The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘స్త్రీల కథ’

స్త్రీల సాహిత్యం – కథ: 1850 నుండి 1960 వరకు

                                                            
Delhi visit photos 185కథ అంటే చెవి కోసుకోని వారెవరుంటారు చెప్పండి!  అమ్మో, అమ్మమ్మో, నాన్నమ్మో కథలు చెప్తుంటే, వింటూ ఊ కొడుతూ నిద్దురపోవడం చిన్నప్పటి నుండీ మనకు తెలిసిందే. అసలు అప్పుడే స్త్రీల కథలు ప్రారంభం అయ్యాయని  అనొచ్చు.   మనమే కాదు, కథ చెప్పుకోవడం అనాదిగా ఉన్నదే. నలుగురూ ఒక దగ్గర చేరి  కాలక్షేపం కబుర్లు-కథలుగా  చెప్పుకోవడం, నీతిని, సమాజ పోకడని అంతర్వాహినిగా నింపి  కథలు చెప్పుకోవడం తెలిసిందే.  మౌఖికంగా చెప్పుకునే కథలు ముద్రణా సదుపాయాలు వచ్చాక అచ్చులో రావడం ప్రారంభం అయింది. 
 
ఆధునిక సాహిత్యంలో కథ ఒక ప్రత్యేక రూపాన్ని, సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది.  వైవిధ్యం గల  వేలాది కథలు వెలువడ్డాయి. వివిధ పత్రికల్లో వచ్చినవే  కాకుండా కథా సంకలనాలూ  వచ్చాయి.  ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట కథల పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి.

కథా రచన అనేది అగ్గిపుల్లలతో మేడ కట్టడం లాంటిదట. ఒక దశ వచ్చేసరికి ఒక్క పుల్ల ఎక్కువయినా మొత్తం కూలిపోతుందట. ఇంత శ్రద్దగా బాలన్స్ గమనించాల్సిన ఆవశ్యకత ఒక కథారచన లో తప్పించి మరెక్కడా కనపడదట. అందు చేతనే సృజనాత్మక వచన సాహిత్య ప్రక్రియలన్నింటి లోకి కథారచన క్లిష్టమైనదని ప్రఖ్యాత కథా రచయిత “హెచ్.ఈ. బేట్స్ అభిప్రాయం.

మనమిప్పుడు ఆధునిక కథాసాహిత్యంలో స్త్రీలు -కథ 1850- 1960 వరకూ ఎలా సాగిందో చూద్దాం.


1939  ‘భారతి’ మాసపత్రికలో తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రిగారు ‘కథాపరిణామం’ గురించి రాసిన వ్యాసంలో (1 తెలుగు కథకులు కథన రీతులు) అప్పటి కథా సాహిత్యంలో గణనీయ రచయిత్రులు కనుపర్తి వరలక్ష్మమ్మ, క్రమదటి జానకీదేవి , పులవర్తి కమలాదేవి ల గురించి పేర్కొన్నారు. కానీ , 1952 లో తెలుగు కథకుల గురించి వెలువడ్డ  ‘అక్షరాభిషేకం’లోను , 1982లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ప్రచురించిన ‘తెలుగు కథారచయితలు’ పరిశీలనాత్మక వ్యాస సంకలనం లోనూ , 1998లో  ముద్రణ అయిన  ‘తెలుగు కథకులు- కథన రీతులు ‘పుస్తకంలోనూ ఒక్క మహిళా కథకురాలి కథనరీతులపైన విశ్లేషణ కనిపించదు.  అదే విధంగా  20వ శతాబ్ది ప్రతినిధి కథల సంకలనం ‘వందేళ్ళ తెలుగు కథ’లో 1960 కి ముందు కథలని చూసినా నిరాశే.   వాటికి ఉన్న పరిధి, నిర్దిష్ట సాహిత్య ప్రయోజనం ఏమయినప్పటికీ ఆనాడు మహిళా కథకులు లేరా…  అన్న ప్రశ్న ఉదయించక మానదు .  తొలితరం కథా జగత్తులో రచయిత్రులకు సరైన స్థానం దక్కలేదన్నది సుస్పష్టమవుతోంది. రచయిత్రుల సాహితీ సేవకు తగిన ప్రాచుర్యం, గుర్తింపు లేకపోయినా వారు చేసిన కృషిలో మాత్రం లోటు లేదనే చెప్పొచ్చు. 
 
మనం స్త్రీల కథా సాహిత్యాన్ని తవ్వుకుంటూ పోతే వజ్రాల్లాంటి రచనలెన్నో కనిపిస్తాయి. మరుగున  పడి ఉన్న మాణిక్యాల్లాంటి  మహిళారచయిత్రులెందరో సాహితీ చరిత్రలో అగుపిస్తారు. మానవ జీవిత సంవేదనలు కళ్ళముందు సాక్షాత్కరింప చేశారు.  వారు సమాజంలో  జరిగే వాస్తవ సంఘటనలని  వస్తువులుగా తీసుకొని పదునైన కథలెన్నోరాశారు.  విభిన్న కుల, మత, ఆచారాల , సంస్కృతుల , ప్రాంతాల , జాతుల సమ్మేళనం తెలుగు నేల.  ఆయా  ప్రాంతాలలోని  చైతన్య శీలతతో  వచ్చిన కథలు ఆనాటి స్థితి గతుల్ని తెల్పుతూ, ప్రశ్నిస్తూ మనని అబ్బురపరుస్తాయి.  స్త్రీ పురుష అసమానతలు , కుటుంబ సంబంధాలు, వైవాహిక సంబంధాల్లో ఉన్న డొల్లతనం,  వివక్ష,సతి దురాచారం , బాల్య వివాహాలు , విధవ వివాహాల నిషేధం , స్త్రీలకు విద్య నిరాకరణ వంటివెన్నో సమస్యలు ఆనాడు ఉండేవి. భార్యాభర్తలమధ్య యజమాని, బానిసల సంబంధాలే కానీ స్నేహ పూర్వక వాతావరణం తక్కువ.  విదేశీ పాలనలో  చదువుకున్న మగవాళ్ళు ఆంగ్లేయుల్ని అనుకరించాలనుకునేవారు. చిన్నతనంతో, చదువులేమితనంతో , అనాకరికంగాను , ముర్ఖంగాను ప్రవర్తించే భార్యలతో తంటాలు పడే పురుషులు తమ వైవాహిక జీవితంలోనూ, స్త్రీపురుష సంబంధాలలోనూ కొన్ని ఆదర్శాలు , ఆకాంక్షలు ఏర్పరచుకున్నారు. భార్యలు చదువుకుని సంస్కారంతో ఉండాలనీ , భర్తని , కుటుంబాన్ని అర్ధం చేసుకుని , భర్తకోసం ఇంటికి వచ్చి పోయే వారికి మర్యాదలు చేసి తమ గౌరవం కాపాడాలని  అనుకునేవారు ఆ భర్తలు. తాము కోరుకున్న విధంగా స్త్రీలని మలుచుకోవాలంటే వారికి విద్య అవసరం అని భావించారు.  భర్త , కుటుంబం కోసం సంస్కరణ బాట పట్టిన స్త్రీ ఆ పరిధిని దాటి ముందుకెళ్ళింది. ఆధునిక యుగంలో ప్రారంభమైన సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, తెలంగాణ విమోచన  ఉద్యమాల్లో భాగస్వామ్యం అందుకుంది. చక్కని అల్లికతో  బిగువైన కథనంతో చదువరులను ఆలోచింపచేసే కథలకు ప్రాణంపోసింది. తెలుగుసాహిత్య పరిణామంలో తానూ ముఖ్య భూమిక వహించింది.
 
అచ్చు యంత్రం వచ్చాక మొదలైన దిన , వార, పక్ష, మాస, త్రైమాస పత్రికలలో కథా కథనరంగంలో అడుగుపెట్టి సామాజిక ప్రయోజనం కోసం కథలల్లిన బండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ , కాంచనపల్లి కనకాంబ (రాధ , చక్కని కథలు సంపుటాలు )వంటి తొలితరం రచయిత్రులు,  భార్యాభర్తల మధ్య అవగాహన, సఖ్యత కల్పించడంలోనూ,  విద్య ప్రధాన విషయంగాను,  మధ్యతరగతి కుటుంబాల జీవిత లోతుల్ని అధ్యయనం చేసి వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తమ వస్తువుగా చేసుకొని కథా సృజన చేశారు. పురుష సంస్కర్తలు ఏ ఏ లక్షణాలు ఉండాలని కోరుకున్నారో ఆ లక్షణాలన్నిటిని తన కథల ద్వారా ప్రచారం చేసారు తొలి తరం రచయిత్రులు.

1902 నవంబరు ‘హిందూసుందరి’ పత్రికలో వచ్చిన భండారు అచ్చమాంబ రాసిన కథ ‘ధనత్రయోదశి’ తెలుగులో మొదటి కథ అంటున్నారు.   కానీ, అంతకు  ముందే ఆమె రాసిన కథలు   1898 జూలై “తెలుగు జనానా”  స్త్రీల పత్రికలో  ‘ప్రేమా పరీక్షణము’,  సెప్టెంబర్ లో ‘ఎఱఉవుల సొమ్ము బఱవుల చేటు’ వచ్చాయి.   1910 ఫిబ్రవరి లో గురజాడ రాసిన కథ ‘దిద్దుబాటు ‘ కంటే ముందే  భండారు అచ్చమాంబ  మూడు కథలు రాసిన విషయం గుర్తించి తెలుగు కథకు ఆద్యురాలుగా మనం చెప్పుకోవచ్చు.

తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు చదువుకుంటుంటే తనూ పక్కన చేరి చదువు నేర్చుకున్న అచ్చమాంబ  12 కథలు రాశారు.  వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభం కాక ముందే రాయడం వల్ల ఆవిడ కథలు గ్రాంధికంలోనే సాగాయి. కథల ఇతివృత్తం మాత్రం ఆధునికమయినదే. గురజాడ రాసిన ‘దిద్దుబాటు’కి ఏమాత్రం తీసిపోని కథ ‘స్త్రీవిద్య’.  కానీ ఆధునిక కథకుండవలసిన లక్షణాలు లేవని ఆమె కథలకు  విమర్శకులు తొలి కథకు రావలసిన గుర్తింపు ఇవ్వకపోవడం పితృస్వామిక ధోరణికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

అచ్చమాంబ ఎలాంటి ప్రోత్సాహం లేకుండా స్వయం కృషితో తెలుగు,మరాఠీ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీషు  భాషలు నేర్చుకోవడమే కాకుండా  చదువు విషయంలో తాను గురయిన వివక్షను గుర్తించింది. ఆడవారిని ఇళ్ళలో కట్టు బానిసలుగా తయారుచేసే మగవాళ్ళను విమర్శించింది. 1903 జూన్ నెల హిందూ సుందరిలో అచ్చయిన ఆమె కథ ‘దంపతుల ప్రధమ కలహం ‘ లో భార్య పాత్రతో ఆమె ఇలా  అనిపిస్తారు.  ‘నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాదు. వివాహమాడుట వలనను భర్తకు దాసినగుదునా ఏమి? గృహయజమనురాలిగా నెంచి, మన్నించి ప్రేమించవలయును గదా? అట్లు చేయక యిచ్చవచ్చిన పనులన్నియు నన్ను సేయమనిన నేను జేయుదునా ఏమి ” అని.
అదే విధంగా ‘ వివాహము కాగానే మేము గృహిణి పదమున కర్హురాండ్రమగుదుమే గాని కొన్న బానిసలము కాము. మా వంటి పత్నులు పురుషుల యహంభావమునెంత మాత్రమును సహింపజాలరు ‘  అంటూ భార్యాభర్తల సంబంధంలో నెలకొన్న అసమానతల్ని మగవారి అహంభావాన్ని గురించి స్పష్టంగా చెప్పించిన తీరు చూస్తే ఆనాటి పరిస్తితుల్లో ఆమె చైతన్య స్థాయి చూస్తే తొలితరం స్త్రీవాద రచయిత్రిగా కూడా మనం భందారు అచ్చమాంబను చెప్పుకోవచ్చు.

కనుపర్తి వరలక్ష్మమ్మ  కథలలో “కుటీర లక్ష్మి”.  పెన్షన్ పుచ్చుకున్ననాటి రాత్రి, 5 మాసాల 20 రోజులు మొదలైన  కథలు చెప్పుకోదగినవి. ఆనాటి సాంఘిక, కాల  పరిస్థితికి చిహ్నాలుగా ఆమె రచనలు కనిపిస్తాయి. వ్యవహారిక భాషలోనే రాశారు.  కొటికలపూడి సీతమ్మ, రాణీ చిన్నమ్మారావు, కందుకూరి రాజ్యలక్ష్మి,  బుర్రా సూరమాంబ, వేమూరి శారదాంబ, వెన్నెలగంటి హనుమాయమ్మ, సీరము సుభద్రయాంబ, అవధూత జ్ఞానమాంబ, కల్లూరి విశాలాక్షమ్మ, పులుగుర్త లక్ష్మీనరసమాంబ, జూలూరి తులసమ్మ, కాంచనపల్లి కనకాంబ, గుడిపూడి ఇందుమతి, చిల్కపాటి సీతాంబ,  ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, పొణకా కనకమ్మ, చేబ్రోలు సరస్వతీదేవి, ఆత్మూరి అన్నపూర్ణమ్మ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, చావలి బంగారమ్మ వంటి ఎందరో రచయిత్రులు తెలుగుసాహిత్య వైభవాన్ని చాటారు.  తొలి తరం రచయిత్రుల కలం కవాతుతో  తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగం ఆరంభమయిందని చెప్పవచ్చు.  ఉత్తుంగ తరంగంలా తెలుగు సాహిత్యాన్ని ముంచి తేల్చారు స్త్రీలు.  తమ రచనలపై వచ్చే కువిమర్శలు పట్టించుకోకుండా  తమ రచనా వ్యవసాయం చేస్తూనే పోయారు.

సంస్కరణోద్యమ నేపథ్యంలో వచ్చిన కథలు చూద్దాం
ఆనాటి సాంఘిక పరిస్థితుల్లో బాల్య వివాహాలు , కన్యాశుల్కం , బహుభార్యత్వం , వితంతు వివాహాల నిషేధం, వేశ్యలోలత్వం , అవిద్య వంటి ఎన్నోఇబ్బందులు, మూఢనమ్మకాలు సాధారణం.    అవే ఆ స్త్రీల కథా వస్తువులయ్యయి. ఆనాటి సంస్కరణ ఉద్యమాలు వారిని ఎంతో ప్రభావితం చేశాయి. నాలుగు గోడల మధ్య నుండి బయటికొచ్చి ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడడం ,  చదవడం వల్ల వారి ఆలోచనా దృక్పథంలో మార్పు తెచ్చింది. భావాలు పరిపక్వం అవుతూ పదును తేలడం మొదలెట్టాయి.   ఆ ప్రభావంతోనే రచయిత్రులు స్త్రీ విద్య వైపు మొగ్గు చూపడం , పురుషాధిపత్యాన్ని నిరసించడం , మూఢనమ్మకాలని వదిలేయడం అభ్యదయ పంధాలో నడవడం ఆ విధానంలోనే రచనలు చేయడం కనిపిస్తుంది.  ఉదాహరణకి
భండారు అచ్చమాంబ వ్రాసిన కథలు  స్త్రీ విద్య (భార్యా భర్తల సంవాదము),  ధనత్రయోదశి చూద్దాం. అవి 1902లో వచ్చాయి.  సంస్కరణోద్యమానికి ప్రతినిధి రచనలివి.  అనేక మూఢాచారాలతో, అంధ విశ్వాసాలతో సతమతమవుతున్న సమాజానికి తొలిచికిత్సగా వచ్చిన సంస్కరణోద్యమం స్త్రీ సమస్యపైననే ఎక్కువగా కేంద్రీకృతమైంది.  స్త్రీ జీవిత కష్టాలను, దౌర్భాగ్యాలను వ్రాస్తూ స్త్రీలలో వున్న సహజ జీవశక్తులను గౌరవంతో ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తూ స్త్రీలలో చైతన్యం నింపటానికి ప్రయత్నించాయి ఈ ఉద్యమాలు.  ఈ నేపథ్యంలో చూస్తే,    స్త్రీ విద్య ఆవశ్యకత గురించి ప్రస్తావిస్తూ, స్త్రీల ఉద్యమాన్ని నిర్మించడానికి, ప్రోత్సహించడానికే తన రచనలను ఉపయోగించింది అచ్చమాంబ.   స్త్రీ విద్య, స్త్రీల అభివృద్ధి కోసం ఎంతో శ్రద్ధాసక్తితో  రచనలు చేసింది. కట్టుబాట్లు నియమాల యుగంలో పుట్టిన అచ్చమాంబ ఆనాటి యుగధర్మాన్ని పాటిస్తూనే అభ్యుదయ మార్గంలో ఆలోచించింది.

సంస్కరణోద్యమం, జాతీయోద్యమంగా సమగ్రరూపాన్ని తీసుకొంటున్న ఈ సంధికాలంలో భాస్కరమ్మ వ్రాసిన కథ ‘ప్రభావతి’ (1926). ‘ప్రభావతి’ విషయం రీత్యా సంస్కరణోద్యమ కథ.  పదేళ్ళకు పెళ్ళయి ఏడాది తిరగకుండానే భర్తను కోల్పోయిన  ప్రభావతి అనే అమ్మాయి,  వైధవ్యం పేరుతో  దుర్భరమైనప్పుడు   ”ఇతరులచే నింత మాటయైన పడుటకు సహింపదు. అట్టి బాలిక ఇప్పుడకారణముగా నిట్టి నిందావాక్యముల సహింపగలదా? ఇందు ‘తానొనర్చిన తప్పేమిగలదు?’ అంటూ  ఆచారం పేరుతొ విధవని చేయడాన్ని ఏ తప్పు చేయకుండానే విధించే శిక్షగా గుర్తించి నిరసించింది భాస్కరమ్మ.   స్త్రీ ఎప్పుడు వితంతువైనా రజస్వల కానిదే జుట్టు, పసుపు కుంకుమలు తీయరు.   పదేళ్ళకే వితంతువైన  ప్రభావతి రజస్వల అయ్యేనాటికి  పత్రికలు పుస్తకాలు చదువుకుంటూ స్త్రీ స్వాతంత్య్రం కోసం  తన జీవితాన్ని అంకితం చేయాలన్న చైతన్యాన్ని పొందింది.
భార్య పోయిన పురుషునికి ఏ శిక్ష లేకుండా పన్నెండు రోజులకే తిరిగి పెళ్లి పిటలెక్కిస్తారు.  భర్త పోయిన స్త్రీకి పదవనాటి అవస్థ తలచుకుంటే ఎంతటి కఠిన హృదయానికైనా గుండె కరిగి నీరవుతుంది. పురుషులకక్కరలేని మార్పు స్త్రీలకెందుకు? అని స్త్రీ పట్ల ఉన్న దమననీతిని నిరసిస్తూ అవయవ నిర్మాణములో స్త్రీపురుషులకు భేదముండవచ్చు. మానసిక విషయాలలో ఇరువురు సమానులే అని అసమానతను, లింగ వివక్షతను ప్రశ్నిస్తుంది రచయిత్రి.
ఈ కథలో దురాచారాలకు నిలయమైన  సంఘాన్ని ఉద్దేశించి ”ఓ సంఘమా? అసమాన ప్రజాధురీణులై యుండి పరోపకార పారీణలు, దేశసేవా పరాయణులు కావలయునని యెక్కుడాసతో నున్న మానవతుల నెందరినింతవరకు నీపొట్ట బెట్టుకుంటివో” అని ప్రభావతిఅన్న చివరిమాటలు దేశ స్వాతంత్య్రోద్యమానికి ఉపయోగపడకుండా వృధా అవుతున్న స్త్రీశక్తిని గురించి ఆలోచించమని హెచ్చరిస్తాయి.

యల్లాప్రగడ సీతాకుమారి ” పునిస్త్రీ పునర్వివాహం” ఆంధ్రప్రతిక, 1937 లో వచ్చింది.  ఈ కథలో నాయిక మధు వరకట్న సమస్యను అధిగమించి స్వేచ్ఛాజీవితాన్ని గడిపిన దృశ్యం కన్పిస్తుంది. కట్నం ఇవ్వలేదన్న నెపంతో అత్తింటివాళ్ళు మధును పుట్టింట్లోనే వదిలేస్తే, అధైర్యపడకుండా ఎన్నో ఆటుపోటులను ఎదిరించి తన లక్ష్యం వైపు నడిచి మరో ఆదర్శ వివాహం చేసుకొంది. ఈ కథలో కన్పించే మధులాంటి ధైర్యవంతులు ఆనాటి సమాజానికి ఎంతో అవసరమని రచయిత్రి తెలియజేశారు. ‘ఈ రాధేనా?” కథ భారతి  జూలై 1938లోనూ,  ‘ఆ వీణ” ఆంధ్రకేసరిలో 1940 వచాయి.  ఈ కథలు కూడా స్త్రీ అభ్యుదయాన్ని కాంక్షించేవే. సీతాకుమారి కథలన్నీ పూర్తిగా ప్రామాణిక భాషలో సాగాయి.  ఆమె కథల్లో  తెలంగాణ మాండలికపదాలు కనిపిస్తాయి.  ఆమె రాసిన ఇంకొన్ని కథలు గృహలక్ష్మి, భారతి, గోలకొండ పత్రికల్లో అచ్చయ్యాయి. కాని ఆమె కథలు సంపుటిగా రాలేదు. 

Delhi visit photos 230
జాతీయోద్యమ నేపథ్యంలో వచ్చిన కథలు
స్వాతంత్య్రోద్యమం స్త్రీల సమస్యలను కలుపుకొని పరిష్కారదిశగా విస్తరించాలన్న ఆకాంక్ష కూడా అందులో కనబడుతుంది. గాంధీ పిలుపునందుకొని సహాయనిరాకరణోద్యమంలో స్త్రీలు కూడా భాగస్వాములయ్యారు.    కుటుంబాన్ని దాటి కొత్తగా సమాజంలోకి అడుగుపెట్టారు. గుమ్మడిదల దుర్గాబాయి వ్రాసిన ”నేధన్యనైతిని” (1929), కనుపర్తి వరలక్ష్మమ్మ వ్రాసిన ”ప్రేమప్రభావము” (1927), ”ఐదుమాసముల ఇరువది దినములు” (1931), బసవరాజు వెంకటరాజ్యలక్ష్మీ వ్రాసిన ”ఎవరిదదృష్టం” (1931), తాడి నాగమ్మ వ్రాసిన ”ఒక ముద్దు” (1939) అయిదు కథలు జాతీయోద్యమ నేపథ్యంలో వచ్చాయి. జాతీయోద్యమంలో స్త్రీల క్రియాశీలక పాత్రను చిత్రించిన కథలుగా వాటికి ఒక ప్రత్యేకత వుంది.

దుర్గాబాయి ‘నేధన్యనైతిని ‘  కథను 1929లో వ్రాసింది. బాలవితంతువైన శారదాబాయి సంప్రదాయాలను ధిక్కరించి పూనాకు వెళ్ళి చదువుకొని వచ్చి పాఠశాల స్థాపించి నడుపుతున్న చైతన్యశీలి.  ఆమె తమ్ముడు శ్యామసుందరుడు సైమన్‌ కమీషన్‌ బహిష్కరణప్పటినుండి  జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొంటూ పాఠాశాల నుండి బహిష్కరణకు, అన్న ఆగ్రహానికి గురై అక్క  దగ్గరకు చేరతాడు.  లీలది  జాతీయోద్యమ చైతన్యశీల స్వభావం. ఇంట్లో  నూలు వడకటం జాతీయోద్యమ గీతాలు పాడటం ఆమెకు అలవాటైంది.  లీల తండ్రి శ్రీనివాసరావు జబ్బుపడి మరణిస్తూ కూతురికి మాతృభూమిని మరువద్దు, భారతాంబ ఋణం తీర్చు అని సందేశమిచ్చాడు. ఆ తరువాత లీల తల్లి మరణిస్తూ ”చదువుల సరస్వతివై విద్యలేక  దేశమన్న నెట్టిదియో యెరుంగక భర్తయున్నతాశయముల కెంతయు ఆటంకమును గల్గించు వృధా ప్రలాపముల యందే కాలమంతయు గడిపి అవిద్యాంధకారమందు మునిగి తేలుచున్న స్త్రీల నుద్ధరింపుము” అని చెప్పింది.   స్త్రీ విద్య కథలో స్త్రీలు తమ పనులైన తర్వాత  కాలక్షేపం  కబుర్లతో కాలాన్నివృధా చేయకుండా చదువుకు వినియోగించాలని భండారు అచ్చమాంబ చెప్పిన విషయమే ఈ కథలో దుర్గాబాయ్‌ తల్లిపాత్ర తో చెప్పించింది.   శారదాబాయి లీలను చేరదీస్తుంది.  లీల, శ్యామసుందరుల మధ్య అనురాగం పెరుగుతుంది.  శారదాబాయి జబ్బు పడ్డప్పుడు  లీలా శ్యామసుందరులు  పాఠశాల నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు.   తన ఆశయాన్ని ముందుకు తీసుకొనిపోగల యువతరం తయారుకావటం శారదాబాయికి చాలా తృప్తినిచ్చింది. నేటికి నేను ”ధన్యనైతిని” అన్న ఆమె ఆఖరి మాటలో ఆ తృప్తే వ్యక్తమవుతుంది.  స్వార్ధ రహితంగా దేశభక్తితో మానవసేవ చేయటంలోనే జన్మసార్థకమవుతుందని దుర్గాబాయి  భావించినట్లు తెలుస్తుంది ఈ కథ ద్వారా .

గాంధీజీ విజయవాడలో జరగనున్న అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశానికి కలకత్తా నుంచి వస్తూ తెలుగు ప్రాంతంలో చాలా పట్టణాల్లో  ప్రసంగించాడు. విదేశీ వస్త్రాలను బహిష్కరించమని పిలుపునిచ్చాడు. స్వరాజ్య స్థాపనకు  సహాయ నిరాకరణమే శరణ్యమని అభిప్రాయపడ్డాడు. ఆ స్ఫూర్తితోనే కనుపర్తి వరలక్ష్మమ్మ ”ప్రేమప్రభావము” అనే కథను 1927లో వ్రాశారు.
లక్ష్మీ వెంకయ్యనాయుడు దంపతుల కొడుకు రామస్వామి చదువురీత్యా మద్రాస్‌లోఉంటాడు.  గాంధీ మద్రాస్‌ సభలో చెప్పిన సహాయనిరాకరణోద్యమానికి మూల సూత్రాలైన సత్యం, త్యాగం, అహింస, ఐకమత్యం ల  గూర్చిచెప్పిన  గాంధీ మాటలు రామస్వామి హృదయంలో గాఢంగా నాటుకొన్నాయి. తానూ  ఉద్యమంలో చేరాలనుకుని చదువుకు మాని స్వగ్రామం చేరతాడు.  వెంకయ్యనాయుడుకు కొడుకు ఉద్యోగము చేయాలని, పెద్ద మొత్తం వరకట్నంతో అతనికి పెళ్ళి చేయాలని ఉంది.  అది కాదన్న కొడుకును ఇంట్లో ఉండొద్దంటాడు.  తల్లి చాలా బాధపడుతుంది.  తల్లికి ఉద్యమతత్వం చెప్పి ఒప్పించుకుని ఇల్లు వదిలి సహాయనిరాకరణ ఉద్యమంలోఉండగా జైలు పాలైన విషయం తెలుసుకున్న వెంకయ్య నాయుడు తానూ కొడుకు మార్గంలో నడవడంతో  కథ ముగుస్తుంది.   ఈ కథ కనుపర్తి వరలక్ష్మమ్మగారి జాతీయోద్యమ చైతన్యాన్ని సూచిస్తుంది. గాంధీ నిర్విహించిన చారిత్రక పాత్రను రచయిత్రి ఈ కథలో నమోదు చేయటం విశేషంగా చెప్పవచ్చు.
కనుపర్తి వరలక్ష్మమ్మ వ్రాసిన మరో కథ ”ఐదు మాసముల ఇరువది దినములు” (1931) మహాత్మాగాంధీ పిలుపునందుకొని విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చేరతాడు గోపాలరావు.  పురిటికి పుట్టింటికి వెళ్లి పిల్లవాడితో  తన కోసం వచ్చిన భార్య విదేశీ వస్త్రాలు ధరించి వుండటం చూసి  గోపాలరావు ఆమెను పలకరించనయినా పలకరించడు. ఆ  రాత్రే  గోపాలరావును బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. విదేశీ వస్త్రాలను వ్యతిరేకిస్తూ ప్రజలను జాగృతం చేస్తున్నందుకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన చీరలు, నగలే  జీవితం అనుకునే  రుక్మిణిని  దేశ స్థితిగతుల గురించి ఆలోచించేటట్లు చేసింది. స్వదేశీవస్త్రాలనే ధరించమని చెప్పటమే నేరమా అని ఆశ్చర్యపడేలా చేసింది .  భర్త ఆశయాన్ని అర్థం చేసుకున్న రుక్మిణి స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా ఖద్దరు కట్టి, నూలు వడకటం మొదలు పెట్టింది.  స్వదేశీ ఉద్యమం పట్ల ఆమె  చుట్టూ ఉన్న స్త్రీలను సమీకరించి కార్యోన్ముఖుల్ని చేసింది.  5నెలల 20 రోజులకి భర్త జైలు నుండి వచ్చేసరికి అతని ఆదర్శాలకు, అభిరుచులకు అనుగుణమైన ప్రవర్తనతో తయారైంది.

స్త్రీలు భర్తల ఉన్నతాశయానికి భంగం కలిగించని రీతిలో విద్యావంతులు కావాలని ”నేనుధన్యనైతిని” కథలో లీల తల్లితో చెప్పించిన మాటల సారాన్ని ఆచరణ రూపంగా వ్యాఖ్యానించిన కథ ఇది. జాతీయోద్యమ ప్రభావంతో పనిచేసే మగవారి ఆశయాలకు, ఆచరణకు భంగం కలగకుండా వారి సహచరులు అతని బాటలో నడచినప్పుడే  ఉద్యమం బలోపేతం అవుతుందని,   భర్త ఉన్నతాశయాలనర్దం చేసుకొని భార్య నడుచుకోవాలని  తెలిపింది.

శ్రీమతి బసవరాజువేంకటరాజ్యలక్ష్మీ వ్రాసిన కథ ”ఎవరిదదృష్టం”.  ఈ కథలో సరళ, కమల ఇద్దరు స్నేహితులు. సనాతన సంప్రదాయలోని  కమల,  స్త్రీలు కూడా పురుషులతో సమానమనే  సరళల చైతన్యాలు కూడా ఆ రకంగానే వికసించాయి.  తల్లిదండ్రుల ఇష్టప్రకారం  బాల్యంలోనే పెళ్లి చేసుకొని యుక్త వయస్సు రాగానే చదువు మానేసింది కమల. సరళ చదువు స్కూల్‌ ఫైనల్‌ ప్యాసు అయింది. మద్రాస్‌లో జరిగే టెన్నీస్‌ పందెములు చూడ్డానికి వెళ్ళి అక్కడ టెన్నీస్‌ ఆటగాడు బేగ్‌ను పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది.   అయితే  మతాంతర వివాహం కాబట్టి బేగ్ ఇంట్లో ఇష్టం లేకపోవడంతో  ఆమె వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగుస్తుంది.  బాల్య వివాహం చేసుకున్న కమల అత్తమామలకు, భర్తకు సేవలు చేస్తూ వంట చేయడం, నూలు వడకటం, కొందరు పిల్లలకి  హిందీ నేర్పటం, తో పాటు జాతీయోద్యమ కార్యకలాపాలు  సాగిస్తూ ఉంటుంది.   సరళ, కమల దగ్గరికి వెళ్లి  పరిస్థితి చెప్పి  ”నా గతి యిల్లా అయినదని” తన మీద తానే జాలిపడుతున్నట్లు అనిపించిన రచయిత్రికి మతాంతర వివాహాల పట్ల  విముఖత ఉన్నట్లుగా కనిపిస్తుంది.  కమల భర్త దామోదరం  సహాయనిరాకరణోద్యమంలో జైలుకు వెళ్తాడు. తిరిగి వచ్చేవరకు సరళ, కమల ఆయన పని చేయదల్చుకున్నారు.   సరళ ఖద్దరు చీర కట్టుకుని, ఖద్దరుకున్న గౌరవం విదేశీ బట్టలకు లేదని ప్రచారం చేస్తూ ఖద్దరు బట్టల మూట నెత్తిన బెట్టుకొని ఖద్దరమ్మేది. సంసారంలో వైఫల్యం చెందిన స్త్రీలకు జాతీయోద్యమ ఒక ప్రత్యామ్నాయ ఆదర్శం కార్యక్రమంగా చూపించారు రచయిత్రి.  సరళ పేరు ప్రఖ్యాతులు  పత్రికలో చదివి పశ్చాత్తాపంతో బేగ్‌ సరళను వెతుక్కుంటూ వచ్చినప్పుడు  సరళతో ఇలా అనిపిస్తారు ”ఇకరాను,  దేశమే నాకు సంసారం, నీకిష్టమైతే దేశసేవ చేయి, మాతృదేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాతే మనకు సంసారం” అని.  ఇలా అనటంలో ఆమె స్వాతంత్య్ర కాంక్షను బలంగా చూపించింది రచయిత్రి.  ఒకరోజు బెజవాడలో విదేశీబట్టల దుకాణం దగ్గర పికెటింగ్‌లో అరెస్టయి ఆరునెలలు శిక్షతో రాయవేలూరు జైల్లో వేస్తే ఆహార నియమాలు పడక 21 రోజులు ఉపవాసం ఉంటుంది. దేశం కోసం ప్రాణాలు ధారపోయటం నా అదృష్టమని తల్లిదండ్రులకు, స్నేహితురాలికి తెలియజేస్తూ దేశసేవ మాత్రం ఏనాటికి మరువద్దని ఆఖరు మాటగా చెప్పి ప్రాణాలు వదులుతుంది.

ఉన్నతాశయాలతో పనిచేసిన  సరళ పేరును కమల తన కూతురికి పెట్టుకొంటుంది. సకాలంలో పెళ్ళి చక్కని సంసారం భర్త ఆశయాలకనుగుణమైన ఆశయాలు ఆచరణ వున్న కమలదా అదృష్టం,  సంసార జీవితం విఫలమైనా జాతీయోద్యమంలో సార్థకమైన జీవితం గడిపిన సరళదా అదృష్టం అన్న ప్రశ్న పాఠకులను వెన్నంటుతూనే వుంటుంది. రచయిత్రి ఒకసారి ఒకరివైపు, మరొకసారి మరొకరి వైపు మొగ్గినట్లు కన్పించినా ఆ ఇద్దరూ ఒకే వ్యక్తిత్వంలో భాగం కావటం రచయిత్రి ఆకాంక్షేమో !

తాడి నాగమ్మ రాసిన కథ ‘ఒక ముద్దు ‘ .  ఈ కథలోని యువతికి 18 ఏళ్ళు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొంటూ స్వదేశ వస్త్ర విక్రయం తన పనిగా చేస్తున్నది యువతి. ”నేధన్యనైతిని” కథలో లాగ శారదబాయిలాగ వితంతువు కాదు. కనుపర్తి వరలక్ష్మమ్మ గారి ”ఐదు మాసముల ఇరువది దినముల” కథలో లాగ  ఇల్లాలు కాదు. ”ఎవరిదదృష్టం” కథలోని సరళలాగ విఫలమైన సంసారం  కాదు. పెళ్ళికాని యువతి స్వతంత్రంగా, స్వచ్ఛందంగా ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తి.  స్వదేశీ ఉద్యమం వెనుక ఉన్న దేశ ఆర్థికబలం గురించి తెల్సిన విద్యావంతురాలు, మేధావి.

విదేశీ వస్త్రాలు  కొనడంవల్ల సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుందనీ, కొంతకాలం తర్వాత భారతీయులంతా  భిక్షాందేహి అనే స్థితి వస్తుందనీ  ఆవేదన చెందే ఆ యువతి  స్వదేశీ వస్త్రాలు మాత్రమే కొనమని ప్రజలను వేడుకుంటుంది.  ఓ ధనమదాంధుడైన  పురుషుడు ఒక ముద్దు ఇస్తే స్వదేశీ దీక్ష చేస్తానంటాడు.  సామాజిక ఉద్యమాలలోకి ప్రవేశించే స్త్రీలకు మాత్రమే ఎదురయ్యే ప్రత్యేక అనుభవం ఇది.  స్త్రీలను లైంగిక దృష్టితో చూడటానికి మాత్రమే అలవాటు పడ్డ పురుషుల నుండి ఉద్యమాలలోకి వచ్చే స్త్రీలకు ఎదురయ్యే సమస్యను తాడి నాగమ్మ 1930 లలోనే ఊహించింది. ఇక్కడ ఆ యువతి ఒక దేశభక్తురాలుగానో వలసపాలస మీద ధిక్కారం ప్రకటించిన తిరుగుబాటుదారుగానో, మేధావిగానో ఆ పురుషుడికి కనబడలేదు. తన అనుభవానికి, తాను హేళన చేయడానికి, అవమానించడానికి అనువుగా ఉన్న రెండవస్థాయి పౌరురాలుగా మాత్రమే కనబడింది. అందుకే  ఒక ముద్దు ఇస్తే ఉద్యమానికి పని చేయగల్గుతానని అనగలిగాడు. ఇలాంటి పరిస్థితులలో యువతులు అవమానంతో దుఃఖపడటం కాదు చేయాల్సింది. ఆత్మగౌరవంతో అలా అన్నవాళ్ళను ధిక్కరించగల్గాలి. ఈ కథలో యువతి చేసిన పని అదే.  నాకిద్దరు అన్నలున్నారు.  రోజూ నన్ను ముద్దుపెట్ట్కుని  ఆశీర్వదించి శాంతి సమరానికి పంపుతున్నారు.  తరతరాల నుండి దాస్యమును అనుభవిస్తున్న మాతృభూమి విముక్తికోసం విదేశీ వస్తువులనే విషానికి ఆహుతి అవుతున్న నీలాంటి సోదరున్ని రక్షించుకోడానికి ఒక ముద్దు ఇవ్వలేనా?  నీవు నా మూడవ తోబుట్టువు.  ఒకటి కాదు, ఎన్నైనా పొందమని ఆమె తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ముద్దు అతని దృష్టిలో ఒక లైంగిక చర్య. ఆమె దృష్టిలో స్నేహాన్ని, సానుభూతిని, ఆప్యాయతను వ్యక్తీకరించే చర్యగాను,  లైంగికత్వ ముద్ర నుండి విముక్తం చేసి ఒక మానవీయ స్పందనగా నిలబెట్టటం ఆ యువతి వివేకానికి, ఔన్నత్యానికి గుర్తుగా చిత్రించిన రచయిత్రిని అభినందించకుండా ఉండలేం.  ఉద్యమాలలో స్త్రీల భాగస్వామ్యం జాతీయాభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని కల్పుకొని సాగాల్సిన స్థితి గురించి ఈ కథ చెప్పింది.  తాడి నాగమ్మ  వ్రాసిన ”ఒక ముద్దు” కథలో దేశీయ స్వాతంత్య్రఆకాంక్షతో పాటు, విదేశీ వస్తు బహిష్కరణ పెనవేసుకున్నాయి. స్త్రీలను జాతీయోద్యమంలోకి సమీకరించటమే కాక, సామ్రాజ్యవాద సంస్కృతిని వ్యతిరేకించే చైతన్యాన్ని, స్త్రీగా స్వతంత్ర వ్యక్తిత్వ చైతన్యాన్ని కూడా రచయిత్రి ఇందులో కనబరచరచడం ఆనాడు ఆమెకున్న చైతన్య స్థాయిని తెల్పుతుంది.  స్పూర్తిని ప్రవహింపచేస్తుంది.

ఈవిధంగా స్త్రీల కథలు సంఘసంస్కరణోద్యమ, జాతీ యోద్యమ ఆదర్శాలను ఆయా ఉద్యమాలలో క్రియాశీలక భాగస్వామ్యాన్ని చైతన్య చరిత్రను నమోదు చేశాయి.

 

స్వాతంత్ర్యానంతర కథలు

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సామాజిక, ఆర్ధిక, సాహిత్య రంగాలలో  చాలా మార్పులొచ్చాయి.  విద్యావకాశాలు మెరుగుపడ్డాయి.  పత్రికలు రాయమని ప్రోత్సహించేవి. అంతకు ముందు ఉన్నత కులాలు , కుటుంబాల్లోంచి చదువుకుని కథలు రాసేవారు.  జమిందారీ వ్యవస్థ రద్దయిన తర్వాత  కుటుంబాలు మధ్య తరగతిలో చేరిపోయాయి.  మధ్యతరగతి కుటుంబాలోంచి వచ్చిన రచయిత్రులు తమకు తెలిసిన  మధ్యతరగతి జీవితాలపై  విభిన్న కోణాల్లో విస్తృతంగా సాహిత్యాన్ని అందించారు.  మారుతున్న విలువలని, మారుతున్న కుటుంబ సంబంధాల్ని, సామాజిక వ్యవస్థలోని అస్తవ్యస్త తలని , అసమానతల్ని ఎత్తి చూపుతూ కర్తవ్యాన్ని బోధిస్తూ అభ్యుదయ రచనలు చేసారు.  అయితే, తెలంగాణా విమోచనోద్యమం పై కథలు వచ్చినా స్త్రీలు రాసినవి కనిపించవు. అదే విధంగా రాయలసీమ ప్రాంతం నుండి కూడా కనిపించవు.  పేదల జీవితాల గురించి వచ్చిన కథలు చాలా తక్కువ. అవి కూడా మధ్యతరగతి కళ్ళద్దాల్లోంచి కనిపించేవే.

కె. రామలక్ష్మి 1950కి ముందునుంచీ కథలు రాస్తున్నారు. 1954 నాటికే ఆమె తొలి కథా సంపుటి ’విడదీసే రైలుబళ్ళు” ప్రచురించారు.1961 లో ’తొణికినస్వప్నం” ప్రచురిం చారు. రామలక్ష్మి కథలు క్లుప్తమైనవి. ఒక్కసారిగా చదివి ముగించటానికి వీలైనవి. తీరైన నిర్మాణసౌష్ఠవం చాలా కథల్లో కన్పిస్తుంది. ఆత్మ గౌరవం స్త్రీలకి గానీ పురుషులకు గానీ ఒకరిచ్చేది ,ఒకరినించీ లాక్కునేదీ కాదు .అది వాళ్లంతట వాళ్ళే అలవర్చుకోవాలనే నమ్మకాన్ని అనేక కథల్లో అర్థం చేయించడానికి ప్రయత్నిస్తారు రామలక్ష్మి. రామలక్ష్మిగారి కథలన్నీ స్త్రీల జీవితాలని ,వాళ్ళు యువతులుగా,గృహిణులుగా ,వృద్ధులుగా ఎదుర్కుంటున్న సమస్యల్ని,చిత్రించినవే. అందుకు ఒక కారణం ఆమె కొన్ని సేవాసంస్థలలో పనిచేస్తూ బాధిత స్త్రీలను సన్నిహితంగా చూడడం కూడా కావచ్చును.మానసిక రోగులను,  సేవా సంస్థలను వికలాంగుల పాఠశాలను సందర్శించడం కూడా కావచ్చు..స్త్రీలపట్ల సహానుభూతి పెంచడానికవి దోహదం చేసి వుండొచ్చు. 

రామలక్ష్మి కథల్లో భాష, శైలి రెండూ ఆధునికమైనవి. ఎక్కడా అసహజత్వానికి చోటీయనివి. కథల్లో వాదోపవాదాలు శిల్పమర్యాదకు భంగం కలిగించనవి. సాధారణంగా కన్పించే అసాధారణమైన కథలివి. రామలక్ష్మిగారి కథలలో ఆధునిక జీవితంలో మనుషుల మధ్య ప్రేమానుబంధాలు తరిగిపోతున్నాయన్న ఆవేదన వుంది. చదువూ సంస్కారంతో మనుషులు సమస్యల్ని పరిష్కరించుకోవాలేగాని ఆత్మహత్యలు ప్రత్యామ్నాయం కాదన్న ఉద్బోధ అంతర్లీనంగా వుంది.

మాలతీ చందూర్ వాస్తవానికి దగ్గరగా రచనలు చేసేవారు. 1950 ప్రాంతంలో ‘ఆనందవాణి’ వారపత్రికలో ప్రచురితమైన ‘రవ్వల దుద్దులు’ ఆమె రాసిన మొదటి కథ. 1953 ఆగస్టులో ప్రచురితమైన ‘పాప’ కథానిక, ఇంకా ‘లజ్ కార్నర్’, ‘నీరజ’ తదితర రచనలన్నీ ప్రముఖ సాహిత్య మాసపత్రిక ‘భారతి’లో వచ్చాయి.  వాటిలో మధ్యతరగతి జీవితాన్నికళ్ళకు కట్టించే ప్రయత్నం చేశారు. మధ్యతరగతి కుటుంబాలలోని మానవ సంబంధాలు, ఒడుదొడుకులు ఆమె రచనల్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్త్రీ పాత్రలను వట్టి బేలలుగా ఆమె చిత్రించరు. ఆమె కథల్లోని స్త్రీ పాత్రలు ఆత్మ గౌరవంతో సమస్యలను ఎదుర్కొంటాయి.

కథానికా రచనలు చేసి ప్రసిద్ధి పొందిన రచయిత్రి నిడదవోలు మాలతి.  వందకు పైగా కథానికలు వెలువడ్డాయి. ఈమె రచనల్లో ముఖ్యంగా మానవతా విలువలు, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఇతరులకు చెప్పడం విశేషం. నిజానికి, ఫెమినిజానికి మధ్య కథానిక సంచలనం కలిగించింది.   1952 తెలుగు స్వతంత్రలో ప్రారంభమైన ఈమె రచన కొనసాగుతూనే ఉంది.

వాసిరెడ్డి సీతాదేవి  మొదట ‘సాంబయ్య పెళ్లి ‘ కథ రాశారు.  ఆ తర్వాత  1952లో  ‘ధర్మదేవత గుడ్డికళ్ళు ‘ కాలేజీ పోటీల కోసం రాసిన కథ.   జడ్జి గా వ్యవహరించిన కొడవటిగంటి కుటుంబరావు మెచ్చుకొని  బహుమతి ఇచ్చిన కథ అది. 1955లో ‘రత్తమ్మ కష్టాలు ‘  రాసింది.  ఈ కథ ఆనాటి ప్రధానమంత్రి భార్యగురించి   రాసిందని ప్రచారం జరిగి , ప్రధానికి ఫిర్యాదు ఇవ్వడం తో  ఉద్యోగం పోగొట్టుకుంది సీతాదేవి. అయినా తన రచనా వ్యాసంగాన్ని ఆపలేదు సరికదా తన కాలానికి మరింత పదును పెట్టారు . 1955లోనే వాసిరెడ్డి సీతాదేవి కథల పుస్తకం వచ్చింది.
రంగనాయకమ్మ కథలు నాటికీ నేటికీ ప్రత్యేకమైనవే. మొదటి కథ ‘పార్వతమ్మ’  1955లో  తెలుగు స్వతంత్రలో వచ్చింది.   1958లో రాసిన ‘రగిలిన పగ ‘  ఆ  తర్వాత ఆవిడకే నచ్చలేదు.   కథ ఎవరికోసం , ఏ ప్రయోజనం ఆశించి రాస్తున్నామో ననే  మానసిక పరిణతితో ఉండడం వల్ల.


స్త్రీవాద కథలు
తెలుగు సాహిత్యంలో విమర్శకుల విస్మరణకు గురైన భండారు అచ్చమాంబనే తొలి స్త్రీ వాది అని ఆ రచనలను చదివిన వారెవరైనా అనక మానరు.
భండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్షమమ్మ మొదలుకొని అనేక స్త్రీ చైతన్యం కోసం, ఆమె వ్యక్తిత్వం కోసం రాసారంటే అవి ఆనాటి పరిస్తితులకి స్త్రీవాద కథలుగా చెప్పుకోవచ్చేమో .. ఆతర్వాత కాలంలో ఆచంట శారదాదేవి, రంగనాయకమ్మ, కె. రామలక్ష్మి, చాగంటి తులసి, ఆర్‌.వసుంధరాదేవి, డి.కామేశ్వరి వంటి రచయితలు ఎన్నో కథలు రాసారు. అప్పటి వరకు స్త్రీల జీవితంలో ఉన్న భిన్నకోణాల్ని, అంటే..  మాతృత్వం, వివాహం, విడాకులు వంటి అంశాలను చిత్రించారు. పితృస్వామ్య సమాజం స్త్రీలను అణచివేస్తున్న తీరును గురించి  తమ రచనల్లో చూపించారు. వైవాహిక జీవితంలోను, సమాజంలోను, ఆడవాళ్ల అణచివేతకు గల మూలాల్ని ఒక్కొక్కరు ఒక్కో తీరున అర్థం చేసుకుని, తమ కథల్లో ఆవిష్కరించారు.  మొదటి తరం రచయిత్రుల కథల్లో కుటుంబంలో, సమాజంలో స్తీ,పురుష మధ్య అంతరాలని,వివక్షను అతి సహజ విషయంగా భావించినట్లు కనిపిస్తే స్త్రీవాదకథ ఆ వివక్షను“పురుషాధిపత్యరాజకీయం గా“  గుర్తించి ఎదిరించగలిగింది. 

ఉదాహరణకి రామలక్ష్మి గారి పేపర్ టైగర్స్ కథలో సుందరి ,మూర్తి ని ప్రేమించింది .అతను పెళ్ళి చేసుకుంటానంటే నమ్మింది..అతను వేరే పెళ్లికి సిద్ధపడి ఆమెకి చెప్పకుండా వెళ్ళిపోయాడు అప్పటికే ఆమె గర్భవతి.. సుందరి అన్న ఆమెను నిలదీసి ,నానా మాటలని ,ఇంక ఉద్యోగం మానేసి ఇంట్లో వుండమంటాడు .సుందరి తిరగబడింది.ఉద్యోగం మాననంది పిల్లని కని పెంచుకుంటానంది. తల్లి తండ్రులని కూడా తనే చూసుకుంటానంది.ఈ కథ ముగింపులో రచయిత్రి “ఆ రోజు ఆ ఇంట్లో విస్తళ్ళు లేవలేదు. నిజమే..కానీ అలా శాశ్వతంగా వుండిపోదుకదా!!” అంటారు. రామలక్ష్మి గారి కథల్లో ఎక్కువ స్త్రీలు అప్పటికీ ఇప్పటికీ అనుభవిస్తున్న పరాధీనత అసహాయత ఎక్కవగా కనిపిస్తుంది. అట్లా అని ఆమె కథల్లో స్వతంత్ర వ్యక్తిత్వంతో జీవితం గడుపుతున్న స్త్రీలు లేరని కాదు.ఈ కథల్లో ఒక నలుగురు స్నేహితులు కనిపిస్తూ వుంటారు.వాళ్ళు పెళ్ళై సంసారం చేస్తున్నవాళ్లు.అయితే వాళ్ళు తమ స్నేహాన్నీ ఏళ్ళకొద్దీ కాపాడుకుంటారు.తరుచూ కలుస్తారు.కలిసి ప్రదేశాలు చూడ్డానికి వెడతారు.వాళ్ల స్వంత స్పేస్ ని హాయిగా వినియోగించుకుంటారు. ఇప్పటికీ చాలామందికి అటువంటి స్పేస్ లేదని వాపోయే పరిస్థితి వుంది. యాభై అరవైల నాటికే ఆ పరిస్థితి వుందని చెబుతాయి ఈ కథలు.  స్త్రీవాద ఉద్యమ రూపం దాల్చక మునుపే స్త్రీవాద  కథారచన చేసిన రచయిత్రి శ్రీమతి అబ్బూరి చాయాదేవి. అబ్బూరి ఛాయాదేవి కథలు స్త్రీ దృక్పథంతో మొదలై స్త్రీవాద దృక్పథంతో సంభాషించే దశ వరకూ ప్రయాణిస్తాయి. 1952లో రాసిన “అనుబంధం” మొదటి  కథ. ఈ కథలో కుటుంబంలో పురుషాధిపత్యం ఎలా ఉంటుందో, అందులోనే స్త్రీలు ఎలా ఆనందాన్ని వెతుక్కుంటారో చెప్పారు. ఆ తరువాత వైవాహిక జీవితంలోని మంచిచెడుల్ని విశ్లేషిస్తూ రాసిన కథ 1955లో “తెలుగుస్వతంత్ర”లో అచ్చయింది.

హాస్య కథలు
హాస్యకథలు రాసిన మహిళలు చాలా తక్కువ.  హాస్యకథలుగా  భానుమతీ రామకృష్ణగారి మరచెంబు, అత్తగారి కథలు  చెప్పుకోవచ్చు.  అత్తగారు గయ్యాళి అయినా , కోడలు అణగిమణగి ఉన్దేదయినా ఆమె కథల్లో హాస్యం నింపడం ప్రత్యేకత.
వసుంధర గారు రసిక రాజ తగువారము కామా ?, చిరునవ్వు వెల ఎంత ? రెండు హాస్య సంపుటిలు వేశారు.  ఆ కథలు అపరాధ పరిశోధన అనే పత్రికలో అచ్చయ్యాయి.

మనో విశ్లేషణాత్మక కథలు
జమ్మలమడుగు వనాంబ  రాసిన ఒకే ఒక కథ ”సుగుణ ఈ పొరపాటు నాదే”  1934లో ”దక్కన్‌ కేసరి” పత్రికలో ప్రచురించబడింది.  కథానాయకి సుగుణ అతి సున్నితమైన మనస్తత్వాన్ని రచయిత్రి చాలా చక్కగా విశ్లేషించిన కథ ఇది.

నందగిరి ఇందిరాదేవి కథల్లో చెప్పుకోదగ్గ కథ ‘పందెం’ .  1941లో వచ్చింది.  ఈ కథ  సరదాగా సాగిన ఇద్దరి వ్యక్తుల మధ్య మాటా, మాటా పెరిగి రెండు లక్షలు పందెం కాసుకునేదాకా వస్తుంది. వాళ్ళ మధ్య జరిగిన పందేనికి కారణం ఉరిశిక్ష గొప్పదని ఒకరు వాదిస్తే, యావజ్జీవం గొప్పదని మరొకరి వాదన. ఇద్దరి మధ్య జరిగిన పందెం. యావజ్జీవం గొప్పదని వాదించిన వాడు ఒక పది సం||లు ఒంటరిగా వుండాలి. అలా పది సంవత్సరాల కాలంలో ఎలాగూ ఉండలేడు. రెండు లక్షలు నాకే వస్తాయి. అని ఒకరనుకుంటే, పందెం నెగ్గి రెండు లక్షలు తీసుకుంటానని ఇంకొకరను కుంటారు. అయితే ఒంటరిగా వున్న వ్యక్తి గడువుకు ఒక రోజు వుందనగా ఒక కాగితం వ్రాసి వెళ్ళిపోతాడు. నాకు ప్రపంచం మీద విసుగు పుట్టింది, ఇవేవి నన్నాకర్షించవు. అప్పుడు రెండు లక్షలు గొప్పగా అనుకున్నాను. అనుభవించానని ఆనందించాను. కాని ఇపుడు అనవసరం అందుకే వెళిపోతున్నాను.  అంటూ ఆ ఇద్దరు వ్యక్తుల మనో విశ్లేషణను చక్కగా చిత్రించిన కథ.

డా.ఇల్లిందల సరస్వతిదేవి  రాసిన స్వర్ణ కమలాలు , తులసి దళాలు అనే కథ సంపుటాలు తెలుగింటి జీవనానికి అడ్డం పట్టాయి.  1943 లో పితృ హృదయం’ అనే తొలి కథతో మొదలు పెట్టి 250 వరకు కథానికలు రాశారు.  మధ్యతరగతి మనస్తత్వాలని, ఆనాటి  కుటుంబ వ్యవస్థని అందులోని ఒడిదుడుకుల్ని చక్కగా చిత్రించేవారు. కథా రచన ప్రారంభించినప్పుడు సంస్కరణోద్యమ ప్రభావం కనిపించినా తర్వాతి కథల్లో మనవ స్వభావంలో వస్తున్నా మార్పులు , శాస్త్ర సాంకేతిక పురోభివృద్ది వల్ల పెరిగే విసృఖలత్వం, క్లిస్టమయ్యే జీవితాల్ని గురించి సాగాయి ఆమె రచనలు. అవి పాఠకలోకానికి ఎంతగానో ఉత్తేజం కలిగించి, ఆలోచింప చేశాయి
ఆర్.వసుంధరాదేవి మనో విశ్లేషణాత్మక రచనలు చేసిన హేతువాద దృక్పథం గల రచయిత్రి . గాలి రధం , నీడలు కథా సంపుటాలు వేశారు . నిజజీవితంలోని కొన్ని సంఘటనలు ఆధారంగా రచనలు చేసిన రచయిత్రి ఈవిడ .  ఆచంట శారదాదేవి కథల్లో స్త్రీలలో ఉండే ఆత్మన్యూనత, అజ్ఞాత వాంఛలు మొదలైన వాటిని విశ్లేషిస్తూ రచనలు చేశారు. పగడాలు, పారిపోయిన చిలక, మరీచిక , వానజల్లు కథ సంపుటాలు వేశారు.

మనో వైజ్ఞానిక కథలు
వాసిరెడ్డి సీతాదేవిగారి కథల్లో ప్రత్యేకత గలవి మనోవైజ్ఞానిక కథలు . ప్రాయిడ్ ప్రభావంతో మనో వైజ్ఞానిక కథలు చాల  వచ్చాయి .   ఆమె రాసిన ‘మనసు గారడీ ‘ కథా  సంకలనం లో ఆత్మహత్యలు, భ్రాంతులు , కలలు  మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని మానసిక శాస్త్ర పరంగా రచనలు చేశారు

గ్రామీణ నేపథ్య మాండలిక  కథలు

 ”వలయం” ”తిరోగామి” వంటి ఆలోచింపచేసిన కథలు వ్రాసిన చాగంటి తులసి 1946 లో బాలపత్రికలో మొదటికథ వ్రాశారు. యాభయ్యవదశకంనించే పురోగామి దృక్పథంతో కథలు వ్రాస్తున్నారు. పరిమాణంలో తక్కువ అయినా గుణాత్మకమైన కథలు ఆమెవి. పధ్నాలుగు కథలతో  ”తులసి కథలు” కథాసంపుటి వచ్చింది.  ప్రసిద్ధ తెలుగు కథలెన్నింటినో హిందీలోకి ఒరియాలోకి అనువదించి వివిధ పత్రికలలో ప్రచురించారు.  తులసి విజయనగరం జిల్లా మాండలికంలో చెయ్యి తిరిగిన రచయిత. ఆమె వ్రాసిన ”ఆడదాయికి నోరుండాలి” ”చోద” రెండూ ఆ మాండలికంలో వ్రాసిన ఉత్తమపురుష కథలే. మధ్యతరగతి జీవుల నెంత బాగా చిత్రిస్తారో బడుగు జీవుల్నీ అంతే సహానుభూతితో చిత్రిస్తారామె. గుడిసెవాసులకి బుల్‌డోజర్లనించీ ఎంత ప్రమాదం వుందో ప్రకృతినించీ కూడా అంత ప్రమాదం వుందని చెప్పే కథ ”స్వర్గారోహణ”లో తన సత్తు బిందెకోసం ఇంట్లోకి వెళ్లి ముంపులో మునిగిపోయింది పోలి…వ్రాసినవి తక్కువ కథలే అయినా శిల్పంలోను వస్తువులోను తాత్వికతలోనూ గుణాత్మకమైనవి తులసి కథలు.


యశోదారెడ్డి 1951 నించే కథలు వ్రాసారని ఆమెపై పరిశోధన చేసిన సుజాత అంటున్నా,  ఏ సంపుటిలోనూ ఏ కథ కిందా అది వ్రాసి ప్రచురించిన తేదీ లేదు. మా వూరి ముచ్చట్లులో పది కథలు, ఎచ్చమ్మ కథలు లో ఇరవై, ధర్మశాలలో ఇరవై నాలుగు కథలు వున్నాయి. ఎచ్చమ్మ కథలూ, మా ఊరి ముచ్చట్లు, తెలంగాణా గ్రామీణ నేపథ్యంలో మాండలిక గుబాళింపుతో ఉండే యశోదాదేవి కథల్లో వ్యక్తికీ వ్యవస్థకి మధ్య  సంఘర్షణ, తలెత్తే సంక్షోభం, ఫలితంగా ఏర్పడే విలువలు ,  పాత విశ్వాసాలు కాలక్రమంలో కనుమరుగు కావడం అంత ఒక పద్దతిలో కనిపిస్తుంది.  ప్రాంతీయతను, స్థానికతను , కులాన్ని , మతాన్ని, సామరస్యాన్ని భిన్న పార్శ్వాలో స్పృశిస్తాయి ఆమె కథలు .   వార్తాపత్రికలో చదివిన సంఘటనలపై స్పందించి కథలు వ్రాసానని ఆమె వ్రాసుకున్నారు. 

పిల్లల కథలు
అబ్భురి ఛాయాదేవి 1955 లో  వివిధ దేశాల జానపద కథలకు తెలుగు అనుసరణ పిల్లలకోసం రాశారు . ‘అనగా అనగా పేరుతొ వచ్చింది ఆ సంకలనం. 
వసుంధర పేరుతో జొన్నలగడ్డ రాజగోపాలరావు -రాజ్యలక్ష్మి రాసిన చందమామ కథలు దాదాపు 900 అవి రాయడం ఎప్పటి నుండి మొదలయిందో తెలియదు. వీరు రాసిన కథల పాత్రలు కళ్ళముందు కదలాడతాయి.

వస్తువు – శైలి

కథావస్తువు…శైలి చూస్తే ముందుగానే చెప్పుకున్నట్లు సమకాలీన సమాజంలో ఉన్న సామాజిక నేపథ్య అంశాలే వారి కథా వస్తువులు అయ్యాయి.   వారి రచనా భాష మొదట్లో గ్రాంధికంగా  కన్పించినా దీర్ఘ సమాసాలు , కఠిన పదాలు తక్కువ. కాల క్రమంలో భాష సరళంగాను వ్యవాహరికంలోను మాండలిక పదాలతోను కనిపిస్తుంది.  కొన్ని కథలలో జీవిత సత్యాలుంటే, మరి కొన్ని  కథలు నీతి బోధించేవిగా కనిపిస్తాయి. కొన్ని కథల్లో వ్యక్తిత్వ నిర్మాణానికి పనికొచ్చేవి అయితే కొన్ని సంఘ నిర్మాణానికి ఉపయోగపడేవిగా ఉంటాయి. తొలితరం రచయిత్రుల  కథలలో సామాజిక ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తుంది.  శైలి, శిల్పం అన్ని కథల్లో గొప్పగా లేకపోవచ్చు. ఆనాటి సామజిక, రాజకీయ, సాంస్కృతిక  పరిస్థితుల్లో స్త్రీలు ముందుకొచ్చి సాహితీ సృజన చేయడమే అద్భుతమైన  విషయం.   సమాజంలోని  సాంఘిక కట్టుబాట్లు, వివక్ష,  అణచివేత, కుటుంబంలోనూ, సమాజంలోనూ ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటూ కలం అందుకోవడమే గొప్ప విషయం. తమకున్న పరిధిలో స్పందించి జీవితాన్ని అర్ధం చేసుకుని సామాజిక మార్పు ఆశిస్తూ రచనలు చేయడం చిన్న విషయం ఏ మాత్రం  కాదు.  స్త్రీల సాహిత్యాన్ని కాలక్షేపపు సాహిత్యంగా భావించి చిన్న చూపు చూసిన వాళ్ళకీ కొదువలేదు. మహిళలనుండి వచ్చే సాహిత్యం ఏ  పరిస్థితుల్లో వచ్చిందో ఆనాటి దేశ కాల పరిస్థితులు ఏమిటి, ఆ స్త్రీల కుటుంబ చైతన్యం , విద్య, ఆర్ధిక , సాంఘిక రంగాలలో స్థితిగతులు ఆమె చైతన్యాన్ని ఎంత ప్రభావితం చేసాయనే  నేపథ్యంలోంచి అనుభవాలు, అవగాహన, అవకాశాలను బట్టి వారి చైతన్య స్థాయి ఉంటుందని మనం ఇక్కడ  గమనించాలి.  వారి చైతన్య స్థాయిని బట్టే వారి కథలు , రచనలు సాగుతాయి.  ఆధునిక కథా నిర్మాతలుగా చరిత్రలో స్త్రీల పాత్ర విశిష్టమైంది . విలక్షణమైంది. తమ చుట్టూ ఉన్న మనుషులపై , సమాజంపై, సామాజిక రుగ్మతలపై అవగాహనతో , ప్రాపంచిక విషయాలను అర్ధం చేసుకుంటూ, మేధకు పదును పెట్టుకుంటూ , ఒక స్పష్టతతో , వస్తువైవిధ్యంతో, నిబద్దతతో, సామాజిక దృష్టితో కాలంతో పాటు కదులుతూ చేసిన రచనలు ఆధునిక కథా ప్రపంచాన్నిపరిపుష్టం చేస్తూ ముందుకు నడిపించాయి.   ఆనాటి చరిత్రను తమ కథల ద్వారా రికార్డు చేశాయి. తెలుగు కథా ప్రస్థానంలో తమకంటూ ఓ చిరునామా ఏర్పరచుకోవడమే కాకుండా భవిస్యత్ తరాలకి బాటలు వేసిన రచయిత్రులందరినీ స్థలాభావం, సమయాభావం వల్ల నేనిక్కడ చెప్పలేక పోవచ్చు.  కానీ,  అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నా .

వి. శాంతి ప్రబోధ

 

Tag Cloud

%d bloggers like this: