The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘ప్రకృతి’

ఇవాళే అంకురిద్దాం !

అన్నా
నాలో నీకు
నీతోడ బుట్టిన చెల్లి కనిపించలేదా !?

నాన్నా
నాలో నీకు
కన్నకూతురు కనిపించలేదా !?

తాతా
నాలో నీకు
ముద్దు మురిపాల మనుమరాలు అగుపించలేదా !?

నాలో మీకు
మన వావి
వరుసలు తెలియడం లేదా !?

ఎందుకని?
నాలో మీకు కనిపించేవి
మాంసపు ముద్దల వంపు సొంపులేనా !?

నేను ఒంటరిగా
కనిపిస్తే చాలు
జుగుప్స కలిగే మాటలతో వేధించవచ్చా !?

వావి వరుసలు మరచి
సభ్యత సంస్కారం విడిచి
వెకిలిచేస్టలతో ఎక్కడైనా చేయి వేయచ్చా!?

వివేకం విచక్షణ నశించి
విషపు కోరలు చాచి
అదను చూసి అత్యాచారం చేసేయ్యచ్చా!?

తల్లిగా, చెల్లిగా, ఆలిగా
ఇంటా, బయటా దిక్కులేని
ఆడపిల్లలా బలవుతున్నాం
మూగ సాక్ష్యాలుగా మిగిలిపోతున్నాం !?

ఎక్కడికి పోతున్నాం మనం
ఆదిమ మానవుడి కాలానికా
యుగాల వెనక్కి ఆటవిక యుగంలోకా ..
అలా అనడం తప్పేనేమో … !?

ఆనాడు ఒంటిపై నూలుపోగు లేకుండా
ఆకులు అలములతో అరకొర ఆచ్చాదనతో ఉన్నా
ఇంతటి అనాగారికంగా లేరేమో
మృగాళ్ళుగా మారలేదేమో!?

ప్రకృతి సహజమైన సంబందాల్ని
సాంస్కృతిక విలువలతో
ఉన్నతీకరించాల్సిన అవసరం లేదా
చెప్పండి నాన్నా .. అన్నా.. తాతా !?

మీ ప్రవర్తనతో నేను మరమనిషిలానో
మాట పలుకులేని పక్షులూ జంతువుల్లానో
మానసిక ఉద్వేగాలను , వేదనను
వెల్లడించకుండా ఎలా ఉండగలను !?

అవ్వా, అమ్మా , అక్కా ఇవాళే అంకురిద్దాం
ఆత్మ రక్షణా పద్దతులు అందుకొందాం
ఏదో ఒక రోజు పెను ఉప్పెనలా విరుచుకుపడదాం
ఎగబడే తెగబడే వారి విషపు కోరల్ని పెకిలిద్దాం .

– వి. శాంతి ప్రబోధ

‘జనవిజయం’ ఫిబ్రవరి మొదటి పక్షంలో ప్రచురణ

నింగి.. నేల .. నీరూ .. నాదే..

నింగీ..  నేలా . .  నీరూ .. నాదే.
నింగీ , నేలా , నీరూ నా అదుపులో ఉండాల్సిందే..
అంటూ విర్రవీగా..
నా తెలివి తేటలతో
నేల దున్నా
నాటు వేశా
రసాయన ఎరువులెన్నో వాడా
పురుగు మండులెన్నో చల్లా
పుట్లకొద్దీ పంటలెన్నో  పండించా
లెక్కలేనంత సంపాదించా
నా అంతటి వాడు లేదని గర్వించా
నా మేధా శక్తి తో నూతన ఆవిష్కరణలు చేశా
భూతల్లి గర్భంలోకి  చోచ్చుకుపోయా
చిద్రం చేశా
అపర గంగనే జయించానని అహంతో
పచ్చాపచ్చని చెట్లన్నీ నా కోసం నరికేసా
నా ఇష్టం వచ్చినట్లు వినియోగించా
ఫలితం..
పీల్చడానికి  స్వచ్చమైన  గాలి కరువు
తాగడానికి గుక్కెడు నీళ్ళు కరువు
తినడానికి బుక్కెడు బువ్వ కరువు
బక్క చిక్కి బతుకే బరువు
అప్పుడు గుర్తించా..
అవును, అప్పుడు గుర్తించా
ప్రకృతిలో నేనూ భాగమని..
నింగీ ..నేలా ..నీరూ ..నా స్వంతం కాదనీ ..
నియంత్రించే హక్కు నాకు లేనే లేదనీ
నన్ను నేను నిలుపు కోవాలనీ
రేపటి తరాలకు అందించాలనీ ..
అది నా బాధ్యత అనీ

వి. శాంతి ప్రబోధ

Tag Cloud

%d bloggers like this: