The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘స్వాతి సోమనాద్’

ఒక పరి పరి.. గెలుపెవరిది ?

“హమ్మయ్య ఇప్పటికి నా ప్రాణానికి శాంతి నిచ్చింది.  ఇక హాయిగా కళ్ళు మూసుకోవచ్చు ” అన్నది చెట్టు కింద చేరిన గాడిద. 

“ఏమిటో .. అంత శాంతినిచ్చింది? దీర్ఘం తీసింది” ఆడమేక 

“ఆ పిల్ల ఆ వీడియో తీసేసిందిగా.. అందుకు” ఒక్క గెంతులో ఆడమేక దగ్గర చేరిన గాడిద అన్నది. 

“ఏ పిల్ల ?” మగమేక ప్రశ్న 

“లోకమంతా కోడై కోస్తుంటే .. మీకింకా ఆ విషయమే తెలియదా.. ” వింతగా చూస్తూ  గాడిద.  

“పనికిమాలిన వాగుడంతా ఆపి అసలు విషయం ఏంటో చెప్పు” కసిరింది ఆడమేక 

” ఆ  స్టా..ర్ర్ సింగర్ చేసిన వీడియో గురించి” వత్తి పలుకుతూ అని మళ్ళీ తానే

“ఎందుకబ్బా.. అంత విసుక్కుంటావు” కినుకగా అన్నది గాడిద 

“ఓ ఆ గాయకురాలు గురించా.. చాలా బాగా పాడుతుంది. ఆమె గొంతు వినిపిస్తుంటే ఆగిపోయి చాలా సార్లు విన్నా .. 

ఊ.. ఇప్పుడర్థమైంది నువ్వేం చెప్పబోతున్నావో …” అంటూ ఆగింది ఆడమేక 

“మీ సస్పెన్స్ తగలెట్టా .. అసలు  విషయం చెప్పండేహే “కసిరింది మగమేక 

” ఆ పిల్ల అసలు ఆడపిల్లేనా..  ముఖానికి బొట్టు లేదు, 

 పెళ్ళైన ఆడపిల్లేనా ..  కాళ్ళకు మెట్టెలు లేవు. 

అది చాలక పోగా అన్నమయ్య కీర్తనను కాళ్ళుపుకుంటూ పాడి అపహాస్యం చేసింది. అది తెలిసి అన్నమయ్య వంశీకులు ఆమె యూ ట్యూబ్ ఛానెల్ లో పెట్టిన ఆ  వీడియో తీసేయమని చెప్పినా పెడచెవిన పెట్టింది. పైగా నా ఇష్టం అని తీయనే తీయను అని మొండికేసింది. 

తిరుమలకు రానివ్వం అని హిందూ సంఘాలు, కేసు పెడతామని అన్నమయ్య వంశీకులు గట్టిగా హెచ్చరించే సరికి తోక ముడిసిందనుకో.. ” కళ్ళు మెరిపిస్తూ గొప్పగా చెప్పింది గాడిద. 

“ఓ .. అదా .. నీ సంతోషానికి కారణం” మగమేక 

“ఆ వీడియో ముచ్చట ఈ చెట్టు కిందే విన్నాను.  ఆ..ఆడకూతురు  ఏమీ చేయలేదులే అని  వందల మంది మీద పడి ఉతుకుడే ఉతుకుడు. పనికి మాలిన జనం. పలికిమాలిన వేషాలు..” అంటున్న ఆడమేకను అడ్డుకుంటూ ఇంతకీ ఎవరిమీద నీ కోపమంతా అన్నది మగమేక. 

“తగలడ్డాయిగా.. పని పాట లేని బాచ్ లు.   

తుమ్మినా, దగ్గినా.. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎగబడే కుక్కమూతి పిందెలు.. అవిచేసే యాగీ తక్కువా మరి! ప్చ్.. ఏం చేస్తుంది. తీసి పడేసింది.

ఆ వీడియో ఏముందని మొన్ననే చూశాను. నాకయితే అందులో తప్పేం కనపడలేదు. 

ఏదో ఆ పిల్ల సరదాగా పాడుకుంది . దానికి ఈకలు పీకాలా.. వంకర మనుషులు.. వంకరేషాలు కాకపోతే.. ” ఆవేశపడింది ఆడమేక 

“కాళ్ళు ఊపుకుంటూ ఒక పరి పరి వయ్యారమే.. అంటూ దేవుని కీర్తన పాడొచ్చా..” తీవ్రంగా  గాడిద

“కాళ్ళు కనబడితే అశ్లీలం అయిపోతుందా.. ” ఉడుత ఆశ్చర్యం

“అలా ఊపుతూ ఆమె పాడింది దేవుని పాట కాబట్టి ఖచ్చితంగా హిందూ సంప్రదాయం పాటించాలి. ఆ స్పృహ ఉండాలి” పూనకం వచ్చినట్టు ఊగిపోతూ  గాడిద 

“దేవాలయాల్లో ఉన్న భంగిమల కన్నా దారుణమైనదా కాళ్ళు ఊపడం. 

ఏది ఏమైనా చూసే కళ్లను బట్టి, దృష్టి కోణం బట్టి ఉంటుంది” నిదానంగా ఆలోచిస్తూ అన్నది ఆడమేక

“ఏంటేంటి..? నువ్వు కూడా ఆ అమ్మాయి మాట్లాడినట్టే మాట్లాడుతున్నావ్.  అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ము మీద తన్నినట్లు” గొణిగింది గాడిద.

అన్నమయ్య రాసిన కీర్తనలు మూడొంతులు శృంగార సంబంధమైనవే .  అన్నమయ్యతో శృంగార సన్నివేశాలు తీస్తే తప్పులేదు.  

సన్యాసి అయిన శంకరాచార్యులు అంగాంగ వర్ణన చేసినా , కుమార సంభవం లో పార్వతీ పరమేశ్వరుల సురత క్రీడల గురించి రాసిన కాళిదాసును. కృష్ణుడి కేళీ విలాస చేష్టలను వర్ణించిన శ్రీనాథుడు  గురించి వీళ్లకు తెలియదా.. 

కాళిదాసు, అన్నమయ్య, శ్రీనాధుడు, పోతన మొదలైన వాళ్లపై కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయని  గొడవ చేస్తారా?  వీధుల్లోకి లాగుతారా? ఊహూ.. ఆపని చేయరు.  ఆడకూతురిని అన్యాయంగా ఆడిపోసుకుంటున్నారు లోలోన అనుకున్నది మగమేక.  

“పూజలు చేస్తూ అంగాంగ వర్ణన చేసే ఆచారాన్ని ఏమనాలి? దానికి నీ సమాధానం ఏంటో..” సవాల్ విసిరినట్టు ఆడమేక. 

“నిజ్జంగా అపచారాలు జరుగుతున్నా నోరెత్తని వీళ్ల ప్రతాపం బలహీనులు అనుకున్న వాళ్లపైనే” అన్నది ఉడుత 

“ఆ అమ్మాయి తప్పు చేసింది. చాలా తప్పు చేసింది. అసలు ఆ వీడియో తీయకుండా ఉండాల్సింది. 

స్వాతి సోమనాద్  “కామసూత్ర ”  సాంఘిక ప్రయోజనం కోసం చేశారు.  అయినా ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. 

తలంచితే ప్రతి వెధవ మనోభావాల పేరుతో నెత్తినెక్కి తైతక్క లాడతానంటాడు. 

ఆమెకు నచ్చినట్లు చేస్తుంది.  ఆమెకు పాడాలని పించింది పాడుతుంది. ఆడాలనిపిస్తే ఆడుతుంది. అది ఆమె ఇష్టం. కానీ వాళ్ళ ఇష్టం ప్రకారం నడుచుకోమనడానికి వాళ్లెవరు? వాళ్ళ పెత్తనం ఏంటి?

మేత్తాగా ఉంటే మొట్టుతూనే ఉంటారు” తీవ్రంగా ప్రశ్నించింది ఆడమేక 

“మన భారతీయత సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవద్దా..” ఉక్రోషంతో అరిచింది గాడిద 

ఆ అమ్మాయి వీడియో పబ్లిక్ లో పెట్టింది కాబట్టి ఈ గొడవ. పెట్టకుండా ఉంటే..?

వందల ఏళ్ల క్రితం ఎప్పుడో అన్నమయ్య సమాజంలోకి వదిలిన కీర్తనలు అవి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పాడుకుంటున్నారు.

ఒకసారి ప్రజల్లోకి, సమాజంలోకి వచ్చాక వారి కుటుంబ ఆస్తి ఎట్లా అవుతాయి? ఇన్ని తరాల తర్వాత వారికి ఏం హక్కు ఉంటుంది? 

ముఖానికి బొట్టు , కాళ్ళకి మెట్టెలు భక్తి చిహ్నాలా .. 

చెత్త పనులన్నీ చేసి బొట్టు మెట్టెలు పెట్టుకుని గుడికి వస్తే భక్తి ఉన్నట్లా  తీవ్రంగా ఆలోచిస్తున్నది చెట్టు మీద కూర్చున్న కోతి. 

“కాళ్ళకు మెట్టెలు, పట్టీలు, ముఖానికి బొట్టు, మెడలో తాళి ఉన్నా లేకపోయినా అందువల్ల సమాజానికి వచ్చిన నష్టం, కష్టం  ఏమిటట?  అది పూర్తిగా ఆమె వ్యక్తిగతం కాదా.. 

భారతీయత, సంప్రదాయం నిలపాల్సింది కాపాడాల్సింది ఆడవాళ్ళ బాధ్యతేనా? మగవాళ్లకు లేదా.. 

అన్నింటా చొరబడి మనో భావాలు దెబ్బతిన్నాయని వీరంగం చేసే వాళ్ళ పద్దతి చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టులేదూ..?” అన్నది ఆడమేక. 

” నిజంగా అన్నమయ్య ఉంటే ఈ రోజు ఎలా స్పందించేవాడు? ఊపుతున్న ఆమె కాళ్ళ మీద మరో కీర్తన రాసేవాడేమో..” నవ్వింది కోతి. 

అదేమీ పట్టించుకోని ఆడమేక “ఒకరి స్వేచ్చని, వ్యక్తీకరణని, తినే తిండిని, కట్టే బట్టని, ప్రేమించే వ్యక్తిని చెప్పడానికి వాళ్లెవరట?  

ఓవర్ ఆక్షన్ కాకపోతే కీర్తనలు దేవుడి ముందే పాడాలని రూలెక్కడైనా ఉందా.?” అన్నది 

“ఆ స్టార్ సింగర్ ఆ కీర్తన మార్చేసినప్పటికీ తన గళం మాత్రం గట్టిగా వినిపించింది. 

ఏదైనా చూసే వాళ్ళ దృష్టి కోణం నుంచే ఉంటుందంటూ..  తన యు ట్యూబ్ ఛానెల్ వేదికగా” అన్నది లోక సంచారం చేసొచ్చిన కాకి. 

“ఇంతకీ ఆ అమ్మాయి గెలిచిందా? ఓడిందా? ” మగమేక సందేహం 

వి. శాంతి ప్రబోధ 

Vihanga, August 22