The greatest WordPress.com site in all the land!

Archive for November, 2013

నీ బాటలోనే ..

నాన్నా …
భవ బంధాలకి దూరమై
అప్పుడే ఇరవై ఏళ్ళయిపోయిందా
అసలు ఎలా గడిపేశాం
ఇన్నాళ్ళూ .. ఇన్నేళ్ళూ ..

ఊహు .. నీవెక్కడికీ
పోలేదు నాన్నా…
మా తోనే ఉన్నావు
ఎప్పటికీ ఉంటావు

చిటికెన వేలు పట్టుకొని
నడుస్తూ నీవు చెప్పిన
బుద్దులు మీరలేదు
నీవు నేర్పిన
నడక తప్పలేదు

కళ్ళజోడు
కిందనుంచి
సూటిగా చూసే చూపు
ఇప్పటికీ మమ్మల్ని
కాపు కాస్తూనే …

పై పై మెరుగుల
తళుకు బెళుకుల
నేటి సమాజంలో
నిత్యం గేలం వేసే
వస్తు ప్రపంచంలో

ఎగుడు దిగుడుల
బాటలో కాళ్ళకు
తగిలే రాళ్ళూ రప్పలూ
ఏరిపారేస్తూ ..
ఒక్కోసారి
డక్కా మొక్కీలు తింటూ
అడుగులో అడుగులేసుకుంటూ
కదులుతూనే ఉన్నాం
నెమనెమ్మదిగా నైనా
నీవు నేర్పిన ఆ ..
అడుగుజాడల్లోనే

వి. శాంతిప్రబోధ

ఆ క్షణం నిన్ను వదిలి ఉంటే..

నవనాడుల్నీ
నిర్వీర్యం చేసే
వ్యవస్థలో మనలేక ,
నీ చైతన్యాన్ని వదులుకోలేక
నీవెంత అవస్థ పడ్డావో ..
నీవెంత సంఘర్షించావో
నీవెన్ని నిద్దుర లేని
రాత్రులు గడిపావో ..

నీలోని
సృజనకారుడిని
ఆలోచనాపరుడిని
ఆత్మీయుడిని
కాదన్న ఆ …
బలహీన క్షణం
ఆ ఒక్క క్షణం నిను
వదిలేస్తే ..

ఆ ఒక్క క్షణాన్ని
ఆపగలిగే శక్తి
మాకే ఉండి ఉంటే ..
గందరగోళ పరిచే
నీ చర్యల్ని
మేం ముందుగానే
పసిగట్టి ఉంటే ..

మా నాన్న ఇప్పటికీ
మాతోనే ఉండేవాడు కదూ ..!
మా ఉన్నతిని
చిరునవ్వుతో కదలాడే
ఆ పెదవి వంపులో దాచేసి
మెరిసే కళ్ళలో మెరుపుల్ని
మాయం చేయడానికి యత్నిస్తూ
గుంభనంగా మనసులోనే
అభినందించేవాడివి కదూ !

మా ఆలోచనల్ని
గమనిస్తూ ..
మా గమనానికి
మార్గదర్శకత్వం చేస్తూ
తరువాతి తరానికి
తలమానికమై
నిలిచేవాడివి కదూ ..

వి. శాంతి ప్రబోధ

వేకువపూలేవీ …

తెరలు తెరలుగా
తరలి వచ్చే ఆలోచనా తరంగాల్ని
ఒడిసి పట్టుకోడానికి
అర్ధరాతిరి కటిక చీకటిలో
నిద్దుర లేచి కిరసనాయిలు
దీపం బుడ్డి గుడ్డి వెలుగులో
కాగితంపై కాంతి పుంజాలు
వెదజల్లుతూ.. వేకువపూలు వికసింప చేస్తూ..

వాగు వొడ్డున
పొలం గట్టున
కొబ్బరి చెట్టు నీడన
తెల్ల కాగితంపై
అలలు అలలుగా
అక్షరాలు అలా అలా
పరుచుకుంటూ పోతుంటే
ఆలోచనల భారం దిగి పోతుంటే …

అరుణతార, ఆంధ్ర పత్రిక
జనసాహితి, నలుపు, సృజన
ఏవేవో పత్రికల్లో ..
తన పేరుతోనే కాక
వరంరావు, లాల్ సలాం
వంటి పేర్లతో ఒదిగిపోయే నీ రాతలు …
నీ రాతల అర్ధం తెలియకపోయినా
అచ్చులో నీ పేరుచూసి మేం మురిసిపోతూ ..

ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో
నీవు లేవు
ఎక్కడున్నావో తెలీదు
ఎప్పుడొస్తావో తెలీదు
కానీ .. నీవు నలుపు చేసిన
కాగితాల దొంతరలు
చైతన్య దీపికలు
మాలో కలవరం రేపుతూ..

కదిలినా మెదిలినా
ఏవేవో భయాలు విజ్రుంభిస్తూ ..
అయిన వారెవరో.. కానివారెవరో
తెలియక, రోజులు దిన దిన గండంగా
అతి భారంగా గడుస్తున్న
ఆ క్రమంలోనే.. నీ రాతలన్నీ
కట్టెల పొయ్యిలో.. కాలి మసై
నీళ్ళ కాగు నీటిలో ఆవిరై ..

నాన్నా .. ఇప్పుడు
ఎందుకు రాయవు? ఆ వేకువపూలేవి
అంటే… ,
ఆ రంగారావు
ఎప్పుడో చచ్చిపోయాడమ్మా..
అన్న మాట , నా హృదయపు
గదిలో ఇంకా పచ్చిగానే..
బాధతో సలుపుతూనే …

వి. శాంతి ప్రబోధ

పాఠం చెబుతున్నాను పై వ్యాఖ్య

వాకిలి నవంబర్ 2013 నీరెండ మెరుపు శీర్షికలో రాఘవరెడ్డి కవిత ‘పాఠం చెబుతున్నాను’ పై నేను రాసిన వ్యాఖ్య ప్రచురణ

పాఠం చెబుతున్నాను

ఇప్పుడేం … పదేళ్ల నుంచీ చెబుతూనే ఉన్నాను
నిజమే … కాస్త ఎర్రగానే చెబుతున్నాను
విద్యార్థి ఇంజనీరో డాక్టరో ఇంకేదో అవ్వాలంటాడు
కానీ మొదట అతను మనిషి కావాలి గదా –
మరి ఎర్రగా కాక ఇంకెలా చెప్పను …
జీవితం గురించి కాక దేనిగురించి చెప్పను …
దారుల గురించి చెప్పొద్దూ …
ఏ దారి ఎక్కడికెళ్తుందో తెలపొద్దూ …
ఎవరు ఏ దారిని ఎందుకు వేశారో అవగతమైతేనే గదా
తను వెళ్లాల్సిన దారిని వెదికి పట్టుకోగలడు –
నీ కోసం నా కోసం పణమయ్యే ప్రాణాలుంటాయని తెలియొద్దూ …
కన్నీళ్లను కోరని త్యాగాలుంటాయని తెలియొద్దూ …
అడవి పాడే పాటలుంటాయని
నిషిద్ధగానపు నిజాలుంటాయని
మరణంతో ఆగని రణాలుంటాయని తెలియొద్దూ …
పాఠాలను కాస్త ఎర్రగానే చెబుతున్నాను
చెప్పాల్సిందే చెబుతున్నాను చేయాల్సిందే చేస్తున్నాను.
ఆలోచన రేపొద్దూ …
గొంతులోనే ఆగిపోయిన పాటలెందుకున్నాయో
కళ్లలోనే ఇంకిపోయిన కలలు ఎందుకున్నాయో
మధ్యరాత్రే ఆరిపోయిన మంటలెందుకున్నాయో – ఆలోచన రేపొద్దూ ..
నడుస్తున్న నాటకం అర్థమైతేనే గదా
తను ధరించాల్సిన పాత్రేదో తరచి చూసుకోగలడు –
పల్లవికీ చరణాలకూ మధ్య చరణాలకూ చరణాలకూ
మధ్య నడకసాగని కాలముండొచ్చు
వేచి ఉండే ఓపికివ్వొద్దా …
ఎక్కడో ఏ మలుపువద్దో ద్రోహమెదురై గాయమవ్వొచ్చు
గుండె చెదరని ధైర్యమివ్వొద్దా …
అడుగు కలిపిన పాదమేదో మధ్యదారిన జారిపోవచ్చు
పట్టు సడలని స్ఫూర్తినివ్వొద్దా …
– చెప్పాల్సిందే చెబుతున్నాను చేయాల్సిందే చేస్తున్నాను
పాఠం కాస్త ఎర్రగానే చెబుతున్నాను.

***

పాఠం ఎవరికి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? ప్రశ్నలు రేకేత్తుతూ…

పాఠం అనగానే బడి . తరగతి గదులు. ఆ గదుల్లో కుర్చీలూ, బల్లలూ, బ్లాక్ బోర్డు, కిటకిటలాడే పారం కోళ్ళ లాంటి పిల్లలు, జీతం రాళ్ళకు బానిసలై జవాబుదారీతనం లేకుండా ఏదో పాఠం చెప్పే ఉపాధ్యాయులు, వారిచ్చే హొమ్ వర్క్, పనిష్మెంట్లు , గంటల గంటల పుస్తకాల నూర్పిడి, వార్షిక పరీక్షలు , అర్హత పరీక్షలు , ఎంపిక పరీక్షల రాపిడి .. సారం లేని చదువులతో నిస్సారం అవుతున్న మెదళ్ళు .. బండ బారుతున్న బాల్యం . కళ్ళ ముందు కదలాడుతూ . ఎప్పుడు మారుతుందీ ఒరవడి అని మదనపడుతూ . . అందుకు భిన్నంగా ఏ దారి ఎక్కడికి వెళుతుందో తెలుపుతూ చెప్పే పాఠం విన్పిస్తుందేమోనని ఆశగా వెతుకులాడుతూ ..

విద్యార్థుల మెదళ్ళు రుబ్బు రోళ్లలా పాఠాలు రుబ్బుతూనే .. అసలీ పరీక్షలు విద్యార్థుల జ్ఞాపక శక్తికా ? జ్ఞానశక్తికా ? అర్ధం కాక కొట్టుమిట్టాడుతూన్న క్షణంలో వినిపిందింది ఓ స్వరం. అది ఎడారిలో ఒయాసిస్సులా రాఘవరెడ్డి గారి స్వరంలో “పాఠం చెబుతున్నాను”. ఆనందం. నాలో పట్టలేని ఆనందం .

‘విద్యార్థి ఇంజనీరో డాక్టరో ఇంకేదో అవ్వాలంటాడు
కానీ మొదట అతను మనిషి కావాలి గదా .’

ఆ స్వరం, ఆ పాఠం నాలో ఆశను రేపింది. భవిష్యత్తుపై నమ్మకం పెంచింది. అవును నిజం, అతను మనిషి కాకుండా , జీవితం గురించి తెలుసుకోకుండా , తన దారిని ఎలా వెతికి పట్టుకోగలడు?

“పాఠంచెబుతున్నాను” నాకెన్నో చెప్పింది. అసమానతల అంతరాలు పూడుస్తూ, రేపటి భవిష్యత్తుకు పునాదులు వేస్తూ , అభివృద్ధికి నూతన గవాక్షాలు తెరుస్తూ, బోస్లూ .. భగత్సింగ్ లూ .. బోన్సాయ్ లను గుర్తిస్తూ, గొంతులోనే ఇంకిపోయిన పాటల్ని, కళ్ళలోనే ఇంకిపోయిన కలల్ని సాకారం చేసుకునేలా మట్టిగొట్టుకు పోతున్న మాణిక్యాలను వెన్నుతట్టి లేపుతూ, తను ధరించాల్సిన పాత్రేదో అర్ధం చేస్తూ కొత్తలోకం సాక్షాత్కరింప జేస్తూ ..

మాయమై పోతున్న నిబద్దత, నైపుణ్యం , అంకిత భావం, ఆత్మ పరిశీలన తెలియచేయాల్సిందే. అది గురుస్వభావం. చెప్పే పాఠం అక్షర జ్ఞానం ఇవ్వడం కోసమేనా? కాదు ఆలోచన రేపాల్సిందే. పదును పెట్టాల్సిందే. మేధోమధనం జరగాల్సిందే. ప్రజ్ఞా పాటవం, ప్రపంచ జ్ఞానం అందించాల్సిందే. సామాజిక విలువలూ, సాంఘిక బాధ్యతలూ, బాంధవ్యాలూ, స్వేచ్చా స్వాతంత్ర్యాలు పూయించాల్సిందే . మనో వికాసం కలిగించాల్సిందే , విశాల దృక్పధం ఏర్పరచాల్సిందే. నూతన జీవన మార్గాన్వేషణ మార్గాలు ఎరుక చేయాల్సిందే.

చెప్పాల్సింది చెప్పాల్సిందే .. చెయ్యాల్సింది చెయ్యాల్సిందే .. అది గురువు బాధ్యత. ఆ ఎరుక గురువులందరూ కలిగి ఉండాల్సిందే

నీ కోసం నా కోసం పణమయ్యే ప్రాణాలుంటాయని తెలియొద్దూ …

‘కన్నీళ్లను కోరని త్యాగాలుంటాయని తెలియొద్దూ …
అడవి పాడే పాటలుంటాయని
నిషిద్ధగానపు నిజాలుంటాయని
మరణంతో ఆగని రణాలుంటాయని తెలియొద్దూ ‘

రాఘవరెడ్డి గారి అక్షర విన్యాసాల్లో, పదచిత్రాల్లో నవ్యత, గాఢత. సామాజిక బాధ్యత కనిపిస్తుంది. సాధారణ పదాలతో అసాధారణ వ్యక్తీకరణ . ఆ వ్యక్తీకరణలో మానవీయ దృక్కోణం . చదువరికి హాయిగొలుపుతూ, నర్మగర్భంగా భావాన్ని పలికిస్తూ, కొత్త అనుభూతిని మిగులుస్తూ, తనవెంట తీసుకుపోతూ, తట్టి లేపుతూ, స్ఫూర్తినిస్తూ సాగుతుంది రాఘవరెడ్డి గారి కవిత్వం.

వి.శాంతి ప్రబోధ

Tag Cloud

%d bloggers like this: