The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’

లాలించే చేతులు పాలించలేవా ..?!

లోక్‌సభ సమావేశాలు ముగిశాయి. ప్రతిష్టాత్మక మహిళా బిల్లులో కదలిక లేదు. అక్కడే చిక్కుకు పోయింది . 1990లోనే మహిళా బిల్లు తెరపైకి వచ్చింది . ఈ శీతాకాల సమావేశాల్లో మహిళా బిల్లును అజెండాలో చేర్చారు. UPA ప్రభుత్వం ఎలాగైనా మహిళా బిల్లు ఆమోదం పొందాలనే కృతనిశ్చయంతో ఉందని వార్తలొచ్చాయి. కానీ ఆ విషయం పట్టించుకున్న నాధుడే లేడు. బడ్జెట్ సమావేశాలూ ముగిశాయి. అంటే, అంతా .. షరా మామూలే .. ఎప్పటిలానే .. అప్పటి నుండి ఇప్పటి వరకూ అన్నీ అడ్డంకులే .. అవరోధాలే ..

దాదాపు అన్ని పార్టీలు పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను కేటాయిస్తామని గొంతు చించుకు అరుస్తున్నా మహిళా బిల్లు మాత్రం ఇంత వరకు మోక్షం పొందలేదు. ఓటర్లలో సగంగా ఉన్న మహిళ మరి ఆ ఓట్లు ఎందుకు పొందడం లేదు? మహిళా ఓట్లతో అందలం ఎక్కే పెద్ద మనుషులు, రాజకీయ పార్టీలు మహిళలను ఎందుకు విస్మరిస్తున్నారు? ఎన్నికల్లో మహిళా పార్లమెంటు సభ్యుల సంఖ్యా పెరగడం లేదు. ఎందుకని?

వంద రోజుల్లో మహిళాబిల్లును సాధిస్తామని చెప్పిన రాష్ట్రపతి వ్యాఖ్యలను ఖండించిన శరద్ యాదవ్, ఆ బిల్లును గనుక ఆమోదిస్తే తాను అక్కడే విషం తాగుతానని బెదిరించాడు. విషం వెళ్ళగక్కాడు. అందరినీ నివ్వెర పరిచాడు. మహిళా బిల్లుగాని ఆమోదం పొందితే దేశంలో అంతర్యుద్దం చెలరేగుతుందని ఆర్జేడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాది పార్టీ అధినేత ములాయుంసింగ్ హెఛ్చరించారు. అంటే మహిళా బిల్లు పట్ల, అంటే మహిళలు రాజకీయాల్లోకి రావడానికి పురుషులు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్ధం అవుతోంది. మార్చి 12, 1996లోనే మొదటి సారి లోక్ సభలో ప్రవేశించిన ఈ బిల్లు రాజకీయ ఏకాభిప్రాయం లేక ఆమోదానికి నోచుకోక అలా నేతల నోళ్ళలో నేటికీ నానుతూనే … ఉంది.

మహాభారత కాలంలోకి వెళ్తే ఆనాటి రాజుల భార్యలకు యద్ద విద్యల గురించి, ధర్మాధర్మాలగురించి అవగాహన ఉన్నట్లు తెలుస్తుంది. ఝాన్సీ రాణి, రుద్రమదేవి గురించీ మనం చదువుకున్నాం. వారి ధైర్య సాహసాల్ని, యుద్ద నీతిని, పరిపాలనా దక్షతనీ ఇప్పటికీ కీర్తిస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు, మనముందున్న మహిళల శక్తిని గుర్తించలేని గుడ్డి వాళ్ళుగా, వారి తెలివితేటల్ని అభివృద్ది కోసం ఉపయోగించుకోలేని దౌర్భాగ్యులుగా మిగిలాం. వారికి అవకాశాలు వస్తే, వారు వాటిని వినియోగించుకుంటే తమకన్నా ఎక్కడ మించి పోతారో.. తాము ఎక్కడ తక్కువ అయిపోతామో అని మహిళలని గౌరవించలేని, సమంగా చూడలేని కుత్సితులుగా తయారయ్యాం. అందుకే ఆ బిల్లు ఆమోదం పొందకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు, కుయుక్తులు .. కుతంత్రాలు .. కాకమ్మ కథలూ ..

1994లో మొదటిసారిగా బీజేపీ మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలనే తీర్మానాన్ని చేసింది.1996, 1998,1999లలో అప్పటి ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనేకసార్లు ప్రయత్నించినప్పటికి యాదవత్రయం తో పాటు, పాశ్వాన్ కలవడం వల్ల చట్టరూపం తీసుకోలేకపోయింది.

2000లో అప్పటి కేంద్ర మంత్రి శివరాజ్‌పాటిల్ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ల గురించి అధ్యయనం చేయడానికి కేబినేట్ కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ లోక్‌సభ సభ్యుల సంఖ్యను 33 శాతం పెంచి, అందులో 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వేషన్ చేయవచ్చని సూచించింది. ఈ సూచనలను లాలూ, ములాయం ఆమోదించినప్పటికీ ఎన్డీఏ దాని మిత్రపక్షాలు వ్యతిరేకించాయి. ఆ సూచన ఆమోదించినట్టయితే, లోక్‌సభ సభ్యుల సంఖ్య 830 వరకు పెరిగి,మహిళలకు 276 స్థానాలు దక్కేవి. రాజకీయాలలో మహిళలకు సమానత్వాన్ని సాధించడం కోసం యూపీఏ ప్రభుత్వం 2008లో 108వ రాజ్యాంగ సవరణ చేసి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ, ప్రతిపక్ష పార్టీ బిజెపి సహకరిస్తున్నప్పటికీ పార్లమెంటు ఆమోదించకపోవడానికి అనేక రాజకీయ కోణాలు, కారణాలున్నాయి. దళితులు, ఒబిసిలు, మైనారిటీలు రిజర్వేషన్ ఫలాలను అందుకోలేరని అగ్రకుల మహిళలే తన్నుకు పోతారని వ్యతిరేకిస్తున్న వారి వాదన. అది ఆయా వర్గాల మహిళలపై ప్రేమతోనో, అభిమానంతోనో కాదు ఎలాగైనా బిల్లును అడ్డుకోవడమే వారి లక్ష్యం.

2010లోనే రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా బిల్లు లోక్ సభలో ఇన్ని సార్లు ప్రవేశ పెట్టినా ఆమోదం పొందలేక పోవడానికి కారణం ఎవరు? పితృస్వామిక భావజాలం నరనరాల్లోను జీర్ణించుకుపోయిన కరడుకట్టిన దురహంకారులు కాదూ…?! ఆడపెత్తనం బోడిపెత్తనం వాళ్ళ మాట మేము వినాలా అనే ఆధిపత్య భావన కాదూ..?! దళితులు, ఒబిసిలు, మైనారిటిల మహిళల సాధికారిత, అభివృద్ధి కావాలంటే, చిత్తశుద్ది ఉంటే బిల్లును అడ్డుకోవడం కాదు కదా చేయాల్సింది. ఆయా వర్గాలకి జనాభా దామాషాలో వారికి సీట్లు కేటాయించవచ్చు కదా ..!

ఆకాశంలో సగం – అవనిలో సగం ఉన్న మహిళల ఓట్లు కావాలి. వాటితో గెలిచి అందలమెక్కాలి. కానీ ఆ మహిళలకే చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలంటే మాత్రం మనసు ఒప్పుకోదు. మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో అలా ఎందుకు ఉండడం లేదు? రాజ్యసభలో 10.60 శాతం , లోక్‌సభలో 11 శాతం, మంత్రుల స్థాయిలో 9.8 శాతం మాత్రమే ఉందంటే అందుకు కారణం ఎవరు? చట్ట సభలలో మహిళలకు సమ భాగస్వామ్యం లేకపోవడం వల్లే కదా!?.. ఆమెకు సంబంధించిన బిల్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది.

పంచాయితీ రాజ్ వ్యవస్థలో 33 శాతం రిజర్వేషన్ వల్ల కింది స్థాయిలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. “ఆమె” పేరుతో “అతను” అధికారం చెలాయించే సంఘటనలు ఉన్నప్పటికీ రాజకీయాల్లో పెరిగిన ఆమె చొరవ, అవగాహన, తన కర్తవ్యం తను సక్రమంగా నిర్వహించాలన్న తపన ఉన్న మహిళలకి కొదువలేదు. అసెంబ్లీ , పార్లమెంటుల్లో తన గొంతు గట్టిగా వినిపించి, సమస్యలను విశ్లేషించి, చట్టాల రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషించగల సత్తా ఉన్న మహిళలకూ కొదువలేదు. అయినా చట్టసభలలో ఆశించిన స్థాయిలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం లేదు. ప్రస్తుతం ఉన్న వారిలోనూ ఎక్కువమంది రాజకీయాలలో ఉన్న తమ భర్త, తండ్రి, లేకపోతే మరో బంధువో చనిపోతే ఆ స్థానంలో వచ్చినవారే ఎక్కువ.
కారణాలు ఏమిటని విశ్లేషించుకుంటే :

కుటుంబ బంధాలు :
సమాజంలో, రాజకీయాల్లో ఉండే మహిళల పట్ల ఉన్న చులకన భావం, చిన్న చూపు కూడా మహిళలు రాజకీయాలకు దూరంగా ఉండడానికి ఒక కారణం. రాజకీయాల్లో ఉన్న మహిళ ఇంటి బయటి ప్రపంచంలోకి, జనంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. పురుషుడిలో ఉండే అభద్రతా భావం, తను స్త్రీని చూసే దృష్టికోణం వల్ల తన కుటుంబంలోని మహిళ నాలుగ్గోడల బయటికి రావడానికి ఇష్టపడడు. ఒకవేళ ఆమె వచ్చినా , కుటుంబ జీవితంలో, బంధాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండడం కోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది.

డబ్బు:
నేడు అన్నిరంగాల్లోను డబ్బు చక్రం తిప్పుతున్నట్లే రాజకీయాల్లోనూ డబ్బు పాత్ర ప్రదానమయింది. నేడు రాజకీయాల్లోకి రావాలంటే వారి ఆర్ధిక పరిస్థితి ప్రధాన అర్హత అయింది. మరి ఆస్తి పాస్తులున్న మహిళలు ఎందరు? ఒకవేళ ఆమె పేరున ఆస్తి ఉన్నా దానిపై అధికారం ఆమెకు ఉందా? మహిళలు రాజకీయాల్లోకి రావాలని పెదాలపై మాటలు అంటారు. హృదయ లోతుల్లోంచి ఆ మాటలు రావు. కారణం ఆమె కోసం డబ్బు ఖర్చు చెయ్యాలి కదా..? డబ్బులేని వారిని అసలు ప్రోత్సహించరు

ముఠాతత్వం-గుండాగిరీ లేనందున:
మహిళలు ముటాలు కట్టి రాజకీయాలు చేయరు ముక్కుసూటిగా పని చేసుకు పోతారు. గుండాయిజం చేయరు. అది కూడా ఆమెకు అనర్హతే.

జెండర్ :
ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే తమ సీట్లు గల్లంతు అవుతాయన్న భయం. అమెది పై చేయి అవుతుందన్న భావన. తమపై ఆమె అధికారం చెలాయిండం భరించలేని తనం . అందుకే మహిళాబిల్లు ఆమోదం పొందకుండా కుంటి సాకులతో కాలక్షేపం చేస్తున్నారు.

కులం:
ఆర్జెడి , సమాజ్ వాది పార్టీలు బి సి లకు ప్రత్యేక రిజర్వేషన్ కోసం పట్టు బడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకి కూడా కులం ఒక అర్హతగా మారిపోయింది. ఆధిపత్య కులాల పెత్తనం పెరిగిపోయింది. కింది స్థాయిలో మహిళలకి కేటాయించిన స్థానాల్లో దళిత మహిళ అధికారం చెలాయించిన చోట ఆధిపత్య కులాల పురుషులు చెలాయించడం చాలా చోట్ల కనిపిస్తూనే ఉంది.

సామాజిక కారణాలు :
సమాజంలో మహిళలని ఇంకా రెండవ తరగతి పౌరులుగానే చూడడం. ఆమెను ఇంటికే పరిమితం చేయాలని పురుషులు భావించడం. మూడింట రెండువంతుల పని చేస్తున్న ఆమె అధికారం పంచుకుంటే .. తనకి పనిభారం పెరుగుతుందన్న భయం. స్త్రీలకు అంతటి తెలివి తేటలు, శక్తి యుక్తులు లేవని భావించడం. లాలించే చేతులు పాలించగలవా . అన్న సందేహం . ఆడవాళ్ళకు రాజకీయాలెందుకు .. మగవాళ్ల మతులు పోగొట్టదానికా మాజీ మంత్రి ఉవాచ . వంశంకురాన్ని ఇచ్చే యంత్రంగాను , మగవాల్లని రెచ్చగొట్టి మనిషిగాను చూడడం దీన్ని మనం ఎలా అర్ధం చేసుకోవాలి? ఆడవాళ్ళకి మగవాళ్ళ మతులు పోగొట్టడం తప్ప ఏమి తెలియదా .. ? లేక మగవాళ్ళకి ఆడవాళ్ళ అందచందాలను చూడడం తప్ప వేరే పనేమీ లేదా .. ? ఆడవాళ్ళోచ్చి రాజ్యమేలితే మేమేం చెయ్యాలి మా నిరుద్యోగం పెంచడం తప్ప అని ఇంకొకరి ఆక్రోశం.

ఆమెకు సామాజిక పరమైన హక్కులు అందుబాటులోకి రాకపోవడం:
ఈ బిల్లు నెగ్గాలంటే పార్లమెంటులో అధిక స్థానంలో ఉన్న పురుషులు మద్దతు తప్పని సరి. కానీ వారు అనుకూలంగా లేరే .. నేటి సమాజంలో మహిళలను కుటుంబం, సమాజం కట్టడి చేస్తోంది .. ఆమె ఇంట్లోంచి బయటి సమాజంలోకి రావడానికి ఎన్నో ఆంక్షలు .. కట్టుబాట్లు .. వాటిని చేదించుకుని ఎదురీదడానికి ఒక్కో అడుగు వేయడానికి ఇప్పుడిప్పుడే సన్నద్ధం అవుతోంది. జాగృతం అవుతున్న ఆమెను వెనుకకు లాగే శక్తులకు కొదువలేదు.

నిర్ణయాధికారం లేకపోవడం:
మనసమాజంలో, కుటుంబంలో మహిళలకు నిర్ణయాధికారం లేకపోవడం కూడా స్త్రీలు రాజకీయాల్లో తక్కువ ఉండడానికి ఒక కారణం. ఆమెకు స్వతహాగా ఆసక్తి ఉన్నా కుటుంబంలో ఆమె రాజకీయాల్లో అడుగు పెట్టడం ఇష్టం లేక పోవడం, ఆమెను నియంత్రించడం అనేవీ కారణాలే.

రాజకీయ పార్టీలకు నిబద్దత లేకపోవడం
ఏ రాజకీయ పార్టికి నిబద్దత లేకపోవడం. తమ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళకు 33 శాతం రిజర్వు చేస్తామని చెప్పినప్పటికీ ఆ దిశగా అడుగు వేయక పోవడం. ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లోనే కాదు పార్టీ పదవుల్లోనూ మహిళలకి సరి అయిన ప్రాతినిధ్యం ఇవ్వక పోవడం. పోలిట్ బ్యూరో లోనూ , కోర్ కమిటీ ల్లోనూ మహిళల స్థానం ఎంత? కీలక బాధ్యతలు వహించేది ఎంత మంది ? సమన్యాయం , సామాజిక న్యాయం అన్న పదాలు చెప్పుకోవడానికే కానీ ఆచరణకు కాకపోవడం.

వారసత్వం:
ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన వారూ కొన్ని సార్లు వెనక్కి వెళ్లి పోవడం. తమ స్థానాన్ని పదిల పరుచుకోవడానికి యత్నించక పోవడం . స్వతహాగా రాజకీయాల పట్ల ఆసక్తి చూపక పోవడం.

చరిత్రలోకి వెళ్తే ఎంతో మంది మహిళలు దేశ రాజకీయాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముద్ర వేసుకున్నారు, రాణించారు. లాలించే చేతులు పాలించగలవని నిరుపించుకున్నారు. ఉదాహరణకి ఇందిరాగాంధీని తీసుకుందాం. బంగ్లాదేశ్ విమోచన యుద్ద సమయంలో ఆమె వ్యవహరించిన తీరును, ధైర్య సాహసాల్ని ఆనాటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పాయి మెచ్చుకున్నారంటే అది పాలకురాలుగా ఆమె దక్షతకు నిదర్శనం .

ముఖ్య మంత్రులుగా జయలలిత, మమత బెనర్జీ, మాయావతి, రబ్రీదేవి గుర్తింపు తెచ్చుకున్నారు. వారు ముఖ్యమంత్రులు కావడానికి కారణాలేమైనా ఇక్కడ మనం చూడాల్సింది వారి పాలన చాతుర్యం , దక్షత గురించి.

అసలు మహిళా రిజర్వేషన్ ఎందుకు?
చారిత్రాత్మకంగా చూస్తే చట్టసభల్లో స్త్రీల ప్రాతినిధ్యం కల్పించడానికి రిజర్వేషన్లు అవసరమని రాజ్యాంగ నిర్మాణ సమయంలోనే ప్రస్తావనకు వచ్చింది. ఆ సందర్భంలో కొందరు మహిళా ప్రతినిధులు రిజర్వేషన్ పద్దతిని వ్యతిరేకించారు. 1974లో కేంద్ర ప్రభుత్వం దేశంలో మహిళల స్థితిగతులను తెలుసుకోవడానికి నియమించిన కమిటీ (ది కమిటీ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా) తన రిపోర్టులో స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని,అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా 15 శాతం మహిళలకు కేటాయించాలని సూచించింది. ఈ నేపథ్యంలో 1992లో పార్లమెంటు 73,74 రాజ్యాంగ సవరణలను ఆమోదించింది.స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ కల్పించింది.

రాజకీయాలు, ప్రజాస్వామ్యం మంచిగా ముందుకు సాగాలంటే రిజర్వేషన్ అవసరం. మహిళలను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడం అవసరం. భూమి హక్కు, వ్యవసాయంలో భాగస్వామ్యం, ఆరోగ్య సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు, సమాన పనికి సమాన వేతనం, మహిళల భద్రత, ఉపాధి వంటి ఎన్నో మహిళలకు సంబంధించిన అంశాలు, వాటికి పరిష్కారాలు జరగడానికి మహిళా బిల్లు అవసరమని మహిళా సంఘాలు, వివిధ పార్టీలకు అనుబంధంగా ఉన్న సంఘాలు కోరుతున్నాయి. పోరాటాలు చేస్తున్నాయి.

నేడు మహిళలు కాలు పెట్టని రంగం ఉందా!? సామాజిక మార్పులు తేవాలన్నా, రాజకీయ ఉద్యమాలు రేకేత్తించాలన్నా వారే ముందుంటున్నారు. కానీ, చట్టసభల్లో సమ భాగస్వామ్యం, అభివృద్ధిలో సమ భాగస్వామ్యం, నిర్ణయాల్లో సమ భాగస్వామ్యం కావాలన్న తమ హక్కుని మాత్రం ఇంకా పొందలేక పోతున్నారు.

దేశంలోనే స్థానిక సంస్థల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ మొదట అందించిన ఘనత N.T. రామారావుదే. ఈ రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. వారసత్వంగా వచ్చిన వారు, వీరి పేరున కుటుంబంలోని పురుష సభ్యులు రాజ్యమేలుతున్న సంఘటనలు లేకపోలేదు. అలాగని, మహిళల ప్రాతినిధ్యాన్ని తక్కువ చేయలేం. చిన్న చూపు చూడలేం. స్థానిక సంస్థల్లో మహిళకు 50శాతం కేటాయించడాన్ని స్వాగతించాల్సిన విషయమని మన దేశంలో పర్యటించిన అమెరికా ప్రతినిధి రిట్టా లూయిస్ వాషింగ్టన్ లో ఓ పత్రికాసమావేశంలో అన్నారు.

అతి పెద్ద ప్రజాస్వామిక దేశం మనది. నిరంతరం సంఘర్షణలతో సతమతమయ్యే చిన్న దేశం , పేద దేశం రువాండా. అక్కడ చట్ట సభల్లో 50 శాతం మహిళలకి కేటాయించారు. మన దేశం కంటే చాలా చిన్న దేశాలు వెనుకబడిన దేశాలైన అంగోలా, మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, నమీబియా, బంగ్లాదేశ్, అర్జంటినా, హైతి వంటి దేశాలలోనూ మహిళలు రాజకీయంగా విశేషంగా రాణిస్తున్నారు. దేశాధినేతలుగా ఎదుగుతున్నారు. చట్టసభల్లో అధికంగా ఎన్నికవుతున్నారు. సమాన అవకాశాల కోసం, సమాన హక్కుల కోసం పోరాడుతున్నారు. మహిళల పై జరిగే అన్యాయాలని నిలదీస్తున్నారు. చట్టసభల్లో తం గొంతు వినిపిస్తున్నారు. యురోపియన్ దేశాలకు ఏమాత్రం తీసిపోకుండా మహిళల్లో రాజకీయ చైతన్యం కనిపిస్తోందని ఐక్య రాజ్య సమితి మహిళా సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో తెలిపింది.

యూఎన్‌డీపీ వారి మానవాభివృద్ధి సూచికలో మంచి స్థానాలలో ఉన్న దేశాలు కూడా పార్లమెంటులో మహిళలకు పెద్దపీటనే వేశాయి. ఉదాహరణకు నార్వే, ఆస్ర్టేలియా, ఐస్‌ల్యాండ్‌, స్వీడన్‌, నెదర్లాండ్స్‌ లాంటి దేశాలలో 30 శాతానికిపైగా పార్లమెంటు స్థానాలలో మహిళలే ఉన్నారు. ఈ దేశాలు మానవాభివృద్ధి సూచిలో మొదటి పది స్థానాల్లో ఉండడం ఇక్కడ మనం గమనించాలి.

రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెంచడానికి కార్యక్రమాలు:
రాజకీయాల్లో ఆసక్తి ఉన్న మహిళల కోసం కర్ణాటకలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ (IIM) ఒక విన్నూత్న కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో ఉన్న నాయకత్వ లక్షణాలను, నైపుణ్యాలను , శక్తి సామర్ధ్యాలను పెంపొందించడం వారి లక్ష్యం. ఈ కార్యక్రమంలో విధానపరమైన విజ్ఞానం, రాజకీయ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం , జెండర్ వంటి విషయాలతో ఉన్న 10వారాల కార్యక్రమం ఇది .

ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రూపొందిస్తే మహిళలను రాజకీయ వేత్తలుగా వృత్తి నైపుణ్యం సంపాదిస్తారు. విలువలతో కూడిన దృష్టి కోణాన్ని పెంచుకుంటూ రాణిస్తారు. మార్పుకు దోహదం చేస్తారు. అగ్రభాగాన నిలిచే రాజకీయ వేత్తలుగా ఎదుగుతారు. తమ దారిలో ఎదురయ్యే అడ్డంకుల్ని , అవరోధాల్ని ఎదుర్కొనే, అధిగమించే ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించుకుంటారు. సాధికారికత దిశగా పయనిస్తారు.

చట్ట సభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో రిజర్వేషన్లు చాలా కీలకపాత్ర పోషిస్తాయి.పార్టీ స్థాయిలో రిజర్వేషన్ వల్ల అభ్యర్థిత్వ స్థాయిలోనే మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళల భాగస్వామ్యం ఉన్నప్పుడు దేశం సామాజికంగాను, ప్రజాస్వామికంగా కూడా అభివృద్ధిచెందుతుందన్నది కాదనలేని సత్యం . మరి అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో మహిళలంతా ఎదురు చూసే మహిళాబిల్లు ఎప్పుడు ఆమోదం పొందుతుందో … మహిళల అస్తిత్వానికి గుర్తింపు ఎప్పుడు వస్తుందో .. .చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఎప్పుడు మెరుగవుతుందో … !!

వి.శాంతిప్రబోధ

Tag Cloud

%d bloggers like this: