The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘displacement’

చెదిరిన చిత్రం చిగురిస్తుందా ..

‘మా బాపు  ఉద్యోగరీత్యా బదిలీ అయినప్పుడల్లా  నా మనసు ఎంత విలవిలలాడేదో ..
నా దోస్తులందరినీ వదిలిపోవాల్సి వచ్చినప్పుడల్లా  ఎంత ఏడ్చేదాన్నో  .. నిండు కుండ భళ్ళున బద్దలయినట్టు ఫీలయేదాన్ని’  చెప్పుకొచ్చింది  శివరాణి పక్కనున్న లీలా టీచర్ తో .

‘అవును మేడం . నేనింత పెద్దగయ్యిన్నా ..  నాకూ అదే దిగులు . అదే బాధ..
ఐదేళ్ల సంది ఉన్న బడిని ఒదిలొచ్చుడు మనసుకు ఎంత రపరపయిందో ఎట్ల జెప్పేది ..? ‘ కన్నబిడ్డలా ఆ బడిపై పెంచుకున్న మమకారాన్ని , అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ  కొద్దీ క్షణాలు ఆగి గట్టిగా ఊపిరి  పీల్చి వదిలింది లీల .
‘ ఆ..మేడం,  నేను స్కూల్ గురించి విన్న.  దాని అభివృద్ధికి మీరు  చేసిన కృషి..   ఆ బడికి డివిజన్లో  వచ్చిన గుర్తింపు.. ‘  చుట్టూ పరుచుకున్న రకరకాల ఆకుపచ్చని షేడ్స్ తో కనిపించే  పచ్చని పంట పొలాలనే పరికించి చూస్తూ  శివరాణి .
‘ఆ బడిపిల్లలతో వారి తల్లిదండ్రులతో, ఊరితో  అనుబంధం ఒదిలి  దూరంగ ఇట్ల ఎన్నడైన ఎల్లిరావాల్నని  తెల్సినా …  ‘ నిట్టూర్చి, ఓ దీర్ఘ శ్వాస తర్వాత  మళ్ళీ తానే  ‘ ఆఊరితో.. ఊరోళ్ళతో నా సంబంధ బాంధవ్యాలు తెగిపోవు .  కొనసాగించవచ్చు .. కానీ… వీళ్ళ  పరిస్థితి అట్ల కాదుగద  మేడం . తరతరాల బంధమాయె.  ఆ అనుబంధాన్ని శాశ్వతంగ జలసమాధి చేయాల్సిందేననుకుంటుంటేనే  వేయి శూలాలు గుండెల్లో గుచ్చుకున్న బాధ… ‘ అంది లీల బడివైపు అడుగులు వేస్తూ ..
లీల మొహంలో కనిపిస్తున్న భావ వీచికల్ని చూసి ఈవిడ చాలా సున్నిత మనస్కురాలు అనుకుంది పక్కనే నడుస్తున్న శివరాణి .
రెండడుగులు వేసారోలేదో  ఐదో తరగతి చదివే సునీత  నాయనమ్మ  రాజవ్వ  కనబడి ‘నమస్తే మేడం .. ” శివరాణిని పలుకరించి ఎవరన్నట్లుగా లీలకేసి కళ్ళు చికిలించి చూస్తోంది .
‘ అంత మంచిదేనా .. ‘ పలుకరించింది. కానీ,  అడగవలసిన ప్రశ్న కాదేమోనని ఫీలయింది  శివరాణి.
‘ఏం మంచిగ ?
 గిదే.. మంచిగ .
మనసు మనాది తోటి  అడ్లు రాలిన కల్లమయ్యే … ఏంజేత్తం ?  అనుమాండ్ల కాడ దండలేస్కోని రోజొక్క గ్రూపు కుసుంటాన్నం .
గా.. పెద్దాయనకేమన్న దయొచ్చి దర్శనమయితడేమోనన్న ఆశతోని .. ‘ గొంతు గద్గదమవుతుండగా రాజవ్వ
అంతలో కర్ర కొట్టుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి వీళ్ళ దగ్గర ఆగిన ముదిమి జాలవ్వ  అందుకుని  ‘ఊరు వాడ వదిలి మమ్ముల ఊరపిచ్చుక లెక్క  పొమ్మంటే యాడికి  ఎగిరి బోతం..ఏడికో పోయిన ఆ కొత్త జాగల మాదేముంటది ? తాత ముత్తాతల కెల్లి  ఇంకా అంతకు ముంగట ఎన్ని జామాన్లు నడిచెనో ..
అసొంటి ఊరిది ..  రజాకార్ల జమానాల సుత గిట్ల లేకుండే ..
మా ఊరోళ్లే  ఆల్లను గుట్టల్లకు తరివి కొట్టిరి. గిప్పుడు గా రజకర్లోలె  మందకు మంద ఊరిమీదవడ్తిరి ..
ఏవేవో కమ్మలు ముంగటవెట్టి  నిశానీ ఏపిచ్చుకుంటిరి .  ఉరికి ఏమైతాందో … ‘  బోసినోటి జలవ్వ   లోపల పొంగి పొర్లతున్న దుఃఖపు నది తీవ్రతకు  గొంతు పెగలక  తడారినకళ్ళను  పైటచెంగు వెనకకు తోచేస్తూ  అక్కడే కూలబడిపోయింది .
‘ఈడ్నే పుట్టినం ఈ మట్టిలనే కడతెర్తం అనుకొంటిమి .. గిట్ల అంటరని ఎన్నడన్న కలగంటిమా .. ‘  నిట్టూర్చింది రాజవ్వ .

నిజమే, అది ఒట్టి ఊరేనా .. దానికెంతో చరిత్ర , వాళ్ళకెంతో గుర్తింపు ..వాళ్ళకో అస్తిత్వాన్నిచ్చిన స్థలం ..  ఆఊరితో , ఊరిజనంతో , చెట్టుచేమతో ,రాలురప్పలతో , చేనుచెల్కతో , ఆకుఅలుములతో , వాగువంకలతో  గుట్టలతో పిట్టలతో  పైరగాలితో పెనవేసుకున్న  అనుబంధం ..  ఎన్నెన్నో జ్ఞాపకాల సమాహారమే  ఊరు . మాఊరు , మాప్రాంతం , అనే ఆత్మగౌరవంతో పాటు ఎన్నిరకాల సెంటిమెంట్లు ఊరి చుట్టూ ముడిపడి ఉంటాయో ..   మనసులో తలపోసింది లీల

‘కళ్ళు తెరిచినా మూసుకున్నా  నా ఊరు  ఇక ఉండదన్నమాటలే చెవుల్ల జొర్రిగల్లెక్క తిర్గవట్టె .  ఊరు మునిగిపోతదన్న  ముచ్చట చెవుల బడ్డప్పటి  కెల్లి నా పానం గిప్పుడే ఉన్నదున్నట్టు పొతే మంచిగుండనిపియ్యవట్టే …  గిట్ల ఈ మట్టిల్నే కల్సిపోవాలె
.. మావంశపోల్లంతా గీ మట్టిలనే.. నన్నూ ఆడికే కొంటబొమ్మని దేవునికి మొరవెట్టుకుంటాన్న  ‘ అరవైఏళ్ల రాజవ్వ  ఆవేదన ఆ టీచరులిద్దరి గుండెని మెలితిప్పింది .

తన వాళ్ళ జీవితం ప్రవహించిన చోటే , ఆ శ్వాసలో శ్వాసై పోవాలనుకుంది..ఆమె కోరికతో తప్పులేదు కదా అనుకుంది శివరాణి
‘తెలంగాణా ప్రజల చరిత్రను కాపాడుకుందం, మనని మనం బద్రం చేసుకుందం అంటే మాస్తు కొట్లాడితిమి . పోరాడితిమి.. ఓట్లన్ని గుత్తవట్టినట్టు ఒక్కదిక్కే గుద్దితిమి .. మా రాజ్యం మాకొచ్చెనని సంబురాలు జేసుకుంటిమి.  కానీ ఇప్పుడు ..’. చచ్చిన శవంముందు కూర్చుని ఏడ్చినట్లు శోకం పెట్టింది  రాజవ్వ . కన్నీటి సముద్రమైన ఆమెను ఎలా సముదాయించాలో తెలియక తికమక పడ్డారు శివరాణి , లీలా టీచర్లు .
ఆమె దుఃఖం చూస్తుంటే  తనకే ఆబాధ, కష్టం  వఛ్చినట్లుగా హృదయంలోంచి దుఃఖం పొంగుకొచ్చి కనురెప్పల గుప్పిట్లో దాచుకున్న బిందువులు ఒక్కొక్కటి ఆమెకు తెలియకుండానే జారిపోతున్నాయి  లీల కళ్ళ నుండి .
అది చూసిన శివరాణి  ‘ మూడునెలల సంది  వినీవినీ మేము కొద్దిగా బండబారినం. మీరు కొత్త కదా .. అట్లనే
 ఉంటది  టీచర్ ‘ అంది
లంచ్ టైం ముగుస్తుండడంతో మౌనంగా స్కూల్ కేసి నడుస్తున్నారు టీచర్లిద్దరూ
.. వారి మనసు  మేఘావృతమై .. వారి భావోద్వేగాలు భారీ చినుకులై  కురుస్తుండగా  ఉదయం జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది  లీలకి .
 ***                                                          ***                                                  ***
హాజరు వేసుకొని  వెళ్ళిపోతున్న సుజల, కరిష్మా , పారిజాత , రజితలను పిలిచింది . నలుగురూ ఏడో తరగతి పిల్లలే .   వాళ్ళ  క్లాస్ టీచర్ తను .
అదేంటి అట్లా పోతున్నారు క్లాసులో కూర్చోకుండా అడిగింది    ‘మేడం ఒకళ్లకు అన్నం పెట్టాల్నంటే మరొకళ్ళకు బంద్ చెయ్యాలన్నా .. ‘ రజిత  ప్రశ్నబాణంలా దూసుకొచ్చింది .
తనేమడిగింది వాళ్ళేం చెబుతున్నారు  ఒక్క క్షణం లీలకు అయోమయంగా తోచింది .  ఆమె చూపుల్ని చూసి నలుగురూ ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకున్నారు
చీకటిని చీల్చే జవాబు ఏమన్నా వస్తుందేమోనని . ‘ చెప్పండి మేడం ‘ ఏమాత్రం సంకోచం లేకుండా రెట్టించింది  రజిత .
ఆ పిల్ల  సీమమిరపకాయలాగా కన్పించింది లీలా టీచర్ కళ్ళకి.
టీచర్ ఏమి చెబుతుందా అన్న ఆత్రుతతో చూస్తున్నారు నలుగురూ .. వారి వెనకే క్లాసులోంచి బయటికి పోబోయిన మిగతా విద్యార్థులూ  ఆగి చెవులు రిక్కించి నిల్చున్నారు.
‘ ఆకలి  ఎవరికైనా ఒకటే కదా ..  అందరి ఆకలీ తీరాలి .. . ‘  లీలా టీచర్ చెబుతున్నది ఇంకా పూర్తికాకుండానే
‘ ఒకళ్లకు ఆకలున్నదని , ఆపతున్నదని .. ఇంకొకళ్ళ నోటికాడి బువ్వ ఇగ్గుకబోయి ఆకలున్నోడి ముంగట పెడతారా  .. మరి  నోటిముందు కూడుపొతే ఈని ఆకలెట్ల తీరాలె …  ‘  సునామీ తీవ్రతతో కరిష్మా  ప్రశ్న దూసుకొచ్చింది
‘ఇదెక్కడి న్యాయమో తెలుస్త లేదు .. ‘ నరాలు పొంగుకొస్తుండగా పారిజాత
‘అక్కడ నాలుగు జిల్లాలల్ల రైతులకు కూడు బెట్టాల్నంటే ఈడ మాపొట్ట కొట్టాల్నా మేడం .. మేము రైతులం కాదా .. మేం మనుషులం కాదా .. మేడం ‘ భూగోళం అంచులు దాటేలా వాడిచూపులతో  రజిత లీలకేసి చూస్తూ

‘ మొన్నటిదాంక మన రాష్ట్రం మనదే .. మన కొలువులు మనకే .. మన మాట మనదే అని ఏమేమో చెప్తే నిజమనుకుంటిమి .. ఊరు ఊరంత ఓట్లేసి గెలిపిస్తే ..  కుప్పలు కుప్పలుగా అస్థిపంజరాలు పేరుస్తున్నరు … ‘ అంటూ వచ్చి అక్కడ నిలిచింది పదోతరగతి చదివే  ఈశ్వరి .

‘ మునిగిపోయే మీభూమి జాగలకు పైసలిస్తమని అంటున్నరు గద ..  మీరంతా ఎందుకింత బాధపడుతున్నరు’  వారి మనసులో విషయం తెలుసుకుందామని లీల ప్రశ్న

‘ ఆ..ఏమిస్తరు మేడం .. మెడకు తాడు బిగిచ్చి  గుడ్లు ముంగటికి పొడుచుకత్తాంటే నోరంత ఎండ్కబోయి గుండె గడబిడ అయితాంటే  బారాణాకు చారణ ఇస్తరా ..? ఏంజేస్కోను ? ‘  మట్టివాసన గుబాళించే ఈశ్వరి .

‘మేడం పైసలు కాదు భూములకు భూములు , ఇండ్లకు ఇండ్లు .. అన్ని ఇక్కడ మాకేమున్నాయో అవ్వన్నీ కొత్త జాగల ఇవ్వుమనున్రి ‘  సాలోచనగా సుజల

‘అయ్యన్నీ ఇచ్చిన బీ గాఊరు మన ఊరయితదావే …. మన శ్వాసలో ప్రవహించే ఈ ఊరి జ్ఞాపకాలు తెచ్చిస్తరా ..? మన మనసుకు అయిన గాయాలు మాన్పుతరా ‘ కొద్దిగా కసిరినట్లుగా  ఈశ్వరి

‘మిరపకాయల ఘాటుకంటే ఎక్కువ ఘాటుగా ఉన్నాయి మీ మాటలు ‘ వాతావరణం తేలిక చేసే ఉద్దేశంతో నవ్వుతూ అంది లీలా టీచర్ .
‘అవును , కడుపు నొప్పి , మంట ఉన్నోడికే ఆ బాధ తెలుస్తది .  మీకేం తెలుస్తది ..? ఇట్లనే నవ్వుతరు ..మాలోపటికి  తొంగి చూస్తే తెలుస్తది మా గోస ‘ సీరియస్ అంది ఈశ్వరి .
నిజమే .. మునిగేది గ్రామము.   వారి భూములూ ఇళ్ళు , వారి చుట్టూ ఉన్న జంతుజాలాలే కాదు.  వారి జ్ణాపకాలు …. ఒలిచిన కొద్దీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయే వారి జ్ఞాపకాలకు ఏ పరిహారం ఇవ్వగలరు ?  భవిష్యత్ పట్ల అందమైన కలలతో గుండె నిండా ఊహలతో ఉండాల్సిన పసివారి గుండెల్లో  ఎన్నెన్ని గాయాలు ..మోడువోయిన అలసత్వపు జాడలే ..  మౌనంగా తలపోస్తున్న లీలా టీచర్ ఆలోచనల్ని భంగపరుస్తూ

‘కడుపు నిండిన మాటలట్లనే ఉంటయ్ ..’ అని ఒకరంటే
‘మనని బండరాయో, మట్టి ముద్దనో అనుకుంటున్నరు .. ఏడ బడేస్తే ఆడ పడివుంటమని’ అంటూ మరొకరు అనుకుంటూ  ఒకరివెనుక ఒకరు అంతావెళ్లిపోయారు .
చూస్తే స్కూల్ దాదాపు ఖాళీ .  దూరంగా కన్పిస్తున్న ర్యాలీలో కలిశారు వాళ్లంతా.
వారి మాటలూ  చూపులూ లీలా టీచర్కు  ఎక్కడో గుచ్ఛుకుంటున్నాయి.    తననే ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది.  వాళ్ళు వెలుతురు పొట్లమేదో విప్పుతున్నట్లుగా తోస్తోంది.  తనలోకి తాను తొంగి చూసుకోవడం మొదలు పెట్టింది .
కొద్ది గంటల క్రితం వరకూ మల్లన్న సాగర్ రిజర్వాయర్ వస్తే నల్లగొండ జిల్లాలోని తమ భూములకు రేటు పెరుగుతుందని  ఆశపడింది తను .
రెండొందల ఎకరాల ఆసామి తన మేనమామ. ఆయన పొలాలన్నీ  ఈ ప్రాజెక్టు కింద పోతాయని అనుకున్నప్పుడు మార్కెట్ రేటు ఒకటైతే ప్రభుత్వం ఇచ్ఛే పరిహారం మరొకటి ఉంటుందని ఎంత దిగులు పడ్డారో .. ,  కాడెద్దులనే నమ్ముకుని బతికే వాళ్ళం ఏమైపోతామో ఎట్లా బతకాలో   అని అత్త ఎంత గగ్గోలు పెట్టిందో…అలాంటిది ఇప్పుడవి పొవట్లేదని తెలిసి చాలా సంతోషపడ్డారు అంతా .
వాళ్లన్నట్లు తనది కడుపు నిండిన బేరమే .. వాళ్ళ ఆకలి తనకేం తెలుసు .
***                                            ********                                       ***

ఎవరి ఆలోచనల్లో ఉండగానే  బడిలోకి వచ్చేసారు శివరాణి , లీలా టీచరులిద్దరూ .
‘ఏం మేడం .. ఏమంటున్నారు ‘హెడ్మాస్టర్  అడిగాడు
‘ఏం చెప్పాల్సార్ . వాళ్ళ  గోస గోస కాదు .  దుఃఖాన్ని దోసిళ్ళతో పట్టుకొచ్చిన . హృదయపు  బరువు ఎట్ల దింపుకోవాల్నో  తెలుస్తలేదు ‘ అంటూ
కుర్చీలో కొద్ది క్షణాలు కూర్చొని  లేచి క్లాసుకు వెళ్ళింది లీల.

క్లాసులో ఎవ్వరూ లేరు .  ఇంటర్వెల్ తర్వాత వెళ్లిన పిల్లలు తిరిగి రాలేదు .  ఆమె తిరిగొచ్చి స్టాఫ్ రూములో కూర్చుంది .  అప్పటికే  శివరాణి మరో ఇద్దరు సార్లు అక్కడ కూర్చొని ముచ్చట్లాడుతున్నారు .

‘తెలంగాణ కోసం కష్టపడ్డారన్న గౌరవం ఉండే .. అదంతా ఖరాబ్ జేసుకుంటుండు  ‘  కొద్దిగా  సానుభూతి , అభిమానం కలగలసి అన్నాడు వీళ్ళ  దగ్గరే కూర్చున్న  హెడ్మాస్టర్

‘ తాను తిన్న  తినకున్న ప్రపంచానికింత తిండి పెట్టేది భూమిని నమ్ముకున్న రైతన్ననే ..
ఆ రైతన్న సర్వం కోల్పోతుంటే అరకొర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాల్నని  చూస్తున్నారు .
ఆటగాళ్లకేమో పతకం తెచ్చారని పోటీలు పడి నజరానాలు ..’  గొణిగి మళ్ళీ  ఆయనే  ‘ దళితులకు ఏడు లక్షలకు ఎకరం భూమి
కొనిద్దామన్న ఎవ్వడు భూమి అమ్ముతలేదన్నోడు  యీళ్లకు ఎకరాకు ఐదారు లక్షలిద్దామంటున్నడు పేద్ద సార్ . ‘  కొంచెం వ్యంగ్యం  హిందీ సారు  గొంతులో .

‘అధికారంలో ఉన్నవాళ్ళకి పేద ప్రజలు కానరారు .  ఆనాడు బషీర్భాగ్ రైతులపై కాల్పులు .. ఈనాడు మన రాజ్యంలో మన రైతులపై కాల్పులు ..’ నిరసనగా శివరాణి గొంతు కలిపింది

అక్కడ కూర్చున్న పంతుళ్లు రాజకీయాల్లోకి దిగారు . శివరాణి బాగ్ లోంచి  ఆదివారం అనుబంధం తీసుకొని అందులో లీనమైంది .
లీల టేబుల్ పై ఉన్న పేపర్ అందుకుంది. ఏవీ బుర్రకెక్కడం లేదు .  కొద్ది సేపటిక్రితం హనుమాండ్ల దగ్గర కూర్చున్న వారి మాటలే గందరగోళంగా ఆమె మదిలో మెదులుతూ ఉన్నాయి .
***                 **                    **
‘వందల వేల ఎకరాలున్నోళ్లను గడ్డకు ఏసుకుంట మా నెత్తిమీద కొట్టుకుంట  బక్క పానాలను బొంద పెడ్తమంటున్నరు’  నడివయస్కుడు భుజంపై తువ్వాలు దులిపి మళ్ళీ వేసుకుంటూ
.
‘మీరందరు కల్సింటే అల్లేంది జేజమ్మలు తాతమ్మలు దిగొత్తరని అంటున్నరుగదనే ..  ‘అన్నది బీడీలు సుట్టుకుంట ఓ యువతి .
‘యాడిది .. వచ్చేసింది .. కుత్తుకల దాంకచ్చింది . ఇగ కాళ్లు లేత్తయ్ రా..  ఆగుల కొట్టుక పోతర్రా అని ఒకరొచ్చి అనవట్టె .. ఆ నాయకుడొత్తడు .. ఈ నాయకుడొత్తడు .. సచ్చినోల్లను  పరామర్శించేతందుకొచ్చినట్టొచ్చి పరామర్శించి పోతున్నరు.’ సోడాబుడ్డి అద్దాల తాత జవాబు
‘ ఉస్మాన్ బాషా , మహబూబ్ బాషా రాజరికం ఎలిన్నుంచి ఎట్టి కొట్టాలు  జేసి ఆరిజనులే కానీ ఎవరేగానీ మేము ఆడ కల్లాలు జేసుకుంట బావులు కాపాడుకుంట సులైమానయితే పట్టాలు జేసుకొని పిల్లల కెల్లి అందరు కష్టపడి జేసుకుంటిమి . అంత గీ ఏట్ల కలిపేతందుకా .. ? ‘ మరో వృద్ధుడి ఆవేదన

గ్రూపులో లోను లేపి, ఇసొంటోళ్ల అసొంటోళ్ల   తాన  పైసలు తెచ్చి బిడ్డ లగ్గం జెత్తి. కూలో నాలో జేసుకుంట బతుకుతుంటి …గ్రూపుల పైసలు కట్టమని మెడ మీన కత్తివెట్టె ..

ఇంటి  జాగకు పైసలిత్తరట .  ఆలిచ్చే పైసలు ఏటికొత్తయ్ .. ఇంట్ల ఎడ్డిపిల్ల ఉండే .. పదేన్నూర్లు  పింఛను వస్తది .  వేరే కాడికివోతే  పింఛనిత్తరా ..బతికుడెట్లా .. మూలిగే నక్కమీద తాటి పండు బడ్డట్టయింది ‘ వాపోతోంది ఓ నడివయసు ఒంటరి మహిళ
‘బరిబత్తల నిలవెట్టినట్టయ్యే .. ‘
‘ఏ ఊరికి బోయిన దొంగలమయితం . మనూర్ల మనమే  సర్దారులం .  పోయిన కాడ ఓరేషను కారట్ , ఆధార్ కారట్ , పింఛన్ ఏముంటాయో ఏముండయో .. మంచికి చెడుకి ఎవరెట్లయితరో .’ కలగూరగంపలాగా సాగున్నయి  మాటలు
‘గా భీంరావు పటేలు భూమి ఇచ్చిండట గద .. ?’ ఒకరి ప్రశ్న
‘ఆని భూమి జాగ ఉంటే తగులవెట్టు కోని  .. గానీ ఆ నిప్పు ఊరంతా ఆగంజేత్తే చూసుకుంట ఊకుంటమా .. ఊర్ల చిచ్చు బెట్టేటోన్ని తిరగగొడతం ఏర్కేనా ..?’ ఆ మాటల్లో పట్టుదల , కడుపులో బాధ , కళ్ళలో కసితో ఓ పడుచు జవాబు

పుట్టినూరిది . పెరిగినూరిది . మాఊరు మాకే గావాలె .. కష్టపడి బంగ్లాలు కట్టుకున్నం . ఎంత మంచిగ కట్టుకున్నం .. ఇయ్యన్నీ…   పన్నెండు ఆమడల తిరిగిన ఇంత సౌలట్ దొరుకుతదా .. ఇంతమంచి జనం , నీళ్లు సౌలత్ ..వదిలి  ఎట్లబోవాలె .. ఈ ఊర్లనే 6గురు కొడుకులను పెద్ద పెద్దోళ్ల పిల్లలెక్క జేసిన .  ఇదంత కాటికి ఒదిలి నేనెట్ల పోదును .. తిన్న కూడు సుతం పెయ్యికింకుతలేదు ‘  శోకం అందుకుంది కాలనిలో ఉండే మైసమ్మ . ఆమె వెనకే ఇంకొంతమంది .. పొట్టకూటికోసం , తమ అస్తిత్వం కోసం గమ్యం తెలియని దారుల్లో తప్పిపోయిన వాళ్ళలా ఉన్న వారిని  ఓదార్చబోయారు లీల , శివరాణిలు .

అంతలో ‘ .. నేను బయట బతుకుత ..ఊరంత అట్ల బతుకుతదా ..ఆగమై పోరా ..ఎప్పుడయినా ఎవడయినా బోయేదే .. బతికితే అందరం బతకాలె .. లేకుంటే అందరం ఆనీళ్లల్లనే బడిచావాలే .. అంతదాన్క  ఎత్తిన పిడికిలి. కలిపిన చేయ్యిడవొద్దు …  ‘ కూలిపోతున్న మానవత్వపు జెండా  సమున్నతంగా ఎగురవేస్తూ ఆ  గ్రామసర్పంచ్ . ఆ వెనకే మరి కొందరు పెద్దలూ ..
పోతరాజుల కొరడా చిందేసినట్లున్న వాతావరణం ఒక్కసారిగా  గంభీరంగా మారిపోయింది.

***                 ***                     ***

ఆ దృశ్యం లీలా టీచర్ కళ్ళముందు లీలగా కదలాడుతుండగా ..

మిలమిల మెరిసే వేగు చుక్కల్లా వారు  చరిత్ర పుటల్లో తమ పేజీకి రంగులద్దుతూ  జీవం పోస్తున్నట్లే  ..  బతుకమ్మను  సరికొత్తగా పేరుస్తున్నట్లే ,  ఆకురాలిన చెట్టుపై  పిట్టల చెదిరిన చిత్రాన్ని చిగురింప చేస్తున్నట్లే  తోచింది ఆమెకు

వి . శాంతి ప్రబోధ

Dasharathi smaraka poti Prize winning story . Published in Sopathi, Navathelangana Sunday magazine 30, April, 2017

Tag Cloud

%d bloggers like this: