  నేను చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయా.. ఆ 20 చక్రాల లారీ పైనే. ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండా బయలుదేరా.  మొదట అంతా గమ్మత్తుగా అనిపించినా తర్వాత భాష తెలియక ఇంటికి వచ్చే మార్గాలు లేక ఎంత బాధపడ్డాడో.. అయినవారికోసం ఎంత బెంగపడ్డాడో..ఎంత నరకం అనుభవించాడో..  చెప్పి అమ్మను మరింత బాధ పెట్టలేననుకుంటూ తల్లి వొడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు సురేష్. ఇన్ని సంవత్సరాలు కోల్పోయిన అమ్మ వొడి వెచ్చదనాన్ని అనుభవిస్తున్నాడతను.

ఒక క్షణం కళ్ళు మూస్తే కనుల ముందు ప్రత్యక్షమైన కొడుకు ఎక్కడ మాయమైపోతాడోనన్న భయం ఆమెలో .. అసలు ఇది కలా నిజమా  కొడుకు తల నిమురుతూ .. మనేద తీర్చుకుంటూ .. ఒకరికొకరు ఓదార్పు పొందుతూ ..

సురేష్ రాక తెలిసి ఊర్లో ఉన్న నలుగురూ జమయ్యారు. ఎవర్ని చూసినా ఒంట్లో సత్తువంతా ఎవరో పైపేసి లాగేసినట్లుగా కనిపిస్తున్నారు.  ఉన్న కొద్దిపాటి పొలం యన్టిపిసి కింద పోయింది. యాష్ పాండ్ కోసం ఊళ్లో చాలా మంది వరి పొలాలు, మెరక పొలాలు  యన్టిపిసి తీసేసుకుంది.  ఎప్పుడూ చూడనంత డబ్బు వస్తుందన్న ఆశతో బంగారం పండే భూముల్ని ఎర్రోల్లమై ఇచ్చేశాం. ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ చేసే వ్యవసాయదారులమంతా కూలీలైపోయాం. ఇప్పుడు చేతులు పిసుక్కుంటే ఏం లాభం?  పొగ .. బూడిద .. జబ్బులు.. సమాధులూ..మొహమాటానికి పోయి ముండ కడుపుతెచ్చుకుందట అట్లా ఉంది మా యవ్వారం.. బిచ్చమేసినట్టు చిల్లరమల్లరగా ఇచ్చిన సొమ్ము ఎటోయిందో.. ఇంటింటికీ ఉద్యోగమిస్తామని కంపెనీ పెట్టకముందు చెప్పారా..  ఏదీ ? ఊరికొక కోక ఇస్తే ఇంటికొక ఈక అన్నట్టు..  ఏంజేత్తాం ?  గొర్రె కసాయిని నమ్మినట్టు నమ్మాం.  ఎవురు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారంటే ఇదే మరీ.. తలోమాట చెప్తున్నారు జనం. అంతా కలగాపులగంగా .

పవర్ ప్లాంట్ లో కూలీగా చేరిన నాన్న పనినుండి సైకిల్ పై ఇంటికి వస్తూనే పడిపోయి లేవనేలేదనీ.  యాష్ పాండ్ స్లర్రిలో ఇచ్చే ఎక్కువ కూలీకి ఆశపడి పనికెళ్లిన తముల్లిద్దరి  ప్రాణాలే కాదు ఇంకొందరి ప్రాణాలు  గాల్లో కలసిపోయాయంటే అది ఎన్టిపిసి విసర్జించే విష వాయువుల వల్లేనని తెలిసి విస్తుపోయాడు సురేష్. అంటే, వాళ్ళు తీసింది ఆక్సైడ్, మెర్క్యురీ .. అయుండొచ్చు. విమానాలకి పూత వేయడానికి వాడతారు.  యాష్ లో రేడియో ధార్మికత ఎక్కువ. లెడ్ , బ్రోమైడ్ వంటి విషపదార్ధాలు శరీరంలోకి వెళ్లి విష ప్రభావం చూపుతాయి. ఎదుగుదల లేకుండా చేసే మిన్మిటా డిసీజ్ వస్తుంది. ఆ బూడిద కుప్పల్లో బూడిద  ఎగిరొచ్చి  ఊరి మీద వాలుతుంది. ఇళ్ళల్లో కళ్ళల్లో పడుతుంది . కంటి నల్లగుడ్డు నెమ్మదిగా రంగు వెలిసిపోతుంది. చూపు మసకవారుతుంది. గ్రీన్ క్లైమేట్ పత్రికలో చదివిన విషయాలు సురేష్ మదిలో మెదిలాయి.  అందుకే అమ్మకి చూపు తగ్గిపోయిందేమో అనుకుంటుండగా ..

 ఆ యాష్ కొందరు లారీల్తో పట్టుకుపోయి సిమెంటులో కల్తీ చేసి అమ్ముకుంటారు… కంపెనీ వదిలే వ్యర్ధాల వల్ల భూగర్భ జలం అంతా పాడయిపోయింది. తాగడానికి నీళ్ళు లేక నానా యాతన పడతన్నాం . కంపెనీ వోల్లని సాయమడిగితే లేదు పోమ్మన్నారు.  ఉద్యోగాలివ్వకపోతే పోయారు. కనీసం గొంతు తడుపుకోడానికి నీళ్ళు ఇవ్వొచ్చుగా …  లేదు , బతిమాలాం .. పెద్ద పెద్దాళ్ళని కలిశాం.  ఓట్ల కొచ్చిన వాళ్ళని నిలదీశాం.  ప్చ్ .. ఏం లాభం లా .. ఉన్నకొద్దిపాటి  భూమి పాడయిపోయి.. పంటలు పోయి .. చివరికి మా జీవితాలే పోయి కాటికి చేరువయి అంటూ ప్రవాహంలా చెప్పుకుపోతున్నారు ఎవరికి వాళ్ళు.  ‘అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు చెప్పుకుంటూ పొతే వినేవాళ్ళ బుర్రలోకి ఏవెక్కుతుందీ.. అంతా ఆపండెహే .. ‘ కసిరి ‘ఒరే నాగా చదువుకున్నోడివి నువ్వు చెప్పరా’ పెద్దరికంగా అంది ఒకావిడ ఆ యువకుడికేసి చూస్తూ.  ఆ యువకుడు కొంచెం బిడియంగా ఉన్నా  గర్వపడ్డాడు.

‘మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుండా ఉంటుందా..?’ అంటూ వచ్చాడు కాళ్ళు విల్లులాగా తిరిగిపోయి మూడో కాలుతో నడుస్తున్న ఓ పెద్దాయన.  వస్తూనే ‘మీకసలు బుద్దుందా .. బిడ్డడు ఇన్నేళ్ళకి మననెతుక్కుంటూ వాకిట్లోకొస్తే .. ఈ మాటలా వాడికి చెప్పేది.  ఎప్పుడు తిన్నాడో ఏమో ఆ పని చూడండి’ అంటూ గదిమాడు.

అదేమీ వినిపించుకోని ఒకావిడ ‘ఎంకి పెళ్లి సుబ్బిచావు కొచ్చినట్టుంది. ఏ మొక్క పెట్టినా ముడుచుకు పోయి ముద్దల్లాగా అవుతాంటే ఏమ్జేత్తాం. మనుషులకేనా,  గేదలకీ గర్భసంచి రోగాలే.. ‘  తన ధోరణిలో అంటూ నిట్టూర్చింది.  అందుకేనేమో ఇంటి దొడ్లో  టమాటానో వంకాయో ఏదోకటి లేకుండా బోసిగా బావురు మంటూ ఉంది అనుకున్నాడు సురేష్ చుట్టూ పరికిస్తూ.. గంపల గంపల టమాటా కోయడం,   ఇంటిముందు ఉండే చేతిపంపు నీళ్ళు కొబ్బరి నీళ్ళలా ఉండేవని అనడం, పొరుగూరు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళడం గుర్తొచ్చి బాధగా నిట్టూర్చాడు సురేష్.

‘కంపెనీ ఊరికి దూరంగా  ఉన్నా బాగుండేది’. అన్నాడు నాగ .  ‘ ఊరు ఎప్పట్నించో ఉంది.  కంపెనీ మధ్యలో పుట్టుకొచ్చింది.  కంపెనీ వల్ల మన బాధలు చెప్తే మనల్నే పొమ్మంటుంది. ఊళ్ళో కళ్ళు తెరిచే పిల్లలు కరువయిపోతున్నారు. అమ్మ కడుపులోనే కరిగిపోతున్నారు. పుట్టినవాళ్ళు దక్కడం లేదు.  దక్కినా ఎదగడంలేదు . ఏవని చెప్పేదీ … ‘ ముక్కు నలుముకుంటూ సాగదిసింది ఒకావిడ.

నీ చెల్లికి పెళ్ళయి పదేళ్ళయినా ఇప్పటివరకూ పిల్లలే పుట్టలేదు. మొదట్లో గర్భం వచ్చినా బిడ్డ ఎదగలేదని అబార్షన్ చేసేసారుగా .. చెప్పుకొచ్చింది మరోకావిడ. రెండు పిలకలు వేసుకుని అన్నా అన్నా అంటూ వెంట తిరిగిన నా చెల్లి ఎలా ఉందో ..  సురేష్ లో అలజడిని అడ్డుకుంటూ వచ్చి చేరుతున్నాయి వాళ్ళ మాటలు.

గర్భసంచి రోగాలు .. హార్మోన్ల సమస్యలు. ఒళ్ళంతా తెల్ల మచ్చలు , కళ్ళు కనబడడం లేదని కళ్ళ డాక్టర్ దగ్గరకు వెళ్తే కాన్సర్ డాక్టర్ దగ్గరకి వెళ్ళమంటున్నారు. ఆ డాక్టర్ బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పడం మామూలయింది ఈ ఊళ్ళో. ప్లాంటు వేడికి పక్షులన్నీపొయాయి. అవి ఎక్కడా కనిపించట్లా..నక్కల ఊళలూ..అడవిపందుల జాడలూ లేవు పద్దెనిమిదేళ్ళ వయస్సు యువకుడు నాగ చెప్పుకుపోతున్నాడు.  అవునన్నట్లు మిగతా వాళ్ళు తలలూపుతూ .. అవునంటూనో మధ్యలో తామూ ఒక మాట కలుపుతూనో .. వాళ్ళ మొహాల్లో విషాద ఛాయలు అలుముకుంటూ.

పొమ్మనలేక పొగపెట్టారుగా .. నాలాంటి వాళ్ళం ఇక్కడ ఉండలేక పట్నం వెళ్లి పోయాం. కలో గంజో తాగి బతకొచ్చని. ఇగో ఈ ముసలాళ్ళు కదలమంటే కదల్నే కదలరు. నిష్టూరంగా అని ఇక్కడ జనం ఏడుస్తుంటే అక్కడ కంపెనీ లాభాల పండుగ చేసుకుంటోంది ఉద్రేకంగా చెప్పుకు పోతున్నాడు నాగ.

ఆ యువకుడి నుదిటిపై ఉన్న చింతగింజంత నల్లటి మచ్చనే చూస్తూ ‘నువ్వు అంజి తమ్ముడివా .. ‘ సంశయంగా అడిగాడు సురేష్ .  ఇన్నేళ్ళయినా బాగానే గుర్తుపట్టావే అన్న ఆశ్చర్యం వాళ్ళలో.

‘అవునన్నా, భలే గుర్తుపట్టావ్.  నేను నీ ఫ్రెండ్ అంజి తమ్ముడినని నేనే పరిచయం చేసుకుందామనుకున్నా .  ఇన్నేళ్ళ తర్వాత నువ్వు గుర్తుపట్టలేవనీ .. ‘ చిరునవ్వుతో అని  చిన్న విరామమం ఇచ్చి కళ్ళలో సుడులు తిరుగుతున్న నీటిని ఆపే ప్రయత్నం చేస్తున్నాడతను.

‘వాడినీ కంపెనీ ఎత్తుకుపోయింది మీ తమ్ముళ్ళ కంటే ముందే .. ‘ విచారవదనంతో పెద్దాయన.

 అంతలో తన కోసం కూతురు పంపిన కజ్జికాయలు, కారప్పూస ప్లేటు  తెచ్చి తినమంటూ  సురేష్ చేతిలో పెట్టింది ఓ స్త్రీ.

‘నువ్వు  తిను బాబూ,’ అని అంతా పదండి.  కాసేపు అబ్బాయిని విశ్రాంతి తిసుకోనివ్వండి ‘ అంటూ అందర్నీ తరమబోయాడు పెద్దాయన.

 ఫర్వాలేదు లేదు లెండి . మన ఊరిని చూడాలని , అందర్నీ కలవాలని ఎంతో ఆత్రుతతో వచ్చా . చెప్పనీయండి ఇక్కడి విషయాలు . ‘ గొంతు పెగిల్చిన సురేష్

‘ఇంకేముంది సురేష్ బాబూ చెప్పడానికి, ఒకప్పుడు నిండుకుండ లాంటి మన ఊరు వట్టిపోయింది. ప్రపంచపు చీకట్లు పారదోలి వెలుతురులు విరజిమ్మే పవర్ ప్లాంటు  మన గ్రామాన్ని చీకటిలోకి నెట్టేసింది.  కొందరు సమయాని కంటే ముందే కాటికి చేరితే ఇంకొందరు కాటికి చేరువలో .. అవిటివాళ్ళయి .. గుడ్డి వాళ్ళయి.. కాన్సర్ .. కిడ్నీ వ్యాధుల పీడితులై .. ‘  గుండెల్లోంచి పెల్లుబుకుతున్న ఆవేదనకి అడ్డుకట్ట వేసి బంధించడం కోసం కొద్దిగా ఆగి కళ్ళు వోత్తుకున్నాడతను.

ఇదా తను చూడాలని తహతహలాడి పరిగెత్తుకొచ్చిన తన ఊరు మౌనంగా రోదించింది సురేష్ హృదయం.  అనాధాశ్రమంలో పెరిగి చదువుకుంటూనే పర్యావరణ కార్యకర్తగా ఎదుగిన సురేష్ కల్పక్కం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలని దగ్గరగా చూశాడు.   కొన్ని సార్లు తానూ పాల్గొన్నాడు. అతనిప్పుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.  తిరిగి వెళ్తే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా మంచి ఉద్యోగంలో చేరి లక్షల్లో డబ్బు సంపాదిస్తాడు. తల్లిని దగ్గర పెట్టుకుని చికిత్స చేయిస్తాడు. చెల్లికీ సాయం అందించగలడు.  కానీ .. తన గ్రామంలాంటి గ్రామాలూ ఇలా మండిపోవలసిన్దేనా .. . ఈ కారుచిచ్చు కాల్తూనే ఉండాల్సిన్దేనా .. సురేష్ ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ ‘ప్రభుత్వాల, నాయకుల  అవిటితనం మమ్మల్ని పనికిరాని వాళ్ళుగా మార్చేసింది ‘ కాళ్ళు వంకర తిరిగిన పెద్దతను అన్నాడు.

‘శారీరకంగా , మానసికంగా శక్తి విహీనమైన తరం , మానసికంగా శారీరకంగా వికసించలేని స్థితి ..  ‘ చెప్పుకుపోతున్నాడు అంజి తమ్ముడు నాగ

ఏమీ ఎరగనట్లు .. తనకేమీ పట్టనట్లు.. ప్రపంచానికేదో మేలు చేసేస్తున్నట్లు దూరంగా వెలుగులు విరజిమ్ముతున్న యన్టి పి సి కేసి చూస్తూన్న సురేష్ లో కొత్త ఆలోచనలు .   కలకత్తా నుండి కచ్ వరకూ సాగరతీరంలో పవర్ ప్లాంట్లు పెడ్తామంటున్న విషయం అతని మదిలో మెదిలింది.  పవర్ అవసరమే . నిత్యావసరమే .. కానీ ప్రజల సంక్షేమం కూడా ప్రభుత్వం బాధ్యతేగా .. ప్రజల్ని పెనం మీద నుంచి పొయ్యిలో పడేయడం కాదుగా..?  సహజ సిద్దంగా లభించే వనరుల్ని ఎంతవాడినా తరిగిపోని ఇంధన వనరుల్ని ఎందుకు ప్రోత్సహించడం లేదు.. ఆ దిశగా సాగే పరిశోధనల్ని .. ఆ ఫలితాల్ని ప్రజలకి అందుబాటులోకి తెచ్చే యత్నం చేస్తే.. అవును , నా కార్య క్షేత్రం ఇదే .. ఇదే .. మనసులోనే అనుకున్నాడు సురేష్ .  పర్యావరణ కార్యకర్తగా తన అనుభవాలు అక్కడివారితో  పంచుకున్నాడు .

ఆసక్తిగా అన్నీ విన్న పెద్దాయన  ‘నూరు గొడ్లను తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు కదా ..’ అన్నమాట అక్కడున్నవారిని ఆలోచనలో పడేసింది .

వి. శాంతి ప్రబోధ

Published in Arunatara July, 2016

 

 

 

తేలియాడే మేఘాల్లో .. తనూజ సోలో ట్రావెలింగ్

ఒక్కదాన్నే .. నేనొక్కదాన్నే..

ఇదే మొట్టమొదటిసారి ఎవ్వరూ వెంటలేకుండా ఒంటరిగా ప్రయాణం..
బెంగుళూర్ కో,  చెన్నైకో, పూనేకో   కాదు.  చిన్ననాటి నుండి కళ్ళింతలు చేసుకుని బొమ్మల్లో చూసి మురిసిన  హిమాలయాలలో తిరుగాడడం తనను చూసి తనే ఆశ్చర్యపోతోంది తనూజ.

అద్భుతంగా .. కొత్తగా గమ్మత్తుగా.. నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి నాకు నన్నే ప్రత్యేకంగా నిలబెడుతూ .. బయటి ప్రపంచం తెలియకుండా పెరిగిన నేను నేనేనా…  అనే విస్మయాన్ని వెన్నంటి వచ్చిన ఆనందం ..  ఆశ్చర్యం మనసు లోతుల్లోంచి పెల్లుబికి వచ్చి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి .

నా కళ్ళ ముందున్న ప్రకృతిని చూస్తుంటే నేను ఉన్నది ఇండియాలోనేనా ..అనేంత  వైవిధ్యం .. ఆ చివర నుండి ఈ చివరికి ఎంత వైరుధ్యం …?

ఒకే దేశంలో ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య మనిషి ఏర్పాటు చేసుకున్న సంస్కృతీ సంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు , భాషలు మాత్రమే కాదు ప్రకృతి కూడా విభిన్నంగానే . విచిత్రంగానే ..  ఆ భిన్నత్వమే.. నూతనత్వం వైపు పరుగులు పెట్టిస్తూ..  కొత్తదనం కోసం  అన్వేషిస్తూ.. భావోద్ద్వేగాన్ని కలిగిస్తూ.. మనసారా  ఆస్వాదిస్తూ… తనువంతా ఉత్సాహం నింపుతుందేమో .. ???  ఒంకర టింకర ఎత్తుపల్లాల గతుకుల రోడ్డులో కదులుతున్న మహీంద్రా జీప్ లాగే ఆమె ఆలోచనలూ .. ఎటునుండి ఎటో సాగిపోతూ ..
తననే పట్టి పట్టి చూస్తున్న బాయ్ చూపులు, హోటల్ ఫ్రంట్ డెస్క్ వాళ్ళ చూపులూ  గుర్తొచ్చాయామెకి .  రూం బాయ్ మొహమాటంలేకుండా హైదరాబాదీ అమ్మాయిలు చాలా ధైర్యవంతులా..  ఆశ్చర్యంగా మొహం పెట్టి మనసులో మాట అడగడం,  విదేశీ మహిళలు ఒంటరిగా రావడం తెలుసు కానీ భారతీయ మహిళలు ఇలా రావడం తానెప్పుడు చూడలేదనడం జ్ఞాపకమొచ్చి ఆమె  హృదయం ఒకింత  గర్వంగా ఉప్పొంగింది. తనకిచ్చిన గొప్ప  కాంప్లిమేంట్ గా ఫీల్ అయింది.

దేశంలో ఏ మూలకెళ్ళినా భారతీయ సంస్కృతిలో ఆడపిల్లల స్థానం ఎక్కడో తెలిసిందే కదా.. ఎంత మిస్ అయిపోతున్నారు అమ్మాయిలు అని ఒక్క క్షణం మనసు విలవిలలాడింది. కానీ, కళ్ళ ముందు తగరంలా మెరిసే మంచు కొండల  సుందర దృశ్యాలు కదిలిపోతుంటే  వాటిని మదిలో ముద్రించుకుంటూ మళ్లీ ఆలోచనల్లో ఒదిగిపోయింది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనూజ.
మనసులోంచి ఎగిసివచ్చే ఆలోచనల్ని అనుభూతుల్ని ఎక్జయిట్ మెంట్ ని ఎప్పటికప్పుడు పంచుకునే మనషులు లేరనే చిన్న లోటు ఫీలయింది ఆ క్షణం.

వెంటనే హ్యాండ్ బాగ్ తెరిచి ఫోన్ అందుకుంది. సిగ్నల్స్ లేవు.
ప్చ్..  నా పిచ్చిగానీ ఈ హిమపర్వత శిఖరాలపైకి నేను వచ్చానని ఫోన్  సిగ్నల్స్ నాతో పాటు పరుగెత్తుకొచ్చేస్తాయా ? తనలో తనే  చిన్నగా నవ్వుకుంది.  ఆత్మీయనేస్తం మనోరమ ఇప్పుడుండి ఉంటే .. ప్చ్ .. యూ మిస్స్డ్  ఎ లాట్ మనో .. అవును, నిజ్జంగా  మనో .. మనని ఒక వ్యక్తిగా కాకుండా ఆడపిల్లగా చూడ్డం వల్ల ఎంత నష్టపోతున్నామో ..
నీతో చాలా చెప్పాలి మనో.  చూడు నా జీవితంలో ఇంతటి అద్భుతమైన క్షణాలు కొన్ని ఉంటాయని అసలెప్పుడయినా అనుకున్నానా .. అనుకోలేదే.  కానీ ఆ క్షణాలను మనవి చేసుకునే చొరవ ధైర్యం మనలోనే ఉన్నాయని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. వాటిని మనం తెలుసుకోవాలి. మన జీవితంలోకి తెచ్చుకోవాలి. ఆ క్షణాలిచ్చిన వెలుతురులో మన జీవితపు బండిని మనమే నడుపుకోవాలి.

నువ్వు  నా మాటల్ని చిన్న పిల్లల మాటల్లా తీసుకోకుని నవ్వుకుంటావని తెలుసు .  అయినా చెప్తున్నాను , మన జీవితపు  పగ్గాలు మన చేతిలోకాకుండా మరొకరి చేతిలో ఉంటే ఎలా ఉంటుందో స్పష్టంగా అర్ధమవుతోంది.  నాలో పొరలు పొరలుగా కప్పడిపోయిన ఊగిసలాటల పొరలు రాలిపోతూ.. కరిగిపోతూ ఉన్నాయి.

ఈ ప్రయాణం జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన  ఇచ్చింది… అది తెల్సుకోలేకపోతే .. ఎంత మిస్సవుతామో, ఎంత కోల్పోతామో నాకిప్పుడు స్పష్టమవుతోంది.
అవును మనో .. నివ్వెంత మిస్ అయ్యావో మాటల్లో చెప్పలేను మనసులోనే మాట్లాడేస్తోంది తనూజ మిత్రురాలు మనోరమతో.  నీలాకాశంలో తేలిపోతున్న మేఘాల్లో ఒక మేఘమాలికలా తనూ తేలిపోతున్నట్లుంది ఆమెకు .

ఈ రోజు టూరిజం డిపార్ట్మెంట్ వారి వాహనంలో  గ్యాంగ్ టక్ నుండి ఎత్తు పల్లాల గతుకుల రోడ్డులో కొన్ని గంటల ప్రయాణం.

నేను ఒక్కదాన్నే .. థ్రిల్లింగ్ గా .  ఆ  తర్వాత వచ్చింది చాంగు లేక్.

నెత్తి మీద నుండి తేలిపోయే మేఘాల్లోను , కళ్ళముందు పొగమంచులా కదిలిపోయే  మబ్బుల్లోంచి ఈ మూడు గంటల ప్రయాణం.. ఓహ్ .. అమోఘం. అద్బుతం.  ముందున్నవి కన్పించనంతగా మేఘం కమ్మేసి .. ఓ పక్క ఎత్తైన కొండలు మరో వైపు లోతైన లోయలు. వాటి అంచులో ప్రయాణం ప్రమాదపుటంచుల్లో ఉన్నట్లే సుమా..!.  వాహనం ఏమాత్రం అదుపు తప్పినా , డ్రైవర్ ఏ కొద్ది అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు.  ప్రతి టర్నింగ్ లోనూ హరన్ కొడుతూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ .. కమ్మేసిన మేఘం కింద దాగిన సరస్సు ను  చూసి నాలో నిరాశా మేఘం.

అంత కష్టపడి వచ్చానా..  లేక్ కన్పించలేదు.  పన్నెండు గంటలయినా సూర్యకిరణాల జాడలేదు.  నిస్పృహతో నిట్టుర్చాను.

అది గమనించాడేమో .. దగ్గరలో  బాబా హర్భజన్ సింగ్ ఆలయం ఉందని డ్రైవర్ చెప్పాడు.

అక్కడికి బయలు దేరా.  పాత టెంపుల్ నుండి  కొత్త టెంపుల్ కి వెళ్ళే దారిలోనే  టాక్సీ డ్రైవర్ ఇల్లు ఉందని తన ఇంటికి ఆహ్వానించాడు.
ఆహ్హాహ్హ.. నాకు వినిపిస్తోందిలే నువ్వేమంటున్నావో .. నీకు బుద్దుందా అని అచ్చు  మా అమ్మలాగే .. తిట్టేస్తున్నావ్ కదూ..? నువ్వు అట్లా కాక మరోలా ఆలోచిస్తావ్ .. ?

కానీ ఇప్పుడు చూడు, నేను ఒంటరి ఆడపిల్లననే భావనే కలుగలేదు తెలుసా ..?!.

జనసంచారం లేని కొత్త ప్రాంతం.  డ్రైవర్ వాళ్ళింటికి రమ్మనగానే వెళ్ళాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించాను కానీ అది భయంతో కాదు.  శరీరాన్ని చుట్టుకున్న మేఘాల అలల ఒడిలో ప్రయాణం ఎక్కడ మిస్ అవుతానో అన్న మీమాంసతోనే సుమా .  నాకిక్కడ పగటి  కాపలాలు రాత్రి కాంక్షల విచారాలు అగుపించలేదబ్బా …

ఇంతటి ప్రతికూల వాతావరణంలో వీళ్ళు ఎలా ఉంటారో .. అనుకుంటూ  డ్రైవర్ తో మాటలు కలిపాను.

ప్రకృతి సౌందర్యం గొలుసులతో కట్టేసినట్లుగా ఉన్న నేను ఇప్పటివరకూ అతని వాహనంలోనే ప్రయాణించానా .. కనీసం అతని  పేరయినా అడగలేదన్న విషయం స్పృహలోకొచ్చి అడిగాను .
అతని  పేరు గోవింద్.  చిన్న పిల్లవాడే. ఇరవై ఏళ్ళు ఉంటాయేమో . చురుకైనవాడు.   చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. అక్కడి వారి జీవితం గురించి చెప్పాడు.
మేం వెళ్లేసరికి వాళ్ళమ్మ చేత్తో ఏదో కుడుతోంది.  చేస్తున్న పని ఆపి లేచి తల్లి మర్యాదగా లోనికి  ఆహ్వానించింది.  తండ్రి పగటి నిద్రలో ఉన్నాడు.

నేను మాట్లాడే హిందీ ఆమెకు అర్ధం కావడం లేదు.  ఆమె మాట్లాడే టిబెటియన్ సిక్కిం భాష నాకు తెలియదు.

పేదరికం ఉట్టిపడే చెక్క ఇల్లు వారిది. చాలా చిన్నది కూడా . లోపలికి వెళ్ళగానే  రూం హీటర్ వల్ల వెచ్చగా ఉంది.   వాళ్ళమ్మ చేస్తున్న పని ఆపి వెళ్లి పొగలు కక్కే టీ చేసి తీసుకొచ్చింది.  నేను టీ తాగనని నీకు తెలుసుగా .. వాళ్ళు నొచ్చుకుంటారనో లేక  ఆ కొంకర్లు పోయే చలిలో వేడి వేడి టీ తాగితే హాయిగా ఉంటుందనో  గానీ ఆ నిముషంలో వారిచ్చిన టీకి నో అని చెప్పలేకపోయాను .

 

వారిచ్చిన హెర్బల్ టీ  ఆస్వాదిస్తూ పాడి ఉందా అని ఆడిగా.  నాలుగు జడల బర్రెలు ఉన్నాయని అవి టూరిస్ట్ సీజన్ లో వారికి ఆదాయాన్ని తెచ్చి పెడతాయని చెప్పారు. ఎలాగంటే ప్రయాణ సాధనంగా జడల బర్రెని వాడతారట .  నాకూ అలా ప్రయాణించాలని కోరిక మొదలైంది.

పాలు, పెరుగు కోసం జడల బర్రె పాలే వాడతారట. చనిపోయిన దాని చర్మంతో చాల మంచి లెదర్ వస్తువులు ప్రధానంగా షూ చేస్తారట .  వాళ్ళింట్లో తయారు చేసిన రకరకాల చేతి వస్తువులు చాలా ఉన్నాయి .  అన్ సీజన్ లో వాళ్ళు ఇల్లు కదలలేరు కదా .. అలాంటప్పుడు ఇంట్లో కూర్చొని తమ దగ్గరున్న వస్తువులతో హండీ క్రాఫ్ట్స్ చేస్తారట.  టూరిస్ట్ సీజన్ లో వాటిని టూరిస్ట్ లకు అమ్ముతారట .  వాళ్ళమ్మ చేసిన వస్తువులు చాలా బాగున్నాయి. వేటికవి కొనాలనిపించినా రెండు హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే కొన్నాను. నీ కొకటి , నాకొకటి .

తర్వాత గోవిందు వాళ్ళ నాన్నను లేపి నన్ను పరిచయం చేశాడు. తమ భాషలో ఏదో చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి వాతావరణం కాస్త అనువుగా మారుతుండడంతో మేం చాంగులేక్ కేసి వెళ్ళిపోయాం.

టూరిస్టులు ఎవరూ కనిపించలేదు. చుట్టూ ఎత్తైన పర్వతాలు తప్ప .  దగ్గరకు వచ్చేవరకూ అక్కడ ఒక లేక్ ఉన్న విషయమే తెలియదు. అలాగే వేచి చూస్తున్నా .. గాలికి కదలాడే సన్నని ఉల్లిపొర తెరల్లా నెమనెమ్మదిగా మేఘం తరలి పోతూ .. వెలుతురు పలచగా పరుచుకుంటూ ..

చుట్టు ముట్టు ధవళ కాంతులతో మెరిసే పర్వతాల నడుమ దోబూచులాడే మేఘపు తునకల కింద చంగూలేక్ . నా కళ్ళను నేనే నమ్మ లేకపోయానంటే నమ్ము.  అప్పటివరకూ ఈ అందాలను మేఘం చీకటి దుప్పటిలో దాచేసిందా..  కళ్ళ గుమ్మం ముందు అద్భుత సౌందర్యం కుప్ప పోసినట్లుగా .. రెప్పవాల్చితే ఆ సౌందర్యమంతా కరిగి మాయమవుతుందోనని ఊపిరి బిగబట్టి చూశాను .
తెల్లటి మేఘ విహంగాల  మధ్యలోంచి నడచి వస్తున్న జడల బర్రె  మసక మసకగా అగుపిస్తూ . అది ఎక్కవచ్చా.. మనసులోంచి ప్రశ్న పైకి తన్నుకొచ్చింది.  డ్రైవర్ విన్నట్లున్నాడు . మీ కోసమే దాన్ని నాన్న తీసుకొస్తున్నాడు. ఎక్కి సరస్సు చుట్టూ తిరిగి రావచ్చని చెప్పడంతో ఎగిరి గంతేసింది మనసు.
పొట్టి మెడతో నల్లగా పొడవైన జుట్ట్టు చిన్న చెవులు, రంగు కాగితాలు చుట్టి అలంకరించిన కొమ్ములు ,  దాని వీపుపై వేసిన దుప్పటి మన గంగిరెద్దులపై వేసినట్లుగా వేసి ఉంది . కాకపొతే బలంగా కనిపిస్తోంది .

మేఘం పోయి వెలుతురు బాగా పరుచుకుంది.  గంట క్రితం ఇక్కడ ఎంత చీకటి .?  పది అడుగుల దూరంలో ఉన్నది అస్సలు కన్పించనంతగా ..
నెమ్మదిగా జడలబర్రె మీద ఎక్కుతుంటే కొంచెం భయమేసింది . ఎక్కడ పడేస్తుందోనని.  నా కెమెరా గోవింద్  కిచ్చి ఫోటోలు తీయించుకున్నా. వాళ్ళ నాన్న యాక్ కి కట్టిన ముకుతాళ్ళు పట్టుకొని ముందు నడుస్తూ లేక్ చుట్టూ తిప్పుకోచ్చాడు .  అప్పుడు నా మనసులో కలిగిన ఉద్వేగాన్ని, అనుభూతుల్ని, అద్వితీయ భావాన్ని  నీకు సరిగా అనువదించగలనో లేదో .. సందేహం ..
వింతగా అనిపిస్తోందా మనో .. చిన్నప్పుడెప్పుడో యాక్ ఫోటో పుస్తకాల్లో చూడడం , చదవడం గుర్తొస్తోందా .. ఆ యాక్ పై కూర్చొని చంగూలేక్ చుట్టూ చక్కర్లు కొట్టి వచ్చా .

అక్కడి బోర్డ్ ఇంగ్లీషు, టిబెటియన్ భాషల్లో ఉంది. మనవాళ్ళు  చంగూ లేక్ అంటే ట్సొంగు లేక్ అని టిబెట్ వాళ్ళు అంటారట.   ఈ సరస్సు  సిక్కిం -టిబెట్ బార్డర్ కు దగ్గరలో తూర్పు దిశలో  ఉంది.  ఆ లేక్ కి వెళ్ళే దారి  కొన్నిచోట్ల బాగుంది. కొన్ని చోట్ల కనస్ట్రక్షన్ లో ఉంది. అక్కడ కొండ చరియలు విరిగి పడడం తరచూ జరుగుతూ ఉంటుందట.  కాబట్టి రోడ్లు తరచూ పాడయి పోతుంటాయట.  కంగారు పడకు తల్లీ .. నేను వెళ్ళిన సమయంలో కొండచరియలు విరిగిపడడం జరగలేదులే. అందుకే  ప్రతి మూడు నెలలకొకసారి రోడ్డు వేస్తూనే ఉంటారట. జీప్ కుదుపుతో కొన్ని సెకన్ల పాటు ఆమె ఆలోచనలకు చిన్న అంతరాయం.  ఆవెంటనే మళ్ళీ మనో వీధిలో ఆప్తమిత్రురాలు మనోతో ముచ్చట్లాడుతూ .

మనో తిట్టుకుంటున్నావా ..  ఎంత తిట్టుకుంటావో తిట్టేసుకో .. ఇప్పుడు హోటల్ చేరగానే ఫోన్ చేస్తాగా ..  గాంగ్ టక్ లో దిగగానే చేశాను .  అంతే.  నువ్వు నా కాల్ కోసం ఎంత ఆత్రుతపడుతున్నావో ఉదయం నీ మిస్డ్ కాల్స్ చూస్తే అర్ధమవుతోంది.  నిన్న గురుడాంగ్ మార్ లేక్ నుండి రాగానే చేద్దామనుకున్నా .. సిగ్నల్స్ లేక చేయలేకపోయాను.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు చేస్తాలేవే ..

ఆ .. అన్నట్టు , నా పర్యటనలో  ముందటి రోజుల  విశేషాలు చెప్పలేదు కదూ .. నేను గ్యాంగ్ టక్ లో ముందే బుక్ చేసుకున్న హోటల్ చేరానా .. హోటల్ రూంలోంచి దూరంగా కనిపిస్తూ రా రమ్మని ఆహ్వానిస్తున్న హిమాలయాలు, వాటి చెంత చేరాలని ఉవ్విళ్ళూరుతున్న మనసును కొన్ని గంటలు ఆపడం ఎంత కష్టమయిందో..అప్పటికప్పుడు వెళ్లిపోలేను కదా .. !

నిరంతరం వచ్చే టూరిస్టులతో నిండి ఉండే హోటల్ వారికి ఇంకా చాలా విషయాలు తెలిసి ఉంటాయనిపించింది.  ఎటునుండి ఎటు వెళ్ళాలి అని మ్యాప్  పరిశీలించా .
నేనున్న హోటల్ లోని టూరిస్టులతో పిచ్చాపాటి మాటలు కలిపాను . వాళ్ళలో బెంగాలీ టూరిస్టులతో పాటు  కొద్దిమంది  విదేశీయులు  ఉన్నారు.   మరుసటి రోజు ఉదయం బయలుదేరి  త్రికోణంలో ఉండే గురుదాంగ్ మార్  లేక్, లాచుంగ్  ఆ తర్వాత యుమ్మాంగ్ ల ప్రయాణం పెట్టుకున్నామనీ , వాళ్ళ వాహనంలో మరో ఇద్దరికి చోటుందని మాటల్లో  చెప్పారు వాళ్ళు.  ఆ హిమపర్వతాల యాత్ర మహాద్బుతంగా ఉంటుందని విని వున్నాను కదా .

daari 9

వెంటనే ట్రావెల్ డెస్క్ వాళ్లతో మాట్లాడాను. వాళ్ళు టూరిజం డిపార్టుమెంటుతో  కాంటాక్ట్  ఏర్పాటు చేశారు . అదే రోజు నా ఫోటోలు, వివరాలు తీసుకుని మరుసటి రోజు నా ప్రయాణానికి పర్మిట్ వచ్చేలా చేశారు. ఇది  ఏప్రిల్ మూడో వారం కదా .. టూరిస్టులు మరీ ఎక్కువగా లేరు. ఇకనుండీ రోజు రోజుకీ పెరుగుతారట.  అదే టూరిస్టులు ఎక్కువగా ఉండే సమయాల్లో  పర్మిట్ రావడంలో ఆలస్యం కావచ్చట.  నేను వెళ్ళింది పీక్ టైం కాదు కాబట్టి నాకు వెంటనే పర్మిట్ వచ్చేసింది.   నేనూ వాళ్లతో జత కలిశాను . నలుగురు బెంగాలీలు, ఒక విదేశీ నేనూ వెళ్ళాం. ఖర్చు తగ్గుతుంది కదాని అందరం కలసి ఒకే వాహనంలో వెళ్ళే ఏర్పాటు.  మొత్తం మూడురోజుల ప్రయాణం.

వింటున్నావా మనో .. ఆ ప్రయాణం ఆద్యంతం అత్యద్భుతం . ఉదయం 11 గంటల సమయంలో గ్యాంగ్ టక్  నుండి మా ప్రయాణం ఆరంభమైంది. ఎత్తైన మంచు కొండలు , లోతైన లోయలు , దట్టమైన అడవులు దాటుతూ  అద్భుత అందాలతో అలరారే గ్రామాలను పలకరిస్తూ   సాయంత్రం 6 గంటలకి లాచుంగ్ చేరాం.

లాచుంగ్ 10వేల అడుగుల ఎత్తులో ఉన్న చిన్న పట్టణం. అక్కడికి వెళ్ళే దారిలో మంచు కరిగి ప్రవహిస్తూ  కొండలపై నుండి కిందకు సవ్వడి చేస్తూ జారిపోయే జలపాతాలు .. ఆ రోజు రాత్రి బస లాచుంగ్ లోనే. అక్కడి నుండి యుమ్తంగ్ లోయ చూసి పాములాగా మెలికలు మెలికలు తిరిగి షార్ప్ కర్వ్స్ తో ఉండే  రోడ్డులో  జీరో పాయింట్ కు చేరాం .. అదంతా మంచుతో నిండి ఉంది. మంచు కరుగుతూ  పాయలు పాయలుగా రాళ్ళను ఒరుసుకుంటూ పల్లంకేసి జారిపోతూ చేసే గలగలలు .. తీస్టా నదిలోకి పరుగులుపెడుతూ చేసే సవ్వడులు ..

ఆ నదితో పాటే ఉరకలు వేస్తూ కొండా కోనల్ని పలుకరిస్తూ అలా వెళ్లిపోవాలనిపించింది ఆ క్షణం.. తీస్టా నది బంగ్లాదేశ్ మీదుగా ప్రయాణించి  బ్రహ్మపుత్ర నదిలో ఐక్యం అవుతుందట. తిరుగు ప్రయాణం  మళ్లీ లాచుంగ్,  చుగ్తాంగ్ మీదుగానే లాచన్ చేరి అక్కడే బస చేశాం. మూడో రోజు  తెల్లవారు జామున 3గంటలకే  బయలుదేరి  8 గంటలకి  గురుడాంగ్ మార్  లేక్ కి చేరాం. మార్గ మధ్యలో తంగు వ్యాలీ లో ఆగి బ్రేక్ పాస్ట్ చేసాం.

లాచన్ నుండి దాదాపు ఐదు గంటల ప్రయాణం అత్యద్భుతంగా … ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో రెండోదట గురుడాంగ్ మార్ లేక్  చేరాం.  భూమికి 17100 అడుగుల ఎత్తులో ఉన్నాం.

ఏయ్ నీకు తెలుసా .. ?

ఎంత హిమపాతం ఉన్నప్పటికీ  వాతావరణం ఎంత మైనస్ డిగ్రీలలో ఉన్నప్పటికీ  గురుడాంగ్ మార్ లేక్ లోని  నీరు కొంత ప్రాంతంలో  గడ్డకట్టదట.  బుద్దిస్ట్ మాంక్ గురు పద్మసంభవ అక్కడి నీళ్ళు ముట్టుకొని తాగి దీవించడం వల్లే ఆ నీటికి పవిత్రత వచ్చిందనీ, అందుకే ఆ ప్రాంతంలోని నీరు గడ్డకట్టదని సిక్కిం ప్రజల నమ్మకం అని నాతో కలసి ప్రయాణం చేసిన బెంగాలీలు చెప్పారు.  చలికాలంలో అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. చూడలేరు కదా ..? వెళ్ళడానికి ఎవరికీ పర్మిషన్ ఇవ్వరు అన్న సంగతి తెలిసిందే కదా .. అలాంటప్పుడు ఆ ప్రాంతంలో నీరు గడ్డ కట్టిందో లేదో ఎవరికైనా ఎలా తెలుస్తుంది చెప్పు ?

గురుడాంగ్ మార్ లేక్ నీరు  తిస్టా నదికి ప్రధాన సోర్స్ ల్లో ఒకటి అట. ఈ లేక్ కి చుట్టు పట్ల మరో రెండు లేక్స్ ఉన్నాయి. వాటికి మేం  వెళ్ళలేదు. ఇండో – టిబెట్ సరిహద్దులో ఉన్న ఈ  మూడు సరస్సులను చూడాలంటే  ఆర్మీ పర్మిషన్ తప్పని సరి అవసరం. తీస్టా నదిలో దిగి ఆ స్వచ్ఛమైన నీటిలో కాసేపు ఆడుకున్నాం. ఆ నీటి అడుగున ఉన్న గులక రాళ్లు నునుపుదేలి ఎంత స్వచ్ఛంగా మెరిసిపోతున్నాయో .. నువుంటే ఆ రాళ్ళన్నీ మూటగట్టుకు వచ్ఛేదానివి . నీ కాక్టస్ ల చుట్టూ అలంకరించడానికి .
అక్కడ ఉన్నంత సేపూ నేను నా దేశంలోనే ఉన్నానా అనే సందేహం.  కానీ ,   సిక్కిం ఉన్నది మనదేశంలోనే కదా ..  ఈశాన్య రాష్ట్రాలు దేశ సరిహద్దుల్లో ఉన్నాయి కాబట్టి  సరిహద్దు ప్రాంతాల్లోకి ఎటు వైపు వెళ్ళాలన్నా ఆర్మీ అనుమతి తప్పనిసరట .  సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో పొటోలు నిషేధం.  లేక్ దగ్గర పొటోలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు.  ఫోటోలు .. వీడియోలు నీకోసం సిద్దం చేస్తున్నాలే ..

ఆ చెప్పటం మరిచాను మనో ..  ఆర్మీ కాంపస్ ఉన్న దగ్గర చాలా నిబంధనలు.  బార్దర్స్ కి వెళ్ళే కొద్దీ మిలటరీ వాళ్ళ భద్రత చాలా ఎక్కువ. జీబ్ డ్రైవర్ చెప్పినా వినకుండా నేనెళ్ళి ఫోటో తీయబోయాను ఎక్కడనుండి చూసాడో ఏమో జవాను ఆరిచేశాడు .

గురుడాంగ్మార్ లేక్ కు 5 కిలోమీటర్ల ఆవల చైనా సరిహద్దు తెలుసా .. ? ఇవన్నీ చూస్తుంటే .. నాలో ఓ కొత్త శక్తి ఊటలు పుట్టుకొచ్చి ప్రవహిస్తున్నట్లుగా .. పుస్తకాలు ఎన్ని చదివితే ఈ అనుభవం వస్తుంది ..? ఆ..,  చెప్పు ?  ఎన్ని వర్క్ షాప్స్ లో పాల్గొంటే ఈ అనుభూతి వస్తుంది ? నాతో వఛ్చిన వాళ్లంతా ఎంతో మర్యాదగా స్నేహంగా ఉన్నప్పటికీ  నా అనుభవాలు, అనుభూతులు పంచుకుందామని నీకు ఫోన్ చాలా సార్లు  ట్రై చేశా .. ప్చ్ ..  సిగ్నల్స్ లేవు . ఎయిర్ టెల్ వాళ్ళ యాడ్ మనని మోసం చేసింది కదూ .. బియస్ యన్  యల్ నెట్వర్క్  కాస్త ఫర్వాలేదు . బెంగాలీ మిత్రులు అదే వాడుతున్నారులే .

నేనేం చేయనూ … నన్ను తిట్టుకోకు మనో . నెట్వర్క్ ని తిట్టుకో .. సరేనా …మనో
అటుచూడు .. ఉదయం వెండిలా మధ్యాహ్నం బంగారంలా మెరిసి సాయంత్రం ఎర్రగా  మారిపోయిన ఈ పర్వతశిఖరాలు చీకటిలో కరిగిపోతున్నాయ్ .. ఎంత అద్భుతమయిన దృశ్యమో ..

ఈ రోజు వెళ్ళివచ్చిన  చంగూ లేక్  టూర్ కి కూడా అప్పుడే  ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నా కదా..  ఉదయమే లేచి  ప్రయాణం కోసం మాట్లాడుకున్న వాహనం కోసం ఉద్వేగంతో ఆత్రుతతో ఎదురుచూపులు .  నీకు నవ్వు వస్తుందేమో .. చెప్తే ..  తనూజ మొహంలో సన్నని నవ్వు మొలిచింది . ఈ పనుల్లో పడి నీకు గానీ అమ్మ నాన్నలకు గానీ రాగానే ఫోన్ చేయలేక పోయాను.  ఈ రోజు రూం కి వెళ్ళగానే అమ్మా నాన్నలకి నీకు ఫోన్ చెయ్యాలి అనుకుంటూ హ్యాండ్ బాగ్ లో ఉన్న మొబైల్ తీసి మళ్లీ చూసింది.  ఊహు..  నెట్వర్క్ లేదు.

అమ్మ నాన్న గుర్తు రాగానే  కొద్దిగా నెర్వస్ గా ఫీలయింది ఆమె. ప్రస్తుతం నేనెక్కడ ఉన్నానో అమ్మకో నాన్నకో తెలిస్తే …చెప్పేస్తే .. అమ్మో..  ఇంకేమన్నా ఉందా ..?!
వాళ్ళని అంత ఇబ్బంది పెట్టొద్దని, మనసులో చేరి రొదపెడ్తున్న తపనని, కోరికని కాదనలేని సంఘర్షణ .  నాలో నేను ఎంతో సంఘర్షణ పడ్డ తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది అని సర్ది చెప్పుకోనే  ప్రయత్నం చేసింది తనూజ.  కానీ, నన్నింత చేసిన తల్లిదండ్రులకు చెప్పకుండా రావడం తప్పు అనే ఫీలింగ్ ఆమెను వదలడం లేదు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు గిల్టీగా అనిపిస్తూ .. వాళ్ళని ఒప్పించుకుని వస్తే ఈ గిల్టీనెస్ ఉండేది కాదేమో .. ఇంకా ఎక్కువ ఆనందించే దాన్నేమో ..అనుకుందామె.
హిమాలయ సోయగాల లోయలల్లోకి జారిపోతూన్న తనూజ మనస్సులోకి, కళ్ళ ముందుకి అన్న ట్రావెల్ చేస్తానన్నపుడు ఇంట్లో జరిగిన సంఘటనలు ప్రత్యక్షమయ్యాయి.

***                          ***                            ***
అన్న ఒంటరిగా ట్రావెలింగ్ చేస్తానంటేనే అమ్మ అసలు ఒప్పుకోలేదు. ఇంటా వంటా లేదు , ఏమిటీ తిరుగుళ్ళు  అని గోల చేసింది.   లేకపోవడమేంటి .. మా నాన్న ఆ రోజుల్లోనే కాశీ యాత్ర కాలినడకన చేసోచ్చాడని గొప్పగా చెప్పింది నాన్నమ్మ.  చివరికి ఎట్లాగో నాన్నమ్మ సహకారంతో అన్న  పెద్ద వాళ్ళని ఒప్పించుకోగలిగాడు.  అదే నేనయితేనా  చాన్సే లేదు. అస్సలు ఒప్పుకోరు. అందుకే గదా ఈ సాహసం చేసింది.

నా కోరిక చెప్తే నవ్వి తీసి పడేసేవారు . అది తనకి తెలియనిదా ..? అంతగా చూడాలని ఉంటే పెళ్ళయ్యాక మీ ఆయనతో కలసి వెల్దువులే అంటారు. లేదా ఫామిలీ ట్రిప్ ప్లాన్ చేద్దాంలే అంటూ నన్ను బుజ్జగించ చూస్తారు . కాని ఒక్క దాన్ని పంపడానికి ససేమిరా అంటారు.  ఉద్యోగం కోసం బెంగుళూరు పంపడానికే అమ్మ చాలా ఆలోచించింది.  అతికష్టం మీద ఒప్పించుకోవాల్సి వచ్చింది. . ఏమన్నా అంటే ఆడపిల్లలకి భద్రత లేదు. పెళ్లిచేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది  అంటూ మొదలుపెడుతుంది. నాన్నదీ అదేమాట. పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడాను. పెళ్లి అయితే భద్రత ఎలా వచ్చేస్తుందో .. ? వచ్చేవాడికి ఇవేమీ నచ్చకపొతే … ? నచ్చిన పని చేయలేకపోతే వచ్చే నిస్పృహ , నిరాశ లతో  నిస్తేజంగా ఉండే మెదడు ఆలోచించడం మానేసి రాజీ పడిపోతుందేమో..మిగతా అమ్మాయిల్లాగే తన జీవితమూ పరిమితం అవుతుందేమో .. ఎన్నెన్నో  సందేహాలూ ప్రశ్నలూ కలవరపరిచాయి.

ఉద్యోగం కోసం విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టాక చాలా చదువుతోంది, తెలుసుకుంటోంది. తనను తాను విశాలం చేసుకుంటోంది ..తనలోని చీకటిని, నిశబ్దాన్ని బద్దలు చేస్తూ కలలను చిగురింపచేసుకునే ప్రయత్నమేగా  ఈ ప్రయాణం. జీవితమంటే ఖరీదైన ప్రాంతాల్లో  తిరగడం, డబ్బుతో సంతోషం కొనుక్కోవడమా కానే కాదు.  నిజమైన  జీవితాన్ని అనుభవించాలంటే, ఆస్వాదించాలంటే , ఆనందించాలంటే మారుమూల గ్రామాలోకి  ఎవ్వరూ వెళ్ళడానికి సాహసించని ప్రదేశాలకు వెళ్ళాలి. వారి జీవితాన్ని పరిశీలించాలి  . వాళ్లతో కరచాలనం చేసి వాళ్ళలో ఒకరుగా కలసిపోవాలి . అప్పుడే కదా జీవితం తెలిసేది .   మొదటి ప్రయాణం టూరిస్టులా వెళ్లి రావాలి.  ఆ తర్వాతే ట్రావెలర్ అవతారం ఎత్త్తాలని ఎన్నెన్ని ఆలోచనలో ..    తన ఆలోచనల ఆచరణ  సాహసమో.. దుస్సాహసమో.. కాలమే చెప్పాలి.
తన ఆలోచనలు చిన్ననాటి  మిత్రురాలు , కొలీగ్ అయిన మనోరమతో చెప్పినప్పుడు చెడామడా తిట్టింది. ఇవ్వాళా రేపు బస్టాపులోనే ఒంటరిగా నిల్చోలేని పరిస్థితి . ఇంట్లో ఉన్న ఆడదానికే భద్రత కరువైన పరిస్థితుల్లో సోలో ట్రవేలింగా .. వెధవ్వేషాలు మాని బుద్దిగా పెద్దలు చెప్పినట్టు నడుచుకోమని లేదంటే ఇప్పుడే  అమ్మతో చెప్తానని బెదిరించింది. చుట్టూ ఉన్న అద్భుతాలని అనుభవించాలన్న ఒకే ఒక కోరికతో ప్రపంచాన్ని చుట్టివచ్చిన భారతీయ మహిళ మెహర్ మూస్ గురించి చెప్పాను.

అప్పుడు చెప్పింది మనసులో మాట.

తనకీ ఇలాంటి ప్రయాణాలంటే ఇష్టమే అయితే అవి ఊహల్లోనే  కానీ ఆచరణ సాధ్యంకాదని కొట్టిపారేసింది.  అందుకే ఆచరణ సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడం అనవసరమని తేల్చేసింది మనోరమ .

తనకేమో అన్న సోలో ట్రావెలింగ్ స్పూర్తి. అన్న వెళ్ళినప్పుడు తను ఎందుకు వెళ్ళకూడదు అన్న పంతం. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలనన్న ధీమా .

ఆడపిల్లలు ఎవరైనా ఇలా వెళ్ళారా అని ఇంటర్నెట్ లో వెతికా . మెహర్ మూస్ , అంశుగుప్త, షిఫాలి , అనూషా తివారి వంటి మహిళా బ్యాక్ పాకర్స్  చెప్పిన విశేషాలు విపరీతంగా ఆకర్షించాయి.  మరి నేను అలా ఎందుకు వెళ్ళలేను అనే ప్రశ్న .. నాలో నన్నే తినేస్తూ .. నా జీవితానికి నేనే కర్తని , కర్మని, క్రియని  అని నా ఆలోచనలు స్థిరపరచుకున్న తర్వాతే మనోతో విషయం చెప్పింది. చర్చించింది.   ప్రతి రోజూ నా  కదలికలు ఎటునుండి ఎటో చెప్పాలన్న ఒప్పందం మీద  మనో ఒప్పుకుంది. అలా చెప్పడం నాకు చిరాకనిపించినా సరే అనక తప్పలేదు.    బయలుదేరేటప్పుడు , తనుండే  వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో అమ్మాయిలు ఇదేం పాడు బుద్ది అని గుచ్చుకునే చూపులు  పిచ్చిదాన్ని చేసి వెటకారపు వ్యాఖ్యానాలు    దీనికి స్క్రూ లూజు అని నవ్వుకోవడం  అన్నీ గుర్తొచ్చాయి
***                       ***                     ***
ఆలోచనల్లో ఉండగానే హోటల్  వచ్చేసింది. ఫ్రెష్ అయి వచ్చి టీ తాగుతూ బయటికి చూస్తే చిక్కటి చీకటి మూసిన కిటికీ .. ఈ నాలుగు రోజులుగా  జరిగిందంతా తలచుకుంటే మళ్ళీ ఆశ్చర్యం ఆమెలో. ఇది కలా .. నిజంగానే ఇదంతా జరిగిందా .. చెయ్యి గిల్లుకుంటూ నవ్వుకుంది .

అమ్మకి ఫోన్ చేసి పలుకరించాలి.  నాలుగు రోజులైంది వాళ్ళతో మాట్లాడి మొబైల్ అందుకుని రింగ్ చేసింది. లైన్ కలిసింది.  కుశల  ప్రశ్నల వర్షం కురిపించింది.  కూతురి  గొంతులో నిండిన ఉత్సాహం అమ్మకి ఆమెను చూసినంత ఆనందం తృప్తి  కలిగినట్లనిపించింది.  కూతురికి అమ్మని నాన్నని  చూసినంత సంతోషం.  ఒకసారి స్కై ప్  లోకి వస్తావా అమ్మ ప్రశ్న.
అమ్మని స్కై ప్ లో చూడాలని మనసు తొందర పెట్టింది. కాని వెంటనే తనను తను సర్ది చెప్పుకుంటూ ఇప్పుడా .. రేపెప్పుడయినా వస్తాలే అమ్మా .. ఇంటర్నెట్ సరిగ్గా లేదు అని చెప్పి అప్పటికి తప్పించుకుంది.   వాళ్ళని మోసం చేస్తున్నానా ..  కళ్ళు మూసుకుని ఆలోచనలతో నిద్రలోకి జారుకున్న  తనూజ ఫోన్ మోగడంతో ఉలిక్కి పడి లేచి ఫోన్ అందుకుంది. అవతలి వైపు మనోరమ .

Kadha-Saranga-2-300x268
‘అసలు నీకు బుద్దుందా … ప్రతిరోజూ కాల్ చేయమని ఎన్ని సార్లు చెప్పాను. ‘ గద్దించింది.
‘ నేనేం మాట్లాడను .. పో ..’  ,
‘తనూ .. ఆ మాట అనకే తల్లీ.. అసలు విషయం చెప్పు ఎలా ఉన్నావ్? నీ కోసం ఎప్పటి నుండి ట్రై చేస్తున్నానో తెల్సా .. అవుటాఫ్ రీచ్ అని వస్తోంది. అసలు ఏ పని చేయలేకపోయాను. ఏదన్నా జరగరానిది జరిగితే .. అమ్మావాళ్ళకి నేనేం సమాధానం చెప్పగలను మనసంతా గుబులు గుబులుగా .. భయం భయంగా … నీ గొంతు విన్నాక ప్రాణం లేచొచ్చింది’.
‘ చుట్టూ అడ్డుగోడలు కట్టేసుకుని అది దాటితే ఏమవుతుందోనన్న భయంతో రోజూ చచ్చే వాళ్లతో నేను వేగలే .. ‘
తనూజని పూర్తి కానివ్వకుండానే, ‘ అంత వద్దులేవే  .. ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు ఫోన్ చేసెయ్యి ..సరేనా,  నన్ను డిస్ట్రబ్ చేస్తున్నానని ఏమాత్రం అనుకోకు.  ఇంతకీ అసలు నీ ట్రిప్లో ఎలా ఉన్నావో చెప్పనే లేదు ‘
‘ తేలిపోతున్నట్లుందే .. మేఘాల్లో తేలిపోతున్నట్లుందే .. ‘రాగయుక్తంగా తనూజ గొంతు
‘ జోరుమీదున్నావు  తుమ్మెదా.. ఆ జోరెవరికోసమే తుమ్మెదా .. ‘ చిరునవ్వుతో మనో అందుకుంది.
‘ఎవరికోసమో ఏంటి ? నాకోసం. అచ్చంగా నా కోసమే .  అంబరాన్ని అందే సంబరంలో ఉన్నా,  ఈ మజా ఏంటో అనుభవిస్తే గానీ అర్ధం కాదులే .. ఎంత కాన్పిడెన్స్ బిల్డప్ అవుతుందో ..

నా వెనుకో ముందో ఎవరో ఒకరు ఉండి నన్ను పోలీసింగ్ చేస్తున్నారన్న ఫీలింగ్ లేదు.  రొటీన్ వర్క్ నుండి ఎప్పుడు బ్రేక్ కావాలంటే అప్పుడు రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలని నిశ్చయించేసుకున్నా ..

కొత్త ప్రాంతాలు , కొత్త మనుషులు, కొత్త విషయాలు నా ఆలోచనల్లో .. నన్ను నా విధానాల్ని మార్చేస్తూ .. ప్రకృతిలో ఒదిగిపోయి పోయి చేసే ప్రయాణాలు .. జీవితం పట్ల కొత్త ఉత్సహాన్నిస్తున్నాయి తెలుసా … ‘
అవతలి వైపు నుండి ఏ చప్పుడూ రాకపోవడంతో ‘ వింటున్నావా .. ‘

‘ ఆ .. వింటున్నా నే .. నీ ఉద్వేగాన్ని .. ‘ మనోరమ  పూర్తి చేయకుండానే అందుకుని

‘ఇక్కడేమో సిగ్నల్స్ సరిగ్గా లేవు, ఒక్కోసారి బాగానే  లైన్ కలుస్తుంది. ఒక్కోసారి కలవదు ‘

ఆ తర్వాత కొద్ది మౌనం
‘ ఊ.. ఇప్పుడు చెప్పు . బయటికొచ్చి నడుస్తూ మాట్లాడుతున్నా .. బయటేమో చలి గిలిగింతలు పెడ్తూ .. ‘
‘దూది పింజల్లా ఎగిరిపోయే మేఘంలా కేరింతలు కొట్టే నీ స్వరం చెప్తోంది నీవెలా ఉన్నావో ..నీవింత ప్రత్యేకంగా..భిన్నంగా ఎలా ఆలోచిస్తావ్ ? నికార్సైన నిన్ను చూస్తే చాలా గొప్పగా ఉంది ‘
‘ఆ చాలు చాలు మునగ చెట్టెక్కియ్యకు..డ్హాం డాం అని పడిపోతా ..

అది సరేగానీ, వింటున్నావా మనో ..

ఈ రోజు సిల్క్ రూట్ లో ప్రయాణించా తెలుసా ..?’
‘వాట్..  సిల్క్ రూట్.. ? అంటే, పరవస్తు లోకేశ్వర్ గారి “సిల్క్ రూట్‌లో సాహస యాత్ర“ గుర్తొస్తోంది. నువ్వూ  ఆ రూట్లో ప్రయణించావా .. రియల్లీ ?’ సంబ్రమాశ్చర్యంతో  అడిగింది మనోరమ
‘అవునే, చంగూలేక్ నుండి నాథులా పాస్ కి బయలు దేరాను. 17 కి . మీ. దూరమే కానీ ప్రయాణం చాలా సమయం తీసుకుంది. ఘాట్ రోడ్లో ఆకాశాన్నంటే పర్వత శిఖరాలను చుట్టేస్తూ అగాధాల లోతులను అంచనా వేస్తూ మేఘాలను చీల్చుకుంటూ సాగే ప్రయాణం అత్యద్భుతం అంటే అది చిన్న మాటేనేమో.. శ్వాసించడం మరచి చూస్తుండి పోయా ..
‘ నాదులాపాస్ అంటే ఇండియా చైనా బార్డర్ క్రాసింగ్ ప్రాంతం అనుకుంట కదా ‘
‘ఓ నీకూ కాస్త ప్రపంచ జ్ఞానం ఉందే .. ‘ నవ్వుతూ  తనూజ
‘ఆ.. నా బొంద , ఏదో నీ ప్రయాణం పుణ్యమాని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నాలే .. కానీ , అసలు విషయాలు చెప్పు ‘
‘అవును దేశ సరిహద్దు ప్రాంతమే ఇది,  ప్రయాణ సాధనాలేమీ లేని రోజుల్లో ఈ రూట్లోనే వర్తక వ్యాపారాలు జరిగేవట.’
‘ రియల్లీ .. గ్రేట్.. చెప్పు చెప్పు నీ సాహస యాత్ర గురించి చాలా చాలా వినాలని ఉంది ‘ ఉత్సుకతతో మనోరమ
‘ చెప్తూంటే ఏమిటే నీ తొందర .. ఈ రూట్ 1962 యుద్ధం తర్వాత మూసేసారట. మళ్లీ 2006లో రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం తర్వాత తెరిచారట. ఏడాదిలో ఆరునెల్లకు పైగా మంచుతో గడ్దకట్టుకుపోయే  ఈ రూట్లో ఒకప్పుడు అంతర్జాతీయ వ్యాపారం జరిగేదని తెలిసి ఆశ్చర్యపోయాను.

ఇప్పుడయితే  విదేశీయులకి  నాధులాపాస్ లో ప్రవేశం ఉండదట.  అక్కడ సిక్కిం , టిబెట్ ప్రజలు తమ ఉత్పత్తులు తెచ్చి అక్కడ అమ్ముకుంటూ ఉంటారు.   వాళ్ళు వ్యాపారం సాగించే ప్రదేశంలో మన మార్కెట్ యార్డ్ లో ఉన్నట్లుగా షెల్టర్స్ ఉన్నాయి. అవి ఈ మధ్యనే కట్టారట.  సోమ , మంగళ వారాల్లో వారి వ్యాపారాలకు సెలవు. అందుకే నాదులాపాస్ మూసేసి ఉంది. నేను వెళ్ళింది మంగళవారం కదా. నాకు ముందుగా  ఆ విషయం తెలియదు .  అందుకే  అక్కడ నుండి బార్డర్ క్రాస్ చేయలేకపోయా.    చైనా టిబెట్ ని ఆక్రమించాక చాలామంది టిబెటియన్లు , ఇండియా, నేపాల్ దేశాలకు వచ్చేశారని చాలా విషయాలు  గోవింద్ చెప్పాడులే .’
‘రేపు ఎక్కడికెళ్తున్నావ్ ..? ‘

‘రావంగలా  ప్రపంచంలో అక్కడ మాత్రమే కనిపించే పక్షుల్ని చూడాలి. అక్కడి నుండి పెల్లింగ్ వెళ్ళాలి . అక్కడ ట్రెకింగ్ చేయాలనుకుంటున్నా ‘
‘  కీర్తి శిఖరాల కోసం కాదు, ఆడపిల్లల విశ్వాసానికి రెక్కలు తొడిగి వెలుగును వెతుక్కుంటూ వేసే అడుగులో అడుగు వేయలేకపోయినా నిన్ను చూస్తే గర్వంగానూ .. ‘ మనోరమ మాటలకడ్డు వచ్చి

‘ భయంగాను ఉంది.అదేగా నువ్వు చెప్పాలనుకున్నది.  ఇదిగో ఇలా అమ్మమ్మ అవతారం ఎత్తావంటే ఫోన్ పెట్టేస్తా .. ‘ నవ్వుతూ బెదిరించిన తనూజ.

మళ్ళీ  తానే ‘  స్వచ్చమైన నీలాకాశంలో పొదిగిన పచ్చదనపు కౌగిలిలో పరవశిస్తూ మంచు బిందువులను ముద్దాడుతూ సాగిన ప్రయాణం,   తారకలతో స్నేహం .. ఎంత అద్భుతంగా ఉంటుందో  నీకెలా చెప్పగలను ..? ‘ నిశబ్దంగా మెరిసే తారకల్ని కొత్త ఆకాశం కింద నిలబడి చూస్తూ తనూజ
‘కవిత్వం వచ్చేస్స్తున్నట్లుందే .. మనసు పలికే భావాల్ని అక్షరాల్లో పరిచేస్తే బాగుంటుందేమో ..తనూ ‘ ఆమె ఎగ్జయిట్ మెంట్ ని గమనించి అంది మనోరమ

‘అహహా హ్హా .. జోక్ చేస్తున్నావా .. నీ మొహం..  నాకు కవిత్వం రావడం ఏమిటి ? ‘
కొద్దిగా ఆగి ‘ మనసులోని భావాల్నివెంటనే  పంచుకొనే నేస్తం లేదనే దిగులు.

ఆహ్హః లేకపోవడమేంటి.. నీతో నేనున్నాగా  నీ మనోకి  పోటీగా  అంటోంది నా లాప్ టాప్.’
‘ఏమిటీ ఆ బుల్లి పెట్టె నేను ఒకటేనా .. ?’ వేగంగా తోసుకొచ్చ్చిన మనోరమ ప్రశ్న
‘కాకపోతే మరి’ అంటూ కాసేపు మనోరమని  ఉడికించింది తనూజ
ఆ తర్వాత ‘ఏ రోజుకు ఆ రోజు నా అనుభవాల్ని పంచుకునేది ఈ ఎలక్ట్రానిక్ డైరీ తోనే కదా .. ఒకరోజు చెప్పకపోతే మరుసటి రోజు వచ్చే అనుభవాలు ముందటి రోజు అనుభూతుల్ని , ఉద్వేగాల్ని ఎక్కడ కప్పి వేస్తాయో .. ఏ మూలకు తోసేస్తాయో అన్న సంశయంతో హృదయ భాషని అక్షరాలుగా నిక్షిప్తం చేసేస్తున్నాను. ఏదేమైనా నా పర్యటన ఆద్యంతం అద్బుతంగా ..ఆహ్లాదకరంగా .. సాగుతోంది. ‘

‘ఆ.. అన్నట్టు నేనిచ్చిన  పెప్పర్ స్ప్రే , స్విస్ నైఫ్ , విజిల్ నీ బాగ్లోనే ఉన్నాయిగా ‘ ఏదో గుర్తొచ్చిన దానిలా సడెన్గా అడిగింది

‘ఊ .. ఉండక అవెక్కడికి పోతాయి ?  భద్రంగా ఉన్నాయిలే …’

‘నీకో విషయం తెల్సా .. గురుడాంగ్ మార్ లేక్ వెళ్ళిన మూడు రోజుల యాత్రలో నా సహా పర్యాటకుల్లో కొత్తగా పెళ్ళయిన ఓ జంట తప్ప అంతా పురుషులే .  అంతా చాలా మర్యాదగా వ్యవహరించారు.  సిక్కిం లో పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్లు కాల్చడం గానీ , పాన్ మసాలాలు తినడం గానీ నేను చూడలేదు. కొద్దిగా ఆశ్చర్యం అనిపించి స్థానికుల్ని అడిగాను .  బహిరంగ ప్రదేశంలో సిగరెట్ కాలిస్తే ఖచ్చితంగా ఫైన్ వేస్తారట. అదే విధంగా గుట్కాలు , పాన్ మసాలాలు అమ్మనే అమ్మరు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం’

‘రియల్లీ ..గ్రేట్ కదా .. మరి మన దగ్గర అలా ఎప్పుడు చూస్తామో ..?,,
‘నిజమేనే ..పరిసరాలే కాదు మనుషులూ స్వచ్చంగానే అగుపిస్తున్నారు’ అంటూ తలకు చుట్టిన స్కార్ఫ్ వదులు చేసుకుంటూ రూం లోకి అడుగుపెట్టింది తనూజ .
‘నీ  గొంతులోని ఉత్సాహం , ఉద్విగ్నత అనిర్వచనీయమైన నీ ఆనందాన్ని తెల్పుతోంది. మన ఇళ్ళలో స్త్రీల తెలివి, ధైర్యం , ఆత్మవిశ్వాసం మండే పోయ్యిలో వండే వంటకే అంకితమయిపోతున్నాయి ..’ మనోరమ మాటలకి అంతరాయం కలిగిస్తూ లైన్ కట్ అయింది.

మళ్ళీ మళ్ళీ  ప్రయత్నించింది తనూజ . నెట్వర్క్ సిగ్నల్ దొరకడం లేదు.  బయటికి వెళ్ళాలంటే చల్లటి గాలి విసిరికొడ్తాంది అనుకుంటూ బెడ్ మీద వాలింది తనూజ.

మనోరమ చివరి మాటలే ఆమె మదిలో మెదులుతున్నాయి.

నిజమే .. మహిళ జ్ఞానం, తెలివితేటలు, ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం పువ్వుకే అతుక్కున్న పరాగధూళిలా ఇంటికే కాదు.   నాలుగ్గోడలనుండి విశాల ప్రపంచంలోకి  సాహసంతో ప్రవహించాలి. అద్భుతమైన జగత్తులో తనదైన అజెండాతో ముందుకు సాగాలి. ఈ విశాల ప్రపంచంలో తనకో చిరునామా సృష్టించుకోవాలి.  కానీ నాలా చాటుగా కాదు.   సగర్వంగా తలెత్తుకుని..  రేపటి మహిళ గురించిన ఆలోచనల్లో  తనూజ

 

published in July 14, 2016 Saranga Web Magazine

పుండు పొడిసే కాకికి నొప్పి ఏం తెలుస్తుంది ..?

వేప చెట్టు నీడన సేదతీరుతున్న భార్య మేక దగ్గరకు వస్తూ ‘ఏంటి ఏమైంది అట్లా ఉన్నావ్ ‘ అడిగింది మొగుడు మేక
‘ఆ ఇంటావిడని చూస్తే గుండె తరుక్కుపోతాంది’ బాధగా మొహం పెట్టి చెప్పింది భార్య
‘ఏ..  ఎందుకూ .. ‘ అంటూ తనూ భార్య పక్కనే జారిగిలబడింది మొగుడు మేక.
‘ తన ఇంట్లోనే తనవాళ్ళనుకున్న వాళ్ళే దారుణంగా హింసిస్తుంటే, తనపై అఘాయిత్యానికి, ఆకృత్యాలకి పాల్పడుతుంటే, అవమానిస్తుంటే తట్టుకోలేక పోతోంది చూడు. ఎట్లా పొగిలి పొగిలి ఏడుస్తాందో. అట్లాగని తలవంచలేకపోతున్నట్లుంది…  ఆడాళ్ళ బతుకులు బాగుపడడం కోసం బలపడడం కోసం కొందరు ఏళ్ళ కొద్దీ చేసిన ఉద్యమాలూ , పోరాటాలు సాధించుకున్న చట్టాలు , ప్రగతిని కుళ్ళ బొడిచి  ఆమె తల నరకడానికి ఈ దౌర్భాగ్యులు ఏమాత్రం సంకోచించడం లేదు. ‘ భర్త మొహంలోకి చూస్తూ భార్య మేక
‘పెళ్ళాం ఉసురు పోసుకోవడం వాళ్ళు సంపాదించుకున్న తెలివి ..’ భార్య మొహంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ వ్యంగ్యంగా భర్త మేక
‘నీకు గుర్తుందా 1975-85 అంతర్జాతీయ మహిళా దశాబ్దం’ అడిగింది భార్య
‘ఆ..  అవును ,  మహిళా ఉద్యమాలు క్రియాశీలంగా ఉన్న ఆ కాలంలో అంటే 1983లోనే కదా 498 A చట్టం వచ్చింది ‘ గుర్తుకు తెచ్చుకుంటూ భర్త.
‘ అప్పటికే అంటే 1961లోనే వరకట్న నిషేధ చట్టం వచ్చిందా .. అయినా ఏం లాభం? ప్చ్ .. కాళ్ళ పారాణి ఆరకముందే ఎన్నో దీపాలు ఆరిపోయే.  అందుకే 498A చట్టాన్ని పకడ్బందీగా రూపకల్పన చేశారట. వరకట్నం మాత్రమే కాకుండా నాలుగ్గోడల మధ్య జరిగే శారీరక మానసిక హింసలు ఏవైనా ఈ చట్టం పరిధిలోకే వస్తాయట. అయ్యన్నీ వచ్చినా ఏం లాభంలే .. ఆయమ్మని చూస్తే గుండె చెరువవుతోంది.  కూరలో ఉప్పెక్కువయ్యిందని జుట్టుపట్టి రోడ్డు మిదేశాడే .. వాడ్ని చూస్తే పోయి గల్లాబట్టి నాలుగు పీక బుద్దయింది ‘
ఇంకా నయం పోలేదు.  మా గొడవలో ఏలుపెత్తడానికి నువ్వెవరని నరికి మసాలా పట్టిచ్చి తినేసేవాడు మనసులో అనుకుని ‘ఇప్పుడా ముచ్చట ఎందుకు చెప్తున్న ..’ తల గోక్కుంటూ భర్త

‘దేశంలో 498A ఉండాలా వద్దా అని చర్చ చాలా జరుగుతోందటగా.  ఆ చట్టం దుర్వినియోగం అవుతోందటగా! ‘ ఇప్పటిదాకా చెట్టు నీడన కూర్చున్న వాళ్ళనుకుంటుంటే విన్నాలే చెప్పింది భార్య.

‘అవును నేనూ అడపాదడపా వింటూనే ఉన్నా.. ‘సహనంలేని ఉద్రేకపడే మహిళా చిన్న కారణాలకే కేసులు పెట్టవచ్చు. దాని వలన ఆమె భర్త , అతని కుటుంబం జైలు పాలు అవ్వొచ్చు. అతని ఉదోగం పోవచ్చు , వారి వైవాహిక జీవితంలో తుఫాను రావచ్చు నని మలవత్ కమిటి చెప్పిందట .. అని ఎంత విడ్డూరం ..?’  భర్త

 ‘ ఏమో .. ఎక్కడో ఒకటి రెండు చోట్ల దుర్వినియోగం అయితే అయ్యాయేమో .. కాదనను. అంత మాత్రాన ఉన్న చట్టాన్నే రద్దుచేయాలా .. ‘ అని ఒక్క క్షణం ఆగి మనకి ఇట్టాటి బాధలూ లేవు.  చట్టాలూ లేవు.  ఏంటో  చదువు, తెలివితేటలున్న మనుషుల్లో సంస్కారం కుంచించుకు పోతూ .. ‘ చెప్తున్న ఆడమేక మాటలకి మధ్యలోనే అందుకున్న మగ మేక ‘చట్టం బాధితులకు కొండంత న్యాయం చేయాలని సూచిస్తే…అది ఆచరణలో ఆవగింజంత కూడా అమలు చేయరు. ఉన్న చట్టాల గురించి కొందరికి తెలవదు. తెలిసినా అవి వినియోగంలోకి రావు.  వచ్చినా ఏదో తూతూ మంత్రంగానే కదా .. అలాంటి దేశంలో…ఒక చట్టం దుర్వినియోగం గురించి చర్చ జరగడం చూస్తే ఈగవాలితే రోకలితో కొట్టినట్టుంది ‘ నెమరువేసుకుంటూ  అంది.
‘ చట్టాలుండీ ఆడవాళ్ళపై హింస అణచివేత తగ్గలేదంటే అసలే లేకుంటే… ‘ అని కొద్దిగా ఆగి మళ్లీ తానే ‘చట్టం చేసేవాళ్ళు అమలు చేసేవాళ్ళు , న్యాయం చెప్పే వాళ్ళు అంతా అతని వైపే ..చీ పాడు బుద్ది పోనిచ్చుకున్నారు కాదు. మనమే నయం. ఆడమగ వివక్ష లేదు.  498ఆ చట్టం వల్ల భర్త అతని కుటుంబానికి అన్యాయం జరుగుతుందని తెగ ఇదయిపొతున్నరు గానీ   ఆమె  కుటుంబ హింసకీ క్రూరత్వానికీ బలై జీవితాన్ని కోల్పోయినా పర్వాలేదా ..? ‘ ఆవేశంగా ప్రశ్నించింది భార్య .
ఆ గొంతులో తీవ్రత కొద్దిగా తగ్గించుకుంటూ మళ్లీ తనే సాహితీప్రసూన మాస పత్రిక ముఖచిత్రంపై ముగ్ద మనోహరంగా ఉన్న రాజీవను భర్తకు చూపింది. ‘ఈమెను గుర్తుపట్టావా.. భవిష్యత్ పై శతకోటి ఆశ ఉహలతో అత్తిల్లు చేరిన యాడాది లోపే అత్తింటి ఆరళ్ళకు బలై కాటికి చేరే .. ఆమెనే కాదు .. అలాంటి ఎన్ని ముద్ద మందారాలు నేలరాలిపోయాయో ..ఈ దేశంలో . వాళ్లకు న్యాయం జరగొద్దా .. అవి జరక్కుండా ఆపొద్దా .. ? ఊ .. చెప్పు .. ‘ అంది భర్తని నిలదీస్తూ ..

‘నిజమే.. పుండు పొడిసే కాకికి ఎద్దు నొప్పి ఏం తెలుస్తుంది ..?  అసలు చర్చ జరగాల్సింది 498-A ఉండాలా..ఊడాలా అని కాదు.  మహిళలపై అఘాయిత్యాలు…అరాచకాలు అరికట్టడం ఎలా అని. ఉన్న చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయంటే అందుకు కారణం ఆమెనా .. ? కానే కాదు. ఆమెకు తప్పుడు సలహాలు ఇచ్చి కేసు పెట్టించే పోలీసులు , లాయర్లు… ‘ అంటున్న భర్త మాటలకు అడ్డుపడుతూ

‘మనం పరాధీనులం అనుకుంటాం కానీ మనకంటే పరాధీనులు ఈ మనుషులు. కానీ అది ఒప్పుకోరు.  అధికులమని విర్రవీగుతారు. కడుపులో కత్తులు పెట్టుకొని తీయగ మాట్టాడతారు.  డబ్బు, పేరు, పరపతి, ఆధిపత్యం కోసం వ్యూహాలు పన్ని ఉచ్చువేసి అణచివేయడం లేదంటే చంపేయడం వీళ్ళ నీతి .. అందులో భాగమే ఆడవాళ్ళపై జరిగే హింస. అందుకే ఈ జాతిలో పుట్టనందుకు గర్వపడుతున్నా..  ‘ భర్త చూపులో చూపు కలుపుతూ భార్య .
వీళ్ళకి చదువు బారాణా , బుద్ది చారాణా అంటూ లేచింది భర్త మేక
వి. శాంతి ప్రబోధ
సాహిత్య ప్రసూన, ఏప్రిల్ 2016 ప్రచురణ

Tag Cloud

%d bloggers like this: