The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘రైతు’

మట్టి బంధం

నా గుండె గూటి ఆవిర్లలోంచి మేఘం
హృదయంలో ముంచెత్తుతున్న వర్షం
బొట్లు బొట్లుగా .. ఎడతెగకుండా కురుస్తూ ..
నయగారా జలపాతంలా కనుకొనుకుల్లొంచి దుంకుతూ ..

ఆరుగాలం రక్తమోడ్చి పుడమికి హరితవర్ణం అద్ది
సిరులు పండించి స్వర్గ సీమను సృష్టించి
పులకించిపోయే అన్నదాతా..
నీదేనా ఆ ఆవేదన..?! ప్రకృతిమాత ప్రశ్న

అవునమ్మా .. అవును
అన్నదాతను, దేశానికి వెన్నెముకను నిన్నటివరకూ
ఊహకందని శత్రువు అస్తవ్యస్థ రూపంలో విసిరే సవాళ్లు
ఎదుర్కొనే శక్తి మరుగైపోతుంటే పసిడి పంటలు
పండించలేక, పండించకుండా ఉండనూలేక
గొంతునిండా గరళం నింపుకుని యుగళ గీతాలాలపిస్తున్నా నేడు

మట్టి బంధం తెంపుకోలేక అరకపట్టి సాలు దున్ని
విత్తు విత్తితే మొలక మొహం చాటేసింది
గొలుసులొచ్చిన కంకి కరుచుకుపోతూ వెక్కిరించింది
అప్పులో పుట్టి అప్పులో పెరిగిన నన్ను
మితిమీరిన ఉత్పత్తి ఖర్చు కలవరపరిచింది
సుడిగుండంలోంచి బయటపడే మార్గం తోచని
జీవన గమనంలోని కుదుపులతో అవిసిన నన్ను జూసి
మాసిన గుడ్డా మసకేసిన బతుకూ పగలబడి నవ్వింది
గుండె తబలా క్షీణించి చరిత్రలో భాగమైపోదాం రమ్మంది
ఆఖరి తీరం చేరువలో ప్రకృతి ఆడే ఆట ఆపడం నా తరమా ,,?

అన్నా ..ఓ రైతన్నా.. ఆగన్నా ..
నిన్నర్దిస్తున్నా .. నీవెత్తిన కాడి వదలకన్నా ..
ధరిత్రి మండుతోంది .. సలసలా కాగుతోంది
పృథ్వీ సుడులు తిరిగుతోంది సెగలు కక్కుతోంది
నిజమే , కారణం ఎవరన్నా ..?!
మీ సోదర మానవులేగా ..?!

చెట్టూ .. గుట్టా ..భూమీ .. నీరూ ..
నాదేనని విర్ర వీగి వసుధ యెదనిండా విషం నింపి
ఒళ్లంతా యంత్రాలతో చిద్రం చేసి
అపారగంగనే వశం చేసుకున్నామని భ్రమపడి
మీ నియంత్రణ లేని కదలకలే
అంతా తమది చేసుకోవాలన్న స్వార్ధ చింతనే
తమ నియంత్రణలో జరగాలన్న అహంకారమే
గుండెలు పిండే స్మృతి గీతం ఆలపించేది?!

నిన్ను నే కోరేదొకటే హాలికుడా ..
నీ నిరాశ నిస్పృహలు వదిలి ఆలోచించు
కుత్తుకలారిపోతూ నెర్రలువాసిన నేల సాళ్ళపై
నీ కన్నీటి ధారలే పన్నీటిలా చిలకరించు
మరుపు దొంతర్లలో దాగిన జీవ సంబంధిత ఎరువులు,
మందులు పుంఖాను పుంఖాలుగా కుమ్మరించు
ఉర్వికి దేహ పుష్టిని ఆర్ధిక సృష్టిని కలిగించు

నీలోనే ఉంది సమస్య – పరిష్కారం
విధివి నీవే, విధాతవు నీవేనని గమనించు
నిరాశా నిస్పృహలు వదిలించు
నీ మానవతా విలువలతో విపత్తు నివారించు
జీవన సారం సజీవంగా ప్రకాశింప జేయి
అనంతర తరాలకు సెలయేరై ప్రవహింపనీయి

వి . శాంతి ప్రబోధ

13.10. 2014

రైతు మట్టికి దూరమై బలవంతంగా మట్టిలో కలిసిపోతున్నాడు. అది ఒక విపత్తుగా భావించి అక్టోబర్ 13 అంతర్జాతీయ విపత్తు నివారణా దినోత్సవం సందర్భంగా రాసిన కవిత

Tag Cloud

%d bloggers like this: