The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘HIV’

నిరాశా పొరలపై ఆశల నగిషీలు చెక్కనా .. !

నా ముద్దు మాటల

విందు మూటలతో

ఆనందించిన వారు

నన్నెందుకో

తమదరి చేరనీయడంలేదు

 

ఒడిలో కూర్చోపెట్టుకొని

మురిపాల ముద్దలతో

మురిపించిన వారు

నన్నెందుకో

తమ సరి రానీయడం లేదు

 

నా పాలబుగ్గలపై  కురిపించిన

అమృతధారల స్థానే

చురకత్తుల జాలి చూపులు

నన్ను కోసేస్తున్నాయి

తాటాకు చీరికల్లా

 

నేనేం తప్పు చేశానో తెలియదు

నాలో ఏమి తిష్ట వేసిందో అర్ధంకాదు

కానీ

తలంతా రక్కసి పుళ్ళు

నాసికనుండి బోలబోలా కారే రక్తం

ఏ మందులకీ లొంగక

తిన్నది ఒంటబట్టక

కృశించి పోతున్న శరీరం

 

పెద్ద సూదితో నా రక్తం

జలగలా లాగేసిన

డాక్టరు ఏం చెప్పారో

ఆకులు రంగులు మార్చుకున్నట్లు

అంతా నాపై చూపే జాలి

వరద కాల్వలై

నన్ను కుంచింప చేస్తూ

 

ఒకప్పుడు

కన్న వాళ్ళు లేక

కడుపుకింత పెట్టేవాళ్ళు కానరాక

ఆకలి మంటలు తాళలేక

గుప్పెట్లతో మట్టి తిన్న నా చేతుల్ని

ఆ తర్వాత

ఆబగా తిన్న అన్నం వెక్కిరిస్తోంది

అప్పుడప్పుడే

ఊహల పురివిప్పుతున్న

ఆశల హరివిల్లు పై

ఉరి వల విసిరింది

 

చేరదీసిన ఆర్ద్ర హృదయం

కరుణ చూపిన చేతులు

కాసింత దూరంలోనే

గొంగళి పురుగును చూసినట్లు చూస్తూ

 

కారణం ఏమిటని

ఆరాతీస్తే అమృతం లాంటి అమ్మపాలు

నా పాలిట విషపు గుళికై

ఆకలిగొన్న మృగంలా

నా శరీరాన్ని ఆక్రమించేసిందట

ఎరకోసం దేవులాడే గద్ద

నన్ను తన్నుకు పోడానికి చూస్తోందట

అమ్మ లాగే , నాన్నలాగే ,

అక్క లాగే నేనూ ….

అంతా గుసగుసలు

 

నేనేం నేరం చేశానని ?

నా శరీరం హరితంలేని పత్రంలా

జల్లెడవుతోంది

మూడు వసంతాలైనా చూడని

నాకిదేం శిక్ష ?

నాకూ బతకాలని ఉంది

మీ అందరిలా నిండుగా

పున్నమి చంద్రుడిలా

నూరేళ్ళూ బతకాలని ఉంది

నా బుగ్గలపై మీ ముద్దుల

సంతకాల మూటలు కట్టి  దాచుకోవాలనుంది

అభిమానం వెల్లువై మీరు చూపే ఆప్యాయత,ఆదరణ

కలకాలం కళ్ళలో వత్తులేసి వెలిగించాలని ఉంది

నాకు కాదు శిలువ

వేయండి నన్నూ నాలాంటి వారిని

కబళిస్తున్న ఎయిడ్స్ కి

అని గొంతెత్తి అరవాలని ఉంది

కానీ గొంతు పెగలడం లేదు

గాఢమైన చీకటి గుహలోకి జారిపోతోంది

అంతలో

నాలో చలనం కలిగిస్తూ

నా ఊహలకు ఊతమిచ్చి

ఊపిరి పోస్తూ

ఊయలలూపుతూ

కొత్త చిగుర్లు తోడిగిస్తానంటూ

నన్ను

ఒడిసి పట్టుకున్న ART మందులు

ఈ ఆధారం చాలు

నా ఆశల అలలపై అడుగులేస్తూ

నా కలల తీరం చేరడానికి

సరి కొత్త ప్రపంచానికి రంగులద్దడానికి

నిరాశా పొరలపై ఆశల నగిషీలు చెక్కడానికి

వి. శాంతి ప్రబోధ

( తల్లిదండ్రులు లేని మూడేళ్ళ చిన్నారి వైష్ణవి కి HIV అని తెలిసాక, ఆ చిన్నారి చూపులు గుచ్చుకుంటూ ఉంటే తట్టుకోలేక వాటినుండి ఉపశమనం పొందడానికి చేసిన ప్రయత్నం ఇది )

Tag Cloud

%d bloggers like this: