The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘pulished in Prasthanam’

జీవన పోరాటంలో

శాంతి ప్రబోధ
9866703223
”నువ్వుంటే బిడ్డకీ గతి పట్టకపోను” అంది పక్కింటి రాజమణి. ఇంకా ఇంట్లోకైనా అడుగుపెట్టని లచ్చమ్మను చూస్తూ.
ఆ మాట వినిపించిందేమో… ప్లాస్టిక్‌ నులక మంచంపై పడి ఉన్న గంగ కొంచెం కదిలినట్లుంది. అవయవాలు సహకరించక ‘అమ్మా…’

 

అని బాధతో గట్టిగా మూలిగింది. ఆ క్షణంలోనే లచ్చుమమ్మ ఇంట్లో అడుగు పెట్టింది.
మొగుడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా పచ్చిపుండు అయి కదలలేక మెదలలేక మంచంలో పడిఉన్న కూతుర్ని ఆ స్థితిలో చూసిన లచ్చమ్మకు పొట్టలో పేగుల్ని మెలితిప్పనట్లుగా.. గుండె పట్టేసినట్లుగా అయింది. పువ్వుల్లో పెట్టి పెంచుకున్న బిడ్డ. పచ్చగా ముద్దబంతి పువ్వులాగా ఉండేది.  వాడిన మందారంలా అయింది. కూతుర్ని చూస్తున్న ఆమె కళ్ళమ్మట జలధార. మనసు మూగగా రోదిస్తుండగా ..  దైన్యంగా చూస్తున్న కూతురి చూపులు ఆ తల్లి మనసుని పిండేస్తున్నాయి.
అరవయ్యోవడిలో ఉన్న లచ్చుమమ్మ ఓ సంస్థ నడిపే ఆశ్రమంలో వంటమనిషి. విషయం తెలియగానే ఉన్న పళాన వచ్చేసింది. తానుపడ్డ కష్టం కూతురు పడకూడదని గారాబంగా పెంచుకుంది. సుకుమారంగా పెరిగిన పిల్ల నేను లేకుంటే ఏమైపోతుందో.. అన్న ఆలోచనే లచ్చుమమ్మకు వెన్నులో చలి పుట్టించింది. తను బిడ్డకి ప్రేమను పంచింది. మనుషుల్ని ప్రేమించడం నేర్పింది. మంచి చెడు తెలిపింది. కాని కష్టం వస్తే దాన్ని ఎదుర్కొనే స్తైర్యం ఇవ్వలేక పోయింది. ఎంతసేపూ నేను పడ్డ కష్టం నా కూతురు పడకూడదు అనుకున్నానే కాని జీవితంలో కష్ట సుఖాలు రెండూ ఉంటాయని వాట్ని మనం ఎదుర్కోవాల్సిందేననీ, గుండెలో ధైౖర్యం నింపుకోవాలని చెప్పలేదే, మనిషిలో గట్టిదనం నింపలేదే అని మధన పడుతున్న లచ్చుమమ్మకు గతం కళ్ళ ముందు మెదిలింది.
అమ్మగారి ఊరిలో ఐదవ తరగతి చదివింది. ఆరవ తరగతికి పొరుగూరి పెద్ద బడిలో చేరుతానని చాలా గొడవ చేసింది. ‘మన ఇండ్లల్ల ఆడిపిల్లకు బడికి పంపుడే గొప్ప. ఇంత దంక సదివిందే మస్తైంది. సాలు.. సాలు.. పొరుగూరికి పంపుతమా’.. సణిగింది నాయనమ్మ. అమ్మ మనస్సులో ఏముందో తెలియదు. కానీ.. నాన్న పక్క ఊరు పంపడానికి అసలు ఇష్టపడలేదు. ఇంటి దగ్గర ఉండి తల్లికి సహాయం చేస్తూ ఇంటిపని వంటపని నేర్చుకొమ్మని హుకుం జారీ చేసాడు తండ్రి. అలా రెండు నెలలు గడిచాయో లేదో మంచి సంబంధం అంటూ రాజమల్లుతో పెళ్ళి. భర్తతో ఏడడుగులు వేసి అత్తింటికి చేరింది చిన్నారి లచ్చమ్మ. అత్తింటికి చేరిన నెలలోపే వాస్తవం తెలిసింది. తల్లిపోరు పడలేక తనను పెళ్ళి చేసుకున్నానని, ముందే వేరే మహిళతో శారీరక సంబంధం ఉందనీ, వారికి పిల్లలు కూడా ఉన్నారనీ భర్త చెప్పిన మాటలు విని అవాక్కైంది లచ్చమ్మ. ప్రియురాలితోనే కాలం గడిపే రాజమల్లు డబ్బు అవసరమైతే ఇంటికి వచ్చేవాడు. భార్యను ఏనాడు పట్టించుకోలేదు. మొగుడిని కొంగున కట్టేసుకుని సంసారం చేయడం రాని దద్దమ్మ అని అత్త తిట్టిపోసేది. చిన్నతనం ఏమి చేయాలో దిక్కుతోచని స్థితి. ఓసారి కూతురిని చూద్దామని వచ్చారు లచ్చుమమ్మ తల్లిదండ్రులు. అత్త, ఆడపడుచులు లేని సమయం చూసి తల్లిదండ్రులతో విషయం చెప్పింది. వాళ్ళతో పాటు ఇంటికి వచ్చేస్తానంది తండ్రి ఇంత ఎత్తున లేచాడు. నీ వెనుక నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయక ఇక్కడే పడిఉండు అన్నాడు. పెళ్లి అయిన ఆడపిల్ల అత్తింట్లనే ఉండాలని తల్లి నచ్చచెప్ప ప్రయత్నం చేసింది. అయినా మారాం చేస్తున్న లచ్చుమమ్మను నీ ఇల్లు ఇదే ఇక్కడే ఉండాలి. నచ్చి నీ మగడు నీ దగ్గరకు వస్తే సంసారం చెయ్యి. లేకుంటే నీ చావు నువ్వు చావు. నీ గాచారం ఇట్లనే రాసి ఉందని సరిపెట్టుకోవాలి అంటూ ఖరాఖండీగా చెప్పాడు తండ్రి. తల్లి బిడ్డ పరిస్థితికి ఏడ్చింది కానీ భర్తకు ఎదురు చెప్పి తమతో తీసుకెళ్ళే ధైర్యం చేయలేదు.
లోకం పోకడ తెలియని లచ్చుమమ్మ తండ్రి మాటలకు చిగురుటాకులా విలవిలలాడి పోయింది. చాలా బాధపడింది. చనిపోవాలని అనుకుంది. కానీ, నేనేం తప్పు చేశాను? నేనెందుకు చనిపోవాలన్న ప్రశ్న ఉదయించి ఆమెను చావనీయలేదు. ఇక ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించ లేదు.
అంతకు ముందెప్పుడూ పొలం గట్టెక్కని ఆమె పొలం వెళ్ళడం, వ్యవసాయ పనులు చేయడం నేర్చుకుంది. అరకు దున్నడం, నాటేయడం, కలవడం, కోయడం అన్ని పనులూ అత్తమామలతో కలసి చేసేది. తన తిండి కోసం ఏనాడు భర్తపై ఆధారపడలేదు. మొగవాడిని, మొగుడిని అని అడిగినప్పుడు పైసలు ఇవ్వకపోతే ఆమెను కొట్టేవాడు. ఉన్న పైసలు లాక్కుపోయేవాడు. నా బతుకు ఇంతే.. నా మీద మనసు లేదు. ప్రేమ లేదు. అచ్చట ముచ్చట ఏం లేదు. కానీ, నేను సంపాదించిన పైసలు కావాలి. అందుకోసం నేను పెండ్లాన్ననని అనుకుంటడెమో అని బాధపడేది. పిల్ల జెల్ల లేరు. ”ఏం జేస్కుంటవ్‌ పైసలు” అని ఎత్తి పొడుపు ఆమెను చాలా బాధించేది.
పనిలో ఉన్నంతసేపు తెలిసేది కాదు కానీ.. ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరితనం చాలా నరకం చూపేది. ఒక్కోసారి తనపై తనకే కోపం.. కసి.. ఆరోగ్యం పాడైంది.
అదే సమయంలో తమ్ముడి భార్య కానుపు కష్టమై చనిపోయింది. పుట్టిన పసిగుడ్డని తెచ్చి తల్లి అయి పెంచింది. పెద్ద దాన్ని చేసింది. బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేసింది. ఇల్లరికం తెచ్చుకుంది. అప్పటికే భర్త చనిపోయాడు. బొట్టు, గాజులు, పూలూ దూరమవడం తప్ప మరే మార్పు లేదు ఆమె జీవితంలో.
పెంపుడు కూతురికి ఇద్దరు ఆడపిల్లలు. అంతా కష్టం చేసి పిల్లల్ని పెంచుతూ ఆనందంగా గడుపుతున్నారు. రెక్కల కష్టం మీద ఎకరం పొలం సంపాదించుకున్నారు. అత్త ఇచ్చిపోయిన ఇల్లు ఉంది.
కొన్నాళ్ళకి సావాసగాళ్ళతో చేరి అల్లుడు మద్యానికి బానిసయ్యాడు. సరిగ్గా పని చేసేవాడు కాదు. ఎక్కడెక్కడో తిరిగి వచ్చేవాడు. అతని వ్యవసనాలకోసం పైసలు ఇవ్వమని తరచూ భార్యని కొట్టేవాడు. ఆ తర్వాత జబ్బు చేసింది. వైద్యం కోసం పొలం కుదువపెట్టి 80 వేలు ఖర్చు చేసింది.. చివరకూ హెచ్‌.ఐ.వి ఎయిడ్స్‌ అని తేలింది. కష్టాల చీకటి పోయి కూతురుతో వెలుతురు వచ్చిందని సంబరపడిన ఆమెను అల్లుడి రోగం అతలాకుతలం చేసింది. అగాధంలోకి తోసినట్లైంది. కూతురి జీవితం గురించి బెంగపడింది. ఎవరెవరినో ఆశ్రయించి చివరకు అల్లుడిని ఓ చర్చి ఆధ్వర్యంలో నడిచే హాస్పటల్లో చేర్చింది.
పొలం పనులు చేసే ఓపిక లేదు. కానీ పని చేయాలి తప్పదు. తన కోసం తన కూతురు కోసం.. ఆమె పిల్లల కోసం.. అందంగా ఉండే కూతురు బయటి పనులకు వెల్తే కంది పోతుందనుకుంది. మీద పడే వయస్సు సహకరించకున్నా తానే వంట మనిషిగా మారింది. పొరుగూరిలో పనిచేస్తూ పైసా పైసా జమ చేస్తోంది. కూతురి కుటుంబం కోసం చేసిన అప్పు తీర్చడం కోసం.
అల్లుడు హాస్పిటల్లో ఉండనని వాళ్ళతో గొడవ పెట్టుకుని ఇంటికి వచ్చేశాడు. తాగుడు, వ్యసనాలకు బానిసైన అల్లుడు, మాయదారి రోగం బారిన పడిన అతడు తన భార్య కోరిక తీర్చలేదన్న కసితో ”నేను నీ మొగుడిని కానా.. మొగాడినా కానా..? పిల్లల్ని ఎవరికీ కన్న వే.. దొంగలం..” అంటూ బూతులు తిడుతూ ఇంట్లో ఉన్న టి.వి. ఎత్తేశాడు. బిందెలు, గిన్నెలు.. వంట సామాగ్రి గిరాటేశాడు. ”నన్ను హాస్పిటల్లో పడేసి ఎవర్ని మరిగావే..” అంటూ భార్యను చితకబాదాడు. అడ్డుకున్న పిల్లల్నీ తన్నాడు. పన్నెండేళ్ళ పెద్ద కూతురు తన తల్లిని తండ్రి పెడ్తోన్న హింసనూ చూడేలేక పోలీస్‌ కేసు పెడతానంటూ వెళ్తోంటే ఆమెను ఈడ్చి పడేశాడు. భార్య ఒంటి మీద ఉన్న పుస్తెలు, చెవి పోగులు లాక్కొని వెళ్ళిపోయాడు.
కూతురికి ఆ మాయదారి రోగం ఎక్కడ అంటుకుంటుందోనని తల్లడిల్లిపోతున్న లచ్చుమమ్మ వొళ్ళంతా దెబ్బలతో వాచిపోయి, కమిలిపోయి ఉన్న గంగను చూస్తే బాధగానూ, భయంగానూ ఉంది. కూతురు ఏమవుతుందోనన్న ఆందోళన ఆమెకు ఊపిరి ఆడనివ్వడంలేదు. అంత చల్లటి వాతావరణంలోనూ ఆమె వొళ్ళు చెమటతో తడచిపోయింది.
లచ్చుమమ్మ రాకను గమనించిన ఇరుగుపొరుగు తమ పనులు ఆపుకుని వచ్చారు.
”అమ్మమ్మా…” అంటూ ఏడుస్తూ లచ్చుమమ్మను చుట్టేశారు మనుమరాల్లిద్దరూ.
”ఏందే అదినే బిడ్డని గిట్ల ఆగం పట్టిపిస్తివి. నువ్వీడ ఉంటే ఆ ముం…కొడుకు గిట్ల జెసునా..” చేతులకున్న తడి కొంగు తీసి తుడుచు కుంటూ ఒకరు అంటే
”ఏదో ఇంత పైసా పోడావు చేస్తానని పోతివి.. ఏమయ్యింది… సూడు” అని దీర్ఘం తీసింది ఒకావిడ.
గంగ మూలుగు విని ”ఇంక నయ్యం గంగవ్వ పానం పోలే.. పోరాగాల్లకు గోస గోస ఐతుండే” అని ఎదురింటావిడ.
”ఎందోనే ఆనికి దెయ్యం పట్టింది గందుకే గిట్ల చెయ్యవట్టిండు” అన్నది మర్రో స్త్రీ మొహమంతా చిట్లించుకొని.
”నువ్వేమన్నా అనుకోయే సిన్నీ నాకయితే ఆలమ్ది కొడుకుని… ఏదోటి చెయ్యాల్నే” అంది తన కసి కోపం అంతా పక్కనున్న జామ చెట్టు కొమ్మ విరవడంలో కన్పిస్తుండగా.
”ఆని వోర్రుడికి ఏమయితాందని ఆస్తి.,, ఆరి ఏందిరా.. అంతగనం కొట్టవడ్తివి. బక్క పోరి సస్తదిర అని ఆడ్ని ఆపబోతే.. ఒసే.. ముసిల్దానా.. నువ్వేవత్తివే.. మా నడుమస్తున్నావ్‌. నా పెండ్లం నా ఇష్టం తంతా.. సంపుత.. అనుకుంట దాన్ని గోడకేసి కొట్టుడు కొడ్తాంటే నా పానం పోయినట్టయ్యే…. నన్నేడ కొడతాడో..నని అసుంట జర్గితి” అంటూ జరిగిన సంఘటన గురించి చెప్పుకుపోతోంది లచ్చుమమ్మకు వరుసకు అత్త అయ్యే ముసలమ్మ.
”అంత ఆడిని ఆడిపోసుకుంటున్నరు. ఇది ఏమనకున్టనే గిన్థగనామ్‌ కొడ్తడా..” ముక్కులో నశ్యం పీల్చుకుంటూ ఒకామె.
”ఆనిల మన్నువడ గా బీమారి ఐన కాడి కెల్లి ఆడు ఏదోటి గట్టనే పెండ్లాం తోటి కయ్యమాడుడు గొడ్డును కొట్టినట్టు కొట్టుడు.. ఇయ్యాల్ల ఇంకొంచెం ఎక్కువాయె.” గొనిగింది ముసలమ్మ
”సిన్నీ ఆడిని ఒదలొద్దె ఇయ్యాల్లతోని ఆగుతదా.. ఈన్ని జూసి ఇంకొకడు గిట్లనే జేస్తడు. ఆల్లకు అన్ని జేసుడే ఎక్కువనుకుంటే ఇంక తన్నులు, గుద్దులు.. ముల్లులోలె గుచ్చుకునేటి మాటలు.. ఇట్లా ఎన్నొద్దులు ఒర్వాల్నే..” పక్కింటి ఇల్లాలు.
”అదినే..గీ అయిసు పోరగాండ్లు గిట్లనే అంటరు.. నువ్వెన్ని కష్టాలు పడ్తివి. ఎంత గుట్టుగ, పరువుగ బతికితివి. గుట్టుగా కాలం నడిపితివి. ఈన్ని టానలు ఎపిస్తే.. ఇగ నువ్వు బజారున వడ్డట్టె..” హెచ్చరికగా.. ఒకావిడ
”పెండ్లాము మొగని కోర్కె తీర్చేది లేదా.. కాదంటె గిట్లనే ఉంటది” గంగనే తప్పుపడ్తున్నట్లుగా ఒకరు అంతా తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారే గానీ లచ్చుమమ్మ నోరు తెరచి ఒక్క మాటా మాట్లాడలేదు. ఎవరికీ సమాధానం చెప్పలేదు. మౌనంగా రోదిస్తూనే అందరి సలహాలూ, వ్యాఖ్యానాలూ వింది. నిజమే, భర్త ఎంత బాధ పెట్టినా ఎన్నడూ పంచాయితీ పెట్టలేదు. పోలీస్‌ కేసు పెట్టలేదు. కానీ, ఇప్పుడు అల్లుడి విషయంలో ఆమె అతని చర్యని సమర్థించలేకపోతోంది. లోకం ఏమనుకున్నా… బిడ్డనే తప్పుపట్టినా సరే.. రోగం దాచిపెట్టి తిరుగుతున్న వాడిని వదిలేస్తే ఇంకెంత మందికి ప్రాణం మీదికి తెస్తాడో.. తప్పదు. అనుకొన్న లచ్చుమమ్మ బిక్కమొహం వేసుకొని తల్లి  పక్కనే కూర్చున్న పెద్ద మనుమరాలిని వెంట పెట్టుకొని పోలీస్‌స్టేషన్‌ కేసి అడుగులేసింది.
గజ్జి, గోకుడు రోగం రాకుండా శుభ్రంగా ఉండాలి గానీ వచ్చినంక మందులు వేసుకోవడం కాదు పరిష్కారం. సర్కారు ఆ మాయదారి రోగం మీద కోట్లు ఖర్చు చేస్తోందని అల్లుడిని చర్చి దవఖానలో చేర్చినప్పుడు ఫాదర్‌ చెప్పాడు. అటువంటి రోగాలు తెచ్చుకోవద్దని చెప్పాలి, మంచి ప్రవర్తనతో ఉండుమని చెప్పాలి గాని ఏమిటో సర్కారే తొడుగులు పంచుడు అర్ధం కావట్లేదు అనుకొంటున్న… ఆమె, మనుమరాళ్ళకు చదువే కాదు పరిస్థితులతో పోరాడటం తెలపాలి.. జీవితంలో బతకడం నేర్పాలి.. ఆమె ఆలోచనల్లో వేగం.. నడకలో వేగం.. ఆమెను అందుకోవాలని ప్రయత్నిస్తూ.. మనుమరాలు.

Tag Cloud

%d bloggers like this: