The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘తెలుగు సాహిత్యం’

రాజ్యహింస – తెలుగు సాహిత్యం

రాజ్యహింస .. అది తాము మాట్లాడకూడని , రాయదగని పదం కొందరికి అయితే .. మరి కొందరికి అసలు ఆ పదానికి అర్ధమే తెలియదు.

భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో నాడు కరీంనగర్ – ఆదిలాబాదు జిల్లాలను కల్లోల ప్రాంతాలుగా ప్రకటించినప్పుడూ .., నేడు బహుళజాతి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు చెల్లుబాటుకాకపోవడంతో వాకపల్లి …వంటి సంఘటనలు కుదిపేసినా , దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత పేరిట ఆదివాసీల పై నిరంతర హింస జరుగుతున్నా అదేదీ తెలియకుండా , అది తమకు సంబంధించినది కాదనే స్పృహతో తెల్సుకోవడానికి ప్రయత్నించకుండా , ఒకవేళ తెలిసినా వాటికి సాహిత్యంలో చోటు కల్పించే సాహసం చేయలేని వాళ్లెందరో..!

ఇక్కడ ఓ విషయం మీతో పంచుకోవాలి . ఈ పత్రం తయారు చేసుకునే క్రమంలో మహిళలపై రాజ్యహింసకు సంబంధించిన సాహిత్యం గురించి తెలిసిన విషయాలు నాతో పంచుకోవలసిందిగా ఫేస్బుక్ మిత్రులకు విజ్ఞప్తి చేశాను. రెండో మూడో లైకులు తప్ప వేరే స్పందన లేదు. కారణం ఏమిటి? అతి మామూలు విషయాలకి విశేషంగా స్పందించే మిత్రుల నుండి స్పందన లేకపోవడానికి కారణం ఏమిటి? అప్పుడర్థమయింది రాజ్యహింస అంటే ఎంత భయమో .. రాజ్యం ఎంత భయపెడుతుందో ..

రాజ్యహింస గురించి రాయాలంటే ముందుగా రాజ్యం గురించీ, దాని పోకడల గురించీ, అందువల్ల ఇబ్బందులకు, హింసకు గురయ్యేవారి జీవితాల గురించీ తెలిసి ఉండాలి. కాల్పనిక సాహిత్యం కాకుండా వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే రచనలు చేయగలగాలి. అందుకు సామాజిక స్పృహ, సమకాలీన సమాజం పట్ల అవగాహన ఉండాలి. భిన్న పరిస్థితులలో, విభిన్న కాలాలలో సమాజ ధోరణులు తెలిసి ఉండాలి. విభిన్న పార్శ్వాలలో మహిళలపై జరిగే హింస గురించి అర్ధం చేసుకోవాలి, విశ్లేషించాలి.

తమపై జరిగే వివిధ రకాలైన దోపిడీని, వివక్షని , అత్యాచారాలకు, పీడనకు, హింసకు వ్యతిరేకంగా మహిళలు తమ గళం విప్పుతున్నారు. వీధుల్లోకి వస్తున్నారు. పితృస్వామిక భావజాలంతో నిండి ఉన్న సమాజంలో తమ అస్తిత్వం కోసం, స్వేచ్చ కోసం, భద్రత కోసం, సమానత్వం కోసం హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో ముందు వరుసలో నిలిచిన స్త్రీలపై హింస కూడా పెరిగిపోయింది. ఆమె ఆలోచనను, చైతన్యాన్ని, ఎదుగుదలను మొగ్గలోనే తుంచేయడానికి ప్రయత్నం సాగుతూనే ఉంది. ఆధిపత్య భావజాలంతో ఉన్న వారు ఆమెను అణచివేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆమెపై , ఆమె లైంగికతపై బురద జల్లుతునే ఉన్నారు. లేదా ఆమె లైంగికతనే దోపిడీ చేస్తూ, శారీరక మానసిక హింసకు గురిచేస్తూ ఉండడం మనకు పురాణ కాలం నుండి నేటివరకూ కనిపిస్తున్న వాస్తవం. అది జరిగేది కుటుంబం వల్ల కావచ్చు. సమాజం వల్ల కావచ్చు . రాజ్యం వల్ల కావచ్చు. అయినా, ఆమె అన్నింటిని ఎదుర్కుంటూ ముందుకు అడుగుగేస్తోంది. ఈ సమయంలో ఆమె పడే వేదనని , ఆవేదనని , కష్ట నష్టాలని, ఆమె స్తైర్యాన్ని, నిబ్బరాన్నికూలదోయడానికి వివిధ కోణాల్లో, వివిధ పద్ధతుల్లో ప్రయత్నాలూ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటప్పుడు ఆమెకు అండగా నిలబడాల్సింది రాజ్యం. కానీ , జరుగుతున్నదేమిటి? ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన రాజ్యం, కనుపాపలా చూసుకోవాల్సిన రాజ్యం, తానే కాటేస్తే ..? హింసకు గురిచేస్తే ..?? ఎవరితో చెప్పుకోవాలి??? ఎలా న్యాయం పొందాలి ???

అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసాన్ని జనం గమనిస్తున్నారు . తమ హక్కుల సాధనకు కదులుతున్నారు . తమపై జరిగే దోపిడీని , అణచివేతను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరికొకరు హక్కుల సాధన కోసం పోరాడుతూ , సంఘటితమవుతూ సాగుతూన్నారు. ఇంద్రవెల్లి నుండి వాకపల్లిదాకా కదులుతూనే ఉన్నారు. నాటి స్వాతంత్ర్య ఉద్యమం నుండి సారా ఉద్యమం, విద్యుత్ ఉద్యమం, ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకు నిరసన వరకూ సాగుతూనే ఉన్నారు. ప్రతిఘటన ఎదురవుతున్న కొద్దీ మరింత బలం పుంజుకుంటూ ఉద్యమ లక్ష్యం వైపు సాగుతున్నారు . ఎప్పుడైతే ప్రజలు ఒక సమస్య పరిష్కారానికి కదలడం మొదలుపెట్టారో అప్పుడు పాలకుల్లో , ప్రభుత్వంలో కలవరం మొదలు అవుతుంది. ప్రజల కదలికలు నియంత్రించాలనుకుంటుంది. అందుకోసం రాజ్యం తన అధికార బలంతో అణచివేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ప్రజల హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ఎప్పుడైతే అణచివేత, ఏరివేత మొదలుపెడుతుందో అప్పుడు ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకత, నిరసన పెరుగుతుంది. ఫలితం రాజ్యం తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో హింస మొదలుపెడుతుంది. అది ఉద్రుతమవుతుంది.

అవసరమైతే పిల్లి పులిగా మారుతుందన్నట్లు సామాన్య మహిళలు వివిధ సందర్భాల్లో తమపై జరిగే రాజ్యహింసని ఎదుర్కొంటూనే .. స్థానిక మహిళలని కలుపుకుంటూనే మహిళలపై దోపిడీకి వ్యతిరేకంగా, రాజ్యహింసకి వ్యతిరేకంగా సామాజిక, రాజకీయ, ఆర్ద్తిక, సాంస్కృతిక కోణాల్లో కారణాలని వెతుక్కుంటూ అసాధారణంగా సాగుతున్నారు. పాలకులు పాలక వర్గం చేతిలోని వారు చేసే హింసాకాండ ఎప్పుడయితే బయటి ప్రపంచంలోకి వస్తుందో .. అప్పుడే సామాన్యులకి జరుగుతున్నదేమిటో అర్ధమవుతుంది.

ఆ నిర్భందాలని , దాడుల్ని, హింసని తట్టుకుని రాజ్యహింసపై తమ కలం పట్టి అక్షర వ్యవసాయం చేసే వారూ లేకపోలేదు . జరుగుతున్న దుర్నీతిని , ఆటవిక న్యాయాన్ని, బాధితుల పట్ల నింపుతున్న విషాన్ని బయట పెట్టడానికి రచన ఒక ఆయుధం. నేడు ప్రచార ప్రసార సాధనాలు రేటింగ్ పెంచుకుని వ్యాపారం పెంచుకునే ఆత్రుతే తప్ప వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకుపోవడంలో విఫలం అయ్యాయనేది కాదనలేని వాస్తవం. ప్రతి చానల్ , ప్రతి వార్తా పత్రిక ఏదో ఒక పార్టీ గొడుగు కింద చేరి అబద్దాల్ని వండి వారుస్తున్నాయనేది కాదనలేని సత్యం. అలాంటప్పుడు వాస్తవాల్ని రచనలో ప్రతిబింప చేయాల్సిన బాధ్యత సృజనశీలురదే.

పోరాటాల్లో, ఉద్యమాల్లో ఉన్న మహిళలు , మరీ ముఖ్యంగా మావోయిస్ట్ ఉద్యమాల్లోని మహిళలు తుపాకీలు పట్టడమే కాదు కలం పట్టి అక్షారాలు నేర్చుకోవడంతో పాటు సాహిత్యం సృష్టిస్తున్నారు. వారి సాహిత్యం వారి అనుభవాలతో , వారి చుట్టూ జరుగుతున్న సంఘటనల నేపథ్యం నుండి వచ్చిన సాహిత్యం కనుక వారి సాహిత్యంలో మహిళలపై జరిగే రాజ్యహింసని తడమకుండా ఉండలేని స్థితి. అవే బయటి ప్రపంచానికి వాస్తవ స్థితిని తెలియజేసేది.

పోరాటాలలో , ఉద్యమాలలో మమేకం కాని వారికి మహిళలపై జరిగే రాజ్యహింస గురించి ఏం తెలుస్తుంది ..? ప్రచార మాధ్యమంలో వచ్చే మసిబూసి మారేడుకాయ చేసిన వార్తలు తప్ప..! అడపాదడపా ప్రగతిశీల సంస్థలు, వ్యక్తులు అందించే సాహిత్యం తప్ప .!!

నేను ఈ పత్రం తయారు చేసుకోవడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. కారణం వ్యక్తిగతంగా నాకు ఏ పోరాటాలతోను ఉద్యమాలతోను సంబంధం లేకపోవడం. ఈ అంశంపై వచ్చిన సాహిత్యం నాకు అందుబాటులో ఉన్నది తక్కువ కావడం కూడా ఒక కారణం కావచ్చు,

రాజ్యహింసపై మహిళలు సృజించిన తెలుగు సాహిత్యం తక్కువే. గృహ హింస , సామాజిక హింస, కులహింస, మత హింస, లైంగిక హింస , మానసిక హింస, సాంస్కృతిక హింస వంటి హింసలకు సంబంధించిన రచనలే కనిపించాయి. కానీ, రాజ్యహింసకు సంబంధించి లభ్యమయిన రచనలు చాలా చాలా తక్కువ. లభ్యమయినవి రాశిలో తక్కువే కావచ్చు కాని, సామాజిక, రాజకీయ, ఆర్ధిక , సాంస్కృతిక పరిస్థితులపై లోతైన అవగాహన, పరిశీలనతో ఉన్నాయవి.

నా వెతుకులాటలో నాకు మొదట నా దగ్గరే లభ్యమైంది 1992 ఏప్రిల్ లో వెలువడ్డ నలుపు” మహిళా ప్రత్యేక సంచిక . అది ఎప్పుడు ఎలా నాదగ్గరికి చేరిందో కానీ రాయడానికి నాకు శక్తినిచ్చింది.

తమది కాని దాన్ని, తమవారైన ఆక్రమదారులను సమర్ధించడం రాజ్యం స్వభావం. అందుకు అడ్డువచ్చిన వారిని హింసించడం దాని స్వభావమే. అదే విధంగా తనకు అడ్డువచ్చే వారిని, న్యాయంగా తమకు రావలసిన దాన్ని పొందడం కోసం పోరాడే వారిని, తమ హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న వారిని ప్రభుత్వం అణిచేందుకు రకరకాల హింసా పద్దతులు ప్రయోగించడం అందరికీ తెలిసిందే. అందుకు మనం ఎన్నో సంఘటనలని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అలాంటి సంఘటనలకి స్త్రీల సాహిత్యంలో ఎంత చోటు లభిస్తోందో తడిమి చూద్దాం.

వివిధ సాహితీ ప్రక్రియలలో మొదట వ్యాసం తీసుకుందాం.

రాజ్యహింస ఈ పదం వినగానే మనకేమనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో , ప్రజలు చైతన్యం అవుతున్న క్రమంలో పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో వినవచ్చే పదం అనుకుంటాం. కానీ, శతాబ్దాల రాజ్యహింసకు ప్రతీక రామాయణం ఎందరెందరు తాటకలు .. ఎన్ని వేలమంది శూర్పణకలు అవమానాల పాలయ్యారో అని ఆవేదన వ్యక్తం చేసిన బి. విజయ భారతి విశ్లేషణా వ్యాసం మనని మరో కోణంలో ఆలోచింపచేస్తుంది.

రామరాజ్యం అంటే రాజ్యహింసల సమాహారం. ఇలాంటి రామరాజ్యమా మనం కోరుకునేది ? రాజ్యహింస రూపాలు మార్చుకుంటోంది కానీ స్వభావాన్ని కాదన్న విజయభారతి మాట అక్షర సత్యం అనిపిస్తుంది ఆ వ్యాసం చదివితే. పురాణ వాజ్మయాన్ని చరిత్రను సమన్వయపరచి చూస్తే రామాయణంలోని రాజ్యహింస స్వరూపం స్పష్టమవుతుంది. ఈనాటి బడుగువర్గాల ప్రజలూ ఆదివాసీలు రాజ్యం చేతిలో అనుభవిస్తున్న హింస రామాయణ కాలం నాటిది ఇంకా ముందటిదే కావచ్చు అంటారు బి. విజయ భారతి ” రామాయణంలో గ్రీన్ హంట్ ” అనే వ్యాసంలో (ఈ వ్యాసం వసంతం లో వచ్చింది).

రచయిత్రి మాటల్లో “ఈ రాజ్యహింస స్వరూపాన్ని అర్ధం చేసుకోవాలంటే రామాయణం బాలకాండ లో ‘తాటక వధ ‘ చదవాల్సిందే . సహస్ర నాగ బాల సమన్విత అయిన తాటకి భర్తను అగస్త్యముని శాపంతో దహించాడు. అదేమిటని అడగడానికి వెళ్ళిన తాటకనూ తాటక కొడుకులనూ చిత్రహింసల పాలు చేశారు. పోలీసు టాణాలోని హింస సరిపోక రాజధాని నుండి రాకుమారులు రామలక్ష్మణులు వచ్చారు. ఒంటరిగా, చేతిలో ఆయుధం లేకుండా ఉన్న సమయంలో తాటకను చేతులు నరికి ముక్కు చెవులూ కోసి ఆ పైన గుండెల్లోకి బాణం వేసి చంపారు. ఈ ఎన్కౌంటర్ ఎందుకు జరిగిందంటే దేశం సుఖం కోసం, గో బ్రాహ్మణ హితం కోసం, చాతుర్వర్ణ హితం కోసం జరిగిందని రామాయణం సంజాయిషీ ఇచ్చింది. రాముడు అరణ్యవాసం పేరుతో ‘దండక’లో ప్రవేశించాడు. దండక రాక్షసుల రాజ్యం. అక్కడ వారి అనుమతిలేకుండా ఆశ్రమం నిర్మించుకున్నాడు. దండకలో ప్రవేశించిన కొత్త వాళ్లెవరని, ఆయుధాలతో ఎందుకు తిరుగుతున్నారని సందేహాలు వచ్చేసరికి శుర్పణక ముక్కూ చెవులూ తెగిపోయాయి. ”
అదీ రాజ్య హింసా విధానం. ఈ విధానం నేటికీ సాగుతూనే .. ఉందిగా ..?! మావోయిస్టుల ఏరివేత పేరుతో దండకారణ్యంలో చేరిన సాయుధబలగాలు ఆదివాసీలపై చేస్తున్న దమనకాందని గుర్తుకు తేవడం లేదూ … ?

ఆకాశంలో సగం అయిన స్త్రీలు పోరాటాల్లోను సగం కావడం , వర్గ దోపిడీకి , పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించడం , దోపిడీ వర్గాలకు నిజంగానే భయకంపితులను చేస్తున్నది. అనేక హింసలను అనుభవించిన స్త్రీలు చైతన్యవంతులై ఒక్కసారి ఉద్యమాలలోకి రావడమంటూ జరిగితే సాధారణంగా వెనక్కు తిరిగి వెళ్ళే సమస్యే ఉత్పన్నం కాదు. చరిత్ర రుజువు చేసిన అంశం ఇది. అందుకే ప్రారంభంలోనే స్త్రీల కదలికలను అడ్డుకునేందుకు స్త్రీ విముక్తి పోరాటాలను త్రుంచి వేసేందుకు రాజ్యం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నది. మహిళా ఉద్యమాలను, ప్రజా ఉద్యమాలను అణచి వేసేందుకు రాజ్యం లైంగిక అత్యాచారాలను ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నది అంటారు విమల మహిళా పోరాటాలు – రాజ్యహింస అనే వ్యాసంలో (1992 ఏప్రిల్ ‘నలుపు ‘ సంచికలో) .

పోరాట ప్రాంతాలలో రాజ్యహింస మూడు పద్దతులలో అమలవుతూ ఉంది .
ఒకటి పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళా సంఘాల కార్యకర్తలపైన , సానుభూతి పరులపైన, విప్లవ సంస్థలలో పని చేస్తున్న మహిళా కార్యకర్తలపైన
రెండు , ప్రజా ఉద్యమాలలో పనిచేస్తున్న కార్యకర్తలు , సానుభూతిపరుల కుటుంబాలకు చెందిన స్త్రీల పైన ,
మూడు , ఎలాంటి పోరాటాలతోను సంబంధం లేకపోయినప్పటికీ పోరాట ప్రాంతాలలో ఉండడం, స్త్రీలు కావడం వల్ల జరిగేది .

రాష్ట్రంలో నేడు పితృస్వామ్యం , జెండర్ , స్త్రీల లైంగిక స్వేచ్చ , స్త్రీల చరిత్ర , స్త్రీల దృక్కోణం … మొదలైన అంశాలపై చెప్పుకోదగిన చర్చ సాగుతోంది . దీనితో పాటు , నిజానికి గ్రహించాల్సిన మరో విషయం స్త్రీలు పోరాడుతున్నారు . అవి మద్యపాన నిషేధ ఉద్యమం కానీయండి, విద్యుత్ వ్యతిరేక ఉద్యమం కానీయండి, ఆర్ధిక పోరాటాలు కానివ్వండి , పాక్షిక సమస్యలపై సాగిస్తున్న పోరాటాలు కానివ్వండి . ఏదైనా స్త్రీలు వంట గదులను , కుటుంబం నాలుగు గోడలను దాటి బయటికి వస్తున్నారు. వేసే ప్రతి ఒక్క అడుగు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఆచరణలో పోరాడందే సాధ్యం కాదు అని గుర్తిస్తున్నారు. స్త్రీల ఆచరణాత్మక అనుభవాలను, విజయాలను పరిశీలించాల్సిన , పరిగణన లోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

“స్త్రీలు రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను , జీవించే హక్కును కోరడం , సాంఘిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సమానత్వం కావాలనడం నేరం అవుతుంన్దా..? తమపై రకరకాల రూపాల్లో అణచివేతను , అత్యాచారాలను సాగిస్తున్న నేరస్తులను ,ప్రభుత్వం శిక్షించక పోవడమే కాకుండా , బాధితులైన స్త్రీలనే నేరస్తులను చేసి నిలబెడుతున్న దురన్యాయాన్ని ప్రశ్నించడం తప్పవుతుందా ‘ అంటారు విమల. తమను తాము రక్షించునేందుకు తమ ఆత్మగౌరవం కోసం, స్వేచ్చ కోసం స్త్రీలు ఉద్యమించడం తప్పేలా అవుతుందని ఇవ్వాళ స్త్రీలు నిలదిస్తున్నారు . కుటుంబహింస, రాజ్యహింస చెట్టాపట్టాలేసుకుని స్త్రీలపై అణచివేతను కొనసాగిస్తున్నప్పుడు ప్రతిఘటన స్త్రీల హక్కు కాదా అని ప్రశ్నిస్తున్నా రామే.

కన్నీళ్లను కత్తులుగా మలచుకున్న స్త్రీలు మానవులుగా జీవించేందుకై ఈ రోజు చావుబతుకుల మధ్య సంకుల సమరం సాగిస్తున్నారు. స్త్రీలకు నిర్భందం , అణచివేత కొత్త కావు. పితృస్వామ్యానికి, దోపిడీ వర్గ వ్యవస్థకు వ్యతిరేకంగా స్వేచ్ఛకోసం , సమానత్వం కోసం , నూతన సమాజం కోసం పోరాడుతున్న స్త్రీలు ఈ వ్యవస్థీకృత రాజ్యహింసను కుడా ప్రతిఘటించి తీరుతారు అని ఇరవై రెండేళ్ళ క్రితం వ్యక్తం చేసిన విమల ఆశాభావానికి సమాధానంగా కనిపిస్తున్నారు నేడు ఉద్యమాలలో సాగిపోతున్న మహిళలు.

ప్రజల ప్రజాస్వామిక కాంక్షలను అణగదొక్కడానికి రాజ్యం అత్యాచారాలని ఒక మార్గంగా ఎన్నుకోవడం యాదృచ్చికం కాకపోవచ్చు. భద్రతా దళాలు , పోలిసుల చేతుల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక, రాజ్య హింస రామరాజ్యం నుండి సరఫరా అయిన రాజ్యహింసే కావచ్చేమో .. !! మయసభలో సభికులందరి ముందు జరిగిన ద్రౌపది వస్త్రాపహరణాని కొనసాగింపే మహిళలపై జరిగే హింసలకి కారణం కావచ్చేమో ..!!!

ఇంద్రవెల్లిలో తాము జరుపుకోవాలనుకున్న సభకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ప్రభుత్వం ఆదివాసి యేతరులను ఇంద్రవెల్లిలోకి లోకి అనుమతించి గిరిజనులను అడ్డుకొన్నప్పుడు ‘ఆదివాసీ పోరాటాలు – స్త్రీలు మరో జలియన్ వాలాబాగ్ ఇంద్రవెల్లి ‘ అనేవ్యాసంలో

“సామూహికంగా బ్రతికే గిరిపుత్రికలు ప్రభుత్వం అంటే అడవి తల్లిల్లా కాచి కాపాడేదేనని అనుకున్నారు . అందుకే గిరిజన రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో నిరాయుధంగా కదిలారు. సభకు వస్తున్నా, వచ్చిన ఆదివాసీలు న్యాయమైన డిమాండ్లు వినడానికి కుడా ఇష్టపడని పాలకవర్గాలు అచ్చు బ్రిటిష్ వలసవాద కాలంలో జరిగిన జలియన్ వాలాబాగ్ లోలాగా చెట్లెక్కి వాముల పొదల వెనుకనుంచి దొంగచాటుగా కాల్చారు . బెదిరిపోయి అయోమయస్థితిలో ఎక్కడ బుల్లెట్లు దిగుతున్నాయో కుడా చూసుకోలేని పరిస్త్తితుల్లో ప్రజలు పరుగులు తీస్తుంటే మన దేశ పోలీసులే రేసుకుక్కల్లా వేటాడి వేటాడి పాయింట్ బ్లాక్ రేంజ్ తో కాల్చారు. వారి శవాలు, ట్యాంకులు, పొదలవేనుక నుంచి ….. వారం తర్వాత కుడా కనుక్కున్నారు . గోండు మహిళా మంకుబాయి నడుములో తూటాలు .. ఆమె కుటుంబ సభ్యులు చనిపోయారు . ఇస్రుబాయి కాళ్ళలో కాల్చి లాక్కుపోయారు . కాళ్ళు తీసేశారు . ఇలా ఎందరో ..”

” తమ నాయకుడైన కొమురం భీం చనిపోయిన తర్వాత తమ చనిపోయినవారికి నివాళులు అర్పించడం గోండుల రివాజు. దసరాపండుగ పున్నాన నివాళు అర్పిస్థారు. ఇది నిజాం కాలం నుండి జరుగుతోంది . అయితే నిజాం పాలక వర్గాలకు భయపడి ప్రజలు రాత్రిపూట చేసుకునేవారు. కానీ , ఇప్పుడు అదే జరిగిన్ది. పోలీసులు ఇంద్రవేల్లిని ముంచెత్తారు . ” అంటూ రాజ్యహింస గురుంచి తన ఆవేదన చెందారు రచయిత్రి జూపాక సుభద్ర భూమికలో రాసిన వ్యాసంలో

నవంబరు 11 1999లో రంగవల్లి, ఆమెతో పాటు మరో ముగ్గురు పోలిసుల రాజ్యహింసకు బలైన విషయం అందరికీ తెలిసిందే . ఆ విషయాన్నే “వెచ్చటి చలి యాది రంగవల్లి” అని మరచిపోలేని ఆమె జ్ఞాపకాలని భూమిక పత్రిక ద్వారా అందరికీ పంచారు జూపాక సుభద్ర.

తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో స్త్రీల పాత్ర , అనుభవాలను పరిశీలించి , పరిశోధించి, స్త్రీల దృష్టి కోణంలోంచి చూసి , ఉద్యమాల్లో, పోరాటాల్లో మహిళల భాగస్వామ్యం అధ్యయనం చేసి విశ్లేషించింది స్త్రీ శక్తి సంఘటన వారు అచ్చువేసిన పుస్తకం ‘మనకు తెలియని మనచరిత్ర ‘ ఈ పుస్తకంలో నైజాం వ్యతిరేక తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్న మహిళల్లో వచ్చిన చైతన్యం , తమ చైతన్యం వల్ల అనుభవించిన, ఎదుర్కొన్న రాజ్యహింస గురించి కూడా ఆ పుస్తకం ద్వారా ఆ ఉద్యమకారుల మాటల్లో మనం తెలుసుకోవచ్చు.

కాత్యాయనీ విద్మహే రాసిన ప్రత్యేక వ్యాసం ‘మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం ‘ భూమిక పత్రికలో వచ్చింది. ఆంద్ర రాష్ట్రంలో ఆదివాసి స్త్రీలు అడవి సంపదపై సహజ హక్కులు భంగపడుతుంటేను, నిత్య జీవితం గిరిజనేతరుల దోపిడీకి, అటవీ అధికారుల వేధింపులకు బాలి అవుతుంటేను తమ పురుషులతో పాటు స్త్రీలూ పోరాటాలలోకి సమీకృతులయ్యారు . …. 1974 సెప్టెంబర్ 29న అభ్యుదయ స్త్రీల సంఘం ఏర్పడింది . స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు , విముక్తికై పోరాడేందుకు అవసరమైన చైతన్యాన్ని , ఆర్ధిక విధానానికి , సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటాలను నిర్మించడం ప్రధాన లక్ష్యంగా ఈ సంఘం ప్రకటించింది…….శ్రామిక స్త్రీల విముక్తి గురించి , అవిద్య , అజ్ఞానం, అనచివేతల్తో మగ్గిపోయే అసంఖ్యాక స్త్రీల విముక్తి గురించి ఆలోచించాలని , పనిచేయాలని నిస్వార్హంగా ప్రకటించిన అభ్యుదయ స్త్రీల సంఘం అత్యయిక పరిస్థితి మూలంగా ఆకాంక్షలకు నిర్భందాలకు గురి కావలసి వచ్చిందని ‘ ఆవేదన వ్యక్తం చేశారు.

1978 నాటి ఉత్తర తెలంగాణ రైతాంగ ఉద్యమం ఉధృత స్థాయిలో ఉంది. సిరిసిల్ల , జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి పోలీసు బలగాలను మొహరించి రైతు కూలీ సంఘ కార్యకర్తలను భయభ్రాంతులను చేసే విధంగా గ్రామాలలో గుండాలు, పోలీసుల దాడులు నిత్య కృత్యమయ్యాయి . అందులో భాగంగా స్త్రీలు అనేకమంది అత్యాచారాలకు గురయ్యారు . కొడుర్పాక రాజవ్వ, సత్తేవ్వ మొదలైన వారు ఆ కోవలోకి చెందినవారు అంటారు కాత్యాయని.

1990 ప్రారంభానికి ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీ విముక్తి) పూర్తీ రూపం తీసుకుంది. 1992 ఏప్రిల్ 10-12 తేదీలలో వరంగల్లులో తొలి రాస్స్త్ర సదస్సు నిర్వహణ, భూస్వామ్య వ్యతిరేక మహిళా వ్యవసాయ కూలీ ఉద్యమాలను, జోగిని, బసివి వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను , కుటుంబ హింస నుండి రాజ్యహింస వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న జీవిత భీభత్సానికి వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళాసంఘం నిర్మించిన ఉద్యమం విధాన్ని తెలిపింది ఈ వ్యాసం.

సైనిక దళాల ప్రత్యేక అధికార చట్టం వల్ల కాశ్మీర్ , ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, నక్సల్ ఉద్యమ ప్రాంతాలు, చత్తిస్ ఘడ్ (సల్వాజుడుం) ముఖ్యంగా ఆదివాసి మహిళలు నిత్యం సైనిక, పొలిసు దళాల లైంగిక దాడులు , హింస ఎద్దుర్కొంటూ పోరాడుతున్నాయి. కాశ్మీర్ , ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక దుశ్చర్యలు ఎంత ఘోరంగా , క్రూరంగా ఉంటాయో అక్కడి మహిళా పోరాటాలు ఐరో షర్మిల పద్నాలుగేళ్ళ దిక్షలె చెప్తాయి. పోలీసుల హింసని చట్టం, న్యాయా స్థానాలు ఎట్లా రక్షిస్తాయో వాకపల్లి ఘటన నిదర్శనం అనే సుభద్ర ‘యునిఫామ్ వేసుకున్న దోషులు, నేరస్తులకు ప్రత్యెక అధికార చట్టాన్ని ఉపసహరించుకోవాలని మహిళా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేయడం అభినందనీయం’ అన్నారు వహ్వా – జాతీయ మహిళాకమిషన్ ‘ ఆనే వ్యాసంలో ( భూమిక నవంబర్ -13)

కారంచేడు, చుండూరు గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. జూన్ 12న లక్షింపేట దళితులపై జరిగిన హింసాకాండ మరవకముందే, పుండుపై కారంలాగా జూన్ 28న ఛత్తీస్‌గఢ్‌లో కాల్పుల ఘటన వార్త. బాసగూడెంలో 19 మంది ఆదివాసీల మీద విచక్షణా రహితంగా కాల్పులు, ఊచకోత, నరికివేత. కోల్డ్‌బ్లడెడ్ ఓపెన్ మర్డర్స్! వారు ఆదివాసీలు, అడవులలో ఉంటారు, అనగా మావోయిస్టులు అనబడతారు. దళితులూ, ఊరికి చివర ఉంటారు, తమకు అన్యాయం జరుగుతుందని సంవత్సరాల తరబడి విన్నపాలు ఇచ్చుకున్నా ఎవరూ పట్టించుకోరు, వీరిని అంటరాని వారు అంటారు.నరనరాన పేరుకుపోయిన కులం కుళ్ళు ఒక్కసారిగా విరుచుకుపడింది. పోలీసుల అండదండలు ఉన్నాయి. అటు రాజ్యం, సామ్రాజ్యవాదం చేతిలో కీలుబొమ్మ అయింది. పాపం వారిది ఒకే కులం, ఒకే మతం. అమాయకులను బలగాలతో చంపిస్తారు. పేరు ఎన్‌కౌంటర్! వీరు నిరాయుధులు అయి ఉండొచ్చు, అమాయకులు అయినా కావొచ్చు. పిల్లలు, మొన్న బాసగూడెంలో కుమారి కాక, 15 ఏళ్ల ఆడపిల్ల, అంటూ రాజ్యహింసకు అమాయకులు, పిల్లలు బలికావడాన్ని ఆవేదనతో ప్రశ్నిస్తారు .-సూరేపల్లి సుజాత దళిత ఆదివాసిలపై రాజ్యహింస అనే వ్యాసంలో

యం. రత్నమాల వివిధ సందర్భాలలో వివిధ ఉద్యమ పత్రికలలో రాసిన వ్యాసాలు, సభలు , సదస్సులలో చేసిన ప్రసంగాలను కూర్చి ‘దాక్షిణ్య వాదం నుండి దండకారణ్యం దాక భారత మహిళా ఉద్యమం ‘ పుస్తకంగా చేశారు. రాజ్యహింస బాధితులకు దక్కని న్యాయం గురించి , నిర్వాసితత్వం – రాజ్యహింస , రాజ్యంపై , పితృస్వామ్యంపై ఏకకాలంలో పోరాడుతున్న్న దండకారణ్య ఆదివాసీ మహిళలు, తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని రాజ్యహింసకు బలైన బెల్లి లలిత తదితర మహిళల గురించి ఆవేదన చెందారామె. నిర్వాసిత ప్రాంతాల్లో నష్టపరిహారంగా అందుకున్న సొమ్ముతో విచ్చలవిడి అరాచక జీవితానికి అలవాటు పడ్డ భర్త, అస్థిరమైన జీవితం వాళ్ళ జరిగే హింస కుటుంబ హింసలా పైకి కనిపిస్తున్నప్పటికీ దానికి కారణం రాజ్యం. అంటే అది రాజ్యహింసే కదా అంటారు రత్నమాల . చాలా సందర్భాలలో స్త్రీలపై జరిగే హింసకి ప్రత్యక్షంగా రాజ్యం కనిపించదు కానీ అందుకు కారణం మాత్రం రాజ్యం అవుతుంది. రాజ్యం ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి. జవాబుదారితనంతో ఉండాలి . కానీ, ప్రజల నిర్ణయాధికారాన్ని లాక్కోకూడదు కదా.!

నిర్బంధంలో నున్న క్రాంతి కారి ఆదివాసీ మహిళా సంఘటన్ దేశవ్యాప్తంగా జరిగిన సెమినార్లకు తమ పత్రాలు పంపి తమపై నున్న రాజ్య నిర్భంధాన్ని, పోరాటాలూ ఉద్యమాలు ఊపిరిగా బతికే తమపై జరుగుతున్న రాజ్యహింస, తాము ఎదుర్కొంటున్న తీరు ప్రపంచానికి తెలియజేసింది. ఎంతో మంది మేధావులను కదిలించింది. ఆలోచింపచేసింది.

“కొంగునడుముకు చుట్టవే చెల్లెమ్మా
కొడవళ్ళు చేతబట్ట్తవే చెల్లెమ్మా ” పాట మనందరం ఎన్నో సార్లు విన్నాం. ఆ పాట సమాజంలో మహిళల స్థితి చెబుతూనే
“ఆలుమగలు కలసి సినిమా చూడబోతే
రక్షక భటులంటూ భక్షక భాతులోచ్చి
కాకి బట్టలోల్లు కనికరం లేనోళ్ళు
నీ భర్తను చంపిరా చెల్లెమ్మా
ని మానము చెరిచిరా చెల్లెమ్మా ..”

పొలిసు స్టేషన్ లేమో నరక కూపాలాయె
కండ్లుకానని దొరలూ కామందు పొలిసు
ని మానప్రాణాలనే చెల్లెమ్మా దోచి మంటల గలిపిరా చెల్లెమ్మా
అంటూ మహిళలపై జరిగే రాజ్య హింసని ఎత్తి చూపారా పాటలో . ఇలాంటి పాటలు గ్రామాల్లో కెళితే ఆశువుగా కనిపిస్తాయి. వారి దైనందిన జీవితంలో కలిగే కాస్త సుఖాలని పాటలు కట్టి పాడే వారి కవిత్వం చాలా సార్లు ఎక్కడా రికార్డు కాదు.

ఇక కథ విషయానికి వస్తే ..
స్వరూపి రాసిన బ”తుకమ్మ బండి ” కథ తెలంగాణ గ్రామ నేపథ్యంలో సాగింది. బతుకమ్మ కొడుకు మేఘ్య కోసం వచ్చిన పోలీసులు అతను దొరకక పొతే ఆమెను తీసుకు పోయి నానా బూతులు తిట్టి కొట్టి పంపేవారు. చివరికి మేఘ్యను పొలుసులు పట్టుకుపోయి కాల్చేశారు. ఆ బెంగతో భర్త చనిపోతాడు. ఆమెకో కూతురు స్వరూప ఉంది. కూతురు పెళ్ళిచేస్తే అత్తింట ఎంత హింస భరించాలొ.. అదే అన్నలలో కలిస్తే సంఘంలో పనిచేస్తే సచ్చినా మంచిగా సావోచ్చు అనుకొంటుంది. అమ్మకు తెలియకుండా కూతురు స్వరూప అదే విధంగా ఆలోచించి అన్నలలో కలిసిపోతుంది.

బయటి సమాజంలో మహిళపై జరిగే హింస కంటే నిర్భంధం ఉన్నా, ఏ నిముషమైనా ప్రాణాలు పోవచ్చని తెలిసినా ఒక మంచి పని కోసం జరిగే యుద్ధంలో చనిపోవడం మేలని , బయట అంతకంటే తక్కువ హింస ఏమి లేదనీ చెప్తుందీ కధ.

సాధన రాసిన రాగో నవల చదవలేదు. మిడ్కో పేరుతో రాసే కరుణ , మైనా , దమయంతి కథలు , నేను చదవలేదు కాని విన్నాను .

మహిళల పై రాజ్యహింస అంశంగా ఇంకా ఎంతో మంది రచయిత్రులు రచనలు చేసి ఉండవచ్చు. నాకు అందుబాటులో ఉన్న కొద్ది రచనలతో నేను ఈ చిన్న ప్రయత్నం చేశాను .

ఆకులతో కొలాజ్ చేయడం ద్వారా సామాజిక స్పృహని పెంచే ఇతర చిత్రాలతో పాటు రాజ్యహింసకు సంబంధించిన చిత్రాలు కూడా చేయడం సుహాసిని కే చెల్లు.

పత్రికలు గమనిస్తే
పోరుమహిళ :
దండకారణ్యంలో ధైర్యసాహసాలతో ముందుకు సాగే క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన్ మహిళల రాటుదనం మొండిదనం సహించలేని రాజ్యం వారిని అణచడానికి లైంగిక అత్యాచారాలను సాధనంగా వాడుకుంటోందన్న విషయం అందరికీ తెలిసిందే. దండకారణ్యంలో సాధారణ మహిళలు , పోరుబాటన ఉన్న మహిళలు రెండురకాల రాజ్యహింస నేదుర్కొంటున్నారు. పొలీసు, ప్రభుత్వ నిర్భంద విధానాలకు గురవడం ఒకటైతే, ఉద్యమంలో భాగస్వాములైన తమ వారి జాడ చెప్పమనే పోలిసుల వత్తిళ్ళు, దాడులు, తమవారిని కాపాడుకోవడం కోసం , వత్తిడిని ఎదుర్కోవడం కోసం మరింత తెగువ చూపుతున్నారు . నిత్యం నిర్భంధం ఎదుర్కొంటూనే 1996 మార్చి 8న ‘పోరుమహిళ’ పేరుతో తెలుగులోనూ , సంఘర్ష్ రథ్ మహిళా ‘ పేరుతో హిందీలోనూ దండకారణ్యంలో ప్రారంభమైన ఈ పత్రిక నేటికీ కొనసాగుతోంది. ఈ పత్రిక పోరాటంలో ఉన్న మహిళలపై రాజ్యహింస గురించి ముఖ్యంగా సల్వాజుడుం , సాయుధబలగాల దాడుల గురించే కాక రాజ్యహింస గురించీ , సల్వాజుడుంని పొరుమహిళలు ఎలా ప్రతిఘటించింది తెలియజేస్తూ వారిని కార్యోన్ముఖుల్ని చేస్తోంది. ఈ పత్రిక తీవ్ర నిర్భందాలు , సమస్యలు , వత్తిళ్ళ మధ్య అజ్ఞాతంగా వెలువడుతుండడం విశేషం.

మహిళలపై సల్వాజుడుం శేస్తోన్న అమానుషమైన దాడుల్ని గురించి , దాన్ని మహిళలు ప్రతిఘటిస్తున్న తీరు గురించి ‘మా గోడు వినేదెవరు?’ అనే పుస్తకాన్ని తెలుగులో క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన్ ప్రచురించింది.

క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన్ ‘ సంఘం పెట్టడం వల్ల రాజ్యహింసకు గురికావలసి వస్థున్నది. సల్వాజుడుం దాడులను నిర్భందాలకు , అత్యాచారాలకు, హత్యాకాండకు బలికావలసి వస్తున్నా , పారా మిలిటరీ బలగాల వాళ్ళ బాధలు పడుతున్నా ఆదివాసీ మహిళా సంఘటన ముందుకు సాగుతూనే ఉంది . తెలంగాణా అందవిలో ఉత్తర తెలంగాణ మహిళా విముక్తి సంఘం పనిచేస్తున్నది . పోరుమహిల పత్రిక ప్రచురిస్తున్నది ‘ అంటూ అనేక విషయాలను ఆ వ్యాసంలో తడిమారు.

సిఆర్పి , పోలీసు బలగాల అత్యాచారాలనూ, దౌర్జన్యకాండను ఎదిరిస్తూ వివివ్ద సెక్షన్ల ప్రజలంతా ‘బస్తర్ మహిళా సంఘర్ష్ సమితి ‘ అనే బ్యానర్ కింద ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. 2004 జూన్ 23న జరిగిన ర్యాలిలో 15 వేలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ ర్యాలీని విఫలం చేయాలని పొలిసు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా అంతమంది పాల్గొన్నారు. మహిళలపై అత్యాచారాలను శిక్షించాలి , సిఆర్పి , పోలీసులను వెనక్కి పంపాలి అంటూ నినదించారు. రాజ్య హింసకు వ్యతిరేకంగా వేల సంఘ్యలో ప్రజలు కలవడం , పాలకులను కలవార పెట్టింది. టివీ చానేల్లలోను , వార్తా పత్రికలలోనూ ఈ అత్యాచారాల గురించి ప్రచారం జరగడంతో పాటు బయటి ప్రపంచానికి ఎం జరుగుతుందో తెలుసుకోవడానికి అర్త్డం చేసుకోవడానికి ఉపయోగపడింది .
భూమిక , మహిళామార్గం, మాతృక లలోను రాజ్యహింసకి సంబంధించిన వ్యాసాలూ వచ్చాయి. మాతృక ప్రస్తుతం రాకపోయినా మిగతా వాటిలో అప్పుడప్పుడూ అందుకు సంబందించిన సాహిత్యం మనకు అందుతూనే ఉంది.

1999 డిసెంబర్‌లో 54వ ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ఒక అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం 25 నవంబర్‌ను అంతర్జాతీయంగా ‘మహిళా హింసపై వ్యకిరేక దినం’గా ప్రకటించారు. ఆ ఒక్క రోజుని మహిళలపై హింసకి వ్యతిరేకంగా జరుపుకోవడం కాదు మనం చేయాల్సింది. మన రెండు కళ్లతో గమనించినదాన్ని విషయాన్ని వివిధ సాహితీ రూపాలలోకి తెచ్చి వేయి మెదళ్ళలో కదలిక తెచ్చే ప్రయత్నం చేయగలగాలి. వ్యక్తిలో, వ్యవస్థ మార్పులో తనదైన బాధ్యతతో, కర్తవ్య నిర్వహణ చేయగలగాలి. ఆ విధంగా చేస్తున్న మహిళల కలాలు ఒక్కొక్కటిగా తమని తాము కూడగట్టుకుంటూ తరువాతి వారికి మార్గదర్శకం చేస్తూ పాలకులను ప్రశ్నిస్తూ సాగుతూనే ఉన్నాయి
మహిళలపై జరుగుతున్న రాజ్యహింసని తమ సాహిత్యం ద్వారా ప్రజలలోకి తిసుకేళ్ళా ల్సిన బాధ్యత రచయితలది. మరీ ముఖ్యంగా రచయిత్రులది.

వి. శాంతిప్రబోధ

(జూన్ 2014 విహంగ వెబ్ మాగజైన్లోనూ ,జూలై 2014 ప్రజాతంత్ర వారపత్రికలోను ప్రచురణ అయింది)

Tag Cloud

%d bloggers like this: