The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘యువత దృష్టి’

యువత- పావన నవ జీవన బృందావన నిర్మాతలు కావాలి

యువత గమనం – గమ్యం

ఇప్పుడు అందరి దృష్టి యువతపైనే. ఆశలూ యువతపైనే. దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే అనే. కారణం అమెరికా జనాభాకి సమానంగా మన దేశంలో యువత ఉండడం. దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. అయితే, నేటి యువత తీరుపై పై అనేక విమర్శలూ, ఫిర్యాదులూ ఉన్నాయి. ఈ సమయంలో యువత తీరుతెన్నులు, వారికున్న అవకాశాలు అవరోధాలు ఏవిధంగా ఉన్నాయో ఒకసారి అవలోకిద్దాం .

‘కొంత మంది యువకులు పుట్టుకతో వృద్దులు .. కొంత మంది యువకులు ముందు తరం దూతలు… పావన నవజీవన బృందావన నిర్మాతలు’ అన్నారు శ్రీశ్రీ . ఈనాడు మన ముందున్న యువతలో అధిక శాతానికి మొదటి వాక్యం చక్కగా సరిపోతుంది. అన్వయించుకుంటే జవసత్వాలుడిగిన వృద్దులే కాదు అన్ని రకాల అవకరాలున్నట్లు తోస్తుంది. వ్యవస్థ భ్రష్టు పడిపోయింది, ఇప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు అనే నిరాశావాదంతో మనము ఏమీ చేయలేమనే నిరుత్సాహం, నిస్ప్రహతో కొట్టుమిట్టాడుతోంది యువత. ఆధునిక విజ్ఞానం అందించిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని తెలిసో తెలియకో తమ వినాశనానికి సమాజ అధోగతికి ఉపయోగిస్తున్నారు.

అసలు వ్యవస్థ అంటే ..? ఎవరూ .. మనమే .. వ్యక్తులమే. అంటే మనం మారితే, వ్యక్తులు మారితేనే కదా వ్యవస్థ మారుతుంది. చీకటిలో కూర్చొని చీకటి .. చీకటి అని తిట్టుకున్నా , అరచినా, ఏడిచినా నా తల రాత, నా దురదృష్టం అని నెత్తి నోరు బాదుకున్నా ఆ చీకటి పోతుందా? పోదు. ఎవరో ఒకరు దీపం వెలిగించాలి. వెలుతురు పూలు పూయించాలి. ఇదీ అంతే కదా !

యువత అంటే ఎవరు?

15 నుండి 24 ఏళ్ల మధ్యవారిని యువతగా పేర్కొంది ఐక్య రాజ్య సమితి. యువత వయస్సుని ఒక్కో ప్రాంతం ఒక్కోలాగా పేర్కొంది. మన దేశంలో15 – 35 ఏళ్ల లోపు వారిని మన రాజ్యాంగం యువతగా చెపుతోంది. భారత జనాభాలో దాదాపు 60 శాతం ఆ వయస్సులో వారే. 2020 నాటికి 64% యువత కానుంది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు యువతే. మన దేశం ప్రపంచంలోనే యువత అధికంగా ఉన్న దేశంగా మారుతుంది .

యువత – ఆరోగ్యం

నేటి యువత ఆరోగ్యం కోసం జిమ్ లకి, యోగా సెంటర్ లకి, పరుగులు పెడుతున్నారు కానీ తాము తీసుకునే ఆహారంపై శ్రద్ధ చూపడం లేదు. పిజ్జాలూ, బర్గర్లు , ఐస్ క్రీంలు, చిప్స్ వంటి వాటితో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలలో కడుపు నింపుకునే యువత ఎక్కువై పోయింది. అవసరానికి మించిన కొవ్వు పదార్దాలు, పిండి పదార్ధాలు తీసు కోవడం, వ్యాయామం, నడక లేక పోవడం తో అనేక సమస్యలకు గురవుతున్నారు. చదువుల్లో, ఉద్యోగంలో వత్తిడి తట్టుకునే మార్గాలు లేక తీవ్ర మానసిక శారీరక రుగ్మతలకు లోనవుతున్నారు. డయాబెటిస్, రక్త పోటు, ఊబకాయం, దానితో వచ్చే గుండె సంబంధ వ్యాధులు, కాన్సర్ వంటి రుగ్మతలకి చిన్న తనంలోనే గురవుతున్నారు.

దేశ జనాభాలో 21 శాతంగా ఉన్న యువతలో (10- 19 వయసు) ఆత్మహత్యా ధోరణి పెరిగిపోయింది. ఏడాదికి 5 నుంచి 10 శాతం పెరుగుతోందని బెంగుళూరు లోని నిమ్ హాన్స్ సంస్థ నివేదిక తెలిపింది. 25. కోట్ల మందికి ‘జాతీయ యుక్త వయస్కుల ఆరోగ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యవత శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

యువత – విద్య

“క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకూ తక్షశిల, నలంద, విక్రమశిల తదితర విశ్వవిద్యాలయాలకు విదేశాలనుండి చదువుకునేందుకు వచ్చేవారు. ప్రస్తుతం మన విద్యార్థులు విదేశాలకు చదువు కోసం వెళుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో సమిక్షించుకోవాలి. విద్యా రంగంలో సౌకర్యాలు లేని రోజుల్లో సివి రామన్, హరగోవింద్ ఖురానా వంటి శాస్త్రవేత్తలు ఇక్కడే చదువుకుని నోబెల్ సాధించారని గుర్తుంచుకోవాలి . ప్రస్తుతం సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నందున పరిశోధన, అభివృద్ధి రంగాల్లో నాణ్యత పెంపొందించి కొత్త ఆవిష్కరణలకు ఉన్నత విద్యాసంస్థలు నాంది పలకాలని ‘ ఆకాంక్షించారు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ .

ఒకప్పుడు సామాజిక స్పృహతో, సామాజిక చైతన్యంతో నడచిన విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు పట్టభద్రులను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మారాయి కానీ, విజ్ఞాన భాండాగారాలుగా లేవు. పట్టభద్రులైన యువత, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, వైద్య విజ్ఞానాన్ని అందుకున్న యువత కూడా దేశ శ్రేయస్సుకోసం, జ్ఞానాన్వేషణ కోసం కాకుండా కాసుల వేటలో విదేశాలకి ప్రయాణమవుతున్నారు. అందుకు కారణం తల్లిదండ్రులు, గురువులు, ప్రభుత్వాలు, సమాజం. యువతకు స్ఫూర్తి నివ్వాల్సిన తల్లిదండ్రులు మార్కులు, ర్యాంకులే ధ్యేయంగా తమ పిల్లల్ని తోముతున్నారు. గురువులు తమ విద్యార్థిలో నిగూఢమై, నిద్రాణమై ఉన్న జ్ఞానాన్ని, సృజనాత్మక శక్తుల్ని వెలికి తీసి ముందుకు నడిపించాలి కాని వారిని తీవ్ర వత్తిడికి గురి చేస్తున్నారు. నేటి యువతలో అధిక భాగం విద్యని జ్ఞానాన్ని అందించే వనరుగా కాకుండా ఉపాధి మార్గంగానే చూస్తున్నారు.

ఉన్నత విద్యకి వెళ్ళేవారు ఇతర దేశాలతో పోల్చినప్పుడు మనవాళ్ళు చాలా తక్కువే. అమెరికా యువతలో 92శాతం, ఇంగ్లాండ్ లో 52 శాతం, జపాన్ లో 45 శాతం అయితే మన దేశంలో ఉన్నత విద్యకు వెళ్ళేవారు 7 శాతం మాత్రమే.

దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది కంటే కాస్త మెరుగు. దేశ యువతలో పదవతరగతి వరకూ చదివే వారు సగం కూడా లేరు. ఆ పై చదివే వారికి ప్రమాణాలతో కూడిన విద్య అందడం లేదు. ఏ దేశమైనా ముందుకు సాగాలంటే, అభివృద్ధి చెందాలంటే వనరులతో, ప్రమాణాలతో కూడిన విద్య కొంతమందికే పరిమితం కాకూడదు. అందరికీ అందాలి. యువత వాటిని అంది పుచ్చుకుని దేశ అభివృద్ధిలో భాగస్తులు కావాలి.

యువత – ఉద్యోగ అవకాశాలు

అనతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 15-34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువత ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువ. కానీ మన దేశంలో యువతకి తగిన ఉపాధి అవకాశాలు ఉండడం లేదు. 2009లో నిర్వహించిన ‘గ్లోబల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్ ‘ సర్వే నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 8.10 కోట్ల యువత ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్నారు. అందులో 36 శాతం మంది ఒక్క మన దేశంలోనే ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ అర్ధం అవుతుంది. మన దేశంలో 49% యువత మాత్రమే ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వారిలో 93 శాతం అసంఘటిత రంగంలోనే ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఉన్నత విద్యావంతుల సంఖ్య పెరుగుతున్నా వారు తమ చదువుకు తగ్గవి కాకుండా ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిన పరిస్తితి. వ్యవసాయంలో యాంత్రికికరణ వల్ల ఆ రంగంపై ఆధారపడ్డ అధిక శాతం యువత పని లేక వట్టి పోతోంది. ఇక విద్యావంతులైన యువత కెరీర్ కోసం ఉరుకులు పరుగులతో తన చుట్టూ ఉన్న సమాజాన్ని పట్టించుకోవడం లేదు.

యువత – సృజనాత్మకత

సృజనాత్మకత అంటే ఆధునికంగా కనిపించడం, అలంకరించుకోవడం , ఆడంబరాలు ప్రదర్శించడం అనుకుంటారు కొందరు. సృజనాత్మకత అంటే విశాల దృక్పథంతో, వికసించిన వ్యక్తిత్వాలతో సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే జీవనం కోసం కొత్తగా ఆలోచించడం. ప్రపంచాన్ని ముందుకు నడపడం కోసం అన్వేషణలు చేయడం, మేధో మధనం చేయడం, శాస్త్ర సాంకేతిక అభివృద్ది కోసం కృషి చేయడం. పరిశోధనా ఫలాలు సమాజానికి అందించడం.

యువత – రాజకీయాలు

ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక పోవడం. రాజకీయ పార్టీలపై విశ్వాసం లేకపోవడం, రాజకీయ వ్యవస్థకి దూరంగా ఉండడం మాకు సంబంధించిన విషయం కాదని భావించడం. ఓటింగ్ లో పాల్గొనక పోవడం . ఎన్నికలకు దూరంగా ఉండడం చేస్తోంది నేటి యువత.

స్వాతంత్రోద్యమంలో ఉత్తుంగ తరంగాలై యువత పాల్గొంది. ఆంగ్లేయుల గుండెల్లో నిదురించిన అల్లూరి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన భగత్ సింగ్ వంటి ఎందరో యువత పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడారు. ప్రాణాలు కోల్పోయారు. నేటి యువతలో ఆనాటి స్ఫూర్తి కొరవడింది. రాజకీయాలంటేనే అంటరానివిగా చూస్తున్న వారి ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్పు వస్తోంది.

1952లో ఆనాటి పార్లమెంటులో అక్షరాస్యతా శాతం చాలా తక్కువ (12% శాతమే.అందులోను గ్రాడ్యుయేట్స్ నాలుగు ఐదు శాతమే ) ఉన్నా చక్కని చర్చ జరిగి చట్టాలు వచ్చేవి. కాని ఇప్పుడు పార్లమెంటు సభ్యుల్లో 64 శాతం గ్రాడ్యుయెట్ లు ఉన్నా ఏమి చర్చలు చేస్తున్నారో మనకు తెలిసిందే. అయితే, యువత తలచుకుంటే చరిత్ర తిరిగి రాయగలదని అనేక దేశాల చరిత్రలు చూస్తే తెలుస్తుంది. నియంతల కుర్చీలను కుదిపి కూల్చేసింది. నేతల రాతలు తారుమారు చేసింది యువతే. ఒక్కొక్కరూ అగ్ని శిఖల్లా ఉద్యమ పతాకలు చేతపట్టి ముందుకు సాగింది యువతే. క్యూబాకి విముక్తిని ప్రసాదించిందీ యువతే. ఈజిప్ట్ తెహ్రిర్ స్క్వేర్లో విప్లవాగ్ని రగిలించింది యువతే.

నేటి యువత (47 శాతం) సోషల్ మీడియాని బాగా వాడుతోందని గమనించిన రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారా యువతని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాని ప్రచార మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు. నిన్నటికి నిన్న దేశ రాజధానిలో కొత్త చరిత్ర లిఖించింది యువతే అన్న విషయం మనం మరచిపోకూడదు. ఇది ఈనాటి రాజకీయాల్లో కొత్త అధ్యాయం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచినవారంతా యువతే కావడం మనం గమనించాలి. అవినీతికి వ్యతిరేకంగా సాగిన ప్రచారం చూస్తే, వారి విజయాన్ని చూస్తే యువతపై మరిన్ని ఆశలు పెరుగుతున్నాయి. అలాంటి యువత వట్టి పోకూడదు. ఓటనే బ్రహ్మాస్త్రంతో నవ చరిత్ర సృష్టించాలి.

యువత – కాలక్షేపం

నేటి యువతకి లైఫ్ అంటే సెలబ్రేషన్. క్లబ్ లు, పబ్ లు, సినిమాలు, షికార్లు, టీవి, ఇంటర్నెట్, సెల్ఫోన్ లతో కాలక్షేపం. మారుమూల పల్లెలకి ఈ వాతావరణం వచ్చేసింది. తినడానికి తిండి లేక పోయినా ఇంట్లో టీవి, చేతిలో సెల్ఫోను ఉండడం సాధారణం అయిపొయింది. ప్రజల్లోకి, వారి జీవనంలోకి అంతగా చొచ్చుకుపొయిన సాధనాలు ఎలా ఉపయోగపడుతున్నాయో చూద్దాం. కొన్ని మీడియా సంస్థలు సమాజ క్షేమాన్ని విస్మరిస్తున్నాయి. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ యువతను పెడదోవ పట్టించే అశ్లీల కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ప్రేరేపిస్తున్నాయి. మంచి చెడుల విచక్షణ మరచి యువతను లక్ష్యంగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నాయి. యువతను ఆదర్శంగా మలచాల్సిన మీడియా అందుకు భిన్నంగా వారు పెడదోవ పట్టేందుకు వీలుగా క్రైమ్ స్టోరీలు మళ్ళీ మళ్ళీ వేస్తూ ఆవిధంగా ప్రేరేపిస్తున్నారు.

నేటి యువత అశ్లీల దృశ్యాలు, బూతు బొమ్మలు చూడడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఏ కాస్త టైం దొరికినా శృంగారానికి సంబంధించిన కబుర్లతో కాలక్షేపం చేస్తూ, తాము ఇంటర్నెట్ లోనో, మొబైల్ ఫోన్ లోనో చూసిన నీలి చిత్రాలలోని యువతుల్లా ఉండాలని తమ వారిని వత్తిడి చేస్తున్నారు. శృంగార సంబంధ ఎస్ ఎమ్మెస్ లు పంపుకోవడము మాములైపోయింది. ఈ క్రమంలోనే అందుబాటులోకి వచ్చిన ఆడపిల్లలపై వావివరుసలు లేకుండా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.

సినిమా స్టార్లు, క్రీడాకారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం పంచుకొంటూ తమ సమయాన్ని వృధా చేసుకోవడం కనిపిస్తుంది. లేదా ఏ పాను కోకాల దగ్గరో, మద్యం దుకాణాలలోనో, మాదకద్రవ్యాలతోనో, ఇంటర్నెట్ కేఫ్ లలోనో, గేమింగ్ సెంటర్ లలోనో తమ విలువైన సమయాన్ని గడిపేస్తున్నారు.

రేపటితరం దూతలైన కొంతమంది యువకులు మాత్రం అందుకు భిన్నంగా సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారు, సామాజిక ప్రయోజనంతో కూడిన కార్యక్రమాలు చేపడుతున్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. తమ తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

యువత – సమాజం

డిల్లీలో నిర్భయ సంఘటన జరిగిన తర్వాత యువతలో వచ్చిన కదలిక కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. యువత జవసత్వాలుడిగి పోయింది అని భావిస్తున్న తరుణంలో అన్నాహజారే చేపట్టిన దీక్షకు యువతలో కొంత కదలిక వస్తే నిర్భయ సంఘటన యువతలో పెల్లుబికిన చైతన్యం యువతను ముందుకు నడిపింది. యువతకు దిశానిర్దేశం చేసి ముందుండి నడిపించే చోదకులు కావాలి. యువతని సమాజాభివృద్దిలో భాగస్వామ్యం చేసే దిశగా మార్గదర్శనం చేయాలి. ప్రపంచంలో ఏ దేశంలో లేని యువ సంపద మన దేశానికే స్వంతం. అది యువత దృష్టిలో పెట్టుకుని దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలి.

ఎంత ఎత్తుకు ఎదిగినా చివరకు మిగిలేది మనం చేసిన మంచి పనులేనని వారికి తెలియచేయాలి. యువత తమ ప్రతిభకు పదును పెట్టి సమాజ దృష్టితో ఆలోచించాలి. ఆధునికతలో, అభివృద్ధిలో దేశం ముందుకెళ్ళడానికి యవత ఒక ఉద్యమంలా ఆకలిపై, పేదరికం పై, అవినీతిపై, అనారోగ్యం పై పోరాడాలి. మూఢత్వం, తీవ్ర వాదం, ఉగ్రవాదం, మతోన్మాదంలకు దూరంగా ఉండాలి. తను ప్రేరణ పొందుతూ, ఇతరులకు ప్రేరణ కలిగిస్తూ నైతికతతో ముందుకు సాగాలి. సమాజంలో ఉండే సవాళ్లు ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి. సమాజ గతిలో, ప్రగతిలో, పురోగతిలో క్రియాశీలక పాత్ర పోషించాలి.

యువత ముందున్న సవాళ్లు

వ్యక్తి గతంగా, సామాజికంగా వచ్చే సవాళ్లు ఏమిటో చూద్దాం.

వ్యక్తిగతంగా :
తనగురించి తాను పట్టించుకోక పోవడం, తనమీద తనకు నమ్మకం లేమపోవడం. ఆత్మవిశ్వాసం లోపించడం.
చేసే పనిపై ద్రుష్టి లేకపోవడం, మనస్సు నిలుప లేక పోవడం, బానిసమనస్తత్వంతో ఉండడం , అనుభవాల ద్వారా జ్ఞానం సంపాదించడం కాకుండా బట్టి పట్టడం.
గొర్రెల మందలో ఒకడిగా ఉండిపోవడం, ఇతరులతో పోల్చుకోవడం.
అనుకున్నది సాధించలేక పోయాను, జీవితం వృధా అయిందని బాధపడడం.
నిరాశా నిస్పృహలకు తరచు లోనవడం , జీవితాన్ని చాలించాలనుకోవడం.
ఓటమిని స్వీకరించ లేకపోవడం, చిన్న చిన్నకస్టాలకు, వైఫల్యాలకు కుంగి పోవడం . చిన్న వైఫల్యాన్ని పెద్దగా ఉహించుకుని వర్తమానాన్ని పాడుచేసుకోవడం, ఎవరు ఏమనుకుంటారోనని భయపడడం . సమస్యలను సవాలుగా తీసుకొని ఎదిగేవారి ముందు ఎవరెస్టు శిఖరం కుడా చిన్నబోతుందని తెలియక పోవడం.
ఉన్నత ఆదర్శాల పట్ల నమ్మకం లేకపోవడం , అందరూ తమని గొప్పగా అనుకోవాలని, చూడాలని అకాంక్షిస్తారు కానీ మంచి పనులు చేయడానికి తగ్గ కృషి చేయకపోవడం.
పనిపట్ల గౌరవం లేకపోవడం . నిగ్రహం లేకపోవడం . జ్ఞానతృష్ణ కోరవడడం.
తమకు ఎదురయ్యే వివిధ అనుభావాలకు ఎలా స్పందిన్చాలో తెలియక పోవడం. తమకు ఎదురయ్యే పరిస్థితులకు ఎలా స్పందిన్చాలో తెలియకపోవడం. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండాలనుకోవడం.
పబ్బులు క్లబ్బులలో విందులు వినోదాలకి ప్రాధాన్యత నివ్వడం. పని చేత కాదు . చేయరు. సోమరితనం , కానీ అన్ని సుఖాలు కావాలి కష్ట పడకపోవడం . ఎవరైనా ఏదైనా చెబితే వినే సహనం ఉండకపోవడం.
మద్యం మత్తులో జోగుతూ ప్రశ్నించే తత్వం కోల్పోవడం , మృగాల్లాగా ప్రవర్తించడం , కక్షలు కార్పణ్యాలు పెంచుకోవడం. కొంత మంది స్వార్ధపరులు యువతని మత్తులో ముంచెత్తేలా ప్రోత్సహిస్తూ వారిలో పోరాట శక్తిని ప్రశ్నించే తత్వాన్ని జోకోడుతూ , బలహినతల్ని రెచ్చగోడుతూ , చైతన్యాన్ని నిద్రపుచ్చుతూ ఉండడాన్ని గ్రహించలేక పోవడం.
సామాజికంగా చూస్తే :
అవినీతి
నిరక్షరాస్యత
పేదరికం
తీవ్రవాదం
ఉగ్రవాదం
తరగిపోతున్నమానవ విలువలు
పెరిగిపోయిన స్వార్ధం
యువత ముందడుగు వేయాలంటే :
ప్రవర్తనా తీరు మారాలి.
నైతిక క్రమశిక్షణ ఏర్పరచుకోవాలి, ఏకాగ్రతతో ఉండడం, తన మనసుని తన అధీనంలో, నియంత్రణలో ఉంచుకోవడం చేయాలి.
కుంటి సాకులు చెప్పకుండా చేసే పనిపై ద్రుష్టి పెట్టడం, శ్రద్ధ పెట్టడం, లక్ష్యం ఏర్పరచుకోవడం, ప్రణాళికలు ఏర్పరచుకోవడం పని పూర్తి అయ్యేవరకు పట్టుదలతో దీక్షతో పని చెయ్యడం
ప్రశాంతంగా మనసుని నిలకడ ఉంచడం, మనస్సుని, బుద్దిని సమన్వయము చేసుకోవడం, ప్రతి విషయం మెలకువతో వ్యవహరించడం
సంకుచిత పరిధులలో తమకు తమకు బందీగా ఉండకుండా ఉండడం
మానసికంగా పరాదినులుగా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించగలగడం
విషమ పరిస్థితులను ఎదురొడ్డి నిలిచే ఆత్మస్తైర్యం, ఆత్మబలంతో ముందుకు సాగడం
మానసిక బలాన్ని, బుద్ది బలాన్ని పెంపొందించే, స్పూర్తినిచ్చే పుస్తకాలు చదవడం, ఆ దిశలో కృషి చేయడం
మన తప్పులకు , మన లోపాలకు మనమే బాధ్యత వహించడం, ఆ ధైర్యం , నైతికత ప్రదర్హించడం
మార్పు కోసం ప్రయత్నించే ధైర్యం చేయడం
మంచి భావనలు, ఆశావాహ దృక్పథం, ఏదైనా సాధించగలనన్న పట్టుదల
ఉన్నతమైన ఆలోచనలు చేయడం, ఉన్నతమైన, గోప్ప విషయాలు చెప్పేవారితో స్నేహం చేయడం
స్తబ్దంగా కాకుండా ప్రవహించే నదిలా చైతన్యంతో సాగడం
నిశిత పరిశీలనా శక్తి , స్పష్టంగా అర్ధం చేసుకునే జ్ఞానం , తరచి చూసుకోవాల్సిన సామర్ధ్యం పెరగాలి. పోరాట పటిమ పెరగాలి.
దోపిడీ దొంగలని ప్రతిఘటించి పరుగెత్తే రైలు నుండి కిందకి తోసివేయబడ్డ అరుణిమ ఒక కాలు కోల్పోయింది. అయినా ఆమెలొ ఆత్మవిశ్వాసం చెదరలేదు. తనకు తాను ఒదార్చుకుని ఎవరూ ఉహించనిది గొప్పది సాధించాలనుకుంది. దాని ఫలితమే ఎవరెస్టు అధిరోహించాలని సంకల్పించింది. మే 21, 2013 న ఒంటి కాలితో ఎవరెస్ట్ అధిరోహించి తన లక్ష్యం నేరవేర్చుకుంది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతాలు చేసే యువత కూడా మనముందు ఉంది. అలంటి వారు మిగతా వారికి, యువతకు స్పూర్తి కావాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూస్తూ, దేబిరిస్తూ కూర్చోవడం కాదు. నిప్పులు లేకుండా పొగలు చిమ్మే కర్రల్లాగా కాకుండా అగ్నికణాల్నివిరజిమ్మే దివ్వెలుగా, రణరంగంలో క్రమశిక్షణతో పనిచేసే సైనికుల్లా ప్రచండశక్తితో యువత ముందుకు సాగాలి. నెత్తురు మండే, శక్తులు నిండే యువత తమ ఆకాంక్షలు నేరవేర్చుకోవడమే కాదు దేశానికి కళ్ళు, కాళ్ళూ అయి నడిపించాల్సిన, దేశ భవిష్యత్తు ఉన్నతంగా లిఖించాల్సిన బాధ్యత యువతరం పైనే ఉంది.