The greatest WordPress.com site in all the land!

Archive for October, 2014

ఆశ్చర్యం .. ఆనందం …

ఆశ్చర్యం .. అంతులేని ఆశ్చర్యాన్ని మోసుకొచ్చింది ఆ ఫోన్.
చేతిలోని మొబైల్ గంట కొట్టింది. నంబర్ చూస్తే ఎవరో తెలియలేదు. కాల్ తీసుకున్నాను. ఎవరో పెద్ద వాళ్ళ గొంతు. అమ్మా .. వర్ని చరిత్రలో లేని విధంగా చరిత్ర సృస్టించావ్ అంటూ .. గొంతు ఎవరిదో గుర్తుపట్టలేక పోయాను. ఆ గొంతులో ఆనందంతో కూడిన వణుకు. అది జలుబుతో ఉన్నట్లుగానో.. వయసుతో వచ్చినట్లుగానో.. అర్ధంగాక .. ఏమిటండీ మీ గొంతు ఇలా వీక్‌గా .. అన్నాను ఆ కాల్ చేసింది జంపాల సుబ్బారావు సార్ కావచ్చోనే ఉద్దేశ్యంతో.. వయసు పెద్దదయిపోయింది కదమ్మా .. 85 ఏళ్ళు ఇప్పుడు అని చెప్పి చాలా సంతోషంగా ఉందమ్మా ..పిల్లలేం చేస్తున్నారూ .. మీ ఆయన ఏమి చూస్తున్నాడు .. మీ మామయ్య వాళ్ళంతా బాగున్నారా అని కుశలప్రశ్నలు వేసి తనకి సాహిత్యం అంటే ఎంత ఇష్టమో చెబుతోంటే ఆ మాటల తీరుని బట్టి అర్దమయింది ఆయనెవరో .. అంత పెద్ద వయసులో నేను ఆర్గనైజ్ చేసిన ఓ చిన్న కార్యక్రమాన్ని గుర్తించి నా ఫోన్ నంబర్ ఎలాగో సంపాదించి ఫోన్ చేసి అంతగా మెచ్చుకుంటుంటే నాకు ఏమీ మాట్లాడాలో తెలియని బిడియం.. ఈ సారి ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే చెప్పమని తప్పకుండా వస్తానని చెప్పడం .. సాహితీవ్యాసంగాన్ని వదలవద్దని సలహా ఇవ్వడం.. ధనంతో కూడిన ప్రస్తుత రాజకీయాలు మాట్లాడడం.. ఈ సారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ని కలవమని చెప్పడం అంతా .. అంతా .. ఆశ్చర్యమే … ఆయన్ని నేను చివరగా చూసి ఇరవై ఏళ్ళ పై మాటే . అలాంటిది ఇప్పుడు ఇలా ఫోన్ చేసి మాట్లాడడం ఆశ్చర్యమే కదా మరి!

ఆయనెవరో ఇంతకీ చెప్పనే లేదు కదూ .. ఆయన మరెవరో కాదు , మా బాన్సువాడ నియోజకవర్గంలో ఒకానొక సమయంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేసిన మాజీ ఎమ్మెల్యే SVL నరసింహారావు గారు.

వి. శాంతి ప్రబోధ

భవిష్యత్ గుడిసెపై వెలుగురేఖలు

స్నేహ సంబంధాలు మసకేసి
స్వార్ధం రాచపుండై విధ్వంసం సృష్టిస్తూ
గుప్పెడు గుండెని గుండుసూది మొనలతో గుచ్చుతూ
పచ్చి పుండై ఆరని గాయంతో మూగగా రోదిస్తున్న
నన్ను చూసి చిద్విలాసంతో చిందులేస్తుంటే ..
బంధాలు ఆత్మీయతానుబంధాలు వెలిసిపోయి
మంచు కత్తితో ముక్కలు ముక్కలు చేస్తూ
సరిహద్దులు దాటి కాకులు గద్దలకేసి ఆనందిస్తూ
పగడపు దిబ్బల్లా పొడుచుకొచ్చిన అహంకారంతో
అనుబంధాలన్న పదానికే అర్ధం మార్చేస్తుంటే ..
అమ్మమ్మ చెప్పిన కథలో పాము మింగిన చంద్రుడిలా
రాళ్ళు రప్పల మధ్య రణభుమిలా ఉన్న నాలో
ఉన్నాం, నీకు మేమున్నామని భరోసా ఇస్తూ
గ్రహణం వీడి భవిష్యత్ గుడిసెపై వెలుగురేఖలు విచ్చుకుంటూ ..

వి. శాంతి ప్రబోధ
20. 10.2014

ప్రపంచ ఆహార దినోత్సవం అనగానే గుర్తొచ్చే యూహ

ఈ రోజు అక్టోబరు 16వ తేది. అంటే ఈ రోజే ప్రపంచ ఆహార దినోత్సవం . ఆహారం, ఆహార దినోత్సవం అనగానే స్వీడన్ దేశంలో మా పర్యటన, ఆ పర్యటనలో మూటగట్టుకున్న అనుభవాలు జ్ఞప్తికి రాకమానవు. అది జరిగింది తొమ్మిదేళ్ళ క్రితం.

ఆ సంఘటన జరిగింది అక్టోబరు 10, 2005 న. నాకు ఇప్పటికీ ఆశ్చర్య పరుస్తుంది. అబ్బురపరుస్తుంది. ఆ సంఘటన మీతో పంచుకోవాలనిపించి ఇప్పుడు మీ ముందుకొచ్చా. ఆ రోజు ఉదయం నుండీ మేమంతా చాలా బిజీగా ఉన్నాం. స్టాక్ హోం నగరం లోని బ్యోర్కా (Bjorka Behandlingsham ), Stenby Gird లలో మాదకద్రవ్యాలకు అలవాటు పడి నేరాలు చేసి జైలుకు వచ్చిన వారికి ఇచ్చే చికిత్సలు, ఆ జైళ్ళలో ఉండేవారి హక్కులు ఏమిటో తెలుసుకొని తిరుగు ప్రయాణం అయ్యాం KRIS బృందం Juha Deoderson, Annelli, Eva Maria లతో పాటు స్టాక్ హోం లోనే ఉంటున్న రత్న (లవణంగారి మానస పుత్రిక ) ఇక్కడ నుండి వెళ్ళిన లవణం గారు , సుందర్ , నేను. మేం అప్పటివరకూ వెళ్ళిన ప్రదేశాలు సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉన్నాయి. అంతా అలసిపోయి త్వరగా మా బసకు చేరాలని అనుకుంటున్న సమయంలో మేం ఉన్న వాహనం పార్కింగ్‌లో ఆపి ఇప్పుడే వస్తానంటూ పరుగు పరుగున వెళ్ళాడు యూహ. ఎందుకో మాకెవ్వరికీ అర్ధం కాలేదు. నిముషాలు గడుస్తున్నాయి అతను రాలేదు.

దాదాపు ఇరవై నిముషాల తర్వాత చేతిలో పెద్ద పెద్ద బ్యాగ్స్ తో వచ్చాడు.
అంత సేపు వెయిట్ చేయించాల్సివచ్చినందుకు క్షమాపణలు చెప్పాడు. మా వాహనం కదిలాక నెమ్మదిగా తను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందీ చెప్పాడు. మరో పది నిముషాలు ఆలస్యం అయితే ఆ పూట చాలామంది తన కోసం ఎదురుచూస్తూ ఆకలితోనే ఉండేవాళ్ళని. ఎందుకో అర్ధం కాని మాకు వివరించాడు తనేం చేస్తాడో. అక్కడ సాయంత్రం 6 గంటలయ్యేసరికి హోటళ్ళు ముసేస్తారట. ఆ లోపు వెళ్తే ఆరోజు మిగిలిపోయిన ఆహారం తీసుకోవచ్చు. లేదంటే అది వృధా అయిపోతుంది. అందుకే ప్రతి రోజూ ఆ సమయాల్లో రెండు మూడు హోటల్లనుండి ఆహారం సేకరించి పేదలకి అందిస్తాడట. వాటితో వారు కడుపు నింపుకుంటారట . యూహ జైలు జీవితం నుండి బయటి ప్రపంచంలోకి వచ్చి KRIS లో చేరిన తర్వాత ఇలా తనకు తోచిన సేవచేస్తున్నాడని అన్నెల్లి చెప్పింది. అతని మానవత్వానికి హేట్సాఫ్ చెప్పి ముందుకు కదిలాం.

వి. శాంతి ప్రబోధ

నేను గ్రామీణ శ్రామిక మహిళను ..

133101
మీకు
నేనో ఉత్పత్తి సాధనాన్ని
నేనో పునరుత్పత్తి సాధనాన్ని
నేను
మనుగడ పోరాటంలో నలుగుతున్న దాన్ని
మార్కెట్ వివక్షలో దోపిడీకి గురవుతున్నదాన్ని
కుటుంబ బాధ్యతల కాడి మోస్తున్నదాన్ని
శారీరకంగా మానసికంగా అలసిపోతున్నదాన్ని
పనికి తగ్గ వేతనం లేనిదాన్ని
స్వల్ప వేతనంతో సర్దుకుంటున్నదాన్ని
పనికి మెరుగులు దిద్దుకునే శిక్షణ లేనిదాన్ని
నాకు కార్మికురాలిగా గుర్తింపు ఉండదు
సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండవు
నాకు ప్రమోషన్లు, రిటైర్మెంట్ తెలియదు
మెటర్నిటి లీవు లేదు
టాయ్‌లెట్ .. రెస్ట్ రూం తెలియదు
కనీస సదుపాయాలు లేనిదాన్ని
మైళ్ళ కొద్దీ నడుస్తా
నాటు, కోతా ఏ పనైనా చేస్తా
ఇప్పుడు మా కడుపు కొట్టే
మహమ్మారి యంత్రాలు భూతాల్లా
నాటుకు, కోతకు .. మా నోట్లో మట్టికొడుతూ
బతుకుల్లో చీకట్లు చిమ్ముతూ
చేయడానికి పని,చేతిలో చిల్లి గవ్వలేక
అసహనంతో మొగుడు అరిస్తే
ఆ భారం మోసేది నేనే
బతుకు దెరువుకోసం కట్టుకున్నోడు ఇల్లు విడిస్తే ..
ఆ భారం బాధ్యత నానెత్తిపైనే
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటే
ఆ భారం నా భుజం పైనే
అంతా తిన్న తర్వాతే మిగిలింది తినడమో ..
లేదా ఆకలికి మాడడమో ..

కుటుంబం కోసం ఎక్కువ కష్టం
తక్కువ ఆహారం నా సొంతం
నేనున్నానంటూ అనారోగ్యం
వెతుక్కుంటూ వచ్చి వేస్తుంది తిస్ట
అతని సంపాదన అతని కోసం
ఆ తర్వాతే కుటుంబం

నా పైసా పైసా నా పిల్లల కోసం కుటుంబం కోసం
నాపై ఇంటా బయటా వేధింపులు .. దాడులు
అయినా నేను కుటుంబపు కాడి మోస్తూనే ..
సమాజ గతిలో పురోగతిలో నా వంతు కృషి చేస్తూనే ..
ఏనాటికైనా నా తల రాత మారుతుందనే ఆశతోనే …

వి. శాంతి ప్రబోధ
15. 10.2014
అక్టోబరు 15వ తేది అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం సందర్భంగా

కిశోర బాలికల సాధికారత-హింసా నిర్మూలన దినోత్సవం

ప్రపంచం నలుదిశలా ఆడపిల్లలపై జరిగే అన్ని రకాల హింసకి వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని అక్టోబర్ 11 వతేదీ అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ బాన్ కి మూన్ పిలుపు నిచ్చారు.
nss camp 129
ప్రపంచ వ్యాప్తంగా ఆడపిల్లలకి ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటూ వారి హక్కులను సంరక్షించడం కోసం ప్రతి ఏడాది అక్టోబర్ 11 వ తేదీని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకోవాలని డిసెంబర్ 19, 2011 న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 11 వ తేదిన అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

2014 సంవత్సరాన్ని Empowering Adolescent Girls: Ending the Cycle of Violence ( కిశోర బాలికల సాధికారత-హింసా నిర్మూలన) గా జరుపుకోవాలని UNO పిలుపునిచ్చింది. బాలికలు, యువతుల సంరక్షణ, సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన, హక్కుల పరిరక్షణ వంటి అంశాలపట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకోసం అంతర్జాతీయ బాలికా సాధికారదినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది.

కౌమార దశలో ఆడపిల్లలు, యువతులు ఎదుర్కొనే వివిధ రకాల హింసను అంతం చేయాలని , హింసను ఎదుర్కోవడమే కాకుండా, లేకుండా చేయడానికి ఆడపిల్లలు తమ శక్తి సామర్ధ్యాలను గుర్తించాలి. సాధికారిత ప్రాముఖ్యాన్ని గుర్తించాలని అభిప్రాయపడింది . కిశోర బాలిక మహిళగా రూపొందే కీలక దశ కౌమార దశ. ఆమెను వర్తమానంలోనే కాదు భవిష్యత్తులోనూ సాధికరతా దిశలో నడిపించడానికి ఆమెకు అవగాహన అవసరం. ఆమెను చైతన్యం చేయడం అవసరం. అందుకే UNO కొన్ని కార్యక్రమాలు రూపొందించింది.

UNITE TO END VIOLENCE AGAINST WOMEN CAMPAIGN ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా బాలికల పట్ల వివక్ష, అసమానత, చిన్నచూపు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హింస, ఆధిపత్యం వివిధ రకాలగా హాని కలిగిస్తున్నాయి. ఈ ధోరణి సమాజాభివృద్దికి, మహిళా సాధికారతకి అది అవరోధం కలిగిస్తుంది. అందుకే బాల్యవివాహాలని నిరోధించి,హింస నుండి ఆమెను రక్షించడానికి కుటుంబం , మిత్రులు, సమాజం అంతా సన్నద్ధం కావాలి.

కిశోర బాలికలని స్వశక్తివంతులుగా తీర్చి దిద్దడానికి విద్య ప్రధానమైన ఆయుధం. బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమిస్తున్న పాకిస్తానీ బాలిక చొరవ , సాహసం, చైతన్యం ఆమెను నోబెల్ బహుమతి దక్కేలా చేశాయి. విద్యావంతుల కుటుంబంలో, సామాజిక చైతన్యం గల నేపథ్యం నుండి వచ్చిన మలాలా లే కాదు. కొద్ది పాటు చైతన్యం ఇస్తే సామాజికంగా వెనుకబడ్డ, నిరక్షరాస్యుల కుటుంబాల్లోంచి కూడా ఏంటో మంది మలాలాలు ఉద్భవిస్తారు. తమపై జరిగే హింసని , దాడులని తిప్పికోడతారు.

కిశోర బాలికలపై జరిగే హింసని అంతం చేయడానికి, ఆమెని స్వశక్తి వంతురాలిగా చేస్తూ సాదికారితవైపు పయనింప చేయాలంటే అది ఏ ఒక్కరో కాదు చేయాల్సింది. ప్రభుత్వం, పౌర సంస్థలు, ప్రజలు, ప్రభుత్వ-ప్రభుత్వేతర సంస్థలు ఏకం కావాలి. కలసి కట్టుగా ప్రణాళికా బద్దంగా నిబద్దతతో కృషి చేయాలి.

కిశోర బాలికలకి సాంకేతిక, వృత్తి విద్యా అవకాశాలు కల్పించాలి. శిక్షణ ఇవ్వాలి. తన జీవితాన్ని తాను తీర్చి నడిపించుకునేందుకు వృత్తి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, జీవన నైపుణ్యాలు, సామాజిక , ఆర్ధిక , ఆరోగ్యఅంశాలపై అవగాహన కల్పించాలి. శిక్షణలు ఇవ్వాలి.

నేటి ఆడపిల్లలకి తప్పని సరి అవసరమైన భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని సేవల్ని అందుబాటులో ఉంచాలి. సామాజిక, ఆర్ధిక , రాజకీయ పరిస్థితులపట్ల అవగాహన కలిగించాలి.

ఇలాంటి ప్రత్యేక దినోత్సవాల్లో ఏదో ఒక కాంపెయిన్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంటే తప్ప ఆడపిల్లపట్ల తరతరాలుగా నిండి ఉన్న భావనలు సమూలంగా పోవు.

.

చిన్న ప్రపంచం పై ఆధారపడే పెద్దప్రపంచం

Delhi visit photos 172మెరుపు మెరిస్తే .. వాన కురిస్తే.. హరివిల్లు విరిస్తే .. అతనికి ఎంత ఆనందం వస్తుందో తెలీదు కానీ .. టీ కెటిల్ వదిలి బడికి వెళ్తే మాత్రం పట్టలేంత ఆనందం .. కానీ అది అందుకోగలడా అతడు ?

అది సెప్టెంబర్ 13 వ తేది ఉదయం ఆరు – ఆరున్నర గంటల మధ్య సమయం.
భారతీయ సాహిత్యంలో స్త్రీ నిన్న, నేడు , రేపు కోసం దేశ రాజధానీ నగరం చేరిన మాకు లోడి రోడ్‌లోని ఆంధ్రా అసోసియేషన్ లో విడిది. క్రితం రోజు డిల్లీ నగర పర్యటనతో అంతా అలసిపోయి ఉన్నాం. ఉదయం నిద్రలేచేసరికి వచ్చాడా అబ్బాయి. నిద్ర లేవగానే ఓ గుక్క వేడి వేడి టీ నీళ్ళు గొంతులో పడందే ఏదీ తోచదు మాలో కొందరికి. ఆతిథ్యం ఇచ్చిన వారు టీ ఇచ్చేసరికి ఏ సమయం అవుతుందో తెలియదు మొదటి రోజు కదా.. ! బయటికి వెళ్లి తాగడానికి దగ్గరలో దొరుకుతుందో లేదో అనుకుంటూన్నసమయంలో చేతిలో కెటిల్, టీ కప్పులతో ప్రత్యక్షమయ్యాడు అతడు. మా వాళ్లకి ప్రాణం లేచి వచ్చినట్లయింది . ఏడెనిమిదేళ్ళు ఉంటాయేమో అతనికి. పేరు పవన్. అతనితో పాటే అతని మిత్రుడు. అదే వయసులో .

నెమ్మదిగా అతన్తో మాట కలిపాం. బడికి వెళుతున్నావా అంటూ .. ఓ దీర్ఘమైన చూపు విసిరి లేదన్నట్లుగా తల ఊపాడు. ఏం ఇష్టం లేదా .. ? అంటే ఉండన్నట్లుగా మౌనంగానే సమాధానం. టీ తీసుకోమ్మంటూ కప్పులో టీ కెటిల్ లోంచి వంపబోయాడు. వద్దన్నాను. నాకు టీ తాగే అలవాటు లేకపోవడం వల్ల. అతని టైం వృధా చేస్తున్నానేమో అనుకుంటూ పక్క గదుల్లో ఇచ్చి రమ్మన్నా. అక్కడంతా ఇచ్చే వచ్చా చక్కని హిందీలో అన్నాడు. బడికి ఎందుకు వెళ్ళడం లేదని మళ్ళీ అడిగా . ‘నేను బడికి వెళ్తే ఈ పని ఎవరు చేస్తారు. మాకు పూట ఎట్లా గడుస్తుంది’ ప్రశ్నార్ధకంగా నాకేసి ఆ చిన్న కళ్ళు చూస్తూ. మీ అమ్మ నాన్న.. అని నేను అడుగుతోంటే ‘నాన్న లేడు చనిపోయాడు. అమ్మ ఉంది పని చేయలేక పోతోంది. ముగ్గురు అక్కలు ఉన్నారు. వాళ్లకి మా నాన్న ఉన్నప్పుడే పెళ్లి అయిపొయింది. వాళ్ళు మా దగ్గరకు రారు. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. నేనే చూసుకోవాలిగా వాళ్ళని’ అంటున్న అతన్ని చూస్తే గుండె బాధతో మెలేసినట్లయింది. నేపాల్ జాతీయులట. చాలా ఏళ్ళ క్రితమే వారి కుటుంబం డిల్లీకి వచ్చేసిందట. కానీ ఇల్లు అంటూ వేరే లేదట. రాజధాని నగరంలో వీధీ వీధి నాదే నంటూ పుట్‌పాత్ పైనే జీవనం. అక్కడే డబ్బా రేకు అడ్డు పెట్టి టీ తయారు చేసి తల్లి ఇస్తే ఇతను అమ్ముతుంటాడట. ఎన్ని టీలు ఇచ్చింది. ఎవరు ఎంత ఇచ్చింది, ఇంకా ఎంత రావాలి లెక్క ఖచ్చితంగా చెప్తున్నాడు చాలా ఆశ్చర్యంగా. ఆ వయసులో బడికి వెళ్ళే పిల్లలకే సరిగ్గా రావు లెక్కలు. వేళ్ళు లెక్క పెట్టుకుంటూ చేస్తారు. కానీ పవన్ మాత్రం మనసులోనే లెక్కించుకుంటూ చకచకా చెప్పేస్తున్నాడు. తనకి చదువుకోవాలని ఉన్నా అది కుదరదని, తమ్ముళ్ళను బడికి పంపుతానని చెప్పాడు. పవన్ తో వచ్చిన అతని మిత్రుడు (పేరు గుర్తు లేదు) మాత్రం బడికి వెళ్తున్నాడట అప్పుడప్పుడు.
Delhi visit photos 174
అతి చిన్న వయసులో పవన్ బాధ్యతాయుత ప్రవర్తనని చూసి అభినందిస్తూనే అపురూపంగా ఆనందంగా సాగాల్సిన అందమైన బాల్యం మసకబారిపోతోందని బెంగపడింది నా మనసు. ఇంత పెద్ద ప్రపంచం ఇంత చిన్న పిల్లలపై ఆధార పడుతోందా ..? ! వాళ్ళ ప్రపంచంలో వాళ్ళని ఉండనివ్వకుండా వాళ్ళ ఆసక్తుల్ని, ఆకాంక్షల్ని పెద్ద ప్రపంచం లాగేసుకుంటోందా ..? ఆలోచిస్తూ ఫోటో తీసుకున్నాను. మొదట సిగ్గు పడిపోయాడు. తర్వాత తనూ ఫోటోకి ముందుకొచ్చాడు పవన్ మిత్రుడు . ఆ తర్వాత పది రూపాయలు ఇవ్వబోతే వద్దంటూ తీసుకోకుండా మిత్రుడితో వారి భాషలో ఏదో చెప్పుకుంటూ వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. అతని ఆత్మాభిమానం చూస్తే ముచ్చటేసింది. కానీ, పరిస్థితులు అతన్ని అలాగే ఉండనిస్తాయా ..? ??

మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 14 ఏళ్ళ లోపు బాలలందరికీ నిర్భంద ఉచిత విద్య ఇవ్వాలంటుంది. చట్ట ప్రకారం బాలలకు సమాన అవకాశాలు , సౌకర్యాలు కల్పిస్తూ ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందేలా వారికి స్వేచ్చ నివ్వాలి. అంతే కాకుండా గౌరవప్రదంగా జీవించే పరిస్తితుల్ని కల్పించాలి. దోపిడీ, అనైకతలకు గురికాకుండా కాపాడాలి. ఇంకా బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా 1986 బాలకార్మిక వ్యతిరేక చట్టాలు ఉన్నాయి.విద్యాహక్కు చట్టం ఉంది. కానీ జరుగుతున్నది ఏమిటి? మన చట్టాలని వెక్కిరిస్తూ, మన వైఫల్యాలని ఎత్తి చూపుతూ పసివాడని బాల్యం పుస్తకాల సంచుల బరువు బదులు కుటుంబ బరువు మోస్తూ… తమ హక్కులను కోల్పోతూ.. పనిచేసుకుంటూ కూడా చదువుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేయొచ్చు కదా .. ! అవును చేయచ్చుగా .. శ్రద్ధ, చిత్తశుద్ది ఉంటే సాధ్యం కాదా ..? సందేహం. అంతలోనే పదేళ్ళ క్రితం చూసిన “పచ్చసాలె ” గుర్తొచ్చింది. అది మెదక్ జిల్లా జహీరాబాద్ దగ్గరలో ఉంది(ఊరి పేరు గుర్తులేదు). దక్కన్ డెవలప్మెంట్ సొసైటి ఆధ్వర్యంలో నడుస్తుంది. అక్కడ పిల్లలు సగం రోజు పని సగం రోజు బడిలో గడపడం, మిగతా బడులకు భిన్నంగా ఉండే ఆ బడికి పోవడానికి పిల్లలు చూపే ఉత్సాహం గుర్తొచ్చాయి. ప్రస్తుతం బాలల కోసం మన దేశంలో రకరకాల పేర్లతో వివిధ పథకాలున్నాయి. అయినా పిల్లల బతుకుల్లో మార్పురాకపోవడానికి కారణం అమలులో చిత్తశుద్ధి లోకపోవడమే కదా. అందుకే పవన్ లాంటి ఎంతో మందికి పెన్నూ పుస్తకం పట్టడం కంటే ఆకలి తీర్చు కోవడమే ముఖ్యమైన సమస్యగా నేటికీ కొనసాగుతోంది.

ఇలాంటి పిల్లలంతా కలసి లక్షల్లో ఉంటారు మన దేశంలో. చదువుకు దూరం అయిన వీరు పెరిగి పెద్దయినా నైపుణ్యం లేని పనులతో సరిపెట్టుకోవలసి వస్తుంది. అంతే కాకుండా వీరి పరిస్తితుల్ని ఆసరాగా చేసుకుని వీరిని మభ్యపెట్టి అక్రమ మార్గాల్లోకి మళ్ళించే వారూ వీరిని వెన్నంటే ఉంటారన్ననిజం మరచిపోకూడదు .. ఆత్మాభిమానంతో ఎదుగుతున్న పవన్ లాంటి వాళ్ళని తమ పావులుగా మార్చుకునే అవకాశం లేకపోలేదు .. ఇలా ఏవేవో ఆలోచనలు. ఆ తర్వాత కొంతసేపటి వరకూ నన్ను వెంటాడుతూనే ..

అది ఆగ్రా.
agra1
15వ తేదీ సాయంత్రం 4 గంటల సమయం. ఉన్న తక్కువ సమయంలో అందాల తాజమహల్, ఆగ్రా కోట చూసి 8.30 కి వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. సమయంతో పోటిపడుతూ ముందుకు సాగవలసిన సమయమది. మా కాళ్ళ కడ్డు తగులుతూ పది అంతకు తక్కువ వయసున్న ఆడ, మగ పిల్లలు చేతిలో తాజమహల్ బొమ్మలు తీసుకోమంటూ… ఇరవై రూపాయలకే నని ఇంగ్లీషు, హిందీ భాషలలో పలుకరిస్తూ, పర్యాటకుల వెన్నంటే నడుస్తూ కొనమని పదే పదే అడుగుతూ .. ఓ అబ్బాయినడిగితే బడికి వెళ్లి వచ్చేశానన్నాడు. మరో అమ్మాయి బడికి వెళ్లి వచ్చానని చక్కని ఇంగ్లీషులో జవాబిచ్చింది. కానీ నాకు సందేహం నిజంగా వీరు చదువుకుంటున్నారా.. అని. ఏదేమైనా తమ వయసు పిల్లలు ఆటపాటల్లో ఆనందంగా గడుపుతోంటే వీరు మాత్రం బతుకు పోరులో జీవికకు మార్గాలెతుక్కుంటూ ..agra2

డిల్లీ నగర ప్రధాన వీధుల అందం, తాజ్ మహల్ సౌందర్యం మన మనసుల్ని దోచుకుంటాయేమో .. ఆ వెన్నంటే రెక్కలు తొడిగి నింగిన గాలిపటంలా ఎగరాల్సిన బాల్యపు రంగుల కలలు వెలవెల పోతుంటే జీవన సమరంలో పోరాడే చిట్టిపొట్టి చేతులు మానని గాయంలా హృదయాన్ని తొలుస్తుంటాయి. మారు మూల పల్లెల్లోనే కాదు మహారణ్యాల్లాంటి నగరాలల్లోనూ పేద పిల్లల స్థితి, అనాధల స్థితి ఇదే. దేశంలో ఎక్కడికెళ్ళినా ఎటు చూసినా పిల్లల స్థితిలో ఏమున్నది గర్వకారణం ..? ప్రతి చోటా ఇలాటి దృశ్యాలే సర్వ సాధారణం.

మురిపెంతో దాచుకోవాల్సిన బాల్యం బతుకు పోరాటంలో కాదు కదా నలిగిపోవాల్సింది. కలలు కనే ఆ కళ్ళు దేశానికి కాళ్ళు, కళ్ళు అయి నడిపించాలి కదా.. మన దేశానికి బంగారు భవితనివ్వాలి కదా … ఆ బాలల కళ్ళలో మెరుపు మెరిసి, హృదయం ఆనందంతో తడిసి, హరివిల్లు విరిసే రోజెప్పుడు వస్తుందో … ?! బాధ్యతల బరువు మోసే చిన్నారి ప్రపంచానికి తనదైన అద్భుత లోకాన్నిపెద్ద ప్రపంచం అందించే ప్రయత్నం ఎప్పుడు విజయవంతం అవుతుందో… ?! అనేక భావాలు మనసుని చుట్టుముట్టి గందరగోళ పరుస్తుంటే వెనుదిరిగా ..

వి. శాంతి ప్రబోధ

వంటిల్లు ఆవల …

అపూర్వం. అమోఘం. అవును అది నిజం. భర్త, పిల్లలు, వంటిల్లు అంటూ తన చుట్టూ అల్లిన గోడల మధ్యే ఉంటూ తన వారి కోసమే సమయం వెచ్చించే మహిళలు తమ కోసం, తాము మెచ్చే ప్రవృత్తి కోసం కొంత సమయం వెచ్చించడం అద్వితీయమైన సంఘటనే కదా ..! అది ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు ఆరు రోజులు. తమ రోజువారీ పనులన్నిటినీ పక్కన పెట్టేసి తమదైన లోకంలో విహరించడం అపుర్వమే కదా ..! !
Delhi visit photos 111
దేశ రాజధానీ నగరానికి వెళ్ళడం నాకిది మొదటిసారి కాదు. గతంలోనూ చాలా సార్లే వెళ్లాను. కానీ, అప్పటి నా పర్యటనలకి పూర్తిగా భిన్నమైనది ఈ సారి నేను వెళ్ళిన ట్రిప్. అప్పుడు వెళ్ళడానికి కారణం వృత్తి. అందులో భాగంగా తప్పని సరిగా వెళ్ళాల్సి రావడం. ఇప్పుడు వెళ్ళడానికి కారణం ప్రవృత్తి. ఎంతో ఇష్టపడి వెళ్ళడం. ఒక్కరం కాదు ఇద్దరం కాదు పాతిక మందిమి. అంతా మహిళలమే. ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి వెళ్ళింది ఓ సాహితీ సదస్సుకి. అందుకు దోహదం చేసిన డిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్, కేంద్ర సాహిత్య అకాడెమీ, డిల్లీ తెలుగు సాహితిలతో పాటు మా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ కమిటీ కార్యదర్శి కాత్యాయనీ విద్మహే, అధ్యక్షురాలు పుట్ల హేమలత, సమన్వయ కర్త కె. యన్. మల్లీశ్వరిలను, అదే విధంగా ఆంధ్రా అసోసియేషన్ తరపున కో ఆర్డినేట్ చేసిన దేవరకొండ సుబ్రహ్మణ్యం గార్లను అభినందించి తీరాల్సిందే. ఈ నడక వెనుక వారి నాలుగు నెలల కసరత్తు దాగి ఉంది కదా..
agra 2ఈ పర్యటన, నా మటుకు నాకయితే కాలేజీ రోజులని, అప్పుడు వెళ్ళిన ఎక్స్ కర్షన్స్గు ని ఎక్కడో గుండె గది మూలన ఒదిగిపోయిన ఎన్నో జ్ఞాపకాలను తడిమింది. అద్బుతమైన ఈ ప్రయాణంలో నా మిత్ర బృందాన్ని నేను మంచిర్యాలలో కలిశాను. మంచిర్యాలలో ట్రైన్ ఆగేటప్పటికి మిత్రురాలు అనిశెట్టి రజిత డోర్ దగ్గరే ఉండి నా లగేజి అందుకుంది. అందరూ హాయ్ అంటూ స్నేహ పూర్వక పలకరింపులు. ఆ తర్వాతి ప్రయాణమంతా ఏమాత్రం బడలిక లేకుండా సాహితీ చర్చలు, అంత్యాక్షరి ఆటలు, కబుర్లు, కవిని రాసిన పాటకి ట్యూన్ కట్టడం ఒకటేమిటి ఎన్నెన్నోకలబోసుకుంటూ… వాటితో పాటే మధ్య మధ్యలో ఏవో ఒకటి బోజ్జలోకి పంపిస్తూ .. భోజనానికి ఇబ్బంది లేకుండా ముందే ప్యాక్ చేయించి తెచ్చారు కదా .. మా బోగిలో కొందరు మా అల్లరిని ఎంజాయ్ చేస్తే కొందరు ఏమనలేక మనసులో విసుక్కుని వుంటారు!

Delhi visit photos 265 12వ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో నిజాముద్దీన్ స్టేషన్ లో దిగేసరికి దేవరకొండ సుబ్రహ్మణ్యం గారూ, దాసరి అమరేంద్ర గారు మాకు ఆహ్వానం పలుకుతూ.. అదే రోజు డిల్లీ నగర పర్యటన. 13, 14 తేదీలు వీకెండ్. డిల్లీ తెలుగు సాహితీ పిపాసులు ఆంధ్రా అసోసియేషన్ లో జరిగే మా సదస్సుకు తరలిరావడం మాకు చాలా ఆనందం కలిగింది. సదస్సులో ప్రాచీన సాహిత్యం నుండి నేటివరకూ ఉన్న వివిధ సాహితీ ప్రక్రియల పై లోతైన పరిశీలనతో వచ్చిన పత్రాలతో పాటు రేపు రావాల్సిన సాహిత్యం గురించి మాట్లాడుకోవడం అంతా చాలా చక్కగా ఒక పద్దతి ప్రకారం జరిగిపోయింది.Delhi visit photos 211
వందమంది పైగా యువత ఒకే గొంతుకగా చేసిన వీధి నాటిక మా హృదయాలని కదలించివేసింది. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నటించలేదు జీవించారు. అది ఒక హైలైట్. ప్రధానంగా వారు తీసుకున్న అంశం దేశాన్నిఅతలాకుతలం చేస్తున్నసమస్య మహిళల భద్రత. తీసుకున్న అంశంతో పాటు వారి ప్రదర్శన ఆద్యంతం ఎంతో గొప్పగా చక్కని సమన్వయంతో సాగింది. ప్రదర్శన అందించిన అస్మిత థియేటర్ గ్రూప్ ప్రజలలో అవగాహన కల్పించడం కోసం దేశంలోఏ ప్రాంతానికైనా వచ్చి తమ సేవలందిస్తామనడం విశేషం.Delhi visit photos 195

ఇక్కడో విషయం గమనించాం. అదేంటంటే, సాయంత్రం ఏడింటికే డిల్లీ విధుల్లో మహిళలు కనిపించడం తగ్గిపోయింది. అంటే.., మహిళలు ఎంత అభద్రతతో జీవిస్తున్నారో కదా ..! ఆ వీధులు, ఆ పరిస్తితులు వారిని ప్రమాదపుటంచున పయనింప చేస్తూ ఎంత భయ భ్రాంతుల్ని చేస్తున్నాయో కదా..! మన హైదరాబాదే చాలా బెటరు కదా .. అంతదాకా ఎందుకు మా పల్లెటూర్లో అర్ధరాత్రి ఏ సమయంలో నైనా బస్సు దిగి ఒంటరిగా ఇంటికి వెళ్లిపోగలను. కానీ, డిల్లీ మహానగరం అలా కాదే.. మహా నగరం కాదు.. మహారణ్యంలో మృగాల సంచారం ఇంత ఎక్కువా .. పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అన్న ఆశ్చర్యం. ప్రధాన వీధుల లోనే ఇలా ఉంటే ఇక గల్లీల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో …?! ఏది మనకు స్వాతంత్ర్యం ..? గాంధీజీ చెప్పిన స్వాతంత్ర్యం అర్ధరాత్రి ఆడపిల్ల వీదుల్లో తిరగ గలిగినప్పుడే కదా .. ! ఎలా ..? ఎన్నాళ్ళు ? ఎన్నేళ్ళు ? ఈ స్థితి ..? కొంతమంది మహిళలు ఉన్నత స్థాయిలో ఉన్నారని అదే ప్రగతిగా, మహిళాభివ్రుద్దిగా చంకలు బాదుకుంటే పప్పులో కాలేసినట్లే .. ఎందుకంటే వారెంత మంది..? అసంఖ్యాకమైన మహిళాలోకం ఇప్పటికీ అట్టడుగునే.. దుర్భర జీవితంలోనే .. మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి, బలమైన రాజకీయ శక్తిగా ప్రజాస్వామ్య భావాలుగల్గిన మహిళల సంఖ్యాబలం పెరిగినరోజు వీరిపై దాడులుకు, అఘాయిత్యాలకు, వేధింపులకు మృగాలు సాహసించక పోవచ్చు. మృగాల్లకు దూరంగా పారిపోవడం కాదు వారిని ఎదుర్కొనే చైతన్యం తెచ్చుకోవాలి. ఆచైతన్యమే సమసమాజానికి బాట వస్తుంది కదా .. మహిళ స్థాయిని బట్టే ఆ సమాజం ఎంత ఆరోగ్యంగా ఉందో అంచనా వేయొచ్చు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం కలం బలంతో ముందుకు ఎలా సాగాలని మనసు సంఘర్షిస్తున్న తరుణంలో అస్మిత థియేటర్ గ్రూప్ వారు వేసిన వీధి నాటిక ఆశలు చిగురింప చేస్తూ .. బాధ్యత గల యువత భవిష్యత్ కు భరోసా ఇస్తూ .. అత్యంత ముఖ్యమైన అంశంపై అత్యంత శక్తివంతమైన వీధినాటికని ఒక ఉపకరణంగా చేసుకొని ఉద్యమిస్తూ దేశంలో ఏ మారుమూల ప్రాంతానికైనా ప్రజలలో అవగాహన కల్గించడానికి మేం సిద్దం అని ప్రకటించిన ఆ యువత కర్త్యవ్య దీక్షని మనసులోనే అభినందించా.

at akshardham మా తిరుగు ప్రయాణమూ అంతే.. అప్పుడే దిగవలసిన సమయం వచ్చేసిందా .. అనిపించింది. ఆరు రోజులు ఆరు క్షణాల్లా దొర్లిపోయాయి. మేం, అంటే ఆంధ్ర , తెలంగాణా కమిటీల బాధ్యులం దాదాపుగా అంతా అక్కడే ఉన్నాం కాబట్టి రైలు చక్రాలతో పాటు మా సమావేశాలు ముందుకు సాగాయి. 16వ తేది రైలు లోనే తెలంగాణా, ఆంద్ర శాఖల సమావేశాలు ప్రత్యేకంగా జరిగితే , ఆ తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. సరికొత్త ఆలోచనలతో భవిష్యత్ ప్రణాళికలు రచించుకుంటూ, ఆరు రోజుల ఆనందాలను, అనుభవాలను, అనుభూతులను నెమరువేసుకుంటూ రోజువారీ కార్యక్రమాల్లో వోదిగిపోయా.

వి. శాంతి ప్రబోధ
అధ్యక్షులు, ప్రరవే తెలంగాణా శాఖ

Oct 2014 విహంగలో

మలిపొద్దు వెలుగులో ..

ఈరోజు కాకపొతే రేపు వచ్చేస్తావు
సడి చప్పుడు లేకుండా
నా ముఖంలో అద్దిన నగిషీలు లాగేయడానికి
నా ఉరకలేసే ఉత్సాహం ఎగరేసుకు పోడానికి
అందరికీ ఆలంబనగా ఉండే నన్ను
కూరలో కరివేపాకులా ఏరి పారేయడానికి
ఒడ్డునపడ్డ చేపల్లా గిలగిలలాడే నాకు
శారీరక, మానసిక సవాళ్లదరిచేర్చచేయడానికి
నీ నుండి విముక్తం కాలేమా ..?
మరణం లేని మనిషి సృష్టి చేయలేమా ..?!
తెగినతోకను బల్లి సృష్టించు కుంటుంది కదా ..
జెల్లీ ఫిష్ లాగా తిరిగి యవ్వనంలోకి వెళ్లి పొతే..?
ఆలోచన బాగానే ఉంది కానీ , మానవ
సహజ పరిణామం వృద్దాప్యం, మరణం కదా .. !
మరి నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నా ..
మలివయసులో మొరాయించే మెదడుకి పదును పెట్టలేనా ?
తరలిపోతున్న వయస్సునీ ఆనందంగా మలచుకుంటూ
తొంగిచూస్తున్న దిగులుని మనోబలంతో తరమలేనా ..?
వయసుతో వచ్చే మార్పుల్నిహుందాగా ఆహ్వానిస్తూ
ఆహ్లాద పూరిత వాతావరణం సృస్టించుకోలేనా ..?
పండిన జీవితపు అనుభవాల సారంతో
అమ్ముల పొదిలో వేసుకుంటా కొత్త విషయ పరిజ్ఞానం
నిండిన మానసిక శక్తి మనసులో
నన్ను నేను ముందుకు నడిపించుకుంటా ..
చోటియ్యను నిస్తేజం , నిరాశలకు
రానీయను మనసులో ఒంటరితనపు కలవరం
ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటూ
జీవితంలోని కడ దశకూ అర్ధం కల్పించుకుంటా …
వి . శాంతి ప్రబోధ
1. 10. 2014
(అక్టోబర్ ఒకటవ తేది అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం సందర్భంగా వారి కోసం)

Tag Cloud

%d bloggers like this: