The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘వివక్షత’

ఆడపిల్లల్ని బ్రతకనీయండి

నేటి మహిళ రాకెట్ స్పీడుతో రోదసికేసి దూసుకుపోతోందని, ఆర్దిక, సామాజిక, రాజకీయ- ఇది అది లేక అన్ని రంగాలలో ముందుకు వెళ్తోందని ఓ వైపు గర్వంగా చెప్పుకుంటున్నాం. అదంతా నాణేనికి ఒక వైపు. మరో వైపు చూస్తే..?, ఆమె బతికి ఉండగానే కాల్చి బుగ్గి చేసేస్తున్నాం . అమ్మ కడుపులో నవమాసాలు నిండి ఈ లోకం లోకి అడుగుపెట్టకుండానే అమానుషంగా చిదిమేస్తున్నాం. పితృస్వామ్య భావజాలం నరనరాల్లోనూ జీర్ణించుకున్న మనలో ఇంకా ఆడపిల్ల అంటే చిన్న చూపే . ఆమె పుట్టుకకు, ఎదుగుదలకు, అభివృద్దికి అన్నీ అవరోధాలే. ఆమె, అమ్మ కడుపులో ఉండగానే ఈ వివక్షతకు లోనవుతోంది. పుట్టేహక్కును కోల్పోతోంది. పుట్టినా జీవించే హక్కును కోల్పోతోంది. అందుకు కారణం ఎవరు? మనం ఎవరిని నిందించాలి? ప్రజలనా..? పాలకులనా..? మన విశ్వాసాలనా..? మత నమ్మకాలనా..? అమలు కాని చట్టాలనా..?

మనం ఏర్పాటు చేసుకున్న చట్టాలు అమలు కాకపోవడం, సంప్రదాయాలు – ఆచార వ్యవహారాలు పేరుతో సాగే ఆడ – మగ వ్యత్యాసాలు, మత నమ్మకాల్లోంచి వచ్చిన అనాచారాలు, అజ్ఞానం, ఆడపిల్ల అంటే ఉన్న చిన్న చూపు, ఆమె అంటే ఉన్న నిర్లక్ష్యం వల్లే ఆమె చేసే పనికి తక్కువ విలువ కట్టడం, ఆమెను కని ఎంతో ఖర్చు చేసి పెంచినా ఆమె బాధ్యత గతంలోలా తీరకపోవడం, పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్ళినా అక్కడ భద్రత లేకపోవడం వంటివన్నీ కారణాలే అని చెప్పుకోవచ్చు. కారణాలేవైనా కానీయండి ఆడపిల్ల పుట్టకముందే, లోకం పోకడ తెలియక ముందే తల్లి గర్భంలో ఉండగానే వివక్షతకు గురవుతోంది. అది ఆమె గిట్టే వరకూ కొనసాగుతూనే ఉంది.

ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఆడ శిశువుల కంటే మగశిశువులు తక్కువ. కానీ చైనాలోను, మనదేశంలోనూ ఆ పరిస్థ్తితి అందుకు భిన్నం. బ్రిటిష్ వారి పాలనలోనే మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితిని వారు గుర్తించారు. ఆ తర్వాత ప్రవీణ్ విసారియా, అశోక్ మిత్రా వంటి జనసంఖ్య శాస్త్ర పరిశోధకులు పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆడ-మగ నిష్పత్తిలో తేడాలని గమనించారు. జనాభా లెక్కలు ఈ విషయాన్ని ధృవపరిచాయి. ఎనభయ్యో దశకంలో ముంబై , డిల్లీ నగరాల్లో ఆమ్నియోసెంటిసిస్ పరీక్షలు లింగానిర్దారణకు, ఆడపిండాల గర్భవిచ్చిత్తికి దారితీయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన ఫలితంగా ‘గర్భస్థ పరీక్షా ప్రక్రియ -నియంత్రణ మరియు దురుపయోగ నివారణా చట్టం – 1994 (PNDT Act) వచ్చింది. ఈ చట్టం ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదు. మన భారత రాజ్యాంగం, UN Convention on rights of child రెండూ పుట్టే ప్రతి బిడ్డకూ బ్రతికే హక్కు (ఆర్టికల్ – 6) ఉందని చెప్తున్నాయి. మనకి హక్కులు, చట్టాలు ఉండగానే సరిపోతుందా …? వాటి అమలు మాటేమిటి ? వాటి పట్ల ప్రజలలో చైతన్యం తీసుకురావలసిన అవసరం లేదా ..?

మగవాడికి ప్రాధ్యాన్యతనివ్వడం ఎప్పుడు ఎలా మొదలయిందో తెలీదు కానీ, ఆడపిల్లని సామాజికంగా, సాంస్కృతికంగా అప్పుగా భావిస్తూ ఉండడం మనం దాదాపు ప్రతి ఇంటా చూస్తున్నదే. ఆడపిల్లకు జన్మనిచ్చి వేలూ, లక్షలూ ఖర్చు చేసే బదులు గర్భస్థ దశలోనే వెయ్యో రెండువేలో ఖర్చు చేసి వదిలించు కోవడం ఉత్తమం అనుకుంటున్నారు కొందరు. ఆ విధంగా కొన్ని ఆసుపత్రులూ ఒకప్పుడు ప్రకటనలు ఇచ్చేవి. తల్లిదండ్రులను ప్రేరేపించేవి. చట్టం వచ్చిన తర్వాత బహిరంగంగా అలాంటి ప్రకటనలు లేక పోయినా ఆడ శిశువులు మాయం అవడం మాత్రం ఆగిపోలేదు సరికదా నానాటికీ పెరిగిపోతూనే వుంది. ఇంట్లోనూ, సమాజంలోనూ ఆడపిల్ల ఆహారం, ఆరోగ్యం, విద్య, వైద్యం , సమాచారం, పని విభజన , స్వేచ్చ, భద్రత అన్ని విషయాల్లోనూ తీవ్ర వివక్షతకు లోనవుతోంది. ఆధునిక విజ్ఞాన తోడ్పాటు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. గర్భస్థ శిశువు శారీరక వైకల్యాలు, జన్యు పరమైన లోపాల్ని తెలుసుకోవడం కోసం కనుగొన్న ఆధునిక విషయ పరిజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆడపుట్టుకల నిరోధానికి ఉపయోగించుకోవడం మామూలై పోయింది. ఆమ్నియోసెంటిసిస్ పరీక్షలు, కొరియన్ విల్లియన్ బయాప్సీ, ఆల్ట్రా సోనోగ్రఫి, పుట్టబోయే శిశువును ఎంపిక చేసుకునే విధానంతో మన ముందుకు వచ్చాయి. అవన్నీ ఆడపిల్ల పుట్టుకను నిరోధించడంలో ప్రధాన భూమిక వహిస్తున్నాయి.

2001 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 933 మహిళలు ఉన్నారు. 1991 లెక్కలతో పోలిస్తే (927) కొద్దిగా అభివృద్ది కనిపిస్తుంది. అయితే 0-6 వయస్సు పిల్లల సెక్స్ రేషియో చూస్తే 1991 లో 945 బాలికలు ఉంటే, 2001 నాటికి అది 927కి దిగజారింది. 2011 నాటికి 914కి దిగజారింది. తల్లి గర్భంలోనే వివక్ష ఈ విధంగా ఉంటే తర్వాత పుట్టిన ఆడ శిశువును చంపివేయడం , తల్లిపాలు పట్టకపోవడం, జబ్బు చేస్తే నిర్లక్ష్యం చేయడం, సరైన ఆహారం అందివ్వక పోవడం కనిపిస్తాయి . ఆ తర్వాత వీటికి తోడు ఆమె అభివృద్దిని నిరోధిస్తూ బడికి పంపకపోవడం, చదువు అనవసరం అనడం, పనికి పంపడం , పోషకాహార లోపంతో బాధపడడం కనిపిస్తాయి. యుక్తవయస్సులో ఆడపిల్లలు ఎక్కువగా లైంగిక హింస, కుటుంబ హింసకు గురవ్వడం, ట్రాఫికింగ్, పెళ్లి-గర్భం, వరకట్నం, రక్తహినత, శారీరక మానసిక వేధింపులు , జీవన నైపుణ్యాలు లేకపోవడం, స్వేచ్చ కరువవడం, ఆత్మవిశ్వాసం కలిగించే పరిస్తితులు లేకపోవడం వంటి అనేక సమస్యలకు కారణం అవుతోంది వివక్షత.

ఒక మహిళగా కుటుంబంలో నిర్ణయాధికారం, ఆర్ధిక స్వేచ్చ, రక్షణ లేకపోవడం, తెల్సిన విషయాలు కుడా చెప్పనివ్వక పోవడం , ఏదీ చెప్పే అవకాశాలు లేకపోవడం , నైపుణ్యం లేకపోవడం, తన మీద తనకు నమ్మకం లేక పోవడం, ఆత్మన్యూనతా భావం , తనను తాను చిన్న చూపు చూడడం వాటి వాటికి వివక్ష కారణం అవుతోంది. అదే వయసు మళ్ళిన స్త్రీలైతే భావుకంగా , ఆర్ధికంగా, సామాజికంగా నిర్లక్ష్యానికి గురై ఒంటరితనంతో బాధపడడం అన్నీ ఆడపిల్లల పట్ల , ఆడవారిపట్ల చూపే వివక్షతా రూపాలే.

“సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గే కొద్దీ కొడుకు కావాలన్న కోరిక పెరగడమే కాక కూతురు వద్దనే అభిప్రాయం బలపడుతోంది. కనీసం ఒక కొడుకు , మహా అయితే ఒక కూతురు అనుకుంటున్నారని ,

మనందరం ప్రగతిశీల మార్పులుగా భావించే – స్త్రీల విద్య, పెళ్లి వయసు పెరగడం వంటి వన్నీ కుడా మనం ఊహించని విధంగా కూతుర్ల పెంపకానికయ్యే ఖర్చుని పెంచి, ఆమెని మరింత బరువుగా మారుస్తున్నాయి. ఈ దుష్ఫలితాల్ని అధిగమించాల్సి ఉంది ” అంటారు ప్రొఫెసర్ మేరి జాన్. ఆమె డిల్లీలోని సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీస్ (CWDS) డైరెక్టర్.

ఆడపిల్ల పుట్టుకను నిరోధిస్తే ఏమవుతుంది ?

తగ్గిపోతున్న ఆడపిల్లల పుట్టుక ప్రభావం సామాజిక , ఆర్ధిక, ఆరోగ్య అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల మహిళలపై లైంగిక నేరాలు , సాంఘిక నేరాలు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువ. అత్యాచారాలు , బాల్య వివాహాలు, అమ్మాయిల అమ్మకం , బలవంతంగా ఎత్తుకెళ్ళడం , బలవంతంగా ఒకరి కంటే ఎక్కువ మందికి భార్యగా ఉండవలసి రావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అంతే కాకుండా వ్యభిచారం , లైంగిక దాడులు పెరగడంతో పాటు లైంగిక వ్యాధులైన HIV/AIDS, STD లాంటి జబ్బులూ పెరగవచ్చు . స్త్రీ పురుష నిష్పత్తిలోని అసమతౌల్యం వల్ల మహిళల్లో మానసిక , శారీరక రుగ్మతలు ఏర్పడవచ్చు. శరీర ధర్మాల్లో క్రమం తప్పవచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. మళ్లీ మళ్లీ గర్భం రావడం తోను, కావలసిన బిడ్డ కోసం ఎదురు చూస్తూ జరిగే గర్భ విచ్చిత్తి వల్ల మహిళల్లో ఆరోగ్య సమస్యలు , చిక్కులు , తలెత్తవచ్చు. అధికరక్తస్రావం, గర్భసంచికి రంధ్రం పడడం, వదులు కావడంతో పాటు, అనస్తిషియా వల్ల వచ్చే రకరకాల చిక్కులు , దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని వైద్య్లులు హెచ్చరిస్తున్నారు.

ఏడవడం, భయం, హిస్టీరియా, నాడీవ్యవస్థ దెబ్బతినడం, కుంగిపోవడం, తనకు తాను తక్కువగా చూసుకోవడం, తన మీద తనకు నమ్మకంలేకపోవడం, తనను తాను శిక్షించుకోవడం, లైంగిక కోరికలు కలుగక పోవడం , కలత నిద్ర వంటి మానసిక గాయాలు అవవచ్చని సైకాలజిస్టులు చెప్తున్నారు. అంతే కాకుండా స్త్రీ లింగాన్ని అసహ్యించుకునే విధానం వల్ల గర్భ విచ్చిన్నం అయ్యే ప్రమాదం ఉందట. రక్తస్రావం , శ్వాస సంబంధ సమస్యలు, నిర్ణిత సమయానికంటే ముందే బిడ్డ పుట్టడం లేదా చనిపోవడం లేదా శాశ్వత వైకల్యం కలుగవచ్చని అంటున్నారు వైద్యులు.

ఆడపిల్లల రక్షణ – అందరి బాధ్యత

తరతరాలుగా వివక్షకు, అన్యాయానికి గురవుతున్న ఆడపిల్లల్ని రక్షించడానికి మనం చాలా గట్టి ప్రయత్నం చేయాలి. చట్టాల్ని ఖచ్చితంగా అమలు చేయడానికి తగు చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలి . అన్ని స్థాయిలలోనూ ప్రజల మైండ్ సెట్ ని మార్చడానికి ప్రయత్నం జరగాలి. ఆడ పిల్లల హక్కుల్ని కాపాడడానికి ప్రజల్లో చైతన్యం తేవాలి . ఆలోచన రేకెత్తించాలి . పురుషులకున్నంత విశాల ప్రపంచం , విస్తృత అవకాశాలు మహిళలకూ ఉన్నాయన్న భరోసా కలిగించాలి. అలా జరగాలి అంటే మనం ఏం చేయాలో ఆలోచిద్దాం

మన ఇంట్లో

మన ఇంట్లో మనం లింగ నిర్ధారణ పరీక్షల్ని చేయించకూడదు. గర్భంలో ఉన్నది ఆడ శిశువైనా, మగ శిశువైనా ఒకే విధంగా చూడాలి.
మన ఇంట్లో పెరుగుతున్న ఆడ-మగ పిల్లల్ని తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు వివక్ష లేకుండా ఎదిగేలా చూడాలి
ఆడవాళ్ళను కించపరిచే లేదా వివక్షకు గురిచేసే సామెతలు , పలుకుబడులు సరదాగా కూడా ఉపయోగించకూడదు.
ఆడపిల్లల సంపూర్ణ అభివృద్ధికి , రక్షణ , శ్రద్ధ , రక్షిత పరిసరాలు అవసరం అని కుటుంబం గుర్తించాలి.
గర్భస్రావం చేయించుకునే స్వేచ్చకు లింగ నిర్ధారణ పరిక్షలకు తేడా తెలుసుకుని మసులుకోవాలి
మన ఇంట్లో ఆడపిల్లలు చేసే పనికి, శ్రమకి తగిన గుర్తింపు నివ్వాలి
ఆడపిల్లల / మహిళల హక్కులు కాపాడడంలో పురుషుల పాత్రకూడా ఉందని కుటుంబం గమమనించాలి. అందరికీ తెలియచేయాలి.

ఆడపిల్లల సమస్యకు పరిష్కారం స్త్రీ – పురుషులు కలసి తెలుసుకోవాలి
గ్రామ స్థాయిలో

తల్లిదండ్రులు, స్వచ్చంద కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు , ప్రభుత్వ – ప్రభుత్వేతర అధికారులు సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం, విద్యావంతుల్ని చేయడం కోసం, ఆడపిల్ల పట్ల తమకున్న భావనల్ని , అపోహల్ని పోగోటడం కోసం కృషి చెయాలి. ఆడ, మగ ఎవరైనా ఇద్దరూ సమానమేనన్న సమదృష్టి అలవారుచుకునేలా కృషి చేయాలి.
ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు , గ్రామ కార్యకర్తలు, మహిళా సంఘాలు , యువజన సంఘాలు మొదలైన వారికి ఆడపిల్లల సమస్య పట్ల అవగాహన కలిగించి ఈ సమాచారం సమాజంలో ఇంకా ఎక్కువ మందికి తెలియజేసే విధంగా చేయొచ్చు .
మత పెద్దల ద్వారా ఆడ పిల్లల సమస్యల పట్ల అవగాహన కలిగించి , వివక్ష లేకుండా అందరికీ తెలియజేయడం
మూసపోసిన విధానాలకు స్వస్తి చెప్పి ఆడపిల్లని అన్ని రంగాలలో ప్రవేశించే దిశలో ప్రోత్సహించడం
ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య సంబంధాల్ని అభివృద్ది చేయడం, ప్రజాసంఘాలు / సంస్థలు చట్టాలు అమలయ్యేలా చూడడం
ఆడవాళ్ళు తమ అభిప్రాయాల్ని , భావనల్ని స్పష్టంగా చెప్పగలిగే విధంగా వారిని ప్రోత్సహించడం
ప్రభుత్వ స్థాయిలో

విధాన నిర్ణేతలు, కార్యక్రమ రూపకర్తల్లో చైతన్యం కల్గించడం
విధానాలు, చట్టాలను, కార్యక్రమాలను జెండర్ దృక్పధంతో చూసి పునఃపరిశీలించడం
ఆడ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే క్లినిక్ లపై గట్టి నిఘావేసి అలా జరగకుండా చూడడం
పుట్టిన ప్రతి శిశువు జననాన్ని వెంటనే రిజిస్టరు చేయడం
ఆడపిల్లల ప్రాధాన్యతని తెలిపే విధంగా కార్యక్రమాలు రూపొందించడం
ఆడవారికి మగవారితో సమాన వేతనం అందేలా చేయడం
వైద్య , విద్యా సదుపాయాల్ని విస్తృత పరచడం, ఆడపిల్లల విద్య పట్ల ప్రత్యెక శ్రద్ధ వహించడం అంటే తన తర్వాత పిల్లల్ని పట్టుకోవడం కోసం బడి మాన్పించాకుండా, పనికి వెళ్ళే తల్లులని దృష్టిలో ఉంచుకొని బాలల సంరక్షణా కేంద్రాలను ఏర్పరచడం
మహిళలకు ప్రత్యేక అవకాశాలు సృష్టించడం
మహిళలకు, యుక్తవయస్సులోకి వచ్చిన ఆడపిల్లల కోసం జెండర్ ఇక్వాలిటి పై కార్యక్రమాలు ఏర్పరచడం
విద్యా కార్యక్రమాల్లో, తరగతి పుస్తకాలలో అమ్మ వంట పని, నాన్న పేపర్ చూస్తున్నట్లు కాకుండా శ్రమను ఇద్దరూ కలిసి పంచుకోవడం, ఆడవారి పట్ల సానుకూల దృక్పధం అలవారచే విధంగా తయారు చేయడం
పాఠశాలలో టీచర్లు , ప్రిన్సిపాళ్లు కుడా జెండర్ దృక్పథంతో వ్యవహరించేలా చూడడం చేయాలి
ప్రచార ప్రసార సాధనాల బాధ్యత ఏమిటంటే :
లింగ వివక్షతను కలిగించే ప్రకటనలు ప్రచురించకూడదు. ప్రసారం చేయకూడదు.
ఆడపిల్లల పట్ల ఆశావాహ దృక్పధాన్ని పెంచడంలో అన్ని రకాల ప్రచార ప్రసార సాధనాలు అంటే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్, ఫోన్, సాంప్రదాయ కళా రూపాలు అన్నిటినీ ఉపయోగించుకోవడం
లింగ నిర్ధారణ పరీక్షల్ని చేసేవారిని, ఆడపిల్లల్ని చిన్నచూపు చూసేవారిని, వివక్ష కనపరిచే సంఘటనల్ని, వ్యాసాలూ, కేస్ స్టడీస్ రూపంలో రాయాలి .
చట్టాన్ని ఉల్లంఘించే వారిపై తీసుకునే చర్యల్ని ప్రముఖంగా ప్రజలలోకి తీసుకువెళ్ళాలి .
చట్టాల్ని అమలు పరచడంలో వచ్చే ఇబ్బందుల్ని బయటికి తీయాలి.
ఆడపిల్లల పట్ల వివక్షతను తొలగిస్తూ , ఆడపిల్లల పట్ల సమాజంలో ఆశావాహ దృక్పథం ఏర్పరచడంలో ప్రచార, ప్రసార సాధనాలు తమ వంతు సహకారం అందివ్వాలి.
రాచపుండు లాంటి వివక్షతని పారదోలాలంటే అన్ని స్థాయిలలోనూ జెండర్ అవగాహన కలిగిస్తూ, చట్టాలు అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిదీ.

Tag Cloud

%d bloggers like this: