The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘రేప్’

నేరం ఎవరిది ? మత్తుదా .. అతనిదా …

shanti 123 288ఎంత అన్యాయం ..? ఎంత అమానుషం ? అసలు ఇదేం తీర్పు ..? ఆమెపై జరిగింది రేప్ కాదట! విడ్డూరంగా లేదూ .. రేప్ చేసి చంపేసినా అది రేప్ కాదని ఆమెపై బలమైన అంటే ఫోర్సుఫుల్ సెక్స్ జరిగింది కానీ ఫోర్సుడ్ సెక్స్ కాదనీ తీర్పునివ్వడం ఎంతవరకూ సమంజసం ?! ఆ సమయంలో ఆమె మర్మాంగానికి అయిన గాయాలు మోనోపాజ్ లో ఉన్న 65 ఏళ్ళు పై బడిన మహిళ కాబట్టి అయ్యాయట .. ! వ్యక్తులు తమకున్న అధికారాన్ని ఉపయోగించుకుని సమాజాన్ని ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారో ఈ కేసు చూస్తే అర్ధమవుతుంది. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని న్యాయాన్ని ఎలా పీక కోస్తున్నారో .. అడ్డగోలుగా ఎలా విశ్లేషిస్తున్నారో అర్ధమవుతుంది. ఓ వైపు ఎన్నెన్నో త్యాగాలు చేసి, పోరాటాలు చేసి , ఉద్యమాలు చేసి సాధించుకున్న చట్టాల్ని పకడ్బందీగా అమలు చేయాలని మహిళా సంఘాలు గొంతెత్తి కోరుతుంటే తెలివి ఎక్కువైన వారు వాటికి తూట్లు పెట్టి అపహాస్యం చేస్తున్నారు.

ఇదే కేసు ఆసరాగా జరిగిందో లేదో తెలియదు కానీ , హైదరాబాదులోని ఇఫ్లూ విశ్వవిద్యాలయంలో ఓ అమ్మాయిపై రేప్ జరిగింది.

కేసు వివరాల్లోకి వెళ్తే …
శారద vs. అచేలాల్ రేప్ & మర్డర్ కేసు కి సంబంధించిన తీర్పు అక్టోబర్ 30, 2014 న వెలువరించింది డిల్లీ హైకోర్టు. ఈ కేసుకి న్యాయమూర్తులు ముక్తా గుప్త , ప్రదీప్ నందరాజోగ్ లు . నిందితుడిని నిర్దోషిగా చూపుతూ ఇచ్చిన తీర్పు ఇది.

డిసెంబర్ 31, 2010 శారద అనే 65 ఏళ్ళ ఇళ్ళలో పనిచేసి బతికే మహిళ రేప్ కి హత్యకి గురిఅయింది. తమ ఇంట్లో పనిచేసే మహిళా రావలసిన సమయానికి పనికి రాకపోవడంతో మనీషా అనే యువతీ ఆమెని తీసుకువేల్దామని వచ్చి శారదని పిలిస్తే పలకలేదు. తలుపులు తెరిచే ఉన్నాయి. లోనికి తొంగి చూసి స్తాణువైన ఆమె ఇరుగు పోరుగుకి , పోలీసులకు చెప్పింది. జనం పోగవుతుండడంతో మద్యం మత్తులో ఉన్న అచ్చేలాల్ (45) లోపలినుండి వచ్చి జనాన్ని లోపలికి అడుగు పెట్టనివ్వలేదు. అయినా తోసుకువెళ్తున్న జనానికి ఆమె తన తల్లి లాంటిదని, తను చంపలేదని మద్యం తీసుకుని నిద్రపోతోందని బుకాయించాడు. వివస్త్ర అయి ఉన్న ఆమె శవం దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా నేరస్థుడు అచేలాల్ అని నిర్ధారించుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
శారద చనిపోయిన ఆరు గంటలకి పోస్ట్ మార్టం జరిగింది. మర్మావయవంపై గాయాలున్నాయని రక్తస్రావం అయిందని, పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తోంది.
చనిపోయిన మహిళ మోనోపాజ్ దశలో 65-70 ఏళ్ల మధ్య ఉంది కాబట్టి లైంగిక కార్యం సమయంలో అక్కడి చర్మం సాగకపోవడం, రసాయనాలు ఊరకపోవడం వల్ల సెక్స్ లో ఇబ్బంది కలిగి గాయాలయ్యాయని కొత్త భాష్యం చెప్పారు న్యాయకోవిదులు. ఆమె అతనితో కలసి మద్యం సేవించి ఉందని, ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో అది జరిగిందని, ఆమె సెక్స్ నిరాకరించిన ఆనవాళ్ళు లేవని, మర్మాంగం తప్ప ఆమె శరీరంపై ఎక్కడా గాయం లేదనీ అచేలాల్ కావాలని ఆమెపై రేప్ చేయలేదని అందువల్ల దాన్ని రేప్ గా పరిగణించలేమని ఫోర్సుడ్ సెక్స్ గా భావిస్తున్నామని, అప్పుడు వత్తిడి గురైన ఆమె మరణించిందని తీర్పు ఇచ్చారు సదరు పెద్దలు.

ఆమె 65 ఏళ్ళు పై బడిన మహిళ కావడం వల్ల ఆమెపై జరిగిన దాడిని ఇంకో రకంగా ఎలా చెప్పగలుగుతున్నారు ..? ఆమె ఆరేళ్ళ పిల్లయినా అరవై పై బడిన స్త్రీ అయినా ఆమెపై జరిగినది రేప్ గానే పరిగణించాలి కదా .. తప్పును తప్పుగానే చూడాలి కదా ..? ఈ తీర్పు ఇంకా ఎన్ని అఘాయిత్యాలని కప్పిపుచ్చడానికి, నేరాలు చేయడానికి కారణం కానున్నదో ..? ఎంతమంది మహిళలు బలికానున్నారో ..

సరిగ్గా ఈ తీర్పు వెలువడ్డ మరుసటి రోజునే అంటే అక్టోబర్ 31న హైదరాబాదులోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (ఇఫ్లూ) విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. అదీ మత్తులో ఉన్నప్పుడు జరిగిన సంఘటనగానే చెప్తున్నారు. తనతో చదువుకునే విద్యార్థులు నలుగురు తనకు మత్తు పదార్థాలు ఇచ్చి రేప్ చేశారని ఆ అమ్మాయి కేసు పెట్టింది. వారిలో సోలసముద్రం నితిన్, కె. రాజ్ సింహ లను మాత్రం అదుపులోకి తీసుకున్నారు.

ఈ రెండు సంఘటనల్లోనూ నేరం అతనిది కాదు. మద్యందే మత్తుదే అనే భాష్యం చెప్తున్నారు. మొదటి సంఘటనలో ఆ రకమైన తీర్పు ఇచ్చేశారు. ఇక రెండో సంఘటనలో బరితెగించిన ఆడదిగా బాధితురాలిని చూపుతున్నారు. ఆమె మగపిల్లల రూంకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ? అంటూ ఆమెనే తప్పు పడుతున్నారు. ఈ సంఘటనలో ఉన్న మరో ఇద్దరి ఊసె లేకుండా వారికి కొమ్ముగాస్తూ ఆమె పైనే నింద వేస్తున్నారు అబ్బాయిల రూంకి వెళ్ళాల్సిన పని ఏమిటని ? వెళ్తే మాత్రం ఆమెపై అఘాయిత్యం చేయడమేనా ..?

తాగి చేసినా , తాగక చేసినా తప్పుని తప్పుగా ఎందుకు చెప్పడంలేదు ? ఎందుకు వక్రికరిస్తున్నారు ? తాగండి .. తాగి . ఆ మైకంలో మత్తులో మీరు ఎన్ని నేరాలు చేసినా .. మిమ్మల్ని కాపాడడానికి మేం ఉన్నాం అని నేరగాల్లకి భరోసా ఇస్తున్నట్లుగా లేదూ …?!

వివక్షతో కూడిన దుర్మార్గమైన తీర్పులను మహిళలంతా ముక్త కంటంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్ లో ఈ కేసులనే రెఫరెన్స్ ఇస్తూ మరిన్ని ఘోరాలూ .. నేరాలూ జరిగే ప్రమాదం ఏంటో ఉంది. వివక్ష నరనరాల్లోను జీర్ణించుకుపోయిన మన న్యాయవ్యవ్యస్థ, పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, విద్యావ్యవస్థ .. ఇది అది అని లేకుండా అందరికి జెండర్ స్పృహ అవసరం. ఆ విధమైన స్పృహ చిన్న తనం నుండే ఇంట్లోనూ, విద్యాలయల్లోనూ భాగం కావాలి. జెండర్ స్పృహ కలిగించే అంశాలు పాట్యప్రణాళికలో భాగం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జరుగుతున్న సంఘటనలని ప్రతిఘటించకపొతే మనం ఏళ్ల తరబడి పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్న చట్టాలు, హక్కులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

వి. శాంతి ప్రబోధ

(published in PRAJATHANTHRA weekly magazine 16-22 November, 2014)

Tag Cloud

%d bloggers like this: