The greatest WordPress.com site in all the land!

Archive for April, 2013

మానవి – మరోని

నేను

క్యా.. ర్..క్యా ర్..మనగానే..

రోహిణీ కార్తె ఎండలో వడగాల్పుల సుడులలా

చీ ..మళ్లీ ఆడపిల్లేనా ..తాత ఈసడింపు

దాని మొహం నాకు చూపొద్దు  నాన్న హుంకరింపు

ఒక్క మగ నలుసునీ కనలేదు నాన్నమ్మ చిదరింపు

నేనింకా కళ్ళు తెరవనే లేదు

అమ్మ ఒడి వెచ్చదనం  పరిచయమే కాలేదు

పురిటి  రక్తపు మరకల్తోనే ..

గడప దాటించేసాడు  నాన్న

కంఠం తెగిన పక్షిలా . ..

విరిగిన కెరటాల్ల్లా   .. నేను

ఎదలో దాగిన తల్లి మనస్సు   వెల్లువై  ఉబికింది

నవమాసాలూమోసిన  మమకారం  కన్నిరై  పారింది

కానీ, తప్పుచేసిన  దానిలా మిన్నకుండిపోయింది

అరికాళ్ళకు చుట్టుకున్న ముళ్ళ తీగ తియలేని  అశక్తతకు కుమిలిపోయింది

శిథిల   వీణను మీటుతూ  ఓ  హృదయం ద్రవించింది

ఎవరైనా  పెంచుకుంటారేమోనని  వాకబు చేసింది

అంతా , ఆ.. ఆడపిల్లా.. మా కొద్దు అన్న మరుగుజ్జు వాళ్ళే..

అప్పుడు

ఏ చెత్త కుప్పలోనో .. మురికి గుంటలోనో ..

పడనియకుండా

ఏ కుక్కలకో..గద్దలకో..

ఆహారం కానీయకుండా

చిత్తకార్తెలో స్వాతి చినుకులా  ఓ కరుణామయి

ఆమె మరోని అమృతమయి 

కటిక పేదరాలే కాచ్చు

గుణ సంపన్నురాలు

నాగరికత తెలియక పోవచ్చు

కానీ మానవీయురాలు

పీలగా పిట్టలా ముది వయస్సులో ఉండొచ్చు

కానీ,  ముడుతల ఆ ముఖకవళికలు ఔన్నత్యపు ఆభరణాలు

బలమైన సామాజిక నేపథ్యం లేకపోవచ్చు

కాని, తెలుసు అనుభవాల లోతుపాతులు

మానవ  హక్కులేమిటో  తెలియక పోవచ్చు

కానీ, వెదజల్లుతుంది మానవత్వపు పరిమళాలు

తనకి తినడాని తిండి లేకపోయినా

ఆవు పాలు కొని నా ఆకలి తీర్చింది

పాలు పడక నేను ఏడుస్తుంటే

పగలనక రాత్రనక హాస్పిటల్ చుట్టూతిప్పింది

నానా హైరానా పడింది

పొత్తిళ్ళలో పెట్టుకుని తల్లి ప్రేమను పంచింది

తన ఒంట్లో  సత్తువ లేకున్నా .. కాయ కష్టం చేసింది

నా ఆలనా పాలనా చూసింది

కుటుంబం భూకంపాలు, సునామీలు  సృష్టి స్తోంటే

నాపై ద్వేషం లావాలా మంచితనాన్ని దహించి వేయాలనియత్నిస్తుంటే

నా కోసం వారిని వదులుకుంది

పేగు బంధం కాక పోయినా

కంటిపాపలా రక్షణ కవచమై నిలిచింది

విలువకట్టలేని లేని   వాత్సల్యం కురిపించింది

నాకొక   ఉనికినిచ్చింది

విద్యాబుద్దులు నేర్పింది

శ్రమైక జీవన సౌందర్యం తెలిపింది

నా బతుకులో పచ్చదనం నింపింది

ఆమె ఋణం ఎలా తీర్చుకోను ?

నేనెలా తీర్చుకోను ?

ఏమిచ్చి తీర్చు కోగలను ?

ఊపిరి లేని ఊహల్లో ఊసుల్లో

నింపు కోవడం తప్ప

తొలకరిజల్లుకి పులకరించిన

పుడమి తల్లి మట్టివాసనల్ని వెదజల్లడంతప్ప

వి. శాంతి ప్రబోధ

(వాస్తవ సంఘటన కి అక్షర  రూపం.  మరోని నిజామాబాదు జిల్లా వర్నిలోని ఒక తండా  నివాసి. దినసరి కూలి.  అరవై ఏళ్ళు ఉండవచ్చు.  ఆడపిల్ల అని ఎవరో వదిలించుకుంటే మానవత్వంతో పురిటి పసిగుడ్డుని తెచ్చి పెంచి పెద్ద చేసింది.  ఆ పాపకి చైతన్య అని పేరు పెట్టింది.  ఇప్పుడా అమ్మాయి ఆరవ తరగతి చదువుతోంది. ఈ పిల్ల విషయంలో తన స్వంత పిల్లలనుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోంది.  మనుమరాలి వయస్సున్న  ఆ పిల్ల భవిష్యత్ గురించి బెంగ పడుతోంది.

మా ఊరికి కరెంటు .. గొట్టపు బావి వచ్చిన వేళ ..

 బుద్దిపల్లి ఊరికి దాదాపు కిలోమీటరు దూరంలో ఉండేవి మా ఇళ్ళు.  ఊరికి మా ఇళ్ళకు మధ్యలో నేతకాని, మన్నె ( అది ఒక షెడ్యుల్డ్  తెగ) వాళ్ళ ఇళ్ళు ఉండేవి.  మా ఇళ్ళను అంతా ఆంధ్రగడ్డ అని పిలిచేవారు.  అదేం విడ్డూరమో ! కానీ ,  కోస్తా ప్రాంతం నుండి వచ్చింది రెండే కుటుంబాలు.  ఒకటి మాది అయితే రెండవది మా ఇంటికి దక్షిణం వయిపు ఉన్న  నిమ్మగడ్డ రాఘవయ్య గారిది.  ఆ తర్వాత నల్లగొండ జిల్లా సూర్యాపేట వైపు నుండి వచ్చిన సోమిరెడ్డి గారి డాబా ఇల్లు, దానికి కొద్దిగా ఆవలగా ఆదిలాబాద్ నుండి వచ్చిన ముప్పిడి నారాయణరెడ్డి గారి ఇల్లు ఉండేవి .  మా ఇంటికి ఎదురుగా  భీమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి ఇల్లు, ఆ ఇంటికి దక్షిణాన ఆయన అల్లుడు లక్ష్మా రెడ్డి పంతులు గారి పెంకుటిల్లు, వాళ్ళింటికి తూర్పున లక్ష్మారెడ్డి తాతయ్య వాళ్ళ పెంకుటిల్లు ఉండేవి .   ఆ ఇంటికి ఉత్త్తరంలో వడ్ల శంకరయ్య  ఉండేవాడు .  ఆ ఇల్లు దాటితే రోడ్డు.  రోడ్డుకి అవతలి వైపు కొంత కాలానికి ప్రతాప రెడ్డి గారు, రాజి రెడ్డి గారు వచ్చి చేరారు .   అయినా, మా ఇళ్ళని ఆంధ్ర గడ్డ అనే పిలిచే వారు .

వడ్ణ శంకరయ్యకి, సత్యనారాయణ రెడ్డి గారి ఇళ్ళ మధ్య కొద్దిగా ఖాళీ స్థలం ఉండేది .   ఆ స్థలంలోనే  విద్యుత్ ట్రాన్స్ ఫారం వెశారు.  మా ఆంధ్రగడ్డ ప్రజలంతా కలసి వేయించుకున్న ట్రాన్స్ ఫార్మర్ అది. దానికి ఒక బల్బు పెట్టారు.  అది చూసి   ఊల్లో  అందరికీ  పండగే .  ఎందుకంటే అప్పటి వరకూ మాకు కరెంట్ లేదు. చాలామందికి ఆ వెలుతురు తెలియదు .
కరెంటు లైన్ వేసేప్పుడు అంటే స్తంభాలు నిర్దేశించిన ప్రదేశంలో నిలబెట్టేటప్పుడు చాలా మంది తాళ్ళతో పోల్స్ పైకి లేపేవారు . అప్పుడు వాళ్ళు వింత శబ్దాలు చేసేవారు . కరెంటు లైన్ వేయడం, ట్రాన్స్ ఫార్మర్ బిగించడం .. చాలా అద్భుతంగా అనిపించేది.  ఆ తీగల నుండి వెలుతురు రావడం గమ్మత్తుగా  ..  ఆ ట్రాన్స్ఫార్మర్ , వైర్లు ముట్టుకుంటే షాక్ కొట్టి చచ్చిపోతారని విన్నప్పుడు చాల భయం వేసినా .. రాత్రిపూట వెలుతురు పరిచే విద్యుత్ దీపాలని చూస్తే అద్భుతమే కదా మరి!  మా ఉళ్ళో కరెంట్ పనులు నడచినన్నాళ్ళు బడి నుండి ఇంటికి రాగానే  మా చిన్న చెల్లి చంటిని చంకనేసుకుని, పెద్ద చెల్లి శైలూ ని చేత పట్టుకొని వెళ్లిపోయేదాన్ని  వాళ్ళు చేసే పనులు చూడడానికి.  నే వెళ్ళేటప్పటికే,  నా తమ్ముడు రవి, వాడి దోస్త్ విష్ణు, మన్మద్, ప్రభాకర్, ఉపేందర్  జమ అయ్యేవారు.  మేం వాళ్ళ పనుల్ని కళ్ళప్పగించి చేసే వాళ్ళం.  మాకు వాళ్ళు చేసే ప్రతి పనీ చాలా గొప్పగా అనిపించేది.  వాళ్ళని, వాళ్ళు చేసే పనిని మా గ్రామస్తులంతా చాలా గౌరవంగా చూసేవారు . మా పిల్లలకైతే మా నోళ్ళలో ఎప్పుడూ కరెంటుకు సంబందించిన మాటలే, చర్చలే, వాదులాటలే .
ఆ పని వాళ్ళు మా ఇళ్ళ దగ్గరలోనే గుడారాలు  వేసుకొని ఉండేవాళ్ళు.   ఆ చిన్ని చిన్ని గుడారాల్లో వాళ్ళు ఎలా ఉంటారో నని మాకు చాలాఆశ్చర్యం .  ఆ గుడారాల ముందే మూడు రాళ్ళు పెట్టి వంటలు చేసుకు తినేవారు .  వాళ్ళలో ఒకరిద్దరు మిగిలిన అల్యూమినియం తీగలతో పూల కుండీ లా, అగరొత్తులు వెలిగించే స్టాండ్ గా రకరకాలు తాయారు చేసి మాకు ఇచ్చే వారు.   కరెంటు స్థంభాలకు పైన బిగించే పింగాణి వస్తువుల్ని తేడా వస్తే వాళ్ళు వాడేవారు కాదు.మేం వాటిని పోటిపడి జమ చేసేవాళ్ళం . వాటి కోసం పోట్లాడుకునే వాళ్ళం.  ఒక్కోసారి కొట్టుకొనే వాళ్ళం .   అమ్మ వద్దన్నా వినేవాళ్ళం కాదు.
మా పొలం వాగు వొడ్డున ఉండేది .   పారే వాగునీ ళ్ళకు ఒక మలుపు దగ్గర అడ్డంగా  తూటికాడ, వావిలి పొరక మట్టి వేసి కట్ట కట్టి నీళ్ళు నిలువ చేసేవారు . (చెక్ డ్యాం ల గురించి ఎప్పుడు విన్నా మాట్లాడినా నాకు మొదట గుర్తుకొచ్చేది మా వాగుకు వేసిన కట్టే) ఆ నీటిని పొలంలోకి మల్లించే వారు.   కొంత కాలానికి వర్షాలు లేక కరువు వచ్చింది .    కాలువల ద్వారా వచ్చే నీళ్లు పంట పొలాలకు సరిపోయేవి కాదు.  వాగు వొడ్డునే చెరువు లాంటి బావి తవ్వించారు నాన్న.వాగు నీళ్ళు బావిలోకి వచ్చే ఏర్పాటు చేశారు నాన్న.  మోటతో  నీళ్ళు పైకి తీసి పొలానికి పంపేవారు .   మా ఊరికి కరెంట్ వచ్చాక పొలం వరకూ లైన్ వెశారు.   అదే సమయంలో మా బావిలో మూడో, నాలుగో గొట్టపు బావులు డ్రిల్ చేయించారు మా నాన్న.  రంగారావు గంగను పొంగించాడు అని అంతా పొగిడేవారు.  ఆ తర్వాత అరుణ వాళ్ళ పొలంలోని బావిలోనూ బోర్ వేశారు.  అవి వేసినప్పుడూ  అంతే మా పిల్ల ముఠా నే కాదు, మా ఊరే  కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి వింతగా  నోరెళ్ళబెట్టి, కళ్ళప్పగించి ఆశ్చర్యంతో , అబ్బురంగా చూసేవారు .  చెప్పుకొనే వారు.  మా బుద్దిపల్లి చుట్టుపక్కల ఎవరూ గొట్టపు బావులు వేయక పోవడం, వాటి గురించి విని ఉండక పోవడంతో ఆడ, మగ తేడా లేకుండా వచ్చెసెవారు చూడడానికి. మరి మా నాన్నా మజాకా అని మేం కాలరెగరేసే వాళ్ళం .  ఆ రోజులే వేరు
వి. శాంతి ప్రబోధ

ఆ ఇంట్లో .. ఆ రాత్రి

నిద్ర పట్టక నవారు మంచం పై అటూ ఇటూ  కదులుతూన్న కల్పన దుప్పటి ముసుగు తీసి చెవులు రిక్కించింది .  నిశబ్ద నిశీధిని చీల్చుతూ కుక్కలు  భౌ భౌ మంటూ  అరుపులు.. కీచురాళ్ళ ద్వనులు ..  దగ్గరవుతూన్న బూట్ల టక టక శబ్దం..మనసులో ఆందోళన .. తెలియని భయం .. ఏం జరగబోతోంది ..? మనసు పరిపరి విధాల ఆలోచిస్తూ .. చలికి తోడు భయంతో బిగుసుకు పోయి ముసుగు తన్నింది.  ఉక్క పోతగా.. ముసుగు తీసింది.  అసలు నిజంగా ఆ శబ్దాలు వినిపిస్తున్నాయా ..? లేక తన భ్రమా.. ? సందేహం .. ఆమెకి .

తలుపు తట్టిన చప్పుడు.  చెవులు రిక్కించింది .  బుంటి గొంతు చించుకొని అరుస్తోంది . అంతలోనే తలుపు బద్దలైపోతుందా అన్నట్లు ధన్.. ధనా ధన్ శబ్దం .. ఇంటి కుక్క బుంటి మరింత గట్టిగా మొరుగుతోంది.   అది మిద పది కరిచేప్పుడు ఎలా అరుస్తుందో అలా ..
ఏం చేయాలి ఇంటాయన లేరు . పిల్లలు గాఢ నిద్రలో.. కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆమెకు.  అలాంటి క్షణాలు ఎప్పుడైనా రావచ్చని ముందే ఉహించినా.. వాటిని ఎదుర్కోవడానికి తనను తాను సన్నద్ధం చేసుకుంటూనే ఉన్నా ఆమెకు  కాళ్ళు వణుకుతున్నాయి.  లేచి వెళ్లి తలుపు గడియ తీయకపోతే పగులగొట్టి లోపలి వచ్చేసేటట్లు ఉన్నారు వాళ్ళు.  ఈ లోగా దక్షిణం వైపు, పడమటి వైపు కూడా బూట్లతో నడచిన  చప్పుదు.. ఇంటిని చుట్టు  ముట్టినట్లుగా.. బుంటి అటూ ఇటూ పరుగులుతీస్తూ .. అరుస్తూ .  ఎవరో దాన్ని ఒకటేసినట్లున్నారు .  కుయ్యో .. మొర్రో .. అంటూనే వాళ్లపైకి లంఘిస్తూ .. అడ్డుకోవడానికి యత్నిస్తూ .
నెమ్మదిగా వెళ్లి తలుపుకు వేసిన గెడ తీసిందో లేదో .. ఎనిమిది మంది ఒక్కసారిగా లోనికి దూసుకొచ్చారు యమభటుల్లా .. ఇంట్లో తలో దిక్కు అయ్యారు .   వాళ్ళలో ఒకరు ఇల్లంతా ఆ చీకటిలో టార్చ్ లైట్ ఫోకస్ చేసి చూస్తూ  “మీ ఆయనేడి?” సూటిగా ఆమె  కళ్ళలోకి చూస్తూ  అధికారయుతంగా ప్రశ్న సంధించాడు .  వాళ్ళంతా తలకి నల్లటి తోలు టోపీలు, పై నుండి కింద దాక పొడవాటి కోట్లు దిగేసుకొని , కాళ్ళకి బూట్లుతో గజ గజ వణికించే చలిని నుంచి కాపాడు కోవడం కోసమో.. నా లాంటి వాళ్ళని బెదరగొత్తడం కోసమో ఆ దుస్తులు మనసులో ఆమె .  వాళ్ళనే భయం భయంగా, బెదురుగా బెదురుగా చూస్తూ ..
ఆమె జవాబు చెప్పేలోగా ఆగలేని ఒకడు “వాళ్ళెవరు?” పక్కన మంచం మీద నిండా తన్నిన ముసుగును చూపిస్తూ ..
“మా పక్కింటి అమ్మాయి ”  , ఆమె జవాబు .
వాళ్లకి నమ్మకం కలిగినట్లు లేదు .
“మీ ఆయనెక్కడ ?” గద్దించాడు పిల్లి గడ్డం
“లేరు ” ముక్తసరిగా లో గొంతుకతో ఆమె
“నిజం చెప్పు” చేతిలో ఉన్న గన్ ఆమె కేసి గురిపెడుతూ  ఆ పిల్లిగడ్డం
“నిజంగానే లేరు” ప్రాణాలుగ్గబట్టుకొని కల్పన గొంతు పెగలక వచ్చిన పీల స్వరంలో.
“ఎక్కడికెళ్ళాడు” వాళ్ళలో వొకరు
“తెలియదు ” ఆమె మొహం లోని భావాల్ని చదవడానికి ప్రయత్నిస్తూ  మరొకరు
“ఎప్పుడెల్లాడు “?
” ఎందుకెళ్ళాడు ?”
“ఎప్పుడొస్తాడు?” ప్రశ్నల పరంపర
“తెలియదు” అదే సమాధానంతో ఆమె
” తెలియదా … నీకు తెలుసు చెప్పకుండా నాటకాలాడుతున్నావా ..?” విసురుగా ఏదో అనబోయాడు పిల్లిగడ్డం.
” ఈ మంచం మిద ఉన్నదెవరు ? ” అప్పుడే లోనికి వచ్చినతను ముసుగులో కదలికల్ని చూస్తూ
“మా… ” ఆమె జవాబుకి అవకాశం లేకుండానే, సూదంటు చూపు వాడోచ్చ్చి గబుక్కున ముసుగు లాగేశాడు .
భయంతో వణికిపోతున్న ఇరవై ఏళ్ల యువతిని చూసి సవాలక్ష ప్రశ్నలు వేశారు.
ఇల్లంతా భీభత్సం చేశారు .  బట్టల పెట్టెలని, బిరువాలోని సామానుల్ని వంటగదిని ఏది వదలలేదు.  బెడ్ రూమ్ పైన ఉన్న ఎలిసి (అటక)మీద కూడా ఎక్కి చూసారు . చిందరవందర చేసారు .
వాళ్లకు కనిపించిన హోమియోపతి మందుల పుస్తకాలు, మందుల కిట్టు పట్టుకొని “ఇవి ఏంటి” చురకత్తుల చూపులతో బండాడు గద్దింపు
“హోమియోపతి ….  ” ఆమె జవాబుకి తావివ్వకుండానే
“ఎవరికోసం ” ?  పిల్లి గడ్డం ప్రశ్న
” మేమే వాడతాం”
“నువ్వూ ఇస్తావా మందులు” సూదంటు చుపులాడు
“లేదు, మా ఆయన ఇస్తారు “
“ఎవరికోసం ” మళ్లీ అదే ప్రశ్న బండాడి నోటివెంట
” ఎవరి కోసం ఏమిటి .. మా కొసమె.. మా ఇంట్లో వాళ్ళకోసమే ” చివర్లో వత్తి పలికింది ఆమె .
“కాదు.. నక్సలైట్ల కోసం .. అవును, వాళ్ళకోసమే కదూ..  ” తనకేదో తెల్సిపోయింది అన్నట్లుగా ఫోజు పెట్టి ఆమె మొహం లోకి చూస్తూ నల్లగా బుర్ర మీసాలతో ఉన్నతను .. మిగతా వాళ్ళూ అదేపని చేస్తూ ..
“నక్సలైట్లా .. వాళ్ళెవరు ” అమ్మయకంగా మొహం పెట్టి ఆమె ప్రశ్న కొంచెం కూడదీసుకొని
“మీ ఇంటికి చీకట్లో వచ్చి చీకట్లో వెళ్ళిపోయే వాళ్ళు.  వాళ్లకి వైద్యం మీ ఆయన చేస్తారు కదా .” ఆమెను నఖ శిఖ పర్యంతం కళ్ళతో పరీక్షిస్తూ, పరిశీలిస్తూ ..  వాళ్ళలో ఒకడు  అంటే, మిగతా వాళ్ళు చూపులతో గుచ్చేస్తూ ..
” వైద్య సదుపాయం లేని ఊళ్ళో ఉన్నాం. పిల్లాజెల్లా ఎ అవసరం వచ్చినా వెంటనే పట్నం వెళ్ళే అవకాశం లేని గ్రామంలో ఉన్నాం. ఆ ఇబ్బందుల నుండి బయటపడటం కోసం మా ఆయన వైద్యం నేర్చుకున్నారు ”  చీకట్లో వచ్చింది మీరే కదా మీరు నక్సలైట్లా అని కడిగేయ్యాలని ఒక క్షణం అనిపించినా, తనను తాను సర్ది చెప్పుకొని నిదానంగానే అన్నదామె.
ఆ మాటలకు ఒకడు అహ్హహ్హ…  మా చెవుల్లో పూవులు పెడ్తూన్నావా .. అన్నట్లుగా ఆ నవ్వు.
మిగతా వాళ్ళు వాళ్ళలో వాళ్ళే ఇంగ్లీషులో మాట్లాడుకొంటూ ఉండగా , ఆ నవ్వినతనే ” చీకట్లో వైద్యం కోసం  ఎప్పుడెప్పుడు వస్తుంటారు ”  ఆరా తిస్తున్నట్లుగా
” మా ఆయన వైద్యుడు కాదు. రైతు .  సామాన్య రైతు మాత్రమే” కొంచెం కటువుగా.  ఆమెలో అంతకు ముందటి భయం, బెరుకు స్థానంలో ధైర్యం ..
అంతలో ఒకరు ” ఈ పుస్తకాలు మీ ఇంట్లో ఎందుకున్నాయ్” ప్రశ్న.   కార్ల్ మార్క్స్-కాపిటల్, నార్మన్ బెతూన్, కొట్నిస్, మావో సే  టుంగ్ ల  పుస్తకాలు పెట్టెలోంచి తీసి ఆవల విసిరేస్తూ
ఆ పెట్టెలోనే ఉన్న నీలం రంగు అంచుతో ఉన్న పింగాణి పాత్ర పై  బంగారు రంగుతో తీగెలు ఎంతో ముద్దులొలుకుతూ.. మధ్యలో చైనియుల బొమ్మతో  ఆ పాత్ర అంటే ఆమెకెంతో ఇష్టం .  చాల అపురూపంగా దాచుకుందామె.  ఉగాదిరోజు ఉగాది పచ్చడి చేయడానికి మాత్రమే ఆ గిన్నె వాడేది .  ఆ పాత్రతో పాటు ఇంకా  కొంత పింగాణి సామగ్రి నీ ఎత్తి కింద పడేశారు ఆగంతకులు .   ఆ పాత్రను అలా ద్వంసం చేయడం చూస్తోన్న ఆమె హృదయం ముక్కలు చేస్తున్న భావన . రక్తం మారిగి పోతోంది .  కోపం కట్టలు తెంచు కుంటూ .. ఆవేశం పొంగి వస్తూ ఉంటే..  పళ్ళ బిగువున అణుచుకుంటూ .. తనను తాను తమాయించుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆమె .  అంతలో ఒకతను ఫైల్ అందుకొన్నాడు.  అందులోంచి జారిపడిందో కాగితం.  దాని వైపు చూసింది. కల్పన.  ఒక్క క్షణం గుండె గుభేల్మంది.  కానీ, మసక చీకటి.  టార్చిలైట్ల వెలుతురులో వాళ్ళెవరూ ఆ కాగితాన్ని గమనించలేదు .  ఆమె నెమ్మదిగా వంగింది.  వాళ్ళకి ఏ మాత్రం అనుమానం రాకుండా , చాలా సమయ స్పూర్తితో  చాకచక్యంగా వ్యవహరించింది.  ఆ కాగితం పైనున్న ఫోటో ని నెమ్మదిగా లాగేసింది. వేళ్ళతో ఉండలాగా చేసి నోట్లో వేసుకుని నమిలేసింది.
ఆ కాగితం ఆమె భర్త SSLC సర్టిఫికేట్ ఫోటోతో .  అమ్మో .. ఆ కాగితం ఆగంతకుల చేతిలో పడితే ఏమైనా ఉందా ..  భర్త వారి చేతికి చిక్కినట్లే. కల్పన తనకు తానే ఆశ్చర్యపోయింది.  అంత తెలివిగా తానేనా వ్యవహరించింది అని. పరిస్థితులు మనిషికి అన్నీ నేర్పుతాయేమో!
 ఆ రోజుల్లో ఫొటోలకి ఫ్రేమ్ కట్టి గోడలకి వేలాడేసేవారు.  ఆ ఇంట్లోను అదే విధంగా ఉండేవి.  సి. ఐ .డి వాళ్ళు ఎప్పుడయినా వచ్చే అవకాశం ఉందని ముందే గ్రహించిన ఆ కుటుంబం ఆ ఇంటాయనకు సంభందించిన ఫొటోలన్నీ తిసేసింది.  చిన్న ట్రంక్ పెట్టెలో పెట్టి తన చెల్లెలింటికి పంపించేశారు.
గతరాత్రి భార్యాపిల్లల్ని పొలం గట్టుపై కూర్చో బెట్టుకుని మాట్లాడాడు  ఆయన . పిల్లలు నలుగురినీ కూర్చోబెట్టి తాను  కొన్ని రోజులు ఊరికి వెళ్ళాలని, బాగా చదువుకోమని చెప్పాడు.  అమ్మ చెప్పినట్టు వినమనీ విసిగించ వద్దనీ చెప్పాడు.  వాళ్ళకేమీ అర్ధం కాలేదు. ” నాన్నా రోజూ పగలు ఇంటికి రావడం లేదే” కొడుకు ప్రశ్న.
“ప్చ్..”పెద్ద కూతురి నిట్టూర్పు అలా అడగకుడదని సైగ చేస్తూ ..
“నాన్నా .. నువ్వు నాకు ముద్ద పెట్టకపోతే .. నాకు ఆకలేస్తుందిగా .. నా బొజ్జ ఏడుస్తుందిగా” ఆయన ఒళ్లో కూర్చొని గారాలుపోతూ చిన్నకూతురు.
కల్పన కళ్ళలో నీరు తిరుగుతుండగా ఒళ్లో కూర్చున్న రెండో కూతురి మీదుగా వంగి తప్పు అట్లా అనకూడదని చెప్పింది . ” నాన్నా నేనూ నీతో వస్తా ”  చిన్న కూతురి మారం
“నువ్వు వచ్చేప్పుడు నాయినమ్మని తీసుకొస్తావా ” పెద్ద కూతురు.
“నాయినమ్మ వారం రోజుల్లో వచ్చేస్తుందిలే .. పంపమని చిన్నాన్నకు ఉత్తరం రాస్తా” అనునయంగా ఆయన.
“కల్పనా జాగ్రత్త . అప్రమత్తంగా ఉన్దన్ది. పిల్లలు నిన్ను విసిగిస్తారేమో. కాస్త ఓపికగా ఉండు. అమ్మ వచ్చేవరకూ నాన్నని జాగ్రత్తగా చూసుకో …,” అని పిల్లలవైపు తిరిగి “నాన్నఎతేల్లాడని తాత అడిగితే ఏం చెబుతారు ? “
” ఆచ్ ..అంటా” చిన్నకూతురు
“బిళ్ళలు, మామిడిపళ్ళు తేవడానికి వెళ్ళాడని చెప్తా” రెండో  కూతురు.
“మాకుతెలియదు, అని చెప్తా” పెద్ద కూతురు
“బుయ్ బూయ్ బస్ ఎక్కి వెళ్ళాడని చెప్తా ” యాక్షన్తో చెప్పాడు కొడుకు
భారమవుతున్న వాతావరణాన్ని తేలిక పరుస్తూ నవ్వారిద్దరూ .  మారోసారి జాగ్రత్తలు చెప్పి చీకటిలో కలసి పోయాడు ఆయన.
జీతగాడి సాయంతో ఎడ్ల బండిలో ఇంటికి చేరింది కల్పన పిల్లలతో సహా .
ఆ మరుసటి రోజే జరిగిందీ సంఘటన.  రెండు రోజుల ముందు వీళ్ళు వచ్చి ఉంటే ఆ ఆలోచనే ఆమెని భయకంపితురాలిని చేసింది . దాదాపు రెండు గంటల సేపు భీభత్సం చేసి, వేసిన ప్రశ్నలే అటుతిప్పి ఇటుతిప్పి వేసి విసిగించి వెళ్ళిపోయారు .
ఆ ఇల్లు మాదే .
ఆమె కల్పన నా కన్నతల్లి
ఆయన రంగారావు నా కన్నతండ్రి
1976 సంవత్సరం లో జరిగిన వాస్తవ సంఘటన
వి. శాంతి ప్రబోధ

 

మా బడి బాటలో …

మేం ఉండేది బుద్దిపల్లిలో . మా బడి దోనబండలో. మా బడికి ఇంటికి మధ్య దూరం రెండు మైళ్ళు. మధ్యలో వాగులూ, వంకలూ .. బళ్ళ బాటలో వెళ్తే ఇంకా అరా మైలు దూరం ఎక్కువే. అందుకే కాలి బాటే మా బాట. వరి చేల గట్లు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర చేలల్లోంచి మా ప్రయాణం.

మా ఊరి వరి పొలాలు దాటగానే వొర్రె (వాగు). ఆ వొర్రె వానాకాలం వచ్చిందంటే నిండుగా పారేది. వర్షం వచ్చిందంటే ఉరకలు వేసుకొంటూ వచ్చే నీటితో వాగు పొంగేది. ఒక్కో సారి అర మైలు దూరం లోని చెరువు నీళ్ళు ఎదురు తన్నేవి.

మేం బడికి వెళ్ళేప్పుడు నీరు vaaguకాస్త ఎక్కువైతే నాన్న వచ్చి మమ్మల్ని జాగ్రత్తగా చేయి పట్టుకొని దాటించేవారు. ప్రొద్దున్న మాములుగా వుంటే మేం బడికి వెళ్ళిపోయేవాళ్ళం కదా! సాయంత్రానికి మా వోర్రే పొంగితే నాన్న మా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. మేం ఆ నీటి ఉదృతిని తట్టుకోలేమని అనుకుంటే మమ్మల్ని భుజం మీద కూర్చో పెట్టుకొని వోర్రే దాటించేవారు. అరుణ, విద్యాదరి ( మేం తనని చిన్నమ్మ అని పిలిచే వాళ్ళం) వర్షం వస్తే బడి డుమ్మా కొట్టేసేవారు. మేం మాత్రం తప్పని సరిగా బడికి వెళ్ళే వాళ్ళం. అందుకు కారణం మా అమ్మానాన్నలే.

అలా వోర్రే దాటి ముందుకు పోతే మొక్కజొన్న, జొన్న, కంది, పెసర పంట చేలల్లోంచి సాగేది మా నడక. వెళ్తూ వెళ్తూ చడీ చప్పుడు లేకుండా పెసరకాయలో, కంది కాయలో పచ్చి మొక్క జొన్న కంకులో ఏవి ఉంటే అవి మా బాగుల్లోకి చేరి పోయేవి . మంచె మీద కావాలి ఉన్న వాళ్ళు కేకలేస్తే .. అదిలించబొతే .. చ మేం తెంపుతమా రంగారావు గారి పిల్లలం .. అని ఎదురు ప్రశ్న వేసో .. మేం కోయలేదని వినయంగా చెప్పో బయట పడే వాళ్ళం. అవేవి లేకపోతే ఆ చేలల్లో పడి మొలిచి కాసే బుడమ దోసకాయలు కోసుకొనే వాళ్ళం. అవి తయారయితే పుల పుల్లగా తినడానికి బాగానే ఉండేవి. లేదంటే కటిక చేదుగా ఉండేవి . ఎవరికీ వాళ్ళం పరుగెత్తి కోసుకునే వాళ్ళం . వాటిని కడగకుండానే నవిలేసేవాల్లం. ఒక్కో సారి వాటికోసం పోట్లాటలు .. తలుచుకుంటే తమాషాగా ఉంటుంది.

ఆ పొలాలు దాటితే దొనబండ చెరువు. మావూరికి ఓ మూల నుండి దొనబండ వరకూ పరుచుకున్న చెరువు. ఆ చెరువు మత్తడి నుండి జాలువారే నీళ్ళు .. వాగులా పారుతూ .. ఆ నీళ్ళలో కాళ్ళు తడుపుకుంటూ .. అ చల్లటి నీటి స్పర్శ తగలగానే కాళ్ళలో కొత్త శక్తి . .. హుశారు.. మేం వేసుకున్న బాటా స్లిప్పర్ర్లులు మా వెనక వేసే డిజైన్లు చూసి నవ్వుకుంటూ ముందుకు సాగితే తాటి చెట్లు. వాటి కింద కూర్చొని గౌండ్లాయన కల్లు ముంత ఎత్తి ఆకుతో చేసిన దొప్పలో కల్లు పోస్తావుంటే ఆ దోప్పని నోటిదగ్గర పెట్టుకొని తాగే వాళ్ళనీ .. ఆకాశం నందుకోవాలని పోటిపడి పెరిగిపోయే ఆ తాటి చెట్ల పైకి నడుముకి, కాళ్ళకి మోకుల్లాంటివి చుట్టుకుని, కళ్ళు లోట్టెలు , కత్తులతో ఎగబాకే గౌండ్ల వాళ్ళనీ ఆగి మరీ చూసేవాళ్ళం. అంత పైకి నిచ్చెన లేకుండా, భయ పడకుండా ఎలా ఎక్కుతారో నని ఆచ్చర్యపొయెవాల్లం. తాటి చెట్టు గీయడం , చెట్టు కున్న కల్లు లొట్టి తీసి నడుముకి ఎంతో జాగ్రత్తగా కట్టుకొని మరో కుండ చెట్టుకి కట్టడం .. అబ్బురంగా .. అద్భుతంగా .. రోజూ చూసే దృశ్యాలే, అయినా అలా కళ్ళప్పగించి చూసే వాళ్ళం. అలా కల్లు వాసనల్ని పీల్చుకుంటూ ముందుకి సాగితే .. దొనబండ హరిజనవాడ . అటు నుండి చెరువు దిశగా పారే సెలయేరు. ఏకాలంలో నైనా మోకాళ్ళ లోతు నీళ్ళు. దాదాపు ఫర్లాంగు దూరం ఆ నీళ్ళలో నడక. చిన్న చిన్న చేప పిల్లలు మా కాళ్ళను ముద్దిడుతూ .. మమ్మల్ని చూసి భయపడుతూ .. సాగిపోతూ . బంధనాలు వీడిన గేదెలు, దున్నలు, దూడలు ఆ నీటిలో జలకాలాడుతూ.. వాటిపై నీళ్ళు జల్లుతూ, ఆ నీటిలో పడుకొని ఆ హాయిని అనుభవిస్తూ సేదతిరుతున్న వాటిని లేపుతూ మా వయసులోనే ఉండే వాటి కాపర్లు. మమ్మల్ని గొప్పగా చూసే వారి చూపులూ . ఆ నీళ్ళలోనే పేడ వేసే తుంటరి దూడలూ.

హరిజనవాడ దగ్గరకు రాగానే మాకో తెలియకుండానే మా ముక్కు దగ్గరకు చేరేవి మాచేతులు అడ్డుపెడుతూ. ఎప్పుడూ అదో రకమైన వాసన. వానాకాలం లోనైతే మరింతగా. మొదట్లో అర్ధమయ్యేది కాదు. ఆ వాసనలో వాళ్ళు ఎలా ఉంటారో అన్న సందేహం. తర్వాత నాన్న చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పులు తయారు చేయడం కోసం చనిపోయిన గేదనో, దున్ననో, ఆవుదో చర్మం వొలిచి లందలో (నిల్ల తొట్టిలో) నానపెడతారని, ఆ తర్వాత తోలుని శుభ్రం చేసి చెప్పులు తాయారు చేస్తారని. మా దొడ్లో గెదొ.. దూడో చనిపోతే నాన్న ఊరి పెద్ద మాదిగకు కబురుపెట్టేవారు. అతను దాన్ని తీసుకెళ్ళే వాడు. ఆ తర్వాత వరం పది రోజుల్లో ఒక చెప్పుల జత తెచ్చి ఇచ్చేవాడు. అది నాకింకా గుర్తే . ఆ చెప్పులు కాళ్ళకి కరవకుండా వేసుకోవడానికి ముందు ఆముదం రాసేవారు . కిర్రు కిర్రు అనేవి నడుస్తుంటే.

అలా హరిజనవాడ దాటుకొని అర మైలు వెళ్తే వస్తుంది మా బడి. మా బడిలో అప్పుడు ఎనిమిదవ తరగతి వరకు ఉండేది. ఆడుతూ పాడుతూ వెళ్ళే మేం బడికి ఎప్పుడూ ఆలస్యమే. మేం వెల్లేప్పటికే మొదటి పిరియడ్ దాదాపు సగం పైనే అయిపోయేది. ఆలస్యమైందని మా సారు నన్ను క్లాసు బయటే నిలబెట్టేవారు. అందరూ లోపల కూర్చొని, నేను బయటే నుల్చొని. అట్లాగే భుజాన వేలాడే పుస్తకాల బ్యాగ్ తీయకుండా నున్చునేదాన్ని. పాటం చెప్పడం అయిన తర్వాత చెప్పిన పాటం లోంచి ప్రశ్నలు అడిగేవారు. లోపల కూర్చున్న వారు ఎవరూ జవాబు చెప్పక పోతే అప్పుడు నువ్వు చెప్తావా అని అడిగేవారు. ఒక్కోసారి సార్ .. నేను చెప్తా అని చెయ్యత్తి అడిగేదాన్ని. లోపలి వాల్లెవరూ చెప్పకపోతేనే నాకు అవకాశం ఇచ్చేవారు. నేను సరైన సమాధానం చెప్పి తరగతి గది లోకి అడుగు పెట్టేదాన్ని. వాళ్ళంతా బయటకి . పాఠం పూర్తిగా వినక పోయినా జవాబు చెప్పానని నా తెలివితేటల్ని మెచ్చుకునే వారు. అప్పుడు చూడాలి, మా క్లాస్ వాళ్ళ చూపులు కొర కొర నన్ను మింగేసేలా. నేనేమో .. గొ..ప్ఫగా ఏదో సాధించేసినట్లు ..

కాని వాళ్లకి తెలియదు అసలు విషయం. నేను ముందు రోజే పాఠం చదివేసుకున్నానని. అమ్మ చదివించిందని.

వి. శాంతి ప్రబోధ

మా ఇల్లు ఓ మధురమైన జ్ఞాపకం

మాది ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గరలోని బుద్దిపల్లి అనే ఓ కుగ్రామం. ఒకప్పుడు కృష్ణా జిల్లాలోని దాకరం (ముదినేపల్లి దగ్గర). అటునుండి అరవైలో వరంగల్ జిల్లాలోని పాలంపేటకి , ఆ తర్వాత అక్కడి నుండి బుద్దిపల్లికి జీవన మార్గాన్వేషణలో వలస వచ్చిన కుటుంబం. నేను వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడే పుట్టాను. మా కుటుంబంతో పాటు రాఘవయ్య గారి కుటుంబం కూడా వచ్చింది అదే సమయంలో. ఆయన మాకు వరుసకి పెద్దనాన్న అవుతారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా నుండి వచ్చిన కుటుంబాలు కొన్ని మాతో చేరాయి . మా ఇల్లు పూరిల్లే. కానీ, విరగబూసిన పూలు, విరగకాసిన పండ్లతో మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా అక్కడే ఉండాలనిపించేలా చాలా అందంగా ఉండేది దాదాపు ఎకరం స్థలంలో. మా ఇంటికి ఎవరు వచ్చినా మర్చిపోలేరు అని తర్వాతి కాలంలో అనడం చాలా సార్లు విన్నాను. మా ఫ్రెండ్స్ మా ఇంటికి ఎప్పుడెప్పుడు రావాలా అని ఎదురు చూసేవారు . ఎందుకంటే, మా ఇంటిలో లాగా ఎవరి ఇళ్ళలోనూ అన్ని రకాల పూవులు, పళ్ళ మొక్కలు ఉండేవి కావు. అన్ని రకాల పంటలు ఎవరి దొడ్లోనూ పండేవి కావు. కానీ, మా ఇంటికి రావాలంటే అందరికీ భయం. కారణం మా తాత, మా కుక్క బూంటి.

మాది మధ్యలో రెండు నిట్టాళ్ళు వేసి కట్టిన ఇల్లు అది. బెడ్ రూమ్, హాల్ , కిచెన్, ఆ మూడు గదుల పొడవుతో పెద్ద వరండా ఉండేవి. మా పురింటికి కప్పుగా తడికలు వేసి వాటిపైన రెల్లు గడ్డి, దానిపైన వరి గడ్డి ఉండేది . ప్రతి ఏడూ వరి పాతది తీసి కొత్తది వేసి ఇంటి కప్పు నేసేవారు. రాత్రి పూటే గడ్డి పురులు తిప్పి ఉండ చుట్టి సిద్దంగా పెట్టేవారు . ప్రొద్దున్నే లేచేసరికి ఇల్లుకప్పడం చాలా వరకు అయిపోయేది . కప్పిన గడ్డిపైన అడ్డంగా నిలువుగా పురివేసిన గడ్డితో కట్టేవారు గళ్ళు గళ్ళు గా చాలా అందంగా, చూడ ముచ్చటగా ఉండేది . ఇంటి గోడలు మట్టి వి. ఒకవైపు వెదురుబద్దలతో చేసిన తడికలు కూడా ఉన్దెవి. వాటిని, గోడలని ఊక , మట్టి వేసి కలిపి బాగా తొక్కించిన మట్టితో (పిండి కలిపినట్లు) మెత్తే వారు. ఇల్లు, వాకిళ్ళు కూడా ఆ మట్టితో మెత్తేవారు . ఆతర్వాత పేడ , మట్టి బాగా తొక్కించి మృదువుగా అయిన తర్వాత దానితో ఇల్లు, గోడలు వాకిళ్ళు అలికెవారు.

మా ఇంటి ముందు నాలుగు గుంజలు పాతి వేసిన పెద్ద పందిరి ఉన్దెది. ఆ పందిరి గుంజలకి ఒక దానికి మాలతీమాధవం, మరో దానికి బటాణి, సన్నజాజి, బోగన్విలియా అలా నాలుగు గుంజలకి నాలుగు రకాలు అల్లుకుపోయి తెలుపు, గులాబీ, కనకాంబరం, నిండు గులాబీ రంగులు పరచినట్లు పందిరి వింత అందాలు ఒలకబోసేది. ఆ తర్వాత ఉండే వాకిలికి రెండువైపులా ఇటుకలను ఏటవాలుగా రోడ్డు వరకూ పేర్చి ఉండేవి . రెండు ఇటుకల మధ్య ఉన్న స్థలాన్ని ఊక, మట్టి కలిపి నానబెట్టి ఆతర్వాత బాగా తొక్కించిన మట్టితో అమ్మ, నాయినమ్మ మెత్తేవారు. ఆ తర్వాత పేడ, మట్టి కలిపి బాగా తొక్కి మృదువుగా అయిన తర్వాత దానితో చేతిని ఎడమ వైపుకి కుడివైపు కి తిప్పుతూ అలికేవారు. అది ఆరుతూ ఉన్నప్పుడు మెత్తటి చీపురుతో ఏమైనా గరకు మట్టి ఉంటే ఒక సారి ఊడ్చిముగ్గు వేసేది అమ్మ. ముగ్గు కోసం బియ్యం రెండు రోజులు నాన బెట్టి రోట్లో మెత్తగా రుబ్బేది . సన్నని పుల్లకి చిన్న గుడ్డ ముక్క చుట్టేది . దానిని చాలా ఒడుపుగా పట్టుకొని వేళ్ళతో కదిలిస్తూ ఉంటే సన్నని లతలు, పూవులు రుపుదిద్దుకోనేవి . వాటితో మా ఇంటి ముంగిలి ఎంతో అందంగా చూపరులను ఇట్టే ఆకర్షించేది . అరుగులకు, మెట్లకి మా నాయినమ్మ బొటన వేలు పిండిలో ముంచి బొట్లు పెట్టేది . అలా రెండు బోట్ల తర్వాత కొంచెం అంటే ఒక బొట్టుకు సరిపోయెంత ఖాళీ వదులుతూ వరుసగా పెట్టేది. నాయనమ్మ, అమ్మ గోడలకి పెద్ద బొట్లు, అరుగులు, మెట్లు వంటి వాటికీ చిన్న బొట్లు బొటన వేలితో పెట్టేవారు. ఆ ముగ్గుల్ని వేసిన వెంటనే వొక్కోసారి పిచ్చుకలు వాలి పిండి తినేసేవి. అందుకే అమ్మ మేం పిల్లలం ఎవరం ఉన్నా పిచ్చుకలు రాకుండా కాపలా ఉంచెది. ఇల్లు, వాకిళ్ళు లతలు, కొమ్మలు, పూవులు, మొగ్గల ముగ్గులతో అందంగా అలంకరించడం అమ్మకి ఎంతో ఇష్టమైన పని. మా అమ్మ కళాత్మకతను, సృజనాత్మకతను, నైపుణ్యాన్ని, ఓపికని తెలిపేవి ఆ ముగ్గులు. లక్ష్మి కళ ఉట్టిపడుతుందని ఇరుగు పొరుగు అనేవారు . వాకిలికి రెండు వయిపులా నందివర్ధనం, గరుడ వర్ధనం, బంతి, బంగాళా బంతి, చిలుక గోరింట, కాస్మాస్, రక రకాల రంగుల్లో చేమంతులు, చిట్టి చేమంతులు, బిళ్ళ చామంతులు, గులాబీలు , తెలుపు, ఎరుపు రంగుల్లో గన్నేరు, బిళ్ళ గన్నేరు, నూరువరహాలు, పైడాపిన్, పూబెండ ఇంకా చాలా రకాల పువ్వులు ఉండేవి. చుట్టూ ఫెన్సింగ్ లా అడవి నుండి తెచ్చిన పొరక కట్టేవారు. ఆ దడికి ముళ్ళ గోరింట, డిసెంబెర్ మొక్కలు పూలు పూసెవి.

దక్షిణం వైపున దానిమ్మ, బత్తాయి పండ్ల మొక్కలు , ఉత్తరం వైపున పశువుల కోసం చావిడి , పడమటి వైపు ఇంటి ఆనుకుని ఒక పందిరి దానికి బీర, పొట్ల, చిక్కుడు వంటి కూరగాయ మొక్కలు, స్నానాల గది, జామ, నిమ్మ, బొప్పాయి లాంటి పండ్ల మొక్కలు ఉండేవి . మిగతా స్థలంలో ఉల్లి, వెల్లుల్లి, ధనియాలు, ఆవాలు, జీలకర, రకరకాల కూరగాయలు , నుల్కోల్, ముల్లంగి, కారట్, అల్లం, చేమ దుంప వంటి దుంప కూరలు పండించేవాళ్ళం. అంతే కాదు, మా తాత కోసం పొగాకు కూడా పండించే వాళ్ళం . ఇంకా మొక్క జొన్న, సజ్జలు, రాగులు కూడా పండేవి . ఉత్తరం వైపు దడి పొడవునా గంగరేగు చెట్లు ఉన్నాయి. గమ్మతు ఏమిటంటే ఒకేరకం కాయలు తిని వేస్తే అవి తీపి, పులుపు, వగరు రుచులతో చిన్నగా, పెద్దగా రకరకాల సైజులలో, గుండ్రంగా, కోలగా, పొట్టిగా చివర మొనదేలి వివిధ రకాలుగా ఉన్నాయి. చావిడి పక్కనే ఉత్తరం వైపు మునగ చెట్లు, అవిశ, కుంకుడు చెట్లు ఉండేవి. బావికి దగ్గరలో మేము వాడిన నీళ్ళు అన్ని అరటి మొక్కల లోకి వెళ్ళేవి .

ఇంటికి వెనుక వయిపు ఉన్న మా బావి నలు చదరంగా ఉండేది . ఒక వైపు అంటే తూర్పు వైపు చేద గిరక ఉంటె పడమట వైపు మోట ఉన్దెది. పెరట్లో మొక్కలు అన్నిటికి నీళ్ళు ఆ మోట నుండే బయటికి వచ్చెవి. పెద్ద గుండ్రటి బకెట్ కి కింద తోలుతో చేసిన తొండం, ఆ బకెట్ నీటిని ముంచుకొని పయికి వచ్చాక తొండంతో వదిలేసేయడం భలే ఉండేది. మోట కాడికి ఎద్దులో, దున్నపోతులో కట్టేవారు. అవి బావికి దగ్గరగా వచ్చినప్పుడు తొండం బకెట్ నీళ్ళలో మునిగి తన లోనికి నీళ్ళు నింపుకొనేది. కొంచెం వాలుగా, కొద్దిగా లోతుగా అవి బావికి దూరంగా జరిగినప్పుడు తొండం తను నింపుకున్న నీళ్ళు బయిటికి వంపేసేది . ఆ నీళ్ళు చిన్న చిన్న కలువల ద్వారా మా పెరడు అంతా పారేవి. ఎప్పుడూ ఉదయం తొమ్మిది లోపు గానీ , సాయంత్రం నాలుగు తర్వాత గానీ మోట కట్టేవారు .

జ్ఞాపకాల పేటికను తెరిస్తే నా యాదిలో , సోదిలో లేనివీ; పొరలమాటున మరుగు పడిపోయినవీ ఎన్నెన్నో జ్ఞాపకాలు .. అవి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. , నేను నేనంటూ ఉరికి ఉరికి ముందుకు వస్తుంటే .. వాటిని ఒక క్రమంలో మీ ముందు ఉంచడం నా శక్తికి మించిన పనే . కానీ, సమయం చిక్కినప్పుడల్లా ప్రయత్నిస్తా.

వి. శాంతి ప్రబోధ

దీపం వెలుతుర్లో చదువు

Old_lampమా ఊరికి కరెంటు వచ్చినా మా ఎవరి ఇళ్ళలో కరెంట్ కనెక్షన్ ఉండేది కాదు . (ఎందుకో మరి..!) . ఆ ట్రాన్స్ ఫారం దగ్గర మాత్రం ఒక బల్బ్ కాంతులు విరజిమ్ముతూ .. వెన్నెల్లా ఆ చట్టుపక్కల ప్రకాశిస్తూ ..

మా ఊరికి కరెంటు వచ్చినా మా ఎవరి ఇళ్ళలో కరెంట్ కనెక్షన్ ఉండేది కాదు . (ఎందుకో మరి..!) . ఆ ట్రాన్స్ ఫారం దగ్గర మాత్రం ఒక బల్బ్ కాంతులు విరజిమ్ముతూ .. వెన్నెల్లా ఆ చట్టుపక్కల ప్రకాశిస్తూ .. మా ఇళ్ళలో కిరోసిన్ దీపాలు, లాంతర్లు వాడేవాళ్ళం . రోజూ సాయంత్రం నాలుగుగంటలు అవగానే దీపం బుడ్డి, లాంతరుల్లో నూనె పోసి శుభ్రంగా తుడిచేవారు మా శేషక్క (చిన్న మేనత్త) గానీ, అమ్మ గానీ. వాటి గ్లాసుల్ని మెత్తటి బుడిదతో రుద్ది కడిగి, తుడిచి ఆరపెట్టి వాటికి అమర్చేవారు . ఎప్పుడైనా వాళ్ళిద్దరూ లేకపోతేనో, లేదా వాళ్ళు వేరే పనుల్లో ఉంటేనో ఆ డ్యూటీ నాకు పడేది . సాయంత్రం ఆరు అయ్యేసరికి ఇంట్లో దీపపు బుడ్లు వేలిగేవి . వేసవిలో అయితే కాస్త ఆలస్యంగా వెలిగేవి.         old-kerosene-lamp-michal-boubin

ఒక్కోసారి దీపపు బుడ్డి గ్లాస్, లాంతర్ గ్లాస్ అంతా నల్లగా మసిబారేది . అలాంటప్పుడు వాటి వత్తి తీసి నలిపి వెలిగించడం లేదంటే కొత్త వత్తి వేయడమో జరిగేది . అప్పట్లో ఇళ్ళమ్మట తిరిగి పూసల వాళ్ళు రకరకాల వస్తువులు అమ్మేవారు. పిన్నీసులు, సూదులు, రిబ్బన్లు, రబ్బరు గాజులు, అద్దాలు, దువ్వెనలు, ఈర్పెనలు, పేల దువ్వెనలు, వత్తులు, దీపపు బుడ్డి గ్లాసులు వంటి అవసరమైన వస్తువులన్నిటికి వాళ్ళ మీదే ఆధారపడేవాళ్ళం. వాళ్ళు పదిహేనురోజులకో, ఇరవై రోజులకో ఊరూరు తిరిగి వచ్చేవారు . మా ఇళ్ళలో వత్తి అయి పోతే, అమ్మ మిగిలిన చిన్న వత్తికి గుడ్డముక్క ముడివేసేది . లేదా సూదితో కుట్టి అతికించేది . ఆ చిన్న వత్తి కూడా లేకపోతే .. గుడ్డముక్కల్ని మడత వేసి బద్దీ లాగా చేసి లాంతరు బర్నర్లో చాకచక్యంగా దుర్చేది అమ్మ. అదే దీపపు బుడ్డికైతే పొడవాటి గుడ్డ ముక్కని రెండు అర చేతులతో మెలిపెట్టి పాములాగా చేసి నెమ్మదిగా బర్నర్ లో ఎక్కించి అతి ప్రయాసతోవత్తిని పైకి తెచ్చేది. ఒక్కోసారి ఆ పని మా చిన్న మేనత్త చేసేది .

మా చదువంతా ఆ దీపం బుడ్లు, లాంతర్ల ముందే సాగేది . మమ్మల్ని చదువుకోవడానికి నాలుగు గంటలకే లేపేది అమ్మ. లాంతరులో నూనె తగ్గిపోతే దీపం బుడ్డి వెలిగించి మా ముందు పెట్టేది. తెల్లవారుజామున లేవడమంటే నాకెంతో బద్దకమ్. నిద్ర ముంచుకొచ్చేది. తెల్లవారుజామున మన మైండ్ ఫ్రెష్ గా ఉంటుందనీ, అప్పుడు చదివితే త్వరగా బుర్రకెక్కుతుందని అనేవారు నాన్న. అదేంటో .. నేనెంత ప్రయత్నించినా, నాకు మాత్రం నిద్ర ఆగేది కాదు . అందుకే అమ్మ పైకి చదవమని కేక వేసేది నా గొంతు వినిపించక పోతే . లేచి మొహం కడుక్కుని పుస్తకం అందుకొని చదువు మొదలుపెట్టేదాన్ని. అలా చదువుతూ .. ఉగుతూ .. తూగుతూ .. గొణుగుతూ .. దీపం మీదకు వాలుతూ .. పడిపోతూ .. కునుకు పెట్టేదాన్ని . నా ముంగురులు దీపం మీ ద పడి కాలి కమురు వాసన వచ్చేది . ఆ వాసనకో , అమ్మ చదువుతున్నారా అన్న అమ్మ అరుపుకో ఉలిక్కిపడి లేచేదాన్ని . ఒక్కోసారి తమ్ముడు నెమ్మదిగా గిల్లడమో నాన్నకి నా మీద చాడీలు చెప్పడమో చేసేవాడు . అప్పుడు నాకు వాడ్ని మింగేయాలన్నంత కోపం వచ్చేది. కానీ, ఏమీ చేయలేక కొరకొరా చూసేదాన్ని .

కాలి ముక్కలైన నా వెంట్రుకలు జడలోకి వెళ్ళకుండా మొహం మీద పడ్తున్నాయని, నేను కావాలని కత్తిరించుకొన్నానని అమ్మ తిట్టేది. ఒక రోజు తమ్ముడు రవి అమ్మకి నేను దీపం బుడ్డి మీద పది జుట్టు కాల్చుకుంటున్నానని చెప్పనే చెప్పాడు. ఆ రోజు తర్వాత ఎప్పుడూ దీపం బుడ్డి పెట్టలేదు చదువుకోవడానికి. అంతేకాదు మేం చదివినంత సేపు రాత్రయినా, తెల్లవారు జామునైనా తానూ మాముందే పోలీస్ లా కూర్చొనేది ఏదోపుస్తకం చదువుకుంటూ .

మా అమ్మ నాన్న మా చదువు పట్ల అంత శ్రద్ధ చూపారు కాబట్టే మాకు నాలుగు అక్షరం ముక్కలు అబ్బినట్లున్నాయి . లేదంటే మా ఊర్లో ఇతర పిల్లల్లాగే చదువూ సంధ్య లేకుండా ఉండేవాల్లమేమో !

వి. శాంతి ప్రబోధ

నింగి.. నేల .. నీరూ .. నాదే..

నింగీ..  నేలా . .  నీరూ .. నాదే.
నింగీ , నేలా , నీరూ నా అదుపులో ఉండాల్సిందే..
అంటూ విర్రవీగా..
నా తెలివి తేటలతో
నేల దున్నా
నాటు వేశా
రసాయన ఎరువులెన్నో వాడా
పురుగు మండులెన్నో చల్లా
పుట్లకొద్దీ పంటలెన్నో  పండించా
లెక్కలేనంత సంపాదించా
నా అంతటి వాడు లేదని గర్వించా
నా మేధా శక్తి తో నూతన ఆవిష్కరణలు చేశా
భూతల్లి గర్భంలోకి  చోచ్చుకుపోయా
చిద్రం చేశా
అపర గంగనే జయించానని అహంతో
పచ్చాపచ్చని చెట్లన్నీ నా కోసం నరికేసా
నా ఇష్టం వచ్చినట్లు వినియోగించా
ఫలితం..
పీల్చడానికి  స్వచ్చమైన  గాలి కరువు
తాగడానికి గుక్కెడు నీళ్ళు కరువు
తినడానికి బుక్కెడు బువ్వ కరువు
బక్క చిక్కి బతుకే బరువు
అప్పుడు గుర్తించా..
అవును, అప్పుడు గుర్తించా
ప్రకృతిలో నేనూ భాగమని..
నింగీ ..నేలా ..నీరూ ..నా స్వంతం కాదనీ ..
నియంత్రించే హక్కు నాకు లేనే లేదనీ
నన్ను నేను నిలుపు కోవాలనీ
రేపటి తరాలకు అందించాలనీ ..
అది నా బాధ్యత అనీ

వి. శాంతి ప్రబోధ

రాయాలనే ఉంది కానీ…

రాయాలనే ఉంది కానీ….

Tag Cloud

%d bloggers like this: