The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘మానవత’

మానవతా వర్ధిల్లు

‘అయ్యో తాతా పడిపోయావా’ అంటూ పరుగు పరుగున వచ్చి లేపబోయాడు ఆ అబ్బాయి
ఆ ముసలతన్న్ని లేపడం కష్టంగా ఉందతనికి. ఎవరైనా సాయం వస్తారేమోనని చుట్టూ చూశాడు. రోడ్డుకు ఆవలి వేపు వున్న బస్ స్టాప్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కానీ ఎవరూ ఇటు చూడడం లేదు. మళ్లీ తాతను నిలబెట్టాలని ప్రయత్నించాడు. అతను నున్చోలేక తూలిపోతున్నాడు. ప్చ్ .. పాపం తాతకి తనలాగే ఎవరూ అన్నం పెట్టేవాళ్ళు లేరేమో అనుకున్నాడు ముసలోడుకదా అందుకే పడిపోతున్నాడు. తాత దగ్గర ఏదో వాసన . స్నానం చేసి ఎన్ని రోజులైయిందో అందుకే వాసన . స్నానం చేయడానికి ఇల్లు లేదేమో .. ఆ వాసనకి ఆ అబ్బాయి ఉదయం పంపు కింద దోసిట పట్టి తాగిన నీళ్ళు కడుపులో పేగుల్ని తిప్పేస్తూ .. బయటకు పంపడానికి సిద్దమవుతూ .. అట్లాగే తాతని చెట్టు నీడన చేర్చాడు.
‘అమ్మా ఓ ముద్దుంటే ఎయ్యన్దమ్మా .. ‘ రోడ్డవతల బస్టాప్ పక్కనున్న ఇంటి ముందు నుంచుని ఓ స్త్రీ అడుక్కుంటూ,
తను అట్లా అడుక్కుంటే .. ఒక్కక్షణం మనసులో కదలాడిన ఆలోచన.
‘దుక్కలాగున్నావు పని చేసుకు బతకోచ్చుగా… ఇళ్ళమీదపడి అడుక్కునే బదులు’ ఆ ఇల్లాలు కోపంగా
‘తాతా ఇప్పుడే వస్తా, ఇక్కడే ఉండు’ అంటూ ఆ చెట్టుకింద పడుకోబెట్టి పరుగెత్తాడు.
‘అమ్మా.. అమ్మా ‘ పిలిచాడు
‘ఈ అడుక్కునే వాళ్ళతో చచ్చిపోతున్నాం .. చిన్నా పెద్దా , ముసలి ముతకా అందరూ అడుక్కోవడమే ఈ పని సులభమై పోయింది. తేరగా పెడితే తిని తిరగడం బాగా అలవాటైపోయింది జనాలకి ‘ బిగ్గరగా తిడుతూనే, విసుగ్గా గడపలోకి తొంగి చూసింది ఆ ఇల్లాలు
‘నేను అడుక్కునే వాడిని కాదమ్మా ‘ చిన్న బుచ్చుకున్న మొహంతో
‘ఆ.. మరెందుకోచ్చావ్ ‘ చిరాగ్గా ఆమె అడుగు ఆ అబ్బాయికేసి వేస్తూ
‘అమ్మా నేనునడుక్కోవడానికి రాలేదు. ఏమన్నా పని ఇస్తారేమోననీ .. ‘ భయం భయంగా
‘నువ్వా! నువ్వేం పని చేస్తావ్? నిండా పదేళ్ళు లేవు ‘ విసుగు మాయం అవుతుండగా ఆశ్చర్యంతో
‘మీరేది చెప్తే అది చేస్తానమ్మా .. ఇందాక మీరు అడుక్కోనేవాళ్ళని పనిచేసుకొమ్మని తిట్టడం విన్నానమ్మ . అందుకే వచ్చా ‘ వినయంగా
‘ఒసే రమణీ .. వాడి మాయమాటలు నమ్మకే , పిల్లల్ని అడ్డం పెట్టుకుని దొంగాతనాలెక్కువయ్యాయి ‘ ముసలావిడ హితబోధ చేస్తూ
‘అమ్మా నేను అట్లాంటి వాడిని కాదు. నేనూ అడుక్కుంటే అని ఒక్క క్షణం ఆలోచించిన మాట నిజం. మీ మాటలే నన్ను ఆ పని చేయనీయలేదు. కష్టాన్ని నమ్ముకు బతాకలనేమానాన్న మాట కూడా గుర్తొచ్చింది ‘ వినమ్రంగా ఆ అబ్బాయి
‘మీ నాన్న పని చెయ్యడా ..? ‘ కుతూహలంగా ప్రశ్నించిదావిడ
‘అమ్మానాన్న , తమ్ముడు రోడ్డు ఆక్సిడెంట్ లో చనిపోయారు. చిన్నాన్న దగ్గర ఉండేవాణ్ణి. కానీ, చిన్నమ్మ పెట్టే బాధలకు ఇంట్లోంచి వచ్చేశా. నన్నంటే బాధ పడకపోదును. కానీ, చచ్చిపోయిన నా వాళ్ళను రోజూ తిడుతుంటే ఉండలేక పోయానమ్మా’ కళ్ళలో ఎగిసిపడే నీటిని, గొంతులో అడ్డుపడే బాధని అదిమిపెడుతూ చెప్పాడు
పాపం పసివాడు అన్నం తిన్నట్టు లేదు అనుకుంటూ తాము తినగా మిగిలిన అన్నం, కూరా ఉంటే ప్లేటులో పెట్టుకు వచ్చి తినమంది. వాడి కళ్ళలో మెరుపు ఆమె చూపును దాటిపోలేదు.
‘అమ్మా ఒక బాటిల్ ఉంటే ఇవ్వామ్మా’
అర్ధమయిన ఆవిడ నీళ్ళ సీసా ఇచ్చింది.
అందుకున్న వాడు పరుగుపరుగున రోడ్డు దాటేశాడు. పక్కన కుర్చుని తింటాడేమోననుకున్న ఆ ఇల్లాలు చూసేసరికి అక్కడ లేడు. అయ్యో నా ప్లేటు .. ఎంత నమ్మించాడు. ఏలెడు లేడు వెధవ. ఎన్ని అబద్దాలు చెప్పాడు. ఆ అబ్బాయి కోసం ఆమె కళ్ళు వెతుకుతూ నమ్మినందుకు తనను తాను తిట్టుకుంటూ గేటు దాటిందామె.
రోడ్డవతల ఉన్న పొగడచెట్టు కింద ఉన్న ముసలతని దగ్గరకెళ్ళి తాతా లే అంటూ లేపాడు. లేవలేదు. కాసిని నీళ్ళు చల్లాడు. నెమ్మదిగా లేచాడతను.
‘ఎవర్నువ్వు ‘ ఎగాదిగా చూస్తూ లేచి కూర్చున్నాడు
‘తర్వాత చెబుతాలే నేను లేకపోతే నువ్వు ఆ లారీ కింద ఉండేవాడివి. ఆకలేసిందా .. కాళ్ళు తిరిగి పడిపోయావా .. ‘అంటూ అన్నం కలిపి ప్లేటు అతని ముందు పెట్టాడు.
ఆ బిడ్డడి మొహం చూస్తుంటే తను తిని ఎన్నిరోజులయిందో అన్నట్టుంది. అయినా, కన్నబిడ్డలే కాదని ఇంట్లోంచి గెంటేసిన ఈ తాగుబోతు కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు అనుకుని నువ్వు తిను కొడకా అన్నాడా వృద్దుడు హృదయం భారమవుతుండగా ..
ఆ దృశ్యం చూసిన ఆమె మానవత్వమా వర్ధిల్లు అనుకుంటూ తృప్తిగా వెనుదిరిగింది.

నీవు తెలిపిన ఎరుకతోనే…

నీవు స్వప్నించిన
సమసమాజం
నీవే కాదు
మేమూ
చూడలేక పోవచ్చు

నీవు కలలు కన్న
అంతరాల అంతం
నీవే కాదు
మేమూ
కనలేక పోవచ్చు

నీవు కోరుకున్నట్లు
కుళ్ళు -కుత్సితాలు
నీవే కాదు
మేమూ
కడిగేయలేకపోవచ్చు

నాటికీ – నేటికీ
మానవతను
దానవత మింగేస్తూనే
తన కబంధ హస్తాలు
మరింత విస్తరిస్తూనే

నాడు – నేడు
నీవిచ్చిన జ్ఞానం తోనే
నీవు తెలిపిన ఎరుకలోనే
ఆ సున్నితత్వంతోనే
అడుగులో అడుగేస్తూ .. సాగుతూనే

మానవి – మరోని

నేను

క్యా.. ర్..క్యా ర్..మనగానే..

రోహిణీ కార్తె ఎండలో వడగాల్పుల సుడులలా

చీ ..మళ్లీ ఆడపిల్లేనా ..తాత ఈసడింపు

దాని మొహం నాకు చూపొద్దు  నాన్న హుంకరింపు

ఒక్క మగ నలుసునీ కనలేదు నాన్నమ్మ చిదరింపు

నేనింకా కళ్ళు తెరవనే లేదు

అమ్మ ఒడి వెచ్చదనం  పరిచయమే కాలేదు

పురిటి  రక్తపు మరకల్తోనే ..

గడప దాటించేసాడు  నాన్న

కంఠం తెగిన పక్షిలా . ..

విరిగిన కెరటాల్ల్లా   .. నేను

ఎదలో దాగిన తల్లి మనస్సు   వెల్లువై  ఉబికింది

నవమాసాలూమోసిన  మమకారం  కన్నిరై  పారింది

కానీ, తప్పుచేసిన  దానిలా మిన్నకుండిపోయింది

అరికాళ్ళకు చుట్టుకున్న ముళ్ళ తీగ తియలేని  అశక్తతకు కుమిలిపోయింది

శిథిల   వీణను మీటుతూ  ఓ  హృదయం ద్రవించింది

ఎవరైనా  పెంచుకుంటారేమోనని  వాకబు చేసింది

అంతా , ఆ.. ఆడపిల్లా.. మా కొద్దు అన్న మరుగుజ్జు వాళ్ళే..

అప్పుడు

ఏ చెత్త కుప్పలోనో .. మురికి గుంటలోనో ..

పడనియకుండా

ఏ కుక్కలకో..గద్దలకో..

ఆహారం కానీయకుండా

చిత్తకార్తెలో స్వాతి చినుకులా  ఓ కరుణామయి

ఆమె మరోని అమృతమయి 

కటిక పేదరాలే కాచ్చు

గుణ సంపన్నురాలు

నాగరికత తెలియక పోవచ్చు

కానీ మానవీయురాలు

పీలగా పిట్టలా ముది వయస్సులో ఉండొచ్చు

కానీ,  ముడుతల ఆ ముఖకవళికలు ఔన్నత్యపు ఆభరణాలు

బలమైన సామాజిక నేపథ్యం లేకపోవచ్చు

కాని, తెలుసు అనుభవాల లోతుపాతులు

మానవ  హక్కులేమిటో  తెలియక పోవచ్చు

కానీ, వెదజల్లుతుంది మానవత్వపు పరిమళాలు

తనకి తినడాని తిండి లేకపోయినా

ఆవు పాలు కొని నా ఆకలి తీర్చింది

పాలు పడక నేను ఏడుస్తుంటే

పగలనక రాత్రనక హాస్పిటల్ చుట్టూతిప్పింది

నానా హైరానా పడింది

పొత్తిళ్ళలో పెట్టుకుని తల్లి ప్రేమను పంచింది

తన ఒంట్లో  సత్తువ లేకున్నా .. కాయ కష్టం చేసింది

నా ఆలనా పాలనా చూసింది

కుటుంబం భూకంపాలు, సునామీలు  సృష్టి స్తోంటే

నాపై ద్వేషం లావాలా మంచితనాన్ని దహించి వేయాలనియత్నిస్తుంటే

నా కోసం వారిని వదులుకుంది

పేగు బంధం కాక పోయినా

కంటిపాపలా రక్షణ కవచమై నిలిచింది

విలువకట్టలేని లేని   వాత్సల్యం కురిపించింది

నాకొక   ఉనికినిచ్చింది

విద్యాబుద్దులు నేర్పింది

శ్రమైక జీవన సౌందర్యం తెలిపింది

నా బతుకులో పచ్చదనం నింపింది

ఆమె ఋణం ఎలా తీర్చుకోను ?

నేనెలా తీర్చుకోను ?

ఏమిచ్చి తీర్చు కోగలను ?

ఊపిరి లేని ఊహల్లో ఊసుల్లో

నింపు కోవడం తప్ప

తొలకరిజల్లుకి పులకరించిన

పుడమి తల్లి మట్టివాసనల్ని వెదజల్లడంతప్ప

వి. శాంతి ప్రబోధ

(వాస్తవ సంఘటన కి అక్షర  రూపం.  మరోని నిజామాబాదు జిల్లా వర్నిలోని ఒక తండా  నివాసి. దినసరి కూలి.  అరవై ఏళ్ళు ఉండవచ్చు.  ఆడపిల్ల అని ఎవరో వదిలించుకుంటే మానవత్వంతో పురిటి పసిగుడ్డుని తెచ్చి పెంచి పెద్ద చేసింది.  ఆ పాపకి చైతన్య అని పేరు పెట్టింది.  ఇప్పుడా అమ్మాయి ఆరవ తరగతి చదువుతోంది. ఈ పిల్ల విషయంలో తన స్వంత పిల్లలనుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోంది.  మనుమరాలి వయస్సున్న  ఆ పిల్ల భవిష్యత్ గురించి బెంగ పడుతోంది.

Tag Cloud

%d bloggers like this: