The greatest WordPress.com site in all the land!

Archive for June, 2014

యుద్దభూమి

గడియారం ముల్లుతో
పరుగులు పెట్టే నేను
సమయంలేని పనిగంటల్ని
లెక్కచేయక ఊరు వాడా తిరిగా
ఫలితం
కుటుంబంలో గాలిదుమారం
కట్టుకున్నవాడు దూరం
బరువు బాధ్యతల భారం
కన్నబిడ్డలతో ఒంటరి జీవితం
నాలాంటి ఎందరికో ధైర్యమిచ్చిన నేను
ఒడ్డునపడ్డ చేప పిల్లలా గిలగిలలాడా
నన్ను నేను ఒదార్చుకున్నా
పిల్లల కోసం గుండె దిటవు చేసుకున్నా
నా పని నేను చేస్తూనే
డేగ చూపులతో నక్క జిత్తులతో
వెంటాడే వేటాడే మృగాళ్ళ
దాడి నుండి తప్పించుకుంటూ
పెంట కుప్పల్లో, గడ్డి వాముల్లో దాగి
నన్ను నేను కాపాడుకుంటూ …
నా పిల్లల కోసం కలలు గంటూ
నా లాంటి అభాగినులకు చేయూత నిస్తూ
వారిని స్వశక్తివంతులుగా చేస్తూ
వారిలో ఆలోచనలు రగిలిస్తూ
నా జవసత్వాలు ధారపోస్తూ
సాగుతున్న సమయంలో
కమ్ముకొచ్చిన కారుమేఘాలు
సునామీలా దుసుకోస్తూ
కట్టుకున్న కలల మేడల్ని కూలదోస్తూ
ఆశలని ఆవిరి చేస్తూ
భవిష్యత్ ని ప్రశ్నగా మిగిలిస్తూ
మా కార్యక్రమాలు ఫేజ్ అవుట్ వార్త
దావానలంలా ఎగిసిపడే ప్రశ్నలు
ఇన్నాళ్ళ నా సేవలకి , అంకిత భావానికి
రెక్కల కష్టానికి
వయసు వాలుతున్న సమయంలో
నా కన్నతల్లి అనుకున్న సంస్థ
ఇచ్చిన రిట్రెంచ్మెంట్ బహుమానం
కుప్పకూలిన కుటుంబం
రెక్కలుడిగిన భవితవ్యం !!

సిద్దం కావాలి …
మళ్ళీ నన్ను నేను, .. సిద్దం చేసుకోవాలి
కుంగిన మనసును యుద్దభుమిలా మార్చి
జీవన పోరాటం చేయడానికి

వి. శాంతి ప్రబోధ

(జులై ఎంప్లాయీస్ వాయిస్ లో ప్రచురణ అయింది)

నీవు లేని లోకం కోసం, నేను ..

ఏ పాపం ఎరగని నాలోకి ఎలా చొచ్చు కోచ్చావో తెలియదు
ఎప్పుడొచ్చి తిష్ట వేశావో అర్ధంకాదు
నీవు నన్నుదహించి వేయడం మొదలు పెట్టాకే గుర్తించా
నాకేదో అయిందని ..

కానీ, అంతలోనే దిగ్బ్రాంతి గొల్పుతూ నీ ఉనికి
నమ్మ లేక పోయా .. అసలు నమ్మ లేక పోయా
నేనేమిటి .. నాలో నీవు ఉండడమేమిటి ?
నా కణాలను నీవు మింగేయడమేమిటి?
ఏ పాపం ఎరగని నాలో సి. డి. కౌంట్ తగ్గడమేమిటి?

ఇదంతా అబద్దం కదూ ..!కాదా.. అయితే ఇదెలా సాధ్యం ?
ఎక్కడో ఏదో తేడా.. అంతా అగమ్యగోచరం
ఎలా? ఎవరినడుగను ? ఏమని అడుగను ?
బిడ్డ పుడుతందన్న ఆనందం ఆవిరై
బతుకు బజారుపాలై.. క్షణమొక యుగమై

నిజం కాదని ఎవరైనా చెప్తారేమోనని ఆశతో రక్త పరీక్షలు మళ్లీ మళ్లీ ,
ఎలిసా టెస్టులు, ఎ అర్ టి కేంద్రంలో సి. డి. 4 పరీక్షలు
అంతా కూడబలుక్కున్నట్టు ఓకే మాట
ఇదెలా సాధ్యం? నమ్మలేక కట్టుకున్న వాడిని నిలదీశా
మౌనమే సమాధానం .. అప్పుడు దొరికింది నా సమస్యకి మూలం

రోజు రోజుకి కుంగి క్రుశించిపోతున్న శరీరం
ఆపై వేసిన నిందలు, ముద్రలు, వివక్ష మనసుని దహించేస్తూ
కన్నీరు మున్నీరై ఏరులై పారి చెరువులై పొంగిపోతూ
చెల్లని రూపాయి లాటి ఈ జీవితం ఎందుకు? అంతం చేసుకుంటే…
అంతలోనే నాలో ఓ ప్రశ్నతారాజువ్వలా ఉవ్వెత్తున లేచి నిలదీస్తూ
అంతం కావాల్సింది నేను కాదు నీవని నొక్కి చెప్తూ…

అప్పుడే, నిశ్చయించుకున్నానిన్ను తరిమేయాలని
తెలుసు నా నుండి పూర్తిగా పారదోలలేనని
ఆ శక్తి నాకింక రాకపోవచ్చు , అనీ
ఆడ్డుకుంటా.. నీతో పాటు నా శరీరంపై దాడిచేసే అవకాశవాద శక్తుల్ని, వ్యాధుల్ని

క్రమం తప్పకుండా తీసుకుంటా పోషకాహారం, తగిన మందుల్ని
ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొటానికి ఉపయోగించుకుంటా ప్రతి క్షణాన్ని
నా బతికే హక్కును అనుభవిస్తూ, పోడిగిస్తా జీవితకాలాన్ని
నియంత్రిస్తా నా అంతం కోసం నీవు చేసే అన్ని యత్నాలని
నేను అవగాహన పెంచుకుంటూ, నా వారిలో పెంచుతూ, దూరం చేస్తా అపోహల్ని

ఆహ్హ హ్హ .. అహ్హహ్హ .. అంటూ ఏమిటా వికటాట్టహాసం చాలించు ..
నాలో రగిలే జ్వాలలు సాగనీయవు నీ ఆటలు
ఇక ఉండవు నీకు భయపడి ఆత్మహత్యలు, అనాలోచిత చర్యలు
ఇన్నాళ్ళూ తెలియని తనంతో నిన్ను తన్ని తగలెయ్యక నా వాళ్ళని వెలివేశారు

కరచాలనం తోనో, దోమకాటుతోనో, నీవు మా దరి చేరలేవు
అరక్షిత లైంగిక కార్యం వల్లో, కలుషిత సూదులు, సిరంజిల ద్వారానో వ్యాపించే నిన్ను
అడ్డుకుంటా, కౌమార కుసుమాలను జీవన నైపుణ్యాలు అందిస్తూ
నీవు నా వారికేసి కన్నెత్తి జూడకుండా విచక్షణా జ్ఞానంతో నిగ్రహంతో మెలిగేలా తీర్చిదిద్దుతా
రెడ్ రిబ్బన్ క్లబ్బులు, చైతన్య కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తూ

డబుల్ రేషన్, ఉచిత ఆరోగ్య పరిక్షలు, పి.పి టి సెంటర్లు, ఎ.ఆర్.టి సెంటర్లు, మందులు
ఎన్నెన్నో అవకాశాలు నేను నిలదొక్కుకోవడానికి
ఇప్పుడు నాకుతెలుసు నీవు నాలోనే ఉన్నా ఆరోగ్యకరమైన బిడ్డని కనగలనని
పి.పి టి.సి. టి పరిక్షలు, నేవరపిన్ మాత్రలు నాకు నా బిడ్డకు రక్షాకవచాలని

డ్రాప్ ఇన్ సెంటర్లలో మేమంతా కూడి మా సమస్యల్ని పరిష్కరించుకుంటాం
సమాచారాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకుంటాం ప్రచారం చేస్తాం
నీ జాడలున్న రక్తాన్ని, వీర్యాన్ని దానం చేయొద్దంటాం
నీవు ఆరోగ్య సమస్యవే కాదు అభివృద్ధి సమస్యవు కూడానని తెలియజేస్తాం

నీవు అణువుగా నాలో చేరి నన్ను ఆక్రమించేసి నీ వశం చేసుకున్నట్లే
నేను నా సైన్యాన్ని తయారు చేసి నిన్ను నా వశం చేసుకుంటా
నా సంకల్ప బలంతో నీ సంక్రమణ తగ్గించేస్తా
నా లక్ష్య సాధనలో చేయి చేయి కలుపుకుంటూ సాగిపోతూనే ఉంటా ..
గమ్యానికి చేరువవుతూనే ఉంటా

వి. శాంతి ప్రబోధ

(HIV/AIDS పై ప్రచురించిన చిగురంత ఆశ పుస్తకంలో చోటు చేసుకోవడమే కాక ఉత్తమ కవితల్లో ఒకటిగా ప్రశంసలు అందుకున్న కవిత )

Tag Cloud

%d bloggers like this: