The greatest WordPress.com site in all the land!

Archive for May, 2013

చట్రంలో బందీ

పక్షిలా ఎగురుతూ..

లేడిలా గెంతుతూ

లేగలా అరుస్తూ
అమ్మ ఒడి లాంటి బడిలో
ఒదిగిపో యి
అ ఆ .. ఇ ఈ ..నేర్వాలని
ఒకటీ రెండూ చెప్పాలనీ
స్వేచ్చగా ఎదగాలనీ
నేననుకుంటా.. కానీ ,
నిదుర కళ్ళతో లేస్తూనే
బడి బట్టల్లో దురిపోవాలి
వడి వడిగా ముద్ద నోట్లో కుక్కు కుంటునే
గాడిద బరువుతో బస్సు మెట్లేక్కాలి
ఇరుకు గదుల్లో ఉక్కి పోతూ
అర్థం కాకపోయినా వల్లెవేస్తూ
a b  c d  నేర్వాలి
1 2 3 4 చెప్పాలి
బడి
అమ్మ ఒడిలా హాయి గా ఉంటుందనుకున్నా ..
ఉండాలని కోరుకున్నా .. కానీ
బూచాడు లాంటి బెత్తం పంతుళ్ళు ..
ఒక పూట హోం వర్క్ చేయకపోయినా
చదువుకు రాక పోయినా పనిష్మెంట్ లూ
మొద్దుమొహమా .. నీకు చదువు వస్తుందా ..
అంటూ చీదరింపులు .. బెదిరింపులు..
వీపు విమానం మోతతో సత్కారాలు .. సన్మానాలు ..
బడి అంటేనే భయం
సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూపులు
మామిడి తోపుల్లో కోతి కొమ్మచ్చిలాటలు
పంట కాల్వల్లో ఈదులాటలు
చెరువు మట్టితో గంగిరెద్దు బొమ్మలు
వాగులో ఇసుక గూళ్ళు కట్టడాలు
అని , నేను సరదా పడుతుంటే ..
సెలవులు వృధా చేస్తున్నావ్
ఇంగ్లీష్ గ్రామర్, కంప్యూటర్ క్లాస్ లో చేరమని నాన్న ఆర్డర్
ఐ ఐ టి ఫౌండేషన్ ..ప్రిపరేషన్ ..ఎంట్రన్స్..
డిగ్రీ చేతికి రాకుండానే ఉద్యోగానికి సెలెక్షన్స్
మరో రెండేళ్లలో ప్రమోషన్  ..
పని.. పని.. చేతి నిండా పని..
మనీ ..మనీ కావలసినంత మనీ ..
దేశ విదేశీ విమానయానాలు
పరుగు.. వేగంగా పరుగు
కాలంతో పోటీ గా పరుగు
హోధా.. అంతస్తూ ..
ఏదో సాధించేశాననీ, అందుకో లేనంత ఎత్తుకు ఎదిగాననీ
ప్రశంసలూ, సన్మానాలూ
అవార్డులూ .. రివార్డులూ
కానీ ..
నాలో ఎంతో కోల్పోయిన  భావన
వెన్నంటే ..నాతో పాటే పెరుగుతూ .. ఎదుగుతూ..
నేను నేనుగా ..
నాకు నచ్చిన విధంగా లేననీ
మరపురాని మధురమైన బాల్యం నాకు లేనే లేదనీ
ఇక ఎప్పటికీ తిరిగి రాదనీ
చట్రంలో బందీననీ
నా మనసు పోరుతోంది
ఇప్పటికైనా మించి పోయింది లేదనీ
నీవు నీవుగా బతకమనీ ..
రాజీ లేని పోరు చేయమనీ ..
వి. శాంతి ప్రబోధ

వెతుకులాటలో “నేను”

నీ చిటికెన వేలు పట్టుకుని

ఏడడుగులు వేయగానే

నా ఇంటి పేరు మార్చేసావు
ఆనాటి నుండి
నా ఊహల్లొ.. ఊసుల్లొ నీవేనాయె
నీ ఆలోచనలే నా ఆచరణగా బతుకాయే
నా శ్వాస నిశ్వాసల్లో నీవేనాయె
నీ నీడలో .. నీ బాటలో
అత్తమామల సేవలో
పిల్లల ఆలన పాలనలో
ఏళ్ళు క్షణాలుగా దొర్లిపోయే
నేను గానీ లేకుంటే వీళ్ళంతా ఏమైపోతారోనన్న భ్రమలో గడచిపోయే
రెక్కలొచ్చిన పిల్లలు జీవనమార్గాన్వేషణలో వెళ్ళిపోయే
అలసి సొలసి
ఇప్పుడు ఒక్క క్షణం ఆగి
వెనక్కి చూసుకుంటే ..
ఏముందీ
అసలు “నేను”న్నానా..? సందేహం!
నా చదువూ .. నా విజ్ఞానం..
నా ఆలోచన..నా వివేచన ..
ఏమైపోయాయి..? ఎక్కడ చిక్కడిపోయాయి ..?
ఇకనైనా నేను నేనులా ఉండగలనా..?
వెతుకులాటలో “నేను”
నేను నీవైనప్పుదు
నీవు నేను అయ్యావా ఎప్పుడైనా?  ఎక్కడైనా?
ఆ వెతుకులాటలో  “నేను”
వి. శాంతి ప్రబోధ

రాలి పోతున్న విద్యా కుసుమం

ర్యాంకుల 
రా’బడి’లో 

నిర్జీవ యంత్రాల్లా 
నిరంతరం బట్టీ బట్టే మెదళ్ళు  .. 

మినుకు మినుకు మనే చుక్కల్లా 
సామరస్యత శాంత స్వభావాలూ .. 

శిథిల శకలాల్లా 
కుటుంబ, సామాజిక సంబంధాలూ .. 

పూ రేకుల్లా 
రాలిపోతున్న విద్యా కుసుమాలు 

వి. శాంతి ప్రబోధ

గుత్తాధిపత్యం

నా అస్తిత్వాన్ని కాపాడుకుంటూ

నా ఆలోచనల్ని సానపడుతూ
నా మనసు మాట వింటూ
నా లోని నన్ను చూసుకుంటూ
నా ఆశలకి, ఆకాంక్షలకి రూపమిస్తూ
అడ్డువచ్చే ముళ్ళకంపల్నీ మురుగు కాలువల్నీ దాటుకుంటూ
చీకట్లను చీల్చుకుంటూ
నా భావికి బాటలు వేస్కుంటూ
సాగుతూ నే ఉన్నా ..
మరి ఎప్పుడు వచ్చావో .. ఎలా వచ్చావో ..
నాకు తెలియకుండానే చొరబడ్డావు నా తలపుల్లో
కొంచెం కొంచెం ఆక్రమించేస్తూ
నా ఆలోచనల్నీ.. దారుల్నీ నీలో కలిపేసుకుంటూ
ఓహ్ .. మనిద్దరం ఒకటే…
ఒకటే మాట , ఒకటే బాట .. అనుకున్నా
చెట్ట పట్టాలేసుకు తిరిగా
నీ స్నేహ హస్తం అందుకున్నందుకు సంబరపడ్డా
కాలం గడుస్తున్న కొద్దీ.
నీవేంటో అర్ధమవుతోంది .
నీ నిజ స్వరూపం అవగతమవుతోంది
నీ వొక అవకాశవాదివనీ
నీ కనుసన్నలలో నడవమని ఆదేశిస్తున్నావనీ
నిన్ను కాదంటే నీవు సహించలేవనీ
నామ రుపాల్లెకుండా చేయడానికి యత్నిస్తావనీ
నీ అహం తృప్తి పరచడానికి ఎంతకైనా తెగిస్తావనీ
అగ్ర రాజ్యం అమెరికాను మరిపిస్తున్నావనీ
అందుకే, నిర్ణయించుకున్నా
పాము పడగ నీడలో మనలేననీ
నీ కబంధ హస్తాలనుండి బయట పడాలనీ
నా అస్తిత్వాన్ని కాపాడుకుంటూ
నేను నేనుగా నిలబడాలనీ
వి. శాంతి ప్రబోధ

ఆడపని..మగపని..

అమ్మా ..అమ్మా ..’ అంటూ బాల్కనీ లోంచి ఎనిమిదేళ్ళ సహజ అరుపులు.

‘తొందరగా రా ‘ పరుగు పరుగున వంటగదిలోకి వచ్చి తల్లి చేయి పట్టి లాగుతూ
‘స్నానం చేయకుండా ఏమిటే నీ గొడవ?,  కానీ .. త్వరగా తయారవు స్కూల్ బస్సు వచ్చే టైం అవుతోంది’ అంది సహజ తల్లి రోహిణి.
‘సరేలేగాని ముందు నువ్విటురా నీకు ఒకటి చూపించాలి ..’ అంటూ తల్లిని లాక్కెల్లడానికి  ప్రయత్నిస్తూ సహజ
‘ఆ.. నాకేం పనిలేదనుకోన్నావా..! పొయ్యిమీద పాలు ఉన్నాయ్.  ఓ వైపు బెండకాయ వేపుడు మాడిపోతుంది.’ కొంచెం విసుగ్గా అని , ఒక క్షణం  ఆగి అసలు విషయం ఏమిటో చెప్పు అంది రోహిణి. కూతురు చేయి విడిపించుకోవడానికి యత్నిస్తూ..ఏదైనా ఒకటి అనుకుందంటే వదలదు ఈ పిల్ల అని మనసులో అనుకొంది రోహిణి.
‘అమ్మా  అటు చూడు ‘ తల్లి మాటల్ని పట్టించుకోకుండా బాల్కనీలొకి లాక్కెళ్ళిన సహజ .
అపురూప దృశ్యం అసలెప్పుదూ ఊహించనిది.  మొన్నటివరకూ ఆడ పిచ్చుక వెంట గింగిర్లు కొట్టిన మగపిచ్చుక  ఇప్పుడు దానితో జతకట్టిన ఆడపిచ్చుక.  ఆ ఇంటి బాల్కనీ వెంటిలేటర్ లో ఆ జంట ఇల్లుకట్టుకొని ఓ ఇంటి వాళ్ళు కావలన్న ప్రయత్నం ఈమధ్య ఆరంభించాయి. ఎక్కడెక్కడి నుండో ఎండు గడ్డి ముక్కున కరచుకొచ్చి తమకొక ఇంటిని ఏర్పరచుకున్నై.  ఉన్న ఇరుకైన జాగాలో తమకనువుగా మలచుకుంది ఆ జంట.  వెధవ పిచ్చుకలు.  ఇల్లు  ఇప్పుడే శుభ్రం చేశానా అప్పుడే మళ్ళి చెత్త పడేశాయి అని తిట్టుకుంటూ  ఆ ఇంటి ఇల్లాలు రోహిణి..  వెంటిలేటర్ కి ఉన్న రెండు అద్దాల మధ్య ఉన్న సన్నని ప్రదేశంలో ఉన్న ఆ గూడు తీయడం కాస్త కష్టమే అయినా ఆదివారమో లేదా తనకి వాటి చెత్తతో విసుగువచ్చినప్పుడో  ఆ గూడు తీసేసింది.  అలా నాలుగైదు సార్లు తీసినా  మళ్లీ అక్కడే గూడు .. పట్టువదలని విక్రమార్కుడిలా ..అవి.
అయ్యో .. వాటినలా ఉండనీ రోహిణి పాపం అవీ బతకాలిగా .. వాటికీ ఇల్లు కావాలిగా .. నిన్న మొన్నటి దాకా నీవెంత పోరేదానివి స్వంత ఇంటికోసం.  మనలాగే వాటికీ గూడు కావాలిగా.  వాటికీ మనిల్లు అనువైనదనిపించింది కావచ్చు.  అందుకే నువు ఎన్ని సార్లు తీసినా మళ్లీ ఇక్కడే చేరుతున్నాయి.  నువ్వు విసుక్కుంటున్నావని నేను అనలేదు.  కానీ, నాకు వాటిని అలా చూడడం చాల ఇష్టం. వాటి కిచకిచా రావాలు వినడం మరీ ఇష్టం. నా చిన్నప్పుడు మా తాత గారి ఇంట్లో పంట రాగానే వడ్ల కంకులు, జొన్న కంకులు జడలాగ అల్లి ఆ గుత్తుల్ని వసారాలో వేలాడదిసేవారు.  వాటిని ఎంచక్కా ముక్కుతో ఒక్కో గింజా గిల్లుకు తినేవి.  మా తాత వడ్లు గిర్నీ పట్టించుకోచ్చేవాడు. మా నాయనమ్మ, అమ్మ పనయ్యాక ఆ బస్తాల్ని గుమ్మరించి బియ్యం తో పాటు ఉన్న చిట్ట్టు చేటతో  చేరిగేసే వారు. మెరిగల్ని చేటతో  నేమి ముందుకొచ్చిన మెరిగలు,మట్టిపెడ్డలు, రాళ్ళూ కిందపదేలా మలిచేది. మలవగా వచ్చిన మెరిగల్ని పిచ్చుకలకి వేసేవారు.   బియ్యం చేరిగినప్పుడు చిట్టులో వచ్చిన నూకల్ని వేరుచేసి వాటిని పిట్టలకి చల్లేవారు. ఆ రోజుల్లో ఇంట్లోకి కావలసినవన్నీ పండించేవారు. వాటితో  ఎప్పుడూ పెసరపప్పో,  మినపపప్పో , రవ్వలొ ఏదో ఒకటి తాయారు చేసేవారు. కొనే వారు కాదు కదా.  ఇంటి చూరులో గుళ్ళు పెట్టుకొని ఉన్న మా ఇంటి పిచ్చుకలే కాదు బయటనించి వచ్చేవి వాటిని తినడానికి.  అప్పుడు వాటికి పండగే మరి. ఇంటి చురులోంచో, వాసాలమీదొ ఉన్నవల్లా  చటుక్కున వచ్చి గింజల్ని నోట నింపుకొని గూట్లోకి వెళ్లి పిల్లలకు పెట్టేవి.  అటునుండి ఇటు ఎగురుతో ఉండేవి.  మా నాయనమ్మ గింజలు వేసేదిగా  అందుకే అవి ఆవిడ వెంట తిరుగుతూ కన్పించేవి.  వాటిని రాకుండా కట్టడి చేద్దామని అపుడప్పుడు నీలాగే మా అమ్మా ప్రయత్నించేది.   కాని వాటిని ఆపడం తన వల్ల అయ్యేది కాదు.  నాకు అవి మంచి నేస్తాలు.  మా అమ్మనో నాన్నమ్మనో కథ చెప్పమంటే కాకిది కర్రల గూడు, పిచ్చుకది పిడకలగూడు అని మొదలుపెట్టేవారు.  అసలు ఆ రోజులే వేరు.  పిచ్చుకల కిచకిచ రావాలని  ఇళయరాజా సంగీతంలా ఆనందించే వాడిని.  మనుషుల చుట్టూ తిరుగుతూ మనతో  స్నేహం చేసే  పిచ్చుకలు, మన ఇళ్లలోనే గుళ్ళు కట్టుకుని  సహవాసం చేసే పిచ్చుకలు కనుమరుగావుతున్నై.  వీనుల విందు చేసే ఆ సంగీతము వినపడడం లేదు.  కాంక్రీటు కీకారణ్యంలో వాటికి చోటే కరువైంది.  రసాయనాలతో పండించే పంటలు తినీ సెల్ టవర్ ల సుడిగుండంలో చిక్కి తమ ఉనికినే కోల్పోతున్నై అంటూ పిచ్చుకల పట్ల తనకున్న కన్సర్న్ తో  భార్యను కన్విన్సు చెయ్యాలని ప్రయత్నించిన  భర్త రాహుల్.
ఆ.. మీరట్లాగే అంటారు. కూర్చొని కబుర్లు బానే చెప్తారు.  కానీ చేసేవాళ్ళకి తెలుస్తుంది నొప్పి.  ఆ చెత్తకు తోడు ఈ మధ్య రోజూ పిట్టగోడపై అన్నీ పిచ్చుక పెంటలే.  చుక్కలు పేర్చినట్లు.  చేయి వేయడాని వీల్లేకుండా. రోజు నాలుగైగు సార్లు శుభ్రం చేయాల్సి వస్తోంది.  లేక పోతే ఎంత రోత.  ఈ ఇంటి ఇల్లలికి శుభ్రతే లేదని ఆది పొసుకొరూ .  అయినా మనది కొత్త ఇల్లు. అప్పుడే ఎలా చేసాయో చూడూ  అంటూ రోహిణి.
ఆమె ఎన్ని సార్లు తీసినా అవి అక్కడనుండి కదలక పోవడంతో విసిగిన రోహిణి కూడా నెమ్మదిగా వాటిని ప్రేమించడం మొదలుపెట్టింది. పిడికెడు లేని పిచ్చుకలు  తలుపు తీసి ఉంటె చాలు రివ్వున లిపలికి పరిగెత్తు కొస్తాయి. పైకి కిందకి గిరికీలు కొడుతుంటాయి. ఒక్కో సారి డ్రెస్సింగ్ టేబుల్ అడ్డం కేసి ముక్కుతో కొడుతూనో, విండో గ్లాస్సెస్ లో తమను చూసుకొని టకటకా కొడుతూ పలకరించు కుంటూ ఉంటాయి  మురిసిపోతుంటాయి. అల్లరి చేస్తుంటాయి. కొట్లాడుకుంటాయి.  సిలింగ్ ఫ్యాన్ రెక్కల పై కూర్చొని హొయలు పోతుంటాయి.
వాటి ప్రతి కదలికను ఆనందిస్తూ వాటితోపాటు అల్లరి చేస్తుంది సహజ.  వాటి సరస సల్లాపాలు చూడడం సరదాగానే ఉన్న శుబ్రం చేయడమే కష్టం రోహిణి కి. జత కట్టిన ఈ జంట ఈ మధ్య గుడ్లు పెట్టి పిల్లలని చేసాయి. తమ జాతి అభివృధికి దోహదం అవుతున్నాయి అనుకున్న ఆ ఇల్లాలు వాటిని అలాగే ఉంచింది.  ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ఆ జంటని గమనించడం సహజ దినచర్యలో భాగమైంది.  పిచ్చుక పిల్లలకు ఆడ పిచ్చుక ఆహారం నోట కరచు కొచ్చి అందించడం..కొద్దిగా హుషారైన పిల్ల గూట్లోంచి తలెత్తి తల్లికోసం ఎదురు చూడడం, నోరు తెరచి తల్లి తినిపించేది అందుకోవడం గమనిస్తోంది.  అప్పుడప్పుడు గోధుమ రవ్వ, బియ్యం జల్లడం జరుగుతోంది.  అమ్మా.. నువ్వు నాకు తినిపించి నట్లే తల్లి పిచ్చుక తన పిల్లలకీ తినిపిస్తోంది కదా! అంటుంది.  ఆ గూట్లో ఎన్ని పిల్లలున్నాయో అన్న కుతూహలం ఆమెలో.  వాటి ఇల్లు చాలా చిన్నది కదా! తమ పిల్లల కోసం… తమ స్థానం వాటికి ఇచ్చి అవి ఎక్కువ సమయం పిట్టగోడ మీద గడుపుతున్నాయి.  అందుకే అక్కడ రెట్టలు వేస్తున్నాయి అనుకోంది రోహిణి.
 కానీ.. అందుకు భిన్నంగా.. ఉహించని విధంగా ..ఆ దృశ్యం.  చాలా ఆశ్చర్యంగా .. అద్భతంగా..
గూట్లో పిల్లలు వేసిన   రెట్టని మగ పిచ్చుక నోట కరచుకోచ్చి పిట్ట గోడ మీద పెడుతోంది.  ఆడపిచ్చుక అలా..అక్కడే పిట్టగోడపై చిద్విలాసంగా చూస్తూ..
అమ్మా నేనెందుకు లాక్కోచ్చానో అర్ధమైందా అన్నట్లుగా తల్లి మొహం లోని భావాల్ని చదవడానికి ప్రయత్నిస్తూ..సహజ
‘అవి కూడా తమ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకొంతున్నాయి ..?’ రోహిణి కూతురి కేసి ఆ పిట్టల కేసి మార్చి మార్చి చూస్తూ ..
‘అవును ,  ఆ పని చేస్తోంది మగ పిచ్చుక.  మనుషులకైతే ఆ పనులన్నీ అమ్మే చేస్తుంది కదా..నాన్న చేయడుగా.. అది మగ వాళ్ళ పనికాదుగదా ,  అమ్మా పక్షులు, జంతువులకు ఆడ పనులూ.. మగ పనులూ అని ఉండవా?’ తన సహజ ధోరణిలో ప్రశ్నల వర్షం కురిపిస్తోంది సహజ.
ఆమె అంతే ఎప్పుడూ ..తనకొక సందేహం వచ్చిందంటే చాలు అలా ప్రశ్నల పరంపర కోన సాగుతూనే ఉంటుంది. తనకి కావలసిన జవాబు వచ్చేవరకూ వేసిన ప్రశ్ననే మార్చి మార్చి రక రకాలుగా అడుగుతూ ఉంటుంది ఎవరు కనిపిస్తే వాళ్ళని.  కూతురి గురించి బాగా తెలిసిన రోహిణి ‘నడు నడు బడికి వెళ్ళవా..? నిన్నిట్ల వదిలేస్తే ఈ రోజు నేను ఆఫీసుకి నువ్వు బడికి వెళ్ళవ్ .’ అంటూ బాత్రూం లోకి తోసింది.  అయ్యో పొయ్యి మీద పాలు పొంగిపోయ ఉంటాయి అనుకుంటూ వచ్చి అడుగంటిన బెండకాయ వేపుడుని రెఒన్దు సార్లు అటూ ఇటూ తిప్పి, పొంగడానికి సిద్దమవుతున్న పాలగిన్నెను దించింది. ఇడ్లీ కుక్కర్ పెట్టి నీళ్ళు పోసింది.ఇడ్లీ ప్లేట్లలో పిండివేస్తూ ఆలోచిస్తోంది.
“ఆడపనీ.. మగపనీ..”అన్న కూతురి మాటలని
ఇంటిపని, వంటపని, పిల్లలపనీ అంతా ఆడవాళ్లదేనా?  మగవాళ్ళు ఎందుకు చేయరు?  తాపీగా లేచి, పేపర్ తిరగేసి అన్ని సిద్దం చేసి పెడ్తే ఇంత తిని చక్కగా తయారయి ఆఫీసుకి వెల్లడం ..అంతే..దానికి ఎంతో కష్టపడి వచ్చాం అనుకుంటారు. ఇంటికి వస్తూ వస్తూ కాసేపు మిత్రులతో కాలక్షేపం  లేదా ఇంటికి వచ్చాక మిత్రులతోనో..మొబైల్ లో ముచ్చాట్లతోనో లేదా టి.వి తోనో కాలం గడిపేస్తారు. కానీ కాసేపు ఇంటి పనీ, వంటపని లో సాయం రాకపోయినా కనీసం  పిల్లల చదువు గురించి ఐనా  పట్టించుకోరు.
ఆడవాళ్ళకి అందులోనూ ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఏమైనా తీరిక ఉంటుందా! గడియారం ముల్లుతో పోటిపడి పరుగులు ..మధ్యలో బంధువులు ..వారి బాగోగులు చూసుకోవడం.. తను ఇంకా నయం.  రాహుల్ చాలా మంచివాడు.  పక్కింటి పరమేశం లా ఇల్లు సరిగ్గా తుడవలేదనో, నీటుగా తయారు కాలేదనో, తనకి కావలసినవి చేసిపెట్టలేదనో .. ఏదో ఒక వంక పెట్టి ఎత్తి చూపి సతాయించడు. రచ్చ రచ్చ చేయడు.  తన ఆధిపత్యం చూపించాలనో, పెత్తనం చేయాలనో చూడడు అని ఎప్పుడూ ఆనంద పడుతుంది.  అంత వరకూ సంతోషమే కానీ..జీవితంలో ఇద్దరూ  భాగస్వాములు. ఇద్దరికీ సంబంధించిన ఇల్లు..వంట..పిల్లలు..అన్నిటిలో సమ భాగస్వామ్యం ఉండాలిగా..ఎప్పుడైనా ఆ మాట అంటే మా అమ్మ నేర్పాలా.  నాకు రావు.  అబ్బా నన్నిలా వదిలెయ్యి అంటాడు విసుగ్గా . మరి హాస్టల్ లో ఉండి
చదువుకున్న నేను నేరుచుకుని చెయ్యడం లేదూ అనుకొంది రోహిణి.
ఆమె కళ్ళ ముందు మగ పిచ్చుక  ముక్కున కరచి తెస్తున్న దృశ్యమే కనిపిస్తోంది.  సహజ పసిపిల్లగా ఉన్నపుడు ఎప్పుడైనా పాసుకు వెళ్ళినా, దొడ్డికి వెళ్ళినా మొహం అదోలా పెట్టి రొహీ ..రా త్వరగా రా అంటూ అరిచేసేవాడు దీని సంగతి చూడు  .. అనే భర్త గుర్తొచ్చాడు ఆమెకి.  సాధారణంగా ఊరికి వెళితే ఇద్దరూ కలిసే వెళతారు లేదా రాహుల్ ఒకడే వెళతాడు.  ఒకటి రెండు సార్లు రాహుల్ కి వీలు కాక తను వెళ్ళింది. అప్పుడు తను వచ్చేవరకూ ఇల్లు అలాగే ఉంది. శుభ్రం చేయనే లేదు. ఏమిటి శ్రమ విభజనలో ఈ తేడా?  ఆడ మగ వ్యత్యాసం, ఆధిపత్య భావజాలం వీళ్ళలో ఎప్పుడు పోతుందో..అనుకొంటున్న రోహిణిలో మగ పిచ్చుక పట్ల గౌరవం భావం కలిగింది.  అమ్మా పిచ్చుకలు పాపం అక్క ఎలా ఉంటున్నాయో . ఒక గూడు కొందామా ..మార్కెట్లో అమ్ముతున్నారట అని అడిగింది. అప్పుడు దాన్ని తిట్టింది.  వచ్చేనెలలో సహజ పుట్టిన రోజు.  తనకి పుట్టిన రోజు కానుకగా పిచ్చుక గూడు కొనిచ్చి కూతురి మోహంలో ఆనందం.. ఆశ్చర్యం..చూడాలని అనుకొంటున్న ఆమె ఆలోచనలని భంగ పరుస్తూ
“రొహీ.. టిఫిన్ రెడీ నా..’ తన పనులు ముగించుకొని వచ్చిన భర్త పిలుపుతో ఉలిక్కి పడ్డ ఆమె సమయం చూసి హడావిడిగా కదిలింది.
వి.శాంతి ప్రబోధ

Tag Cloud

%d bloggers like this: