The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘ద్రౌపది ముర్ము’

చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం…  

చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం…  

వర్షం చినుకులు పడుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. కాస్త మునగదీసుకుని పడుకున్నది మేకల జంట. చినుకులు పెరిగాయి.  మోటార్ సైకిల్ ఆపుకుని సెల్ ఫోన్ లో వార్తలు వింటున్నాడు ఓ నడి వయస్కుడు. 

కళ్ళు మూసుకుని సెల్ ఫోన్ నుండి వచ్చే వార్తలు వింటూ ఆ మేకల జంట. 

అంతలో హడావిడిగా పరిగెత్తుకొచ్చింది గాడిద. 

“హే .. ఇది విన్నారా.. 

ఎక్కడో మారుమూల ప్రాంతపు గిరిజన మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైందోచ్.  ఎంత గొప్ప విషయం కదా..!

ఈ మారుమూల పల్లెలో పడున్న మనకి కూడా ఎప్పటికైనా ఇలాంటి గొప్ప అవకాశం వస్తే..!?”  ఆశగా అన్నది గాడిద

అదేమీ పట్టించుకోనట్టు కళ్ళు మూసుకునే ఉన్నది మేకల జంట. 

“సర్వసత్తాక , సామ్యవాద , లౌకిక , ప్రజాస్వామ్య , గణతంత్ర రాజ్యమైన భారతదేశానికి దేశాధినేత రాష్ట్రపతి.  రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత, శాసన విభాగమైన పార్లమెంట్ ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు.  ప్రభుత్వ అధినేత అయిన ప్రధాన మంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు.  అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు.  అటువంటి మహోన్నతమైన పదవికి ఓ మహిళా పోటీపడుతున్నారు.” అంటూ  ఆ సెల్ ఫోన్ నుంచి వినవస్తున్నది. 

“ఎహే.. లేవండి . ఎప్పుడు చూసినా ఇదే సీను” మేకల జంటని పట్టి కుదుపుతూ కసిరింది గాడిద. 

“అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి కి ద్రౌపది ముర్ము. నిజమే  ఒక గిరిజన మహిళ ఆ కుర్చీలో ఆసీనురాలడం భారత దేశానికి గర్వకారణం ” గాడిద కేసి చూస్తూ అన్నది కాకి 

“ఆమెవరో రాష్ట్రపతి అయితే గర్వకారణం ఎవరికి? ఎందుకు? ఎవరో ఒకరు అవాల్సిందే గా..? ” మొహం చిట్లించుకున్న ఉడుత 

“శివాలయంలో చీపురు పట్టుకునే మనిషి. దేశ అధ్యక్షురాలా”  ఎగతాళిగా నవ్వింది చిలుక 

“సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ”  తన మాటను సమర్ధించుకుంటూ కాకి 

“రబ్బర్ స్టాంప్ పోస్టులు దళిత ఆదివాసీ బిడ్డలకు, లేదా మైనారిటీలకు.  అధికారం చెలాయించే పెద్ద పోస్టులు వాళ్ళకి…   

దేశ ప్రయోజనాలే ముఖ్యంగా, అంతర్జాతీయ సమాజంలో దేశ కీర్తి ఇనుమడిస్తుంది. దేశంలో కుల మత వివక్షలేదని ప్రపంచానికి చాటి చెపుతోంది.. అంతేగా ..”  గాడిదకేసి సూటిగా చూస్తూ అన్నది  మగమేక 

“ఏముంది ఒక్కరికి పదవి ఇవ్వాలి. ఆ జాతిని మొత్తం అణచివేతకు గురి చేయాలి ” వెటకారంగా అన్నది కోతి 

“ఆదివాసీ కార్డు ఉపయోగించి ప్రయోజనం పొందాలని ఆరాటం.  అందులో రహస్యం ఏముంది. జగమెరిగిన సత్యం ఇది”  లేచి ఒళ్ళు దులుపుకుంటూ అన్నది మగమేక    

“మత సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న పార్టీ దళిత, ఆదివాసీలకు చేరువ కాలేకపోయింది.  ఓట్లు చేసుకోలేకపోయింది.  వాళ్లకు చేరువయ్యే ప్రయత్నంలో భాగమిది.  దేశ జనాభాలో 9 శాతం ఉన్న ఆదివాసీల ఓట్లపై కన్నేసి ఈ పాచిక వేసినట్టుంది ”  జోస్యం చెప్పింది చిలుక 

“అయ్యాయా .. మీ వెటకారాలు.. ,దెప్పి పొడుపులు.. 

ఒక మంచి పని జరుగుతుంటే సమర్ధించకపోగా నానా రాద్ధాంతం చేస్తారు ..ఛీ ఛీ.. “కయ్యిమంది  గాడిద 

“ఒరిస్సాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతంలో పుట్టి పెరిగిన ద్రౌపది ముర్ము సంతాల్ తెగకు చెందిన మహిళ.  దేశంలో మూడో పెద్ద ఆదివాసీ తెగ సంతాల్.  ఆమె పార్టీలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి,  పార్టీ విధేయురాలు. వార్డు మెంబర్ గా రాజకీయాల్లోకి వచ్చి. అంచెలంచెలుగా ఎదిగింది.  మూలవాసి మహిళ ద్రౌపది ముర్ము  రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవడం చారిత్రక ఘట్టం   

ఆదివాసీ గూడెం నాయకుడి కూతురుగా పుట్టిన ద్రౌపది డిగ్రీ చదివింది.  ఆమె మొదట గుమస్తాగా, తర్వాత టీచర్ గా పనిచేసింది . ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి పంచాయితీ వార్డు మెంబర్ గా గెలవడంతో ద్రౌపది ముర్ము రాజకీయ ప్రస్థానం మొదలైంది .  . 

రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. వాణిజ్య, రవాణా శాఖ మంత్రిగాను, తర్వాత మత్స్య, పశుసంవర్ధక శాఖ, మంత్రిగా పనిచేసింది.  2007 లో ఉత్తమ శాసన సభ్యురాలిగా ఎన్నికయింది. ఆ తర్వాత జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు  సమర్థవంతంగా నిర్వహించింది.” సెల్ ఫోన్లో నుంచి  వినవస్తున్నది. 

“ఆదివాసీ మహిళ గా పుట్టడం ఆమెకు కలిసొచ్చిన అదృష్టం” వెడల్పయిన మొహంతో గాడిద 

“చీపురు పట్టి శివాలయాన్ని శుభ్రం చేసిన ద్రౌపది ముర్ము వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.  పెద్ద పెద్ద పదవులు చేపట్టిన ఆమె సొంత ఊరి ఆలయాన్ని శుభ్రం చేసే కర్మ ఏమిటో ..”  వెక్కిరింతగా ఉడుత 

” అది ఆమె భక్తికి, నిరాడంబరతకు నిదర్శనం. తన మూలాలు మరవని వ్యక్తి.” టక్కున జవాబిచ్చింది  గాడిద 

రాష్ట్రపతి పదవి ఓ రబ్బరు స్టాంపు వంటిదని అనుకోగా విన్నాను.  కాకపోతే అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకని అధికార పార్టీ వీలయినంత డమ్మీ అభ్యర్థిని పెట్టడానికి చూస్తుంది. మరీ పూర్తి అనామక డమ్మీ అయితే విమర్శలు వస్తాయి కదా? అందుకని ఏదో ఓ కవరప్ క్వాలిఫికేషన్ కోసం చూస్తారు. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ లాంటివన్న మాట. ఒకవేళ ప్రత్యర్థులు విమర్శిస్తే, చూశారా,  ఆదివాసీ మహిళ అని కించపరిచారు అని ఎదురు దాడి చేయొచ్చు. మనక్కావలసిన డమ్మీ మనకు దొరుకుతుంది. ఎన్నిక ప్రాతిపదిక అదే అయినపుడు జనం కూడా అదే గుర్తిస్తారు కదా?”  మనసులో అనుకుంది మగమేక 

పంతులుగారికి ఇంట్లో ఆర్డక సమస్య అనిపించినప్పుడల్లా ఏదో ఒకటి ప్రవేశపెట్టి జనాలనుండి గో దానం, భూదానం, మరేదో దానం పొందినట్లన్నమాట అనుకుంది ఆడమేక 

“ఏంటో ఈ మనుషులు అన్ని కులం, మతంలోంచే చూస్తారు .. “గొణిగింది చిలుక 

“మన దేశంలో ప్రతి నిర్ణయం కుల లేదా మత ఆధారితమే ఎందుకంటే ప్రతి కులం, మతం ఎప్పటి కప్పుడు  మా వాటా ఏది, మా కోసం ఏమిటి?  అంటూ 

డిమాండ్ చేస్తుంది”  గొణిగింది గాడిద 

“ఓహో .. , ఏదో ఒకటి విసిరితే తృప్తిపడతారు. ఆ తర్వాత ఆదివాసీ ఓట్లన్నీ దండుకోవచ్చనా ..”  సాలోచనగా అన్నది ఆడమేక 

దేశంలో ఆదివాసీ ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రభావం నామమాత్రమే.  ఆ ప్రాంతాల్లో  ఎన్నికల్లో ప్రతిపక్షాలే మెజారిటీ సీట్లు గెలుస్తున్నారు ..  విన్న విషయాలు గుర్తొచ్చాయి కాకికి. 

” ఓహో ఆదివాసీ ఓట్లు లక్ష్యంగా చేసిన నిర్ణయమన్నమాట ” అన్నది కాకి 

“విశేషమైన ఆమె ప్రజ్ఞాపాటవాలు, మెరుగైన సేవలు,  విధాన పరమైన అంశాలపై  అవగాహన  మీ కళ్ళకు కనిపించడం లేదా.. ” వెటకారంగా అన్నది గాడిద. 

“ఆమె కన్నా విశేష ప్రజ్ఞాపాటవాలు, మెరుగైన సేవలు,  విధాన పరమైన అంశాలపై  అవగాహన ఉన్నవారు అనేకులున్నారు.  కానీ ఆమె ఎంపికకు కారణం ఆమె అస్తిత్వం అంటే ఆమె కులం , మతం, జెండర్ ”  అన్నది ఆడమేక 

“అత్యంత సాధారణ మహిళ రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎంపికై ఇప్పటి వరకు ఏ గిరిజన వర్గాల వారికి లభించని అవకాశం గౌరవం ముర్ముకి లభించింది. 

ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత స్థాయి పదవికి చేరువలో ఉన్న ద్రౌపది ముర్ము ను నేను తప్పు పట్టడం లేదు.” అన్నది కోతి  

“మూలవాసి కి ఇవ్వడం వల్ల ఆదివాసీ సమూహాలకు, ప్రాంతాలకు  ఏమైనా ఒరుగుతుందా .. ఈ రోజుకీ ఆమె స్వస్థలంలో విద్య , వైద్య, రవాణా సదుపాయాలు ఏమీ లేవట. ఆమె ఆ ప్రాంత ఎమ్మెల్యే గా, మంత్రిగా చేసినప్పటికీ తన ప్రాంత అభివృద్ధికి, తన జాతి మెరుగైన జీవితం అందుకోవడానికి ఏం కృషి చేసినట్లు ?” నిలదీసింది మగమేక   

“రాష్ట్రపతి రేసులో గెలిస్తే మొదటి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ఆమె కొత్త చరిత్ర లిఖిస్తారు, అందులో సందేహం లేదు.  కానీ ఒక ఆదివాసీ మహిళ అభ్యర్థి అయినంత మాత్రాన ఆదివాసీల జీవితాల్లో వెన్నెల కురుస్తుందన్న భ్రమలు  మాత్రం లేవు.

ఒక మూలవాసి చెట్టుపై చిటారు కొమ్మకు చేరినంత మాత్రాన మిగతా జాతికి ఆ చెట్టు ఫలాలు అందుతాయా ఏంటి? అందవుగా.. దీన్నేచెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం అంటారు. ” అర్థమైందా అన్నట్లు అందరివైపు చూసింది ఆడమేక 

“వాళ్ల జీవితాల్లో నిన్నటికీ నేటికీ రేపటికి చెప్పుకోదగ్గ మార్పేమీ రాదు. స్వతంత్ర దేశంలో ఇన్నేళ్లలో లేనిది ఈ ఐదేళ్లలో ఎలా వస్తుంది?” అన్నది అవునన్నట్టు తల ఊపిన మగమేక

“అంతేనంటారా .. “అంటూ తలగోక్కుంటూ నీరసంగా వెనుదిరిగింది గాడిద . 

వి. శాంతిప్రబోధ

Vihanga, July 2022