The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘వివక్ష’

తగలబెదతారట! అవును, తగులబెట్టాల్సిందే ..!

తగలబెడతారట !
ఊళ్లోకొస్తే తగలబెడతారట !!
కిరోసిన్ పోసి మరీ తగలబెడతారట !!!
నేనేం చేశానని ..? నేను చేసిన నేరమేమిటనీ.. ??

నాకు నచ్చిన వాడిని, నన్ను మెచ్చిన వాడిని
కులం, గోత్రం చూడకుండా ప్రేమించడమేనా ..?
అతడు నా చేయి అందుకుని
తోడై ,నీడై నిలుస్తానని అనడమేనా.. అదేనా ..?

అతన్ని చితగ్గొట్టి మాకు జరిమానా వేసి,
అది కట్టలేకపోతే, ఊళ్లో మగాళ్ళంతా నన్ను అనుభవించాలని
మీసం మెలేస్తూ హుకుం జారీ చేసిన పెద్దలు
కాదు కాదు గద్దలు, రాబందులు నన్ను తగులబెడతారట!

వావివరుసలు మరచి, మంచి చెడు
విచక్షణ విడచి ఆ రాత్రంతా నా దేహంతో ఎన్నిసార్లు
ఆటలాడుకున్నారో ..పోలీసులకు చెబితే చంపేస్తామని
ఆజ్ఞల హెచ్చరికలు జారీ చేసిన వాళ్ళు తగులబెడతారట!

వాళ్ళు కాదు మనం, అవును మనం
తగులబెట్టాల్సిందే, తప్పనిసరిగా తగులబెట్టాల్సిందే
వాళ్లకి మనమిచ్చిన అరాచక పెద్దరికాన్ని
విజ్ఞత మరచి బరితెగించినోళ్ళని తగులబెట్టాల్సిందే

నాగరిక సమాజం తలదించుకునే
కంగారూ కోర్టు ఆటవిక వికృత తీర్పుల్ని
ఇరుకు హృదయాల్ని, సంకుచిత తత్వాన్ని
అమానవీయ, కలుషిత ఆలోచనల్ని తగులబెట్టాల్సిందే

జేబులు గుల్ల చేస్తూ , మిమ్మల్ని నిర్విర్యుల్ని చేస్తూ
వేలం గెలిచి వీధి వీధినా వెలిసి, ఆదాయం పెంచుకుంటూ
నా స్వేచ్చని, నా శ్వాసని గద్దలా తన్నుకు పోయి
నా వలువల్ని నిలువునా కాల్చేసే వాళ్ళని తగుల బెట్టాల్సిందే

మద్యం మత్తుకు చిత్తై, మాదకద్రవ్యాలకు బానిసలై
సంరక్షించాల్సిన అన్న, నాన్న, తాతల వావివరుసలు మసై
నా ఎత్తుపల్లాలను కళ్ళతోనే కొలిచి, మాటువేసే
వేట చేసే మానవ మృగమదోన్మాదుల్ని తగులబెట్టాల్సిందే !

మతం ముసుగులో భక్తీ పేరుతో ఆకర్షించి వంచించే
దొంగ స్వామీజీలు, బాబాలు, ఫాస్టర్ల వికృత లైంగిక చేష్టలు
అదను చూసి అమాయక మహిళలపై, చిన్నారులపై
ఆకృత్యాలకు పాల్పడే కీచకుల్ని తగులబెట్టాల్సిందే !

అడ్డదారుల్లోనైనా కోరుకున్నది దక్కించుకు తీరాలనే
మనస్తత్వాన్ని, అది ప్రబలేలా చేస్తున్న వినిమయ సంస్కృతిని
మనుషుల్లో నియంత్రణ లేని మనో వికారాల్ని
ఏం చేసినా చెల్లుతుందనే ఇంగిత జ్ఞానహీనుల్ని తగులబెట్టాల్సిందే !

మగవాడి విచ్చలవిడి తనానికి, పశుప్రవృత్తికి కారణం
నేనూ .. నా వస్త్రధారణ అంటూ నాపైనే నిందవేసి
నా స్చేచ్చని లాక్కుని, బలవంతులమనుకుని తప్పించుకోజూసే
కామపిశాచుల విచ్చలవిడితనాన్ని, విధ్వంసక స్థితిని తగులబెట్టాల్సిందే !

టీనేజీ ప్రేమల సినిమాలు,అక్రమ సంబంధాల సీరియళ్ళు ,
అంగాంగ ప్రదర్శనలు, కండోముల ప్రకటనలు అనుమతులిస్తూ
సూక్తి ముక్తావళి వల్లెవేస్తూ , చిలక పలుకుల్లా హితవచనాలు
పలికే రెండు కళ్ళ సిద్దాంతాన్ని తగులబెట్టాల్సిందే !

స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం బూటకపు మాటలు వల్లిస్తూ
నన్ను అశ్లీలంగా చూపుతూ, అత్యాచారాలకు వేదికలవుతూ
విలువల వలువలు ఒలుస్తూ పెట్రేగిపోయే విష సంస్కృతిని
చట్టాలలోని గతుకు గుంతల్ని, కంపల్ని తగులబెట్టాల్సిందే !

ఏ కులంలో నైనా, ఏ మతంలో నైనా
కుటుంబంలో నైనా, కార్య ప్రదేశంలో నైనా
టివి, సినిమా , ఇంటర్ నెట్ , మొబైల్ ఎక్కడైనా
సమాజం నన్ను చూసే తీరులోని వ్యత్యాసాన్ని తగులబెట్టాల్సిందే !

మనిషి మనసులోతుల్లోని సున్నితత్వాన్ని
కులమతరహిత మానవ హృదయ వైశాల్యాన్ని
మధురప్రేమకుల మనోహర మానవతా పరిమళాల్ని
సమతమమతల సహజ స్వాభావిక జీవనతత్వాన్ని నిలబెట్టాల్సిందే

మనలోని అంతః సౌందర్యాన్ని
జాతుల భిన్నత్వంలో ఏకత్వాన్ని
మానవ విలువల సౌరభాల్ని
సమున్నత సామాజిక బంధాల్ని కాపాడాల్సిందే

నా మనోఫలకంపై చెరిగిపోని ఎన్ని దాడులో .. ఎన్ని మచ్చలో
నా బాధ, వ్యధ వ్యక్తి మీద కాదు, వ్యవస్థ మీద
నా పరువు పోతుందన్న భయాన్ని భగ్నం చేయకపోతే
అభయ .. నిర్భయ ఎన్ని చట్టాలు వచ్చినా నిరర్ధకమేనని తెలపాల్సిందే

ఉరిశిక్షల మరణ మృదంగాలు కావు తారక మంత్రాలు
అసమాన సమాజంలో ఉన్న అభద్రతా మూలాలు
మురిగి కంపుకొట్టే ఆలోచనల మురికి మకిలి వదిలించి చేతన రగిలించాల్సిందే
ధైర్యంగా ఫిర్యాదు చేయగలిగే అనుకూల వాతావరణం సృస్టించాల్సిందే

అణగి పోను, కుంగి పోను కూడదీసుకుని నిలబడుతూనే..
నా గొంతులో తడి ఆరేదాకా ఊపిరులూదుతూనే..
అంతర్వేదనల్ని తుడిచేస్తూనే.. విష వలయాల్ని ఎదుర్కుంటూనే ఉంటా
జీవధారల్ని చిమ్ముతూనే.. జనం గుండె చప్పుడు వినిపిస్తూనే ఉంటా

వి. శాంతిప్రబోధ

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కలాలను కవాతు చేయించి సమాజాన్ని కదిలించే అక్షర శరాలను సంధించే ప్రయత్నం రాజీవగారి సారధ్యంలో జరిగింది.
మార్చి 16 2014 తేదీన ‘ ధిక్కార ‘ పేరుతో సంకలనం వెలువడింది. ‘ధిక్కార’ లో చోటుచేసుకున్న కవిత ఇది.

Tag Cloud

%d bloggers like this: