The greatest WordPress.com site in all the land!

Archive for the ‘vyasam’ Category

మహిళల పరిశుభ్రతా.. ? మత చిహ్నాలా.. ?  వేటికి మీ ప్రాధాన్యత ???

దేశ వ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంటోంది. వివిధ వర్గాల మహిళలు తమ గొంతు విప్పుతున్నారు . కారణం భారత ప్రభుత్వం సానిటరీ నాప్కిన్స్ పై 12 % జీఎస్టీ విధించడమే .
అసలు భారత ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటి ? ఏ ప్రాధాన్యతా క్రమంలో వస్తువులపై గూడ్స్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ ) నిర్ణయించి విధించింది ? ఎన్నెన్నో ప్రశ్నలు . మరెన్నో సందేహాలూ .. ఇప్పుడందరి నోటా జీఎస్టీ గురించే ..

స్వతంత్రం వచ్చాక పన్ను విధానంలో ఇదే పెద్ద సంస్కరణ అంటున్నారు . కావచ్చు అది ప్రజలకు, ప్రభుత్వానికి ఏ విధంగా మేలు చేస్తుందో చర్చించడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు నేను తడిమే విషయం సానిటరీ నాప్కిన్స్ పై 12% జీఎస్టీ గురించి మాత్రమే .

ఒక ఆడపిల్ల ఋతుమతి కావడం , తల్లి కావడం ఆమె శరీర సహజ ధర్మం. ఆ రుతుక్రమం మహిళల ఛాయస్ కాదు . ఆమెకు ఇష్టం ఉన్నా లేకున్నా నెలలో3- 5 రోజులు, దాదాపు 39 ఏళ్ళు రక్తం స్రవిస్తూనే ఉంటుంది . అంటే ప్రతినెలా మహిళలకు అవసరమైన వస్తువు సానిటరీ నాప్కిన్స్ . ఇది లక్సరీ ఎంతమాత్రం కాదు . కంపల్సరీ . ఆ అవసరాన్ని గుర్తించకుండా 355 మిలియన్ల మహిళల రుతు ధర్మంపైన పన్ను వేస్తున్నామన్న సోయేలేదు ఈ పాలసీ మేకర్స్ కి . .

ఇప్పటికీ ఋతుధర్మం పట్ల ప్రజల్లో ఎన్నో మూఢ నమ్మకాలు, అపోహలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. దాన్ని శరీర సహజ ప్రక్రియగా కాకుండా మైల , ముట్టు అంటూ దూరంగా ఉంచుతారు . ఆ సమయంలో తీసుకోవాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత గురించిన జ్ఞానమూ తక్కువే . AC నీల్సన్ అధ్యయనం ప్రకారం ఇప్పటికి 88% మహిళలు అరక్షిత విధానాల్లోనే ఉన్నారు , సరిగ్గా ఉతకని బట్ట , బూడిద , మట్టి , ఇసుక , చెక్క పొట్టు వంటివి వాడడం వల్ల 70% మంది పునరుత్పత్తి అవయవాల ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారు . సరైన రుతుక్రమ రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కౌమార బాలికలు ఆ 5 రోజులూ బడికి దూరం అవుతున్నారు . ఈ విధంగా ఏడాదిలో 50రోజులు కోల్పోతున్నారు .
యునెస్కో స్టడీ ప్రకారం 20 % ఆడపిల్లలు పుష్పవతి అయిన తర్వాత బడి మానేస్తున్నారు . బడిలో సరైన వసతులు కరవు కావడం వాళ్ళ గ్రామీణప్రాంత బాలికలు ఆ 5 రోజులూ బడికి దూరంగా ఉంటున్నారు .

దేశంలో 70% మహిళలు సానిటరీ నాప్కిన్స్ కొనే స్థోమతలో లేరు. ఆ క్రమంలో ఇప్పటికీ చాలామంది మహిళలు పాత బట్టతో చేసిన పాడ్స్ వాడడం తెలిసిందే . .. పోలియెస్టర్ వంటి సింథటిక్ పాత బట్టతో చేసిన పాడ్స్ వాడడం వల్ల ఆ ప్రాంతంలో వచ్చే సమస్యలు ఫంగల్ ఇన్ఫెక్షన్లు ..తక్కువేమి కాదు . ఒకవేళ సానిటరీ నాప్కిన్ వాడినప్పటికీ , రోజంతా ఒకే పాడ్ వాడడం వల్ల వచ్చే సమస్యలు , సింథటిక్ పాడ్స్ తిరిగి వాడడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో మన మహిళలు సతమతమవుతూనే ఉన్నారు . నాటు పద్ధతులు మోటు పద్ధతులు అనుసరించడం వల్ల అనేక శారీరక , మానసిక రుగ్మతలకు గురవుతున్నారు మహిళలు . అందుకే మహిళల, బాలికల వ్యక్తిగత పరిశుభ్రతపై కొంతకాలం దృష్టి కేంద్రీకృతం చేసింది మహిళా శిశు సంక్షేమ విభాగం , వైద్య విభాగం . ఆ క్రమంలో వ్యక్తిగత లైంగికావయవాల పరిశుభ్రత కోసం బాలికలకు సానిటరీ నాప్కిన్స్ వాడడంపై ప్రచారం చేసి అలవాటు చేసారు . పాత బట్టలు , ఇతరత్రా అపరిశుభ్ర విధానాల వల్ల వచ్చే అనారోగ్యాల గురించి విశదీకరించడం జరిగింది. పరిశుభ్రమైన నాప్కిన్స్ అవసరం తెలియజేస్తూ కొంతకాలం బడిలో ఉచితంగా అందజేయడం జరిగింది . అదే విధంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో చౌకగా అందజేశారు . ఈ మధ్య కాలంలో ఇవ్వడం మానేశారు . మార్కెట్లో కొనాలంటే కొనలేని విధంగా వాటిపై పన్నులు విధిస్తున్నాం ..

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి . అల్ట్రా నాప్కిన్స్ రోజంతా ఉంచుకోవడం వల్ల గర్భ సంచి కాన్సర్ కి దారితీస్తోందని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి . అందుకే పాడ్ ప్రతి 5 గంటలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది . అంటే రోజుకి 4 లేదా 5 నాప్కిన్స్ అవసరం . ఒక ఆడపిల్ల రుతుక్రమం నెలలో 5 రోజులు ఉంటుందని అనుకుంటే 20 నుండి 25 నాప్కిన్స్ అవసరమవుతాయి . అలా ప్రతి నెలా కావాల్సి ఉంటుంది . ఈ విధంగా చూస్తే కనీసం 3 సానిటరీ నాప్కిన్ పాకెట్స్ అవసరం అవుతాయి . (అందులో 8 ఉంటాయనుకుంటే ) . ఒక్కో పాకెట్ తక్కువ రకం తీసుకున్నా కనీసం 30 రూపాయలు (టాక్స్ లేకుండా ) . ఒక వ్యక్తికీ 120 లు ఖర్చు . ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఎంతవుతుందో .. లెక్కవేయనక్కరలేదు కదా .. అదే టాక్స్ కలిపితే తడిసి మోపెడు అవుతుంది . కాబట్టి సానిటరీ నాప్కిన్స్ పై ఎలాంటి టాక్స్ ఉండకూడదు .

అదే సమయంలో హిందూ మహిళ వాడే బొట్టు , కుంకుమ , గాజులపై పన్నులు విధించడం లేదు. అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ? ఒక మహిళకి తన ఆరోగ్యం కాపాడుకునే , తప్పని సరి అవసరం అయిన సానిటరీ నాపికిన్స్ అవసరమా ..? లేక హిందూ మహిళగా గాజులు , బొట్టు కుంకుమ అవసరమా .. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నదో చెప్పకనే చెప్పడం లేదూ …?! ఇదే ప్రభుత్వం సిగరెట్లపై గతంలో ఉన్న టాక్స్ కంటే 4 – 10 శాతం పన్ను తగ్గించింది.

మహిళల అత్యవసర వస్తువు కావడం వల్లే సానిటరీ నాప్కిన్స్ పై జీఎస్టీ ఉండరాదంటూ కదం తొక్కుతున్నారు మహిళలు . ఇది ఇప్పుడొక ఉద్యమ రూపు దాలుస్తోంది .
శాలిని ఠాక్రే రాజకీయ పలుకుబడి ఉన్న ప్రముఖ కుటుంబపు పెద్ద కోడలు . ఆమె సానిటరీ నాప్కిన్స్ పై ఉన్న జీఎస్టీ వ్యతిరేకంగా గొంతు విప్పారు . మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య కూడా సానిటరీ నాప్కిన్స్ పై 12% జీఎస్టీ కి వ్యతిరేకంగా తన గళం విప్పారు . అదే విధంగానటి కొంకణాశర్మ , నిర్మాత ఏక్తాకపూర్ , నటి దర్శకురాలు రత్న పథక్ షా , పూజాసింగ్ సామాజికవేత్త కుంకుమ బొట్టు , గాజులు , వాటికి టాక్స్ బాదకుండా సానిటరీ నాప్కిన్స్ కి మాత్రం రెండో స్లాబ్ లో 12% విధించడం చూస్తే భారతీయ మహిళల్ని ఏమనుకుంటున్నారు .. ఎలా చూస్తున్నారు , భారతీయ మహిళలకి వారి వ్యక్తిగత పరిశుభ్రత , ఆరోగ్యం కంటే బొట్టు , గాజులు ముఖ్యమా ..? రుతుక్రమం పట్ల ఉన్న ఏహ్యత , అపవిత్రత , మైల , ముట్టు .. సానిటరీ నాప్కిన్స్ పై టాక్స్ విధించరాదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు సుస్మితా దేవ్ ఆర్ధిక మంత్రి అరుణ్ జెట్లీ ని కోరారు . అది చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అయింది.

ఛాయా కక్కడే మరో ఐదుగురు మహిళలు జూన్ 21 నుండీ సానిటరీ నాప్కిన్స్ పై టాక్స్ ఉండకూడదని నిరాహారదీక్ష చేసస్తున్నారు కక్కడే బృందం స్వయం సహాయక బృందాలద్వారా సానిటరీ నాప్కిన్స్ తయారు చేసి 30 (6 నాప్కిన్స్ ప్యాక్ ) అందజేసింది . 12% పన్ను అంటే దాని ఖరీదుఇంకా పెరిగి పోతుంది. ఈ పెరుగుదల మహిళల కొనుగోలు శక్తిపై, వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది అంటారు ఆమె . అందుకే నిత్యావసర వస్తువుల్ని రేషన్ దుకాణాల్లో సరఫరా చేసినట్లే సానిటరీ నాప్కిన్స్ కూడా నిత్యావసర వస్తు సరఫరా చేసే రేషన్ దుకాణాల్లో అందించాలి . గ్రామీణ మహిళలకు ఉచితంగా అందించాలి . బడుల్లో సానిటరీ వెండింగ్ మెషిన్స్ పెట్టాలి . టాక్స్ ఉండకూడదు డిమాండ్ చేస్తోంది 41 ఏళ్ల ఛాయా కక్కడే .

కుంకుమ బొట్టు , గాజులు , కండోమ్స్ పైన మాత్రం 0% జిఎస్టీ చూస్తే నేతల పితృస్వామ్య భావజాలం స్పష్టమవుతుంది . మహిళల పునరుత్పత్తి వ్యవస్థ పరిశుభ్రత, ఆరోగ్యం ఈ పాలకులకు పట్టదా .. సానిటరీ ప్రొటెక్షన్ ప్రతి మహిళా ప్రాథమిక హక్కు ఏలిన వారు తెలుసుకునేదెన్నడో .. ?!

బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ పాడ్స్ ని సైనికుల గాయాల కోసం డిజైన్ చేసాడు . ఆ తర్వాత అది రుతుక్రమంలో వాడే పాడ్ గా మారింది . అమెరికన్ కంపెనీ జాన్సన్ జాన్సన్ వారు 1896 లో వాడి పడేసే పాడ్స్ తాయారు చేసి వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అప్పుడు బ్యాండేజ్ వాడే విధంగానే ఉండేవి . 1980 ఆ పద్ధతి మారింది . తడిని బాగాపీల్చుకుని , ఎటువంటి లీకు కాకుండా మరకలు కాకుండా ఉండే విధంగా రకరకాల సానిటరీ నాప్కిన్స్ తయారుచేయడం మొదలుపెట్టారు .

కెనడా , యూకే , ఐర్లాండ్ , స్లోవేకియా మొదలైన దేశాలు సానిటరీ నాప్కిన్స్ పై టాక్స్ తీసేయాలని నిర్ణయించుకుని సంతకం చేసాయి . అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా అడుగులువేస్తున్నాయి

మనదేశమూ ఆ దిశగా అడుగు వేయాల్సిన అవసరం చాల ఉంది . లేకపోతే ధరలు పెరిగిన సానిటరీ పాడ్స్ కొనలేని భారతీయ బాలికలు బడికి దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది . మళ్ళీ పూర్వపు అరక్షిత పద్ధతులలోకి వెళ్లే ప్రమాదం ఉంది . భారతీయ .

ప్రతి మహిళా ఏడాదికి 12 నెలలు , జీవిత కాలంలో 39 ఏళ్ళు .. వాడాల్సిందే . మహిళకి సహజమైన ప్రక్రియ రుతుక్రమం . అది వారికి ఆర్ధిక భారం కాకూడదు . మహిళలకు అందుబాటులో ఉండాలి . వాటిని కొనగలిగే విధంగా ఉండాలి. మహిళకి అత్యవసరమైన వస్తువుగా టాక్స్ లేకుండా అందించాల్సిన దిశగా ప్రభుత్వం అడుగువేయాలి. లేకపోతే ఘనంగా చెప్పుకునే స్వచ్ఛ భారత్ కి , భేటీ బచావో – భేటీ పడావో నినాదాలకు అర్ధం లేకుండా పోతుంది .

మత చిహ్నాలైన బొట్టు , కుంకుమ , గాజులకు విలువ ఇచ్చి వాటిపై పన్ను విధించకుండా మతఛాందస ప్రభుత్వంగా ముద్ర వేయించుకుంటున్న ప్రభుత్వం, ఉద్యమం తీవ్రరూపం దాల్చకముందే మేల్కొంటే మంచిది. __వి.శాంతి ప్రబోధ.

చాట్ బాక్స్ ల్లో చెత్త రాతల కుక్కమూతి పిందెలు  తెంపలేమా ..  

మనం ఎటువంటి సమాజంలో నివసిస్తున్నాం  ? హత్యచేస్తామనో , రేప్ చేస్తామనో , యాసిడ్ పోస్తామనో బెదిరింపులతో  ఆడపిల్లలని , మహిళలని మానసిక హింసకు గురిచేస్తోంటే ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు ?  ఎవరు అటువంటి బెదిరింపులకు  పాల్పడుతున్నారో గుర్తించి వారిపై తగిన చర్యలు  ఎందుకు తీసుకోవడంలేదు ? ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి . అందుకు  బాధ్యులు ఎవరు ?  ఆడపిల్లలా .. వారిని కన్నతల్లిదండ్రులా .. విద్యాబుద్ధులు నేర్పే గురువులా .. సమాజమా … ?

ఆడపిల్లల్ని , మహిళల్ని భయభ్రాంతులకు గురయ్యేవిధంగా బెదిరించే వారిని ఏమనాలి ..? మానసికరోగులు  అనాలా .. లేక నేరస్థులు అనాలా ..?  మానసిక రోగులు అయితే వారికి మానసిక వైద్యం అవసరం . నేర మనస్తత్వం ఉన్నవాళ్లయితే వారిలో పరివర్తన చేసే శిక్ష అవసరం. ఆలా కాకుండా చూసీ చూడనట్లు వదిలేస్తే ఏమవుతుంది .. వ్యవస్థ మొత్తం వ్యాధిగ్రస్తమవుతుంది . లేదా నేరాలమయం అవుతుంది .
తరతరాలుగా పితృస్వామ్య మనువాద భావజాలం నరనరాన ఇంకిపోయిన మన సమాజంలో ఇప్పుడు జరుగుతున్నదదే .  ఆధునిక సమాజంలో అందిపుచ్చుకున్న టెక్నాలజీని ఉపయోగించుకుని పబ్లిక్ గా  అమ్మాయిలపై జరిగే దాడులు, బెదిరింపులు  అన్నీ ఇన్నీ కావు .  ముఖ్యంగా ఫేస్బుక్ , ట్విట్టర్ వంటి సోషల్ మీడియా చాట్ బాక్స్ ల్లో దూరి చెత్త కూతలు , రాతలు …
 ట్విట్టర్ ఖాతాలో ఓ అమ్మాయి ఎదుర్కొన్న బెదిరింపుల గురించి ఇప్పుడు చూద్దాం .
ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు . ఒక నేపథ్య గాయని .  పేరు శ్రీపాద చిన్మయి .   నువ్వు మళ్లీ పాడకుండా చేస్తాం . నీ  మొహంపై యాసిడ్ పోస్తాం . నిన్ను రేప్ చేస్తాం వంటి బెదిరింపులు ఎదుర్కొంది.  పబ్లిక్ లైఫ్ లో ఉన్న ఆమెకు ఇటువంటి హింసాత్మకమైన బెదిరింపులు రావడం ఆమెను భయకంపితురాలిని చేసాయి .  ఆ విషయం ట్విట్టర్ కి రిపోర్ట్ చేసింది .  ట్విట్టర్ పట్టించుకోలేదు . అసలు చెవిన పెట్టలేదు .  పోలీసు కేసు అయితే తప్ప మేం ఎటువంటి చర్యా తీసుకోమని స్పష్టం చేసింది .
ఇలాంటప్పుడు చాలామంది మహిళలు మౌనంగా ట్విట్టర్ నుండి బయటకు వచ్చేస్తారు .  కానీ శ్రీపాద చిన్మయి అలా చేయలేదు .  ఈ సంఘటన ఆమెను కుదిపివేసింది . మహిళల పట్ల సమాజపు చూపుని అర్ధంచేసుకునేలా చేసింది . భయకంపితురాల్ని చేసింది .  ఇటువంటి సమస్య పదుగురిలో ఉన్న  తనకి ఎదురయింది .  తన దగ్గర డబ్బుంది . సమయం ఉంది . పదుగురి సప్పోర్ట్ ఉంది తనో సెలబ్రిటీ కాబట్టి  . నేపథ్య గాయకురాలిగా అభిమానుల బలం ఉంది .  మామూలు ఆడపిల్లలకు ఈ సమస్య వస్తే ..  ఆ ఆలోచనే ఆమెను ముందుకు నడిపించింది .  మహిళలపై దాడిచేసే , మానసికంగా గాయపరిచే వారిని వదల కూడదనీ ,  యుద్ధం చేయాల్సిందే నని నిర్ణయించుకుంది .  వెంటనే పోలీసు కంప్లైంట్ చేసింది .  హింసాత్మక బెదిరింపులకు   పాల్పడుతున్న వారిని గుర్తించడంలో అభిమానుల సహకారం తీసుకుంది. ముగ్గురిని పట్టుకొని 10 రోజులు జైలుకు పంపడం జరిగింది .
శ్రీపాద చిన్మయి ఇంతటితో తృప్తిపడితే  చెప్పాల్సిందేమీ లేదు . ఆమె ఇంకాస్త ఆలోచించింది . ట్విటర్ లో ఉన్న సాధారణ మహిళలు  ప్రతిరోజు ఎదురయ్యే ఇటువంటి దాడులను ఎదుర్కోగలరా .. అందుకు వారి ఆర్ధిక, సామాజిక పరిస్థితులు ఎంత వరకు సహకరిస్తాయి అని ఆలోచన చేసింది . మహిళని ముందుకు నడిపిస్తూ వారికి హింస నుండి రక్షణ పొందేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ట్విట్టర్ దేనని అభిప్రాయపడింది .  అదే ట్విట్టర్ కు తెలిపింది .   ట్విట్టర్లో mute  అండ్ block  ఫంక్షన్స్ ఈ మధ్యే తీసుకొచ్చింది . కానీ మహిళలకు వ్యతిరేకంగా హింసాత్మకంగా కూసే వాళ్ళని నిరోధించలేదు .  అలాంటి వారి ఖాతాలు మూసేయలేదు .  2015 లో టెర్రరిస్ట్ లతో లింక్ ఉన్నాయని మూడులక్షల అరవై వేల ఖాతాలను మూసేసింది . అదే విధంగా మహిళలకి భద్రత కల్పిస్తూ పోకిరీలు , పర్వర్ట్ ల ఖాతాలను మూసేయ్యొచ్చుకదా ..అది వారి బాధ్యత కాదా ..? మహిళల వాదన , వారి గొంతు వినిపించుకోవాల్సిన అవసరం ట్విట్టర్ కి లేదా అంటూ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ  కి పిటిషన్ పంపింది శ్రీపాద చిన్మయి . దానికి ప్రజల మద్దతు కోరుతోంది.
కొంతమంది మగవాళ్ళకి మహిళలని బెదిరించడం , అత్యాచారం చేస్తామని అనడం పెద్ద సమస్యగానే కాదు అసలు సమస్యగానే  కనిపించక పోవచ్చు .  హింసలో అత్యంత భయంకరమైన అత్యాచారం వాళ్ళకి సాధారణంగా కనిపించవచ్చు .  సరదాగానూ కనిపించవచ్చు .  ఇటువంటి సంఘటనల పట్ల సమాజం స్పందించాలి .  మహిళలు మౌనం వీడి ముందుకు రావాలి .  రేప్ అవనీయండి , జెండర్ బేస్డ్ హింస అవనీయండి  మహిళల మౌనాన్ని బద్దలు కొట్టాలి .  సోషల్ మీడియాలో ఉన్న మహిళలు ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు , చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మన ఖాతాలను మూసుకోవడం కాదు అలాంటి మానసిక జబ్బు ఉన్నవారినే బయటికి పంపాలి .  వారిని నేరస్థులుగా గుర్తించాలి .  ట్విట్టర్ ఇటువంటి ఖాతాల్ని మూసెయ్యలి . లే కపోతే  మహిళలపై మరింత ఎక్కువ దాడులు చెయ్యడానికి ట్విట్టర్ లాంటి వేదికలుగా చేసుకొని చేలరేగిపోతారు .  అది ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలకి ఆరోగ్యకరం కాదు . అందుకే  ట్విట్టర్ తనను తాను  శుభ్రం చేసుకోని  మహిళల్ని  భద్రంగా ఉండమని మహిళాప్రపంచం కోరుకుంటోంది .  ప్రపంచంలోని నలుమూలల నుండి  మహిళలు, సభ్యసమాజం ట్విట్టర్ వైపు ఆసక్తిగా చూస్తోంది . మహిళల పట్ల ట్విట్టర్ స్పందన ఎలా ఉంటుంది .. విచక్షణతో వ్య్వవహరిస్తారా లేక వివక్ష చూపిస్తారా  వేచి చూడాల్సిందే .   ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం స్పందించాలి . కట్టుదిట్టమైన చట్టాలు  కఠినంగా శిక్షించే రూపొందించి అవి అమలయ్యే  విధంగా చర్యలు తీసుకోవాలి .
మాట్లాడే స్వతంత్రం , స్వేచ్ఛగా భావప్రకటన చేసే హక్కు ఉన్నాయని  మహిళల గురించి తమ ఇష్టం వచ్చినట్లు కూస్తే , రాస్తే తాటతీసే చట్టాలకోసం ప్రయత్నిద్దాం .
వి . శాంతిప్రబోధ
Published in Prajathanatra daily edit page on 31 March 2017

వధ్యశిలపై అడవి బిడ్డలు  

 గుండ్రంగా ఉందన్నట్లు ప్రపంచంలో ఏమూలకు పోయినా ఇదే పరిస్థితా ..? ప్రపంచంలో ఏమూల విలువైన ఖనిజ సంపద, సహజవనరులు  ఉంటే అక్కడ వాలిపోయే కార్పొరేట్ గుత్త్తాధిపత్య సంస్థల ఏలుబడిలోని ప్రభుత్వాల చేతిలో అక్కడి ప్రజలు మాడి మసై పోవలసిందేనా .. ?  మరీ ముఖ్యంగా మూలవాసులు లేదా ఆదివాసులు..?!
మూలవాసులు లేదా ఆదివాసులు లేదా గిరిజనులు మనం ఏ విధంగా పిలుచుకున్నప్పటికీ రానురానూ వారి జీవనం, వారి భూమి  ప్రమాదాల్లోకి వెళ్ళిపోతోంది.  ఆయా తెగల జీవన శైలులు ప్రమాదపుటంచున కొట్టుమిట్టాడుతున్నాయి.  సహజవనరుల వినియోగం కోసం పెట్టుబడి సంస్థలు మూలవాసుల జీవన ప్రదేశాలపై కన్నేశాయి. ప్రభుత్వాలు తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవాలని  ప్రయత్నం చేసే కార్పొరెట్ సంస్థల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయి. నిజానికి సహజవనరుల ఉపయోగం పర్యావరణానికి, అక్కడ ఉండే జనానికే కాదు జీవావరణానికి  ఏమాత్రం హానికలగకుండా ఉండాలి .  అంటే పర్యావరణ అనుమతులు తప్పని సరి.   ఇందుగలడందులేదన్నట్లు .. ఎక్కడ చూసినా అవి నామమాత్రంగానే .. తూతూ మంత్రంగానే ..
ఫలితం .. పర్యావరణంతో పాటు ఆదివాసీల సంస్కృతి వారి సాంఘిక , చారిత్రక చరిత్రలు కూడా వినాశనం తప్పడంలేదు.  మూలవాసుల వైవిధ్య జీవన విధానంలోకి , జీవన ప్రదేశాల్లోకి చొచ్చుకొచ్చే గద్దలు , డేగలు వారిని కబళించేస్తున్నాయి.   వారిని అభివృద్ధి పథకాల కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బలవంతంగా తరలించినప్పుడు సాంస్కృతికంగా , సమాజపరంగా కొత్త చోట ఉన్న సమూహాలతో సమాజాలతో కలిసిపోవడానికి ఎంత ఒత్తిడి ఎదుర్కొవలసి వస్తోందో వారిమాటల్లోనే చూద్దాం .
సెప్టెంబర్ 12వ తేదీ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తరపున 45 రచయిత్రుల బృందం పోలవరం ముంపు , పునరావాస గ్రామాలను సందర్శించడం జరిగింది . ఈ సందర్భంగా మేం పర్యటించిన కొత్త దేవరగొండు , కొత్త రామయ్యపేట , తదితర గ్రామాలలో పిన్నలను పెద్దలను పలకరించడం జరిగింది .

ఉన్న ఊళ్ళో వ్యవసాయము చేసుకునే వాళ్ళము ..  ఆపరాలూ అవీ ఇవీ పండిచ్చుకు తినేవాల్లము  సంతకెళ్తే ఉల్లిపాయలూ .. అప్పుడప్పుడూ  పచ్చి మిరపకాయలూ కొనుక్కునేవాళ్ళం . ఇప్పుడు అన్నీ కొనుక్కోటమేగా .. వాళ్ళిచ్చే వెయ్యి రూపాయిలు దేనికొత్తయ్యి .. ఉప్పు , పప్పు , కూరగాయలు , పుల్లలు అన్నీ కొనుక్కోటమేగా .. కొండకెల్లి పండో .. పచ్చనాకో తెచ్చుకునేవాళ్లం .. ఇప్పుడేదీ .. అన్నిటికీ కరువేగా .. ‘ 

‘అట్టాగని ఇక్కడ పనీ లేదు ఏదోటి చేద్దామంటే .. మాకు భూవి లేదని ఇవ్వలేదు. ఉన్న వాళ్ళకిచ్చినా అది పదిమైళ్ళవతల ఇచ్చారు . ఎట్టా చేసుకునేదీ .. మా రాతలిట్టా ..’  వెంకటమ్మ , 
కొత్తదేవరగొందు

‘ఆ ఎలచ్చన్లప్పుడోత్తారు అదిచ్చేత్తాం పెద్దమ్మా ఇది చేత్తాం పెద్దమ్మా అంటా .. ఈ తడవ రానీ చెప్తా .. నా అసొంటోళ్లేవయి పొవాల్నో అడ్గుతా .. వాళ్ళిచ్చే వెయ్యిరూపాయిలు నా మందులకే సాలట్లా .. ఇక్కడ ఓ ఆకా .. పసారా .. అన్నిటికీ దిక్కుమాలిన మందులేగా .. ” అంది దాదాపు డెబ్బయ్యేళ్లున్న నర్సమ్మ , 
కొత్తదేవరగొందు

‘దూడలూ మేపుకునే వాళ్ళము .. కొండెక్కి అటూ ఇటు తిరిగొచ్చేయి .. కోళ్ళు , మేకలూ అన్నీ అమ్మేసుకుచ్చేసాం. ఏవీ లేకపోతే కొండకొమ్ములు , వెదురు బియ్యం అయినా తెచ్చుకునే వాళ్ళం . ఈడతిని కుకుంటే ఎక్కడనుంచొత్తయి .. వాళ్ళిచ్చిన సొమ్ములు నిండుకున్నాయి ‘

‘సుబ్బరంగా పడగొట్టేశారు సీతాఫలం మొక్కలూ , ఇంతింత లావు మామిడి మొక్కలూ..  అన్నిటిమీదా .. ఇళ్లమీదా మట్టోసేసారు ..మట్టి దిబ్బనాగుందిప్పుడు మా ఊరు ‘  – సింగారమ్మ , కొత్తదేవరగొందు 

 
‘ఏవేవో ఇచ్చేత్తావని నమ్మిచ్చి గొంతుకోశారు.  వచ్చాక అడిగితే సమాధానం లేదు .  ఎవడి దగ్గరకెళ్ళినా ఒక రూపాయి పుట్టట్లేదు .  ఇల్లు మాత్రం ఇచ్చింది .  ఇల్లొకటి ఉంటే సరిపోతదా .. ?ఎంత బాధ .. ఖర్మ .. ఏమ్చేతాం ..? కాలం ఎటు తీసుకుపోతుందో ..  ‘ –   ఓ రైతు , కొత్తరామయ్యపేట  
 
నర్మదానదిపై కట్టిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కింద 1000 ఆదివాసీ గూడేలు జల సమాధి అయితే పోలవరం కింద  3 లక్షల మంది ఆదివాసీల జీవనశైలి, సంస్కృతి  జలసమాధి అవుతున్నాయి .
అదే విధంగా గత జనవరిలో POW తో కలసి కొత్తగూడెం సమీపంలోని మొండి చెలక, బంగారు చెలక వంటి  గిరిజన గ్రామాలకు వెళ్లడం జరిగింది. విమానాశ్రయం కోసం 2500 ఎకరాలలో సర్వే నిర్వహిస్తున్న అధికారులు , పోలీసు బృందంతో అక్కడి మహిళలు మాట్లాడిన మాటలు నన్ను ఆలోచనల్లో పడేశాయి .
ఇది నా పిల్లలు పుట్టిన గడ్డ , నేను పుట్టిన మట్టి , మేమె కాదు నా తల్లిదండ్రులు , వారి తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు .. ఇంకా ముందటి నుండి మేం బతుకుతున్న నేల , గాలి ఇదే .. ఇది మీది కాదు సర్కారుదే అంటే మేమెట్లా ఒప్పుతం ? ఇదే మా గుర్తింపు . మీరిప్పుడొచ్చిన్రు . కానీ మేమెట్లా కాదు .. ఆ …ఈ జల్  జంగల్ , జమీన్ మాది”  అంటూ ఎలాంటి భయం లేకుండా పోలీసు అధికారులను నిలదీసింది ఓ యువతి .
రెండేళ్ల క్రితం అరకులోయలో బాక్సయిట్ నిధుల కొండ గాలికొండకు ప్రరవే నుండీ వెళ్ళాం. అక్కడా అంతే ..
 బ్రిటిష్ వారి కాలం నుండి ఇప్పటివరకూ  మా కొండల్లో నిక్షిప్తమై ఉన్న బాక్సయిట్ నిధుల కోసం ఎంత ఆరాటపడినా మేం ఎదుర్కొంటూనే ఉన్నాం . మమ్మల్ని  మేంకాపాడుకుంటూనే ఉన్నాం.  చేప సముద్రంలోంచి ఒడ్డునేత్తే బతుకుతుందా ..? మేఁవూ అంతే ..‘ అన్నాడో గిరిజన యువకుడు ఆనంద్, అరకు
ఒకనిర్దిష్ఠ ప్రాంతంలో ఉండి అక్కడే అభివృద్ధి చెందిన సంస్కృతి మూల/ఆదివాసులది.  అంటే స్థానికంగా వారు అభివృద్ధి చేసుకున్న సంస్కృతి అన్నమాట.  ప్రపంచంలో ఎక్కడికక్కడ వారి ప్రాంతీయ , సాంస్కృతిక , సామాజిక పరిస్థితులనుండి , చారిత్రక నేపథ్యాలనుండి వారి సంస్కృతులు వెలిశాయి. అవి మానవ జీవన గమనంలో కొన్ని ఉనికిలో ఉంటే మరికొన్ని తమ ఉనికిని కోల్పోయాయి .  నాగరిక సమాజాల్లో ఇమడని తమదైన ప్రత్యేక జీవన సంస్కృతిని కోల్పోని సమూహాలూ , సమాజాలూ నేటికీ ప్రపంచమంతటా ఉన్నాయి. కొండాకోనల సరసన ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి అతి సహజంగా జీవిస్తూ, ప్రకృతితో పాటు తమ సంస్కృతినీ పదిలంగా పదికాలాల పాటు భద్రపరచుకోవాలనుకునే దృష్టి వారిది.  అలా భద్రపరచుకుంటూ వస్తున్న వారినే మన  నాగరిక సమాజం ఆదివాసులు లేదా మూలవాసులు లేదా గిరిజనులు అంటోంది.

ఆయా ప్రాంతాలను బట్టి , భౌగోళికమైన పరిస్థితులను బట్టి మానవజాతుల్లో సాంస్కృతికమైన వైరుధ్యాలు మనకు తెలుసు. అవి అంతర్గతంగా మార్పులు చెందుతూనే ఉంటాయి .    అయితే పెట్టుబడిదారీ గుత్తాధిపత్య సంస్థల కనుసన్నల్లో సాగే ప్రభుత్వాలు , వాటి లక్ష్య సాధన కోసం, లాభాపేక్షకోసం  మూలవాసుల నివాసప్రాంతాలపై దృష్టి పెట్టింది.  తరతరాలుగా సంక్రమించిన నివాసప్రాంతాలు , వారి ఆస్తిపాస్తులు , సంస్కృతి ఆచార వ్యవహారాలు అన్నిటికీ దూరంగా వారిని తరిమేయడం లేదా తరలించడం జరుగుతోంది.  అది పోలవరం  వంటి  ప్రాజెక్టు పేర కావచ్చు , లేదా ఒక వేదాంత , జిందాల్ వంటి  కంపెనీల కోసం కావచ్చు  లేదా విమానాశ్రయం కోసం కావచ్చు . లేదా మరి దేని కోసమైనా కావచ్చు .  అది చత్తిస్ గఢ్ ,,జార్ఖండ్, ఒరిస్సా , పశ్చిమబెంగాల్, ఆంధ్ర, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలు ఏవైనా  కావచ్చు.  లేదా ఒకప్పుడు పూర్తిగా స్థానిక తెగలతో ఉన్న  ఆస్ట్రేలియాలో వజ్రాల గనులు , బంగారు గనులు , బొగ్గుగనుల కోసం   వారిని

 నిర్వాసితుల్ని చేసినా, వారి భూముల్లోనే వారిని కూలీలుగా మార్చినా ,  స్థానికులైన రెడ్ ఇండియన్లను అమెరికాలో మైనింగ్ కోసం నిర్వాసితుల్ని చేసినా పెట్టుబడిదారీ సామ్రాజ్యం నిర్మించుకున్నా  , పెరూ లో  కాపర్ మైనింగ్ కోసం, బంగారు గనుల కోసం  స్థానిక తెగల భూముల్నిఅడ్డదారుల్లో ఆక్రమించినా , దక్షిణాఫ్రికా లో  వజ్రాలవేట సాగించినా సమిధలు అయ్యేది అమాయకులైన స్థానిక తెగలవారే .  ఆయాప్రాంతాల్లో అక్కడి స్థానిక తెగలు తమ భూముల్ని కాపాడుకోవడం కోసం , దాని మీద పట్టుకోల్పోకుండా ఉండడం కోసం ఆ తెగలు చాలా పోరాటాలే చేశాయి . చేస్తూనే ఉన్నాయి .
అదే విధంగా మనదేశంలోనూ సారవంతమైన భూముల్లో ,  ముడి ఇనప ఖనిజం, మైకా , బంగారం ,  బొగ్గు , బాక్సయిట్ , సున్నపురాయి .. వంటి సహజసిద్ధమైన ఖనిజసంపద నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి.  వాటిపై కన్నేసిన శక్తులనుండి తమ భూముల్లోంచి తమని గెంటి వేసి అత్యంత నిరుపేదలుగా మార్చేసే స్థితిని ఇక్కడి మూలవాసులూ ఎదుర్కొంటూనే ఉన్నారు .  అది సింగూరు , నందిగ్రామ్ కావచ్చు . అరకులోయ కావచ్చు , బస్తర్ కావచ్చు , నియంగిరి కావచ్చు , సర్దార్ సరోవరం కావచ్చు , పోలవరం కావచ్చు , పోస్కో కావచ్చు మరోటి మరోటి కావచ్చు .  మూలవాసులకు తమ భూమితో ఉన్న అనుబంధమే ఆ పోరాటాలు వారితో చేయించింది.  గత ప్రభుత్వ హయాంలో వేదాంత బాక్సయిట్ మైనింగ్ కోసం తమ ప్రాంతంలో అడుగుపెట్టకుండా అడ్డుకుని విజయం సాధించారు గిరిజనులు .  అది మానవహక్కుల్ని కాపాడుకోవడంలో వారు సాధించిన గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు.
మనదేశ జనాభాలో 8. 2 శాతం గిరిజనులు ఆక్రమిస్తే జాతి నిర్మాణం కోసం తలపెట్టిన గనులు , ప్రాజెక్టులు, పరిశ్రమలలో  తదితరాలలో ఇల్లూవాకిలి , భూమి , చెట్టు పుట్ట కోల్పోయిన గిరిజనులశాతం 55. 16 % గా 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి .  అది చూస్తే అర్ధమవుతోంది కదా బలిపశువులు అయ్యేది ఎవరో… దేశంలో ఖనిజలవణాలు ఉత్పత్తి చేసే జిల్లాలు  50 ఉంటె అందులో సగం పైగా గిరిజన ప్రాంతాల్లోనే  ఉన్నాయి .  90% బొగ్గు , 50% మిగతా సహజ సిద్దమైన వనరులు వీరు నివసిస్తున్న ప్రాంతోలలోనే ఉన్నాయ్ .
రాష్ట్రాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మొదటి వరుసలో  నిలబెట్టాలంటే కొందరు త్యాగాలు చేయక తప్పదు -రమణ్ సింగ్ , ముఖ్యమంత్రి , చత్తిస్ ఘడ్
అభివృద్ధి అంటే ఆదివాసీలని తుడిచిపెట్టేయడం కాదుగా … ప్రిమిటివ్ ట్రైబల్ చట్టాలను మట్టికలుపుతూ వారి భూముల్ని అక్రమంగా బదలాయించుకోవడమా ?   కొన్నిచోట్ల వారి భూముల్ని వారికే ఇచ్చేస్తాం అని అంటున్నాయి కంపెనీలు, కానీ ఎప్పుడు ? వందల కోట్ల సొమ్ము దండుకున్నాక ఎందుకూ పనికిరాని పిప్పిని వదిలిపోవడమా ..? ఆ కంపెనీ ల్లో ఉద్యోగాలిస్తామని భ్రమలు కల్పిస్తున్నారు ?  ఆదివాసీల్లో ఎంతమందికి ఇప్పటి వరకూ ఉద్యోగాలిచ్చారు ?  ఇచ్చిన పనులు ఏంటి .. ఇచ్చినా  చదువులేదనే చచ్చు కారణం చూపి  దినసరి కూలీ గానే  కదా ..
చదువు చెప్పిస్తామని వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తామని బిల్డింగులు కడుతున్నారు కానీ అక్కడ ఉపాధ్యాయులు , వైద్య సిబ్బంది కరువే . ఇక రవాణా సదుపాయం గురించి చెప్పనవసరం లేదు .  కట్టించిన భవనాలు మావోయిస్టుల ఏరివేత కోసం దిగిన పారా మిలిటరీ వారి ఆధీనంలోనే .. టీచర్ ఉన్న చోట కూడా ఆదివాసీ పిల్లలు బడికి పోలేని స్థితి. ఇక చదువెక్కడనుండి వస్తుంది ?
అసలే పేదలైన ఆదివాసీలు ప్రభుత్వాల  అసంబద్ధ విధానాల వల్ల మరింత పేదలుగా మారుతున్నారు .  ఐరన్ ఓర్ , బొగ్గు , బాక్సయిట్ , సున్నపురాయి .. వంటి ఎంతో విలువైన ఖనిజ  సంపదని దేశం కోల్పోతోంది . సంపద విదేశాలకు తరలి పోతోంది . తమ దేశాల్లో పర్యావరణాన్ని , ప్రకృతిని కాపాడుకునే విదేశీ  కంపెనీలు ఇక్కడమాత్రం మన పర్యావరణాన్ని , మన ప్రకృతినీ , మన జీవితాలని కొల్లగొడుతున్నాయి.  అంతేకాకుండా మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి.   ఇందుకు బాధ్యత ఎవరిదీ ? ఎవరిని నిందించాలి స్వదేశీ ప్రభుత్వాలనా ..? మల్టీనేషనల్ కంపెనీలనా ..?
తమదైన ప్రత్యేక జీవన విధానాన్ని కాపాడుకొంటూ  ప్రకృతిపై, సహజవనరులపై  ఆధారపడి ప్రకృతి సిద్ధంగా జీవించే  ప్రకృతి బిడ్డలు  అడవితో తామున్న సంబంధాన్ని, అనుబంధాన్ని  కొనసాగిస్తూ వందల రకాల పంటలు  పండిస్తారు . వాటితో పాటు స్థానిక అడవుల్లోని  మొక్కలు , జంతువులూ ,  కుటుంబాలూ వారికి కొట్టినపిండి .. అంతులేని వృక్షసంపద , జంతు సంపద కూడా నిర్వాసితులైపోతున్నాయి . మనుగడ కోల్పోతున్నాయి .   తరతరాలుగా వారు పెంపొందించుకున్న జ్ఞానం , ప్రక్రుతితో పెనవేసుకుపోయిన బంధం అక్కడితో అంతమైపోతోంది .   శతాబ్దాల తరబడి వారు రక్షిస్తూ వస్తున్న సహజ సంపద , ప్రకృతి , అటవీసంపద అన్నీ వారితో పాటే విధ్వంసం అవుతున్నాయి.
అభివృద్ధి మంత్రం జపించే ప్రభుత్వాలకు , పాలకులకు మనం రాసుకున్న రాజ్యాంగం మూలవాసులకూ  వర్తిస్తుందని  తెలియదా ..?!  21వ శతాబ్దపు ఫలాలేవీ వారికి అందకపోగా .. ఉన్న జీవితం , వారి జీవన హక్కులు కాలరాసిపోతున్నాయి.  ప్రపంచ పటంలో మానవ హక్కులు ఉల్లంఘిస్తున్న దేశంగా ఖ్యాతి మాత్రం సొంతం చేసుకుంటోంది మనదేశం .
భారతదేశంలో మొదటగా 1774 లో ఈస్ట్ ఇండియా కంపెనీ బొగ్గు తవ్వకంతో మైనింగ్ మొదలయినప్పటికీ 1991లో వచ్చిన నూతన ఆర్ధిక విధానం తర్వాత గ్లోబలీకరణ , ప్రయివేటీకరణ కు తలుపులు బార్లా తెరిచిన తర్వాతే పారిశ్రామికీకరణ, అభివృద్ధి పేరుతో జరిగే తరతరాల  జీవన విధ్వంసానికి బాటలు వేయడం మొదలయిందని చెప్పొచ్చు .   అప్పటి నుండీ ప్రకృతి బిడ్డలకు  వాళ్ళ నేలపై , వాళ్లదైనా జీవన శైలిలో సంచరించే , జీవించే స్వేచ్ఛ వాళ్ళకి లేకుండా పోయింది .  చేసుకున్న చట్టాలకు సవరణలు జరిగాయి .  గిరిజనుల సంక్షేమం కోసం 1996 PESA  చట్టం వచ్చినా , 2006లో వచ్చిన అటవీ చట్టం తెచ్చినా , రాజ్యాంగంలో ని 5, 6వ షెడ్యూల్ ఉన్నా ఆర్టికల్ 46 అన్నిరకాల వివక్ష , దోపిడీ, సామజిక అన్యాయం  నుండి రక్షణ కల్పించాలని చెబుతున్నా ..అడవులపై హక్కు ఆదివాసీలకే ఉందని 2010లో ప్రకటించినా ..   అన్నీ  ఘోరంగా  విఫలమయ్యాయి .    కాబట్టే , రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వాలు ఉండబట్టే  లక్షలాది మూలవాసులు తమ నివాసప్రాంతాలనుండి నిర్ధాక్షిణ్యంగా తరిమివేయబడుతున్నారు .   నిరాశ్రయుల్ని చేస్తున్నారు .  వారికి సరైన పునరావాస సౌకర్యాలు కూడా  కల్పించడంలేదు .
1940లో హైమండార్ఫ్ అనే యూరోపియన్ ఆంథ్రోపోలోజిస్ట్ మొదట  మనదేశపు కొన్ని మూలవాసుల తెగలపై పరిశోధన చేశారు .  ఆ తర్వాత 1970లో కూడా అయన పరిశోధన కొనసాగించారు. స్వాతంత్య్రానికి ముందు స్వాతంత్య్రానంతరం ఆయన చేసిన పరిశోధన తేల్చిందేమంటే వారి జీవన స్థితి గతులు దిగజారిపోయాయని . ఇప్పుడు నూతన ఆర్ధిక విధానాల్లో  అధః పాతాళంలోకి జారాయని చెప్పొచ్చు.
1994లో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ఆదివాసీ హక్కులమీద ముసాయిదా ప్రకటించింది. అందులో ప్రధానంగా స్వయం నిర్ణయక హక్కు , స్వేచ్ఛ హక్కు , మానవహక్కుల సంరక్షణ , ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలు -జీవన విధానం , వేష భాషల రక్షణ , స్వపరిపాలన , విద్య వైద్యం మౌలిక సదుపాయాల హామీ  మొదలయినవి .  వాస్తవంగా అవన్నీ అమలవుతున్నాయా ?
 రాజ్యాంగ స్ఫూర్తికి  విరుద్ధంగా ఆదివాసీలను ప్రాంతాల వారీగా  విడగొట్టి వారి హక్కుల్ని కాలరాస్తూ, వారి ఐక్యతను చిన్నాభిన్నం చేస్తూ ,  అభివృద్ధిపేరిట ఆదిమ జాతులను అంతం చేస్తూ వారి సమాధులపై నిర్మించే అభివృద్ధిని దేశప్రజలు కోరుకోవడంలేదని సర్కారుకు తెలియనిదా..?
ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి పేరిట జరుగుతున్న మైనింగ్ , ప్రాజెక్టులు , పరిశ్రమలకు వ్యతిరేకంగా  విధ్వంసానికి  గురవుతున్న నేటివ్ ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడం కోసం ఆందోళనలు , పోరాటాలు చేయడం జరుగుతూనే ఉంది .   అయితే , జీవన విధ్వంసానికి గురవుతున్న మూలవాసుల పక్షాన అండగా నిలబడిన వారిని దేశద్రోహులుగా పరిగణించడం లేదా చట్టవ్యతిరేక కార్యక్రమాలు నెరపుతున్నారన్న నెపంవేసి అరెస్ట్ చేసి జైళ్లలో కుక్కడం లేదా నక్సలైట్ / మావోయిస్టు  ముద్రవేసి ఎంకౌంటర్ పేరుతొ మట్టుపెట్టడం లేదా మాయం చేయడం  మాత్రం మనదేశంలోనే జరుగుతోంది .
వి . శాంతి ప్రబోధ
Published in Sakshi edit page on  12 Jan 2017.”Abhivruddhaa.. anachivethaa..?”
ప్రరవే , జాతీయ సమన్వయకర్త

చితికిపోతున్న ‘సింగల్ పేరెంట్ చైల్డ్ ‘ బతుకు

ఆమె సింగల్ పేరెంట్ చైల్డ్ . తల్లి తప్ప తండ్రి తెలియదు . ఆమె పుట్టగానే
ఆడపిల్ల అనే కారణంతో అతను ఆమె మొఖమే చూడలేదు . ఆమె తల్లినీ పలకరించలేదు .
నిర్దాక్షిణ్యంగా వదిలేసి తనదోవ తాను చూసుకున్నాడు . తల్లీ బిడ్డలు
బతికారో చచ్చారో కూడా చూడలేదు . తల్లీ తండ్రీ అయి ఆమెను ఆమె తల్లి
పెంచింది.  బడిలోనూ, ఆధార్ కార్డులోనూ బ్యాంకు ఖాతాలోనూ తల్లి పేరే ఉంది
.  అందుకు ఆమె కొంత పోరాటం చేయాల్సివచ్చినా అది సాధించుకుంది ఆ తల్లి .
ఇప్పుడామె పాస్పోర్ట్ తీసుకోవాలనుకుంది.  అప్పటి నుండి మొదలయ్యాయి ఆమె
కష్టాలు.

పాస్ పోర్ట్ అప్లికేషన్ లో తండ్రి పేరు లేని కారణంగా అది తిరస్కరణకు
గురయింది.  ఆమెకు ముక్కు మొహం తెలియని , ఈనాడూ ఇసుమంత ప్రేమ చూపని అతను
తన జన్మకు కారకుడైనప్పటికీ అతని పేరు చేర్చడం ఆమెకు ఇష్టం లేదు. కానీ
పాస్పోర్ట్ అధికారులు తల్లిదండ్రులిద్దరిపేర్లూ కావాలంటున్నారు. తండ్రి
పేరు లేకుండా పాస్పోర్ట్ ఇచ్చేది లేదని వత్తిడి తెస్తున్నారు.  ఒకరకమైన
మానసిక హింసని అనుభవిస్తోంది ఆమె. అప్పుడు ఆమె ఏం చెయ్యాలి?  తండ్రి పేరు
చెప్పని కారణంగా పాస్పోర్ట్ పొందే తన హక్కుని కోల్పోవలసిందేనా ..?  తాను
దేశాంతరం వెళ్ళవలసి వచ్చే అవకాశాల్ని వదులుకోవలసి వచ్చిందేనా ..?

ఆమె తల్లి ప్రియాంక గుప్తా రంగంలోకి దిగింది. పాస్పోర్ట్ అధికారులకు
విషయం నివేదించింది . సీనియర్ అధికారులను కలిసింది . ఉత్తరప్రత్యుత్తరాలూ
నెరపింది . వారిని ఒప్పించడానికి శతవిధాలా  ప్రయత్నం చేసింది. కానీ ఫలితం
లేదు . .

ఒకవేళ తండ్రి పేరు చేర్చి పాస్పోర్ట్ తీసుకున్నా తనంటే ఇష్టంలేని అతని
పేరు తన పాస్పోర్టులో చూసుకున్నప్పుడు కూతురు ఎంత మానసిక వ్యధను, బాధను
అనుభవిస్తుందో అర్ధం చేసుకుంది ప్రియాంక. ఇది నా ఒక్కదాని సమస్యేనా ..?
ఎంతోమంది ఒంటరి తల్లులు / తండ్రుల సమస్య . సింగల్ పేరెంట్స్ కి ఉండే
సమస్యలకు ఇదో సమస్య తోడయింది.  ఈ సమస్యకు పరిష్కారం వెతకాలనీ,, సమాజం
నుండి సహకారం అందుకోవాలని భావించింది.  కోర్టు తలుపు తట్టింది .

తండ్రి పేరు అవసరం లేదని న్యాయ వ్యవస్థ ప్రగతి శీలమైన తీర్పు చెప్పింది .
విడాకులు తీసుకోవడం ద్వారానో , లేదా మహిళ సింగిల్మే గా ఉండాలనుకోవడం
వల్లనో గానీ రాను రానూ దేశంలో సింగిల్ పేరెంట్స్ పెరుగుతున్నారు . ఇలాంటి
సందర్భాల్లో  తండ్రిపేరు  తప్పని సరి కాదు .  వారికి ఇష్టమైతే
పెట్టుకోవచ్చు . కానీ బిడ్డకు ఇష్టం లేనప్పుడు ఆమె ఎవరి సంరక్షణలో ఉంటే
వారి పేరు మాత్రమే ఉండొచ్చని  మే 2016, ఢిల్లీ హై కోర్టు తీర్పు
వచ్చినప్పటికీ పరిస్థితి మారలేదు .

ప్రధానమంత్రి , హోం మంత్రి , స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి  తదితరుల
దృష్టికి సింగిల్ పేరెంట్స్ సమస్యలపై దృష్టి సారించవలసిందిగా వేడుకుంటూ
12 జులై, 2016 న  change.org ద్వారా పిటిషన్ వేసింది. ఈ విషయం పై మహిళా
శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ వెంటనే (జులై 15)స్పందించారు .

ప్రస్తుత పాస్పోర్ట్ నియమావళి  ప్రకారం తల్లిదండ్రులిద్దరి పేర్లూ తప్పని
సరి . ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పుని దృష్టిలో పెట్టుకొని, సమాజంలో
వస్తున్న మార్పులను అనుసరించి మన వ్యవస్థలోనూ , విధి విధానాల్లోనూ , నియమ
నిబంధనల్లోనూ సానుకూల మార్పురావలసిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు .
తనవైపు నుండి ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇటువంటి న్యాయబద్ధమైన అంశాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పడంతో పాటు
” నీ  భర్త ఆమెకు తండ్రిగా ఏనాడూ లేడు .  ఆ బాధ్యతలు నిర్వహించలేదు
కాబట్టి మీ అమ్మాయికి తల్లి పేరు మాత్రమే పెట్టుకునే హక్కు ఉంది . ” అంటూ
ప్రియాంకకు కొండంత అండగా నిలిచారు మేనకా గాంధీ .

ఇప్పుడు ప్రియాంక గుప్త కేంద్ర  విదేశీ వ్యవహారాలమంత్రి సుష్మా స్వరాజ్ ఈ
విషయంలో జోక్యం చేసుకొని పాస్పోర్ట్ నియమ నిబంధనల్లో అవసరమైన మార్పులు
చేయవలసిందిగా అప్పీల్ చేశారు . అందుకోసం సోషల్ ప్రజల మద్దతు
కూడగట్టుకుంటున్నారు.

మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని మనం ఏర్పరచుకున్న నియమ నిబంధనావళి
వల్ల మనం కోల్పోకూడదు. అంటే, మారుతున్న సామాజిక పరిస్థితులకనుగుణంగా మనం
ఏర్పరచుకున్న నియమాలని మనం మార్చుకోవలసిందే .  వివిధ కారణాల కారణంగా
సమాజంలో సింగిల్ పేరెంట్స్ ఎక్కువ అవుతున్నారు. ఆ సింగిల్
పేరెంట్స్ఎక్కువగా ఉన్నది మహిళలే . పురుషులు చాల తక్కువే .

పిల్లలకి తల్లిదండ్రుల ద్వారా సమాజంలో ఓ గుర్తింపు లభిస్తుంది.
తల్లి/తండ్రి మాత్రమే ఆ బిడ్డ బాధ్యతలన్నీ మోసినప్పుడు తల్లి/తండ్రి ఎవరో
ఆ బిడ్డకు తెలియనప్పుడు లేదా తెలిసినా వారిపేరు పెట్టుకోవడానికి
ఇష్టపడనప్పుడు ఆ గుర్తింపు తల్లి/తండ్రి ఏ ఒక్కరికో మాత్రమే ఉంటుంది.
అదే సరైంది కూడా . కానీ ఆ బిడ్డని వదిలించుకుని లేదా వదిలేసి దూరంగా
అనామకంగా ఉన్న వ్యక్తి పేరు తప్పని సరి అని బలవంతం ఎందుకు ?  పురుషాధిక్య
సమాజంలో  సింగిల్ పేరెంట్స్ గా మహిళలు మానసికంగా, చట్టపరంగా ,
సామాజికపరంగా   అనుభవిస్తున్న ఇటువంటి సమస్యలపై చర్చ జరిగి సానుకూల
ఫలితాలు రావాలనీ , వారి సమస్యలకు తెరపడాలని కోరుకుందాం. వీలయినంత త్వరలో
పాస్పోర్ట్ చట్టంలో మార్పులు చోటు చేసుకోవాలని,  ప్రియాంక గుప్తా
కుమార్తె పాస్పోర్ట్ పొందాలని ఆశిద్దాం .

వి. శాంతి ప్రబోధ

(October 17, 2016, Navathelangana, Vedikalo Prachurana)

సోలో ప్రయాణంలో   తెలంగాణ మహిళ  సో బెటర్ 

మన మహిళలు కుటుంబ సభ్యులతో కాకుండా ఒంటరిగా ప్రయాణాలు  చేయగలగడం అంటే గొప్పవిషయమే కదా .. రకరకాల అభద్రతల నడుమ ఆమె ఆత్మ స్థైర్యంతో ముందుకు వెళ్తున్నట్లే కదా .. మన దృష్టి ప్రపంచమంత విశాలం కాకపోయినా విశాలం అవుతున్నట్లే కదా ..
పశ్చిమ దేశాల్లో ఒంటరిగా మహిళలు ఎల్లలు దాటి ప్రయాణాలు చేయడం , పర్యటనలు చేయడం సర్వసాధారణం .  రోజులు , నెలలు , సంవత్సరాలు వివిధ ప్రదేశాల్లో ఉండడం అలవాటు .  చిన్నప్పటి నుండే వారు ఆ విధంగా పెరుగుతారు .  ఇక్కడ అంటే మనదేశంలో పరిస్థితి అది కాదు.  ఆడపిల్ల లేదా మహిళ ఇంట్లోంచి కాలు బయటికి పెడితే తోడుగా ఐదేళ్ల పసివాడైనా ఆమెకు తోడుగా పంపిస్తుంటారు .  ఆమెకు భద్రత లేదా రక్షణ గా ఉంటారని . ఆమె శక్తి యుక్తులపై అంత నమ్మకం మన వాళ్ళకి మరి ?!
ఇక అసలు విషయానికి వస్తే , దేశం మొత్త్తంలో మన తెలంగాణా మహిళలు సోలో ప్రయాణాల్లో  సో బెటర్ ఆట .  తెలంగాణా మహిళ  ఒంటరిగా ఒకటి కంటే ఎక్కువ రోజులు ప్రయాణాల్లోనో  పర్యటనల్లో గడిపే వారిలో రెండో స్థానం ఆక్రమించడం మనం గర్వించవలసిన విషయమే కదా…  అయితే , పంజాబ్ మనకంటే ముందు ఉందనుకోండి.  ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్  జూన్ 29న విడుదల చేసిన  నివేదిక వెల్లడించింది .  ఆ నివేదిక ప్రకారం తెలంగాణాలో ప్రయాణంచేసే మహిళల్లో 60 శాతం ఒంటరిగా  ప్రయాణాలు చేస్తున్నారు . ఓవర్ నైట్ ప్రయాణాలు లేదా పర్యటనలు చేయడమంటే మనం ప్రగతిని సాధిస్తున్నట్లే అనుకోవచ్చేమో  .. .
మహిళల పర్యటనలపై దేశీయ టూరిజం అందిస్తోన్న ఆసక్తికరమైన గణాంకాలు చూద్దాం.
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ కోసం సమాచార సేకరణ తెలంగాణ లో  జులై 2014 నుండి జూన్ 2015 మధ్య కాలంలో గ్రామీణ , పట్టణ ప్రాంతాలకు చెందిన  86 లక్షల కుటుంబాలలో జరిగింది .  ఈ సంవత్సర కాలంలో 11 లక్షలమంది ఓవర్ నైట్ ట్రిప్స్ వేశారు . వారిలో 60 శాతం ఒంటరిగా ప్రయాణం చేసిన మహిళలే.   తెలంగాణాలో 60 శాతం ఉంటే ప్రథమ స్థానంలో ఉన్న పంజాబులో 66 శాతం మహిళల ఒంటరి ప్రయాణాలు నమోదయ్యాయి. అదే విధంగా తెలంగాణా తర్వాతి స్థానాల్లో కేరళ 58 శాతంతోను , తమిళనాడు 55 శాతం తోనూ ఆంధ్రప్రదేశ్ 53 శాతంతోనూ మిగతా రాష్ట్రాల కంటే ముందున్నాయి .
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో విశాల దృక్పథం కనిపిస్తుందని నిపుణుల అభిప్రాయం. అందుకే దేశంలోని మిగతా ప్రాంతాలకంటే ఇక్కడ మహిళల సోలో ట్రిప్స్  ఎక్కువ కనిపిస్తాయని అంటున్నారు .
“దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇంకా సాంప్రదాయ జీవన శైలిలోనే , పద్ధతుల్లోనే , పాత ఆచార వ్యవహారాల్లోనే ఉండి మహిళల్ని ఒంటరిగా పర్యటనలకు పంపరు.  పురోగామి దిశగా ఆలోచించరు . వారు వెళ్తానంటే ఒప్పుకోరు .భయపడతారు. భయపెడతారు.  కానీ తెలంగాణాలో ఆ విధంగా కాదు .  ఇక్కడ విశాలమైన ఆలోచన ఉంది. ఓపెన్ ఐడియాస్ తో మహిళ కుటుంబంతో కాకుండా ఒంటరిగా కూడా పర్య టనలు చేయడానికి అంగీకరిస్తారు ” అంటున్నారు మహిళల ట్రావెల్ కంపెనీ ‘వాండర్ గర్ల్స్ ‘ వ్యవస్థాపకుడు హెటల్ దోషి .
తోడు లేకుండా ఒంటరిగా చేసే మహిళల  ప్రయాణాలు పర్యటనలు ప్రధానంగా ఆరోగ్యం , వైద్యం కోసం  అయితే వాటితో పాటు షాపింగ్ కోసమూ , సెలవుల్లో చేసే విహార యాత్రలూ తక్కువేమీ కాదు .  ఈ మహిళా పర్యాటకులు లేదా యాత్రికులు సగటున  రూ . 17,470 ఆరోగ్యం , వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారనీ  . అదే విధంగా రూ. 12,122 షాపింగ్ కోసం, రూ. 7, 311/- సెలవుల్లో వినోదంకోసం , విహారం కోసం ఖర్చు చేస్తున్నారనీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక చెప్తోంది .
కుటుంబ సభ్యులతో కాకుండా ఒంటరిగా ప్రయాణించాలనుకున్న మహిళలు బృందాలుగా ఏర్పడి గోవా , కేరళ వంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. ఆరోగ్యం , వైద్యం లతో పాటే షాపింగ్ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రావెల్ ఏజెంట్స్ అధ్యక్షుడు అనిల్ పంజాబీ అంటున్నారు .
ఈ మహిళల ప్రయాణాలు ఎక్కువగా మే జూన్ మాసాల్లో ఎక్కువగా ఉంటాయనీ,  షాపింగ్ కోసం చేసే ప్రయాణాలయితే డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలంలో ఎక్కువగాను, ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదా ధార్మిక కార్యక్రమాలు , పుణ్య తీర్ధాల పర్యటనలు ఎక్కువగా జులై ఆగస్టు మాసాల్లో  జరుగుతూ ఉంటాయని  నివేదిక వెల్లడిస్తోంది.
షాపింగ్ కోసమే ఒంటరి ప్రయాణం చేసే మహిళల పర్యటనలు రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండవనీ, అదే షాపింగ్ తో పాటు హాలిడేయింగ్ కూడా జత అయితే నాలుగు రోజుల కంటే ఎక్కువే ఉంటాయనీ ,   మొత్త్తం మీద సరాసరిన 6-7 రాత్రులు ఉంటుంది వారి ట్రిప్
తెలంగాణ సోలో ట్రావెలర్స్   ఎక్కడకు వెడితే అక్కడి నివాసుల సపోర్ట్ ఎక్కువగా తీసుకుంటారని నివేదిక వెల్లడించింది.  వెళ్లిన చోట మరుగుదొడ్లు , రవాణా సదుపాయాలు , వసతి వంటి వాటితో పాటు అక్కడి ప్రజలు లేదా బస ఇచ్ఛే వాళ్ళు ఎంత స్నేహంగా ఉంటారు తమకి ఎంత సహాయకారులాగా ఉంటారో కూడా ఆలోచిస్తారని అంటున్నారు దేశంలోని 20 నగరాలకు పైనే పర్యటించిన మైక్రో సాఫ్ట్ సీనియర్ మేనేజర్ కొల్లూరు పల్లవి .
పంజాబీ అమ్మాయిలు బాగా చదువుకుంటారు . దృఢంగా ఉంటారు . పంజాబ్ కూడా సురక్షితమైన ప్రాంతం . అందుకే పంజాబీలకు ధైర్యం ఎక్కువ  అంటున్నాడు సౌరబ్ సింగ్ .
దీన్ని బట్టి అర్ధమయ్యేది ఏమిటంటే కుటుంబంలో, సమాజంలో ఉండే స్వేచ్ఛయుత వాతావరణం  ఆమెని స్వేచ్ఛగా బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టిస్తుంది .స్వతంత్రంగా వ్యవహరించేలా చేస్తుంది . గడ్డు పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనే స్థైర్యం ఆమెలో పెంచుతుంది .   కుటుంబంలో ఉండే సంప్రదాయపు సంకెళ్లు , సమాజంలోని అనారోగ్య కర అనాగరిక పరిస్థితులు ఆమె హక్కుల్ని హరించివేస్తూ ఆమెలోని స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి . పురోగతికి ప్రగతికి ప్రతిబంధకాలవుతాయనే కదా ..
వి. శాంతి ప్రబోధ
published in Navatelangana Vedika on 4th August, 2016

ఆమె ఎప్పటికీ సజీవమే .. 

ఆమెను చూడగానే ఒక అమ్మలా ,  అమ్మమ్మలా కనిపింస్తుంది. కనిపించడమే కాదు వారిలాగే ఆదివాసీలను అక్కున చేర్చుకుంది.  ఆమె మరెవరో కాదు  తొలితరం ఆధునిక రచయిత్రి మహాశ్వేతాదేవి. ఇప్పుడావిడ  ఈ లోకం నుండి భౌతికంగా నిష్క్రమించింది. కానీ , అడవి బిడ్డల అమ్మగా ఆరిపోని దీపమై ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది.
కారణం ఆమె సామాజిక దృక్పథంతో , సమకాలీన సమాజ పరిస్థితులను అద్ధంపడుతూ , సమాజాభివృద్ధికి మార్గదర్శనం చేస్తూ రచనలు చేసే కలంయోధురాలు ,  సుప్రసిద్ధ సాహితీవేత్త మాత్రమే కాదు.  సామాజిక న్యాయం తన రచనల్లో చూపడమే కాదు వ్యక్తిగతంగానూ వాటికోసం పోరాడిన సాహసి , గొప్ప ఉద్యమ కారిణి మహాశ్వేతాదేవి .    కాలేజీలో పాఠాలు చెబుతూనే తీరిక సమయంలో సామాజిక కార్యక్రమాలకు సమయం వెచ్చించేది  మహాశ్వేతాదేవి.  ఆ క్రమంలో కలిగిన సామాజిక అనుభవాలు ఆమె జీవనగమనాన్ని మార్చివేశాయి.   తన జీవితంలో సగంపైనే సంతాల్ ఆదివాసీ తెగల మధ్యే గడిపేలా చేశాయి. దేశవ్యాప్తంగా ఆదివాసీల హక్కుల కోసం, వారి సంక్షేమంకోసం పోరాడేలా ముందుకు నడిపించాయి .  మహాశ్వేతాదేవి  ప్రభుత్వం అనుసరించే పారిశ్రామిక విధానాల వల్ల నష్టపోతున్న ఆదివాసీల పక్షాన నిలబడి వారి సమస్యలను గొంతెత్తి చాటింది .  అంతే కాకుండా వ్యవసాయ భూములను పరిశ్రమలకు కేటాయించడాన్ని నిరసించింది .   తన రచనల ద్వారా వచ్చిన సొమ్ముని ఆదివాసీల కోసం ఖర్చుచేసింది  మహాశ్వేతాదేవి .
అందుబాటులో వున్న వనరులను సద్వినియోగ పరుచుకుంటూ ఆదివాసీల్లో అక్షరాస్యత పెంచడానికి  మహాశ్వేతాదేవి చేసిన కృషిని కొద్ది మాటల్లో చెప్పలేం .  ఆదివాసీల కోసం ఆదివాసీల  లిపిలోనే రాత పత్రిక నడిపారు . ఒకప్పుడు పోడు వ్యవసాయం చేసుకునే ఆదివాసీలు ఇప్పుడు రైతులుగా పంటలు పండిస్తున్నారు . అదేవిధంగా ఆదివాసీ మహిళల అభ్యున్నతికి ఆమె చేసిన కృషి తక్కువేమీ కాదు . వారిలోని హస్త కళల్ని , వృత్త్తి నైపుణ్యాలని పెంచి వారి జీవితాల్లోకి వెలుగును తేవడంలో చేసిన కృషి అసామాన్యమైనది .  ఆదివాసీ, గిరిజన తెగల్లో అక్షరాస్యత పెంచడానికి,  వారి అభ్యున్నతికోసం  అవిరళ  కృషి  చేసినందుకు గాను 1997లో  ఆసియా నోబెల్ గా పిలుచుకునే రామన్ మెగసెసే అందుకున్నారు ఆమె.
వాస్తవ జన జీవనంలోంచి సాహితీ సృజన చేసే ప్రయత్నంగా జనంలోకి వెళ్లి విషయ జ్ఞానం తో శక్తివంతమైన రచనలు చేశారు మహాశ్వేతాదేవి .  ఆమె సాహిత్య జీవితం 1956లో ప్రారంభమైంది .  సిపాయిల తిరుగుబాటును నడిపించిన ఝాన్సీరాణి పై రాసిన క్వీన్ అఫ్ ఝాన్సీ ‘ ఒక ప్రయోగాత్మక రచన . క్షేత్ర స్థాయిలో ఎంతో పరిశోధన చేసిన తర్వాత రాసిన నవల ఇది .   ఆ తర్వాత ‘ అరణ్యేన్ అధికార్’ నవల రాసారు.  ‘ అరణ్యేన్ అధికార్ నవలకి 1996 లో సాహిత్య అకాడెమీ అత్యున్నత పురస్కారం  జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది .
బెంగాల్ లో అరవయ్యో  దశకం చివర్లో యువతరాన్ని ఉర్రుతలూగించిన  నక్సల్బరీ ఉద్యమ నేపథ్యంలో రాసిన నవల ‘హజార్ చౌరాసియా కీ మా ‘  (ఒక తల్లి) భారతీయ సాహిత్యంలో ఒక సంచలనం.  ‘హజార్ చౌరాసియా కీ మా ‘   సినిమాగా రూపొంది ఆమెకు జాతీయ , అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది . అదే విధంగా రుడాలి నవల అదే పేరుతోనూ , గాంగోర్ నవల ‘చోళీ కె పీచే ‘ సినిమాలుగా వచ్చ్చాయి . ఆదివాసీల జీవన సమస్యలను చిత్రీకరించిన ఆమె రచనలు  పలు భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి .
మహాశ్వేతాదేవి చేసిన ఆదివాసీ హక్కుల ఉద్యమకారిణిగా కలం  సాహిత్య , సామజిక స్వెలకు గుర్తింపుగా ఎన్నెన్నో అవార్డులు , రివార్డులు అందుకున్నారామె .  భారత ప్రభుత్వ అత్యున్నత పౌరస్కారాల్లో రెండోదైన పద్మభూషణ్ 2006 లో అందుకున్నారు .
2006 అంతర్జాతీయ పుస్తకమహోత్సవానికి మహాశ్వేతాదేవి విశిష్ట అతిధి గా హాజరైంది. ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన ఆ సభలో ఆమె చేసిన కీలకోపన్యాసం చిరస్మరణీయమైంది.  అడవి బిడ్డల హృదయాల్లోనూ  భారతీయ సాహిత్యంలోనూ  తనదైన ముద్ర వేసుకున్న మహాశ్వేతాదేవి ఎప్పటికీ సజీవమే .
వి. శాంతిప్రబోధ
published in Prajathanthra daily edit page on 2.8. 2016

తెలంగాణా వైతాళికుడు దాశరధి

దాశరథి పేరు వినగానే నాకు మొదట గుర్తొచ్చేది సినిమా పాటలు.  ఆ తర్వాత ఇందూరు ఖిల్లా. 

నా చిన్నప్పుడు రేడియోలో మీరుకోరిన పాటలు, వివిధ భారతి, రేడియో సిలోన్ లలో మా అమ్మ పాటలు వినేది. ఆ పాటలు వస్తుంటే అమ్మ పనులు చేసుకుంటూ వినడం ఇప్పటికీ గుర్తే. అవి అలా నా చెవిన పడేవి. కొన్నిపాటలు నేనూ చాలా ఇష్టంగా వినేదాన్ని.   పాటకి  వేసే ముందు గానీ , తర్వాత గానీ సాహిత్యం శ్రీ శ్రీ ,  దాశరథి, సి. నారాయణ రెడ్డి , కొసరాజు మొదలైన పేర్లు ఏవో చెప్పేవారు. అలా దాశరథి సాహిత్యం పాటగా  నాకు పరిచయమైంది.  ఆయన  రాసిన పాటలు కొన్ని నా స్మృతిలో నేటికీ నిలిచిపోయాయి.  వాటిలో ‘ గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది’ అనే పాట నాకెంతో ఇష్టంగా ఉండేది,   అదే విధంగా ‘ ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ..’ , ‘గోరంక గూటికే చేరావు చిలకా ; గోరొంక కెందుకో కొండంత అలక’ , ‘ మదిలో వీణలు మ్రోగె ఆశలెన్నొ చెలరేగె కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడె ‘ కుడా నాకిస్టమైనవే . దాశరథి  కొన్ని వందల పాటలు రాసి  ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నారో కదా …! 
 
ఆ తర్వాత దాశరథి కృష్ణమాచార్య గురించి చదివాను. విన్నాను.   1986 లో నిజామాబాద్ ఖిల్లాని మొదటిసారి చూసాను. నిజామాబాదు నుండి వర్ని వెళ్ళే దారికి కొద్ది దూరంలో ఖిల్లా కనిపిస్తుంది.  ఖిల్లాపైన జిల్లా జైలు ఉందనీ ఆ జైలులోనే  దాశరధి కృష్ణమాచార్య , వట్టికోట ఆళ్వారుస్వామిలతో పాటు ఎంతోమంది ఉన్నారని తెల్సి ఆ ఖిల్లా జైలు అంటే ఏదో చెప్పలేని అభిమానం ,గౌరవం. గొప్ప ఉత్తేజం.  ఖిల్లా మీదుగా ఎన్నిసార్లు వెళ్ళానో లెక్కలేదు . కానీ, లోపలి వెళ్లి చూసే అవకాశం మాత్రం రాలేదు.

ఇందూరు ఖిల్లా జైలులో ఉండి దాశరధి రాసిన పద్యాలు, అందులోని వాక్యాలు ఆనాడే కాదు ఈనాడూ స్పూర్తిని రగులుస్తూనే ఉంటాయనడానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమం. నిన్నటి తెలంగాణ ఉద్యమంలో బాగానలిగిన వాక్యం, ఎందరికో ప్రేరణ ఇచ్చిన వాక్యం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటిన వాక్యం ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ ‘.

‘దేశమంటే మట్టికాదోయ్ , దేశమంటే మనుషులోయ్ ‘ అన్న గురజాడ మాటల్ని గుర్తుకు తెస్తుంది ‘ తెలంగాణ అంటే రైతుదే ‘ అన్న దాశరధి వాక్యం .   రైతుదే’ శీర్షికన అగ్నిధారలో రాసిన కవితలోనిదే ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ ‘

నిజాంపాలనలో రజాకార్ల అరాచకాలతో నలిగిపోతూ అష్టకష్టాలు పడుతున్న ప్రజల కష్టాలను చూసి చలించపోయాడు దాశరథి. నిజాం రాజ్యంలోని ప్రజల అగచాట్లు, నిజాం నిరంకుశత్వం, ప్రజల పోరాటాలు, భారత స్వాతంత్రం, భారత సైన్యాల ప్రవేశం, నైజాం విమోచన వంటివి ఆయన పద్యాలకు వస్తువులుగా చేసుకున్నాడు .  ఆనాటి సాంఘిక, ఆర్ధిక , రాజకీయ పరిస్థితులే ఆయనతో తిరుగుబాటు రచనలు చేయించాయి.   నిజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలం ఝుళిపించిన  దాశరధి  రజాకర్లపోషకుడైన నిజాం గద్దె దిగాల్సిందిగా ఘర్జించాడు. ఆయన తన సాహిత్యంతో నిప్పుకణికలను రగిల్చాడు.   పదునైన పద్యాన్ని తన ఆయుధంగా చేసుకుని అక్షర నగారా మోగించాడు. పీడిత ప్రజల గొంతుకగా మారాడు.

ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించారు. దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్”అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేసారు.  నిజాం రాజు తరతరాల బూజు అని తన రాతలతో దులిపాడతను.  ఫలితంగా జైలు పాలయ్యాడు.  జైలు గోడల్నే కాగితాలుగా చేసుకున్నాడు . పళ్ళు తోముకోవడానికి ఇచ్చే బొగ్గుతో ఎక్కుపెట్టిన బాణల్లాంటి రచనలు చేశాడు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచాడు దాశరథిగా సుప్రసిద్దుడైన దాశరథి కృష్ణమాచార్య.


రైతులంటే దాశరధి కి ఎనలేని గౌరవం.  ఆరుగాలం కష్టించి పని చేసే రైతుకు ఫలితం దక్కడం లేదని ఆవేదన కన్పిస్తుంది.   తెలంగాణ రైతుదేననే  నినాదాన్ని వినిపింస్తుంది  రైతుదే ‘ లో .

ప్రాణము లొడ్డి ఘోర గహ 
నాటవులన్ బడగొట్టి మంచి మా
గాణములన్ సృజించి ఎము 
కల్ నుసిజేసి పొలాలు దున్ని, భో
షాణములన్ నవాబునకు 
స్వర్ణము నింపిన రైతుదే, తెలం
గాణము రైతుదే; ముసలి 
నక్కకు రాచరికంబు దక్కునే?

ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ…
 
ఈ పద్యాన్ని మన ఇందూరు జైలు గది గోడలపై పళ్ళు తోముకోడానికి ఇచ్చిన బొగ్గు ముక్కతో రాశాడు దాశరథి.  జైలు అధికార్లు చెరిపినప్పుడల్లా మరో గోడమీద ఆ పద్యం ప్రత్యక్షమేయ్యేదట . దాన్ని వట్టికోట రాసేవారట.  నేడు రాజులు పోయారు. రాజరికాలు పోయాయి కాని ఎముకలు నుసినుసి జేసి దున్నిన పొలాల్లోనే రైతన్న పీనుగై వేలాడుతున్న స్థితి చూస్తే దాశరధి ఎలా స్పందించేవాడో … ??
దాశరథి గొప్ప రచయిత , కవి మాత్రమే కాదు మంచి ఉపన్యాసకుడు కూడా . భావప్రేరిత ఉపన్యాసాలతో  చైతన్యం కలిగించాడు. రగిలించాడు .  తెలంగాణా వైతాళికులలో ఒకరైన దాశరధి కృష్ణమాచార్య జయంతిని అధికారికంగా నిర్వహించడం ఆయన గొప్పదనానికి నిదర్శనం .

వి. శాంతి ప్రబోధ
Published in Sahitya Prasoona Dashardhi special issue 22 July, 2016

 

బాలల ఆరోగ్యం ఎవరి బాధ్యత?

భావి భారత నిర్మాణానికి పిల్లలే సంపద .   పిల్లలకి ప్రాధాన్యత నివ్వడం అంటే భవిష్యత్ ప్రపంచం పై  ఇన్వెస్ట్ చేయడమే అంటారు విజ్ఞులు.  మన  దేశ జనాభాలో 37 శాతం పిల్లలే. అంటే మూడింట ఒక వంతు పైనే పిల్లలు ఉన్న దేశం మనది . అంటే మనం సంపన్నుల కిందే లెక్క .  కానీ ఎప్పుడూ ..?  ఆ పిల్లలంతా సరైన పోషకాహారం అందుకుంటూ మంచి ఆరోగ్యంతో విద్య అభ్యసిస్తున్నప్పుడు.  శారీరకంగా , మానసికంగా పువ్వులా వికసిస్తున్నప్పుడు .   బాలల వికాసానికి  అవసరమైన అలాంటి పరిస్థితులు మనదేశంలో ఉన్నాయా.. అవసరమైన వసతులు బాలలకోసం కల్పిస్తున్నామా .. ?

మరో ఆరేళ్లలో అంటే 2022 నాటికల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా సూపర్ పవర్ దేశంగా వెలిగిపోనుందని మన ఏలికలు ఘంటాపథంగా  చెప్తున్నారు .  గత ఏడాది అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటన సందర్భంగా భారత్ వర్ధమాన దేశం కాదనీ, అభివృద్ధి చెందిన దేశం అని కొనియాడారు. శక్తి వంతమైన దేశం అని మరొకరు అభివర్ణిస్తున్నారు .  అభివృద్ధి చెందిన దేశాలు అవే మాటలు వల్లిస్తున్నాయి .  నిజమేనా ..? నిజ్జంగా భారతదేశం సూపర్ పవర్ దేశంగా వెలిగిపోనుందా … ?!

అభివృద్ధికి కొలమానం ఏమిటి? పాటించవలసిన ప్రమాణాలు ఏమిటి ? ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రణాళిక (UNDP) లోని మానవ భివృద్ధి సూచిక ప్రకారం  జీవితకాలం , ఆరోగ్యం , శిశు సంక్షేమం, జీవన ప్రమాణం, విద్య , అక్షరాస్యత, మొదలైనవన్నీ ప్రమాణాలే.  2015 మానవాభివృద్ధి సూచిక ప్రకారం 177 దేశాలలో భారతదేశం  130వ స్థానంలో ఉంది .నార్వే 0.944 తో మొదటి స్థానంలో ఉంటే భారత్   0.609తో 130వ స్థానంలో ఉంది .  అభివృద్ధి ప్రమాణాల్లో ఒకటైన శిశు సంక్షేమం అభివృద్ధికి  వారి ఆరోగ్యం , పోషకాహారం , విద్య  ఇండికేటర్స్ గా చెప్తారు.

బాలలని ఆస్తిగా చూసే మనం వారి ఆరోగ్యానికి , అభివృద్ధికి ఏం చేస్తున్నామో ఒక సారి చూద్దాం .

మన బడ్జెట్లో పిల్లల ప్రాధ్యాన్యత ఎంత? పిల్లల జనాభాకి అనుగుణంగా బడ్జెట్ ఉందా ..? దేశ జనాభాలో 37 శాతంగా ఉన్న పిల్లల బడ్జెట్ 3.32 శాతం అంటే ఆశ్చర్యంగా ఉంటుంది . గత ఐదేళ్ల బడ్జెట్ ఒక్కసారి అవలోకిస్త్తే … 2012 – 13 లో 4. 76, 2013 -14 లో 4. 64, 2014-15 లో 4. 52, 2015 -16లో 3.26, ప్రస్తుత బడ్జెట్లో 3.32.. గత ఏడాది కన్నా కొద్దిగా పెరిగినట్లు కనిపించినప్పటికీ అది అంతకు ముందు సంవత్సరాల కంటే తక్కువే .
బాలల ఆరోగ్యం , అభివృద్ధి , విద్య , రక్షణ మొదలైన బడ్జెట్ కేటాయింపుల్లో కోత ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం .
సమీకృత బాలల అభివృద్ధి పథకం ( ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ -ICDS ) బడ్జెట్ లో భారీ కోత వేశారు. గత ఏడాది   3. 44%  కేటాయిస్తే 2016-17 కి 2.40% మాత్రమే కేటాయించారు .
ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వ వాటా 2012 -13 లో  0. 18% ఉంటే ఇప్పుడది 0.12%. ఇక్కడ పిల్లలు అంటే చిన్న పిల్లలు .11 ఏళ్లలోపు పిల్లలు.  కౌమార దశలో ఉండే పిల్లల ఆరోగ్యం గురించి కేటాయింపు మరింత తక్కువ . కౌమారదశలో ఉండే బాలల పునరుత్పత్త్తి ఆరోగ్యం కోసం తప్ప వేరే కేటాయింపులు లేవు .
అభివృద్ధి లో మాత్రం గుడ్డిలో మెల్ల అన్నట్లు కేంద్ర వాటా కొద్దిగా పెరిగింది . గతంలో 0 . 51% ఉంటే ప్రస్తుతం 0 . 77% గా ఉంది.
బాలల రక్షణ కు సంబంధించి కృశించిన కేంద్రం బడ్జెట్ చాలా ఆందోళన కలిగిస్తుంది . సరైన రక్షణ చర్యలు చేపట్టే అవకాశమే లేకుండా పోతుంది. బాలలపై మరిన్ని నేరాలు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది . బాలల రక్షణ కోసం కేటాయించిన బడ్జెట్ 0 . 03% మాత్రమే .  అంటే, బాలల రక్షణకు మనం ఇచ్ఛే ప్రాధాన్యత ఎంతో అర్ధమవుతుంది .
మన సర్కారు బాలల కోసం కేటాయించిన బడ్జెట్ ఎంతో చూశాం కదా .. ఇప్పుడు బాలల ఆరోగ్య పరిస్థితి అలా ఉందో చూద్దాం.
ఆర్ధికంగా ఎదిగిపోతున్నాం అంటున్నాం . మరి అదే విధంగా బాలల ఆరోగ్య స్థితిగతులు అభివృద్ధి చెందుతున్నాయా . పోషకాహారలోపం సాధారణమైన విషయం మనదేశంలో .  ఐదేళ్ల లోపు బాలల్లో 30% పిల్లలు తక్కువ బరువుతోనే కనిపిస్తారు. 49. 3 % అంగన్వాడీ సెంటర్లలో మాత్రమే టీకాలు వేసే సౌకర్యం ఉంది . 3-6 ఏళ్ల పిల్లల్లో 37. 9 మాత్రమే అంగన్వాడి కి వెళ్లగలుగుతున్నారు .6- 35 నెలల వయసులోని బాలల్లో 49. 2 % ఆ అవకాశం పొందగలుగుతున్నారు .   మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ శిశు మరణాలను 27 కు తేవాలని చెప్పుకున్నా అది 42 గా ఉందని వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ న్యూట్రిషన్ సర్వే తెలిపింది

38. 7 శాతం పిల్లలు పౌష్టికాహారలోపంతో బతుకీడుస్తున్నారు మన దేశంలో .  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు  క్షేత్ర స్థాయికి చేరడంలేదు . -. వెనుక బడిన దేశాలకంటే మన దేశంలోనే బాలల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  పిల్లల్లో ఉన్న పోషకాహార లోపం సవరించడానికి కష్టం . పోషకాహార లోపం వల్ల శారీరక , మానసిక ఆరోగ్యం సమస్యలెన్నో తలెత్తుతాయి .

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారని ఈ మధ్యే గ్లోబల్ హెల్త్ ఆర్గనైజషన్ తెలిపింది. 132 దేశాల జాబితాలో భారత్ 114 వ స్థానం లో ఉంది అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు .

పుట్టిన ప్రతి బిడ్డకి జీవించే హక్కు ఉంది. అది మన ప్రాథమిక హక్కు . కానీ సరైన ఆహారం , ఆరోగ్యం , వైద్యం అందక వారు తమ హక్కుని కోల్పోతున్నారని స్పష్టమవుతోంది. ఓ పక్క ఆరా కోరా బడ్జెట్ అనుకుంటుంటే మరో పక్క  ఉన్న బడ్జెట్ సక్రమంగా వినియోగం గాక ఇక్కట్లు .  బాధ్యత ఎవరిది ? సూపర్ పవర్ దేశంగా పరుగులు పెడుతోందని చంకలు బాదుకుంటున్న ప్రభుత్వానిది కాదా .. ? !

 ఓ పక్క ట్రాన్సఫార్మ్ ఇండియా అంటూ అందుకోసం తొమ్మిది ప్రాధాన్యత అంశాలు ఎంచుకున్నారు మన నేతలు. వాటిలో ఆరోగ్యం మాత్రం లేదు.   బహుశా ప్రజారోగ్యం , బాలల ఆరోగ్యం యోగా అందించేస్తుందని అనుకుంటున్నారేమో .. అందుకే బడ్జెట్లో కోత విధిస్తున్నారేమో ..?! అందుకే ప్రజలలో ఆరోగ్య చైతన్యం రావడానికే యోగా చైతన్య  దినోత్సవం నిర్వహించారేమో …???

వి. శాంతి ప్రబోధ
published in  Prajathanthra daily on 22 July, 2016

ఆ భాగ్యం అభాగ్యులందరికీ అందితే …

praja 26july-aug1 '15                                          పెద్ద మనసును  అభినందించాల్సిందే .. అది ఎవరికున్నా.
ఎవరో ఓ అధికారికి ఆదేశాలిచ్చి చేతులు దులుపుకోవడం గాకుండా… తనే స్వయంగా ప్రత్యూష వద్దకు వెళ్లి, అండగా ఉంటానంటూ ఓ సీఎం భరోసా ఇవ్వడం గొప్ప విషయమే…
సవతి తల్లి, తండ్రి ఉండీ  అనాధ అయిన బాలిక ప్రత్యూషని ముఖ్యమంత్రి గారితో పాటు కుటుంబం సభ్యులూ వచ్చి పరామర్శించారు. ఆమెకు అండదండగా ఉంటామని , బాధ్యతని తీసుకుంటామని భరోసా ఇచ్చారు.   ఒక వారం రోజులు తమతో ఉంచుకోవడమే కాకుండా హాస్టల్ లో పెట్టి చదివిస్తామనీ, ఆమెకు పెళ్లి చేస్తామనీ, ఇల్లు కట్టించి ఇస్తామనీ అన్నారు. సెలవుల్లో తన ఇంటికి రావచ్చని అన్నారు. చాలా సంతోషమే. మరి!రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత స్వికరిస్తానన్నారో, లేక ఆమె పరిస్థ్థితికి చలించి బాధ్యత గల పౌరుడిగా స్వచ్చందంగా ఆమె బాధ్యత తీసుకుంటానని అన్నారో తెలియదు. ఏవిధంగానైనా  ఆపదలో ఉన్న ఆ బాలికకు ఆపన్నహస్తం అందించడం హర్షణీయమే.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతలు స్వీకరించి ఉంటేనూ .. లేకపోయినా కూడా ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న వ్యక్తిగా ఆపదలో ఉన్న వారి పట్ల స్పందించాల్సిందే. బాధ్యత తీసుకోవాల్సిందే .

july 26 - 1 aug 2015 ప్రత్యూష ఒక్కటే కాదు అలాగే  కన్న తండ్రి/ తల్లి  ఉండీ నిత్యం నరకం అనుభవించే చిన్నరులెందరో .. ఇక తల్లి దండ్రులే లేనివాళ్ళు కో కొల్లలు. ప్రత్యూష లాంటి వాళ్ళకి తమ పుట్టు పూర్వోత్తరాలు తెలిపే బంధువులైనా ఉంటారు.తమని అభిమానించే , ప్రేమించే బంధువులూ ఉంటారు.  కానీ  అసలు తల్లిదండ్రులెవరో కూడా తెలియని వాళ్ళు , తమ కులం , మతం , కనీసం ఇంటిపేరు కూడా తెలియని చిన్నారులెందరో ..  వారందరినీ అదే విధంగా ఆదరిస్తే ఇంకెంత బాగుంటుంది .?  వారందరికీ ప్రత్యుషకి దొరకిన అభయం దొరుకుతుందా .. ?!

రాష్ట్రంలోని అనాధ బాలల కోసం ప్రతి జిల్లాలోనూ ఒక అనాధ శరణాలయం ఏర్పాటు చేస్తామని అక్కడే ఉండి వారు చదువుకోవచ్చని,  కాలేజీ సీట్లలో విషయంలో, ఉద్యోగాల విషయంలో వచ్చే సమస్యలని  పరిష్కరించే విధంగా బిసి (ఎ ) గ్రూపులో అనాధ బాలలను చేర్చనున్నట్లు వార్తలొచ్చాయి.  అవి ఎప్పుడు ఆచరణలోకి వస్తాయోనని వారంతా ఎదురు చూస్తున్నారు.  నిజానికి ఇప్పుడూ ఈ పిల్లల శ్రేయస్సు కోసం ప్రభుత్వం నిర్వహించే హొమ్ లు ఉన్నాయి . అదే విధంగా ప్రైవేటు వ్యక్తులు , సంస్థలు నిర్వహించే హొమ్ లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పైనే అనాధ బాల బాలికలు ఉన్నారని ఒక అంచనా.  ఆ బాల బాలికలందరూ ఇతర బాలల్లాగే ఆనందంగా , ఆరోగ్యంగా ఎదగాలి. వారికీ  సరైన విద్య , వైద్యం అందాలి.  వారికంటూ ఒక చిరునామా ఉండాలి. అది వారి హక్కు.  తల్లి దండ్రులు లేనప్పుడు వారి అలన పాలన ప్రభుత్వం బాధ్యత. కానీ ఈ ప్రత్యేక అవసరాల్లో ఉన్న బాలలు అందుకో గలుగుతున్నారా .. అందని ద్రాక్షలాగే ఉంటోందా పరిస్థితి అని తరచి చూస్తే .. ప్రభుత్వ చట్టాల్లోనూ, స్కీముల్లోను,  జివోల్లోను అవి చాలా అందంగా ఆకర్షనీయంగా కనిపిస్తాయి. అబ్బో చాలా జరిగిపోతోంది ఆపదలో ఉన్న బాలలకి అని సంబరపడిపోతాం. వాస్తవం అందుకు భిన్నంగా .. కనిపిస్తుంది.
వాళ్ళు బడిలో చేరేటప్పుడు , ఆ తర్వాత ప్రతి చోటా కులం  కాలం వెక్కిరిస్తూనే ఉంటుంది. ఇంటిపేరు ఏదని పదే పదే ప్రశ్నిస్తూనే ఉంటుంది.  మొదటిసారి  బడిలో చేరినప్పుడు ఏమిరాశారో ఆ పిల్లలకు తెలియదు. అదే విధంగా వారి  ఇంటిపేరు,  కులం, మతం ఏమీ తెలియని వయస్సులో ఉండొచ్చు కాబట్టి వారికి ఆ బాధ తెలియదు .  కానీ ఎదిగిన కొద్దీ బాణంలా దూసుకువచ్చే ప్రశ్నల్ని ఎదుర్కోవడం వారికి చాల కష్టంగా , గుండెని రంపం పెట్టి కోసినంత బాధగా ఉంటుంది.

ఇప్పుడు అంతా ఆన్లైన్ మయం కదా .. ఇంటి పేరు లేకపోతే ఎట్లా ఆన్లైన్  అంగీకరించదు. కులం పేరు కావాల్సిందే ఎట్లా .. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు G.O.Ms. No. 34, G.O.Ms. No. 47 ఉన్నాయి. అనాధ బాలలుగా ఎవరెవరిని గుర్తించవచ్చో చెబుతూ , కులం పేరు తెలియని బాలల్ని కాస్ట్ లెస్ గా పేర్కొంది  G.O.Ms. No. 47.  అదే విధంగా ప్రభుత్వ, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలలో ప్రతి క్లాసులో 3 సీట్లు సూపర్ న్యూమరీ గా కేటాయించవచ్చు. స్కాలర్ షిప్ ఇవ్వవచ్చు. స్కూల్ లో గానీ, కాలేజిలో గానీ ఎలాంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు. కానీ వాస్తవం లోకి వచ్చేసరికి అంతా విరుద్దంగా. అవి ఆచరణలోకి రావడం  లేదు. కారణం శాఖల మధ్య సమన్వయ లోపం. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా వచ్చిన జీవోల గురించి విద్యా శాఖ , సాంకేతిక విద్యా శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ వంటి సంబంధిత  అధికారులకి అవగాహన లేదు. క్షేత్ర స్థాయిలో వారికి వాటి గురించే తెలియదు.  ఒక వేళ అధికారులకు తెలుసు అనుకున్నా .., తమకి ఆన్లైన్ ప్రోగ్రాం డిజైన్ చేసే ప్రోగ్రామర్స్ కి చెప్పరు . అందువల్ల వీళ్ళకు సంబంధించిన ఆప్షన్లు ఉండవు. చేసుకున్న జీవోలు అమలు కావు. ఫలితం, ప్రత్యేక పరిస్తితుల్లో ఉన్న ఈ విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందుతూ ఇబ్బందుల పాలవుతూ భవిష్యత్ పట్ల ఆశ కోల్పోవడమే అవుతోంది.  ఇక్కడ ఈ నెలలోనే జరిగిన ఓ విషయం మీ ముందు పెడతాను.  గ్రామీణ ప్రాంతంలోని ఓస్వచ్చంద  సంస్థలో ఉండి 10 తరగతి వరకూ చదివిన ఓ బాలుడు పై చదువుకోసం హైదరాబాదులోని మరో సంస్థ నిర్వహించే హొమ్ లో చేరాడు. పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ కి వెళ్ళినప్పుడు అతనికి కలిగిన అసౌకర్యం , మానసిక వేదన గురించి చెప్తున్నాను. అందరిలాగే తనూ పాలిటెక్నిక్ ఎంట్రన్స్  రాసి కౌన్సిలింగ్ కి వెళ్ళాడు. కులం సర్టిఫికేట్ , ఆదాయం సర్టిఫికేట్ తప్పని సరి కావాలన్నారు అక్కడి పెద్దలు.  అవి లేవు . నేను అనాధని . కాబట్టి అనాధ ని తెల్పుతూ సంబంధిత అధికారులు తాసీల్దార్ , MDO, CDPO, స్కూల్ H.M , అతను ఉన్న సంస్థ అందరూ సర్టిఫై చేసి ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చాడు. దాని వారు అన్గికరించలేదు. హైదరాబాదులోని స్వచ్చంద సంస్థ ప్రతినిధులు చాలా సమయం వెచ్చించి చెప్పిన తర్వాత కాలేజి అలాట్ చేస్తున్నాం. అక్కడ కాలేజిలో వాళ్ళు కావాలంటే ఇవ్వాల్సిందే అని చెప్పారు. మొత్తం ఫీజు కట్టాల్సిందే నన్నారు . స్కాలర్ షిప్ కూడా రాదన్నారు. జీవో గురించి చెప్పినా , జీవో ఇచ్చినా తమకి సంబంధం లేదన్నారు. తనకు అలాట్ అయిన కాలేజికి వెళ్ళాడు ఆ అబ్బాయి. కులం, ఆదాయం ద్రువికరించే పత్రాలు ఇవ్వనట్లయితే నీ అడ్మిషన్ రద్దు అవుతుంది అంటూ ఓ వారం రోజులు సమయం ఇచ్చారు కాలేజి వాళ్ళు .   ఇటు అతను చిన్నప్పటి నుండి ఉన్న హొమ్ నిర్వాహకులు , ప్రస్తుతం ఉన్న హొమ్ నిర్వాహకులు శ్రద్ద తీసుకుని జిల్లానుండి, రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వత్తిడి తెచ్చిన తర్వాత మాత్రమే ఆ అబ్బాయి అడ్మిషన్ తీసుకోగలిగాడు. అది అన్ని సందర్భాలలో , అందరికీ సాధ్యమా .. అంత బాధ్యతగా వ్యవహరించే వాళ్ళు, స్పందించే వాళ్ళు ఉండాలిగా ..

మన సియం గారిది చాలా విశాలమైన మనస్సు.  అందుకే ప్రజల భక్తి కోసం ముక్తికోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి , అధికార యంత్రాంగమంతా అహోరాత్రులు కష్టపడి మహా పుష్కరాలని ఘనంగా నిర్వహిస్తున్నారు. అదే దొడ్డ మనసుతో ప్రత్యూషకి  గొప్ప జీవితం ఇవ్వబోతున్నారు. ఇంత చేసిన వాళ్ళు అదే సంకల్పంతో ఎవరూ లేని  లక్షలాది చిన్నారులకి ఆసరా అవలేరా .. వారి జీవితాలకి భరోసా ఇవ్వలేరా .. సియం గారి మాటలు , రాతలు నీటిమీదవి కాదు అని నిజం చేస్తారని ఆశిద్దాం.

వి. శాంతి ప్రబోధ
(published in Prajathanthra weeklly 26th July -1Aug 2015)

తస్మాత్ జాగ్రత్త

thasmat jagraththa-praja- june  ఇది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే .  ఎవరిపై బురద జల్లినా అది తప్పకుందా ఖండిచాల్సిన సంగతే. ఆమె లైంగికతే అందుకు కారణమైతే ..? అది ఆకాశంలో సగ భాగమైన మహిళలందరినీ అవమానించినట్లే కదా ..?
కారణాలేమైనా ..రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో నియమితులైన మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారిగానే కాకుండా  కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అడవులు, పర్యావరణం, నీటిపారుదల, ఐసీడీఎస్, హౌజింగ్, వ్యవసాయం, పాడి పరిశ్రమ, ల్యాండ్ రెవెన్యూ, విపత్తు నిర్వహణ, యూఎల్సీ లాంటి శాఖలను పర్యవేక్షిస్తున్నారు ఐఏఎస్ అధికారిణి స్మితా సిబ్బర్వాల్ .  సీఎంవోలో విధులు నిర్వహించటమంటే ఆషామాషీ విషయం కాదు .  నిత్యం తీరిక లేకుండా ఉండే సిన్సియర్  ఐఏఎస్ అధికారి  ఆమె. అటువంటి వ్యక్తిపై అసంబద్దమైన , అనుచితమైన కథనం OUTLOOK వీక్లి లో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.  దాన్ని ఆమె తీవ్రంగా ఖండించిన విషయం, ఆ తర్వాత యు ట్యూబ్ లో క్యారికేచర్ తొలగించడం తెలిసిందే .
ఆవిడపై పనిగట్టుకుని రాయాల్సిన అవసరం, పనిగట్టుకుని పేరు పెట్టకుండా క్యారికేచర్ గీయడం ఏమిటి ? అనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తాయి . ఒక ప్రవేటు కార్యక్రమంలో వేసుకున్న దుస్తుల ఆధారంగా ఆమె క్యారెక్టర్ ని నిర్ణయిస్తారా .. ఆమె అనువైన దుస్తుల్ని ఎంచుకునే అధికారం ఆమెపై ఆమెకు ఉండదా ..? నిజానికి, ఎటువంటి అసభ్యతకి తావివ్వని దుస్తుల్లో కనిపిస్తారామే. నీటుగా నిండైన దుస్తుల్లో కన్పిస్తున్న ఆమెని   అన్నిటికీ మించి ఆవిడ ఏ జిల్లాలో పనిచేసినా అట్టడుగు వర్గాల అభున్నతికి కృషిచేశారన్న మంచి పేరు ఉంది.

నిండా నలబై ఏళ్ళు లేని స్మిత 2001 ఐఏఎస్ అధికారిణి. ఆమె 22 వ ఏటనే 4 వ రాంకుతో ఐఏఎస్ సాధించిన ప్రజ్ఞాశాలి. పదేళ్ళ పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేసిన తర్వాత 2011 లో కరీంనగర్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.  ఆ సమయంలో ఆమె ప్రజలకు చేరువయ్యే ఎన్నో కొత్త కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. జిల్లా పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె మదిలోంచి పుట్టిన కార్యక్రమమే అమ్మలాలన కార్యక్రమం.  20 సూత్రాల కార్యక్రమం అమలు,  పాలనపై పట్టు ఆమెకు ప్రధానమంత్రి ఎక్ష్సెలెన్స్ అవార్డు తెచ్చిపెట్టింది .  అదే విధంగా గత పార్లమెంటు , అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో మెదక్ జిల్లా కలెక్టర్ గా ఓటరును చైతన్యపరచి అధిక పోలింగ్ సాధించారు  స్మితా సబ్బర్వాల్.   ఆమె కార్యదక్షత , పనిపట్ల నిబద్దత , ప్రజల మనిషిగా ఆమె అమలు పరచిన అబివృద్ది కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆమెను చేరువ చేశాయి.

ఆమె కార్యదక్షతను, పరిపాలన దక్షతను, సేవాతత్పరతను  వదిలేసి అవమానకరంగా చిత్రించడం జరిగిందంటే కారణం ఆమె మహిళ కావడమే కదా ..!.  అదే స్థానంలో పురుషుడు ఉంటే ఇలాగే రాసేవారా ..? ప్రతిభను, సమర్ధతను గుర్తించకుండా “ఐ క్యాండి ‘ పదాలతో హీనపరుస్తారా ? వారి లైంగికతనే గుర్తిస్తారా ?

అవుట్ లుక్ పత్రిక ఈ వ్యాసం రాయడంలోని రాజకీయ కారణాలు ఏమైనప్పటికీ ఇలాంటి అసంబద్ద రాతని ఖండించాల్సిందే. ఇక్కడ మరో విషయం కూడా నొక్కి చేపుకోవాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారిణికే ఇలాంటి పరాభవాలు జరిగితే సామాన్య మహిళల విషయం ఏమిటి..?  ఇలాగే ఉంటే అన్ని రంగల్లో మహిళల భాగస్వామ్యం మరింత తగ్గిపోదా ..?  వేసే ప్రతి అడుగుని స్కాన్ చేసి అనుచిత వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టి వెనక్కి లాగేయడం కాదా ?  ఎన్నో ఉద్యమాలు , పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు , సాధించిన అభివృద్ధి , సాధికారత దిశగా వేస్తున్న అడుగులు  ఏమవుతాయి ? ఏ గమ్యం చేరతాయి ఆలోచించాల్సిన సమయం ఇది.   ఆమెని సెక్స్ అబ్జెక్ట్ గా మాత్రమే చూసే వ్యాధికి చికిత్స జరగకపోతే, తగిన మందు పడక పొతే, కుళ్ళి కంపు కొట్టే భావనల్ని తెగనరికి కాయకల్ప చికిత్స చేయకపోతే రాచపుండులా పెరిగిపోతుంది. కూకటివేళ్ళతో సహా నాశనం చేస్తుంది. కాబట్టి,  మహిళల్లారా… తస్మాత్ జాగ్రత్త  .

వి . శాంతి ప్రబోధ

(published in Prajathanthra daily on 7.7.15)

Tag Cloud

%d bloggers like this: