The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘సెప్టెంబర్ 13న ప్రచురణ . ప్రకృతి’

పూబాల

పూబాల

                        santhi prabodha  అబ్బ ! ఎంత..  ముద్దొస్తున్నావే ..’ అంటూ మురిపెంగా దోసిట పట్టుకుంది విశాల ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ .

           ’ఓహ్ .. నీ రంగు మరీ  ..ముద్దుగా ..  ‘ అంటూ  సుతారంగా రెండు పెదవులూ సున్నాలా చుట్టి ముద్దాడింది.  గట్టిగా ముద్దాడితే అది ఎక్కడ నలిగి పోతుందోనని  సున్నితంగా తాకాయి ఆమె పెదవులు.

               నిజంగానే చాలా అందంగా ఉంది  ఆ పువ్వు .  మజెంటా  పసుపు రంగుల  షేడ్స్ తో ముద్దగా విరిసిన బంగాళా బంతి పువ్వు.

              ఆ పక్కనే కదులుతున్న నిండు ఎరుపు రంగు పూవు పైపు చూస్తూ  ’ కొద్దిగా ఆగవే ఎర్ర పూవా .. ఊ .. మొహం అట్లా కోపంగా  పెట్టకూ .. వస్తున్నా కదా.. నీకూ ముద్దిస్తాలే..’ అటు వైపు తిరిగి మురిపెంగా చూస్తూ చెప్పింది ఆ చిన్నారి.

                    ‘ఆ వచ్చేశా .. నే వచ్చేశాగా .. ఇంకా ఎందుకర్రా ఆ ఏడుపు మొహం .. మీరు అట్లా ఉంటే అస్సలు బాగోలేదు ..   నవ్వాలి .. ఆ ..నవ్వాలి ..ఆ ..  ఆ అట్లాగే .. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి .. ఆనందంగా , సంతోషంగా ఉండాలిరా .. ఇలా చూస్తుంటే ఎంత ముద్దోస్తున్నారో .. ఎంత అందంగా ఉన్నారో తెల్సా .. ‘  తను ఏడిస్తే అక్క చెప్పే మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ .. చిరుగాలికి అటూ ఇటూ కదలాడుతున్న ఆ పూల కేసి కొన్ని క్షణాలు సంబరంగా చూసింది . పరవశించింది.

                             తమ నేస్తం రాకతో ఆనందంతో  అటూ ఇటూ కదులుతూ, తలలూపుతున్న ఆ పూల మొక్కలకేసి , పూలకేసి కలియచూస్తూ ‘ ఎందుకలా  గోల చేస్తున్నారర్రా..  నేను మీ దగ్గరకీ వస్తున్నా కదా.. అంతలోనే ఇంత గోల చేసేయ్యాలా…  ‘ అటూ ఇటూ కదులుతోన్న మొక్కల్ని చేతులు తిప్పుతూ చిరు కోపం ప్రదర్శిస్తూ అని, మళ్లీ తానే  ’ మిమ్మల్ని చూడకుండా, పలుకరించకుండా, ముద్దాడకుండా నేను ఉండగలనా చెప్పండి.  మీతో ఉంటే నా కెంత హాయిగా ఉంటుందో .. ఎంత సంతోషం గా ఉంటుందో .. మీరంతా నా వాళ్ళే.  చెప్పటం నాకు తెలియట్లేదు  కానీ, మీతో ఉంటే నాకు గాలిలో ఎగిరి పోతున్నట్లుగా ఉంటుంది.. పగలూ , రాత్రికి చందమామ వెన్నెలలో  ఎప్పుడూ మీతో ఇట్లాగే కబుర్లు చెప్పుకుంటూ ఉండాలనిపిస్తుంది.  కానీ , కుదరదుగా . నేను బడికి పోవాలి. టీచర్ లు చెప్పిన పాఠాలు నేర్చుకోవాలి. హోం వర్క్ చెయ్యాలి.  లేకపోతేనా .. అమ్మో టీచర్ ఎండలో నిలబెట్టేస్తుంది.  ఒక్కోసారయితే  బరిగెతో దంచేస్తుంది.  నాకయితే ఆమెను చూస్తేనే భయం.  నేను అట్లా కొట్టించుకోవడం మీకు ఇష్టమా .. ? లేదుకదా …! ‘ కళ్ళు పెద్దవి చేసి, చేతులు ఊపుతూ కబుర్లాడుతూ ఆ పూదోటలో ఉన్న బంతి, చేమంతి, బంగాళా బంతి, కారం బంతి , ఊక బంతి, షిరిడీ బంతి, డాలియా , కాశ్మీరు బంతి, చిలుక గన్నేరు , గన్నేరు, గులాబీ, కనకాంబరం, నంది వర్ధనం, గరుడ వర్ధనం , బిళ్ళ గన్నేరు,   మందార, వంటి రకరకాల పూలని కళ్ళు తిప్పుతూ కలియ చూస్తూ తన్మయం చెందుతూ   ఏడేళ్ళ విశాల .

 పూల బరువుకి పక్కకి ఒరిగిన ముద్డ్డ బంతి మొక్కని చూస్తూ ,’చ్చొ.. చ్చొ..  అయ్యొ.. పడిపోయావా లేమ్మా లే .. ‘ అంటూ కొమ్మని లేపింది.  మళ్లీ పక్కకు ఒరుగుతున్న దాన్ని ‘ఏమైందమ్మా అట్లా పడిపోతున్నావు .  దెబ్బతగిలిందా.. ఏమి కాదు తగ్గిపోతుందిలే ’ అంటూ ఓదార్చింది.  పక్కనే ఉన్న నురువరహాలు కొమ్మని బంతి మొక్కకి ఆసరా అయ్యేలా, పడిపోకుండా ఉండేలా ఆన్చి దయార్ద గుణాన్ని చాటింది.  గోల్డు స్పాట్ రంగులో నూరువరహాల చెట్టు నిండా ఆకాశంలో నక్షత్రాలు కుప్పలు కుప్పలుగా పోసినట్లు . .  ఆ కొమ్మకు ఆనించిన పసుపు బంతి వింత సోయగాలు ఒలక పోస్తూ ..

                       ఎరుపు, పసుపు, తెలుపు, గులాబీ, నారింజ, నీలం, ఊదా రంగుల్లో ముదురు, లేత వర్ణాలతో రకరకాల రంగుల కలయికలతో పూవులు.  వివిధ రకాల ఆకుపచ్చ షేడ్స్ తో ఆకులు.  కొన్ని పూలు చక్కగా విరిస్తే, మరికొన్ని అర విరిసీ విరియనివి. ఇంకొన్ని పసిమొగ్గలు. కొన్ని ముదురాకులు. మరి కొన్ని చిగురుటాకులు .  నునులేత కొమ్మలు , రెమ్మలు.  ఎంత అందంగా ఉంది ప్రకృతి.  ఎంత వింతైనది, విచిత్రమైనది , అద్భుతమైనది  ఈ ప్రకృతి.  ఈ పూదోటలో అందరికీ భిన్నంగా ఈ చిన్నది మరింత అద్భుతంగా .. అపురూపంగా ..  ప్రకృతితో సహచర్యం చేస్తూ .. . ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ..

                       గత వారం పది రోజులుగా తోటలో పూవులు విరగ పూశాయి.  తోట కన్నుల పండుగగా చూసినకొద్దీ చూడాలనిపించేలా ఉంది.  అప్పటి నుండీ గమనిస్తున్నా.  ఉదయం బడికి వెళ్ళేటప్పుడు  ’హాయ్  పూవులూ ‘ అంటూ పలకరింపులు.. , ‘టాటా బై  బై’ వీడ్కోలు చెబుతూ బడికి వెళ్తుంది .  బడి వదిలాక అందరూ వరుసలో తమ తమ నివాసాల్లోకి వెళ్తే ఈ ప్రకృతి ప్రేమికురాలు మాత్రం వరుస నుండి పూదోట ఆరంభం లోనే విడిపోతుంది.  నెమ్మదిగా పూల వైపు దారి తీస్తుంది.  పుస్తకాల బరువు కూడా దించదు.  బరువైన బ్యాగ్ భుజాలపై వేలాడుతూనే ఉంటుంది.  వస్తూనే పూలని, మొక్కలని కలియజుస్తుంది.  పలుకరిస్తుంది.  ముద్దాడుతుంది.  వాటికి కబుర్లు చెబుతుంది.  వాటిని చూసి నవ్వుతుంది. నవ్వుకుంటుంది.  వెక్కిరిస్తుంది.  అవి గాలికి తలలుపితే తనతోనే మాట్లాడుతున్నట్లు అనుభూతి చెందుతుంది.  ఆనంద పడుతుంది. మైమరచిపోతుంది.  వాటికి తను బడిలో నేర్చుకున్న పాఠాలు , పాటలు నేర్పుతుంది.  ప్రశ్నలు అడుగుతుంది.  కేకలేస్తుంది.  ఒక్కోసారి సుతారంగా ఒక్కటేస్తుంది .  ఆ పూవు నుండి ఈ పూవు పైకి అటు ఇటు ఎగిరే రంగు రంగుల సీతాకోకచిలుకల్ని చూసి  కోప్పడుతుంది. పూల మీద వాలి వాటినితోక్కేస్తున్నారేం  అంటూ తిడుతుంది.  ఏం .. చెబితే వినిపించుకోరే .. అసలు మీకెందుకంత పొగరు? రంగు రంగులతో అందంగా ఉన్నామనా? హు .. మీకంటే నా పూవులే అందమైనవి అంటూ వాటిని ఉడికిస్తుంది. వెక్కిరిస్తుంది .   తూనీగల వెంట పడుతుంది.  ఊరికే అలా రాగాలు తీస్తూ పరుగులు పెడతారు అంటూ వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.  ఏయ్ .. ఏంటి ? ఈ పూలకు మీరంటే ఇష్టం అనుకుంటున్నారా .. ఏం కాదు. నేనంటేనే వాటికిష్టం అంటూ అరుస్తుంది.  ఒక్కోసారి వాటిని చూసి ఈర్ష్య పడుతుంది.  కొద్ది దూరంలో గట్టుపై ఉన్న మామిడి చెట్టు కొమ్మలనడుమ నుండి వచ్చే కాకి అరపుల్ని ఎగతాళి చేస్తుంది.  కోయిల పాటలా పాడుతున్నావని నీకు చాక్లెట్ ఇస్తానని అనుకుంటున్నావా ..!  అబ్బ, ఆశ..  దోశ..  అప్పడం..  వడ .. అంటూ వాటిని గేలి చేస్తుంది. రకరకాల హావభావాలు ప్రకటిస్తుంది.  వాటితో మమేకమై పోతుంది. పరవశించి పోతుంది.

        పిల్లలతో ఉన్నప్పుడు చాలా మాములుగా, నిశ్శబ్దంగా సాగిపోయే సెలయేరులా ఉండే విశాలకీ,  ఈ పూదోటలోకి రాగానే విభిన్నంగా, ప్రత్యేకంగా మారిపోయే విశాలకీ ఎంత తేడా .. .  తమని పెద్దలు ఎలా చూస్తారో నిశితంగా గమనించే ఆ అమ్మాయి  అవన్నీ తన ప్రియ నేస్తాలైన పూలపై, మొక్కలపై  చూపిస్తుంది.  ప్రేమ వర్షం కురిపిస్తుంది. ఉప్పొంగి పోతుంది. ఉరకలేస్తుంది.

రోజూలాగే,  ఆ రోజు బడి నుండి వస్తూనే ఆ ఉదయమే  విరిసిన ఎర్ర గులాబీని ముద్దుతో ఆస్వాదించబొయిన ఆమె  పెదాలకు తగిలిన స్పర్శకు ఉలిక్కిపడి ఆ పూకాడను వదిలేసింది.  పూవు నుండి కొద్దిగా కిందకు జారి మళ్లీ పూ రేకలపైకి ఎగబాకుతున్న గొంగళి పురుగు.

ఒక్కసారిగా ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి.  ఒళ్ళు జలదరించింది.  శరీరంపై వెంట్రుకలు నిక్కబోడిచాయి.  ఆ దృశ్యం ఆమెలో అంతులేని బాధనూ, భయాన్నీ కలిగిస్తూ .. కళ్ళలోంచి నీరు ధారగా కారిపోతూ .. . నిశ్చేష్టలా సుమబాల.   కొద్ది క్షణాలాగి ‘నీ దోస్త్ కాస్..  కీస్..  కటీప్ .. ‘ ఎడమచేతి మొదటి రెండు వేళ్ళను  గుండ్రంగా చేసి కుడి చేతి చూపుడు వేలితో లాగుతూ అంది .

విశాలనే కొద్ది దూరం నుండి గమనిస్తున్నా.  చిరుగాలి మోసుకొచ్చిన ఆమె మాటలు నాకు అస్పష్టంగా , అర్ధం కాకుండా ..

               వారం రోజులుగా ఈ అమ్మాయిని పూల మధ్యలో చూడడం, ఆమె అనుభూతుల్ని , హావభావాల్ని,  దొంగచాటుగా, ఆమెకు ఇబ్బంది కలుగకుండా గమనిస్తూ ఆనందించడం నా వంతు అయింది.   నన్ను అయస్కాంతంలా ఆకర్షిస్తూ  . . ఆమె.   నాకెన్ని పనులున్నా,  పిల్లలు బడి నుండి వచ్చేసమయానికి నా కళ్ళు ఈ బుజ్జాయి కోసం ఎదురు చూస్తుంటాయి.  నా మనస్సు ఈ పాపాయి పలుకులు వినడం కోసం తహ  తహ లాడుతూ ఉండడం, ఆఫీసు కిటికీ లోంచి ఎదురు చూస్తూ ఉండడం నాకే వింతగా  గమ్మత్తుగా అనిపిస్తూ..

                     ఏమై ఉంటుందీ .. విశాల ఇంకా అలాగే భయం భయంగా చూస్తున్నట్లుగానే ఉంది .  నా ఉత్సుకతను ఆపుకోలేక నెమ్మదిగా ఆమెకేసి కదిలా .  ఆమె దగ్గరవుతుండగా మాటలు వినిపిస్తున్నాయి సన్నగా .  అలాగే మందార, నందివర్దనలు కలసిన గుబురు వెనక ఆగిపోయా.

                ‘ పచ్చి .. నీతో పచ్చి, కాస్  .. కీస్ .. కటిప్ ‘  అంటోంది ఏడుస్తూనే.  కొంచెం  ఆగి  ’ మీనా… , నా దోస్త్  మీనాని   ఇక ఎప్పటికీ నా దగ్గరికి రాకుండా , మాట్లాడకుండా చేశావ్ ’ వెక్కిళ్ళు పెడుతోంది. కళ్ళమ్మట నీళ్ళు  జల జల కారి పోతున్నాయి.   మనోహరమైన ఆ పాల బుగ్గలు ఎర్ర గులాబీతో పోటీ పడుతున్నాయి.  ’నిజమేనా.. మీనా చచ్చిపోయిందా .. ’ మొక్కలని చూస్తూ బేలగా అడిగింది .

                 గులాబీ మొగ్గపైకి మళ్లీ ఎగబాకిన పురుగు నెమ్మదిగా రేకల్ని తింటూ  .   ‘మొగ్గని పురుగు ముట్టుకుంటే ఆ మగ్గ పూవు అవ్వకుండానే చచ్చిపోతుందట కదా .. పుచ్చిపోతుందట కదా .. మీనా అట్లాగే చనిపోయిందట.  తన అమ్మ నాన్నలకి అట్లాటి పురుగేదో ఉంది కావచ్చు.  వాళ్ళు చచ్చిపోయారట రోగంతో.  అందుకే ఎవరో మీనా ని మా సమతానిలయం లో చేర్చారట.  తనకి వాళ్ళ అమ్మ, నాన్నలనుంచి ఆ జబ్బు వచ్చిందట’ తను విన్న మాటల్ని తనకు తెలిసిన విధంగా ఆ మొక్కలకు చెప్తోంది. నిజమే,  మీనా కొన్నాళ్ళ క్రితం HIV/AIDS తో చనిపాయింది.

                     కొన్ని క్షణాలు ఆగి, దీర్ఘంగా ఆ పురుగు కేసి చూసింది .విశాల   ’మీనా చచ్చి పోయింది.  కానీ మిమ్మల్ని నేను చచ్చిపోనివ్వను.’ కళ్ళు తుడుచుకుంటూ ఆకుల్ని ప్రేమగా, ఆప్యాయంగా నిమిరింది. కళ్ళతో అటూ ఇటు వెతికింది.  చిన్న కర్ర పుల్ల కనిపించగానే గబగబా వెళ్లి అ పుల్లని తెచ్చింది.  గులాబి మొగ్గకి పట్టిన పురుగుని లాగి కింద పడేసింది.  ఎప్పటి నుండి గమనిస్తోందో , ఎక్కడి నుండి వచ్చిందో ఓ పిట్ట పిల్ల వచ్చింది. చటుక్కున  ఆ పురుగును  ముక్కున కరచుకొని ఎగిరిపోయింది .

                 ’ఏయ్ పిట్టా .. ఆ పురుగు నిన్ను కరుస్తుంది .  జాగ్రత్త’  పెద్ద నాపసానిలా చెప్పింది.  కొద్దిగా ముందుకు కదిలింది.  మరో పిట్ట ఆకుపచ్చ పురుగును ఆకుపై నుండి పట్టుకుని ఎగరడం చూసింది.  ’ఏయ్ .. ఎందుకు దాన్ని పట్టుకుపోతున్నావ్ .. తింటావా .. తినెయ్ .. మా తోటలోని పురుగులన్నిటిని పట్టుకు తినెయ్ ,  మా పూవుల్ని మాత్రం ఏమి చెయ్యకు’ సలహా ఇస్తూ .. .  జాగ్రత్తలు చెబుతూ … ఆమె ప్రవర్తన నన్ను ఆకట్టుకుంటూ …

              ‘ ఏయ్ దొడ్డు పురుగూ .. గన్నేరు కొమ్మని తింటున్నావా .. అవి నాకు వద్దులే .. నువ్వు అందమైన సితాకోకచిలుక అవుతావంటగా .. అందుకే వదిలేస్తున్నా .  అవీ నా దోస్తులే కదా .. అంటే నువ్వూ నా దోస్తే కదూ .. కాని,  పూవులపై నిన్ను చూసానో అంతే .. ఆ .. అయి పోతావు.  అదిగో ఆ పిట్టలకు నిన్ను పట్టిచ్చేస్తా ‘ బెదిరించింది.  ఆ మరుసటి రోజు నుండి బడి నుండి రాగానే పూలను పలుకరించడంతో పాటు వాటిని జాగ్రత్తగా, సునిశితంగా పరిశీలిస్తోంది.  ఎక్కడైనా చీడ పీడలు ఉన్నాయేమోనని. కన్నా బిడ్డల్ని సాకుతున్నట్లుగా .. ఇంత చిన్న వయసులో ఎంత బాధ్యతగా వవ్యవహరిస్తోంది ఈ పసిది ..

ఓ రోజు ఉండబట్టలేక ఆ పాపను పిలిచా ‘ విశాలా .. ఏం చేస్తున్నావక్కడ? పూలను కోస్తున్నవా ? ‘ కావాలనే గదమాయించి అడిగా .

‘ఉహు , నేను తెంప లెదు. తెంపను’ తల అడ్డంగా ఊపి తొణక్కుండా బెణక్కుండా నా మొహం లోకే చూస్తూ

‘మరేం చేస్తున్నా’ దబాయించా

‘చెడ్డవాల్లకి దూరంగా ఉండమని మా టిచర్ చెప్పారు . నువ్వేమో ఎవరికి  కష్టం వచ్చినా సాయం చెయ్యమని చెప్పావు కదా!   అందుకని నేనే చెడ్డ వాటిని దూరం చేస్తున్నా, వాటికి సాయం చేస్తున్నా  ’ నా మొహంలోకి, కళ్ళలోకి లోతుగా చూస్తూ చెప్పింది .

                      కొద్ది క్షణాలు ఇద్దరి మధ్యా మౌనం .  చెట్లపై పిచ్చుకలు,చిలుకలు ఇంకా రకరకాల పక్షుల చప్పుళ్ళు ఆమె చేస్తున్న పనికి హర్షద్వానాల్లాగా.  దూరంగా పిల్లల మాటలు మా మౌనానికి భంగం కలిగిస్తూ .. సాయంత్రపు అల్పాహారానికి  పిలుస్తూ సమతానిలయపు గంట మోగుతోంది.  ఆ చిట్టి తల్లి నా మొహం లోకి సూటిగా, లోతుగా చూస్తూనే  ’ వీటికి అమ్మా నాన్నా లేరుగా  అందుకే  .. ఈ పూవుల్ని, మొక్కల్నినేను  చూసుకుంటున్నా’ విశాలమైన కళ్ళని మరింత విశాలంగా చేస్తూ, తిప్పుతూ భుజానికి ఉన్న బ్యాగ్ సవరించుకుంటూ అని మరో మాటకు తావివ్వకుండా తన నివాసం కేసి దారి తీసింది.   ప్రకృతి శోభనే కాదు అపురూపమవుతున్న మానవతా పరిమళాన్ని వెదజల్లుతూ…

                    విశాల పేరులాగే విశాలంగా ఉన్నతంగా…  మహోన్నతంగా  .. ఎదిగిపోతూ .  మాములుగా కన్పించే ఆ చిన్నదానిలో  మానవీయత ..ప్రకృతిని సంరక్షించడంలో ఎంత బాధ్యత ..  ప్రకృతి నియమాలు, మూగ జీవాల మనోవేదన ఈ చిన్నారికి అర్ధమైందా .. చుక్కలు పొదిగిన ఆకాశాన్ని , చినుకులు కురిసిన పుడమిని  ఆస్వాదించే  సమయం లేక పచ్చదనానికి, ప్రకృతికి దూరమవుతున్న నేటి  ప్రపంచంలో, మానవ హృదయాలు పాషాణంలా తయారవుతున్న తరుణంలో, ఆ దుష్ఫలితాలు  అనుభవిస్తున్న సమయంలో…  ప్రకృతిని అనుకరిస్తూ .. అనుభవిస్తూ .. ఆస్వాదిస్తూ ప్రకృతి మాత ఒడిలో ఆనందం పొందే ఈ పూబాలలో మానవీయత ఇంకి పోకుండా ఇలాగే ఎప్పటికీ ఉండిపోవాలి, ఎందరికో స్ఫూర్తి నివ్వాలి  అనుకుంటూ నేనూ కదిలా .

వి. శాంతి ప్రబోధ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– See more at: http://vihanga.com/?p=9780#sthash.oAMgdFED.dpuf

Tag Cloud

%d bloggers like this: