The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘baalyam’

తప్పటడుగుల బాల్యం

తప్పటడుగుల బాల్యం

 వి. శాంతి ప్రబోధ
9866703223

మొబైల్‌ మోగుతోంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయం వెంటాడుతుండగా బ్యాగ్‌ లోంచి  ఫోన్‌ తీసి చూశా. కొత్త నంబరు. చంద్ర ఆచూకీ తెలుపుతుందేమోనని ఆతృతతో కాల్‌ తీసుకున్నాను. ‘‘అమ్మ .. అమ్మా ..’’ స్త్రీ కంఠం. వాయిస్‌ బ్రేక్‌ అవుతోంది. హలో  హలో అంటున్నా..  నా గొంతు వారికి వినిపించినట్లు లేదు. .. లైన్‌ కట్‌ అయింది.  అదే నంబరుకి పదే పదే చేశాను. కాల్‌ వెళ్ళడం లేదు.  మనసులో ఆందోళన, ఆదుర్దా అంతకంతకు పెరిగిపోతోంది.

అసలు ఏమయ్యాడు చంద్ర?  ఆ ప్రశ్న మదిలో మెలిపెడుతోంది. నిన్న సాయంత్రం నుండి కనిపించడం లేదు. వాడి గురించి తెలుసు కాబట్టి,  ఎటు వెళ్ళినా చీకటి పడేసరికి  వస్తాడులే అనుకున్నాం. ఉహు .. రాలేదు.  ఊరంతా జల్లెడ వేసి గాలించాం.  తలో దిక్కు బావులు, చెరువులు, పెద్ద కాల్వతో సహా వెతికాం. జాడే లేదు.  ఉదయం పదకొండు గంటలవుతోంది. చివరికి పోలీసు కంప్లయింట్‌ ఇద్దామని బయలుదేరుతుండగా ఈ కాల్‌.
తండ్రిలేని పిల్లగాడని మా అత్తమామలు జర గార్వం చేసిన్రు .. గాలి గాలి అయితున్నరు. నేనా ఈ పొద్దో ఆ పొద్దో అన్నట్టుంటి .. నువ్వే ఈల్లకి బుద్ది నేర్పాలే.  దయుంచి మంచిగ చూసుకోరవ్వా… అంటూ అప్పగింతలు పెట్టిన ఆ తల్లి ప్రేమకి నేనేం జవాబు చెప్పను?  పిల్లలని నా దగ్గర వదిలినప్పుడు వాళ్ళ అమ్మ, తాత ఇచ్చిన నంబరుకి కాల్‌ చేస్తే నంబరు సరి చూసుకోండి అంటూ వాయిస్‌ వస్తోంది.  ఇప్పుడు వచ్చిన నంబరుకి ఎన్ని సార్లు చేసినా సిగ్నల్స్‌ అందడం లేదు.   వాడి దయాగుణం,  చీదర పడకుండా మానవత్వంతో స్పందించిన తీరు.. స్వచ్చమైన వెన్నెల్లా నవ్వుతూ తుళ్ళుతూ అమాయకంగా కనిపించే చంద్ర  తెలిసో తెలియకో చేసి ఇబ్బంది పెట్టిన… ఆకతాయి పనులు ఒకదాని తర్వాత నన్ను వెంటాడుతున్నాయ్‌.. ఆ రోజు చంద్ర వాళ్ళు వచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది.
లిలి లి
చంద్ర, వాడి తమ్ముడు చరణ్‌ లది కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల దగ్గరలోని ఓ మారుమూల పల్లె.  ‘‘తండ్రి ల్యాకనే పాయె.. తల్లి ఉండి లేనట్టేనయే.. మాకు మాటినకచ్చిన్రు బిడ్డా .. ఆగమయితాన్రు.. గందుకే ఈడిదంక తోల్కచ్చిన .. జర పయిలం.’’ అంటూ అప్పగింతలు పెట్టి వెళ్ళాడు తాత.  వెళ్తూ వెళ్తూ మనవల్లిద్దరి చేతిలో చెరో నలబై రూపాయలు పెట్టాడు.   వద్దు, పిల్లలకి పైసలతో పని ఉండదు అని చెప్పినా వినలేదతని మనసు.  సరేలే, సాయంత్రం తీసుకొని దాచిపెట్టవచ్చు అనుకున్నాం.
కాసేపైన తర్వాత చంద్ర కనిపించలేదు. అయ్యో .. ఏమైపోయాడు ? అసలే ఊరికి కొత్త . వాళ్ళ తాత, అమ్మ వెళ్ళేప్పుడు చిన్నవాడు చరణ్‌ కళ్ళనీళ్ళు పెట్టాడు కానీ చంద్ర నవ్వుతూనే సాగనంపాడు కదా .. అనుకుంటూ చరణ్‌ ని  అడిగితే,  ‘‘మా అన్న సబ్బు తేనీకి పోయిండు’’ అని చెప్పాడు.  అంతలో రానే వచ్చాడు చంద్ర చేతిలో ఓ పాలితిన్‌ కవర్తో.    పెయ్యి సబ్బు, బట్టల సబ్బు, కొబ్బరి నూనె అంటూ తీసి చూపాడు. ఈ  ఊరు నీకు తెలియదుగా అన్న ప్రశ్నకు .. ‘‘నేను బస్సు దిగి ఆటో ఎక్కి రాంగ దుక్నం జూసిన.  సీదా అదే తొవ్వ బట్టి పోయి తెచ్చిన ‘‘అని చెప్పి, తమ్ముడి కేసి చూస్తూ ‘‘పో .. పోయి తానం జేసిరా .. నీ ఎన్క నేన్జేత్త’’ అన్నాడు పెద్దరికంగా . వాడి తీరు చాలా ముచ్చటేసింది.  అవన్నీ మేమే ఇస్తామని, మీరు మాకు చెప్పకుండా గేటు దాటి బయటికి వెళ్ళ కూడదని చెప్తే  ఏంతో బుద్దిమంతుడిలా సరేనన్నట్లుగా తలూపాడు.
అది ఆదివారం ఉదయం. పిల్లలంతా తమ పరిసరాలు శుభ్రం చేసుకునే పనిలో ..మా కాంపస్‌ పక్కనే మొక్కజన్న చేను.  ఆ చేన్లోకి ఎప్పుడు వెళ్ళాడో నాలుగు మక్క కంకులు తెచ్చి తోటివాల్లకిచ్చి తినమన్నాడట చంద్ర. వాళ్ళు మెచ్చుకుంటుంటే సంత్రా తోటలోకి వెళ్లి అవి తెంపుకొచ్చి ఇచ్చాడట.   ఇంతలో ఆ తోట యజమాని కర్ర పట్టుకొని యుద్దానికొచ్చాడు.
ఓ రోజు మధ్యాహ్నం మూడుగంటల సమయంలో వచ్చాడు. అది బడి పిల్లలు  వచ్చే సమయం కాదు.  ఇప్పుడోచ్చావే అనడిగితే పళ్లన్నీ బయటపెట్టి అహహా .. హÛ అంటూ పెద్దగా నవ్వేస్తూ చేతిలో ఉన్న నోట్‌ బుక్స్‌ అటూ ఇటూ తిప్పుతూ నించున్నాడు.  పుస్తకాల బాగ్‌ బడిలోనే ఉందనీ, లంచ్‌ బెల్‌ లో అంతా ఆడుకుంటుంటే తాను బస్టాండుకు పోయి అక్కడ  మక్క కంకులు కాల్చి అమ్మేవాళ్ళకి అమ్మి పెట్టానని, వాళ్ళు 15 రూపాయలు ఇచ్చారని, 5 రూపాయలతో బజ్జీలు తిన్నానని, మిగిలిన 10 రూపాయలతో ఆ పుస్తకాలు  కొన్నానని చెప్పాడు. సంపాదించి ఖర్చుచేసిన తీరుకి, ఆ తెలివితేటలకి  ఆశ్చర్యపోతూ .. నీ దగ్గర పుస్తకాలున్నాయిగా  ఇవెందుకు అంటే మేడం డబ్బాల కాపీలు తెచ్చుకొమ్మంది.  నువ్వు పొద్దుగల విశాల అడిగితే ఇప్పుడు లేవు రేపు తెప్పిస్త అన్నవు గద ..! గందుకే నేనే కొని తెచ్చుకున్న అని చంద్ర జవాబు.  ఇంకెప్పుడూ అట్లా చేయొద్దంటే సరేనంటూ ఎప్పట్లానే బుద్దిమంతుడిలా తలూపాడు.
ఆ రోజెందుకో బడి బంద్‌. పిల్లలొకొక్కరిని పిలిచి వాళ్ళ కేస్‌ స్టడీ రాసుకుంటున్నా . చంద్ర వంతు  వచ్చింది. అన్నదమ్ములిద్దరినీ  పిలిచా. కుటుంబ వివరాలు అయ్యాక వాళ్ళ గురించి చెప్పమన్నా .. చరణ్‌ నవ్వుతూ మెలికలు తిరుగుతూ అన్నకేసి చూస్తుంటే..   ఉళ్ళో ఉన్నప్పుడు వాళ్ళు  ఏమేమి చేసేవారో, ఏ ఆటలు ఆడేవారో ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో చెప్పమన్నా. చంద్ర ఒకసారి నా మొహంలోకి దీర్ఘంగా చూసి చెప్పడం మొదలు పెట్టాడు.  మా ఊర్లె ఉన్నప్పుడయితే నేను పత్తలాడుతుంటి. బీడీలు పడ్తుంటి. సార పాకెట్లు , కల్లు సీసలు తాగుతుంటి.  దొర్కిన్నా .. మా తాత చింత బరిగేతోని జోపుడు జోపుతుండే .. నేను దోర్కుతనా .. ఆహాÛహాÛ .. ఊరంత ఉర్కిపిస్తుంటి .. పాపం ముసలోడు దమ్ముకస్తుండే .. అని గర్వంగా చెబుతుంటే నేను తెల్లబోయా
‘‘ఓరి  అయ్యా .. నీ కాల్మోక్కుతరా  .. తాత చెప్పినట్టు ఇనరా .. నీ బాంచెన్‌  అని మా అమ్మ గుండెబగుల ఏడుత్తుండే .. ’’ చెప్పాడు చరణ్‌.
‘‘మా బాపు పత్తలాడేటోడు, మా చిన్నబాపు బీ ఆడ్తడు. మాతాత, బాపు, చిన్నబాపు, అమ్మ, ఆయీ అందరు కుసుండి తాగుతరు. ఎన్నడన్న ఆల్లే మాకింతబోత్తరు గద..! నేను నా సోపతోల్లతోని తాగితే, పత్తలాడితే బరిగె బడ్తరు .. నాకయితే ఏం సమజ్గాకొచ్చిన్ది’’ తలగోక్కుంటూ చంద్ర .
వాడి సంఘర్షణకి కారణం పెద్దల ద్వంద నీతి. టాపిక్‌ మారుస్తూ అవన్నీ కొనడానికి నీకు పైసలెక్కడివి?
‘‘ఆ .. మా ఊర్లె ఎల్లారం చెరువున్నది గదా .. గా చెర్ల మత్తు చాపలున్నయ్‌ ..గవ్వి పైకి తేల్తుండే నా .. కర్రతోని జప్పన జోపుతుంటి .  దెబ్బతగిలి అది కిన్దమీద అయితున్డెగదా .. దాన్ని పట్టి అమ్ముతుంటి .. గా నాగరాజుగాడు రెండ్రూపాలు ఒక్కొక్కపాలి ఐద్రూపాలు ఇచ్చి చ్యాప తీస్కపోతుండే. ఊర్ల ఎవ్వల్లెం జెప్పిన ఆ పని జేస్తున్టిగద! ఆల్లు బీ పైసలిత్తుండే .. నాకేది గావాల్నంటే గది కొనుక్కొంటుంటి’’ సంతోష సముద్రం ఉప్పెనై వస్తున్నట్టు తను చేసిన ఘన కార్యాల్ని ఏ సంకోచం లేకుండా స్వేచ్చగా హావభావాలతో చెప్పుకు పోతున్నాడు చంద్ర.
‘‘సితారలు , సాగర్లు నేను సుత మత్తు బుక్కుతుంటి..’’ చెప్పాడు చరణ్‌. నిశ్చేష్టలా వింటున్నా ..నువ్వు కూడానా .. నా మతి పోతోంది .  ఈ పిల్లల వ్యవహారం తెలుస్తోంటే ..
‘‘అవునక్కా .. అడు బీ బడికిపోకుండే .. మా తాత బడికి తోలేత్తే .. ఆ ఎన్కనే ఎల్లోస్తున్టిమి.’’
‘‘ఎందుకు .? అన్నట్లుగా చూశా..’’ హు .. గా సారేం సదు నేర్పుతడు.. ? ‘‘ఎదురుప్రశ్న వేసి’’ అంబటాల కొత్తడు.  ఇటు  పొద్దు మల్లంగనే అటు బోతడు. మా పోరగాల్లను            ఉత్తగనే అమ్మనా బూతులు తిడ్తడు ..ఈపులు సీర్త .. అన్కుంట కొడ్తడు .. తూ .. నీఅ .. గా బడికెవడు వోతడు .. ఈడు బీ నా తోకబట్టి తిర్గుతుండే .. ‘‘చంద్ర తమ్ముడి కేసి చూసి చెప్తుంటే అవునన్నట్టు పళ్ళికిలించాడు చరణ్‌.
ఇంకా ఏం చేసేవారు ..? ఏ ఆటలు ఆడేవారు.. ప్రశ్న నా నోటినుండి బయటికి రాకుండానే చెప్పడం మొదలెట్టాడు చంద్ర ‘‘గప్పుడయితే సిర్రగోనే, గోటిలు ఆడ్తున్టిమి గానీ పత్తలాట ఆడంగ మత్తు మజా అస్తుండే.. గా నాగరాజుగాడున్నడు గద .. ఆడు బజ్జీలు తెత్తుండే .. ఆడు పటేల్‌ ఇంటి బర్లు గాస్తుండే గద .. ..  మల్లిగాడు కాపోల్ల బర్లను మేపుతున్డే.. ఆడు అప్పుడప్పుడు బోయి బర్లను మల్లేస్తుండే .. కర్రెంకడు , నేను జబ్బ మీది తువ్వాలు పరుస్తున్టిమి.  పత్తలేసి ఆడుతున్టిమి. నడుమ నడుమ బజ్జీలు తినుకుంట ఆడుతున్టిమి. ఒక్కోపారి చెర్లకుబోయి చ్యాపలు, ఎండ్రక్కాయలు పట్టుడు గమ్మతుంటుండే.. అయ్యిట్ని ఇన్ని పుల్లలుపోర్కల్తోని మంటేసి కాల్చుక తింటున్టిమి.  గా కర్రెంకడయితే వాగొడ్డుకాడ కవుజు పిట్టల పడ్తున్డే .. అయ్‌ బీ కాల్చుక తింటున్టిమి.  కమ్మగుంటుండే ..  చేతిల పైసలుంటే కల్లు సీసాలు తెస్తున్టిమి.
‘‘అక్కా .. ఊర్ల ఆడితే గా పోలీసోల్లు కొండవోయి టాణల ఎత్త్తాన్రు గద .. గందుకే గా పెద్దోల్లు గుట్టల మొకానబోయి ఆడ్తున్నరు.  మేం సుత గట్లల్ల , చేన్లపొన్నబోయి  ఆడ్తున్టిమి’’.
ఎంతో  ఉత్సాహంగా తమ వీరోచిత కార్యాల్ని చెబుతున్న చంద్రాన్ని చూస్తూ పెద్దల ప్రభావం పిల్లలపై ఎలా పడుతుందో ఆలోచిస్తూ.. ఒక నిముషం ఆగి .. మీ నాన్న ఎట్లా చనిపోయాడు..
‘‘ఏమో’’ ఆ చిన్ని కళ్ళు చికిలిస్తూ చరణ్‌
చంద్ర తలొంచుకుని అలోచించి ‘‘టి. బి .బీమారి అయిందట. మస్తు బయలువెట్టి సచ్చిన్డట.’’
‘‘బతికున్నప్పుడు ఏం జేసేవాడు ?’’
‘‘ఏం జేత్తడు..? బిమారయింది గద .. చ్యాతనయితలేదని పనికి పోకుండే . పోద్దువోతలేదని పత్తాలాడుతుండె ..  మా అమ్మ ఎంత మొత్త్తుకున్న ఇనకున్డె.  సీసలు సీసలు  మత్తు తాగుతుండే .. మా అమ్మ పైసలియ్యకుంటే దాన్ని పడేసి దంచుడు దంచుతున్డే ..’’
మరి మీకు అన్నం ..?
‘‘మా అమ్మ బట్టలుతుకుతున్డే కద ..  ఉత్కిన బట్టలు ఆల్లింట్ల యేసి రాంగ ఆల్లే జరంత  అన్నం కూర ఏదుంటే అది ఇస్తుండే .. అదే తింటున్టివి .. మా అమ్మ ఉత్కిన బట్టలు ఆ ఇండ్లల్ల ఏసి రానికి నేను సుత  పోతుంటి’’  అన్నాడు చరణ్‌
‘‘ఒక్కోపారి మా అమ్మ చ్యాతనయితలేదు కొడ్కా .. పోయి ఇండ్లల్ల బట్టలేసి రా బేటా అని తోలుతుండే. పొతే పోతుంటి. లేకుంటే లేదు.  సావుకారమ్మ ఇంటికయితే పోతుంటి. బట్టల మూట ఆడ బెట్టి అట్లనే చూస్కుంట ఉంటుంటి.  ఆమె ఓ చంద్రిగా అదివ్వు .. ఇదివ్వు అని ఏదో పన్జేప్తుండే .. సావుకారమ్మ నడుత్తాన్న అంటుంటి .. ఓ  పొల్లగా ఇగరా అని పిల్చి తినేటి గోలీలు ఇస్తుండే ..’’
‘ఇంకా ఏదో చెప్తుండగా చరణ్‌ అందుకొని ‘‘అమ్మానాన్నలాట ..’’  అంటుండగా ‘‘ఊ’’ అని తన లోతైన కళ్ళతో గదిమి చూసి వద్దన్నట్లుగా సైగ చేశాడు చంద్ర.
అప్పటినుండి అన్నే చెబుతున్నాడు నేను చెప్పొద్దా అనుకున్నాడేమో ‘‘ఊ .. గప్పుడు నువ్వు చెడ్దిలిప్పి అమ్మనాన్నలాట ఆడలే ..’’ అన్నాడు చరణ్‌. అదిరిపడి చంద్రకేసి చూశా
గాలి తీసిన బుడగలాగా  అయిన చంద్ర తమ్ముడి చెయ్యి గిల్లాడు చెప్పొద్దన్నట్లుగా .కెవ్వు మన్నాడు చరణ్‌ చెయ్యి రుద్దుకుంటూ
వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ‘‘నువ్వు ఆడలేదా ..’’ అడిగా
‘‘నేను బీ ఆడిన’’ మెలికలు తిరిగి సిగ్గు పడిపోతూ చరణ్‌
వెన్నులోంచి  సన్నని వణుకు నా శరీరమంతా వ్యాపిస్తూ .. ఇలాంటి పిల్లల్ని దారికి తేవడం తన వల్ల అవుతుందా ..? ఏమాత్రం ఏమర పాటుతో ఉన్నా మిగతా పిల్లలతో తమ కార్యకలాపాలు మొదలెడితే … ఆ ఆలోచనే భయకంపితురాల్ని చేసింది.  జీవనసౌధానికి బలమైన పునాదులు వేయాల్సింది బాల్యంలోనే.  ఆదిలోనే అపశ్రుతులా.. వీరి బతుకుబాటను మార్చగలమా ఆలోచిస్తున్న నాకు
ఎగుడు దిగుడు రోడ్డులోని గుంతలో పడి మా వాహనం ఇచ్చిన జర్క్‌  చంద్ర ఇచ్చిన కుదుపుకంటే చాలా చిన్నదిగా అనిపించింది.  వెనక సీట్లో కూర్చున్న మాళవిక, ఉమా                వాళ్ళు చంద్ర గురించే మాట్లాడుకుంటున్నారు.
నోరు లేని కోడి తను వెన్నంటే  ఉండి పిల్లలకి లోకాన్ని పరిచయం చేస్తుంది. రెక్కల కింద దాచుకుని గద్దల్నించి కాపాడుకుంటుంది. కొమ్ము విసిరి తన చిన్నారి దూడని కాపాడుకుంటుంది ఆవు. మరి మనిషి ఏం చేస్తున్నాడు..? ఇలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల సమస్యా.. కుటుంబ సమస్యా .. లేక సమాజ సమస్యా .. తన దగ్గరున్న ప్రత్యేక పరిస్థితుల్లోని పిల్లలను సరైనదారికి మళ్ళించడం వ్యక్తుల వల్ల అవుతుందా .. ఇందులో ప్రభుత్వాల బాధ్యతలు ఏమిటి .. ? తలెత్తుతున్న ప్రశ్నలకి అడ్డుతగులుతూ ఫోన్‌ ఒక రింగ్‌ వచ్చి ఆగిపోయింది. మామూలే నెట్వర్క్‌ లేదు.
చంద్ర జ్ఞాపకాల్లోకి జారిపోతూ … నేను
మరో రోజు మధ్యాహ్నం చేతిలో నలుపు రంగు పొలిథిన్‌ కవర్తో గబగబా చంద్ర వెళ్ళడం కన్పిస్తోంది. ఇప్పుడెందుకు వచ్చినట్లు .. చేతిలో ఏమిటో అనుకుంటూ ఆఫీసు రూం లోంచి బయటి కొచ్చా. వడివడిగా వాడి నివాసం కేసి వెళ్తున్నాడు. ఆ ఇళ్ళలో ఉండే అమ్మలు తోట పనిలోనో, వంట పనిలోనో             ఉండే సమయం అది.  గది మధ్యలో పెట్టాడు పాకెట్‌. మంచినీళ్ళ బిందె  మీద గ్లాసు తీసుకొచ్చి కూర్చొన్నాడు.  నేను గడపలోకి రావడం చూశాడేమో తన చేతిలోని పాకెట్‌ పక్క బట్టల కిందకు తోశాడు. గ్లాసు మాత్రం అక్కడే ఉంది.
ఏంట్రా ఏం చేస్తున్నావ్‌ ..?
ఏం లేదక్కా..
ఆ గ్లాసు ఏంటి  గది మధ్యలో ..
ఏమోనక్కా .. ఇక్కన్నే ఉన్నది.
ఓ అలాగా అంటూ  వెళ్లి పరుపు కింద ఉన్న పాకెట్‌ తీయబోతుండగా , మెరుపు వేగంతో వెళ్లి అడ్డుగా నిల్చున్నాడు.  అక్కడేదో కనిపిస్తోంది అంటూ పాకెట్‌ తీశా బయటికి .  ఇక దాచలేను అనుకున్నాడేమో .. పళ్ళికిలిస్తూ  నేనే తెచ్చిన అన్నాడు.
పైసలెక్కడివంటే ..
బడికెల్లి మేడం సూడకుంట తప్పిచ్చిన గద !. బస్టాండ్ల అడుక్కున్న . పది రుపాలొచ్చినయ్‌. రెండు పాకెట్లు కొన్న. ఇగో ఒక సితార అంటూ జేబులోంచి తీసి చూపాడు. అక్కడ ఒకటే కల్లు పాకెట్‌ కనిపిస్తోంది. ఆ విషయం అడిగితే దార్లో వచ్చేటప్పుడు సీమచింత చెట్టుకింద కూచొని తాగిన అని జంకు గొంకు లేకుండా జవాబు
నువ్వు చాలా మంచి వాడివి కదరా చంద్రా. మీ అమ్మను బాధ పెట్టకుండా బాగా చదువుకుంటావు అనుకుంటే ఇట్లా చేస్తున్నావేమిరా .  ఇట్లా చెయొచ్చా కోపాన్ని అణుచుకుంటూ అన్నా. చేయకూడదన్నట్లుగా బుద్దిమంతుడిలా తల ఊపాడు.  క్షణమాగి .. ‘‘నాకు తాగాలనిపిచ్చింది. పానమాగకచ్చిన్ది. మా ఊర్ల ఎప్పుడంటే అప్పుడు తాగుతుంటి. ఈడ మీరు పాలు పోస్త్తరు , అన్నం పెడ్తరు , పల్లి లడ్డులు , మొలకలు , గుడాలు , అరటి పండు అన్ని పెడ్తరు గానీ కల్లుపోయరు గద ! నాకేమో అది కావాల్నని పానం  గుంజవట్టె . గందుకే పోయి తెచ్చుకున్న’’ మనసులో ఉన్నది నిర్భయంగా, స్వేచ్చగా  వెలుబుచ్చాడు .
మరి మీ తమ్ముడిని, ఇక్కడున్న పిల్లలందరినీ  నీలాగే చేయమందామా .. ?! రోజు పాలు పోయకుండా కల్లు తెప్పిద్దామా … ?!
‘‘ఊహు అద్దు అద్దు’’ అన్నాడు కంగారుగా
ఏం ఎందుకంటే .. ‘‘అద్దు మంచిదికాదట . మా అమ్మ ఎప్పటికి ఎడుత్తది. కొడ్కా తాగకురా అని. మా తమ్ముడు సుత తాగిండంటే మా అమ్మ గుండెవగిలిసత్తది.’’ అమ్మపై తడి ఆరని ప్రేమ.
వాడి ఆలోచనల్లో ఉండగానే  మా వాహనం పొలీస్‌ స్టేషన్‌ ముందాగడం నా ఫోన్‌ మోగడం ఒకేసారి జరిగింది. ‘‘అమ్మ.. నేను సాయమ్మను. చంద్రి గాడొచ్చిండు.  చెప్పకుంట పారేల్లొచ్చిన్డట.. గద .. మీరు పరేశానయితరని అప్పటికెల్లి ఫోన్‌ జేత్తాన్న . గిప్పటికి కల్సింది.. చెప్తోందామె .. నానెత్తి మీద పెద్ద భారం దిగిన ఫీలింగ్‌.  హమ్మయ్య అని గట్టిగా ఊపిరి పీిల్చుకున్నా . నేను జీపులోనే కూర్చొని మిగతావాళ్ళకి  ఆగమని సైగ చేశా.  చంద్ర తల్లి చెప్పుకుపోతోంది వాడు ఎలా వచ్చిందీ .. చంద్ర పక్కనే ఉండి ఏదో చెబుతున్నాడు .  వాడి గొంతు వింటుంటే కోపం తన్నుకొస్తోంది. నిన్నటి నుండి ఎంత బాధ పడ్డాం . ఎంత టెన్షన్‌ అనుభవించామో తలచుకొని ఒకసారి ఫోన్‌ వాడికివ్వమన్నా .. ‘‘ఎందుకిలా చేశావ్‌?’’ కోపంగా అడిగా
‘‘మా అమ్మకి జరమొచ్చిందని కలవడ్డది. అమ్మని చూడబుద్దయింది. అచ్చిన’’
‘‘మరి చెప్పొచ్చుగా ..’’
‘‘మొన్న సరిత వాల్ల పెద్దమ్మ కందూరుకు తోల్కపోనత్తే నువ్వు తోలలే గద .. పండుక్కు పంపుతనన్నావ్‌ గద.’’ ఎదురు ప్రశ్న.
అవును , నిజమే .. మరో పది రోజుల్లో పండుగ సెలవులు  అని పంపలేదు.
‘‘మరి నువ్వు ఎట్లా వెళ్ళావ్‌ .. ? నీదగ్గర పైసలు లేవు గద ..’’
‘‘అవ్‌ నా తాన చిల్ల పెంక లేదు. బస్ల ఎన్క సీటు కింద కూసున్న..టికెట్లాయన సూడకుంట. కామారెడ్డి కాడ దిగిన. సిరిసిల్ల బస్సెక్కిన.  ఆడ దిగేవరకంటే రాత్రయింది. అట్లనే పన్న . పొద్దుగాల్ల తెలివికచ్చి చూద్దును గద బస్సుల ఉంటి. బస్‌ లకేల్లి అరిచిన. ఎవ్వరు రాలే. ఒక కిటికీకి  అద్దం లేకుండే.  దాంట్ల కెల్లి దుమ్కిన. ఆటోల కాడికి బోయిన . మా ఊరి ఆటో కనవడ్డది. అన్న ఆకలయితాందే అంటి.  పూరి తినబెట్టిండు. ఇంటికాడ దిమ్పిండు’’. అని చెప్పి  ‘‘ అక్కా మా తమ్ముడు మంచి గున్నడా .. నాకోసం ఏడుత్తండా .. రేపత్తనని జెప్పక్కా .. రజినక్కకు జరం తగ్గిందా .. మా మేడం ఏమన్నది’’ అడుగుతున్నాడు.
తోటి విద్యార్థిని వాంతి చేసుకుంటుంటే దోసిట పట్టి అవతల పడేసిన చంద్ర.. మొక్క విరిగితే దానికి నాలుగు వైపులా              రాళ్ళు పెట్టి కర్రపుల్ల ఆసరాతో ఆమొక్కని నిలబెట్టిన చంద్ర.. ఆ తెలివి తేటల్ని .. అమ్మ అంటే ఉన్న ప్రేమ, తమ్ముడంటే   ఉన్న ఆప్యాయత, బాధ్యత  ఇతరుల పట్ల ఉన్న సహానుభూతి,  సహజంగా వికసిస్తున్న వ్యక్తిత్వం,  స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే తత్వం అబ్బురపరుస్తూ ..  ఆకాశంలో రంగుల్లా .. స్వచ్చమైన గాలిలా .. పారే సెలయేటిలా .. వెన్నెల వెలుగులా కనిపిస్తూ చంద్ర.  వాడి చుట్టూ ఉన్న ముళ్ళు ఎరివేస్తూ,  మంచితనాన్ని మసకబారించి తప్పుటడుగులు వేయించే స్వార్ధపరులను దాటుకుంటూ,  ఏర్పడే తుఫానుల్ని తట్టుకుంటూ ముందుకు వెళ్ళగలడా? ప్రశ్నార్ధకంగా మారుతున్న తప్పటడుగుల బాలల భవిష్యత్‌ చిత్రాన్ని చిత్రించడం ఎలాగ అని ఆలోచిస్తూ.. సంఘర్షిస్తూ.. మా వాహనం వెనక్కి తిప్పాం

 

Published in Sahiti Prasthanam in March 2015.

మహారణ్యపు ముళ్ళదారుల్లో ..

చిగురు తొడుగుతున్న బాల్యాన్ని
ఊపిరాడని చీకటి గుయ్యారంలోకి
రెక్కలు విప్పుకుని తరుముతూ .. రభసచేస్తూ..
తన కబంధ హస్తాలలోకి రారమ్మని వేధిస్తూ ..
తనువు నుజ్జు నుజ్జై బాధతో అరుస్తుంటే
మనసు భయంతో చిగురుటాకులా కంపించిపోతుంటే
పసిమొగ్గల హాహాకారాలను జుర్రుతూ
వికటాట్టహాసంతో ఆలింగనం చేసుకొన్నావా ..?!

******
బంగారు బతుకు బొమ్మల్ని చిందరవందర చేసి
మహారణ్యపు ముళ్ళదారుల్లోకి గిరాటేసి
మసక బారుస్తూ .. చీకటి రంగుల్లోకి తరిమేసి
కన్న వారి కళ్ళలో ఆశల చిగుళ్ళు తుంచేసి
బొండు మల్లె గుబాళింపులు మాయంచేసి
సేదతిరమంటున్నావా ..?
మట్టిపొరల సువాసనలద్దుతున్నానంటూ
నిన్ను నీవు సమర్ధించుకుంటున్నావా .?!

** *** **

ఉత్పాతంలో ముద్దలు ముద్దలుగా
రాలిన చుక్కల జ్ఞాపకాల వేదనతో
పగిలిన హృదయ రోదనతో
తెల్ల కాగితంపై రక్తాశ్రువుల వీడ్కోలు
రెప్ప వాల్చి తెరిస్తే .. మళ్ళీ మామూలే
లిప్తపాటులో .. అంతా జరిపించేసి
రాజుకుంటున్న కారుమబ్బుల్లో
గద్దల్లా తన్నుకు పోతున్న ఇనుప శకలాలు
అయినా నిద్దురపోతూనే ఉంటాం!
మొద్దు నిద్దుర పోతూనే ఉంటాం !!

వి. శాంతి ప్రబోధ
(ముసాయపేట సంఘటన తర్వాత రాసిన కవిత)

Tag Cloud

%d bloggers like this: