The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘సంక్షేమం’

మూలచికిత్స ఏదీ..? 

పైన ఆకాశమంతా మేఘావృతమై ఉంది.  ఎప్పుడైనా వర్షం కుమ్మరించేట్లుగా ఉంది. కానీ ఆ చెట్టు కింద వాతావరణం మాత్రం చాలా వేడిగా ఉంది.  వాడి వేడి చర్చ జరుగుతోంది. 

ఆ సమయానికి చెట్టు కింద చేరి హాయిగా నిద్రపోయే మేకల జంట నిద్రాభంగమైందని కాసేపు విసుక్కున్నప్పటికీ తర్వాత ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టింది.  ఆ చర్చల సారాన్ని ఇంకించుకోవడానికి యత్నిస్తున్నది. 

మీరెన్నైనా చెప్పండి అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లిచేసి పంపడమే మంచిది. తన వాదన నెగ్గించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న గాడిద. 

బాల్యవివాహాలను నిరోధించాలని సదుద్దేశంతో ఆడపిల్ల పెళ్లి వయసు పెంచితే జరిగే మంచి ఆలోచించకుండా ఎడ్డెమంటే తెడ్డెం, తెడ్డెమంటె ఎడ్డెం అనడం నీకెప్పుడు అలవాటేగా అని గొంతు చించుకున్న గోవు. 

“అదేదో తన అభిప్రాయం చెబితే నువ్వెందుకు అంత ఆవేశపడతావ్.. కూల్ కూల్ .. “ అంటూ సమాధానపరచాలని చిలుక యత్నిస్తున్నది. 

“యునెస్కో లెక్కల ప్రకారం బాల్య వివాహ బాధితుల్లో మూడింట ఒక వంతు మంది మన దేశంలోనే ఉన్నారట. అది మానవ హక్కుల ఉల్లంఘన అట.” తాను ఎప్పుడో ఎక్కడో విన్న విషయం గుర్తొచ్చి చెప్పింది కాకి. 

“మరందుకేగా .. ఈ కొత్త చట్టం తేవాలని చూసేది ” కాకి కేసి కృతజ్ఞతగా చూస్తూ అన్నది ఆవు. 

ఆడపిల్లంటే అప్పుగానో, బరువుగానో చూడటం చూస్తూనే ఉన్నాగా. ఇక వాళ్ళ భద్రత గురించిన భయాలు తల్లిదండ్రులకు ఉండడం సహజమే మనసులోనే అనుకుంది మగమేక.  

పెడదోవ పట్టిన ఆడపిల్లల గురించి ప్రతి రోజూ ఎన్ని వింటున్నాం. మరిన్ని చూస్తున్నాం.. అయినా ఇట్లా మాట్లాడతారేంటి? బుద్ధిలేకుండా ..  పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే ఆ తల్లిదండ్రుల గుండెలపై భారం దిగుతుంది.  ఆ పిల్ల పెళ్లి గురించే కాదు, ఎప్పుడు ఎక్కడ ఆ పిల్ల శీలానికి ప్రమాదం ముంచుకొస్తుందో… 

రేపు పెళ్లి ఎలా చేయగలమో.. అసలే కట్నాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి అని భయపడుతున్న ఆ కన్నవాళ్ళ బాధ మీకు కనపడలేదా .. విరుచుకుపడింది గాడిద. 

“నిజమే.. అసలే లోకంలో ధర్మం తప్పి నడుస్తున్నది.  ధర్మం తప్పిన పెళ్లిళ్లు ఎక్కువైపోతున్నాయి.  అవి హత్యలకు దారితీస్తున్నాయి” బాధగా మొహం పెట్టి అన్నది చెంగు చెంగున చెట్టుపై నుండి దూకుతూ అన్నది కోతి.  

ఆ గొంతులో  వ్యంగ్యమో, వెటకారమో ధ్వనించి చురుగ్గా చూసింది ఆవు. 

‘అంతేనా.. ఒక మతం అమ్మాయిలను ప్రేమ ముగ్గులోకి దింపి పెళ్లి చేసుకుని మరో మతంలోకి మార్చేస్తున్నారు.  జరుగుతున్నది చూస్తుంటే ఒళ్ళు మండిపోతున్నది.  అందుకే..” పళ్ళు కొరికింది  ఆవు.  

“అయితే ఇక 18-21 ఏళ్ల  మధ్య కులాంతర, మతాంతర ప్రేమ పెళ్ళిళ్ళు ఉండవన్నమాట ” దూరంగా డాన్స్ చేస్తూన్న నాట్యమయూరాన్ని చూస్తూ  పలికింది చిలుక 

“ఇప్పటికే చుట్టాలు, ఇరుగుపొరుగు ఇంకెప్పుడు పెళ్లి.. ఎప్పుడు పప్పన్నం పెడతావ్ అని.., ఇంకెన్నాళ్లు ఆడపిల్లను ఉంచుకుంటావ్ అని ఆ తల్లి దండ్రుల్ని పీక్కుతింటుంటేనూ… 

అయినా వీళ్ళకి వోటెయ్యడానికి 18 చాలు. పెళ్ళికి మాత్రం 21 కావాలా.. ?

నా పెళ్లి నా యిష్టం. నువ్వెవరు నా కొంప లోకి దూరి నా పై పెత్తనం చేయడానికి? అనరేంటి .. నేనయితేనా…” కోపగించుకుంది కోతి. 

“నువ్వు చెప్పింది అక్షరాలా నిజం కోతి  బావా.. నువ్వయితే లంకాదహనం చేసినట్లుండేదేమో .. ” నవ్వింది కాకి  

“సినిమాలే అనుకుంటే చేతిలో సెల్ ఫోన్ లు వచ్చాక ఈ ఆడపిల్లలు  ఆగుతున్నారా.. అబ్బో.. చెప్పనలవి కానంత విచ్చలవిడిగా తయారయ్యారు. 

ఇక ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయకపోతే ఆ వయసు చేసే ఆగడాలను ఆపగలిగే శక్తి ఎవరికుంటుంది?” వత్తాసు పలికింది పక్కన ఉన్న మరో గాడిద 

“ఎంత సేపూ ఆడపిల్లలని ఆడిపోసుకోవడమేనా.. ఆ మగ సచ్చినాళ్ళ బుద్ది ఎక్కడేడ్చింది? మరి వాళ్లకు చేయరా పెళ్లిళ్లు?”  కయ్ మన్నది పై నుండి చిలక 

” ఆ వాళ్ళకేంటి మగమహారాజులు .. వాళ్లతో పోలికేంటి విడ్డురంగా.. ” అన్నది మొదటి గాడిద. 

నిజమే కదా.. గల్లీ నుంచి ఢిల్లీ దాక నాయకుల్ని ఎంపిక చేసే హక్కు ఉన్న ఆమెకు తనతో కలసి జీవితం పంచుకునే తోడుని ఎందుకు ఎన్నుకోనివ్వరు? అని ప్రశ్న మొదలైంది ఆడ మేకలో 

“తమకన్నా చిన్న వయసు వాళ్ళని చేసుకుంటే మగవారికి సుఖం, శాంతి . చెప్పిన మాట వింటుంది . భయం , భక్తి తో మెలుగుతుంది. “అంటూ ఇంకా ఏదో అన్నది రెండో గాడిద. 

“పూర్ణమ్మ కథని మర్చిపోయినట్లున్నారు” అంటున్న చిలక మాటలు అకస్మాత్తుగా మొదలైన వర్షపు చినుకుల చప్పుడులో కలిసిపోయాయి.

అంతలో ఇద్దరు యువతులు  ఆ చెట్టు కింద చేరారు. పట్నంలో కాలేజీకి సైకిల్ పై వెళ్లి వస్తుంటారు ప్రతి రోజు. 

మీద పడ్డ చినుకులు చున్నీతో తుడుచుకుంటూ “ఇక చదివింది చాల్లే  ఈ ఏడు పెళ్లి చేయాల్సిందేనని మా అమ్మ వాళ్ళు పట్టుబడుతున్నారే.. 

ఏం చేయాలో తోచడం లేదు” అన్నది సన్నగా చిన్నగా గాలొస్తే ఎగిరిపోయేటట్టున్న అమ్మాయి. 

“పెళ్ళిపోరు లేని ఆడపిల్లలెవరుంటారే..?”అని నవ్వేసింది పక్కనున్న కోలమొహం పిల్ల. 

“అట్లానవ్వకు.. నాబాధ చెప్తే నీకు నవ్వులాటగా ఉందా.. ఏదైనా సలహా ఇస్తావని నేనకుంటే.. చిర్రుమన్నది బక్కపిల్ల. 

“పెళ్లి వయసు మగపిల్లలతో సమానంగా 21 ఏళ్ళకి పెంచుతూ చట్టం చేస్తున్నారట. కేబినెట్ నిర్ణయం అయిందట మొన్న వార్తల్లో విన్నాను” అన్నది రెండో పిల్ల. 

“ఓహ్ ఎంత మంచి మాట చెప్పావ్.. అయితే పెళ్లి ఆపడానికి ఓ మార్గం దొరికినట్టే. మనం ఎంచక్కా చదువుకోవచ్చు.” కళ్ళు మెరుస్తుండగా అన్నది సన్నటి పిల్ల 

ఒక క్షణం ఆగి “నాకు అర్ధం కాక అడుగుతున్నాను. 18 ఏళ్ళు దాటితే ఆడ , మగ ఇద్దరూ పెద్దవాళ్లకింద లెక్క . 

ఆడ మగ సమానం అని చెప్పే చట్టం పెళ్లి వయసు ఇద్దరికీ వేరు వేరుగా ఎందుకు పెట్టిందా అని నాకెప్పుడూ సందేహమే” అన్నది సన్నటి పిల్ల 

“అవును , నిజమేనే.., ఆ దిశగా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఇద్దరికీ 21. సమానం .. సమానం ” నవ్వేసింది రెండో పిల్ల 

“ఆడామగా సమానం అని మన రాజ్యాంగం చెబుతుంది. కానీ సమానంగా ఉన్నామా? మనని సమానంగా ఎక్కడ చూస్తున్నారు చెప్పు?  నాకంటే నాలుగేళ్లు వెనుక పుట్టిన తమ్ముడికి ఉన్న స్వేచ్ఛ నాకుందా.. ప్రతి విషయానికి ఎంత యుద్ధం చేయాల్సి వస్తున్నది?.  చట్టం తెచ్చినంత మాత్రాన మనకి సులువు అయిపోతుందా.. ఊహూ .. లేదు. ” రేపు చేయాల్సిన యుద్దాన్ని తల్చుకుంటూ అన్నది బక్కపిల్ల 

నాలుగు చినుకులు కుమ్మరించి హడావిడి చేసిన నల్లని మేఘం ఎటో వెళ్లిపోవడంతో ఆ అమ్మాయి లిద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు సాగి పోయారు. 

ఆ ఇద్దరి మనస్సులో ఆటంకం లేకుండా చదువుకోగలమా.. కలలు నెరవేర్చుకోగలమా.. అనేకానేక సందేహాలు, ప్రశ్నలు సుడులు తిరుగుతుండగా .. 

వారి మాటలు విన్న ఆవు “బాల్య వివాహాలు నిరోధించడానికి, చిన్న వయసు గర్భాన్ని నిరోధించడానికి, యువతుల మానసిక , శారీరక ఆరోగ్యం సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అయినా ఆడపిల్ల , మగపిల్లవాడు అనే తేడాలు ఇక ఏముంటాయి. అంతా సమానమే ” గాడిదకేసి కళ్ళెగరేసి చూస్తూ అన్నది ఆవు .  

” చాలు చాల్లే .. మా చెప్పొచ్చావ్ .. 

ఏ గల్లీ లో చూసినా , ఢిల్లీలో చూసినా మాటలు చెప్పినంత సులభం కాదు ఆ తేడా పోవడానికి. 

చదువు సంధ్య లేని బస్తీల్లో జనం కంటే చదువు, డబ్బు ఎక్కువైన వాళ్లలోనే ఆ తేడాలు మరీ ఎక్కువ.  అదిగో ఆ హాస్పిటల్ డాక్టరు తన పెళ్ళానికి ఇప్పటికే మూడు సార్లు అబార్షన్ చేయించాడు. ముందు ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇప్పుడు మళ్ళీ తొమ్మిదో నెల కడుపు. ఈ సారి మగపిల్లాడేనటలే..” అన్నది కాకి 

“కుడి ఎడమ అవుతుందా.. ఎడమ కుడి అవుతుందా .. ఇది అంతే ఆడ మగ సమానం ఎప్పటికీ కాదు. కాలేరు” అన్నది మొదటి గాడిద 

“నోటిమాటేగా అంటే పోయిందని అంటారు కానీ, చేతల్లో ఒప్పుకుంటారా.. ఒకమ్మాయి అబ్బాయి పార్కులో కూర్చుంటేనే ప్రేమికులని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు కానీ.. ” సణిగింది కోతి. 

అందరి మాటలు మౌనంగా వింటున్న మేకల జంట నోరు విప్పింది. 

“ఏ మతంలో చూసినా , ఏ కులంలో చూసినా అమ్మాయి పెద్దమనిషి అయితే చాలు ఇక ఆ పిల్ల పెళ్లి గురించి ఆలోచన మొదలవుతుంది. 

ఆమె పెళ్లి ఆమె ఇష్టం కావాలి. నిర్ణయం ఆమెది కావాలి.    మధ్యలో కుటుంబం, బంధువులు, కులం,మతం, రాజ్యం ఎందుకు పెత్తనం చేయాలి. 

పెళ్లి వయసు పెరగడం మంచిదే కాదనలేం. కానీ దానివల్ల ఆడపిల్లకు కావలసినవన్నీ మగపిల్లవాడితో సమానంగా అందుతాయా..? ఇన్నాళ్లు లేనిది చట్టం వల్ల జరిగిపోతుందా..?

మరయితే, ఆడపిల్లల సంక్షేమం కోసం ఇప్పటికే చాలా చట్టాలున్నాయి. పెళ్లి విషయంలో చట్టాలున్నాయి. బాల్య వివాహ చట్టం 1929 ఉంది. ఆ తర్వాత 1978లో సవరణ చేసారు .  2006లో బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చింది . బాల్య వివాహం నేరం అన్నారు. 

అయినా పెళ్లి వయసు రాకుండా పెళ్లిళ్లు జరుగడంలా..? 

అసలు తల్లి గర్భంలోంచి వెలుగులోకి రాకుండానే చిదిమేయడంలా..?

ఆహరం , ఆరోగ్యం, విద్య , వైద్యం, ఉద్యోగం అన్నిట్లో ఆమె వెనుకబాటు స్పష్టంగా కనిపిస్తున్నదే.  

ఆడపిల్లకు ఇంట బయట రక్షణ ఉందా?  ఇక చట్టం ప్రయోజనాన్ని ఏమాశించగలం.. ?!” అన్నది మగమేక 

“ఊ.. ఎన్ని చట్టాలుండి ఏం లాభం? జరగాల్సిన అనర్ధాలన్నీ జరిగిపోతూనే ఉన్నాయి.  ఆడపిల్లల తెలివితేటలన్నీ, వాళ్ళ శక్తి సామర్ధ్యాలన్నీ తనకు, తన కుటుంబానికి, ప్రపంచానికి అందకుండా పోతున్నాయి.  

ప్చ్ .. రోగం ఒకచోట అయితే మందు మరో చోట… 

అసలు రోగానికి మూలం ఎక్కడో చూడకుండా, కారణం వెతక్కుండా, మూల చికిత్స జరక్కుండా పైపై పూతలు .. ప్చ్..  ఎన్ని పూసినా  ఏం లాభం?” దీర్ఘంగా నిట్టూర్చింది ఆడమేక 

వి. శాంతి ప్రబోధ 

Published in Vihanga January 2022

కనురెప్పే కాటేస్తే.. 

కనురెప్పే కాటేస్తే.. 

“ఇంత కంటే పాపం ఏముంటుందమ్మా.. ” నోటిమీద  వేసి అన్నది లోనికి వస్తున్న యాదమ్మ. 

ఏమైందన్నట్లు చూస్తున్న నా కేసి చూసి “మా బస్తీలో ఉన్నడు లే అమ్మా .. ఓ పశువు. ఆ మాట అంటే పశులను తప్పు పట్టినట్టయితదేమో.. 

అంతకంటే హీనం బతుకు .. తూ .. ఆని బతుకు చెడ..  నిట్టనిలు నరికెయ్యాల 

కండ్లకు ఆడిది తప్ప కన్న బిడ్డ కానరాక పాయె.  దాని బతుకు బుగ్గి జేసిండు. అని మొదలారిపోను” నోటికొచ్చిన తిట్లు మొదలెట్టింది. . 

” అసలు ఏమైంది యాదమ్మా”  

“ఏమున్నదమ్మ .. ఆడిపిల్లకు ఇల్లే కాపాడుతది అనుకుంటం కానీ ఏడిదమ్మ..? 

సొంత ఇంట్లనే, సొంత తండ్రి కాడనే లేకపోతే  ఇంకా ఎక్కడ ఉంటది? 

తాగుబోతు సచ్చినోడు .. ఆరు నెలల సంది చెరబడుతున్నాడట. పాపం బిడ్డ, ఎంత నరకం పడిందో.. యాతన పడిందో .. 

బడిలె  కళ్ళు తిరిగి పడిపోయిందట. డాక్టరుకు పిలిపిచ్చి చూపిచ్చింరట. ఆ డాక్టరుసాబు ఈ పోరికి కడుపు అని చెప్పిండు.  అప్పుడు నోరిప్పి నిజం చెప్పింది బిడ్డ. ఎవరికన్నా ఈ విషయం  చెబితే చంపుతని బెదిరిచ్చిన తండ్రికి బయపడి ఎవరికీ చెప్పలేదట.  

తల్లి ఉంటేనన్న ఏమన్న మనసులో బాధ చెప్పుకుంటుండెనో ఏమో..  

ఆ తల్లి సచ్చి మూడేండ్లయె.. తాగొచ్చి మొగడు తన్నిన తన్నులకే అది సచ్చిందట. తండ్రి బిడ్డ ఉండేది. 

మేస్త్రీ పనికివోతడు. తప్పతాగి పంటడు  అనుకుంటిమి గాని ఇట్ల బిడ్డతోనే .. ఛి చి.. పోలీసులు పట్కపోయిన్రు.  

ఇప్పుడు పట్కపోయిన్రు .. 

… పగుల తాగుంరి అని బస్తీలల్ల అమ్ముతరు. అటెన్క తప్పు చేసిన్రని ఠాణల నూకుతరు.  ఇది తీరేనా ఈ సర్కారోళ్లకు?”  అంటూ విసురుగా లోపలి పోయి చీపురు చాట అందుకున్నది యాదమ్మ  

నిజమే ఆమె మాటల్లో వాస్తవమున్నది.  ఆమె ఆవేశంలో అర్ధమున్నది. 

ఒంటిని ఇంటిని, కుటుంబ బంధాలను సామాజిక బంధాలను, విలువలను పొట్టన పెట్టుకుంటున్న మద్యం వద్దని ముప్పై ఏళ్ల  క్రితమే మహిళలు యుద్ధం ప్రకటించారు. 

ఉద్యమం చేసి నిషేధం సాధించుకున్నారు.  కానీ ఏమి లాభం? 

మద్యంతోనే, మద్యం అమ్మకాలతోనే నడిచే ప్రభుత్వాలకు మహిళల ఆవేదన అర్థం చేసుకోలేని కరకు గుండెలాయె.  

పోరాడి తెచ్చుకున్న మద్య నిషేధ బిల్లుకు తూట్లు పొడిచారు. గల్లి గల్లీకి దుకాణం తెరిచి పోలీసుల్ని పెట్టి మరీ అమ్మడం మొదలుపెట్టి సామాన్యుడి జేబు గుల్ల చేసి గల్లాపెట్టి నింపుకుంటున్న వైనం మనసును మెలిపెడుతున్నది.

మద్యంతో మండిపోయే జీవితాల, కుటుంబాల గురించి చిన్న పిల్లలకు ఉన్న బుద్ది జ్ఞానం ఏలికలకు లేకపోయే.. 

ఆ మధ్య ఒక ఊళ్ళో పిల్లలు తమ కుటుంబ రాబడి ఎంత? ఖర్చు ఎంత? దేనికి ఖర్చు చేస్తున్నారు అని చేసిన ఒక సర్వే గుర్తొచ్చింది. 

తమ తల్లిదండ్రుల సంపాదనలో అధిక మొత్తం మద్యం కోసం, పొగాకు కోసం అవి తెచ్చే రోగాల కోసం, గొడవల కోసం ఖర్చు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.  వెంటనే తమ ఊళ్ళో ఏ రకమైన మద్యం అమ్మడానికి వీల్లేదని తీర్మానించారు.  మద్యం దుకాణం ముందే తాము ఎట్లా అన్యాయం అయిపోతున్నామో తెలుపుతూ వీధి నాటికలు వేశారు.  ఎవరికి వారు తమ ఇంట్లో పెద్దలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.  

ఒకవైపు సంక్షేమం పేరుతో చిల్లర విదిలిస్తూ మరో వైపు చేతిలో ఉన్నదంతా ఊడ్చేసి ఖజానా నింపుకుంటున్న వారిని ఏమనాలి?  

అది సంక్షేమం అంటే ఏంటి?  

అన్నిరకాల మద్యం దుకాణాలకు డోర్లు బార్లా తీసి జనాన్ని మత్తులో ముంచడమా?  

ఏడాదికేడాది భారీగా మద్యం అమ్మకాలు చేయడమా? 

పెరిగిన సేల్స్ తో సెలబ్రేషన్ చేసుకోవడమా?   

 ప్రజల విచక్షణ, ప్రశ్నించే స్వభావాన్ని, చైతన్యాన్ని మద్యంతో మట్టు పెట్టడమా?  

వికసించాల్సిన కుటుంబాన్ని, కుటుంబ బంధాల్ని, సామాజిక బంధాల్ని, విలువల్ని, మానవ వనరుల్ని బొంద పెట్టడమా? 

మనని మనం, మన ఆడపిల్లల్ని మనం,  కూలుతున్న మన కుటుంబ బంధాల్ని మనం, మన సామాజిక బంధాల్ని, విలువల్ని మనం కాపాడుకోవడం కోసం మళ్ళీ మద్య నిషేధం కోరుతూ పోరాటం చేయక తప్పదేమో..  

ఆదాయం కోసం రాజ్యాంగ బాధ్యత విస్మరిస్తూ జాతికి తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వాలపై  ఉద్యమించక తప్పదేమో..   

కనురెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వ ఆధ్వర్యంలోనే, జరుగుతున్న విధ్వంసం పై  యుద్దానికి ప్రజలతో పాటు, రాజకీయ పార్టీలు,  సామాజిక సంస్థలు కలసికట్టుగా సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చిందేమో..!  

వి. శాంతి ప్రబోధ