The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘batukamma’

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…

batukamma 1దసరా, బతుకమ్మ పండుగల సీజన్ రాగానే నా చిన్ననాటి మధుర జ్ఞాపకాలు ముసిరి మరోసారి ఆనాటి రోజుల్లోకి తీసుకుపోతుంటాయి. నా బాల్యంలో జరుపుకున్న పండుగలలో బతుకమ్మ ఒక మధురానుభూతి. ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజూ, సద్దుల బతుకమ్మ రోజు మా ఇంటి దగ్గర చాలా సందడిగా ఉండేది. కారణం మా ఇంట్లో ఉండే రకరకాల పువ్వులు. ఉదయం లేవగానే మా తమ్ముడు, మా పొలంలో పని చేసే జీతగాళ్ళు మా ఇంటి ముందు ఉండే పెద్ద పందిరి ఎక్కే వారు. ఆ పందిరి పాకిన తీగ బటాణి పూవులు , మాలతీ పూలూ, బోగన్ విలియా పూవులు కోసి కిందకి వేసే వారు. నేను, నా చెల్లెళ్ళు వాటిని పెద్ద పెద్ద గంపలలో వేటికవి నింపే వాళ్ళం. ఆ తర్వాత దొడ్లో విరగ బూసిన బంతి, బంగాళాబంతి (పట్నం బంతి), ఊక బంతి, పైడాపిన్, నందివర్ధనం,తెలుపు- గులాబీ రంగుల గన్నేరు, గోరింట వంటి రకరకాల పూలను కోసి గంపలలో సిద్దంగా ఉండే వాళ్ళం. ఉదయమే లేచి అడవి సమీపంలోనో, బంజరు భూముల్లోనో కనిపించే తంగేడు పూలు, కంది, జొన్న వంటి మెట్ట పోలాల్లోంచి గునక పూవు, కట్ల పూవు వంటి వాటిని మా వూరివాళ్ళు తెచ్చుకునే వారు. ఆ తర్వాత అంటే తొమ్మిది పదిగంటల సమయంలో మా ఇంటికి చేరేవారు పూల కోసం. మా అమ్మో, నాయనమ్మో వచ్చిన వాళ్లకి కాదనకుండా అన్ని రకాల పూలూ ఇచ్చి పంపే వాళ్ళు. ఆ సందడి ముగిసే సరికి పన్నెండయ్యేది.

మా ఇంట్లో మా వాళ్ళు బతుకమ్మలు పేర్చేవారు కాదు. మొదట్లో అమ్మనీ, నాయనమ్మని విసిగించే వాళ్ళం. మనమూ బతుకమ్మలు పేరుద్దామని. ఆ పండుగ చేయడం మాకు రాదు. మనకు అలవాటు లేదు అని చెప్పి మీరు లక్ష్మి అక్క వాళ్ళింటి దగ్గరో, శోభక్క వాళ్ళింటి దగ్గరకో, అరుణ వాళ్ళింటి దగ్గరకో వెళ్లి నేర్చుకోండి అని చెప్పింది అమ్మ. అప్పటి నుండి వాళ్ళు తెచ్చిన తంగేడు, గునక , కట్ల పూవులను తీసుకుని ఒక పెద్ద తప్క (ప్లేట్ ) తీసుకుని గుమ్మడి ఆకులు కానీ, సొర ఆకులు కాని వేసి చుట్టూ పసుపు రంగులో ఉండే తంగేడు పూలను ఆ ప్లేటు చుట్టూ గుండ్రంగా పేర్చే వాళ్ళం. మధ్యలో ఉన్న ఖాళీలో తంగేడు ఆకు నింపే వాళ్ళం. ఆ తర్వాత తెల్లటి గునక పూల చివరలో నిండు గులాబీ రంగులో మొద్దొచ్చె గునక పూలు,టమాటా రంగులో ఉండే కాయితప్పూలూ, బంతి పూలు, బటాణి పూలూ, పట్నం బంతి పూలూ, నీలి రంగు పూలూ , మాలతీపూలూ ఒకదాని తర్వాత ఒకరకం రంగు వచ్చేట్టు శిఖరం లాగా పేర్చి పైన గుమ్మడి పూవు బొడ్డెమ్మతో ఎంత అందంగా ఉండేవో మా ఊరి బతుకమ్మలు. అసలు బతుకమ్మలు పేర్చడం ఓ అద్భుత కళ. ఒకరికొకరు పోటీ పది తమ ఇంటి బతుకమ్మ బాగుండాలని తమ సృజనకి పదునుపెట్టి చేసేవాళ్ళు. అంత అందమైన బతుకమ్మలు ఆ తర్వాతి కాలంలో నేనెప్పుడూ చూడనే లేదు.batukamma

మేం మేము పట్టుకోగలిగే విధంగా చిన్న బతుకమ్మలే పెర్చుకునే వాళ్ళం కానీ, లక్ష్మి అక్క వాళ్ళ అమ్మ వెంకటరత్తమ్మగారు, శోభక్క వాళ్ళమ్మ ఇందిరమ్మగారు వాళ్ళు చాలా పెద్దవి దాదాపు మా ఎత్తు ఉండే విధంగా తాయారు చేసేవారు పెద్ద ఇత్తడి తంబాలంలో వాటిని పెర్చేవారు. తోడు బతుకమ్మ మొదటి దానికంటే చిన్నదిగా ఉండేది. వాళ్ళ దగ్గరే మేమూ బతుకమ్మలు పేర్చడం నేర్చుకున్నాం. తొమ్మిది రకాల సున్ని పిండిలతో సద్దులు చేసేవారు. కొంచెం సేపు ఎవరిదైనా ఒకరింటిదగ్గర ఆడి ఆ తర్వాత ఓ మైలు దూరంలో ఉండే చెరువు ఒడ్డుకు తీసుకెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడేవాళ్ళు. వాళ్ళతో మేము చప్పట్లు చరుస్తునో, కోలలు వేస్తూనో ఆడేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు ఒడ్డున నిల్చుని చూసేవారు. ఊరు ఊరన్త అక్కడే ఉండేది. అందరూ అలా ఒక దగ్గర కలిసేది ఆ ఒక్క పండుగకే.

ఆ పెద్ద పెద్ద బతుకమ్మలు చెరువుదాకా మోయడం చాల కష్టం కదా .. అందుకే జీతగాళ్ళు వాటిని చేరువుదాకా తెచ్చే వారు. చెరువుకు వెళ్ళేటప్పుడు బాండుతో చప్పుడు చేసుకుంటూ వెళ్ళడం భలే ఉండేది. పెద్ద వాళ్ళు పెట్టెలో అడుగున దాచిన పెద్దంచు పట్టు చీరలు తీసి కట్టేవాళ్ళు. మేం పిల్లలం లంగా జాకెట్టు వేసుకునే వాళ్ళం. వెంట మగవాళ్ళు కుడా వచ్చేవారు. చెరువు దగ్గర చదునుగా ఉన్న దగ్గర ఒక వెంపలి చెట్టు నాటి పసుపు కుంకుమలు వేసి ఊదుబత్తులు (సాంబ్రాణి కడ్డీలు ) వెలిగించేవారు. దాని చుట్టూ బతుకమ్మలు ఉంచినాక ఆట మెదలయ్యేది.

ఒక్కేసి పువ్వేసి చందమామ
ఒక జాము ఆయెనే చందమామ
రెండేసి పువ్వేసి చందమామ
రెండు జాములయేనే చందమామ

బంగారు బతుకమ్మ ఉయ్యాలో
ఇద్దరక్కజెల్లెల్లు ఉయ్యాలో
ఒక్కురికిచ్చిరి ఉయ్యాలో

శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మా .. చిత్రమై పొదురమ్మ గౌరమ్మా అంటూ రకరకాల పాటలు పాడేవారు .
batukamma 2
ఎంగిలి పువ్వు బతుకమ్మకి పాడే పాటలు, సద్దుల బతుకమ్మకి పాడే పాటల్లో తేడా ఉండేది. ఆ పాటలు ఇప్పుడు గుర్తు లేవుగాని వాళ్ళతో కలసి లయబద్దంగా అడుగులేస్తూ, చప్పట్లు చరుస్తూ గుండ్రంగా తిరుగుతూ ఆడడం బలే జోష్ ఇచ్చేది. బతుకమ్మలాటకి వయసుతో పనిలేకుండా ఆడవాళ్ళంతా ఆడేవాళ్ళు. పేదలు, డబ్బున్నవాళ్ళు అనే తేడా కూడా కనిపించేది కాదు.

ఆట అయిపోయాక బతుకమ్మలని ఆడవాళ్ళు నీళ్ళలోకి దిగి వదిలేసే వారు. పోయిరావమ్మా అంటూ .. సాగనంపేవారు . జీతగాళ్ళు వాటిని ఇంకా కొంత లోపలి పంపేవారు. ఆ తర్వాత అందరూ తమ ఇంటి నుండి తెచ్చిన తొమ్మిది రకాల సద్దుల మూటలు విప్పి “ఇస్తి నమ్మ వాయనం , పుచ్చు కుంటినమ్మ వాయనం ” అనుకుంటూ ఇచ్చి పుచ్చుకునేవారు. మా పిల్ల మూక అంతా ఆ సద్దులు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూసే వాళ్ళం. అలా సంబురం అంతా అయిపోయే సరికి చీకటి పడిపోయేది. చెరువు ఒడ్డునుండి పొలం గట్ల మీదుగా ఇంటికి వెళ్ళాలి. టార్చి లైటు వెలుతురులో ఒకరితర్వాత ఒకరం నడుచుకుంటూ వెళ్తుంటే పెద్దలు పిల్లలకి జాగ్రత్తలు చెప్పడం, చెరువులోంచి వచ్చిన బురద కాళ్ళు ఆడవాళ్ళ చీరలకు తగిలితే వాళ్ళు చీర పాడైపోతుందని జాగర్త పడడం, కొంటె పిల్లలు కావాలని గట్టుమీద నడుస్తూ వాళ్ళను దాటుకుపోవడం అంతా తమాషాగా ఉండేది.

దాదాపుగా బతుకమ్మలని మరచిపొతున్న సమయంలో ఊపునిస్తూ వచ్చిన తెలంగాణా ఉద్యమం బతుకమ్మకి మళ్లీ బతుకునిచ్చిందనిపిస్తోంది. వెదురుబద్దలకి రంగు కాయితాలు అంటించి చేసిన బతుకమ్మల ఆట కొద్ది మందితో ఎంతో కృత్రిమంగా ఉండేది. ఇప్పుడుజవం జీవం వచ్చిన బతుకమ్మలు కళ్ళ కింపుగా .. జనంతో కళకళలాడుతూ నిండుగా .. ఉద్యమ స్పూర్తితో విస్తరిస్తూ .. సమకాలీన సమస్యలతో విశాలత్వం సంతరించుకుంటూ ..

వి. శాంతి ప్రబోధ