The greatest WordPress.com site in all the land!

Archive for the ‘vyakhya’ Category

స్క్రీన్ ప్లే 

నేను సాధారణంగా సినిమా చూడడానికి ఆసక్తి చూపను.  అటువంటిది, మిత్రురాలు శ్రీలక్ష్మి ఆహ్వానంతో 22న ఒక సినిమా ప్రీ వ్యూకి వెళ్ళాను.  ఆ సినిమా పేరు స్క్రీన్ ప్లే .  మామూలుకి భిన్నంగా ఉన్న దాని గురించి మీతో పంచుకుందామని ఇలా..
ఆశ్చర్యం ఏమంటే, సగం సినిమా అయి విరామం ఇస్తుండగా ఆలా కనిపించి ఇలా మాయమయిన మొహాన్ని చూసేవరకూ గమనించనంతగా సినిమాలో లీనమైపోయాను. రెండే రెండు పాత్రలతో ఇంతసేపు గడచిపోయిందా అనుకున్నాను .
సెకండ్ హాఫ్ నుంచి మూడో పాత్ర కనిపిస్తుంది. అంతే, సినిమా అంతా మూడంటే మూడు పాత్రలతో నడుస్తుంది . ఎక్కడా బోర్ కొట్టకుండా  ప్రేక్షకులను రెండుగంటలు ఉత్కంఠతో కూర్చోబెట్టగలిగిందంటే అర్ధం చేసుకోండి..  .
చావైనా  బతుకైనా నీతోనే ప్రియతమా మనసంతా తనువంతా నీవేలే నేస్తమా సమరానికి శ్వాసనే ప్రాణమై వెలుగునై నువ్వే నేనుగా నేనే నీవుగా బతుకంతా నీతోనే సాగనా..
పాటతో మొదలైన సినిమా వీక్షకులను నెమ్మదిగా తన వైపు తిప్పుకుంటుంది. MM శ్రీలేఖ సంగీత సారధ్యంలో వచ్చిన ఒకే ఒక్క పాట ఉందా సినిమాలో .  మెలోడియస్ గా సాగే ఆ పాట నాకయితే చాలా నచ్చింది .  ఆ పాట వస్తున్నంత సేపూ ఆనిమేటెడ్ పాత్రల బొమ్మలు కనిపిస్తాయి .  సినిమా అంతా అట్లాగే ఉంటుందేమో అనుకునేంతలో భార్యాభర్తలు తగవుపడే దృశ్యం షేడెడ్ గా కనిపిస్తుంది .  నలుపు తెలుపుగా కనిపించే షేడ్స్ లో ఆ పాత్రల ఎక్స్ప్రెషన్స్ స్పష్టంగా అర్ధమవుతుంటాయి. ఆ తర్వాత షేడ్స్ పోయి పాత్రలు మనముందుకు వస్తాయి.  సినిమాలో లీనమైన మనకు ఆ పాత్రలు చాలా సహజంగా కనిపిస్తాయి. ఒక్కోసారి భయపెట్టిస్తాయి. కోపం తెప్పిస్తాయి.  బాధ కలిగిస్తాయి.  నవ్విస్తాయి .
A సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రంలో కొన్ని దృశ్యాలు కొంచెం అతిగానే  అనిపించినప్పటికీ జుగుప్స కలిగించేవిగా మాత్రం లేవు .

ఆడవాళ్ళ కొచ్చే సమస్యలను అర్ధం చేసుకోగలిగే మనసు, సున్నితత్వం  మగవాళ్లకు ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్క్రీన్ ప్లే ద్వారా  చెప్పినట్లుగా నాకనిపించింది .
ప్రధాన పాత్రలైన రాధిక, గౌతమ్ లుగా నటించిన ఇద్దరూ కొత్త నటులు.  మొదటిసారిగా తెరకు పరిచయం అయినవారు.  కానీ వాళ్ళ నటన అట్లా అనిపించలేదు. చాలా అనుభవం ఉన్న వాళ్ళ లాగ ఉంది వాళ్ళ నటన. రాధికగా ప్రగతి యధాటి , గౌతమ్ గా విక్రమ్ శివ నటించారు . మూడో పాత్ర భూపతిగా కె.ఎల్. ప్రసాద్  నటించారు. ప్రసాద్ గారు తెలుగు యూనివర్సిటీ ఉపన్యాసకులు.  ఈ చిత్ర రచయిత, దర్శకులు కె ఎల్ ప్రసాద్.

మాములుగా సినిమాకి ముందు స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఆ స్క్రిప్ట్ ప్రకారం డైలాగ్స్ చెప్తారు. కానీ ఇక్కడ అలా కాదట. Mumble code screenplay విధానంలో జరిగిందట.  అదేంటో నాకు అర్ధం కాలేదు. కానీ ఫోటోగ్రఫీ , సంగీతం చాలా బాగున్నాయి. రొటీన్ సినిమాలకు చాలా భిన్నంగా ఉన్న సినిమా ఇది.
ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగే అసలు కథ తెలుసుకోవాలంటే సినిమా చూడండి  మార్చి 6వ తేదీ రిలీజ్ అవుతుంది.

కొత్తలోకం చూపిన బ్లాక్ మార్కెట్స్ 

డిసెంబర్ 4వ తేదీ .

నేను బ్లాక్ మార్కెట్స్ కు  వెళ్లినరోజు .

బ్లాక్ మార్కెట్ అంటే నల్ల ధనపు లేదా దొంగడబ్బు మార్కెట్లు అనుకునేరు  .
నల్లవారి మార్కెట్లు .  అయితే  అక్కడ అంతా నల్లవారే కనబడరు .  నల్లవారు అంటారు కానీ వారంతా నలుపు రంగులో ఉండరు . వారి పూర్వికులది నలుపు రంగే కావచ్చు . కానీ ఇప్పుడన్ని రంగుల్లోనూ కనిపిస్తారు . ఎప్పుడైతే వారి  అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడడం మొదలయిందో అప్పటి నుండి వారి రంగూ రూపు  మారడం మొదలయింది .  బ్లాక్ మార్కెట్స్ లోకి వెళ్లేముందు వాళ్ళ చరిత్ర ఏంటో విహంగ వీక్షణం చేద్దాం .

ఒకప్పుడు ఆ భూభాగమంతా వారిదే.  ఏ సమూహానికి ఆ సమూహం వారి పరిసరాలు , భౌగోళికంగా ఉన్న పరిస్థితులు  అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా వారి సంస్కృతి ఆచార వ్యవహారాలు రూపొందించుకున్నారు .  ఆదిమ మానవుడు పుట్టిన దక్షిణాఫ్రికా నుండి  అన్వేషణలో ఆసియా దేశాల మీదుగా 60 మైళ్ళు ప్రయాణించి ఇప్పటి వెస్ట్రన్ ఆస్ట్రేలియా భుభాగం చేరారట . అలా వచ్చిన వీరు  ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని రక్షిస్తూ ప్రకృతితో మమేకమై సహజీవనం చేశారు.
కానీ ఇప్పుడు ఆ భూభాగమంతా వారిది కాదు . వారి జనాభా 3% పడిపోయింది . 50 నుండి  65 వేల (ఆంత్రోపాలజిస్టులు కొందరు 50 వేలని , కొందరు 65 వేల ఏళ్ళని రకరకాలుగా చెప్తున్నారు . ఏదేమైనా 50 వేల ఏళ్ళక్రితమే మానవుడు నిరంతర అన్వేషి అని తెలుపుతూ  మానవుల పుట్టినిల్లయిన ఆఫ్రికా ఖండం నుండి ఖండాంతరాలలోకి మొదట వలసలు ప్రారంభం చేసి  ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి బాటలువేసింది వీరే.
న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని పెన్ రిత్ సమీపంలో 1971 ముందు మట్టిదిబ్బలలో లభ్యమైన   రాతి పనిముట్లు  50 వేల ఏళ్ల  క్రితం ఉన్న మూలవాసులవిగా గుర్తించారు .
 ఆస్ట్రేలియాలోని మూలవాసుల బంధువులే మొట్టమొదటి వాస్తవమైన మానవ అన్వేషులు . మన పూర్వీకులు ప్రపంచమంటే భయపడుతూ ఉన్న సమయంలోనే వీరు అసాధారణంగా సముద్రమార్గంలో ఆసియా వరకు ప్రయాణించారు ” విల్లెర్స్ లేవ్ , కోపెన్ హెగెన్ యూనివర్సిటీ , డెన్మార్క్ కు చెందిన పరిశోధకుని అభిప్రాయం
ఆస్ట్రేలియా , పపువా న్యూ గినియా దీవుల్లో  ల్లో నివసిస్తున్న జనాభా డిఎన్ఏ పరీక్షచేసిన తర్వాత ప్రాచీన మానవుని జీవన యానాన్ని పసిగట్టారు . వారే సముద్రాన్ని దాటిన మొదటి మానవులని విశ్లేషించారు .
వారెవరో కాదు అబోరిజినల్స్ .. అంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ . ఒకప్పుడు 270 నేటివ్ ఆస్ట్రేలియన్ భాషలతో విలసిల్లిన నేలపై ఇప్పుడు 145 మాత్రమే ఉంటే, అందులో 18 భాషలు మాత్రమే వాడకంలో ఉన్నాయి . అంటే కుటుంబంలో అందరూ మాట్లాడేవి . మిగతా భాషలు కొద్దిమంది  ముసలీ ముతకా తప్ప మిగతా కుటుంబ సభ్యులు మాట్లాడరు.  50 వేల ఏళ్ళకి తక్కువ కాని ఘనచరిత్ర కలిగిన మూలవాసుల సంస్కృతి ఆచారవ్యవహారాలు, భాషలు , జ్ఞానసంపద , వనరులు ,వారి జీవనం అన్నీ ఆపదలో ఉన్నాయి . ఆ విషయాన్ని గమనించి తమ తాతముత్తాతలు తిరుగాడిన తావుల్ని , నింగిని , నేలని మాత్రమే కాదు వారి అందించిన అపారజ్ఞానాన్ని, కళలని , నైపుణ్యాలని పదిలపరుచుకోవాలని నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు భావిస్తున్నారు.  అందుకు తగిన కృషి చేస్తున్నారు .
నేను అబోరిజన్స్ ని కలవాలనుకోవడానికి కారణం ఏమిటంటే .. 
అబోరిజినల్స్ ని కలవాలని నేను సిడ్నీ వచ్చిన దగ్గర నుండి అనుకుంటూనే ఉన్నాను .  కారణం , బ్లాక్ టౌన్ హాస్పిటల్ ఉద్యోగాల్లో మిగతా ఆస్ట్రేలియన్స్  లాగే అబోరిజినల్స్ ని కూడా సమానంగా చూస్తామని ప్రత్యేకంగా తెలుపుతూ రాసిన దాన్ని చదివాను .   అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.   అదే  అడిగాను.  మా వాళ్లేమో ,  ఆమ్మో అబోరిజినల్స్ చాలా అగ్రెసివ్ అట అన్నారు.  కొందరు ఆస్ట్రేలియన్లని అడిగితే వాళ్ళు మూలవాసుల గురించి మాట్లాడ్డానికే ఇష్టపడలేదు .   వాళ్ళని హాస్పిటల్ లో , షాపింగ్ మాల్స్ లో, మార్కెట్ ప్రదేశాల్లో , స్టేషన్స్ ఎక్కడబడితే అక్కడ  చాలా చోట్ల చూశాను . వాళ్ళు ఖచ్చితంగా అబోరిజినల్స్ అని చెప్పలేను . మాట్లాడి తెలుసుకునే  అవకాశం లేదు .  మాట్లాడినా మాములు విషయాలు మాట్లాడగలం కానీ వారి పూర్వీకుల గురించి గానీ , మీరు అబోరిజనల్సా అని గానీ సూటిగా  అడగలేం కదా .. అసలు అలా అడగకూడదు కూడాను.  అడిగితే ఇక్కడ చాలా పెద్దతప్పు .  వివక్ష చూపిస్తున్నారని , లేదా వాళ్ళని వేలెత్తి చూపుతున్నారనో మీద కేసు పెట్టినా పెడతారు అన్నారు మావాళ్ళు.    మనదేశంలో లాగా ఇక్కడ అట్రాసిటీస్ ఆక్ట్ ఉందేమో అనుకున్నా .  మనం అడిగేది అర్ధం చేసుకోలేక పోయినా, మనం సరిగ్గా అడగలేక పోయినా ఇబ్బందే అని గమ్మున ఉన్నా.   వారిని మాత్రం పలకరించలేదు కానీ రోజు రోజుకీ వారిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి , తపన పెరిగిపోయింది .
చివరికి  కలవడం కోసం బ్లూ మౌంటెన్స్ దగ్గర ఉన్న అబోరిజినల్ హెరిటేజ్ టూర్ కి వెళ్లిరావాలని అనుకున్నాం .  కానీ అంతలో బ్లాక్ మార్కెట్ గురించి తెలిసింది .  డిసెంబర్ 4 బ్లాక్ మార్కెట్ డే (నల్ల వాళ్ళ లేదా అబోరిజినల్ ).  ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ మార్కెట్ అంటే మన అంగడి లేదా సంత లాంటిది నిర్వహిస్తారు. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో జరుగుతుంది .  ఆయా తెగల ప్రజలు అంతా కలసి ఓ చోట చేరి తమ నైపుణ్యాలని , కళల్ని , జ్ఞానాన్ని , సంస్కృతిని, ఆహారాన్ని , వైవిధ్యభరితమైన జీవితాన్ని  మనకు పరిచయం చేస్తారు . ( మనకు నచ్చిన వాటిని మనం కొనుక్కోవచ్చు ).  విషయం తెలవగానే వాళ్ళని కలవడానికి ఇంతకంటే మంచి అవకాశం నా ఈ పర్యటనలో రాదనుకున్నా .  ఆ రోజు ఎన్నిపనులున్నా వెళ్లాలని నిశ్చయం జరిగిపోయింది .
 2013 నుండి బ్లాక్ మార్కెట్స్ ని నిర్వహిస్తోంది ఫస్ట్ హ్యాండ్ సొల్యూషన్స్ అబోరిజల్స్ కార్పొరేషన్ .  ఆపదలో లేదా రిస్క్ లో ఉన్న యువతని ఆదుకోవడం కోసం ఈ ఫండ్ ఉపయోగిస్తారట .  బోటనీ బే తీరంలోని లే పెరౌస్ లో ఈ సంస్థ కార్యాలయం , మ్యూజియం ఉన్నాయి . దీన్ని అబోరిజినల్స్ బిజినెస్ సెంటర్ అనొచ్చు .  ఇక్కడనుండి బేర్ ఐలాండ్ కి టూర్లు నిర్వహిస్తుంటారు .  అబోరిజినల్ రోల్ మోడల్స్ ని యువతకి పరిచయం చేస్తారు . యువతలో లీడర్ షిప్ పెంచడం , పబ్లిక్ తో మాట్లాడడం వంటి జీవన నైపుణ్యాలు అందిస్తున్నారు.   వాటితోపాటే బ్లాక్ మార్కెట్స్ నిర్వహణ .  మొదట్లో ప్రతినెలా నిర్వహించినప్పటికీ 2015 నుండి ప్రతి మూడునెలలకొకసారి నిర్వహిస్తున్నారు .   ఆయా స్టాల్స్ లో తాయారు చేసిన వస్తువులుకొని అబోరిజినల్ యువతను ప్రోత్సహించమని చెప్తుంది ఆ సంస్థ .
“మా పూర్వీకుల వారసత్వ జ్ఞానం విపత్కర పరిస్థితుల్లో కొట్టుకిట్టాడుతోంది . వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాదే “  అంటాడు ఫస్ట్ హ్యాండ్ సోలుషన్స్ డైరెక్టర్ పీటర్ కూలీ .
ఆధునిక ఆస్ట్రేలియా పుట్టింది లే పెరౌస్ లోనే .  అంటే ఆస్ట్రేలియాని కనుగొన్న  కెప్టెన్ కుక్ 1770లో మొదట అడుగుపెట్టింది ఈనేలపైనే.  ఆ తర్వాతే బ్రిటిష్ వారి కాలనీలు 1788లో వెలిశాయి =. స్థానికులైన ఆస్ట్రేలియన్ల భూముల్ని , వనరుల్ని దురాక్రమించడంతో పాటు వేల ఏళ్ల సంవత్సరాలుగా నివసిస్తున్న వారి జీవనాన్ని , తరతరాలుగా పొందిన జ్ఞానాన్ని, రూపొందిచుకున్న సంస్కృతిని , భాషల్ని, చరిత్రని సర్వనాశనంచేశారు  జాత్యాహంకారులు . తమ నేలపై తాము పరాయివారుగా తిరుగాడుతూ వివక్షతో బతుకీడ్చడం కాదు.  కోల్పోతున్న తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం తమ పూర్వీకులు కొందరు జాత్యహంకారులపై పోరాడారు .  వారి స్పూర్తితో హక్కుల్ని,  సంస్కృతిని పునరుజ్జివింపచేసుకుంటూ తమ వారసత్వసంపదని కాపాడుకుంటూ ఏకీకృతం అవుతున్నారు నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు . అందులో భాగంగా ఏర్పడిందే బ్లాక్ మార్కెట్ ..
పదండి అలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్లి చూసోద్దాం 
మేముండే బ్లాక్ టౌన్ నుండి బారంగారో రిజర్వ్ లో ఉన్న బ్లాక్ మార్కెట్స్కి కారులో వెళ్లడం కంటే ట్రైన్ లో వెళ్లడం మంచిది అనుకున్నాం .( కారులో వెళ్తే పార్కింగ్ వెతుక్కోవాలని ) .  బస్సు , ఫెర్రీ సౌకర్యం కూడా ఉంది .  ఏది ఎక్కినా opeal కార్డు స్వైప్ చేయడమే .  ప్రయాణ సదుపాయం చాలా బాగుంది .   బారంగారో రిజర్వ్ టౌన్ హాల్ కి , సిడ్నీ హార్బరుకి దగ్గరలో ఉంది . వెతుక్కునే పనిలేకుండా సులభంగానే వెళ్లిపోయాం.
ఉదయం 9. 30 కే బ్లాక్ మార్కెట్స్ లో దుకాణాలు తెరిచారు .  హిక్సన్ రోడ్డులోని  బారంగారో రిజర్వు లోని బ్లాక్  మార్కెట్స్  చాలా సందడిగా కనిపిస్తున్నాయి .  చుట్టూ స్టాల్స్ 30 పైగా ఉన్నాయి  మధ్యలో ఉన్న ఖాళీలో  ఇసుకపోసి ఉంది .  అందులో సాంప్రదాయ నృత్యాలు సాగుతున్నాయి . చుట్టూ జనం గుమి గూడి చూస్తున్నారు .  Ngaran Ngaran డాన్స్ ట్రూప్ వారి ఆధ్వర్యంలో ఆ నృత్య ప్రదర్శన జరిగుతోంది.  మైకులోంచి ఆ నృత్య రీతిని వివరిస్తున్నారు .  వారి డాన్సు చూస్తుంటే నాకు ఆదిలాబాద్ గిరిజనులు చేసిన గుస్సాడీ , చత్తిస్గఢ్ గిరిజనుల మోరియా నృత్యాలు గుర్తొచ్చాయి .  ఆహార్యం ఒకేలా లేకపోవచ్చు గానీ కాళ్ళు చేతుల కదలికలు ఒకేలా అనిపించాయి .  వీవర్స్ చేసే నృత్యం , ఫిషింగ్ కమ్యూనిటీ చేసే నృత్యం , వేటాడేవారి నృత్యం ఇలా వారు చేసే పనులను బట్టి వారి నృత్యాలు ఉన్నాయి . ఆ ట్రూపులో ఉన్న చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు . ఆ విషయమే అడిగినప్పుడు-  ఆదిమ కాలంనాటి వారి నృత్యం కనుమరుగై పోతున్న నేపథ్యంలో అది కాపాడుకోవడానికి వారసత్వ సంపదగా ముందు తరాలకు అందించడం కోసం ఇప్పటి తరానికి తమ పూర్వీకుల సనాతన నృత్యాన్ని నేర్పుతున్నామని చెప్పాడు ఆ ట్రూప్ లీడర్ మాక్స్ హారిసన్ .  నాకు వాళ్ళ నృత్య రీతులు చూశాక కలిగిన భావాన్ని వారితో పంచుకున్నప్పుడు ‘ఇండియాకు మాకు కొన్ని పోలికలు ఉంటాయట’ అన్నాడు ట్రే పార్సన్ అనే మరో కళాకారుడు .
ఏ స్టాల్ నుండి చూడ్డం మొదలు పెడదామా అనుకుంటూ  మొదటి స్టాల్ దగ్గరకి వెళ్ళాం .  అక్కడ ఆదిమ జాతుల గురించి సమాచారం చాలా ఉంది . దాంతో ఆసక్తి ఉన్నవారు అబోరిజినల్ కల్చరల్ టూర్ చూసే ఏర్పాటు ఉందని చెప్పారు .  వెంటనే మేమూ మా పేర్లు రిజిస్టర్ చేసుకున్నాం . 11 గంటలకు ఆ టూర్ మొదలయింది .  బారంగారో రిజర్వ్ లో దాదాపు గంటసేపు సాగింది మా టూర్ . ఆదిమకాలంనాటి వీవర్స్ కమ్యూనిటీ కి చెందిన జెస్సికా మాకు గైడ్ గా వచ్చింది . ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ లో పనిచేస్తోంది (సెలవుల్లో తమ జాతి ఉన్నతి కోసం సేవలు అందిస్తూ ఉంటుందట. మరో సందర్భంలో అడిగిన ఓప్రశ్నకు జవాబుగా చెప్పింది ).  ఆవిడతో కలసి మాతో పాటు జపాన్ , చైనా , ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశస్తులతో పాటు కొంతమంది యూరోపియన్ దేశాల వారు కూడా వచ్చారు .
బారంగారో కొండ అంచున నడుస్తూ , ఆగుతూ ఆమె చెప్పిన విషయాలు ఇవే . 1788లో 1100 మంది నేరస్థులు , మరో రొండొందలమంది సిబ్బందితో మొదటి యూరోపియన్ కాలనీ వెలిసిన సమయంలో క్యాంమెరగల్ , కడిగళ్  జాతి బారంగారో లో ఉండేది . ఆ సమయంలో దాదాపు 1500 జనాభా  బోటనీ బే నుండి బ్రోకెన్ బే వరకూ ఉన్న సిడ్నీ తీరప్రాంతంలో చిన్న చిన్న సమూహాలుగా  నివసించేవారని గవర్నర్ ఆర్థర్ ఫిలిప్ అంచనా . పారామట్టా నదిలోనో , సముద్రంలో చెట్టు బెరడుతో చేసిన తెప్పలపై తిరిగి చేపలు పట్టడం , వేటాడడం , వండుకోవడం , తినడం ఇదీ వారి దినచర్య.
యూరోపియన్ సెటిల్మెంట్ తర్వాత కూడా కొంతకాలం అబోరిజినల్స్ కి , వలసవచ్చిన తెల్లవాళ్లకి డార్లింగ్ హార్బర్ సమీపంలో సముద్రపు కాకల్స్ అనే గవ్వలు  , ఆయిస్టర్ లు ప్రధాన వనరుగా ఉండేవి . బ్రిటిష్ కాలనీలతో పాటే వచ్చిన మశూచి చాలామంది మూలవాసుల్ని మింగేసింది . దాంతో వారు తమ నివాసాల్ని శ్వేతజాతీయులకి దూరంగా ఏర్పాటు చేసుకున్నారు .  కాలనీలు పెరిగాయి . 1900 నాటికి సిడ్నీ హార్బర్ నుండి ప్రధాన వ్యాపార కేంద్రంగా మారింది . న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇరవయ్యో శతాబ్దం నుండి ఇరవయ్యో శతాబ్దంలోకి మాత్రమే కాదు ప్రపంచంలోని  అత్యాధునిక నగరాల్లో ఒకటిగా  ఈ ప్రాంతపు రూపురేఖలు మారిపోయాయి .  అభివృద్ధిని మేం కాదనడంలేదు . కానీ మా అస్తిత్వాల్ని, మా వారసత్వ సాంస్కృతిక సంపదను మేం కోల్పోవడానికి సిద్ధంగా లేం. ఇప్పటికే మాకు తీరని నష్టం జరిగింది అని స్పష్టం చేసింది జెస్సికా  ఓ ప్రశ్నకు సమాధానంగా .
బ్రిటిష్ కాలనీలు వెలసిన కొత్తలో “బారంగారో” అనే  చేపలు పట్టే ఓ శక్తివంతమైన మూలవాసీ మహిళ ఉండేది.  ఆమె  తెల్ల జాతీయుడైన అధికారికి ఒకే రోజు  200 వందల చేపలు ఇచ్చిందట. అందుకే అతను ఆ ప్రాంతానికి ఆమె పేరుపెట్టాడట.  మూలజాతుల వారు పెట్టుకున్న పేర్ల స్థానంలో ఇంగ్లీషు వారి ఊరి పేర్లు , పట్టణాల పేర్లు కనిపిస్తాయి .  సిడ్నీ మహానగరం ఉన్న న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం పేరు కూడా యూరోపియన్లు మొదట వచ్చి రాగానే తామున్న ప్రాంతానికి న్యూ సౌత్ వేల్స్ అని పేరు పెట్టారట . అదే విధంగా ఆస్ట్రేలియాలో పేర్లన్నీ మార్చేశారు. కొద్ది తప్ప. బ్రిటిష్ వారితో స్థానిక ఆస్త్రేలియాన్స్ కి ఉన్న సంబంధాలను బట్టి అక్కడక్కడా ఇప్పటికీ అబోరిజినల్స్ పేర్లు కనిపిస్తాయి.   బారంగారో కొండకి ఒక వైపు అంతా నీరు మరో వైపు భూభాగం .  ఆ కొండపై 75,858 రకాల మొక్కలు పెరుగుతున్నాయి . అవన్నీ కూడా సిడ్నీ ప్రాంతంలో పెరిగే మొక్కలూ , చెట్లూ .  అవి బ్రిటిష్ కాలనీలు రాకముందూ – వచ్చిన తర్వాత మా  జాతీయుల చరిత్రలు చెబుతాయి అంటుంది జెస్సికా . అక్కడ  కనిపించే గడ్డిని చూపి దీనితో మా పూర్వీకులు తమ అవసరాలకు కావాల్సిన పాత్రలు , సంచులు , బుట్టలు తాయారు చేసుకునేవారు . ఆ గడ్డి గెలలు వచ్చాక ఆ గెలనుండి వచ్చే నారతో నులక నేసి మంచాలకు చుట్టేవారు.  చెట్టు బెరడు ఎన్నో విధాలుగా వాడేవారు . నార, పీచు , పళ్ళు , ఫలాలు , వాటి గింజలు , దుంపలు ప్రతిదీ తమచుట్టూ ఉన్న అడవినుండి తమ అవసరాలకు మాత్రమే తెచ్చుకునేవారు . చెట్లను నరకడం మా పూర్వీకులకు తెలియదు . వాళ్ళు చెట్టు మొదలు నుండి పైకి  నిలువుగా ఒక గాటు పెట్టి  బెరడు తొలిచేవారు .  ఆ బెరడును చాలా రకాలుగా అవసరాలకు మలుచుకునేవారు . ఎన్నెనో ఔషధమొక్కలున్నాయి  ఈ కొండపై అంటూ మాకు వివరించింది .  తను మాకు చూపిన గడ్డితో చేసిన బాగ్ లోంచి తీసి తమ పూర్వీకులు వాడిన పరికరాలు , వస్తువులు చూపింది .
అదే విధంగా కనిపించే ఆ నీటిలో ఎంతో చరిత్ర సమాధి అయింది .   అనూహ్య వాతావరణ పరిస్థితుల్లో సముద్రపు నీటిమట్టం పెరిగి అప్పుడున్న జనాభాతో పాటు రాతిని తొలిచి చేసుకున్న వారి నివాసాలు , సొరంగ మార్గాలు జల సమాధి అయ్యాయి . ఇక్కడ దొరికే ఈ ఇసుక రాళ్ళూ , నత్తలు , గవ్వలు , చేప పొలుసులు అన్నీ మూలవాసుల ఆనవాళ్ళని , ఆనాటి చరిత్రని పట్టిస్తాయి అని ఎంతో ఉద్వేగంగా చెప్పిందామె .
కొద్దీ దూరంలో అంటే 500 మీటర్ల దూరంలో కనిపిస్తున్న ఆకాశహార్మ్యాలను చూపుతూ అభివృద్ధి దృష్టి ఎప్పుడూ మా స్థలాలపైనే .. అటుచూడండి ఆ కట్టడాలన్నీ అబోరిజినల్స్ స్థలాల్లోనే జరిగేది . మేం గట్టిగా అడ్డుకుంటున్నాం . అయితే మా జనాభా తక్కువ . ఉన్నవాళ్లు కూడా ఎక్కడెక్కడో ఎవరికి వారుగా ఉన్నారు . అందరం సంఘటితమయ్యి మా సమస్యలని ఎదుర్కొంటూ పోరాడడమే కాదు మా హక్కుల్నీ కాపాడుకోవడం కోసం మిగతా వాళ్ళకంటే మేం మరింత కష్టపడాల్సి వస్తోంది  అంటుందా మూలవాసీ మహిళ .
ఒక్క బారంగారో లోనో , సిడ్నీ లోనో , న్యూసౌత్ వేల్స్ లోనో మాత్రమే కాదు దేశమంతా అబోరిజినల్స్ టోర్రెస్ స్ట్రైట్ ఐలాండర్స్ పరిస్థితి ఇదే  అంటూ వివరించింది జెస్సికా . మధ్య మధ్యలో మేం అడిగే ప్రశ్నలకు , సందేహాలకు ఓపిగ్గా జవాబు చెప్పింది . ఇప్పటికీ ఈ దేశంలో మా పట్ల వివక్ష ఉంది . విద్య , ఆరోగ్యం , ఉద్యోగం,  అన్ని చోట్లా వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పింది . అందుకు సంబంధించిన వివరాలు మరోచోట ప్రస్తావిస్తాను .  అదే విధంగా  స్టోలెన్  జనరేషన్స్ గురించి విన్నానన్నపుడు జెస్సికా చాలా ఉద్వేగానికి గురయింది . అవును , ఇప్పటికీ తమ కుటుంబాన్ని కలుసుకోలేని పిల్లలూ , పిల్లల్ని కలవలేని తల్లిదండ్రులు కొల్లలు .  ఇలాంటి మార్కెట్స్లోనో , మీట్స్ లోనో , ఉత్సవాల్లోనో కలిసినప్పుడు తమవారెవరైనా కనిపిస్తారేమోనని వారి  పేర్లను బట్టి బంధుత్వాలు వెతుక్కుంటూ ఉంటారు . (స్టోలెన్ జనరేషన్స్ గురించి మరో సందర్భంలో మాట్లాడుకుందాం . ) అని చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది .
అలా ఓ గంట నడకతో సాగిన ఆ టూర్ అయ్యేసరికి కడుపులో కొద్దిగా ఆకలి మొదలయింది .  మేం ఇంటినుండి తెచ్చుకున్న పదార్ధాలున్నప్పటికీ అక్కడున్న ఫుడ్ స్టాల్స్ వైపు చూశాము .  మూలవాసులు ఏమి తినేవారో ఆ ఆహార పదార్ధాలు అక్కడ కనిపించాయి .  ఈము పక్షి మాంసం , కంగారూ ల మాంసం పుల్లలకు గుచ్చి నిప్పులపై కాల్చి (ఇప్పుడు మనం అనే BBQ ) చేపలు , పీతలు,  వోయిస్టర్ చెరుకు ఆకులాంటి ఓ ఆకులో చుట్టి కాలుస్తున్నారు .  నత్తలు , ఆల్చిప్పలు ఒలిచి అరటి మొక్క పొరల్లాంటి పొరల్లో చుట్టి కొద్దిగా కాల్చి ఇస్తున్నారు .  ఒకరకం నీచు వాసన .  ఉప్పు కారం మసాలా  లాంటివేమీ లేకుండా  ఎలా తినేవారో అలా ..
మేం ఈము మాంసం తో చేసిన స్కీవర్స్ తీసుకున్నాం .
నేటివ్ అబోరిజినల్స్ జీవిత వీర గాథలు చెప్పింది టకీ కూలీ అనే మహిళ.   ఆ తర్వాత ఆ మహిళ పామిస్ట్రీ చెప్తోంది.  ఒక్కక్కరి నుండి $10, 20, 30 తీసుకొంది. తమ హస్త రేఖలను బట్టి , ముఖ కవళికలను బట్టి ఆమె జాతకం చెప్తోంది . చాలా మంది క్యూ లో కనిపించారు.
అద్భుతమైన కళా నైపుణ్యాలు వారివి . రేగు పండ్ల గింజల్లాంటి గింజలతో వారు చేసిన ఓ  ఆభరణం నా మనసుని బాగా ఆకట్టుకుంది. కొందామనుకున్నాను కానీ అది అప్పటికే అమ్మేశానని చెప్పింది నిర్వాహకురాలు .   మా పూర్వీకులు రంగులు వాడేవారు కాదు . మేం వాడుతున్నాం అని చెప్పింది మేరీ . ఆవిడ ఆర్ట్స్ స్టూడెంట్ ననీ బహుశా వచ్చే ఏడాది ఇండియా వస్తానని చెప్పింది . అయితే ఇండియాలో ఏ యూనివర్సిటీ కి వచ్చేది తెలియదట . కల్చరల్ ఎక్స్చేంజి ప్రోగ్రాంలో భాగంగా వస్తానని చెప్పింది . దాదాపు 50 ఏళ్ల వయసులో ఉన్నావిడ ఇప్పుడు ఈ వయస్సులో యూనివర్సిటీ కి వెళ్లి చదువుతున్నందుకు అభినందించాను . ఆవిడ నవ్వుతూ   మేం చదువుల్లోకి వెళ్ళేది చాలా ఆలస్యంగా .  నాన్ అబోరిజినల్స్ కి ఉన్న అవకాశాలు మాకు లేవు . మేం అవతలి వారి నుండి ఎగతాళి ఎదుర్కొంటూ పై చదువులకు రావడం సాహసమే అని చెప్పింది .  అందుకే కాలేజీల్లో ,యూనివర్సిటీ లో మిగతా వాళ్ళకంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ వయసులో పెద్దవాళ్ళయి ఉంటారు అంటూ కొబ్బరి పూసలతో  బ్రేస్ లెట్ తాయారు చేస్తూ  వివరించింది .  ఇంకా ఎదో మాట్లాడ బోతుండగా కస్టమర్స్ రావడంతో బిజీ అయిపొయింది .  వాళ్ళతో చాలా చాలా మాట్లాడాలి . ఎంతో తెలుసుకోవాలన్న ఉత్సాహం నాది . కానీ వాళ్ళకి ఉన్న సమయం ఉదయం 9. 30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే . అంతలోనే తమ వస్తువులు వీలయినంత ఎక్కువ అమ్మి సొమ్ము చేసుకోవాలన్న తాపత్రయం .  అలా వాళ్ళు తాయారు చేసిన హస్త కళలు , ప్రకృతి సహజమైన వస్తువులతో తాయారు చేసిన సబ్బులు , షాంపూలు , పురుగుమందులు , కొన్ని రకాల మందులు  ఒక స్టాల్లోఉంటే మరో స్టాల్ లో కిందరగార్డెన్ స్కూల్ పిల్లలకోసం స్టడీలెర్నింగ్ మెటీరియల్ అతి తక్కువ ధరల్లో .  ఒక స్టాల్ లో పురాతన ఆస్ట్రేలియన్ వాడిన సామగ్రి ,పనిముట్లు ,వాళ్లకు సంబంధించిన ఫోటోలు, ఆర్ట్ , వగైరాలతో పాటు ఆస్ట్రేలియా దేశంలో ఆదిమ మానవుడు నివసించిన రాతి గుహలు , సొరంగాలు , వారి పవిత్ర స్థలాలు, ఆదిమ కాలంనాటి మానవుల శిలాజాలు , జంతువుల శిలాజాలు వంటివన్నీ చూపడానికి ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీల వివరాలు ..  మందమైన నారవంటి బట్టపై ప్రాధమిక రంగులతో వేసిన కళాకృతులు , పెయింటింగ్స్, మనం ఎందుకూ పనికిరావని పడేసే షెల్స్ , సీడ్స్  తో ఎన్నో ఎన్నెన్నో .. కళాకృతులు , ఆభరణాలు . అద్భుతంగా ..
ఒక స్టాల్ లో పురాతన నేటివ్ ఆస్ట్రేలియన్ వాడిన పనిముట్లు, సామాగ్రి, ఇతర వస్తువులతో పాటు వాళ్ళు కప్పుకున్న గొంగళి కనిపించింది . ఆ స్టాల్ నిర్వాహకుడు జోసెఫ్  ఆ గొంగళి గురించి చెప్పాడు . ఆదిమ మానవులు బిడ్డ పుట్టిన తర్వాత కూలమన్  (అంటే దోనె ఆకారంలో ఉన్న చెట్టు బెరడు )లో గొర్రె ఉన్నితోలు వేసి ఆ బిడ్డను పడుకోబెట్టి అదే కప్పేవారట . ఎటన్నా పోయినా అట్లాగే  తీసుకెళ్లేవారట .  అలా బిడ్డ పెరిగిన కొద్దీ ఆ ఉన్ని ముక్కకి మరో ముక్క అతికేవారట . అలా ఆ బిడ్డ పెద్దయ్యేసరికి పెద్ద గొంగళి అయ్యేదట . అలా అతుకులు అతుకులుగా ఉన్న గొంగళి భలే ఉంది . కూలమన్ ను వంట పాత్రగాను , వస్తువులు వేసుకునే పాత్రగాను  ఎన్నోరకాలుగా వాడేవారట .  మహిళలయినా , పురుషులయినా వాళ్ళ చేతిలో చేతికర్ర కన్నా చిన్నదిగా సూదంటు మొనతో ఉన్న కర్ర ఉండేదట . అది వారిని వారు కాపాడుకోవడం కోసం , కందమూలాలు తవ్వుకోవడం కోసం వంటి వివిధ పనులకోసం వాడేవారు . అలా వారి వస్తువులు , పనిముట్లు ఒకటి కంటే ఎక్కువ పనులకోసం ఉపయోగించేవారు .
ఉదయం 9. నుండీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నారతో వివిధ రకాల వస్తువులు , సముద్రంలో దొరికే వివిధ రకాల గవ్వలతో వస్తువులు , అలంకరణ సామాగ్రి తాయారు చేయడం , అదే విధంగా ఆభరణాలు తాయారు చేయడం , పెయింటింగ్స్ , వంటి వర్క్ షాప్స్ కొనసాగాయి .  95 సంవత్సరాల మహిళ ఎంతో ఉత్సాహంతో ఓ స్టాల్ లో కనిపించింది తన కూతురితో పాటు . ఆమె తాను నేర్చుకున్న పూర్వీకుల జ్ఞానాన్ని వారసత్వంగా తరువాతి తరాలకు అందించే ప్రతినిధిగా అక్కడ కనిపించడం అపురూపంగా తోచింది .
ఓ పక్క ఎండ మండుతున్నా వచ్చే జనం పోయే జనంతో కిటకిటలాడాయి బ్లాక్ మార్కెట్స్ .  అక్కడ వారు చాలా షాపింగ్ చేశారు . మేం మాత్రం ఓ కొత్త లోకంలోకి వెళ్ళివచ్చినట్లుగా భావించాం .  మనకు తెలియని మూలవాసుల జీవితాల గురించి ఆలోచిస్తూ తిరుగు ముఖంపట్టాం.
ఆస్ట్రేలియా పర్యటించేవారు ఓపెరా హౌస్ , హార్బర్ బ్రిడ్జి, స్కైటవర్  వంటివి చూడ్డమే కాదు అబోరిజినల్స్ జీవనానికి సంబంధించిన టూర్లు చేయొచ్చు . మూలవాసుల జీవనం గురించి ఎంతో తెలుసుకోవచ్చు .  అదే విధంగా అలలపై తేలియాడే చేపల్ని, నీటిఅడుగున ఉన్న సముద్రపు జీవాల్ని  గురించి తెలుసుకోవచ్చు.  చేపల్ని  వేటాడడం , వివిధ రకాల సముద్ర జీవుల్ని అక్కడే కాల్చుకు తినడం , బూమెరాంగ్ ఎలా విసరాలో నేర్చుకోవడం ,   మంచుయుగం , రాతియుగాల్లోను  జాత్యహంకారులు అడుగుపెట్టక ముందున్న నేటివ్ ఆస్ట్రేలియన్ల జీవనం , టెక్నాలజీ ని , వారి ఆర్ధిక వ్యవస్థని , మార్కెట్ పద్దతులను  తెలుసుకోవడం వంటివన్నీ మనకు కొత్త ఉత్సాహాన్నివ్వడమే కాదు జీవితంపై కొత్త అన్వేషణలకు పునాదులేస్తాయి .
ఆస్ట్రేలియాలో ఏ  మూలకు పోయినా ప్రాచీనచరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను తుడిచేసే ప్రయత్నమే ..  ఎతైన ఆకాశహర్మ్యాలు , స్కై టవర్స్, స్కైవేలు , ఫోర్ వేలు, మైనింగ్ ప్రాజెక్ట్స్ వంటి  మరెన్నో అభివృద్ధి పథకాల  కింద నలిగిపోయిన మూలవాసుల గుండె ఘోష వినిపిస్తూనే ఉంటుంది .  అతి పురాతనమైన చరిత్ర కలిగి కేవలం మూడుశాతం జనాభాగా మిగిలిన మూలవాసులు కోరుకునేదొకటే . అభివృద్ధి భూతం తమని మింగకూడదనే . ఇప్పటివరకూ జరగకూడని విధ్వంసం జరిగిపోయింది . ఇక  జరుగకూడదనే  వారి తపనంతా .   వారే కాదు ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ప్రజలు కోరుకునేది అదే కదా ..
వి . శాంతి ప్రబోధ
Published in Saranga 24 Dec, 2016

కొండా కోనల్లోని మాణిక్యాలు ‘ఓజ ‘ హస్త కళాకారులు

madhyalo madavi bhagavantharavu. mugguru ahmadabaad vellaru ‘మా తాత ముత్తాతల నుండీ ఈ పని చేస్తున్నాం. కానీ మాకు మార్కెట్ లేదు.’ అన్నాడు మడావి భగవంతరావు.   అవునన్నట్లు తలలూపారు అతనితోనే ఉన్న వాళ్ళు . ఆ వెంటనే ‘మాకు పనిచేయడం తెలుసు కానీ మార్కెట్ చేసుకోవడం తెలియదు’ అని తన మాట సవరించుకున్నాడు మడావి భగవంతరావు.  వాళ్ళంతా ‘ఓజ ‘ చేతిపని కళాకారులు. నిజమే,  వాళ్ళు చేసిన చేతికళలకు ఉపయోగపు విలువ ఉంది.  మార్కెట్ చేసుకోవడమే తెలియదు. వారు తమ శక్తిని జోడించి చేసే కళాకృతుల ద్వారా  ఒక తరం నుండి మరో తరానికి వారసత్వ జ్ఞాన సంపద బదిలీ చేస్తున్నారు. అనాదిగా ఉన్న డిజైన్ లనే చేస్తూ తమ గిరిజన తెగల ఆభరణాలు, ప్రకృతిలో నివసించే వారి సంస్కృతీ సంప్రదాయాలకు తగ్గ వ్యవసాయ పనిముట్టులు, గృహావసర వస్తువుల్ని తయారు చేయడం ద్వారా సజీవంగా ఉంచుతున్నారు.

dipam
ఇత్తడి కరిగించి వారు చేసిన కళాఖండాలు మమ్మల్ని చాలా ఆకట్టుకున్నాయి.  భూమిక పత్రిక, మహిళా సమత సొసైటీ ఆధ్వర్యలో ఏర్పాటైన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు డివిజన్ లోని కెరిమెరి, జైనూర్  మండలాలలో 25మంది రచయిత్రుల సందర్శన సందర్భంగా మేం జైనూర్  మండలం లోని ఉషేగాం వెళ్లాం.  అదో కుగ్రామం. ఉట్నూరు నుండి ఆసిఫాబాద్ వెళ్ళే మార్గంలో ఉంది.  ఒకే ఒక బజారు. 20 కుటుంబాలు నివసిస్తున్నాయక్కడ.  ఒకప్పుడు వారు సంచార జీవులు.  ప్రస్తుతం వారి ఇల్లు  ప్రభుత్వం కట్టించిన ఒకే ఒక గది. కొందరి ఇళ్ళకి ముందర వాలుగా వేసిన  పందిరి.   ఆ పందిట్లో కూర్చొని తమ చేతులు ఒంపు సొంపులతో  తమ పని చేసుకుపోతుండగా కొత్తగా కనిపిస్తున్న మాకేసి వింతగాను, ఆసక్తిగాను చూసే యువకులు, పిల్లలు, మహిళలు.  ఆగి ఏమి చేస్తున్నారని అడిగినప్పుడు ఒకరు ఎద్దు అని చెప్తే మరొకరు గంట అని చెప్పారు. thanapanilo వారి చేతుల్లో మైనం సన్న తీగలా ఒంపులతో చుట్లు తిరుగుతూ ..ఒక రూపాన్ని సంతరించు కుంటూ .. వారి కళా నైపుణ్యానికి  అబ్బురంగా చూస్తూ మేం .  వారిని చూస్తుంటే చేట ముందు వేసుకుని క్షణం వృధా కానీయకుండా  చకచకా బీడీలు చుట్టే మహిళలే కళ్ళ ముందు మెదిలారు.
ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఉండే ఇతర గిరిజన తెగలకి భిన్నంగా వీళ్ళు సంచార జీవితం గడిపేవారు.  ఏ చెట్టు కిందో, ఎవరింటి పందిరి కిందో  మకాం వేసి ఇత్తడి కరిగించి నగలు, ఎద్దులు, ఎడ్ల బండ్లకు అలంకరించే ఆభరణాలు చేసే కంసాలిపని, వ్యవసాయ పనిముట్లు చేసే కమ్మరం పని చేసే వారు. అదేవిధంగా గోండులు పూజించే దేవతా విగ్రహాలు, పూజా సామాగ్రి ఇతర వస్తు సామాగ్రి చేసి ఇచ్చేవారు.  అందుకు ప్రతిఫలంగా ధాన్యం, లేదా ఇతర ఆహార పంటలను గోండుల నుండి పొందేవారు. అంటే గోండులు ఇచ్చేవారిగాను ఓజ తెగ వారు పుచ్చుకునే వారిగాను ఉండేవారు.
ఊషేగాంలో  ఉన్న కుటుంబాలన్నీ ‘ఓజ ‘ అనే గిరిజన తెగకు చెందిన కుటుంబాలే.  చూడగానే వారు గోండులకు దగ్గరగా కనిపిస్తారు. కానీ, వారి ఆచార వ్యవహారాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకరికొకరు పిల్లని ఇచ్చి పుచ్చుకోవడం ఉండదు.  గోండులు వీరి ఇళ్ళలో ఆహరం ముట్టరు. వీరు సామాజికంగా  గోండుల కంటే దిగువ స్థాయికి చెందిన తోటి , కొలామ్, పర్దాన్ ల కంటే కూడా తక్కువ స్థాయికి చెందుతారు.    గోండు పురాణాలలో వీరిని  pen de Wojalir (ది ఫౌండర్స్ ఫర్ ది గాడ్స్ ) గా పేర్కొన్నారు.  వీరికి కూడా గోండులలో ఉన్న విధంగానే ఇంటిపేర్లు ఉంటాయి.   మిగతా గిరిజనులతో పోలిస్తే ఓజ తెగ జనాభా చాలా తక్కువ.  జైనూరు మండలం లోని ఊషేగాం తో పాటు ఇంద్రవెల్లి మండలంలోని ఒకటి రెండు కుగ్రామాల్లో మాత్రమే ఉన్నారు. పేదల్లో పేదలు ఓజా తెగ జాతివారు.  వీరిని Wojaris అని అంటారు. గోండులు మాత్రం ఓజాలు అనే వ్యవహరిస్తారు.  వీరు ‘ఓజ’ భాష మాట్లాడతారు. ఓజ భాష మరాఠీ భాషకు దగ్గరగా ఉంటుంది.    తాము చంద్ర వంశీయులమని చెప్పారు అక్కడి వాళ్ళు.
eddula jodiమహిళా సమత సొసైటీ కార్యకర్తలు మమ్మల్ని గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలోకి తీసుకెళ్ళారు.  మేం వెళ్ళేసరికే అక్కడ కొంతమంది ఉన్నారు. లోనకి వెళ్ళగానే పుత్తడిలా మెరిసే అద్భుతమైన ఇత్తడి కళాఖండాలు మా మది దోచుకుంటూ.. అవి వారి చేతుల్లో రుపుదిద్దుకున్నాయంటే ఆశ్చర్యం . వాళ్ళ కళ  గురించి తెలుసుకోవాలన్న ఆతృత.   ఆ క్రాఫ్ట్ వర్క్ అంతా త్వరలో రాబోయే కేస్లాపూర్ లో  జరిగే నాగోబా  జాతర కోసం సిద్దం చేసుకుంటున్నామని చెప్పారు అక్కడి వారిలో ఒకరు.  ప్రతి సంవత్సరం జరిగే జాతరకి రెండు మూడు నెలల ముందు నుండే వివిధ సామాగ్రిని తయారు చేయడం మొదలు పెడతారు వీళ్ళు.
వాళ్ళు తయారు చేసే  హస్త కళల్లో కొన్ని :
nagobaaనాగోబా – చుట్ట చుట్టుకొని పడగ విప్పిన నాగు. గోండులలో మేస్రం వంశస్తుల దైవం
nevadiనేవడి – కాలికి వేసే ఒక రకమైన కంకణం. నాగోబా జాతర సమయంలో దైవాన్ని నెత్తిన ఎత్తుకున్న వ్యక్తీ భీందేవ్ (గోండు, కొలామ్, పర్ధాన్, తోటి తదితర గిరిజనులంతా భీముడిని దేవుడిగా కొలుస్తారు.)  తిరిగేటప్పుడు సాంప్రదాయంగా కాలికి వేసుకునే ఆభరణం.
udaaniఉదాణి – దేవుడి పూజకు ఊదు/సాంబ్రాణి వేసి వెలిగించే వస్తువు
దీపంచె  – దీపం
గంటి  – గంట
gorka pelli koduku pelli kuthuriviగొర్క  – కత్తి
గంటలు, మువ్వలు ,  కర్రకి చివర కడతారు.  దేవుడికి కడతారు.  ఎద్దులకి వేసేవి వేర్వేరుగా ఉంటాయి.  వారు తయారు చేసే వస్తువులు పూజకు సంబంధించినవి, వ్యవసాయానికి సంబంధించినవి, వారి సంస్కృతీ ఆచారాలకు, అవసరాలకు  సంబంధించినవి ఎక్కువగా కనిపిస్తాయి. ఎద్దులు , నెమళ్ళు, పాములు, సూర్య చంద్రులు, అయిదు నక్షత్రాలు  వారి డిజైన్లలో ఎక్కువగా  కనిపిస్తాయి.
గోండు తదితర గిరిజనులు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురులకు  కత్తి లేకుండా పెళ్లి జరగదట.  అందుకే పెళ్ళిళ్ళ కోసం వాటిని తయారు చేస్తారు. వాటిని పెళ్లి గోర్కలు అంటారు.  పెళ్ళికొడుకుకి వాడే గోర్కలు పెళ్లి కూతురికి వాడే వాటి కంటే కొద్దిగా పెద్దవిగా ఉంటాయి.  గోర్కని ఊరికి రక్షణగా పెడతారు. అదే విధంగా భార్యాభర్తలు ఒకరికొకరు రక్షణగా ఉంటారని, దుష్ట శక్తులు వారి దరిచేరకుండా ఉండాలని  గోర్కలు పెళ్ళిలో వారికి ఇస్తారట. గోర్కలపైన సూర్యుడు, చంద్రుడు,  ఐదు నక్షత్రాల (పంచపాండవులు అని అంటారు ) బొమ్మలతో ఉన్నాయి.  మరో గోర్కల సెట్ పై నెమళ్ళ డిజైన్ తో ఉన్నాయి.
దీపం స్టాండ్ లో ఒకప్పుడు ఆముదం వేసి వెలిగించేవారు.  ఆ దీపం రాత్రంతా వెలుగుతూనే ఉండేది. ఇప్పుడు ఏదో ఒక నూనె వాడుతున్నారు. ఇవి ప్రతి ఇంటిలో ఉంటాయి. ఇవి ఒకటి, రెండు, మూడు, ఐదు అంతస్తులు గా ఉండేటట్లు చేస్తారు.  పెద్దవి ఇప్పుడు ఎక్కువగా దేవాలయాల్లో వాడుతున్నారు.
ఎలా చేస్తారంటే :
ఒక దీపం చేయడానికి రెండు రోజులు పడుతుంది. ముందుగా ఒకరకమైన మట్టిపై మైనంతో డిజైన్ చేస్తారు.  ఆ తర్వాత ఆ మైనపు డిజైన్ పై మట్టి వేస్తారు. దాన్ని కుండలు కాల్చినట్లు కాలుస్తారు.  మైనం కరిగిపోయి మధ్యలో ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలో కరిగించిన ఇత్తడి పోస్తారు.  ఆ తర్వాత మట్టి తీసేసి బ్రష్ తో శుభ్రం చేస్తారు.
కావలసిన ఇత్తడిని ఆదిలాబాదు లేదా ఆసిఫాబాదు నుండి తెస్తారు.
ధర
పెళ్లి గోర్కల సెట్ కి (అమ్మాయివి, అబ్బాయివి )మూడువేల ఐదువందల రూపాయలు , కొద్దిగా చిన్నవి అయితే రెండువేల ఐదు వందల రూపాయలు అవుతాయి. చిన్న అద్దుల జత కి ఆరువందల రూపాయలు . ఇలా,  వారు డిజైన్ ని బట్టి , అది తీసుకునే తయారీ సమయాన్ని బట్టి , ఉపయోగించే ఇత్తడిని బట్టి వస్తువు ధర నిర్ణయిస్తారు.
ఎవరికైనా నేరిపిస్తారా ?  అంటే ఇది నేర్పిస్తే అందరూ నేర్చే పని కాదు అన్నారు.  ఐఎఎస్ అధికారి చందనా ఖన్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా ఉన్న సమయంలో అంతరించి పోతున్న ఈ కళను భవిష్యత్ తరాలకు నేర్పించాలన్న ప్రయత్నం జరిగిందనీ, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లోని విద్యార్థులు నేర్చుకున్నారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ మహిళా సమత సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంతి .  అయితే వీరు చేసే డిజైన్లు చాలా సమయం తీసుకుంటాయి. ఒక్క దీపపు కుందె చేయడానికి కనీసం మూడు రోజులు పడుతుంది.  ప్రస్తుతం బడికి పోయే పిల్లలు తప్ప మిగతా వారంతా ఇవి చేస్తారు.  వ్యవసాయం పనికి వెళ్ళరు .  ఇదే వారి ప్రధాన వృత్తి.
ఆదిలాబాదు జిల్లాలోని  DRDA వారు నిర్వహించిన వర్క్ షాపులో పాల్గొన్నామని ఒకరు చెబుతుండగా మడావి భగవంతరావు ఒక వార్తాపత్రిక తీసుకొచ్చి మా బృందం చేతిలో పెట్టాడు. అది ‘అహ్మదాబాద్ సిటీ లైఫ్ ‘. గుజరాతిలో ఓజ హస్తకళ, కళాకారుల  గురించి రాశారు.  ఎక్కడో ఉన్న  పరాయి రాష్ట్రం గుజరాత్లో వారికి లభించిన గుర్తింపుకి  చాలా ఆనందం కలిగింది.  మదావి భగవంతరావు బృందాన్ని ARCHITECTURE PLANNING AND CONSTRUCTION TECHNOLOGY వాళ్ళు 30 మంది విద్యార్థులకు నేరించడం కోసం వీరిలో ముగ్గురు కళాకారులని పిలిపించారనీ ,  వచ్చేప్పుడు తమ  బృందానికి దుప్పి తల బహుకరించారని చెప్పి ఆ దుప్పి తలను చూపించాడు మడావి భగవంతరావు.
తాత ముత్తాతల నుండి సాంప్రదాయికంగా చేస్తున్న డిజైన్లు తప్ప కొత్తవి తెలియదు. డిజైన్లు ఇస్తే మేమూ చేయగలం అని ఎంతో ఆత్మా విశ్వాసంతో ఉన్నారు వాళ్ళు.  చేయడం వరకు తెలుసు గాని వాటిని మార్కెట్ చేయడం తెలియదు.  మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలైన  మహారాష్ట్ర , చత్తిస్ ఘడ్ , మధ్యప్రదేశ్ నుండి కొండలు కోనలు దాటి  వచ్చే భక్తులు కేస్లాపూర్ జాతరలో వీరు తయారు చేసిన వస్తువులు కొంటూ ఉంటారు.  అంతకు మించి రాష్ట్ర హస్త కళల కేంద్రాల్లో వాటిని ఎలా మార్కెట్ చేయాలో తెలియదు.  ఇప్పుడిప్పుడే తమ పిల్లల్ని బడికి పంపుతున్న వీరికి కొత్త డిజైన్లు ఇస్తూ వారిని ప్రోత్సహించక పొతే భవిష్యత్ లో ఈ కళ అంతరించిపోయే ప్రమాదం ఉంది .  రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, గిరిజన సంక్షేమ శాఖ, ప్రభుత్వం  ‘ఓజ ‘ కళాకారుల కళని గుర్తించి వారి కళను కాపాడుతూ భవిష్యత్ తరాలకు భద్రపరచి  అందించాల్సిన బాధ్యత ఉంది. కళాకారులకి చేయూత నిచ్చి వారు రూపొందించే కళాకృతులకు సంస్థ నిర్వహించే షో రూం లలో ఉంచి మార్కెట్ సదుపాయాలు పెంచాల్సిన బాద్యత కూడా ప్రభుత్వానిదే.   అతి దయనీయ స్థితి లో ఉన్న ‘ఓజ ‘ కళాకారులని ఆర్ధికంగా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వి. శాంతి ప్రబోధ

ఎవరికోసం ఈ అభివృద్ధి ..?

నవంబరు 7వ తేది మా ప్రజాస్వామిక రచయిత్రుల బృందం విశాఖపట్నంలోని కొన్ని పారిశ్రామిక వాడలు సందర్శించిన తర్వాత నా మనసుని మెలిపెట్టిన ప్రశ్నలను, కలిగిన భావనలను మీ ముందుంచుతున్నాను .

ఇప్పుడు అందరి నోటా అభివృద్ధి అన్న పదం సమృద్ధిగా వినిపిస్తోంది. ప్రస్తుత దేశ కాల పరిస్థితుల్ని చూస్తే మదిలో ఎన్నెన్నో ప్రశ్నలు… అసలు అభివృద్ది అంటే ..? ఆ అభివృద్ది ఎవరి కోసం ..? ఎందుకోసం ..? ఎక్కడ జరుగుతోంది ..? ఎలా జరుగుతోంది ..?

బళ్ళు ఓడలు అవడం, ఓడలు బళ్ళు అవడం అంటే ఇదేనేమో ..! ఒకప్పుడు చక్కటి కట్టుదిట్టమైన ఇళ్ళు వాకిళ్ళు , పిల్లా పాపలు , గొడ్డు గోదాతో పసిడి పంటలతో విలసిల్లిన ఆ గ్రామం నేడు వట్టిపోయి వల్లకాడులా మారిపోయింది. ఒకప్పుడు 368 కుటుంబాలున్న ఆ గ్రామంలో ఇప్పుడు మిగిలింది 20 కుటుంబాలే. వారూ ఆ గ్రామం వదలలేక .. చావలేక.. అభాగ్య జీవితం గడుపుతున్నవారే .. ఆ గ్రామమే చుక్కవానిపాలెం.

ఆ గ్రామం ఇప్పుడు కొత్తగా ఏర్పడింది కాదు. ఎప్పుడో.. అంటే వారి తాత ముత్తాతల కాలం నుండీ అక్కడే ఉందా గ్రామం. అక్కడున్నవారంతా చిన్న సన్నకారు రైతులు. మధ్యతరగతి కుటుంబీకులు. పచ్చగా నందనవనంలా కళకళలాడే ఆ గ్రామానికి దగ్గరలోనే 1957 లో హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ కంపనీ ఏర్పాటుచేయాలన్న నిర్ణయం జరిగింది. ఆ కంపనీ అవసరాలకోసం ప్రభుత్వ స్థలాలే కాకుండా స్థానిక రైతుల నుండి కలిపి మొత్తం 365 ఎకరాల స్థలం సేకరించుకుంది. 1964 లో పని ప్రారంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద జింక్ కంపనీగా వెలుగొందింది. కోట్లాది రూపాయల ఆదాయం పొందే సంస్థపై ప్రయివేటు గద్దల దృష్టి పడింది. తరువాతి కాలంలో ప్రభుత్వ వాటా తగ్గి ప్రయివేటు వాటా పెరిగింది. షరా మామూలే .. 2002లో ప్రభుత్వ రంగ సంస్థకి మరణశాసనం రాసి వేదాంత కంపెనీ అధినంలోకి వచ్చింది. 1976లో నిర్మించిన జింక్ స్మెల్టర్ లో పనిచేసే 300 మంది కార్మికులతో బలవంతంగా విరమణ చేయించి నడిరోడ్డుపైకి విసిరేసింది. ప్రతి ఏడాది కోట్ల రూపాయల లాభం అందుకున్టున్నప్పటికి ముడి ఖనిజం కొరత, పవర్, పర్యావరణం వంటి రకరకాల కుంటి సాకులు చూపి జింక్ కంపెనీని మూసేసింది యాజమాన్యం. వాస్తవంలోకి తొంగి చూస్తే .. వేదాంత కంపెనీ గంగవరం పోర్టు కొనుగోలు చేసింది. విశాఖ పోర్టులో రెండు బెర్తుల్ని పిపిపి పద్దతిలో తీసుకుంది. దాంతో స్టాక్ యార్డుల అవసరం ఏర్పడింది. దానికోసం జింక్ కంపనీకి చెందిన స్థలాన్ని చూపించి ఇక్కడి జింక్ కంపనీ రాజస్తాన్ కు తరలించి ఈ కంపనీ ఊపిరి తీసేసింది. ప్రభుత్వరంగ సంస్థల పట్ల , కార్మికుల సంక్షేమం పట్ల మన ప్రజా ప్రభుత్వాలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాయో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలదూ ..?!

Previous Image
Next Image
shithilamaipotuna-pilaka-gangulu-illukunchinchuku-poyina-pilaka-ganguluo-pakka-zink-facotry-aa-pakkane-led-factoryprarave-team-vishakha-field-visit-035vikalnguralaina-bharati-gangulu-chinna-kuturuacid-kalvalaa-paarutu-gangulu-inti-pakkane

ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే మరో వైపు పరిస్థితి ఏమిటో ఓసారి చూడాలంటే చుక్కవానిపాలెమో .. పిట్టవానిపాలెమో వెళ్తే వాటితో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలు, ఆయ గ్రామస్తుల పరిస్థితి ఇట్టే అర్ధమైపోతుంది. ప్రజల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల ప్రజా ప్రభుత్వాల నిబద్దత ఏమిటో, తీసుకున్న బాధ్యత ఏమిటో విశదమవుతుంది.

చుక్కవానిపాలెం ప్రస్తుత స్థితి చూద్దాం. ఏళ్ల తరబడి జింక్ కంపనీ నుండి వెలువడ్డ విషవాయువులు, వ్యర్ధ పదార్ధాలు అక్కడి ప్రజల జీవనాన్ని, పరిస్తితుల్ని చిన్నాభిన్నం చేసేసాయి. . విషవాయువులు, రసాయనాలు గాలిని, నీటిని, వారి శరీరాల్ని కలుషితం చేశాయి. మానసిక శారీరక వైకల్యం, కాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, కీళ్ళు ఎముకల సమస్యలు, హార్మోన్ల అసమానతలు మృత్యు ఘంటికలు మోగించడంతో ఉలిక్కిపడ్డ అక్కడి ప్రజలు చేపట్టిన అనేక ఆందోళనలు, ఉద్యమాలు, ప్రయత్నాల తర్వాత కనీసపు ఉపశమన చర్యగా మంచినీరు సరఫరాకి, వారం వారం డాక్టరు వచ్చి చూసేలా కంపనీ ఏర్పాటు చేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయింది. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో బతికుంటే బలుసాకు తినొచ్చు అని భావించిన అక్కడి ప్రజలు ఎంతో కష్టం మీద పునరావాసం సాధించుకున్నారు. పగిలిన గుండెకు అతుకులు వేసుకుంటూ తుంగవానిపాలెంలో 40 గజాల స్థలంలో 20 గజాల ఇల్లు అందుకున్నారు. చావుడప్పు మోగిస్తున్నప్పటికీ పిట్టగూడు లాంటి ఆ ఇళ్ళలో ఇమడలేనక, గంపెడంత ఇళ్ళను, కన్నతల్లిలా సాకిన ఊరిని వదిలి వెళ్ళలేక 20 కుటుంబాలు చావైనా బతుకైనా అక్కడేనని ఉండిపోయాయి. అలాంటి వారిలో పిలక గంగులు కుటుంబం ఒకటి.

పిలక గంగులుకి నలుగురు అన్నదమ్ములు. అంతా ఒకే ఊళ్ళో ఉండేవారు. అందరి ఇళ్ళు పిలిస్తే పలికే విధంగా ఉండేవి. వాళ్ళలో ఇద్దరు హంతకులెవరో తెలియని హత్యలకు బలై చనిపోతే మరొకరు ఆవురావురంటున్న కాలుష్య కోరల్ని విదిలించుకుని ఊరు విడిచాడు.
పిలక గంగులుకి ఆరు ఎకరాల వరి సాగు చేసే పోలం ఉండేది. గంట్లు, చోళ్ళు. వరి, మినుములు, ఉలవలు, కంది పండించేవారు. రెండు పంటలు పండేవి. 1964 ఎకరం 800 రూపాయలకి తీసుకున్నారు. ఆ తర్వాత 76లో లక్షా తొంబై వేలిచ్చి తీసుకున్నారు. అప్పుడు చాలా మొత్తంలో డబ్బు చేతికి వచ్చిందని ఫ్యాక్టరీకి తన పొలం అప్పజెప్పారు అతని పెద్దలు.

వ్యవసాయదారుడైన పిలక గంగులు చేతిలో పైసా అయిపొయింది. షిప్ యార్డ్ లో కూలిగా మారాడు.
ఒకప్పుడు ఇంటి దొడ్లో కూరగాయలు, పళ్ళు కాయించే వారు. కోళ్ళు, గేదలు ఉండేవి. దేనికి కొదువ ఉండేది కాదు. హాయిగా జీవితం గడచిపోతున్న సమయంలో ఆవరించిన విష మేఘం ఒక్కొక్కరినీ మింగేయడం ఆరంభించింది. అక్కడి మనుషుల్లాగే మొక్కలు , పశువులు, పక్షులు అన్నీ ఒక్కొక్కటీ కనుమరుగవడం జరిగిపోయింది. అవే కాదు, రెండు మూడు తరాలకు గొడుగు పట్టాల్సిన ఇళ్ళు చిక్కి శిథిలాలై చరిత్రలో భాగమైపోయాయి.

పిలక గంగులు సంతానంలో నలుగురు మానసిక వైకల్యంతో చనిపోయారు. ఇద్దరు కూతుళ్ళకు పెళ్లి చేశాడు. ఇద్దరు కూతుళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇద్దరినీ చూపుతూ పెళ్లి చేసుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తారా .. ? అని ప్రశ్నించే గంగులు చిన్నకూతురు, చిన్న కొడుకుశారీరక వికలాంగులే. ఇంట్లో ఉన్న కూతుళ్ళలో కుమారి మాత్రం 10వ తరగతి చదివింది. చిన్నకూతురు లేచి నించోలేదు, నడవలేదు, మాట్లాడలేదు. ఆరడుగుల ఎత్తుండే గంగులు ఐదడుగుల కంటే తక్కువగా రోజురోజుకి కుంచించుకుపోతూ ..

ఆ గ్రామపు నేలపోరల్లో, వాతావరణంలోభాగమైపోయిన వివిధరకాల రసాయనాలను ప్రతి జీవి తమ శరీరపు లోపలి పొరల్లో ఇంకించుకుని దుర్భర బాధలకు, తీవ్ర నష్టానికి బాదితులైనవే .. నేటికీ ఆ రసాయనాల ఘాటైన వాసనల్లోనే వారు. అక్కడివారితో ముచ్చటిస్తూన్న కొద్దిసేపటికే మాకు ఆ వాతావరణానికి తల బరువెక్కింది. జుట్టు బిరుసెక్కింది. మొహం గరకుగా అనిపించింది. వాళ్ళు ఏళ్ల తరబడి ఎలా భరిస్తున్నారో ..?.!

అక్కడ ఉన్న ఎవరిని కదిపినా వ్యధాభరిత జీవన చిత్రాలే .. హృదయపు లోతుల్ని పరా పరా కోస్తున్న గాయాలే .. వాళ్ళ మాటల్లోనే విందాం.

“జి. యం. వెంటబడి తీసుకొచ్చిఇవన్నీ తిప్పిఏంటి మా పరిస్థ్తితి అంతే నేనేమీ చేయలేను. నా చేతిలో ఏమిలేదు అని డాక్టర్ నిస్తాను మందులువాడుకోండి. తాగడానికి నీళ్ళిస్తాను తాగండి అన్నాడు. అట్లా కొంతకాలం బతికాం. ఇప్పుడు జింక్ కంపనీ మూతపడింది. ఏళ్ళతరబడి మొరబెట్టుకోగా ఏర్పాటైన మంచినీటి కుళాయిలు తీసేశారు. వారానికి ఒకసారి వచ్చే డాక్టరు రావడం లేదు. అక్కడ వచ్చే మరణాలన్నింటికి తనని బాధ్యుణ్ణి చేస్తారని చెప్పి డాక్టర్ రాకుండా చేశారు కొందరు నాయకులు .రసాయనాలు చూపినా ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకుంటే ఎవరు ఎక్కడ అతుక్కుపోతారో నన్న భయం. ఇప్పుడు మేమంతా గోలచేస్తే రెండురోజులకో తుట్టు నీళ్ళ ట్యంకి పంపుతున్నారు. ‘ – సర్పంచ్

“ప్రతి ఇంటికి 10, 15 గేదెలుండేయి. కుమారిని చూపుతూ ఈ పిల్ల 15 లీటర్ల పాలు పిండేది. ఎలాగుండేవోరిమి ఇప్పుడిలా అయిపోయాము. అప్పుడి ఫోటోలు చూసావంటే ఆళ్ళు ఈళ్ళు ఒకరేనేటి? ఇలాగామ్మా అంటావు ” – పిలక గంగులు

” సుట్టు కోనేసినాడు. ఇయన్ని దించీసినాడు.(స్టాక్ పాయింట్ గోడౌన్లు, అమ్మోనియం నైట్రేటు గుట్టల్ని,అక్కడ నిలిచిన లారీలు చూపుతూ ) మద్యలో ఉన్డోల్లం. లంకంతేసి కొంపలు వొదిలీసి, ఆ బొమ్మరిల్లాటి ఇల్లిస్తే ఆ ఇళ్ళల్లో ఎలాగుండాల ?
మా ఇళ్ళను ఆడు మనుషుల్ని తీసుకొచ్చి ఇరగ్గోట్టేసి పోతన్నాడు. ఎవడేటిచేత్తాడని ? పోలీసోడు ఆల్ల దగ్గర డబ్బు తీసుకుని మామాట వినడు. పెజల్ని ఏడిపిస్తే ఆడు బాగుపడతాడేటి? మరి అలా ఎడిపిస్తాన్నడనుకో . ‘ – చుక్కా అనంతమ్మ

పిట్టవానిపాలెం లోనూ ఇలాంటి స్థితే. అయితే ఇక్కడ గ్రామస్తులు జింక్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత తిరిగి తమ గ్రామానికి చేరుకున్న్నారు. ఇల్లు కట్టుకున్నారు.

జింక్, లెడ్ ఫ్యాక్టరీలు పిట్టవానిపాలెం గ్రామానికి అతి సమీపంలో ఉన్నాయి. కూతవేటు దూరంలోనే HPCL, కోరమండల్, జిప్సం కంపెనీలు. అవి వదిలే కార్బన్ డయాక్సైడ్ , సల్పర్ డయాక్సైడ్ , ఆర్సెనిక్ , లెడ్ వంటి వాయువులు, ధూళితో గ్రామం నిండిపోయేది . ఆ విషవాయువుల్లో ఉండే టోలిన్ వల్ల పిల్లలుపుట్టకపోవడం, తరచూ అబార్షన్లు అవడం జరుగుతాయి. బెంజీన్ వల్ల బుద్ది మాంద్యం వస్తుంది. పోలిసైకిక్ ప్రొడక్ట్స్ లో కాన్సర్ కారకాలు ఎక్కువ ఉంటాయి. విశాఖపట్నంలో పారిశ్రామిక అభివృద్ధి 1990 నాటికే ఉన్నప్పటికీ 2000 నుండి బాగా పెరిగింది.

“పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ప్రకృతివనరుల విద్వంసం జరుగుతుంది. తద్వారా పర్యావరణ విద్వంసం జరుగుతుంది తత్ఫలితం ప్రజలపై ఆ దుష్ప్రభావాల ప్రభావం ఉంటుంది. రెండింటిని బేరీజు వేసుకున్నప్పుడు అభివృద్ధి కంటే విద్వంసం, విచ్చిన్నం ఎక్కువ అని ఇప్పటి పరిస్తితులను చూస్తే అర్ధం అవుతుంది. అభివృద్ధి ఎవరి కోసం అర్ధమవుతుంది.” – జె.వి. రత్నం, పర్యావరణ ఉద్యమకారుడు, గ్రీన్ క్లైమేట్ పత్రిక ప్రచురణ కర్త , సంపాదకుడు

“ఫ్యాక్టరీ ఉన్నప్పుడు మాకు పిల్లలు పుట్టకుండా అబార్షన్ అయిపోవడం, పుట్టిన వాళ్ళు చనిపోవడం, వికలాంగులవడం, దగ్గు దమ్ము వంటి ఎన్నో రోగాలతో సతమతంయ్యేవాళ్ళం . ఒక పశువులున్దేవి కావు, కోళ్ళున్దేవి కావు. కాలుష్యం వల్ల పిల్లలు చని పోయేవారు. అందరి సంగతీ ఎందుకూ .. నాకు తొమ్మిది అబార్షన్లు. ఆ తర్వాతే బాబు పుట్టాడు. పెద్ద బాబుకి పుట్టుకతోనే జబ్బు. ఆ తర్వాత ఎన్నో మందులు వాడిన తర్వాత పుట్టిన చిన్న బాబు. ఇద్దరూ కొన్నాళ్ళు పెరిగి చనిపోయారు. చూడండి, మీకు ఏ ఇంటికి వెళ్ళినా ఇలాంటి సంఘటనలే కనిపిస్తాయి. చాలా ఇబ్బందులు పడ్డామండి. జింక్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత ఇప్పుడిప్పుడే కొద్దిగా ఊపిరి పిలుస్తున్నామనుకుంటే ఉదుద్ వచ్చి ఊపిరి తీసేసింది”. డ్రాలింగ్ వరలక్ష్మి

విశాఖపట్నం పారిశ్రామిక వాడలలో మా పర్యటన నాకు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్ని మరో కోణంలో చూపింది. ప్రజలకోసం ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో అర్ధమయింది. ముందటి స్థితిని దాటి ముందుకు వెళితే కదా అభివృద్ది ..! ఎవరు ముందుకు వెళ్లారో… తెలిపి అప్పటివరకూ నాకున్న భ్రమల్ని తొలగించింది. మరెన్నో ప్రశ్నలను నా ముందు నిలిపింది .

వి. శాంతి ప్రబోధ
అధ్యక్షురాలు,
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక – తెలంగాణా విభాగం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– See more at: http://vihanga.com/?p=13522#sthash.LFfKvPAR.SH7DFMop.dpuf

కిశోర బాలికల సాధికారత-హింసా నిర్మూలన దినోత్సవం

ప్రపంచం నలుదిశలా ఆడపిల్లలపై జరిగే అన్ని రకాల హింసకి వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని అక్టోబర్ 11 వతేదీ అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ బాన్ కి మూన్ పిలుపు నిచ్చారు.
nss camp 129
ప్రపంచ వ్యాప్తంగా ఆడపిల్లలకి ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటూ వారి హక్కులను సంరక్షించడం కోసం ప్రతి ఏడాది అక్టోబర్ 11 వ తేదీని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకోవాలని డిసెంబర్ 19, 2011 న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 11 వ తేదిన అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

2014 సంవత్సరాన్ని Empowering Adolescent Girls: Ending the Cycle of Violence ( కిశోర బాలికల సాధికారత-హింసా నిర్మూలన) గా జరుపుకోవాలని UNO పిలుపునిచ్చింది. బాలికలు, యువతుల సంరక్షణ, సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన, హక్కుల పరిరక్షణ వంటి అంశాలపట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకోసం అంతర్జాతీయ బాలికా సాధికారదినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది.

కౌమార దశలో ఆడపిల్లలు, యువతులు ఎదుర్కొనే వివిధ రకాల హింసను అంతం చేయాలని , హింసను ఎదుర్కోవడమే కాకుండా, లేకుండా చేయడానికి ఆడపిల్లలు తమ శక్తి సామర్ధ్యాలను గుర్తించాలి. సాధికారిత ప్రాముఖ్యాన్ని గుర్తించాలని అభిప్రాయపడింది . కిశోర బాలిక మహిళగా రూపొందే కీలక దశ కౌమార దశ. ఆమెను వర్తమానంలోనే కాదు భవిష్యత్తులోనూ సాధికరతా దిశలో నడిపించడానికి ఆమెకు అవగాహన అవసరం. ఆమెను చైతన్యం చేయడం అవసరం. అందుకే UNO కొన్ని కార్యక్రమాలు రూపొందించింది.

UNITE TO END VIOLENCE AGAINST WOMEN CAMPAIGN ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా బాలికల పట్ల వివక్ష, అసమానత, చిన్నచూపు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హింస, ఆధిపత్యం వివిధ రకాలగా హాని కలిగిస్తున్నాయి. ఈ ధోరణి సమాజాభివృద్దికి, మహిళా సాధికారతకి అది అవరోధం కలిగిస్తుంది. అందుకే బాల్యవివాహాలని నిరోధించి,హింస నుండి ఆమెను రక్షించడానికి కుటుంబం , మిత్రులు, సమాజం అంతా సన్నద్ధం కావాలి.

కిశోర బాలికలని స్వశక్తివంతులుగా తీర్చి దిద్దడానికి విద్య ప్రధానమైన ఆయుధం. బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమిస్తున్న పాకిస్తానీ బాలిక చొరవ , సాహసం, చైతన్యం ఆమెను నోబెల్ బహుమతి దక్కేలా చేశాయి. విద్యావంతుల కుటుంబంలో, సామాజిక చైతన్యం గల నేపథ్యం నుండి వచ్చిన మలాలా లే కాదు. కొద్ది పాటు చైతన్యం ఇస్తే సామాజికంగా వెనుకబడ్డ, నిరక్షరాస్యుల కుటుంబాల్లోంచి కూడా ఏంటో మంది మలాలాలు ఉద్భవిస్తారు. తమపై జరిగే హింసని , దాడులని తిప్పికోడతారు.

కిశోర బాలికలపై జరిగే హింసని అంతం చేయడానికి, ఆమెని స్వశక్తి వంతురాలిగా చేస్తూ సాదికారితవైపు పయనింప చేయాలంటే అది ఏ ఒక్కరో కాదు చేయాల్సింది. ప్రభుత్వం, పౌర సంస్థలు, ప్రజలు, ప్రభుత్వ-ప్రభుత్వేతర సంస్థలు ఏకం కావాలి. కలసి కట్టుగా ప్రణాళికా బద్దంగా నిబద్దతతో కృషి చేయాలి.

కిశోర బాలికలకి సాంకేతిక, వృత్తి విద్యా అవకాశాలు కల్పించాలి. శిక్షణ ఇవ్వాలి. తన జీవితాన్ని తాను తీర్చి నడిపించుకునేందుకు వృత్తి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, జీవన నైపుణ్యాలు, సామాజిక , ఆర్ధిక , ఆరోగ్యఅంశాలపై అవగాహన కల్పించాలి. శిక్షణలు ఇవ్వాలి.

నేటి ఆడపిల్లలకి తప్పని సరి అవసరమైన భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని సేవల్ని అందుబాటులో ఉంచాలి. సామాజిక, ఆర్ధిక , రాజకీయ పరిస్థితులపట్ల అవగాహన కలిగించాలి.

ఇలాంటి ప్రత్యేక దినోత్సవాల్లో ఏదో ఒక కాంపెయిన్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంటే తప్ప ఆడపిల్లపట్ల తరతరాలుగా నిండి ఉన్న భావనలు సమూలంగా పోవు.

.

ఆదిలాబాదు అడవుల్లో ..గోండు గూడేలలో ..

నేను పుట్టింది వరంగల్ జిల్లలో అయినా పెరిగిందంతా ఆదిలాబాదు జిల్లా మంచిర్యాల సమీపంలోని బుద్దిపల్లిలో. మా పెద్దమ్మలు, మామయ్య వాళ్ళ ఊరు దండేపల్లి మండలంలోని తానిమడుగు వెళ్ళినప్పుడల్లా గోండులు, నాయకపోడ్, లంబాడా గిరిజనులను చూస్తూనే ఎదిగాను. అలా నడుచుకుంటూ గుట్టల కేసి సాగిపోయే వారిని గొండులు అంటారని అప్పుడే తెలిసింది. జాకెట్ వేసుకోకుండా చీర కొంగునే వక్షస్థలంపై చుట్టుకునే వారిని వింతగా చూసేదాన్ని. వారి ఆహార్యం భిన్నంగా ఉండడం నన్ను ఆకట్టుకునేది. వాళ్ళు ముక్కుకి, చెవులకి పెట్టుకునే పెద్ద పెద్ద ఇత్తడి చెవి పోగులు, జాకెట్టు వేసుకోని చీరకట్టు, వెడల్పాటి పెదాలతో, చప్పిడి ముక్కుతో, చిన్నకళ్ళు , గుండ్రటి మొహం, నలుపు చాయతో ఉండే వారి ముఖ కవళికలు నాకు గుర్తు. వారి గూడేనికి వెళ్ళింది లేదు. ఒకసారి వెళదామని మా అన్నవాళ్ళని అడిగితే వాళ్ళ గూడేనికా .. అని, దాదాపు పది కిలోమీటర్లు నడవాలి. కనిపించే గుట్టలు ఎక్కి దిగాలి. వెళ్తే అక్కడ పదిహేనో ఇరవయ్యో కుటుంబాలు ఉంటాయి అంతే. దట్టమైన అడవిలో నువ్వు నడవగలవా .. గుట్టలెక్క గలవా అంటూ నా ఉత్సాహాన్ని నీరసపరిచాడు. అంతే మరింకేప్పుడూ ఆ ఆలోచన చెయ్యలేదు. కానీ ఆ కోరిక చావలేదని ఇప్పుడే తెలిసింది. ఇదిగో ఇప్పుడు అనుకోకుండా …
133
మా ప్రశాంతిగారు (స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమతా సొసైటీ) 18వ తేదీ సాయంత్రం ఫోన్ చేసి, 22 వతేదీ సాయంత్రం దాదాపు 25 మంది రచయిత్రులు సమతానిలయానికి వస్తారని వారి ట్రిప్ గురించి చెప్పినప్పుడు నాకు తెలియకుండానే అనాలోచితంగా అడిగేశా. నేనూ రావచ్చా అని. వెంటనే ప్రశాంతి తప్పకుండా రావచ్చు అన్నారు. సత్యవతి గారు కూడా ఆనందంగా ఆహ్వానించారు. ఏదైనా నా కోసం అడగాలంటే మోహమాటపడే నేను ఎలా అడిగానా అని నాకే ఆశ్చర్యం వేసింది ఆ తర్వాత ఆలోచిస్తుంటే…

గోండుగూడెంకు వెళ్లబోతున్నానన్న ఆనందం నన్ను నిలువనీయ లేదు. అయితే వచ్చే 25 మందిలో నాకు తెలిసిన వాళ్ళు ఉంటారో.. ఉండరో .. అన్న సందేహం. ప్రశాంతి, సత్యవతి గార్లు ఉంటారు కదా, వారితో పాటు అమృతలత గారి బృందం ఉంటుంది కదా అని సర్దిచెప్పుకున్నా.. ఇలాంటి ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మనసులోని భావాలు కలబోసుకోవడానికి ప్రియ మిత్రులు లేదా నా తరహాలో ఆలోచించే వాళ్ళతో కలసినట్లుగా కొత్తవాళ్ళతో కలవలేనేమోనన్న మీమాంస ఒకవైపు ఉన్నప్పటికీ, అనుకోకుండా వచ్చిన ఈ అవకాశం వదులుకోకూడదనుకుంటున్న సమయంలో అమృతలత గారి నుండి ఫోన్ సాయంత్రం 6 గంటల వరకూ నిజామాబాద్ వచ్చేయ్యమని. ప్రోగ్రాం షీట్ తో పాటు పార్టిసిపెంట్స్ లిస్టు పంపారు. ఆవిడ ప్లాన్ చేసిన షీట్ చూడగానే అమ్మ హేమలతాలవణం గుర్తోచ్చారు. ప్రతిదీ ఒక పద్దతిగా చక్కటి ప్రణాళికతో చేయడం, ఎంత చిన్న విషయాన్నైనా వదలకుండా పర్యవేక్షించడం హేమలతగారి తర్వాత అమృతలత గారినే చూశాను. అందుకే ఆ నిర్వహణా సామర్ద్యమే విజయాసంస్థలు ఊడల మర్రిలా విస్తరించడానికి కారణమై ఉంటుందనిపించింది.

*** **** ****
మధురమైన అనుభూతుల్ని, అనుభవాల్నిమదిలో పదిల పరుచుకున్నాను.

ట్రాక్టర్ పై మా ప్రయాణం గులకరాళ్ళు, బండరాళ్ళతో కూడిన పాములా మెలికలు తిరిగిన బాటలో గుట్టలు, వాగులు వంకలు పెద్ద పెద్ద చెట్లు దాటుతూ సాగింది. విప్ప, నల్ల మద్ది, తెల్లమద్ది, టేకు, మోదుగ, తునికి, కుంకుడు, ఉసిరి, దిరిశెన, జువ్వి, మామిడి, ఈరికి వంటి ఎన్నో మొక్కలు, చెట్లు, వృక్షాలు .. ఈరికి చెట్టు చూడగానే మా పొలాన్ని వోరుసుకుంటూ పారే ఒర్రే, అది దాటగానే ఉండే ఈరికి చెట్టు, ఆ చెట్టెక్కి మేం కోసుకు తిన్న ఈరికి పళ్ళు గుర్తొచ్చాయి. కాస్త జిగురు జిగురు గా ఉండే ఆ పళ్ళు కోసం మేం పోట్లాడుకున్న క్షణాలు, అవి తింటూ చెట్లపై గెంతే కోతులకు మేం పోటీ అయ్యామని మమ్మల్ని గుర్రుగా బెదిరిస్తూ చూడడం .. మా వెంట మా బూంటి (పెంపుడు కుక్క) లేకపోతే అవి మాపై పడి కసి తీర్చుకునేవే.. మా పొలం వెనక ఉన్న వాగుల్లో వోర్రెల్లో ఈత కొట్టడం, ఆ నీళ్ళలో తిరిగే బుల్లి బుల్లి చేప పిల్లల్ని దోసిట్లోకి పట్టుకోవడాని చేసే ప్రయత్నాలూ .. చెలిమెలు తీసి ఆకులతో చేసిన దోప్పలతోనో , దోసిట తోనో నీళ్ళు తాగడం వంటి జ్ఞాపకాలు నన్ను ముసిరివేస్తుండగా… మాటలు.. పాటలు .. కలబోసుకుంటూ.. ఒక్కోరకం చెట్టు చూస్తూ దాని గురించి చెప్పుకుంటూ విప్పచెట్టుకోసం కళ్ళతో అన్వేషిస్తూ.. రక రకాల ఆకులు గమనిస్తూ .. ఆకాశంకేసి చూసే చెట్ల కొమ్మలు ఆకుల మధ్యనుండి తొంగి చూసే ఆకాశాన్ని, ఆకారాలు మార్చుకుంటూ సాగే మబ్బు తునకల్ని .. అడవి మల్లెలు వాసనల్ని ఆస్వాదిస్తూ .. ఆ వృక్షాల మధ్య కన్పించిన బాదం చెట్టు చూసి ఆశ్చర్య పోతూ .. . అంత్యాక్షరి ఆడుతూ వెళ్తోంటే మధ్యలో పత్తి , గోధుమ, శనగ, పైర్లు గమనిస్తూ .. ఖానాపూర్ మండలంలోని బుర్కరేగడి చేరాం .. అంతా తమతమ పనులు ఆపి మమ్మల్ని వింతగా, చిత్రంగా చూస్తూ .. ఏ పల్లెకు వెళ్ళినా ముందుగా పలకరించే కల్లు దుకాణం కాకుండా, పిల్లలూ-పెద్దలూ .. గోవులూ .. మేకలు .. మాకు ఆహ్వానం పలుకుతూ .
128
ఒకే ఒకవీధి . మా పెద్దమ్మ వాళ్ళ ఊరు తానిమడుగులాగే . ఆ వీధికి అటూ ఇటూ ఇళ్ళు. అన్నీ తూర్పుకు నడిచే విధంగా .. ఆ ఇళ్ళ ముందు నాగలి, గొర్రు, ఎడ్ల బండి, బండి చక్రాలు. వాటిని చూస్తుంటే నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఎప్పుడో కోల్పోయినవాటిని పొందిన భావన.
ఇంటి ముందున్న దడికి కాసి ఎండిపోతున్న చిక్కుడు కాయలు, 8 ఆకారంలో ఉన్న సోరకాయలు .. కొత్తలు పండుగ చేసుకునే వరకూ వాళ్ళు వాటిని కోయరట ! తినరట !!
137

ఇళ్లన్నీ దగ్గర దగ్గరగా .. 58 కుటుంబాలు. ఎక్కువగా కూన, రేకుల ఇళ్లే. ఒకే ఒక గది.ఇటుక గోడలతో పాటు , టేకువంటి కర్రల్ని గోడలకి వాడడం చుస్తే వాటి విలువ తెలియదనిపించింది. ఒక్క గదిలోనే కుటుంబమంతా. ఒకప్పుడు అన్నీ గుడిసెలే ఉండేవట. ఊళ్ళో విద్యుత్ సౌకర్యం ఉంది. ఊరంతా కలసి విద్యుత్ లైన్ వేసుకున్నారట. ఎవరికీ మీటర్లు లేవు. ఎప్పుడో ఒకసారి ఆరోగ్యకార్యకర్త చుట్టం చూపుగా వస్తుండట. రావాలన్నా కష్టమేగా ..! ఎవరికి ఏ సమస్య వచ్చినా 10 కి. మీ . నడచి మొండి గుట్ట వస్తే అక్కడినుండి నిర్మల్ వెళ్ళవచ్చు . లేవలేని పరిస్థితిలో ఉన్నవారిని రెండు కర్రలపై (పాడె కట్టినట్లుగా కట్టి ) వారిని మోసుకు పోతారట. ప్రాథమిక పాటశాల ఉంది. పంతులు రోజూ కాకపోయినా వస్తాడట.

గూడెంలో కల్లు తాగే అలవాటు కొద్దిమందికి మాత్రమే ఉందట. తాగాలనుకునే వారు 8కి. మీ . దూరంలోని మరో గ్ర్రామం నుండి తెచ్చుకు తాగుతారట. చాలామంది యువకులు పొగ తాగుతారు. ఒకరు మాత్రం నిర్మల్ లో ఇంటర్ చదువుతున్నాడు. అది చదవడమే వాళ్లకి ఎక్కువ అనుకుంటారు. ఆడ పిల్లలు ఎవరూ హై స్కూల్ చదువుకోలేదు. నెలసరి దినాల్లోనూ, పురుడు ఆతర్వాత కొన్ని రోజులూ ఇంట్లోకి రానివ్వరట. దూరంగా ఒక గుడిసెలో ఉంటారట. నేను అలా గోండి మహిళలతో ముచ్చట్లాడుతుండగానే డప్పు శబ్దం. అక్కడున్న అందరినీ ఆకట్టుకుంటూ .. అటుకేసి నాలుగడుగులేస్తే ఒళ్లంతా నలుపురంగు పులుముకొని విచిత్ర వేషధారణలో నలుగురు యువకులు . 142వారి తలలపై నెమలి పించాల్తో చేసిన గుస్సాడి కిరీటం/పాగా , దానిపై కొమ్ములు ఆ రెండు కొమ్ముల మధ్య రెండు అద్దాలు, ఎడమ భుజం పై జింక తోలు, మెడలో గవ్వలు , తుంగ గడ్డల పూసలతో చేసిన హారాలు, నడుముకు లంగాలాంటి వస్త్రం, దానిపై ఒక గంట, మణికట్టుకు మువ్వలు , గంటలు కట్టుకొని, కాళ్ళకి గజ్జెలు ధరించారు. చేతిలో చిన్న రోకలి నలుపు రంగు పులుముకున్న మొహంపై కళ్ళ దగ్గర చారికల్లా చర్మం తొంగిచుస్తూ ..కృత్రిమ గడ్డాలు, మీసాలూ, చేతిలో కర్ర పట్టుకుని డప్పు వాయిద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ … గుస్సాడి నృత్యం చేస్తూ .. మొదట మెల్లగా ప్రారంభమైన వాద్య శబ్దం రాను రానూ పదవిన్యాసంతో పాటు ఉధృతమవుతూ.. 141మా అందరిలో ఉత్తేజం కలిగిస్తూ .. అందరినీ ఆ నృత్యంలోకి రా రమ్మని ఆహ్వానిస్తూ .. నాగరిక సమాజానికి దూరంగా వీరు వేసే దరువు కొండా కోనల్లో మారుమోగుతూ … గోండుల సంస్కృతిలో మమ్మల్ని భాగం చేస్తూ .. మహిళలూ నృత్యగానాలు మొదలు పెట్టారు.. 147మా బృంద సభ్యులూ జత కలిసి స్టెప్పు లేశారు.

రాజగోండులకు పెద్ద పండుగ దీపావళి అట. దీపావళికి ముందు వచ్చే పున్నమి నుండి నరక చతుర్దశి వరకూ గోండులు ఆటపాటలతో కాలాక్షేపం చేస్తారట. దీన్ని ‘దండారి ‘ పండగ అంటారట. గుస్సాడి నృత్యం చేసేవారిని దేవతలు ఆవహిస్తారని వారి నమ్మకం. చాలా నిష్టగా ఉండి గుస్సాడి నృత్య సాంప్రదాయిక వస్త్ర ధారణ చేస్తారట. నృత్యకారుడి చేతిలో ఉండే రోకలి లాంటి కర్రను తాకితే జబ్బులు రావని, వచ్చినా నయమవుతాయని వారి నమ్మకం. ఈ పండుగను తమ గ్రామంలో జరుపుకోవడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో సంబంధాలు పెంచుకుంటూ దండారి బృందమంతా మరో గ్రామానికి అతిథులుగా వెళ్తారు. వారికి పొరుగూరు వారు అతిథి మర్యాదలతో స్వాగతం పలుకుతారు. అక్కడ వారి ఆట పాటా ప్రదర్శిస్తారు. తమ గూడేలు , వ్యవసాయ భూములు , తమ కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుతూ ఈ పండుగను జరుపుకుంటామని నారాయణ చెప్పారు. ఇలా చుట్టుపక్కల వారితో స్నేహ సంబంధాల్ని పెంచుకుంటూ, ఆనందాన్ని పంచుకుంటూ విందు వినోదాలతో కాలక్షేపం చేయడం వారికేంతో ఇష్టమట.

మాములుగా తమ పండుగ సమయాల్లో, జాతరలు, ఉత్సవాల సమయాల్లో మాత్రమే గుస్సాడి నృత్యం చేసే వీరు మాకోసం చేయడం మాకిస్తున్న గౌరవంగా భావించాం. వారి ఆత్మీయత, స్నేహభావం చూస్తే ముచ్చటేసింది.

*** **** ****

ఝోడేఘాట్ వెళ్తున్నామన్న ఉద్విగ్నత మనసులో .. అల్లంరాజయ్య, సాహు లు రాసిన కొమురం భీం నవలలో అతని గురించి చదివి ఉండడంతో. ఆనాటి నిజాం ప్రభుత్వం గిరిజనుల పంటల్ని దోచుకు పోతుంటే, మేకలను గొర్రెలను ఎత్తుకు పోతుంటే ఎదురు తిరిగిన వాళ్ళని చిత్రహింసలకి గురిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ, గూడేలను తగలబెడుతుంటే సహించలేక తిరగుబాటు చేసశాడు కొమురం భీం. కొందరు ద్రోహుల వల్ల శత్రువుల చేత చిక్కి ఝోడేఘాట్ లో ప్రాణాలు అర్పించిన అమరుడి తలపులతో సాగింది ప్రయాణం .. జల్, జంగిల్, జమీన్ పై హక్కు కోసం రక్తం చిందించిన కొమురం భీం తో పాటు మరో 11 మంది గోండు వీరులను తనలో ఇముడ్చుకున్న ఆ నేలపై అడుగుపెట్టడం .. వారి అమరత్వానికి చిహ్నంగా వెలసిన స్తూపం.. మాలో తెలియని స్పూర్తిని నింపింది.
156

157
గొండి, తెలుగు, మరాఠి, హిందీ భాషా పదాలు మిళితమై కనిపిస్తాయి వారి మాటల్లో. గొండులతో పాటు కొలామ్, ప్రదాన్(పర్ధాన్), ఓజ, తోటి వంటి గిరిజన తెగలు అక్కడ ఉన్నాయి. కొలామి భాష గురించి ద్రావిడ భాషల గురించి చదివినప్పుడు విని ఉన్నాను. అతి కొద్ది మంది మాత్రమే ఆ భాష మాట్లాడేవారు మిగిలి ఉన్నారని వారు మన రాష్ట్రంలో ఆదిలాబాదు జిల్లాలోను, ఉత్తర భారత్ ఒకదగ్గర మాత్రమే కొలామి భాష మాట్లాడేవారు ఉన్నారన్న విషయం గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు ఆ కొలామి తెగవారు తెలుగు , గోండి భాషలు మాట్లాడడంతో కొలామి భాష అంతరించిపోతున్న జాబితాలో చేరింది.

పర్ధాన్ వాళ్ళే ఈ ప్రదాన్ లు అని సాకృబాయి చెప్పినప్పుడు మా బుద్దిపల్లిలో ఉండే పర్దాన్ వాళ్ళు గుర్తోచ్చారు. పర్దాన్ లు , కోలాములు గోండులకన్నా తక్కువ స్థాయి వారట!.

ఒకప్పుడు స్వతంత్రంగా రాజ్యాలేలిన గోండులు … వారికి చెందిన కోటలు ఇప్పటికీ శిథిలావస్థలో ఆదిలాబాదు జిల్లాలో కనిపిస్తాయని గుర్తొచ్చి ప్రస్తుత వీరి జీవనాన్ని చూసి మనసు మూగదయింది. దాదాపు 500 ఏళ్ళు పాలించిన రాజగోండులు అంతరించి మరట్వాడా రాజులు చేతిలోకి అటునుండి నిజాం చేతిలోకి వాళ్ళ రాజ్యం పోవడంతో వారు చెల్లాచెదురు అయి ఉంటారేమో ..
ఇప్పటికీ పెళ్ళిళ్ళు , పండుగలు -పబ్బాలూ , ఇతర సాంప్రదాయక వ్యవహారాలు మాత్రం తమదైన ప్రత్యెక పద్దతుల్లోనే జరుపుకోవడం విశేషం.

విస్తారమైన అడవి వున్న ఆదిలాబాదు అడవుల్లో పోడు వ్యవసాయం చేసి సాంప్రదాయక పంటలైన జొన్న, సజ్జ, కొరలు, కంది, పెసర, ఆముదాలు, నువ్వులు, కుసుమలు వంటి వర్షాధార పంటలు పండించే వీరి భూములపై మైదాన ప్రాంతాల వాళ్ళ కళ్ళు పడి భూమి వారి చేతుల్లోకి బదిలీ అవడం , రిజర్వ్ ఫారెస్ట్ విధానాలు వీరిని తామున్న అడవి నుండి వెళ్లగోట్టాయని, ప్రభుత్వ అటవీ చట్టాలు కూడా అడవి బిడ్డల బతుకు దుర్భరం చేస్తున్నాయని బుర్కరేగడిలో వారి నాయకుడు చెప్పినప్పుడు బలవంతమైన సర్పం చలి చీమల చేత చిక్కి చావదా అన్న ఆలోచన ..

గోండు భాషలో కొన్ని పుస్తకాలు లభ్యమయ్యాయని అయితే అవి చదవడం తెలిసిన వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారని ఎక్కడో జయధిర్ తిరుమలరావు గారి వ్యాసం చదివి ఉన్నా. గొండి భాషలో పుస్తకాలని విడుదల చేస్తున్నారని సాక్రుబాయి ద్వారా విన్నప్పుడు కలిగిన సంతోషంతో అంతరించి పోతున్న భాషని కాపాడిన భాషభిమానులకు మనసులోనే అభినందనలు తెలుపుకున్నా.

మైదాన ప్రాంతాల వారి ప్రభావంతో, పురుగు మందుల కంపెనీల మాటల హోరుతో పత్తి పంట వేసి ఎంత నష్టపోతున్నది వారు తెలుసుకోలేకపోతున్నారని కెరెమెరి మండలంలోని ఝరి గ్రామానికి వెళ్ళినప్పుడు పదవీ విరమణ చేసిన వ్యవసాయదికారి రాజయ్య ఆవేదన అక్కడి చెలకలను చేలను చూసినప్పుడు అర్ధమయింది. జీవవైవిధ్యం మాట్లాడుతూ ఇట్లాగే ఇబ్బడి ముబ్బడిగా ఎరువులు, పురుగు మందులు వాడుతూ పొతే మరో నలబై యాబై ఏళ్లలో భూమి చచ్చిపోతుంది. అందుకే మనిషిని, భూమిని కాపాడేపనిలో ఉన్నామని చెప్పినప్పుడు ఒళ్ళు పులకరించింది. సాంప్రదాయిక జొన్న, మచ్చ కంది వంటి విత్తనాలను ఊరు ఊరు తిరిగి సేకరిస్తూ, సేద్యం చేస్తూ ఆ పంటలను ఎక్కువమొత్తంలో పండించడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి శిరస్సు వంచి నమస్కరించాలనిపించింది.

కుసుమల్తో చేసిన కారప్పొడి, మక్క గట్క జీవితంలో మొదటిసారి రుచి చూసాను. ప్రకృతి ఒడిలో పెరిగే వారు పండించే పంటలు, వారు తీసుకునే ఆహారపు అలవాట్లు నాగరిక ప్రపంచంలో మనం తీసుకునే ఆహారపు అలవాట్ల కంటే చాలా ఆరొగ్యకరమైనవి. అయితే, మూడు పూటలా ముద్ద దొరకడమే వారికి గగనం.. అందుకేనేమో అక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా లావుగా కనిపించలేదు. వారు తినే ఆ కొద్ది తిండి వారి నడకకే సరిపోదేమో .. పత్తి, కంది తదితర పంటలకు వేసే పురుగుమందులు, రసాయన ఎరువులు కొండ వాలులో పారే వోర్రెల్ని , వంకల్ని కలుషితం చేయడం , ఆ నీటినే ఈ అడవిబిడ్డలు తాగడం వల్ల గతంలో వచ్చే మలేరియా , టైఫాయిడ్, డయేరియా వంటి జబ్బులే కాకుండా ఇతర ప్రాణాంతక జబ్బులు కూడా వచ్చి ప్రాణాలు కోల్పోవడం పెరిగిపోతోందట. వేసవిలో గుక్కెడు నీటికోసం కటకటలాడే వారి బతుకు చిత్రం గురించి విని మనసు ఆవిరయింది.
153
కొత్త పాత లేకుండా అంతా కలసి పోవడం, ఎవరికీ తెలిసిన విషయాలు వారు పక్క వారితో పంచుకోవడం, అమృతలత గారి ఆత్మీయ ఆతిధ్యం, వారి బృంద ప్రదర్శనలు, మొండిగుట్టలో కల్పన గారి కుటుంబం చూపిన ఆప్యాయత, ఏర్పాట్లు, పొచ్చెర జలపాతం లో జలకాలాటలు, కుంటాల అందాలు, ఘాట్ రోడ్ లో కెరిమెరి వైపు సాగిన ప్రయాణం, ఓజ కళాకారుల అద్భుతమైన పనితనం అన్నీ మా మనసులో ముద్రించుకుని సమతానిలయానికి ప్రయాణమయ్యాం.

రెండు రోజులు మరో కొత్త లోకంలో విహరించి రావడానికి ఎంతో శ్రమకోర్చి ఏర్పాట్లు చేసి, ఎవరికీ ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకున్న అమృతలత, ప్రశాంతి, సత్యవతి గార్లకు కృతజ్ఞతలు.

వి. శాంతిప్రబోధ

published in Bhumika magazine in March-April 2014

నాడు -నేడు

నాడు
ఆ అంటే అమ్మ
ఆ అంటే ఆవు
ఇ అంటే ఇల్లు

నేడు
అ అంటే అమెరికా
ఆ అంటే ఆస్త్రేలియా
ఇ అంటే ఇంగ్లాండు

Tag Cloud

%d bloggers like this: